ముస్లిం పాలకులైన అసఫ్‌జాహీల ఏలుబడిలోని తెలుగు ప్రాంతాల్ని తెలంగాణా అన్నారు. అంటే తెలుగువాళ్లు ఉండే ప్రాంతమని. అప్పుడు ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ అంతా తెలంగాణాయే. ఫ్రెంచి వారి రుణం తీర్చుకోవడం కోసం అసఫ్ జాహీ రాజు సలాబత్ జంగ్ 1753లో తెలంగాణాలోని 1. ముస్తఫానగర్, 2. రాజమహేంద్రవరం (రాజమండ్రి), 3. శ్రీకాకుళం జిల్లాలను ఫ్రెంచివాళ్లకు అప్పగించాడు.
అదే సలాబత్ తన రక్షణ కోసమని ఇంగ్లీష్ వాళ్లకు 1759లో తెలంగాణాలోని 1. నిజాంపట్నం, 2. మచిలీపట్నం, 3. కొండవీడు, 4. వల్కమనేరు అప్పగించాడు. ఫ్రెంచివాళ్లకు, బ్రిటీషువాళ్లకు సర్కారు (ప్రభుత్వం) నుంచి వచ్చిన జిల్లాలు కావటాన అవి సర్కారు జిల్లాలు అయ్యాయి.
బ్రిటీషువాళ్లు 1762లో సలాబత్‌ను గద్దె దించి నిజాం ఆలీని గద్దెనెక్కించారు. మహారాష్ట్రులు నిజాం అలీమీద దండెత్తి అతన్ని ఓడించినప్పుడు అతన్ని రక్షిస్తామన్నారు బ్రిటీషువాళ్లు. రక్షణ కోసం సైన్యాన్ని నియమించేందుకయ్యే ఖర్చుల కింద ఒప్పందం ప్రకారం 1800 సంవత్సరంలో 1. కంభం, 2. కర్నూలు, 3. ఆదోని, 4. రాయదుర్గ, 5. గుత్తి, 6. కడప, 7. గుర్రంకొండ, 8. బంగనపల్లి, 9. అనంతపురం, 10. బళ్లారి, 11. మదనపల్లి, 12. వాయల్పాడు జిల్లాల్ని బ్రిటీషువాళ్లకి ధారాదత్తం చేశాడు నిజాం అలీ. నిజాం వాటిని బ్రిటీషువాళ్లకి దత్తం చేసినందున వాటికి దత్త మండలాలు అనే పేరు వచ్చింది.
ఆ తర్వాత నిజాం రాజ్యంలో మిగిలిన తెలుగుప్రాంతం తెలంగాణాగా మిగిలిపోయింది. అంటే 250 ఏళ్ల క్రితం వరకు తెలుగువాళ్లంతా కలిసే ఉన్నారు.
Tuesday, January 31, 2012
Saturday, January 28, 2012
ప్రివ్యూ: యమహో యమః
యమధర్మరాజుగా శ్రీహరి తొలిసారిగా నటిస్తున్న చిత్రం 'యమహో యమః'. సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి.వి.కె. ఆర్ట్స్ బేనర్‌పై జి. విజయ్‌కుమార్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జితేందర్ వై. దర్శకుడు.
"తొలిసారి యముడిగా బరువైన పాత్ర చేస్తున్నా. ఇది అసాధారణ స్క్రిప్ట్. బాగా నవ్వించే సినిమా. ఇదివరకు మహామహులు పోషించిన ఈ పాత్రని బాగా చేసి, నన్ను నేను నిరూపించుకోవడానికి కృషిచేస్తున్నా" అని శ్రీహరి చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ విశేషం దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ గెస్ట్ కేరక్టర్ చేయడం.
హీరో సాయిరాం మాట్లాడుతూ "యమునిగా శ్రీహరి చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చింది. అమెరికా వెళ్లిన ఓ కుర్రాడికీ, అక్కడకు వచ్చిన యమునికీ మధ్య జరిగే కథ ఇది" అని చెప్పాడు. ఈ సినిమాతో తనకు కచ్చితంగా బ్రేక్ వస్తుందని అతను ఆశిస్తున్నాడు. పార్వతీ మెల్టన్ అమెరికాలో ఉండే తెలుగమ్మాయి పాత్రని చేస్తోంది. "ఇంతవరకు మన ప్రాంతంలోనే అలరిస్తూ వచ్చిన యముడు అమెరికాలో అడుగుపెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అల్లిన కథ ఇది" అని దర్శకుడు జితేందర్ తెలిపాడు.
ఈ సినిమాతో మహతిగా పేరు మార్చుకున్న బొంబాయ్ భోలే సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో అలీ, భరత్, కోవై సరళ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, చిర్రావూరి, సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జితేందర్ వై.
Thursday, January 12, 2012
'అధినాయకుడు'లో ఆసక్తికర అంశాలు!
బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న 'అధినాయకుడు' సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్నారు. నాలుగు రోజుల ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో బాలకృష్ణ తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ముగ్గురి సరసన ఎవరెవరు నటిస్తున్నారనే సంగతి వెల్లడైంది.
తాత సరసన జయసుధ, మనవడి సరసన లక్ష్మీరాయ్ నటిస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. మరి మధ్యలో తండ్రి సరసన ఎవరు చేసినట్లు? ఆ పాత్రని తమిళ నటి సుకన్య పోషించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా కథానుసారం ఈ మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించవు. కారణం మనవడు పుట్టిన రెండేళ్లకే తాత పాత్రధారి మరణిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ పాత్రపై కర్నూలులో 40 వేలమంది జనం మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్ అవుతాయని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో బాలకృష్ణకు ఏక కాలంలో భార్యగా, తల్లిగా, నాయనమ్మగా తొలిసారి జయసుధ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే మనవడి పాత్రధారి జయసుధను ఎక్కడా 'నాయనమ్మా' అని పిలవకుండా స్క్రిప్టులో జాగ్రత్తపడ్డారు. పోతే ఈ సినిమాలో సలోని కూడా నటిస్తోంది. ఆమెది ఓ సీనులో, మరో పాటలో మాత్రమే కనిపించే గెస్ట్ రోల్.
Sunday, January 8, 2012
అలనాటి చిత్రం: సీతా కల్యాణం (1934)
సీత కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతా కల్యాణం'. మచిలీపట్నంలోని 'మినర్వా సినిమా' థియేటర్ యజమాని అయిన పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్‌ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది.
కథ: లోక కల్యాణం కోసం విశ్వామిత్ర మహర్షి ఓ గొప్ప యాగాన్ని చేయ సంకల్పించి, అందరు ఋషులకూ ఆహ్వానం పంపాడు. ఆ యాగానికి రావణాసురుని అనుయాయులైన రాక్షసుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో, యాగ రక్షణకు శ్రీరాముడు ఎలా తోడ్పడగలడో యోగదృష్టితో తెలుసుకొని రాముని కోసం అయోధ్యకు వెళ్లాడు. అదే సమయంలో రామునికి వివాహం చేయాలని దశరథుడు సంకల్పించాడు. యాగ రక్షణ నిమిత్తం రాముని తనతో పంపమని దశరథుని కోరాడు విశ్వామిత్రుడు. పుత్రుని మీద అతి ప్రేమతో దశరథుడు వెనుకాడుతుంటే వశిష్టుడు అభయమిచ్చాడు. దశరథుడు అంగీకరించక తప్పలేదు. రామునితో లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుని వెంట వెళ్లాడు. మార్గ మధ్యమున వారికి అస్త్రశస్త్రాల్ని ఉపదేశించాడు విశ్వామిత్రుడు. ఆయన ఆజ్ఞతో సోదరులిరువురు రాక్షసి అయిన తాటకిని సంహరించారు.
మరోవైపు మిథిలలో సీతకు యుక్తవయసు వచ్చిందని గ్రహించి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు జనక మహారాజు. బాల్యంలోనే శివ ధనువును సీత ఎత్తడంతో ఆ ధనస్సును వంచినవానికే ఆమెనిచ్చి వివాహం చేస్తానని స్వయంవరం చాటాడు.
విశ్వామిత్రుడు యాగాన్ని ఆరంభించాడు. దానిని నాశనం చేయడానికి వచ్చిన మారీచ సుబాహులనే రాక్షసుల్ని సంహరించాడు రాముడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తవడంతో రామలక్ష్మణులను తీసుకొని మిథిలకు పయనమయ్యాడు విశ్వామిత్రుడు. మార్గమధ్యంలో రాముని పాదము సోకి రాయిలా పడివున్న అహల్యకు శాప విమోచనమయ్యింది.
సీతా స్వయంవరానికి అనేకమంది రాజులు వచ్చారు. రావణుని సహా ఒక్కరూ శివ ధనస్సును ఎత్తలేకపోయారు. రాముడు సునాయాసంగా ధనువునెత్తి దాని విరిచి, సీతను పరిణయమాడాడు. విషయము తెలిసి అయోధ్యా నగర ప్రజ సీతారామ కల్యాణమును తిలకించుటకు మిథిలకు వెళ్లింది. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులకు సీత, ఊర్మిళ, మాండవ, శ్రుతకీర్తులనిచ్చి వైభవంగా వివాహం చేశాడు జనకుడు.
తారాగణం: మాస్టర్ కల్యాణి (శ్రీరాముడు), రాజారత్నం (సీత), మాధవపెద్ది వెంకట్రామయ్య (విశ్వామిత్రుడు), నెల్లూరు నాగ రాజారావు (దశరథుడు), గోవిందరాజుల వెంకట్రామయ్య (జనకుడు), తీగల వెంకటేశ్వర్లు (రావణుడు), నాగేశ్వరరావు (లక్ష్మణుడు), కమలకుమారి (అహల్య), సూరిబాబు (గౌతముడు), కృత్తివెంటి వెంకట సుబ్బారావు (మారీచుడు), లంక కృష్ణమూర్తి (సుబాహుడు), శ్రీహరి (కౌసల్య), రామతిలకం (కైకేయి), కోకిలామణి (సుమిత్ర)
పాటలు, సంగీతం: గాలిపెంచల నరసింహారావు
సినిమాటోగ్రఫీ: కె. రామనాథ్
సెట్టింగ్స్ (ఆర్ట్): శేఖర్
నిర్మాత: పినపాల వెంకటదాసు
దర్శకుడు: చిత్రపు నరసింహారావు
బేనర్: వేల్ పిక్చర్స్
Wednesday, January 4, 2012
చూడాల్సిన సినిమా: అపోకలిప్స్ నౌ (1979)
1970వ దశకం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పొలాది. ఆ దశాబ్దంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఆయన పాత్ర ఉంది. 'పేటన్' స్క్రీన్‌రైటర్, 'అమెరికన్ గ్రాఫిటి' నిర్మాత, 'గాడ్‌ఫాదర్' తొలి రెండు సినిమాలు, 'ద కన్వర్‌జేషన్' దర్శకుడు ఆయనే. ఆ తర్వాత 1979లో ఆయన దర్శకత్వం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం 'అపోకలిప్స్ నౌ'. అది వియత్నాం అనుభవం నుంచి పుట్టిన గొప్ప సినిమా మాత్రమే కాదు, మన కాలపు క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పిన మాస్టర్‌పీస్ కూడా.
ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'అపోకలిప్స్ నౌ' ప్రీమియర్ అయ్యాక జరిగిన ప్రెస్ కాన్‌ఫరెన్స్‌లో "నాది వియత్నాం గురించి తీసిన సినిమా కాదు. నా సినిమాయే వియత్నాం" అని చెప్పాడు కొప్పోలా. వలసవాద క్రూరత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జోసఫ్ కాన్రాడ్ విశిష్ట నవల 'హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్' ఆధారంగా ఆయన ఈ సినిమాని ఒళ్లు జలదరింపజేసే విధంగా సెల్యులాయిడ్‌పై చిత్రించాడు. అమెరికన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ బెంజమిన్ విల్లార్డ్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఒకప్పుడు అమెరికన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సభ్యుడై, తర్వాత క్రూరుడిగా మారి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కంబోడియాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న కల్నల్ వాల్టర్‌ని పట్టుకునే పనిని చేపట్టిన విల్లార్డ్ అందులో విజయం సాధించాడా, లేదా అన్నది కథ.
విల్లార్డ్‌గా మార్టిన్ షీన్, వాల్టర్‌గా మార్లన్ బ్రాండో పోటాపోటీగా నటించిన ఈ సినిమాలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ బిల్ కిల్‌గోర్ పాత్రలో రాబర్ట్ డువాల్ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించాడు. లారెన్స్ ఫిష్‌బర్న్, డెన్నిస్ హాపర్, హారిసన్ ఫోర్డ్, ఫ్రెడరిక్ ఫారెస్ట్, శాం బాటమ్స్ నటించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ డాలర్లను ఆర్జించింది.
ఆ యేడాది ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండింగ్ అకాడమీ (ఆస్కార్) అవార్డుల్ని పొందిన ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పాం డీఓర్ అవార్డును చేజిక్కించుకుంది.
Subscribe to:
Posts (Atom)