Wednesday, July 13, 2011

న్యూస్: మరో చక్కని నటి దొరికింది!

ప్రియా ఆనంద్ రూపంలో మరో మంచి నటి తెలుగు తెరకి దొరికిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. '180'లో రేణుకా నారాయణన్ అనే ఎన్నారై అమ్మాయి పాత్రని ఆమె చేసిన తీరే దీనికి కారణం. తొలి సినిమా 'లీడర్', రెండో సినిమా 'రామ రామ కృష్ణ కృష్ణ'లో ఆమె పాత్రలు, నటన జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. అయితే ఆమెలోని నటనని వెలికి తీసిన సినిమా మాత్రం '180' అనే చెప్పాలి. జయేద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. ఇందులో ప్రతిభావంతురాలైన నిత్య మీనన్ ఉన్నప్పటికీ ప్రియకే ఎక్కువ మార్కులు పడటం గమనార్హం. కారణం.. నిత్య పాత్ర చిన్నది కావడం, ప్రియది ప్రధాన హీరోయిన్ పాత్ర కావడం. ఈ పాత్రకి ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. పైగా మొదటి రెండు సినిమాల్లో లేని గ్లామర్ లుక్ ఈ సినిమాలో ఆమెలో బాగా కనిపించింది. సినిమాటోగ్రాఫర్ బాలసుబ్రమణియన్ ప్రతిభ దీని వెనుక ఉండవచ్చు. ఇప్పటివరకు టాప్ హీరోల దృష్టిలో పడని ఈ బ్యూటీకి '180' విడుదల తర్వాత ఆ అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇంకా ఏ సినిమా ఫైనలైజ్ కాకపోయినా అతి త్వరలోనే ఒకట్రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ప్రియ కనిపించే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

Tuesday, July 12, 2011

న్యూస్: హీరో కెరీర్ కోసం మరో కమెడియన్ కొడుకు

హీరో కెరీర్ కోసం మరో తెలుగు కమెడియన్ కొడుకు ప్రయత్నిస్తున్నాడు. అతను సీనియర్ కమెడియన్, కేరక్టర్ ఆర్టిస్ట్, రచయిత అయిన తనికెళ్ల భరణి కుమారుడు తేజ. అతను హీరోగా పరిచయం కాబోతున్న సినిమా పేరు 'మిస్టర్ లవంగం'. హాస్యం మేళవించిన ఫ్యామిలీ స్టోరీతో మల్లాది అనే దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా పరిస్థితులు అనుకూలిస్తే జూలైలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఏ తెలుగు కమెడియన్ కొడుకూ హీరోగా వెండితెరపై తన ముద్రని వేయలేకపోయాడు. ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రం, బాబూమోహన్ కొడుకు ఉదయ్‌కుమార్, బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా రాణించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు భరణి కుమారుడు తేజ వంతొచ్చింది. అతనైనా హీరోగా సక్సెస్ అవుతాడా లేక మిగతా కమెడియన్ కొడుకుల బాటనే అనుసరిస్తాడా.. అన్నది వేచి చూడాలి.

Monday, July 11, 2011

న్యూస్: హిట్టు కోసం తొమ్మిదేళ్లుగా నిరీక్షణ!

త్రివిక్రం దర్శకుడిగా పరిచయమైన 'నువ్వే నువ్వే'  (2002) తర్వాత హీరో తరుణ్‌కి ఇంతవరకు చెప్పుకోదగ్గ మరో హిట్ దక్కకపోవడం ట్రాజెడీ. తప్పకుండా హిట్టవుతాయనకున్న 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖా పరిణయం' సినిమాలు కూడా అతనికి హేండిచ్చాయి. వీటిలో మొదటి దాన్ని ఆర్.బి. చౌదరి నిర్మిస్తే, రెండోది బాలీవుడ్ సూపర్ హిట్ 'బంటీ ఔర్ బబ్లీ'కి రీమేక్. ఇక మూడోదాన్ని డైరెక్ట్ చేసింది కృష్ణవంశీ. 'శశిరేఖా పరిణయం' వచ్చి రెండేళ్లయినా ఇంతవరకు తరుణ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. విమలా రామన్ జతగా అతను నటించిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రం 2010లోనే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటికీ జనం మధ్యకు రాలేకపోయింది. 2011లోనూ రెండుసార్లు విడుదల తేదీ ప్రకటించినా ఆ పని చేయలేకపోయారు నిర్మాతలు. ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలు, వారిలో ఒకరు సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హర్వాణీ కాగా, మరొకరు సినీ జర్నలిస్టు అయిన గోగినేని శ్రీనివాస్. ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ సవ్యంగా నడవలేదు. మొదట డైరెక్టర్‌గా పెట్టుకున్న వి.ఎన్. ఆదిత్య నిర్మాతలతో పొసగక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో తమిళుడైన కన్మణితో ఈ సినిమాని పూర్తి చేశారు నిర్మాతలు. చివరిగా మే 27న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా రిలీజ్ కాలేదు. తిరిగి ఇప్పటివరకు ఈ సినిమా పరిస్థితి ఏంటో తెలీదు. ఇందులో తరుణ్, విమల హాట్ హాట్ బాత్ రూం సీన్‌లో నటించినట్లు నిర్మాతలు విడుదల చేసిన స్టిల్స్ వల్ల తెలుస్తోంది. తెరమీద ఆ సీన్లని తిలకించే అవకాశం ప్రేక్షకులకి ఎప్పుడొస్తుందో మరి. ఈ సినిమా సంగతి అలా ఉంచితే ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు తరుణ్. వాటిలో ఒకటి శ్రీకాంత్ కాంబినేషన్‌తో చేస్తున్న 'అనుచరుడు' కాగా, మరోటి శ్రీహరి కాంబినేషన్‌తో చేస్తున్న 'యుద్ధం'. ఈ సినిమాలైనా సకాలంలో విడుదలై, తరుణ్‌కి మంచి కెరీర్‌ని ఇస్తాయో, లేదో చూడాలి.

Sunday, July 10, 2011

న్యూస్: మంచి కమర్షియల్ హిట్ కావాలి!

'పరుగు' తర్వాత అల్లు అర్జున్‌కి ఇంతవరకు సరైన్ హిట్ లభించలేదనే చెప్పాలి. తెలంగాణ గొడవలతో 'ఆర్య 2' నైజాంలో నష్టపోగా, 'వరుడు' డిజాస్టర్‌గా నిలిచింది. క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం' నటుడిగా అతడికి మంచి పేరైతే తెచ్చింది కానీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఇక 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అల్లు అరవింద్ నిర్మించగా, వీవీ వినాయక్ రూపొందించిన 'బద్రీనాథ్' విపరీతమైన అంచనాలతో రిలీజై, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కానీ నేల విడిచి సాము చేసిన కథ, నేటివిటీని మిస్సయిన కథాంశం, 'ఓవర్' అయిన సన్నివేశాలు ఈ సినిమాకి మైనస్సులుగా మారి, క్రమేణా ప్రేక్షకుల సంఖ్యని పలుచన చేశాయి. పబ్లిసిటీతో కొంతవరకే సినిమాని నిలబెట్టగలమే కానీ, అంతిమంగా సినిమా బాగుంటేనే లాంగ్ రన్ ఉంటుందని 'బద్రీనాథ్' ఉదంతం తెలియజేసింది. అర్జున్ చేసిన డాన్సులు, ఫైట్లకి అన్ని వర్గాల నుంచి గొప్ప రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమాని వారు మెచ్చలేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ మంచి సినిమా, అదీ కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యే సినిమా అర్జున్ ఖాతాలో జమ కావాలి. ఈ నెల్లోనే మొదలు కాబోతున్న కొత్త సినిమాపై అతడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రం. దాంతో సహజంగానే దీనిపై అంచనాలు మొదలయ్యాయి. ఇలియానా లేదా కాజల్ అగర్వాల్ నటించనున్న ఈ సినిమా అయినా అర్జున్ దాహాన్ని తీరుస్తుందా?

Saturday, July 9, 2011

న్యూస్: ఉదయ్ కిరణ్‌కి నిర్మాత దొరికాడు!

రెండో ఇన్నింగ్స్‌తో ఎలాగైనా మునుపటి ప్రాభవాన్ని పొందాలని తపిస్తున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఇప్పుడు 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' అంటున్నాడు, టీనేజ్ గర్ల్ శ్వేతాబసు ప్రసాద్‌తో. తమిళుడైన సుభా సెల్వం ఈ సినిమాకి డైరెక్టర్. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి వరుస హిట్లతో యువతరం ఆరాధ్య నటుడిగా అవతరించిన ఉదయ్‌కి వాటి తర్వాత ఇప్పటివరకు మరో చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. ఐదేళ్ల క్రితం తన తొలి, మలి చిత్రాల దర్శకుడు తేజతో చేసిన 'ఔనన్నా కాదన్నా' సినిమా తర్వాత రెండేళ్ల విరామం తీసుకుని 'వియ్యాలవారి కయ్యాలు'తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినా అతడికి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత మదన్ దర్శకత్వంలో వచ్చిన 'గుండె ఝల్లుమంది'పై అతడెన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనిపించుకున్నా, కమర్షియల్‌గా ఉపయోగపడలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన 'ఏక్‌లవ్యుడు' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ పరిస్థితుల్లో 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' సినిమాని ఓ తపనతో, ఓ కసితో చేశాడు ఉదయ్. అయితే పూర్తయి చాలా రోజులైనా ఇంతవరకు ఈ సినిమా ప్రేక్షకుల మధ్యకు రాలేకపోయింది. ఉదయ్ సినిమా అంటే బిజినెస్ వర్గాలు ఏమాత్రం ఆసక్తి చూపక పోతుండటమే దీనికి కారణం.
ఇలాంటి పరిస్థితుల్లోనే అతడి మరో సినిమా 'దిల్ కబడ్డి' షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. సముద్ర వద్ద పనిచేసిన శ్రీ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇంతకీ ఈ సినిమా నిర్మాత ఎవరు? అతని పేరు శివకుమార్. ఉదయ్ కిరణ్‌కి స్నేహితుడు. బయటి నిర్మాతలు తనతో సినిమాలు తీయడానికి భయపడుతున్నందున స్నేహితులు, శ్రేయోభిలాషుల్నే ఉదయ్ సినిమాల్లోకి దింపుతున్నట్టున్నాడని సినీ వర్గాలు జోక్ చేస్తున్నాయి. పైగా ఇకనుంచీ తనకి గ్యాప్ రాదనీ, వరసగా సినిమాలు చేస్తాననీ అతను వాక్రుచ్చాడు కూడా.

న్యూస్: 'నిప్పు'పై సినీ వర్గాల ఆసక్తి

'మిరపకాయ్' హిట్ తర్వాత రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన 'దొంగల ముఠా' వచ్చిందో, లేదో కూడా జనానికి తెలీనివిధంగా ఫ్లాప్ కావడం, రమేశ్ వర్మ దర్శకత్వంలో చేసిన 'వీర' బి, సి సెంటర్లలో మాత్రమే గట్టెక్కడంతో రవితేజ 'నిప్పు' మీద ఎక్కువ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇది రవితేజ, గుణశేఖర్ తొలి కాంబినేషన్ ఫిల్మ్. బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్. చౌదరి నిర్మిస్తున్న చిత్రం. అంతే కాదు, మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు స్నేహితులు (రవితేజ, గుణశేఖర్, వైవీఎస్) కలిసి చేస్తున్న చిత్రం. ఇలాంటి స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి దీక్షాసేథ్ కాగా, యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. 2012 జనవరిలో అంటే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనేది వైవీఎస్ సంకల్పం. 'ఒక్కడు' తర్వాత గుణశేఖర్ చేసిన సినిమాలేవీ హిట్టు కాకపోయినా 'నిప్పు'పై సినీ వర్గాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి మొదట 'కత్తి' అనే పేరు అనుకోవడం, కల్యాణ్‌రాం 'కల్యాణ్‌రాం కత్తి' అనే పేరుతో సినిమా తీయడంతో 'నిప్పు'గా టైటిల్ మారడం తెలిసిందే. కాగా దీంతో పాటు వంశీ డైరెక్షన్‌లో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే మరో ఆసక్తి కరమైన సినిమాని రవితేజ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూడండి.

న్యూస్: సిందూర సంగతి అంతే!

2005లో మిస్ ఇండియా వరల్డ్‌గా ఎంపికై అందాల ప్రపంచంలో తెలుగువాళ్లకి పేరు తెచ్చిన విజయవాడ అమ్మాయి గద్దె సిందూర సినీ రంగంలో రాణించలేక పోతోంది. నాలుగేళ్ళ క్రితం 'హే బేబీ'తో బాలీవుడ్‌లో కాలుమోపిన ఆమెకి మళ్లీ ఇంతవరకు మరో హిందీ సినిమా చాన్స్ దక్కలేదు. ఇక తెలుగుకు వస్తే 2008లో రసూల్ ఎల్లోర్ డైరెక్షన్‌లో 'సంగమం'తో పరిచయమై, ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో 'అమరావతి' సినిమా చేసింది. ఈ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో పెద్ద హీరోల దృష్టి ఆమె మీద ప్రసరించలేదు. అందుకే ఆమెకి అవకాశాలు అడుగంటాయి. నరేశ్ నారదాసి అనే అంతగా పేరులేని ఓ దర్శకుడితో ఆమె చేసిన 'కిల్లర్' సినిమా రెండేళ్ల క్రితమే మొదలైనా ఇప్పటికి విడుదలకి రెడీ అయ్యింది. సినిమా చాన్సులు లేనందువల్లే 2010 డిసెంబరులో తన బాయ్‌ఫ్రెండ్ జోనాథన్ వార్డ్‌ని న్యూజిలాండులో పెళ్లాడింది సిందూర. అయితే పెళ్లైనంత మాత్రాన నటనకి దూరం కావాలని ఆమె నిర్ణయం తీసుకోలేదు. 'కిల్లర్' అనూహ్యంగా హిట్టయితే ఆమెకి ఒకట్రెండు అవకాశాలు రావచ్చు. ఒక నరమాంస భక్షకుడు సమాజంలో ఉంటే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే భిన్నమైన కథాంశంతో నగేశ్ ఈ సినిమాని రూపొందించాడు. ఆ నరమాంస భక్షకుని పాత్రని షఫీ చేశాడు. ఇందులో సిందూర ఏ పాత్ర చేసిందీ, ఆమె ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశముందా.. అనేవి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాలి.

Friday, July 8, 2011

న్యూస్: ఆ రెండింటితో ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యేనా?

కొడాలి నాని తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా 'అదుర్స్' సినిమా నైజాంలో నష్టపోవడం, దిల్ రాజు చెప్పిన రేంజిలో 'బృందావనం' హిట్టు కాకపోవడం, ఇక ఈ యేడాది విడుదలైన 'శక్తి' డిజాస్టర్ కావడంతో చిన్న ఎన్‌టీఆర్ మాంచి కసి మీదున్నాడు. ఎలాగైనా ఈసారి భారీ హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న 'ఊసరవెళ్లి' కాగా, మరోటి బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న పేరుపెట్టని చిత్రం. 'ఊసరవెళ్లి' షూటింగ్ యమ స్పీడుగా జరుగుతోంది. ఎలాగైనా దసరా సెలవులకి, అంటే సెప్టేంబర్ చివరకి 'ఊసరవెల్లి'ని ప్రేక్షకుల మధ్యకి తీసుకు రావాలని నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ జోడీగా నేటి క్రేజీ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. 'కిక్' వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న సినిమా. కారణం వరుసగా మూడు హిట్ సినిమాల్ని (భద్ర, తులసి, సింహా) డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు కావడం. పైగా ఇందులో హీరోయిన్ శృతీహాసన్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో తను టాప్ లీగ్‌లోకి మళ్లీ వస్తాననే నమ్మకం ఎన్‌టీఆర్‌లో నిండుగా కనిపిస్తోంది.

Thursday, July 7, 2011

న్యూస్: నాని కెరీర్‌కి ఊపు 'సెగ'

డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన నాని కెరీర్ 'అలా మొదలైంది'తో మళ్లీ గాడిలో పడింది. తొలి రెండు సినిమాలు 'అష్టా చమ్మా', 'రైడ్' హిట్టవగా, 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డి జట్టు' ఫెయిలయ్యాయి. రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బేలన్స్ అయిన అతడి కెరీర్ మళ్లీ 'అలా మొదలైంది'తో ఇంకో మెట్టు పైకెక్కింది. చేసిన ఐదు సినిమాల్లో మూడు హిట్టవడం చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడు అతడి దృష్టి తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ రానున్న 'సెగ' మీదే ఉంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళంలో చేసిన 'వెప్పం'. అంజనా అలీ ఖాన్ ఈ సినిమా డైరెక్టర్. 'అలా మొదలింది' డైరెక్టర్ నందినీరెడ్డి తరహాలోనే అంజన కూడా నానికి మంచి దోస్త్. ఆ సినిమాలో నానికి జోడీగా నటించిన నిత్యమీనన్ ఈ సినిమాలోనూ నటించడం ఇంటరెస్టింగ్. ఈ నెల్లోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి. అయితే వీటికంటే అతడికి పెద్ద పేరు తీసుకొచ్చే అవకాశమున్న సినిమా మరోటి ఉంది. అది 'ఈగ'. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్టర్ కావడమే ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. విలన్ (సుదీప్) చేతిలో చనిపోయిన హీరో (నాని) తర్వాత జన్మలో ఈగగా పుట్టి విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కథతో వస్తున్న ఈ సినిమా నాని కెరీర్‌కి బూస్ట్‌నివ్వడం ఖాయం. ఇదే కాక అశోక్ అనే మరో కొత్త డైరెక్టర్ తీస్తున్న 'పిల్ల జమీందారు' అనే ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు నాని. మొత్తానికి కుర్ర హీరోల్లో మంచి నటుడిగా ఎక్కువ మార్కులు పొందుతోంది నిస్సందేహంగా అతడే.

స్టోరీ: విదేశీ లొకేషన్లకే టాలీవుడ్ ఓటు

తెలుగు నిర్మాతలు, దర్శకుల ధోరణి మారుతోంది. తన సినిమాలకి హంగులు అద్దడంలో భాగంగా ఫారిన్ లొకేషన్లకి పరుగులు పెడుతున్నారు. భారతీయ, తెలుగు అందాల స్థానంలో విదేశీ సోయగాలకు పట్టం కడుతున్నారు. ఫారిన్ లోకేషన్లలో షూటింగ్ జరగని సినిమాలు టాలీవుడ్లో తగ్గిపోతున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని పోతపోసుకున్న తెలుగు, భారతీయ ప్రదేశాల్ని వదిలి విదేశీ లొకేషన్ల వేట అన్నది కొన్నేళ్లుగా ఎక్కువైంది. ఇందుకు కారణం.. తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ పెరగడమే. మనవాళ్ల విదేశీ వ్యామోహాన్ని సొమ్ము చేసుకోడానికి అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. తమ తమ దేశాల్లో ఉన్న అందమైన ప్రదేశాలు, అరుదైన కట్టడాలు, నిర్మాణాల్లో షూటింగులు జరుపుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాలు నిరాటంకంగా షూటింగులు జరుపుకోడానికి అనుమతులతో పాటు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో షూటింగ్ జరుపుకోవడమే ఇప్పుడు కష్టమైపోతోంది. విదేశాల్లో కంటే ఇక్కడే ఖరీదెక్కువ అవుతోంది. ఇటీవలి కాలంలో థాయిలాండ్, మలేషియా దేశాల్లో తెలుగు సినిమాల షూటింగ్ అనేది సాధారణ విషయమైపోయింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌కి థాయిలాండ్ అంటే ఎంతిష్టమో తెలిసిందే. ఒకట్రెండు సినిమాలు మినహా అన్ని సినిమాలకీ అతను థాయిలాండ్ వెళ్లి బ్యాంగ్‌కాక్, ఫుకెట్, పట్టాయాలలో షూటింగ్ చేసుకొచ్చాడు. పోకిరి, చిరుత, ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి సినిమాల్లో కొన్ని సీన్ల కోసమో, పాటల కోసమో అతను థాయిలాండ్ వెళ్లాడు.
ఇటీవలి కాలంలో పాపులర్ అయిన మరో విదేశం మలేషియా. బిల్లా, కిక్, ప్రయాణం, గోలీమార్‌తో పాటు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న నా ఇష్టం, రేయ్, ముగ్గురు వంటి సినిమాల్ని అక్కడి కౌలాలంపూర్, పుత్రజయ, లంకావి వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. వెంకటేశ్ సినిమా 'జయం మనదేరా', నాగార్జున సినిమా 'మన్మథుడు' సినిమాల్ని ఫ్రాన్స్, జర్మనీ, యుకెలలో చిత్రీకరించారు. నాగచైతన్య తాజా చిత్రం 'దడ'లోని కొన్ని సన్నివేశాల్ని జర్మనీలో, అమెరికాలో తీశారు. ఇదివరకు ఎడారుల్లో షూటింగ్ అంటే రాజస్తాన్‌కి వెళ్లేవాళ్లు. ఇప్పుడు దుబాయ్, ఒమన్, జోర్డాన్, టర్కీ వంటి ప్రదేశాలకి వెళ్తున్నారు. 'పౌరుడు', 'బృందావనం' సినిమాలు అందుకు ఉదాహరణ.
ఆఫ్రికా ఖండం ఏమీ తక్కువ తినలేదు. ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలు టూరిజానికీ, సినిమాలకీ పేరుపొందాయి. ఎన్‌టీఆర్ 'కంత్రి'లోని ఓ పాటని దక్షిణాఫ్రికాలోని మ్యూజెన్‌బర్గ్ బీచ్ (కేప్‌టౌన్)లో చిత్రీకరించారు. రవితేజ ఇటీవలి సినిమా 'డాన్ శీను' చిత్రీకరణ కోసం స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లారు. గ్రీస్‌లో 'కేడి' చిత్రీకరణ సందర్భంగా నాగార్జునని ఆ దేశపు ప్రభుత్వం సత్కరించింది. భారతీయుల పట్ల జాతి వివక్ష ఆరోపణలతో భారత్-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సమయంలో రాంచరణ్ 'ఆరెంజ్' షూటింగ్ అక్కడి మెల్బోర్న్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్‌కి ఆస్ట్రేలియా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు.
ఇలా విదేశీ లొకేషన్లు మన టాలీవుడ్ వ్యక్తుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల షూటింగులు విదేశాల్లో జరగడం ఖాయం.

Wednesday, July 6, 2011

న్యూస్: ఐశ్వర్య వల్లే 'హీరోయిన్' ఆగింది

ఐశ్వర్యారాయ్ ఇప్పుడు గర్భవతి. ఎంతోమందికి, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఇది సంతోషకరమైన వార్త. పెళ్లయి చాలా కాలమవుతున్నా, ఐశ్వర్య ఇంకా గర్భం దాల్చలేదేమిటనేది కూడా వార్తయిన సందర్భంలో తన కోడలు ఐదు నెలల గర్భవతి అనే సంగతి ప్రపంచానికి మొదటగా అమితాబే తెలిపాడు. అయితే ఈ వార్త కొంతమందికి అశనిపాతమైంది. అది 'హీరోయిన్' సినిమా యూనిట్‌కి. ఆమె గర్భవతి అనే సంగతి తమందరికీ దిగ్భ్రాంతి కలిగించిందని ఆ సినిమా దర్శకుడు మధుర్ భండార్కర్ వాపోతున్నాడు. ఆమె వల్ల 'హీరోయిన్' సినిమా ఆగిపోయింది. అందులో ఆమే హీరోయిన్. ఆమె గర్భవతి అని తెలిసి కొద్ది రోజులైనా ఇప్పటివరకు మౌనంగా ఉన్న మధుర్ ఇప్పుడు నోరు విప్పాడు. "ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఒకటిన్నర సంవత్సరం నుంచీ ఈ ప్రాజెక్టు కోసం నా నెత్తురు ధారపోస్తూ వచ్చా. మాతృత్వం అనేది ఏ స్త్రీకైనా పరిపూర్ణత్వాన్నిస్తుందని నాకు తెలుసు. మాతృమూర్తి కాబోతున్న స్త్రీకి ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యం. ఆమెని ఇబ్బందికర స్థితికి గురిచెయ్యాలని నేననుకోను. 'హీరోయిన్' మామూలు సినిమా కాదు. 40 లొకేషన్లలో, భారీ జనం మధ్య క్లిష్టమైన సన్నివేశాలతో తీయాల్సిన సినిమా. నా కథలో హీరోయిన్ని జనం చుట్టుముట్టి ఇబ్బంది పెట్టే సీన్లు, శరీరాన్ని కష్టపెట్టే సీన్లు, అడల్ట్ కంటెంట్ వంటివి ఉన్నాయి. నా హీరోయిన్ తెరమీద సిగరెట్ తాగుతుంది. ఒకవేళ ఆమె తాగకపోయినా, అదే సీన్లో మిగతా నటులు సిగరెట్లు తాగుతుంటారు. ఇది గర్భవతికి మంచిది కాదు. 'హీరోయిన్' తీస్తున్నట్లు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మే 13న ప్రకటించాం. జూన్ 7న షూటింగ్ ప్రారంభించాం. ఈ మధ్యలో 24 రోజుల వ్యవధి ఉంది. కానీ ఐశ్వర్య ఎప్పుడూ తను గర్భవతిననే సంగతి మాకెవరికీ చెప్పలేదు. అందరితో పాటే మేం కూడా న్యూస్ చానల్స్ ద్వారానే తెలుసుకున్నాం. అప్పటికి ఎనిమిది రోజుల షూటింగ్ కూడా జరిగింది. విషయం వినగానే మేమంతా షాక్‌కి గురయ్యాం. తప్పనిసరి స్థితిలో ఆ సినిమాని ఆపేశాం'' అని అతను వివరించాడు.

న్యూస్: రాజశేఖర్‌కి మంచిరోజులు వచ్చేనా?


అదేంటో గానీ రాజశేఖర్ ఏం చేయాలనుకున్నా పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. గడచిన పదేళ్లలో అతని సినిమాలు రెండంటే రెండే హిట్టయ్యాయి. అవి 'సింహరాశి', 'గోరింటాకు'. ఈ రెండింటి నిర్మాత ఒక్కరే. ఆయన మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి. 'ఎవడైతే నాకేంటి'ని కూడా రాజశేఖర్, జీవిత హిట్టు కింద జమ చేస్తారు కానీ, దానికి పెట్టిన డబ్బు వసూలు కాలేదు. అప్పులు తీరలేదు. హీరో పాత్రలు తప్ప ఇతర ప్రధాన పాత్రలు చేయనని మునగదీసుకు కూర్చోవడంతో తాను ఎంత నష్టపోతున్నదీ ఆయన గ్రహించడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు మారినందునే హీరో పాత్రలకంటే ఇతర పాత్రల ద్వారానే శ్రీహరి ఎక్కువ సొమ్ము చేసుకో గలుగుతున్నాడు. సరే. అసలే 'లేట్ లతీఫ్' అనే బిరుదు సంపాదించుకున్న రాజశేఖర్‌తో సినిమా తీయాలంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు దర్శకులు కూడా ఆయనతో సినిమా అంటే ఠారెత్తుతున్నారు. ఎక్కడ మధ్యలో తమని తీసేసి జీవితనే డైరెక్టర్ అనేస్తాడేమోనని సందేహిస్తున్నారు. ఆయన తాజా సినిమా 'మహంకాళి' విషయంలో అదే జరిగింది. కార్తికేయ అనే ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమాని ప్రారంభించాడు. మధ్యలో అతని పనితనం నచ్చలేదనే వంకతో అతన్ని తొలగించి జీవితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది. ఇటీవల చెన్నైలో ఓ ఫైట్ సీన్ తీస్తుంటే పైనుండి కిందపడి బాగా గాయపడ్డాడు రాజశేఖర్. నాలుగైదు రోజుల్లో షూటింగంతా అయిపోతుందని అనుకునేంతలో ఇలా జరగడంతో నిర్మాతలు యేలూరు సురేందర్‌రెడ్డి, పరంధామరెడ్డి బాధ వర్ణనాతీతం. 50 యేళ్లకు దగ్గరవుతున్నా ఇంకా 20 యేళ్ల కుర్రాడిలా ఊహించుకుని రిస్క్ సీన్లు చేయడమెందుకు? ఇలా దెబ్బలు తినడమెందుకు? నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడమెందుకు? ఇంతకీ 'మహంకాళి'తో అయినా ఈ భార్యాభర్తల జోడీ విజయాన్ని సాధిస్తుందా? డౌటే!

న్యూస్: నయనతార కెరీర్ ముగిసినట్లేనా?

కేరళ కుట్టి నయనతార నట జీవితం ఇక ముగిసినట్లేనా? ప్రస్తుతానికైతే అవుననే చెప్పాలి. ఆమె చివరి చిత్రాన్ని తెలుగులోనే చేసింది. అది 'శ్రీరామరాజ్యం'. ఇందులో ఆమె రామాయణ గాథలోని సీత పాత్ర చేసింది. ఒక పౌరాణిక సినిమాతో కెరీర్‌కి ఆమె ముగింపు పలుకుతుండటం విశేషమనే చెప్పాలి. అందుకే చివరి రోజు షూటింగులో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది కూడా. ఆఖరి రోజు ఆమె పాల్గొన్న చివరి సీను ముగియగానే అక్కడున్న యూనిట్ సభ్యులంతా ఆమెపై పూల వర్షాన్ని కురిపించారు. నిర్మాత సాయిబాబు స్వయంగా ఆమె మీద పూలు చల్లి రెండు చేతులతో నమస్కరించారు. అందరికీ దండం పెడుతూ, కళ్ల నుంచి చెంపలమీదికి నీళ్లు కారుతుండగా దర్శకుడు బాపు పాదాలకి నమస్కరించింది నయనతార. ఆయన ఆమెని ఆశీర్వదించారు. ఈ సినిమా యూనిట్‌ని వీడిపోతున్నానన్న బాధో, ఇదే చివరి సినిమా అనే ఆవేదనో కానీ ఆమె మొత్తానికి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారాములుగా ఆ ఇద్దరూ తెరమీద కనిపిస్తారనేది ఆసక్తికరం. ఇదివరకు 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, ఎన్‌టీ రామారావు అమోఘంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే కథతో తీసిన 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ, నయనతార ఆ పాత్రల్లో ఆకట్టుకునే అవకాశాలున్నాయి. 'సింహా'లో ఆ ఇద్దరూ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. మొదట 'శ్రీరామరాజ్యం'లో చేయడానికి నయన వెనుకాడింది. ప్రభుదేవాతో పెళ్లి నిర్ణయం జరిగాక సినిమాలకి గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే బాలకృష్ణ ఆమెనే సీతగా కోరుకోవడం, దర్శకుడు బాపు కావడం వల్లే ఆమె చివరి నిమిషంలో సీతగా నటించేందుకు అంగీకారం తెలిపింది. యూనిట్ వర్గాల ప్రకారం ఆ పాత్రని ఆమె సమర్థంగా పోషించింది. అందుకే తృప్తికరంగా సినిమాలకు సెలవు చెప్పింది నయనతార. ఈ సినిమా తర్వాత ఆమె తెరమీద కనిపించే అవకాశాలు లేనట్లే.