Tuesday, April 11, 2017

Powerful Film Publicity

పవర్‌ఫుల్‌ పబ్లిసిటీ! 



ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ పోషించగా, యస్‌.యస్‌. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ ట్రైలర్‌ వంద మిలియన్ వ్యూస్‌ మార్క్‌ను దాటిన తొలి భారతీయ సినిమాగా సరికొత్త చరిత్రను లిఖించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషలను కలుపుకొని ఈ రికార్డును సాధించింది. అంటే పది కోట్ల మంది ఆ ట్రైలర్‌ను వీక్షించారన్న మాట! మార్చి 16న విడుదలైన ఈ ప్రచార చిత్రాన్ని తొలి 24 గంటల్లోనే 5 కోట్ల మంది వీక్షించడం కూడా రికార్డే. ‘బాహుబలి’ పేరుకు ఎలాంటి క్రేజ్‌, ఇమేజ్‌ ఉందో చెప్పేందుకు ఈ లెక్కలే నిదర్శనం! ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం.. ట్రైలర్‌తో ఆ సినిమాకు మరింత ప్రాచుర్యం లభించడం, దానిపై మరింత మోజు పెరగడం!! 

సినిమాకు ప్రాణం పబ్లిసిటీనే. లోపలి సరుకు అటు ఇటుగా ఉన్నా పబ్లిసిటీ కారణంగానే సినిమాలు జనాదరణ పొందిన దాఖలాలు ఎన్నెన్నో. అంతటి పవర్‌ఫుల్‌ అయిన సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘స్టార్‌’ పవర్‌ ఉన్న సినిమాకు పైసా ఖర్చు లేకుండా సోషల్‌ మీడియా మరింత ప్రచారాన్ని కల్పిస్తోంది. ఒకవైపు ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, వెబ్‌ మీడియాలో పబ్లిసిటీకి భారీగా ఖర్చు చేస్తూనే, మరోవైపు అభిమానులకు, సినీ ప్రియులకు మరింత చేరువ కావడానికి సోషల్‌ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు.

గోడమీది బొమ్మ

ఒకప్పుడు గోడమీద పోస్టర్లు మాట్లాడేవి. కమ్మని కథలు చెప్పేవి. కవ్వించి, నవ్వించి మనల్ని ఆకర్షించేవి, అలరించేవి. వాటితో పాటు నిలువెత్తు కటౌట్లు సమ్మోహనపరిచేవి. పోస్టర్లది పంచ వన్నెల భాషైతే, కటౌట్లది ఇంద్రజాల భాష. వాటికి సగటు సినీ అభిమాని దాసోహమయ్యేవాడు. ఆ పోస్టర్లను పట్టుకొని ఊరేగేవాడు. కటౌట్లకు పాలాభిషేకం చేసేవాడు. తొమ్మిదో దశకం వరకూ కూడా పల్లెల్లో, పట్టణాల్లో ఏ వీధి మలుపు తిరిగినా గోడమీద పోస్టర్‌ దర్శనమిచ్చేది. నిలబెట్టేది. ఇక దినపత్రికల్లో వచ్చే ప్రకటనల మీద నుంచి అభిమాని దృష్టి అంత త్వరగా మరో పేజీ వైపు మరలేది కాదు. అప్పట్లో సినిమా పబ్లిసిటీకి ఆ పోస్టర్లు, ప్రకటనలు, మౌత పబ్లిసిటీనే ఆధారం.

ప్రచారాన్ని మోసిన చానళ్లు

కాలం మారింది. ప్రేక్షకుల ఆలోచనా ధోరణీ మారింది. దానికి తగ్గట్లు సినిమా పబ్లిసిటీలోనూ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి, వస్తున్నాయి. రోడ్లపై తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సులు కూడా ప్రచార సాధనాలయ్యాయి. వాల్‌ పోస్టర్‌కి ‘వాల్‌ రైటింగ్‌’ కూడా తోడయ్యింది. తొలినాళ్లలో దర్శకుడు తేజ.. ఈ వాల్‌ రైటింగ్‌తో తన సినిమాలను బాగా ప్రమోట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత గోడమీద బొమ్మలు, రాతలపై నిషేధం రావడంతో పోస్టర్‌ హవా కాస్త తగ్గింది. రూపం మార్చుకుంది. వినైల్స్‌ వచ్చాయి. ఎలక్ట్రానిక్‌ మీడియా హవా మొదలయ్యాక, సినిమాకు టీవీ పెద్ద దెబ్బగా మారాక, ఆ టీవీనే ప్రచార సాధనంగా మలచుకున్నాయి నిర్మాణ సంస్థలు. స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌, పాటల ప్రదర్శనలు, ట్రైలర్లతో చానళ్లు సినిమా పబ్లిసిటీని మోస్తూ వచ్చాయి. ఒక దశాబ్దం పాటు టీవీలు సినిమా పబ్లిసిటీని మోశాయి.

సోషల్‌ పబ్లిసిటీ ఫ్రీ 

కలెక్షన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పైరసీ భూతాన్ని ఎదుర్కొంటూనే ‘ప్రింట్‌’ నుంచి ‘డిజిటల్‌’గా రూపాంతరం చెందింది సినిమా. దాంతో సోషల్‌ మీడియాకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. సినీ ప్రేమికులతో, ప్రేక్షకులు కాబోయే వారితో అనుసంధానం కావడానికి నిర్మాణ సంస్థలకు, నటులకు, సాంకేతిక నిపుణులకు ఫేస్‌బుక్‌ అతిపెద్ద వేదికగా మారింది. దీనివల్ల సినిమాకు సంబంధించిన సమాచారం అతి వేగంగా లక్షలాదిమందికి చేరుతోంది. సోషల్‌ మీడియాకు జనం అడిక్ట్‌ కావడంతో, సినిమాకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అందిస్తూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫ్యాన్సతో నేరుగా అనుసంధానమై తమ సినిమాని ప్రమోట్‌ చేయడానికి స్టార్స్‌ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. టీజర్‌ లేదా ట్రైలర్‌ను అభిమానులు విపరీతంగా ఆదరిస్తుండటంతో సహజంగానే పబ్లిసిటీలో వాటికి ప్రాధాన్యం పెరిగింది. అందుకే ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారానో లేదంటే యూట్యూబ్‌ వంటి ఆనలైన చానల్‌ ద్వారానో వాటిని విడుదల చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రైలర్‌ కంటే టీజర్‌ ఎక్కువ ప్రాచుర్యం పొందడాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు ‘కాటమరాయుడు’, ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాల ట్రైలర్‌ల కంటే టీజర్‌లే యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ పొందాయి. తాజాగా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘పెళ్లి చూపులు’ వంటి లో-బడ్జెట్‌ సినిమా పెద్ద విజయం సాధించడానికి బాగా దోహదం చేసింది సోషల్‌ మీడియానే. థియేటర్లలో విడుదలకు ముందు ‘హృదయ కాలేయం’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో చేసిన హల్‌చల్‌ కారణంగానే సంపూర్ణేశబాబు వంటి నటుడు హీరోగా ప్రేక్షకుల్ని అలరించాడు. యూట్యూబ్‌ చానల్‌లో ఆదరణ పొందిన టీజర్‌, ట్రైలర్‌, మేకింగ్‌ వీడియోస్‌, సాంగ్స్‌ వంటి వాటికి ఆదాయం కూడా సమకూరుతుండటం అదనపు ప్రయోజనం!

చిత్రోత్సవాలూ ప్రచార సాధనాలే!

రాష్ట్ర సరిహద్దులు దాటి, ఇతర రాషా్ట్రల్లోకీ, అక్కడ్నించి అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ తదితర ప్రాంతాల్లోకీ తెలుగు సినిమా విస్తరిస్తూ పోవడంతో ‘గ్లోబల్‌ సినిమా’గా తెలుగు సినిమాను ప్రమోట్‌ చేయడానికి పబ్లిసిటీలోనూ కొత్త పోకడలు పోతున్నారు. ‘బాహుబలి’ వంటి వందల కోట్ల బడ్జెట్‌ సినిమాకు డబ్బులు రావాలంటే కేవలం తెలుగు మార్కెట్‌ ఒక్కటే సరిపోదు. దాని ‘రీచ’ పెరగాలి. అందుకే హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. దాని కోసం ప్రచారానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ ఉపయోగించారు. ఇప్పుడు రెండో భాగం సినిమాకూ మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్లోబల్‌ పబ్లిసిటీకి చలన చిత్రోత్సవాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఇంట గెలిచిన ‘బాహుబలి’, రచ్చ గెలిచేందుకు దోహదం చేసింది ఈ చిత్రోత్సవాలే. కాన్స, బుసాన, హవాయ్‌, బ్రస్సెల్స్‌, బ్రిక్స్‌, ఇఫీ తదితర పదిహేను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవడం వల్ల ఈ సినిమాకు గ్లోబల్‌ ఇమేజ్‌ వచ్చింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్న జర్నలిస్టుల వ్యాసాల కారణంగా కూడా ఈ సినిమాకు అంతర్జాతీయంగా మంచి పేరు లభించింది.

‘కంటెంట్‌’ కాస్తయినా ఉండాలి

ఒక సినిమాకు ప్రచారం ద్వారా లాభాలు ఆర్జించవచ్చనే గ్యారంటీ ఏమీ లేదు. స్టార్‌ హీరోల సినిమాల నిర్మాణ వ్యయంతో పాటు పబ్లిసిటీ వ్యయం కూడా అంచనాలకు మించి పెరిగిపోవడంతో సంప్రదాయ నిర్మాణ సంస్థలు కుదేలవుతూ వచ్చాయి. కానీ ఇంటర్నెట్‌ యుగానికి తగ్గట్లు పబ్లిసిటీ తీరును మార్చుకుంటూ వస్తున్న ఆధునిక నిర్మాణ సంస్థలు నిలదొక్కుకుంటున్నాయి. ఎంత విస్తృతంగా కొత్త తరహాలో ప్రచారం చేసినా, సినిమాలో ‘విషయం’ లేకపోతే చేసిన ప్రచారమంతా వృథా అవుతుందనేది నిరూపిత సత్యం. సినిమాలో ఏ కొంచెం ‘విషయం’ ఉన్నా, ఆకట్టుకొనే ప్రచారంతో ఆ సినిమాని నిలబెట్టొచ్చనేది కూడా అంతే నిజం. ‘సమ్‌థింగ్‌ ఈజ్‌ బెటర్‌ దేన నథింగ్‌’ కదా!

- బుద్ధి యజ్ఞమూర్తి


చిన్న సినిమాలకు కొన్నిసార్లు బడ్జెట్‌ను మించి పబ్లిసిటీకి ఖర్చుపెట్టిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు పీవీపీ సంస్థ తీసిన ‘క్షణం’ నిర్మాణ వ్యయం రూ. 1.10 కోట్లయితే, ప్రచార వ్యయం రూ. 1.50 కోట్లు! టీవీ, వెబ్‌ మీడియాలో ఈ సినిమా ప్రచారానికి బాగా ఖర్చు పెట్టారు. అయితేనేం.. ఖర్చు పెట్టిన రూపాయికి రెండు రూపాయల లాభం వచ్చింది. అయితే అన్ని సినిమాలకూ ఇది వర్తించదు. ప్రచారానికి ఉపయోగించే ‘విషయం’ ఇందులో కీలకమనేది గుర్తించాలి. ఆసక్తికరంగా ట్రైలర్‌నూ, ప్రకటనలనూ రూపొందిస్తే.. సినిమాకు మేలు చేకూరుతుందని ‘క్షణం’, ‘హృదయ కాలేయం’ వంటి సినిమాలు నిరూపించాయి.

యూట్యూబ్‌లో అత్యధిక ఆదరణ పొందినవి.. 
‘బాహుబలి 2’ (హిందీ) ట్రైలర్‌: 42.35 మిలియన్ వ్యూస్‌
‘బాహుబలి 2’ (తెలుగు) ట్రైలర్‌: 39.95 మిలియన్ (తమిళ, మలయాళంలో కలుపుకొని నాలుగు భాషల్లో 100 మిలియన్ వ్యూస్‌ దాటాయి)
‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌: 12.12 మిలియన్
‘కాటమరాయుడు’ టీజర్‌: 11.50 మిలియన్
‘ఖైదీ నంబర్‌ 150’ టీజర్‌: 7.86 మిలియన్
‘ధృవ’ ట్రైలర్‌: 7.83 మిలియన్
‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌: 7.79 మిలియన్
‘ఖైదీ నంబర్‌ 150’ ట్రైలర్‌: 7.17 మిలియన్
‘జనతా గ్యారేజ్‌’ ట్రైలర్‌: 6.58 మిలియన్
‘కాటమరాయుడు’ ట్రైలర్‌: 6.51 మిలియన్

పబ్లిసిటీ ప్లాన్
ప్రేక్షకులే సినిమాకి వ్యాపారం. ప్రేక్షకులు లేకపోతే ఆ వ్యాపారం లేదు. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రచార ప్రణాళిక ముఖ్యం.
టార్గెట్‌ ఆడియెన్స్ ఎవరనేది నిర్ధారించుకోవాలి.
ప్రేక్షకులకు చేరువ కావడానికి ఏ తరహా పబ్లిసిటీ ఇవ్వాలో ప్లాన్ చేసుకోవాలి.
సినిమా కంటెంట్‌లోని ఆసక్తికర అంశాలతో బులెటిన్లు విడుదల చేస్తుండాలి.
సినిమాల విషయంలో ఆదరణ ఉండే పత్రికలు, చానళ్ల ద్వారా ప్రచారం చేస్తుండాలి.
మిగతా మీడియాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం ఎలా ఇవ్వాలో అన్వేషించాలి.
ప్రేక్షకులను ఆకర్షించే తీరులో టీజర్‌, ట్రైలర్‌ను రూపొందించాలి.
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా వీలైనంత మందికి అనుసంధానం కావాలి.

- ఆంధ్రజ్యోతి డైలీ, 9 ఏప్రిల్ 2017

No comments: