Saturday, June 4, 2016

Interview of actress Samantha

అతనెవరో నేనే చెబుతా!

‘త్వరలోనే సమంత పెళ్లంట. పేరు చెప్పకపోయినా ఓ తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతోందట’.. కొద్ది రోజులుగా సినీ ప్రేమికుల మధ్య నలుగుతున్న మాటలివి. ‘ఎవరా హీరో?’ అనే దానిపై ఎవరికి తోచినట్లు వాళ్లు నిర్ధారణకు వస్తున్నారు. పెళ్లి గురించి అడిగితే నవ్వుతూ తన ప్రతినిధి ఆ విషయం చెబుతారని దాటవేస్తోంది సమంత. అయితే పెళ్లి తర్వాత కూడా నటిస్తానని స్పష్టం చేస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అ ఆ’ చిత్రంలో నాయికగా నటించిన ఆమె.. తనను నడిపిస్తోంది తన అమ్మే అంటోంది. సమంత చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..

ఈ వేసవికి విడుదలవుతున్న నా చివరి చిత్రం ‘అ ఆ’. నేను చేసిన ముఖ్యమైన సినిమాల్లో ఇదొకటి. ఇప్పటిదాకా సీరియస్‌ సినిమాలు, ఇంటెన్స్, రొమాన్స్ ఉన్న సినిమాలు చేశాను. కామెడీ చెయ్యలేదు. మొదటిసారి నేను కామెడీ చేసిన సినిమా ఇది. కమెడియ న్స్అంటే నాకు చాలా గౌరవం. కామెడీ పండించడం చాలా క్లిష్టమైన వ్యవహారం. ప్రేక్షకులకు నవ్వు రాలేదంటే, అది అపహాస్యమైనట్లే. ఆ రిస్క్‌ను నేను తీసుకున్నా. నాకు అలాంటి పాత్ర ఇచ్చినందుకు కచ్చితంగా త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగానూ త్రివిక్రమ్‌గారి ప్రభావం నాపై ఉంది. ఆయన చాలా నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. నాలోని కొన్ని అభద్రతాభావనలను ఆయన వల్ల అధిగమించాను. ఆయనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఆయన నాకు పాత్ర గురించి చెబుతుంటే, ఆయనను నేను ఇమిటేట్‌ చేశానంతే. నేనేమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే అనసూయ పాత్రకు న్యాయం చేశానని నమ్ముతున్నా. ఈ సినిమాతో నటిగా మరింత ఎదిగాననుకుంటున్నా.

అప్పుడు జీరో కెమిస్ట్రీ

నేను వ్యక్తుల్ని బట్టి సినిమా చెయ్యను. స్క్రిప్టును బట్టే చేస్తాను. ఇప్పటివరకూ స్క్రిప్ట్ విని, కన్విన్స్ అయ్యాకే సినిమా చేస్తూ వచ్చా. ఏ స్క్రిప్టూ వినకుండా సంతకం చెయ్యలేదు. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాముఖ్యమే ఉంటోందన్నది నిజం. పది సినిమాల్లో ఒక్క సినిమాలోనే హీరోయిన్‌కు మంచి పాత్ర దొరుకుతోంది. ఇలాంటి రోజుల్లో ‘అ ఆ’ స్క్రిప్ట్ నాకు చాలా ముఖ్యమైంది. ఇందులో హీరో హీరోయిన్‌లకు సమాన ప్రాధాన్యం ఉంది. సినిమా మొత్తం హీరోయిన్‌ దృక్కోణంతో నడుస్తుంది. నిజ జీవితంలో నేనేమిటో ఆ పాత్ర కూడా అంతే. కొంచెం అల్లరి, వేగంగా నిర్ణయాలు తీసుకొనే తత్వం ఉన్న పాత్ర. నితిన్‌కూ, నాకూ, త్రివిక్రమ్‌గారికీ కూడా ఈ సినిమా ఓ మేకోవర్‌ లాంటిది. ఇప్పటివరకూ నితిన్‌ చేసిన ఉత్తమమైన అభినయాల్లో ఇందులోని ఆనంద్‌ విహారి పాత్ర ఒకటి. ఈ సినిమా చెయ్యకముందు నుంచీ నితిన్‌ నాకు మంచి ఫ్రెండ్‌. అందువల్ల ఈ సినిమా చేసేప్పుడు చాలా ఒత్తిడి ఫీలయ్యాను. మొదటి రెండు రోజులూ రొమాంటిక్‌ సీన్లు చేయడం చాలా కష్టమైపోయింది. సెట్స్‌పై మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ జీరో. ‘‘మీ ఇద్దర్ని పెట్టి నేను తప్పు చేశానా?’’ అని కూడా అనేశారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత మేం కుదురుకున్నాం.

అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు

‘ఇది చాలా కొత్త కథ.. ఇలాంటి ప్రేమకథ ఇంతదాకా రాలేదు..’ ఇలాంటి మాటలు ‘అ ఆ’ గురించి చెప్పను. సినిమా చూస్తున్నంతసేపూ మన ముఖాలపై చిన్న నవ్వు ఉంటుంది. నేను సినిమా చూశాను. ఆ మరుసటి రోజే నాకు మళ్లీ ఇంకోసారి చూడాలనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా సింపుల్‌ సినిమా, అందమైన సినిమా వస్తోంది. ఇది హీరోయిన్ చెప్పే కథ అయినా, కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాకు నేను డబ్బింగ్‌ చెప్పే పనైతే ఈ ఏడాది జూన్‌కు కాకుండా, వచ్చే ఏడాది జూన్‌కు వస్తుందేమో. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగులతో పాటు వాయిస్‌ ఓవర్‌ కూడా ఎక్కువే. దాన్ని నేను హ్యాండిల్‌ చెయ్యగలనని అనుకోలేదు. అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు.

ఫ్లాప్‌కు బాధపడతా

నేను అబద్ధం చెప్పను. హిట్లు వస్తే సంతోషిస్తాను. ఫ్లాపులొస్తే బాధపడతాను. ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ అంతే. జయాపజయాలనేవి ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి. మనం చేసే ప్రతి సినిమా హిట్టవ్వాలని లేదు. ఒక్కోసారి స్క్రిప్టుపరంగా బాగా ఉందనుకున్నది తెరమీద అంత బాగా రాకపోవచ్చు. బ్యాడ్‌ ఫిల్మ్‌ చెయ్యాలని ఎవరూ కోరుకోరు. సినిమా విజయానికి అదృష్టం కూడా తోడవ్వాలి.

పెళ్లి తర్వాతా నటిస్తా

పొద్దున్నే నిద్రలేచి.. ‘ఈ రోజు బాగుంటుందిలే’ అనుకుంటే, ఏదో ఓ పేపర్‌లో ‘సమంతకు పెళ్లి.. ఎవరితో పెళ్లి?’ అంటూ ఎవరెవరివో ఐదు పేర్లు రాసేసిన న్యూస్‌ కనిపిస్తుంది. ‘అమ్మబాబోయ్‌.. ఇతనితో నేను మాట్లాడి రెండు సంవత్సరాలైపోయిందే.. అతనితో నాకు పెళ్లా?’ అని నవ్వుకుంటాను. నేనెవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయం నేనే చెబుతాను. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా.

వివక్షపై ఫిర్యాదు లేదు

ఓ స్త్రీగా నన్ను పురుషులతో పోల్చుకొని వివక్షకు గురైనట్లుగా నేనెప్పుడూ భావించుకోలేదు. జీవితమంటేనే పోరాటం. పోటీ అనేది పురుషులతో కావచ్చు, స్త్రీలతో కావచ్చు. లింగ వివక్షపై నాకెప్పుడూ దృఢమైన అభిప్రాయం లేదు. పురుషులతో పాటు స్త్రీలనూ సమానంగా చూడ్డం మొదలైంది. బాలీవుడ్‌లో ఇప్పటికే స్త్రీ ప్రధాన చిత్రాలు పెరుగుతున్నాయి. తెలుగులోనూ ఆ వాతావరణం వస్తుంది. నేనైతే ఈ విషయమై ఎవరిపైనా ఫిర్యాదు చెయ్యదలచుకోలేదు.

వీలైనంతమందికి గుండె ఆపరేషన్లు

మా ‘ప్రత్యూష సపోర్ట్‌’ ఫౌండేషన్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నాను. దాని కోసమే జూలైలో అమెరికా వెళ్తున్నాను. అక్కడి ఓ ఫౌండేషన్ వాళ్లు ఆహ్వానించారు. ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా ఖర్చవుతోంది. ఆ ఆపరేషన్ల కోసం మా వద్దకు చాలామంది వస్తున్నారు. వారిలో నిజంగా ఎవరికి ఆపరేషన్ అవసరమనేది మా బృందంలోని డాక్టర్‌ మంజుల చూసుకుంటారు. ఈ విషయంలో వీలైనంత మందికి సాయం చెయ్యాలనేది నా సంకల్పం. ఇప్పటివరకూ నిధుల సమీకరణకై ఎవరి సాయమూ తీసుకోలేదు.

అది తప్పంటాను

నిర్భయ తరహా దుర్ఘటనల వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఇవాళ దేశంలోని చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న దారుణమైన సమస్య అది. సో టెర్రిబుల్‌. ఈ ప్రపంచంలో మంచి విషయాలే జరగాలని కోరుకునే మనస్తత్వం నాది. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పనులు చేస్తున్నాయి. ఇలాంటి దారుణాల్ని ఎలా ఆపాలో నాకు తెలీదు. కానీ ఏదైనా చెయ్యమంటే నా వంతుగా చెయ్యడానికి సిద్ధంగా ఉంటాను. నిర్భయ కేసులో నిందితులు రెండేళ్లలో విడుదలయ్యారు. మైనర్‌ అనే కారణంతో వాళ్లను విడుదల చేయడాన్ని నేనంగీకరించను. అది తప్పంటాను. వాళ్లను తిరిగి జైలులో పెట్టాలనేవాళ్లకు నేను మద్దతిస్తాను.

అమ్మ నన్ను కాపాడింది

మా కుటుంబంలోని అందరిలోకీ అమ్మతోటే ఎక్కువ అనుబంధం నాకు. నాన్న చాలా చాలా స్ట్రిక్టు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. చిన్నప్పట్నించీ నాతోనూ అంతే. అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘షి సేవ్డ్‌ మి’ అంటాను. నా చిన్నతనంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాలు పడింది. ఆ టైమ్‌లో అమ్మే అందరికీ ధైర్యం చెబుతూ వచ్చింది. నాన్నకు కోపమెక్కువ. అమ్మకు ఓర్పెక్కువ. ఆ ఓర్పుతోటే కుటుంబాన్నీ, నన్నూ నడిపించింది. ఇప్పటికీ నా వెనకాల అమ్మ ఉందనే ధైర్యంతో కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాను.

- ఆంధ్రజ్యోతి డైలీ, 31 మే 2016.

No comments: