తెలుగు సినిమా ఎదగడం లేదని ఎంత మొత్తుకుంటే ఏం లాభం? జాతీయ సినిమా యవనికపై తెలుగు సినిమా స్థాయి ఇంతగా దిగజారిపోతోందనే ఆవేదన పట్టేదెవరకి? అవే మూస కథలు, అవే మూస పాత్రలు, అవే మూస సన్నివేశాలు తెరపై దాడిచేస్తుంటే తట్టుకోలేక తలలు పట్టుకొని, తిట్టుకుంటూ హాలు బయటకు వచ్చే సగటు ప్రేక్షకుణ్ణడిగినా చెబుతున్నాడు - ‘ఎన్ని సినిమాలని చూస్తామండీ. అవే సీన్లు, అవే డైలాగులు. కొత్తగా ఒక్క సీనన్నా లేదండీ’ అని. అందుకు అసలు సిసలు ఉదాహరణగా వచ్చింది ‘పండగ చేస్కో’. ఈ సినిమా చూసినవాళ్లలో ఎవరు పండగ చేసుకున్నారో తెలీదు కానీ, దీనికి పెట్టిన ప్రతి పైసా ‘దండగ’ అనేవాళ్లే ఎక్కువ. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారబ్బా! అనే ఆశ్చర్యం కలిగితే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది ఫక్తు ‘ఎ’ టైపు సినిమా. తెరమీద 70 శాతం సన్నివేశాలకు మించి ‘కామ’ రసం ప్రవహిస్తూనే ఉంటుంది మరి! చాలా పాత్రలు ‘కామం’తో దహించుకుపోతూ కనిపిస్తుంటాయి. హీరో సహా చాలామంది డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులతో ‘రచ్చ రచ్చ’ చేసేస్తుంటారు. ఒకట్రెండు డైలాగులని సెన్సార్ వాళ్లు ‘మ్యూట్’ చేసినా, ఎక్కువ శాతం బూతుల్ని అలాగే ఉంచేశారు.
ఈ దండగమారి సినిమా చూస్తున్నంత సేపూ అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు, పాత్రలు మన మనసులో మెదులుతుంటాయి. ఒకట్రెండు సినిమాల పేర్లయితే ప్రస్తావించవచ్చు. తెలుగులో విడుదలయ్యే ప్రతి నాలుగు ‘కమర్షియల్ ఎంటర్‌టైనర్స్’లో మూడు సినిమాలు ఇదే తరహాలో ఉంటున్నవే. ఈ సినిమా ఇతివృత్తం చెబితే నిజమేనని ఎవరైనా తలాడిస్తారు. పోర్చుగల్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని అయిన కార్తీక్ పోతినేని (రామ్)ది పూర్తిగా బిజినెస్ మైండ్. అలాంటి మైండ్‌సెట్టే ఉన్న అనుష్క (సోనాల్ చౌహాన్) అనే ఇంకో వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా నిశ్చితార్థం కూడా చేసుకుంటాడు. కానీ పాతికేళ్ల క్రితం పుట్టింటితో వేరుపడిన తల్లి (పవిత్రా లోకేశ్) ఫ్లాష్‌బ్యాక్ తెలిసి హైదరాబాద్‌కు వస్తాడు. తనెవరో చెప్పకుండా మేనమామ (సంపత్) ఇంట్లోనే ఉండి, ఆయన కూతురైన దివ్య (రకుల్‌ప్రీత్ సింగ్)తో పెళ్లికి ఆమోదం పొందుతాడు. చివరకు విడిపోయిన అన్నా చెల్లెళ్లను కలుపుతాడు. ఇది చదివాక వెంటనే గుర్తొచ్చే సినిమా ‘అత్తారింటికి దారేది’. అందులో హీరో పవన్‌కల్యాణ్ తనెవరో చెప్పకుండా మేనత్త ఇంటికి వస్తాడు. ఇందులో హీరో రామ్ మేనమామ ఇంటికి వస్తాడు. అంతే తేడా. అంటే ఈ సినిమాకు ‘పండగ చేస్కో’ అని కాకుండా ‘మామగారింటికి దారేది’ అని పెట్టినా సరిపోతుంది. ఇక ఎప్పట్లాగే హీరోకీ, హీరోయిన్ ఫ్యామిలీకీ మధ్య ‘దాగుడుమూతలాట’ షురూ. ఈ మధ్య కాలంలో ఈ తరహా దాగుడుమూతలు లేని సినిమాలేవో వేళ్లమీద లెక్కించవచ్చు. అదనంగా ఇందులో ఇంకో పాత్రని ప్రవేశపెట్టారు. అది సాయిరెడ్డి (సాయికుమార్) పాత్ర. ఈ పాత్ర క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌కు బాగా పనికొచ్చింది. చివరలో సెంటిమెంట్ రసం పావుగంట సేపు ప్రవహించేసరికి కళ్లలో నీళ్ల బదులు రక్తం కారుతుందంతే! ఈ సినిమాకి సంబంధించి ‘గట్టి’గా చెప్పుకోవాల్సింది నాలుగు డోసులెక్కువగా ఉండే ‘కామ’ రసం గురించే. అనుష్క అనే కేరక్టర్‌ని చూసినప్పుడల్లా ‘వీకెండ్ వెంకట్రావు’ (బ్రహ్మానందం) ఒళ్లు చిమచిమలాడిపోతూ ఉంటుంది. ఓసారి అతణ్ణి చూసి కార్తీక్ అననే అంటాడు - ‘ఏంటండీ కళ్లల్లో కామరసం అలా కారిపోతోంది’ అని. అంటే అనుష్క కనిపించిందంటే చాలు, వెంకట్రావు కళ్లతోటే ఆమె అందాన్ని ‘జుర్రేసుకుంటూ’ (ఈ పదం వాడినందుకు క్షమించాలి) ఉంటాడు. ప్రతిసారీ అతడి కళ్లు కామరసాన్ని కార్చేస్తుంటే కుటుంబ ప్రేక్షకులు ఆ జుగుప్సను భరించలేక ఎంత ఇబ్బందిగా కుర్చీల్లో కదులుతుంటారో ఊహించుకోవాల్సిందే. వెంకట్రావు ఒక్కడే అలా ప్రవర్తిస్తున్నాడనుకునేరు. హీరోయిన్ ముగ్గురు బాబాయిలు (రఘుబాబు, బ్రహ్మాజీ, శ్రవణ్) ఇరవై ఏళ్ల నుంచీ భార్యలకు దూరంగా ఉండాల్సి వచ్చి, ఆ తర్వాత ఒకసారి వాళ్లు తమ వచ్చేసరికి ‘తట్టుకోలేక’, కామ (‘శృంగారం’ కాదు) పీడితులైన పురుషుల్లాగా, వాళ్లమీద పడిపోతూ ఉంటారు. వాళ్ల హావభావాలు, మాటలు ఎంత ‘పచ్చి’గా ఉంటాయో చెప్పలేం, ‘ఇంగితం’ అనేది ఒకటి మనలో ఇంకా ఉంది కాబట్టి.
స్త్రీ పాత్రలపై చిన్నచూపు
దర్శకుడికి స్త్రీల పట్ల సదవగాహన లేదోమో అనిపిస్తుంటుంది, సినిమా చూస్తున్నంత సేపూ. సోనాల్ చౌహాన్ చేసిన అనుష్క పాత్రను డబ్బు యావ తప్ప మానవత్వం ఏమిటో తెలీని ఓ మృగం తరహాలో చిత్రీకరించాడు. హీరో కార్తీక్‌ను పెళ్లాడాలనుకున్న ఆమె చివరకు రూ. 3 వేల కోట్ల కోసం పక్కా రౌడీ అయిన అభిమన్యుసింగ్‌ను పెళ్లాడటం ఎంత ఫూలిష్‌గా ఉంటుందో! బద్ధ శత్రువుల్లాగా ఉండే తండ్రినీ, మావయ్యనీ కలపాలనే ఉద్దేశంతో వాళ్లకు కనిపించకుండా అజ్ఞాతంలో ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన స్వాతి (తేజస్విని) ఇంట్లో ఉండే హీరోయిన్ దివ్య ‘గ్రీన్ ఆర్మీ’ పేరుతో ఉద్యమాన్నే నడపడం చూసి ముక్కుమీదే కాదు, ‘ఇంకెక్కడైనా’ వేలు పెట్టేసుకోవచ్చు. ఛ.. ఈ దండగ సినిమా చూశాక మనక్కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నాయ్ బాబోయ్. మొక్కల కోసం, పచ్చదనం కోసం దివ్య చేసే ఉద్యమాన్ని టీవీలు ప్రసారం చేస్తున్నా, ఆమె ఎక్కడుందో పాపం.. వాళ్ల నాన్నకూ, మావయ్యకూ తెలీదు. చిత్రమేమంటే స్వాతి ఇంట్లో ఉన్నంత సేపే ‘గ్రీన్ ఆర్మీ’ ఉద్యమాన్ని నడుపుతుంది దివ్య. తమ ఇంటికి వచ్చేస్తే ఆ ‘గ్రీన్’ సంగతి మచ్చుకి కూడా ఆమెకు జ్ఞాపకముండదు. ఇక ఆమె చేసే ఉద్యమమంటే మన హీరోకు ఎంత చులకనో! మొక్కలనూ, పిచుకలనూ ఎంత తక్కువచేసి మాట్లాడుతుంటాడో! ఇక దివ్య ఫ్రెండ్ స్వాతి పాత్రను దర్శకులు మలిచిన తీరు మరీ ఘోరం. ఎవరికి పడితే వాళ్లకు పడిపోతుందని ఆమెని ప్రేమించిన కొండయ్య (వెన్నెల కిశోర్) మాత్రమే కాదు, ఆమెను కన్న తండ్రి ఎమ్మెస్ నారాయణా తెగ బాధపడితుంటారు. ఆమెను ఒంటరిగా వదిలేస్తే కష్టమని డైరెక్టుగానే చెప్పేస్తుంటారు. సినిమా మొదట్లో హీరోకు ఓ చెల్లెల్ని చూపించారు. మధ్యలో ఆమె పాత్ర ఉన్నదనే విషయం మర్చిపోయారు.
కార్తీక్ కేరక్టర్‌లో రామ్ ‘ఓవరాక్షన్’ చేసేశాడు. ‘అండరాక్టింగ్’ చేయాల్సిన చోట కూడా ‘నేను వెనక్కి తగ్గేది లేదు’ అన్నట్లుగా అతి నాటకీయత ప్రదర్శించాడు. చాలా సన్నివేశాల్లో.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఐదు నిమిషాల పైగా డైలాగులు, హావభావాల విషయంలో పవన్‌కల్యాణ్‌ను మక్కీకి మక్కీ అనుకరించేశాడు (‘అత్తారింటికి దారేది’లో రైల్వే స్టేషన్‌లో మేనత్త నదియా వద్ద పవన్‌కల్యాణ్ చెప్పే డైలాగులు గుర్తున్నాయి కదూ). రామ్ దెబ్బకు ఓవరాక్టింగ్‌కు పెట్టింది పేరైన సాయికుమార్ సైతం డౌనైపోయాడు. దివ్యగా హీరోయిన్ పాత్రలో రకుల్‌ప్రీత్ క్యూట్‌గా ఉంది. సినిమాలో కాస్త చూడబుద్ధేసిన ముఖం ఆమెదే. తన పరిధిలో ఆ పాత్రను బాగానే చేసింది. హీరోయిన్ తండ్రిగా సంపత్, మేనమామగా సాయికుమార్, హీరో తల్లిదండ్రులుగా పవిత్రా లోకేశ్, రావు రమేశ్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. సోనాల్ చౌహాన్ పాత్రనూ, ఆ పాత్రలో ఆమె అభినయాన్నీ భరించలేం. ఎమ్మెస్ నారాయణ వంటి హాస్యనటుణ్ణి డబుల్‌మీనింగ్ డైలాగుల కోసం ఉపయోగించుకోవడం బాధని కలిగిస్తుంది. ‘వీకెండ్ వెంకట్రావు’ పాత్రలో కామరసాన్ని బీభత్సంగా కురిపించేసి, ఆ పాత్రను పూర్తిగా ‘పెద్దలకు మాత్రమే’గా మార్చేశాడు బ్రహ్మానందం. కొండయ్య పాత్రలో అమాయకత్వాన్ని పండించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు వెన్నెల కిశోర్.
సాంకేతిక వర్గంలో ఎక్కువ మార్కులు పడేది సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణానికే. సినిమా ఎలా ఉన్నా ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉందంటే అది కెమెరా పనితనం వల్లే. తమన్ డప్పు సంగీతంలో కొత్తగా వినిపించిన బాణీలేమీ లేవు. పాటలు ఎంత రిచ్‌గా తీసినా, వినసొంపుగా లేవు. టైటిల్ సాంగ్ వచ్చేసరికి ప్రేక్షకులు రిలీఫ్ కోసం కుర్చీల్లోంచి లేస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ రాసిన పాచిపోయిన కథకు, కోన వెంకట్ డబుల్ మీనింగ్, ‘అడల్ట్’ డైలాగులు తోడై, ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండాల్సిన సినిమాగా చేశాయ్.
ట్యాగ్‌లైన్ : డబ్బు ‘దండగ’ చేస్కో..