Wednesday, June 18, 2014

Cinema: Ram Gopal Varma.. The Experimental Technician

ప్రయోగాలకు వెరవని టెక్నీషియన్

ట్రెండ్‌సెట్టర్లకే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి నాగార్జున, జగపతిబాబు, జె.డి. చక్రవర్తి వంటి నటులకు స్టార్‌డం కల్పించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇవాళ హిందీ చిత్రసీమకే అంకితమవడం విచారకరం. ఆరు పాటలు, ఐదు ఫైట్లు, వెగటు పుట్టించే ముతక హాస్య సన్నివేశాలు, ద్వంద్వార్థాల సంభాషణలు - ఇవే తెలుగు సినిమా అంటే.. అనే స్థితి నుంచి ఒక్కసారిగా సాంకేతిక అంశాలవైపు దృష్టి మరలింపజేసి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించినవాడు వర్మ. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకేట్లుగా సన్నివేశాల్ని మలచడంలో వర్మ నిష్ణాతుడు. ఇందుకు మంచి ఉదాహరణ - 'క్షణ క్షణం'. కథగా చెప్పుకోడానికి ఏమీలేని ఈ సినిమాని కేవలం కథనంతో, సహజమని భ్రమింపజేసే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. పాటల చిత్రీకరణలో కూడా వర్మ ప్రత్యేకత కనిపిస్తుంది. పాటల్లో నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) ఎలా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.
ఒక్క 'శివ' చిత్రంతోటే వర్మ అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. పైగా అది మొదటి చిత్రం కూడా. ఆ సినిమా నాగార్జునకు స్టార్‌డం కల్పించి చిరంజీవి తర్వాత రెండో స్థానాన్ని సాధించిపెట్టింది. యువతలో 'శివ' సృస్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల యువత చెడిపోతున్నదని అప్పుడంతా గోలపెట్టినవాళ్లే. కాలేజీ కేంపస్‌లలో 'శివ' తరహాలో జరిగిన అల్లర్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మొత్తానికి ఆ సినిమాతో వర్మ, నాగార్జున - ఇద్దరూ పరస్పర ప్రయోజనం పొందారు. ఐనా వర్మ సంతృప్తి చెందలేదు. అతడిలోని టెక్నీషియన్ నిరంతర శోధనలోనే ఉండేవాడు. 'క్షణ క్షణం' ఆ టెక్నీషియన్‌కు మరింత పదునుపెట్టింది. కాగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తి రాజ్‌కపూర్ 'చోరీ చోరీ' అనిపిస్తుంది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడో కానీ ఆదరణ చూపని తెలుగు ప్రేక్షకులను ఒప్పించే లక్ష్యంతో వర్మ 'రాత్రి', 'దెయ్యం' సినిమాలను తీశాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాందోళనలు ఆ మనిషిని ఎలా కల్లోలపరుస్తాయో ఆ రెండు చిత్రాల్లో చూపించేందుకు ప్రయత్నించాడు వర్మ. 'దెయ్యం' విడుదలకు ముందు ప్రకటనల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కాడు. ఐతే ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయాయి.
అంతకు ముందు జగపతిబాబు హీరోగా 'గాయం' చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాడు వర్మ. సరైన సక్సెస్ లేక డౌన్ స్టేజ్‌కి చేరువవుతున్న సమయంలో జగపతిబాబుకు 'గాయం' ఊరటనివ్వడమే కాకుండా చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఇది ఊర్మిళకు రెండో సినిమా. తొలి సినిమా 'అంతం' ఘోరంగా ఫ్లాపైంది. మచ్చుకైనా తెలుగుతనం కనిపించకపోవడం, హాలీవుడ్ స్టయిల్లో రూపొందించాలనే తాపత్రయంతో కథని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కథనాన్ని సైతం చికాకు పరిచేలా తయారుచేయడం 'అంతం' బాక్సులన్నీ తిరుగుటపా కట్టడానికి కారణం. అయినా వర్మ పరాజయానికి కుంగిపోయే రకం కాదు. 'ప్రయోగాలకు స్వస్తిచెప్పి సాధారణ స్థాయిలో సినిమాలు తీసుకుందాం' అనుకొనే సాధారణ దర్శకుడు కాదు. అందుకనే తెలుగువాళ్లకే కాదు, దేశంలోని కోట్లాది ప్రజానీకానికి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి మీదే ప్రయోగం చేయాలనుకొని 'గోవిందా గోవిందా'ని తలపెట్టాడు. చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వెరవక చిత్రాన్ని పూర్తిచేశాడు. జయాపజయాల మాటెలా ఉన్నా చిత్రంలోని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ వర్మలోని దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పాయి. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు చేసిన 'కట్స్' వల్ల వర్మకి తెలుగు సెన్సార్ బోర్డు మీద కోపం వచ్చి "ఇక తెలుగు సినిమాలు చేయను" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తర్వాత జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా 'అనగనగా ఒక రోజు' అనే సినిమా మొదలుపెట్టాడు. "తెలుగు సినిమాలను తీయనన్నారుగా" అనడిగితే "ఆ స్టేట్‌మెంట్ ఇవ్వకముందే ఈ సినిమా మొదలైపోయింది" అన్నాడు. 'అనగనగా ఒక రోజు'తో బ్రహ్మానందం ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సినిమా కూడా జనానికి నచ్చింది. అదే ఆఖరు - తెలుగు సినిమాకు వర్మ దర్శకత్వం వహించడం.
ముంబైకి వెళ్లి తీసిన తొలి సినిమా పెద్ద సంచలనం రేపింది. అది 'రంగీలా'. సినిమా రంగానికి వెళ్లిన ఓ సాధారణ యువతి స్టార్ అయినా కూడా సామాన్యుడైన తన పూర్వ స్నేహితుణ్ణే పెళ్లాడాలని నిర్ణయించుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. 'రంగీలా ఆయిరే' పాట అప్పట్లో యువతని ఓ ఊపు ఊపింది. ఊర్మిళతోనే ఎక్కువగా సినిమాలు తీస్తుంటే ఇద్దరిమీదా గాసిప్స్ మొదలయ్యాయి. ఇలాంటివేమీ పట్టించుకొనే ఘటం కాదు కాబట్టి ఆ తర్వాత కూడా ఊర్మిళతో సినిమాలు తీస్తూనే వచ్చాడు వర్మ. 'కౌన్', 'సత్య', 'మస్త్', ఇప్పుడు 'జంగిల్' - వీటన్నింటిలోనూ ఊర్మిళనే హీరోయిన్. రెండే పాత్రలతో తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'కౌన్' సక్సెస్ కాలేదు. దీంట్లో నటించిన మజోన్ బాజ్‌పేయి అంతకుముందు 'సత్య'తో వెలుగులోకి వచ్చాడు. మనోజ్ హీరోగా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పిన వర్మ చెప్పినట్లుగానే 'శూల్' తీశాడు. అయితే తాను నిర్మాతగా మాత్రమే ఉండి శిష్యుడైన నివాస్‌కు దర్శకత్వం అప్పజెప్పాడు. సినీ జగత్తు నేపథ్యంతోనే వర్మ తీసిన 'మస్త్' కూడా ఫ్లాపయింది. త్వరలో 'జంగిల్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఫిరోజ్‌ఖాన్ కొడుకు ఫర్దీన్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. వర్మ స్థాయిలోనే టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వస్తుందని అందరూ భావిస్తున్నారు.
తన సినిమాలతో కొంతమందికి స్టార్‌డంనీ, మరికొంతమంది కొత్తవాళ్లకి గుర్తింపునీ తీసుకువచ్చిన వర్మ చిత్రంలో నటించడానికి ఆరాటపడని వాళ్లుండరు. జె.డి. చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, అఫ్తాబ్ శివ్‌దాసాని, ఫర్దీన్‌ఖాన్ వంటి వాళ్లని తెరకి పరిచయం చేసినా కొంతమంది మంచి టెక్నీషియన్స్‌ని కూడా చిత్రసీమకు అందించాడు. అతడి శిష్యుడైన కృష్ణవంశీ ఇవాళ అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడు. ఏమైనా హిందీ చిత్రసీమకే పూర్తిగా అంకితమైపోకుండా మాతృసీమ అయిన తెలుగు చిత్రసీమకూ సేవ అందించాలనీ, వర్మ తెలుగు చిత్రాలు తీస్తే బాగుండుననీ కొంతమందైనా అనుకుంటున్నారు.

- ఆంధ్రభూమి 'వెన్నెల', 26 మే, 2000

No comments: