Saturday, June 28, 2014

Cinema: Extraordinary Writer Mullapudi Venkata Ramana

ఆయన మాట రమణీయం

నాటకంలో విజువల్ కన్నా శబ్దానికి ప్రాధాన్యం ఎక్కువ. కారణం సినిమాలోలా దూరంగా ఉన్నవాళ్లకు రంగస్థలం మీద నటులు సరిగా కనిపించరు. అందుకని సంభాషణలు ఎక్కువ ఉండాలి. అదే సినిమా విషయానికి వస్తే ఒక విజువల్‌తో వంద మాటలు పలికించవచ్చు. అంటే ఒక బొమ్మ వంద మాటల పెట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంభాషణలు రాసినవాళ్లు చరిత్రలో గొప్ప రచయితలుగా నిలిచారు. అలాంటి అరుదైన సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ. 'అందరికీ నచ్చే స్థాయిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటేనే అది మంచి స్క్రిప్టు' అని ఆయనే ఒకచోట చెప్పారు. అలాంటి మంచి స్క్రిప్టులు ఆయన కలం నుంచె అనేకం జాలువారాయి.

"నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను'' అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు 'ముత్యాల ముగ్గు' తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర 'ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ' అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. 'ముత్యాల ముగ్గు' నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా 'బుద్ధిమంతుడు' కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.

గుడికీ, బడికీ మధ్య పోటీ

బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 'బుద్ధిమంతుడు'ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు - మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా' అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి 'బుద్ధిమంతుని'గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య "వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?'' అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. "అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా'' అంటాడు గోపి ఆవేదనగా.

నిజం రాణిస్తుంది

తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాన్నట్లు మాట్లాడితే "నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది'' అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య "సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను" అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. "అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేడో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు'' అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.

మానవసేవే మాధవసేవ

ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. 'మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?' అని ప్రశ్నించిన కృష్ణుడు (శోభన్‌బాబు) "నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట పెరిగాననీ నువ్వెరుగవా?'' అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. "సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను'' అంటాడు. తమ్ముడితో "మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం'' అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.

'ఆమ్యామ్యా' ఇందులోనిదే

ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే 'ఆమ్యామ్యా' అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. "ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది'' అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి 'బుద్ధిమంతుడు'ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.

- ఆంధ్రజ్యోతి డైలీ, జూన్ 28, 2014

Tuesday, June 24, 2014

Cinema: The Evergreen Item Girl Jyothi Lakshmi

ఎవర్‌గ్రీన్ ఐటం గాళ్

ముప్పై అయిదేళ్ల క్రితం.. అంటే 1973లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 'ఇదా లోకం' సినిమాలోని 'గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు..' పాట ఆంధ్ర ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకు నర్తించింది.. అప్పటి మేటి శృంగార తార జ్యోతిలక్ష్మి. ఇన్నేళ్ల తర్వాత ఆ పాట 'కుబేరులు' అనే సినిమాలో రీమిక్స్ అవుతోంది. పల్లవిని యథాతథంగా ఉంచి, చరణాలు మార్చి భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఆ పాటకు నర్తించింది.. వేరెవరో కాదు.. మళ్లీ జ్యోతిలక్ష్మే. 'అదెలా సాధ్యం!' అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. పాతికేళ్ల వయసులోని అప్పటి జ్యోతిలక్ష్మి ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ వొంటి విరుపులతోనూ, నాట్య విలాసంతోనూ ఆ పాటకు నర్తించింది. ముంబైకి చెందిన తస్లీమా షేక్ అనే అందమైన డాన్సర్‌తో ఈ పాటకు ఆమె నర్తిస్తుంటే సెట్స్ మీద ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. కొంత కాలం గ్యాప్ తర్వాత తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆ స్టార్ డాన్సర్ తన అంతరంగాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలో 'నవ్య' ఎదుట ఆవిష్కరించింది. ఆసక్తికరమైన ఆ విశేషాలు...

నేను తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టా. మా అమ్మా నాన్నలకు మొత్తం ఎనిమిది మంది సంతానం. నేనే పెద్దదాన్ని. అందరికంటే జయమాలిని చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురం ఆడపిల్లలం. చిన్నతనంలోనే నన్ను మా మేనత్త ఎస్.పి.ఎల్. ధనలక్ష్మి పెంపకం తీసుకుంది. ఆమె వద్దే పెరిగా. ఆమె అప్పటికే మంచి హీరోయిన్. ఆ తర్వాతే జ్యోతిని కాస్తా జ్యోతిలక్ష్మినయ్యా. పేరుపొందిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ టి.ఆర్. రామన్న మా అన్నయ్యే (పెద్దమ్మ కొడుకు). నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనే ఎంజీఅర్ సినిమా.. పేరు గుర్తులేదు.. అందులో ఒక పాటలో డ్యాన్స్ చేయించాడు. ఎనిమిదేళ్లప్పుడు శివాజీ గణేశన్ సినిమా 'కార్తవరాయన్ కథ'లో డ్యాన్స్ చేశా. ఆ తర్వాత పెద్దయ్యాక 1963లో విడుదలైన తమిళ చిత్రం 'పెరియ యిడత్తు పెణ్'తో మళ్లీ సినిమాల్లోకి వచ్చా. ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో. అందులో నగేశ్ సరసన వల్లి అనే పాత్ర చేశా. అది కామెడీ రోల్. ఆ పాత్ర నాకు బాగానే గుర్తింపు తెచ్చింది. నాకు గుర్తున్నంత వరకు తెలుగులో చేసిన తొలి సినిమా 'పెద్దక్కయ్య'. అది 1967లో వచ్చింది. అందులో డ్యాన్సర్‌గా చేశా. చిన్నప్పుడే నేను రామయ్య పిళ్లె దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. అందువల్ల సినిమా డ్యాన్సులు నాకు కష్టమనిపించలేదు. వాటికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోకపోయినా భరతనాట్యమే అందుకు ఉపకరించింది. అందుకే ఎటువంటి క్లిష్టమైన డ్యాన్స్‌నైనా చేయగలిగా.

నాకు పోటీ నా చెల్లెలే

ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి మించి పాటల్లో నర్తించా. వీటిలో హీరోయిన్‌గా చేసిన సినిమాలు ఇరవై వరకు ఉంటాయి. తమిళంలో హీరోయిన్‌గా పది సినిమాల వరకు చేశా. ఎంజీఆర్‌తో 'తలైవా'లో జయలలితతో పాటు హీరోయిన్‌గా చేశా. అలాగే శివజీ గణేశన్‌తో సెకండ్ హీరోయిన్‌గా నటించా. తెలుగులో కృష్ణ గారితో 'మొనగాడొస్తున్నాడు జాగ్రత్త', 'హంతకులు దేవాంతకులు' సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. హరనాథ్‌తో 'పుణ్యవతి', రామకృష్ణతో 'పిల్లా? పిడుగా?' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎక్కువగా కృష్ణగారి సినిమాల్లో చేశాను. డైరెక్టర్ల విషయానికి వస్తే ఎక్కువగా కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో నటించా. అప్పట్లో ఫైటింగ్ సినిమాలంటే నేను తప్పకుండా ఉండేదాన్ని. ఫైటింగ్ సీన్లలో నేనే స్వయంగా నటించేదాన్ని. డూప్‌ని ఎప్పుడోగానీ ఉపయోగించేవాళ్లు కాదు. విజయలలిత, హలం వంటి వాళ్లున్నా నాకు ప్రధాన పోటీ నా చెల్లెలు జయామాలినియే. అప్పట్లో నేను గర్భవతిగా ఉండి, కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యా. ఆ టైంలోనే జయమాలిని సినిమాల్లోకి వచ్చి సక్సెసయ్యింది. అందం తనకు ప్లస్ పాయింట్. కొన్ని నెలలకు నేను తిరిగి సినిమాల్లోకి వచ్చేశా. అప్పట్నించీ మా మధ్య పోటీ ఉండేది. అయితే ఈ విషయంలో మేమిద్దరమూ ఒకరి పట్ల ఒకరం అసూయ చెందింది లేదు. చాలా సినిమాల్లో కలిసే డాన్సులు చేశాం. ఒకర్ని మించి ఒకరం బాగా డాన్స్ చేయాలని తపన పడేవాళ్లం. అందుకే మా పాటలు అంతగా పాపులర్ అయ్యాయి. మా డాన్సులు అంతగా పేరు తెచ్చుకున్నాయి. నేనింకా సినిమాల్లో కొనసాగుతున్నా, తను మాత్రం ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకొని చెన్నైలోనే ఉంటోంది. సమయాన్నంతా కుటుంబానికే కేటాయిస్తోంది. తనకు ఒక మనవడున్నాడు.

ఎక్స్‌పోజింగ్‌కు ఇబ్బంది పడలేదు

నా కూతురు జ్యోతిమీనా కూడా జయ బాటే పట్టింది. నా వారసురాలిగా డాన్సర్‌గా అడుగు పెట్టినప్పటికీ, మీనాకు ఈ ఫీల్డ్ అంతగా నచ్చలేదు. అందుకే తనకు పెళ్లి చేసేశా. హాయిగా కాపురం చేసుకుంటోంది. తనకు ఒక పాప. ఇటీవలి కాలంలో నాకు తెలుగులో గ్యాప్ వచ్చిందన్నది నిజం. అయితే తమిళంలో అడపాదడపా చేస్తూనే ఉన్నా. తమిళ టీవీ సీరియల్స్‌తో పాటు తెలుగులో 'మా ఇంటి మహాలక్ష్మి', 'ఓం నమో వెంకటేశాయ' వంటి సీరియల్స్ చేశా. రాజశేఖర్ హీరోగా నటించిన 'శేషు' తర్వాత మళ్లీ తెలుగులో నటించడం ఇదే. నేను డాన్స్ చేసిన పాటలన్నీ నాకిష్టమైనవే కానీ, ఎన్టీఆర్ సినిమా 'సర్దార్ పాపారాయుడు'లోని 'జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. ఆ చీరకే సిగ్గేసింది' పాటంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చీరకట్టడమనేది ఒక సెన్సేషన్. ఆ పాట అప్పట్లో బాగా పాపులర్. ఏ మూలకు వెళ్లినా ఆ పాట చాలా కాలం వినిపించింది. "ఐటం సాంగ్స్ అంటే ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి కదా.. ఇన్ని పాటలు ఎలా చేయగలిగారు?" అని మీతో పాటు ఒకరిద్దరు నన్నడిగారు. డాన్సర్‌గా చేయడమంటే ఎక్స్‌పోజింగ్ తప్పదని తెలుసు. మొదటే ప్రిపేరయ్యాను కాబట్టే తొలినాళ్ల నుంచీ ఇప్పటిదాకా ఎక్స్‌పోజింగ్‌కు కానీ, కురచ దుస్తులు వేసుకోవడానికి కానీ నేనెన్నడూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే డాన్సింగ్‌ని నేను వృత్తిగా, పనిగా భావించాను కాబట్టి. అందుకే నాలుగు దశాబ్దాలుగా కెరీర్ కొనసాగించగలిగా. అదే హీరోయిన్‌గా అయితే ఇప్పుడు మీకు కనిపించేదాన్నా!

అదే నా ఆరోగ్య రహస్యం

ఆ రోజుల్లోని ట్రెండు ప్రకారం ఆ క్లబ్ సాంగ్స్ ఎలా బాగుండేవో, ఇప్పటి ట్రెండు ప్రకారం ఈ ఐటం సాంగ్సూ బాగుంటున్నాయి.  మధ్యలో కొంత కాలం ఐటం సాంగ్స్ వెనుకపట్టు పట్టినా, మళ్లీ ఇప్పుడు వాటికి మంచి రోజులు నడుస్తున్నాయి. అందుకే నాకు మళ్లీ అవకాశాలొస్తున్నాయి. 'ఈ వయసులోనూ ఎందుకు ఈ డాన్సులు చెయ్యడం?' అని మీరడగవచ్చు. చేసే ఓపిక ఉంది కాబట్టే చేస్తున్నా. చేస్తూనే ఉంటా. ఓపిక లేనప్పుడు మానేస్తా. అదెప్పుడనేది చెప్పలేను. హీరోయిన్ సహా అన్ని రకాల పాత్రలూ చేశా. హీరో మాదిరిగా ఫైట్లు, డాన్సులు చేశా. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేశా. అందువల్ల ఫలానా రకం పాత్ర చేయలేదనే అసంతృప్తి నాలో లేదు. ఆహారాన్ని మితంగా తీసుకోవడమే నా ఆరోగ్యం వెనుక ఉన్న రహస్యమంటాను. ఇంటి పనులు నేనే చేసుకుంటా. అందుకే ఒంటిని ఇప్పటికీ కాపాడుకోగలుగుతున్నా. రాజా హీరోగా నటిస్తున్న 'జగన్మోహిని'లో నమిత తల్లిగా నటిస్తున్నా. నమిత జగన్మోహిని అన్నమాట. ఈ సినిమా తెలుగు, తమిళం.. రెండు భాషల్లోనూ తయారవుతోంది. అలాగే శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'కుబేరులు'లో ఐటం సాంగ్ చేశా. ఒకప్పుడు నేను 'ఇదా లోకం' సినిమాలో డాన్స్ చేయగా, బ్రహ్మాండంగా పాపులర్ అయిన 'గుడి యెనక నా సామి గుర్రమెక్కి పోతున్నాడు'కు ఇది రీమిక్స్ సాంగ్. ముప్పై ఐదేళ్ల తర్వాత అదే పాటకు మళ్లీ నేనే డాన్స్ చెయ్యడం కొత్తగానూ, ఆనందంగానూ ఉంది. అలాగే దాసరి నారాయణరావుగారి సినిమా 'మేస్త్రి'లో హీరో బామ్మగా నటిస్తున్నా.
ఇప్పటి తరానికి నా గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు రెండు దశాబ్దాల పైగా నా ఆట పాటతో దక్షిణాది ప్రేక్షకుల్ని మురిపించాను, మైమరపింపజేశాననే తృప్తి ఉంది. 'ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఉందా?' అని మగవాళ్లు అడిగేవాళ్లంటే.. అంతకంటే ఒక సినిమా డాన్సర్‌గా నాకు కావలసిందేముంది! ఈ తరం ప్రేక్షకుల హృదయాల్లోనూ స్థానం పొందాలనేది ఇప్పటి నా లక్ష్యం.

- నవ్య వీక్లీ, డిసెంబర్ 3, 2008

Wednesday, June 18, 2014

Cinema: Ram Gopal Varma.. The Experimental Technician

ప్రయోగాలకు వెరవని టెక్నీషియన్

ట్రెండ్‌సెట్టర్లకే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి నాగార్జున, జగపతిబాబు, జె.డి. చక్రవర్తి వంటి నటులకు స్టార్‌డం కల్పించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇవాళ హిందీ చిత్రసీమకే అంకితమవడం విచారకరం. ఆరు పాటలు, ఐదు ఫైట్లు, వెగటు పుట్టించే ముతక హాస్య సన్నివేశాలు, ద్వంద్వార్థాల సంభాషణలు - ఇవే తెలుగు సినిమా అంటే.. అనే స్థితి నుంచి ఒక్కసారిగా సాంకేతిక అంశాలవైపు దృష్టి మరలింపజేసి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించినవాడు వర్మ. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకేట్లుగా సన్నివేశాల్ని మలచడంలో వర్మ నిష్ణాతుడు. ఇందుకు మంచి ఉదాహరణ - 'క్షణ క్షణం'. కథగా చెప్పుకోడానికి ఏమీలేని ఈ సినిమాని కేవలం కథనంతో, సహజమని భ్రమింపజేసే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. పాటల చిత్రీకరణలో కూడా వర్మ ప్రత్యేకత కనిపిస్తుంది. పాటల్లో నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) ఎలా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.
ఒక్క 'శివ' చిత్రంతోటే వర్మ అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. పైగా అది మొదటి చిత్రం కూడా. ఆ సినిమా నాగార్జునకు స్టార్‌డం కల్పించి చిరంజీవి తర్వాత రెండో స్థానాన్ని సాధించిపెట్టింది. యువతలో 'శివ' సృస్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల యువత చెడిపోతున్నదని అప్పుడంతా గోలపెట్టినవాళ్లే. కాలేజీ కేంపస్‌లలో 'శివ' తరహాలో జరిగిన అల్లర్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మొత్తానికి ఆ సినిమాతో వర్మ, నాగార్జున - ఇద్దరూ పరస్పర ప్రయోజనం పొందారు. ఐనా వర్మ సంతృప్తి చెందలేదు. అతడిలోని టెక్నీషియన్ నిరంతర శోధనలోనే ఉండేవాడు. 'క్షణ క్షణం' ఆ టెక్నీషియన్‌కు మరింత పదునుపెట్టింది. కాగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తి రాజ్‌కపూర్ 'చోరీ చోరీ' అనిపిస్తుంది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడో కానీ ఆదరణ చూపని తెలుగు ప్రేక్షకులను ఒప్పించే లక్ష్యంతో వర్మ 'రాత్రి', 'దెయ్యం' సినిమాలను తీశాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాందోళనలు ఆ మనిషిని ఎలా కల్లోలపరుస్తాయో ఆ రెండు చిత్రాల్లో చూపించేందుకు ప్రయత్నించాడు వర్మ. 'దెయ్యం' విడుదలకు ముందు ప్రకటనల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కాడు. ఐతే ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయాయి.
అంతకు ముందు జగపతిబాబు హీరోగా 'గాయం' చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాడు వర్మ. సరైన సక్సెస్ లేక డౌన్ స్టేజ్‌కి చేరువవుతున్న సమయంలో జగపతిబాబుకు 'గాయం' ఊరటనివ్వడమే కాకుండా చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఇది ఊర్మిళకు రెండో సినిమా. తొలి సినిమా 'అంతం' ఘోరంగా ఫ్లాపైంది. మచ్చుకైనా తెలుగుతనం కనిపించకపోవడం, హాలీవుడ్ స్టయిల్లో రూపొందించాలనే తాపత్రయంతో కథని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కథనాన్ని సైతం చికాకు పరిచేలా తయారుచేయడం 'అంతం' బాక్సులన్నీ తిరుగుటపా కట్టడానికి కారణం. అయినా వర్మ పరాజయానికి కుంగిపోయే రకం కాదు. 'ప్రయోగాలకు స్వస్తిచెప్పి సాధారణ స్థాయిలో సినిమాలు తీసుకుందాం' అనుకొనే సాధారణ దర్శకుడు కాదు. అందుకనే తెలుగువాళ్లకే కాదు, దేశంలోని కోట్లాది ప్రజానీకానికి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి మీదే ప్రయోగం చేయాలనుకొని 'గోవిందా గోవిందా'ని తలపెట్టాడు. చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వెరవక చిత్రాన్ని పూర్తిచేశాడు. జయాపజయాల మాటెలా ఉన్నా చిత్రంలోని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ వర్మలోని దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పాయి. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు చేసిన 'కట్స్' వల్ల వర్మకి తెలుగు సెన్సార్ బోర్డు మీద కోపం వచ్చి "ఇక తెలుగు సినిమాలు చేయను" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తర్వాత జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా 'అనగనగా ఒక రోజు' అనే సినిమా మొదలుపెట్టాడు. "తెలుగు సినిమాలను తీయనన్నారుగా" అనడిగితే "ఆ స్టేట్‌మెంట్ ఇవ్వకముందే ఈ సినిమా మొదలైపోయింది" అన్నాడు. 'అనగనగా ఒక రోజు'తో బ్రహ్మానందం ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సినిమా కూడా జనానికి నచ్చింది. అదే ఆఖరు - తెలుగు సినిమాకు వర్మ దర్శకత్వం వహించడం.
ముంబైకి వెళ్లి తీసిన తొలి సినిమా పెద్ద సంచలనం రేపింది. అది 'రంగీలా'. సినిమా రంగానికి వెళ్లిన ఓ సాధారణ యువతి స్టార్ అయినా కూడా సామాన్యుడైన తన పూర్వ స్నేహితుణ్ణే పెళ్లాడాలని నిర్ణయించుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. 'రంగీలా ఆయిరే' పాట అప్పట్లో యువతని ఓ ఊపు ఊపింది. ఊర్మిళతోనే ఎక్కువగా సినిమాలు తీస్తుంటే ఇద్దరిమీదా గాసిప్స్ మొదలయ్యాయి. ఇలాంటివేమీ పట్టించుకొనే ఘటం కాదు కాబట్టి ఆ తర్వాత కూడా ఊర్మిళతో సినిమాలు తీస్తూనే వచ్చాడు వర్మ. 'కౌన్', 'సత్య', 'మస్త్', ఇప్పుడు 'జంగిల్' - వీటన్నింటిలోనూ ఊర్మిళనే హీరోయిన్. రెండే పాత్రలతో తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'కౌన్' సక్సెస్ కాలేదు. దీంట్లో నటించిన మజోన్ బాజ్‌పేయి అంతకుముందు 'సత్య'తో వెలుగులోకి వచ్చాడు. మనోజ్ హీరోగా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పిన వర్మ చెప్పినట్లుగానే 'శూల్' తీశాడు. అయితే తాను నిర్మాతగా మాత్రమే ఉండి శిష్యుడైన నివాస్‌కు దర్శకత్వం అప్పజెప్పాడు. సినీ జగత్తు నేపథ్యంతోనే వర్మ తీసిన 'మస్త్' కూడా ఫ్లాపయింది. త్వరలో 'జంగిల్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఫిరోజ్‌ఖాన్ కొడుకు ఫర్దీన్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. వర్మ స్థాయిలోనే టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వస్తుందని అందరూ భావిస్తున్నారు.
తన సినిమాలతో కొంతమందికి స్టార్‌డంనీ, మరికొంతమంది కొత్తవాళ్లకి గుర్తింపునీ తీసుకువచ్చిన వర్మ చిత్రంలో నటించడానికి ఆరాటపడని వాళ్లుండరు. జె.డి. చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, అఫ్తాబ్ శివ్‌దాసాని, ఫర్దీన్‌ఖాన్ వంటి వాళ్లని తెరకి పరిచయం చేసినా కొంతమంది మంచి టెక్నీషియన్స్‌ని కూడా చిత్రసీమకు అందించాడు. అతడి శిష్యుడైన కృష్ణవంశీ ఇవాళ అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడు. ఏమైనా హిందీ చిత్రసీమకే పూర్తిగా అంకితమైపోకుండా మాతృసీమ అయిన తెలుగు చిత్రసీమకూ సేవ అందించాలనీ, వర్మ తెలుగు చిత్రాలు తీస్తే బాగుండుననీ కొంతమందైనా అనుకుంటున్నారు.

- ఆంధ్రభూమి 'వెన్నెల', 26 మే, 2000

Cinema: Eligible Bachelors of Telugu Cinema


- ఆంధ్రజ్యోతి డైలీ, జూన్ 16, 2014

Cinema: Chiranjeevi's 150 film


- ఆంధ్రజ్యోతి డైలీ, జూన్ 9, 2014

Wednesday, June 11, 2014

Short Story: Amrutham Varshinchina Megham

అమృతం వర్షించిన మేఘం


వీపు కింద ఇసుక జారుతుంటే గిలిగా ఉండటంతో పాటు నీళ్లలోకి అంతకంతకూ జారిపోతున్నామా అనిపిస్తోంది. చల్లటి సాయంకాలపు సముద్రపు గాలి ముఖాన్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా స్పృశిస్తోంది. చీకటి పడ్డానికి ఇంకా సమయముంది. ఆకాశంలో వలస పక్షులేమో - సర్రున దూసుకుపోతున్నాయి.
తల పక్కకి తిప్పి చూశాను. గజం దూరంలో నా కోసమే వెతుక్కుంటూ వచ్చిన వసంతుడికి మల్లే తలకింద చేతులు పెట్టుకొని పడుకొని ఉన్నాడు కేశవ, పరవశంగా కళ్లు మూసుకొని. అతడి పెదాల మీద చిరునవ్వు లాస్యం చేస్తున్నట్లే ఉంది. అలలు తీసుకొస్తున్న నీళ్లు తాకుతున్నా - అంత వేగానికీ చలించక దృఢంగా అందమైన శిలమల్లే అవుపిస్తోంది అతడి దేహం.
అతడి దగ్గరగా జరిగాను.
వాలుగా పడుకొని కుడిచేతిని అతడి పొట్టమీద వేసి.. నా ముఖాన్ని అతడి ముఖం మీదుగా తీసుకొస్తుంటే చప్పున ఓ చేత్తో నన్ను తన మీదికి లాక్కున్ని, పడుకొని ఉన్నవాడల్లా లేచాడు.
ఇప్పుడు నా ముఖంపైన అతడి ముఖం...
కేశవ బలంగా.. చాలా బలంగా నా పెదాలను ముద్దు పెట్టుకొని నా కళ్లలోకి తీవ్రమైన ఆరాధనతోటి, నేనెంత మాత్రమూ ఓర్చుకోలేని గొప్ప ప్రేమతోటీ చూశాడు.
అట్లా చూస్తే ఏ స్రీకి గుండె చలించదు? కేశవ సాధారణ వ్యక్తి కాదు నాకు. నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని నేనంటూ లేకుండా చేసిన నా ఆరాధ్య పురుష పుంగవుడు. నేనెవరి కోసం మా అమ్మ కడుపులోంచి బయటికొచ్చానో.. నేనెవరి కోసం ఈ పరిపూర్ణ యవ్వనాన్ని పదిలపరచుకున్నానో.. ఆ గొప్ప ప్రేమికుడు - కేశవ. ఇప్పుడు ఇక్కడ ఇలా.. నన్ను.. అబ్బ! ఈ ప్రపంచం ఆగిపోతే ఎంత బాగుండును.. మా ఈ ప్రేమ తప్ప మిగిలిన ఈ 'వేస్ట్' అంతా లేకుండా ఉంటే ఎంత బాగుండును.. కానీ.. మా ప్రేమ ఎంత నిజమో, ఈ ప్రపంచం కూడా అంతే నిజం. అయినా ఈ వేదాంతులు 'సర్వం మిథ్య' అని ఎందుకంటారో అర్థంకాదు. మిథ్య కాని ఆరోజు...
*   *   *
బోర్డు మీద ముప్పై నిమిషాలు లేటు అని రాసినా గంట ఆలస్యంగా వచ్చింది కృష్ణా ఎక్స్‌ప్రెస్. గేటు దగ్గర నిల్చొని బండిలోంచి దిగుతోన్న వాళ్లని చూస్తున్నాను. ఏదీ వాసంతి? వాసంతి బండిలోంచి దిగలేదు. వాసంతి రాలేదసలు. వస్తానన్న మనిషి ఇట్లా ఎందుకు చేసింది? వచ్చిన బండి వెళ్లిపోవడం కూడా అయ్యింది. వాసంతిని తిట్టుకుంటూ వెనక్కి తిరుగుతుంటే.. అప్పుడే "హలో వినీలా" అని ఎవరో అనేసరికి చప్పున అటు తలతిప్పాను. నవ్వుతూ చేతిలో సూట్‌కేసుతో నిల్చుని ఉన్నాడు కేశవ!
"నువ్వా.. నువ్వేనా? అన్నాను అపనమ్మకంగా.
"నేను నేనుకాక మరొకర్ని అవుతానా?"
"కానీ ఇంత కాలానికి ఇలా ప్రత్యక్షమవుతావని అస్సలు అనుకోలేదు."
"జ్ఞాపకం ఉన్నానన్నమాట అయితే."
"నాకు తారసపడ్డ వ్యక్తుల్ని మరవడం నాకు చేతకాదు మరి."
"ఏం చేస్తున్నావిప్పుడు మరి?"
"మగవాడినైనందున ఉద్యోగం తప్పదు కదా."
పక్కపక్కనే నడుస్తూ ఇట్లా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మధ్యలో ఉన్నట్లుండి "నీ గురించి ఈమధ్య ఓ సంగతి విన్నాను" అన్నాడు.
"ఏమిటి?" అన్నాను అతని ముఖంలోకి లోతుగా చూస్తూ.
"రాజేంద్రని నువ్వు ఎందుకు కాదనాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. తప్పు నీదేనని అనుకుంటున్నా."
"అవును. తప్పే ఛేశాను. రాజేంద్రని ప్రేమించడమే తప్పు."
"కొంచెం వివరంలోకి రాకూడదూ" అంటూనే రెస్టారెంట్‌లోకి దారి తీశాడు.
"టిఫినేమీ వొద్దు. వొచ్చేటప్పుడే చేశాను. కాఫీ ఓకే" అన్నా.
"ఓకే. నాకైతే బాగా ఆకలిగా ఉంది" అంటూ చపాతీకి ఆర్డరిచ్చి "కానీ" అన్నాడు.
"రాజేంద్రకి నాకన్నా డబ్బు ముఖ్యమైంది. ప్రేమదారి ప్రేమదే కట్నందారి కట్నందే అన్నాడు. మా వాళ్లు కాదనలేదు. కానీ నా మనసుకు దెబ్బ తగిలింది. 'ఇదేం ప్రేమ?' అనిపించింది. అతడు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించలేదని తెలిసిన తర్వాత కూడా అతడ్ని చేసుకోవడం నన్ను నేను వంచించుకోవడమే అవుతుంది. టైంపాస్ కోసమో, క్షణికమైన థ్రిల్ కోసమో అతడు నన్ను ఉపయోగించుకున్నాడు. అంతే!"
"రాజేంద్ర ఇట్లా చేశాడా? రాస్కెల్. మా ముందు ఎన్ని ఆదర్శాలు పోయేవాడు. ఎప్పటికైనా లవ్ మ్యారేజే చేసుకుంటాననీ, కులాలూ, మతాలూ పట్టించుకోననీ, పెద్దలు ఒప్పుకోకపోతే ధిక్కరిస్తాననీ.. ఎన్ని చెప్పేవాడో.. తర్వాత మీ ఇద్దరూ ప్రేమలో పడటం.. వాడు 'లక్కీఫెలో' అని మేం అనుకోవడం.."
ప్లేటు ఖాళీ అయ్యింది. కాఫీలు వచ్చాయి.
"నువ్వెవరినీ చూసుకోలేదా కేశవా" అన్నాను నెమ్మదిగా కాఫీ తాగుతూ, అతడి కళ్లలోకి చూస్తూ.
చప్పున అతడూ నా కళ్లలోకే చూశాడు. ఆ చూపుల్లోని భావానికి నా కళ్లు కిందికి వాలాయి.
"నాది వన్‌సైడ్ లవ్ వినీలా" అంటుంటే కేశవ కంఠం స్పష్టంగా వొణికింది.
నాకు మాటలే దొరక్కుండా పోయాయి. ఏమని అడగ్గలను? గతం తలచుకున్నంత మాత్రం చేతనే అతడి ఈ మాటలకి అర్థం తెలిసొస్తుంది.
కాలేజీ రోజుల్లో నన్నారాధించే వాళ్లలో కేశవ నెంబర్‌వన్. ఎప్పుడూ తన నోటితో చెప్పకపోయినా అతడికి నా మీద అంతులేని ప్రేమ ఉందని ఎట్లానో తెలిసింది. కానీ నా మనసు అప్పటికే రాజేంద్రని నింపుకోవడంతో దూరంగానే ఉండిపోయాడు కేశవ. తారసపడినప్పుడల్లా చప్పున తలదించుకొని వెళ్లిపోయేవాడు. నేను నవ్వుకునేదాన్ని. రాజేంద్ర తప్ప మిగతా మగాళ్లంతా 'జోకర్లు'గానే కనిపించేవాళ్లు అప్పుడు. అమ్మాయిల దృష్టిలో పడ్డానికి వాళ్లు ఎన్ని వేషాలు వేసేవాళ్లు.. ఇప్పటికీ నవ్వొస్తుంటుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. కేశవ నా దృష్టిలో పడేందుకు ఎట్లాంటి వేషమూ వెయ్యలేదు. కళ్లు ప్రదర్శించే ఎక్స్‌ప్రెషన్ చాలు, హృదయం తెలుసుకోవాలంటే.
కాఫీ తాగడం పూర్తయింది. తిరిగి ఇద్దరమూ రోడ్డుమీద నడుస్తున్నాం. ఎటు పోతున్నామో స్పృహే లేదు నాకు. ఏవో ఆలోచనలు తొలిచేస్తున్నాయ్ నన్ను. ఆ స్కౌండ్రల్ రాజేంద్ర జ్ఞాపకం వొచ్చి మనసంతా పాడయ్యింది.
"ఇదే మా ఇల్లు" అని కేశవ చెప్పడంతో "ఊ" అని దిక్కులు చూశాను. అతడేమన్నాడో స్ఫురించి చూశాను. ఆలోచనల్లో పడి అతడింటిదాకా వొచ్చానన్న మాట. వాళ్లింట్లో అందరికీ పరిచయం చేశాడు కేశవ. వాళ్ల కలుపుగోలుతనం, నవ్వుతోన్న వాళ్ల ముఖాలు, ఎట్లాంటి అనుమానమూ లేకుండా స్వచ్ఛంగా చూస్తోన్న వాళ్ల కళ్లు నన్ను అమితంగా ఆకర్షించి ఆకట్టుకున్నాయి. అప్పుడే అనుకున్నాను - నా జీవితంలోని గొప్ప మార్పుకు అది ఆరంభం అవుతుందని. అంతే అయ్యింది.
కేశవతో చనువు స్నేహాన్ని దాటింది. వాళ్లంట్లోనూ నేను చనువుగా మెదిలే స్థితికి చేరుకున్నాను. కేశవ వాళ్లమ్మ నాకు బాగా దగ్గరయ్యింది. ఇక్కడ మా అమ్మకీ, కేశవ వాళ్లమ్మకీ ఎంతో తేడా ఉంది. మా స్నేహాన్ని కేశవ వాళ్లమ్మ అంగీకరించినట్లు మా అమ్మ అంగీకరించలేదు. ఒక్క విషయంలోనే స్త్రీలలో ఎందుకిట్లా వైరుధ్యాలుంటాయి? వాళ్లు జీవించే స్థితిగతులూ, వాతావరణ ప్రభావం వల్లనేనా?
కేశవ వాళ్లింటికి నేను తరచూ వెళ్తున్నా, అతను మాత్రం రెండు సార్లే మా ఇంటికి వొచ్చాడు. తొలిసారి అతణ్ణి నేనే తీసుకొచ్చాను. అమ్మకీ, అన్నయ్యకీ అతణ్ణి పరిచయం చేసినప్పుడు వాళ్ల ముఖాల్లో జీవం చచ్చిపొయ్యింది. అన్నయ్య ముఖమైతే కందగడ్డే అయ్యింది.
కేశవ వెళ్లిన తర్వాత "వాడితో స్నేహమేమిటే నీకు?" అన్న అమ్మకి అన్నయ్య కూడా వంత పాడేసరికి అతడి మీద అంతులేని అసహ్యం కలిగింది. ఆయనగారికి ఎంతమంది 'స్నేహితురాళ్లు' ఉన్నారో నాకు తెలియంది కాదు. ఆయనకో నీతి, నాకో నీతీనా? తామేం పనులు చేస్తున్నారో అవే పనులు తమకి సంబంధించిన స్త్రీలు చేస్తే ఈ మగవాళ్లు హర్షించరెందుకో అర్థంకాదు. ఈ గుణం వాళ్లకి పుట్టుకతోనే వొస్తుంది గావును.
అయినా నేను వాళ్లని లక్ష్యపెట్టదలచుకోలేదు. వాడి ద్వంద్వ వైఖరి గురించి అన్నయ్యతో నేను వాదించదలచుకోలేదు. అటువంటి వాళ్లతో వాదించడం కంటే వ్యర్థమైన పని ఇంకోటి ఉండదనిపించింది.
కేశవ రెండోసారి వొచ్చినప్పుడు అన్నయ్య లేడు కానీ నాన్న ఉన్నాడు. ఆయన మా స్నేహానికి ఆందోళన చెందినట్లుగా నాకు కనిపించలేదు.
తర్వాత అమ్మ ఈ విషయం ప్రస్తావించినప్పుడు నాన్న మాటలు నాకు ఎంతో శక్తినిచ్చాయి. "వినీ చెడ్డపని చేయదని నాకు నమ్మకముంది. ఒకవేళ దానికి అతన్నే చేసుకునే ఉద్దేశముంటే, అప్పుడు కూడా దాన్ని నేను కాదనను."
ఈ విషయంలో అమ్మ అంత తేలిగ్గా నాన్నకి లొంగిపోకూడనుకుందేమో అనుకుంటాను.
"దాన్నట్లా తయారు చేసింది మీరే. ఆడదనే స్పృహ లేకుండా ఊళ్ల మీదికి అట్లా తిరగడం చేతనే దానికి నేనన్నా, అబ్బాయన్నా బొత్తిగా లక్ష్యం లేకుండా పోయింది. అది చేసే వెధవ పనులకి మీరు తందానా అంటం చేతనే అదింత జగమొండిగా తయారయ్యింది. ఆ ముందు స్నేహమేమో పెళ్లిదాకా లాక్కొచ్చి అబ్బాయి కట్నం కాదనలేదని ఆ పెళ్లి వొద్దంది. మరిప్పుడెట్లా తగలడుతుందో.. ఏమో..? అయినా ఇట్లాంటి స్నేహాలు ఎప్పుడూ మా వంశంలో వినలేదూ, కనలేదూ - అట్లాంటిది దీనికి ఈ బుద్ధి ఎట్లా వొచ్చిందో తెలీకుండా ఉంది" అని ఎంతగా గింజుకున్నా అమ్మ మాటల్ని నాన్న గానీ, నేను గానీ ఖాతరు చేయలేదు.
*  *  *
"వినీ! ఇంక పోదాం పద" అని రెక్క పట్టుకొని కేశవ పైకిలేపుతుంటే ఆలోచనలాపి, లేచాను.
అప్పుడప్పుడే చీకటి పడబోతోంది.
ఇద్దరమూ అట్లా సముద్రం ఒడ్డున ఒకరి పక్కగా ఒకరం నడుస్తావుంటే చేపలు పట్టేవాళ్లు మా వొంక చిత్రంగా చూస్తున్నారు. గాలికి జుట్టు ముఖాన పడుతోంది. తడిగా ఉంటంతో జుట్టు ముఖానికి తగిలినప్పుడల్లా జివ్వుమంటోంది.
తలతిప్పి చూస్తే కేశవ గంభీరంగా నడుస్తున్నాడు, చేతులు రెండూ ప్యాంటు జేబులో పెట్టి.
కేశవతో నా జీవితం ముడిపడబోతోందని నాకు స్పష్టమైపోతోంది. ఏమంటాడు కేశవ? అట్లాంటి ఆలోచన లేదంటాడా? ఊహు.. ఎప్పటికీ అననే అనడు నా కేశవ అట్లా. నాకు కేశవ ఎంతో, నేనూ కేశవకి అంతేనన్న సంగతి నాకు తెలియదూ!
"కేశవా!" అన్నాను.
"ఊ.. ఏమిటి?" అన్నాడు తల నావేపు తిప్పి.
చెప్పాలి. చెప్పేయాలి.. అనుకుంటున్నాను. పెదాలు కదులుతున్నాయే కానీ గొంతు పెగలడం లేదు.
"ఏమిటి వినీ. ఏదో చెప్పాలనుకుంటున్నావులా ఉంది. ఇంకా ఆ దాపరికాలేమిటి?" అని భుజం మీద చేయివేసి, నా దగ్గరగా జరిగి నడుస్తున్నాడు. అట్లా నడుస్తూనే తల అతడి భుజం మీద వాల్చేశాను.
"నీది ఒన్ సైడెడ్ లవ్ అన్నావు జ్ఞాపకముందా?" అన్నానప్పుడు.
"అది అప్పటి మాట. ఇప్పుడెందుకంటాను? నాది.. కాదు.. మనది.. బోత్ సైడెడ్ లవ్.. అవునా?"
చప్పున కేశవ ముఖాన్ని లాక్కుని పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను.
"అయితే పెళ్లెప్పుడు?" అడిగాను.
"ఇప్పుడే రానా మీ నాన్నని అడగటానికి?" క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు కేశవ.
ఇద్దరమూ కలసి జీవితం సాగిద్దాం అన్నట్లు చేయి చేయి కలిపి నడక సాగించాం.

- ఉదయం ఆదివారం, 26 సెప్టెంబర్ 1993

Sunday, June 8, 2014

Cinema: Celebrities And Their Publicity In Social Media


- ఆంధ్రజ్యోతి డైలీ, 7 జూన్ 2014

Cinema: Chalam Dialogues for MALA PILLA (1938)

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు.
ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారు. విజయాలు సాధించారు. చలం ప్రభావం పాజిటివ్‌గానైనా, నెగటివ్‌గానైనా పడని రచయిత ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి చలానికి నాటకీయ సన్నివేశాలు, కృతక సంభాషణలతో నిండివుండే సినిమాలంటే ఏవగింపు. మరి అదే చలం సినిమాకి పని చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? సంభాషణలు రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు?
కథల్లో కానీ, నవలల్లో కానీ చలం సృష్టించిన పాత్రలను చూస్తే, అవి మాట్లాడుకోవడం చూస్తే – కృతకంగా కాక సహజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వ్యావహారంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తాయి. రచనల్లో గ్రాంథిక భాష రాజ్యం చేస్తున్న కాలంలో చలం భాష, చలం శైలి ఆకర్షణలో, మాయలో కొట్టుకుపోయారు జనం. పదాలతో, శైలితో అంతటి గారడీ చేసిన చలం 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా కథనీ, సంభాషణల్నీ రాసిన తీరు అద్వితీయం!
స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్ల ముందు వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా తెలుగునాట పెను సంచలనమే కలిగించింది. బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా చలామణీ అవుతున్న కాలంలో, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలంలో బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని సవాలు చేస్తూ, అస్పృశ్యతను ధిక్కరిస్తూ, అణగారిన కులాలకు అండగా నిలుస్తూ ‘మాలపిల్ల’ అనే పేరుతో ఒక సినిమా రావడమంటే మాటలా! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సంకల్ప బలానికి చలం సునిశిత కలం తోడైతే వచ్చే మహోన్నత ఫలం ‘మాలపిల్ల’ కాకుండా మరొకటి ఎలా అవుతుంది!!
మనం ఇప్పుడు ‘మాలపిల్ల’ కథ గురించి కాక, అందులోని సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోబోతున్నాం. ఆ సినిమాకి ముందు వచ్చిన సినిమాల్లోని సంభాషణలకూ, ‘మాలపిల్ల’ సంభాషణలకూ పొంతననేది కనిపించదు. టాకీ యుగం ప్రారంభమైన కాలంలో అప్పటి నాటకాల భాషలోనే సినిమాల సంభాషణలు నడిచాయి. ఆ భాషను ‘మాలపిల్ల’ భాష సమూలంగా మార్చేసింది. నిజానికి ‘మాలపిల్ల’ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక సినిమాల సంభాషణలు పాత వాసనలోనే నడిచాయి. ఐతే అతి త్వరలోనే ‘మాలపిల్ల’ సంభాషణలకు లభించిన ఆదరణను రచయితలు అందుకోక తప్పలేదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా ఆ చిత్రంలోని సంభాషణలను చలం నడిపించిన తీరు అనన్య సామాన్యం.
‘మాలపిల్ల’లో నీళ్లకోసం చెరువు వద్దకు వచ్చిన మాలలను బ్రాహ్మణుల నాయకత్వంలోని అగ్ర కులాల వాళ్లు అడ్డుకుంటారు. నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదని కట్టడి చేస్తారు. అదే సమయంలో పెద్ద వర్షం మొదలవుతుంది. మాలలు తడుస్తూ సుందరరామశాస్త్రి ఇంటి ముందుకు వస్తారు. వారిలో నాగాయ్ అనే యువకుడు “బాపనోళ్లది ఎప్పుడూ తిని కూర్చునే ఖర్మ. మాలోళ్లది ఎప్పుడూ బువ్వలేక మలమలమాడే ఖర్మ.. గుళ్లో కూర్చుని సుఖంగా ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కష్టాలు తీరుస్తాడా?” అంటాడు. ‘మాటల తూటాలు’ అంటే ఇవే కదా. అగ్ర వర్ణాలు – నిమ్న వర్ణాల మధ్య, ఉన్నోళ్లు – లేనోళ్ల మధ్య తేడాని రెండంటే రెండు ముక్కల్లో ఎంత శక్తిమంతంగా చెప్పాడు చలం! ఈ విషయంలో దేవుడినీ వదల్లేదు. దేవుడు కూడా పెద్ద కులాలవైపే ఉన్నాడని సూటిగా ఆ పాత్రతో చెప్పించాడు.
‘నేనున్నంత కాలం గ్రామంలో కుల ధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వన’ని శాస్త్రి బీష్మించినప్పుడు మాలల నాయకుడు మునెయ్య అంటాడు – “మీరు చెరువు కట్టేశారు. దాన్ని విడవండి. ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకానీ మాకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో మాకు తెలీదు. మా పిల్లల్నీ, ఆడాళ్లనీ మాడ్చారా, మీ పిల్లలూ, ఆడాళ్లూ క్షేమంగా ఉండరు. మమ్మల్ని మృగాల కింద నొక్కిపట్టారు. అవును. మృగాలమే. చేసి చూపిస్తాం. జాగర్త.” అని హెచ్చరిస్తాడు. తమకు నీళ్లివ్వకుండా చెరువు కట్టేసి అధర్మయుద్ధం చేస్తున్నారని తేల్చేసిన మునెయ్య, తమకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం బోధించిందో చెప్పమని అడుగుతున్నాడు. అంతేనా, తమని మృగాలకింద తొక్కిపెడితే, నిజంగా మృగాలమవుతామని హెచ్చరిస్తున్నాడు. అంటే తిరగబడతామని చెబుతున్నాడు. అగ్ర వర్ణాల అకృత్యాల వల్ల, నిమ్న కులాలు ఎట్లా యాతనలు అనుభవిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే మాలల తరపున ఉండి ఆ మాటలు పలికించాడు చలం.
‘మాలపిల్ల’ టైటిల్ రోల్ చేసింది – తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల. ఆమె పాత్ర పేరు శంపాలత. ఆమె మునెయ్య కూతురు. సుందరరామశాస్త్రి కొడుకు నాగరాజు (వెంకటేశ్వరరావు)కూ, ఆమెకూ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ మునెయ్యకి దొరికిపోతారు. “అయ్యా మీరు పెద్దలు. మీ కులంలో ఆడోళ్లు లేరా. మురికోళ్లు, అంటరానోళ్లు.. ఈ పిల్లలెందుకు కావాల్సొచ్చారు నాయనా. మేం అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే. ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్లకి ఉన్నదల్లా ఒక్కటే. అది శీలం. దాన్నీ దోచుకోవాలా! ధనం, అధికారం, సుఖం చాలవేం? వెర్రిపిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకుని, మెరిపించి, మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారూ. శాస్త్రులవారి వంటి మహాత్ముల కుమారులు చెయ్యదగ్గ పనికాదు” అంటాడు మునెయ్య. తన కథల్లోని శైలి తరహాలోనే ఈ సినిమాలోని సంభాషణలనూ గొప్ప లయతో నడిపించాడు చలం. కేవలం మనం చలం సమ్మోహన శక్తిని శైలికే పరిమితం చెయ్యడం పొరపాటు. ఆయన సంభాషణా శిల్పం కూడా అసాధారణం. ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇవాళ్టి సినిమాల్లో ఎంతమంది రచయితలు ఇలాంటి శైలితో, ఇలాంటి శిల్పంతో సంభాషణలు రాయగలుగుతున్నారు?
అప్పటికింకా నాగరాజుకు, శంపాలతకు తమ మధ్య ప్రేమ పెనవేసుకుంటున్నదనే సంగతి తెలీదు. స్నేహమైతే ఏర్పడింది. అంతలోనే మునెయ్యకు దొరికారు. నాగరాజును అపార్థం చేసుకున్న మునెయ్య.. చెడుబుద్ధితోనే అతను శంపకు చేరువవుతున్నాడని తలచాడు. ఒక పెళ్లికాని అమ్మాయి తండ్రి ఎలా స్పందించాలో అలాగే స్పందించాడు మునెయ్య. పైగా నాగరాజు సాక్షాత్తూ తమని మృగాల కింద భావించే శాస్త్రి కొడుకు. కరడుకట్టిన దురాచారవాది కొడుకు. తామా తక్కువ కులంవాళ్లు. దుర్బలులు. శంపని లోబరచుకోవడానికి మాయమాటలు చెప్పి దగ్గరవుతున్నాడని సంశయించాడు మునెయ్య. అలాంటి స్థితిలో అతని నోటినుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత శక్తివంతంగా వస్తాయి? ఆ సందర్భానికి తగ్గట్లు మునెయ్య నోటినుంచి వచ్చిన మాటల్ని ఇంతకంటే శక్తివంతంగా, ఇంతకంటే సమర్థవంతంగా ఎవరు రాయగలరు?
‘మాలపిల్ల’లో మాలలకు దన్నుగా చౌదరి నాయకత్వంలోని ‘హరిజన సేవాసంఘం’ నిలుస్తుంది. మాలలను మృగాలుగా పెద్ద కులాలు చూస్తుంటే, కాదు, వాళ్లూ అందరిలాంటి మనుషులేనని సంఘం వాదిస్తుంటుంది. మాలల పక్షం వహిస్తే కమ్మ కులాన్నుంచి వెలేస్తామని ఒకతను చౌదరిని బెదిరిస్తాడు. దానికి చిన్నగా నవ్వి “కులం.. వెలి.. మా కులం హరిజన కులం. వాళ్లతో నీళ్లు త్రాగి, వాళ్లతో పరుండటమే మా నిత్య కృత్యం” అని చెప్పిన చౌదరి “రండి. మాలగూడేనికే పోదాం. మాలల్లో మాలలమై మాలలూ మనుషులేనని లోకానికి చాటుదాం” అంటూ సంఘ సభ్యులతో అక్కడికే వెళ్తాడు. ఆ పాత్రచేత అలా చెప్పించిన చలం నిజ జీవితంలో బ్రాహ్మణ సమాజం తనను వెలేస్తే, మాలపల్లెల్లోనే నివసించిన సంగతి గమనించదగ్గ విషయం.
Mala Pilla_C53242-83C451
ఈ కథలో శంపకు చేదోడు వాదోడుగా ఉండే పాత్ర అనసూయ. ఆమె శంప చెల్లెలే. చిన్నదైనా అక్కకి సలాహాలు, ధైర్యం ఇవ్వగల గడుగ్గాయి. తెలివైంది. శంపను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు, ఆమెని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మార్గంలో అనసూయ కనిపిస్తే శంప గురించి ఆమెని అడుగుతాడు. ఎందుకని ప్రశ్నిస్తుంది అనసూయ. “నేను శంపాలతను పెళ్లి చేసుకుంటాను” అంటాడు రాజు. అనసూయ పెద్దగా నవ్వుతుంది. ఆరిందాలా “పెళ్లి? పెళ్లి? మాలపిల్లని? మీకు మతిపోయినట్టుంది” అంటుంది. దాంతో “మీ చిన్నికృష్ణుని పాదాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను” అని చెబుతాడు రాజు (చిత్రంలో శంప, అనసూయ కృష్ణభక్తులు). అప్పుడు అనసూయ ఏమనాలి? ఏ ఇతర రచయితైనా అనసూయతో ఎలాంటి మాటలు పలికిస్తాడు? కచ్చితంగా చలం పలికించినట్లు “ఎక్కడి మాటలు లెండి. మీ నాన్నగారు గుండెపగిలి చావరూ? మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు” అని పలికించలేడు. 76 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలోని పాత్రల చేత ఇలాంటి సునిశితమైన, బాకుల్లాంటి మాటలు పలికించడం ఒక్క చలానికే సాధ్యం.
మాలలకు నీళ్లివ్వకుండా చేసి, వాళ్లు నీళ్ల కోసం అలమటించేలా చేస్తున్నందుకు నిరసనగా మాలలంతా చౌదరి నాయకత్వంలో అగ్ర కులాల వారి పొలం పనులకు, ఇతర పనులకు వెళ్లకుండా సమ్మెకట్టారు. ఆ పనులకు పొరుగూళ్లనుంచి మనుషులు రాకుండా చూశారు. దాంతో చౌదరి వాళ్లతో ఒకసారి మాట్లాడమని శాస్త్రికి చెబుతాడు ఆయనకు అనుయాయిగా ఉండే మల్లికార్జున శర్మ. శాస్త్రి కోపంతో ఊగిపొయ్యాడు. “పోండి. పోండి. అందరూ పోండి. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడు. నేనొక్కణ్ణే ఏకాకినై నిలుస్తాను. రానీ మాలల్ని. నా ఇంటిచుట్టూ మూగి నా అగ్నిహోత్రాల్ని మలినం చెయ్యనీ. నా వంటలో గోమాంసాదులు వెదజల్లనీ. పూర్వం రాక్షసులు  రుష్యాశ్రమాల్ని ధ్వంసం చెయ్యలా. నేనే నిలుస్తాను. ఆ శ్రీరామచంద్రుడే ఉంటే మళ్లా నా ఇంటికొచ్చి కావలి కాస్తాడు. నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు నాయనా. పోండి” అంటాడు.
వర్ణ భేదాల్ని నిక్కచ్చిగా పాటిస్తూ, కరడుకట్టిన బ్రాహ్మణిజానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే సుందరరామశాస్త్రి అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ ఆచారాలనూ, కట్టుబాట్లనూ వదులుకుంటాడా? తమ అవసరం కోసం బెట్టుని వదిలి మెట్టు దిగుతాడా? మాలలతో రాజీకి వస్తాడా? అలాంటి స్థితిలో ఉన్న శాస్త్రి నోటివెంట ఇలాంటి మాటలు కాకుండా వేరేవి ఎలా వస్తాయి? ఆద్యంతం శాస్త్రి పాత్ర తీరుకు తగ్గట్లు (ఇదే మాట అన్ని పాత్రలకూ వర్తిస్తుంది) చలం రాసిన మాటలు ఆ పాత్రకి వన్నె తెచ్చాయి. చలం మాటల్ని శాస్త్రి పాత్రలో గోవిందరాజుల సుబ్బారావు పలికిన తీరు అసామాన్యం. డైలాగులు పలకడంలో, ఆ పలికేప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో ఎస్వీ రంగారావుని మించిన నటుడు లేడని మనవాళ్లు అంటుంటారు. అయితే ఆయనకటే ముందు అలాంటి నటుడు ఒకరున్నారనీ, ఆయన గోవిందరాజుల సుబ్బారావనీ ఒప్పుకోక తప్పదు. ‘కన్యాశుల్కం’లో లుబ్దావధాన్లుగా ఆయన నటనని మరవగలమా? ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, తొలి తరం ప్రేక్షకులు ఇప్పుడంతగా లేరు కాబట్టి ఆయన గురించి చెప్పుకునేవార్లు లేకుండా పోయారు. అందుకే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.
మాటల రచయిత చలం
మాటల రచయిత చలం
శంపాలతనూ, అనసూయనూ తీసుకుని కలకత్తా పారిపోయాడు నాగరాజు. దీంతో ఇటు శాస్త్రి కుటుంబం, అటు మునెయ్య కుటుంబం దిగాలుపడ్డాయి. శంపాలతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తండ్రికి ఉత్తరం రాశాడు రాజు. ఆగ్రహంతో ఊగిపోయిన శాస్త్రి తనకసలు కొడుకు పుట్టలేదని అనుకుంటాననీ, పుట్టినా చచ్చిపొయ్యాడనుకుంటాననీ చౌదరితో అన్నాడు. ఆవేశపడకుండా ఆలోచించమన్నాడు చౌదరి. మనుషుల్లో విభజన ఏ శాస్త్రంలో ఉందో చూపించమన్నాడు.
“మేనమామ కూతుర్ని వదిలి మాలపిల్లను వివాహం చేసుకున్నాడంటే దాన్ని తేలిగ్గా చూస్తున్నారు కానీ అది సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ, ఉదార స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి? ఎందరుంటారు అలాంటివాళ్లు? కామానికి లొంగేనండీ, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎంతమంది లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలలో వేసుకున్నవాళ్లు ఎందరు లేరు? చేరదీసినదాన్ని పెండ్లి చేసుకుని తన పేరును, తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగినవాళ్లు ఎందరు? వెయ్యిమందిలో ఒక్కడుంటాడో, ఉండడో. ఆ ఒక్కడే మనిషి. తక్కినవాళ్లంతా నీచులు. వారే సంఘద్రోహులు. నిజమైన అస్పృశ్యులు. అలాంటివాళ్లంతా మనలో ఉన్నారు. మనతో తిరుగుతున్నారు. మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పులేదు. మాలలనంటితేనే తప్పు. మీరేమన్నా అనండి. నాగరాజు ధన్యుడు. వారడ్రస్ తెలీదు కానీ అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు చెప్పేవాణ్ణి” అన్నాడు చౌదరి.
గూడవల్లి రామబ్రహ్మం
గూడవల్లి రామబ్రహ్మం
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చౌదరి చేత పలికించిన ఈ మాటల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాడు చలం. ఒకటి – ఒక ‘మాలపిల్ల’ను వివాహం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణుడైన నాగరాజు చేసింది చాలా గొప్ప పని అని చెప్పడం, రెండు – సంఘంలో పైకి పెద్ద మనుషులుగా, మర్యాదస్తులుగా చలామణీ అవుతూ చాటుమాటుగా పరాయి స్త్రీలతో వ్యవహారాలు నడిపేవాళ్లను ఎండగట్టడం. ఈ రోజుల్లో కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాలు సాధారణమయ్యాయి కానీ, ఆ రోజుల్లో అలాంటివి గొప్ప పనులే. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి ధైర్యంగా పెళ్లి చేసుకున్నవాడే మనిషనీ, అమాయకురాళ్లను వలలో వేసుకుని ఎంగిలి బతుకులు బతుకుతున్నవారంతా నీచులనీ, వారే సంఘద్రోహులనీ, నిజమైన అస్పృశ్యులనీ చౌదరిచేత చెప్పించాడు చలం. అలాంటి వాళ్లంతా మనతో తిరుగుతూ మర్యాదలు పొందుతున్నారని ఎండగట్టాడు. నిజానికి ఆ మాటలు పలికింది చౌదరి కాదు. చలమే. అవి అచ్చంగా చలం భావాలే.
ఇవాళ్టి సినిమాల్లోనూ ఈ తరహా డైలాగులు రాయగల రచయిత ఒక్కడైనా ఉన్నాడా? మరి దురాచారాలు, కట్టుబాట్లు అధికంగా రాజ్యం చేస్తున్న కాలంలో ‘మాలపిల్ల’ వంటి సినిమా రావడం పెద్ద సాహసం, గొప్ప విషయమైతే, అందులో బ్రాహ్మణాధిపత్య సమాజానికి సూటిగా, బాణాల్లా తగిలే పదునైన సంభాషణలు రాయడం ఇంకెంత సాహసం, ఇంకెంత గొప్ప విషయం! నేటి సినీ రచయితలు తప్పకుండా అధ్యయనం చెయ్యాల్సిన సినిమా ‘మాలపిల్ల’ అయితే, అందులోని సంభాషణలు వారికి మార్గదర్శకమయ్యే గొప్ప పాఠాలు!!
-బుద్ధి యజ్ఞ మూర్తి
261374_585952121417138_1370360100_n