Wednesday, August 3, 2011

న్యూస్: డైరెక్షన్ వదిలేయాలనుకున్న వినాయక్!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన వి.వి. వినాయక్ డైరెక్షన్ వదిలేయాలని అనుకున్నాడు. ఎప్పుడు? 'బద్రినాథ్' సినిమా విడుదలై డివైడ్ టాక్ వచ్చినప్పుడు. ఈ సంగతిని వినాయక్ స్వయంగా చెప్పాడు. 'బద్రినాథ్' 187 సెంటర్లలో (!) 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 29 జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ సంగతి చెప్పాడు. "ఇంత బాగా తీసిన సినిమాకి కూడా డివైడ్ టాక్ రావడమేమిటా అని ఎంతో బాధపడ్డా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అసలు డైరెక్షన్‌ని వదిలేసి పోవాలని అనుకున్నా. అయితే సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ మొదలై కలెక్షన్లు స్టడీ అయ్యాయి. అప్పుడు కానీ కుదుటపడలేకపోయా" అని చెప్పాడు వినాయక్. ఇదే మీటింగ్‌లో పాల్గొన్న చిన్నికృష్ణ అయితే తనదైన స్టయిల్లో మాట్లాడుతూ ఈ సినిమాకి దిష్టి తగలడం వల్లే మొదటి వారం రోజులు టాక్ అలా వచ్చిందనీ, వారం తర్వాత దిష్టి పోయిందనీ, అందుకే సినిమా ఇంత పెద్ద హిట్టయ్యిందనీ చెప్పాడు. అయితే 'బద్రినాథ్' 187 సెంటర్లలో 50 రోజులు నడిచిందంటే జనానికి నమ్మ శక్యం కావడం లేదు. దానికి బలమైన హేతువు హైదరాబాద్‌లో 50వ రోజుకు అది కేవలం 4 థియేటర్లలోనే ఆడుతుండటం. ఏదేమైనా ఈ సినిమా 'ఫ్లాపయ్యిందనుకుని' దర్శకత్వం వదిలేద్దామనుకున్న వినాయక్ అది 'హిట్టవడం'తో మళ్లీ మనసు మార్చుకున్నాడన్న మాట.

No comments: