Thursday, August 4, 2011

ఆనాటి వెండితెర వెలుగులు: వై.వి. రావు

యరగుడిపాటి వరదారావు (వై.వి. రావు) నెల్లూరులోని ఓ సంపన్న, సంప్రదాయ కుటుంబం నుంచి సినీ రంగానికి వచ్చారు. స్కూలు రోజుల్లోనే రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. బొంబాయి, కొల్హాపూర్‌కి వెళ్లి ఓ రెండు మూకీ సినిమాల్లో నటించారు. దక్షిణాదిన మూకీ చిత్రాల ఆద్యుల్లో ఒకరైన ఆర్.ఎస్. ప్రకాశ్ ఆయన్ని మద్రాసుకు తీసుకువచ్చారు. అలా వై.వి. రావు మూకీ చిత్రాలైన 'భీష్మ ప్రతిజ్ఞ' (1921), 'గజేంద్ర మోక్షం', 'ఉషా స్వప్న' (1924), 'గరుడ గర్వభంగం' (1929)లో నటించారు. ఇవన్నీ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ ఫిల్మ్ కంపెనీ నిర్మించినవే. అలాగే 'సారంగధర' (1930), 'పాండవ నిర్వాణ', 'పాండవ అజ్ఞాతవాసం' (1931) చిత్రాల్లో నటించి, వాటిని డైరెక్ట్ చేశారు. వీటిని జనరల్ పిక్చర్స్ కార్పొరేషన్ నిర్మించింది. ఆసక్తికర సంగతేమంటే కన్నడలో తొలి టాకీ సినిమా 'సతీ సులోచన' (1934) దర్శకుడు ఆయనే. తమిళ టాకీ 'చింతామణి' దర్శకుడిగా అందరి ప్రశంసలు పొందిన ఆయన అందులో భవానీ శంకర్ పాత్రని స్వయంగా పోషించి తమిళనాట మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. మరో తమిళ సినిమా 'లవంగి'లో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన వై.వి. రావు అందులో హీరోయిన్‌గా నటించిన అప్పటి వర్థమాన తార రుక్మిణితో ప్రేమలోపడి, పెళ్లి చేసుకున్నారు. అయితే వారి వైవాహిక జీవితం ఎంతో కాలం సాగక, విడిపోయారు. నిన్నటి తరం అందాల నాయకి, నేటి సీనియర్ నటి లక్ష్మి వారి కూతురే. ఆ తర్వాత రుక్మిణి అప్పటి మరో గ్లామరస్ హీరో చదలవాడ నారాయణరావుతో సంసార జీవితం గడిపారు. తెలుగులో విధవా వివాహంపై ఆయన రూపొందించిన 'మళ్లీ పెళ్లి' (1939) అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో రావు, కాంచనమాల జంటగా నటించారు.

No comments: