Wednesday, June 30, 2010

'Komaram Bheem' is coming to cinema halls

ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనుల హక్కుల కోసం చావుకు తెగించి పోరాడిన గోండు యోధుడు కొమరం భీం కథ ఎంతో ఉత్తేజభరితం, మరెంతో ఉద్వేగభరితం. ఆయన కథతో సుమారు 20 యేళ్ల క్రితం రూపొందిన 'కొమరం భీం' సినిమా ఇన్నాళ్లకి జూలై 2న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నవలా రచయితా అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న అల్లాణి శ్రీధర్‌కి డైరెక్టర్‌గా ఇదే తొలి సినిమా. 'మాభూమి' చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు పొందిన సినీ నవలా రచయిత ఎస్.ఎం. ప్రాణ్‌రావు ఈ చిత్రానికి రచన చేసి, సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఆయనా, శ్రీధర్ కలిసి ఆదిలాబాద్ అడవుల్లో మూడు నెలలు గోండులతో కలిసి గడిపి వారి ఆచారాలు, సంప్రదాయాలు, శుభ, అశుభ కార్యక్రమాలను అధ్యయనం చేశారు. "కొమరం భీం భార్య ఎక్కడ ఉన్నారో కనుగొని, ఆమెని కలిశాం. అప్పుడామె దయనీయ స్థితిలో ఉన్నారు. భీం గురించి ఆమె చాలా విషయాలు చెప్పారు" అని తెలిపారు ప్రాణ్‌రావు. కొమరం భీం పాత్రని రంగస్థల నటుడు, రచయిత అయిన భూపాల్‌రెడ్డి పోషించారు. "కొమరం భీం ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఆ పాత్ర పోషణ చేశారు భూపాల్" అని ప్రాణ్‌రావు, శ్రీధర్ ఇద్దరూ ప్రశంసించారు.
విశేషమేమంటే ఈ చిత్రంలోని పాటల్ని భూపల్ స్వయంగా రాశారు. అంతకంటే విశేషం, ఆ పాటలకి అవార్డు చిత్రాల దర్శకుడు గౌతం ఘోష్ సంగీతం సమకూర్చడం. అప్పట్లోనే నంది అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డులు లభించాయి. అయితే "దర్శకుడిగా నంది అవార్డును తీసుకున్నా నాకు తృప్తిలేదు. నాకు కావలసింది నంది కాదు, ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకుడి చేతిలోని టిక్కెట్టు. ఈ సినిమా ఇన్నాళ్లకి విడుదలవబోతోందంటే ఎంతో భావోద్వేగంగా ఉంది" అని సహజంగీనే స్పందించారు శ్రీధర్.
ఈ సినిమా షూటింగ్ అంతా ఆదిలాబాద్ అడవుల్లో జరిగింది. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ ఈ సినిమా కోసం పనిచేశారు. "ఈ సినిమా రూపకల్పన విషయంలో ఆదిలాబాద్ గిరిజనుల సహకారం మరవలేనిది. ఇది తెలంగాణ కథ. ఇందులోనివి తెలంగాణ మాటలు, పాటలు. అడవిలోనే మొత్తం షూటింగ్. నాతో సహా అందరూ నేలమీదే పడుకుని, నదిలో స్నానం చేసేవాళ్లు షూటింగ్ జరుగుతున్నంత కాలం" అని అప్పటి రోజుల్ని భూపాల్ జ్ఞప్తి చేసుకున్నారు. ఆదివాసి చిత్ర (ఐటిడిఎ, ఉట్నూరు), ఫిల్మీడియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భీం భార్యగా మౌనిక నటించగా, శ్రీధర్ మిత్రుడు కె. భవానీశంకర్ సినిమాటోగ్రఫీని అందించారు. గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ఎఫ్.డి.సి., కొమరం భీం ఫౌండేషన్ ద్వారా జూన్ తొలి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్‌సింగ్ లాగా, జనం హృదయాల్లో నిలిచిన పోరాట యోధుడు 'కొమరం భీం' జీవితాన్ని తెరమీద చూసే అవకాశం ఇన్నాళ్లకైనా కలుగుతుండటం హర్షణీయం.

Tuesday, June 29, 2010

Gallery: Gadde Sindhura

Mahesh movie launched


మహేశ్ హీరోగా నటించే కొత్త సినిమా లాంచనంగా సోమవారం మొదలయ్యింది. శ్రీను వైట్ల ఈ సినిమాకి డైరెక్టర్. ఇదివరకు వెంకటేశ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 'నమో వెంకటేశ' ఫిలింని తీసిన 16 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మహేశ్ అన్న రమేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించే శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ (ప్రై.) లిమిటెడ్ ఈ సినిమాని సమర్పిస్తోంది. సోమవారం (జూన్ 28) ఉదయం 7.20 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో మహేశ్ సరసన 'ఏ మాయ చేసావె' ఫేం సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నానని డైరెక్టర్ శ్రీను వైట్ల తెలిపారు. ఈ సినిమాకి రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. తొలిసారి మహేశ్, వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

Monday, June 28, 2010

Good Days for Uday Kiran?


రెండో ఇన్నింగ్స్‌తో ఎలాగైనా మునుపటి ప్రాభవాన్ని పొందాలని తపిస్తున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఇప్పుడు 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' అంటున్నాడు, టీనేజ్ గర్ల్ శ్వేతాబసు ప్రసాద్‌తో. తమిళుడైన సుభా సెల్వం ఈ సినిమాకి డైరెక్టర్. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి వరుస హిట్లతో యువతరం ఆరాధ్య నటుడిగా అవతరించిన ఉదయ్‌కి వాటి తర్వాత ఇప్పటివరకు మరో చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. ఐదేళ్ల క్రితం తన తొలి, మలి చిత్రాల దర్శకుడు తేజతో చేసిన 'ఔనన్నా కాదన్నా' సినిమా తర్వాత రెండేళ్ల విరామం తీసుకుని 'వియ్యాలవారి కయ్యాలు'తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినా అతడికి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత మదన్ దర్శకత్వంలో వచ్చిన 'గుండె ఝల్లుమంది'పై అతడెన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనిపించుకున్నా, కమర్షియల్‌గా ఉపయోగపడలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన 'ఏక్‌లవ్యుడు' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ పరిస్థితుల్లో 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' సినిమాని ఓ తపనతో, ఓ కసితో చేశాడు ఉదయ్. రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని శ్వేతాబసు అభివర్ణించింది. 'కొత్త బంగారు లోకం', 'రైడ్' చిత్రాలతో యువ ప్రేక్షకులకి సన్నిహితమైన శ్వేతబసు హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కొద్దిపాటి ఆసక్తి నెలకొంది. "ఉదయ్, శ్వేతాబసులది చూడ చక్కని జంట. ప్రేక్షకుల్ని ఈ జంట ఆకట్టుకోవడం ఖాయం" అని చెప్పారు డైరెక్టర్ సుభా సెల్వం. ఈ సినిమాకి ప్రధాన బలం కథేననీ, క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందనీ ఆయనన్నాడు. ఈ సినిమాతోనైనా ఉదయ్‌కి మంచి రోజులు వస్తాయేమో చూద్దాం.

Gallery: Gadde Sindhura (Killer)


Sunday, June 27, 2010

KOTHIMOOKA: Fourth Trial for AVSదర్శకుడిగా నిలదొక్కుకోవాలని తపిస్తున్న నటుడు ఏవీయస్, ఆ దిశగా నాలుగో యత్నం చేస్తున్నారు. భారీకాయుడు కృష్ణుడు హీరోగా, బ్యూటీ గర్ల్ శ్రద్ధా ఆర్య హీరోయిన్‌గా ఆయన 'కోతిమూక' డైరెక్ట్ చేశారు. తులసి పూజిత ఫిలిమ్స్ బ్యానర్‌పై వెంకట్ జగదీష్ అనే నూతన నిర్మాత ఈ ఫిలింని నిర్మిస్తున్నారు.
కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ పొందిన ఏవీయస్ 'సూపర్ హీరోస్'తో డైరెక్టర్‌గా తన జర్నీ ప్రారంభించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం, ఆయనా టైటిల్ రోల్స్ చేశారు. రామానాయుడు నిర్మించిన ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత తనే సొంతంగా 'ఓరి నీప్రేమ బంగారం గానూ' అనే సినిమాని ఆయన తీశారు. సూపర్ హిట్ ఫిల్మ్ 'నిన్నే పెళ్లాదతా'లో 'ఎటో వెళ్లిపోయింది మనసు' పాటతో పాపులర్ అయిన సింగర్ రాజేశ్‌ని ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం చేశారు. కానీ ఆ సినిమా కూడా ఆయనకు కమర్షియల్‌గా అసంతృప్తినే మిగిల్చింది. ఈసారి నలుగురు మిత్రుల కథకి కాస్త సందేశాన్ని మేళవించి 'రూంమేట్స్' సినిమాని డైరెక్ట్ చేశారు ఏవీయస్. కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందినప్పటికీ ఈసారీ సక్సెస్ రుచి చూడలేకపోయారు. దాంతో తనలోని దర్శకుడికి మూడున్నరేళ్లు విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు 'కోతిమూక'తో మరోసారి పరీక్షకి సిద్ధమయ్యారు.
'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో కొత్త తరహా హీరోగా స్థూలకాయుడైన కృష్ణుడు సక్సెస్ కావడంతో అతణ్ణే హీరోగా పెట్టి 'కోతిమూక' రూపొందించారు ఏవీయస్. "కోతి అంటూ హేళనగా చూస్తారు కానీ, ఆ కోతులే లంకకు వారధి కట్టాయనీ, శ్రీరామునికి ఘనవిజయం చేకూర్చి పెట్టాయనీ రామాయణం చెబుతుంది. అలాగే మా చిత్రంలోని కోతిమూక కూడా ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తుంది" అని తెలిపారు ఏవీయస్. అందుగు తగ్గట్లే టైటిల్‌కి 'నాట్ ఓన్లీ కామెడీ' అనే ట్యాగ్ లైన్‌ని ఉపయోగించారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఏవీయస్ విజయాన్ని సాధించడం ఖాయమని స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సహా ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన బలంతో, గట్టి పట్టుదలతో ఏవీయస్ చేసిన ఈ ప్రయత్నం ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 9న 'కోతిమూక' మనముందుకు వస్తోంది.

Friday, June 25, 2010

Wallpapers: NTR

Gallery: AnushkaTelugu Cinema Quiz-1

1. అనుష్క టైటిల్ రోల్ చేసిన 'పంచాక్షరి' దర్శకుడు ఎవరు?
2. యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసి' ఆధారంగా వచ్చిన సినిమా?
3. 'బావ నచ్చాడు'లో నాగార్జున భార్య సిమ్రాన్, మరి మరదలు?
4. సుమన్, భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌తో బోయిన సుబ్బారావు డైరెక్ట్ చేయగా 1985లో వచ్చిన ఫిల్మ్?
5. 'నా పాట పంచామృతం' పాట ఏ మూవీలోనిది?
6. శొభన్‌బాబు, మంజుల జంటగా నటించిన 'గడుసు పిల్లోడు' డైరెక్టర్?
7. 'వయ్యారి భామలు వగలమారి భర్తలు'లో ఎన్‌టీఆర్, కృష్ణ తల్లి?
8. 'బంపర పనస పండురో' పాట కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఏ సినిమాలోనిది?
9. '20వ శతాబ్దం'లో హీరో?
10. వెంకటేశ్, భానుప్రియ, గౌతమి కాంబినేషన్‌లో వచ్చిన ఫిల్మ్ నిర్మాత?
11. రవితేజ, కల్యాణి జంటగా భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన సినిమా?

జవాబులు:
1. వి. సముద్ర
2. కాష్మోరా
3. రీమాసేన్
4. ముసుగు దొంగ
5. అల్లరి మొగుడు
6. కె. బాపయ్య
7. పండరీబాయి
8. ఘరానా దొంగ
9. సుమన్
10. కె. మురారి
11. దొంగోడు

Wednesday, June 23, 2010

Dasari Narayana Rao on success rate of films


ఈమధ్య నేను చేసిన ఇంటర్వ్యూలో దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పిన రెండు ఇంటరెస్టింగ్ పాయింట్స్ మీకోసం..
*సినిమాల సక్సెస్ రేటు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు థియేటర్లు లీజుకు తీసుకుని రూపాయికి ఇంకో రూపాయి లాభం వేసుకుని రెంటు వసూలు చేస్తూ నిర్మాతల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇంతకుముందు పెద్ద హీరోల సినిమా విడుదలైన రెండు వారాల పాటు టిక్కెట్ రేటు పెంచితే దాని వల్ల లాభం జరుగుతుందని అనుకుని ఆ పద్ధతికి మద్దతు పలికారు. తెలియక వారు చేసిన ఈ పని వల్ల థియేటర్ల రెంట్లు పెరిగాయి. రెంటల్ సిస్టం వల్ల ఎన్నో మంచి సినిమాలు నాశనం అవుతున్నాయి. పర్సంటేజ్ విధానం అమలు చేసే విషయంలో ప్రతిసారీ మోసం జరుగుతోంది. ఇప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
*మొదటి నుంచి నా నినాదం ఒక్కటే. దర్శకుడిదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలి. దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్న ఈనాటి దర్శకుల్ని చూసి నేను గర్వపడుతున్నా. పెద్ద హీరోలు సైతం దర్శకుడి మీద ఆధారపడేలా చేసిన ఇప్పటి టాప్ డైరెక్టర్లను అభినందిస్తున్నా. అయితే ఒక విషయం. ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తేనే సినిమా బాగా వస్తుందనే అభిప్రాయాన్ని మార్చుకోండి. ఆ రోజుల్లో మేం 40 రోజుల్లో తీసిన సినిమాని మీరు 80 రోజుల్లో తియ్యండి. అంతేకానీ 250 రోజులు తీసి నిర్మాతని ఇబ్బంది పెట్టకండి. నిర్మాణ వ్యయం తగ్గించడం దర్శకుల చేతుల్లో ఉన్న పని. విమర్శిస్తున్నానని అనుకోకుండా ఆత్మావలోకనం చేసుకుని సినిమాల సక్సెస్ రేటు పెంచమని చెబుతున్నా.

Monday, June 21, 2010

Kota Srinivasa Rao's son Prasad dead in road accidentకోట శ్రీనివాసరావుకు విషాదం మిగిల్చిన ఫాదర్స్‌డే
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు ఫాదర్స్‌డే తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరు కొడుకులు ఫాదర్స్‌డే జరుపుకుంటుంటే కోట మాత్రం పుట్టెడు పుత్రశొకంలో మునిగిపొయ్యారు. ఆయన కుమారుడు ప్రసాద్ ఆదివారం (జూన్ 20) హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భార్యాపిల్లల్ని కారులో రమ్మని చెప్పి ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త స్పోర్ట్స్ బైక్‌పై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్‌కు లంచ్ చేసే నిమిత్తం వెళ్తున్న ఆయనను లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన ఆయనను స్థానికులు సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కోటకు ప్రసాద్ ఒక్కరే కొడుకు కాగా ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రసాద్ ఇప్పటివరకు రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మూడొ చిత్రం 'గాయం-2'లో నటిస్తున్నారు. జగపతిబాబు హీరోగా జె.డి. చక్రవర్తి డైరెక్ట్ చేసిన 'సిద్ధం' సినిమాలో సలీం అనే నెగటివ్ పాత్రతో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రసాది. ఆ పాత్ర పోషణతో ఆయన ప్రేక్షకుల అభినందనలే కాక విమర్శకుల ప్రశంసలూ చూరగొన్నారు. నిజానికి ఆయన మొదట ముఖానికి రంగేసుకున్నది 'వీడు వాడు ఇంకొకడు' అనే సినిమాకి. సీనియర్ రచయిత దివాకర్‌బాబు కుమారుడు శ్రీకర్‌బాబు నటించి, రూపొందించిన ఈ సినిమా ఇప్పటివరకు వెలుగు చూడలేదు.
'గాయం-2'లో నిజ జీవిత పాత్రల్నే కోట శ్రీనివసరావు, ప్రసాద్ పోషిస్తుండటం గమనార్హం. ఇందులోనూ హీరో జగపతిబాబే. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొడుకు పాత్ర చనిపోతుంది. ఆ సందర్భంగా వచ్చే కొడుకు భౌతికకాయానికి తలకొరివి పెట్టే సన్నివేశాన్ని చేయడానికి కోట నిరాకరించారు. దాంతో ఆయన డూప్‌తో ఆ సన్నివేశాన్ని తీసినట్లు తెలిసింది. అయితే సినిమాలో ఆ సన్నివేశాన్ని అభినయించడాన్ని తప్పించుకున్న కోట నిజ జీవితంలో మాత్రం ఆ సన్నివేసం నుంచి తప్పించుకోలేకపోవడం విషాదంలో విషాదం. దుర్ఘటన జరిగినప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన ఆస్పత్రిలో కుమారుడి పార్థివ శరీరాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇక ఫిలింనగర్‌లోని ఆయన ఇల్లయితే శోకసంద్రంగా మారింది. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమతో కోటకు ఉన్న అనుబంధం వల్ల ఆయనకు హితులు, స్నేహితులు, సన్నిహితులు లెక్కకు మించి ఉన్నారు. వారంతా కోట కుమారుడి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక సినిమాల్లో కోటకు అసిస్టెంట్‌గా నటించిన కమెడియన్ బాబూమోహన్ సాయంత్రం నుంచి రాత్రివరకు కోటని ఓదారుస్తూ ఆయనని అంటిపెట్టుకునే ఉన్నారు. కోటను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపినవారిలో ఎం. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సిహెచ్. విద్యాసాగరరావు, జె. కిషన్‌రెడ్డి వంటి బీజీపీ నాయకులు; చిరంజీవి, రామానాయుడు, అల్లు అరవింద్, సురేశ్‌బాబు, వెంకటేశ్, పవన్ కల్యాణ్, త్రిపురనేని మహారథి, పరుచూరి బ్రదర్స్, జగపతిబాబు, శ్రీహరి, శాంతి, కవిత, ఇ.వి.వి. సత్యనారాయన, రేలంగి నరసిమ్హారావు, చలపతిరావు, శివకృష్ణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, వివి వినాయక్, వీరశంకర్, చక్రపాణి, రోజారమణి, తరుణ్, రాజీవ్ కనకాల, ఆర్యన్ రాజేశ్, నరేశ్, రోహిత్, వరుణ్ సందేశ్ తదితర చిత్రసీమ ప్రముఖులున్నారు. ప్రసాద్, తను దాదాపు సోదరుల్లాగా మెలగుతుంటామనీ, 'సిద్ధం'తోనే తామిద్దరికీ బ్రేక్ వచ్చిందనీ, ఆయన మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాననీ ప్రసాద్‌తో సన్నిహితంగా మెలగే నటుడు, అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ భరత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భర్త మరణవార్త తెలియగానే భార్య మోనా స్పృహతప్పి పడిపోయారు. రాత్రివరకు ఆమె ఆ స్థిలోనే ఉన్నారు. ప్రసాద్ మృతదేహాన్ని రాత్రి నింస్ ఆస్పత్రిలో ఉంచారు. సోమవారం ఉదయాన్నే భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించి, ఆ తర్వాత అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.