Thursday, June 30, 2011

ఫ్లాష్‌బ్యాక్: ప్రిన్సిపాల్‌ని చంపిన విద్యార్థి

ఈ రోజుల్లో టీచర్లు, లెక్చరర్ల పట్ల విద్యార్థులు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని వాపోతుంటాం. కానీ 20 వ శతాబ్ది తొలి రోజుల్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ విద్యార్థి ఎలా ప్రవర్తించాడో చూడండి...

"1917 ప్రాంతంలో మద్రాసులో న్యూయింగ్‌టన్ కాలేజీ ఉండేది. మద్రాసు రాష్ట్రంలోని మైనర్ జమీందారుల కోసం ఇది పెట్టారు. తండ్రులు చనిపోతే జమీలను నిర్వహించే స్థోమత పిల్లలకొచ్చేవరకూ వాళ్లను ఈ కాలేజీలో ఉంచి చదివించేవారు. అప్పట్లో ఆ కాలేజీకి 'డీలాహే' అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు. చాలా నిక్కచ్చి మనిషి. అదే కాలేజీలో రాంనాడ్ రాజా కొడుకు చదువుకుంటున్నాడు. ఆ ప్రిన్సిపాల్ భార్యతో ఈ పిల్ల జమీందారు అసభ్యంగా ప్రవర్తించాడు. అది ప్రిన్సిపాల్ చెవికెళ్లింది. మర్నాడు డీలాహే ఈ రాంనాడ్ పిల్ల జమీందారును మందలించాడు. ఆ రోజు రాత్రి ప్రిన్సిపాల్ తన ఇంట్లో మంచానికి దోమతెర వేసుకుని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో పిల్ల జమీందారు తుపాకీతో కాల్చి ప్రిన్సిపాల్‌ను చంపాడు. 1917లో ఈ కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వం కలవరపడింది. ముద్దాయికి తేలిక శిక్ష పడింది. ఈ అలజడితో ఆ కాలేజీని ప్రభుత్వం మూసేసింది."
-ఏటుకూరి ప్రసాద్ రచన 'తాపీ ధర్మారావు జీవితం-రచనలు' నుంచి

Wednesday, June 29, 2011

హాట్ న్యూస్: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం

సినీ మాక్స్‌లో మంగళవారం జరిగిన '180' సక్సెస్‌మీట్‌లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథుల నుంచి హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ట్విట్టర్‌లో "టీవీలో ఓ గంట కార్యక్రమం కోసం థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ తమ కుటుంబాల్ని కూడా అమ్ముకుంటాయి'' (థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ విల్ సెల్ దెయిర్ ఫ్యామిలీస్ టు మేక్ అప్ యాన్ అవర్ ఆఫ్ టీవీ) అంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై తెలుగు న్యూస్ చానల్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జరిగిన '180' సక్సెస్ మీట్‌లో యథాలాపంగా పాల్గొన్న సిద్ధార్థ్‌ని చానల్స్ అన్నీ మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేయడం ద్వారా తమ నిరసన తెలిపాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్ మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు మైకుల ముందుకు సిద్ధార్థ్ రావడంతోటే తమ కెమెరాలన్నింటినీ చానల్స్ తీసేశాయి. దీంతో పత్రికల వారివైపు తిరిగి రెండు ముక్కలు మాట్లాడిన సిద్ధార్థ్, పత్రికా ఫొటోగ్రాఫర్లు గ్రూప్ ఫొటో కోసం రావడంతో అక్కడ నిలవకుండా ఆవేశంతో విసవిసా నడచుకుంటూ అక్కణ్ణించి వెళ్లిపోయారు.

దీంతో ఆ సినిమా యూనిట్ సభ్యులంతా అతడి ప్రవర్తన పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, మీడియాకి క్షమాపణలు చెప్పేంతవరకు సిద్ధార్థ్ విషయంలో తమ నిరసనని ఇలాగే కొనసాగిస్తామని ఫిల్మ్ న్యూస్‌కేస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు తెలిపారు. సిద్ధార్థ్ ప్రవర్తన పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేస్తున్నట్లు వారు చెప్పారు.

ఇంటర్వ్యూ: వరుణ్ సందేశ్

నా కెరీర్‌లో నిలిచిపోయే 'బ్రమ్మిగాడి కథ'

"ఇందులో కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను'' అని చెప్పారు వరుణ్ సందేశ్. వి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా వరుణ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...

నా కెరీర్‌లో తొమ్మిదో చిత్రం 'బ్రమ్మిగాడి కథ'. ఇది 36 గంటల్లో జరిగే కథ. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. స్క్రీన్‌ప్లే మీద ఆధారపడిన కథ. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది.

కమర్షియల్ ఎంటర్‌టైనర్
'మీ శ్రేయోభిలాషి', 'మనోరమ' వంటి సినిమాలు తీసిన ఈశ్వర్‌రెడ్డి తొలిసారి చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయినా ఇది మీనింగ్‌ఫుల్ సినిమా. ఓ సందేశం కూడా ఉంటుంది. షూటింగంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మమ్మల్ని హైదరాబాదంతా పరుగులు పెట్టించారు డైరెక్టర్.

'యాల యాల' ఐటమ్
కోట చాలా మంచి సంగీతాన్నిచ్చారు. 'యాల యాల' అనే ఐటమ్ సాంగ్ చాలా పెప్పీగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం)కి 25 రోజులు వెచ్చించి, చాలా బాగా ఇచ్చారు కోటి. ఇందులో నేను ఫైట్స్ చేశా. అన్నీ ఎమోషనల్ ఫైట్సే. ఒకే ఒక్క ఫైట్‌కి రోప్స్ వాడారు. మిగతావాటిని నేచురల్‌గానే చేశాం.

కష్టాల్లో ఆదుకుంటా
ఇందులో నాది పరిణతి చెందిన పాత్ర. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇదివరకు నేను చేసిన జోవియల్ రోల్స్‌కు భిన్నంగా సెటిల్డ్‌గా ఉండే పాత్ర. నా పాత్రని కానీ, మిగతా పాత్రల్ని కానీ చాలా బాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ఈశ్వర్‌రెడ్డికే క్రెడిట్ అంతా దక్కుతుంది. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను.

కొత్త సినిమా
దీని తర్వాత యు.కె. అవెన్యూస్ నిర్మిస్తున్న సినిమాలో చేస్తున్నా. ఎం.ఎస్. రాజు బేనర్‌లోనూ, డైరెక్టర్ సుకుమార్ వద్దా పనిచేసిన శ్రవణ్ దీనికి డైరెక్టర్. అమృతారావ్ చెల్లెలు ప్రీతికా రావు హీరోయిన్. 

Thursday, June 16, 2011

ఇంటర్వ్యూ: అల్లు అర్జున్

బయటి నిర్మాతలకైతే 'బద్రినాథ్' చేసేవాణ్ణి కాదు

"ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేది బడ్జెట్‌లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే చేసేవాణ్ణి కాను'' అని చెప్పారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా దర్శకుడు వి.వి. వినాయక్ రూపొందించిన 'బద్రినాథ్' సినిమా ఇటీవల విడుదలై భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ సంభాషించారు అర్జున్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... 
ఇది పెద్ద మాస్ ఇమేజ్ వచ్చే కథ. అన్ని విషయాలూ ఉన్న కమర్షియల్ కథ. సినిమాకి మొదట డివైడ్ టాక్ ఉన్నా, కచ్చితంగా ఆడే అంశాలు ఉన్నాయి. అందుకే టాక్‌కి భిన్నంగా కలెక్షన్లు బలంగా ఉన్నాయి. సినిమాలో విషయం ఉంది కాబట్టే, తాము కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి కాబట్టే జనం బాగా చూస్తున్నారు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ వల్ల మొదట అలాంటి టాక్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల ధోరణి ఇలాగే కొనసాగితే చిత్రసీమలోని అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుంది. నా కెరీర్‌లో ఇవి హయ్యస్ట్ ఓపెనింగ్స్. నా మునుపటి టాప్ సినిమాల కలెక్షన్లని 'బద్రినాథ్' వారంలోనే దాటేస్తుంది.
32 గంటల సమయం 
కత్తి పట్టుకోవడం కొత్త పాయింట్ కాదు. పాతదే. కానీ అందులోనే కొత్తదనం చూపించాలి. హాంగ్‌కాంగ్, చైనీస్ సినిమాల్లో వాళ్లు కత్తి పట్టుకునే విధానం మనవాళ్లు పట్టుకునే దానికి భిన్నంగా, మరింత సాధికారికంగా ఉంటుంది. అందుకే వియత్నాం వెళ్లి రెండు నెలలు పాటు కత్తి తిప్పడంలో శిక్షణ పొందా. 'బద్రినాథ్'లో సమురాయ్ టైపు ఫైట్స్ చేయడానికి ఇదే కారణం. ఇక పొడవాటి జుట్టు విషయానికొస్తే ఆ కృత్రిమ జుట్టు పెట్టించుకోవడానికి 32 గంటల సమయం పట్టింది. అంతసేపూ ఓపిగ్గా కూర్చోవాల్సిందే. కానీ తీసేయడానికి అరగంట చాలు.
స్టంట్స్ కంటే డాన్సే కష్టం 
చిరంజీవి మావయ్య డాన్స్ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆయన్ని గుర్తుకు తేవాలని కావాలనే ఓ పాటలో కొన్ని బిట్స్ ఆయనలా చేశా. యాక్షన్ ఎపిసోడ్స్ చెయ్యడం కంటే డాన్సు చెయ్యడమే కష్టం. స్టంట్స్‌ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి బాగా తీయొచ్చు. అందుకే ఇవాళ 'యాక్షన్ ఎంత బాగా చేశాడు!' అనడం లేదు. 'ఎంత బాగా తీశాడు!' అంటున్నారు. డాన్సుకి అలా కుదరదు. ఫిజికల్‌గా చెయ్యాల్సిందే.
'మగధీర' లక్ష్యం కాదు 
'మగధీర' అందరికీ ఓ బెంచ్‌మార్క్ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది అలాంటి సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు. దెబ్బతింటున్నారు. కానీ భారీ స్థాయిలో సినిమా తియ్యడానికి అది ఓ ఉదాహరణగా మారింది. సృజనాత్మక స్వేచ్ఛనిచ్చింది. అయితే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మేం 'బద్రినాథ్' తియ్యలేదు. సృజనాత్మక విషయంలోనే దాన్నో ఆదర్శంగా తీసుకున్నాం. ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేవి బడ్జెట్‌లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే చేసేవాణ్ణి కాను. సినిమా బడ్జెట్ పెరగడానికి ఏ ఒక్కరో కారణం కాదు. అందరూ కారణమే.
బెస్ట్ మాస్ డైరెక్టర్ 
వినయ్ (వినాయక్)తో పనిచెయ్యడమంటే చాలా చాలా ఇష్టం. 'బన్ని' తర్వాత మేం కలిసి చేసిన సినిమా. అతని సినిమాలో ఎక్కడా వృథా అనేది కానీ, అనవసరమైనది కానీ ఉండదు. హి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ డైరెక్టర్స్. వినయ్‌తో సినిమా అంటేనే మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చేస్తుంది. కాంబినేషన్ వల్ల నష్టమేం లేదు. పైగా దానివల్ల సినిమాకి హైప్ వస్తుంది. స్టార్‌కేస్ట్ ఉంటే ఎవరిమైనా ఆసక్తి చూపిస్తాం కదా. క్రేజీ కాంబినేషన్ల వల్ల హిట్లు, ఫ్లాప్టు రెండూ ఉన్నాయి. అయితే కాంబినేషన్ ఒక్కటే సరిపోదు. మంచి కథ ఉండాలి.
మోస్ట్ సిన్సియర్ గర్ల్ 
'హ్యాపీడేస్' అప్పట్నించీ తమన్నాతో చెయ్యాలని ఉంది. అందుకే అడ్వాన్స్ ఇచ్చి మా సంస్థ తరపున ముందుగానే ఆమెని బుక్ చేశాం. మొదట '100% లవ్'కి తీసుకున్నాం. అది హిట్టవడంతో 'బద్రినాథ్'కి ఆమె ఓ ప్లస్ పాయింటయ్యింది. ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోయిన్లలో అంకితభావం ఉన్న 'ద మోస్ట్ సిన్సియర్ గర్ల్'.

Wednesday, June 15, 2011

ఇంటర్వ్యూ: సంగీత దర్శకుడు చక్రి

"పాట అంటే నా దృష్టిలో 60 శాతం సాహిత్యం, 40 శాతం బాణీలు. పాటలో గాత్రమే ప్రధానం. సాహిత్యం వినిపించని పాట పాటే కాదు'' అని చెప్పారు సంగీత దర్శకుడు చక్రి. ఎన్నో సూపర్ హిట్ పాటలకి బాణీలు కూర్చిన ఆయన చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తూ వస్తున్న ఆయన బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన అనుభవాల్ని పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే...
చిత్రసీమకి వచ్చాక ఇది పదో పుట్టినరోజు. నిర్మాతలు, దర్శకులు, హీరోల ప్రోత్సాహంతో ఇన్నేళ్లుగా కెరీర్‌ని కొనసాగించ గలుగుతున్నా. ఇన్నేళ్లలో మంచి దర్శకులతో పనిచేశా. మంచి హిట్స్ ఇవ్వగలిగా. అయితే మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, వెంకటేశ్, రాంచరణ్ వంటి హీరోలతో పనిచేసే అవకాశం ఇంతవరకు రాలేదు. రాబోయే రోజుల్లో వారితో పనిచేస్తాననే ఆశిస్తున్నా. బాలకృష్ణతో తొలి సినిమా 'సింహా' పెద్ద హిట్టవ్వడం హ్యాపీ. ఆయన్ని ఎన్నిసార్లు కలిసినా 'చాలా మంచి పాటలిచ్చావు' అని మెచ్చుకున్నారు. 'త్వరలో మనం మళ్లీ కలిసి పనిచేస్తాం' అని కూడా చెప్పారు.
అలా అయితే ఫీలవుతా
'చుక్కల్లో చంద్రుడు', 'చక్రం' వంటి సినిమాల్లో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అవి సరిగా ఆడకపోవడం వల్ల కాస్త బాధుంటుంది కానీ తప్పదు కదా. నా సినిమా హిట్టయ్యాక వెంటనే అవకాశాలు రాకపోయినా, ఆ సినిమా డైరెక్టర్ నుంచి మరో ఆఫర్ రాకపోయినా ఫీలవుతా. పూరి జగన్నాథ్‌తో ఎప్పుడూ కలిసి పనిచేయాలనే ఉంటుంది. ఇప్పుడెందుకు చెయ్యట్లేదనే ప్రశ్న నన్ను కాక ఆయన్నడిగితేనే కరెక్టు. మళ్లీ ఆయనతో కలిసి పనిచేసే రోజు దగ్గర్లోనే ఉందనుకుంటున్నా.
నా పాటల్లో సాహిత్యం వినిపిస్తుంది
ఆడియో మార్కెట్ పడిపోయింది. అయితే వినేవాళ్లు బాగా పెరిగారు. రేడియోలో, ఇంటర్నెట్‌లో బాగా వింటున్నారు. గాయనీ గాయకులు కూడా పెరిగారు. బాలు తర్వాత కార్తీక్ మంచి గాయకుడని చెప్పుకోవచ్చు. గాయనీమణుల్లో గీతామాధురి అద్భుతంగా పాడుతోంది. పాట అంటే నా దృష్టిలో 60 శాతం సాహిత్యం, 40 శాతం బాణీలు. నా పాటలో సాహిత్యం వినిపించాలని కోరుకుంటా. గాత్రమే ప్రధానం. సాహిత్యం వినిపించని పాట పాటే కాదు. అందుకే నా పాటల్లో సౌండ్ రికార్డింగ్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తా. మిక్సింగ్‌లో తేడా వల్ల నేను చేసిన కొన్ని పాటల్లోనూ బీట్ ఎక్కువగా వినిపించి ఉండొచ్చు కానీ, ఎక్కువ వాటిలో సాహిత్యం వినిపిస్తుంది.
అతను విలక్షణ రచయిత
నా అభిమాన సంగీత దర్శకుడు ఇళయరాజా, రెహమాన్. నేను పనిచేసిన గేయ రచయితల్లో భాస్కరభట్ల రవికుమార్ మంచి రచయిత. అన్ని రకాల పాటలూ రాయగల విలక్షణ రచయిత.
తొలి బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం వైవిఎస్ చౌదరి సినిమా 'రేయ్', తరుణ్, శ్రీకాంత్ సినిమా 'అనుచరుడు', రానా హీరోగా నటిస్తున్న 'నా ఇష్టం', నిఖిల్ సినిమా 'వీడు తేడా', తరుణ్ చిత్రం 'యుద్ధం', జగపతిబాబు హీరోగా నటిస్తున్న మరో సినిమా చేస్తున్నా. ప్రకాశ్ ఝా నిర్మించే ఓ హిందీ సినిమాకి పనిచేస్తున్నా. ఇది నా తొలి బాలీవుడ్ సినిమా. ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశా. ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేసేదీ, నటీనటుల వివరాలు ఇంకా తెలీదు.
సేవా కార్యక్రమాలు
నా పుట్టిన రోజు సందర్భంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అనాథ శరణాలయాలకు బియ్యం బస్తాలు అందిస్తున్నాం. వృద్ధాశ్రమాలకు నెల వరకు ఉదయం ఫలహారాల్ని సమకూరుస్తున్నాం. కాలేజీలో చదువుకుంటున్న పేద విద్యార్థుల ఫీజులు కట్టడం, చిత్రసీమలోని వృద్ధ కళాకారుల పిల్లలకు చదువు చెప్పించడం వంటివి చేస్తున్నాం. అలాగే అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నాం.

Thursday, June 9, 2011

ఇంటర్వ్యూ: చిన్నికృష్ణ

"ఇది బాగా పులిసిపోయిన పాత చింతకాయ పచ్చడి తరహా కథ కాదు. నాకు తెలిసి భారతదేశంలోని ఏ భాషలోనూ ఇంతవరకు ఈ కథలోని 'సంఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్)తో సినిమా రాలేదు'' అని 'బద్రినాథ్' గురించి చెప్పారు కథా రచయిత చిన్నికృష్ణ. అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి. వినాయక్ రూపొందించిన చిత్రం 'బద్రినాథ్'. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ కథ తన మనసులో ఎలా పుట్టిందనే సంగతితో పాటు ఆ సినిమాకి సంబంధించిన అనేక అంశాల గురించీ తన కార్యాలయంలో ప్రత్యేకంగా సంభాషించారు చిన్నికృష్ణ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'ఇంద్ర' తర్వాత మొక్కు తీర్చుకునేందుకు కాశీకి నన్ను కూడా తీసుకెళ్లారు నిర్మాత అశ్వనీదత్‌గారు. అప్పుడు గంగని చూసిన ఆనందంలో పుట్టిన కథే 'గంగోత్రి'. పెట్టుబడికి నాలుగు రెట్లు వసూలు చేసింది. ఆ సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ ఈ రోజు స్టార్‌గా ఎదగడం హ్యాపీ. ఆ సినిమా సాధించిన విజయంతో గంగమ్మ తల్లి రుణం తీర్చుకోవాలని గంగోత్రి వెళ్లా. అక్కణ్ణించి తిరుగు ప్రయాణమైనప్పుడు తల్లిని వదిలేసి వస్తున్న బాధ కలిగింది. ఆ ప్రయాణంలో అనుకోకుండా 'బద్రినాథ్' అనే పుస్తకం చదివా. హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌కి సంబంధించిన పుస్తకం అది. అందులోని ఓ విశేషం నన్ను విపరీతంగా ఆకర్షించింది. అదేమంటే అక్కడ గుడిని ఆర్నెల్లు తెరచి, ఇంకో ఆర్నెల్లు మూసి ఉంచుతారు. మూసేప్పుడు వెలిగించిన జ్యోతి తిరిగి గుడి తెరిచే దాకా ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే ఆర్నెల్ల పాటు నిరంతరాయంగా వెలుగుతుంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడాలేని అద్భుతమైన వింత! దాంట్లో నిజమెంతో తెలుసుకోవాలని తోచింది. బద్రినాథ్ వెళ్లా. ఆ గుడి మూసే సమయంలోనూ, ఆర్నెల్ల తర్వాత మళ్లీ తెరిచే సమయంలోనూ వెళ్లా. జ్యోతి వెలుగుతూ ఉంది. నిజం! అప్పుడు తట్టిన ఆలోచనతో పుట్టిన కథే 'బద్రినాథ్'.
స్వచ్ఛమైన ప్రేమకథ
హీరో బద్రినాథ్‌కి ఎందుకెళ్లాడు, హీరోయిన్ ఎందుకెళ్లింది అన్నది కథలోని భాగం. అందరూ భావిస్తున్నట్లు ఇది యాక్షన్ సినిమానో, రెండు వర్గాల మధ్య గొడవల కథనో, పక్కా మాస్ సినిమానో కాదు. ఇది అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ ప్రేమకథలో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అవసరం మేరకు ఉంటాయి. 'నమ్మకం' అనే ఎమోషన్‌ని ప్రధానం చేసుకుని అల్లిన కథ ఇది. నేను మొదట స్క్రిప్టులోని చివరి పేజీ రాసి, చివరగా మొదటి పేజీ రాస్తా. స్క్రిప్టు రచనలో ఇదో పద్ధతి. మొదట కేరక్టర్ అనుకుని, ఆ కేరక్టర్ చుట్టూ సన్నివేశాలల్లడం నాకు తెలీదు. మొదట విషయం నిర్ణయించుకుని, ఆ తర్వాత పాత్రల్ని సృష్టిస్తా.
వినాయక్ సరైన దర్శకుడు
నిజానికి ఈ కథ రెండు, మూడు ఆఫీసులకెళ్లి తిరిగొచ్చింది. ఒకప్పుడు నా దర్శకత్వంలోనే దీన్ని తీయాలనుకున్నా. వీలు పడలేదు. దాంతో నేను దర్శకత్వం చేయడం ముఖ్యం కాదనీ, 'బద్రినాథ్' కథ త్వరగా జనంలోకి వెళ్లడమే ముఖ్యమనీ రియలైజ్ అయ్యా. అలా వినాయక్ దర్శకత్వంలో ఇప్పుడు జనంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని మూడు సార్లు చూశా. వినాయక్ తీసినంత బాగా నేను తీసేవాణ్ణి కాదేమోననీ, వినాయక్ సరైన డైరెక్టర్ అనీ అనిపించింది. ప్రేక్షకుడికి ఓ సినిమా చూస్తున్న ఫీలింగ్ కాక, బద్రినాథ్‌లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. అంత బ్రహ్మాండంగా తీశాడు.
అర్జున్‌కి ఆకాశమే హద్దు
అర్జున్ హీరో కావడంలో చిన్నికృష్ణ పాత్ర ఎంతో ఉందని 'గంగోత్రి'ని దృష్టిలో పెట్టుకుని అంటుంటారు అల్లు అరవింద్. అర్జున్‌కి అన్ని భాషల్లోనూ స్నేహితులైన హీరోలున్నారు. ఈ సినిమా చూస్తే, వాళ్లంతా అతన్ని విపరీతంగా మెచ్చుకుంటారు. సిక్స్ ప్యాక్ శరీరాన్ని ప్రదర్శించడమే కాదు, సంకట స్థితుల్లో, భావోద్వేగ సన్నివేశాల్లో, త్యాగాన్ని ప్రదర్శించే సందర్భాల్లో, యాక్షన్ సీన్లలో 'ఆకాశమే హద్దు' అన్నట్లు చెలరేగిపోయాడు అర్జున్. పతాక సన్నివేశాల్లో అలకనంద పాత్రలో తమన్నా చేసిన అభినయం అపూర్వం. ఇప్పుడున్న వాళ్లలో ఆ పాత్రకి సరిగ్గా సరిపోయే నటి ఆమె మాత్రమే.
సమస్యా, పరిష్కారమూ...
ఇది బాగా పులిసిపోయిన పాత చింతకాయ పచ్చడి తరహా కథ కాదు. నాకు తెలిసి భారతదేశంలోని ఏ భాషలోనూ ఇంతవరకు ఈ కథలోని 'సంఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్)తో సినిమా రాలేదు. అయితే ఆ సంఘర్షణ కూడా అంతర్లీనంగానే ఉంటుంది. అంతర్జాతీయ చిత్రానువాద పద్ధతులకి (ఇంటర్నేషనల్ స్క్రీన్‌ప్లే మెథడ్స్) తగ్గట్లు నేను, వినాయక్ కలిసి స్క్రీన్‌ప్లే చేశాం. సన్నివేశాలన్నీ కొత్తగా ఉంటాయి. ఓ కొత్త సమస్యా, దానికి పరిష్కారమూ ఈ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులు స్క్రిప్టుతో పాటు ప్రయాణిస్తారా, లేదా.. అన్న సంగతిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేశాం.
ఎన్నెన్నో విశేషాలు
ఇందులో ఎన్నో విశేషాలున్నాయి. వాటిలో ఒకటి సరస్వతి నదిని చిత్రీకరించడం. మిగతా నదులన్నీ ఎంతో దూరం నేలమీద పారుతుంటాయి. కానీ సరస్వతి నది మాత్రం భూగర్భంలో పారుతూ, భూ ఉపరితలం మీదికొచ్చి, కొద్ది దూరం తర్వాత మళ్లీ భూగర్భంలోకి వెళ్లిపోతుంది. ఈ సినిమా ఇంత గొప్పగా రావడంలో అరవింద్ బాగా ఎఫర్ట్ పెట్టారు. ఈ సినిమా ఎట్లాగైనా చెయ్యాల్సిందేనని గట్టిగా పట్టుబట్టిన వ్యక్తి మాత్రం (ఠాగూర్) మధు. స్క్రిప్టుని గట్టిగా నమ్మి ఖర్చు పెట్టారు. పెట్టిన డబ్బంతా వస్తుందనే నమ్మకం ఉంది.
దర్శకత్వం మీద దృష్టి లేదు
'నందీశ్వరుడు' నా డ్రీమ్ ప్రాజెక్టు. దాన్ని బాలకృష్ణ చెయ్యాలనేది నా కోరిక. దాన్ని నేను డైరెక్ట్ చెయ్యాలని అనుకోవట్లేదు. ఇప్పుడు నా దృష్టి డైరెక్షన్ మీద లేదు. కథలు ఇవ్వడం మీదే. 'జీనియస్' పూర్తి స్క్రిప్టుని దర్శక నిర్మాతలకి అప్పగించా. ఎప్పుడు తీస్తారనేది వాళ్ల చేతుల్లో ఉంది.

Monday, June 6, 2011

ట్రైలర్: బుడ్డా హోగా తేరా బాప్

వ్యక్తిత్వం: డి. రామానాయుడు

అవిశ్రాంత సినీ శ్రామికుడు
నిజం. ఆయన అవిశ్రాంత సినీ శ్రామికుడు. డెబ్భై ఐదేళ్ల నవ యవ్వనుడు. చిత్ర నిర్మాతగా ఎన్నడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొంది, నలభై ఎనిమిదేళ్లుగా సినిమాలు నిర్మిస్తూ, నేటి తెలుగు చిత్రసీమ మూలస్తంభాల్లో ఒకరుగా పేరుపొందిన మూవీ మొఘల్. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నలభై ఏడేళ్ల క్రితం ఆయన నెలకొల్పిన సురేశ్ మూవీస్ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల్లో నేటికీ అగ్రగామిగా వెలుగొందుతుండటం అసాధారణం.
ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి మద్రాసు వెళ్లి 'అనురాగం' చిత్రాన్ని భాగస్వామితో కలిసి నిర్మించడం ద్వారా 1963లో చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన ఆ మరుసటి ఏడాదే సోలోగా ఎన్టీఆర్‌తో 'రాముడు భీముడు' నిర్మించి, సంచలన నిర్మాతగా మారిన సంగతి ఓ చరిత్ర. ఆరేళ్ల తర్వాత కష్టాల కడలి ఈదుతూ ఇక సినిమాలకు 'రాం రాం' చెప్పక తప్పదనుకునే పరిస్థితిని ఎదుర్కొని, అక్కినేని-వాణిశ్రీ జంటగా నిర్మించిన 'ప్రేమనగర్'తో పడిలేచిన కెరటమైన ఆయన, ఇక వెనుతిరిగిందే లేదు. శ్రీకృష్ణ తులాభారం, చక్రవాకం, సోగ్గాడు, సెక్రటరీ, సావాసగాళ్లు, మండే గుండెలు, దేవత, ముందడుగు, ప్రతిధ్వని, అహ నా పెళ్లంట, ఇంద్రుడు చంద్రుడు, బొబ్బిలి రాజా, కలిసుందాం రా, మల్లీశ్వరి వంటి ఎన్నో సినిమాలు ఆయన నిర్మాణ దక్షతకు నిదర్శనాలు.
పెద్ద కుమారుడు సురేశ్‌ని తన వారసుడిగా నిర్మాతని చేసిన ఆయన చిన్న కుమారుడు వెంకటేశ్‌ని 'కలియుగ పాండవులు'తో హీరోని చేశారు. ఇవాళ ఆ ఇద్దరూ తమ తమ రంగాల్లో అగ్ర స్థాయిని ఆస్వాదిస్తుండటం తెలిసిందే.
ఓ నిర్మాతగా ఎంతోమంది తారల్నీ, సాంకేతిక నిపుణుల్నీ పరిచయం చేసిన ఆయన తన సేవల్ని నిర్మాణ రంగం బయట కూడా విస్తరింపజేశారు. సినిమా షూటింగుల కోసం రామానాయుడు స్టూడియోస్‌ని నెలకొల్పిన ఆయన అందులో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల్నీ ఏర్పాటు చేశారు. ఇక డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోనూ ఆయన అగ్రగామిగా వెలుగొందుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌నీ సినీ హబ్ చేయాలనే సంకల్పంలో భాగంగా పాతికెకరాల సువిశాల స్థలంలో సముద్రానికి అతి దగ్గరగా ఆయన నెలకొల్పిన రామానాయుడు స్టూడియోస్ ఇప్పుడు ఎంతోమంది నిర్మాతల్ని ఆకర్షిస్తోంది. నటుడిగానూ ఆయన కొన్ని సినిమాల్లో కనిపించారు. ఇటీవలి కాలంలోనే 'హోప్' అనే సినిమాలో ప్రధాన భూమిక ధరించి, ఉత్తమ నటనని ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసల్పి సైతం అందుకున్న ప్రజ్ఞాశాలి రామానాయుడు. ప్రస్తుతం రాజకీయ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఉన్న కొద్ది సంవత్సరాల్లో ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన సేవాతత్పురుడు. బాపట్ల పార్లమెంటు సభ్యునిగా పదవిలో ఉన్న కాలంలో ఆయన చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలు నిరుపమానం. ఇందుకోసం ఆయన ఎంపీ నిధుల్నే కాక సొంత డబ్బునీ ఖర్చు చేసి తన సేవా నిరతిని చాటుకున్నారు.
అటువంటి ఆ నిరంతర సినీ పథికుడు ప్రస్తుతం మరో సినీ నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ హీరోలుగా వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్నీ చురుగ్గా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆద్యంతం వినోదభరితంగా తయారవుతున్న ఈ సినిమాతో నిర్మాతగా మరో విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్న రామానాయుడు సోమవారం తన 76వ పుట్టిన రోజును బ్యాంకాక్‌లో అదే సినిమా సెట్స్‌పై జరుపుకోబోతున్నారు. 
(నేడు డాక్టర్ రామానాయుడు పుట్టిన రోజు)