Saturday, January 29, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (రెండో భాగం)

'నరసింహనాయుడు' నిర్మాణ వ్యయం దాదాపు 8 కోట్ల రూపాయలు. పదేళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. ఈ సినిమాలో భారీ సంఖ్యలో టాటా సుమోలు కనిపిస్తాయి. విలన్, హీరో గ్రూపులకు ఇలా అధిక మొత్తంలో సుమోలను ఉపయోగించడం దర్శకుడు గోపాల్ ప్రారంభించిన ధోరణే. భావోద్వేగ సన్నివేశాల సందర్భాల్లో అలా బారులు బారులుగా తెల్లటి సుమోలు కనిపిస్తుంటే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత రోజుల్లో సందర్భం ఉన్నా, లేకున్నా అధిక సంఖ్యలో సుమోలు వాడటం విపరీత ధోరణిగా మారి, ప్రేక్షకులకి మొహం మొత్తడం వేరే సంగతి. 'నరసింహనాయుడు'లో టాటా సుమోల సన్నివేశాలన్నీ ఉద్వేగభరిత సన్నివేశాల్లో వచ్చేవే. అందుకే అవి కథలో అంతర్భాగంగా ఇమిడిపోయాయి. ఆయా సన్నివేశాల్ని పండించాయి. వాటితో పాటు రైలుబండి వద్ద యాక్షన్ సన్నివేశాలు, హెలికాప్టర్‌ని వినియోగించడం వంటివి ఈ సినిమా వ్యయాన్ని బాగా పెంచాయి. అంత వ్యయమంటే అప్పట్లో చాలా రిస్కే. చిన్నికృష్ణ కథనీ, గోపాల్ దర్శకత్వ సామర్థ్యాన్నీ నమ్మినందునే నిర్మాత మురళీకృష్ణ అంత మొత్తాన్ని వెచ్చించారు. "ఎందుకు, ఏమిటి అనకుండా అడిగిందల్లా సమకూర్చిపెట్టారు నిర్మాత మురళీకృష్ణ గారు. ఎప్పుడూ 'ఇదొద్దు' అనలేదు. సూట్‌కేసులతో డబ్బులు కుమ్మరించారు. ఆయనకి హేట్సాఫ్ చెప్పాలి" అని కృతజ్ఞత వ్యక్తం చేస్తారు దర్శకుడు గోపాల్. బడ్జెట్ విషయంలో తీసుకున్న రిస్కుకి తగ్గట్లుగానే అనూహ్యమైన ఫలితం దక్కింది. ఖర్చుకి రెండు రెట్లకి మించి 21 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది ఈ చిత్రం. ఆ విధంగా 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఫలితాన్ని ఊహించింది ఒకే ఒక్కడు. అతను చిన్నికృష్ణ. తను రాసిన స్క్రిప్టు చివరి పేజీలోనే ఆయన 'ఈ సినిమా 20 కోట్ల రూపాయల్ని వసూలు చేస్తుంది' అనే మాట కూడా రాశాడు. అది నూటికి నూరు శాతమూ నిజమవడం విశేషమే.
మరి ఇంతటి విజయాన్ని సాధించిన 'నరసింహనాయుడు' బలం ఎక్కడుంది? ఏయే అంశాలు ఆ సినిమాకి అంతటి విజయాన్ని చేకూర్చిపెట్టాయి? ఈ సినిమాలో లోపాలే లేవా? ఎందుకు లేవు! నరసింహనాయుడు పెద్దవాడై మనకి కనిపించడమే నాట్యాచార్యునిగా కనిపిస్తాడు. అయితే చిన్నతనంలోనే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని తర్వాత ప్రత్యర్థుల పీచమణూస్తూ వచ్చిన నరసింహనాయుడు ఎప్పుడు నాట్యం నేర్చుకున్నాడు? నేర్చుకున్నా అంత తొందరగా నాట్యాచార్యుడు ఎలా అయ్యాడు? అనేవి సమాధానం లభించని ప్రశ్నలు. అలాగే 'సర్వకాల సర్వావస్థల్లోనూ నీ తోడుగా, నీడగా ఉంటాను' అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యను అన్నావదినల్ని తూలనాడిందనే కారణంతో కనీసం ఆమె వాదన కూడా వినకుండా పుట్టింటికి పంపేయడం ధీరోదాత్త నాయకుని లక్షణం కాదు. నరసింహనాయుడు ఆ పని చేశాడు. భార్య పట్ల చాలా కఠినంగా వ్యవహరించి, ఆమెని వ్యధకు గురిచేశాడు. అంటే కథలో శ్రావణి పాత్రకు అన్యాయం జరిగింది.
అయితే మామాలు ప్రేక్షకుడికి ఇవేవీ పట్టలేదు. కారణం, వాటిని గుర్తించని రీతిలో అమరిన స్క్రీన్‌ప్లే. ఆరంభం నుంచి శుభం దాకా కుర్చీల్లో కదలనివ్వని కథాగమనం 'నరసింహనాయుడు'కి పెద్ద బలం. ఆ పాత్రని ప్రేక్షకులు అంతగా ప్రేమించడానికి దోహదం చేసింది అదే. ఇంటర్వెల్ వచ్చినప్పుడు సాధారణంగా ప్రేక్షకుడు రిలీఫ్ పొందడానికి కుర్చీలోంచి లేస్తాడు. కానీ ఎప్పుడు ఇంటర్వెల్ టైం అయిపోతుందా, ఎప్పుడు సెకండాఫ్ మొదలవుతుందా.. అనే క్యూరియాసిటీని కలిగించింది ఈ చిత్రం. అంతదాకా అజ్ఞాతంలో ఉన్న నరసింహనాయుడు ఉనికి తెలిపే ట్రైన్ ఎపిసోడ్ కచ్చితమైన ఇంటర్వెల్ బ్యాంగ్. ప్రత్యర్థులకు మొదట వీపు చూపించి, 'స్లో మోషన్'లో నరసింహనాయుడు మొహాన్ని చూపిస్తుంటే, ఆ రూపాన్ని చూసీ చూడగానే ఠారెత్తి ఆ ప్రత్యర్థులు ఆయుధాలు అక్కడే పడేసి పరుగులు తీస్తుంటే, 'మాస్' ప్రేక్షకుడికి అంతకంటే ఉద్వేగభరిత సన్నివేశం ఇంకేముంటుంది! అంతకుముందు దాకా సాఫ్ట్‌గా కనిపించి, సింహాచలం నాయుడు తమ్ముళ్లని చితగ్గొట్టినా నరసింహనాయుడులోని హీరోయిజాన్ని ఒకేసారి వెయ్యి రెట్లు పెంచేసిన సన్నివేశం అది. నరసింహనాయుడు వంటి బలమైన పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అది త్యాగం, పౌరుషం సమపాళ్లలో రంగరించిన పాత్ర. ఆ పాత్ర జనానికి అంతగా ఎందుకు నచ్చింది? "అతను (నరసింహనాయుడు) ఊరికోసం ప్రత్యర్థిని చంపుతాడు. కుటుంబం కోసం చదువుసంధ్యలు వదిలేశాడు. అన్నయ్యలను తూలనాడింది అన్ని కట్టుకున్న భార్యను వదిలేస్తాడు. సోదరుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. వాళ్లను రక్షించుకునే సమయంలో భార్యను పోగొట్టుకుంటాడు. కొడుకు వేరే కథానాయికలో అమ్మను వెతుక్కుంటే అంగీకరించడు. కానీ తండ్రి 'ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా' అంటే వెళ్లి తీసుకొస్తాడు. విచిత్రం ఏమిటంటే ఏదీ తనకోసం చేయడు. తనవారికోసమే చేస్తాడు. అందుకే అందరికీ నచ్చిందా పాత్ర" అని వివరిస్తారు పరుచూరి కోపాలకృష్ణ.
అలాంటి పాత్రను తనదైన శైలితో రక్తి కట్టించారు బాలకృష్ణ. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎంతటి సాత్త్వికాభినయం చేశారో, భావోద్వేగ సన్నివేశాల్లో అంతటి గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పోరాట సన్నివేశాల్లో ఎంతటి పరాక్రమాన్ని చూపించారో, సరదా సన్నివేశాల్లోనూ, పాటల్లోనూ అంతటి హుషారు కనపరిచారు. అలా 'నరసింహనాయుడు'కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలకృష్ణ. అందుకే ఆ పాత్రని నెత్తికెత్తుకున్నారు జనం. అందుకే ఆ పాత్రకి 'ఉత్తమ నటుడు'గా నంది అవార్డు అందుకున్నారు బాలకృష్ణ.
ఆయనకు దీటుగా శ్రావణి పాత్రలో సిమ్రాన్ ప్రదర్శించిన అభినయం కూడా ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోయింది. భర్తను అతని అన్నావదినలు ఇష్టం వచ్చినట్లు తూలనాడుతుంటే తట్టుకోలేక వారిమీద ఆమె తిరగబడే సన్నివేశం 'నరసింహనాయుడు' పాత్రౌచిత్యాన్ని పరిపుష్ఠం చేసింది. ఇక తండ్రి పాత్రలో కాశీనాథుని విశ్వనాథ్ ప్రదర్శించిన హుందాతనం, ప్రతినాయకునిగా ముఖేష్‌రుషి చూపించిన క్రూరత్వం జనాన్ని మెప్పించాయి. మిగతా తారలంతా తమకి అప్పగించిన పాత్రల్ని సమర్థంగా చేసుకుంటూ వెళ్లారు.
బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపించే ఈ సినిమా విజయానికి దోహదం చేసిన అంశాల్లో ప్రముఖమైంది మణిశర్మ కూర్చిన సంగీతం. బాలకృష్ణ, ఆషా సైనీపై చిత్రీకరించిన 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా' పాట మాస్‌ని ఓ ఊపు ఊపింది. 'కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో', 'చిలకపచ్చ కోక పెట్టినాది కేక', 'మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది' పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చిన నేపథ్య సంగీతాన్నీ విస్మరించలేం. చిన్నికృష్ణ స్క్రీన్‌ప్లేకి మరింత బలాన్నిచ్చినవి పరుచూరి సోదరుల సంభాషణలు. బావోద్వేగ సంభాషణలకు పెట్టింది పేరైన వారు 'కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా' తరహా డైలాగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన బావలు, తోడికోడళ్ల వద్ద ఆవేశభరితంగా శ్రావణి నోట పలికే ఇంగ్లీషు డైలాగులకు చప్పట్లు పడ్డాయంటే ఆ క్రెడిట్ వాళ్లదే. సినిమాకి మంచి 'లుక్' రావడంలో కీలకమైంది వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రఫీ. చేజింగ్ సీన్లలో ఆయన కెమెరా ఎక్కడా షేక్ కాలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన కెమెరా యాంగిల్స్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. అలాగే పోరాట సన్నివేశాల్ని గొప్పగా రూపొందించి 'నరసింహనాయుడు' విజయంలో తనదీ ప్రముఖ పాత్రేనని చాటిచెప్పారు స్టంట్ మాస్టర్ విక్రం ధర్మా. ఇవన్నీ తెరమీద ఇలా పండాయంటే అందుకు ఎడిటింగ్ నిర్వహించే పాత్ర చాలా ఎక్కువ. ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించారు కోటగిరి వెంకటేశ్వరరావు.
ఇలా ఇందరి సమష్టి కృషి వల్లే 'నరసింహనాయుడు' చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. మునుపటి బాక్సాఫీసు వసూళ్ల చరిత్రని తిరగరాసింది. 105 కేంద్రాల్లో శతదినోత్సవం, 17 కేంద్రల్లో రజతోత్సవం జరుపుకుంది. ఏలూరులో 275 రోజులు ఆడింది. 'సమరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - బి. గోపాల్ ద్వయానికి మరో సంచలన చిత్రంగా నిలిచింది.

'నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలిపిన సినిమా' 
-బి. గోపాల్
చిన్నికృష్ణ 'సమరసింహారెడ్డి' టైంలోనే కలిసేవాడు. కథలు చెప్పేవాడు. అప్పుడు ఆ కథలు వర్కవుట్ కాలేదు. తర్వాత నేనే పిలిపించా. ఈ కథ చెప్పాడు. ఇంటర్వెల్ వరకు చెప్పాడు. బాగుంది. నిర్మాతకీ, బాలకృష్ణకీ నచ్చింది. మొదట సెకండాఫ్‌లో హీరో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని చెప్పాడు. నాకు ఐపీఎస్ ఆఫీసర్ అనే పాయింట్ నచ్చలేదు. అప్పటికే బాలయ్యతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' చేసివున్నా. నాలుగు రోజుల్లో బాలయ్యకు సెకండాఫ్ చెప్పాలి. పోలీసాఫీసర్ గెటప్ లేకుండా చెప్పమన్నా. చిన్ని కొంత అప్సెట్ అయ్యాడు. దాంతో పరుచూరి బ్రదర్స్‌తో చిన్నికి మీటింగ్ ఏర్పాటు చేయించా. అప్పుడు ఇంటికొక్కడు బలిదానమయ్యే పాయింట్ చెప్పాడు చిన్ని. నేను డౌట్‌పడ్డా. గోపాలకృష్ణ బాగుందన్నారు. ఆ తర్వాత సీనార్డర్ వేసుకొచ్చాడు చిన్ని. అది అందరికీ నచ్చింది. 'నరసింహనాయుడు' పాత్ర చెబుతుంటేనే బాలయ్య ఎగ్జయిట్ అయ్యారు. వెంటనే 'ఈ సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాం' అన్నారు. స్క్రీన్‌ప్లే గొప్పగా చేశాడు చిన్ని. షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో సినిమాని విడుదల చేశాం. వేస్టేజ్ లేకుండా రీజనబుల్ బడ్జెట్‌లో సినిమా చేశాం. నిర్మాత ధైర్యంగా కొన్ని ఏరియాలు అమ్మకుండా ఉంచుకున్నారు. పెద్ద హిట్టవడంతో బాగా డబ్బు వచ్చింది.
బాలయ్య పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. మొదట సాఫ్ట్‌గా, తర్వాత ఎమోషనల్ మేన్‌గా గొప్పగా నటించాడు. లుక్స్‌తోనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రిప్టుకు తగ్గట్టు వంద శాతం కాదు వెయ్యి శాతం న్యాయం చేశాడు.
'సమరసింహారెడ్డి' తర్వాత నేను చేసిన సినిమాలు సరిగా రాలేదు. ఈ సినిమా నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలబెట్టింది. టెక్నీషియన్లకి ఇక సక్సెస్ వస్తే చెప్పలేని ఆనందం. ఆయుష్షు పెంచినంత బలాన్నిస్తుంది. ఇంకా మంచి సినిమా చెయ్యాలన్న ఉత్సాహాన్నిస్తుంది.

'నా అంచనా తప్పలేదు' 
-చిన్నికృష్ణ
ఉత్తర భారతంలో దేశభక్తి ఎక్కువ. దక్షిణ భారతంలో వ్యక్తుల్ని పూజిస్తే, పంజాబ్‌లాంటి చోట్ల దేశాన్ని పూజిస్తారు. అందుకే ఆర్మీలో నార్త్‌వాళ్లు ఎక్కువ. అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఒక్కో కొడుకు దేశ రక్షణలో ఉన్నాడు. నేను అలాంటి గ్రామాల్ని ప్రత్యక్షంగా చూశా. దానికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా.
మన ఊరి సమస్యని కాపాడ్డానికి లా అండ్ ఆర్డర్ ఫెయిలయినప్పుడు ఒక్కో ఇంట్లో ఒక్కొక్కణ్ణి బలిదేవుడి (వారియర్)గా ఇస్తే వాళ్లు తమ ఊర్ని కాపాడుకుంటారనే ఐడియా అలా వచ్చింది. అట్లాంటి యోధులకి పెళ్లి సంబంధాలు రావు. ఒకవేళ పెళ్లయితే ఆ భార్యకి ఎన్నో కష్టాలుంటాయి. ఈ అంశాలు నా స్క్రిప్టులో 'బై-ప్రొడక్ట్స్'గా బాగా వర్కవుట్ అయ్యాయి.
నిజానికి నా మైండ్‌లో పోలీస్ కేరక్టర్ లేదు. మొదట సినిమా పోలీస్ అనుకుని మొదలుపెట్టినందునే అలా చెప్పా. తర్వాత గోపాల్ పోలీస్ ఆఫీసర్ కాకుండా చెప్పమన్నారు. నా మైండులో ఉన్న అసలు కథ అప్పుడు చెప్పా. 'లక్ష్మీనరసింహస్వామి' అనే థాట్ క్రియేట్‌చేసి తొలిగా చెప్పింది నేనే. నేను సృష్టించిన నరసింహనాయుడు కేరెక్టర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం సంతోషకరం.
తమ ఇంట్లో ఈ స్క్రిప్టు వినగానే లోపలికి వెళ్లి స్వీట్ పాకెట్, పళ్లు తెచ్చిచ్చి, 'ఈ అబ్బాయి గొప్ప రైటర్ అవుతాడు' అని ఆశీర్వదించారు బాలకృష్ణ. ఆయన మిగతా హీరోలందరికంటే ఎంతో గొప్పవారు. సినిమా సక్సెస్ అవగానే కొన్ని లక్షల రూపాయలు విలువచేసే పురాతన పచ్చల పతకం, పట్టుబట్టలు ఇచ్చి, కారుదాకా మమ్మల్ని తీసుకువచ్చి పంపిన గొప్పవారు. నా 'నరసింహనాయుడు' పాత్రకి వంద శాతం జస్టిఫై చేశారు బాలకృష్ణ. చిన్నపిల్లాడిగా విని, పెద్ద నటునిగా చేశారు. విశ్వరూపాన్ని ప్రదర్శించారు కాబట్టే అంత పెద్ద హిట్టు.
ఈ సినిమా స్క్రిప్టు ఎ టు జడ్ నాదే. నా స్క్రిప్టు ఆఖరి పేజీలో '20 కోట్లు వస్తాయి' అని రాశా. బడ్జెట్ 8 కోట్లయితే, 21 కోట్లు వచ్చాయి. ప్రతి సినిమాకీ అలాగే రాస్తుంటా. అది అహంకారమనుకోండి, ఆత్మవిశ్వాసం అనుకోండి. ఇంతవరకు నా అంచనా తప్పలేదు. ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకుంటూ 'సాక్షాత్తూ లక్ష్మీనరసింహస్వామి చిన్నికృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి ఈ కథ చెప్పాడు' అన్నారు బాలకృష్ణ. అంతకుమించిన కాంప్లిమెంట్ నాకు ఇంకేముంటుంది! మళ్లీ ఆయనా, నేనూ కలుస్తాం. అది చరిత్ర అవుతుంది. అదే 'నందీశ్వరుడు'. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలన్నీ అదే రోజు రిలీజైనా నేను రెడీ. 'నందీశ్వరుడు' మీద అంత గట్టి నమ్మకం.

(వచ్చే వారం 'ఖుషి' సినిమా కబుర్లు) 

Tuesday, January 25, 2011

మాస్ అంటే అంత చులకనా?

ఈ మధ్య మన సినిమావాళ్లకి - ముఖ్యంగా దర్శకులకీ, కథకులకీ - మాస్‌ని తక్కువ అంచనా వెయ్యడం ఎక్కువయ్యింది. మతిమాలిన హింస అన్నివేళలా వర్కవుట్ కాదని స్పష్టం కావడంతో బూతు హాస్యాలు, జుగుప్సాకర దృశ్యాల్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు. మాస్‌కి ఇట్లాంటి సీన్లయితేనే నచ్చుతాయనే భ్రమలు పెరిగాయి. మేధావుల మెప్పుకోసం ఎవరూ కమర్షియల్ సినిమాలు తీయరనే సంగతి అందరూ ఒప్పుకుంటారు. అయినా మనకున్న పారలల్ సినిమాల సంఖ్య ఒక్క శాతం కంటే మించింది ఎప్పుడని? కానీ అధిక శాతం ప్రజల్ని ఆకర్షించడానికి చవకబారు, ముతక హాస్య సన్నివేశాల మీద ఆధారపడ్డం ఏమాత్రం సమర్థనీయం కాదు. పెద్ద దర్శకులమని అనిపించుకుంటున్న వాళ్లు సైతం ఇట్లాంటి దిగజారుడు దృశ్యాల్ని చిత్రీకరించడానికి ఉత్సాహం చూపిస్తూ తమ బాధ్యతని విస్మరిస్తున్నారు.
'పెళ్లిచేసి చూడు', 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ', 'ఇల్లరికం', 'అహ నా పెళ్లంట', 'కొబ్బరి బోండాం', 'యమలీల' వంటి అమలిన హాస్య చిత్రాల్ని చూసిన కళ్లతోటే 'అల్లుడా మజాకా', 'అల్లరి మొగుడు', 'చిత్రం', 'టైంపాస్' వంటి అసభ్య, ముతక హాస్య చిత్రాల్ని చూడాల్సి రావడం బాధాకరం. వీటిలో కొన్ని విజయవంతం అయితే అవ్వొచ్చుగాక. మనిషిలో అంతర్గతంగా ఉండే ఇన్‌స్టింక్ట్స్‌ని రేపెట్టి వాటిని కేష్ చేసుకోవడంలో తాత్కాలికంగా సఫలమైనా చరిత్రలో వాటికి దక్కేది అట్టడుగు స్థానమే.
మనది ఎట్లాంటి సమాజం? ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త అనే సామాజికి సూత్రానికి అత్యంత విలువనిచ్చే సమాజం. ఇందులో మగవాడికి మినహాయింపులు ఇచ్చినట్లు అగుపించినా, భార్యతో కాక మరో స్త్రీతో సంబంధం పెట్టుకునే మగవాణ్ణి ఈ సమాజం గౌరవ దృష్టితో చూడదు. స్త్రీ విషయంలో అయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. అట్లాంటిది ఒక గుడ్డివాణ్ణి చేసుకుంటే ఎంచక్కా ఇంకో మగాడితో రంకుతనం ఎట్లా సాగించవచ్చో 'టైంపాస్' చిత్రంలో కథకుడు కళ్లకు కట్టినట్లు చూపడం ఎంతైనా గర్హనీయం. కథకుడు ఈ రంకుతనాన్ని హైలైట్‌చేసి రంకుతనానికి వచ్చిన ఆటంకాల్ని సులువుగా తప్పించేస్తుంటాడు. చిత్రం ఆఖర్లో సైతం దానికి అడ్డుకట్ట వెయ్యకపోవడం చూస్తే మాస్‌ని కథకుడు కానీ, దర్శకుడు కానీ ఎంత తక్కువగా అంచనా వేశారో అర్థమవుతుంది. ఈ బాగోతం గురించి పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్లేం సమాధానం చెప్పాలి? పైగా తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటీ పెద్ద హాస్యనటులు ఈ అసభ్య, అశ్లీల హాస్యాన్ని పోషించడం మనసుకి చాలా కష్టంగా తోస్తుంది. 'అల్లుడా మజాకా'లో చిరంజీవి అంతటివాడు చేయగా లేనిది మేం చేస్తే తప్పేంటి అని వాళ్లంటే మనం మాత్రం ఏం చేస్తాం?
హాస్య సన్నివేశాల్లోనే కాకుండా ఇతరత్రా కూడా కొన్ని పాత్రల చేత అసభ్యకర మాటల్ని పలికించడంలో కూడా మనవాళ్లు అత్యుత్సాహం చూపుతుంటారు. 'వైఫ్' చిత్రంలో కాలేజీ అమ్మాయిల చేత పలికించిన మాటలు వినడానికి సరదాగానూ, చూడ్డానికి వినోదంగానూ ఉంటే ఉండొచ్చుకానీ మాస్‌లో అవి ఎట్లాంటి ప్రభావాన్ని కలిగిస్తాయో యొచించనవసరం లేదా? కడుపుబ్బ నవ్వించే చిత్రమంటూ 'జాక్‌పాట్'కి తెగ పబ్లిసిటీ ఇచ్చారు. ఫక్తు కామెడీ చిత్రమని భావించి వెళ్లిన మహిళా ప్రేక్షకులు ఆ చిత్రంలోని వెకిలి, అశ్లీల హాస్యాన్నీ, సంభాషణల్నీ భరించలేక ఇంటర్వెల్‌లోనే బయటకి వెళ్లడానికి ఇష్టం చూపారు. ఇందులోని సంభాషణలు సెన్సార్ కత్తెరకి చిక్కకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఒక్కో సినిమాలో కొన్ని సన్నివేశాల్నే ఎందుకు కట్‌చేస్తారో తెలీని సెన్సార్ వాళ్లకి 'జాక్‌పాట్'లోని డైలాగులు బాగా వినోదాన్ని అందిచాయేమో వాటికి కట్ చెప్పడం మర్చిపోయారు.
'ఎదురులేని మనిషి'లో కొత్త నటి షెహనాజ్, ఎల్బీ శ్రీరాంల మధ్య నడిచే డైలాగులు ముతక హాస్యానికి అసలు సిసలు నమూనాగా నిలుస్తాయి. పరమ జుగుప్సాకరంగా తోస్తాయి. బహుశా రచయిత తన ఒరిజినల్ మెంటాలిటీని ఆ సంభాషణల ద్వారా వ్యక్తం చేశాడేమో! హిట్ ముద్రని వేసుకున్న 'బ్యాచిలర్స్', '6 టీన్స్' చిత్రాల్లోనూ బూతు జోకులూ, జుగుప్సాకర డైలాగులూ, సన్నివేశాలూ మోతాదు మించాయి. వీటిని చూసి సినిమా హిట్టవడానికి అట్లాంటి డైలాగులూ, దృశ్యాలూ వుండాలనే అపోహలో పడిపోయి వాటినే నమ్ముకుని చిత్రాలు తీస్తూ చాలామంది బోల్తాకొడుతున్నారు.
వాస్తవానికి ఏ చిత్రమూ ముతక హాస్యంవల్ల, అశ్లీల సన్నివేశాలవల్ల విజయం సాధించలేదు. టెక్నిక్, కథనంవల్లనే ఆయా చిత్రాలు హిట్టయ్యాయన్న సంగతి గ్రహించాలి. ఇప్పటి చిత్రాల్లో ఆరోగ్యకరమైన హాస్యం ఉండటంలేదని వ్యక్తిగతంగా ప్రతివొక్కరూ బాధని వ్యక్థం చేస్తుంటారు. పత్రికా ఇంటర్వ్యూలలో, దృశ్యమాధ్యమంలోనూ మంచి హాస్యం రావాలని ఆకాంక్షని ప్రదర్శిస్తుంటారు. అయితే తమ వంతు బాధ్యతగా ఏం చేశారో, ఏం చేస్తున్నారో మాత్రం చెప్పరు. పైగా ఆ తర్వాత కూడా అట్లాంటి డైలాగులు సినిమాల్లో యధేచ్చగా వల్లిస్తూనే ఉంటారు. ఈ 'ద్వంద్వ' రీతిని ముందు ఉద్ధండ హాస్యనటులు వదిలించుకోవాలి. మాస్‌కి వాళ్లు చేయగల మేలు అదే.
అశ్లీల హాస్యం పెచ్చుమీరిపోతున్నదని ఒక పక్క బాధపడుతుంటే ఇప్పుడు ఇంకోరకం బాధ జనాల్ని వేధించడానికి ముందుకొస్తున్నది. ఈ కొత్త హాస్యం జనాల్ని మరీ తక్కువగా అంచనా వేస్తోంది. వాళ్లకి 'చెవిలో పువ్వు' పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందులో 'థాంక్యూ సుబ్బారావ్'లోలా 'మాట్లాడే కుక్క', 'అమ్మో బొమ్మ'లోలా 'దయ్యం బొమ్మ' పాలు పంచుకుంటున్నాయి. ఇలాంటి చిత్రాలు ఇంకా వస్తున్నాయంటే మన మాస్ స్టాండర్డ్‌ని సినిమావాళ్లు ఎంత గొప్పగా భావిస్తున్నారో అన్నదానికి నిదర్శనం. అమలిన చిత్రాల రోజులు రావాలంటే ఈ 'మలిన' చిత్రాల్నీ, హాస్యాల్నీ చీత్కరించి డబ్బాలు వెంటనే వెనక్కి వెళ్లిపోయేలా చేయడమే పరిష్కారం.
-ఆంధ్రభూమి, 19 అక్టోబర్ 2001 

Saturday, January 22, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (2001)

తారాగణం: బాలకృష్ణ, సిమ్రాన్, ప్రీతి జంగియాని, కె. విశ్వనాథ్, ముఖేష్ రుషి, మోహన్‌రాజ్, ఆశా షైనీ, జయప్రకాశ్‌రెడ్డి, సత్యప్రకాశ్, హేమంత్ రావణ్, రాఖీ, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, శివాజీరాజా, ముక్కురాజు, నర్రా వెంకటేశ్వరరావు
కథ, స్క్రీన్-ప్లే: చిన్నికృష్ణ
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రాజు
ఫైట్స్: విక్రం ధర్మా
డాన్స్: రాఘవేంద్ర లారెన్స్, బృంద, శ్రీను
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
దర్శకత్వం: బి. గోపాల్
బేనర్: శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11 జనవరి, 2001

'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా'.. సుమారు పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ డైలాగ్‌ని జనం నేటికీ మరచిపోలేదు. ఆ తర్వాత దానికి ఎన్నో పేరడీలు వచ్చాయి. అంతగా జనం నోళ్లలో నానిన, నానుతోన్న డైలాగ్ 'నరసింహనాయుడు' చిత్రంలోనిది. అది చెప్పింది కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 2001లో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా అంతకు మునుపటి డెబ్భై ఏళ్ల తెలుగు చలనచిత్ర బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డుని తిరగరాసింది. అంతేకాదు. నేటివరకు బాలకృష్ణ కెరీర్‌లోనూ అతిపెద్ద హిట్టు 'నరసింహనాయుడు'. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆ సినిమాకి విజయాన్ని చేకూర్చి పెట్టారంటే, అందులో అప్పటివరకు కనిపించని కొత్తదనమేదన్నా వాళ్లకి కనిపించిందా? లేదు. ఈ సినిమాలో అసాధారణ కథ లేదు. ఫార్ములాకి భిన్నమైన కథ కూడా కాదు. పోనీ కథనంలో ఏమన్నా కొత్తదనం వుందా అంటే - అదీ లేదు. మరెందుకు అంత సంచలనాత్మక విజయాన్ని 'నరసింహనాయుడు' సాధించాడు?
సినిమా అనేది సమష్టి కృషి. సినిమా విజయానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. విజయం సాధించే సినిమాకి అన్ని అంశాలూ కలిసొస్తాయి. 'నరసింహనాయుడు' విషయంలో జరిగింది అదే. అయితే ఈ విజయంలో మొదటగా చెప్పుకోవాలసింది నిస్సందేహంగా 'నరసింహనాయుడు' పాత్రనీ, ఆ పాత్రని బాలకృష్ణ పోషించిన తీరునీ. ఆ చిత్ర సంభాషణల రచయితలు పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ తమ 'తెలుగు సినిమా సాహిత్యం' పుస్తకంలో 'నరసింహనాయుడు చిత్రం ఏడు దశాబ్దాల చలనచిత్ర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి కారణం నరసింహనాయుడి పాత్రను తీర్చిదిద్దిన తీరే' అని చెబుతారు. ఆ పాత్రని అలా మలిచిందెవరు? కథా రచయిత చిన్నికృష్ణ. కథతో పాటు సినిమాకి ప్రాణమైన స్క్రీన్‌ప్లేనీ ఆయనే సమకూర్చాడు. తెలుగులో చిన్నికృష్ణకి ఇదే తొలి చిత్రం. అంటే తన మొదటి సినిమాతోటే రికార్డులు సొంతం చేసుకున్నాడు చిన్నికృష్ణ. అదివరకు రజనీకాంత్ సూపర్‌హిట్ తమిళ సినిమా 'పడయప్పా' (తెలుగులో 'నరసింహా') స్క్రిప్టు రచయితల్లో ఒకడిగా ఆయన వెలుగులోకి వచ్చాడు. 'నరసింహనాయుడు' అవకాశాన్ని కల్పించింది అదే. నిజానికి ఆ అవకాశం అనుకోని రీతిలో ఆయనకి వచ్చింది. అప్పటికే పోసాని కృష్ణమురళి కథతో సినిమాని ప్రారంభించారు దర్శకుడు గోపాల్, నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. ఆ కథలో బాలకృష్ణ పోలీసాఫీసర్. అదే గెటప్‌తో ఆయన మీద తీసిన తొలి సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు.
అయితే తర్వాత ఎందుకనో గోపాల్‌కి ఆ కథ నచ్చలేదు. కారణం ఆయన అప్పటికే బాలకృష్ణతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' తీసి ఉన్నాడు. అది పెద్ద హిట్టు కూడా. దానికంటే ఆ కథ గొప్పగా లేదనిపించింది. అప్పుడు 'సమరసింహారెడ్డి' కాలంలోనే తనకి పరిచయమైన చిన్నికృష్ణని పిలిపించాడు గోపాల్. హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చిన్నికృష్ణకు ఓ సంగతి తెలిసింది. "అప్పటికే చాంబర్ బిల్డింగ్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రసిద్ధ రచయితలు విజయేంద్రప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సుందర్ ('పెదరాయుడు' కథారచయిత), పోసాని కృష్ణమురళి ఒక్కో గదిలో ఉండి కథలు చెబుతున్నారు. అందరికంటే నేనే చిన్నవాణ్ణి. అప్పుడు నా వయసు 32 యేళ్లు. నేను గోపాల్‌గారికి ఒకే స్క్రిప్టు చెప్పా. ఆయన పరుచూరి గోపాలకృష్ణగార్ని పిలిపించారు. కథ విన్న ఆయనకి ఓపెనింగ్ సీన్ బాగా నచ్చింది. హీరో ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతూ కొడుకుతో పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రశాంత జీవితం గడపడమనే పాయింట్ కొత్తగా ఉందని చెప్పి, నా కథని ఓకే చేశారు. ఆ తర్వాత బాలకృష్ణగారికీ వినిపిస్తే, ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. 'నరసింహనాయుడు'తో నేను తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యానంటే సగం ఘనత గోపాల్ గారిదీ, సగం ఘనత గోపాలకృష్ణ గారిదీ" అని చెప్పారు చిన్నికృష్ణ. అలా పోసాని కృష్ణమురళి కథ స్థానంలో చిన్నికృష్ణ కథ వచ్చింది.
కథా సంగ్రహం:
రాయలసీమ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక గ్రామానికి పెద్ద రఘుపతినాయుడు (కె. విశ్వనాథ్) అయితే ఇంకో గ్రామం అప్పల్నాయుడు (మోహన్‌రాజ్), అతని బావమరిది కుప్పుస్వామినాయుడు (ముఖేష్‌రుషి) అజమాయిషీలో ఉంటుంది. వాళ్లనుంచి తమ గ్రామాన్ని కాపాడుకోడానికి ఒక సైన్యాన్ని తయారుచేయడం కోసం ఊళ్లోవాళ్లందర్నీ ఇంటికొక బిడ్డని బలిదానం చేయమంటాడు రఘుపతినాయుడు. తన వంతుగా నలుగురు కొడుకుల్లో చిన్నవాడైన నరసింహనాయుణ్ణి దానం చేస్తాడు.
సంవత్సరాలు గడుస్తాయి. నాట్యాచార్యుని అవతారమెత్తిన నరసింహ (బాలకృష్ణ) ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతుంటాడు. అదే ఊళ్లో కుప్పుస్వామినాయుడు కూతురు అంజలి (ప్రీతి జంగియాని) మేనమామ సింహాచలంనాయుడు (జయప్రకాశ్‌రెడ్డి) ఇంట్లో ఉండి చదువుకుంటూ నరసింహని ప్రేమిస్తుంది.
అంజలిని మేనల్లుడైన దివాకర్ (హేమంత్ రావణ్)కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కుప్పుస్వామి. కట్నంగా నరసింహనాయుడు తల కావాలన్న అక్క నాగమణి (తెలంగాణ శకుంతల)కి అలాగేనని వాగ్ధానం చేస్తాడు. అయితే నరసింహనాయుణ్ణి అంజలి ఇష్టపడ్తున్న సంగతి తెలిసి, ఊరువిడిచి వెళ్లమని నరసింహనాయుణ్ణి హెచ్చరించిన సింహాచలంనాయుడు తమ్ముళ్లు, పసివాడైన అతని కొడుకుని పైకి విసిరేస్తారు. దాంతో కొడుకుని రక్షించుకుని, వాళ్లందర్నీ చితగ్గొడతాడు నరసింహనాయుడు. అక్కణ్ణించి వెళ్లిపోవాలని ఆశ్రమం ఖాళీచేస్తాడు. బావతో పెళ్లి ఇష్టంలేని అంజలి కూడా నరసింహ వెళ్తున్న రైలుబండిలోనే ఎక్కుతుంది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారనుకున్న దివాకర్ బృందం రైలుని ఆపేస్తారు. రైలు దిగుతాడు నరసింహనాయుడు. అంతే! అతన్ని చూసీ చూడగానే దివాకర్ బృందం ఆయుధాలు పారేసి, భయంతో పరుగులు తీస్తారు.
అదిచూసి ఆశ్చర్యపోయిన అంజలికి తన గతం చెబుతాడు నరసింహనాయుడు. ఆ గతం.. తండ్రిమీద దౌర్జన్యం చేసిన అప్పల్నాయుణ్ణి హతమారుస్తాడు నరసింహ. అతని కొడుకుల్ని చావగొడతాడు. చేతులూ, కాళ్లూ విరిగిన వాళ్లు తండ్రి చితికి కొరివి పెట్టలేని స్థిలో వుంటే బావమరిది కుప్పుస్వామి వచ్చి కొరివి పెడతాడు. నరసింహ చితి మండేదాకా తాళి, బొట్టు తీయొద్దని అక్క నాగమణితో ఆవేశంతో చెబుతాడు. శ్రావణి (సిమ్రాన్)ని పెళ్లిచేసుకుంటాడు నరసింహ. విదేశాల్లో వున్న అన్నలు పెళ్లికి రాకపోవడంతో వాళ్ల ఫోటోని ఎదురుగా పెట్టుకుని మరీ చేసుకుంటాడు. గుడివద్ద నరసింహ, కుప్పుస్వామి ఒకరికొకరు తారసపడతారు. అంతుచూస్తానన్న కుప్పుస్వామితో "ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే/కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా" అంటాడు నరసింహ.
'నీ మొగుడు నా మొగుణ్ణి చంపాడు' అని నాగమణి చెప్పడంతో భర్త వాస్తవ జీవితం తెలుస్తుంది శ్రావణికి. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అన్నావదినల వల్ల ఎదురైన అవమానాలకు తట్టుకోలేక వారికి ఎదురుతిరిగి మాట్లాడుతుంది శ్రావణి. ఇంటికొచ్చిన నరసింహకి ఆమెమీద పితూరీలు చెబుతారు అన్నావదినలు. దాంతో మనస్తాపం చెందిన నరసింహ వాళ్లకే విలువనిచ్చి శ్రావణిని పుట్టింటికి పంపేస్తాడు. అప్పటికే నిండు చూలాలైన శ్రావణి పుట్టింట్లోనే కొడుకుని కంటుంది. నరసింహ మీద అలిగిన అన్నలు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. కుప్పుస్వామి వల్ల ప్రమాదం వుండటంతో పోలీసుల సాయంతో వెళ్తారు. మరోవైపు మనవణ్ణి చూడాలనుకున్న రఘుపతి తనకు రక్షణగా కొడుకుని రమ్మంటాడు. నరసింహ అన్నలమీద కుప్పుస్వామి మనుషులు దాడిచేస్తారు. విషయం తెలిసి నరసింహ అక్కడికి వచ్చి, తాను గొడ్డలి దెబ్బ తిని కూడా అన్నావదినల్ని కాపాడతాడు. ఈలోగా నరసింహ కొడుకుని చంపాలనుకుని శ్రావణి వద్దకు వెళ్లిన కుప్పుస్వామికి పసివాడు కనిపించడు. కొడుకుని దాచి, తాను కుప్పుస్వామి చేతిలో బలైపోతుంది శ్రావణి. ఆ తర్వాత నరసింహ చేతుల్లో తుదిశ్వాస విడుస్తూ కొడుకుని అతని చేతుల్లో పెట్టి కొట్లాటలకు దూరంగా వుండమని ఒట్టు వేయించుకుంటుంది. తండ్రి కూడా చెప్పడంతో భార్యకిచ్చిన మాటకోసం కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లిపోతాడు నరసింహ. ఇదీ గతం.
వర్తమానానికొస్తే విషయం తెలిసి నరసింహని చంపడానికి అతనింటికి వచ్చిన కుప్పుస్వామికి అంజలినిచ్చి పంపిస్తాడు నరసింహ. అంజలిని 'అమ్మా' అని పిలుస్తున్న అతని కొడుకుని చూసి, ఆ పసిబిడ్డకు అమ్మనివ్వమని నరసింహని వేడుకుంటాడు రఘుపతి. సరేనని కుప్పుస్వామి ఇంటికొచ్చి 'రేపు ఉదయం 10 గంటలకి నాకూ, అంజలికీ వివాహం' అని చెబుతాడు. మరుసటి రోజు చెప్పినట్లే అంజలిని తీసుకెళ్లడానికి వస్తాడు. నరసింహకీ, కుప్పుస్వామికీ ముఖాముఖి పోరు జరుగుతుంది. నరసింహ చేతిలో చావుదెబ్బలు తింటాడు కుప్పుస్వామి. అంజలి హాస్పిటల్లో ఉందని తెలిసి అందరూ అక్కడకు వెళతారు. నరసింహ కొడుకు కోసం తనకి పిల్లలు పుట్టకుండా అంజలి ఆపరేషన్ చేయించుకోవడం చూసి కుప్పుస్వామి పశ్చాత్తాపపడతాడు. అందరూ ఒక్కటవుతారు.
(వచ్చేవారం 'నరసింహనాయుడు' విజయానికి దోహదం చేసిన అంశాలు)
-నవ్య వీక్లి, జనవరి 12, 2011 

Tuesday, January 18, 2011

మూసధోరణులు ఇంకెంతకాలం?

గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు తెలుగులో టీనేజ్ హీరోలు రంగప్రవేశం చేస్తుండటంతో పాతుకుపోయిన హీరోల ఇమేజ్ పునాదులు నెమ్మదిగానైనా కదులుతున్నాయి. పాత కథలు, కొత్తదనంలేని కథనాలు, పాత ముఖాలు  చూసీచూసీ జనానికి కూడా విసుగొస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే కొత్తదనం కోసం, కొత్త కథల కోసం, కొత్త ముఖాల కోసం ఆబగా ఎదురుచూస్తున్నారు.తరుణ్, ఉదయ్‌కిరణ్, సాయికిరణ్ వంటి టీనేజ్ హీరోలు తమకి వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతుంటే అగ్రహీరోలు, ఆ తర్వాతి స్థాయి హీరోలు తమ స్థానాల్ని పడిపోకుండా చూసుకోడానికి నానా పాట్లూ పడుతున్నారు.
కొత్త కథలు సృష్టించడం మనవాళ్లకి ఒక అరుదైన సందర్భంగా మారిపోయింది కాబట్టి కనీసం కథనంలోనైనా కొత్తదనాన్నీ, చాకచక్యాన్నీ చూపించి 'సినిమా భలేగా ఉంది' అనిపించగల సత్తా కూడా మనవాళ్లలో మృగ్యమై పోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాల్లో కథలు సహనానికి పరీక్ష పెట్టడం సాధారణ విషయమైపోయింది. వాటిల్లో కృత్రిమత్వం తప్ప సహజానుభూతులు ఏమాత్రం వుండటంలేదు. వాటికి భారీ నేపథ్యాలూ, డబ్బూ ఖర్చుపెట్టి ప్రేక్షకుల మీదికి వదిలేస్తున్నారు. ఆ చిత్రాల్లో పాటల చిత్రీకరణగానీ, వాటి ట్యూన్లుకానీ మరీ నాసిరకంగా వుంటున్నాయి. కొన్ని పాటల్ని చూస్తే- అవేం పాటలో, ఎందుకలా వున్నాయో అసలు అర్థంకాదు. సాక్ష్యం కావాలంటే 'ప్రేమతో రా', 'భలేవాడివి బాసూ', 'ఆకాశవీధిలో' పాటల్ని చూడవచ్చు.
పెద్ద హీరోల చిత్రాల్లో డాన్సులూ, ఫైట్లూ లేకపోతే జనం చూడరనే ఓ 'గట్టి' నమ్మకం మనవాళ్ల మెదళ్లలో పీటవేసుకు కూర్చుంది. అందుచేత కథకులు కూడా కథ డిమాండ్ చేసినా, చేయకపోయినా మధ్యమధ్యలో ఫైటింగ్ వచ్చే సీన్లని 'క్రియేట్' చేస్తుంటారు. మన డైరెక్టర్లకి కథమీద పట్టున్నా ఒక్కోసారి అదుపుతప్పి పడిపోయి హైటెక్ యాక్షన్ సీన్లని సృష్టించే భారం స్టంట్ డైరెక్టర్ల మీద వొదిలేస్తారు. ఆ చాన్స్ కోసమే చూసే సదరు 'డిష్యుం.. డిష్యుం' డైరెక్టర్లు హీరోగారి హీరోయిజాన్ని ఎక్స్‌పోజ్ చేయించడానికి రకరకాల ఫైట్లు చేయిస్తారు. అయితే ఈ ఫైట్లతో ఎంత అదరగొడితే ఏం లాభం? జనం ఫైట్లు చూడ్డానికి మాత్రమే వచ్చే రోజులు ఎనిమిదో దశకం తొలిభాగంతోనే పోయాయి. ఇవాళ టీవీ అతి చౌక వినోద సాధనంగా రూపుదాల్చింది. సినిమాలేమో జేబుకి బరువవుతున్నాయి. దీన్ని కొంతవరకు భరించగలరేమో కానీ బుర్రలకి కూడా భారంగా తయారైపోతే ఎలా భరిస్తారు? ప్రేక్షకుల అభిరుచులు గతంలోలా లేవు. చిత్రంలో సత్తా లేకపోతే మొహమాటం లేకుండా తిప్పికొట్టడం అలవాటు చేసుకున్నారు వాళ్లు. అందుకే దర్శకులు మరింత ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో అలనాటి మేటి దర్శకుడు బి.ఎన్. రెడ్డి ఇప్పటి దర్శకులకి మార్గదర్శకునిగా నిలుస్తారు. ఎప్పటికప్పుడు ఇతివృత్తాల్లో నూతనత్వం చూపించి ప్రయోగాలు చేయడంలో ఆయనను మించినవారు లేరు. ప్రయోజనాల్ని ముందుకుతెచ్చి సినిమాని ప్రతిభావంతమైన మాధ్యమంగా నిరూపించే ప్రయత్నం చేశారాయన. ఆయన చిత్ర నిర్మాణ పద్ధతికి స్క్రిప్టు ఆయువుపట్టుగా వుండేది. ప్రతి చిన్న వివరంతో సహా కెమెరా మూవ్‌మెంట్, నటీనటుల కదలికలు అన్నీ ప్రతిషాట్‌కు సంబంధించి స్క్రిప్టులో రాసుకునేవారు. అందుకే ఆయన చిత్రాల్లో పరిపక్వత అడుగడుగునా గోచరిస్తుంది. ఇప్పటి దర్శకుల్లో ఆ ఓపిక ఏమాత్రం కనిపించదు.
సినిమా అనేది శక్తివంతమైన ఓ కళాసాధనం. దాన్ని ఉపయోగించడం తెలీకపోతే అది వికృతంగా తయారవుతుందని ఎన్నో చిత్రాలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఈ నిజాన్ని మనం గమనించాం. ఎప్పటికప్పుడు మూసధోరణి సినిమాల వల్లే చిత్రసీమకు సంక్షోభాలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ మూసధోరణిని చీల్చుకుంటూ ఓ కొత్తచిత్రం వస్తే అదే ట్రెండులో మళ్లీ మూసచిత్రాలు తయారవడంతో పరిశ్రమకు గడ్డుకాలం స్థిరపడిపోయింది. ఇప్పుడు నడుస్తోంది ప్రేమ చిత్రాల ట్రెండు - అదీ టీనేజ్ ప్రేమ కథాచిత్రాల వరకే. అందరూ ఒకే మూసలో సినిమాలు తీస్తుంటే జనం ఎన్ని ప్రేమల్ని చూస్తారు? వాటిలో కొత్తగా అనిపించిన 'నువ్వు-నేను', 'సంపంగి', 'ఖుషి' వంటి కొన్ని చిత్రాల్నే ఆదరించి మిగతా వాటిని డబ్బాలు సర్దేసుకొమ్మని చెప్పేశారు. కథనే నమ్ముకుని పకడ్బందీగా చిత్రాన్ని రూపొందిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని గత ఏడాది వచ్చిన 'క్షేమంగావెళ్లి లాభంగా రండి' రుజువుచేసింది. కథ పాతదే అయినా అందులోని పాత్రల్లో తమని ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఆ చిత్రానికి ఊహించనంత విజయాన్ని చేకూర్చిపెట్టారు. ఈ ఏడాది ఇలాంటి డిఫరెంటు చిత్రం (ప్రేమ మూసలో) రాలేదు.
నవతరం నటులు ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ ముందుకు సాగిపోతుండబట్టే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నవవసంతంలా వెల్లివిరుస్తోంది. పవన్‌కల్యాణ్, మహేశ్ ఇదివరకే తమని తాము ప్రూవ్ చేసుకుంటే తరుణ్, ఉదయ్‌కిరణ్ కూడా రెండేసి హిట్లు ఇచ్చి తమనీ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నవతరం నటుల మధ్యే ఎంత కాదనుకుంటున్నా పోటీవచ్చి చేరుతుంటే అగ్ర కథానాయకులు తమ స్థానాన్నీ, ఇమేజ్‌నీ నిలబెట్టుకోవాలంటే మరింత కష్టపడక తప్పదు. ఒకే తరహా పాత్రలవల్ల, కథలవల్ల జనం మొనాటనీ ఫీలవుతుండటం చేతనే ఇటీవల పెద్ద హీరోల చిత్రాలు ఎక్కువ శాతం అపజయం పాలయ్యాయి. ఈ ఏడాది అగ్రహీరోల చిత్రాలు పది విడుదలైతే అందులో రెండు మాత్రమే ('నరసింహనాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్') విజయం సాధించాయ్. అంటే విజయ శాతం కేవలం 20 మాత్రమే. 80 శాతం చిత్రాలు అపజయం పొందాయన్నమాట. పరిశ్రమకి ఇదెంతమాత్రమూ క్షేమకరం కాదు. ఎందుకంటే ఇవి భారీ బడ్జెట్‌తో తీసే చిత్రాలు. అవి ఫెయిలైతే నిండా మునిగిపోయేది బయ్యర్లు. అందుచేతనే ఇప్పుడు బయ్యర్ల దృష్టి స్టార్లమీద కాకుండా క్రేజీ హీరోల మీదనే ఎక్కువగా పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తదనానికే ప్రాముఖ్యమిచ్చే విధంగా పెద్ద హీరోలు తమ కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలి. కొత్తదనమంటే అనవసరపు రిస్క్ తీసుకొమ్మని కాదు. కొత్తదనమంటే అందరికీ అహ్లాదాన్ని పంచే టానిక్‌లాగుండాలి తప్ప చేదు మాత్రలా వుండకూడదు. ఇక్కడే పెద్ద హీరోలు తమ దృష్టిని కేంద్రీకరించి సహజంగా అనిపించే కథల్ని ఎంచుకుని అందులో నవ్యతకి ప్రథమ స్థానం కేటాయిస్తే పరిస్థితులు మెరుగవుతాయి. వాళ్లమీద ఆధారపడ్డ అనేకమంది సర్వైవ్ అవుతారు.
-ఆంధ్రభూమి డైలీ, 28 సెప్టెంబర్ 2001

Saturday, January 8, 2011

హిట్.. హిట్.. హుర్రే...! (కొత్త శీర్షిక ప్రారంభం)

ఓ దశాబ్దపు సూపర్‌హిట్ సినిమాల విశ్లేషణ 
ఏ సినిమా హిట్టవుతుంది? ఏ సినిమా ఫట్టవుతుంది? చిత్రసీమలోని అత్యధిక శాతం మందికి అంతుచిక్కని ప్రశ్న ఇది. 'మినిమం గ్యారంటీ' అనుకున్న సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద కుదేలైన సందర్భాలెన్నో. 'హిట్ సినిమాకి ఇదీ ఫార్ములా' అని చాలామందే చెప్పారు. స్క్రిప్టుని 'యాక్ట్-1', 'యాక్ట్-2', 'యాక్ట్-3' అనే మూడు భాగాలుగా విభజించి, ఏ యాక్ట్‌లో కథ ఏ తరహాలో నడవాలో సూచించారు. కానీ ఎవరైతే ఈ పాఠాలు చెప్పారో, వాళ్ల సినిమాలు సైతం ఫ్లాపయ్యాయి. మరైతే గ్యారంటీగా హిట్ సినిమా తీయడం ఎలా? అనేవి ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక దశాబ్ద కాలంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న, అలరించిన సినిమాలను ఓసారి పరికించి, పరిశీలిస్తే.. ఆ కిటుకేమన్నా తెలుస్తుందా? ఫలానా సినిమా ఎందుకు హిట్టయ్యిందో, ఆ సినిమాలోని బలాలేమిటో, వాటితో ప్రేక్షకులు ఎందుకు సహానుభూతి చెందారో విశ్లేషిస్తే.. చాలా సంగతులు అర్థమవుతాయి. పైకి అవి చాలామందికి తెలిసినట్లే అనిపిస్తాయి. కానీ సన్నివేశాల కల్పనలో తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. సినిమా విజయానికి కథతో పాటు కథనం అనేది అత్యంత కీలకమైన అంశం. బిగువైన కథనం (గ్రిప్పింగ్ నెరేషన్) కావాలంటే బలమైన సన్నివేశాలే ఆధారం. ఆ సన్నివేశాల్ని తెరమీద ప్రతిభావంతంగా ఆవిష్కరించడం అంతకంటే ప్రధానం. ఇందుకు తెరపైన కనిపించే అభినయ సామర్థ్యంతో పాటు తెరవెనుక సాంకేతిక నైపుణ్యమూ కీలకమే. అలా అన్నీ కుదిరి అమోఘమైన విజయాలు చవిచూసిన సినిమాల గురించిన విశ్లేషణే ఈ 'హిట్.. హిట్... హుర్రే..!' శీర్షిక ఉద్దేశం.
2001 నుంచి 2010 వరకు ఓ దశాబ్దకాలంలో వచ్చిన చిత్రాల్లో కొన్నింటిని ఏరి, అవి ఆ స్థాయి విజయాల్ని సాధించడంలో ఏయే అంశాలు దోహదం చేశాయో వివరించే ఈ ప్రయత్నంలో విజయవంతమైన అన్ని చిత్రాల్నీ స్పృశించడం కుదిరేపని కాదు. అది ఉద్దేశపూర్వకంగా చేసేదిగా భావించవద్దని ఆయా సినిమాలకు పనిచేసినవారికి మనవి. ఇందులో విశ్లేషిస్తున్న సినిమాలకు సంబంధించి, వాటికి పనిచేసిన కొంతమంది అనుభవాలు, అభిప్రాయాలు సైతం పొందుపరుస్తున్నాం. దీనివల్ల ఆ విశ్లేషణకు మరింత నిండుతనం చేకూరుతుందని నమ్మకం. 2001లో తొలి బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచి, వసూళ్లపరంగా అప్పటివరకు ఉన్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసిన 'నరసింహనాయుడు' సినిమాతో ఈ విశ్లేషణని ప్రారంభిస్తున్నాం. సినిమాపట్ల ఆసక్తీ, అభిరుచీ వున్న వారందర్నీ ఈ శీర్షిక ఆకట్టుకుంటుందనే నమ్మకంతో..
-నవ్య వీక్లి, జనవరి 5, 2011

Friday, January 7, 2011

కొత్తదనం హోరులో క్వాలిటీ మాయం

ఒక నిర్మాత కొత్తవాళ్లతో సినిమా మొదలుపెట్టి 'కొత్తదనం కోసమే నా చిత్రంలో కొత్తవాళ్లని పరిచయం చేస్తున్నా' అంటాడు. ఇంకో దర్శకుడు 'పాత్రలు కనిపించాలే తప్ప నటులు కనిపించకూడదని కొత్తవాళ్లని ఎంచుకున్నా' అని చెబుతాడు. వాళ్ల దృష్టిలో సినిమాకి నూతనత్వం కొత్త నటులవల్లనే వస్తుందని. ఇదెంతవరకు వాస్తవం? తరచి చూస్తే ఇందులో నిజం పాక్షికంగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది. సినిమాకి కొత్తదనం కేవలం కొత్త నటులవల్లనే రాదు. ట్రీట్‌మెంట్‌లో నూతనత్వం వుండాలి. అప్పుడే ఏ సినిమా అయినా కొత్త తరహాగా తోస్తుంది ప్రేక్షకులకి. ఇప్పుడే కాదు అనాది కాలం నుంచే ఈ సత్యం ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది.
ఉదాహరణలకి మరీ పూర్వపు చిత్రాల జోలికి వెళ్లకుండా చిరంజీవి తరం నుంచే తీసుకుందాం. 'ఖైదీ'కి ముందుగా చిరంజీవి అనేక చిత్రాలు చేసి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. 'ఖైదీ' చూస్తే వయొలెన్సు, పగ, ప్రతీకారాల నడుమ ఆ సినిమా కథ నడుస్తుంది. అయితే తీసే విధానం, అందులోని పాటల చిత్రీకరణ నవ్యతతో కూడుకుని వున్నందున ప్రేక్షకులు ఆదరించారు. 'రగులుతోంది మొగలి పొద..' పాట చిత్రీకరణ అద్భుతంగా వుందని మెచ్చుకోనివాళ్లు అరుదు. ట్రీట్‌మెంట్ పరంగా చూసినా అందులో క్షణం క్షణం ఉత్కంఠతని నదిపించడంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మంచి పరిణతిని కనబర్చాడు. ఇదే ఆ చిత్రానికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టి 'ట్రెండ్‌సెట్టర్' ముద్రని వేసుకోగలిగింది.
కామెడీ చిత్రాలంటే మనకి మొదట్నించీ ఓ చిన్న చూపుంది. వాటిని మనం రెండవ శ్రేణి చిత్రాలకిందే జమకట్టడం అలవాటు చేసుకున్నాం. అయితే అలాంటి హాస్య చిత్రాల్లో అరుదైన చిత్రంగా 'లేడీస్ టైలర్'ని పేర్కొనవచ్చు. 'తొడమీద పుట్టుమచ్చ' అన్న పాయింట్ నేపథ్యంలో తీసిన ఆ చిత్రంలో ఆద్యంతమూ హాస్యం, సున్నిత శృంగారం పోటీపడి నడుస్తాయి. దర్శకుడు వంశీ ఒక సరికొత్త తరహా హాస్యాన్ని ప్రేక్షకులకి అందించినందునే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అందులో హీరో రాజేంద్రప్రసాద్. ఆయన కొత్తవాడేమీ కాదు. వంశీయే తీసిన 'అన్వేషణ' సస్పెన్స్ చిత్రాల్లోనే కొత్త ఒరవడిని సృష్టించింది. అందులో హీరో హీరోయిన్లు కార్తీక్, భానుప్రియ అప్పటికే ఎన్నో సినిమాలు చేశారు.
మొదట్నించీ తెలుగులో ప్రేమ కథాచిత్రాలకు కొదవలేదు. అయినా 'గీతాంజలి' కొత్తగా ఎందుకు అనిపించింది? అందులో చెప్పిన పాయింట్ కొత్తగా వుంది. చిత్రీకరణలో నవ్యత వుంది. ఒక దృశ్యకావ్యం అనిపించుకోగల లక్షణాలన్నీ అందులో ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం కానీ, హీరో నాగార్జున కానీ కొత్తవాళ్లు కాదు. అయినా ఆ చిత్రం కొత్త తరహా చిత్రాల కోవకే చెందుతుందని అప్పట్లో అందరం ఒప్పుకున్నాం. అట్లాగే 'శివ'. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక ట్రెండుని సృష్టించిన ఆ చిత్రంలో ప్రతి ఫ్రేములోనూ కొత్తదనాన్ని ఆస్వాదించాం. దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్తవాడే కావచ్చు కానీ హీరో హీరోయిన్లిద్దరూ పాతవాళ్లేగా.
'ఖుషి' సంగతి చూసినా అంతే. పవన్‌కల్యాణ్ కొత్తవాడు కాదు. అయినా చిత్రం అంతా కొత్తదనమే. అదంతా దర్శకుడు యస్.జె. సూర్య పనితనం. ప్రతి సన్నివేశాన్నీ పాత మూసధోరణితో తీయకుండా కొత్తగా, 'సహజంగా జరుగుతుంది' అనిపించేలా తీశాడు. డైలాగులూ అంతే. కొత్త తరహాగా తోస్తాయి. అందుకనే 'ఖుషి' ఒక కొత్త సెన్సేషన్ అయ్యింది.
'నువ్వే కావాలి', 'నువ్వు నేను' కొత్తవాళ్లతో తీసి ఘన విజయాల్ని సొంతం చేసుకున్న చిత్రాలే. దాన్నెవరూ కాదనలేరు. సినిమాలు ఫ్రెష్‌గా ఉండటానికి వాటిలోని హీరో హీరోయిన్లు కొత్తవాళ్లయి వుండటం కూడా దోహదం చేస్తుందనడంలో ఎవరికీ అభ్యంతరం వుండదు. వాటిలోని సబ్జెక్టుకి కొత్తవాళ్లయితే సరిగ్గా వుంటుంది కాబట్టి వాటికి వాళ్లని ఎంచుకున్నారు. కాలేజీ స్టూడెంటుగా పవన్‌కల్యాణ్‌నీ, మహేశ్‌నీ మినహాయించి వెంకటేశ్, నాగార్జున వంటివాళ్లని మనం చూడలేముగా. అయితే మన అభ్యంతరం దానికి కాదు. ఇప్పుడు అనేకమంది నిర్మాతలు (వాళ్లలో కొత్తవాళ్లు చాలామందే వున్నారు) కొత్తవాళ్లతో సినిమాలు తీస్తూ కొత్తదనం కోసమే అలా చేస్తున్నామని చెబుతుండటం అభ్యంతరకరం. కొత్త నటుల ప్రవేశాన్ని విమర్శించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆ వచ్చే కొత్తవాళ్లలో క్వాలిటీ తక్కువగా కనిపిస్తున్నదనేదే ఇక్కడ పాయింటు.
హీరో హీరోయిన్లు అందంగా కనిపించినంత మాత్రాన చాలదు. హావభావ ప్రకటనలో పరిపక్వత వుందా లేదా అన్నది అతి ముఖ్యం. ఇవాళ పరిచయమవుతున్న హీరోలు చాలామందిలో ఈ పరిపక్వత ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం దిష్టిబొమ్మలుగా మాత్రమే కనిపిస్తున్నారు. లోపం ఆ నటులది కాదంటే వేలు దర్శకులవైపు చూపించాల్సి వస్తుంది. నటుల నుంచి నటనను రాబట్టాల్సింది వాళ్లే కాబట్టి. 'నటించడం'లో నటుడు ఫెయిలయ్యాడంటే ఆ భాధ్యతలో సగం వంతు దర్శకుడిదే. ఆకాశ్, సంతోష్, సతీశ్, శ్రావణ్, సచిన్, దిలీప్, పవన్‌కుమార్, రోహిత్.. ఇలా హీరోల జాబితా.. జయలక్ష్మి, వనియా, అంజలి, మితిక, సునీత, రాజీ, అర్చన, కాంచీకౌల్.. ఇలా హీరోయిన్ల జాబితాకి అంతుండదు. వీళ్లలో నటులుగా ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్లలో ఒక్కరు కూడా అవుపించరు. ఆకాశ్, రోహిత్, జయలక్ష్మి, కాంచీకౌల్ వంటి అతికొద్ది మందికి మాత్రమే ఒకటికంటే ఎక్కువ సినిమాల్లో చాన్సులు వస్తున్నా వాళ్లెంతవరకూ నిలదొక్కుకోగలరన్నది ప్రశ్నార్థకమే. నటనపరంగా వాళ్లు నేర్చుకోవలసింది చాలా వుంది.
ఇదిలా వుంటే కొత్తనటులతో సినిమాలు తీయడంవల్ల సినిమా బడ్జెట్‌ని అనుకున్న తీరులో పరిమితం చేసుకోవచ్చనే వాదనే ఎక్కువ బలంగా వినిపిస్తోంది. కొంతమంది కొత్తతారలు తెరమీద కనిపించిందే చాలనే ధోరణితో పారితోషికం కూడా అడగకపోవడంతో అది నిర్మాతలకు వరంగా మారుతోంది. పైగా కొత్తతారలయితే తమ పాత్ర 'అలా వుండాలి ఇలా వుండాలి' అనే డిమాండ్ చేయరు. ముందనుకున్న ప్రకారంగానే కథని లాగించేయవచ్చు. అదే పెద్ద హీరోలైతే అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారు. అన్నింటికీ మించి బడ్జెట్ - ముందనుకునేదొకటి, తర్వాత అయ్యేదొకటి. ఈ బాధలెందుకని ఇప్పుడు నిర్మాతలు పది, ఇరవై లక్షల్లో సినిమాలు ఎడాపెడా తీసేసి ఆనక బయ్యర్లు లేక నానాతంటాలు పడుతున్నారు. బయ్యర్లు మాత్రం ఏంచేస్తారు? బేనర్ మంచిదా కాదా - దర్శకుడు గట్టివాడా, కాదా - చూసుకున్నాకే కదా కొనడానికి ముందుకొచ్చేది! పెద్ద హీరో చిత్రమైతే ఇవికూడా చూడరు. అందుకే - నిర్మాత కావాలనుకునేవాళ్లు కొత్తవాళ్లని పరిచయం చేసేప్పుడు 'క్వాలిటీ'ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.
-ఆంధ్రభూమి డైలీ, 21 సెప్టెంబర్ 2001 

Sunday, January 2, 2011

గ్రాఫిక్స్ మాయాజాలానికి కాసులు రాలుతాయా?

కొత్తదనం చూపించాలనే యావలో ప్రేక్షకుణ్ణి పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో ఈ ఏడాది విడుదలైన ముగ్గురు పెద్ద హీరోల చిత్రాలు నిరూపించాయి. ఇక్కడ కొత్తదనం అనే మాట వాడింది గ్రాఫిక్స్ విషయంలోనే తప్ప ట్రీట్‌మెంట్ విషయంలో కాదు. సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రవేశించాక దర్శకుడి పని సులువైంది. అతడి మనసులోని ఊహకి దృశ్యరూపం ఇవ్వడానికి గ్రాఫిక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. హాలీవుడ్‌లోని ప్రతి అగ్ర దర్శకుడూ గ్రాఫిక్స్‌నే నమ్ముకుని చిత్రాలు రూపొందిస్తున్నారంటే అందుకు కారణం అక్కడి వాళ్లు భారీతనాన్నీ, కొత్తదనాన్నీ ఇష్టపడతారు కాబట్టి. అయితే మన తెలుగు ప్రేక్షకుల టేస్ట్ అటువంటిది కాదు. ఇక్కడ మానవ సంబంధాలే ముఖ్యం. ఆ మానవ సంబాంధాల మీద అల్లిన కథలో భారీతనం, కొత్తదనం మిళితమై వుంటే వాళ్లు ఆదరించకుండాపోరు. కానీ కథలో మానవ సంబంధాలకి ప్రాధాన్యత తక్కువై భారీతనానికీ, కృత్రిమత్వానికీ పెద్ద పీట వేస్తే మనవాళ్లు ఆదరించరు. ఈ సంగతి చిరంజీవి 'మృగరాజు', వెంకటేశ్ 'దేవీపుత్రుడు', నాగార్జున 'ఆకాశవీధిలో' నిరూపించాయి.
మూస ధోరణిలో తెలుగు సినిమా కథ నడుస్తున్నందువల్ల కంప్యూటర్ గ్రాఫిక్స్‌ని ఉపయోగించుకుంటూ కొత్త కథల్ని సృష్టించి ప్రేక్షకుల్ని రంజింప చేయవచ్చని మొదట్లో అంతా అనుకున్నారు. 'బొబ్బిలి రాజా' సినిమాలో తొలిసారి కంప్యూటర్ గ్రాఫిక్స్‌ని ఉపయోగించినప్పుడు 'ఇదేదో బావుందే' అనుకున్నారు. 'ఆదిత్య 369', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'భైరవ ద్వీపం' వంటి చిత్రాల్లో ఉపయోగించిన గ్రాఫిక్ వర్క్ కథలో మిళితమవడంతో వాటికీ ఆదరణ లభించింది. పైగా వాటి నిడివి కూడా తక్కువ కాబట్టి జనం వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే ఎప్పుడైతే 'అమ్మోరు' చిత్రం విడుదలై, మంచి విజయం సాధించిందో అప్పట్నించి మనవాళ్లకి ఈ గ్రాఫిక్స్ మీద మోజెక్కువ అయ్యింది. అంతదాకా పాటల వరకే పరిమితమై ఉన్న గ్రాఫిక్స్‌ను 'అమ్మోరు'తో కథని నడిపించడానికి వాడుకొని కొత్త ఒరవడిని మొదలుపెట్టారు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ. ఈ చిత్ర విజయం తెలుగులో సినిమా నిర్మాణాన్ని బాగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. 'అమ్మోరు'తో గ్రాఫిక్స్‌కి బాగా పేరు తెచ్చిపెట్టిన నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి మరోసారి గ్రాఫిక్స్‌నే నమ్ముకొని చిరంజీవితో 'అంజి' సినిమాని ప్లాన్ చేశారు. చాలాకాలం క్రితం ఆర్భాటంగా మొదలుపెట్టిన ఈ చిత్ర నిర్మాణం హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడే దీని నిర్మాణ వ్యయం 25 కోట్ల రూపాయలని వార్తలొచ్చాయి. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయినా చిరంజీవిదే 'మృగరాజు' విడుదలై చాలా నిరాశపరిచింది. ఇందులో విలన్ అయిన సింహాన్ని కంప్యూటర్ మీద తయారుచేసి కథకి 'అతకడం'తో అది నిజమైన సింహం కాదనీ, 'అతుకు సింహం' అనీ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. 'అతుకు సింహం'తో చిరంజీవి ఫైట్లు చేస్తుంటే జనానికి ఏం నచ్చుతుంది? అలా సింహంతో కూడిన గ్రాఫిక్స్ మీద ఎక్కువ శ్రద్ధపెట్టి కథ మీద ఏకాగ్రతని చూపించకపోవడంతో 'మృగరాజు' నీరసించిపోయాడు.
'దేవీపుత్రుడు' నిర్మాణంలో వున్నప్పుడు అందులోని గ్రాఫిక్ వర్క్ గురించి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు నిర్మాతా దర్శకులు. దాంతో ఆ చిత్రంలోని గ్రాఫిక్స్‌పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. చిత్రం విడుదలయ్యాక చూస్తే వాళ్ల అంచనాలకు తగ్గట్లు అందులో గ్రాఫిక్ వర్క్ లేదు. పైగా కృతకంగా అనిపించింది. తల్లి కడుపులోంచి పాప బయటకువచ్చి ఆ తల్లితో మాట్లాడుతుంటే దాన్ని సహజమని ఎట్లా అనుకుంటారు? ఆ 'మహిమ'ని ఎట్లా జీర్ణం చేసుకుంటారు? గతంలో 'దేవీపుత్రుడు' నిర్మాత ఎమ్మెస్ రాజు 'దేవి' అనే సినిమాని గ్రాఫిక్స్ నేపథ్యంలోనే తీశారు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ కుదురుగా వుండటంతో కథకి గ్రాఫిక్స్ సరిపోయి నటీనటుల బలం లేకుండానే ఆ చిత్రం విజయం సాధించింది. తన చిత్రాల్లో స్క్రిప్టుకే ప్రాధాన్యత అని చెప్పుకునే ఎమ్మెస్ రాజు 'దేవీపుత్రుడు' విషయానికొచ్చేసరికి గ్రాఫిక్స్‌ని హైలైట్ చేశారు. సముద్ర జలాల్లో మునిగిపోయిందని భావించే ద్వారకానగరంలో కథని నడిపించే క్రమంలో ఆ చిత్రంలో గ్రాఫిక్స్‌ని ఉపయోగించారు. కథాకథనాల్ని గ్రాఫిక్స్ డామినేట్ చేయడంతో ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. 17 కోట్ల రూపాయల పెట్టుబడికి వచ్చినదెంతో నిర్మాతకే తెలియాలి. ఈ ఏడాది వెంకటేశ్‌తోటే 'ఆదిశేషు' అనే చిత్రాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో నిర్మిస్తానని ఎమ్మెస్ రాజు పోయిన ఏడే చెప్పారు. దాని ఊసు ఇప్పుడెక్కడా వినిపించడం లేదు.
పోతే 'ఆకాశవీధిలో' కథ లేదనీ, కథనం గాడి తప్పిందనీ చిత్ర విమర్శపై అవగాహన లేని వాళ్లు సైతం చెబుతారు. ఇందులో 'స్పెషల్ ఎఫెక్టు'లే ఎక్కువ. విమానం బదులు విమానం సెట్టునే వేసి క్లైమాక్స్‌ని నడిపించాలనే 'గొప్ప ఆలోచన' ఎవరికి వస్తుంది? ఈ చిత్ర దర్శకుడికి తప్ప. ఆకాశంలో ఎగిరే విమానాన్ని 'మంత్ర'లో తయారుచేసి చూపించేసరికి మన కళ్లకి అది బొమ్మ విమానంగానే కనిపించడం, 'గ్రాఫిక్స్ అంటే ఇంతేనా' అనే తేలిక భావన ఏర్పరచుకోవడం మన తప్పేమీ కాదు. ఎలుగుబంటిని తప్పించుకునే క్రమంలో హీరో హీరోయిన్లు కొండమీదకి దూకి పారాషూట్ సాయంతో ఆకాశంలోనే కావలించుకోవడం - గ్రాఫిక్ వర్క్‌కి మచ్చుతునక అని ఎవరూ అనకపోవడం చూసి దర్శక నిర్మాతలు బాధపడే వుండాలి. హైజాక్‌కి గురైన విమానం కిందికి హీరో ఎయిర్‌క్రాఫ్ట్ వేసుకు వెళ్లే సీనుని 'క్యా సీన్ హై' అని ఈలలు వేయకపోవడం మన తప్పేనని వారు అనగలరు కూడా.
వీటిని బట్టి ఒక సంగతి మన అర్థం చేసుకోవచ్చు. చిత్ర నిర్మాణం కోసం నిర్మాత ఎంత ఖర్చుపెట్టాడు, దర్శకుడు ఎంతగా గ్రాఫిక్స్‌ని చొప్పించాడు అన్నది ప్రేక్షకులకి అవసరం లేదు. ఎక్కువ ఖర్చుపెట్టి సినిమా తీసి థియేటర్లో టికెట్ల రేట్లు పెంచితే లాభాలు దండిగా వస్తాయని భావించడం భ్రమ. ప్రేక్షకుడికి కావలసింది భారీతనాలూ, కథలో మిళితం కాని కృతక గ్రాఫిక్సూ కాదు. వినోదాన్ని పంచే మంచి కథాచిత్రం కావాలి. ఆ కథలో భారీతనం వున్నా, గ్రాఫిక్స్ ఉన్నా అభ్యంతరం లేదు. అయితే అవి ఆ కథలో ఒక భాగంగానే వుండాలి తప్పితే కథే వాటిమీద ఆధారపడేట్లు వుండకూడదు. కథలో గొప్ప సందేశం ఇవ్వకపోయినా పట్టింపులేదు. మానవ సంబంధాల్ని రసవంతంగా నడిపించగలిగితే చాలు. అలా చేస్తే కోటి రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టి తీసిన చిత్రాన్ని 20 కోట్లు ఆర్జించిపెట్టే బాక్సాఫీసు రికార్డు చిత్రంగా చూపించడానికి ప్రేక్షకులు సిద్ధంగానే వుంటారు.
-ఆంధ్రభూమి డైలీ, 14 సెప్టెంబర్ 2001