Saturday, April 26, 2014

Telugu Cinema After Independence

1947 తర్వాత తెలుగు సినిమా
ఈ శతాబ్దంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మాధ్యమంగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ యాభైయ్యేళ్ల తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలిస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికొచ్చేది నిర్మాణమవుతున్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతి యేటా తెలుగులో సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అసలు ఉండటం లేదు. అయితే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బి.ఎన్. రెడ్డి, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు వంటి మహానటులూ, రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లూ, కాంచనమాల, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి మహా నటీమణులూ, గూడవల్లి రామబ్రహ్మం, సి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్ వంటి దిగ్దర్శకులూ మనకి లభించారు.
మొదట్లో - అంటే ఆరవ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు బహు తక్కువ. గూడవల్లి రామబ్రహ్మం తీసిన 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటివి అందుకు మినహాయింపు. అయితే 'దేవదాసు', 'పాతాళభైరవి', 'మాయాబజార్', 'మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ చిత్రాలు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర కథానాయకులుగా నిలిచారు. నటీమణుల్లో భానుమతి, సావిత్రి అగ్ర స్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించిన భానుమతి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు. 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళ భైరవి' బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన సామాజిక ప్రయోజనాత్మక చిత్రం 'రోజులు మారాయి' అఖండ విజయం సాధించి ఆ తరహా సినిమాలకు తలమానికంగా నిలిచింది.
స్వాతంత్ర్యానికి పూర్వం వ్యాపారాత్మక దృష్టితో తీసిన సినిమాలు మనకు కనిపించవు. 1950లో వచ్చిన విజయా వారి సినిమా 'షావుకారు'తో ఈ వ్యాపార పోకడలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో నటిగా పరిచయమైన జానకి, దానితోటే 'షావుకారు జానకి'గా మారిపోయారు. 1963లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అప్పట్లో టిక్కెట్ ధరలు 25 పైసలు నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో ఈ సినిమా ఒక కోటి రూపాయలు వసూలు చేసి, ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం పొందింది. ఇదే ఏడాది రూపొందిన 'నర్తనశాల' అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మొదటి తెలుగు చిత్రంగా పేరు తెచ్చుకుంది. జకార్తాలో జరిగి ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాలో కీచకునిగా ఎస్వీ రంగారావు చూపించిన అభినయం ఆ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుల్ని అమితంగా ఆకట్టుకుంది. అలా ఒక అంతర్జాతీయ సినిమా వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఎస్వీఆర్.
తొలి సాంఘిక వర్ణ చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. అదివరకు 'పదండి ముందుకు'లో చిన్న పాత్రలో కనిపించిన కృష్ణ హీరోగా పరిచయమయ్యింది దానితోటే. అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలు రాజ్యం చేస్తూ ఉంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారత చలన చిత్రసీమలోనే తొలి జేమ్స్‌బాండ్ తరహా సినిమాగా రికార్డులకెక్కింది. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి వెలువడటం మరో విశేషం. ఆ తర్వాత కాలంలో ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు సమాన ఆదరణ పొందుతూ వచ్చాయి. ఏడవ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమా ప్రభావం తెలుగు సీమకీ సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు తీయడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువుల కింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' (1972), 'చలిచీమలు' (1978) వంటి అభ్యుదయ చిత్రాలూ, 'తూర్పు వెళ్లే రైలు' (1979), 'నీడ' (1979) వంటి ప్రయోగాత్మక చిత్రాలూ కొన్ని వచ్చాయి. మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' (1971) వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్రే. ఇందులో హీరోగా నటించిన కృష్ణ 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ పతాకంపై 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని నిర్మించి ఆ పాత్రలో తానే నటించించాడు. ఇది తెలుగులో పూర్తిస్థాయి తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక చిత్రాలు వచ్చాయి. ఎన్టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి మూడు పాత్రల్లో (కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దాన వీర శూర కర్ణ' (1977) కలెక్షన్ల వర్షంలో తడిసింది. కేవలం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. కోటి వసూలు చేసిందంటే ఈ చిత్రానిది ఏ స్థాయి విజయమో గ్రహించవచ్చు. మహా భారతంలో దుష్ట పాత్రలుగా చిత్రీకరణకు గురైన కర్ణ, దుర్యోధన పాత్రలను కొత్త కోణంలో చూపించి, ఆ పాత్రలకి హీరో ఇమేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా ఎన్టీఆర్‌దే.
ఇక ఎనిమిదో దశకంలో తెలుగు సినిమా పూర్తిగా వాణిజ్యమయమై పోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ. బూతు మాటలు, శృంగార సన్నివేశాలు ఉన్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సు అనేది సినిమాకి తప్పనిసరి అంశమైంది.
ఏడవ దశకం ద్వితీయార్ధంలో నటుడిగా రంగ ప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకుంటున్న సమయంలో 'ఖైదీ' (1983) అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ సినిమాల్లో 'ఖైదీ' సరికొత్త ధోరణికి తెరతీసింది. హీరోల పరంగా నృత్యాలకు అక్కినేని ఆద్యుడైనా, వాటికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది చిరంజీవి వల్లనే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తుంటే, మరోవైపు కొద్ది సంఖ్యలోనైనా కళాత్మక విలువలున్న సినిమాలు వచ్చాయి. కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' (1980) తెలుగు చిత్రసీమకి ఏనాటికైనా గర్వంగా చెప్పుకోదగ్గ కళాఖండంగా చరిత్రలో నిలిచింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ సినిమాలో ఒక సదాచార బ్రాహ్మణ సంగీత విద్వాంసునికీ, ఒక కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీకీ మధ్య అమలిన అనుబంధాన్ని విశ్వనాథ్ చూపించిన తీరు దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కినేనితో దాసరి నారాయణరావు తీసిన 'మేఘసందేశం' (1982) కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే 'యువతరం కదిలింది' (1980), 'ఎర్రమల్లెలు' (1981), 'విప్లవ శంఖం' (1982) వంటి విప్లవ కథాంశ చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' అనే ఆరు చిత్రాలే తీసినా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
ఎన్టీఆర్ వారసునిగా అంతకుముందే హీరోగా బాలకృష్ణ ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్, అగ్ర నిర్మాతల్లో రామానాయుడి కుమారుడు వెంకటేశ్, వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు హీరోలుగా అడుగుపెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో తనపేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో మొదటి 70 ఎం.ఎం. సినిమా 'సింహాసనం' (1986) కూడా ఈ దశకంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్త రక్తం మొదలైంది. ఎంతోమంది నవ యువ దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించడంతో పాత తరం దర్శకులు చాలమంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఆ సినిమా యువతపై చేదు ప్రభావాన్ని కలిగించిందనే విమర్శలు ఉన్నాయి. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక కథలతో సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యం హెచ్చింది. టెక్నికల్ అంశాలపై శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడా వాతావరణం మచ్చుకి కూడా కనిపించదు. ఎనిమిదో దశకం నుంచే హీరోనిబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ అదే స్థితి. గతంలో సినిమా ఫెయిల్యూర్ అయితే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటుల మీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామన్నది నిజం. మన పొరుగునే ఉన్న మలయాళ సినిమాలు దేశంలో అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమిళంలోనూ ఇటీవలి కాలంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమానే దుస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల 'పెళ్లి' నేపథ్యంలో వచ్చిన ఓ సినిమా మంచి హిట్టవడంతో అదే మూసలో చిత్రాలు వస్తున్నాయి. ఒక విప్లవ కథాచిత్రం బాగా ఆడితే అదే తరహా చిత్రాల్ని తీస్తున్నారు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవడం తప్ప వాటితో చిత్రాలు తీసేవారికి చిత్తశుద్ధి ఉందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న చిత్రాల్లో మానవతా విలువలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా చలామణీ అవడం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలతో పోలిస్తే పురుషాధిక్యం ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ తీసికట్టుగా తయారైంది. వ్యాంప్ కేరక్టర్ల అవసరం లేకుండా హీరోయిన్లతోనే వ్యాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు దర్శకులు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము  కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థం కాదు. అట్లాంటి సన్నివేశాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! మన అభిరుచి స్థాయి అలా ఉంది మరి. వీటినే ఆశీర్వచనాలుగా నమ్ముతున్న నిర్మాతలు అట్లాంటి చిత్రాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్ని ఇస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చిత్రించడం, ఎంత ఏడ్పించినా ఏమీ అనని హీరోయిన్లనీ, భర్త ఎంత హింసించినా సహించే భార్యల్నీ మంచివాళ్లుగా చిత్రిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోలేదు. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవిక అంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెలుగు చిత్ర రంగాన్ని మార్పుకు గురిచేస్తోంది. ఈ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సమయంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాకుండా ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి ఉంది. అప్పుడే విమర్శకి నిల్చే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది.
- స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా 
ఆంధ్రభూమి 'వెన్నెల' 15 ఆగస్ట్ 1997

Wednesday, April 9, 2014

Movie Review: Saradala Samsaram (1997)

ఇదెక్కడి సరదా? ఇదెక్కడి సంసారం?

దర్శకత్వం: సాయిప్రకాశ్
నిర్మాత: ఉషశ్రీ మారెడ్డి
తారాగణం: సురేశ్, రుచిత, నరసింహరాజు, గోకిన రామారావు, ప్రసాద్‌బాబు, సుబ్బరాయశర్మ

మంచి పనులు చేయడానికి గూండాగిరీ, రౌడీయిజం చేయడంలో తప్పులేదనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రేక్షకులపై బలవంతాన రుద్దే ప్రయత్నం చేసింది 'సరదాల సంసారం' చిత్రం. 'అమ్మ' చిత్రాల సెంటిమెంటుని వదిలించుకుని 'సంసారం' గొడవలో పడ్డ దర్శకుడు సాయిప్రకాశ్ అసహజమైన కథాంశాన్ని తీసుకుని పొరపాటు చేశాడని అనిపిస్తుంది.
మిత్ర చతుష్టయం అనే సూర్య (సురేశ్) అండ్ కో గూండాయిజం చేసి డబ్బు సంపాదించడమే 'సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్' కింద పెట్టుకున్నారు. వాళ్లకో ఆఫీస్ సైతం ఉంది. ఒకానొకరోజు ఓ రోమియో బారినపడ్డ జయ (రుచిత) తారసపడ్తుంది సూర్యకి. రోమియో ఫోన్లమీద ఫోన్లు చేస్తూ జయని చికాకు పెడ్తుంటాడు. సూర్య ఆ రోమియోకి తన మిత్ర బృందంతో తన్నుల సన్మానం చేశాక సూర్య ప్రేమని అంగీకరించి తన లాయర్ అన్నయ్య (నరసింహరాజు) ఇష్టానికి వ్యతిరేకంగా అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది జయ. సూర్య తమ్ముడు చంద్రం (కొత్త నటుడు) ఎం.ఎ. ఫస్ట్ క్లాస్‌లో పాసవుతాడు. డబ్బు సంపాదించడానికి తన అన్న అనుసరించే మార్గాన్ని చంద్రం అసహ్యించుకుంటూ ఉంటాడు. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలని భావిస్తాడు. ఆ క్రమంలో సూర్య రికమెండ్ చేసిన ఉద్యోగాన్ని కూడా తిరస్కరిస్తాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్లినా 'నో వేకన్సీ' బోర్డు దర్శనమిస్తుంటుంది. లేదంటే లంచం ఇవ్వమనైనా అడుగుతుంటారు. ఆఖరికి విసిగిపోయిన చంద్రం వదిన జయ ఇచ్చిన నగలతో ఉద్యోగం సంపాదించాలని వాటిని తనకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపిన బ్రోకర్ (సుబ్బరాయశర్మ) చేతిలో పెడతాడు. అయినా ఆ ఉద్యోగం అతడికి రాదు. బ్రోకర్ చేతిలో తను మోసపోయానని అర్థమైన చంద్రం కుమిలిపోయి అన్నా వదినలకి తన ముఖం చూపలేక ఫ్యానుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తమ్ముడి చావు, జయ మాటలతో పరివర్తన చెందిన సూర్య మారిపోతాడు. మెకానిక్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆఖరుకి కంపెనీ ఎండీ మృదుల అతణ్ణి పార్టనర్‌గా కూడా చేర్చుకుంటుంది. జయ మరదల్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారని తెలియడంతో సూర్య ఆ రౌడీల్ని చితకతన్ని వేశ్యాగృహంలో ఉన్న జయ మరదల్ని రక్షించి ఆ వేశ్యాగృహంలోనే తన మిత్రబృందంలోని రాజుతో ఆమె పెళ్లి చేస్తాడు. గతంలో సూర్య చేతిలో దెబ్బలు తిన్నవాళ్లంతా అతడి అంతు చూడాలని ఓ 'ఇంటర్నేషనల్' గూండా (ప్రసాద్‌బాబు)కి డబ్బు చెల్లిస్తారు. అయితే అతణ్ణి కూడా మిత్ర చతుష్టయం చిత్తుగా చావగొడ్తుంది. మరోపక్క జయ మృదులతో తన భర్త సరస సల్లాపాలు సాగిస్తున్నాడనే భ్రమలోపడి విషం తాగుతుంది. ఆఖరికి ఎట్లాగో బతికి సూర్యని అతడి పూర్వపు మార్గాన్నే అంటే గూండాగిరినే కొనసాగించమనడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలచింది సుస్పష్టమే. గూండాల్లోనూ మంచి గూండాలుంటారనీ, రౌడీయిజం తప్పుకాదనీ ఆయన చెప్పదలచుకున్నాడు. ఈ నేపథ్యంలో కథంతా అసహజంగా తయారయింది. మనకి ఎక్కడా కనిపించని కొత్త తరహా గూండా సూర్య పాత్రలో మనకి దర్శనమిస్తాడు. అతడికి మనుషుల్ని చావగోట్టడమే కాకుండా తెగ జోకులు వేయడం, సరసం చేయడం కూడా బాగా తెలుసు. భార్యని ప్రేమగా "బుజ్జిముండా ఇంతందంగా ఎందుకు పుట్టావే" అంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్నంతసేపూ ఆమెని క్షణం వదలడు. ఆమెని సుఖపెట్టడం కోసం తాపత్రయపడిపోతుంటాడు. గూండాకి ఉండని అసహజమైన ప్రత్యేకతలెన్నో కలిగి ఉన్న సూర్య పాత్రని సురేశ్ తనదైన శైలిలో బాగా పోషించాడు. శృంగారం, హాస్యం మేళవించిన సన్నివేశాల్లో బాగా రాణించాడు. రుచిత ఓ వైపు గ్లామర్‌ని కురిపించి, మరోవైపు నటననీ ప్రదర్శించింది. శృంగారం వొలికించడానికి కూడా ఆమె పాత్ర పనికొచ్చింది. సూర్య తమ్ముడు చంద్రంగా నటించిన కొత్త నటుడు మంచి నటననే చూపించాడు. మిగతా నటులంతా సోసోగానే అనిపించారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. దుగ్గిరాల సంగీతం ఫర్వాలేదు. సంభాషణల విషయంలో రచయిత దురికి మోహనరావు శృంగార సన్నివేశాల్లో అత్యుత్సాహం ప్రదర్శించాడని చెప్పాలి. కామెడీ సంభాషణల్లో కొన్ని బిట్లు ఆకట్టుకున్నాయి. నిర్మాత ఉషశ్రీ మారెడ్డి పాటలకి సాహిత్యాన్ని కూడా అందించారు. అయితే కథలో పట్టు లేకపోవడం, కథనంలో లోపాలు, పేరున్న నటులు లేకపోవడం మైనస్ పాయింట్లు. గూండాగిరీని అంగీకరించడం చిత్రం మొత్తం మీద పెద్ద తప్పు. సమాజంపై ప్రభావం చూపే వాటిలో సినిమా మాధ్యమం ఒకటి. ఈ విషయాన్ని సినిమా వాళ్లు విస్మరిస్తూ ఉండటం మన అనుభవంలోనిదే. 'ప్రేక్షకులు చూస్తున్నారు (ఆదరిస్తున్నారు) కాబట్టే మేం తీస్తున్నాం' టైపు చిత్రంగా 'సరదాల సంసారం'ని పేర్కొనవచ్చు. అయితే ఈ చిత్రానికి ఆదరణ ఉంటుందా అంటే ఉండదనేదే జవాబు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 1 ఆగస్ట్ 1997