Thursday, December 29, 2011

'అన్నపూర్ణ' ద్వారా పరిచయమైన తారలు, దర్శకులు

సతీమణి అన్నపూర్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావుకు అమితమైన ప్రేమ. అందుకే హైదరాబాద్‌లో నిర్మించిన స్టూడియోకు ఆమె పేరే పెట్టారు. ఇక తమ నిర్మాణ సంస్థను కూడా 'అన్నపూర్ణ స్టూడియోస్' గానే వ్యవహరించారు. ఆ బేనర్ కింద అనేకమంది నటులు, దర్శకులు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది అనంతర కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
* 1986లో నిర్మించిన 'విక్రమ్' చిత్రం ద్వారా నాగేశ్వరరావు, అన్నపూర్ణల చిన్న కుమారుడు నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. హీరోయిన్‌గా శోభన తెలుగు తెరకు పరిచయమయ్యిందీ ఈ చిత్రంతోటే.
* 1989లో నిర్మించిన 'శివ' సినిమాతో తెలుగు సినిమా గతినే మార్చేసిన రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యారు. అదే సినిమా హిందీ వెర్షన్‌తో ఇటు నాగార్జుననూ, అటు వర్మనూ బాలీవుడ్‌కూ పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.
* 1995లో నాగార్జున చిన్న కుమారుడు మాస్టర్ అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ 'సిసింద్రీ'ని నిర్మించారు.
* 1998లో సమర్పించిన 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' చిత్రం ద్వారా దర్శకుడిగా వై.వి.ఎస్. చౌదరినీ, హీరోగా వెంకట్‌నూ పరిచయం చేశారు.
* 1998లోనే తీసిన 'చంద్రలేఖ' చిత్రంతో బాలీవుడ్ సుందరి ఇషా కొప్పికర్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
* 1999లో తీసిన 'ప్రేమకథ' ద్వారా మనవడు (కూతురి కుమారుడు) సుమంత్‌ను హీరోగా, ఆంత్రమాలిని హీరోయిన్‌గా పరిచయం చేశారు.
* 2000 సంవత్సరంలో నిర్మించిన 'యువకుడు' ద్వారా నాయికగా భూమిక పరిచయమయ్యారు.
* 2003లో సమర్పించిన 'సత్యం' చిత్రంతో నాయికగా జెనీలియా తెలుగు తెరకు పరిచయం చేశారు. దర్శకుడిగా సూర్యకిరణ్‌కూ ఇదే తొలి చిత్రం.
* 2004లో తీసిన 'మాస్' చిత్రంతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారారు.
* 2005లో సమర్పించిన 'సూపర్' సినిమాతో అనుష్క తెరంగేట్రం చేశారు. ఇదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా తకియా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
* 2008లో తీసిన 'పౌరుడు' ద్వారా రాజ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 29, 2011

అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని అన్నపూర్ణ సమర్పించిన చిత్రాలు

చిత్రం పేరు                దర్శకుడు                      తారాగణం
1. రాజన్న (2011) - వి. విజయేంద్రప్రసాద్ - నాగార్జున, స్నేహ, యాని.
2. పౌరుడు (2008) - రాజ్ ఆదిత్య - సుమంత్, కాజల్ అగర్వాల్.
3. సూపర్ (2005) - పూరి జగన్నాథ్ - నాగార్జున, ఆయేషా తకియా, అనుష్క.
4. మాస్ (2004) - రాఘవ లారెన్స్ - నాగార్జున, జ్యోతిక, ఛార్మి.
5. సత్యం (2003) - సూర్యకిరణ్ - సుమంత్, జెనీలియా.
6. మన్మథుడు (2002) - కె. విజయభాస్కర్ - నాగార్జున, సోనాలీ బెంద్రే.
7. యువకుడు (2000) - ఎ. కరుణాకరన్ - సుమంత్, భూమిక.
8. ప్రేమకథ (1999) - రాంగోపాల్‌వర్మ - సుమంత్, ఆంత్రమాలి.
9. సీతారామరాజు (1999) - వై.వి.ఎస్. చౌదరి - నాగార్జున, హరికృష్ణ, సాక్షి శివానంద్, సంఘవి.
10. ఆహా (1998) - సురేశ్‌కృష్ణ - జగపతిబాబు, సంఘవి.
11. చంద్రలేఖ (1998) - కృష్ణవంశీ - నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్.
12. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ (1998) - వై.వి.ఎస్. చౌదరి - నాగేశ్వరరావు, వెంకట్, చాందిని.
13. నిన్నే పెళ్లాడుతా (1996) - కృష్ణవంశీ - నాగార్జున, టాబు.
14. సిసింద్రి (1995) - శివనాగేశ్వరరావు - నాగార్జున, అఖిల్.
15. తీర్పు (1994) - ఉప్పలపాటి నారాయణరావు - నాగేశ్వరరావు, జగపతిబాబు, రోహిణి, ఆమని.
16. రక్షణ (1993) - ఉప్పలపాటి నారాయణరావు - నాగార్జున, శోభన.
17. ఇద్దరూ ఇద్దరే (1990) - ఎ. కోదండరామిరెడ్డి - నాగేశ్వరరావు, నాగార్జున, సుజాత, రమ్యకృష్ణ.
18. శివ (1989) - రాంగోపాల్‌వర్మ - నాగార్జున, అమల.
19. శివ - హిందీ (1989) - రాంగోపాల్‌వర్మ - నాగార్జున, అమల.
20. విజయ్ (1989) - బి. గోపాల్ - నాగార్జున, విజయశాంతి.
21. అగ్నిపుత్రుడు (1987) - కె. రాఘవేంద్రరావు - నాగేశ్వరరావు, నాగార్జున, రజని, శారద.
22. విక్రమ్ (1986) - వి. మధుసూదనరావు - నాగార్జున, శోభన.
23. శ్రీరంగ నీతులు (1982) - ఎ. కోదండరామిరెడ్డి - నాగేశ్వరరావు, శ్రీదేవి.
24. యువరాజు (1982) - దాసరి నారాయణరావు - నాగేశ్వరరావు, సుజాత, జయసుధ.
25. ప్రేమాభిషేకం (1981) - దాసరి నారాయణరావు - నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ.
26. ప్రేమ కానుక (1981) - కె. రాఘవేంద్రరావు - నాగేశ్వరరావు, సుజాత, శ్రీదేవి.
27. బుచ్చిబాబు (1980) - దాసరి నారాయణరావు - నాగేశ్వరరావు, జయప్రద.
28. పిల్ల జమీందార్ (1980) - సింగీతం శ్రీనివాసరావు - నాగేశ్వరరావు, జయసుధ.
29. కల్యాణి (1979) - దాసరి నారాయణరావు - మురళీమోహన్, జయసుధ.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 29, 2011

Tuesday, December 27, 2011

ప్రివ్యూ: కంపెనీ

ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన మద్దెలచురువు సూరి, భానుకిరణ్, సి. కల్యాణ్ వంటి వ్యక్తుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు వీరు కె. రూపొందించిన సినిమా 'కంపెనీ'. రమాశ్రీ క్రియేషన్స్ బేనర్‌పై లక్కరాజు రాధారాజేశ్వరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 
సినిమా గురించి వీరు కె. మాట్లాడుతూ "కొన్ని వాస్తవిక సంఘటనల్ని ఇందులో సినిమాటిగ్గా చూపించాం. మద్దెలదరువు నూరి, బాలుకిరణ్, కె. చియాన్ అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథాంశంతో దీన్ని తీశాం. రూ. 500 కోట్ల రూపాయల స్కాం, మద్దెలదరువు నూరి అనే పాత్ర జైలు నుంచి రిలీజైన కొద్ది రోజులకే హత్యకు గురవడం, ఆ హత్యకు కారకుడని అనుమానిస్తున్న బాలుకిరణ్ అనే అతను పరారీ కావడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మూడు క్లబ్, పబ్ మిక్స్ పాటలు హిందీలో ఉంటాయి. వీటిని యాక్షన్ హీరోయిన్‌గా నటిస్తున్న స్వాతివర్మపై రొమాంటిగ్గా చిత్రీకరించాం" అని చెప్పారు. 2012 జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది 'కంపెనీ'.
మద్దెలదరువు నూరిగా సురేశ్, బాలుకిరణ్‌గా 'బద్రీనాథ్' ఫేం హ్యారీ, కె. చియాన్‌గా దండపాణి, నూరి గర్ల్‌ఫ్రెండ్‌గా స్వాతివర్మ, రాంభూపాల్‌శర్మగా సుమన్‌శెట్టి నటించిన ఇందులో జీవా, సూర్య, కృష్ణభగవాన్, చిత్రం బాషా, శకుంతల, సంధ్య ఇతర తారాగణం. వీరు కె. స్వయంగా సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: అరుణ్, ఎడిటింగ్: నాగిరెడ్డి.

Monday, December 26, 2011

బిగ్ స్టోరీ: సంక్రాంతికి సై

సంక్రాంతికి ఏయే సినిమాలు రానున్నాయో దాదాపు తేలిపోయింది. తెలుగు సినిమాకు సంబంధించి ఓ కేలండర్ సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద సీజన్ సంక్రాంతి అనేది తెలిసిందే. సంక్రాంతికి వారం నుంచి పది రోజుల దాకా బడులకు ఇచ్చే సెలవుల్ని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు భావిస్తుంటారు. పెద్ద సినిమాలు రంగంలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఆ సినిమాల నిర్మాతలు నిరాశ పడటం మామూలే. ఇప్పుడూ అదే స్థితి. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీ అంటుండటంతో చిన్న సినిమాకు చోటెక్కెడ దొరుకుతుంది? పైగా ఈ పెద్ద సినిమాలే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుండటం వల్ల వాటికీ మిగతా సమయాల్లో లభ్యమయ్యే రీతిలో థియేటర్లు దొరకవనేది నిజం. ఫలితంగా వాటి కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపడం తథ్యం. సంక్రాంతి విజేతలుగా నిలవాలనే తపనతో వస్తున్న ఆ నాలుగు సినిమాలు - 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్', 'నిప్పు', 'పూలరంగడు'.
మళ్ళీ కలిశారు 
'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేశ్ హీరోగా వస్తున్న 'బిజినెస్‌మేన్' సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకుడవడం వల్ల కూడా ఈ సినిమా పట్ల ఇటు సినీ వర్గాలవారూ, అటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'బిజినెస్‌మేన్' ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బారులు తీరారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. 'దూకుడు' మీదున్న తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో అన్నిటికంటే ముందుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడు తెలుగులో... 
వెంకటేశ్ హీరోగా నటించిన 'బాడీగార్డ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం - ఇప్పటికే ఈ సినిమా మూడు భాషల్లో జయకేతనం ఎగురవేయడం. మొదట మలయాళంలో (దిలీప్ హీరో), తర్వాత తమిళంలో (విజయ్ హీరో), ఆ పిమ్మట హిందీలో (సల్మాన్‌ఖాన్ హీరో) కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. వాటికంటే తెలుగు వెర్షన్ మరింత బాగా వచ్చిందని శ్రీ సాయిగణేశ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బెల్లకొండ సురేశ్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన వెంక టేశ్ చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇప్పుడే. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేయడం ఇది మూడోసారి. 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ కూర్చిన ఫైట్లు, తమన్ సంగీతం అందించిన పాటలు హైలైట్ అవుతాయంటున్నారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ముగ్గురు మిత్రులు 
ముగ్గురు మిత్రుల సినిమా 'నిప్పు'. కెరీర్ తొలినాళ్లలో చెన్నైలో ఒకే ఇంట్లో ఉండి అవకాశాలు వెతుక్కున్న ఆ ముగ్గురు - గుణశేఖర్, రవితేజ, వైవీఎస్ చౌదరి. రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ నిర్మిస్తున్నారు. ఇలా ఓ అరుదైన కాంబినేషన్‌తో, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ మార్కు వినోదానికి, గుణశేఖర్ శైలి టేకింగ్ తోడైన ఈ సినిమాకి సైతం తమన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఇలా ఒకే సంగీత దర్శకుడు పనిచేసిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడనుండటం అనేది కూడా అరుదైన సందర్భం. జనవరి 13న 'నిప్పు' విడుదలవుతోంది.
నవ్వులు పువ్వులు 
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని, కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ ఇప్పుడు 'పూలరంగడు'గా అవతారమెత్తాడు. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' చిత్రాలతో ఘన విజయాలు సాధించిన ఈ భీమవరం నటుడు తనకంటూ సొంత మార్కెట్‌ని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. అందుకు తగ్గట్లే 'పూలరంగడు' పట్ల బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 'అహ నా పెళ్లంట' ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో దాని సోదర సంస్థ మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జనవరి 5న ఆడియో ఆవిష్కరణ జరగనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా నాయిక. ఒకే సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండటాన్నీ ఈసారి మనం చూడబోతున్నాం.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 26, 2011

Saturday, December 24, 2011

నివాళి: మహారథి కన్నుమూత

'అల్లూరి సీతారామరాజు' మాటల్లో అగ్గి రగిల్చిన కలం ఆగిపోయింది. కట్టుదిట్టమైన పదాలతో 'కంచుకోట' కట్టిన మాటల మేస్త్రీ శ్వాస నిలిచిపోయింది. తన రచనా పటిమతోటే అనేక చిత్రాలకు ప్రాణంపోసిన మాటల సవ్యసాచి త్రిపురనేని మహారథి (81) జీవన యానం ఆగిపోయింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కాలుజారి పడి తుంటి ఎముక విరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. గురువారం (23వ తేదీ) శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మహారథి తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య కమల, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఉదయం ఈఎస్ఐ శ్మశాన వాటికలో మహారథి అంత్యక్రియలు జరుగనున్నాయి.
అవతలి వారు ఎంత పెద్ద నటుడైనా, ఎంత గొప్ప దర్శకుడయినా తను రాసిన మాటను తనకు తెలీకుండా మార్చడానికి ఎంతమాత్రమూ అంగీకరించని 'మాట' వెరువని కలం యోధుడు మహారథి. ఆ మాటల సవ్యసాచి మహారథి కన్నుమూసారు. ఎన్టీఆర్ 'బందిపోటు'తో మొదలైన ఆయన ప్రస్థానం కృష్ణ 'శాంతి సందేశం'తో ముగిసింది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో 1930 ఏప్రిల్ 20న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పుణ్యవతి, సత్యనారాయణ. ఆయన అసలు పేరు బాలగంగాధర్. పన్నెండేళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో పువ్వాడ శేషగిరిరావు శుశ్రూషలో తొలి పద్యం రాశారు. అదే ఊపుతో శతకాలు, విప్లవ కవిత్వం రాసేశారు. పాత్రికేయుడిగా మొదలై సినిమా రంగానికి విస్తరించి.. డబ్బింగ్‌తో సహా వంద సినిమాలకు రచయితగా వ్యవహరించారు.
కృష్ణకు చెందిన పద్మాలయా పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' (1973) అఖండ విజయం సాధించడంతో మహారథి రచయితగా నిలదొక్కుకున్నారు. 'అల్లూరి సీతారామరాజు' కోసం నిజంగానే తపస్సు చేశారు. డిసెంబర్ చలిలో తెల్లవారుజామున చింతపల్లి అడవుల్లో చెట్టు కింద ఒంటిమీద ఆచ్ఛాదన లేకుండా కూచుని... ధ్యానయోగంలో ఉండి ఈ సినిమాను మనసులోనే దృశ్యమానం చేసుకున్నారు. ఆయన అకుంఠిత శ్రమ ఫలించి 'అల్లూరి సీతారామరాజు' అఖండ విజయం సాధించింది.
ఎన్నో అడుగులు
మహారథి సొంత ఊరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి దక్కన్ రేడియోలో పనిచేశారు. 1957లో మద్రాసు రైలెక్కారు. తిలక్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1959లో డబ్బింగ్ రచయితగా రూపాంతరం చెందారు. ఆయన సంభాషణలు రాసిన తొలి స్ట్రయిట్ సినిమా 'బందిపోటు' (1963). మంచిని పెంచాలి, దేశమంటే మనుషులోయ్, రైతు భారతం అనే మూడు సినిమాలను నిర్మించి ఆర్థికంగా దెబ్బతిన్నారు. 'రైతు భారతం'తో సౌందర్యను పరిచయం చేశారు. టెలివిజన్ రంగంలోనూ రాణించి 'చాణక్య', 'పంచతంత్రం' మెగా సీరియళ్లకు సంభాషణలు రాశారు. ఆది నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆయన... బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనేలక్ష్యంతో 'త్రిలింగ ప్రజాప్రగతి పార్టీ'ని స్థాపించారు.
కేవలం సినిమా రచయితగానే కాకుండా కవిగా, పుస్తక రచయితగానూ మహారథి రాణించారు. విప్లవ వీరులకు అంకితమిస్తూ 'మహాప్రళయం' వెలువరించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చీకటి కోణాల్ని ఆవిష్కరించిన 'మరోసారి మరణిస్తున్న ఎన్టీఆర్'(2004), 'ఎన్టీఆర్ పునరుత్థానం' (2005), 'మాడు పగిలే మూడు శతకాలు' (2007) 'మహారథి ముచ్చట్లు' (2008) పాఠకాదరణ పొందాయి. కొంతకాలంగా భౌతిక వాదం, ఆధ్యాత్మిక వాదం మేళవింపుతో ఓ పరిశోధన్మాతక గ్రంథాన్ని రాసే పనిలో ఉన్నారు. భగవద్గీతకు భాష్యం రాసే పని మొదలుపెట్టారు. మహారథి రెండో కుమారుడు చిట్టి (వరప్రసాద్) చిత్ర రంగంలో కొనసాగుతున్నారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 24, 2011

Thursday, December 22, 2011

బిగ్ స్టోరీ: బాలీవుడ్ పొమ్మంది.. టాలీవుడ్ రమ్మంది!!

రెండు దశాబ్దాల నుంచీ తెలుగులో పరభాషా హీరోయిన్‌లే రాజ్యం చేస్తున్నారని మనకు తెలుసు. కన్నడ నటి సౌందర్యను మినహాయిస్తే మిగిలినవాళ్లలో ఎక్కువమంది బాలీవుడ్ తిరస్కారానికి గురై అక్కడి నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హం. నిన్న మొన్నటిదాకా తెలుగు తెరపై నగ్మా, అంజలా ఝవేరీ, సిమ్రాన్, సోనాలీ బెంద్రే, ఆర్తీ అగర్వాల్, శ్రియ, రీమాసేన్, జెనీలియా ఓ వెలుగు వెలగగా ఇప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక, శ్రుతిహాసన్ రాణులుగా చలామణీ అవుతున్నారు.
ఎనభైల చివర్లో బాలీవుడ్ భామల్ని నిర్మాతలు తెలుగులోకి తీసుకు రావడమనే ట్రెండ్ మొదలైంది. దాంతో పాటే హీరోయిన్‌కూ, వ్యాంప్‌కూ మధ్య ఉండే గీత చెరిగిపోయి, హీరోయిన్‌లో వ్యాంప్ మిళితమైపోయింది. వ్యాంప్ వేసే పొట్టి దుస్తులు హీరోయిన్ వొంటిమీదకు చేరాయి. హీరో సరసన ఓ 'ఆడబొమ్మ'గా రూపుదాల్చిందామె. 'కలియుగ పాండవులు' (1986)తో ఖుష్బూ, 'కిరాయి దాదా' (1987)తో అమల, 'సామ్రాట్' (1987)తో సోనం టాలీవుడ్‌కు పరిచయమై బాలీవుడ్ నుంచి హీరోయిన్ల దిగుమతి అనే ధోరణికి తెరతీశారు. అప్పట్నించీ టాలీవుడ్‌లో బాలీవుడ్ తారల ప్రవాహం మొదలైంది. 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాతో దేశవ్యాప్తంగా యువతరంలో గుబులురేపిన జుహీ చావ్లా  'ముగ్గురు కొడుకులు' (1988)లో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరణని చూరగొంది. రాజీవ్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'విశ్వాత్మ'తో హీరోయిన్‌గా పరిచయమైనా, ప్రేక్షకుల గుర్తింపుపొందని దివ్య భారతి 'బొబ్బిలి రాజా' సినిమాతో టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తమ తొలి హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకోకముందే తెలుగులో ప్రీతీ జింటా 'ప్రేమంటే ఇదేరా'తో, అమీషా పటేల్ 'బద్రి'తో తెలుగులో సక్సెస్ సాధించారు. వీరిలో కొంతమంది తారలు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ రాణించగా, కొంతమంది తారలు బాలీవుడ్‌లో ఫయిలై, తెలుగులో టాప్ స్టార్లుగా రాణిస్తూ వచ్చారు. పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ హీరోయిన్‌కు ప్రాథమిక అర్హత కావడంతో కొత్త ధోరణికి ద్వారాలు తెరుచుకున్నాయి. దివ్యభారతి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా నగ్మా పేరు తెచ్చుకుంది. సల్మాన్‌ఖాన్ సరసన 'బాజీ' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 'పెద్దింటల్లుడు' (1991) చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి కనిపించింది. 'కిల్లర్', 'ఘరానా మొగుడు' (1992) సినిమాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అప్పట్నించీ బాలీవుడ్ భామలకు తెలుగులో మరింత గిరాకీ. 
మధుబాల, అంజలా ఝవేరీ, సాక్షి శివానంద్, సిమ్రాన్, రీమాసేన్, శ్రియ, ఆర్తీ అగర్వాల్ వంటివాళ్లు తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలు పొందుతూ వచ్చారు. హిందీలో 'తేరే మేరే సప్నే' తర్వాత సరైన అవకాశాలు రాని సిమ్రాన్ తమిళంలో సక్సెస్ సాధించి, తెలుగులో 'కలిసుందాం రా' (2000) వంటి సూపర్ హిట్ సినిమాతో తారాపథానికెగసింది.
ఇక 'ఇష్టం' వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన శ్రియ 'సంతోషం' హిట్టయ్యాక వెనుతిరిగి చూడలేదు. కానీ బాలీవుడ్‌లో స్థానం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోనాలీ బెంద్రేకు హిందీలో 'సర్ఫరోష్' మినహా చెప్పుకోవడానికి మరో సినిమా ఏదీ లేదు. కానీ తెలుగులో తొలిసారి 'మురారి' సినిమాలో నటించాక ఆమెకు  ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్క 'పలనాటి బ్రహ్మనాయుడు' తప్పితే ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ విజయం సాధించాయి. 
'చిత్రం', 'మనసంతా నువ్వే' సినిమాల్లో మంచి పాత్రలు చేసి, యువతరాన్ని ఉర్రూతలూగించిన రీమాసేన్ అనంతరం సెక్స్ సింబల్‌గా పేరు తెచ్చుకుంది. ఫర్దీన్‌ఖాన్ సరసన ఆమె చేసిన హిందీ సినిమా 'హం హో గయే ఆప్కే' డిజాస్టర్ కావడంతో బాలీవుడ్‌లో ఆమెకు చోటు లభించలేదు. హిందీలో 'పాగల్‌పన్'తో తెరంగేట్రం చేసిన ఆర్తీ అగర్వాల్‌కు మరో బాలీవుడ్ అవకాశం అందని ద్రాక్షే అయింది. కానీ తెలుగులో చేసిన తొలి సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'తో ఇక్కడి యువత ఆరాధ్య తారగా మారింది. ఇప్పుడు వీళ్లంతా కళా విహీనమైతే వారి స్థానాల్లో జెనీలియా, కాజల్ అగర్వాల్, హన్సిక, తమన్నా, శ్రుతిహాసన్ వచ్చారు. 
'తుఝే మేరీ కసం'తో జెనీలియా, 'క్యూన్.. హో గయా నా'తో కాజల్ అగర్వాల్, 'ఆప్ కా సురూర్'తో హన్సిక, 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో తమన్నా, 'లక్'తో శ్రుతిహాసన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాల తర్వాత వారికి అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో దక్షిణాదివైపు చూపు సారించారు. తెలుగులో వరుస అవకాశాలతో యూత్ ఐకాన్స్‌గా మారిపోయారు. ఈ అయిదుగురిలో కాజల్, తమన్నా చక్కని అవకాశాలతో అగ్ర నాయిక రేసులో దూసుకుపోతున్నారు. జెనీలియాకు పదేళ్ల తర్వాత బాలీవుడ్ ఛాన్సులు తలుపు తడుతున్నాయి. కమలహాసన్ కూతురు శ్రుతిహాసన్‌కు ఇప్పుడిప్పుడే అగ్ర హీరోలతో పనిచేసే అవకాశాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆమె టాప్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నుంచి ఇంతమంది వెల్లువగా వస్తుంటే, మన తెలుగు తారల సంగతేంటి? సహజంగానే ఈ పరభాషా తారలతో మనవాళ్లు పోటీపడలేక పోతున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే మన హీరోలే వాళ్లకు తమ సరసన చోటు కల్పించేందుకు ముందుకు రావడం లేదు. అందువల్లే తెలుగమ్మాయిలు అర్చన, మాధవీలత, స్వాతి, బిందుమాధవి కెరీర్ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లు ఉంది. తెలుగులో రాణిస్తున్న ఉత్తర భారతీయ అమ్మాయిలు బాలీవుడ్‌లో రాణించలేకపోతుంటే, మన తెలుగు తారలు తెలుగులోనే కాదు ఇంకెక్కడా కూడా రాణించలేక పోతున్నారు. ఇద్దరి మధ్యా కనిపిస్తున్న తేడా అదే. 

Tuesday, December 20, 2011

చూడాల్సిన సినిమా: ద చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్ (1997)

ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అకాడమీ (ఆస్కార్) అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇరానీ సినిమా 'ద చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్'. ప్రఖ్యాత ఇరానీ దర్శకుడు మాజిద్ మాజిది రూపొందించిన ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చూసి చలించని ప్రేక్షకులు ఉండరు. టెహ్రాన్‌లో నివసించే అలీ అనే చిన్న కుర్రాడు, అతని కుటుంబం చుట్టూ అల్లిన కథ ఈ సినిమా. కథ ప్రకారం అలీ అజాగ్రత్త వల్ల అతని చెల్లెలు జారా స్కూల్ షూస్ పోతాయి. పేదరికం కారణంగా ఈ సంగతి ఇంట్లో చెప్పడానికి భయపడతాడు అలీ. అతడి షూస్‌నే ఇద్దరూ మార్చి మార్చి వేసుకుంటుంటారు. దీనివల్ల అలీ స్కూలుకు చాలాసార్లు లేటుగా వెళ్లి ప్రిన్సిపాల్ చేత చివాట్లు తింటాడు. తన పింక్ షూస్ రోయా అనే మరో సహ విద్యార్థిని కాళ్లకు ఉండటం గమనిస్తుంది జారా. రోయా తండ్రి అంధుడనీ, చెత్త తీసుకెళ్లే వ్యక్తి అనీ తెలిసి ఆ షూస్‌ని రోయాకే వదిలేస్తారు అన్నాచెల్లెళ్లు. అయితే రోయా మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఆమె తండ్రి ఆమెకి కొత్త పర్పుల్ షూస్ కొనిచ్చి జారా షూస్‌ని బయట పారేస్తాడు. 
తన చెల్లెలికి ఎలాగైనా కొత్త షూస్ కొనాలని తపించిన అలీ అనేక స్కూళ్ల విద్యార్థులు పాల్గొనే నడకపందెంలో పాల్గొంటాడు. అందులో మూడో స్థానం వచ్చిన వాళ్లకి జిం షూస్ బహుమానంగా వస్తాయని తెలిసి తాను మూడో స్థానంలో రావాలనుకుంటాడు. కానీ అనుకోకుండా ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తాడు. మరి అతను చెల్లెలికి కొత్త షూస్ కొనిచ్చాడా? లేదా? అనేది చివరి సన్నివేశం.
ఈ కథతో బాలల ప్రపంచం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించాడు దర్శకుడు మాజిద్ మాజిది. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమాభిమానాలు ఎంతగా పెనవేసుకుని ఉంటాయో, ఒకరి బాధని మరొకరు ఎలా పంచుకుంటారో, చెల్లెలి కళ్లల్లో సంతోషం చూడ్డానికి పిల్లవాడైన ఓ అన్న ఎంతగా తపిస్తాడో ఈ సినిమా కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే మనం బాల్యంలోకి వెళ్లకుండా ఉండలేం. అలీ, జారా పాత్రలతో సహానుభూతి చెందకుండా ఉండలేం. అంత బాగా ఆ పాత్రల్ని పోషించారు అమీర్ ఫరూఖ్ హషేమియన్, బహరే సిద్దిఖి.
1999 నుంచి మూడేళ్ల కాలంలో 'ద చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్' అనేక ఐరోపా, దక్షిణమెరికా, ఆసియా చిత్రోత్సవాల్లో పాల్గొని ఆవార్డులతో పాటు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసల్ని పొందింది.

బిగ్ స్టోరీ: ఆరు పదుల వెన్నెల సౌరభం మల్లీశ్వరి

మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలైనా 'మల్లీశ్వరి' నిత్యనూతనం.
మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొండు చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అన్నిట్లోనూ 'మల్లీశ్వరి' పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంది. భారతి మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణకృత్యం' అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దాన్ని విన్న బి.ఎన్. రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్' కథ కూడా ఆయనకు నచ్చింది. ఆ నాటికనూ, ఈ కథనూ మేళవించి ఆయన 'మల్లీశ్వరి' కథను తయారు చేయించారు. ఈ సినిమా కోసం బి.ఎన్. అహోరాత్రాలూ పడిన క్షోభ ఓ తపస్సు. అందుకే ఆయనతో పనిచేసిన వారంతా - ఈ మాట ఆయన 'రాయించు'కున్నారు, ఈ పాట ఆయన 'చేయించు'కున్నారు, 'పాడించు'కున్నారు - అనే అంటారు గౌరవ పురస్సరంగా.
కథాంశం
ఈ చిత్ర కథాంశాన్ని ఓసారి మననం చేసుకుందాం. హంపీ విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లయిన నాగరాజు, మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పైచేయి అయిన మల్లి తల్లి నాగమ్మకు వారి పెళ్లి ఇష్టంలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణివాసానికి రప్పిస్తాడు. రాణివాసంలోని స్త్రీలను పరపురుషులెవరూ చూడరాదనేది నియమం. డబ్బు సంపాదించి వచ్చిన నాగరాజుకు మల్లి రాణివాసానికి వెళ్లిపోయిన సంగతి తెలిసి పిచ్చివాడైపోతాడు. ఆమె రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. నాగరాజు పనితనం చూసి ఆస్థాన శిల్పాచారి అతణ్ణి నందనోద్యానవనంలో శిల్పాల్ని చెక్కేందుకు నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు తోటలో కలుసుకున్న నాగరాజు, మల్లి అక్కణ్ణించి పారిపోవాలనుకుంటారు. అదే సమయానికి ఉషా పరిణయం నృత్యగానంలో మల్లి పాల్గొనాల్సి వస్తుంది. సాహసంతో అంతఃపుర ప్రవేశం చేసిన నాగరాజును సైనికులు బంధించి ఖైదుచేస్తారు. విచారణ జరిపిన మహారాజు ప్రేమికులిద్దర్నీ ఒకటిచేసి, వారికి స్వేచ్ఛాజీవితం ప్రసాదిస్తాడు.
అందరూ అపురూప తారలే
నాగరాజు, మల్లీశ్వరి పాత్రల్లో ఎన్టీ రామారావు, భానుమతి అపూర్వ అభినయం ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వారి చిన్నప్పటి పాత్రలు వేసింది వెంకటరమణ, మల్లిక. ఈ వెంకటరమణ సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు బాపుకు స్వయాన బావమరిది. నిజానికి మల్లి పాత్రకు మొదట ఎవరైనా కొత్త తారను తీసుకుందామని రేవతి అనే అమ్మాయిని ఎంపిక చేసుకుని కూడా, బరువైన ఆ పాత్రకి ఆమె న్యాయం చేయలేదని భావించారు బి.ఎన్. అప్పటికే దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న భానుమతి వైపు మొగ్గుచూపారు. ఆయన నమ్మకాన్ని భానుమతి ఈ స్థాయిలో నిలబెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదివరకు 'షావుకారు'లో జానకి తండ్రిగా వేసిన శ్రీవత్స ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో గంభీరంగా నటించారు. మల్లి తండ్రి నారప్పగా దొరస్వామి, మల్లి మావయ్య హనుమంతప్పగా వంగర వెంకటసుబ్బయ్య, మల్లి తల్లి నాగమ్మగా ఋష్యేంద్రమణి, నాగరాజు తల్లి గోవిందమ్మగా వెంకుమాంబ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. రేడియోలో వచ్చిన 'రాయల కరుణకృత్యం' నాటికలో మల్లీశ్వరిగా నటించిన టి.జి. కమలాదేవి 'మల్లీశ్వరి'లో భానుమతి నెచ్చెలి జలజ పాత్ర చేయడం విశేషం. అప్పట్లో రేడియోలో బాగా పాపులర్ అయిన 'బాలానందం' కార్యక్రమాన్ని నిర్వహించే 'బాలన్నయ్య' న్యాపతి రాఘవరావు ఇందులో రాయల ఆస్థానకవి పాత్రలో నటించారు. అదివరకు వాహినీ సంస్థ తీసిన ప్రతి చిత్రంలోనూ నటించిన చిత్తూరు నాగయ్య ఇందులో కనిపించరు. ఈ సినిమా షూటింగయ్యాక ఇందులో తను నటించలేదనే బాధను నాగయ్య వ్యక్తం చేయడంతో బి.ఎన్. ఆయన్ను మరో రకంగా సంతృప్తిపరిచారు. సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానం చెప్పింది నాగయ్యే.

పోటీపడ్డ సాహిత్యం, సంగీతం
తొలిసారిగా ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన సినీ జీవితంలో మాటలు రాసిన ఒకే ఒక చిత్రమిది. 'మల్లీశ్వరి' విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని ప్రజామిత్ర పత్రికలో సమీక్షిస్తూ "ఈ చిత్రంలో పాటలకు సాహిత్య గౌరవం లభించింది'' అని ప్రశంసించారు ప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. నిజమే. అప్పటిదాకా వచ్చిన సినిమా పాటలకంటే భిన్నంగా 'మల్లీశ్వరి' పాటల్ని సాహితీ సౌరభంతో ప్రబంధ శృంగార సారాన్ని సినీ సాహిత్యపరంగా మలిచిన విశిష్ట రచయిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఇందులోని గీతాలు ప్రణయ భావపరంపరకు పట్టంగట్టిన నిత్యనూతన సౌరభాల్ని వెదజల్లిన మల్లెల మాలికలు. కృష్ణశాస్త్రి రాసిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు బాణీలు కట్టారు. మ్యూజిక్ కంపోజింగ్‌కు ఆయన ఆరు నెలల సమయం తీసుకున్నారు. బాణీలు సాలూరువి అయితే, ఆర్కెస్ట్రా నిర్వహించింది అద్దేపల్లి రామారావు. అందుకే టైటిల్స్‌లో సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లూ ఉంటాయి. సాలూరు తన కెరీర్ మొత్తం మీద అపురూపంగా చెప్పుకున్న చిత్రాలు రెండే. ఒకటి 'చంద్రలేఖ', రెండు 'మల్లీశ్వరి'. హంపీ విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దంపట్టే ఈ చిత్రంలో అసలు కథానాయిక సంగీతమేనంటే అతిశయోక్తి కాదు. 'మనసున మల్లెల మాలలూగెనే', 'కోతీ బావకు పెళ్లంట', 'పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి', 'ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు', 'నెల రాజా వెన్నెల రాజా', 'ఎందుకే నీకింత తొందర' వంటి పాటలన్నీ అపురూప రాగ హారాలే. కాఫీ రాగంలో భానుమతి ఆలపించిన 'పిలచిన బిగువటరా..' తెలుగు సినిమా పాటల్లో చిరస్థాయిని సాధించింది. మల్లీశ్వరిని రాణివాసానికి పంపే ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే గుండెలు బరువెక్కించే అద్భుత కరుణ రసాత్మక భాష్పగంగా మణికర్ణికా ఘట్టం. దాన్ని అలా చిత్రించిన బి.ఎన్. రెడ్డినీ, ఆ ఘట్టంలో అభినయించిన దొరస్వామి, ఋష్యేంద్రమణి, భానుమతి, వెంకుమాంబనీ, ఆ సెట్‌ని రూపొందించిన ఎ.కె. శేఖర్‌నీ, అన్నింటికీ మించి హంపీ విజయనగర శిల్పవీణలు ఆ సన్నివేశాలకి నేపథ్యంగా మూర్ఛనలు చేస్తున్నాయా అనిపించే నేపథ్య సంగీతం, అందులో రాజేశ్వరరావు చూపిన ప్రతిభ, చరిత్ర జ్ఞానం తెలుగువారు మరవలేనివి. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆది ఎం. ఇరానీ పక్షవాతంతో కెమెరాని హ్యాండిల్ చేసే స్థితిలో లేకపోవడంతో ఆపరేటివ్ కెమెరామన్‌గా బి.ఎన్. సోదరుడు కొండారెడ్డి అద్భుత పనితీరు కనపర్చారు.
ఈ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం రూ. ఆరు లక్షలు. అప్పట్లో అది అత్యంత భారీ బడ్జెట్. 1951 డిసెంబర్ 20న తొలిసారి విడుదలై ఒక్క విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడిన ఈ సినిమా మూడేళ్ల తర్వాత రెండో విడుదలలో మరింత విజయం సాధించింది. ఆంధ్రదేశంలో కంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 'మల్లీశ్వరి'కి ఎక్కువ ఆదరణ లభించింది. బీజింగ్‌లో జరిగిన తూర్పు ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్‌తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు పుటల్లో నిలిచింది.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 20, 2011

Saturday, December 17, 2011

ప్రివ్యూ: రామాచారి

విజయవంతమైన 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణు, కమలిని ముఖర్జీ జంటగా నటించిన సినిమా 'రామాచారి'. 'ఈడో పెద్ద గూఢచారి' అనేది ట్యాగ్‌లైన్. ఇదివరకు 'సిద్ధు.. ఫ్రం సికాకుళం', 'సీతారాముల కల్యాణం.. లంకలో' చిత్రాల దర్శకుడు జి. ఈశ్వర్‌రెడ్డి (ఈశ్వర్ ఘనాపాటి) ఈ సినిమాకి దర్శకుడు. ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై పి. వెంకట శ్యాంప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ బేనర్‌లో వేణుకి ఇది ఆరో సినిమా. తనకు ఇదివరకు హిట్లని అందించిన కామెడీని నమ్ముకుని ఈ సినిమా చేశాడు వేణు. మలయాళంలో దిలీప్ హీరోగా నటించగా హిట్టయిన 'సి.ఐ.డి. మూస'కి ఇది రీమేక్. వాస్తవానికి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు పొందారు. ఆయనను కన్విన్స్ చేసి, ఆ హక్కులు తీసుకుని 'రామాచారి' తీశారు వేణు, శ్యాంప్రసాద్. టైటిల్‌కు తగ్గట్లు వేణు ఇందులో రామాచారి అనే డిటెక్టివ్‌గా నటిస్తే, ఓ ఫ్లోరిస్ట్ కేరక్టర్‌ను కమలిని పోషించింది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఎస్సెట్ అని దర్శకుడు చెబుతున్నాడు. 2012 జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
సుత్తివేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, హర్షవర్ధన్, ఇందూ ఆనంద్, రమాదేవి, ఆనంద్, లిరీష తారాగణమైన ఈ సినిమాకు కథ: ఉదయ్‌కృష్ణ, సి.బి.కె. థామస్, మాటలు: వి. విక్రంరాజ్, డొంగ్రోత్ నాగరాజు, రైటర్ మోహన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సతీశ్, కొరియోగ్రఫీ: శేఖర్, ప్రసన్న.

Friday, December 16, 2011

'కృష్ణం వందే జగద్గురుం' ప్రారంభం

రానా హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో డిసెంబర్ 14న జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. 
క్రిష్ మాట్లాడుతూ "ఈ కథకు సంబంధించిన పాయింట్ స్ఫురించగానే రానాకు ఫోన్ చేసి చెప్పాను. మా ఇద్దరి గమనం, గతిని మార్చే సినిమా ఇది. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. బీటెక్ బాబుగా రానా నటించనున్నారు. అతని ఆరున్నర అడుగుల కటౌట్‌ను పూర్తిగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాను. సాయిమాధవ్ డైలాగులు బావుంటాయి. మంచి టీమ్‌తో ముందుకు వెళ్తున్నాం. హీరోయిన్‌ను రెండు మూడు రోజుల్లో ఎంపిక చేస్తాం. వెంటనే షెడ్యూల్ మొదలవుతుంది. యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. కృష్ణుడిని మించిన మాస్ పాత్ర నాకు కనిపించలేదు. ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది'' అని అన్నారు. 
రానా మాట్లాడుతూ "ఇది నేను చేస్తున్న ఆరో చిత్రం. గతంలో దర్శకులు సృష్టించిన పాత్రల్లోకి నేవెళ్ళి చేశాను. ఈ సినిమాలో నాకోసం రూపొందించిన పాత్రలో నటించబోతున్నాను. హీరో జర్నీకి సంబంధించిన చిత్రమిది. వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళంలో 'వడక్కు చెన్నై'లో నటిస్తున్నాను'' అని అన్నారు. 
కథను నమ్మి సినిమా తీసే దర్శకుడు క్రిష్ అని పోసాని కితాబిచ్చారు. మంచి పాత్రలో నటిస్తున్నట్టు ఎల్బీశ్రీరామ్ అన్నారు. కథ మెప్పిస్తుందని వెంకటేష్ చక్రవర్తి చెప్పారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తానని సాయిమాధవ్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "మంచి కథ. రానా పాత్ర మెప్పిస్తుంది. లొకేషన్‌లు, స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, పోసాని, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, నాగినీడు, రవి ప్రకాష్, జె.వి.ఆర్., హేమ, శ్రీనిజ తదితరులు ఇతర పాత్రధారులు. కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: క్రిష్, స్క్రిప్ట్ కన్సల్టంట్: వెంకటేష్ చక్రవర్తి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: శ్రావణ్.కె, కెమెరా: జ్ఞాన శేఖర్.వి.ఎస్., సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి.

మణిరత్నం చిత్రంలో లక్ష్మీ మంచు

మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'పూక్కడై'. ఇందులో లక్ష్మీ మంచు ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఆమె నటిస్తున్న తొలి తమిళ చిత్రమిది. తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు', హిందీలో రామ్‌గోపాల్‌వర్మ 'డిపార్ట్‌మెంట్'లో లక్ష్మీ నటించిన సంగతి విదితమే. మరోవైపు బాలకృష్ణ, మంచు మనోజ్ నటిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమె కథానాయికగా సెట్స్‌మీదకు వెళ్ళనున్న సొంత చిత్రం 'గుండెల్లో గోదారి' పనుల్లోనూ ఆమె నిమగ్నమై ఉన్నారు. ఇంత బిజీలోనూ మణిరత్నం చిత్రంలో నటిస్తున్నందుకు ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.

టర్నింగ్ పాయింట్: తులసి

నమ్మండీ నమ్మకపోండీ నేను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు నేను మూడు నెలల పసికందుని. సావిత్రి, మా అమ్మ స్నేహితులు. 'భార్య' సినిమాలో రాజబాబు మీద చిత్రీకరించిన ఓ పాటలో ఓ పాప కావాలని సావిత్రి కోరడంతో అమ్మ నన్ను అప్పగించింది. అలా తొలిగా మూడు నెలల వయసులో ఓ పాటలో నటించా. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరం వయసులో 'జీవన తరంగాలు'లో మరో పాటలో నటించా. నాన్న చనిపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా కేవలం మూడేళ్ల వయసులో పూర్తిస్థాయి బాలనటిగా మారా. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతానని జనం అంటుంటారు. చిత్రమేమంటే నేను స్కూలుకెళ్లి చదువుకోలేదు. దూరదర్శన్‌లో న్యూస్ బులెటిన్లను చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నా. మా సిస్టర్స్ స్కూలు నుంచి వచ్చి హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నేనేమో చాకొలేట్లు తింటూ షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తూ వచ్చా. 
అమ్మ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా నాన్న తన తాగుడు వ్యసనంతో అమ్మని బాధపెట్టిపోయాడు. నాన్నని అమ్మ ఎంతగానో ప్రేమించేది. నేనంటే అమ్మకి ఎంతో ముద్దు. ఈజీ చైర్‌లో కూర్చున్న అమ్మ గుండెలమీద పడుకునే నాకు ఆమె ఏడుపు వినిపించేది. 'గోరింటాకు', 'సీతామాలక్ష్మి', 'మంత్రిగారి వియ్యంకుడు', 'శుభలేఖ', 'శంకరాభరణం' సినిమాలు బాలనటిగా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు కూడా అమ్మ నా వద్దే ఉంది. ఆమె ఆశీస్సులే నాకు మంచి స్థితిని కల్పించాయనకుంటా. మంచి భర్త, కొడుకు, బెంగళూరు, చెన్నైలలో ఇళ్లు.. జీవితం హాయిగా నడిచిపోతోంది.

Thursday, December 15, 2011

గుణశేఖర్‌కి 'నిప్పు' పరీక్ష!

లాఠీ, సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు... ఈ సినిమాలకీ, గుణశేఖర్‌కీ సంబంధం ఉంది. అది - ఆ సినిమాలకు దర్శకుడు ఆయనే. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే 2003లో వచ్చిన 'ఒక్కడు' తర్వాత ఆయనకు మరో హిట్ లేదని అర్థమైపోతుంది. 
'ఒక్కడు'తో మహేశ్ ఇమేజ్‌ని ఎంతో పెంచిన గుణశేఖర్ అదే హీరోతో 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు తీసి అటు మహేశ్‌ని దెబ్బకొట్టడమే కాకుండా తానూ దెబ్బతిన్నాడు. 'అర్జున్' స్వయంగా మహేశ్ వాళ్ల బేనర్ నిర్మించినదే. దాని కోసం మధుర మీనాక్షి దేవాలయం సెట్‌ని భారీ ఖర్చుతో నిర్మించారు. ఫలితంగా 'అర్జున్' కాస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలింది. ఇక అశ్వనీదత్ నిర్మించిన 'సైనికుడు' డిజాస్టరైంది. దీని కోసం కూడా ఓ సునామీ సెట్‌ని భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించాడు గుణశేఖర్. వీటి తర్వాత పెళ్లి ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నానంటూ అల్లు అర్జున్ హీరోగా అతను రూపొందించిన 'వరుడు' సినిమా సైతం ఘోరంగా ఫెయిలైంది. దీనికి సైతం బిగ్ బడ్జెట్ అయింది. 
ఇలా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదుచేసిన గుణశేఖర్ ఇప్పుడు రవితేజ హీరోగా 'నిప్పు' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దీన్ని బొమ్మరిల్లు బేనర్‌పై వైవీఎస్ చౌదరి నిర్మిస్తుండటం విశేషం. తన మునుపటి సినిమాలకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న గుణశేఖర్ 'నిప్పు'ను మాత్రం యమ స్పీడుగా తీసేస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కూడా బాగా తక్కువని తెలుస్తోంది. అంటే అతడు మారాడని అనుకోవాలి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చౌదరి ప్రకటించాడు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాతో గుణశేఖర్ మునుపటి ఫాంని అందుకుంటాడా? క్రియేటర్‌గా ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టిన అతడి క్రియేటివిటీకి ఇది అగ్ని పరీక్ష. ఇందులో అతను పాసవుతాడా, ఫెయిలవుతాడా అన్నది ఇప్పుడు తేలాలి

Wednesday, December 14, 2011

త్రివిక్రం ఎదుట సవాలు

దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నాలుగో సినిమాతో బోల్తాపడ్డ త్రివిక్రం ఐదో సినిమాతో సవాలును ఎదుర్కొంటున్నాడు. అతను డైరెక్ట్ చేసిన 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయిన సంగతి తెలిసిందే. అదివరకు రచయితగా టాప్ రేంజ్ పొందిన త్రివిక్రం ఈ మూడు సినిమాలతో డైరెక్టర్‌గానూ టాలీవుడ్ టాప్‌లీగ్‌లో చేరిపోయాడు. అయితే అతడి నాలుగో సినిమా తొలి ఫ్లాప్‌ని అతడి జాబితాలో చేర్చింది. ఆ సినిమా 'ఖలేజా'. మహేశ్ హీరోగా అతడు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. 'మగధీర' స్ఫూర్తితో తీయడం వల్ల ఈ సినిమాలో ఒరిజినాలిటీ మిస్సయ్యిందనే అపవాదుతో పాటు మహేశ్, అనుష్క మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదనే విమర్శా వచ్చింది. కథలోనే దమ్ములేదనే మాట ఎలాగూ ఉంది. 
ఈ సినిమాతో దెబ్బతిన్న త్రివిక్రం ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యాడు. నవంబర్ 2న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్జున్ సరసన ఇలియానా తొలిసారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో బంపర్‌హిట్ కొట్టి తన సత్తా చాటాలని ఆశిస్తున్నాడు త్రివిక్రం. తొలి మూడు సినిమాలతో దర్శకుడిగా త్రివిక్రంలోని ప్రతిభ ఆవిరైందనీ, అందువల్లే 'ఖలేజా' లాంటి సబ్జెక్ట్ చేశాడనీ వచ్చిన విమర్శల్ని తాజా సినిమాతో తిప్పికొట్టాలని అతను భావిస్తున్నాడు. ఈ సవాలుని అతడు ఎలా అధిగమిస్తాడో చూడాల్సిందే.

Tuesday, December 13, 2011

ఇంటర్‌వ్యూ: వెంకటేశ్

నేను కలలు కనను


"నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే'' అని చెప్పారు హీరో వెంకటేశ్. ఆయనతో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న 'బాడీగార్డ్' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. త్రిష నాయికగా నటించిన ఈ చిత్రానికి 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకుడు. మంగళవారం వెంకటేశ్ జన్మదినం. ఈ సందర్భంగా 'బాడీగార్డ్'తో పాటు, తన తదుపరి చిత్రాల గురించీ, జీవితం పట్ల తన ఆలోచనలూ, అభిప్రాయాల గురించీ విపులంగా సంభాషించారు. అవేమిటో ఆయన మాటల్లోనే...


'బాడీగార్డ్' వచ్చిన తీరుకి చాలా హ్యాపీగా ఉన్నా. జనవరి 12న రిలీజ్. సంక్రాంతికి మంచి ఆల్‌రౌండ్ సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ డ్రామా, చక్కని సంగీతం ఉన్నాయి. తమన్ చాలా బాగా సంగీతం ఇచ్చాడు. తొలిసారి అతనితో కలిసి పనిచేశా. ఇతర సినిమాలకంటే ఎక్కువగా దీన్ని సంగీతభరిత చిత్రం చేశాడు. అతనిచ్చిన నేపథ్య సంగీతం గురించి కూడా చెప్పుకుంటారు.
నేను వెంకటాద్రిని 
ఇది గుడ్ క్లీన్ ఫిల్మ్. మలయాళ ఒరిజినల్ 'బాడీగార్డ్'తో పోలిస్తే మన అభిరుచికి తగ్గట్లు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాం. ప్రేక్షకులకి మంచి ఫీల్‌నిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు వెంకటాద్రి. 'చంటి' తర్వాత ఓ అమ్మాయికి బాడీగార్డుగా ఉండి కాలేజీ క్యాంపస్‌కి వెళ్లడం మళ్లీ ఈ చిత్రానికే. ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. లవ్ స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. త్రిష, నేను ఇదివరకు కలిసి చేసిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' తర్వాత తనది ఇందులో మరో మంచి పాత్ర. చివరి 30 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. రామ్-లక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు.
చక్కని దర్శకుడు, మంచి నిర్మాత 
గోపీచంద్ మంచి డైరెక్టర్. సింపుల్ అండ్ సిన్సియర్. అతనితో మంచి రాపో కుదిరింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు మంచి కెమెరా పనితనం చూపించాడు. బెల్లంకొండ సురేశ్‌తో ఇది నాకు రెండో సినిమా. అతను మంచి నిర్మాత. చక్కని నిర్మాణ విలువలతో తీశాడు. మిగతా సినిమాలన్నింటి కంటే భారీ ఎత్తున చేశాడు. ఇటీవలి కాలంలో చూడని చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. దానికి నేను గ్యారంటీ.
తదుపరి చిత్రాలు 
ఈ నెల 16 నుంచి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో పాల్గొనబోతున్నా. ఇది చాలా చక్కని చిత్రం. చాలా రోజుల తర్వాత ఓ అందమైన ఫ్యామిలీ ఫీల్‌తో, ఇద్దరు అన్నాతమ్ముళ్ల జీవిత ప్రయాణంతో, వాళ్ల ఎత్తుపల్లాలతో రాబోతున్న చిత్రం. నేను, మహేశ్ కలిసి చేయడానికి ఉద్వేగంతో ఎదురుచూస్తున్నాం. దీని తర్వాత మల్టీస్టారర్స్ పెరుగుతాయని ఆశిస్తున్నా. సంవత్సరానికి ఒకటాన్నా వస్తే బాగుంటుంది. దీనితో పాటు మెహర్ రమేశ్‌తో బాగా స్టయిలిష్‌గా ఉండే యాక్షన్ ప్రధాన చిత్రం చేయబోతున్నా. అందులో ఫ్యామిలీ డ్రామానీ, వినోదాన్ని చాలా తెలివిగా మేళవించాడు రమేశ్. ఆల్‌రౌండ్ సాలిడ్ కమర్షియల్ అప్పీల్‌తో ఉంటుంది. 'సీతమ్మ వాకిట్లో..' తర్వాత నాకు వైవిధ్యమైన సినిమా అవుతుంది. 'వివేకానంద' 2012 ద్వితీయార్థంలో మొదలవుతుంది. మణిశంకర్ దర్శకుడు. స్క్రిప్టు సిద్ధమయింది.
'బొబ్బిలి రాజా' సీక్వెల్ 
'బొబ్బిలి రాజా'కి సీక్వెల్ చేయాలంటే ఇవాళ చాలా నియమ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఆ సినిమాలో చాలా జంతువులు ఉంటాయి. నిజమైన జంతువులతో చేయాలంటే చాలా పర్మిషన్లు తెచ్చుకోవాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. వాటిని సడలిస్తే చేయొచ్చు. అందులో రానా కూడా చేస్తానంటున్నాడు సరదాగా.
రానాకే ఎక్కువ తెలుసు 
రానా ఊరంతా తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. తెలుగు, తమిళం, హిందీల్లో చేస్తున్నాడు. వాడు కష్టజీవి. నాకన్నా ఎక్కువ సినిమా తపన ఉన్నవాడు. నిజంగా చెప్పాలంగా నాకన్నా సినిమా గురించి ఎక్కువ తెలుసు. చిన్నప్పట్నించీ సినిమా గురించి నేర్చుకుంటూ వస్తున్నాడు. సాంకేతికంగా సినిమా గురించి అధ్యయనం చేయడం గానీ, సినిమాకు సంబంధించిన పుస్తకాలు చదవడం గానీ నాకంటే ఎక్కువ చేస్తుంటాడు. చాలామందితో కలుస్తుంటాడు. ఇది ఆరోగ్యకరమైన విషయం. ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. ప్రయోగాల కోసం తాపత్రయపడుతుంటాడు. దానివల్ల ప్రతిభ కూడా పెరుగుతుంటుంది. ఇప్పట్లో వాడూ, నేనూ కలిసి సినిమా చేసే అవకాశం లేదు.
అర్జున్ చిన్న పిల్లాడు 
మా అబ్బాయి అర్జున్ చాలా చిన్న పిల్లాడు. మూడో గ్రేడ్ చదువుతున్నాడు. అప్పుడే సినిమాలెందుకు? ఈ మధ్య స్కూల్లో ఓ ఎగ్జామ్‌కి సరిగా ప్రిపేరయినట్లు లేడు. దాంతో దిగాలుపడ్డాడు. నేనూ, మా ఆవిడా 'అదేమీ కంపల్సరీ కాదు కదా. రాయొద్దులే' అని చెప్పాం. కారులో కూర్చున్నాక "డాడ్. ఫియర్ ఈజ్ ద డార్క్‌సైడ్ ఆఫ్ ద పాత్'' అన్నాడు. అదేదో హాలీవుడ్ సినిమాలో డైలాగ్ అంట. వెళ్లి ఎగ్జామ్ రాశాడు. వాడికి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. పిల్లలు సహజంగా పెరగాలి. నిబంధనలు ఉండకూడదు. అన్నీ చేస్తుండాలి. సినిమాల్లో చెయ్యాలని వాడికి ఉంది. 'కరాటే కిడ్' చేస్తానంటున్నాడు.
శుభ పరిణామం 
ఇప్పటికే అందరు హీరోలూ వరుసగా సినిమా చేసుంటే ఇండస్ట్రీ బాగా సెట్టయి ఉండేది. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్నందుకు సంతోషం. ఇది శుభ పరిణామం. అయితే బడ్జెట్ మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకపోతే సమస్యలొస్తాయి. మినిమం గ్యారంటీ ఉండేట్లు చూసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేసేప్పుడు ప్లానింగ్ ముఖ్యం. కథ మీద నమ్మకం ఉండాలి.
వివాదాల్లో తప్పు లేదు 
ఏదో జన్మలో అంతా అయిపోయుంటుంది. అందుకే ఈ జన్మలో ఎలాంటి వివాదాలూ లేకుండా జీవితం సాగించగలుగుతున్నా. వివాదాల్లో చిక్కుకోవడంలో తప్పేమీ లేదు. అది శక్తినిస్తుంది. బహుశా నేను వాటికి ఎట్రాక్ట్ కాలేదేమో.
లక్ష్యాలు ఉండవు 
నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే. జీవితంలో మనం ఏదన్నా కండిషన్ పెట్టుకుంటే ఆ రోజు నుంచే మన జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. అది ఎవరు నేర్పించారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం అది సూటవదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం తెలుసు కానీ, ఈ లక్ష్యాలనేవి నాకు తెలీదు. ఓ లక్ష్యం అనేది పెట్టుకొని అది సాధించగానే, మళ్లీ ఇంకో లక్ష్యం పెట్టుకోవడం... ఈ పద్ధతికి నేను దూరం. ఇవన్నీ పెట్టుకొంటే ఇక ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ సంగతి తెలుసుకుంటే జీవితం చాలా సింపుల్‌గా ఉంటుంది. జీవితాన్ని వృథా చేయకూడదు. ఎన్నో చేస్తుంటాం. టైమ్ లేనట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాం. కానీ మన ఆరోగ్యం గురించి మనం ఓ అరగంట కేటాయించుకోం. జీవితంలో నిజమైన ఎమర్జన్సీ అనేది ఒకటే ఉంటుంది. అది మన చివరిదశ. అది తెలుసుకోకపోవడం మనం చేసే అతి పెద్ద తప్పు.
బౌద్ధ క్షేత్రాలు దర్శించుకున్నా 
ఇటీవల బుద్ధుడికి సంబంధించిన నాలు సుప్రసిద్ధ స్థలాల్ని దర్శించి వచ్చా. నేపాల్ సరిహద్దులకు వెళ్లా. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయ, సారనాథ్, నేపాల్‌లోని ఆయన జన్మస్థలం లుంబినీ వనం, ఆయన పరినిర్వాణం చెందిన ఖుషినగర్ (ఉత్తరప్రదేశ్) సందర్శించా. అలాగే వారణాసిలోని ప్రవక్త కబీర్ సమాధి, కాశీలోని నంది దేవుణ్ణి దర్శించుకున్నా.
ఆలోచనా విధానం మారాలి 
సమస్యలు ఉండని మనుషులు ఉండరు. దేవుడికి కూడా సమస్యలే. సమస్య నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ప్రధానం. సంతోషమనేది మానవుడికి ఎప్పుడూ ఉండదు. అది తెలుసుకుంటే ఆలోచనా విధానం మారుతుంది. జీసస్ కానీ, బుద్ధుడు కానీ, రాముడు కానీ, మహ్మద్ ప్రవక్త కానీ మనలాగే మనుషులు. వాళ్లు అందరూ ఆరాధించే స్థాయిలో ఎందుకున్నారు, మనం ఇలా ఎందుకున్నాం అని ఆలోచించుకోవాలి. అందరం అత్యున్నత స్థాయికి అర్హులమే. సమర్థులమే. ఆలోచనా విధానమే మారాలి. మనకీ, వాళ్లకీ అదే తేడా.


-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 13, 2011

Monday, December 12, 2011

మరలిరాని లోకాలకు మల్లెమాల

'కవికి గర్వము ముంజేతి కంకణమని/ఉర్వి నెవరికి తలవంచకుండ బ్రతికి'న సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి మరి లేరు. తెలుగు చిత్రసీమకు రాశిలో తక్కువైనా ఆణిముత్యాల్లాంటి సినిమాల్నీ, పాటల్నీ అందించిన ఎమ్మెస్ రెడ్డి మరలిరాని లోకాలకు తరలిపోయారు. తెలుగు సినిమా మరో కురువృద్ధుణ్ణి కోల్పోయింది. పోయిన ఆదివారం భారతీయ సినిమా ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ స్టార్ దేవానంద్‌ని కోల్పోతే, ఈ ఆదివారం కవి, రచయిత, నిర్మాత ఎమ్మెస్ రెడ్డిని తెలుగు సినిమా కోల్పోయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924 ఆగస్టు 15న జన్మించారు మల్లెమాల సుందరరామిరెడ్డి. తల్లిదండ్రులు రంగమ్మ, రామస్వామిరెడ్డి. ఎంతగా చదువుకోవాలన్నా ఏదో ఓ అవాంతరంతో ఆయన చదువు సాగలేదు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. 30 లక్షల మంది బలయిన బెంగాల్ కరువుపై సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన బుర్రకథకి ప్రభావితులై తంబుర చేతబట్టి ఆ బుర్రకథ చెప్పి పది వేల రూపాయలు సేకరించి కలకత్తాకు పంపారు. నెల్లూరు జమీన్ రైతు వారపత్రిక ప్రభావంతో జమీందారీ వ్యతిరేక భావాలను అలవర్చుకొని 'మాకొద్దీ జమీందారి పెత్తనం. అది/రద్దు కావాలి తప్పకుండ తక్షణం' అన్న గేయాన్ని రాశారు. దాన్ని విన్న ప్రకాశం పంతులు 'సహజకవి'గా మల్లెమాలను సంబోధించారు. అది ఆయనకు సార్థక నాయధేయంగా మారింది.

సినీ రంగంలో ఎగ్జిబిటర్‌గా అడుగుపెట్టి గూడూరులో సుందరమహల్ అనే థియేటర్‌ను నిర్మించి, 1963 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఆ థియేటర్ ద్వారా గూడూరులో తొలిసారిగా కొత్త చిత్రాల్ని విడుదల చేశారు ఎమ్మెస్ రెడ్డి. 1964లో చిత్ర నిర్మాణ సంస్థ కౌముది ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించి, దానిపై తొలిగా తమిళ చిత్రం 'కుమరిప్పెణ్'ను 'కన్నెపిల్ల'గా డబ్‌చేసి, 1966 డిసెంబర్ 26న విడుదల చేశారు. అదే రోజు విడుదలైన ఎన్టీ రామారావు సినిమా 'కంచుకోట' పోటీని తట్టుకొని ఆ సినిమా వంద రోజులు ఆడి, లాభాలు తెచ్చింది. ఆ తర్వాత 'కొంటెపిల్ల', 'కాలచక్రం' అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసిన ఆయన 1968లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'భార్య' చిత్రాన్ని నిర్మించి, స్ట్రయిట్ సినిమాల నిర్మాతగా మారారు. అది బాగా ఆడింది. ఆ తర్వాత లాభనష్టాలకు అతీతంగా అనేక చిత్రాల్ని నిర్మించారు. తను నిర్మించిన పలు చిత్రాల్లో ఆయన గేయ రచయితగానూ గొప్పగా రాణించారు. 'అంకుశం'లో ముఖ్యమంత్రిగా నటించి, నటుడిగానూ సమర్ధత చూపారు.
1964 నుంచీ చిత్రసీమలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ సినిమాలు నిర్మించలేక పోవడానికి కారణం వివిధ సంఘాల్లో బాధ్యుడిగా ఉండటమే. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా, దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘాధ్యక్షుడిగా, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షునిగా, ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షునిగా, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి.) ఛైర్మన్‌గా ఆయన చిత్రసీమకు ఇతోధిక సేవలందించారు. ఎఫ్‌డిసికి పనిచేస్తున్న కాలంలోనే దానికి సొంత భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, సెన్సార్ బోర్డు ఆఫీసును అందులోనే ఏర్పాటు చేయించారు. సెన్సార్ చిత్రాల పరిశీలనకు ఓ మినీ థియేటర్‌ను సైతం అందులో నిర్మించారు. బంజారాహిల్స్‌లో ప్రభుత్వమిచ్చిన స్థలంలో రెండేళ్లు శ్రమించి 'శబ్దాలయ' పేరుతో రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్ థియేటర్, ఎడిటింగ్ రూములు కట్టారు. సినిమా ప్రాసెసింగ్‌లో అది తనవంతు సేవ చేస్తూ ఉంది.
ఇక రచయితగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవ చిన్నదేమీ కాదు. 'మల్లెమాల రామాయణం', 'వృషభ పురాణం', 'నిత్య సత్యాలు', 'తేనెటీగలు', 'మంచు ముత్యాలు', 'అక్షర శిల్పాలు', 'ఎందరో మహానుభావులు', 'వాడని మల్లెలు' వంటి పద్య, గద్య పుస్తకాలు వెలువరించారు. అయితే ఇటీవల ఆయన రాసిన స్వీయ చరిత్ర 'ఇదీ నా కథ' సినీ రంగంలో కలకలం సృష్టించింది. తను పనిచేసిన నటీనటులు, దర్శకులతో తన అనుభవాలను ఉన్నదున్నట్లు ఆయన రాయడం చాలామందిని నొప్పించింది. వివాదాలకు దారితీసింది. జమున, శోభన్‌బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ వంటి లబ్ద ప్రతిష్టుల వల్ల తను ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని అందులో ఆయన ఉటంకించారు. ఏదేమైనా నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, నిర్భీతిగా వ్యవహరించే ఆయన స్వభావానికి 'ఇదీ నా కథ' ఓ బలమైన నిదర్శనం.
-ఆంధ్రజ్యోతి డైలీ (చిత్రజ్యోతి), డిసెంబర్ 12, 2011

రాలిపోయిన మల్లెమాల

విధికి శిరసు వొంచి విధిలేని స్థితిలోన
పదునొకండు యేండ్ల ప్రాయమందె
చదువు మానివేసి సంసార భారమ్ము
మూపు నందు దాల్చి మోయ వలసె!

..అని చెప్పుకొన్నా ఇష్టంగా సంసార సాగరాన్ని ఈదుతూనే సాహితీ లోకానికీ, తెలుగు భాషకూ అపార సేవచేసిన సుందరరామిరెడ్డి ఇకలేరు. 11 ఏళ్ల వయసులోనే చదువు మానివేసానని చెప్పి.. ఎంతో చదువుకున్న వారికంటే గొప్పగా.. 'ఎంత కమ్మని భాష మనది.. ఎదను కదిపే భాష మనది' .. అంటూ కమ్మని తేటతెలుగు వినిపించిన సహజ కవి అస్తమించారు. 
ఐదువేలకు పైగా పాటలు, పద్యాలతో తుది శ్వాస వరకూ సాహితీ సేద్యం చేసిన చలన చిత్ర శ్రామికుడు శాశ్వతంగా విశ్రమించారు. తెలుగు చిత్రసీమకు ఆణిముత్యాల్లాంటి సినిమాల్నీ, పాటల్నీ అందించిన మేటి నిర్మాత.. 'మల్లె-మాల' సాహితీ సౌరభాలు ఇక గుబాళించవు. మల్లెమాలగా సుప్రసిద్ధుడైన ఎమ్మెస్‌రెడ్డి (87) ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. ఆయనకు భార్య సౌభాగ్యమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెస్ రెడ్డి భౌతిక కాయానికి సోమవారం ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. 
మల్లెమాల సుందరరామిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924 ఆగస్టు 15న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రంగమ్మ, రామస్వామిరెడ్డి. ఆయనకు నలుగురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఎమ్మెస్ రెడ్డి ఇంటిపేరు.. 'మన్నెమాల'. అయితే అందులో అర్థం కనిపించక 'మల్లెమాల'గా మార్చుకున్నారు. మాస్టారు చెప్పిన పద్యాల్ని ఒకసారి విని వెంటనే వాటిని ఒక్క తప్పు పోకుండా పఠించి చిన్నతనంలోనే ఏకసంథాగ్రాహిగా పేరొందారు. 
అయితే.. ఆర్థిక కారణాల వల్ల ఆయన చదువు ఆగిపోవడంతో నాగలిపట్టి దుక్కి దున్నారు. ఆ తర్వాత వ్యవసాయం అర్ధంతరంగా ఆగిపోవడంతో ఉన్న ఊళ్లో నెలకు ఎనిమిది రూపాయల జీతం మీద మైకా డిపోలో ఉద్యోగిగా చేరాడు. కొన్ని రోజులకు జీతం వద్ద యజమానితో విభేదం తలెత్తి ఇంకెవరి వద్దా పనిచేయకూడదని నిర్ణయించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. అలా సంపాదించిన డబ్బుతో.. అప్పుల కోసం తండ్రి అమ్ముకున్న భూముల్ని రెట్టింపు ధరకు తిరిగి కొని, తండ్రికి ఆనందం చేకూర్చారు. 
కొద్ది రోజులపాటు రేషన్ దుకాణాన్ని కూడా నిర్వహించిన ఆయన మైకా వ్యాపారంలో అడుగుపెట్టి అందులోనూ రాణించారు. ఆయన రాసిన 'మాకొద్దీ జమీందారి పెత్తనం. అది రద్దు కావాలి తప్పకుండ తక్షణం' అన్న గేయాన్ని విన్న ప్రకాశం పంతులు మల్లెమాలను 'సహజకవి'గా సంబోధించారు. ఆ నాటి నుంచీ సాహితీలోకం ఆయన్ను సహజకవి మల్లెమాలగా పిలుస్తోంది. 1951 అక్టోబర్‌లో సౌభాగ్యమ్మను జీవిత భాగస్వామిగా స్వీకరించిన ఆయన రాజకీయాల్లోనూ కొద్దికాలం ఉన్నారు. 
1957లో వెంకటగిరి పంచాయతీ ఎన్నికల్లో మెంబర్‌గా గెలిచి, అధ్యక్షుడిగా మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్నుంచీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసే సమయంలో.. ఎమ్మెస్‌రెడ్డిని తమ పార్టీలో చేరమని ఆహ్వానించినా రాజకీయాలు తన తత్వానికి సరిపడవని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. 
ఎగ్జిబిటర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి గూడూరులో సుందరమహల్ అనే థియేటర్‌ను నిర్మించి, 1963 డిసెంబర్‌లో ప్రారంభించారు. 1964లో వ్యాపార నిమిత్తం మద్రాసు వెళ్లినప్పుడు అనుకోకుండా 'కుమరిప్పెణ్' అనే తమిళ సినిమా చూశారు. ఆ సినిమా నచ్చి, రూ.60 వేలకు డబ్బింగ్ హక్కులు కొన్నారు. కౌముది ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించి, 'కుమరిప్పెణ్'ను 'కన్నెపిల్ల'గా డబ్‌చేసి, 1966 డిసెంబర్ 26న తన బ్యానర్‌పై విడుదల చేశారు. ఆ తర్వాత 'కొంటెపిల్ల', 'కాలచక్రం' అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసిన ఆయన 1968లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'భార్య' చిత్రాన్ని నిర్మించి, స్ట్రయిట్ సినిమాల నిర్మాతగా మారారు. ఆ సినిమా బాగా ఆడింది. 
ఆ తర్వాత లాభనష్టాలకు అతీతంగా ఎమ్మెస్ రెడ్డి అనేక చిత్రాల్ని నిర్మించారు. వాటిలో.. 'శ్రీకృష్ణ విజయం', 'ఊరికి ఉపకారి', 'కోడెనాగు', 'ఏకలవ్య', 'పల్నాటి సింహం', తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, జూనియర్ ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన 'రామాయణం' చిత్రాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. 'అంకుశం'లో ముఖ్యమంత్రిగా నటించి, నటుడిగానూ తన సత్తా చాటారు. చిత్రసీమకు చెందిన అనేక సంఘాలకు ఎమ్మెస్‌రెడ్డి తన సేవల్ని అందించారు. తెలుగు సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. 
సామాజిక సేవ
ఎమ్మెస్ రెడ్డి యువకుడిగా ఉన్న కాలంలో బెంగాల్ కరువుకు 30 లక్షల మంది బలయ్యారు. దాని గురించి సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన 'బుర్రకథ'కి ప్రభావితులై తంబుర చేతబట్టి ఆ బుర్రకథ చెప్పి రూ.10 వేలు సేకరించి కలకత్తాకు పంపారు. దివిసీమ ఉప్పెన కారణంగా వేలాది మరణించినప్పుడు.. 'కన్నీటి కెరటాలు' అనే డాక్యుమెంటరీని నిర్మించారు. 1993 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌లో సంభవించిన భూకంపంలో అసువులు బాసిన వేలాది అభాగ్యుల మృతదేహాల్ని చూసి చలించిపోయిన ఆయన మరో తొమ్మిదిమంది కవులతో కలిసి 'బాష్పాంజలి' పేరుతో పుస్తకాన్ని ప్రచురించి, దాని ద్వారా రూ.లక్ష సేకరించి, భూకంప బాధితుల సహాయనిధికి పంపారు. 
అభినవ వాల్మీకి
రచయితగా ఎమ్మెస్‌రెడ్డి తెలుగు భాషకు చేసిన సేవ అపారం. 'మల్లెమాల రామాయణం', 'వృషభ పురాణం', 'నిత్య సత్యాలు', 'తేనెటీగలు', 'మంచు ముత్యాలు', 'అక్షర శిల్పాలు', 'ఎందరో మహానుభావులు', 'వాడని మల్లెలు' వంటి పద్య, గద్య పుస్తకాలు వెలువరించారు. వీటిలో 'మహిత వినయశీల మల్లెమాల' మకుటంతో రాసిన 'నిత్యసత్యాలు' ఆంధ్రజ్యోతి దినపత్రికలో నూరు వారాల పాటు ధారావాహికంగా వచ్చాయి. 
నాగభైరవ కోటేశ్వరరావు ఆయనకు 'అభినవ వేమన' బిరుదును ప్రదానం చేశారు. ఎమ్మెస్‌రెడ్డి రాసిన 'మల్లెమాల రామాయణం' చదివిన గుంటూరు శేషేంద్ర శర్మ 'మళ్లీ పుట్టాడు వాల్మీకి మల్లెమాలగా' అని ప్రశంసించారంటే కవిగా ఆయనది ఎంతటి ఉన్నత స్థాయో అర్థమవుతుంది. ఇటీవల ఆయన రాసిన స్వీయ చరిత్ర 'ఇదీ నా కథ' సినీ రంగంలో ఎంతగా కలకలం సృష్టించిందీ తెలిసిందే. 

-ఆంధ్రజ్యోతి డైలీ (మెయిన్), డిసెంబర్ 12, 2011

Saturday, December 10, 2011

బిగ్ స్టోరీ: ఎదగని హీరో!

ఆరడుగుల మించి పొడగరీ, స్ఫురద్రూపీ అయిన హీరో అతను. డైలాగులు చెప్పడంలో మంచి టైమింగ్, కామెడీ పండించగల నేర్పు అతని సొంతం. అయినా పన్నెండేళ్ల క్రితం 'స్వయంవరం' అనే సినిమాతో హీరోగా పరిచయమై, ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నా కెరీర్ పరంగా ఎక్కడివాడక్కడే నిల్చుండిపోయాడు. అతను వేణు! ఈశ్వర్ ఘనాపాటి (జి. ఈశ్వరరెడ్డి) డైరెక్ట్ చేయగా త్వరలో విడుదలవుతున్న 'రామాచారి... ఈడో పెద్ద గూఢచారి' సినిమా తన కెరీర్‌కు ఊపునిస్తుందని అతను గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈశ్వర్ ఇదివరకు 'సిద్ధు.. ఫ్రం సికాకుళం', 'సీతారాముల కల్యాణం.. లంకలో' సినిమాల్ని రూపొందించాడు. 'రామాచారి' సినిమా మలయాళంలో దిలీప్ నటించిన సూపర్ హిట్ మూవీ 'సి.ఐ.డి. మూస'కు రీమేక్.
విజయబాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'స్వయంవరం' (1999) సినిమా అనూహ్యంగా బాక్సాఫీసు వద్ద విజయం పొందడంతో అందులో తొలిసారి హీరోగా కనిపించిన వేణు పేరు యువతలోనూ, ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ నానింది. జి. రాంప్రసాద్ రూపొందించిన 'చిరునవ్వుతో' (2000) చిత్రం అతణ్ణి ప్రేక్షకులకి మరింత సన్నిహితం చేసింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు ఫ్లాపయ్యేసరికి ఒక్కసారిగా వెనుకపడిపోయాడు. 2001 ఆఖర్లో అర్జున్, జగపతిబాబు హీరోలుగా వచ్చిన 'హనుమాన్ జంక్షన్' సినిమాలో మూడవ హీరోగా నటించినప్పటికీ, కామెడీ నటనతో ఆకట్టుకోగలిగాడు. తర్వాత సంవత్సరం మామూలే. 
2003లో 'పెళ్లాం ఊరెళితే', 'కల్యాణరాముడు', 'ఖుషీఖుషీగా' సినిమాల బాక్సాఫీసు విజయంతో ఊరడిల్లిన అతనికి మళ్లీ ఒక హిట్టంటూ దక్కింది 2007లో శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 'యమగోల మళ్లీ మొదలైంది' సినిమాతోటే. వీటిలో అతడు సోలో హీరోగా కంటే కాంబినేషన్‌తోనే ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. ఇంతదాకా సాఫ్ట్, కామెడీ హీరో పాత్రలూ, సెకండ్, థర్డ్ హీరో పాత్రలూ చేస్తూ రావటాన అతడికంటూ ఓ ఇమేజ్ రాలేదు. 
2009లో వంశీ దర్శకత్వంలో సోలో హీరోగా చేసిన 'గోపి గోపిక గోదావరి' సినిమా పేరుకి హిట్టయ్యిందే కానీ వేణుకి దానివల్ల దక్కిన ప్రయోజనం ఏమీ లేదు. దాన్ని కమలినీ ముఖర్జీ సినిమా, వంశీ సినిమాగానే అందరూ చెప్పుకున్నారు. ఇటీవల చార్మి జతగా చేసిన 'మాయగాడు' మీద అతడు పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ 'రామాచారి' మీదనే ఉన్నాయి. 
ఇప్పటివరకు వేణుకి కలిసివచ్చింది ఎక్కువగా కామెడీ సినిమాలే. 'రామాచారి' అలాంటి కామెడీ మీద ఆధారపడిన సినిమా. ఇందులో అతడి సరసన రెండోసారి కమలిని నాయికగా చేసింది. 'గోపి గోపిక గోదావరి' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేయడం ఒక ప్లస్ పాయింటే. పోతే ఈ సినిమాని ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ నిర్మించింది. ఈ బేనర్‌లో వేణుకి ఇది ఆరో సినిమా కావడం గమనార్హం. అంటే ఇది అతనికి సొంత బేనర్ వంటిదే. 
కాగా వేణు ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగానూ నటించేందుకు అంగీకరించడం ఆసక్తికర పరిణామం. ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న 'దమ్ము'లో అతను ఎన్టీఆర్ బావగా నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక అతడికి ఆ తరహా అవకాశాలు మరిన్ని వచ్చే వీలుంది. ఓ వైపు హీరోగా, మరోవైపు కేరక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ కొనసాగిస్తున్న శ్రీహరి బాటలో నడిస్తే అతడికి వచ్చే నష్టమేమీ ఉండదు. పైగా ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు రావచ్చు కూడా. ఏదేమైనా తనకంటూ మార్కెట్ సృష్టించుకోగలిగే హీరోయే ఇవాళ చిత్రసీమలో మనగలుగుతాడు. లేదంటే మనుగడ కోసం నిరంతర పోరాటం తప్పదు.

'నూతిలో కప్పలు'... పైకి రావు, రానివ్వవు

డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా 'నూతిలో కప్పలు' అనే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 'పైకి రావు.. రానివ్వవు' అనేది ఉప శీర్షిక. పోల్‌స్టార్ పిక్చర్స్ పతాకంపై వినయ్, పూనాటి ఎస్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంటి జ్ఞానమణి దర్శకునిగా పరిచయమవుతున్నారు. భరత్‌భూషణ్, విజయ్‌సాయి, రామ్‌తేజ హీరోలుగా, ప్రతీక్ష హీరోయిన్‌గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, శరత్ మరార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 24 మంది దర్శకులు పాల్గొనడం గమనార్హం.
ఈ చిత్రం విజయం సాధించాలని రచయిత చిన్నికృష్ణ, శరత్‌మరార్, దర్శకులు వి. సముద్ర, అంజి శ్రీను, టి. వేణుగోపాల్ ఆకాంక్షించారు. 
సహ నిర్మాత వి. శివాజీరాజు మాట్లాడుతూ జనవరి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామన్నారు. 'నూతిలో కప్పలు... పైకి రావు, రానివ్వవు' అనే టైటిల్‌తోటే సినిమా కథ ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చునని దర్శకుడు చంటి తెలిపారు. నిర్మాతల్లో ఒకరైన వినయ్ మాట్లాడుతూ "చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా రూపొందబోతోంది. చాలామంది వ్యక్తులు తాము పైకి రాకపోవడమే కాక, పైకి రావాలనుకున్న వాళ్లని కూడా రానివ్వకుండా చేస్తుంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల కథే ఈ చిత్రం. దర్శకుడు చంటి నా తమ్ముడు. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ప్రతిభావంతుడు. ఈ చిత్రాన్ని బాగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. 
రవిబాబు, అల్లరి సుభాషిణి, తాగుబోతు రమేశ్, జోగినాయుడు తారాగణమైన ఈ చిత్రానికి కథ: వినయ్ జ్ఞానమణి, మాటలు: మహేంద్ర, తిరుపతి, సంగీతం: సుభాష్, ఛాయాగ్రహణం: ఎస్. మురళీమోహన్‌రెడ్డి, కళ: హరిబాబు, నృత్యాలు: వి.జె. శేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంటి జ్ఞానమణి.

జగపతిబాబుకి లలితకళాభూషణ బిరుదు

కళలను, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డా.టి.సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన టిఎస్ఆర్ లలితకళాపరిషత్ నరసరావుపేట జోన్ డిసెంబర్ 11న ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో జగపతిబాబును లలితకళాభూషణ బిరుదుతో సత్కరించనున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి చెప్పారు. అలాగే మూడు తరాల చలనచిత్ర ప్రముఖుడు, దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో వాణిశ్రీ, బ్రహ్మానందం, డా.రాజశేఖర్, జీవిత, ప్రియమణి, శియాగౌతమి, గిరిబాబు, గీతాంజలి, పరుచూరి వెంకటేశ్వరరావు, పి.విజయబాబు తదితరులు పాల్గొంటారు. సాలూరి వాసూరావు, నాగూర్‌బాబు, అంజనా సౌమ్య పాల్గొనగా ఎల్.ఆర్.ఈశ్వరి సినీ సంగీత విభావరి జరుగుతుంది.

రాంచరణ్ 'ఎవడు'

రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Thursday, December 8, 2011

చూడాల్సిన సినిమా: ద టిన్ డ్రం (1979)

గుంతర్ గ్రాస్ ప్రఖ్యాత నవల ఆధారంగా అదే పేరుతో వోకర్ ష్లాన్‌డార్ఫ్ డైరెక్ట్ చేసిన అద్భుత జర్మన్ ఫిల్మ్ 'ద టిన్ డ్రం' (1979). అదే ఏడాది బెస్ట్ ఫారిన్ ఫిలింగా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఈ సినిమా 'అపోకలిప్స్ నౌ'తో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'పాం డీఓర్' అవార్డును సాధించింది. 142 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో డేవిడ్ బెన్నెట్, మరియో అడార్ఫ్, ఏంజెలా వింక్లెర్, డేనియల్ ఆల్‌బ్రిచ్కి ప్రధాన పాత్రలు పోషించారు.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఆస్కార్ అనే బాలుడి దృక్కోణంలో నడిచే కథ 'ద టిన్ డ్రం'. వాస్తవ ప్రపంచంలోని భయానక స్థితులు చూసి ఎప్పటికీ పెరక్కుండా చిన్న పిల్లాడిగానే ఉండిపోవాలనే అతడి ఆలోచన మన హృదయాల్ని కలచి వేస్తుంది, కదిలించి వేస్తుంది. తన మూడో పుట్టినరోజున ఓ టిన్ డ్రంని గిఫ్ట్‌గా అందుకుంటాడు ఆస్కార్. తనని తాను ఇంటి మెట్లకింద విసిరేసుకుని, అక్కడే ఉండిపోతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం భరింపరాని విధంగా తయారైనప్పుడు డ్రంని వాయించడం మొదలుపెడతాడు. ఎవరైనా ఆ డ్రంని లాక్కోవడానికి యత్నిస్తే ఎదుటివాళ్లు తట్టుకోలేనంత గట్టిగా అరిచేస్తాడు. యుద్ధం ఆఖర్లో సోవియట్ దండయాత్ర తర్వాత తన నాయనమ్మ, తన సవతి తమ్ముడు బతికాక, అప్పుడు తను పెద్దవాణ్ణి కావాలని అనుకుంటాడు ఆస్కార్.
ఈ సినిమా తీసేందుకు దర్శకుడు అనుసరించిన జానపద శైలి కథనం మనల్ని ఆ రోజుల్లోకి తీసుకు వెళ్తుంది.'టిన్ డ్రం'ని అతడు ఉపయోగించుకున్న తీరుకి సమ్మోహనం చెందని ప్రేక్షకుడు ఉండడు. ఆస్కార్‌గా డేవిడ్ బెన్నెట్ నటన, ముఖ్యంగా అతడి కళ్లు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

బిగ్ స్టోరీ: కొత్త అవతారం!

ఎన్నడూ లేనివిధంగా తెలుగు కథానాయకులు మూకుమ్మడిగా కొత్తదనం కోసం సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో అడపాదడపా మాత్రమే మన హీరోలు కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. దాదాపు ప్రతి హీరో మూస పాత్రల నుంచి బయటపడి, కొత్త రూపంతో, కొత్త పాత్రతో ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాల్లో ప్రయోగాలు తక్కువ, కొత్తదనం తక్కువ, వాస్తవికత తక్కువ... అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే హీరోల దృక్పథాల్లో మార్పు వస్తోంది. దర్శకులు కమర్షియల్ కథల్లోనే కొద్దిగానైనా కొత్తదనం ఉండే పాత్రల చిత్రణ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలుగు హీరోలు కొత్త రూపాలతో దర్శనమిస్తున్నారు.
పవన్ కల్యాణ్
ఈ నెల 9న వస్తున్న 'పంజా' చిత్రం పట్ల అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. కారణం, అది పవన్ కల్యాణ్ చిత్రం కావడం, అందునా ఆయన ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో గడ్డంతో కనిపిస్తుండటం. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో స్థిరపడి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్‌గా పరిచయమవుతున్నాడు. స్టయిలిష్ టేకింగ్‌తో సినిమాలు రూపొందిస్తాడనే పేరున్న విష్ణు స్టయిలిష్ హీరోగా పేరున్న పవన్‌ను ఇప్పుడు 'పంజా'లో మాఫియా గ్యాంగ్ మెంబర్ జయదేవ్ పాత్రలో గడ్డంతో కొత్తగా చూపిస్తున్నాడు. ఈ కొత్త రూపంలో పవన్ మరింత స్టయిల్‌గా, సరికొత్త అందంతో కనిపిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాగార్జున
సమకాలీన హీరోలతో పోలిస్తే భిన్నమైన రూపాలతో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్న హీరో నాగార్జున. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రలతో మెప్పించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెలితిప్పిన మీసం, పొడవాటి కేశాలు, నుదుటన పొడవాటి తిలకం, మెడలో కండువాతో కొత్త రూపంతో కనిపిస్తున్నారు. స్వాతంత్య్ర పూర్వ కాలం నాటి నేపథ్యంతో తయారైన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రం కాబోతోంది.
బాలకృష్ణ
ప్రయోగాలంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ప్రియం. 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. వాటితో పాటు కొన్ని చారిత్రక పాత్రలు, పౌరాణిక పాత్రలూ ఆయన ధరించారు. మొన్నటికి మొన్న 'సింహా'గా పొడవాటి బుర్ర మీసాలతో కనిపించి, ఆ పాత్రలో గొప్పగా రాణించిన ఆయన నిన్నటికి నిన్న 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించి, నేటి కాలంలో పౌరాణిక పాత్రలకు తను మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు. ఇప్పుడు జనవరిలో రాబోతున్న 'అధినాయకుడు' చిత్రంలో తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముఖ్యంగా తాత గెటప్‌లో బాలకృష్ణ ఆహార్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రాజశేఖర్
భావోద్వేగపూరిత పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ తన కెరీర్‌లో 'ఓంకారం', 'శేషు' వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించారు. తాజాగా ఆయన 'అర్జున'లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యనారాయణ అనే సామాన్య రైతుగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. కొడుకు అర్జున్ సాయంతో సమాజానికి ఆయన ఏం చేంశాడనేది ఇందులోని ప్రధానాంశం. సూర్యనారాయణ పాత్రలో రాజశేఖర్ ప్రదర్శించే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ అంటున్నారు.
జగపతిబాబు
కుటుంబ కథాచిత్రాల నాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు ఆ ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలనెన్నింటినో పోషించారు. 'గాయం', 'హోమం' వంటివి అందుకు ఉదాహరణలు. ఇప్పుడు 'క్షేత్రం' చిత్రంలో ఆయన చేస్తున్న వీరనరసింహ రాయలు అనే పాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మెలి తిప్పిన పొడవాటి బుర్ర మీసాలతో ఆయన కొత్తగా, భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జగపతిబాబు పాత్ర ప్రత్యేకాకర్షణ అనేది దర్శకుడు టి. వేణుగోపాల్ మాట.
రాజేంద్రప్రసాద్
పేరుకి హాస్య చిత్రాల కథానాయకుడే అయినా తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆల్‌రౌండర్ అనిపించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. 'ఎర్ర మందారం', 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనాలు. ఇటీవలే 'క్విక్‌గన్ మురుగన్'గా ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 'డ్రీమ్' చిత్రంలో సరికొత్త గెట ప్‌తో ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకుడు భవానీ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రాజేంద్రప్రసాద్ భిన్నమైన హెయిర్ స్టయిల్‌తో మరో ప్రయోగం చేస్తున్నారు.
రానా
ప్రయోగాలకు సీనియర్లే కాదు కుర్ర హీరోలు కూడా సై అంటున్నారు. అనేకమంది నేటి తరం హీరోలు సినిమా సినిమాకీ రూపం మార్చుకుంటూ వస్తుంటే తనూ అదే దారిలో పయనిస్తున్నానంటున్నారు రానా. 'లీడర్', 'నేను నా రాక్షసి' చిత్రాల్లో గడ్డంతో ఓ రకంగా కనిపించిన ఆయన ఇప్పుడు 'నా ఇష్టం' చిత్రంలో షేవ్ చేసిన గడ్డం, మీసంతో కొత్త రూపంతో కనిపించబోతున్నారు. జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకుడు.