Saturday, December 8, 2012

బండోడు గుండమ్మ (1980) - సమీక్ష


ఓ అమాయకుల్లో అమాయకుడి కథతో దాసరి నారాయణరావు రూపొందించిన సినిమా 'బండోడు గుండమ్మ'. అమాయకుడైన ఆంజనేయులుకి చెల్లెలంటే ప్రాణం. చిన్న పిల్లలతో కలిసి ఆడుకునే అతను వారి ప్రోద్బలం మీద గుండమ్మను ప్రేమిస్తాడు. క్రమంగా గుండమ్మ కూడా అతడికి మనసిస్తుంది. దశరథరామయ్య కొడుకు డాక్టర్ ప్రసాద్‌తో తన చెల్లెలి పెళ్లి జరగాలంటే  25 వేల రూపాయలు కట్నం కింద ఇవ్వాలంటారు. డబ్బు సంపాదన కోసం పట్నం వెళ్లిన ఆంజనేయులుకు రాఘవరావు తారసపడతాడు. అతను అచ్చం ఆంజనేయులు మాదిరిగానే ఉంటాడు. కానీ రాఘవరావు దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. తన స్థానంలో ఆంజనేయుల్ని ప్రవేశపెట్టి పోలీసుల బారి నుంచి తప్పించుకోవాలనుకున్న రాఘవరావు ఓ కారు ప్రమాదంలో గాయపడతాడు. ఆంజనేయుల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చిన గుండమ్మ అతడే అనుకొని రాఘవరావును ఊరికి తీసుకుపోతుంది. మరోవైపు రాఘవరావు స్థానంలో అతనింటికి వెళ్తాడు ఆంజనేయులు. ఆ తర్వాత కథ ఎలా నడిచిందనేది ఆసక్తికరం.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు కొన్ని పాటలు కూడా రాసిన దర్శకుడు దాసరి నారాయణరావు ఈ కథను ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రీకరించడంలో సఫలమయ్యాడు. ఆంజనేయులు తన చెల్లెలికి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన సన్నివేశాల్లో రచయితగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే ఆంజనేయుల్ని రాఘవరావు తన ఇంటికి తెచ్చినప్పుడు రాఘవ భార్య తన చిన్నారి కొడుక్కి పులి, ఆవు కథను చెప్పే సన్నివేశం ఆయన ఇమాజినేషన్‌కు నిదర్శనం.
ఇటు ఆంజనేయులు, అటు రాఘవరావు పాత్రల్లో కృష్ణ వైవిధ్యభరితమైన నటన ప్రదర్శించాడు. ఆంజనేయులు పాత్రలో ఆయన చూపిన అమాయకత్వం, హావభావాలు ఆకట్టుకుంటాయి. గుండమ్మగా జయప్రద బాగా రాణించగా, రాఘవరావు భార్యగా ప్రభ సరిగ్గా సరిపోయింది. చక్రవర్తి బాణీలు కూర్చిన పాటల్లో 'సిరిపురపు సిన్నోడా', 'ఊరు నిదురపోతోంది.. గాలి నిదురపోతోంది' పాటలు శ్రావ్యంగా ఉన్నాయి. కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్.

Friday, December 7, 2012

మాధవపెద్ది వెంకటరామయ్య (1898-1951)


రంగస్థలంపై ఉదాత్త నటనకు భాష్యం చెప్పిన మాధవపెద్ది వెంకటరామయ్యకు శివాజీ, దుర్యోధనుడు, రంగారాయుడు పాత్రలు ఎంతో పేరు తెచ్చాయి. దుర్యోధనుడిని అభిజాత్యం ఉన్న శౌర్యవంతునిగా, శాస్త్ర విషయ సంపన్నుడిగా, స్వశక్తి మీద నమ్మకం ఉన్న రారాజుగా తొలిసారి రంగస్థలం మీద మలిచింది మాధవపెద్దే. 'ప్రతాపరుద్రీయం'లో విద్యానాథుని పాత్రను ధరించి ఆ పాత్రకు కూడా అజరామరత్వం కల్పించారు.
మాధవపెద్ది సినిమాల్లోనూ రాణించారు. 'ద్రౌపదీ మాన సంరక్షణము' (1936)లో శిశుపాలుడు, 'సతీ తులసి' (1936)లో శివుడు, 'విజయదశమి' (1937)లో కీచకుడు, 'నల దమయంతి' (1938)లో నలుడు, 'పార్వతీ కల్యాణం' (1939)లో శివుడు, 'చంద్రహాస' (1941)లో దుష్టబుద్ధి వంటి పాత్రల్ని గొప్పగా పోషించారు.
ఆయన గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1898లో జన్మించారు. 1951 మార్చి 19న తెనాలిలో మరణించారు.

Saturday, December 1, 2012

అగ్నిపూలు (1981) - సమీక్ష


అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.