Saturday, December 8, 2012

బండోడు గుండమ్మ (1980) - సమీక్ష


ఓ అమాయకుల్లో అమాయకుడి కథతో దాసరి నారాయణరావు రూపొందించిన సినిమా 'బండోడు గుండమ్మ'. అమాయకుడైన ఆంజనేయులుకి చెల్లెలంటే ప్రాణం. చిన్న పిల్లలతో కలిసి ఆడుకునే అతను వారి ప్రోద్బలం మీద గుండమ్మను ప్రేమిస్తాడు. క్రమంగా గుండమ్మ కూడా అతడికి మనసిస్తుంది. దశరథరామయ్య కొడుకు డాక్టర్ ప్రసాద్‌తో తన చెల్లెలి పెళ్లి జరగాలంటే  25 వేల రూపాయలు కట్నం కింద ఇవ్వాలంటారు. డబ్బు సంపాదన కోసం పట్నం వెళ్లిన ఆంజనేయులుకు రాఘవరావు తారసపడతాడు. అతను అచ్చం ఆంజనేయులు మాదిరిగానే ఉంటాడు. కానీ రాఘవరావు దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. తన స్థానంలో ఆంజనేయుల్ని ప్రవేశపెట్టి పోలీసుల బారి నుంచి తప్పించుకోవాలనుకున్న రాఘవరావు ఓ కారు ప్రమాదంలో గాయపడతాడు. ఆంజనేయుల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చిన గుండమ్మ అతడే అనుకొని రాఘవరావును ఊరికి తీసుకుపోతుంది. మరోవైపు రాఘవరావు స్థానంలో అతనింటికి వెళ్తాడు ఆంజనేయులు. ఆ తర్వాత కథ ఎలా నడిచిందనేది ఆసక్తికరం.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు కొన్ని పాటలు కూడా రాసిన దర్శకుడు దాసరి నారాయణరావు ఈ కథను ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రీకరించడంలో సఫలమయ్యాడు. ఆంజనేయులు తన చెల్లెలికి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన సన్నివేశాల్లో రచయితగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే ఆంజనేయుల్ని రాఘవరావు తన ఇంటికి తెచ్చినప్పుడు రాఘవ భార్య తన చిన్నారి కొడుక్కి పులి, ఆవు కథను చెప్పే సన్నివేశం ఆయన ఇమాజినేషన్‌కు నిదర్శనం.
ఇటు ఆంజనేయులు, అటు రాఘవరావు పాత్రల్లో కృష్ణ వైవిధ్యభరితమైన నటన ప్రదర్శించాడు. ఆంజనేయులు పాత్రలో ఆయన చూపిన అమాయకత్వం, హావభావాలు ఆకట్టుకుంటాయి. గుండమ్మగా జయప్రద బాగా రాణించగా, రాఘవరావు భార్యగా ప్రభ సరిగ్గా సరిపోయింది. చక్రవర్తి బాణీలు కూర్చిన పాటల్లో 'సిరిపురపు సిన్నోడా', 'ఊరు నిదురపోతోంది.. గాలి నిదురపోతోంది' పాటలు శ్రావ్యంగా ఉన్నాయి. కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్.

Friday, December 7, 2012

మాధవపెద్ది వెంకటరామయ్య (1898-1951)


రంగస్థలంపై ఉదాత్త నటనకు భాష్యం చెప్పిన మాధవపెద్ది వెంకటరామయ్యకు శివాజీ, దుర్యోధనుడు, రంగారాయుడు పాత్రలు ఎంతో పేరు తెచ్చాయి. దుర్యోధనుడిని అభిజాత్యం ఉన్న శౌర్యవంతునిగా, శాస్త్ర విషయ సంపన్నుడిగా, స్వశక్తి మీద నమ్మకం ఉన్న రారాజుగా తొలిసారి రంగస్థలం మీద మలిచింది మాధవపెద్దే. 'ప్రతాపరుద్రీయం'లో విద్యానాథుని పాత్రను ధరించి ఆ పాత్రకు కూడా అజరామరత్వం కల్పించారు.
మాధవపెద్ది సినిమాల్లోనూ రాణించారు. 'ద్రౌపదీ మాన సంరక్షణము' (1936)లో శిశుపాలుడు, 'సతీ తులసి' (1936)లో శివుడు, 'విజయదశమి' (1937)లో కీచకుడు, 'నల దమయంతి' (1938)లో నలుడు, 'పార్వతీ కల్యాణం' (1939)లో శివుడు, 'చంద్రహాస' (1941)లో దుష్టబుద్ధి వంటి పాత్రల్ని గొప్పగా పోషించారు.
ఆయన గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1898లో జన్మించారు. 1951 మార్చి 19న తెనాలిలో మరణించారు.

Saturday, December 1, 2012

అగ్నిపూలు (1981) - సమీక్ష


అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

Saturday, November 24, 2012

ఆడది గడప దాటితే (1980) - సమీక్ష


మన సమాజంలో పురుషునికి లేకుండా స్త్రీకి మాత్రమే కొన్ని కట్టుబాట్లు నిర్దేశించారు. గడప దాటిన స్త్రీకి అగచాట్లు, నగుబాట్లు తప్పవని చెప్పే కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. గడప దాటిన స్త్రీని సమాజం ఎంతగా హింసిస్తుందో చలం సైతం తన రచనల్లో ఎంతో సహజంగా చిత్రించాడు. ఫలానా అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందని హేళన చేయడం తేలికే. కానీ అలా వెళ్లిందంటే దాని వెనక ఎంతటి బలీయమైన కారణం ఉండి ఉంటుందని ఆలోచించేవాళ్లు బహు అరుదు. ఇదే పాయింటుతో దర్శకుడు బి.ఎస్. నారాయణ రూపొందించిన సినిమా 'ఆడది గడప దాటితే'.
కోటీశ్వరుడు రఘునందనరావు ఏకైక కుమార్తె కరుణ. రాహుల్ అనే యువకుడు, కరుణ గాఢంగా ప్రేమించుకుంటారు. కరుణ వెనకున్న ఆస్తిని చూసే ఆమెని రాహుల్ ప్రేమిస్తున్నాడనేది రఘునందనరావు నమ్మకం. రాహుల్‌ను ఇంటికి పిలిపించి అవమానిస్తాడు. అయినా కరుణ, రాహుల్ జంకరు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం తేదీ నిర్ణయించుకుంటారు. ఇంట్లోంచి వచ్చేసిన కరుణకు చిల్లిగవ్వ ఆస్తి రాదని తెలిసిన రాహుల్ మాయమైపోతాడు. రోడ్డునపడిన కరుణను ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఆదుకుంటాడు. ఆమెని నమ్మించి గుళ్లో పెళ్లి చేసుకుంటాడు. కరుణకు నెలలు నిండిన సందర్భంలో కృష్ణకు అదివరకే పెళ్లయిందనే సంగతి తెలుస్తుంది. కరుణను ఆస్పత్రిలో చేర్పించి, ఆ ఊరినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడు కృష్ణ. మగబిడ్డను కన్న కరుణకు ఆర్టిస్ట్ మధుబాబు ఆశ్రయమిస్తాడు. తన చిత్రాలకు ఆమెను మోడల్‌గా తీసుకుంటాడు. ఆమెపై అతను ప్రేమ పెంచుకుంటున్న సమయంలోనే అతని స్నేహితుడు, కోటీశ్వరుడు ఆయిన ఆనంద్ రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నది పతాక సన్నివేశం.
కరుణగా కన్నడ మంజుల సమర్థవంతంగా నటించింది. రాహుల్‌గా నరసింహరాజు, మధుబాబుగా మురళీమోహన్, ఆనంద్‌గా శ్రీధర్ రాణించారు. జగ్గయ్య, శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్ ఇతర ప్రధాన పాత్రధారులు. యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాయగా, దాశరథి, సినారె, కోపల్లె పాటలు రాశారు. ఎం.బి. శ్రీనివాస్ కూర్చిన బాణీలు శ్రవణానందకరం. చక్కటి డ్రామాతో బి.ఎస్. నారాయణ ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారు. శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి. రామచంద్రరావు, ఎం.ఎం. రాజా, సి. సుబ్బారాయుడు ఈ సినిమా నిర్మించారు.

Saturday, November 17, 2012

ఆకలి రాజ్యం (1981) - సమీక్ష


దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న కాలంలో కె. బాలచందర్ రూపొందించిన గొప్ప చిత్రం 'ఆకలి రాజ్యం'. ఆనాటి యువతరం ఈ సినిమాని తమ సొంతం చేసుకుంది. కథలోకి వస్తే - రంగా తన కాళ్ల మీద తను నిల్చోవాలనుకునే ఆదర్శ యువకుడు. ఆత్మాభిమాని. ఆవేశపరుడు. అందుకే ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లినా నిరాశే ఎదురవుతుంది. ఆ నిరాశ ఆవేశంగా మారి శ్రీశ్రీ మాటల్ని ఉటంకిస్తుంటాడు. అతడికి నాటకాలు వేసే దేవి పరిచయమవుతుంది. క్లైమాక్స్‌లో రంగా క్షౌరశాలలో పనిచేస్తుండగా అతడి తండ్రి గడ్డం గీయించుకోడానికి వస్తాడు. తనని చూసి దిగ్భ్రాంతికి గురైన తండ్రికి ఆత్మ గౌరవంతో చేసే ఏ పనయినా మంచిదేననీ, దేశంలో నిరుద్యోగం పోవాలంటే అదొక్కటే మార్గమనీ చెబుతాడు రంగా. ఈ సన్నివేశం హృదయాల్ని కదిల్చి వేస్తుంది. ఈ కథను దర్శకుడు చెప్పిన తీరు, మధ్య మధ్య రంగా బృందం చేష్టలు, రంగా, దేవి మధ్య డ్యూయెట్లు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. 'హ్యాట్స్ ఆఫ్ టు బాలచందర్' అనిపిస్తాయి. రంగా పాత్రలో కమల్ జీవించాడు. దేవిగా శ్రీదేవి ఉత్తమ నటన ప్రదర్శించింది. గణేశ్ పాత్రో సంభాషణలు సినిమాకి ఆయువుపట్టు. అవి అడుగడుగునా ఆలోచింపజేస్తాయి. ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీలు వినసొంపుగా ఉండి, పాటల్ని మళ్లీ మళ్లీ వినాలనిపించేట్లు చేస్తాయి. ఆత్రేయ, శ్రీశ్రీ అందించిన సాహిత్యానికి అందులో ప్రధాన భాగముంది. లోకనాథన్ సినిమాటోగ్రఫీ దర్శకుడి అంతరంగాన్ని అర్థం చేసుకుని పనిచేసింది.

Wednesday, July 18, 2012

నిర్మాత దిల్ రాజుతో ఇంటర్వ్యూ

అవి కనెక్టయితే 'తూనీగ తూనీగ' సూపర్ హిట్టే
"హీరోకి సంగీతమంటే పిచ్చి. హీరోయిన్‌కి జంతువులంటే ప్రేమ. వారి అభిరుచులు కథలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులకి అవి కనెక్టయితే సినిమా సూపర్ డూపర్ హిట్టవడం ఖాయం" అని చెప్పారు దిల్ రాజు. పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రాంజీ నిర్మించిన్న 'తూనీగ తూనీగ' సినిమాని ఆయన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించీ, మరికొన్ని ఆసక్తికర అంశాల గురించీ దిల్ రాజు చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
మేకర్‌గా ఎమ్మెస్ రాజు ప్రతిభ ఏమిటో తెలుసు. వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో మాగంటి రాంజీతో పాటు నిర్మాణంలో నేనూ పాలు పంచుకున్నా. నా సొంత సినిమాకి ఎలాగైతే అన్ని విషయాలూ చూసుకుంటానో అలాగే ఈ సినిమాకీ చేయాలని నిర్ణయించుకుని 70 శాతం షూటింగ్ అయ్యాక రషెస్ చూపించమన్నా. అప్పటికి క్లైమాక్స్, కొన్ని కీలక సన్నివేశాలు తియ్యలేదు. అందులో పొరబాట్లుగా నాకు అనిపించినవీ, నాకు కలిగిన సందేహాలనూ చెప్పాను. రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో చర్చించా. ఈ సినిమాని సూపర్‌హిట్ చెయ్యాలంటే ఏం చెయ్యొచ్చో వాటిని అందరినీ కూర్చోపెట్టి చర్చించాను. అప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కడ మార్పులు చెయ్యాలో, తర్వాత కథ ఎలా ఉండాలో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజుగారు కూడా కన్విన్స్ అయ్యారు. దానికి తగ్గట్లే సినిమా తీశారు.

అంచనాలకు తగ్గ సినిమా
ఎమ్మెస్ రాజు, దిల్ రాజు కలిసి చేస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో, దానికి తగ్గట్లే ఈ సినిమా ఉంటుంది. ఇది లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా మేళవించిన సినిమా. నిర్మాణ విలువలు, కథ, సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్. హీరో హీరోయిన్లది చూడ ముచ్చటైన జంట. ఇళయరాజా గారబ్బాయి కార్తీక్‌రాజా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.
సుమంత్ భలే చేశాడు
హీరో సుమంత్ అశ్విన్ చాలా అందంగా ఉన్నాడు. తన కేరక్టర్‌ను సూపర్బ్‌గా చేశాడు. కథని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. హీరో సరిగా నటించకపోతే ఎంత మంచి కథయినా కిందికి పడిపోతుంది. సుమంత్ వల్ల ఈ సినిమా పై స్థాయికి వెళ్లిందని గట్టిగా చెప్పగలను. థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లు 'సినిమా భలే ఉంది, అబ్బాయి భలే ఉన్నాడు' అంటారు. సుమంత్ రెండో సినిమా మా బేనర్‌లో ఉంటుంది. నా వద్ద ఉన్న రెండు స్క్రిప్టులకు అతను సరిపోతాడు. 'తూనీగ తూనీగ' ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూసి, అప్పుడు స్క్రిప్టు ఎంచుకుంటా.
సినిమా హిట్టవ్వాలంటే...
మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేది కేవలం 10 శాతం లోపే. 40 శాతం మంది టీవీలు చూస్తుంటే, మిగతా 50 శాతం మందికి సినిమా అంటేనే అవగాహన లేదు. టీవీల్ని దాటి థియేటర్‌కు జనం వచ్చేలా చేస్తేనే సక్సెస్. 'ఈగ'లో ఏం ఉందని అంతమంది చూస్తున్నారు. 'బొమ్మరిల్లు', 'దూకుడు', 'గబ్బర్‌సింగ్' సినిమాల్ని ఎందుకు అంతమంది చూశారు. వాటిలో విషయం ఉంది కాబట్టి. ఓ సినిమా హిట్టవ్వాలంటే నా దృష్టిలో మూడు విషయాలు కీలకం. కంటెంట్ (కథాంశం), కాస్టింగ్ (తారాగణం), టెక్నీషియన్స్ (సాంకేతిక నిపుణులు). 'తూనీగ తూనీగ'లో కంటెంట్, కాస్టింగ్, టెక్నీషియన్స్ పర్‌ఫెక్ట్. తమ ప్రేమకు ఎదురైన అడ్డంకుల్ని హీరో హీరోయిన్లు ఎలా అధిగమించి ఒక్కటయ్యారనేదే కథ. దాన్ని ఎంత ఇంటరెస్టింగ్‌గా రాజుగారు మలిచారన్నది తెరమీద చూడాల్సిందే.
కౌన్సిలింగ్‌కి రెడీ
ప్రతి నెలా రెండో ఆదివారం కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో నేను ప్రపోజల్ పెట్టాను కానీ ఎందుకనో దాన్ని పట్టించుకోలేదు. సినిమా ఎలా తియ్యాలనే విషయంలో కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను రెడీ. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయనే విషయంలో నిర్మాతలకి జడ్జిమెంట్ ఉండాలి. కథ విన్నాక తన సినిమా ఎలా ఉంటుందో అనే విజన్ ఉండాలి. సినిమా మేకింగ్ పట్ల తపన, ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండాలి. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఇక్కడ ఆదాయం తక్కువనే విజ్ఞత ఉండాలి. లాభం సంగతి తర్వాత, పెట్టుబడి వస్తుందనే గ్యారంటీ లేదనే సంగతి గ్రహించాలి. వీటిలో అవగాహన ఉంటే సక్సెస్ రేట్ కచ్చితంగా పెరుగుతుంది. నేను ఇప్పుడు తీస్తున్న సినిమాలకి పెట్టిన పెట్టుబడి వేరే వ్యాపారాల మీద పెడితే గ్యారంటీగా లాభాలు ఎక్కువే ఉంటాయి. కానీ సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తోనే ఇక్కడ ఉన్నా.
అంజలి నటన అసాధారణం
వచ్చే దసరా సెలవులకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలవుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా తీస్తున్నాడు. రాజమండ్రి, తణుకు, భద్రాచలంలో రెండో షెడ్యూల్ చేశాం. ఆగస్టు 7 నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చేస్తాం. సెప్టెంబర్ 5 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్. సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఎస్సెట్. 'సీతమ్మ వాకిట్లో..'కీ, బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'కభీ ఖుషి కభీ ఘమ్'కీ ఎలాంటి పోలికా లేదు. 'సీతమ్మ వాకిట్లో' అంటే భారతదేశం, 'సిరిమల్లె చెట్టు' అంటే ఓ కుటుంబం. భారతదేశంలోని ఓ అందమైన కుటుంబం కథ ఈ సినిమా. వెంకటేశ్ సరసన అంజలి, మహేశ్ జోడీగా సమంత నటిస్తున్నారు. నిజానికి వెంకటేశ్‌కి జోడీగా త్రిషను కానీ, అనుష్కను కానీ తీసుకోవాలనుకున్నాం. కానీ పాత్ర కంటే మహేశ్‌కి వదినగా నటించాలనే అంశం హైలైట్ అవడంతో వారు వెనుకంజ వేశారు. చివరకు అంజలిని తీసుకున్నాం. ఆమె అసాధారణంగా నటిస్తోంది. ఈ సినిమా కథ ప్రధానంగా వెంకటేశ్, మహేశ్, అంజలి పాత్రల చుట్టూ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత అంజలి తెలుగులో పెద్ద రేంజ్ హీరోయిన్ అవుతుంది.

Saturday, July 14, 2012

'ఆకాశంలో సగం' యండమూరి 'అనైతికం'


యండమూరి వీరేంద్రనాథ్ నవల 'అనైతికం' ఆధారంగా 'ఆకాశంలో సగం' అనే సినిమా రూపొందుతోంది. రవిబాబు, ఆశా షైనీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నంది ప్రొడక్షన్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. 'నగరంలో నిద్రపోతున్న వేళ' ఫేమ్ ప్రేమరాజ్ దర్శకుడు.
రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "అందరూ దర్శకులే నటిస్తున్న ఈ చిత్రం నిజంగా ప్రయోగాత్మక చిత్రం. యండమూరి అద్భుతంగా రాసిన 'అనైతికం'ను ప్రేమరాజ్ చక్కగా తెరమీదకు తీసుకొస్తున్నాడు'' అన్నారు. రవిబాబు మాట్లాడుతూ "ప్రేమరాజ్ నా సినిమాలకూ పనిచేశాడు. నేను చదివిన తొలి తెలుగు నవల 'అనైతికం'. ఆ కథలో ప్రధాన వేషం నేను వెయ్యడం చాలా గర్వంగా ఉంది'' అని చెప్పారు. 'అనైతికం'ను సినిమాగా తీయాలనే ప్రేమరాజ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాననీ, ఇది హిట్టయితే ఇండస్ట్రీలో కొత్త ధోరణి మొదలవుతుందనీ యండమూరి అన్నారు. ఇంతమంది దర్శకులు నటిస్తున్న సినిమాని నిర్మించడం తన అదృష్టమని శివకుమార్ చెప్పారు. దర్శకుడు ప్రేమరాజ్ మాట్లాడుతూ "చాలా కాలం క్రితం 'అనైతికం' చదివినప్పుడు సినిమాగా తీస్తే బాగుంటుందనుకున్నా. జనానికి ఓ మంచి సినిమా అందించాలనే తపనతో అందరూ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆశా షైనీకి ఇది జీవితకాల పాత్ర అవుతుంది. ఈ నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది'' అన్నారు.
రేవా, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సాగర్, రాంప్రసాద్, మద్దినేని రమేశ్, దేవీప్రసాద్, కామేశ్వరరావు, కాదంబరి కిరణ్, కాకినాడ శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, ఛాయాగ్రహణం: కల్యాణ్ సమీ, కళ: రాజీవ్ నాయర్, సహ నిర్మాత: టి. వెంకటేశ్ యాదవ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమరాజ్.

Thursday, July 5, 2012

దాసరి ఆచరణలోకి దిగాలి

దాసరి నారాయణరావు మాటలు ఆపేసి, ఆచరణలోకి దిగాలని సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు చదలవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనీ, లీజుదార్లపై తిరుగుబాటుకు తాను కంకణం కట్టుకుంటున్నాననీ ఆదివారం సీనియర్ దర్శకుడు దాసరి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చదలవాడ "చిన్న సినిమాల విషయంలో ఆదివారం దాసరిగారు చేసిన వ్యాఖ్యల విషయంలో వంద శాతం నేను ఏకీభవిస్తున్నా. అయితే ఆయన చాలా కాలం నుంచే ఈ మాటల్ని చెబుతూ వస్తున్నారు. కేవలం ప్రకటనలకే ఆయన పరిమితవుతున్నారు. అలా కాకుండా ఆయన తన మాటల్ని ఆచరణలో చూపిస్తే చిన్న నిర్మాతలు నిజంగానే సంతోషిస్తారు. ఆయన ఆచరణలో దిగితే చిన్న సినిమాలకు మేలు జరగడమనేది పది నిమిషాల పని. దళారుల వల్ల మహా మహా నిర్మాతలే సినిమా నిర్మాణాన్ని మానేసుకుని వేరే వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. సీనియర్ నిర్మాతలు ఇవాళ ఎంతమంది సినిమాలు తీస్తున్నారో గమనిస్తే అర్థమైపోతుంది, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. నిర్మాతల పెట్టుబడిని దళారులు కాజేస్తున్నారు. చాలామంది వ్యక్తులు తమకు దాసరి వంటివాళ్లు అండగా ఉంటారని భావించి మోసపోతున్నారు. అలాంటి ఎంతోమంది చిన్న సినిమాల నిర్మాతలకు మేలు జరగాలంటే వెంటనే దాసరిగారు కార్యాచరణ చేపట్టాలి'' అని చెప్పారు.

దసరాకు 'లక్కీ'


శ్రీకాంత్, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'లక్కీ'. జ్యోత్సారెడ్డి సమర్పిస్తున్నారు. రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోంది. హరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజరాజేశ్వరి శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ "చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కథానాయకుడు శ్రీకాంత్ ఇంటికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించాం. తదుపరి షెడ్యూల్ జూలై 6నుంచి 20 వరకు జరుగుతుంది. దసరాకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.
బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు, చిట్టిబాబు, రఘుబాబు, కృష్ణభగవాన్, తిరుపతి ప్రకాష్, నల్లవేణు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, ధన్‌రాజ్, జయసుధ, రోజా, సన, గీతాసింగ్, హేమ, రత్నాసాగర్, రమ్య, శ్రీలలిత తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం, సంగీతం: సాయి కార్తీక్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: నాగిరెడ్డి, ఫైట్స్: నందు, కళ: కె.వి.రమణ, కొరియోగ్రఫీ: భానోదయ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముదిగొండ వెంకటేష్.

Monday, July 2, 2012

ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తా


"ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఈజ్ ద బిగ్. సక్సెస్ కంటే పెద్ద సినిమా మరోటి లేదు'' అని వ్యాఖ్యానించారు నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "నాకు తెలిసి ఈ ఆరేడు సంవత్సరాల్లో నా మనసుకు నచ్చినవి మూడే మూడు సినిమాలు. ఒకటి 'బొమ్మరిల్లు', తర్వాత 'అలా మొదలైంది', ఇప్పుడు 'ఈ రోజుల్లో'. ఈ సినిమా కోసం ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు. 'ఇది వంద రోజులు ఆడుతుంది, ఆ ఫంక్షన్‌కి నేనొస్తాన'ని చెప్పాను. సినిమాని నేను ప్రేక్షకుడిగానే చూస్తా. సినిమాలో ఏడుపు సీన్లుంటే నా కళ్లవెంట నీళ్లొస్తాయి. నవ్వు సీన్లొస్తే చంటి పిల్లాడిలా నవ్వుతాను. నేను బడ్జెట్ గురించి మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో కేవలం రూ. లక్షతో పాటలు లేకుండా, అక్కడక్కడా తప్పితే మాటలు కూడా లేకుండా తీసిన 'నీడ' పెద్ద సినిమానా? చిన్న సినిమానా? 110 రోజులాడింది. ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసిన సినిమానో, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమానో పెద్ద సినిమా కాదు. 'ప్రేమాభిషేకం' కంటే పెద్ద హిట్టు లేదు. దానికి ఊటీ కూడా వెళ్లలేదు. పాటలన్నీ విజయా గార్డెన్స్‌లోనే తీశాను. వాటికంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా, ఈ మధ్య వచ్చే సినిమాల్లో. ఈ రోజు కోట్లు గురించి మాట్లాడుతున్నారు. 'ఒసేయ్ రాములమ్మా' సినిమా నేల టిక్కెట్టు రూ. రెండు, పై టిక్కెట్లు రూ. 10 ఉన్న రోజుల్లో రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇవాళ రేట్ల ప్రకారం లెక్కేస్తే రూ. 220 కోట్లు అవుతాయి. రికార్డుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, సినిమాల గురించి. 'ఈ రోజుల్లో' సినిమాలో కథలేదు. నిత్య జీవిత సత్యాలున్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది.. ఇదీ ఇందులో ఉంది. ఇవాళ ఏదైతే యూత్‌లో నడుస్తుందో, సమ సమాజంలో ఏం జరుగుతోందో.. దాన్ని వడపోసి, చక్కని స్క్రీన్‌ప్లేతో తీశాడు మారుతి. 'ఈ రోజుల్లో' వంటివి పది సినిమాలు వస్తే చాలు'' అని ఆయన చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ "చిన్న సినిమాలు తీసేవాళ్లకి ఇన్‌స్పిరేషన్ 'ఈ రోజుల్లో'. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చేసి సహకారం అందించాను. అన్ని తరగతుల ప్రేక్షకులు చూస్తే ఇంకా ఎక్కువగా రెవెన్యూ సాధించాల్సిన సినిమా'' అన్నారు. కేవలం 'ఈ రోజుల్లో' సక్సెస్‌ని మాత్రమే కాక దాని వెనుక ఉన్న ప్లానింగ్, కృషిని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నిర్మాత కె. అచ్చిరెడ్డి సూచించారు. ఈ సినిమాకి పెట్టిన ఖర్చునీ, వచ్చిన కలెక్షన్లనూ చూస్తే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ "రచయిత స్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రెండో సినిమా తియ్యబోతున్నాం. మేం తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే సినిమాలు తీస్తాం'' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తియ్యకూడదు. సినిమాని ప్రేమించి తియ్యాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దాసరిగారి చేతులమీదుగా వంద రోజుల షీల్డు అందుకోవడం నా జీవితంలో జరిగిన అద్భుతం. ఇప్పుడు నా కథని నమ్మి బెల్లంకొండ సురేశ్ 'బస్‌స్టాప్' నిర్మిస్తున్నారు. అది పెద్దలు, పిల్లలు కూడా చూసి ఆనందించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లకు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ వంద రోజులు షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లకొండ సురేశ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, దర్శకుడు రవికుమార్‌చౌదరి, రచయిత సంజీవి, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాసు, డాక్టర్ దశరథరామిరెడ్డి, హీరోలు శ్రీ, సాయి, హీరోయిన్ రేష్మా, నిర్మాత శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూడు దశాబ్దాల మోహన్‌బాబు నిర్మాణ సంస్థ


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డా. మోహన్‌బాబుది ప్రత్యేకమైన బాణీ. నటనలో విలక్షణత ఆయన ప్రత్యేకత. ఒడిదుడుకులతో ప్రారంభమైన సినీ జీవితం సాఫీగా మారి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తరువాత విలన్ అయ్యారు, కామెడీ విలన్‌గా నటించారు, మళ్లీ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం హీరోగానే కొనసాగుతున్నారు. నటుడుగా 500 చిత్రాల్లో నటించి, నిర్మాతగా 56 సినిమాలు నిర్మించిన మోహన్‌బాబు గురించి, ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి ఎంతయినా చెప్పవచ్చు. అయితే ఈ రోజున ఆయన గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అంశం ఒకటుంది.
అదేమిటంటే.. 'స్వర్గం-నరకం' చిత్రంతో నటుడిగా ఆయనకు సినీ జన్మ ప్రసాదించిన డాక్టర్ దాసరి నారాయణరావు 'కేటుగాడు' సినిమాతో సోలో హీరోని చేశారు. ఆ సినిమా తరువాత ఇక హీరోగానే కొనసాగాలనే సంకల్పంతో ఆరు నెలల పాటు ఏ ఆఫర్లు అంగీకరించకుండా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ను నెలకొల్పి, తొలి సారిగా 'ప్రతిజ్ఙ' చిత్రం నిర్మించారు మోహన్‌బాబు. ఆ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.... ఆర్టిస్టు అయిన ఏడేళ్లకే సొంతంగా చిత్ర నిర్మాణసంస్థను నెలకొల్పడం నిజంగా ఆ రోజుల్లో ఒక సాహసమే. అందుకే ఈ విషయమై తన గురువు దాసరిని కలిసి ఆయన సలహా అడిగారు మోహన్‌బాబు. 'ఆరి ్టస్ట్‌గా బిజీగా ఉన్నావు.. పేరు తెచ్చుకుంటున్నావు.. ఇలాంటి సమయంలో నీకు చిత్రనిర్మాణం అవసరమా?' అని ఆయన అన్నారు. అయితే పక్కనే ఉన్న దాసరి పద్మ మాత్రం దానికి అంగీకరించలేదు. 'నీకెందుకు నేనున్నాను.. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి.. ఆల్ ది బెస్ట్' అని ఆవిడ ప్రోత్సహించడంతో ముందడుగు వేశారు మోహన్‌బాబు. ఆ రోజుల్లో ఎం.డి. సుందరం ప్రముఖ కథార చయిత. కన్నడంలో, తమిళంలో చాలా చిత్రాలకు కథలు అందించారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు కథారచయితగా పనిచేశారు. ఆయన చెప్పిన ఓ కథ మోహన్‌బాబుకి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నారు. అప్పటికి దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవలేదు.
ఆ తరుణంలో ఆర్టిస్ట్ ప్రభాకరరెడ్డి దర్శకుడు బోయిన సుబ్బారావు పేరు సజెస్ట్ చేసి, ' నీ టెంపర్‌మెంట్‌కి తగిన దర్శకుడతను' అని చెప్పడంతో తన సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆయనకి అప్పగించారు మోహన్‌బాబు. హీరోయిన్‌గా కవితను, మిగిలిన పాత్రలకు సత్యనారాయణ, గిరిబాబు, త్యాగరాజు, సాక్షి రంగారావు తదితరుల్ని ఎంపిక చేసి షూటింగ్‌కు ప్రొసీడ్ అయ్యారు. టెక్నీషియన్ల విషయంలో కూడా రాజీ పడకుండా ఆ నాడు అగ్ర స్థానంలో ఉన్న సంగీత దర్శకుడు సత్యంను, ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపీకృష్ణని, ఎడిటర్ కె.ఎ.మార్తాండ్‌ని ఎన్నుకొన్నారు.
ఎన్టీఆర్ ఆశీస్సులు చెన్నయ్ వాహినీ స్టూడియోలో ఉదయం ఏడు గంటలకు జరిగిన పాటల రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై ఆశీస్సులు అందచేశారు. ఆ రోజు చెన్నయ్‌కి దూరంగా ఓ లొకేషన్‌లో 'బొబ్బిలిపులి' షూటింగ్ ఉంది. అందుకే మేకప్‌తో అక్కడి వెళుతూ మార్గ మధ్యంలో మోహన్‌బాబు రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై కొబ్బరి కాయ కొట్టారు. 'ఈ సినిమా హిట్ అవుతుంది.. నువ్వు పెద్ద హీరోవవుతావు' అని ఆశీర్వదించారు. దాసరి పద్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక 'ప్రతిజ్ఞ' చిత్రం షూటింగ్ తిరుపతికి సమీపంలో ఉన్న కొటాల గ్రామంలో ప్రారంభమైంది. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి పద్మ క్లాప్ ఇచ్చారు. 27 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. సినిమా తొలి కాపీ వచ్చిన తరువాత హీరో కృష్ణ తల్లితండ్రులకు సినిమా చూపించి అభిప్రాయం అడిగారు మోహన్‌బాబు. సినిమా బాగుందని వాళ్లు మంచి రిపోర్ట్ ఇచ్చారు. మంచి టాక్ స్ప్రెడ్ కావడంతో వైజాగ్ ప్రాంతానికి చెందిన ధనరెడ్డి అనే ఆయన సినిమా కొని రాష్ట్రమంతా విడుదల చేశారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. చెన్నయ్ మ్యూజిక్ అకాడెమీ హాలులో జరిగిన శతదినోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, దాసరి నారాయణరావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అలా 30 ఏళ్ల క్రితం నిర్మాతగా కూడా తన ప్రస్థానం ప్రారంభించిన మోహన్‌బాబు ఇంతవరకూ 56 చిత్రాలు నిర్మించి శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఈ సంస్థ నిర్మిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నాయి.

తెలుగు సినిమా దార్శనికుడు కె.వి.రెడ్డి శతజయంతి



తెలుగువారు గర్వంగా తలెత్తుకునే రీతిలో చిత్రాలను రూపొందించిన దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. తక్కువ సినిమాలే చేసినా ఒక్కో సినిమా ఒక పాఠ్యగ్రంధంలా మిగిలింది. ఆయన పౌరాణికాలు తీశారు, జానపదాలు రూపొందించారు. భక్తి రస చిత్రాలు, సాంఘికాలు తీశారు. ఏ సినిమా తీసినా అందులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన కె.వి.రెడ్డి శత జయంతి (జూలై 1) సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.
తను దర్శకుడు కావడానికి ముందు వాహినీ పిక్చర్స్ నిర్మించిన చిత్రాలకు క్యాషియర్‌గా పని చేసి ఉండటంతో చిత్రం బడ్జెట్ గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండేదాయనకు. తాను అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడమే కాకుండా పక్కాగా షాట్ డివిజన్ చేసుకుని, నిడివిని ముందే నోట్ చేసుకుని, దానికి ఏ మాత్రం పెరగకుండా తీయగలగడం కె.వి. రెడ్డి ప్రత్యేకత. ఏ సినిమాకైనా స్క్రీన్‌ప్లే ప్రాణం.
కెవి రెడ్డి తయారు చేసుకున్న స్క్రీన్‌ప్లే ఎంత పకడ్బందీగా ఉండేదంటే మొత్తం స్క్రిప్ట్, షాట్స్‌తో సహా రాసి సిద్ధం చేస్తే చిత్ర నిర్మాణం పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తయినా దాన్ని ఫాలో అవుతూ అద్భుతంగా సినిమా తీయగలడని చెప్పేవారు. 'మాయాబజార్' చిత్రం విషయమే తీసుకుంటే అంత పెద్ద కథని, అన్ని కేరెక్టర్లతో ఎటువంటి గందరగోళం లేకుండా మనసుకి హత్తుకొనే విధంగా కె.వి. చిత్రీకరించగలిగారంటే దానికి కారణం ఆయన తయారు చేసుకున్న స్క్రీన్‌ప్లే. అందుకే తర్వాత కాలంలో ఎడిటింగ్ రూమ్‌లలో అనేకమంది కె.వి.రెడ్డి ఫొటోలు పెట్టుకున్నారు.
దర్శకత్వంలో కెవిది ఒక ప్రత్యేకమైన స్కూల్. దర్శకునికి స్క్రిప్టే ప్రధానం అని ఆయన నమ్మేవారు. ఒక కథను ఎన్నుకున్న తరువాత స్క్రిప్ట్ సంతృప్తికరంగా తయారయ్యేవరకూ ఎంతకాలమైనా నిరీక్షించాలని అనేవారు. ఒక సారి బౌండ్ స్క్రిప్ట్ తయారైన తరువాత సెట్‌లో స్పాంటేనియస్‌గా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి ఆయన అంగీకరించేవారు కాదు. కెవి రెడ్డి స్కూల్‌లో శిక్షణ పొంది అగ్రకథానాయకునిగా ఎదిగిన ఎన్టీఆర్ దర్శకునిగా మారినప్పుడు తన గురువు స్కూల్‌నే ఫాలో అయ్యారు.
షూటింగ్ సమయంలో కెవి అనుసరించిన విధానమే వేరు. ఆర్టిస్టులకు నటించి చూపడం, ఇలా చెయ్యండి అని చెప్పడం ఆయనకు అలవాటు లేదు. ఆర్టిస్టుల్నే నటించమనే వారు. అది తనకి కావాల్సిన రీతిలో లేకపోతే ఇంకోలా చెయ్యమని చెప్పి, తనకి నచ్చిన షాట్‌ని ఫైనలైజ్ చేసేవారు. మరో విషయం ఏమిటంటే షాట్‌లో ఆరుగురు ఆర్టిస్టులుంటే , డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ ఒకరే అయినా ఆరు ఫైనల్ రిహార్సల్స్ చేయించేవారు. ప్రతి రిహార్సల్‌లో ఆర్టిస్టుల రియాక్షన్ గమనించేవారు.
ఎక్కువతక్కువలుంటే సరిదిద్దేవారు. మేకప్ టచప్, లైటింగ్, కెమేరా పొజిషన్.. అన్నీ చూసుకున్న తరువాత టేక్ తీసేవారు. ఆయన ఏనాడు షాట్ అయ్యాక 'ఓ.కె.' అనేవారు కాదని, 'పాస్' అని మాత్రమే అనేవారని ఆయన దర్శకత్వంలో నటించిన వారు చెప్పేమాట. కె.వి. దర్శకత్వంలో ఎన్నో మంచి పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న హాస్య నటుడు రేలంగి ఓ సందర్భంలో మాట్లాడుతూ 'రెడ్డిగారు పాస్ మార్కులే మాకు ఇచ్చేవారు కానీ నూటికి నూరు మార్కులు ఇవ్వడం మేమెరుగం' అని చెప్పారు. కె,వి.రెడ్డి సెట్‌లో ఉంటే ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఉండేది. అలాగే వాళ్ల మీద ఆయనకు కంట్రోల్ ఉండేది.
ఆయన సెట్‌లో ఉంటే చాలు వాతావరణం చాలా సైలెంట్‌గా ఉండేది. ఎవరు మాట్లాడినా.. ఆఖరికి నిర్మాతయినా ఆయన సహించేవారు కాదు. సెట్ బయటకు వెళ్లి మాట్లాడుకోమని చెప్పడానికి సందేహించేవారు కాదు. అలాగే తన షూటింగ్స్‌కి విజిటర్స్‌ని అనుమతించేవారు కాదు. అయితే మరీ కావాల్సిన వాళ్లు వచ్చినప్పుడు మాత్రం ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవారు. అది కూడా వాళ్లు పది, పదిహేను నిముషాల్లో పని ముగించుకుని వెళ్లి పోవాలి.
షాట్ డివిజన్, డైలాగ్ వెర్షన్ పూర్తయిన తరువాత షాట్ ఎంత నిడివి ఉండాలన్నది స్టాప్ వ్యాచ్ దగ్గర పెట్టుకుని నిర్ణయించేవారు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఆ డైలాగ్ చదివించి పుటేజ్ నోట్ చేసుకోవడం ఆయనకు అలవాటు. 'గుణసుందరి కథ' చిత్రనిర్మాణ సమయంలో ఒకసారి ఇలి పుటేజ్ నోట్ చేసుకుంటూ 'ఆ షాట్ ఎంత వచ్చింది' అని అడిగారు కె.వి. 'రెండు నిముషాలు' అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగానే 'కాదు.. మరో అరనిముషం పెరుగుతుంది. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పేది గోవిందరాజుల సుబ్బారావు. ఆయన డైలాగులు తాపీగా చెబుతారు కనుక ఆయన ఉన్న ప్రతి దృశ్యానికి మనం కొంత టైమ్ అదనంగా కలుపుకోవాలి' అన్నారట కె.వి. అంత దూరాలోచన చేసేవారాయన.
అలాగే 'జగదేకవీరుని కథ' చిత్రనిర్మాణ సమయంలోనూ ఇటువంటి సంఘటనే జరిగింది. షాట్ డివిజన్ చేస్తూ ఈత కొలనులో తీయాల్సిన షాట్స్ నోట్ చేస్తూ , ఆ సన్నివేశాలను డిసెంబర్ నెలలో చిత్రీకరిస్తారు కనుక వేడి నీళ్లు సిద్ధంగా ఉంచాలని ఆరు నెలలకు ముందే సీన్ పేపర్‌లో పేర్కొనడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని కె.వి.రెడ్డి చిత్రాలు రూపొందించినా అవి అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమాకు కమర్షియల్ బాట ఏర్పరచిన ఈ దిగ్ధర్శకుడు తెరస్మరణీయుడు, చిరస్మరణీయుడు.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు
1. భక్తపోతన -7:1:1943 వాహిని వారి నాగయ్య, మాలతి, గౌరినాధశాస్త్రి 177 రోజులు
2. యోగివేమన -10:4:1947 వాహిని వారి నాగయ్య, రాజమ్మ- 50రోజులు
3. గుణసుందరి కథ -29:12:1949- వాహిని వారి శ్రీరంజని, శివరావు 162 రోజులు
4. పాతాళభైరవి - 15: 3:1951- - విజయావారి ఎన్టీఆర్, మాలతి, ఎస్వీఆర్ 365 రోజులు
5. పెద్దమనుషులు - 11:3: 1954 - వాహినీ వారి గౌరీనాథశాస్త్రి, రేలంగి 100 రోజులు
6. దొంగరాముడు -1:10:1955... అన్నపూర్ణా వారి... అక్కినేని, సావిత్రి.... 100 రోజులు
7.మాయాబజార్ -27: 3: 1957.. విజయా వారి.. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, ఎస్వీఆర్.. 175 రోజులు
8. పెళ్లినాటి ప్రమాణాలు -17:12: 1958 .. జయంతి వారి.. అక్కినేని, జమున.. 50 రోజులు
9. జగదేకవీరుని కథ - 9:8: 1961... విజయా వారి. ఎన్టీఆర్, బి.సరోజాదేవి... 175 రోజులు
10. శ్రీకృష్ణార్జున యుద్ధం -9:1: 1963... జయంతీ వారి.. ఎన్టీఆర్, అక్కినేని, బి.సరోజాదేవి.. 147 రోజులు
11. సత్య హరిశ్చంద్ర - 22: 4: 1965.. విజయావారి.. ఎన్టీఆర్, ఎస్. వరలక్ష్మి... 63 రోజుల
12. ఉమాచండీగౌరీశంకరుల కథ - 11:1: 1968.. విజయావారి.. ఎన్టీఆర్, బి.సరోజాదేవి... 50 రోజులు
13. భాగ్యచక్రం - 13:9: 1968... జయంతి వారి.. ఎన్టీఆర్, బి.సరోజాదేవి.. 42 రోజులు.
14. శ్రీకృష్ణసత్య -24: 12: 1971.. ఆర్.కె.బ్రదర్స్.. ఎన్టీఆర్, జయలలిత... 100 రోజులు
తమిళం 
15. -పాతాళభైరవి - 17: 5:1951- - విజయావారి- ఎన్టీఆర్, మాలతి, ఎస్వీఆర్ 175 రోజులు
16 మాయాబజార్ .. -14: 4: 1957.. విజయా వారి.. ఎన్టీఆర్, జెమినీ గణేశన్, సావిత్రి, ఎస్వీఆర్.. 150 రోజులు
17. వాళ్ కై ఒప్పందం .. -4:9: 1959.. జయంతి వారి.. అక్కినేని, జమున.. 50 రోజులు
హిందీ 
18. పాతాళభైరవి.. -ఏప్రిల్ 1952 .. జెమినీ వారి.. ఎన్టీఆర్, మాలతి.. 175 రోజులు

'లింగడు రామలింగడు' గా కృష్ణుడు


కృష్ణుడు హీరోగా నటిస్తున్న చిత్రం 'లింగడు-రామలింగడు'. వేగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సమర్పిస్తోంది. పాలాక్షుని ఫిలిమ్స్ పతాకంపై అశోక్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీనారాయణ నిర్మాత. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత చెబుతూ "ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన కృష్ణుడు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చక్కని కథ, కథనాలతో ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం అతని మామ పెట్టే కండిషన్లు, టెన్షన్లు ఎలా భరించాడు? అనేదే కథ. కృష్ణుడు ద్విపాత్రాభినయం చేశారు. జూలై రెండో వారంలో పాటల్ని, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.
భానుశ్రీ మెహ్రా, రాజీవ్ కనకాల, కృష్ణభగవాన్, కొండవలస, నరసింహరాజు, కవిత, విజయభాస్కర్, జెన్నీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేష్, పాటలు-సంగీతం-నృత్యాలు: స్టైల్ మధు, కెమెరా: నర్సింగ్‌రావు, నిర్మాత: లక్ష్మీ నారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అశోక్‌రావు.

'గబ్బర్‌సింగ్' విజయం పవన్‌కల్యాణ్‌కే అంకితం


పవన్‌కల్యాణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తాను నిర్మించిన 'గబ్బర్‌సింగ్' చిత్రం శుక్రవారంతో 306 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుందని బండ్ల గణేశ్ చెప్పారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "మా కెరీర్‌కి అర్థం చెప్పిన చిత్రం 'గబ్బర్‌సింగ్'. 81 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమలో మా సినిమా నెంబర్‌వన్‌గా నిలవడం మా అదృష్టం. మలేషియాలో యాభై రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా ఇంత హిట్టవడానికి హీరో పవన్‌కల్యాణ్ కారణం. మూడో చిత్రమైనా అద్భుతంగా డైరెక్ట్ చేసి, మాటలు రాసిన హరీశ్ శంకర్, తన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్, మిగతా టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా ఈ విజయంలో భాగమే. జూలై తొలివారంలో భారీ స్థాయిలో అభిమానుల మధ్య యాభై రోజుల వేడుక చేయబోతున్నాం'' అని చెప్పారు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ "నేను తీసిన 'మిరపకాయ్' కంటే ముందే పవన్ కల్యాణ్‌కు సబ్జెక్ట్ చెప్పా. అప్పుడు చేయడానికి కుదరలేదు. కానీ నాతో సినిమా చేస్తానని మాటిచ్చిన ఆయన ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిన 'గబ్బర్‌సింగ్'ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. నేను మంచి స్క్రిప్టు రాసినా సినిమా ఇంత పెద్ద హిట్టవడానికి కారణం పవన్ కల్యాణ్ పవర్. చేతి మణికట్టు విరిగినా, వెన్నునెప్పి బాధిస్తున్నా లెక్కచెయ్యకుండా మిగతా షూటింగ్‌ని పూర్తిచేశారు. ఆయన అంకితభావానికి ప్రతిఫలం దక్కింది. అందుకే ఈ విజయం పవన్ కల్యాణ్‌కే అంకితం. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది'' అని తెలిపారు.

అల్లరి నరేష్ కొత్త చిత్రం

అల్లరి నరేష్ పుట్టిన రోజు (జూన్ 30) సందర్భంగా సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమిల్లి నిర్మించే కొత్త చిత్రం వివరాలు ప్రకటించారు. నరేష్‌తో ఇంతకుముందు 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్' చిత్రాలను రూపొందించిన జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా వివరాలను నిర్మాత అమ్మిరాజు వెల్లడిస్తూ 'అక్టోబర్ నెల్లో విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి డిసెంబర్‌కల్లా పూర్తి చేస్తాం. వినోదం, యాక్షన్ కలగలసిన ఫ్యామిలీ డ్రామా ఇది. 'సీమటపాకాయ్' చిత్రంలో 'ఆకాశంలో ఒక తార' పాటను రీమిక్స్ చేసినట్లే ఈ సినిమాలో కూడా హీరో కృష్ణ చిత్రంలోని మరో పాటను రీమిక్స్ చేస్తాం. నరేష్ సరసన ఓ కొత్త నటి నటిస్తుంది. 'సీమటపాకాయ్' చిత్రానికి పనిచేసిన టీమ్ ఈ సినిమాకి కూడా పనిచేస్తుంది' అన్నారు.

Saturday, June 30, 2012

'కొరియర్ బోయ్ కళ్యాణ్'గా నితిన్

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొరియర్ బోయ్ కళ్యాణ్'. తమిళంలో ఈ చిత్రం 'తమిళ్ సెల్వనుం తనియార్ అంజలుం' పేరుతో తెరకెక్కనుంది. గౌతమ్ వాసుదేవమీనన్ నిర్మాత. ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. నిర్మాత మాట్లాడుతూ "నేను దర్శకత్వం వహించిన 'ఏమాయ చేసావె' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు నితిన్‌తో తీస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. భాషలకు అతీతంగా అందరి అభినందనల్ని అందుకుంటుంది. ప్రేమ, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్ళలో ఉన్న కథ ఇది. కథ నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాల్లో మంచి పాటలు పాడిన కార్తీక్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నారు. కీలక పాత్రల్లో జై ,సంతానం, విటివి గణేష్ నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది'' అని అన్నారు.

'ఈగ'ని చూసి ఎగ్జయిటైన నిర్మాతలు

నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏక కాలంలో ఈ సినిమా విడుదలవుతోంది. దర్శకుడు రాజమౌళి "ఈ సినిమా తొలికాపీని సురేశ్‌బాబు, తమిళ వెర్షన్ 'నాన్ ఈ' నిర్మాత పి.వి. కలిసి చూశారు. సినిమా అయ్యాక నన్ను కౌగలించుకుని ఈ సినిమా నిర్మాణంలో తాము పాలుపంచుకున్నందుకు గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. వాళ్ల అభినందనకు చాలా చాలా సంతోషంగా ఉంది'' అని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇటీవల నానిపై చిత్రీకరించి విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నా. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం'' అని చెప్పారు.

క్లైమాక్స్ సీన్లలో 'ఒక్కడినే'


నారా రోహిత్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్‌గా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో గులాబీ మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న 'ఒక్కడినే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా సి.వి.రెడ్డి మాట్లాడుతూ 'మా సినిమాలోని పతాక సన్నివేశాల చిత్రీకరణని ఈ నెల 27 నుంచి రామోజీ ఫిలింసిటిలో ప్రారంభించా. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. జూలై 3 వరకూ జరిగే షూటింగ్‌తో మూడు పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. ఆ మూడు పాటల్లో ఐటెం సాంగ్‌ని హైదరాబాద్‌లోను, మిగిలిన రెండు డ్యూయెట్లని విదేశాల్లో జూలై ప్రథమార్థంలోగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం శబ్దాలయా థియేటర్‌లో డబ్బింగ్ జరుగుతోంది' అని తెలిపారు.
నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, ఫొటోగ్రఫీ: ఆండ్ర బాబు, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.

'ఆల్ ది బెస్ట్' చెప్పండి

శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, లక్కీ శర్మ కీలక పాత్రల్లో నటించిన 'ఆల్ ది బెస్ట్' ఈ నెల 29న విడుదల కానుంది. సుధా సినిమా పతాకంపై సాంబశివరావు నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నిర్మాతల మండలి హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ "ఇది ముమ్మాటికీ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం. శ్రీకాంత్ లేకుంటే నేను ఈ సినిమాను ఊహించి ఉండేవాడిని కాదు. ప్రేక్షకులు మాకు 'ఆల్ ది బెస్ట్' చెప్పాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. " వన్ బై టు, ఎగిరే పావురమా చిత్రాల్లో నేను, చక్రి కలిసి నటించాం. ఇందులో ఫ్రెండ్స్‌గా నటించాం. ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ కథను నడిపిస్తాం. ఇ.వి.వి., కృష్ణారెడ్డి తరహా చిత్రమిది'' అని శ్రీకాంత్ చెప్పారు. "సినిమా చాలా బాగా వచ్చింది. 29న విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు. మంచి పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందని రఘుబాబు, బ్రహ్మాజీ చెప్పారు.

హై వోల్టేజ్ కేరక్టర్‌లో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారు. శేఖర్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దీక్షాసేథ్ నాయిక. డా.ఎం.మోహన్‌బాబు సమర్పిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ "విజయవంతమైన చిత్రానికి కావాల్సిన అన్ని హంగులతో మా చిత్రం సర్వసన్నద్ధమవుతోంది. మా అన్నయ్య బాలకృష్ణగారి పాత్రకి హై ఓల్టేజ్ స్పందన వస్తుందనడంలో అనుమానం లేదు. మహిళా ప్రేక్షకులకు, యువతకు విపరీతంగా నచ్చుతుంది. మనోజ్ మంచి పెర్‌ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ ప్రామిసింగ్ స్టార్‌గా ఎదుగుతాడు. బోబోశశి సంగీతానికి మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్రలో నేను నటించాను. వచ్చేనెల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. ప్రభు, సోనూసూద్ తదితరులు ఇతర పాత్రధారులు.

Thursday, June 28, 2012

'జగన్.. నిర్దోషి' పేరుతో సినిమా


శివ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి 'జగన్.. నిర్దోషి' అనే టైటిల్ ఖరారు చేశారు. తోట సినిమాస్ సమర్పణలో ఐ.ఎస్.జె. ఫిలిమ్స్ పతాకంపై శాఖమూరి మల్లికార్జునరావు, తోట హేమసుందర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరయు, సంజన, శ్రుతిరెడ్డి నాయికలు. మంగళవారం షూటింగ్ లొకేషన్‌లో యూనిట్ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు శివ.
ఈ సందర్భంగా నిర్మాత మల్లికార్జునరావు మాట్లాడుతూ "కథకి ఇది సరిగ్గా సరిపోయే టైటిల్. హీరోగా శివ బాగా చేస్తున్నాడు. జూలై 10 వరకు జరిపే షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాలు సహా టాకీ పార్టును పూర్తి చేస్తాం. జూలై 15 నుంచి యూరప్‌లో నాలుగు పాటల్ని తీయడంతో షూటింగ్ అయిపోతుంది. కృష్ణగారి సూపర్‌హిట్ సినిమా 'ఖైదీ రుద్రయ్య'లోని 'పువ్వెత్తి కొట్టమాకు పురుషోత్తమా' రీమిక్స్ సాంగ్‌ను శివ, సంజనపై తీస్తాం'' అని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకీ, తమ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదనీ, ఇందులో తన పాత్రను బాగా డిజైన్ చేశారనీ హీరో శివ తెలిపారు.
సంజన మాట్లాడుతూ చాలా కాలం తర్వాత అభినయానికి మంచి అవకాశమున్న పాత్ర చేస్తున్నాననీ, తెలుగులో తొలిసారి ఓ కొత్త హీరోతో చేస్తున్నాననీ చెప్పారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా చేస్తున్నానని నాగినీడు తెలిపారు. దర్శకుడు వెంకన్నబాబు మాట్లాడుతూ "ఇందులో హీరో పేరు జగన్. జైలుకు వెళ్లిన అతను ఎలా నిర్దోషిగా బయటకు వచ్చాడన్నదే ఈ చిత్ర కథ'' అన్నారు. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని మరో నిర్మాత హేమచందర్ తెలిపారు.
బ్రహ్మానందం, ప్రసాద్‌బాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, ఆర్కే, ఖాదర్ ఘోరి, శివన్నారాయణ, ఝాన్సీ, అల్లరి సుభాషిణి, ఈడ్పుగంటి లోకేంద్రనాథ్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, అమర్ మొహిలే, ఛాయాగ్రహణం: జయరామ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: నందు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.

'జై శ్రీరామ్' అంటున్న ఉదయ్‌కిరణ్


ఉదయ్‌కిరణ్ హీరోగా 5 స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేళ్ల రమేశ్ నిర్మిస్తున్న చిత్రానికి 'జై శ్రీరామ్' అనే టైటిల్ ఖరారు చేశారు. బాలాజీ ఎన్. సాయి దర్శకుడు. 'ఈ రోజుల్లో' ఫేమ్ రేష్మా నాయిక. మంగళవారం ఈ సినిమా యూనిట్ సభ్యుల మధ్య కేక్ కోసి జన్మదినం జరుపుకున్నారు ఉదయ్‌కిరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఈ సినిమా నా జీవితంలో పెద్ద మైలురాయి అవుతుందని గట్టి నమ్మకం. నటుడిగా నాలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే సినిమా. పన్నెండేళ్ల నుంచీ నేను మోస్తున్న 'లవర్ బాయ్' ట్యాగ్‌ను పక్కనపెట్టి చేస్తున్న సినిమా'' అన్నారు.
మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిథి వాసు మాట్లాడుతూ "ఫస్ట్‌లుక్‌కు మంచి ప్రశంసలొచ్చాయి. హీరోగా ఉదయ్‌కి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్. దర్శకుడు బాలాజీ బాగా తీస్తున్నాడు'' అని చెప్పారు. దర్శకుడు బాలాజీ ఎన్. సాయి మాట్లాడుతూ "త్రేతాయుగంలోని రాముడికి ఎలాంటి గుణాలున్నాయో, అలాంటి గుణాలున్నవాడే మా హీరో. ఈ దేశం కోసం ఓ పోలీసాఫీసర్ ఏం చేశాడన్నది ప్రధానాంశం. ఉదయ్ నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తాడు'' అని చెప్పారు. ఉదయ్‌తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఇందులో తన పాత్రలో రెండు కోణాలుంటాయనీ రేష్మా తెలిపారు. నిర్మాత తోట రమేశ్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చిందనీ, టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందనీ అన్నారు. చిత్రంలో ఐదు పాటలున్నాయనీ, ఇప్పటికే ఓ పాటను తీశారనీ సంగీత దర్శకుడు డాకే చెప్పారు. తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ తాను వినోదాన్ని పంచే పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటిస్తున్నానన్నారు.
చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, గిరిధర్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివ-మురళి, కళ: భాస్కరరాజు, స్టంట్స్: డ్రాగన్ ప్రకాశ్, డాన్స్: రఘు, సహ నిర్మాత: ఎన్.సిహెచ్. రాజేశ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బాలాజీ ఎన్. సాయి.

Monday, June 25, 2012

స్విట్జర్లాండ్‌లో 'శ్రీమన్నారాయణ'


నందమూరి బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ సంస్థ రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది.
షూటింగ్ వివరాలను నిర్మాత రమేష్ పుప్పాల వెల్లడిస్తూ 'ఈ నెల 18న ప్రారంభమైన షూటింగ్ 28 వరకూ జరుగుతుంది. మలేషియాలో ఒక పాట, ఫైట్ తీశాం. ఇవి రెండూ బాగా వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఇటలీలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం, దీంతో చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారితో 'శ్రీమన్నారాయణ' వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు, అభిమానులు బాలయ్యబాబు నుంచి ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి' అన్నారు.
పార్వతీమెల్టన్, ఇషాచావ్లా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయకుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, ఫొటోగ్రఫీ: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.

జూలైలో 'ఏం బాబూ లడ్డూ కావాలా'


శివాజీ హీరోగా గాంధీ మనోహర్ దర్శకత్వంలో వనితాస్ డ్రీమ్‌లైన్ సంస్థ నిర్మిస్తున్న 'ఏం బాబూ లడ్డూ కావాలా' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిధి అగర్వాల్, రచనా మౌర్య కథానాయికలు.
ఈ సినిమా గురించి శివాజీ మాట్లాడుతూ 'సాధారణంగా మా చిత్రానికి స్క్రిప్ట్, ఆర్టిస్టులు బాగా సెట్ అయ్యారని అంటుంటారు. కానీ ఈ చిత్రానికి నిర్మాత కరెక్ట్‌గా సెట్ అయ్యారు. దర్శకుడు గాంధీ టైటిల్‌కు తగ్గట్లు ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ, గీత రచయిత భాస్కరభట్ల నాకు మరోసారి సూపర్‌హిట్ ఆడియోను అందించారు. కుటుంబసమేతంగా చూసి, ఎంజాయ్ చేసే సినిమా ఇది' అన్నారు.
నిర్మాత టి.జనార్థన్ మాట్లాడుతూ 'గత వారం విడుదలైన మా సినిమాలోని అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఆడియో హిట్ కావడం శుభ పరిణామం. ఈ సందర్భంగా శ్రీలేఖగారికి, భాస్కరభట్లగారికి నా ధన్యవాదాలు' అన్నారు.
దర్శకుడు గాంధీ మనోహర్ మాట్లాడుతూ ' వినోదాత్మక చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు. ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, రాంజగన్, తిరుపతి ప్రకాష్, జి.టి.రావు, భావన, లక్ష్మి, లహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: వాసు, కూర్పు: నాగిరెడ్డి, కళ: విజయకృష్ణ, నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్.

'దేవుడు చేసిన మనుషులు' పాటల విడుదల


రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించిన పాటలన్నీ అలరిస్తాయని నమ్ముతున్నానీ, సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోవాలనీ ఆకాంక్షించారు.
గేయ రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ "ఇది చాలా మంచి ఆడియో. సింగిల్ కార్డ్ రాశా. 'ఏమి సేతుర సామీ' అనేది నా మనసుకు బాగా నచ్చిన పాట. 'బంపర్ ఆఫర్' తర్వాత రఘు కుంచెతో పనిచేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది వేరే సెటప్‌తో తీసిన సినిమా. కథలేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసిన సినిమా. మొదట ఈ కథని ఇలియానాకి చెప్పా. తను టాక్సీ డ్రైవర్‌గా బాగా చేసింది. రవితేజతో ఇది నాకు ఐదో సినిమా. రవి అంటే నాకు మోజు. హైదరాబాద్‌లో నాకు తగిలిన మొదటి ఫ్రెండు రఘు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బర్తాంతే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ చేసింది'' అని చెప్పారు. ఈ పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాయనీ, జగన్‌తో, రవితో పనిచేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందనీ హీరోయిన్ ఇలియానా చెప్పింది.
రఘు కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్‌గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి'' అని తెలిపారు.
రవితేజ మాట్లాడుతూ "ఈ సినిమాతో రఘు కుమ్మేయబోతున్నాడు. జగన్ నమ్మకమే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది'' అని చెప్పారు. జూలై 27న 'దేవుడు చేసిన మనుషులు'ను విడుదల చేస్తామని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు గుణ్ణం గంగరాజు, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, వీరభద్రం, రిలయెన్స్ ప్రతినిధి మహేశ్ రామనాథన్, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బండ్ల గణేష్, లవ్‌లీ రాజు, సహ నిర్మాత భోగవల్లి బాపినీడు, నటులు ఆలీ, సుబ్బరాజు, తారలు జ్యోతిరాణా, గాబ్రియేలా, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, కల్యాణ్, కళా దర్శకుడు చిన్నా, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, సోనీ మ్యూజిక్ ప్రతినిధులు అశోక్, అశ్విన్, బ్యాంకాక్ బాబీ తదితరులు పాల్గొన్నారు.

తారకరత్న 'విజేత'


తారకరత్న కథానాయకుడిగా 'విజేత' అనే చిత్రం రూపొందుతోంది. వి.ఎం.సి. కంబైన్స్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. ఉదయభాస్కర్ దర్శకుడు. సంజన, శ్వేతాబసు ప్రసాద్ నాయికలుగా నటిస్తున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. శుక్రవారం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌చాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన సమావేశంలో రామసత్యనారాయణ మాట్లాడుతూ జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామనీ, అక్టోబర్‌లో సినిమాని రిలీజ్ చేస్తామనీ చెప్పారు.
దర్శకుడు ఉదయభాస్కర్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రి' వంటి సూపర్‌హిట్ ఇచ్చిన సంస్థ ఇప్పుడు మరో వారసుడు తారకరత్నతో తీస్తున్న 'విజేత' కూడా అంత హిట్టవుతుందని ఆశిస్తున్నాం. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది తయారవుతుంది'' అన్నారు. తారకరత్న మాట్లాడుతూ "ఈ సంస్థలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చక్కని చిత్రం'' అని చెప్పారు. చిత్రంలో ఆరు పాటలుంటాయని సంగీత దర్శకుడు అర్జున్ తెలిపారు.
నిర్మాత దొరస్వామిరాజు మాట్లాడుతూ "మేమెప్పుడూ కుటుంబ కథాచిత్రాల్నే చేస్తాం. 'విజేత' తప్పకుండా మంచి సినిమా అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్‌కి 'సింహాద్రి' ఎలా బెస్ట్ ఫిల్మ్ అయిందో, తారకరత్న కెరీర్‌కి 'విజేత' బిస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు. ఈ సమావేశంలో దర్శకుల సంఘాధ్యక్షుడు సాగర్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత-నటుడు అశోక్‌కుమార్, నిర్మాత మోహన్ వడ్లపట్ల, సినిమాటోగ్రాఫర్ కంకణాల శివరాంరెడ్డి, నటుడు గుండు అశోక్‌కుమార్ మాట్లాడారు.
కృష్ణుడు, సాయాజీ షిండే, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, ఝాన్సీ, తాగుబోతు రమేశ్, ధనరాజ్, నందన్, హేమసుందర్, బి.హెచ్.ఇ.ఎల్. ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి కూర్పు: పి. శ్రీనివాస్, కళ: శ్రీభాస్కరరాజు, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, కొరియోగ్రఫీ: రమణ, ప్రేమ.

జూలైలో 'తూనీగ.. తూనీగ'

తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న 'తూనీగ..తూనీగ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దిల్ రాజు సమర్పణలో పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రామ్‌చంద్రన్ (రాంజీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి సమర్పకుడు రాజు మాట్లాడుతూ ' హై టెక్నికల్ వాల్యూస్‌తో యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రేమకథల్లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఎం.ఎస్.రాజుగారు తీసిన ఈ చిత్రం 2012 టాప్ హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలవడం ఖాయం. హీరోగా సుమంత్ అశ్విన్‌కు మంచి బిగినింగ్ లభించనుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. త్వరలోనే అగ్రహీరోల సమక్షంలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ని నిర్వహిస్తాం.జూలైలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: కార్తీక్‌రాజా, ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, పాటలు: సిరివెన్నెల, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, కళ: వివేక్.

Saturday, June 23, 2012

కరీనా కాదంటే దీపిక ఔననెలే

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి అంటే కరీనా కపూర్‌కి భయం కానీ దీపికా పదుకోనేకు ఎందుకు భయం? అందుకే ఏక్తాకపూర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి కరీనా కపూర్ తప్పుకుంటే దీపిక 'నేను చేస్తాను' అంటూ ముందుకొచ్చింది. ఈ సినిమాలో చేయడానికి మొదట అంగీకరించిన కరీనా, ఆ తర్వాత అందులో హీరోగా ఇమ్రాన్ హిష్మి ఎంపికయ్యాడని తెలియగానే దాని నుంచి తప్పుకుంది. అతనితో కలిసి తెరమీద కనిపించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నదని సమాచారం. "తనకు ఆఫర్ చేసిన పాత్ర విషయంలో కరీనా సంతోషంగా లేదు. పైగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయంలోనే ఆమె పెళ్లి జరగనుంది'' అని కరీనా సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీపికకు ఇలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఇందులో చేసేందుకు అంగీకరించింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనీ, హీరో కంటే హీరోయిన్‌కే సినిమాలో ఎక్కువ ప్రాధాన్యమున్నదనీ సమాచారం. కాగా దీపిక ఈ సినిమా చేస్తున్నదని తెలిశాక, కరీనా మనసు మార్చుకున్నదనీ, తానే చేస్తాననీ కబురు పంపించిందనీ యూనిట్ సభ్యులు తెలిపారు. "అయితే దీపికను తీసేసి, కరీనాను తీసుకోవడం అనైతికమవుతుందనీ, పైగా దీనిక కూడా ఆ పాత్రకు బాగానే సరిపోతుందనీ నిర్మాతలు భావించారు'' అని వారు చెప్పారు. ఈ ప్రేమకథాచిత్రం ద్వారా అక్షయ్ రాయ్ దర్శకునిగా పరిచయం కాబోతున్నాడు.

Thursday, June 21, 2012

'దేనికైనా రెడీ'లో ప్రభాస్ నాకు డబ్బింగ్ చెబుతున్నాడు

"ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు మంచు విష్ణు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్‌బాబు నిర్మిస్తున్న 'దేనికైనా రెడీ'లో ఆయన హీరోగా నటిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా జరిపిన సంభాషణలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలతో పాటు, మరికొన్ని ఆసక్తికర విషయాల్ని తెలియజేశారు విష్ణు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'దేనికైనా రెడీ' మూడు పాటలు మినహా సినిమా పూర్తయింది. తమ్ముడు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' విడుదలయ్యాక ఆ మూడు పాటలూ తీస్తాం. జూలై చివరలో పాటల్నీ, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తాం. యూరప్‌లో రెండు పాటల్నీ, హైదరాబాద్‌లో ఓ పాటనీ తీద్దామనుకుంటున్నాం. ఒకవేళ యూరప్‌కి వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తాం.

అమ్మ సెంటిమెంట్
ఇది ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి చెబితే, అతనితో కలిసి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్ చేశారు. మాటలు మరుధూరి రాజా రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్‌లైన్‌గా ఉపయోగించిన 'దేనికైనా రెడీ'నే టైటిల్‌గా పెట్టాం. ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దానితో పాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. అది తల్లీ కొడుకుల సెంటిమెంట్. నా తల్లిగా సీత, తండ్రిగా సుమన్ చేశారు. నా తల్లి హిందు అయితే, తండ్రి ముస్లిం. హన్సిక తండ్రిగా ప్రభు చేశారు. విలన్‌గా కోట శ్రీనివాసరావు చేశారు.

ఇందులోనూ బ్రహ్మానందమే
ఈ సినిమాని 'ఢీ'కి సీక్వెల్ అనొచ్చు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామికల్‌గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్ ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే ఉంటారు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్‌లో ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి' అనే మేనరిజమ్‌తో నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ మేనరిజమ్‌తో తెగ నవ్విస్తారు. హన్సికతో మొదటిసారి పనిచేశా. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోయిన్లందరిలోకీ బ్యూటిఫుల్ గర్ల్. ప్రొఫెషనల్‌గా బ్రిలియంట్. ఆమెతో పనిచేయడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. శ్రీను వైట్ల తర్వాత అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అని చాలామంది అన్నారు. ఆయన్ని అనుకున్నప్పుడు శ్రీను వైట్ల కూడా 'వెరీగుడ్ చాయిస్ విష్ణు. ఆయన బ్రిలియంట్‌గా చేస్తారు' అని చెప్పారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ కూడా బాగా ఎక్కువ. 'ఢీ'కి శ్రీను గారితో ఎంతగా ఎంజాయ్ చేశానో, ఆయన తర్వాత ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిందీ, అంత కాన్ఫిడెంట్‌గా ఉందీ ఈ సినిమాకే.

ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలున్నాయి. ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరోని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ఆ హీరోనే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు ప్రభాస్. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విక్రమ్ (ఎమ్మెస్ నారాయణ కుమారుడు)ను యంగ్ విలన్‌గా పరిచయం చేస్తున్నాం. సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికి రెండు పాటల్ని తీశాం. ఒకటి మాంటేజ్ సాంగ్‌గా వస్తుంది. చక్రి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా సన్నిహిత మిత్రుడు, దేశంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్‌శంకర్ రాజా రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చారు. అందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక యాక్షన్ సన్నివేశాల్ని సెల్వ మాస్టర్ ఆధ్వర్యంలో చేశాం. నేనెంతో ఇష్టపడి చేశా. ఇటీవలే క్లైమాక్స్ ఫైట్ చేశాం. చాలా గొప్పగా వచ్చింది. మొత్తం నాలుగు ఫైట్లు. ఒకటి తిరుపతిలో, ఒకటి కాళహస్తిలో, రెండు హైదరాబాద్‌లో తీశాం.

తమిళంలోనూ అడుగేస్తున్నా
ఈ సినిమా నుంచి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నా. ఇక ప్రతి సినిమా తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. బాలీవుడ్‌లోకి ఇప్పుడే వెళ్లే అవకాశం లేదు. ఇంట గెలిచాక అప్పుడు రచ్చ సంగతి చూద్దాం. నాలుగేళ్ల తర్వాత ఇతను తెలుగు నటుడనీ, అతను తమిళ నటుడనీ, హిందీ నటుడనీ భేదాలు ఉండవు. నటుడికి భాషాభేదం అనేది తొలగిపోతుంది. ఉత్తరాది వాళ్లు కూడా కేరక్టర్లకి ఇక్కడి నటుల్ని తీసుకోవాల్సిందే. నా కెరీర్‌లో 'ఢీ' ఒక్కటే బిగ్ హిట్. 'వస్తాడు నా రాజు' రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడం వల్ల ఫెయిలైంది. 'దేనికైనా రెడీ' మీద చాలా నమ్మకంతో ఉన్నాం. దీని తర్వాత నాన్నగారి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నా కెరీర్‌ను ప్లాన్ చేసుకోబోతున్నా.

నలుగురు హీరోల సినిమా
'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా తరానికి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్‌ను నాన్నగారు చేస్తారు. సురేందర్‌రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే.

బాలయ్యకు హ్యాట్సాఫ్
నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా మనోజ్ కెరీర్‌కీ, నిర్మాతగా లక్ష్మి కెరీర్‌కీ 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చాలా ముఖ్యం. అందుకే దాని మీద చాలా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనోజ్ చేసినవి సన్నని లైన్‌మీద నడిచిన కథలే. అంతా అతని షోనే కనిపిస్తుంది. తొలిసారి అద్భుతమైన కథలో చేస్తున్నాడు. బాలకృష్ణ గారి కేరక్టర్ హైలైట్ అవుతుంది సినిమాకి. ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకూ, ఆ పాత్రని చేసిన విధానానికీ హ్యాట్సాఫ్. ఈ తరహా పాత్ర చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి.





Tuesday, June 19, 2012

నారాయణరావు మాస్టారి కథ


ఇంతకుముందు దినపత్రిక ఎడిటర్ రఘురామ్ ('ఆ నలుగురు'), రాజాజీ ('మీ శ్రేయోభిలాషి') పాత్రల్లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ తాజాగా నారాయణరావు మాస్టారుగా తెరమీద కనిపించబోతున్నారు. ఆయన ఆ పాత్ర పోషిస్తున్న 'ఓనమాలు' చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సన్‌షైన్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. అటువంటి ఉత్సాహం కలిగించిన సినిమా ఇది. ఇందులోని నారాయణరావు మాస్టారు పాత్ర నా మనసుకు బాగా నచ్చిన పాత్ర. ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి వాళ్ల కెరీర్‌లో వయసుతో నిమిత్తం లేకుండా మంచి పాత్రలు దొరికాయి. అలా నాక్కూడా ఇదో మంచి అవకాశం. ఇవాళ మన సమాజానికి కచ్చితంగా కావాల్సిన అనుబంధాల్ని చెప్పే సినిమా'' అని చెప్పారు.
నిర్మాత, దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ "మనిషి ఓడలాంటివాడు. ఒడ్డుకు చేరితేనే ఓడకు ఎలాగైతే విలువ వస్తుందో, అలాగే మనిషి కూడా ఏదో ఓ విజయపు ఒడ్డుకు చేరితేనే విలువ. ఇందులో ఓ స్కూలు మాస్టారు ఎలాంటి ఒడ్డుకు చేరాడన్నది కథ. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి కథ: తమ్ముడు సత్యం, మాటలు: ఖదీర్‌బాబు, సంగీతం: కోటి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: గౌతంరాజు, కళ: బాబ్జీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. క్రాంతిమాధవ్.

Monday, June 18, 2012

సినిమాగా పుట్టపర్తి సాయిబాబా చరిత్ర


పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సౌభాగ్య చిత్ర పతాకంపై నిర్మితమవుతోంది. కరాటం రాంబాబు నిర్మాత. చిత్ర విశేషాలను దర్శకుడు కోడి రామకృష్ణ వివరిస్తూ "సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని కథ సిద్ధం చేసుకున్నాం. ఆరునెలలు, 8, 10, 14, 35, 50, 85 ఏళ్ళ బాబా పాత్రధారులను ఈ చిత్రంలో చూడొచ్చు. స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనువిందు చేసే బాబా పాత్రధారి కోసం ఎందరెందరినో అనుకున్నాం. మలయాళ నటుడు దిలీప్‌ను ఎంపిక చేశాం. ఈ విషయమై ఆయనకు ఫోన్ చేయగానే 'నేను ఇంతకుముందే బాబా గురించి ఆలోచించాను. అంతలో మీరు ఇలా ఫోన్ చేయడం ఆ భగవంతుడి సంకల్పమేమో' అని అన్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనానికి తోడ్పడేవే'' అని చెప్పారు.
నిర్మాత కరాటం రాంబాబు మాట్లాడుతూ "తొలి షెడ్యూల్‌ను పుట్టపర్తిలో, రెండో షెడ్యూల్‌ను పశ్చిమ గోదావరి పరిసరాల్లో చిత్రీకరించాం. బాబా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను, కరణం సుబ్బమ్మ ఇంటి దృశ్యాలను తెరకెక్కించాం. స్థానిక పుట్టాయిగూడెంలో వేసిన బాబా సెట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. బ్రిటిష్ కాలానికి సంబంధించిన పరిసరాలను ప్రతిఫలించేలా వేసిన సెట్‌లో బాబాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. బాబా పాత్రధారికి విదేశీ నిపుణులు మేకప్ వేస్తున్నారు. మిగిలిన అన్ని పాత్రలకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్‌మేన్‌లను పిలిపిస్తున్నాం. మా సంస్థలో సంచలనాత్మక చిత్రమవుతుంది. త్వరలో పేరును ప్రకటిస్తాం. ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్‌లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు'' అని అన్నారు.
దిలీప్, జయప్రద, శరత్‌బాబు, సుకుమారి, సిజ్జు, కె.వి.రమణాచారి.ఐ.ఎ.ఎస్., శ్రీజిత్ విజయ్, లక్ష్మి, అమృత, అర్చన, రూపాలక్ష్మి, సుజాత, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: కరాటం రాంబాబు, దర్శకత్వం: కోడి రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్: వాసు, సంగీతం: ఇళయరాజా, రచన: రాజేంద్రకుమార్, సాహిత్యం: జొన్నవిత్తుల, కళ: నాగు, ఎడిటర్: నందమూరి హరి.

Sunday, June 17, 2012

'ఒక రొమాంటిక్ క్రైం కథ'ను నిషేధించండి

శుక్రవారం (జూన్ 15) విడుదలైన 'ఒక రొమాంటిక్ క్రైం కథ'లో అభ్యంతరకర దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయని బాలల హక్కుల సంఘం ఆరోపించింది. పిల్లల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ సినిమాను తక్షణం నిషేధించాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హెచ్ఆర్‌సీకి శనివారం ఫిర్యాదు చేశారు. టీనేజర్లు, యువత తమ సంతోషాల కోసం అడ్డదార్లు తొక్కుతారనే భావాన్ని స్ఫురింపజేసేలా అందులో కొన్ని దృశ్యాలు, మాటలు ఉన్నాయని ఆరోపించారు. ఒక సీన్లో.. 'శవంపై ఉన్న ఆభరణాలను కూడా అందులో నటించిన బాలలు తీసుకుంటున్నట్లు ఉంది. మరో సీన్లో ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నట్లుగా చూపించారు. ఇంకా ఇబ్బందికర సన్నివేశాలున్నాయి' అని చెప్పారు. పిల్లల్ని నేరస్థులుగా చూపించేందుకూ చిత్ర నిర్మాతలు, దర్శకలు వెనకాడకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్‌సీ కేంద్ర సెన్సార్ బోర్డు డైరెక్టర్‌కు నోటీసులు పంపింది. 28లోగా ఆ అంశంపై వివరణ పంపాలని ఆదేశించింది.

Saturday, June 16, 2012

జూలై 6న వస్తున్న 'ఈగ'


నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'నా పేరు నాని, నేను ఈగనైతే గానీ' అనే టైటిల్ సాంగ్‌ను హీరో నాని బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా ఉపయోగిస్తున్నామనీ, చిత్రంలో ఈ పాటను 'ఈగ'పై తీశామనీ రాజమౌళి చెప్పారు.
'మగధీర' చేసేప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా తెలిసిందని అనుకున్నాననీ, కానీ 'ఈగ' చేస్తుంటే నేను తెలుసుకుంది చాలా తక్కువనీ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువనీ అర్థమైందన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ "ఈ సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ దర్శకుని శ్రమ కనిపిస్తుంది. తను అనుకున్నది రాజమౌళి చెయ్యగలిగాడు. రీరికార్డింగ్ అయిపోయి నెలపైనే అయ్యింది. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ కూడా అయిపోవచ్చింది. నేను విలన్ పాత్రలకు సంబంధించి కోట శ్రీనివాసరావుకు వీరాభిమానిని. 'ఈగ' చూసి సుదీప్‌కు వీరాభిమానినైపోయా. అతనిలాంటి నటులు ఇవాళ చాలా తక్కువమంది ఉన్నారు'' అని చెప్పారు.
హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఉన్నా. రాజమౌళి ఈజ్ రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారు. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం. ఈ సినిమాకి రాజమౌళి ఎంతో శ్రమించాడు. ఇందులోని యానిమేషన్ గ్రాఫిక్స్ ఎంతో క్లిష్టమైనవి. అవి చాలా బాగా వచ్చాయి'' అన్నారు.

'ఎందుకంటే ప్రేమంట'ను ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు

రామ్, తమన్నా జంటగా తను రూపొందించిన 'ఎందుకంటే ప్రేమంట!'లోని కొత్తదనాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారనీ, సినిమాకి వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే దీనికి నిదర్శనమనీ దర్శకుడు ఎ. కరుణాకరన్ చెప్పారు. శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా కరుణాకరన్ మాట్లాడుతూ "చచ్చిన తర్వాతనే ఆత్మ ఉంటుందని అనుకుంటున్నారే తప్ప అసలు నిజమేంటో ఎవరికీ తెలీదు. నేను కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ హీరో సాయంతో తనని బతికించుకోవడం చూపించాను. ఇది అద్భుతమైన ప్రేమకథ. ఈ సినిమాని మెదడుతో చూడొద్దు, ఆత్మతో చూడండి. అందరూ చాలా చక్కని ఎమోషనల్ లవ్‌స్టోరీగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చేయని రీతిలో ఎంతో ఎనర్జిటిక్‌గా డాన్సులు చేశాడు రామ్'' అని చెప్పారు. నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ "ఎ, బి సెంటర్లలో సినిమా బాగా ఆడుతోంది. ఓ మంచి సినిమా చూద్దామనుకునే వాళ్లకి సంతృప్తినిస్తోంది. ఏ సినిమాకీ వెంటనే బాగుందని జనం చెప్పలేదు. 'గీతాంజలి', 'దేవదాసు' వంటి సినిమాలు కూడా చాలా రోజుల తర్వాతనే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతానికి కలెక్షన్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇది నవ్యతను కోరుకునేవాళ్ల కోసం తీసిన సినిమా. చూసినవాళ్లంతా ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. రామ్, తమన్నా జంట ముచ్చటగా ఉందని చెబుతున్నారు. చివరలో రామ్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దర్శకుడు కరుణాకరన్ బాగా తీశాడు. కొన్ని రోజులైనా గుర్తుండిపోయే సినిమా. ఇది ఎంత వసూలు చేస్తుందనేది తెలియడానికి కొంత టైమ్ పడుతుంది'' అన్నారు.

Friday, June 15, 2012

తమ్మారెడ్డి భరద్వాజ్ 'ప్రతిఘటన'

ఆరేళ్ల క్రితం సింధూ తులాని నాయికగా 'పోతే పోనీ' చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ మళ్లీ ఇప్పటివరకు సినిమాల జోలికి పోలేదు. తిరిగి చరిత చిత్ర పతాకంపై సినిమాలు తీయడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. ఇకనుంచీ ఏడాదికి ఏకంగా ఆరు సినిమాలు నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. "ఈ ఏడాది డిసెంబర్‌లోగా మూడు సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. నా దర్శకత్వంలో 'ప్రతిఘటన' అనే సినిమా చేయబోతున్నా. ఒరిస్సాలో జరిగిన ఓ నిజ సంఘటన ఈ సినిమా కథకు ఆధారం. అలాగే శివ అనే దర్శకుణ్ణి పరిచయం చేస్తూ 'ధ్యేయం' అనే సినిమాని నిర్మించబోతున్నా. ఈ సినిమాల ద్వారా ఎక్కువమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా'' అని చెప్పారు. కాగా ప్రతి ఏటా ఓ చారిటీ షో నిర్వహించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు భరద్వాజ్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 16న సత్యసాయి నిగమాగమంలో ఓ షోని నిర్వహిస్తున్నామనీ, ఇందులో గీతామాధురి, శ్రీకృష్ణ, మాళవిక, పర్ణిక వంటి గాయనీ గాయకుల పాటలు, శివారెడ్డి మిమిక్రీ, శ్రీనివాసరెడ్డి కామెడీ స్కిట్స్ ఉంటాయన్నారు. దీని ద్వారా వచ్చే డబ్బును గుంటూరులోని ఓ పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తామని భరద్వాజ్ చెప్పారు.

Wednesday, June 13, 2012

రవితేజ కోసమే పుట్టిన 'దరువు'


"ఇది రవితేజ కోసమే పుట్టిన కథ. ఇందులో తను చేసిన సీన్లు ఇప్పటివరకు చేయలేదని రవి అన్నారు'' అని చెప్పారు శివ. రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన 'దరువు'కు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి శివ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
'దరువు' పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్. యువతతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి చేస్తే మంచే జరుగుతుందనే సందేశం వాళ్లని ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలవగానే బాగుందన్నారు. ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి.
ఇదే తొలి చిత్రం
తెలుగులో ఇంతవరకు సోషియో పాంటసీ, సామాజిక అంశాల మేళవింపుతో సినిమా రాలేదు. ఆ తరహాలో ఇదే తొలి చిత్రం. చిరంజీవిగారి 'యముడికి మొగుడు'కీ, 'దరువు'కీ ఇదే తేడా. ఇది అవినీతిపై పోరాడే హీరో కథ. అవినీతిపై పోరాటం అంటేనే మనకు శంకర్ గుర్తుకొస్తారు. అందువల్ల ఈ సినిమాకీ, ఆయన సినిమాలకీ పోలిక రావడం సహజం. కానీ సన్నివేశాల్ని నా శైలిలో చిత్రీకరించా. ఇందులోని 3డి గ్రాఫిక్స్‌ని ప్రైమ్ ఫోకస్ వాళ్లు చాలా బాగా చేశారు.
అలసట ఎరుగని హీరో
ఆయన వద్దకు బౌండ్ స్క్రిప్టుతో వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆయన ఎనర్జీ మనకి కూడా వస్తుంది. ఆయనకు అలసట అనేది ఉండదు. ఈ సినిమా అవగానే వెంటనే మరో సినిమా కలిసి చేద్దామన్నారు రవి. రానున్న రోజుల్లో తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తా.
యాక్టింగ్ కష్టం
నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని ఇందులో చిన్న యముడి కేరక్టర్‌ని నన్నే వెయ్యమన్నారు రవితేజ. కానీ నా వరకు డైరెక్షన్ చేయడమే బెటర్. యాక్టింగ్ చాలా కష్టం. ఆ పాత్రను ప్రభు చాలా బాగా చేశారు. సీనియర్ యుమునిగా నటించిన కైకాల సత్యనారాయణగారు కూడా ప్రభు ఛాయిస్‌ను మెచ్చుకున్నారు. ఆడతనం ఉన్న పాత్ర చెయ్యడం బ్రహ్మానందంకు ఇదే తొలిసారి. అందుకే ఆయన పాత్రకు విద్యాబాలన్ పేరు పెట్టాం. ఆయన తెరమీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ పాత్రకు మంచి డాన్సర్ కావాలి. తాప్సీకి భరతనాట్యం వచ్చు. అందుకే ఆమెని తీసుకున్నాం. ఇప్పటివరకు ఆమె కామెడీ చేయలేదు. ఈ సినిమాలో ఆమె బాగా చేసింది.
మాట నిలబెట్టుకున్నా
తొమ్మిదేళ్ల గ్యాప్‌తో బూరుగుపల్లి శివరామకృష్ణగారు నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాని నేననుకున్న విధంగా తీయడానికి ఆయనిచ్చిన సహకారం మరచిపోలేనిది. సినిమా మొదలుపెట్టేప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేవిధంగా సినిమా ఉండాలనీ, వల్గారిటీ ఉండకూడదనీ చెప్పారు నిర్మాత శివరామకృష్ణగారు. ఆయనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నా. ఆయన బేనర్‌లో గతంలో 'ప్రేమంటే ఇదేరా'కి అసిస్టెంట్ కెమెరామన్‌గా, 'శ్రీరామ్'కు సినిమాటోగ్రాఫర్‌గా, ఇప్పుడు 'దరువు'కు డైరెక్టర్‌గా పనిచేశా. నన్నో కుటుంబ సభ్యునిలా ఆయన చూసుకుంటారు.
అజిత్‌తో సినిమా
తమిళంలో అజిత్ హీరోగా సెప్టెంబర్ నుంచి ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా. ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మించబోతోంది. తర్వాత తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తా.

Tuesday, June 12, 2012

బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా


"బాలకృష్ణకు రెండేళ్ల క్రితం 'నరసింహస్వామి' అనే కథ చెప్పా. ఓకే అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా'' అని చెప్పారు దర్శకుడిగా మారిన నటుడు జీవీ సుధాకరనాయుడు. ఆయన రాబోయే రోజుల్లో తన ప్రణాళికల గురించి పత్రికల వారికి తెలియజేశారు. "త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనిల్‌కపూర్, నానాపటేకర్, రేఖ కాంబినేషన్‌లో 'శత్రు' అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా'' అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బయటి బేనర్లలో 'హీరో', 'రంగ ది దొంగ' సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్‌ను నెలకొల్పారు.
"ఈ బేనర్‌పై తొలిసారిగా 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాని నిర్మించబోతున్నా. 'ద ప్రిన్స్ ఆఫ్ రాయలసీమ!' అనేది ఉప శీర్షిక. దీనికి నేను నిర్మాతను మాత్రమే. ఓ సీనియర్ డైరెక్టర్ దీన్ని రూపొందిస్తారు. కథ నాదే. టైటిల్ ప్రకారం రాయలసీమకు చెందిన ఓ పవర్‌ఫుల్ రెడ్డిగారు, ఆయన మనవడి చుట్టూ నడిచే కథ. రెడ్డిగారు ఏ రోజున పుట్టారో అదే రోజు మనవడు కూడా పుడతాడు. తాత ఎంత నీచుడో మనవడు అంతకంటే నీచుడు. 'దండంపెట్టి ఓటడిగేవాడు అన్నం పెడతానంటేనే ఓటెయ్' అని జనానికి చెబుతుంటాడు హీరో. రాయలసీమ ఫ్యాక్షన్, దాని ద్వారా వచ్చే అధికారం, దాన్ని ఉపయోగించుకుని సంపాదించే డబ్బు... వీటి చుట్టూ అల్లిన కథ. ఇందులో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. రెడ్డిగారికి ప్రత్యర్థి అయిన చౌదరి కూతురు, హీరో ప్రేమించుకోవడం, వారి ప్రేమకూ, రాజకీయాలకూ లంకె ఉండటం ఇందులోని ఇంటరెస్టింగ్ పాయింట్. రాజకీయం వ్యాపార స్థాయికి ఎలా ఎదిగిందో ఈ కథలో చెబుతున్నా. వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి ఈ కథకు క్లైమాక్స్ రాస్తా. అప్పుడే హీరోకి పేరు పెడతా. రెడ్డిగారి పాత్రకు కోట శ్రీనివాసరావును అనుకుంటున్నాం. హీరో ఛాయిస్‌ను డైరెక్టర్‌కి వదిలేస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, జయసుధ, రమ్యకృష్ణ, ముమైత్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు. చక్రి సంగీతం సమకూర్చబోతున్నారు'' అని తెలిపారు జీవీ. ఈ సినిమా వివాదాల్ని రేకెత్తించే అవకాశాలున్నాయి కదా అనడిగితే "తప్పకుండా కాంట్రవర్సీ అవుతుంది. అవనీయండి. అవ్వాలనే కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.

'ఎందుకంటే ప్రేమంట!'కు ప్రధాన బలం స్క్రిప్టే


"ఈ సినిమాకు ప్రధాన బలం కరుణాకరన్ సమకూర్చిన స్క్రిప్టే'' అన్నారు రామ్, తమన్నా. ఆ ఇద్దరూ కరుణాకరన్ డైరెక్ట్ చేసిన 'ఎందుకంటే ప్రేమంట!'లో జంటగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామ్, తమన్నా- ఇద్దరూ ఆ సినిమాకు సంబంధించిన తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు... 
రామ్: ఏడాది విరామంతో వస్తున్న సినిమా ఇది. చాలా ఎగ్జయిటింగ్‌తో ఉన్నా. ఇది నా హృదయానికి సన్నిహితమైన సినిమా. కరుణాకరన్, తమన్నా కాంబినేషన్‌తో ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. దీంతో ఆ కోరిక తీరింది. ఇందులో తమన్నా, నా కేరక్టర్లు సమానంగా ఉంటాయి. కరుణాకరన్ అంటేనే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీస్ చేస్తాడనే పేరు. ఇప్పటివరకు చెయ్యని కొత్త తరహాలో ఈ లవ్ స్టోరీని డీల్ చేశాడు. తమిళ వెర్షన్‌కి కొన్ని మార్పులు చేశాం, నేటివిటీని దృష్టిలో ఉంచుకొని.
తమన్నా: 'రెడీ'కి ఒకే రోజు పనిచేశా. అప్పుడు రామ్‌తో సరిగా మాట్లాడటానికి కూడా కుదరలేదు. ఈ సినిమాతో రామ్ ఎంత ఎనర్జిటిక్, స్పాంటేనియస్ యాక్టరో తెలిసింది. ఇక అతని డాన్సులు చూసి, అలా ఎలా చేయగలుగుతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. ఇందులో అతని డాన్సులే ఎక్కువ. నా డాన్సులు పెద్దగా ఉండవు. ఇది ఫ్రెష్‌నెస్ ఉన్న సబ్జెక్టు.
రామ్: తమన్నా కూడా మంచి డాన్సర్. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాకు ప్రధాన బలం కరుణాకరన్ స్క్రిప్టే. పాటల కంటే జీవీ ప్రకాశ్ ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాకి ఆరో ప్రాణం. కోన వెంకట్ ఇంపార్టెంట్ అయిన నెగటివ్ రోల్ చేశారు. రైటర్ కాబట్టి తన కేరక్టర్‌ను బాగా రాసుకున్నాడు. ఈ సినిమా చూశాక ఆయన రైటరా లేక యాక్టరా అనే కన్‌ఫ్యూజన్‌లో పడతారు ప్రేక్షకులు. ఇందులో నా కేరక్టర్ పేరు కూడా రామ్. 'నీ చూపులే' అనేది నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్.
తమన్నా: నేను చేసిన పాత్ర పేరు స్రవంతి. వెరీ ప్రొటెక్టివ్ గర్ల్ రోల్. నా కెరీర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్. 'నీ చూపులే' అనేది బెస్ట్ సాంగ్. నా దృష్టిలో కరుణాకరన్ స్క్రీన్‌ప్లే హైలైట్. నా మునుపటి సినిమా 'రచ్చ' ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే 'ఎందుకంటే ప్రేమంట!' అనేది దానికి భిన్నమైన సినిమా. ఇందులో పర్ఫార్మెన్స్‌కి బాగా అవకాశమున్న కేరక్టర్ నాది. ఈ సినిమాలో ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నా.
రామ్: హీరోగా మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలి కాబట్టి అటు కమర్షియల్ సినిమాలూ, ఇటు పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న సినిమాలూ.. రెండూ బేలన్స్ చేసుకుంటూ వస్తున్నా. 'కందిరీగ' పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే, ఇది దానికి భిన్నమైన లవ్‌స్టోరీ.
తమన్నా: బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న 'హిమ్మత్‌వాలా'లో అజయ్ దేవగన్ సరసన నటించబోతున్నా.

Monday, June 11, 2012

టీనేజ్ అబార్షన్లపై దృష్టిపెట్టిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'


"పిల్లలతో సెక్స్ గురించి చర్చించే ధైర్యం పెద్దలకి లేకపోవడంతో టీన్ అబార్షన్స్ పెరిగిపోతున్నాయి. టీనేజ్ లవ్, టీనేజ్ సెక్స్ సమాజాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ సినిమాలో చూపించా'' అని చెప్పారు పి. సునీల్‌కుమార్‌రెడ్డి. డిజిక్వెస్ట్ ఇండియా సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'కు ఆయన దర్శకుడు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే... 
ఇది నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద తీసిన సినిమా. టీన్ సెక్సువాలిటీ మీద ఫోకస్ చేసిన సినిమా. బైక్స్, గర్ల్‌ఫ్రెండ్స్ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న అబ్బాయిలు తమ కోరికల కోసం చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతోంది. చదువులేని వాళ్లకంటే చదువుకున్నవాళ్లే తప్పుదోవ పడుతున్నారు. పోలీసు రికార్డులు ఈ సంగతే చెబుతున్నాయి. ప్రతి నేరంలో ఓ రొమాన్స్ ఉంటుంది. మనుషులు తాము ప్రేమించిన వాళ్లకోసం నేరాలు చేస్తుంటారు. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' అని టైటిల్ పెట్టడానికి కారణం ఇదే.
ఏదీ రహస్యం కాదు
ఈ కథ కోసం ఎంతోమంది కాలేజీ పిల్లల్ని కలిసి మాట్లాడా. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాయిష్టాలు ఏమిటో ప్రతిఫలింపజేశా. వాళ్ల దృష్టికోణం నుంచే ఈ సినిమా తీశా. ఎక్కడా వల్గారిటీ వైపు పోకుండా ఈస్థటిక్‌గా, అందరూ కలిసి చూడదగ్గ రీతిలో తీశా. 'ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది' అనే ట్యాగ్‌లైన్ పెట్టాను. సీరియస్ సబ్జెక్టుని వినోదాత్మకంగా చెప్పా. తప్పుచేసిన వాళ్లు తాము దొరకం అనుకుంటే తప్పే. ఏదీ రహస్యం కాదనీ, దాపరికం అనేది ఏదో ఓ రోజు బయటపడుతుందనీ చెబుతున్నాం. ఇది ఓ టెన్ల్‌క్లాస్ అమ్మాయి, ఇంకో ఇంటర్మీడియేట్ అమ్మాయి, మరో ఇంజనీరింగ్ విద్యార్థిని - ఈ ముగ్గురి చుట్టూ నడిచే కథ. ఆ పాత్రల్ని గాయత్రి, దివ్య, స్వప్న చేశారు. హీరోలుగా ఇదివరకు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన మనోజ్ నందం, అనిల్ కల్యాణ్ నటించారు.
ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా
అవార్డులు పొందిన 'సొంతవూరు', 'గంగపుత్రులు' సినిమాలు ఎక్కువమంది ప్రేక్షకులకు ఎందుకు చేరలేదనే ప్రశ్న నుంచి పుట్టిన సినిమా ఇది. ఇవాళ సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతే. వాళ్లకు సంబంధించిన విషయంతో సినిమా తీస్తే వాళ్లు సొంతం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ సినిమా తీశా. నా సినిమాల్లో బిజినెస్‌పరంగా కూడా సంతృప్తికరమైన స్పందన వచ్చింది దీనికే. సినిమాకి స్ట్రక్చర్ కంటే ఎమోషన్ ఇంపార్టెంట్ అనేది నేను తెలుసుకున్న నిజం.
సెన్సిబుల్ సబ్జెక్టుకి కమర్షియాలిటీ
సమాజాన్ని ప్రతిబింబించే, సమాజానికి సంబంధం ఉండే కథలతో సినిమాలు తియ్యాలనుకునే వాళ్లలో నేనొకణ్ణి. సినిమా అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నమ్ముతా. ఇకనుంచీ సెన్సిబుల్ సబ్జెక్టులకే కమర్షియాలిటీ జోడించి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' తర్వాత ఓ కళారూపం నేపథ్యంలో సినిమా తీయాలనుకుంటున్నా. దానికి ఎల్బీ శ్రీరామ్‌తో కలిసి ఓ స్క్రిప్టు తయారు చేస్తున్నా.

Sunday, June 10, 2012

విలువైంది పోగొట్టుకున్నా

కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ప్రతి ఏటా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇదివరకు సీరియస్ సినిమా ప్రియులే దీనిపట్ల ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు కమర్షియల్ సినిమా ప్రియులు కూడా ఆ ఫెస్టివల్ అంటే మక్కువ చూపుతున్నారు. అంతటితో ఆగకుండా అక్కడకి వెళ్తున్నారు. అలాంటి వారిలో అందాల తార శ్రియ కూడా చేరిపోయింది. ఇటీవల కాన్స్‌కు వెళ్లిన శ్రియ అక్కడ తీపి, చేదు అనుభవాలు- రెండింటినీ చవిచూసింది. "కాన్స్‌లో ఎన్నో మంచి మంచి సినిమాలు చూశా. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సినిమా ప్రియుల్ని కలుసుకుని, వాళ్లతో మాట్లాడటం మరచిపోలేని అనుభవం'' అని చెప్పింది శ్రియ. మరి చేదు అనుభవం ఏమిటి? "ఈ ఫెస్టివల్ విషయంలో నాకున్న ఒకే కంప్లయింట్ నా వాలెట్ పోవడం. దాంతో పాటు నా క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, డైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా. అది నా ఫేవరేట్ వాలెట్'' అని వాపోయింది శ్రియ.

Saturday, June 9, 2012

షార్క్ చేపలతో ఈతకొట్టా

ఫిట్‌నెస్ విషయంలో ఏ బాలీవుడ్ హీరోయినూ ఆమెని గెలవకపోవచ్చు. విమానాల్లోంచి కిందకి దూకే, సముద్రంలో షార్క్ చేపలతో కలిసి ఈతకొట్టే సాహసం ఆమెకి గాక మరెవరికి ఉంటుంది. ఆమె... దీపికా పదుకోనె. 'కాక్‌టెయిల్' సినిమా షూటింగ్ మధ్యలో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ ఫీట్లు చేసింది. ప్రస్తుతం 60 కిలోల బరువుతో ఇదివరకెన్నడూ లేనంత ఫిట్‌గా ఉన్నానని చెబుతున్న ఆమె "షూటింగ్ అయిపోగానే నేను, దర్శకుడు హోమీ అదజానియా, నా సహ నటి డయానా పెంటీ కలిసి గన్స్‌బాయ్ గ్రామంలో గ్రేట్ వైట్ షార్క్‌లతో కలిసి ఈతకొట్టాం. మూడుసార్లు విమానాల్లోంచి కిందికి దూకాం. నేను గనక ఫిట్‌నెస్‌తో లేకపోయినట్లయితే ఈ ఫీట్లు చేయగలిగేదాన్ని కాదు'' అని చెప్పింది 26 సంవత్సరాల దీపిక. ఇదివరకటికంటే ఇప్పుడామె మరింత అందంగా కనిపిస్తోంది. "ఫిట్‌నెస్ అనేది శరీర బరువు మీద కాక వంట్లోని కొవ్వు శాతం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది సన్నగా ఉండేవాళ్లలో అధిక కొవ్వుశాతం ఉంటుంది. అది అనారోగ్యకరం'' అని తెలిపింది ఈ బక్కపలుచని భామ.

Friday, June 8, 2012

కేఎస్ఆర్ దాస్ కన్నుమూత

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.ఆర్. దాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి (జూన్ 8) తుదిశ్వాస విడిచారు. ఆయన 1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించారు. 1966లో 'లోగుట్టు పెరుమాళ్లకెరుక' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణతో అత్యధికంగా 30 పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా ఆయనకు అమితమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. తెలుగులో యాక్షన్ సినిమాల ఒరవడికి ఆయనే ఆద్యుడిగా నిలిచారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, రజనీకాంత్ వంటి హేమాహేమీలను డైరెక్ట్ చేశారు.

బాలకృష్ణ ఇంట్లో చోరీ

ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో చోరీ జరిగింది. 35 తులాల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గతనెల 24వ తేదీన బాలకృష్ణ సతీమణి వసుంధర, పిల్లలు విహారయాత్రలకు వెళ్లారు. 30వ తేదీన బాలకృష్ణ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే వసుంధర వెళ్లేటప్పుడు తన సోదరి భర్త ప్రసాద్‌కు తాళం ఇచ్చి ఇంట్లో కొన్ని మరమ్మతులు చేయించాలని కోరారు. ప్రసాద్ తన భార్యతో కలసి బుధవారం బాలకృష్ణ ఇంటికెళ్లారు. అక్కడి నుంచి వసుంధరకు ఫోన్ చేసి ఎక్కడ మరమ్మతులు చేయించాలో అడిగారు. ఆ సమయంలో వసుంధర తాను ఒక గదిలో బంగారు ఆభరణాలు ఉంచాననీ, ఒకసారి చూడాలని కోరారు. ఆ గదిలోకి వెళ్లి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. దాంతో ఇంట్లో చోరీ జరిగిందని భావించిన ప్రసాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.