Tuesday, August 23, 2011

న్యూస్: అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్న!

తమ్ముడు ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగి, తర్వాత దర్శకుడిగా 'అందమైన మనసులో', 'బ్రోకర్' సినిమాలు తీసి ఫెయిలైతే, ఇప్పుడు అన్న మెగాఫోన్ పట్టుకుని పరీక్షకు సిద్ధమయ్యాడు. అతని పేరు గౌతం పట్నాయక్. గౌతంని చూస్తే ఆర్పీ కంటే చిన్నవాడిగా కనిపిస్తాడు చూపులకి. ఇప్పుడతను 'కెరటం' అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. ఆగస్టు 26న రిలీజవుతున్నఈ సినిమా ద్వారా ప్రభాస్ కజిన్, కృష్ణంరాజు మరదలి కుమారుడు సిద్ధార్థ రాజ్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్నాడు. కన్నడంలో పెద్ద హిట్టయిన 'జోష్' కి ఈ సినిమా రీమేక్. ఆ సినిమాని నిర్మించిన ఎస్వీ బాబు ఈ సినిమాకీ నిర్మాత. గమనించాల్సిన సంగతేమంటే ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్‌గా పరిచయమైన 'అందమైన మనసులో' నిర్మాత కూడా ఆయనే. ఇప్పుడు ఆర్పీ అన్న గౌతంని కూడా ఆయనే డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నారు. "ఈ సినిమాలో హీరో టెన్త్ క్లాసులోనే ప్రేమలోపడి, పరీక్ష ఫెయిలవుతాడు. ఆ తర్వాత అతను ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరం. ప్రేమ కోసం తమ తల్లిదండ్రుల్నీ, చదువునీ, కెరీర్‌నీ పాడుచేసుకోవద్దనేది ఈ సినిమా చెప్పే సారాంశం. ఆకర్షణలో పడి స్నేహితులతో సహా సర్వం పోగొట్టుకున్న ఓ అబ్బాయి కథ ఇది. క్లైమాక్స్ రియలిస్టిక్‌గా, హృదయాల్ని తడిచేసే విధంగా ఉంటుంది" అని ఈ సినిమా గురించి చెప్పాడు గౌతం. 'కెరటం'లో హీరోయిన్లుగా కొత్తమ్మాయిలు రాకుల్, ఐశ్వర్య నటించగా, హీరో తండ్రి పాత్రని సీనియర్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు పోషించడం విశేషం. నిజానికి 'జోష్' చూసి తెలుగు రీమేక్ హక్కులు తీసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే ఒరిజినల్ నిర్మాతే తెలుగు రీమేక్ చేయడంతో, అందులో తనకి బాగా నచ్చిన హీరో తండ్రి పాత్ర చేసి, ఆ రకంగా సంతృప్తిచెందారు. మొత్తానికి ఈ సినిమాతో గౌతం పట్నాయక్ కెరీర్ 'కెరటం'లా దూసుకుపోతుందా?

No comments: