Monday, August 8, 2011

న్యూస్: తారకరత్న 'ప్రజాపతి' పరిస్థితేంటి?

నందమూరి తారకరత్న 'ప్రజాపతి'గా నటించనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కొన్ని చిన్న సినిమాల్ని డైరెక్ట్ చేసి, వర్కవుట్ కాక, టీవీ సీరియళ్లు తీసుకుంటూ వస్తున్న రాజా చంద్రవర్మ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించేందుకు యలమంచి రవిచంద్ సంకల్పించారు. పీరియాడికల్ సినిమాగా, భారీ వ్యయంతో దీన్ని తీయనున్నట్లు చెప్పుకున్నారు. ఈలోగా ఎంతో కాలం నుంచి పెండింగులో ఉన్న 'మాయగాడు' సినిమాని రిలీజ్ చేసి, ఊపిరి పీల్చుకోవాలని అనుకున్నారు. దీని ద్వారా ఎంతో కొంత డబ్బు చేతికి వస్తుంది కదా అని ఆశపడ్డారు. అయితే ఆయన ఆశల్ని 'మాయగాడు' తలకిందులు చేసింది. ఈ సినిమా వల్ల కనీసం ఆయనకు కనీసం రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు సమాచారం. దీనితో 'ప్రజాపతి' ప్రాజెక్టుపై సందేహాల నీడలు అలుముకున్నాయి. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. అయితే 'మాయగాడు' కారణంగా ఆర్థిక ఇబ్బందులో చిక్కుకున్న రవిచంద్ ఈ సినిమాని నిర్మిస్తారా, లేదా అనే ఆసక్తి పరిశ్రమ వర్గాల్లో నెలకొని ఉంది. టీవీ నుంచి మళ్లీ సినిమాల్లోకి రావడానికి గట్టి కృషి చేస్తున్న రాజా చంద్రవర్మ 'ప్రజాపతి' కోసం కథ, మాటలు, స్క్రీన్‌ప్లే.. అన్నింటిని సిద్ధం చేసుకుని రవిచంద్ ఎప్పుడు ఈ సినిమా మొదలు పెడతారా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాడు. మరోవైపు హీరోగా ఏమాత్రం గిరాకీ లేని తారకరత్న సైతం ఈ పీరియాడికల్ మూవీ ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం.. 'ప్రజాపతి' షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో...

No comments: