Saturday, March 26, 2011

కథ: పదహారేళ్ల తర్వాత (రెండో భాగం)

"ఏం సారూ! మీరీడికొచ్చి శానా కాలమైనట్టుందే?" అడిగాడు రిక్షావాలా.
"అవును. పదహారేళ్లయింది. నా ఫ్రెండుని చూడటం కోసం వచ్చా ఇప్పుడు" చెప్పాడు.
"నాయినపల్లిలో ఎ స్నేయితుడు? నేనుండేది కూడా అక్కణ్ణే. అంతా నాకు తెల్సినోళ్లే. నా పేరు కోటయ్య" అన్నాడు రిక్షావాలా.
"అవునా కోటయ్యా! వాడి పేరు సుదర్శన్". 
టక్కున బ్రేక్ వేశాడు కోటయ్య. చైను కిర్రుమని చప్పుడు చేస్తుండగా ఆగింది రిక్షా. అది ఊహించని పద్మాకర్ కంట్రోల్ చేసుకోలేక కాస్త ముందుకు తూలాడు. చివరి నిమిషంలో చేత్తో రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు. లేదంటే పడిపోయేవాడే.
"ఏంటి కోటయ్యా! ఎందుకు సడన్‌గా రిక్షా ఆపావ్?" కాస్త అసహనంగా అడిగాడు పద్మాకర్.
"శమించండి బాబూ. మీరు సుదర్శన్ బాబనేసరికి ఏదో అయినట్టయ్యింది బాబూ. అయితే ఆఖరి చూపుకు వొత్తున్నారన్న మాట!" అన్నాడు కోటయ్య.
'ఆఖరి చూపుకు..' అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు పద్మాకర్.
"ఏంటి కోటయ్యా నువ్వంటున్నది? ఆఖరి చూపేమిటి?" అడిగాడు.
కోటయ్య కాస్త ఆశ్చర్యంగా చూశాడు పద్మాకర్ వైపు. రిక్షా ఇంకా ఆగే ఉంది రోడ్డుకి ఓ పక్కగా.
"ఏంటి బాబుగోరూ మీరొత్తుంది సుదర్శన్‌బాబు అంతిక్రియలకే కదా!" అన్నాడు. 
షాక్ కొట్టినట్లు కాసేపు కోటయ్య వంక చూసి "నువ్వు చెబుతోంది లీడర్ సుదర్శన్ గురించి కాదనుకుంటా, వేరే అతను అయివుంటాడు" అన్నాడు పద్మాకర్ తనని తాను సంభాళించుకుంటూ.
"నాకు తెల్సిన సుదర్శన్‌బాబు వొక్కరేనయ్యా. ఆ మాటకొత్తే నాయినపల్లిలోనే కాదు, యేటపాలెం మొత్తమ్మీద సుదర్శన్‌బాబంటే అందరికీ తెల్సింది ఆ బాబొక్కడే" గట్టిగా చెప్పాడు కోటయ్య.
తన మిత్రుడికేమీ కాదని ఎక్కడనో మిణుకు మిణుకుమంటున్న ఆశ, ధైర్యం చల్లారిపోయాయి పద్మాకర్‌లో. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. గొంతు పూడుకుపోయింది. 
కళ్లు తడవుతున్నాయి.
"ఎలా.. ఎలా జరిగింది? ఇంత హఠాత్తుగా ఎలా పోయాడు? వారం రోజులు కాలేదే నేను వాడితో మాట్లాడి" అన్నాడు బలహీనమైన గొంతుతో. 
తిరిగి రిక్షా తొక్కుతూ చెప్పడం మొదలుపెట్టాడు కోటయ్య.
"నాల్రోజుల కింద నెక్లెసు నూక్కెళ్లాడనిజెప్పి ఓ కుర్రాణ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మేశారు బాబూ. కానీ ఆ నెక్లెసు ఆ కుర్రాడు పనిచేసే ఆసామి ఇంట్లోనే దొరికింది. ఆ ఆసామి పెళ్లాం ఏదో పేరంటామికెళ్తా ఆ నెక్లెస్‌ని యాడో పెట్టి మర్సిపోయింది. ఆ కుర్రాణ్ని దొంగన్నారు. పోలీసులు ఆడొళ్లు ఊనంసేసి పారేశారు.
ఎస్సయ్యి బూటుకాలితో కొట్టిన దెబ్బకి ఆడి కాలొకటి ఇరిగిపోయింది. ఈ సంగతి బయట చెబ్తే పేణాలు తీత్తామని బెదరగొట్టి ఆడ్ని వొదిలేశారు. కానీ అట్లాంటి సంగతులు దాగుతయ్యా? సుదర్శన్‌బాబుకి తెల్సిపోయింది. కొంతమంది కుర్రోళ్లని ఎంటేసుకొని పోలీసోళ్ల మీద ఉద్దెమం లేవదీశాడు.
కొత్త కాల్వ బ్రిడ్జికాడ నాలుగ్గంటల్సేపు రాస్తారోకో సేసారు. అప్పుడు సూడాలి బాబూ.. అటు ఒంగోల్నించి వొత్తున్న బళ్లు, ఇటు సీరాల్నించి ఎళ్తున్న బళ్లు ఎంత దూరం ఆగిపోయినాయో! యేటపాలెం సెరిత్రలోనే అట్టాంటి ఉద్దెమం నేను సూళ్లేదు బాబూ. అప్పుడు సీరాల్నించి సీఐ వొచ్చి బెదిరిచ్చాడు. ఎవురూ లెక్కసెయ్యలా. ఆ తర్వాత డీఎస్పీ బాబే వొచ్చాడు. గదిమాడు. అరెస్టు జేత్తానని బెదిరిచ్చాడు. సుదర్శన్‌బాబోళ్లు అదర్లా, బెదర్లా. "సేతనైతే సేస్కోండి" అన్నాడు.
రోసమొచ్చి డీఎస్పీ అరెస్టు చెయ్యబోయాడు. ఉన్నపళాన జనం తిరగబడ్డారు. ఆళ్లలో నేనూ ఉన్నందుకు చాలా గర్వమనిపిత్తుంది బాబూ ఇయాల. జనాన్ని చూసి డీఎస్పీ పళ్లు పటపటమంటా కొరికి పోలీసుల్తోటి 'శార్జ'నో ఏందో అన్నాడు బాబూ. ముందు ఆయనే లాఠీ తీసుకుని కుర్రాళ్ల మీద పడ్డాడు. ఆయన్ని చూసి అక్కడున్న పోలీసులంతా లాఠీల్తోటి ఇరగతన్నారు బాబూ జనాన్ని.
సుదర్శన్‌బాబు ఇది సూళ్లేక డీఎస్పీకి అడ్డం పడ్డాడు. అంతలోకే ఆయన తలమీన లాఠీ దెబ్బ పడిందయ్యా. ఆ డీఎస్పీనే కొట్టాడో, ఇంకెవరు కొట్టారో అట్టానే కుప్పకూలిపోయాడు. దాంతోటి జనం ఇంకా రెచ్చిపొయ్యారు.
ఎవుర్ని ఎవురు కొడ్తన్నారో తెలీలా. ఎవురు ఎవుర్ని తొక్కేత్తన్నారో తెలీలా. గొడవ సల్లార్నాక జూత్తే ఏముందయ్యా.. నెత్తుటి మడుగులో ఉన్నాడు సుదర్శన్‌బాబు.
ఆస్పెత్రికి తీస్కపోదామంటే ట్రాఫిక్‌జామయ్యే. రెండు గంటలు పైనే పట్టింది ఆస్పెత్రికి ఎళ్ళేతలికి. అప్పటికే ఆ బాబు కోమాలోకి ఎల్లిపోయాడు. కొనూపిర్తో వున్నాడు.
రెండ్రోజులు సావుతో యుద్ధం జేశాడు. మా కోసం సేసిన యుద్ధాలు ఇంక సాలనుకున్నాడో ఏందో నిన్ననే ఊపిరి వొదిలేశాడు బాబూ".
కోటయ్య గొంతు పూడుకుపోయింది బాధతో. అప్పటికే పద్మాకర్ గుండె బరువెక్కింది. పదహారేళ్లుగా దూరమైపోయి, తిరిగి కలవాలని ఎంతో ఆశతో వస్తుంటే.. సెలవంటూ వెళ్లిపోయావా నేస్తం? ఈ మిత్రుడి మొహం చూడకూడదనుకున్నావా? టపటపమంటూ రెండు నీటి చుక్కలు కళ్లనుండి జారి తొడల మీద పడ్డాయి.
కోటయ్యే మాట్లాడాడు మళ్లీ. "నిన్న సాయంకాలమే పోట్టుమాట్టం సేసి శవాన్ని ఇంటికి పంపిచ్చారు. సుదర్శన్‌బాబు పోయాడని తెలియంగాల్నే ఆస్పెత్రికాడికి వొచ్చారు సూడయ్యా.. ఎంత జనమని! నేం కూడా ఎల్లాలే. పోలీసు నాయాళ్లు కూడా శానా మందున్నారు. ఏదైనా గొడవ జరుగుద్దేమోనని ముందుగాల్నే వంద మందికి తక్కువ కాకుండా ఆళ్లని పెట్టారు. కానీ జనం గొడవ సెయ్యలా! ఎందుకనంటే అప్పటికే ఆ డీఎస్పీని ఆఫీసర్లు సస్పెండు సేసేశారు".
రిక్షా ఆగింది. పద్మాకర్ దిగాడు. వీధి పొడుగూతా జనమే.
"జరగండి.. జరగండి" అని కాస్త గట్టిగా అరుస్తూ ముందుకు పోతున్నాడు కోటయ్య. వెనకే పద్మాకర్.
కాళ్లు వొణుకుతున్నాయి. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగింది. ఎదురుగా నేలమీద పాడె, దాని మీద శవం. పద్మాకర్‌కి మొదటగా కనిపించింది తాడుతో బొటనవేళ్లు కలిపి కట్టిన రెండు పాదాలు. బాధ పొగిలి పొగిలి వచ్చింది గుండెల్లోంచి. దగ్గరగా వెళ్లాడు. 
"అమ్మా. బాబు సావాసగాడంట. కలకత్తా నుంచి వొచ్చాడంట" చెప్పాడు కోటయ్య.
సుదర్శన్ భార్య తలెత్తి పద్మాకర్ వైపు చూసి చీరకొంగుని నోట్లో కుక్కుకుంది దుఃఖాన్ని అదిమి పెట్టడానికి. 
"అంకుల్! మీరొస్తున్నారని వారం రోజుల కింద నాన్న ఎంత సంబరంగా చెప్పాడో. పదహారేళ్ల తర్వాత ఫ్రెండుని కలవబోతున్నానని ఎంత ఆనందపడ్డాడో. ఇప్పుడిట్టా కలుసుకున్నారు.." అని వెక్కివెక్కి ఏడ్చింది సుదర్శన్ పదకొండేళ్ల కూతురు. ఆ అమ్మాయి తలని గుండెలకి అదుముకుని సుదర్శన్ మొహం వంక చూశాడు పద్మాకర్. అదే స్ఫురద్రూపం. ఏమాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు కళ్లు మూసుకుని ఉన్నాయి. ముక్కు రంధ్రాల్లో దూది పెట్టి ఉంది.
సుదర్శన్ చెంపని తడిమాడు పద్మాకర్. దుఃఖాన్ని అదిమిపెట్టడం కష్టమైంది.
"ఏరా! ఇలా చూసేందుకా నేను వచ్చింది?" అంతకుమించి గొంతులోంచి మాటలు రాలేదు. కళ్లలోంచి నీళ్లు రాలుతున్నాయి.
తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు.
సరిగ్గా అప్పుడే అతడి సెల్‌ఫోన్ రింగయ్యింది. కళ్లు తుడుచుకుని చూశాడు. 
ఏదో తెలీని నెంబరు. కాల్ రిసీవ్ చేసుకున్నాడు. 
"హలో సార్. నేను లక్ష్మణ్‌ని. ఇందాక ట్రైన్‌లో కలిసి జర్నీ చేశాం కదా. సార్ మీ ఫ్రెండుని కలిశారా? ఈ పాటికి కలిసే ఉంటారనిపించి ఆగలేక ఫోన్ చేశా సార్".
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఫోన్‌లో పద్మాకర్ ఏడుపు గట్టిగా వినిపించింది లక్ష్మణ్‌కి.
(అయిపోయింది)

Saturday, March 19, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: మనసంతా నువ్వే-2

చిన్ననాటి స్నేహితులు పెద్దవాళ్లయ్యాక ప్రేమికులు కావడం చాలా సినిమాల్లో చూశాం. చిన్నతనంలో స్నేహితులుగా విడిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి పెద్దయ్యాక ఒకర్నొకరు చూసుకోకపోయినా ఒకరిపట్ల మరొకరు విపరీతమైన ఆరాధనా భావాన్ని పెంచుకోవడం, తమ ఉనికి తెలీకుండా తమ పట్ల ఎదుటివాళ్లకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకోవడం వైవిధ్యమైన పాయింట్. 'మనసంతా నువ్వే' ఘన విజయానికి దోహదం చేసిన ప్రధానాంశం ఇదే. నిర్మాత ఎమ్మెస్ రాజు ఇచ్చిన లైన్‌ని దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, స్క్రిప్టు సహాయకుడు వీరు పోట్ల కలిసి డెవలప్ చేసి, కల్పించిన సన్నివేశాలూ, ఆ సన్నివేశాలకి పరుచూరి సోదరులు కూర్చిన సంభాషణలూ ఓ సున్నితమైన, భావోద్వేగపూరితమైన ప్రేమకథని సృజించాయి.
ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో బలవంతపు ప్రేమలే ఎక్కువ. హీరోనో, హీరోయినో 'నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపేస్తా', 'నన్ను కాకుండా ఇంకొకర్ని చూశావా?' అనే బెదిరింపులే కనిపిస్తాయి. ఆ బెదిరింపులతోటే ప్రేమలు పుట్టినట్లు ఆ సినిమాల్లో చూపిస్తారు. అట్లా ప్రేమ స్థాయిని దిగజార్చిన సినిమాలు వస్తున్న కాలంలో ఒకరిపట్ల మరొకరు గుండె నిండా ప్రేమ నింపుకొని, వేరే ఇంకే ఆకర్షణకీ లొంగని ప్రేమికుల కథ వస్తే, గుండెల మీద పన్నీటి జల్లు కురిసినట్లే కదా!
మ్యూజికల్ వాచ్‌తో మ్యాజిక్
చిన్నతనంలో అనుకి జ్వరం తగిలినప్పుడు చంటి గుళ్లోని ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి అను వద్ద పెడతాడు. "నువ్వు గుడికి రాలేవు కదా. అందుకని దేవుణ్ణే నీ దగ్గరకు తీసుకొచ్చా" అన్న చంటి మాటల్లోని అమాయకత్వం, నిజాయితీకి ముచ్చటపడని వాళ్లెవరు? ఆ పిల్లల స్నేహం మనసుకి హత్తుకుంటే, ఆ ఇద్దరూ విడిపోయే సన్నివేశం బాధ కలిగిస్తుంది. ఆ సన్నివేశాన్ని కల్పించిన కథకుడూ, వాటిని కదిలించేలా చిత్రీకరించిన దర్శకుడూ.. ఇద్దరూ అభినందనీయులే. విడిపోయిన ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక తిరిగి కలవాలంటే ఏదో ఒక 'సంధాన కర్త' ఉండాలి. అది ఓ జ్ఞాపకం కావచ్చు, ఓ వస్తువు కావచ్చు, ఓ వ్యక్తి కావచ్చు. ఈ సినిమాలో అలాంటి 'సంధానకర్త'గా కనిపించేది ఓ మ్యూజికల్ వాచ్. ఎమ్మార్వోగా పనిచేసే తన తండ్రికి బదిలీ కావడంతో చంటి నుంచి విడిపోక తప్పని స్థితిలో అను అతనికి ఆ మ్యూజికల్ వాచ్ ఇచ్చి, తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దానితో ఆడుకొమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఆ గడియారం కథలో ఓ మలుపుకి కారణమవుతుంది. ఆ గడియారాన్ని శ్రుతి (తనూరాయ్) వద్ద చూసి, ఆమె చెప్పిన మాటలు విని, చంటి అలియాస్ వేణు (ఉదయ్ కిరణ్)ని అపార్థం చేసుకుంటుంది అను. అలాగే ప్రీ క్లైమాక్స్‌లోనూ ఆ గడియారం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎంపీ కొడుకుతో అను పెళ్లి జరిగితేనే నీ చెల్లెలి పెళ్లి అనుకున్న ప్రకారం జరుగుతుందని అను తండ్రి వేణుని హెచ్చరిస్తే, చెల్లెలి కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటాడు వేణు. అందుకే 'మనసంతా నువ్వే' సీరియల్ రచయిత్రి రేణు, తను ప్రేమించిన అను.. ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ సంగతి ఆమెకి చెప్పకుండా "ఇప్పుడు నాకు ఆ అమ్మాయే (అను) గుర్తురావడం లేదు. అసలు ఉందో, లేదో తెలీని అమ్మాయి మీద ప్రేమేంటండీ రేణు గారూ. నా మనసంతా మీరే ఉన్నారండీ..." అంటాడు వేణు.
"అనూయే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది?" అనడుగుతుంది అను. నిజమే కదా అంటూ ఆ గడియారాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు వేణు. అప్పుడు అతడి చెంప చెళ్లుమనిపించి, "యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు" అంటా వెళ్లిపోతుంది అను. వేణు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వాన కూడా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన సునీల్ ఒడ్డున నీళ్లలో కనిపిస్తున్న గడియారాన్ని తీసుకుని వేణు వద్దకొస్తాడు. అతణ్ణి చూసి లేని నవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ ఇప్పటిదాకా అను, తను కలిసి మాట్లాడుకున్నామనీ, తను చాలా హ్యాపీగా ఫీలయ్యిందనీ అంటాడు వేణు.
గడియారాన్ని వేణు చేతిలో పెట్టిన సునీల్ "రేయ్. అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లని ఎదుటివాళ్లకి కనిపించకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావో భగవంతుడు నీకు ఆ కన్నీళ్లే మిగిల్చాడురా. ఏడవరా. వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడువ్" అంటాడు ఉద్వేగంగా. దాంతో సునీల్‌ని గట్టిగా వాటేసుకుని ఏడ్చేస్తాడు వేణు.
ఇట్లా ఆ మ్యూజికల్ వాచ్‌ని ఈ ప్రేమకథలోని మలుపులకు ఉపయోగించుకున్నారు. గమనించాల్సిన అంశమేమంటే ఓసారి అపార్థానికి కారణమైన ఆ గడియారం ఇంకోసారి ప్రేమికులిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఈ రెండో సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా కదిలిస్తుంది. ముఖ్యంగా సునీల్ డైలాగులతో వేణు పాత్ర పట్ల సానుభూతి పెల్లుబుకుతుంది. చెల్లెలి కోసం ప్రేయసికి తనంతట తానుగా దూరమయ్యే అతని పరిస్థితి ఎవర్ని మాత్రం కదిలించదు! ఆ సన్నివేశంలో వానపడటం, ఆ వానలో సునీల్ వద్ద కన్నీళ్లని దాచుకోవాలని వేణు ప్రయత్నించడం, దాన్ని గమనించిన సునీల్ మన కన్నీళ్లని ఎదుటివాళ్లకు కనిపించకుండా వర్షం దాచేస్తుందని అనడం.. రచయిత సన్నివేశ కల్పనా చాతుర్యానికి ఓ చక్కని ఉదాహరణ.
కీలకం చర్చావేదిక సన్నివేశం
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ రోజుల్లో టెలివిజన్లో పాపులర్ అయిన 'ప్రజావేదిక' కార్యక్రమం తరహాలో ఈ సినిమాలో 'స్నేహం-ప్రేమ' అనే అంశంపై పెట్టిన చర్చావేదిక సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. సినిమా మొత్తానికీ కీలకమైంది ఈ ఎపిసోడే. కథ ప్రధానమైన మలుపు తిరిగేది ఆ ఎపిసోడ్‌లోనే. సాధారణంగా సినిమాలో చర్చావేదిక అంటే సగటు ప్రేక్షకుడి దృష్టిలో విసుగు పుట్టించే వ్యవహారం. కానీ దాన్ని జనరంజకం ఎలా చేయొచ్చో ఈ సినిమా చూపించింది. ఆ చర్చావేదికలో పాల్గొన్న అను ఒక్కసారి ఆడది మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురుచూస్తుందంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. వేణు, శ్రుతి ప్రేమించుకుంటున్నారనే అపోహే ఆమె ఆవేశానికి మూలం. ఆ తర్వాత తన చిన్ననాటి నేస్తం గురించీ, ఆమె మీద ప్రేమ గురించీ ఆ కార్యక్రమంలో చెప్పిన వేణు.. ఆ స్నేహితురాలు కలిస్తే తనెవరో చెప్పకుండా ఆమె మనసులో ఏముందో తెలుసుకుంటాననీ చెబుతాడు. 'తూనీగా తూనీగా' పాట పాడతాడు. దాంతో అనుకి అతడి పట్ల ఉన్న అపోహ పటాపంచలవుతుంది. తన పట్ల అతడికి ఉన్న ప్రేమ సంగతి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తను ఎదురైతే అతను ఏం చేయదలచుకున్నాడో అదే ప్రయోగాన్ని అతడి మీద తనే చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పట్నించీ తనెవరో చెప్పకుండా వేణుకి ఆమె దగ్గరయ్యే విధానం, అతడితో ఆమె ఆడే దాగుడుమూతలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తన చిన్ననాటి నేస్తాన్ని తెలుసుకోవడం కోసం రేణు పేరుతో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ని అను రాయడం మరో ఆసక్తికర అంశం. ఇది రంగనాయకమ్మ 'రచయిత్రి' నవలని గుర్తు చేస్తుంది. ఆ నవలలో అనూరాధ అనే కలం పేరుతో రచనలు చేస్తుంది కథానాయిక విజయ. తన భార్యే అనూరాధ అనే సంగతి ఆమె భర్తకి తర్వాత తెలుస్తుంది. చిత్రమేమంటే 'రచయిత్రి' నవలా నాయిక కలం పేరు 'మనసంతా నువ్వే'లో నాయిక అసలు పేరు కావడం. కాకపోతే అ కథ వేరు, ఈ కథ వేరు.
సమష్టి కృషి ఫలితం
కథాకథనాలు రెండూ చక్కగా అమరడమే ఈ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణం. ఆ క్రెడిట్ కథా రచయిత ఎమ్మెస్ రాజు, సంభాషణల రచయితలు పరుచూరి సోదరులు, దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు దక్కుతుంది. తొలి సినిమా కావడం వల్లనేమో ఆదిత్యలోని 'ఫైర్' ప్రతి సన్నివేశ చిత్రణలోనూ కనిపిస్తుంది. ప్రధాన పాత్రలతో పాటు సపోర్టింగ్ కేరెక్టర్లనీ దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. హీరో స్నేహితుడిగా చేసిన సునీల్ పాత్ర, వీక్లీ ఎడిటర్ కూతురు శ్రుతి పాత్ర, అను తండ్రి గంగాధరం పాత్ర కథకి మంచి 'సపోర్ట్'నిచ్చాయి. ఆ పాత్రల్లో సునీల్, తనూరాయ్, తనికెళ్ల భరణి సరిగ్గా ఇమిడిపోయారు. ఇక హీరో వేణు పాత్రకి అతికినట్లు సరిపోయాడు ఉదయ్ కిరణ్. పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది. అప్పటికే అతడికొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ దీనికి మరింత వన్నె అద్దింది. నిజానికి అనూరాధ పాత్రకి రీమాసేన్ ఛాయిస్ కాదు. హీరో పాత్రలో ఉన్న భావోద్వేగాలన్నీ ఆ పాత్రలోనూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోకి తన ఐడెంటిటీ తెలీకుండా నటించే సన్నివేశాల్లో 'అండర్‌ప్లే' అవసరం. ఆ విషయంలో రీమాసేన్ ఓ మోస్తరుగానే నటించింది. అయినా ఆమెని ఆ పాత్రలో ప్రేక్షకులు ఆమోదించడానికి కారణం, ఆ పాత్రలోని బలమే. ఇక ప్రత్యేక పాత్రలో సీతారామశాస్త్రి కనిపించేది స్వల్ప సమయమే అయినా తమవైన డైలాగులతో, 'వాయిస్'తో బలమైన ముద్ర వేశారు. చంద్రమోహన్, సిజ్జు వంటివాళ్లు పాత్రల పరిధుల మేరకు రాణించారు.
సినిమాకి సగం బలం సంగీతమే అనేది నానుడి. ఈ సినిమాకి సంబంధించి అది అక్షరాలా నిజం. అప్పుడే ఎగిసిన సంగీత కెరటం ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా పాటలకి వినసొంపైన, ఆహ్లాదకరమైన బాణీలనిస్తే, పదాలతో ఆడుకునే సీతారామశాస్త్రి చక్కని సాహిత్యాన్నందించారు. 'తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే రావే నా వంకా', 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' (టైటిల్ సాంగ్) పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే వుంటే, 'కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం', 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా', 'ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా' పాటలు మంచి హిట్టయ్యాయి. ఆర్పీ కూర్చిన నేపథ్య సంగీతమూ ప్రభావవంతమైందే. మిగతా సాంకేతిక నిపుణులూ తమ వంతు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఎస్. గోపార్‌రెడ్డి కెమెరా అత్యుత్తమ స్థాయి పనితనాన్ని ప్రదర్శించింది. ఆరంభ సన్నివేశాల్లో, సముద్రం ఒడ్డున సన్నివేశాల్లో, పాటల్లో అది ఎలా హొయలు పోయిందో చూసి తీరాల్సిందే. అరకు అందాల్ని లాఘవంగా ఒడిసిపట్టింది ఆ కెమెరా. దర్శకుడు ఆదిత్య చెప్పినట్లు కె.వి. కృష్ణారెడ్డి ఎడిటింగ్ ప్రతిభ ఈ సినిమా కథనానికి బిగువుని చేకూర్చిపెట్టింది. 'మనసంతా నువ్వే' అందరి మనసుల్నీ దోచుకుని, పెట్టుబడికి ఐదు రెట్ల ఆదాయాన్ని అందించిందంటే అది సమష్టి పనితనం వల్లే.
(వచ్చే వారం ఎన్‌టీఆర్ 'ఆది' చిత్ర విశేషాలు)

Saturday, March 12, 2011

కథ: పదహారేళ్ల తర్వాత...

కృష్ణా ఎక్స్‌ప్రెస్ వేగంగా పరుగెత్తుతోంది. పద్మాకర్‌ని ఆనందం, ఉద్వేగం కలగలసిన భావం ఊపేస్తోంది. అది మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎదుటివాళ్లకి.
"ఏం సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు?" ఎదురుగా విండో పక్కన కూర్చున్న లక్ష్మణ్ అడిగాడు. అతనో ఇంజినీరింగ్ స్టూడెంట్. అప్పటికే ఇద్దరికీ పరిచయమయ్యింది.
"ఇంకో అరగంటలో వేటపాలెం వచ్చేస్తుంది. పదహారేళ్ల తర్వాత నా స్నేహితుణ్ణి కలవబోతున్నా!" పద్మాకర్ గొంతులో ఉద్వేగం దాగలేదు.
"పదహారేళ్ల తర్వాత మీ ఫ్రెండుని కలవబోతున్నారా! అబ్బా.. చాలా థ్రిల్లింగ్‌గా ఉండి ఉంటుంది మీకు. అవునా?" అడిగాడు లక్ష్మణ్.
"మామూలు థ్రిల్లింగ్ కాదు. వాడు నా ప్రాణమిత్రుడు. కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. మా క్లోజ్‌నెస్ చూసి మిగతా స్టూడెంట్స్, లెక్చరర్స్ తెగ ఆశ్చర్యపోయేవాళ్లు. మమ్మల్ని విడదీయాలని చూసిన వాళ్లు సక్సెస్ కాలేకపోయారు."
"మరి ఎలా విడిపోయారు?"
"బీఎస్సీ ఫైనలియర్‌లో ఉండగానే మా నాన్నకు ప్రమోషన్ మీద కలకత్తాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఆయన అప్పుడు స్టేట్ బ్యాంకు మేనేజర్. ఎగ్జాంస్ అయ్యేలోగా నాలుగు నెలలు సుదర్శన్ వాళ్లింట్లోనే ఉన్నా. ఆ తర్వాత కలకత్తాకు వెళ్లిపోయా. మళ్లీ ఇప్పుడే రావడం."
"అప్పణ్ణుంచీ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ లేదా?"
రైలు వేగం తగ్గింది.
"నేను కలకత్తాకి వెళ్లిన కొత్తలో రెండు మూడు ఉత్తరాలు రాసుకున్నాం. ఆ తర్వాత నేను ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయా. చదువులో పడి నేను వాడికి ఉత్తరాలు రాయడం నిర్లక్ష్యం చేశా. అట్లా మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నెల రోజుల క్రితమే వాడితో మళ్లీ మాట్లాడా ఫోనులో. అప్పట్నించీ వాడెలాగ ఉన్నాడో చూడాలనే ఆరాటం. అందుకే ఈ ప్రయాణం."
రైలు బాపట్ల స్టేషనులో ఆగింది. దిగేవాళ్లు దిగుతుంటే, ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు.
"గుగ్గిళ్లోయ్.. గుగ్గిళ్లూ" అంటూ తిరుగుతున్న ఓ కుర్రాడిని పిలిచాడు పద్మాకర్. ఐదేసి రూపాయలకు రెండు పొట్లాలు తీసుకుని ఒకటి లక్ష్మణ్‌కిచ్చాడు. అతను మొహమాటపడుతూ తీసుకున్నాడు.
"గుగ్గిళ్లంటే సుదర్శన్‌కీ, నాకూ చాలా ఇష్టం. కాలేజీ దగ్గరకి ఓ ముసలామెతో పాటు ఇద్దరు ముగ్గురు గుగ్గిళ్లు తెచ్చేవాళ్లు. మేం మాత్రం రోజూ ఆ ముసలామె దగ్గరే కొనేవాళ్లం. ఒకసారి ఆమె ఆ గుగ్గిళ్లు అమ్ముతూనే గుండెపోటు వచ్చి చనిపోయింది" జ్ఞాపకం చేసుకున్నాడు పద్మాకర్.
"అసలు అన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఎలా దొరికాడు" అడిగాడు లక్ష్మణ్.
"ఫోన్ చేసింది నేను కాదు, వాడే. ఢిల్లీలో ఆ ఊరతను ఒకాయన పరిచయమయ్యాడు. అప్పుడు సుదర్శన్ గురించి అతనికేమన్నా తెలుసేమో అడిగాను. అతనేమన్నాడో తెలుసా? 'సుదర్శన్‌గారి గురించి తెలీకపోతే ఆ ఊరతను కానట్టే' అని. అయితే వాడి ఫోన్ నెంబర్ తెలీదనీ, వాడి పేరు, ఊరి పేరు రాస్తే చాలు లెటర్ వాడికి చేరుతుందనీ చెప్పాడు. అతను చెప్పినట్లే లెటర్ రాశా. అందులో నా ఫోన్ నెంబరు ఇచ్చా. నాలుగు రోజుల తర్వాత వాడు ఫోన్ చేశాడు" ఉత్సాహంగా చెప్పాడు పద్మాకర్.
రైలు కదిలింది.
"మీ ఫ్రెండ్ అక్కడ అంత ఫేమస్ ఫిగరా?" లక్ష్మణ్ గొంతుకలో కుతూహలం.
"అవును. ఆ ఊళ్లోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ల వాళ్లకీ వాడు తెలుసంట! ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరికంటే ఎక్కువసార్లు అరెస్ట్ అయ్యిందీ, జైలుకి వెళ్లిందీ వాడేనంట!" అని పద్మాకర్ చెప్పగానే గుగ్గిళ్లు తింటున్న వాడల్లా నోరెళ్లబెట్టాడు లక్ష్మణ్.
"జైలుకి వెళ్తుంటాడా? అంటే.." అని ఆగిపోయాడు.
"నీ ఉద్దేశం అతడు నేరాలు చేస్తూ జైలుకి వెళ్తుంటాడా? అని కదూ!.. కాదు. మామూలుగానైతే జైలుకి వెళ్లేది నేరాలు చేసేవాళ్లే. కానీ నా ఫ్రెండు అలాంటివాడు కాదు. అన్నిసార్లూ ఇతరుల కోసమే, వారి కోసం చేసిన పోరాటాల వల్లే జైలుకి వెళ్లాడు. పేదవాళ్లకి అన్యాయం జరిగితే కాళ్లూ చేతులూ ముడుచుకుని, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం వాడికి చేతకాదు. అందుకే అన్నిసార్లు జైలుకెళ్లాడు. ఇంకెన్నిసార్లు వెళతాడో! ఢిల్లీలో ఈ సంగతి చెప్పిన ఆ వ్యక్తి తనూ ఆ ఊరివాడైనందుకు గర్విస్తున్నానని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వపడ్డాను, సుదర్శన్‌కి నేను మిత్రుడనైనందుకు. అలాంటి గొప్ప లీడర్ని వెంటనే చూడాలని మనసు కొట్టుకుపోయింది. అందుకే ఈ ప్రయాణం" చెబుతుంటే పద్మాకర్ గొంతు ఉద్వేగంతో పూడుకుపోయింది. వొళ్లు వణికింది. విండోలొంచి బయటకు చూశాడు. రైలుకట్ట పొడవూతా వరిచేలు పచ్చగా. అప్పుడే కోతలు మొదలు పెడుతున్నట్లుంది. గోచీలు బిగించి ఆడవాళ్లు కొడవళ్లతో పైరు కోస్తుంటే, మగాళ్లు వాటిని కుప్పలు పెడుతున్నారు.
అంతట్లోనే నూలు డయ్యింగులు ప్రత్యక్షమయ్యాయి. బొంగుల మీద ఎండకు ఆరబెట్టిన రంగురంగుల నూలు. ఈపూరుపాలెం స్టేషను దాటింది రైలు. అక్కడ ప్యాసింజర్లు మాత్రమే ఆగుతాయి. రైలు వేగం తగ్గుతోంది. చీరాల స్టేషన్ దగ్గరవుతోంది.
"ఇంకో పది నిమిషాల్లో వేటపాలెం వచ్చేస్తుంది" అన్నాడు లక్ష్మణ్ విండోలోంచి బయటకి చూస్తూ.
పద్మాకర్ తలూపాడు.
"మీరు చెబుతుంటే మీ ఫ్రెండుని చూడాలని నాకూ ఆరాటంగా ఉందండీ. ఆయన గురించీ, ఆయన పనుల గురించీ ఇంకా తెల్సుకోవాలన్న కోరిక కలుగుతోంది. అలాంటివాళ్లే నాకు స్ఫూర్తి. నేను మా కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ని. కానీ నేను తప్పకుండా గూడూరుకి వెళ్లాలి. అమ్మకి ఆరోగ్యం బాలేదు" అన్నాడు లక్ష్మణ్ కాస్త విచారంగా.
"ఏంటి ప్రాబ్లెం అమ్మకి?" అడిగాడు పద్మాకర్.
చీరాల్లో ఆగింది రైలు.
"రెండ్రోజుల క్రితం ఇల్లు కడుగుతూ జారి గడప మీద పడిపోయిందంట! మడమ దగ్గర ఫ్రాక్చరంట! అసలే అమ్మకు సుగర్" చెప్పాడు అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ లక్ష్మణ్.
"అరే.. అవునా! అమ్మ ఆరోగ్యం ముఖ్యం. నిన్ను చూశాక అమ్మకు కాస్త ధైర్యం రావచ్చు. ఇష్టమైన వాళ్లు దగ్గరుంటే మనిషిలో హుషారు వస్తుంది" చెప్పాడు పద్మాకర్. రైలు కదిలింది. పద్మాకర్ లేచి సీటుకింద పెట్టిన ఎయిర్‌బ్యాగ్‌ను లాగి సీటు మీద పెట్టాడు. తనలో కలుగుతున్న ఉద్వేగానికి ఆశ్చర్యపడ్డాడు. తనకి ఊహ తెలిశాక ఇటువంటి ఉద్వేగాన్ని ఎన్నడూ ఎరుగడు. ఎంబీఏలో టాపర్‌గా నిలిచినప్పుడు గానీ, ప్రతిష్ఠాత్మక ఢిల్లీ బిజినెస్ స్కూల్లో ఉద్యోగం వచ్చినప్పుడు గానీ ఇంతటి ఉద్వేగం కలగలేదు.
అంతలోనే రైలు స్పీడు తగ్గింది. వేటపాలెం స్టేషన్ వచ్చేస్తోంది. కిర్రుమని చప్పుడు చేస్తూ ఆగింది రైలు.
పద్మాకర్ దిగుతుంటే "మీ ఫ్రెండుని అడిగినట్లు చెప్పండి సార్. బై.." చెప్పాడు లక్ష్మణ్.
నవ్వి "బై" అంటూ రైల్లోంచి ఫ్లాట్‌ఫాం మీదకి అడుగుపెట్టాడు. స్టేషన్ కాస్త మారింది. ఇదివరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవు. అవతలివైపు ఫ్లాట్‌ఫాంకి షెల్టర్లు లేవు. ఇప్పుడు వచ్చాయి. స్టేషన్ బయటకొచ్చాడు. అక్కడ పెద్ద మార్పు కనిపించలేదు. మూడు నాలుగు రిక్షాలు, రెండు ఆటోలు ఉన్నాయి.
"సార్! ఆటో కావాలా? ఎక్కడికి?" అంటూ వచ్చాడు ఒక ఆటోవాలా.
త్వరగా సుదర్శన్‌ని చూడాలని ఉన్నా, రిక్షాలో వెళ్లాలని అనుకున్నాడు పద్మాకర్. రిక్షాలో అయితే ఊరు చూస్తూ వెళ్లొచ్చు.
అతణ్ణి పంపించేసి ఒక రిక్షా ఎక్కి "నాయనపల్లికి పోనీయ్" అని కూర్చున్నాడు.
రిక్షా పోతుంటే అటూ ఇటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జింఖానా క్లబ్, పోలీస్ స్టేషన్, గరల్స్ హైస్కూలు దాటింది రిక్షా.
"అరే ఇక్కడ సరస్వతీ పిక్చర్ ప్యాలెస్ ఉండాలే. విజయదుర్గా థియేటర్ అని మార్చారన్న మాట!" అన్నాడు రూపురేఖలు మారిపోయిన సినిమా హాలును చూస్తూ.
(మిగతా వచ్చే వారం) 

Friday, March 11, 2011

హిట్.. హిట్.. హుర్రే!: మనసంతా నువ్వే

తారాగణం: ఉదయ్ కిరణ్, రీమాసేన్, సిజ్జు, తనూరాయ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవదాస్ కనకాల, సుధ, రజిత, శివారెడ్డి, శివపార్వతి, కృష్ణవేణి, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబీ జీబా, రఘునాథరెడ్డి, పావలా శ్యామల, శిరీష
కథ: ఎమ్మెస్ రాజు
స్క్రీన్‌ప్లే, రచన: పరుచూరి బ్రదర్స్
రచనా సహకారం: వీరు పోట్ల
పాటలు: సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం: ఎస్. గోపాల్‌రెడ్డి
కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
డాన్స్: సుచిత్రా చంద్రబోస్
కళ: రాజేశ్
డి.టి.ఎస్. మిక్సింగ్: డి. మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. భాస్కరరాజు
నిర్మాత: ఎమ్మెస్ రాజు
దర్శకత్వం: వి.ఎన్. ఆదిత్య
బేనర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి: 2 గంటల 37 నిమిషాలు
విడుదల తేది: 19 అక్టోబర్ 2001

గ్రాఫిక్స్‌ని నమ్ముకుని భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'దేవీ పుత్రుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కుదేలవడంతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు బాణీ మార్చాలనుకున్నారు. అందమైన ప్రేమకథని తెరకెక్కించాలని సంకల్పించారు. ఆ సమయంలో వి.ఎన్. ఆదిత్య అనే కుర్రాడి గురించి విన్నారు. డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ వద్ద వరుసగా మూడు సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశాడు ఆదిత్య. అప్పటికే అతను తన స్నేహితుడైన త్రివిక్రం కథతో డైరెక్టర్ కావాలని ప్రణాళికలు వేస్తున్నాడు.
"ఎమ్మెస్ రాజు గారు కబురు పంపించిన వారం రోజులకి వెళ్లి కలిశా. ఆయనే ఓ లైన్ చెప్పారు. 'ఇది ప్రేమించుకుందాం రా సినిమా లైన్ సర్' అని చెప్పా. ఆయన నన్ను మెచ్చుకుని, అప్పుడు తన మనసులోని లైన్ చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల పాటు ఇద్దరం చాలా సినిమాల గురించి క్యాజువల్‌గా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అంతాకా హీరో ప్రేమ విషయం స్నేహితులకి తెలియదన్నట్లుగా చూపించే సినిమాలే ఎక్కువగా వచ్చాయ్. కానీ ఎవరైనా తన ప్రేమని మొదటగా చెప్పుకునేది స్నేహితులకేననీ, సినిమాలో ఆ కోణం పెడితే బాగుంటుందనీ చెప్పా. ఆయన నన్ను హత్తుకుని 'నువ్వే నా డైరెక్టర్‌వి' అన్నారు. అడ్వాన్స్ ఇచ్చారు" అని ఆ రోజులు జ్ఞాపకం చేసుకున్నారు ఆదిత్య.
అలా ఎమ్మెస్ రాజు కథతో, పరుచూరి సోదరుల స్క్రీన్‌ప్లేతో, ఆదిత్య దర్శకత్వంలో తయారైన ప్రేమ కథాచిత్రం 'మనసంతా నువ్వే' 45 ప్రింట్లతో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమా దానికి ఐదు రెట్లు అంటే 15 కోట్ల రూపాయల్ని వసూలుచేసి పెట్టింది. 'దేవీపుత్రుడు' కారణంగా ఎంతో డబ్బు పోగొట్టుకున్న ఎమ్మెస్ రాజు ఎంతో నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేసి, అనూహ్యమైన ఫలితాన్ని పొందారు. అప్పటికే 'చిత్రం', 'నువ్వు నేను' వంటి వరుస హిట్లు సాధించి, యువతలో క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే'తో హ్యాట్రిక్ సాధించాడు. 'లవర్ బాయ్' ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'చిత్రం'లో హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఉదయ్ కిరణ్, రీమాసేన్ జోడీ ఈ సినిమాతో రెండో సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లో ఎక్కడ విన్నా 'తూనీగా.. తూనీగా' పాటే. ఆ పాటతోటే 'పాడుతా తీయగా' ఫేం ఉష సినీ గాయనిగా తళుక్కున మెరిసిపోయింది. అలాగే టైటిల్ సాంగ్ 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' కూడా హిట్.
ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విశేషం మరోటుంది. ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో ఏడుగురు తదనంతర కాలంలో దర్శకులయ్యారు. కథా రచయిత అయిన నిర్మాత ఎమ్మెస్ రాజు 'వాన'తో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ 'అందమైన మనసులో'తో, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి 'నా ఆటోగ్రాఫ్'తో, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ 'పల్లకిలో పెళ్లికూతురు'తో, కో-డైరెక్టర్ శంకర్ కె. మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా'తో, పబ్లిసిటీ డిజైనర్ రమేశ్‌వర్మ 'ఒక ఊరిలో'తో, రచనా సహకారం అందించిన వీరు పోట్ల 'బిందాస్'తో దర్శకులుగా పరిచయమయ్యారు.

కథా సంగ్రహం:
అరకులో చంటి, అనూరాధ ఇరుగుపొరుగు వాళ్లు. చంటివాళ్లు కడు బీదలైతే, అను తండ్రి గంగాధరం ఎమ్మార్వో. అంతస్తులు వాళ్ల దోస్తీకి అడ్డుకాలేదు. తండ్రికి ట్రాన్స్‌ఫర్ కావడంతో అను వెళ్లిపోతుంది. వెళ్లేప్పుడు చంటికి తన జ్ఞాపకంగా ఓ మ్యూజిక వాచ్ ఇచ్చి వచ్చే ఏడాది తన పుట్టినరోజున అక్కడి ఆంజనేయస్వామి గుడివద్ద కలుసుకుందామని చెబుతుంది అను. తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథ అయిన చంటి రైల్వే స్టెషన్లో ఇడ్లీలు అమ్ముకుని బతుకుతుంటాడు. ఓ రోజు రైలెక్కుతున్న ఓ పాప బంగారు గోలుసు జారి కిందపడిపోతే, దాన్ని తీసుకెళ్లి ఆ పాప తండ్రి మోహన్ (చంద్రమోహన్)కి ఇస్తాడు. చంటి అనాథ అని తెలుసుకుని ఆ కుటుంబం అతన్ని తమతోపాటు తీసుకువెళ్తుంది. చంటికి వేణు అని పేరు పెడతారు.
వేణు (ఉదయ్ కిరణ్)కి 22 యేళ్లు వస్తాయి. అతనికి సునీల్ (సునీల్) మంచి ఫ్రెండ్. పన్నెండేళ్ల నుంచీ ప్రతి ఏడాదీ అరకులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్తూనే వుంటాడు వేణు. కానీ ఇంతవరకు అను తారసపడలేదు. చెల్లెలు రేఖ (శిరీష)ని కాలేజీ వద్ద ఎంపీ కొడుకు స్నేహితుడు అల్లరి పెడుతుంటే వాణ్ణి కొడతాడు వేణు. అతను ఓ సూపర్‌మార్కెట్లో దూరితే వెంటపడి కొట్టే క్రమంలో పొరపాట్న అతడి దెబ్బ ఆ సూపర్ మార్కెట్ ఓనర్‌కి తగులుతుంది. పోలీసులు వేణుని తీసుకుపోబోతుంటే కొట్లాట సంఘటనని షూట్ చేసిన ఓ టీవీ చానల్ ప్రతినిధి శ్రుతి (తనూరాయ్) నిజంచెప్పి అతణ్ణి విడిపిస్తుంది. అదివరకే వేణు, 'స్వాతి' ఎడిటర్ కూతురైన శ్రుతి స్నేహితులవుతారు. మలేషియాలో మేనమామ వద్ద ఉన్న అను (రీమాసేన్) చదువు పూర్తికాగానే ఇండియాకి తిరిగొస్తుంది.
తన చిన్నటి జ్ఞాపకాలతో స్వాతి వీక్లీలో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ రాయడం ప్రారంభిస్తుంది అను. అది చూసి చంటి వస్తాడనేది ఆమె ఆశ. అతి తక్కువ కాలంలోనే ఆ సీరియల్ పాపులర్ అవుతుంది. వేణు చెల్లెలు రేఖకి పెళ్లిచూపులు జరుగుతాయి. ఆ పెళ్లికొడుకు తండ్రి ఎవరో కాదు. ఇదివరలో వేణువల్ల పొరపాట్న దెబ్బతిన్న సూపర్‌మార్కెట్ ఓనర్. వేణుని చూసి అతను ఆగ్రహంతో ఊగిపోయి, ఆ సంబంధం ఒద్దనుకుని వెళ్లిపోబోతాడు. అప్పుడు పొరబాట్న కొట్టాననీ, దయచేసి పెళ్లి ఆపకండనీ, తానసలు వాళ్ల కొడుకునే కాదనీ బ్రతిమలాడుతూ క్షమాపణలు కోరతాడు వేణు. అయితే వేణుని అవమానించినందుకు మోహన్ పెళ్లివాళ్లని తిట్టి పంపేస్తాడు. బాధలో ఉన్న వేణుని బార్‌కి తీసుకెళ్లి తనతో పాటు మందు తాగిస్తాడు మోహన్. డబ్బులు తక్కువవుతాయి. శ్రుతికి ఫోన్ చేస్తాడు వేణు. ఆమె వచ్చి డబ్బు కడుతుంది. మత్తులో ఆమెకి మ్యూజికల్ వాచ్ ఇస్తాడు వేణు. మరుసటిరోజు ఆ వాచ్‌ని గమనించి, దాని గురించి శ్రుతిని ఆరా తీస్తుంది అను. అది తన బాయ్‌ఫ్రెండ్ వేణు ఇచ్చాడని చెబుతుంది శ్రుతి. నిర్ఘాంతపోతుంది అను. వేణుని తప్పుగా అర్థం చేసుకుంటుంది. శ్రుతికి వాచ్ ఇచ్చాననన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఆమె ఇంటికి వెళ్లి, ఆ వాచ్ తనకు చిన్ననాటి స్నేహితురాలు అను ఇచ్చిన సంగతి చెప్పి, తిరిగి తీసుకుంటాడు. టీవీ చానల్లో జరుగుతున్న 'స్నేహం-ప్రేమ' చర్చా కార్యక్రమంలో అను, వేణు పాల్గొంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సంధానకర్తగా వ్యవహరించే ఆ చర్చలో ప్రేమ సక్సెస్ అయినా, ఫెయిలైనా అందులో ఆడా, మగా ఇద్దరికీ సమాన పాత్ర ఉందంటూ, తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతాడు వేణు. తన నేస్తం కలిస్తే తనెవరో చెప్పననీ, ఆమె మనసులో ఏముందో మొదట తెలుసుకుంటాననీ అంటాడు. అది విని అతడి మనసులో తనకున్న స్థానం అర్థమై ఆనందంతో ఉప్పొంగిపోతుంది అను. తన మీద అతడు చేయాలనుకున్న ప్రయోగాన్ని అతడిమీద తనే చేస్తుంది. తనెవరో చెప్పకుండా వేణుతో స్నేహం పెంచుకుంటుంది. వేణు కుటుంబానికీ సన్నిహితమవుతుంది. వేణు చెల్లెలికి మరో సంబంధం కుదురుతుంది.
అయితే అనుకోని రీతిలో తనతో వియ్యమందమంటూ ఎమ్మార్వోతో పెళ్లి ప్రపోజల్ పెడతాడు ఎంపీ (దేవదాస్ కనకాల). వియ్యమందితే వచ్చే 500 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్టుకి ఆశపడి అనుని ఎంపీ కొడుక్కిచ్చి చేయడానికి ఆనందంగా ఒప్పుకుంటాడు గంగాధరం. తండ్రికి చంటితో తన ప్రేమ గురించి చెబుతుంది అను. 'మనసంతా నువ్వే' సీరియల్లో జరుగుతున్న సంఘటనలు చదివి రేణు, అను ఒక్కరే అని తెలుసుకుంటాడు వేణు. అనుని కలవడానికి తహతహలాడుతున్న వేణుని గంగాధరం కలిసి, నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో తన కూతురి పెళ్లి జరగాలనీ అంటాడు. ఇప్పటికే ఓసారి పెళ్లి ఆగిందనీ, ఈ పెళ్లి కూడా ఆగితే నీ తండ్రి గుండె ఆగిపోతుందనీ బెదిరిస్తాడు. చెల్లి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు వేణు. ఆ తర్వాత ఏమయ్యింది? అను, వేణు ఎలా ఒక్కటయ్యారు? అనేది క్లైమాక్స్.

నేను దాన్ని పట్టుకోలేకపోయా
-వి.ఎన్. ఆదిత్య
అప్పట్లో పరుచూరి బ్రదర్స్ వద్ద వీరు పోట్ల అసిస్టెంట్‌గా ఉన్నాడు. నేను, వీరు స్క్రిప్ట్ వర్క్ చేశాం. మేం చేసిన వర్క్‌ని ఎప్పటికప్పుడు రాజు గారు చెక్‌చేసి, మమ్మల్ని సరైన ట్రాకులో పెడుతూ వచ్చారు. మరోవైపు గోపాలకృష్ణ గారు డైలాగ్ వెర్షన్ రాస్తూ వచ్చారు. స్క్రిప్టు పూర్తయ్యాక 'మహేశ్‌తో చేద్దామా?' అనడిగారు రాజు గారు. అది మహేశ్ వంటి మాస్ హీరోకి సరిపోదనీ, అప్పుడే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటున్న ఉదయ్ కిరణ్ అయితే బాగుంటుందనీ చేప్పా. అలా అతను ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. చంటి పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది.
ఆ రోజుల్లో టీవీలో గొల్లపూడి మారుతీరావు గారి 'ప్రజావేదిక' కార్యక్రమం సూపర్‌హిట్. సినిమాలో మేం పెట్టిన 'ప్రేమ-స్నేహం' చర్చావేదికకి ప్రేరణ అదే. మా ప్రేమకథకి కీలకమైంది ఆ ప్రజావేదిక సన్నివేశమే. అందులో ప్రయోక్తగా వ్యవహరించే పాత్రకి మారుతీరావు గారినే తీసుకోవాలనుకున్నాం. చివరికి సీతారామశాస్త్రి గారు దాన్ని అమోఘంగా చేశారు. ఆ సీనులో తను చెప్పే డైలాగ్స్‌తో పాటు ఉదయ్ డైలాగ్స్‌ని రాసింది ఆయనే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో రీషూట్ లేని ఏకైక చిత్రం 'మనసంతా నువ్వే'. మీకో సంగతి చెప్పాలి. నేను పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంటే, 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా' పాటలో కొంత భాగాన్ని రాజు గారే చిత్రీకరించారు. రీమాసేన్, సిజ్జు మధ్య ఎయిర్‌పోర్ట్ సీనుని తీసిందీ ఆయనే.
సినిమా విడుదలయ్యాక మారుతీరావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సినిమాలోని ప్రతి షాట్ గురించీ ఆయన విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ మాట్లాడారు.
కృష్ణారెడ్డి ఎడిటింగ్ గురించి కూడా చెప్పాలి. ఎడిటింగ్ రూములో ఉన్నప్పుడు చివరలో ఎమోషన్స్ మిస్సయ్యాయని రాజు గారు, గోపాలకృష్ణ గారు భావించారు. అప్పుడు 'నీ స్నేహం..' పాటని మరో చోట కూడా 'కట్.. పేస్ట్' చేశారు కృష్ణారెడ్డి. దాంతో ఎమోషన్స్ బ్రహ్మాండంగా క్యారీ అయ్యాయి. నేను దాన్ని పట్టుకోలేకపోయా. రీ రికార్డింగ్‌తో ఆ సీన్ బాగా పండింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక 'నీ స్నేహం' సినిమా కోసం అందులో నటిస్తున్న కె. విశ్వనాథ్ గారు రాజు గారి ఆఫీసుకి వచ్చారు. 'ఏడయ్యా. నీ డైరెక్టర్ని పరిచయం చెయ్యవా?' అనడిగారు రాజు గార్ని. నన్ను పరిచయం చెయ్యగానే 'ఇంత చిన్నవాడివా. యాన్ యంగ్‌స్టర్ విత్ గుడ్ టేస్ట్' అని మెచ్చుకున్నారు. అలాగే ఓసారి చిరంజీవి గారింటికి నేను వెళ్లిన సమయంలో ఆయన 'మనసంతా నువ్వే'ని డీవీడీలో చూస్తున్నారు. స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడి మెచ్చుకున్నారు. ఇలా చాలామంది పెద్దవాళ్ల నుంచి మంచి మంచి ప్రశంసలు అందుకున్నా.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Friday, March 4, 2011

హిట్.. హిట్.. హుర్రే!: నువ్వు నాకు నచ్చావ్-2

ఒకరితో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి, తనకు తెలీకుండానే మరొకర్ని ప్రేమిస్తే.. ఆ అమ్మాయి ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? ఆమె ప్రేమని పొందిన యువకుడూ ఆమెని అమితంగా ప్రేమించి, పెద్దల్ని కష్టపెట్టకూడదనే ఒకే కారణంతో మౌనంగా ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? ఇంతకీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా, మనసుకి నచ్చిన వాళ్లని మనువాడాలా? ఎన్ని ప్రశ్నలు! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం!! మనసులు కలవని అమెరికా సంబంధం కంటే మనసుకి నచ్చిన మనూరబ్బాయే ఎంతో మేలని చెప్పిన ఈ చిత్రాన్ని తిరుగులేని విధంగా దీవించారు ప్రేక్షకులు. చేసిన వ్యాయానికి రెట్టింపు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెట్టారు. ఈ సీరియస్ విషయాన్ని సీరియస్‌గా కాక, వినోదాల విందుగా చిత్రించిన దానికి దక్కిన ప్రయోజనం ఇది.
'కథ తక్కువ కథనం ఎక్కువ' తరహాకి చెందిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం మూడు గంటలపైగా నిడివి ఉన్నా బోర్ కొట్టకపోవడానికీ, ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచడానికీ కారణం చకచకా పరుగులెత్తిన సన్నివేశాలూ, జరజరా ఉరకలెత్తిన సంభాషణలూ. చిత్రంలోని దాదాపు అన్ని సన్నివేశాలూ సహజంగానే తోస్తాయి. ఏ సన్నివేశాన్ని తీసుకున్నా 'అవును. నిజంగా కూడా ఇలాగే కదా జరిగేది' అనిపించడమే ఈ చిత్రం ప్రత్యేకత.
చాలా సినిమాల్లో కనిపించినట్లు ఈ సినిమాలో నందిని, వెంకీలది 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' కాదు. ఏ బాధలూ లేకుండా సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు వెంకీ అయితే ఇంకో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లే స్థితిలో ఉన్న చక్కని చుక్క నందిని. ఆమె తన తండ్రి స్నేహితుని కూతురనీ, మరొకరితే నిశ్చితార్థం జరిగిందనీ వెంకీకి తెలుసు. అందుకే ఆమెని మొదట మరోభావంతో అతను చూడలేదు. ఉడుకు వయసు కారణంగా ఇద్దరూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. మొదట అతడంటే చులకన భావం ఉన్న నందు అతడి మనసెంత స్వచ్ఛమైందో గ్రహించాక తనకు తెలీకుండానే క్రమంగా అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇక్కడ్నించీ ఇద్దరి మనసుల్లోని సంఘర్షణని దర్శకుడు ఎంతో నేర్పుగా సెల్యులాయిడ్ మీద చిత్రించాడు.
భారతీయ సంప్రదాయం ప్రకారం మనసు ఎవరి మీదున్నా మనువాడిన వాడే స్త్రీకి సర్వస్వం. నిశ్చితార్థం అంటే సగం పెళ్లయిపోయినట్లే. కాబోయే వరుడి మీదే అమ్మాయి దృష్టంతా లగ్నం కావాలి. ఆ నిశ్చితార్థం అయ్యాక మరో మగాడు ఆమె జీవితంలో ప్రవేశించడమన్నది మన సెంటిమెంట్‌కి విరుద్ధమైన సంగతి. ఆ యాంటీ సెంటిమెంట్ వ్యవహారాన్ని అందరిచేతా ఔననిపించాలి. ఇక్కడ కథనం ఏమాత్రం బేలెన్స్ తప్పినా అభాసవుతుంది. రచయిత, దర్శకుడి పనితనం ఎలాంటిదో బయటపడేది ఇలాంటి సున్నిత సందర్భాల్లోనే. ఆ విషయంలో విజయభాస్కర్, త్రివిక్రం జంటగా విజయం సాధించారు.
తన మనసు బయటపెట్టినా, ఎంతగా ప్రయత్నిస్తున్నా వెంకీ నుంచి ఆశించిన స్పందన రానందుకు బాధపడుతూ 'ఒక్కసారీ చెప్పలేవా నువ్వు నచ్చావనీ..' అని పాడుతుంది నందు. దానికి సమాధానమిస్తూ పాట చివరలో నందూని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోబోయి తమాయించుకుని వొదిలేస్తాడు వెంకీ.
"ఎందుకిలా చేస్తున్నావ్ నువ్వు? ఒక్క క్షణం చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తావ్. ఒక్క క్షణం అస్సలు పరిచయం లేనట్లు దూరంగా ఉండిపోతావ్. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది. ఎందుకు? నువ్వే బాధపడతావ్. నువ్వే ఓదారుస్తావ్. ఒక్కోసారి నవ్విస్తావ్. ఒక్కోసారి ఏడిపిస్తావ్. నన్నెందుకిలా హింసిస్తున్నావ్? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావ్? అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావ్? వై వెంకీ? ఎందుకిలా చేస్తున్నావ్? చెప్పు" అని అతడి గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంది నందు.
ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి అతడు తనకు కాసేపు దగ్గరగా, మరికాసేపు దూరదూరంగా ఉండటాన్ని తట్టుకోలేక వేసిన ఈ ప్రశ్నలు ప్రేక్షకుల గుండెని తడి చేయకుండా ఉంటాయా? జీవితంలో ప్రేమలో పడిన ఎవరైనా ఆ పాత్రలతో, ఆ సన్నివేశాలతో సహానుభూతి చెందకుండా ఉంటారా? అంతదాకా ఆ పాత్రలు తెరనిండా చేసిన అల్లరిలో, చిలిపి చేష్టల్లో తమని తాము చూసుకున్న ప్రేక్షకులు ఈ ఆర్ద్రమైన సన్నివేశాన్ని కూడా సొంతం చేసుకున్నారు. నవ్వుల్లో ముంచెత్తే సన్నివేశాల్నే కాదు, హృదయాన్ని తడిచేసే సన్నివేశాల్నీ కల్పించగలనని త్రివిక్రం నిరూపిస్తే, ఆ సన్నివేశాల్ని అంతే హృద్యంగా తీయగలనని విజయభాస్కర్ నిరూపించాడు.
ఇక ఈ సినిమాలో వినోదాన్ని పంచే సన్నివేశాలకు కొదవ లేదు. వెంకటేశ్, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశమూ నవ్వులు పూయిస్తుంది. అన్నిటికీ మించి ప్రధానమైన హీరో అల్లరివాడైతే ఎంత వినోదం! ఎంత అహ్లాదం!! చక్కని కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నిలిచే వెంకటేశ్‌కి అల్లరి పాత్ర లభిస్తే చెడుగుడు ఆడకుండా ఉంటాడా? వెంకీ పాత్రలో విపరీతమైన అల్లరి చేశాడు. తెరనిండా నవ్వుల జడివాన కురిపించాడు. నలభయ్యో పడిలో పడినా పదిహేడేళ్ల పరువాల చిన్నది ఆర్తీ సరసన పాతికేళ్ల కుర్రాడిలానే కనిపించి మెప్పించాడు. త్రివిక్రంలోని హాస్యప్రియుడు యమ సీరియస్‌గా ప్రవర్తించే మూర్తి (ప్రకాశ్‌రాజ్) పాత్రతో కూడా ఓ సందర్భంలో ఆపుకోలేని నవ్వుని సృష్టించాడు. హాలీవుడ్ సినిమా 'మీట్ ద పేరెంట్స్' ప్రేరణతో అతను కల్పించిన డైనింగ్ టేబుల్ సీన్ ఇప్పటికీ కళ్లముందు మెదిలి పెదాలపై నవ్వులు మొలిపిస్తుందన్నది నిజం. అమ్మ మీద ప్రేమ ఉన్న మూర్తి ఆమె మీద కవిత చదువుతుంటే వెంకటేశ్ ప్రదర్శించే హావభావాలు చూడాల్సిందే.
ఈ సినిమా విజయంలో ఆర్తీ అగర్వాల్‌దీ కీలక భాగస్వామ్యమే. నందిని పాత్రలో ముగ్ధమోహనంగా కనిపించడమే కాక, ఆ పాత్రలో మమేకమై నటించి, సగటు ప్రేక్షకుణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది. వెంకటేశ్ కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన ప్రకాశ్‌రాజ్ హీరోయిన్ తండ్రిగా నడివయసు పాత్రలో బాగా రాణించాడు. ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుదీప, ఆషా సైనీ, పృథ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
రెండు మూడు సన్నివేశాల్లోనే కనిపించినా సుహాసిని పాత్రని ఉపయోగించుకున్న తీరు కూడా ముచ్చట వేస్తుంది. నందు మేనత్త అంటే మూర్తి చెల్లెలి పాత్ర వేసింది సుహాసిని. తన నిశ్చితార్థానికి కాకుండా తర్వాతెప్పుడో వచ్చిన మేనత్తని నందు ప్రశ్నిస్తే "పెళ్లయిన రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్లయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది. ఊరు మారుతుంది. ఇంటిపేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు?.. మనం ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మనవాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు.. మనల్నెందుకు వెంటాడాలి? మనల్నెందుకు ఏడ్పించాలి? ఈ పెళ్లిళ్లెందుకవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?" అని ఆవేదన చెందే సుహాసినితో మహిళా ప్రేక్షకులు బాగా సహానుభూతి చెందారు.
ఇక ఈ చిత్రంలోని పాటలు మనసుకి ఎంత ఉల్లాసాన్నిచ్చాయో చాలామందికి తెలిసిన సంగతే. కోటి అందించిన స్వరాలకు సీతారామశాస్త్రి సాహిత్యం తోడై పాటలన్నీ హిట్టయ్యాయి. 'ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి', 'నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది', 'ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా', 'నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు', 'ఒక్కసారీ.. చెప్పలేవా నువ్వు నచ్చావనీ' పాటల్లో ఏది జనం నోళ్లలో నానలేదని చెబుతాం! భువనచంద్ర రాసిన ఒకే పాట 'ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా'ది కూడా అదే బాణీ. చిత్రీకరణ విషయంలోనూ ఈ పాటలది అగ్ర తాంబూలమే. రవీంద్రబాబు కెమెరా కళ్లు పాటలన్నింటినీ అందంగా చిత్రించాయి. ఆయా సన్నివేశాలు బాగా పండటానికి అతను తీసిన క్లోజప్ షాట్స్ దోహదం చేశాయి. కొత్తమ్మాయి ఆర్తీ అభినయ సామర్థ్యాన్ని ఆ క్లోజప్సే పట్టించాయి. ఈ సినిమాకి నేపథ్య సంగీతమూ ఒక ప్లస్సే. మూడు గంటల నాలుగు నిమిషాల ఈ సినిమా ప్రేక్షకులకి విసుగు పుట్టించకుండా నవ్వుల నావలా సాగడంలో తోడ్పడిన మరో అంశం అత్యంత ప్రతిభావంతులైన ఎడిటర్లలో ఒకరైన శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ నేర్పు. సినిమా అంతా 'కలర్‌ఫుల్'గా భాసించడానికి పేకేటి రంగా కళా నైపుణ్యమూ కారణమే. ఇలా అన్ని విభాగాలూ చక్కగా పనిచేసినందునే 113 ప్రింట్లతో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' 93 కేంద్రాల్లో యాభై రోజులు, 57 కేంద్రాల్లో వంద రోజులు నడిచింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.

కాలేజీ రోజుల్లో అలాగే ఉండేవాణ్ణి
-వెంకటేశ్
సినిమాలో ఈచ్ అండ్ ఎవ్విరి సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. త్రివిక్రం ఈ కథని రెండున్నర గంటల సేపు చెప్పాడు. ఏ కథకీ వెంటనే ఓకే చెప్పని నేను 'నువ్వు నాకు నచ్చావ్' కథ వినగానే ఇమ్మీడియేట్‌గా చేసేద్దామన్నా. ఈ సినిమాలో నేనెంత అల్లరి చేశానో చూశారు కదా. కాలేజీ రోజుల్లో నేనలాగే ఉండేవాణ్ణి. పరీక్షల్లో కాపీ కొట్టడం, అమ్మాయిల్ని కామెంట్ చేయడం.. ఇప్పుడవన్నీ ఎందుకులెండి. అప్పటికీ, ఇప్పటికీ నాలో మార్పు చూసుకుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది.
ఈ సినిమా రిలీజయ్యాక మొదట డివైడ్ టాక్ వచ్చింది. 'ఈ ఒక్క సెంటర్లోనే ఆడుతోంది. మిగిలిన సెంటర్లలో కలెక్షన్లు అస్సలు లేవు' అంటూ మాట్లాడేవాళ్లు ఎప్పుడూ చాలామందే ఉంటారు. హిట్టయిన 90 శాతం సినిమాలకు ఇలాంటి టాకే. తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్‌టైనర్. చూస్తున్నంతసేపూ అందులో ఇన్వాల్వ్ అయిపోయే వాళ్లే ఎక్కువ.
అప్పట్లో చాలామంది హీరోల పరిచయ సన్నివేశాల్ని చూపించాలంటే.. చేతిని కళ్లకు అడ్డంగా పోనిచ్చి ఫేస్ చూపించడం, కట్ చేస్తే నలభైమంది డాన్సర్లతో డాన్స్ చేయించడం.. ఇది ఓ ఫ్యాషన్‌గా ఉండేది. ఈ పద్ధతిని మార్చాలనుకున్నా. అదే విషయాన్ని దర్శకుడు విజయభాస్కర్‌కి చెప్పా. అలా సికిందరాబాద్‌లో దిగాల్సి ఉండగా నాంపల్లి వద్దే ట్రైన్ దిగటాన్ని నా ఓపెనింగ్ సీన్‌గా చిత్రీకరించి, నా పాత్ర స్వభావాన్ని తెలిపేశాడు.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' ముచ్చట్లు)