Friday, March 11, 2011

హిట్.. హిట్.. హుర్రే!: మనసంతా నువ్వే

తారాగణం: ఉదయ్ కిరణ్, రీమాసేన్, సిజ్జు, తనూరాయ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవదాస్ కనకాల, సుధ, రజిత, శివారెడ్డి, శివపార్వతి, కృష్ణవేణి, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబీ జీబా, రఘునాథరెడ్డి, పావలా శ్యామల, శిరీష
కథ: ఎమ్మెస్ రాజు
స్క్రీన్‌ప్లే, రచన: పరుచూరి బ్రదర్స్
రచనా సహకారం: వీరు పోట్ల
పాటలు: సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం: ఎస్. గోపాల్‌రెడ్డి
కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
డాన్స్: సుచిత్రా చంద్రబోస్
కళ: రాజేశ్
డి.టి.ఎస్. మిక్సింగ్: డి. మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. భాస్కరరాజు
నిర్మాత: ఎమ్మెస్ రాజు
దర్శకత్వం: వి.ఎన్. ఆదిత్య
బేనర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి: 2 గంటల 37 నిమిషాలు
విడుదల తేది: 19 అక్టోబర్ 2001

గ్రాఫిక్స్‌ని నమ్ముకుని భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'దేవీ పుత్రుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కుదేలవడంతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు బాణీ మార్చాలనుకున్నారు. అందమైన ప్రేమకథని తెరకెక్కించాలని సంకల్పించారు. ఆ సమయంలో వి.ఎన్. ఆదిత్య అనే కుర్రాడి గురించి విన్నారు. డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ వద్ద వరుసగా మూడు సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశాడు ఆదిత్య. అప్పటికే అతను తన స్నేహితుడైన త్రివిక్రం కథతో డైరెక్టర్ కావాలని ప్రణాళికలు వేస్తున్నాడు.
"ఎమ్మెస్ రాజు గారు కబురు పంపించిన వారం రోజులకి వెళ్లి కలిశా. ఆయనే ఓ లైన్ చెప్పారు. 'ఇది ప్రేమించుకుందాం రా సినిమా లైన్ సర్' అని చెప్పా. ఆయన నన్ను మెచ్చుకుని, అప్పుడు తన మనసులోని లైన్ చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల పాటు ఇద్దరం చాలా సినిమాల గురించి క్యాజువల్‌గా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అంతాకా హీరో ప్రేమ విషయం స్నేహితులకి తెలియదన్నట్లుగా చూపించే సినిమాలే ఎక్కువగా వచ్చాయ్. కానీ ఎవరైనా తన ప్రేమని మొదటగా చెప్పుకునేది స్నేహితులకేననీ, సినిమాలో ఆ కోణం పెడితే బాగుంటుందనీ చెప్పా. ఆయన నన్ను హత్తుకుని 'నువ్వే నా డైరెక్టర్‌వి' అన్నారు. అడ్వాన్స్ ఇచ్చారు" అని ఆ రోజులు జ్ఞాపకం చేసుకున్నారు ఆదిత్య.
అలా ఎమ్మెస్ రాజు కథతో, పరుచూరి సోదరుల స్క్రీన్‌ప్లేతో, ఆదిత్య దర్శకత్వంలో తయారైన ప్రేమ కథాచిత్రం 'మనసంతా నువ్వే' 45 ప్రింట్లతో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమా దానికి ఐదు రెట్లు అంటే 15 కోట్ల రూపాయల్ని వసూలుచేసి పెట్టింది. 'దేవీపుత్రుడు' కారణంగా ఎంతో డబ్బు పోగొట్టుకున్న ఎమ్మెస్ రాజు ఎంతో నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేసి, అనూహ్యమైన ఫలితాన్ని పొందారు. అప్పటికే 'చిత్రం', 'నువ్వు నేను' వంటి వరుస హిట్లు సాధించి, యువతలో క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే'తో హ్యాట్రిక్ సాధించాడు. 'లవర్ బాయ్' ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'చిత్రం'లో హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఉదయ్ కిరణ్, రీమాసేన్ జోడీ ఈ సినిమాతో రెండో సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లో ఎక్కడ విన్నా 'తూనీగా.. తూనీగా' పాటే. ఆ పాటతోటే 'పాడుతా తీయగా' ఫేం ఉష సినీ గాయనిగా తళుక్కున మెరిసిపోయింది. అలాగే టైటిల్ సాంగ్ 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' కూడా హిట్.
ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విశేషం మరోటుంది. ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో ఏడుగురు తదనంతర కాలంలో దర్శకులయ్యారు. కథా రచయిత అయిన నిర్మాత ఎమ్మెస్ రాజు 'వాన'తో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ 'అందమైన మనసులో'తో, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి 'నా ఆటోగ్రాఫ్'తో, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ 'పల్లకిలో పెళ్లికూతురు'తో, కో-డైరెక్టర్ శంకర్ కె. మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా'తో, పబ్లిసిటీ డిజైనర్ రమేశ్‌వర్మ 'ఒక ఊరిలో'తో, రచనా సహకారం అందించిన వీరు పోట్ల 'బిందాస్'తో దర్శకులుగా పరిచయమయ్యారు.

కథా సంగ్రహం:
అరకులో చంటి, అనూరాధ ఇరుగుపొరుగు వాళ్లు. చంటివాళ్లు కడు బీదలైతే, అను తండ్రి గంగాధరం ఎమ్మార్వో. అంతస్తులు వాళ్ల దోస్తీకి అడ్డుకాలేదు. తండ్రికి ట్రాన్స్‌ఫర్ కావడంతో అను వెళ్లిపోతుంది. వెళ్లేప్పుడు చంటికి తన జ్ఞాపకంగా ఓ మ్యూజిక వాచ్ ఇచ్చి వచ్చే ఏడాది తన పుట్టినరోజున అక్కడి ఆంజనేయస్వామి గుడివద్ద కలుసుకుందామని చెబుతుంది అను. తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథ అయిన చంటి రైల్వే స్టెషన్లో ఇడ్లీలు అమ్ముకుని బతుకుతుంటాడు. ఓ రోజు రైలెక్కుతున్న ఓ పాప బంగారు గోలుసు జారి కిందపడిపోతే, దాన్ని తీసుకెళ్లి ఆ పాప తండ్రి మోహన్ (చంద్రమోహన్)కి ఇస్తాడు. చంటి అనాథ అని తెలుసుకుని ఆ కుటుంబం అతన్ని తమతోపాటు తీసుకువెళ్తుంది. చంటికి వేణు అని పేరు పెడతారు.
వేణు (ఉదయ్ కిరణ్)కి 22 యేళ్లు వస్తాయి. అతనికి సునీల్ (సునీల్) మంచి ఫ్రెండ్. పన్నెండేళ్ల నుంచీ ప్రతి ఏడాదీ అరకులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్తూనే వుంటాడు వేణు. కానీ ఇంతవరకు అను తారసపడలేదు. చెల్లెలు రేఖ (శిరీష)ని కాలేజీ వద్ద ఎంపీ కొడుకు స్నేహితుడు అల్లరి పెడుతుంటే వాణ్ణి కొడతాడు వేణు. అతను ఓ సూపర్‌మార్కెట్లో దూరితే వెంటపడి కొట్టే క్రమంలో పొరపాట్న అతడి దెబ్బ ఆ సూపర్ మార్కెట్ ఓనర్‌కి తగులుతుంది. పోలీసులు వేణుని తీసుకుపోబోతుంటే కొట్లాట సంఘటనని షూట్ చేసిన ఓ టీవీ చానల్ ప్రతినిధి శ్రుతి (తనూరాయ్) నిజంచెప్పి అతణ్ణి విడిపిస్తుంది. అదివరకే వేణు, 'స్వాతి' ఎడిటర్ కూతురైన శ్రుతి స్నేహితులవుతారు. మలేషియాలో మేనమామ వద్ద ఉన్న అను (రీమాసేన్) చదువు పూర్తికాగానే ఇండియాకి తిరిగొస్తుంది.
తన చిన్నటి జ్ఞాపకాలతో స్వాతి వీక్లీలో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ రాయడం ప్రారంభిస్తుంది అను. అది చూసి చంటి వస్తాడనేది ఆమె ఆశ. అతి తక్కువ కాలంలోనే ఆ సీరియల్ పాపులర్ అవుతుంది. వేణు చెల్లెలు రేఖకి పెళ్లిచూపులు జరుగుతాయి. ఆ పెళ్లికొడుకు తండ్రి ఎవరో కాదు. ఇదివరలో వేణువల్ల పొరపాట్న దెబ్బతిన్న సూపర్‌మార్కెట్ ఓనర్. వేణుని చూసి అతను ఆగ్రహంతో ఊగిపోయి, ఆ సంబంధం ఒద్దనుకుని వెళ్లిపోబోతాడు. అప్పుడు పొరబాట్న కొట్టాననీ, దయచేసి పెళ్లి ఆపకండనీ, తానసలు వాళ్ల కొడుకునే కాదనీ బ్రతిమలాడుతూ క్షమాపణలు కోరతాడు వేణు. అయితే వేణుని అవమానించినందుకు మోహన్ పెళ్లివాళ్లని తిట్టి పంపేస్తాడు. బాధలో ఉన్న వేణుని బార్‌కి తీసుకెళ్లి తనతో పాటు మందు తాగిస్తాడు మోహన్. డబ్బులు తక్కువవుతాయి. శ్రుతికి ఫోన్ చేస్తాడు వేణు. ఆమె వచ్చి డబ్బు కడుతుంది. మత్తులో ఆమెకి మ్యూజికల్ వాచ్ ఇస్తాడు వేణు. మరుసటిరోజు ఆ వాచ్‌ని గమనించి, దాని గురించి శ్రుతిని ఆరా తీస్తుంది అను. అది తన బాయ్‌ఫ్రెండ్ వేణు ఇచ్చాడని చెబుతుంది శ్రుతి. నిర్ఘాంతపోతుంది అను. వేణుని తప్పుగా అర్థం చేసుకుంటుంది. శ్రుతికి వాచ్ ఇచ్చాననన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఆమె ఇంటికి వెళ్లి, ఆ వాచ్ తనకు చిన్ననాటి స్నేహితురాలు అను ఇచ్చిన సంగతి చెప్పి, తిరిగి తీసుకుంటాడు. టీవీ చానల్లో జరుగుతున్న 'స్నేహం-ప్రేమ' చర్చా కార్యక్రమంలో అను, వేణు పాల్గొంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సంధానకర్తగా వ్యవహరించే ఆ చర్చలో ప్రేమ సక్సెస్ అయినా, ఫెయిలైనా అందులో ఆడా, మగా ఇద్దరికీ సమాన పాత్ర ఉందంటూ, తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతాడు వేణు. తన నేస్తం కలిస్తే తనెవరో చెప్పననీ, ఆమె మనసులో ఏముందో మొదట తెలుసుకుంటాననీ అంటాడు. అది విని అతడి మనసులో తనకున్న స్థానం అర్థమై ఆనందంతో ఉప్పొంగిపోతుంది అను. తన మీద అతడు చేయాలనుకున్న ప్రయోగాన్ని అతడిమీద తనే చేస్తుంది. తనెవరో చెప్పకుండా వేణుతో స్నేహం పెంచుకుంటుంది. వేణు కుటుంబానికీ సన్నిహితమవుతుంది. వేణు చెల్లెలికి మరో సంబంధం కుదురుతుంది.
అయితే అనుకోని రీతిలో తనతో వియ్యమందమంటూ ఎమ్మార్వోతో పెళ్లి ప్రపోజల్ పెడతాడు ఎంపీ (దేవదాస్ కనకాల). వియ్యమందితే వచ్చే 500 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్టుకి ఆశపడి అనుని ఎంపీ కొడుక్కిచ్చి చేయడానికి ఆనందంగా ఒప్పుకుంటాడు గంగాధరం. తండ్రికి చంటితో తన ప్రేమ గురించి చెబుతుంది అను. 'మనసంతా నువ్వే' సీరియల్లో జరుగుతున్న సంఘటనలు చదివి రేణు, అను ఒక్కరే అని తెలుసుకుంటాడు వేణు. అనుని కలవడానికి తహతహలాడుతున్న వేణుని గంగాధరం కలిసి, నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో తన కూతురి పెళ్లి జరగాలనీ అంటాడు. ఇప్పటికే ఓసారి పెళ్లి ఆగిందనీ, ఈ పెళ్లి కూడా ఆగితే నీ తండ్రి గుండె ఆగిపోతుందనీ బెదిరిస్తాడు. చెల్లి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు వేణు. ఆ తర్వాత ఏమయ్యింది? అను, వేణు ఎలా ఒక్కటయ్యారు? అనేది క్లైమాక్స్.

నేను దాన్ని పట్టుకోలేకపోయా
-వి.ఎన్. ఆదిత్య
అప్పట్లో పరుచూరి బ్రదర్స్ వద్ద వీరు పోట్ల అసిస్టెంట్‌గా ఉన్నాడు. నేను, వీరు స్క్రిప్ట్ వర్క్ చేశాం. మేం చేసిన వర్క్‌ని ఎప్పటికప్పుడు రాజు గారు చెక్‌చేసి, మమ్మల్ని సరైన ట్రాకులో పెడుతూ వచ్చారు. మరోవైపు గోపాలకృష్ణ గారు డైలాగ్ వెర్షన్ రాస్తూ వచ్చారు. స్క్రిప్టు పూర్తయ్యాక 'మహేశ్‌తో చేద్దామా?' అనడిగారు రాజు గారు. అది మహేశ్ వంటి మాస్ హీరోకి సరిపోదనీ, అప్పుడే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటున్న ఉదయ్ కిరణ్ అయితే బాగుంటుందనీ చేప్పా. అలా అతను ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. చంటి పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది.
ఆ రోజుల్లో టీవీలో గొల్లపూడి మారుతీరావు గారి 'ప్రజావేదిక' కార్యక్రమం సూపర్‌హిట్. సినిమాలో మేం పెట్టిన 'ప్రేమ-స్నేహం' చర్చావేదికకి ప్రేరణ అదే. మా ప్రేమకథకి కీలకమైంది ఆ ప్రజావేదిక సన్నివేశమే. అందులో ప్రయోక్తగా వ్యవహరించే పాత్రకి మారుతీరావు గారినే తీసుకోవాలనుకున్నాం. చివరికి సీతారామశాస్త్రి గారు దాన్ని అమోఘంగా చేశారు. ఆ సీనులో తను చెప్పే డైలాగ్స్‌తో పాటు ఉదయ్ డైలాగ్స్‌ని రాసింది ఆయనే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో రీషూట్ లేని ఏకైక చిత్రం 'మనసంతా నువ్వే'. మీకో సంగతి చెప్పాలి. నేను పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంటే, 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా' పాటలో కొంత భాగాన్ని రాజు గారే చిత్రీకరించారు. రీమాసేన్, సిజ్జు మధ్య ఎయిర్‌పోర్ట్ సీనుని తీసిందీ ఆయనే.
సినిమా విడుదలయ్యాక మారుతీరావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సినిమాలోని ప్రతి షాట్ గురించీ ఆయన విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ మాట్లాడారు.
కృష్ణారెడ్డి ఎడిటింగ్ గురించి కూడా చెప్పాలి. ఎడిటింగ్ రూములో ఉన్నప్పుడు చివరలో ఎమోషన్స్ మిస్సయ్యాయని రాజు గారు, గోపాలకృష్ణ గారు భావించారు. అప్పుడు 'నీ స్నేహం..' పాటని మరో చోట కూడా 'కట్.. పేస్ట్' చేశారు కృష్ణారెడ్డి. దాంతో ఎమోషన్స్ బ్రహ్మాండంగా క్యారీ అయ్యాయి. నేను దాన్ని పట్టుకోలేకపోయా. రీ రికార్డింగ్‌తో ఆ సీన్ బాగా పండింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక 'నీ స్నేహం' సినిమా కోసం అందులో నటిస్తున్న కె. విశ్వనాథ్ గారు రాజు గారి ఆఫీసుకి వచ్చారు. 'ఏడయ్యా. నీ డైరెక్టర్ని పరిచయం చెయ్యవా?' అనడిగారు రాజు గార్ని. నన్ను పరిచయం చెయ్యగానే 'ఇంత చిన్నవాడివా. యాన్ యంగ్‌స్టర్ విత్ గుడ్ టేస్ట్' అని మెచ్చుకున్నారు. అలాగే ఓసారి చిరంజీవి గారింటికి నేను వెళ్లిన సమయంలో ఆయన 'మనసంతా నువ్వే'ని డీవీడీలో చూస్తున్నారు. స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడి మెచ్చుకున్నారు. ఇలా చాలామంది పెద్దవాళ్ల నుంచి మంచి మంచి ప్రశంసలు అందుకున్నా.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' విజయానికి దోహదం చేసిన అంశాలు)

No comments: