Saturday, November 26, 2011

'పంజా' దెబ్బ ఎలా ఉంటుంది?

'తీన్‌మార్' తర్వాత పవన్ కల్యాణ్ 'పంజా' దెబ్బ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 9న ఈ సినిమా రావడం ఖాయమైంది. త్రివిక్రం డైరెక్షన్‌లో చేసిన 'జల్సా' వంటి సూపర్‌హిట్ తర్వాత ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ చేసిన 'కొమరం పులి' అట్టర్‌ఫ్లాపవగా, జయంత్ సి. పరాంజీ డైరెక్షన్‌లో చేసిన 'తీన్‌మార్' బిలో యావరేజ్‌గా మాత్రమే నడించింది. దీంతో 'పంజా' మీద ఆయనా, ఆయన అభిమానులూ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో డాన్ వేషంలో గడ్డంపెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు పవన్. తమిళంలో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగుకు పరిచయమవుతున్నాడు. 'పంజా'ని అతను చాలా స్టైలిష్‌గా తీస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అజిత్‌ని 'బిల్లా'గా అతను చూపించిన తీరు ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు కొత్తమ్మాయిలు మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా కనిపించబోతున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందించగా చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు నవంబర్ 19న మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ సినిమాతో పాత రికార్డులు బద్దలై, కొత్త రికార్డులు నమోదవుతాయనీ, పవన్ 'పంజా' దెబ్బ ఏమిటో అందరికీ తెలుస్తుందనీ ఆయన ఫాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

బాలకృష్ణ నాయనమ్మగా జయసుధ!

ఇప్పటివరకు హీరోలకు అమ్మగా కనిపిస్తూ వచ్చిన సహజనటి జయసుధ తొలిసారిగా ఓ హీరోకి నాయనమ్మగా కనిపించబోతున్నారు. అదీ తన సమవయస్కుడైన సీనియర్ హీరో బాలకృష్ణకు. 'అధినాయకుడు' సినిమాలో ఆమె నాయనమ్మ పాత్రని చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన తాత, తండ్రి, మనవడిగా నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఇందులో తాత పాత్ర సరసన జయసుధ నటిస్తున్నారు. "అంటే మేం జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఒకే సినిమాలో ఆయనకు భార్యగా, తల్లిగా, నాయనమ్మగా నటిస్తుండటం గమ్మత్తైన అనుభవం. 'శివరంజని'లోనే మేం జంటగా నటించాల్సింది తప్పిపోయింది" అని జయసుధ తెలిపారు. మిగతా ఇద్దరి పాత్రల సరసన లక్ష్మీరాయ్, సలోని నటిస్తున్నారు. ఇలాంటి విశేషాలున్న 'అధినాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Wednesday, November 23, 2011

బిగ్ స్టోరీ: సినిమా బడ్జెట్‌ని బట్టి టెక్కెట్ ధరలు!

ఇప్పటికే ఓ కుటుంబం థియేటర్‌లో సినిమా తిలకించాలంటే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్ తీసుకున్న నిర్ణయం సగటు సినిమా ప్రియుడి పాలిట శరాఘాతం కానున్నది. సినిమాకైన బడ్జేట్‌ని బట్టి టిక్కెట్ ధరల్ని రూ. 35 నుంచి రూ. 100 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని ఫిలించాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్‌కమిటీ తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది. డబ్బింగ్ సినిమాల హవాని నియంత్రించి, చిన్న చిత్రాల్ని బతికించాలనే ఉద్దేశంతో చాంబర్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీ అందుకు కొన్ని నిర్ణయాల్ని సూచించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు సినిమా నిర్మాణానికయ్యే వ్యయానికి తగ్గట్లుగా థియేటర్లలో టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటుని నిర్మాతలకు కల్పించాలనేది కూడా ఆ కమిటీ చేసిన నిర్ణయాల్లో ఒకటి. ఈ నిర్ణయాల్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు తెలిపారు. ప్రభుత్వం కనుక ఇందుకు సమ్మతించినట్లయితే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడల్లా సామాన్య ప్రేక్షకుడికి సినిమా వినోదం భారీ ఖర్చు వ్యవహారం అవడం ఖాయం. అయితే ఎంత బడ్జెట్ సినిమాకి టిక్కెట్ ధరని ఎంతగా పెంచుకోవచ్చనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
గతంలో భారీ సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లో పై తరగతి టిక్కెట్ ధరల్ని 75 శాతం పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కొద్ది నెలలు ఈ పరిస్థితి కొనసాగాక చిన్న నిర్మాతలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా నిరసనలు వ్యక్తం కావడంతో రెండు వారాల పెంపు పద్ధతిని తీసేసి, మొత్తంగా టిక్కెట్ ధరల్ని కొద్దిగా పెంచారు. దీనివల్ల నగరాల్లో పై తరగతి టిక్కెట్ ధర రూ. 50కు చేరుకుంది. అంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాలంటే కేవలం టిక్కెట్లకే రూ. 200 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ. 300 ఉంటే తప్ప సినిమాకి వెళ్లలేని స్థితి. సినిమా అనేది ఖరీదైన వినోదంగా మారినందునే పైరసీ డీవీడీల మీద ప్రేక్షకులు ఆధారపడుతున్నారనేది ఓ నిజం. కేవలం పది లేదా ఇరవై రూపాయల అద్దెతో ఇంటిల్లిపాదీ బయటకు కదలకుండానే ఇంట్లో సినిమా చూసుకునే వీలుండటంతో దాన్నే సౌకర్యంగా భావించి, పైరసీ డీవీడీల పట్ల జనం ఆసక్తి చూపిస్తున్నారు. పైరసీ విషయంలో నిర్మాతలు ఎంత అప్రమత్తంగా వ్య్వహరిస్తున్నా, సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోపలే దానికి సంబంధించిన పైరసీ డీవీడీలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలించాంబర్ పెద్దలు తీసుకున్న నిర్ణయం సగటు ప్రేక్షకుడికి మరింత భారం కానున్నది. మొదట్నించీ టిక్కెట్ ధరల పెంపుని వ్యతిరేకిస్తున్న చిన్న సినిమాల నిర్మాతలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి మూడాలి.

Tuesday, November 22, 2011

టర్నింగ్ పాయింట్: నరేశ్

'పండంటి కాపురం' షూటింగ్ సమయంలో అందులో నటిస్తున్న ఓ బాల నటుడుకి జబ్బు చేయడంతో అక్కడే ఉన్న నన్ను నటిస్తావా అనడిగారు. అప్పుడు నాకు ఏడేళ్లు. చేస్తానని డైరెక్టర్‌కి చెప్పాను. అప్పడు అమ్మ (విజయనిర్మల) సెట్స్ మీదకు రాలేదు. వచ్చాక నన్ను చూసి నవ్వింది. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ కోరిక. నా ధ్యాసంతా సినిమాల మీదే. అదే అమ్మకి చెప్పా. అలా ఆ సినిమా సెట్స్ మీద 30 రోజులు గడిపా. ఎస్వీ రంగారావు, కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, బి. సరోజాదేవి, జయసుధ వంటివాళ్లతో తొలి సినిమాలోనే పనిచేయడం నాకు దక్కిన గొప్ప భాగ్యం. ఆ సినిమా సూపర్‌హిట్. 
ఇక హీరోగా నా తొలి సినిమా 'నాలుగు స్తంభాలాట'. అది గొప్పగా ఆడింది. జంధ్యాల కలం, సంగీతం, మంచి కథ, క్లైమాక్స్ సన్నివేశాలు కలిసి ఆ సినిమాని సక్సెస్ చేశాయి. తొలి తెలుగు టీనేజ్ హీరోగా ఆ సినిమా నాకు గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాని సంజయ్‌దత్‌తో 'బేకరార్'గా హిందీలో రీమేక్ చేశారు వి.బి. రాజేంద్రప్రసాద్ గారు. కాని ఆ సినిమా ఎందుకనో ఆడలేదు. 

Sunday, November 20, 2011

'స్వయంవరం' శాపం!

హీరోగా నటించిన తొలి సినిమానే హిట్టయ్యిందంటే ఎవరికైనా ఎంత ఆనందం కలుగుతుంది? దాన్ని ఓ వరమనే అనుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం దాన్ని వరమంటూనే, అదే శాపం కూడా అంటున్నాడు. ఆ హీరో వేణు! అవును. హీరోగా అతని తొలి సినిమా 'స్వయంవరం' మంచి సక్సెస్ అవడమే కాక యువతలో అతనికి క్రేజ్ కూడా తెచ్చింది. కానీ తర్వాత కాలంలో ఆ క్రేజ్‌ని అతను నిలుపుకోలేకపోయాడు. త్రివిక్రం స్క్రిప్టుతో కె. విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన 'స్వయంవరం' సినిమా తర్వాత వేణుకి మళ్లీ ఇప్పటివరకు అంతకంటే మంచి స్క్రిప్ట్ తారసపడలేదు. అతను సోలో హీరోగా చేసిన వాటిలో 'చిరునవ్వుతో', 'గోపి గోపిక గోదావరి' మాత్రమే చెప్పుకోదగ్గ రీతిలో సక్సెస్ అయ్యాయి. అందుకే 'స్వయంవరం' తనకి వరం మాత్రమే కాదనీ, శాపం కూడాననీ అతను చెప్పుకున్నాడు. అతడికి ఎలాంటి పాత్ర చేయాలంటే ఇష్టమో తెలుసా? "యాక్షన్ హీరోతో పాటు నెగటివ్ షేడ్స్ ఉండే యాంటీ హీరో కేరక్టర్ చెయ్యాలంటే ఇష్టం. కానీ మన సినిమాల్లో హీరో అంటే కొన్ని పరిధులు గీసేసి, ఇలాగే ఉండాలంటారు. హిందీలో, తమిళంలో హీరోలు మంచి ప్రయోగాలు చేస్తుంటారు. మనవాళ్లకి హీరో చనిపోతే నచ్చదు. కానీ అలాంటి పాత్ర ఒకటి చెయ్యాలనేది నా కోరిక" అని తెలిపాడు వేణు.

Saturday, November 19, 2011

ఇంటర్‌వ్యూ: సిద్ధార్థ్

కుర్రాళ్లు కాలేజీ ఎగ్గొట్టి 'ఓ మై ఫ్రెండ్' చూస్తున్నారు
"యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు'' అని చెప్పారు సిద్ధార్థ్. ఆయన హీరోగా వేణుశ్రీరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
'బొమ్మరిల్లు'లాంటి సినిమా తర్వాత దిల్‌రాజు బేనర్‌లో నేను చేసిన సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలుంటాయి. డైరెక్టర్ వేణు నా కోసం రెండేళ్లు ఎదురుచూశాడు. అంతకాలం ఎదురు చూడాలంటే గట్స్ ఉంటాలి. ప్రధాన పాత్రకు నేనే కావాలని నా మీద నమ్మకం పెట్టాడు. రాజు కూడా నాతోనే దీన్ని తీయాలనుకున్నాడు. ఇది ఒక హీరో సినిమా కాదు. నాలుగు కేరక్టర్ల సినిమా. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ గురించి దీనిలో చెప్పాం. దాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఫ్యామిలీల్లోకి వెళ్లాలి
యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదు థియేటర్లకు వెళ్లి చూశాం. ఎక్కువగా కనిపించింది కాలేజీ కుర్రాళ్లే. ఇక ఈ సినిమా వెళ్లాల్సింది ఫ్యామిలీల్లోకి. అది కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్లు కూడా థియేటర్లలో కనిపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ రెవెన్యూపరంగా సంతోషంగా ఉన్నారు.
20 నిమిషాలే బలం
కొత్తగా ఈ సినిమాలో ఏముంది అనేవాళ్లకి నా సమాధానం ఒక్కటే. ప్రపంచంలో ఏడు కథలే ఉన్నాయంటారు. ఎవరు చెప్పినా వాటిలోంచి తిప్పితిప్పి చెప్పాల్సిందే. ఈ సినిమాకి సంబంధించి చివరి 20 నిమిషాలే బలం. అలాంటి క్లైమాక్స్‌ని ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తియ్యలేదు. వేణు ఓ సున్నితమైన పాయింట్ బాగా డీల్ చేయగలిగాడు. స్నేహితులుగా ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి చివరివరకు తమ అనుబంధాన్ని అలాగే కొనసాగించలేరా... అనే పాయింట్‌ని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకు తెరమీద ప్రకాశ్‌రాజ్, నేను తండ్రీకొడుకులుగా బాగా సరిపోయాం. ఈ సినిమాలో నా తండ్రిగా తనికెళ్ల భరణి బ్రహ్మండంగా చేశారు. క్లైమాక్స్‌లో ఆయన సంభాషణలు చెప్పిన విధంగానీ, ఆయన హావభావాలు కానీ అత్యుత్తమం.
లక్కీ గర్ల్ హన్సిక
నేను, నవదీప్, శ్రుతిహాసన్ మొదటే ఫైనలైజ్ అయినా హన్సిక ఆ పాత్రకి చివరగా ఎంపికైంది. ఆమెకి ఈ ఏడాది తెలుగులో 'కందిరీగ', తమిళంలో 'వేలాయుధం' వంటి హిట్స్ వచ్చాయి. ఆమె ఈ సినిమాకి లక్కీ అవుతుందనుకున్నా. అలాగే అయ్యింది. శ్రుతి, నవదీప్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
నాలుగు భాషా చిత్రాలు
2012 నాకు మరపురాని సంవత్సరం కాబోతోంది. నాలుగు భాషలు - తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌లో నా సినిమాలు రాబోతున్నాయి. హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో చేస్తున్న 'చష్మే బద్దూర్', ఇంగ్లీష్‌లో దీపా మెహతా డైరెక్షన్‌లో చేస్తున్న 'విండ్స్ ఆఫ్ చేంజ్' వచ్చే ఏడాది రాబోతున్నాయి. దీపాతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆమె పర్‌ఫెక్షనిస్ట్. బుకర్ ఆఫ్ బుకర్స్‌గా ప్రశంసలు పొందిన సల్మాన్ రష్డీ నవల 'మిడ్‌నైట్ చ్రిల్డన్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నిడివి పరంగా పెద్దది కాకపోయినా కథకి కీలకమైన పాత్ర చేస్తున్నా.

Friday, November 18, 2011

అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'


అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే. 
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే. 
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు. 
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.

Thursday, November 17, 2011

'రెబల్' మీద కన్నేసిన బయ్యర్లు

'రెబల్' సినిమా మీద అందరి దృష్టీ ప్రసరిస్తోంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడం ఒక కారణమైతే, 'కాంచన' వంటి సూపర్ హిట్ తర్వాత రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం రెండో కారణం. ఈ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా, లేదా అనేది ఆసక్తికరమైన అంశం. అలాగే డైరెక్టర్‌గా తొలి సినిమా 'మాస్' తర్వాత తెలుగులో ఆ స్థాయి హిట్ లారెన్స్‌కి వస్తుందా అనేది మరో అంశం. 'మాస్' తర్వాత తెలుగులో లారెన్స్ 'స్టైల్', 'డాన్' సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. లారెన్స్ స్వయంగా హీరోగా నటించిన 'స్టైల్' సినిమాతో రూ. 100 కోట్ల వ్యాపారం చేస్తానని దాని నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పిన కబుర్లు ఉత్తుత్తివిగా తేలిపోయాయి. అందులో కనీసం 25 శాతం కూడా అది వసూలు చేయలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా శ్రీధర్‌కి ఒక్క పైసా లాభాన్ని ఇవ్వలేదు. దాని తర్వాత నాగార్జున హీరోగా లారెన్స్ డైరెక్ట్ చేసిన 'డాన్' సినిమా సైతం ఆశించిన రీతిలో ఆడలేదు. అయితే అతను తమిళంలో తీసిన 'ముని', 'కాంచన' సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అటు తమిళం, ఇటు తెలుగులో లాభాలు ఆర్జించాయి. అతడి లేటెస్ట్ ఫిల్మ్ 'కాంచన' అయితే తెలుగులో దాన్ని రిలీజ్ చేసిన బెల్లంకొండ సురేశ్‌కి నాలుగింతల లాభాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో తయారవుతున్న 'రెబల్' పట్ల బయ్యర్లు అమితాసక్తి వ్యక్తం చేస్తున్నారు. తమన్నా, దీక్షా సేథ్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇది హిట్టయితే ప్రభాస్, లారెన్స్ కెరీర్లు ముందుకు దూసుకుపోయినట్లే.

Wednesday, November 16, 2011

ఆ యువ నటుడు ఎవరు?

ఇటీవల 'శ్రీరామరాజ్యం' ఆడియో అభినందన సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అన్నాడంటూ ఓ టీవీ చానల్ చేసిన హంగామా వివాదాన్ని సృష్టించింది. దాంతో తాను ఆ మాటల్ని రాంచరణ్‌ని ఉద్దేశించి అనలేదనీ, ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో చిరంజీవి, మోహన్‌బాబుకు తెలుసనీ వివరణ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. ఇంతకీ 'శ్రీరామరాజ్యం' సభలో ఆయన ఏమన్నారు? "ఈమధ్య ఓ యువ నటుడు మన తెలుగు సినిమాల గురించీ, దర్శకుల గురించీ అవమానకరంగా మాట్లాడాడు. టాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయరని అన్నాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దనీ, బాపు వంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారని నేను అన్నాను. వారు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తీశారనీ, నేను కూడా 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాననీ చెప్పాను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పళ్లూడగొడతానని హెచ్చరించా" అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి? ఆ యువ నటుడు బాలకృష్ణ సమక్షంలోనే తెలుగు దర్శకుల్ని తూలనాడితే, బాలకృష్ణ అతణ్ణి హెచ్చరించాడని ఇట్టే అర్థమైపోతోంది. కానీ వివాదం సృష్టించిన చానల్ దీన్ని గమనించకుండా కొద్ది రోజుల క్రితం దాసరి నారాయణరావుని ఉద్దేశించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చినట్లుగా ఊహించుకొని స్టోరీ అల్లేసింది. అందుకే బాలకృష్ణ "ఏదో ఫంక్షన్‌లో షాట్స్ చూపించి నేను చరణ్‌ను ఉద్దేశించి అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. నేను అన్నది చరణ్‌ని ఉద్దేశించి కాదని సవినయంగా మనవి చేస్తున్నా. నేను ఆ మాటలు ఆ వ్యక్తితో నేరుగానే అన్నాను. కానీ చరణ్‌ను నేను కలిసి నాలుగైదు నెలలు అయింది. చిరంజీవి పిల్లలకు నేనంటే ఎంతో వాత్సల్యం. అలాగే వారన్నా నాకు ఎంతో వాత్సల్యం" అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ వివరణని సైతం సదరు చానల్ మరోరకంగా వాడుకొంది. అదలా ఉంచితే బాలకృష్ణ చేత పళ్లూడగొడతాననని అనిపించుకున్న ఆ యువ నటుడు ఎవరన్న చర్చ మొదలైంది చిత్రసీమలో. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నది హీరో నాని అనీ, అతడితోటే బాలయ్య ఆ మాటలు అని ఉంటారని ఊహిస్తున్నారు. తను ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నదీ చిరంజీవి, మోహన్‌బబుకు తెలుసని బాలకృష్ణ అనడాన్ని బట్టి మరికొంతమందికీ ఈ సంగతి తెలిసే ఉంటుంది. ఎవరో ఆ యువ నటుడు?

Tuesday, November 15, 2011

రివ్యూ: మొగుడు

తెలుగు ప్రేక్షకులు ఇంకా 1980ల కాలంలో లేరు. కొంతైనా ఎదిగారు. వాళ్లని తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుందో నిన్నటి గుణశేఖర్ 'వరుడు' నిరూపిస్తే, నేటి కృష్ణవంశీ 'మొగుడు' బలపరిచింది. 'నిన్నే పెళ్లాడతా' నుంచీ కృష్ణవంశీ తీసిన వాటిలో ఎక్కువ సినిమాలు పెళ్లిచుట్టూనే పరిభ్రమిస్తూ వస్తున్నాయి. ఆయన 'పెళ్లి ఉచ్చు'లో చిక్కుకుని బయటపడలేక పోతున్నాడు. ఇండివిడ్యువల్‌గా ఏ పాత్రకి ఆ పాత్రని 'అతి'గా చూపించే ఆయన అలవాటు 'మొగుడు'లోనూ కొనసాగింది. 'చక్రం' చిత్రం నుంచీ ఆయన పాత్రల్లో ఈ ఓవర్ డ్రమటైజేషన్ మనకి కనిపిస్తూ వస్తోంది. బయట ప్రపంచంలో ఏ తండ్రీ కొడుకులూ, అక్కా తమ్ముళ్లూ, బావా మరుదుళ్లూ ప్రవర్తించని విధంగా ఆయన పాత్రలు 'ఓవర్'గా ప్రవర్తిస్తుంటాయి. 'మొగుడు'లో ఏ పాత్రనైనా తీసుకోండి. మీకు ఇది నిఖార్సయిన నిజమని తెలుస్తుంది. 
'మొగుడు'లో ఫస్టాఫ్‌లో పాత్రల ఓవరాక్షన్‌తో మతిపోయిన మనకి సెకండాఫ్ కాస్త రిలీఫ్‌నిస్తుంది. అదీ పూర్తిగా కాదు. కథకి సరిపోయే ముగింపునివ్వడంలోనూ కృష్ణవంశీ ఫెయిలయ్యాడు. 'మొగుడు' అనేది ఆంజనేయప్రసాద్ (రాజేంద్రప్రసాద్) కుటుంబం చుట్టూ అల్లిన కథ. ముగ్గురు ఆడపిల్లలు, చివర ఓ మగ పిల్లాడినీ కని భార్య చనిపోతే నలుగురు పిల్లలకీ తనే తల్లీతండ్రీ అయి పెంచాడు. అందర్నీ మంచి చదువులు చదివించాడు. అనాథల్ని చేరదీసి, తనే వాళ్లకి చదువులు చెప్పించి, అల్లుళ్లని చేసుకున్నాడు. ఇక కొడుకు రాంప్రసాద్ (గోపీచంద్) పెళ్లి చేయడమే తరువాయి. మెర్సిడెజ్ బెంజ్ కార్ల డీలర్ అయిన రాంప్రసాద్‌కి తండ్రి తెచ్చిన ఏ సంబంధమూ నచ్చదు. ఓసారి రాజరాజేశ్వరి (తాప్సీ) అనే అందాలరాశిని చూసి మనసు పారేసుకుంటాడు. ఇద్దరికీ పరిచయమవుతుంది. అంతలో తండ్రి మరో సంబంధం తెస్తాడు ప్రసాద్‌కి. తనకి కావలసింది ఆ పిల్ల కాదనీ, రాజేశ్వరి అనీ అర్థమై, ఆమెకి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. అప్పటికే అతడి పట్ల ఇష్టం ఏర్పరచుకున్న ఆమె సరేనంటుంది. రాజేశ్వరి పేరుపొందిన రాజకీయ నాయకురాలు చాముండేశ్వరి (రోజా) కూతురు. ఆమె భర్త (నరేశ్), అంజనేయప్రసాద్ బాల్య స్నేహితులనే సంగతి అప్పుడే బయటపడుతుంది. బాల్యమిత్రులిద్దరూ 'లిప్ టు లిప్ కిస్' పెట్టుకొని మనల్ని బిత్తరపోయేలా చేస్తారు. పెళ్లికి అంతా ఓకేనంటారు. పెళ్లవుతుంది. కానీ ఓ చిన్న కారణంవల్ల అప్పగింతల సమయంలో రెండు కుటుంబాలకీ గొడవవుతుంది. రాజేశ్వరితో పాటు గౌరీమాత విగ్రహాన్నీ తీసుకురమ్మంటాడు ఆంజనేయప్రసాద్. గౌరీమాత పుట్టింటే వుండాలని రాజేశ్వరి అమ్మమ్మ తేల్చిచెప్పడంతో మాటా మాటా పెరుగుతుంది. అంతలో ఆంజనేయప్రసాద్ చిన్నల్లుడు గౌరీ విగ్రహాన్ని తెస్తాడు. దాంతో అతణ్ణి చెంపమీద కొడుతుంది చాముండేశ్వరి. నా అల్లుణ్ణి కొడతావా, నువ్వసలు ఆడదానివేనా? అని ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు ఆంజనేయప్రసాద్. నన్నే కొడతావా? అంటూ అతణ్ణి చెప్పుతో కొడుతుంది చాముండేశ్వరి. మా నాన్నని చెప్పుతో కొడతావా? అంటూ అత్త గూబ గుయ్యిమనిపిస్తాడు రాంప్రసాద్. మా అమ్మనే కొడతావా? అని మొగుడి చెంప చెళ్లుమనిపిస్తుంది రాజేశ్వరి. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మీద చెయ్యెత్తి ఆగిపోతాడు రాంప్రసాద్. నాకు ఈ పెళ్లొద్దు, ఈ మొగుడూ వద్దు - అని పుటుక్కున తాళి తెంచేసి మొగుడిమీదకు విసిరేస్తుంది రాజేశ్వరి. ఈ చెంపలు చెళ్లుమనిపించే కార్యక్రమం చకచకా సాగి మన మైండ్ బ్లాంకవుతుండగా తెరమీద 'సగం అయ్యింది' అనే ఇంటర్వెల్ కార్డ్ పడటంతో ఊపిరి తీసుకోడానికి పరుగున బయటకు వస్తాం. 
రాంప్రసాద్, రాజేశ్వరికి విడాకులు మంజూరు చేయించే కార్యక్రమాన్ని చాముండేశ్వరి షురూ చేశాక మన హీరో హీరోయిన్లు మారిషస్‌కి వెళ్లి మళ్లీ ఎలా దగ్గరయ్యారు, పెద్దల్ని ఒప్పించి మళ్లీ మొగుడూ పెళ్లాలు ఎలా అయ్యారనేది మిగతా కథ. ఈ ప్రాసెస్‌లో హీరో హీరోయిన్లకి శ్రద్ధాదాస్ బాగా సాయపడుతుంది. రాజేశ్వరితో పెళ్లి ఒకవేళ జరగకపోతే నేను ఉండానని గుర్తుపెట్టుకో అని మొదట్లోనే తన సమక్షంలోనే రాంప్రసాద్‌కి చెప్పిన శ్రద్ధ మారిషస్‌లో రాంప్రసాద్‌తో రాసుకు పూసుకు తిరగడాన్ని సహించలేకపోతుంది రాజేశ్వరి. అతడిపట్ల తనలో ఎంత ప్రేముందో తెలిసి, షార్క్ చేపల్ని చంపడానికిచ్చే విషం తాగుతుంది. ఆమెని కాపాడుకోవడమే కాక, చివరకు అత్త చాముండేశ్వరిలో పరివర్తన కలిగిస్తాడు రాంప్రసాద్.
పెళ్లయ్యాక మగాడనేవాడు 'మొగుడు' అనికూడా అనిపించుకోవాలని ఈ సినిమాతో చెప్పానని కృష్ణవంశీ సినిమా విడుదలకి ముందు పదేపదే చెప్పాడు. 'మొగుడు' సినిమాలో పెళ్లయ్యాక రాంప్రసాద్ చేసిన పని చాలా సినిమాల్లో ఇప్పటికే మనం చూశాం. మరి ఇందులో కృష్ణవంశీ కొత్తగా ఏం చెప్పినట్లు? నథింగ్. పాత కథనే మరోసారి తనదైన 'ఓవర్ డోస్'తో చెప్పాడంతే. పెళ్లయి పసుపూ పారాణి ఆరకముందే ఆ మొగుడూ పెళ్లాలు విడిపోవాల్సి రావడం మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. కానీ చెంపదెబ్బల ప్రహసనంతో ఆ ఫీల్ ఏమాత్రమూ మిగలదు. నిజానికి ఫస్టాఫ్‌లో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలేవీ దాదాపుగా లేవు. సెకండాఫ్‌లో రాజేశ్వరి విషం తాగినప్పుడు మాత్రం ఆమెపట్ల సానుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్‌లో రాజేశ్వరిని వాళ్లింట్లో వదిలేసిరమ్మని రాంప్రసాద్‌ని తండ్రి అన్నప్పుడూ, మేము కావాలో, రాజేశ్వరి కావాలో తేల్చుకొమ్మని ముగ్గురక్కలూ అతడిని అడకత్తెరలో పోకచెక్క చేసినప్పుడూ జాలి పడతాం. అంతకుమించి 'మొగుడు'లో మనం సహానుభూతి చెందే సన్నివేశాలు కనిపించవు. గోపీచంద్, శ్రద్ధాదాస్ మీద తీసిన బీచ్ సాంగ్, గోపీచంద్, తాప్సీ మీద సింహం పిల్లలు, చిరుత మధ్య తీసిన డ్యూయెట్ మాత్రం యువతని ఆకట్టుకుంటాయి. 
కన్నతండ్రే (ఆంజనేయప్రసాద్) కన్నకొడుక్కి (రాంప్రసాద్) మగతనం ఉందో, లేదో తెలుసుకొమ్మని తన డాక్టరల్లుణ్ణే పురమాయించడం 'మొగుడు' లాంటి కృష్ణవంశీ సినిమాల్లోనే మనం చూడగలం. ఆ సంగతి అర్థమయ్యాక రాంప్రసాద్ కిందపడి దొర్లడం, ఆ ఓవరాక్షన్ చెయ్యలేక గోపీచంద్ ఇబ్బందిపడటం, అది చూడలేక మనం ఇబ్బందిపడటం... ఎందుకొచ్చిన ఇబ్బంది?
గంపగుత్తగా ఒకే సినిమాలో అందరు యాక్టర్ల ఓవరాక్షన్ చూసే అవకాశం మనకి అరుదుగా దొరుకుతుంది. ఆ ఓవరాక్షన్, ఓవర్ డ్రమటైజేషన్ ఎలా ఉంటుందో అనుభవించాలంటే 'మొగుడు' చూసి తీరాల్సిందే. సినిమాలో చెప్పుకోతగ్గది శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ. బాబూశంకర్ సంగీత బాణీలకన్నా పాటల చిత్రీకరణే బాగుంది. 'మొగుడు' ఫీడ్‌బాక్ తర్వాతైనా పాత్రల, సన్నివేశాల కల్పనలో కృష్ణవంశీలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే. ఎందుకంటే ఆయన అక్కడే ఫిక్సయిపోయాడు.

Monday, November 14, 2011

ఇక్కడ పవన్, అక్కడ శింబు!

ఒకే హిందీ సినిమా రెండు భాషల్లో ఒకేసారి రీమేక్ అవుతున్న సన్నివేశం ఇది. గతంలో ఎన్టీఆర్, ఏఏన్నార్‌ల కాలంలో హిందీ సినిమాలు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయ్యేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేస్తుంటే, తమిళంలో శివాజీ గణేశన్ లేదా జెమినీ గణేశన్ ఆ సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు హిందీలో సల్మాన్‌ఖాన్ సూపర్ హిట్ సినిమా 'దబాంగ్' ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తుంటే, తమిళంలో శింబు చేస్తున్నాడు. కాకపోతే తెలుగుకంటే తమళ సినిమా చాలా ముందుగా వచ్చేస్తోంది. అవును. శింబు, రిచా గంగోపాధ్యాయ్ జంటగా నటిస్తున్న ఆ సినిమా 'ఓస్తి' ఈ నవంబర్‌లోనే రిలీజవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ బయటకు వచ్చేశాయి. 'దబాంగ్'లో మలైకా అరోరాఖాన్ చేసిన ఐటం సాంగ్‌ని ఇందులో మల్లికా షెరావత్ చేయడం విశేషం. ధరణి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పట్ల తమిళ సినీ, ట్రేడ్ వర్గాలు అమితాసక్తి కనపరుస్తున్నాయి. తమిళంతో పోలిస్తే తెలుగు 'గబ్బర్‌సింగ్' షూటింగ్ నెమ్మదిగా నడుస్తోంది. దీని ఫస్ట్‌లుక్ చాలా కాలం క్రితమే వచ్చినా పవన్ కల్యాణ్ 'పంజా' ప్రాజెక్టుతో బిజీ కావడం 'గబ్బర్‌సింగ్'ని ఆలస్యం చేస్తోంది. ఇందులో పవన్ సరసన నాయికగా శ్రుతిహాసన్ నటిస్తుండగా 'మిరపకాయ్' ఫేం హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2012లో విడుదల కానున్నది. ఈ సినిమాలు ఆడే తీరుని బట్టి తెలుగు, తమిళుల క్రియేటివిటీ ఏమిటో తేలనున్నది.

Sunday, November 13, 2011

బిగ్ స్టోరీ: హిందీలో మాట్లాడుతున్న మన స్టార్ హీరోలు

హిందీలో తెలుగు సినిమాల రీమేక్‌ల కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి అదనంగా అక్కడ తెలుగు సినిమాల డబ్బింగూ ఓ వెల్లువలా మారడం నడుస్తున్న చరిత్ర. మన మెగా, సూపర్ స్టార్ల సినిమాల్ని కొనుగోలు చేసుకుని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటోంది బాలీవుడ్. ఇది థియేటర్లలో ప్రదర్శన కోసం కాదు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఏదో ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్లో ఏదో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ప్రసారమవుతూ కనిపిస్తోంది. 
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేశ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల సినిమాల డబ్బింగులతో ముంబైలోని అంధేరీ, గుర్గావ్ వంటి ప్రాంతాలు డబ్బింగుల వాడలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ ఒక పరిశ్రమలా నెలకొంది. కేవలం గంటకు రూ. 200 నుంచి రూ. 1500 వరకు అద్దె ఉండే ఈ డబ్బింగ్ థియేటర్లలో అనువాద క్రతువు నిరంతరాయంగా నడుస్తోంది. తెలుగు సినిమాల్ని సాధ్యమైనంత హిందీ నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులతో అహోరాత్రులు కృషి జరుగుతోంది. ఈ క్రమంలో వందకు పైగా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి. 
కలర్స్, సోనీ మాక్స్ చానళ్లకే కాదు, మధ్యాహ్నం పూట మరి కొన్ని మూవీ చానళ్ల ముడిసరుకు తెలుగు డబ్బింగులే. ఈ సినిమాల్లో మన స్టార్లు మరొక వాయిస్‌తో అచ్చమైన హిందీ మాట్లాడటం మనకి నవ్వు తెప్పిస్తుంటుంది కూడా. ఈ ట్రెండు ఎందుకు నడుస్తున్నదంటే - హిందీ సినిమాలు రోజురోజుకూ సూటిగా సాఫీగా కథ చెప్పే పద్ధతికి దూరమవుతుండటం. తెలుగు సినిమాల కథలు డైరెక్టుగా నడుస్తుండటం. తెలుగు సినిమాల్లో ఎమోషన్లు, డ్రామా ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలకి మాదిరిగా కాక కుటుంబ ప్రేక్షకులకి నచ్చే మోతాదులో స్ట్రాంగ్‌గా ఉండటం.
అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే మన తెలుగు డబ్బింగులు ప్రాంతీయ భోజ్‌పురి సినిమాలతో సమానం. అంతకంటే వాటికి స్థాయీ, విలువా లేవు. కాకపోతే టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా ఇవి భోజ్‌పురి సినిమా నిర్మాతలు కలలో కూడా ఊహించని భారీతనంతో ఉంటాయి. ఇంకా ఈ హిందీ చానళ్ల వీక్షకులకి బోనస్ ఏమిటంటే ఈ తెలుగు డబ్బింగుల్లో విలన్లు హిందీవాళ్లే కావడం. ముఖేశ్ రుషి, సాయాజీ షిండే నుంచి ప్రదీప్ రావత్, సోనూ సూద్ దాకా హిందీ ప్రేక్షకులకి తెలిసిన ముఖాలే ఉండటంతో అదొక ప్లస్ పాయింట్ అవుతోంది.
కొన్ని పాత్రల నేటివిటీ మార్పు పేరు మార్పుతో సులభంగా జరిగిపోతోంది. కమెడియన్ నల్లగా ఉంటే కాలూ (నల్లటివాడు) అని పేరు పెట్టేస్తారు. తెల్లగా ఉంటే సమస్య ఉండదు. అలా కొన్ని హిందీ నేటివిటీకి అతకని దృశ్యాలుంటే, అవి కథాగమనాన్ని దెబ్బతీయకపోతే తీసేస్తారు. గమనించదగ్గ సంగతేమంటే ఈ సినిమా టైటిల్స్‌లో టైగర్ అనే పదం ఎక్కువగా కనిపించడం. భవానీ ద టైగర్ (పలనాటి బ్రహ్మనాయుడు), ఇంద్ర ద టైగర్ (ఇంద్ర), టైగర్ ఎ ఒన్‌మేన్ ఆర్మీ (సుబ్బు) వంటివి అందుకు ఉదాహరణలు. మరికొన్ని టైటిల్స్ హిందీ హిట్ సినిమాల టైటిల్స్ గుర్తొచ్చేలా పెడతారు. ద రియల్ ఇండియన్ (ఒక్క మగాడు), డాన్ నెం.1 (డాన్), ఏక్ ఔర్ హిమ్మత్‌వాలా (అందరివాడు), అతిథి ఇంటర్నేషనల్ ఖిలాడీ (అతిథి), మేరీ జంగ్ (మాస్), విశ్వ (నేనున్నాను), రాబరీ (సూపర్), పెహలీ నజర్ కా పెహలా ప్యార్ (సంతోషం) వంటివి వాటిలో కొన్ని. 
ప్రతినిత్యం మధ్యాహ్నం వేళ హిందీ చానళ్ల ప్రేక్షకులకి మంచి వినోద కాలక్షేపం అందిస్తున్న మన తెలుగు సినిమాలకి మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. వీటిలో హీరోయిన్లు హిందీవాళ్లే! ఏదేమైనా తెలుగు సినిమాల హిందీ డబ్బింగులతో మన స్టార్ల టాలెంట్ హిందీ ప్రేక్షకులకి - అదీ వాళ్ల ఇంటిల్లిపాదికీ పరిచయం కావడమంటే మామూలు విషయం కాదు.

Friday, November 11, 2011

ప్రివ్యూ: సోలో

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా 'సోలో'. నారా చంద్రబాబునాయుడు తమ్ముడు రామ్మూర్తినాయుడు కుమారుడైన రోహిత్ 'బాణం' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అందులో ఓ మాజీ నక్సలైట్ కుమారుడు భరత్ పాణిగ్రాహిగా రోహిత్ ప్రదర్శించిన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు అతను నటిస్తున్న 'సోలో'కి పరశురాం దర్శకుడు. 'యువత', 'ఆంజనేయులు' సినిమాల తర్వాత పరశురాం డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. స్క్రిప్టే ఈ సినిమాకి అసలు హీరో అని అతను చెబుతున్నాడు. ఇక రోహిత్ సరసన నాయికగా కాజల్ అగర్వాల్ చెల్లెలు, 'ఏమైందో ఈవేళ' ఫేం నిషా అగర్వాల్ నటిస్తోంది. 'సాలిడ్ లవ్‌స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌తో ఎస్.వి.కె. సినిమా బేనర్‌పై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. 
ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో సాయాజీ షిండే, సుహాసిని, రవిప్రకాశ్, అలీ ప్రధాన తారాగణం. రామజోగయ్యశాస్త్రి, కృష్ణచైతన్య పాటలు రాసిన ఈ సినిమాకి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కళ: రఘు కులకర్ణి, స్టైలింగ్: అర్చన పరశురాం, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురాం.

Thursday, November 10, 2011

భార్యాభర్తలుగా ఎస్పీ బాలు, ఆమని

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ నటిగా గతంలో నంది అవార్డు పొందిన ఆమని జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరు 'దేవస్థానం'. కామెడీ సినిమాల రచయితగా పేరుపొందిన జనార్ధన మహర్షి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్ బేనర్‌పై తయారవుతున్న ఇందులో ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ ఓ దేవాలయ ధర్మకర్తగా నటిస్తుంటే, బాలు ఓ మధ్యతరగతి కుటుంబీకునిగా నటిస్తున్నారు. బాలుకు ఇల్లే దేవాలయం. ఆయన భార్యగా ఆమని నటిస్తోంది. విశ్వనాథ్, బాలు మధ్య జరిగే హ్యూమన్ ఎమోషనల్ డ్రామానే 'దేవస్థానం' అని  జనార్దన మహర్షి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలు దేవాలయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. కొంత విరామంతో మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్న ఆమని గతంలో బాలు నిర్మించిన 'శుభసంకల్పం' సినిమాలో హీరోయిన్‌గా నటించి, ఉత్తమ నటిగా నంది అవార్డు సాధించింది. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది విశ్వనాథ్. ఇప్పుడు ఆ ముగ్గురూ కలిసి నటిస్తుండటం ప్రత్యేకతని సంతరించుకున్న అంశం. ఈ కాంబినేషన్‌లో వస్తున్న 'దేవస్థానం' ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాల్సిందే.

ఏడేళ్ల తర్వాత బాలయ్యతో పరుచూరి బ్రదర్స్!

'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల కాంబినేషన్ బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్ ఏడేళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నారు. చివరిసారిగా వారు 'లక్ష్మీనరసింహా' సినిమాకి పనిచేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకి వారు 'హరహర మహాదేవ' సినిమా కోసం కలిశారు. బి. గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. 'లక్ష్మీ నరసింహా' నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. ఇక బి. గోపాల్ విషయానికొస్తే ఎనిమిదేళ్ల తర్వాత ఆయన బాలకృష్ణని డైరెక్ట్ చేస్తున్నాడు. 2003లో వచ్చి ఘోరంగా ఫెయిలైన 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాకి చివరగా ఆ ఇద్దరూ కలిసి పనిచేశారు. దీనికి రచన చేసింది కూడా పరుచూరి సోదరులే. ఇప్పుడు ఈ నలుగురి (పరుచూరి బ్రదర్స్ ఇద్దరు కాబట్టి) కలిసి 'పలనాటి బ్రహ్మనాయుడు' చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో పనిచేస్తున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి పెట్టింది పేరైన బ్రదర్స్ ఇందులో 'సై అంటే శరభ శరభ.. జై అంటే ఆయుష్మాన్‌భవ.. కాదని ఎదురొస్తే హరహర మహాదేవ' వంటి శక్తివంతమైన డైలాగులు రాశారు. అయితే ఏ సినిమాకైనా కథే ప్రాణాధారం కాబట్టి 'హరహర మహాదేవ' కథ విషయంలో బి. గోపాల్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మంచి పాటలు, యాక్షన్ పార్ట్, పవర్‌ఫుల్ కేరక్టర్, కావలసినంత సెంటిమెంట్ రంగరించి ఈ సినిమా కథని వండారు. ఈ సినిమాతో పునర్వైభవం పొందాలని ఇటు పరుచూరి బ్రదర్స్, అటు బి. గోపాల్ చేస్తున్న కృషి ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.

రెండు భాషల్లో హిట్లు కొట్టిన హీరోయిన్

తెలుగులో 'పిల్ల జమీందార్', తమిళంలో 'మురన్' సినిమాలు సక్సెస్ సాధించడంతో తెగ సంబరిపడిపోతోంది కన్నడ భామ హరిప్రియ. భూమిక నిర్మించిన 'తకిట తకిట' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమెకు తొలి సినిమా నిరాశని మిగిల్చింది. అలాంటిది ఆమెకు 'పిల్ల జమీందార్' ఆఫర్ రావడం అదృష్టమే అనుకోవాలి. నాని హీరోగా నూతన దర్శకుడు అశోక్ రూపొందించిన ఆ సినిమా హిట్టవడం కొత్త ఊపిరినిచ్చినట్లయింది. దీనికంటే కొద్ది రోజుల ముందు తమిళంలో రజ్జన్ మాధవ్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేరన్ నిర్మించిన 'మురన్' కూడా హిట్టవడంతో హరిప్రియ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలో ఆమె చేరన్ ప్రియరాలి పాత్రను బాగా చేసిందనే పేరు కూడా సంపాదించింది. ఇలా రెండు భాషల్లో వెంటవెంటనే రెండు సినిమాలు విజయం సాధించడంతో హరిప్రియ కెరీర్‌కు మేలు జరిగే అవకాశాలున్నాయి. చూద్దాం ఆమెకి ఎలాంటి ఆఫర్లు వస్తాయో...

Wednesday, November 9, 2011

'ఓ మై ఫ్రెండ్' మరో 'వసంతం'?

సిద్ధార్థ్, శ్రుతిహాసన్ సినిమా 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వేణు శ్రీరాంను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ఇదివరకు చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇద్దరు మిత్రులు', వెంకటేశ్ హీరోగా వచ్చిన 'వసంతం' సినిమాల తరహాలో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 'ఇద్దరు మిత్రులు'లో చిరంజీవి, సాక్షి శివానంద్ మిత్రులుగా నటిస్తే, చిరంజీవి సరసన నాయికగా రమ్యకృష్ణ నటించింది. సాక్షికి జోడీగా సురేశ్ కనిపించాడు. అలాగే 'వసంతం' చిత్రంలో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటిస్తే, వెంకటేశ్ సరసన ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. కల్యాణికి జోడీగా ఆకాశ్ కనిపించాడు. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో సిద్ధార్థ్, శ్రుతి జంటగా గాక, స్నేహితులుగా నటించారని గట్టిగా వినిపిస్తోంది. అంటే సిద్ధార్థ్‌కి జోడీగా హన్సిక, శ్రుతికి జోడీగా నవదీప్ కనిపించనున్నారనేది ప్రచార సారాంశం. ఇదే నిజమైతే ఇప్పటికే 'ఇద్దరు మిత్రులు', 'వసంతం' సినిమాల్ని చూసిన జనం 'ఓ మై ఫ్రెండ్'ని బాగా రిసీవ్ చేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా 'ఇద్దరు మిత్రులు' సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు కూడా. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే 'ఓ మై ఫ్రెండ్' కథ గురించి జరుగుతున్న ప్రచారం నిజమో, కాదో తేలిపోనున్నది.

Tuesday, November 8, 2011

డైరెక్టర్ కాబోతున్న హీరోయిన్!

ప్రఖ్యాత కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ మనవరాలైన నిశాంతి 'ఎల్బీడబ్ల్యూ' సినిమాతో నాయికగా తెరంగేట్రం చేసింది. ఆమె తండ్రి కూడా సంగీత సాహిత్యాల్లో ప్రవీణుడే. ఆయన ఇ.ఎస్. మూర్తి. పలు సినిమాలకు పాటలు రాసిన ఆయన కొన్ని సినిమాలకు సంగీతాన్నీ సమకూర్చారు. అందువల్లే నిశాంతికీ సాహిత్యం పట్ల ఆసక్తి. "తీరిక వేళల్లో సినిమాలు చూస్తుంటా. పుస్తకాలు చదువుతా. ఇప్పుడు తెలుగు సాహిత్యమే చదువుతున్నా. తాతయ్య, నాన్న ఆ రంగానికి చెందినందున నేనూ దానిపట్ల ఆకర్షితురాలినయ్యా" అని ఆమె తెలిపింది. ముంబైలో డైరెక్షన్ కోర్సు చేసి, మొదట ఓ కన్నడ సినిమాకి అసెస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె దేశవ్యాప్తంగా పేరొందిన 'ఇక్బాల్' సినిమాకి నగేశ్ కుకునూర్ వద్ద కూడా పనిచేసింది. "అవకాశాల్ని బట్టి నటిగా కంటిన్యూ అవుతా. అయితే నా ఆశయం మాత్రం డైరెక్టర్ కావడమే. 'అలా మొదలైంది'తో నందినీరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నాక, నా కోరిక మరింత బలపడింది. ఇప్పటికే మంచి సబ్జెక్ట్ తయారుచేసుకున్నా. త్వరలోనే డైరెక్షన్ చేస్తాననుకుంటున్నా" అని చెప్పింది నిశాంతి.

బిగ్ స్టోరీ: చుక్కల్లో హీరో.. చిక్కుల్లో సినిమా!

తెలుగు సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లకు చేరుకోవడంతో హీరోల, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కువ బడ్జెట్ సినిమాల్ని మరింత ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి, ఆ సినిమాలు ఫ్లాపయ్యాక విలవిల్లాడటం బయ్యర్లకు పరిపాటి వ్యవహారం. అయితే ప్రస్తుతం వాళ్లు సైతం రియలైజయి, భారీ రేట్లకు సినిమాలు కొనేందుకు వెనుకాడుతున్నారు. దీనికి మంచి ఉదాహరణ ఇండస్ట్రీ హిట్టయిన 'దూకుడు' రూ. 5 కోట్ల డెఫిసిట్‌తో రిలీజవడమే. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద హీరోతో సినిమా తీసే నిర్మాత, ఆ స్థాయిలో బిజినెస్ కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అయినా సొంతంగానే విడుదల చేసుకోక తప్పని స్థితి నెలకొని ఉంది. మహేశ్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సినిమాలు ఫెయిలైనా కనీసం సగటున రూ. 20 కోట్లయినా (తాజా అంచనాల ప్రకారం) వసూలు చేస్తాయి. అంటే వారి సినిమాల్ని 20 కోట్లు పెట్టి కొనే బయ్యర్లు 'నో గెయిన్ - నో లాస్' పద్ధతిన బతికిపోతారు. అదే 40 కోట్లకు కొన్నప్పుడు, ఆ సినిమా సూపర్ హిట్టయితేనే వాళ్లకు ఓ రూపాయి మిగులుతుంది. లేదంటే సగం డబ్బు నష్టపోతారు. వాళ్లు బతికి బట్ట కట్టడం కష్టం. 
2011లో బాలకృష్ణ 'పరమవీరచక్ర', ఎన్టీఆర్ 'శక్తి', అల్లు అర్జున్ 'బద్రినాథ్', నాగచైతన్య 'దడ' సినిమాల బయ్యర్ల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో బయ్యర్ల గుండెలు పగలడమొక్కటే తక్కువ. సమస్యకు మూలం భారీ బడ్జెట్లే. సినిమా బడ్జెట్‌లో అత్యధిక భాగం హీరోకూ, ఆ తర్వాత డైరెక్టర్‌కూ పోతోంది. స్టార్ హీరోలెవరికీ ఇవాళ ఆరు కోట్ల కంటే తక్కువ పారితోషికం లేదు (ఆ డబ్బుతో మూడు చిన్న సినిమాలు తీసేయొచ్చు). స్టార్ డైరెక్టర్లు సైతం మూడు నుంచి ఐదు కోట్ల దాకా వసూలు చేస్తుండటం సమస్యను మరింత జటిలం చేస్తోంది.
నిర్మాతల్లో ఏకాభిప్రాయమేదీ?
ఓ స్టార్ హీరో, మరో స్టార్ డైరెక్టర్, ఇంకో స్టార్ హీరోయిన్ కాంబినేషన్‌లో సినిమా తీయాలనుకునే నిర్మాత 30 కోట్ల రూపాయల దాకా (కొండొకచో 40 కోట్ల దాకా) వెచ్చించాల్సి వస్తోంది. ఇంత డబ్బుపెట్టి సినిమా తీశాక, ఆ సినిమా ఆడకపోతే హీరో, డైరెక్టర్ బాగానే ఉంటున్నారు కానీ బయ్యర్లు, నిర్మాత మాత్రమే మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతినిపోతున్నారు. అలాంటప్పుడు 'పెద్ద హీరోతో సినిమా తీయడం దేనికి? చిన్న సినిమా తీయొచ్చు కదా?' అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే చిన్న సినిమా పరిస్థితి మరింత అధ్వాన్నం. 'రిస్క్' వ్యవహారం. ఎందుకంటే - చిన్న సినిమాకు ఇవాళ మార్కెట్ లేదు. విలువలు వదిలేసి యువత బలహీనతల్ని సొమ్ముచేసుకునే కథలతో తీసిన సినిమాలకు మాత్రమే మనుగడ. అందువల్లే ఇవాళ రెండొందలకు మించిన సంఖ్యలో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోక ల్యాబుల్లో బూజుపట్టిపోతున్నాయి. బయ్యర్ లేకపోయినా సొంతంగా సినిమాను విడుదల చేసుకోగల శక్తి ఉన్నవాళ్లు చిన్న సినిమాల్ని నిర్మిస్తున్నా, 'సేలబిలిటీ' లేకపోవడంతో అవి కలెక్షన్లు తేలేకపోతున్నాయి. అందువల్లే ఏ నిర్మాతైనా పెద్ద హీరోతో సినిమా తీయడానికే ఉత్సాహం చూపుతున్నాడు. ఫలితంగానే పారితోషికాలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రాథమికంగా పారితోషికాలు తగ్గాలనే డిమాండ్ సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తోంది. ఇంతకుముందు వరకు పబ్లిసిటీ వ్యయాన్ని అదుపు చేయడం వరకే నిర్మాతలు ఐక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల యాక్టర్లకు ఇస్తున్న సౌకర్యాల్లో కోత విధించారు. అయితే ఇప్పుడు వాటిని కొంతమంది నిర్మాతలు ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరోలు, టెక్నీషియన్లు తమ రెమ్యూనరేషన్‌లో కనీసం 20 శాతమైనా తగ్గించుకుంటే బాగుంటుందని నిర్మాతలు కోరుతున్నారు. అయితే అసలైన మెలిక ఇక్కడే ఉంది. హీరోల, దర్శకుల పారితోషికాలు స్థిరంగా ఉండవు. ఓ సినిమా హిట్టయ్యిందంటే ఆ వెంటనే వాళ్ల రెమ్యూనరేషన్ పెరగటం సర్వసాధారణం. ఈ పారితోషికం పెంచే ట్రెండే సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నదని దాసరి నారాయణరావు తరచూ చెబుతుంటారు. 
కావాలని హీరోలు, డైరెక్టర్లు తమ రేటుని పెంచకపోయినా, వాళ్లతో సినిమా తీయాలని ఉబలాటపడే నిర్మాతలే వాళా రేటు పెంచేస్తున్నారు. ఎవరు ఎక్కువ పారితోషికం ఇస్తారో ఆ నిర్మాతకే హీరో, డైరెక్టర్ కమిట్ కావడాన్ని తప్పు పట్టలేం. ఎవరైనా పేరు, డబ్బు కోసమే యత్నిస్తారు. అంటే వేళ్లు తిరిగి నిర్మాతల వైపుకే మళ్లుతున్నాయి. నిర్మాతలు గట్టిగా ఓ కట్టుబాటుతో ఉండి, రెమ్యూనరేషన్లని విపరీతంగా పెంచకుండా ఉంటే సమస్య ఉప్పుడున్న స్థాయికి చేరుకునేది కాదు.

తొమ్మిదేళ్లు... తొమ్మిది మంది కొత్త దర్శకులు!

కొత్త దర్శకులంటే సిద్ధార్థ్‌కి మోజెక్కువ. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో సరిగ్గా తొమ్మిది మంది కొత్త దర్శకులతో పనిచేశాడు. ఈ వరుసలో వస్తున్న అతడి తదుపరి సినిమా 'ఓ మై ఫ్రెండ్'తో కరీంనగర్‌కి చెందిన వేణుశ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇదే సినిమాతో కేరళకు చెందిన రాహుల్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అవడంతో ఈ సినిమా విజయంపై సిద్ధుతో పాటు నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తమ బేనర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయనీ, కానీ 'ఓ మై ఫ్రెండ్' గ్రేట్ ఫిల్మ్ అవుతుందనీ గొప్పగా చెప్పాడు. సిద్ధు విషయానికొస్తే అతడి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా అవతారమెత్తి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత కాలంలో సిద్ధు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' ద్వారా మణిరత్నం శిష్యుడు శివకుమార్, 'బొమ్మరిల్లు' ద్వారా భాస్కర్, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ద్వారా డాలీ, 'ఓయ్!'తో ఆనంద్ రంగా, 'బావ'తో రాంబాబు, 'అనగనగా ఓ ధీరుడు'తో సూర్యప్రకాశ్, '180'తో జయేంద్ర డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. వీరిలో ప్రభుదేవా, భాస్కర్ మాత్రమే సక్సెసయ్యారు. '180' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని సిద్ధు గట్టిగా నమ్మాడు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్'తోనైనా అతడికో హిట్టు వస్తుందేమో చూడాలి.

Saturday, November 5, 2011

'ప్రియుడు' మీద నమ్మకం పెట్టుకున్న నటి

చూపులకి అక్క అమృతా రావ్ని గుర్తుకుతెచ్చే ప్రీతికా రావ్ 'ప్రియుడు' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. నటి కాకముందు ప్రీతిక ఓ ఫిల్మ్ జర్నలిస్ట్, మోడల్ కావడం గమనార్హం. 'ప్రియుడు'లో ఆమె వరుణ్ సందేశ్ జోడీగా కనిపించబోతోంది. అయితే ఆమె హైదరాబాద్‌కి తొలిసారి వచ్చింది ఈ సినిమా షూటింగ్ కోసం కాదు. అక్క అమృత, తల్లితో కలిసి 'అతిథి' సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారి వచ్చింది. ఆ సినిమాలో మహేశ్ సరసన అమృత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ప్రీతిక హీరోయిన్‌గా పరిచయమైన సినిమా ఆర్య సరసన నటించిన తమిళ చిత్రం 'చిక్కు బుక్కు'. మణికందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2010లో రిలీజైంది. ఓ డైలీలోని ప్రీతిక రాసిన కాలంలో ఆమె ఫోటోచూసి మణికందన్ 'చిక్కు బుక్కు'లో అవకాశమిచ్చాడు. 
నిజానికి ప్రీతిక టెన్త్ క్లాస్ చదివేప్పుడే తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌ని తిరస్కరించింది. ఇప్పుడు వివిధ దేశాల్లో 50 దాకా కమర్షియల్ యాడ్స్ చేసిన ప్రీతిక ఇది సరైన సమయంగా భావించి తెలుగులో అడుగుపెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుని, పరుగులు పెట్టాలని ఆమె భావించడం లేదు. మంచి పాత్రలే చేయాలనేది ఆమె ఉద్దేశం. హిందీ సినిమాల్లోకి వెళ్లడానికి తెలుగు ఓ స్టెప్పింగ్ స్టోన్‌గా ఉపయోగపడుతుందని కూడా ఆమె అనుకోవడం లేదు. ముంబై చిత్రసీమ మాదిరిగానే తెలుగు చిత్రసీమ కూడా చాలా పెద్దదనీ, ప్రస్తుతం ఎన్నో తెలుగు సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయనీ ఆమె అంటోంది. 'ప్రియుడు' సినిమా తనకి తెలుగులో బ్రేక్ ఇస్తుందని గట్టిగా నమ్ముతుందామె.

ఇంటర్వ్యూ: పైడిశెట్టి రాం

''సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' (చంటిగాడు), 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు), 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' (గుండమ్మగారి మనవడు), 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' (జాజిమల్లి)... ఇలాంటి చక్కటి పాటల రచయిత పైడిశెట్టి రాం. సినీ రంగంలో కెరీర్ చూసుకోవాలనే విషయంలో అమ్మానాన్నలతో గొడవపడి, వాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా విజయనగరం నుంచి హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతూనే నెమ్మదిగా ఒక్కో మెట్టూ పైకెక్కుతూ ప్రస్తుతం నందమూరి తారకరత్న సినిమా 'నందీశ్వరుడు'కు సింగిల్ కార్డ్ రాసే స్థికి ఎదిగిన పైడిశెట్టి రాం అంతరంగ భాషణ...
సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?
చిన్నప్పట్నించీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. నటనంటే ఎక్కువ ఇష్టం. నటించాలని కోరికుండేది. మాది విజయనగరంలో ఓ వ్యవసాయ కుటుంబం. నిజం చెప్పాలంటే రాయిపని చేసుకు బతికేవాళ్లం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. అందుకే నేను కూడా ఆ పనిలో ఉంటే తమకి ఆసరా అవుతుందని నాన్న భావించారు. కానీ నా దృష్టంతా సినిమాల మీదుంది. ఎమ్మెస్సీ బోటనీ చేశాక సినిమాల్లో నటించాలనే తపనతో ఇంట్లోవాళ్లతో గొడవపడి మరీ కృష్ణానగర్‌కి వచ్చా. డిగ్రీ వరకు గురుకులాల్లోనే చదువుకోవడం వల్ల తెలుగు, సంస్కృత భాషలు బాగా వచ్చు. అప్పటికే సొంతంగా పాటలు రాయడం అలవాటు. వాటిని విన్నవాళ్లంతా నటనపై కంటే పాటలపై దృష్టి పెట్టమన్నారు.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
హైదరాబాద్‌కి నాతో పాటు నా స్నేహితులు మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్లు తలో ఇరవై వేలు తీసుకొస్తే, నేను తెచ్చుకుంది కేవలం ఇరవై రూపాయలే. ఇప్పుడు వాళ్లు లేరు. ఆ డబ్బులయిపోయాక మా ఊరికి వెళ్లిపోయారు. నేను వేషాల కోసం తిరుగుతూనే పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి. దాంతో నా ఫ్రెండ్స్, మరికొంతమది వేషాల బదులు పాటల అవకాశాల కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అదీ బాగానే ఉందనిపించింది. సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌గారు కొత్తవాళ్లకి అవకాశాలిస్తారని విని, ఆయన్ని కలుసుకోవాలని అన్నా ల్యాబ్స్‌కి వెళ్లా. అప్పుడే కారులోంచి దిగుతున్న ఆయన్ని పరిచయం చేసుకున్నా. ఓ పాట పాడమన్నారు. ల్యాబ్ బయటనే నేను రాసుకున్న ఓ పాట పాడా. అప్పుడే అక్కడకి 'చంటిగాడు' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వచ్చిన డైరెక్టర్ జయ బి. గారు కూడా నా పాట విన్నారు. నన్ను ఎల్లారెడ్డిగూడలోని తమ ఆఫీసుకి రమ్మన్నారు. అక్కడికి వెళితే దాదాపు 20 మంది రచయితలు కనిపించారు. అందరికీ క్లైమాక్స్ సందర్భం చెప్పి, నాలుగు రోజుల్లో పాట రాయమన్నారు. 'సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' అంటూ నేను రాసిన పాటని సెలక్ట్‌చేసి, దానికి అప్పటికప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. ఆ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి చేత పాడించడం నేను మర్చిపోలేని అనుభవం. ఆ పాటకి మంచి స్పదన వచ్చింది.
అప్పుడు బాలు గారిని కలిశారా? ఆ అనుభవం గురించి చెప్పండి..
నిజానికి అప్పుడు నేను ఇటు ఆనందాన్నీ, అటు బాధనీ రెండూ అనుభవించా. అదెట్లాగంటే.. ఆ పాట రికార్డింగ్‌కి ఉదయం 8 గంటలకి రికార్డింగ్ థియేటర్‌కి రమ్మని జయ మేడం చెప్పారు. నాకు అప్పటిదాకా అనుభవం లేకపోవడంతో తాపీగా 10 గంటలకి వెళ్లా. అప్పట్లో నాకు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు. నా కోసమే ఎదురు చూస్తూ కనిపించారు జయ మేడం. నేను రాసిన పాటలో ఓ పదం తప్పుగా అనిపించింది బాలు గారికి. అది తప్పని చెప్పి, దాన్ని మారిస్తే కానీ పాట పాడనని ఆయన భీష్మించారు. దాంతో నాకోసం అంతా ఎదురు చూస్తున్నారు. నాకు చాలా సిగ్గనిపించింది. నేను రాసిన పదం గురించి చెప్పి, దాన్ని మార్చాలనీ లేకపోతే బాలుగారు పాడరనీ జయగారు చెప్పారు. నిజానికి నా తొలిపాటకి బాలుగారైతే బాగా న్యాయం చేస్తారనే అభిప్రాయంతో ఆయనతో పాడించమని జయగార్ని రిక్వెస్ట్ చేసింది నేనే. ఇప్పుడు సడన్‌గా ఓ పదం మార్చమని అడిగేసరికి నా మైండ్ బ్లాంకయిపోయింది. నాకేమీ తోచలేదు. ఆ స్థితిలో నాకు పాటా వద్దూ, ఏమీ వద్దనీ, దాన్ని కేన్సిల్ చేసుకొమ్మనీ దాదాపు ఏడుస్తున్నట్లే జయగారికి చెప్పా. ఆమె అధైర్యపడొద్దని, తనే ఆ పదం బదులు వేరే పదం పెట్టి, ఆ పాటని బాలుగారితో పాడించారు. బాలుగారు కూడా పాట చాలా బాగా రాశావంటూ భుజంతట్టి, నాతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. అది మర్చిపోలేని అనుభవం.
ఇప్పటిదాకా ఎన్ని సినిమాలకి రాశారు?
ఇప్పటివరకు 47 సినిమాలకి పాటలు రాశా. పాటల సంఖ్య వంద చేరువలో ఉంది. బాలుగారు పాడిన నా తొలి పాటతో పాటు, 'ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు' చిత్రానికి నేను రాసిన రెండో పాట 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (జేసుదాస్‌గారు పాడింది) కూడా మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జయ గారు డైరెక్ట్ చేసిన 'గుండమ్మగారి మనవడు'లో నాలుగు పాటలు రాశా. వాటిలో 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' అనే పాటకి మంచి ఆదరణ లభించింది. అలాగే 'జాజిమల్లి'లోని 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' పాట రింగ్‌టోన్‌గా బాగా ఆదరణ పొందింది. చెప్పాలంటే నేను రాసిన పాటలన్నీ నాకిష్టమే.
ఇప్పటివరకు పనిచేసిన సంగీత దర్శకుల్లో ఎవరు మీకు సౌకర్యంగా అనిపించారు?
అలా ఎవరో ఒకర్ని ప్రత్యేకించి చెప్పలేను. ఎందుకంటే అందరు సంగీత దర్శకులూ నన్ను ప్రోత్సహించినవాళ్లే. వందేమాతరం, చక్రి, ఆర్పీ పట్నాయక్, చిన్నా వంటి సంగీత దర్శకులతో పనిచేశా. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందరితోనూ సౌకర్యంగా ఫీలయ్యా. వాళ్లు మనకి ట్యూన్ ఇచ్చినా రాయడం వచ్చుండాలి, లేదా ట్యూన్ లేకపోయినా రాయడం తెలిసుండాలి. నేను రెండు రకాలుగా రాశా. 
లాబీయింగ్‌తో అవకాశాలు వస్తాయా?
ప్రతిభ ఉండాలే గానీ పోటీ ఎంతున్నా ముందుకెళ్తామనేది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న వాస్తవం. ప్రతిభ లేకుండా ఎంత లాబీయింగ్ చేసినా ఉపయోగముండదు. సంగీత దర్శకులైనా, దర్శకులైనా ప్రతిభ ఉన్న వాళ్లనే ప్రోత్సహిస్తుంటారు. ఆల్రెడీ ప్రతిభ నిరూపించుకున్నవాళ్లకి ఎక్కువ అవకాశాలు రావడం సహజం. దానికి బాధపడ్డం నెగటివ్ థింకింగ్ అవుతుంది.
మీ రాబోతున్న సినిమాలేవి?
రాబోయే సినిమాల్లో తారకరత్న, జగపతిబాబు కలిసి నటిస్తున్న 'నందీశ్వరుడు'కి ఎనిమిది పాటలు సింగిల్ కార్డ్ రాశా. అలాగే రాజశేఖర్‌గారి సినిమా 'మహంకాళి'కీ, శ్రీకాంత్ సినిమాలు 'దేవరాయ', 'సేవకుడు'కీ, శ్రీహరి, సాయిరాం శంకర్ సినిమా 'యమహో యమః'కీ, 'దునియా'కీ రాశా. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న 'క్రేజీ కృష్ణ'కి సింగిల్ కార్డ్ రాశా.
మీ భాషని మెరుగుపర్చుకోడానికి ఎలాంటి కృషి చేస్తారు?
ప్రాచీన సాహిత్యమైన అష్టాదశ పురాణాలూ, రామయణ భారతాలను అధ్యయనం చేయడంతో పాటు తెలుగు చిత్రసీమలో ప్రసిద్ధులైన ఆనాటి గేయ రచయితల నుంచి ఈ నాటి రచయితల దాకా - వారి పాటల్ని అధ్యయనం చేశా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. అలా నా భాషని నిరంతరం మెరుగు పరచుకుంటున్నా. ఎక్కువగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలంటే ఇష్టం.
ఇప్పుడు మీ అమ్మానాన్నలు ఎలా ఫీలవుతున్నారు?
నేను పది సినిమాలకి పాటలు రాసేదాకా కూడా మా ఇంట్లో వ్యతిరేకత ఉండేది. ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడికొచ్చి కష్టాలు పడటమెందుకనేది అమ్మానాన్నల అభిప్రాయం. ఇప్పుడు నా పురోగతి చూసి వాళ్లు ఆనందపడుతున్నారు. ప్రోత్సహిస్తున్నారు. దాంతో టెన్షన్ లేకుండా నా పని చేసుకోగలుగుతున్నా. అలాగే ఇండస్ట్రీ వ్యక్తులు చాలామంది నేను పాటలు బాగా రాస్తున్నానని ప్రోత్సహిస్తున్నారు. నెలకి సగటున రెండు పాటలు తక్కువ కాకుండా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అగ్ర హీరోలకు రాయాలని తపనపడ్తున్నా.

Friday, November 4, 2011

న్యూస్: రాజేంద్రప్రసాద్ ఫుల్ బిజీ!

చాలా రోజుల తర్వాత వెటరన్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ సినిమాలతో బాగా బిజీ అయ్యారు. గోపీచంద్ తండ్రిగా ఆయన చేసిన 'మొగుడు' శుక్రవారం (4న) విడుదల కాబోతోంది. 'ఆ నలుగురు' తర్వాత ఆయనకు మళ్లీ అంత పేరు ఇందులోని ఆంజనేయప్రసాద్ కేరక్టర్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. వెరైటీ గెటప్‌తో ఆయన చేసిన 'డ్రీం' సినిమా షూటింగ్ పూర్తయింది. కె. క్రాంతిమాధవ్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమాలో ఆయన నారాయణరావు మాస్టారు అనే ఉపాధ్యాయుడి పాత్ర చేశారు. "ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. నారాయణరావు పాత్ర అలాంటిదే" అని చెప్పారు రాజేంద్రప్రసాద్. వీటితో పాటు గుణశేఖర్, రవితేజ కాంబినేషన్ సినిమా 'నిప్పు', అల్లు అర్జున్, త్రివిక్రం కలిసి చేస్తున్న 'హనీ' (టైటిల్ ఇంకా ధృవీకరించలేదు), ఆది హీరోగా జయ బి. డైరెక్ట్ చేస్తున్న సినిమాలను ఆయన చేస్తున్నారు. అలాగే 'క్విక్‌గన్ మురుగన్ 2' సినిమానీ ఆయన చేయనున్నారు. హిందీలోనూ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. "ఇంకా చాలానే ఉన్నాయి. ఇంత బిజీగా మళ్ళీ గడుపుతానని అనుకోలేదు'' అని ఉత్సాహంగా చెప్పారు రాజేంద్రప్రసాద్.

రివ్యూ: సెవెన్త్ సెన్స్

ఒక కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే అంతకుముందు ఆ కాంబినేషన్‌లో వచ్చిన గొప్ప సినిమాతో పోలిక తేవటం చాలా సహజం. అదే పని ఇప్పుడు 'సెవెన్త్ సెన్స్' విషయంలో జరుగుతోంది. సూర్య, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన మునుపటి సినిమా 'గజిని'తో 'సెవెన్త్ సెన్స్'ని పోల్చి గట్టిగా పెదవి విరుస్తున్నారు ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకులూ. ఓ ప్రేమకథకి ప్రతీకారం అనే అంశాన్ని జోడించి అప్పటివరకు భారతీయ తెరపై రానివిధంగా మురుగదాస్ ప్రెజేంట్ చేసిన 'గజిని' సినిమా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది. అందులో సూర్య, అసిన్ ప్రదర్శించిన అభినయాలు మన కళ్ల ముందు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అదే సూర్య ఇప్పుడు 'సెవెన్త్ సెన్స్'లోనూ చాలా బాగా నటించాడు. కానీ ఆ నటనకి ప్రయోజనం అంతగా లేకుండా పోయింది. కారణం మురుగదాస్ ఫ్లాట్ అండ్ బోరింగ్ స్క్రిప్ట్. 'గజిని' హిట్టవటంలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్ర ఎంతో ఉంది. 'సెవెన్త్ సెన్స్'లో లోపించింది అదే. 
క్రీ.శ. 6వ శతాబ్దం నాటి సన్నివేశాల్ని ప్రశంసనీయంగా చిత్రించిన మురుగదాస్ వర్తమాన కాలానికి వచ్చేసరికి స్క్రిప్టుపై పట్టు కోల్పోయాడు. యుద్ధ కళల్లోనే కాక ప్రకృతి వైద్యంలోనూ అసామాన్యుడైన బోధిధర్ముడు (సూర్య) చీనా దేశంవెళ్లి అక్కడ విపత్తులో ఉన్న ఓ గ్రామ ప్రజల్ని ఓ ప్రాణాంతక అంటువ్యాధి నుంచి రక్షించడమే గాక, వారికి ఆత్మరక్షణ కోసం యుద్ధ కళల్నీ నేర్పుతాడు. వారికి దేవుడిగా మారతాడు. కొన్నేళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని అతడనుకుంటే, అక్కడి పెద్దలు మరో రకంగా తలుస్తారు. అతడి దేహం అక్కడే ఉంటే ఎలాంటి వ్యాధులూ వారి దరిచేరవని భావించిన వాళ్లు అతడికి ఆహారంలో విషమిస్తారు. అది తెలిసి కూడా వాళ్ల కోరిక మన్నించి, ఆ ఆహారాన్ని భుజించి తనువు చాలిస్తాడు బోధిధర్ముడు. అప్పటివరకు ఆ సన్నివేశాల్ని చక్కగా తీసి, మనల్ని ఆ కాలానికి తీసుకుపోయాడు దర్శకుడు. ఆ తర్వాత కథ వర్తమానానికి వస్తుంది. ప్రఖ్యాతి చెందిన బాంబే సర్కస్‌లో అరవింద్ (సూర్య) ఓ కళాకారుడు. అతడిని వెతుక్కుంటూ శుభా శ్రీనివాస్ (శ్రుతిహాసన్) అనే ఓ జెనటిక్ స్టూడెంట్ అక్కడికి వచ్చి, అరవింద్‌తో పరిచయం పెంచుకుంటుంది. అరవింద్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆమె తనవద్దకు వచ్చింది తనమీద పరిశోధనలు చేయడానికి అని తెలిసి కుమిలిపోతాడు. శుభ అతడికి తన పరిశోధనలోని ప్రయోజనాన్ని అతడికి తెలియజేస్తుంది. 6వ శతాబ్దం నాటి బోధిధర్ముడి డీఎన్ఏని దానితో సరిపోలే అతడి వంశానికే చెందిన వ్యక్తి డీఎన్ఏతో కలిపితే మరో బోధిధర్ముడు తయారవుతాడనీ, అంతుచిక్కని ఎన్నో వ్యాధుల్ని అప్పుడు నయం చేసి, ఆరోగ్యవంతమైన భారతావనిని సృష్టించవచ్చనీ చెబుతుంది. అతడి డీఎన్ఏ బోధిదర్ముడి డీఎన్ఏతో మ్యాచ్ అవుతునందనే సంగతీ చెబుతుంది. మరోవైపు చైనా ప్రభుత్వం ఇండియా మీద 'ఆపరేషన్ రెడ్' అనే ప్రయోగాన్ని చేసేందుకు డాంగ్‌లీ అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణుణ్ణి నియమిస్తుంది. 6వ శతాబ్దంలో బోధిధర్ముడు ఏ ప్రాణాంతక వ్యాధిని నయంచేశాడో, ఆ వ్యాధి వైరస్‌తో భారతదేశాన్ని ఛిన్నాభిన్నంచేసి, దాని మందుని తామే భారతదేశానికి అందజేసి, తద్వారా ఈ దేశాన్ని లొంగదీసుకోవాలనేది దాని ప్లాన్. అందుకు శుభ చేసే పరిశోధన వారికి అడ్డుగా నిలుస్తుంది. ఆమె వల్ల బోధిధర్ముడి శక్తిసామర్థ్యాలు మళ్లీ వస్తే తమ కష్టమంతా వేస్టవుతుందని ఆమెనీ, అరవింద్‌నీ కూడా చంపమని డాంగ్‌లీని ఆదేశిస్తుంది చైనా ప్రభుత్వం. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఓ వీధికుక్కలో ప్రాణాంతక వైరస్‌ని ప్రవేశపెడతాడు డాంగ్‌లీ. శుభని వెంటాడతాడు. ఎన్నో హత్యలు చేస్తాడు. బోధిధర్ముడు ఒకప్పుడు మంచి కోసం వినియోగించిన వశీకరణ విద్యని చెడుకోసం ఉపయోగిస్తాడు. చిత్రంగా అతడు ఎంతమందిని చంపినా మీడియాకి గానీ, ప్రభుత్వానికి గానీ అదేమీ పట్టనట్లే కనిపిస్తుంది సినిమాలో. సినిమాలో ఇది కొట్టొచ్చినట్లు కనిపించే లోపం. ఇవాళ ఎక్కడ ఎంత చిన్న సంఘటన జరిగినా మీడియాలో అది ఎంత త్వరగా వచ్చేస్తుందో తెలిసిందే. అట్లాంటిది డాంగ్‌లీ విచక్షణా రహితంగా వరుసపెట్టి పదుల సంఖ్యలో మనుషుల్నీ, పోలీసుల్నీ చంపుకు పోతుంటే మనకి ఓ మీడియా ఉన్నట్లు కానీ, ఓ రాజకీయ వ్యవస్థ ఉన్నట్లు కానీ, ఆ వ్యవస్థలు ఈ హత్యలపై గగ్గోలు పెడుతున్నట్లు కానీ ఎక్కడా ఈ సినిమాలో కనిపించదు. 
ఈ సంగతలా ఉంచితే డాంగ్‌లీ ప్రవేశపెట్టిన వైరస్ ద్వారా వ్యాప్తి చెందిన భయంకరమైన వ్యాధిని అదుపుచేసి, డాంగ్‌లీని అంతం చేయడానికి అరవింద్‌కి బోధిధర్ముడి డీఎన్ఏని కలపడానికి శుభ చేసే ప్రయత్నం ఫలించిందా? డాంగ్‌లీ ఆ ప్రయోగాన్ని అడ్డుకోలేదా? అనేది క్లైమాక్స్. 
'గజిని' కంటే 'సెవెన్త్ సెన్స్' నాలుగురెట్లు బెటర్‌గా ఉంటుందని స్వయంగా సినిమా విడుదలకు ముందు మురుగదాస్ ఊదరగొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు అసాధారణమై పోయాయి. అందుకు తగ్గట్లు సినిమా ఉంటే ఫర్వాలేదు. కానీ అలా లేకపోవడమే ఈ సినిమా కొంపముంచింది. సినిమాలో వినోదం పాలు దాదాపు మృగ్యం కావడంతో సగటు ప్రేక్షకుడు ఈ సినిమాని ఎంజాయ్ చేయడం కష్టం. సర్కస్ కంపెనీలో అరవింద్ మిత్రుడైన మరగుజ్జు నటుడి పాత్ర మరీ చిన్నదైపోవడం, సెకండాఫ్‌లో అతడి పాత్రని ఉన్నట్లుండి విరమించడం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని దెబ్బతీసింది. 
సినిమా మొత్తంలో ఆకట్టుకునేది తొలి 15 నిమిషాలు, చివరి 40 నిమిషాల ఆట మాత్రమే. మిగతా సినిమా అంతా బోరింగే అని చెప్పాలి. స్వతహాగా హారిస్ జయరాజ్ మ్యూజిక్ బాగుంటుందనే నమ్మకాన్ని ఈ సినిమాలోని పాటలు పోగొట్టాయి. ఏ ఒక్క పాటా ఆకట్టుకునే రీతిలో లేదు. మరీ ముఖ్యంగా శుభ తనని ప్రేమించడంలేదనీ, ఆమె పరిశోధన కోసం తనని పావులా వాడుకున్నదనీ తెలిశాక అరవింద్ పాడే విషాదపు పాట చికాకు కలిగిస్తుంది. ఆ పాటని తీసేస్తే ప్రేక్షకుల పరిస్థితి కొంత మెరుగవుతుంది. నేపథ్య సంగీతం మాత్రం బాగీ చేశాడు హారిస్. ఇప్పటికే బ్రూస్‌లీ, జాకీ చాన్, జెట్‌లీ, టొనీ జా వంటి సుప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ నటులు చేసిన మెరుపు వేగపు మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు చూసిన మనకు ఇందులో పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్లు ఏమంత గొప్పగా అనిపించలేదు. కుంగ్‌ఫు ఫైట్లు చేయడానికి సూర్య ఎంతో కష్టపడ్డట్లు తెలుస్తున్నది కానీ అవి అంతగా అకట్టుకోలేదు. ఇక డాంగ్‌లీ పాత్రలో హాంగ్‌కాంగ్ ఫైట్‌మాస్టర్ జానీ ట్రీ గుయెన్ బాగున్నాడు కానీ అతని మేనరిజమ్స్ 'టెర్మినేటర్'లోని విలన్ పాత్రని గుర్తుకు తెచ్చింది. బోధిధర్మునిగా, అరవింద్‌గా సూర్య తనదైన శైలిలో చక్కగా పోషించాడు. అతని హావభావాలు అతనెంతటి ప్రతిభావంతుడైన నటుడో చెబుతాయి. శుభ పాత్రలో శ్రుతిహాసన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సూర్య, శ్రుతి మధ్య రొమాంటిక్ యాంగిల్ ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో చెప్పుకోదగ్గది రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ. ఆద్యంతం తన కెమెరా పనితనాన్ని అతను ప్రదర్శించాడు. మన ప్రాచీన అంశాల్లో ఎంతో సైన్స్ ఉన్నదనీ, వాటిని సైన్స్‌గా బోధించకపోవడం వల్ల వాటిని కేవలం మూఢనమ్మకాలుగా భావించే పరిస్థితి ఉన్నదనీ, ఇది పోవాలనీ ఈ సినిమా ద్వారా చెప్పే యత్నం చేశాడు 

Wednesday, November 2, 2011

'బద్రినాథ్' బాధ నుంచి తేరుకున్న దర్శకుడు

అల్లు అర్జున్ కెరీర్‌లోనే నెంబర్‌వన్ సినిమా అవుతుందని ఎంతగానో ఆశించిన 'బద్రినాథ్' బాక్సాఫీస్ వద్ద ఫెయిలవడంతో మానసికంగా కలతచెందిన ఏస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఇప్పుడు ఆ బాధనుంచి కోలుకుని తదుపరి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా బాక్సాఫీసులు బద్దలుకొట్టే సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను చెప్పిన కథకి ఇప్పటికే రాంచరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. 'మగధీర'లో ప్రేమికులుగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న రాంచరణ్, కాజల్ అగర్వాల్ మరోసారి ఈ సినిమాలో జంటగా నటించనున్నారనే వార్తలు రావడంతో అందరి దృష్టీ ఈ ప్రాజెక్టు పైకి మళ్లింది. కొంత కాలంగా వినాయక్ వద్దే పనిచేస్తున్న ఆకుల శివ ఈ సినిమాకి కథని అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నాడు. 'బద్రినాథ్' చేదు అనుభవాన్ని ఈ సినిమాతో చెరిపివేయాలనే పట్టుదలతో ఉన్న వినాయక్ దీని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. 'మగధీర'లో ఎమోషనల్, లవ్ సీన్లలో రాంచరణ్ కనపర్చిన ప్రతిభావంతమైన అభినయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టులో ఇటు లవ్‌నీ, అటు ఎమోషన్స్‌నీ సమపాళ్లలో మేళవిస్తున్నట్లు సమాచారం. 

ప్రియా ఆనంద్ కనిపించుటలేదు!

తెరపైనా, తెరబయటా యమ చలాకీగా కనిపించే ప్రియా ఆనంద్ '180' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమాలో టీవీ జర్నలిస్ట్‌గా సెకండ్ హీరోయిన్ పాత్రలో పరిచయమై మెప్పించిన ఆమె 'రామ రామ కృష్ణ కృష్ణ', '180' సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గానూ బాగా రాణించింది. ముఖ్యంగా జయేంద్ర డైరెక్ట్ చేసిన ద్విభాషా చిత్రం '180'లో నిత్య మీనన్ వంటి సహజ నటి ఉన్నప్పటికీ నటిగా ప్రియకి మంచి మార్కులు రావడం గమనార్హం. రేణుక అనే ఎన్నారై యువతిగా ఆమె ప్రదర్శించిన హావభావాలు విమర్శకుల్ని సైతం మెప్పించాయి. ఆ సినిమాతో నటిగా ప్రియ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందనీ, దాంతో ఆమెకి మంచి అవకాశాలు రావడం ఖాయమనీ చాలామంది భావించారు. చిత్రంగా ఇప్పటివరకు ఆమె ఏ తెలుగు సినిమాకీ సంతకం చేయలేదు. పెద్ద హీరోలెవరూ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే అలా అని ఆమె ఖాళీగా ఉందనుకుంటే పొరపాటే. 'చీని కం', 'పా' సినిమాల దర్శకుడు బాల్కి రూపొందిస్తున్న సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యేందుకు సిద్ధమవుతోంది. న్యూయార్క్ నగరంలో ఈ సినిమా షూటింగులో ఇటీవలే పాల్గొంది. అయితే తెలుగు బాగా మాట్లాడగలిగిన ఆమెని తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడమే బాధాకరం.

Tuesday, November 1, 2011

చూడాల్సిన సినిమా: మోడరన్ టైమ్స్ (1936)

చార్లీ చాప్లిన్ రూపొందించిన సినిమాలన్నింటిలోకీ గొప్ప కళాఖండంగా పేరుతెచ్చుకున్నది 'మోడరన్ టైమ్స్' (1936). ఆధునిక కార్మికుడు యాంత్రాల కోరల్లో ఎలా నలిగిపోతున్నాడో 'మోడరన్ టైమ్స్' చిత్రంలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించాడు చాప్లిన్. పెట్టుబడిదారీ సమాజంలో ఆధునిక యంత్రాలు కార్మికుని సృజనాత్మకతను దెబ్బతీసి అతన్ని కూడా ఓ యంత్రంగా మార్చేస్తాయనీ, కార్మికుల రక్తం పీల్చుకోడానికి యజమానులు ఆధునిక యంత్రాల్ని మరింత ఎక్కువగా ప్రవేశపెడతారనీ, ఆ సమాజంలో చివరికి కార్మికుని మిగిలేది ఆకలి, దారిద్ర్యం, మానసిక ఆందోళనలేననీ ఎంతో వ్యంగ్యంగా వివరించాడు.
ఈ సినిమాలో చాప్లిన్ ఓ కార్మికుడు. పెద్ద ఫ్యాక్టరీలో కదులుతున్న ఓ కన్వేయర్ బెల్టుమీద నట్లు బిగించడం చాప్లిన్ పని. కార్మికుల చేత మరింత ఎక్కువ పని చేయించుకోవాలని యజమాని తపన. యజమాని ఆదేశంపై ఫోర్‌మన్ కన్వేయర్ బెల్టు స్పీడు పెంచుతాడు. చాప్లిన్ నట్లు బిగించే స్పీడు కూడా పెరుగుతుంది. అలా నట్లు బిగిస్తూ బిగిస్తూ యంత్రంలోని పెద్ద చక్రాల కోరల్లోకి పోతాడు చాప్లిన్. మళ్లీ యంత్రాన్ని వెనక్కి తిప్పి బయటకు తీస్తారు. కార్మికులు భోజనం చేసే సమయాన్ని తగ్గించడం కోసం తిండి తినిపించే ఓ ఆధునిక యంత్రాన్ని ప్రవేశపెట్టిన యజమానులు తొలిసారి దాన్ని చాప్లిన్ మీద ప్రయోగిస్తారు. ఈ సన్నివేశంలో నవ్వు తెప్పిస్తూనే దాని ద్వారా యజమానుల దురాశనూ, కార్మికుల శ్రమ దోపిడీకి వారు చూపే ఆత్రుతనీ వ్యంగ్యంగా విమర్శించాడు చాప్లిన్. ఆ యంత్రంలో నట్లు బిగించీ బిగించీ చాప్లిన్ చివరికి పిచ్చెత్తిపోతాడు. ప్రపంచంలో అన్నీ అతనికి నట్లులాగానే కనిపిస్తాయి. పక్కనే వెళ్తున్న ఓ అమ్మాయి కోటుమీది గుండీలు సైతం అతనికి నట్లులాగానే కనిపిస్తాయి. వాటిని బిగించడానికి ఆమె వెంటపడి, చివరికి ఆస్పత్రి పాలవుతాడు.
ప్రజా కళాకారుడిగా చాప్లిన్ నాటి భౌతిక పరిస్థుతలకి స్పందించాడు. ఆవిధంగా తీసిన ఈ సినిమా తీసినందుకు ఆయన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 'మోడరన్ టైమ్స్' సినిమా కమ్యూనిస్ట్ అభిప్రాయాలు వెల్లడిస్తోందని అమెరికన్ పాలక వర్గాలు ఆయనమీద కక్షగట్టాయి. అప్పటివరకు చాప్లిన్‌ను ఆకాశానికెత్తిన పత్రికలు సందు దొరికితే ఆయన్ని విమర్శించడం, చిన్న విషయాలకు చిలువలు పలువలల్లి విష ప్రచారం చేశాయి. 

జెనీలియాని జనం ఇష్టపడతారా?

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'సత్యం' (2003)తో గ్రాండ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియాకి రాం సరసన నటించిన 'రెడీ' తర్వాత మరో హిట్ దక్కలేదు. 'శశిరేఖా పరిణయం', 'కథ', 'ఆరంజ్' సినిమాలు ఫట్టయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా రానా సరసన 'నా ఇష్టం' చేస్తోంది. ఇదివరకు 'సింహా' వంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన యునైటెడ్ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. వాస్తవానికి 'నా ఇష్టం' అనేది రాంగోపాల్‌వర్మ రాసిన పుస్తకం పేరు. ఆ పేరుని క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై జోగినాయుడు ఫిలించాంబర్ వద్ద రిజిస్టర్ చేశాడు. అల్లరి నరేశ్ హీరోగా, పరశురాం డైరెక్షన్‌లో ఆ పేరుతో సినిమాని తీయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చకపోవడంతో టైటిల్‌ని యునైటెడ్ మూవీస్ అధినేత పరుచూరి శివరామప్రసాద్‌కి ఇచ్చేశాడు. ఈ సినిమాలో మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు రానా. అతనితో జెనీలియా జోడీ ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో వ్యక్తమవుతోంది. 'బొమ్మరిల్లు', 'ఢీ', 'రెడీ' విజయాలతో టాప్ స్లాట్‌లోకి వస్తుందనుకున్న జెనీలియా హఠాత్తుగా వెనుకంజ వేయడం చిత్రమే. ముఖ్యంగా కృష్ణవంశీ తీసిన 'శశిరేఖా పరిణయం', 'భాస్కర్ తీసిన 'ఆరంజ్' సినిమాల్లో ఆమె ఓవరాక్షన్ ప్రేక్షకులకి చికాకు తెప్పించింది. దానివల్లే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు 'నా ఇష్టం'లో ఆమె నటన ఎలా ఉంటుందో వేచిచూడాలి. ఈ సినిమా అటు రానాకీ, ఇటు జెనీలియాకీ కీలకమే. చూద్దాం ఏమవుతుందో...