Monday, August 29, 2011

న్యూస్: జీవా సినిమాలొస్తున్నాయ్!

కొత్తగా ఓ నటుడి సినిమా హిట్టయితే అతను అంతకు ముందు నటించిన సినిమాలూ, ఆ తర్వాత నటించే సినిమాలూ వరుసపెట్టి రావడం తెలుగు చిత్రసీమలో జరిగే ఓ విశేషం. నిన్నటికి నిన్న 'వైశాలి' బాగా ఆడటంతో ఆది పినిశెట్టి తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో దిగుమతి అయిపోతున్నాయ్. ఇప్పుడు ఆ వంతు జీవాది. ఆర్.బి. చౌదరి కుమారుడైన జీవా నటించిన 'ఈ' సినిమా కొంత కాలం క్రితం తెలుగులో వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఏమంత పట్టించుకోలేదు. ఇప్పుడు అతడి 'రంగం' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేయడంతో అతడి తమిళ సినిమాలన్నిట్నీ తెలుగులో తీసుకు రావడానికి డబ్బింగ్ సినిమాల నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే అతని 'రౌతిరం' సినిమాని ఆర్.బి. చౌదరి స్వయంగా 'రౌద్రం' పేరుతో తెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా జీవా మరో రెండు సినిమాలు తెలుగులో డబ్బవుతున్నాయి. వాటిలో 'సింగం పులి' సినిమా 'సింహం పులి' పేరుతోనూ, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న 'వందాన్ వెండ్రాన్' సినిమా 'వచ్చాడు గెలిచాడు' పేరుతోనూ రాబోతున్నాయి. జీవా డ్యూయల్ రోల్ పోషించిన 'సింగం పులి' తమిళంలో 2011 మార్చిలో విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. ఇందులో అతని సరసన రమ్య, హనీరాజ్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'వచ్చాడు గెలిచాడు' సినిమాని ఆర్. కణ్ణన్ డైరెక్ట్ చేయగా తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అటు తమిళం, ఇటు తెలుగులో ఒకేసారి సెప్టెంబరులో ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాలతో జీవా మరింతగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతాడేమో చూడాలి.

మన చరిత్ర: తెలంగాణాలో తెలుగు జాతి సమైక్యతా నినాదం

ఆంధ్ర ప్రాంతంలో ప్రపంచ రాజకీయాల పట్ల ఎలాంటి అభిప్రాయాలుండేవో తెలంగాణాలో ఉన్న కమ్యూనిస్టులకూ అవే అభిప్రాయాలుండేవి. అదేవిధంగా 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం ఇక్కడా కార్చిచ్చులా వ్యాపించింది. స్థానిక నాజీ రూప నిజాం పాలకుల్నీ, వారి తాబేదార్లనీ దించడం తక్షణ సమస్యగా ఇక్కడి వామపక్ష భావాల యువకులు భావిస్తుండేవారు.
1944 భువనగిరి సభలనుండి అతివాద భావాలకు తెలంగాణాలో గౌరవం పెరిగింది. 1945 ఖమ్మం సభలు మహాసభల చైతన్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాయి. అంతవరకూ 'బాంచెను దొరా' అన్న నోళ్లు గ్రామాల్లో భూస్వాముల్ని నిలేసి ప్రశ్నించడం ఆరంభించాయి. జనం అక్రమ వసూళ్లు, వెట్టిచాకిరి, దౌర్జన్యాల్ని అడ్డుకోవడం ఆరంభించారు. అది 1946 జూలై 4, తెలంగాణా ప్రాంతంలో ఓ భూస్వామి విసునూరి రామచంద్రారెడ్డి. అతడు కర్కోటకుడు. పెల్లుబుకుతున్న కసితో కడివెండి ప్రజలు భూస్వాములకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య నాయకత్వాన ఓ ఊరేగింపు తీశారు. రామచంద్రారెడ్డి ఆ ఊరేగింపుమీద కాల్పులు సాగించాడు. అందులోనే కొమరయ్య నేలకొరిగాడు.
అదే దావానలంలా గ్రామాల్లో వ్యాపించి భూస్వాముల గడీల్ని పడగొట్టింది. అందిన ఆయుధాన్ని పట్టి ప్రజలు తమను తాము రక్షించుకున్నారు. 1946 నవంబరులో నిజాం ప్రభుత్వం.. ప్రజలు తమను కంటిపాపలా కాపాడుతున్నదనుకునే 'సంగాన్ని' నిషేధించింది. ఇంతలో 1947లో సంస్థానాలు మినహా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సంస్థానాల విలీనీకరణకు నిజాం ఎదురుతిరిగాడు. దాంతో సంస్థానంలోని కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర మహాసభ, సామాన్య ప్రజానీకం నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల సమైక్యత అనే నినాదానికి బాగా బలం వచ్చింది. విశాలాంధ్ర నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ నిజాంతో పోరాటానికి సిద్ధపడింది. స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆరంభించింది. నిజాం తొత్తులుగా ఇత్తెహాదుల్ ముసల్మీన్, రజాకార్లు ఈ ప్రజా పోరాటాన్ని అణచడానికి దౌర్జన్య చర్యలు సాగించారు. అంతటితో అన్ని నినాదాలు మరుగునపడి తెలుగు జాతి సమైక్యత అనేది నిజామును గద్దె దింపడంలోనే ఉందన్న భావం ఒక్కటే విజృంభించింది.

Sunday, August 28, 2011

న్యూస్: రెండు ఫ్లాపుల తర్వాత వస్తున్న కృష్ణవంశీ 'మొగుడు'

'చందమామ' వంటి హిట్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన 'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఇప్పుడు మరింత కసిగా 'మొగుడు'ని తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ని గోపీచంద్ చేస్తున్నాడు. "మగ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడూ మగాడు కాదు. అలాగే తాళి కట్టిన ప్రతివాడూ మొగుడు కాడు. బాధ్యతనెరిగినవాడు మగాడు అవుతాడు. మనసెరిగినవాడు మొగుడు అవుతాడు. 'మొగుడు' కథాంశం వెనుకవున్న విషయం ఇదే" అని చెప్పాడు కృష్ణవంశీ. గోపీచంద్‌తో ఇది ఆయనకి తొలి చిత్రం. గోపి నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని ఆయన చెబుతున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా ఇద్దరు నటిస్తున్నారు. ఒకరు తాప్సీ అయితే, మరొకరు శ్రద్ధా దాస్. వీరిలో ప్రధాన నాయిక తాప్సీ కాబట్టి గోపీచంద్ ఆమెకే 'మొగుడు' అని అర్థమైపోతుంది. ఈ సినిమాలో మరో ఆకర్షణ రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, రానా కాంబినేషన్‌లో ఎంతో నమ్మకంతో నిర్మించిన 'నేను నా రాక్షసి' సినిమా ఆడకపోవడంతో 'మొగుడు' బాక్సాఫీసు ఫలితం మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీసిన ప్రతి సినిమాకీ ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తూ వస్తున్న కృష్ణవంశీ ఈ సినిమాకీ ఆ కోణాన్ని జోడించి ఉంటాడని నమ్మొచ్చు. సెప్టెంబరులోనే రిలీజవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో... కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో... వెయిట్ అండ్ సీ.

న్యూస్: రెండు హిట్లు, రెండు ఫ్లాపులు!

ఇప్పటివరకు నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసిన సురేందర్‌రెడ్డి రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బ్యాలెన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'అతనొక్కడే', నాలుగో సినిమా 'కిక్'తో హిట్లు కొట్టిన అతను రెండు, మూడు సినిమాలైన 'అశోక్', 'అతిథి'లతో ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడతను తన ఐదో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఊసరవెల్లి'. అఫిషియల్‌గా ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అశోక్' చేశారు. ఆ సినిమాతో పరాజయం పొందిన వాళ్లు 'ఊసరవెల్లి'తో ఆ చేదు అనుభవాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. విపరీతమైన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథ వల్లనే 'అశోక్' ఫ్లాపయ్యిందని సురేందర్‌రెడ్డి గ్రహించాడు. అందుకే 'ఊసరవెల్లి'ని 'కిక్' తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఎన్టీఆర్, తమన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సురేందర్‌కి పర్మనెంట్ రైటర్‌గా మారిన వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి 'బృందావనం' ఫేం కొరటాల శివ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇదివరకు ఎన్టీఆర్ 'రాఖీ'కి సూపర్బ్ మ్యూజిక్‌నిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలనిస్తున్నాడు. 'ఛత్రపతి ప్రసాద్' నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పేరుపొందిన మోడల్ విద్యుత్ జామ్వాల్, రాంగోపాల్‌వర్మ సినిమా 'కాంట్రాక్ట్' ఫేం ఆద్విక్ మహాజన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మొత్తానికి 'ఊసరవెల్లి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే సురేందర్‌రెడ్డి తపని ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

న్యూస్: కమలినికి కొత్త అవకాశాల్లేవ్!

బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ప్రాభవం టాలీవుడ్‌లో దాదాపు అంతరించినట్లే కనిపిస్తోంది. 'ఆనంద్', 'స్టైల్', 'గోదావరి', 'గమ్యం', 'గోపి గోపిక గోదావరి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సన్నిహితమైన ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. వాటిలో 'పోలీస్ పోలీస్', 'మా అన్నయ్య బంగారం', 'నాగవల్లి', లేటెస్టుగా 'విరోధి' వంటివున్నాయి. అందంకంటే అభినయాన్నే ఎక్కువ నమ్ముకున్న ఆమెకి టాప్ హీరోలతో చేసే అవకాశాలు రాలేదు. వెంకటేశ్ సినిమా 'నాగవల్లి' చేసినా అది ఆయన సరసన హీరోయిన్ పాత్ర కాదు. నీలకంఠ డైరెక్ట్ చేసిన 'విరోధి'లో ఆమెది పేరుకు హీరోయిన్ పాత్రయినప్పటికీ మరీ చిన్న పాత్ర కావడం, పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడం వల్ల ఆమెకి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం ఆమె నటించిన 'రామాచారి' సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒకే పాజిటివ్ అంశం 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణు, ఆమె కలిసి నటించడం. వాళ్ల కలయికలోని తొలి సినిమా హిట్టవడం వల్ల 'రామాచారి'కి అది ప్లస్ అవుతుందని నిర్మాత, దర్శకుడు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు దానికి బిజినెస్ జరగకపోవడం గమనార్హం. అందుకే ఆగస్టులోనే రిలీజ్ కావలసిన ఆ సినిమా సెప్టెంబరుకి వాయిదా పడింది. ఈ సినిమా ఆడితేనే కమలినికి టాలీవుడ్‌లో మరో అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

Saturday, August 27, 2011

న్యూస్: తెలుగు సినిమాలో శ్రీలంక అందం!

ఓ తెలుగు సినిమా ద్వారా తొలిసారిగా ఓ శ్రీలంక అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ సినిమా 'మిస్టర్ రాస్కెల్' కాగా, ఆ అమ్మాయి నదీషా హేమమాలి. చక్కని ముఖ వర్చస్సు, మంచి ఫిజిక్ ఉన్న నదీషా ఈ సినిమాలో పరుచూరి రవీంద్రనాథ్ సరసన నటించింది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించిన ఆమెకి ఆడిషన్ నిర్వహించి ఈ సినిమాకి ఎంపిక చేశారు రచయితలు పరుచూరి బ్రదర్స్. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె మనోజ్ సినిమా 'ప్రయాణం' ద్వారా పరిచయమైన పాయల్ ఘోష్ అలియాస్ హారిక. ఇప్పటివరకు ప్రోమోస్‌లో పాయల్ స్టిల్సే ఎక్కువగా కనిపిస్తూ వచ్చాయి. అయితే దీనికి నదీషా పెద్దగా బాధ పడటం లేదు. "ఈ సినిమాలో ప్రేమ కోసం తపించే మధుమతి అనే ఇంపార్టెంట్ కేరక్టర్ చేశా. హీరోతో షేర్ చేసుకున్న ఓ ఇంటిమేట్ సీన్‌ని మర్చిపోలేను. ఆ సీనులో అడవిలో ఓ పాము నా పక్క నుంచి జరజరా పాక్కుంటూ వెళ్తుంది. నేను భయంతో హీరోని కావలించుకుంటా" అని ఆమె తెలిపింది. తెలుగు వాళ్లు చాలా ఆదరాభిమానాలు చూపిస్తున్నారనీ, అయితే తెలుగు భాష పలకడం తనకి కాస్త కష్టంగా ఉందనీ నిజాయితీగా చెప్పింది ఈ సింహళీ బ్యూటీ. తమిళ దర్శకుడు ఆర్.వి. ఉదయశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి బ్యాడ్ టాక్ నడుస్తున్నా నదీషా మాత్రం అందరి దృష్టిలో పడింది. రానున్న రోజుల్లో ఆమె మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

న్యూస్: విష్ణువర్థన్ సినిమాల్ని మిస్ చేసుకున్న రాం

రాం చాలా ఆనందంగా ఉన్నాడు. కారణం తెలిసిందే. అతని లేటెస్ట్ సినిమా 'కందిరీగ' బాక్సాఫీస్ వద్ద హిట్‌గా డిక్లేరయ్యింది. తొలిసారిగా ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో తనదైన ఎనర్జీతో నటించి అలరించాడు రాం. ప్రస్తుతం 'ఎందుకంటే ప్రేమంట' సినిమాని చేస్తున్న అతను మరో కారణంగా ఎగ్జయిట్ అవుతున్నాడు. అది గౌతం మీనన్ డైరెక్షన్‌లో పనిచేసే అవకాశం రావడం. 'ఏమాయ చేసావె' తర్వాత గౌతం డైరెక్షన్‌లో చేయాలని చాలామంది కుర్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ అవకాశం రాంకి దక్కింది. 'ఏమాయ చేసావె' హిందీ వెర్షన్‌ని డైరెక్ట్ చేశాక రాంతో అతని సినిమా మొదలవుతుంది. ఇది ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ రూపొందుతుంది. చాలా కాలం నుంచి తమిళంలో చేయాలని ఆశిస్తున్నాడు రాం. "నిజానికి సూపర్‌హిట్ సినిమా 'ప్రేమిస్తే'లో నేనే చేయాల్సింది. అలాగే విష్ణువర్థన్ డైరెక్షన్‌లో నటించే ఛాన్స్ రెండు సార్లు వచ్చింది నాకు. కానీ రకరకాల కారణాలతో వాటిని చేయలేకపోయా" అని అతను తెలిపాడు.
ఖాళీ దొరికిందంటే అద్దం ముందు గడపడానికి అతను ఇష్టపడతాడు. "నన్ను నేను కరెక్ట్ చేసుకోడానికీ, నేర్చుకోవడానికీ అద్దం నాకు బాగా ఉపయోగపడుతుంది. ఇటు హైదరాబాద్, అటు చెన్నై ఆఫీసుల్లో నా గదిలోని ఓ గోడకి పూర్తిగా అద్దం వేయించా. అద్దంలో మనల్ని మనం పరిశీలించుకుంటుంటే మన రూపాన్నీ, హావభావాల్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెషన్ పెడితే నా ఫేస్ ఎలా ఉండాలో నాకు తెలియాలి" అంటాడతను. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలంటే అతడికి చిరాకు. మిగతా కుర్ర హీరోలతో పోలిస్తే అతను బుద్ధిమంతుడే. "నేను తాగను. సిగరెట్లు కాల్చను. ఆడపిల్లలతో కలిసి తిరగను. పార్టీలకి వెళ్లను. తొందరగా పడుకుంటాను. అందుకే నన్నంతా అబ్‌నార్మల్ అంటుంటారు" అని నవ్వేస్తాడు.

Friday, August 26, 2011

న్యూస్: మహా 'దూకుడు'మీదున్న పాటలు

మహేశ్ సినిమా 'దూకుడు' పాటలు అదరగొడుతున్నాయ్. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తయారైన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. మహేశ్ సినిమాకి అతను పనిచేయడం ఇదే తొలిసారి. ఆగస్ట్ 18న అఫిషియల్‌గా విడుదలైన ఆడియో అప్పుడు మ్యూజిక్ చార్టుల్లో ముందుకు దూసుకుపోతోంది. ఇందులోని ఆరు పాటల్లో నాలుగు పాటల్ని రామజోగయ్యశాస్త్రి రాయగా, ఓ పాటని విశ్వా, ఇంకో పాటని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ముఖ్యంగా భాస్కరభట్ల రాయగా రంజిత్, దివ్య ఆలపించిన 'ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే' పాట శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'దూకుడు' ఆల్బంలో ఇదే నెంబర్ వన్ సాంగ్. ఈ పాటలో దివ్య గొంతులోంచి వచ్చిన 'దేత్తడి దేత్తడి' అనే మాటలు అలరిస్తున్నాయి. దీని తర్వాతి స్థానం టైటిల్ సాంగ్‌ది. "నీ దూకుడూ కాదెవ్వడూ' అంటూ సాగే ఈ పాటని విశ్వా రాయగా శంకర్ మహదేవన్ ఆలపించాడు. మిగతా పాటల్లో రాహుల్ నంబియార్ పాడిన సోలో సాంగ్ 'గురువారం మార్చి ఒకటీ', కార్తీక్, రీటా పాడిన డ్యూయెట్ 'చుల్‌బులీ నా చుల్‌బులీ', కార్తీక్, రామజోగయ్యశాస్త్రి, వర్ధని కలిసి పాడిన 'అదర అదరగొట్టు' పాట బాగున్నాయి. ఎన్.ఎస్. రమ్య, నవీన్ మాధవ్ పాడిన 'పువ్వాం పువ్వాం అంటాడు ఆటో అప్పారావు' పాట ఏమంత ఆకట్టుకునే రీతిలో లేదు. ఆల్బంలో ఇదొక్కటే వీక్ సాంగ్. ఇప్పటివరకు ఒకే రకంగా ట్యూన్స్ ఇస్తూ వస్తున్న తమన్ ఇందులోనూ అదే బాణీని అనుసరించాడు. 'ఇటు రాయే ఇటు రాయే', టైటిల్ సాంగ్ ఇందుకు ఉదాహరణలు. ఏదేమైనా పాటలు హిట్టవడంతో ఇక సినిమా రావడమే తరువాయి. 'పోకిరి' తర్వాత తమ హీరోకి సరైన హిట్టులేకపోవడంతో మహేశ్ ఫాన్స్ యమ ఆకలి మీదున్నారు. సినిమా ఏమాత్రం బాగున్నా పెద్ద హిట్టవడం ఖాయం.

న్యూస్: 'పిల్ల జమీందార్'కి బిజినెస్ లేదు!

తెలుగులో ఇటు 'సెగ', తమిళంలో అటు 'వెప్పం' రెండూ ఫట్టయ్యాక ఇప్పుడు నాని తర్వాతి సినిమాపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం అతను రాజమౌళి డైరెక్షన్‌లో 'ఈగ', కొత్త దర్శకుడు అశోక్ తీస్తున్న 'పిల్ల జమీందార్'లో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో ముందుగా రాబోతోంది 'పిల్ల జమీందార్'. ఈ సినిమాలో నాని సరసన హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లు. ఆ ఇద్దరూ సాధారణ తారలే కావడం గమనార్హం. భూమిక నిర్మించిన ఫ్లాప్ సినిమా 'తకిట తకిట' ద్వారా హరిప్రియ పరిచయం కాగా, నాలుగైదు సినిమాలు చేసినా ఒక్కటీ హిట్టులేని తార 'బిందుమాధవి'. ఇలాంటి తారలతో నటిస్తున్నందువల్ల ఈ సినిమా పట్ల బిజినెస్ వర్గాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ శైలేంద్ర సినిమాస్ బేనర్‌పై డి.ఎస్. రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. "జమీందారుగా నటిస్తున్న నాగినీడు ('మర్యాద రామన్న' ఫేం), ఆయన మనవడు 'పిల్ల జమీందార్'గా నటిస్తున్న నాని మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి' అని ఆయన చెప్పారు.
ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతేమంటే అవసరాల శ్రీనివాస్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. 'అష్టా చెమ్మా' ద్వారానే నాని, శ్రీనివాస్... ఇద్దరూ పరిచయమయ్యారు. తిరిగి వాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే నాని వ్యవహార శైలి పట్ల సినీ వర్గాలు పెదవి విరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పిల్ల జమీందార్' హిట్టయితేనే అతనికి విలువ. లేదంటే ఇబ్బందే.

ఇంటర్వ్యూ: వెంకటేశ్

మీరెక్కువగా రీమేక్స్‌ని ప్రోత్సహిస్తారెందుకు?
-మంచిది ఏ భాషలో దొరికినా ఆహ్వానించడంలో తప్పులేదనుకుంటా. సినిమా అనేది పెద్ద వ్యాపారం. కోట్లు ఖర్చు చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అలా ఓ భాషలో హిట్టయిన సినిమాని రీమేక్ చేయడంలో తప్పులేదనకుంటా. అయినా నేను తెలుగు కథలతోటే ఎన్నో హిట్లు సాధించాగా. బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నెం.1, క్షణ క్షణం, ధర్మచక్రం, పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, తులసి... ఇవన్నీ తెలుగు కథలేగా.
పాతికేళ్ల క్రితానికీ, ఇప్పటికీ పరిశ్రంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తే ఏమనిపిస్తుంది?
-అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. టెక్నికల్‌గా జరిగిన అభివృద్ధి సినిమా స్థాయిని మరింత పెంచింది. అలాగే కొత్త హీరోలు చాలామంది వచ్చారు. దర్శకులూ వచ్చారు. ఇదంతా మంచి పరిణామమే. కాకపోతే హీరోలకి తగ్గ సంఖ్యలో హీరోయిన్లు లేరు.
మీ ఇమేజ్‌కి తగ్గ కథలు ఇష్టపడతారా? కథని కథగా ఇష్టపడతారా?
-మొదట్నించీ నేను ఒకటే చెబుతున్నా. ఓ కథ నాకు నచ్చితే అందులో హీరో పాత్రలో నన్ను నేను మలచుకోడానికే ఇష్టపడతా.
సినిమా సక్సెస్‌లో కీక పాత్రధారి ఎవరు?
-ఇది సమష్టి కృషి. అందరూ కీలక పాత్రధారులే. ఇంతకుముందు సినీ పరిశ్రమ స్టార్స్ మీద ఆధరపడి ఉందన్నారు. ఇప్పుడు దర్శకులంటున్నారు. రేపు రచయితలు కావచ్చు. అయితే ఇదంతా సృజనాత్మక సృష్టి. అందరి సహకారమూ అవసరమే.
సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు?
-ఇన్ని అని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథలు దొరక్కపోవడం వల్ల ఓ సంవత్సరం తక్కువ చేయొచ్చు. కథలు నచ్చితే ఎక్కువ చేయొచ్చు. కథలను బట్టే ఈ సంఖ్య ఉంటుంది.
మీరు నటించిన సినిమాల్లో ఎక్కువ సక్సెస్‌లు కావడం వెనుకున ఉన్న రహస్యం?
-ఎక్కువ భాగం స్క్రిప్టుల ఘనత. పైగా లాభనష్టాలు తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులున్నందువల్ల హీరోల మీద కూడా బాధ్యత ఎక్కువైంది. ఏక కాలంలో ఐదు, ఆరు సినిమాలకు అడ్వాన్సులు తీసుకోవడం గాక, ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా సినిమాల్ని చేస్తున్నాం.
మీరు సినిమాల్ని ఎంచుకునే తీరులో ఈమధ్య బాగా మార్పు వచ్చినట్లుందే?
-ఎప్పటికప్పుడు వైవిధ్యంతో కూడిన పాత్రలు చేయాలన్న దృష్టితోనే తీసుకుంటున్న మార్పు ఇది. భావోద్వేగాలతో నిండిన మాస్ పాత్రలకే పరిమితం కాక, వీలైనంత ఎక్కువగా గుడ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఫిలింస్ చేయాలనీ, ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనీ భావిస్తున్నా. 'చింతకాయల రవి', 'నమో వెంకటేశ' అలా చేసినవే. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రల్ని వెతుక్కుంటా. ఇటు మాస్, అటు క్లాస్... అన్ని పాత్రలూ చేయాలన్నదే నా ఉద్దేశం.
సినిమాల మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడటం మంచిదేనా?
-ఒక సినిమా మీద భారీ అంచనాలు రావడం సహజం. అలా కావాలని ఎవరూ చేయడంలేదు. అదంతా మన చేతిలో కూడా ఉండదు. ఏ సినిమాకైనా సిన్సియర్‌గా పనిచేస్తా. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు ఎంత కష్టపడ్డానో ఇప్పుడూ అంత కష్టపడుతున్నా.

మన చరిత్ర: తెలంగాణాలో విశాలాంధ్ర కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం

ప్రజల్లో పెల్లుబుకుతున్న స్వాతంత్ర్య కాంక్ష తన గద్దెను కదిలిస్తుందేమోనన్న భయం నిజామును పట్టుకుంది. దాంతో 1942లో కొన్ని రాజకీయ సంస్కరణలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదే సంవత్సరం ధర్మవరంలో మాదిరాజు రామకోటేశ్వర్రావు అధ్యక్షత కింద జరిగిన తొమ్మిదో ఆంధ్ర మహాసభల్లో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రజాసామాన్యం ఎన్నుకున్న సభ్యులతో శాసనసభ ఏర్పడాలని మహాసభ నిర్ణయించింది. ఈ ఆంధ్రోద్యమ సభలు "ముఖ్యంగా భాష, విద్య, విజ్ఞానము, నీతి, సంస్కృతి అభివృద్ధికి పాటుపడగలవని" మాడపాటి హనుమంతరావు గారు అనేక వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో ప్రకటించారు.
"నాయకులే ఉద్యమానికి రాజకీయాలతో సంబంధం లేదని ఎంత ప్రకటించినప్పటికీ, ఉద్యమాన్ని చట్టబద్ధంగా నడవడానికి ఎంత కృషి చేసినప్పటికీ, ఆంధ్రోద్యమానికి ఉండే రాజకీయ ప్రాముఖ్యతను ఎవరూ విస్మరింపజాలరు. నలుదిశల అంధకారం వ్యాపించి ఉన్న ఆ రోజుల్లో ఎంత చిన్నదైనప్పటికి ఆంధ్రోద్యమం ఒక జ్యోతిగా వెలిగి ఇక్కడి ప్రజానీకానికి మార్గం చూపించిందనే విషయంలో సందేహం ఏమాత్రం లేదు. అటు పిమ్మట అభివృద్ధిచెందిన విశాల ప్రజా ఉద్యమానికి ఈ దశాబ్దంలో జరిగిన కృషి పునాదిగా నిలిచింది" అన్నారు రావి నారాయణరెడ్డి.
1939 నుండీ తెలంగాణా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ పనిచేయడం ఆరంభించింది. ఇది కూడా గ్రంథాలయ ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలుగు సంస్కృతీ పరిరక్షణ పోరాటాల రూపంలో పనిచేసింది. గ్రామాల్లో జనాన్ని చైతన్యవంతుల్ని చేయడం, నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాట దిశగా వాళ్లను మళ్లించడంలో కమ్యూనిస్టు పార్టీ బాగా కృషి చేస్తుండేది. విశాలాంధ్ర వాంఛనూ వాళ్లలో రగుల్కొల్పడంలో కూడా శాయశక్తులా శ్రమించింది. మునగాల రాజా ప్రజలపై చేసే నిర్బంధాలను వ్యతిరేకిస్తూ పెద్ద ప్రజా ప్రతిఘటనను నిర్మించింది. జాగీర్దార్లు తమ ప్రాంతాల్లో విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమీకరణ సాగించింది.

Thursday, August 25, 2011

ప్రివ్యూ: పూలరంగడు

సునీల్ మరోసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా 'పూలరంగడు'. ఇదివరకు అతను హీరోగా నటించిన 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' సినిమాలు సూపర్‌హిట్టవగా, 'అప్పల్రాజు' ఫ్లాపయింది. ఇప్పుడు 'పూలరంగడు' సినిమాని 'అహ నా పెళ్లంట' ఫేం వీరభద్రం డైరెక్ట్ చేస్తున్నాడు. 'ప్రేమ కావాలి' ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఇషా చావ్లా ఇందులో సునీల్ సరసన స్టెప్పులు వేస్తోంది. అదే సినిమాని నిర్మించిన మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సంస్థ సమర్పిస్తోంది. అదివరకు కొన్ని సినిమాలకు పనిచేసినా 'ప్రేమ కావాలి'తోటే లైంలైట్‌లోకి వచ్చిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇషా చావ్లాని చూస్తుంటే 'మైనే ప్యార్ కియా' హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుకొస్తున్నదని సినిమా ప్రారంభం రోజున చెప్పాడు సునీల్. అలా అతణ్ణి ఇంప్రెస్ చేసింది ఇషా. ఇదివరకు 'పూలరంగడు'గా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోగా, రాజేంద్రప్రసాద్ చెప్పుకోదగ్గ రీతిలో అలరించలేదు. ఇప్పుడు ఈ మూడో 'పూలరంగడు' ఏం చేస్తాడో చూడాలి.
2012 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వీ, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేశ్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: నాగేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.

ఇంటర్వ్యూ: జె.డి. చక్రవర్తి

"ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది'' అని చెప్పారు జె.డి. చక్రవర్తి. చక్రవర్తి ప్రొడక్షన్స్, ఫస్ట్ చాయిస్ మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించిన 'మనీ మనీ మోర్ మనీ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రనీ చేశారు. కె. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా చక్రవర్తి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు ముందే నిర్ణయించుకుంటారండీ. వాళ్లకి ఆ సినిమా మీద ఇంటరెస్ట్ ఉండాలి. అంతే. సినిమా బాగుందనే టాకే వాళ్లని థియేటర్లకి తీసుకువస్తుంది. కొన్ని సినిమాలకి ఎంత పబ్లిసిటీ ఇచ్చినా జనం రారు. కొన్నింటికి పెద్దగా లేకపోయినా జనం చూస్తారు.
ఇది స్క్రీన్‌ప్లే సీక్వెల్
ఇది సీక్వెలే కానీ మునుపటి వాటిలాంటి సినిమా కాదు. ఇది స్టోరీ సీక్వెల్ కాదు, స్క్రీన్‌ప్లే సీక్వెల్. 'మనీ' నుంచి కొన్ని పాత్రలు తీసుకున్నా. వాటి ప్రోగ్రెస్ ఉంటుంది కానీ కథ కొత్తది. ఈ కథ 2009లో మొదలవుతుంది. రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించిన ఖాన్‌దాదా 2011కు వచ్చేసరికి డబ్బంతా పోగొట్టుకుని ఉంటాడు. కాకపోతే జూబ్లీహిల్స్‌లో అతనికి పెద్ద ఇల్లుంటుంది. అప్పులపాలై దాన్ని అమ్మేసుకుందామని అనుకుంటుంటాడు. ఆ టైమ్‌లో నలుగురు వ్యక్తులు అతని ఇంట్లో ప్రవేశించి, అతన్ని ఎలా ఆడుకున్నారనేదే కథ. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎంతోమంది వస్తారు. వాళ్లందరి నుంచీ ఎదురైన సమస్యని ఖాన్‌దాదా ఎలా పరిష్కరించుకున్నాడనేది క్లైమాక్స్. ఖాన్‌దాదా ఇంట్లో ప్రవేశించే నలుగురు కిడ్నాపర్లుగా నేను, బ్రహ్మాజీ, ముకుల్‌దేవ్, కెవిన్ (మోడల్) నటించాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్. డబుల్ మీనింగ్స్, అసభ్యకరమైన మాటలు, సన్నివేశాలు ఉండవు.
బ్రహ్మానందం విశ్వరూపం
ఈ సినిమాలో ఎవరూ కామెడీ చెయ్యరు. సందర్భాలే కామెడీని సృష్టిస్తాయి. ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది. ఎలాగంటే ఆయన నటిస్తున్నప్పుడు 'కట్' చెప్పడం మర్చిపోయేవాణ్ణి. అలా నెగటివ్ ఎక్కువ ఖర్చయింది. ఆయన నటనలో ఎన్ని కోణాలున్నాయో అప్పుడు అర్థమైంది. ఖాన్‌దాదా ఇంట్లో, అతని చుట్టూ తిరిగే కథ కాబట్టి ఫోకస్ అంతా ఆయనమీద ఉండటం సహజం.
వాటిని ఇష్టపడి చెయ్యలేదు
'హోమం', 'సిద్ధం' నా తరహా సినిమాలు కావు. వాటిని నేను ఇష్టపడి చెయ్యలేదు. నాకు కామెడీ ఇష్టం. అందుకే బాపు, కె. విశ్వనాథ్ సినిమాలకంటే రాఘవేంద్రరావు, జంధ్యాల సినిమాలు ఎక్కువ ఇష్టం. నిజానికి నవ్వించడం కష్టమైన ప్రక్రియ. 'మనీ మనీ మోర్ మనీ' నా తరహా సినిమా. మనం అన్ని సినిమాల్ని కాక కొన్ని సినిమాల్నే ఎంజాయ్ చేస్తాం. అలాగే నేను చేసిన వాటిలో కొన్నింటినే ఎంజాయ్ చేశా. 'కాశి', 'సూరి, 'సర్వం' (తమిళం) వంటివి సరిగా ఆడలేదు. కానీ వాటిని ఎంజాయ్ చేశా. 'ఎగిరే పావురమా', 'హోమం' వంటివాటిని నేను ఎంజాయ్ చెయ్యలేదు. ఇక్కడ ఎంజాయ్ చెయ్యడమనేది ఆ సినిమా మేకింగ్‌కి సంబంధించింది. ఇప్పుడు 'మనీ మనీ మోర్ మనీ' మేకింగ్‌ని బాగా ఎంజాయ్ చేశా.
ఇదే తొలిసారి
ఒక సినిమాకి సీక్వెల్ రావడమనేది నాకు తెలిసి దేశం మొత్తం మీద 'మనీ మనీ'తోటే మొదలు. ఇప్పుడు సెకండ్ సీక్వెల్ రావడం ఇదే తొలిసారి. తొలి రెండు సినిమాలకి దర్శకుడు శివనాగేశ్వరరావు. నేను 'మనీ మనీ మోర్ మనీ' టైటిల్ రిజిస్టర్ చేసిన రెండు రోజులకి ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'మనీ మనీ మోర్ మనీ'తో ఇంకో సినిమా చేద్దామనుకుంటున్నానని ఆయన చెప్పారు. నేను నవ్వేసి, ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేశాననీ, సినిమా స్టార్ట్ చేస్తున్నాననీ చెప్పా. ఆయన 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.
నాది బాధ్యతారాహిత్యం
నా కెరీర్‌కి నాదే బాధ్యత. తెలుగులో వరుసగా మంచి హిట్లిచ్చి బూమ్‌లో ఉండగా రాము గారు (రాంగోపాల్‌వర్మ) రమ్మనగానే ఇక్కడన్నీ వదిలేసి బాంబే వెళ్లిపోయా. 'సత్య' సినిమా చేశా. ఆయన దగ్గరే ఉన్నా. ఇదంతా పరిణతి లేక, బాధ్యతారాహిత్యంతో చేసింది. నా కెరీర్‌ని ఎలా మలచుకోవాలన్నది నా చేతిలో పని. కానీ నేనప్పుడు అలా చెయ్యలేదు. అయితే జరిగినదానికి నేనేమీ బాధపడట్లేదు.

న్యూస్: 'శంఖం' దర్శకుడితో రవితేజ కొత్త సినిమా!

రవితేజ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఇదివరకు గోపీచంద్ హీరోగా 'శౌర్యం', 'శంఖం' సినిమాల్ని రూపొందించిన సినిమాటోగ్రాఫర్ శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న లాంఛనంగా మొదలైంది. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ "శివ సెన్సిబుల్ డైరెక్టర్. అతనికి మాస్ పల్స్ బాగా తెలుసు. అతను చెప్పిన కథ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది" అని చెబితే, "రవితేజ ఇప్పటివరకు చెయ్యని కేరక్టర్ ఇది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది" అని శివ తెలిపాడు. ఇంకా హీరోయిన్‌ని ఎంపికచేయని ఈ సినిమాకి ఇద్దరు తమిళ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఒకరు సంగీత దర్శకుడు విజయ్ ఆంథోని, మరొకరు సినిమాటోగ్రాఫర్ వెట్రి. ఇంకో చెప్పుకోదగ్గ సంగతేమంటే సీనియర్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తుండటం.
డైరెక్టర్ శివకి మాస్ పల్స్ బాగా తెలుసని రవితేజ అన్నాడు కానీ 'శంఖం' సినిమా చూసినవాళ్లు మాత్రం ఆ మాటలతో ఏకీభవించరు. నిజానికి అది క్రేజీ కాంబినేషన్‌తో తయారైన సినిమా. అదివరకు విలన్, హీరోయిన్‌గా 'వర్షం'లో నటించిన గోపీచంద్, త్రిష ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించడంతో విడుదలకి ముందు దానికి ఎంతో క్రేజ్ వచ్చింది. కానీ సినిమా చూశాక జనం ఉసూరుమన్నారు. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడి వాసన వేయడం, చాలా సీన్లు బోర్ కొట్టించడంతో 'శంఖం'ని వారు తిరస్కరించారు. దాంతో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భారీగా నష్టపోయారు. దానికి ఓవర్ బడ్జెట్ అవడం కూడా ప్రధాన కారణం. ఇప్పుడు రవితేజ సినిమాకి అతను ఖర్చుపెట్టించే దానిపైనే దాని విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాకపోతే రవితేజ అంటే మినిమం గ్యారంటీ హీరో కాబట్టి ఆ మేరకు నిర్మాతకి ఒకింత లాభం కలగవచ్చు.

Wednesday, August 24, 2011

న్యూస్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్!

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 2012 ఏప్రిల్ నుంచి ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ అంతకంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ కలవడం ఇదే తొలిసారి. ఎన్టీఅర్, పూరి కాంబినేషన్ సినిమాని నిర్మించే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ సినిమానీ నిర్మించబోతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్‌నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.

న్యూస్: మలయాళంలో తెలుగు కుర్రాడి హవా!

కేరళలోని యువతలో ఇవాళ బాగా పాపులరైన నటుడెవరో తెలుసా? మన అల్లు అర్జున్. అవును. తన తెలుగు సినిమాల మళయాళ డబ్బింగులతోటే అతను అంతటి పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు మరో కుర్ర తెలుగు నటుడు మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. అతను నిన్నటిదాక బాల నటుడిగా కనిపించిన కౌశిక్‌బాబు. ప్రస్తుతం ఆంధ్రప్రభ డైలీకి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న పి. విజయబాబు కుమారుడే కౌశిక్. తెలుగులో ప్రస్తుతం షూటింగులో ఉన్న జె.కె. భారవి సినిమా 'జగద్గురు ఆది శంకరాచార్య'గా టైటిల్ రోల్ చేస్తున్న కౌశిక్ మలయాళంలో నేరుగా ఓ సినిమాలో హీరోగా నటిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు 'నాద బ్రహ్మం'. ఒక తెలుగు నటుడు హీరోగా నటిస్తున్న తొలి మలయాళ సినిమా ఇది. ఇందులో ఇంకో విశేషమేమంటే కౌశిక్ డ్యూయల్ రోల్ చేస్తుండటం. "బాల అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఓ పాత్రనీ, కృష్ణ అనే మృదంగ విద్వాంసునిగా మరో పాత్రనీ చేస్తున్నా. ఈ రెండు పాత్రల మధ్య ఎంతో వైవిధ్యం ఉంది. బాల పాత్రలో స్టైల్, డైనమిజం ఉంటే, కృష్ణ పాత్రలో సంప్రదాయబద్ధంగా, కూల్‌గా కనిపిస్తా" అని చెప్పాడు కౌశిక్. అయ్యప్పస్వామి పాత్రలో మలయాళ మెగా టీవీ సీరియల్లో మెప్పించడమే అతడికి అక్కడ ఇంతటి పాపులారిటీని సంపాదించి పెట్టింది. అందుకే అతణ్ణి అక్కడ 'కుట్టి ఎన్టీఆర్' అని పిలుస్తున్నారు. పౌరాణిక సినిమాల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా మహానటుడు ఎన్టీఆర్ మలయాళీలకి సుపరిచితం. అన్నట్లు 'టక్కరి దొంగ'లో చేసిన మహేశ్ చిన్నప్పటి పాత్రతో అతను ఉత్తమ బాలనటునిగా నంది అవార్డును గెలుచుకున్నాడు. గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా సహజసిద్ధంగా అబ్బిన నటనా సామర్థ్యం, స్ఫురద్రూపంతోటే అతడు మలయాళీల మనసుల్ని గెలుచుకున్నాడు. తెలుగులోనూ ఆరోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాడు కౌశిక్.

న్యూస్: ఈ సారైనా ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ హిట్ కొట్టేనా?

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందబోతోంది. ఈ కాంబినేషన్‌లో తయారయ్యే రెండో సినిమాని బండ్ల గణేశ్ నిర్మించనున్నాడు. ఈ బండ్ల గణేశ్ మరెవరో కాదు. ఇదివరకు రవితేజతో 'ఆంజనేయులు', పవన్ కల్యాణ్‌తో 'తీన్‌మార్' నిర్మించిన హాస్యనటుడు గణేశ్‌బాబు. మనవాళ్లకి న్యూమరాలజీ అంటే పిచ్చి కాబట్టి, ఆ రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఇప్పుడు పూర్తిపేరుని తెరపేరుగా వాడుతున్నాడు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మాణమయ్యే ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్లో మొదలు కానున్నది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని సహజంగానే జగన్నాథ్ అందించనున్నాడు. "జగన్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చెయ్యాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులు, అభిమానులు, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది. జగన్, నేను కలిసి పనిచేస్తున్నామంటే అంచనాలు భారీగానే ఉంటాయి" అని చెప్పాడు ఎన్టీఆర్.
నిజమే. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరై ఆ సినిమా నిర్మాత గిరికి పీడకలగా పరిణమించిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా దెబ్బతో గిరి తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. 20 యేళ్ల వయసులో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఆ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. అంతేనా.. తండ్రి పాత్రకి జోడీగా అప్పటికే ముదురు తార అయిన సంఘవి చేయడం ఇంకా ఎబ్బెట్టు అనిపించింది ప్రేక్షకులకి. అందుకే ఆ సినిమాని మరో ఆలోచనకు తావులేకుండా తిరస్కరించారు. మిస్ కేస్టింగ్ అనేది ఓ మోస్తరు సినిమాని ఎలా ఘోరమైన సినిమాగా మారుస్తుందో 'ఆంధ్రావాలా' చక్కని ఉదాహరణ. చాలా సన్నిహితులైన ఎన్టీఆర్, జగన్నాథ్ కాంబినేషన్ రెండో సినిమాకి ఎనిమిదేళ్లు పట్టిందంటే ఆ సినిమా అనుభవమే కారణం. వచ్చే యేడాది రూపొందే ఈ రెండో సినిమా అయినా ఆ పీడకలని మర్చిపోయేలా చేస్తుందా?

Tuesday, August 23, 2011

మన చరిత్ర: నిజాం రాష్ట్ర ప్రథమ ఆంధ్ర మహాసభ

తెలంగాణాలోని ప్రతి జిల్లా, తాలూకాల్లో 'ఆంధ్ర జనసంఘం'కు శాఖలేర్పడ్డాయి. దీనితో గ్రంథాలయోద్యమాన్ని కూడా జోడించారు. తెలంగాణా అంతటా ఉన్న వివిధ ప్రజాసంఘాల సమన్వయ భారం మాడపాటివారు వహిస్తుండేవారు. చివరకు 1923 మార్చి నెలలో హనుమకొండలో ఓ సభ జరిగింది. తెలంగాణా అంతటినుండీ ఈ 'జనసంఘ' ప్రతినిథులు పాల్గొన్నారు. ఇందులోనే 'నిజాం రాష్ట్ర ఆంధ్రజన కేంద్రసంఘం' ఆవిర్భవించింది. ఈ సంఘం సభలు 1924 మార్చిలో నల్లగొండలోనూ (రెండవది), 1925 ఫిబ్రవరిలో మధిరలోనూ (మూడవది) జరిగాయి. నిజాం ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా 1928 మేలో సూర్యాపేటలో జరిగే సభవరకూ మధ్యకాలంలో సభలు జరగలేదు. అంటే నాలుగవ మహాసభ 1926లో జరగాల్సింది 1928లో జరిగింది. సాధారణంగా ఈ ఆంధ్రజన కేంద్రసంఘం సభలతో గ్రంథాలయ సభలూ, యువజన, వైశ్య యువజన, సంఘ సంస్కరణ, మహిళాసభలు కూడా జరుగుతుండేవి.
గ్రంథాలయాలు, పఠనాలయాలు, అప్పుడున్న తెలుగు పత్రికలు తెలంగాణాలోని తెలుగు ప్రజల్లో సాంస్కృతిక చైతన్యానికి విశేషంగా దోహదం చేశాయి. తెలుగు చరిత్రలో పరిశోధన చేసి కృషిచేయడం, తెలుగు ప్రజలకు తమ భాషలో, సంస్కృతిలో ఆసక్తి కలిగించడమే కాకుండా దాన్ని రక్షించుకోవాలన్న ధైర్యస్థయిర్యాల్ని కలిగించడం ఈ అన్ని సంఘాల ఆశయం. దానికి ఆనాడు ఉన్నవ వెంకట్రామయ్యను పూర్తికాలపు ప్రచారకునిగా ఈ సంఘం నియమించింది. ఈ సంఘం ఆశయాల్ని ఊరూ వాడా ప్రచారం చేశారాయన. ఈ కృషి క్రమంగా సమన్వయం చెంది 1930లో జోగిపేటలో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమ ఆంధ్ర మహాసభగా రూపుచెందింది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులు. 1931లో భువనగిరిలో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన రెండో మహాసభ, 1934 ఖమ్మంలో పులిజాల వెంకటరంగారావు అధ్యక్షతన మూడో మహాసభ, 1935లో సిరిసిల్లలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన నాలుగో మహసభలు జరిగాయి. 1936లో కొండా వెంకటరంగారెడ్డి, 1937లో ముందుముల నరసింగరావు (నిజామాబాద్) అధ్యక్షతన సభలు జరిగాయి.
1937 నుండి 1944 సభలవరకూ జరిగిన అన్ని ఆంధ్ర మహాసభల్లోనూ రావి నారాయణరెడ్డి నాయకత్వం కింద అతివాద భావాలు వెలువడటం ఆరంభమయ్యాయి. కార్యవర్గంలో చురుకుదనం రావాలనీ, కేవలం స్వాతంత్ర్య కాంక్షను నిజాం ప్రభువుకు విన్నవిస్తే సరిపోదన్న భావం ఈ యువకుల్లో ఉండేది. బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు, ఇంకా అనేకులు ఈ వర్గంలో ఉండేవారు.

న్యూస్: అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్న!

తమ్ముడు ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగి, తర్వాత దర్శకుడిగా 'అందమైన మనసులో', 'బ్రోకర్' సినిమాలు తీసి ఫెయిలైతే, ఇప్పుడు అన్న మెగాఫోన్ పట్టుకుని పరీక్షకు సిద్ధమయ్యాడు. అతని పేరు గౌతం పట్నాయక్. గౌతంని చూస్తే ఆర్పీ కంటే చిన్నవాడిగా కనిపిస్తాడు చూపులకి. ఇప్పుడతను 'కెరటం' అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. ఆగస్టు 26న రిలీజవుతున్నఈ సినిమా ద్వారా ప్రభాస్ కజిన్, కృష్ణంరాజు మరదలి కుమారుడు సిద్ధార్థ రాజ్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్నాడు. కన్నడంలో పెద్ద హిట్టయిన 'జోష్' కి ఈ సినిమా రీమేక్. ఆ సినిమాని నిర్మించిన ఎస్వీ బాబు ఈ సినిమాకీ నిర్మాత. గమనించాల్సిన సంగతేమంటే ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్‌గా పరిచయమైన 'అందమైన మనసులో' నిర్మాత కూడా ఆయనే. ఇప్పుడు ఆర్పీ అన్న గౌతంని కూడా ఆయనే డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నారు. "ఈ సినిమాలో హీరో టెన్త్ క్లాసులోనే ప్రేమలోపడి, పరీక్ష ఫెయిలవుతాడు. ఆ తర్వాత అతను ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరం. ప్రేమ కోసం తమ తల్లిదండ్రుల్నీ, చదువునీ, కెరీర్‌నీ పాడుచేసుకోవద్దనేది ఈ సినిమా చెప్పే సారాంశం. ఆకర్షణలో పడి స్నేహితులతో సహా సర్వం పోగొట్టుకున్న ఓ అబ్బాయి కథ ఇది. క్లైమాక్స్ రియలిస్టిక్‌గా, హృదయాల్ని తడిచేసే విధంగా ఉంటుంది" అని ఈ సినిమా గురించి చెప్పాడు గౌతం. 'కెరటం'లో హీరోయిన్లుగా కొత్తమ్మాయిలు రాకుల్, ఐశ్వర్య నటించగా, హీరో తండ్రి పాత్రని సీనియర్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు పోషించడం విశేషం. నిజానికి 'జోష్' చూసి తెలుగు రీమేక్ హక్కులు తీసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే ఒరిజినల్ నిర్మాతే తెలుగు రీమేక్ చేయడంతో, అందులో తనకి బాగా నచ్చిన హీరో తండ్రి పాత్ర చేసి, ఆ రకంగా సంతృప్తిచెందారు. మొత్తానికి ఈ సినిమాతో గౌతం పట్నాయక్ కెరీర్ 'కెరటం'లా దూసుకుపోతుందా?

న్యూస్: కామెడీతో 'మనీ మనీ మోర్ మనీ' వస్తుందా?

గురువు రాంగోపాల్‌వర్మ్‌తో పోలిస్తే జె.డి. చక్రవర్తికి ఎన్నో పోలికలు కనిపిస్తాయి. దెయ్యాలు, భూతాల మీదా, గేంగ్‌స్టర్ల మీదా కథలల్లి సినిమాలు తియ్యడం వాటిలో ఒకటి. అయితే కొన్ని ఇతర అంశాల విషయాలకొస్తే ఇద్దరికీ ఏమాత్రం పొంతన కుదరదు. 'నిశ్శబ్ద్', 'అప్పల్రాజు' లాంటి సినిమాల్ని తానెన్నటికీ తీయనంటాడు జేడీ. వర్మ పని రాక్షసుడూ, కుటుంబ అనుబంధాలకు అతీతుడూ అయితే, జేడీ ఎమోషనల్ మేన్. రాత్రి 7.30 గంటల తర్వాత ఇంటికి వెళ్లకుండా అతణ్ణి ఏ శక్తీ ఆపలేదు. ఎందుకంటే అమ్మకోసం. ఇటీవలి కాలంలో వర్మ చాలా వివాదాల్లో ఇరుక్కొని, మీడియాలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నా వర్మని తాను తొలిసారి చూసినప్పటికీ, ఇప్పటికీ ఆయనలో తనకి కనిపించిన మార్పేమీ లేదంటాడు జేడీ. తన తోటివాళ్లంతా ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్ ద్వారానో తమ భావాల్ని పంచుకుంటుంటే అతను మాత్రం వాటికి చాలా దూరంగా ఉంటున్నాడు. తనెప్పుడు ఏం చేసేదీ జనానికి తెలియాల్సిన పని లేదనేది అతడి సమాధానం. ప్రస్తుతం అతను 'మనీ మనీ మోర్ మానీ' అనే తెలుగు సినిమా డైరెక్షన్‌లో మునిగి ఉన్నాడు. ఇది 'మనీ'కి రెండో సీక్వెల్ అనీ, అయితే ఇది కొత్త కథనీ అతను తెలిపాడు. ఇదివరకటి సినిమాల్లో నటించిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "ఖాన్‌దాదా (బ్రహ్మానందం) కరాటేలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. రియల్ ఎస్టేట్ బూంలో బాగా సంపాదించిన ఖాన్‌దాదా జూబ్లీహిల్స్‌లో మంచి ఇల్లు కొనుక్కుంటాడు. అయితే 2011కి వచ్చేసరికి అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టాలనుకుంటాడు. ఆ టైంలో అతనింట్లోకి నలుగురు కిడ్నాపర్లు ప్రవేశించి అతనితో ఎలా ఆడుకున్నారనేదే కథ.ఈ సినిమా కథ బ్రహ్మానందం చుట్టూ నడుస్తుంది. ఆయన లేకుండా ఈ సినిమాని మెప్పించలేను. బ్రహ్మానందం విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది" అని చెప్పాడు జేడీ. ముందటి సినిమాల్లో బ్రహ్మానందం మీద తీసిన 'భద్రం బే కేర్‌ఫుల్ బ్రదరూ', 'వారెవా యేమి ఫేసు' మాదిరిగానే ఈ సినిమాలోనూ బ్రహ్మానందంపై ఓ పాటని అతను తీశాడు. 'హోమం', 'సిద్ధం' వంటి యాక్షన్ సినిమాల్ని జగపతిబాబుతో తీసిన జేడీ ఇప్పుడు బాణా మార్చి కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ఆశిస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలిస్తుందా?

Sunday, August 21, 2011

న్యూస్: తెలుగులో మరిన్ని అవకాశాల కోసం...

మొదట 'కిక్'లో, తర్వాత 'కల్యాణ్‌రాం కత్తి'లో, తిరిగి 'వీర'లో తన పాత్రలతో ఆకట్టుకున్న తమిళ నటుడు శ్యాం అసలు పేరేమిటో తెలుసా? షంషుద్దీన్ ఇబ్రహీం. అవును అతను ముస్లిం. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల నటుడు తెలుగులో రవితేజతో 'కిక్', 'వీర' సినిమాలు చేశాక అతనికి మంచి స్నేహితుడైపోయాడు. అయితే రవితేజని తాను 'భయ్యా' అని పిలుస్తానని అతను తెలిపాడు. తనకి ఇక నుంచీ పోలీసు పాత్రలు కాకుండా వేరే ఇంకేవైనా పాత్రలు ఇవ్వమని తెలుగు దర్శకుల్ని కోరుతున్నాడు. "కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయడానికి నాకు అభ్యంతరం లేదుకానీ కంప్లీట్ విలన్ రోల్స్ అంటే చెన్నైలోని నా లేడీ ఫాన్స్ ఫీలవుతారు. వాళ్లు నన్ను లవర్ బాయ్‌గా చూడాలనుకుంటూ ఉంటారు" అని నవ్వేస్తాడు శ్యాం.
'కల్యాణ్‌రాం కత్తి'లో తను చేసిన ఎమోషనల్ సీన్లు చాలా బాగా వచ్చాయనీ, కానీ ఫైనల్ ఎడిటింగ్‌లో వాటిని కత్తిరించేశారని కాస్త బాధని వ్యక్తం చేశాడు. అయితే దాని గురించి అతడేమీ నెగటివ్‌గా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడో జనం ముందుకు వచ్చేసింది. అతను మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఆశిస్తున్నాడు. అయితే 'క్షేత్రం', 'బెజవాడ రౌడీలు' కాదనుకున్నాడు. ప్రస్తుతం అతను ఎన్టీఆర్ సినిమా 'ఊసరవెల్లి'లో చేస్తున్నాడు. 'కిక్'లో చేసేప్పుడు డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో ఏర్పడిన స్నేహమే ఈ సినిమా అవకాశాన్నిచ్చింది. "సెప్టెంబర్ తర్వాత తెలుగు సినిమాలకు ఎక్కువ కాల్షీట్లు ఇద్దామనుకుంటున్నా" అని చెప్పాడు శ్యాం. 'ఊసరవెల్లి'తో పాటు '6' అనే ద్విభాషా చిత్రాన్ని అతను చేస్తున్నాడు. ఆ సినిమాని అతని కజినే నిర్మిస్తున్నాడు. 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాకి దురై దర్శకుడు. ఇదివరకు అతను శింబు హీరోగా 'తొట్టిజయ'ని డైరెక్ట్ చేశాడు. "ఈ సినిమాలో నేను నాలుగు గెటప్పుల్లో కనిపిస్తా. ఇందులోని కేరక్టర్ కోసం 15 కిలోల బరువు తగ్గా" అని చెబుతున్న శ్యాం తెలుగులో మరిన్ని అవకాశాలతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడేమో చూద్దాం.

న్యూస్: కీరవాణి పాటలు అలరించేదెప్పుడు?

తెలుగు చిత్రసీమలో సంగీతం తెలిసిన అతికొద్దిమంది సంగీత దర్శకుల్లో అగ్రగణ్యుడైన ఎం.ఎం. కీరవాణి 2010 సంవత్సరపు నది అవార్డు విజేతల్లో ఒకరు. చిత్రమేమంటే ఆయనకు నది అవార్డు వచ్చింది సంగీత దర్శకుడిగా కాదు, గాయకుడిగా! ఎస్.ఎస్. రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న'లో పాడిన 'తెలుగమ్మాయీ' అనే పాటకి గాను ఆయనకు నంది అవార్డుల జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. ఇక సంగీత దర్శకుడిగా 'సింహా' చిత్రానికి గాను చక్రి నంది అవార్డును సాధించాడు. మిగతా వాళ్లకు లాగా కాకుండా సెలక్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకునే కీరవాణికి 2011లో చెప్పుకోదగ్గ సినిమా ఏదంటే 'బద్రినాథ్' మాత్రమే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడటంతో అందులోని పాటలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి. ఓవైపు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, లేటెస్ట్‌గా తమన్ టాలీవుడ్‌ని ఏలుతుంటే, వాళ్లందరికంటే సీనియర్ మాత్రమే కాక, సంగీత పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న కీరవాణి అతి తక్కువ సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఆయన సంగీతం కూర్చిన రెండు సినిమాల పాటలు జనం నోళ్లలో నానడం ఖాయమని సంగీతజ్ఞులు భావిస్తున్నారు. ఆ రెండింటిలో మొదటగా రాబోతున్న సినిమా 'రాజన్న'. నాగార్జున కథానాయకుడిగా వి. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. అలాగే రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'కి సహజంగానే ఆయన సంగీత దర్శకుడు. రాజమౌళి - కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌గా హిట్టే. అందువల్ల 'మగధీర' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కొంతకాలంగా వెనుకపట్టులో ఉన్నట్టనిపించిన కీరవాణి ఈ సినిమాలతో మళ్లీ తన సత్తా చూపిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Saturday, August 20, 2011

ప్రివ్యూ: బిజినెస్ మేన్

హీరో మహేశ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'బిజినెస్ మేన్'. వాళ్ల తొలి సినిమా 'పోకిరి' అంతకు మునుపటి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసి, తెలుగులో తొలిసారిగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. 'బిజినెస్ మేన్'ని ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ తీస్తోంది. ఆ బేనర్‌లో చేయడం ఇటు మహేశ్‌కీ, అటు జగన్నాథ్‌కీ ఇదే తొలిసారి. డా. వెంకట్ నిర్మాతగా, వి. సురేశ్‌రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. "ఇంతవరకు నేను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులో హీరో కేరక్టర్ ద బెస్ట్ అనిపించేలా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా సబ్జెక్ట్ నడుస్తుంది" అని జగన్నాథ్ చెప్పగా "ఈ కథ విన్నప్పట్నించీ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నా. హీరో రోల్ అసాధారణంగా ఉంది. జగన్నాథ్ కాంబినేషన్‌లో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజిలోనే ఈ సినిమా ఉంటుంది" అని మహేశ్ తెలిపాడు.
2012 సంక్రాంతికి (జనవరి 12న) రిలీజయ్యే ఈ సినిమాకి సంగీతం: ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

మన చరిత్ర: తెలంగాణలో ఆంధ్రోద్యమ ఆరంభం

1901లో హైదరాబాద్ నగరంలో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏర్పడింది. కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజా నాయని వెంకటరంగారావు దీన్ని తెలుగు గ్రంథాలయంగా స్థాపించారు. దీని తర్వాత వరుసగా తెలంగాణా అంతటా గ్రంథాలయాలు ఆవిర్భవించాయి. ఇవి నాడు కేవలం పఠనాలయాలుగా మాత్రమే కాకుండా పాఠశాలలు, వయోజన విద్యానిలయాలు, సాంస్కృతిక, రాజీయాభిప్రాయాల చర్చావేదికలుగా కూడా ఉపయోగపడుతుండేవి.
సరిగ్గా అదే కాలంలో ఇక్కడ యాదవ, ముదిరాజ, మున్నూరు, పద్మశాలి, గౌడ తదితర వర్ణాలవారి సభలూ జరగడం ఆరంభమయ్యాయి. సంఘ సంస్కరణ, జీవరక్షా ప్రచారాలు కూడా ముమ్మరమయ్యాయి. హిందూ సంఘ సంస్కార సభ, ఆది హిందూ సేవాసమితిలాంటి సంస్థలు ఆవిర్భవించాయి. నాడిక్కడున్న పత్రికలు చాలా తక్కువ. నీలగిరి, గోలకొండ, తెనుగు ప్రతిభ, సుజాత వంటివి ఉండేవి. ఉర్దూలో అనేక పత్రికలుండేవి.
తెలంగాణా ప్రాంతం ఉన్న చారిత్రక పరిస్థితిననుసరించి విభిన్న భాషలవారూ ఉన్నారు. ఇక్కడి తెలుగువారికి కన్నడిగులు, మహారాష్ట్రులు, ఉత్తర హిందూస్థానీయులు, మహమ్మదీయులవంటి ఆంధ్రేతర భాషీయులతో సత్సంబాంధాలుంటుండేవి.
1921లో ఓ సంఘటన జరిగింది. నవంబరులో హైదరాబాద్‌లోని వివేకవర్థినీ థియేటరులో హిందూ సంస్కార సభలు జరిగాయి. ఆ సభలకు సరళాదేవి చౌధరాణి అధ్యక్షత వహించారు. అనేకమంది వక్తలు హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. అల్లంపల్లి వెంకట్రామారావు అనే న్యాయవాది తెలుగులో మాట్లాడటం ఆరంభించగానే సభలోని ఆంధ్రేతరులు అల్లరిచేయడం ఆరంభించారు. సభలో ఈలలు, కేకలు. సభాధ్యక్షురాలు కూడా వక్తను ఆపడానికి ప్రయత్నించారు. వెంకట్రామారావు తమ ఉపన్యాసం ఆపక తప్పిందికాదు. తెలుగువాళ్లలో ఈ సంఘటన ఆవేశానికి దారితీసింది. తర్వాత కొద్ది రోజులకు హైదరాబాద్‌లోని ట్రూప్ బజారులో ఉన్న టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగువాళ్లు సమావేశమై 'ఆంధ్రజన సంఘం' అనే పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటుచేశారు. మాడపాటి హనుమంతరావును కార్యదర్శిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఆంధ్రోద్యమంగా పైకి రావడానికి అది నాంది.

Friday, August 19, 2011

న్యూస్: 'దూకుడు'తో తేలనున్న శ్రీను వైట్ల సత్తా!

మహేశ్ హీరోగా నటిస్తున్న 'దూకుడు'తో శ్రీను వైట్ల అసలు సత్తా ఏమిటో తేలిపోతుందని ఫిలింనగర్ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. డైరెక్ట్ చేసిన 11 సినిమాల్లో ('దూకుడు' 12వ సినిమా) 6 హిట్లున్న శ్రీనుకి మునుపటి సినిమా 'నమో వెంకటేశ' నిరాశని కలిగించింది. వెంకటేశ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్ పాత్రని శ్రీను తీర్చిదిద్దిన విధానం విమర్శలకి తావిచ్చింది. వెంకటేశ్ ఈ సినిమాలో బ్రహ్మానందం కేరక్టెర్‌ని మించి జోకర్‌గా కనిపించిందని చాలామంది విమర్శించారు. అయితే ఈ విమర్శలేవీ అతనితో మహేశ్ పనిచేయడాన్ని ఆపలేకపోయాయి. ఎందుకంటే 'ఢీ' నుంచి 'కింగ్' దాకా వరుసగా శ్రీను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం. యాక్షన్‌కి అతను జోడించే వినోదం ఇప్పటివరకూ సత్ఫలితాల్నే ఎక్కువగా ఇస్తూ వచ్చింది. అందుకే అతని డైరెక్షన్‌లో చేయాలని మహేశ్ భావించాడు. అలా 'దూకుడు' సినిమా రూపుదాల్చింది. శ్రీనుతో 'నమో వెంకటేశ'ని తీసిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థే ఈ సినిమానీ నిర్మిస్తోంది. విడుదలైన పాటలకి రెస్పాన్స్ మాత్రం అదిరింది. కొట్టిన ట్యూన్లే కొట్టే తమన్ ఈసారి కొన్ని డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చాడు. రామజోగయ్యశాస్త్రి, విశ్వా రాసిన పాటలు బాగున్నాయి. ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా తీసుకుంటూ వస్తున్న శ్రీను 'దూకుడు'తో తొలిసారి తమన్‌తో పనిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మహా 'దూకుడు' మీదున్న తమన్ టైటిల్‌కి న్యాయం చేశాడు. కాగా 'దూకుడు' ప్రోమోస్‌లో మహేశ్ చాలా బాగున్నాడనే పేరు వచ్చింది. ఇక సినిమాలో అతణ్ణి శ్రీను ఎలా చూపించాడు, దానికంటే కూడా సబ్జెక్ట్ ఎలా చేశాడు, స్క్రీన్‌ప్లేని ఎలా అల్లాడు.. అనే అంశాల మీదే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది ఆధారపడి ఉంది. 'నమో వెంకటేశ' రిజల్ట్‌తో 'దూకుడు'ని అతడు కసిగా తీశాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 'దూకుడు' తర్వాత శ్రీను టాప్ డైరెక్టర్‌గా మరింత డిమాండ్ పొందుతాడో, లేదో చూడాల్సిందే.

న్యూస్: 2012లో హీరోగా పరిచయం కానున్న వరుణ్‌తేజ్

రాంచరణ్, జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిన 'ఆరెంజ్' సినిమా షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు అంజనా ప్రొడక్షన్స్ అధినేత నాగబాబు. డిజాస్టర్ కావడంతో ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లయ్యింది. ఈ సినిమా అనుభవం తర్వాత అతని అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కల్యాణ్ అతనికి సపోర్ట్‌గా నిలిచారు. తనకైనా, కల్యాణ్‌కైనా ఇప్పుడు చిరంజీవే తండ్రిలాంటివాడని తండ్రిని కోల్పోయిన ఆయన భావిస్తున్నారు.
త్వరలో నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరమీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "2012లో వాడు హీరోగా పరిచయమయ్యే సినిమా మొదలవుతుంది. ఈలోగా హీరోకి అవసరమైన అన్ని అంశాల్లోనూ వాడు తర్ఫీదు అవుతున్నాడు. అశ్వనీదత్ వాణ్ణి హీరోగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్‌లో నటిస్తాడు" అని ఆయన చెప్పారు. వరుణ్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ "వాడికి మేం ప్లాట్‌ఫాం మాత్రం అమరుస్తాం. వాడు సక్సెస్ అయ్యేదీ, లేనిదీ వాడి ప్రతిభా పాటవాల మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ల కుటుంబం నుంచి వస్తున్నందువల్ల వాడి మీద ఆ వత్తిడి సహజంగానే ఉంటుంది. దాన్ని వాడు అధిగమించ గలగాలి" అని నిర్మొహమాటంగా ఆయన చెప్పారు.

బిగ్ స్టోరీ: మన 'విలన్'పై చిన్న చూపెందుకు?

సాధారణంగా మన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మూడుంటాయి. హీరో, హీరోయినూ, విలనూ. హీరో హీరోయిన్లుగా అందమైన వాళ్లనే ఎంచుకుంటారు. కానీ విలన్‌కి మాత్రం ఎంత క్రూరంగా కనిపించే ముఖమైతే అంత నప్పుతుందని అట్లాంటి వాళ్లని గాలించి మరీ మన సినిమావాళ్లు విలన్లని చేస్తుంటారు. మన సినిమా విలన్లకు లేని దుర్గుణాలు కానీ, వాళ్లు చెయ్యని ఘోరాలు కానీ వుండవు. తెరమీద కనిపించడమే తాము చాలా దుర్మార్గులమని గట్టిగా చెప్పుకుంటారు. వాళ్లెంతటి దుర్మార్గంగా వుంటారంటే తేడా వస్తే తమ మనిషిని కూడా అతి సులువుగా చంపేస్తూ వుంటారు. కొంతమంది విలన్లు సూటూ బూటూ వేసుకుని పైకి బాగా మంచివాళ్లుగానే కనిపించినా వాళ్లు చేసేవన్నీ దుర్మార్గపు పనులే. కొంతమందయితే నల్ల కల్లజోళ్లు పెట్టుకునో, ఒక కన్ను లేకుండానో, చెంపమీద పెద్ద గాటుతోనో, ఒక చెయ్యి లేదా ఒక కాలు లేనివాళ్లుగానో కనిపించి అసలు సిసలు విలన్లు తామే అనిపిస్తుంటారు. ఈ ప్రతినాయకుల ముఖ్య కర్తవ్యం హీరో హీరోయిన్లని తిప్పలు పెట్టడం, వాళ్లు కలుసుకోకుండా చూస్తూ రీళ్లని పెంచడం. ఈ పనికోసం సినిమా ఆరంభం నుంచి ఆఖరుదాకా హీరోయిన్ వంక కోరచూపులు చూస్తూవుంటారు. ఈ విలన్లకు గుర్రపుస్వారీ, ఫైట్లు అన్నీ బాగావచ్చు. హీరోకంటే కూడా వాటిలో అతడికి ఎక్కువ సామర్థ్యం వుంటుంది. కండబలంతో పాటు తెలివితేటలూ ఎక్కువే. అయితే రచయితా, దర్శకుడూ, కథా - వీళ్లంతా కుట్రతో విలన్నే ఎప్పుడూ ఓడిస్తూ వుంటారు. సినిమా ఆఖర్న విసిగిపోయిన విలన్ చావనైనా చస్తాడు లేదంటే పోలీసులతో సంకెళ్లయినా వేయించుకుంటాడు. లేదంటే బుద్ధి వచ్చిందని లెంపలేసుకుంటాడు. మొత్తానికి ఈ విలనే లేకపోతే హీరోగారి హీరోయిజం బయటపడదు కాబట్టి నూటికి తొంభై అయిదు సినిమాలకి ఈ విలనే ఆధారం.
ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే ఇంతటి ప్రాధాన్యత వున్న విలన్ పాత్రధారుల్ని ఇవాళ మన సినిమావాళ్లు చిన్నచూపు చూస్తున్నారని. అలనాటి గోవిందరాజుల సుబ్బారావు నుంచి ఇప్పటి జయప్రకాశ్‌రెడ్డి దాకా విలనిజాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నా వాళ్లకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పటివాళ్లు చాలా మెరుగు. గోవిందరాజుల సుబ్బారావు, సీఎస్సార్ ఆంజనేయులు, ధూళిపాళ, ఎస్వీ రంగారావు, ముక్కామల, రాజనాల, జగ్గయ్య, ఆర్. నాగేశ్వరరావు, నాగభూషణం, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి విలన్ పాత్రధారులకి పేరు ప్రతిష్ఠలూ, గౌరవమూ దక్కాయి. శకుని పాత్ర పోషణలో సీఎస్సార్, ధూళిపాళ; విశ్వామిత్ర పాత్రలో ముక్కామల; రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రల్లో ఎస్వీ రంగారావు; దుష్ట మాంత్రికుడి పాత్రలో ఎస్వీ రంగారావు, రాజనాల; దుష్ట సైన్యాధిపతి పాత్రలో రాజనాల; 'అల్లూరి సీతారామరాజు'లో బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్ పాత్రలో జగ్గయ్య పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎస్వీ రంగారావు కేవలం దుష్ట పాత్రల్లోనే కాకుండా సాత్త్విక పాత్రల్లోనూ గొప్పగా రాణించి మహానటుడు అనిపించుకున్నారు.
ఆయన తర్వాత అట్లాంటి ఖ్యాతి కైకాల సత్యనారాయణకీ, కోట శ్రీనివాసరావుకీ దక్కింది. హీరోగా వచ్చి విలన్‌గా నిలదొక్కుకొని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందిన సత్యనారాయణని అందుకే అందరూ 'నవరస నటనాసార్వభౌమ' అనేది. కేవలం డైలాగ్ మాడ్యులేషన్‌తోటే విలన్లుగా గొప్పగా రాణించినవాళ్లు నాగభూషణం, రావు గోపాలరావు. సీరియస్ విలనిజంలో హాస్యాన్ని జోడించి మాటని విరిచి మాట్లాడే నాగభూషణాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. డైలాగుల్లో గోదావరి యాసని జోడించి కొన్ని మాటల్ని వత్తి పలుకుతూ విలన్‌గా రావు గోపాలరావు కొత్త రూపంతో కనిపించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. 'ముత్యాల ముగ్గు', 'యమగోల' చిత్రాల్లో ఆయన డైలాగుల్ని ఇప్పటికీ చాలామంది తెలుగువాళ్లు మరచిపోలేదు. 'అహ నా పెళ్లంట'లో పిసినారి విలన్‌గా, 'గాయం'లో గుండు విలన్‌గా కోట శ్రీనివాసరావు నటనకి శభాష్ అన్నారు ప్రేక్షకులు. ఒక్క విలన్‌గానే కాక హాస్య పాత్రల్లోనూ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తను తక్కువవాణ్ణి కానని కోట నిరూపించుకున్నారు.
ఇంతమంది నటులు విలన్‌గా రాణించి హీరోలతో పాటే (తక్కువగానైనా) స్థిరంగా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు అట్లాంటి స్థిరమైన విలన్ వేషధారులు కనిపించకపోవడమే బాధాకరం. జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి వంటి నటులు విలన్ వేషాల్లో మెప్పిస్తున్నా వాళ్లు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో జయప్రకాశ్‌రెడ్డి విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా తగినన్ని అవకాశాలు మన నిర్మాతలు, హీరోలు ఇవ్వడం లేదు. అతను ఆహార్యంలో కానీ, హావభావాల్లో కాన్నీ పచ్చి దుర్మార్గాన్ని పలికించడంలో నేర్పరి. ఇతన్ని తెలుగు చిత్రసీమ సరైన రీతిలో వినియోగించుకుంటే ఈసరికే తిరుగులేని విలన్ అయ్యుండేవాడు. 'మాతృదేవోభవ', 'నువ్వు నేను' సినిమాల్లో అతి క్రూరమైన విలన్ పాత్రల్లో బాగా రాణించిన తనికెళ్ల భరణిని విలన్‌గా కంటే హాస్య నటుడి పాత్రల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి భరణిని హాస్యనటుల జాబితాలోనే వేసుకోవాలి. చలపతిరావుది మరో రకం కథ. పక్కా విలన్‌గా కనిపించే రూపం వున్నా ఎందుకనో పరిశ్రమ ఆయన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. తెలుగులో ద్వితీయ శ్రేణి సినిమాల్లోనే ఎక్కువగా ప్రధాన విలన్ పాత్రలు వేసిన ఆయన 'నిన్నే పెళ్లాడుతా' నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు.
ప్రస్తుతం విలన్ వేషాల్లో పేరు తెచ్చుకుంటున్న వాళ్లంతా హీరో వేషాలు వేయడానికే ఆసక్తి చూపిస్తూ రావడం గమనార్హం. హీరోగా పరిచయమై, మళ్లీ అవకాశాలు లేకపోవడంతో 'జయం'తో విలన్‌గా మారిన గోపీచంద్ ఆ పాత్రలకి అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. 'వర్షం', 'నిజం' సినిమాలు ఆ కోవలేనివే. తెలుగు సినిమాకి మంచి తెలుగు విలన్ లభించాడని అందరూ ఆనందిస్తున్న కాలంలోనే అనూహ్యంగా 'యజ్ఞం'తో హీరో అయిపోయాడు గోపీచంద్. ఇప్పుడు ఆ పాత్రల్లో తనకంటూ సొంత ఇమేజ్ కూడా సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కుర్ర విలన్లు అజయ్, సుబ్బరాజు కూడా హీరో పాత్రల కోసం ట్రై చేస్తున్నారు. అజయ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించేశాడు కూడా. సుబ్బరాజు కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.
మనం ఇక్కడ ఇంకో ఇద్దరు నటుల గురించి కూడా చెప్పుకోవాలి. విలన్లుగా పేరు తెచ్చుకుని, తర్వాత హీరోలుగా కూడా రూపాంతరం చెంది, అట్లా కూడా పేరు తెచ్చుకున్న ఆ నటులు - మోహన్‌బాబు, శ్రీహరి. కొత్తరకం డైలాగ్ మాడ్యులేషన్‌తో మోహన్‌బాబు, యాక్షన్ విలన్‌గా శ్రీహరి బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ మరింతకాలం విలన్లుగా వాళ్లు నటించి వుంటే వాళ్ల సేవలు అటు పరిశ్రమకీ, ఇటు ప్రేక్షకులకీ దక్కేవి. సో, ఇద్దరు మంచి విలన్లని అట్లా మిస్సయ్యాం. పోతే ఇప్పుడు మన పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు తమ చిత్రాల్లో విలన్లుగా మన నటుల్ని కాక ఇతర భాషల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల కూడా మన 'విలన్' నటులకి మంచి అవకాశాలు దక్కడం లేదు. ముఖేష్‌రుషి, మోహన్‌రాజ్, ఆనంద్‌రాజ్, సాయికుమార్ (మలయాళీ), సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్‌దేవ్, ముకుల్‌దేవ్, దండపాణి వంటి పరభాషా విలన్లనే మన అగ్రహీరోలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్ద హీరోలు మన వాళ్లలోని టాలెంటుని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఒత్తిడికి లోంగిపోకూడదు. అలా జరిగితే మరికొందరు మంచి తెలుగు 'విలన్లు' తయారవుతారు. వాళ్లలో కొందరైనా చరిత్రలో స్థానం పొందగలిగే అవకాశం వుంటుంది.

Thursday, August 18, 2011

నోస్టాల్జియా: హీరో నుంచి విలన్ అయిన నవరస నటనా సార్వభౌమ

నవరస నటనా సార్వభౌమగా ఖ్యాతి పొందిన కైకాల సత్యనారాయణ విలన్ పాత్రలతో సుప్రసిద్ధులైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన తొలిగా నటించింది హీరోగా. హీరో నుంచి విలన్ ఎందుకయ్యారో ఆయన మాటల్లోనే...
"ఇంటర్మీడియేట్‌లో ఉండగా విజయవాడలో ఓ నాటకాల పోటీలో పాల్గొన్నా. ఆ పోటీకి న్యాయమూర్తుల్లో ఒకరైన గరికపాటి రాజారావు గారు వచ్చి నన్ను సినిమాలో హీరోగా పరిచయం చేస్తానన్నారు. ముందు డిగ్రీ సంపాదించాకే ఏదైనా అని చెప్పా. బీఏ అయిపోయాక కె.ఎల్. ధర్ అని ఎల్వీ ప్రసాద్ దగ్గరి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ నన్ను మద్రాసు రమ్మని ఉత్తరం రాశారు. బి.ఎ. సుబ్బారావుగారి దగ్గరకు వెళ్లి అసిస్టెంట్‌గా ఇవ్వమని అడిగితే ఆయన చక్రపాణిగారి వద్దకి పంపారు. ఆయన మళ్లీ కేవీ రెడ్డిగారి దగ్గరకి పంపారు. 15 రోజుల తర్వాత రమ్మని, చిన్న పాత్ర చేయమన్నారు. మర్నాడు వాయిస్ టెస్ట్ చేసి, 'యు ఆర్ సెలెక్టెడ్' అన్నారు. కానీ సంక్రాంతికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఆ పాత్ర ఆర్. నాగేశ్వరరావుకి వెళ్లిపోయింది. కేవీ రెడ్డిగారు తర్వాతి చిత్రంలో ఇస్తానన్నారు. తర్వాత డి.ఎల్. నారాయణ గారి దగ్గరకు వెళ్తే ఆయన 'సిపాయి కూతురు' సినిమా తీస్తూ అందులో హీరో ఛాన్స్ ఇచ్చారు. అది ఫెయిలైంది. మళ్లీ గ్యాప్. ఇక వెళ్లిపోదాం అనుకుని.. మద్రాసు చూద్దామని తిరుగుతున్నా. ఇంతలో విఠలాచార్య గారు 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రానికి నా కోసం వెతుకుతున్నారు. నేను వెళ్లిన వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది. రషెస్ అందరికీ నచ్చింది. పాతికవేల చెక్కిచ్చారు. విలన్‌గా చేస్తే బాగుంటుందని చెప్పి, నాకు తొలి విలన్ వేషం ఇచ్చారు విఠలాచార్య. 'అగ్గి పిడుగు' నుంచి రామారావు గారు, నేను మంచి కాంబినేషన్ అయ్యాం. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశా." 

న్యూస్: క్రిష్ తర్వాతి సినిమా ఎలా ఉంటుంది?

మిగతా దర్శకులంతా సేఫ్ జోన్‌లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి తాపత్రపడుతుంటే అతను మాత్రం తనకు నచ్చిన మార్గంలో జీవిత వాస్తవికతని ప్రతిబింబించే సినిమాలు తీస్తూ ముందుకు నడుస్తున్నాడు. కేవలం మూడే మూడు సినిమాలతో టాలీవుడ్‌లోనే కాక, మొత్తం భారతీయ చిత్రసీమలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అతను జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమితో 'గమ్యం', 'వేదం' సినిమాలతో చూపించిన అతను 'వేదం' తమిళ రీమేక్ 'వానం'తో తమిళ ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూస్తున్న తమిళ ప్రేక్షకులు థియేటర్లలో లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోయారంటే అతని దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవాల్సిందే. ఈ సినిమాలో అతను హీరోలనీ చూపలేదు, విలన్లనీ చూపలేదు. తప్పుడు మార్గంలో పోయే మనిషి కొన్ని సంఘటనలతో ఎలా మంచివాడిగా మారతాడో ఎంతో కన్విన్సింగ్‌గా అందులో చూపించాడు క్రిష్. ఈ సినిమాని హిందీలో తీసి, మరింతమందికి చేరువయ్యే అవకాశమున్నా అలా వచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఈ సినిమా తమిళ హక్కులు కొన్న హీరో శింబు హిందీ సినిమానీ డైరెక్ట్ చేయాల్సిందిగా అతన్ని కోరుతున్నాడు.
తెలుగుకంటే తమిళ ప్రేక్షకుల్నే ఎక్కువగా 'వేదం' ఆకట్టుంది. ఆ ఇద్దరి మధ్య పోలికల్ని తెలియజేస్తూ "ఓ సీన్‌లో ముసలాయన సొమ్ముని దొంగిలించిన అల్లు అర్జున్ తిరిగి దాన్ని అతనికి తిరిగివేస్తాడు. ఆ సీను చూసి తెలుగువాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సీనుని తమిళంలో శింబు చేశాడు. ఆ సీను చూసి తమిళులు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. మనవాళ్లకీ, తమిళులకీ సినిమాని అర్థం చేసుకోవడంలో ఉన్న తేడా అది" అని చెప్పాడు క్రిష్.
ఇప్పటిదాకా తన సినిమాల కోసం గ్రామాల్లో, మురికివాడల్లో ఎక్కువగా తిరిగిన క్రిష్ ఈసారి పట్టణ, పోష్ లొకేషన్లలో సినిమా తీయాలనుకుంటున్నాడు. "నా తర్వాతి సినిమాలో భారీ ఫైట్లు, సెట్లు ఉంటాయి" అని అతను తెలిపాడు. ఓ వైపు సామాజిక వాస్తవికతని చూపిస్తూ, మరోవైపు మానవ భావోద్వేగాల్ని గొప్పగా సెల్యులాయిడ్ మీద మలచగలిగే నేర్పు ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పుడు తన తర్వాతి స్క్రిప్టు మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమా కూడా అతణ్ణి కచ్చితంగా వార్తల్లో నిలుపుతుందన్నది నిఖార్సయిన నిజం.

న్యూస్: 'ఇట్స్ మై లవ్‌స్టోరీ'తో ఆశ నెరవేరుతుందా?

లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'స్నేహ గీతం'తో దర్శకుడిగా పరిచయమైన 'మధుర' శ్రీధర్‌రెడ్డి త్వరలో 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త తారలతో అతను రూపొందించిన 'స్నేహ గీతం' పబ్లిసిటీ ఇచ్చిన స్థాయిలో ఆడకపోయినా డైరెక్టర్‌గా శ్రీధర్‌రెడ్డి ఫర్వాలేదనిపించాడు. ఆ సినిమా తర్వాత పెద్ద హీరోలతో కాకపోయినా ఓ మాదిరి హీరోల నుంచైనా తనకి కాల్స్ వస్తాయని అతను ఊహించాడు. అలాగే నిర్మాతల నుంచి ఆఫర్లు వస్తాయనుకున్నాడు. అవేవీ జరగకపోవడంతో తిరిగి కొత్త తారలతోటే సినిమా తీయడానికి సిద్ధమైపోయాడు. నిర్మాతగా ఓ ఎన్నారైని దొరకబుచ్చుకున్నాడు. అలా 'ఇట్స్ మై లవ్‌స్టోరీ'ని తీశాడు. ఈ సినిమా ద్వారా అరవింద్‌కృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. అతను ఈ సినిమాకి ముందు డి. రామానాయుడు నిర్మించిన ఫ్లాప్ ఫిల్మ్ 'ఆలస్యం అమృతం'లో నటించాడు (హీరోగా కాదు). ఇక హీరోయిన్ నిఖితకు ఇదే తొలి చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' సెప్టెంబరులో రిలీజ్ కానున్నది. చాలా కాలం తర్వాత వెటరన్ యాక్టర్లు జయసుధ, శరత్‌బాబు కలిసి ఇందులో నటించారు. ఇందులో జయసుధ హీరో తల్లిగా, శరత్‌బాబు హీరోయిన్ తండ్రిగా నటించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ గేం డిజైనర్ (అరవింద్‌కృష్ణ)కీ, వైజాగ్‌కి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ (నిఖిత)కీ మధ్య చిగురించే ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందీ, చివరికి ఎలా సుఖాంతమయ్యిందీ అన్నది ఈ సినిమా కథ. ఈ లవ్‌స్టోరీతో డైరెక్టర్‌గా తనకి మరింత పేరు వస్తుందనీ, తద్వారా క్రేజీ ఆఫర్లు రావడం ఖాయమనీ శ్రీధర్‌రెడ్డి ఆశిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

Wednesday, August 17, 2011

మన చరిత్ర: ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి తాత్కాలిక అడ్డుకట్ట

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే బిల్లు 2.8.1935న ఇంగ్లీష్ పార్లమెంట్‌లో చట్టంగా రూపొందింది. దాన్ననుసరించి రాష్ట్రాలకు చెందిన విషయాల్లో ఆ రాష్ట్ర సభలకు స్వాతంత్ర్యం ఇచ్చారు. దాన్నే రాష్ట్రీయ స్వపరిపాలన అన్నారు. దాన్ననుసరించి 1937 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జస్టిస్ పార్టీ ఓడిపోయింది. 1927-30, 1934-37 వరకూ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండేది. ఈ 1937 ఎన్నికల్లో జస్టిస్ పార్టీకి చల్లపల్లి జమీందారు సీటూ, నరసాపురంలోని జస్టిస్ నాయుడు సీటూ మాత్రమే దక్కాయి. ముస్లింలకు వారికి కేటాయించిన స్థానాలన్నీ దక్కాయి. శాసనసభలోని 215 స్థానాల్లో కాంగ్రెసుకు 160 లభించాయి. ఆంధ్ర ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులందరూ ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం జరగాలని ఒత్తిడి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారికి ఇది ఇష్టంలేదు. ఎప్పటికప్పుడు ఏవేవో సాకులు చెబుతూ ఉద్యమ భావాలపై నీళ్లుచల్లడం ఆరంభించాడు.
1937లో శాసనసభ స్పీకరుగా ఉన్న బులుసు సాంబమూర్తి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆంగ్లేయ పాలకులకు వివరించేందుకు లండన్ వెళ్లాలనుకున్నారు. అంతా సిద్ధమైంది. అయితే రాజాజీ మంత్రాంగంతో కాంగ్రెస్ అధిష్టానం అసమ్మతి తెలిపింది. ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇది ఆంధ్ర ప్రాంత శాసనసభ్యుల్లో ఆగ్రహావేశాల్ని కలిగించింది. సమయం కోసం కాచుక్కూర్చున్నారు.
ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. 3.9.1939న బ్రిటీష్ రాజప్రతినిథి, భారతదేశం ఈ యుద్ధంలో ఇంగ్లండు పక్షాన చేరినట్టు ప్రకటించాడు. అంతకుముందు మన దేశానికేమాత్రం సంబంధంలేని ఈ ఐరోపా సంగ్రామంలో భారతదేశాన్ని దించకూడదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. అందులో భాగంగానే ఆంగ్లేయులకు భారతదేశ పాలనలో సాయం చేయకూడదనీ, కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేయాలనీ 22.10.1939న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తీర్మానించింది. దాని ప్రకారం 26.10.1939న చెన్న రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ మంత్రివర్గ రాజీనామాను ఆమోదించింది. 29వ తేదీన రాజాజీ మంత్రివర్గం తన రాజీనామాను గవర్నరుకు అందజేసింది. అంతటితో అప్పటికి ఆంధ్రరాష్ట్ర వాంఛకు తాత్కాలిక సమాధి కట్టినట్టయింది. ఆ తర్వాత 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తెలుగు ప్రజలు నిర్వహించారు.

న్యూస్: 'ధనం' ఎలా ఉంటుందో!?

మూడేళ్ల క్రితం సంగీత టైటిల్ రోల్ పోషిస్తూ తమిళంలో నటించిన 'ధనం' సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల్నీ బాగా మెప్పించింది. ఇందులో ఆమె హైదరాబాద్‌కి చెందిన సెక్స్‌వర్కర్‌గా నటించడం గమనార్హం. దర్శకుడు శివ హైదరాబాద్‌లోని సెక్స్ వర్కర్ల జీవితాల్ని పరిశీలించి, 'ధనం' స్క్రిప్టుని రూపొందించాడు. ఈ సినిమా షూటింగ్ సైతం రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్, రాజ్యలక్ష్మి, గిరీశ్ కర్నాడ్, ఆశిశ్ విద్యార్థి, వివేక్ వంటి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితమైన నటులు నటించిన ఈ సినిమా ఈ ఆగస్టులోనే తెలుగులో విడుదల కాబోతోంది. ఇందులో 'ధనం' పాత్రలో సంగీత నటన హైలైట్ అని కోట శ్రీనివాసరావు స్వయంగా చెప్పడం విశేషం. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఇందులోని పాటల్ని చంద్రబోస్, వెన్నెలకంటి, సాహితి, వనమాలి, రామజోగయ్యశాస్త్రి వంటి పేరుపొందిన గేయ రచయితలు రాశారు. తనని పెళాడతానన్న ఓ బ్రాహ్మణ యువకుణ్ణి అతని కుటుంబ అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న 'ధనం', ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనేది ఇందులోని ప్రధానాంశం. తెలుగు నేటివిటీతోటే సినిమా తీయడం వల్ల తమిళ ప్రేక్షకులకి మించి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని నిర్మాతలు అడ్డాల వెంకట్రావు, ఎ. సెల్వం ఆశాభావంతో ఉన్నారు. చూద్దాం... చాలా కాలం క్రితమే ఫేడవుట్ అయిన సంగీత ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో, లేదో...

న్యూస్: 'కందిరీగ' హిట్ కొట్టాడు!

మూడేళ్ల విరామంతో, మూడు సినిమాల ఫ్లాప్ షో తర్వాత హిట్ కొట్టాడు రాం. చిత్రమేమంటే అతని కేరీర్‌లో ఇది మూడో హిట్ కావడం. 'కందిరీగ'తో అతనికి విజయాన్ని కూర్చిన దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్. పెద్దగా మేధావితనం కనిపించని సినిమాటోగ్రాఫర్ శ్రీన్‌వాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను తరహాలో జడ్జిమెంట్ చేయగల సామర్థ్యం అతనిలో ఉండటమే 'కందిరీగ' విజయానికి కారణమని చెప్పాలి. ఒకరోజు ముందుగా మరో కొత్త దర్శకుడు, బాగా చదువుకున్న విద్యాధికుడు అజయ్ భుయాన్ 'దడ'తో నిరాశపరిస్తే, ప్రేక్షకుల నాడినే నమ్ముకుని అన్ని కమర్షియల్ అంశాలూ సమపాళ్లలో మేళవించి సినిమా తీసి ఆకట్టుకున్నాడు శ్రీన్‌వాస్. శీను పాత్రలో రాం మరోసారి మంచి ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టిన అతను, మాసీ డైలాగ్స్‌ని బాగా చెప్పి మెప్పించాడు. హన్సిక కాస్త ఒళ్లు చేసినా అందంతో ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో అక్ష రోల్ అందర్నీ ఆశ్చర్యపరచింది. ఆమె కూడా ఆ పాత్రకి న్యాయం చేకూర్చింది. ఈ సినిమా విజయంతో నిర్మాత బెల్లంకొండ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా టాప్ పొజిషన్‌లో నిల్చున్నాడు. ఆయనకి ఇది వరుసగా రెండో విజయం. నిన్నటికి నిన్న లారెన్స్ 'కాంచన' బంపర్ హిట్ కొట్టి ఆయనకి బాగా డబ్బులు సంపాదించిపెట్టింది. అదివరకు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తీసిన 'గోలీమార్' సైతం ఆయనకి డబ్బులు మిగిల్చింది. ఇలా వరుస విజయాలతో అతను దూసుకెళ్తుంటే రాంకి వ్యక్తిగతంగా 'కందిరీగ' విజయం ఎంతో మేలు చేసింది. యువ హీరోల్లో అతనిప్పుడు తనదైన మార్కెట్‌ని పొందినట్లే. దీంతో అతని తదుపరి సినిమా 'ఎందుకంటే ప్రేమంట'కి క్రేజ్ వచ్చినట్లయింది. ఇందులో అతని సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండటం దానికి మరింత ఆకర్షణని తెస్తోంది.

న్యూస్: 'టీ.. సమోసా.. బిస్కెట్'తో బాబ్జీ నమ్మకం ఫలిస్తుందా?

'నల్లపూసలు' సినిమాతో పేరు తెచ్చుకున్న బాబ్జీ పదకొండేళ్ల విరామంతో మరోసారి దర్శకత్వం చేపట్టాడు. చివరిసారి ఆయన డైరెక్ట్ చేసిన సినిమా 'ఎన్.టి.ఆర్. నగర్'. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ డూపులే హీరోలుగా ఈ సినిమాని ఆయన తీశారు. ఇందులో చిరంజీవి డూపుగా రాజ్‌కుమార్ నటించాడు. తీసిన సినిమాలేవీ కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవడంతో ఆయనతో సినిమాలు తీయడానికి మళ్లీ ఏ నిర్మాతా ముందుకు రాలేదు. ప్రజా నాట్యమండలి కళాకారుడు కూడా అయిన బాబ్జీ ఇన్నాళ్లకి సొంతంగా నిధులు సమకూర్చుకుని ఇప్పుడు 'టీ.. సమోసా.. బిస్కెట్' సినిమాని ప్రారంభించాడు. ఇందులో శ్రీహరి, హంసానందిని జంటగా నటిస్తున్నారు. ఇటీవలే వచ్చిన అల్లరి నరేశ్ సినిమా 'అహ నా పెళ్లంట'లో భార్యాభర్తలుగా దర్శనమిచ్చిన వారు ఇప్పుడు ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తుండటం గమనార్హం. "ఈ రోజుల్లో నగరాలు కాఫీ క్లబ్బులు, పబ్బులమయమై పోతున్నాయి. పేదవాడు పది నిమిషాలు సేదతీరుదామన్నా దగ్గర్లో ఎలాంటి హోటల్సూ ఉండటం లేదు. ఈ పాయింటునే ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నా" అని చెప్పాడు బాబ్జీ. పీపుల్స్ థియేటర్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్న బాబ్జీని ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే "ఈసారి తప్పకుండా కమర్షియల్ హిట్ కొడతా. సబ్జెక్ట్ అంత బాగా వచ్చింది" అని ఎంతో కాంఫిడెంట్‌గా చెప్పాడు. ఈ సినిమా ఫ్లాపైతే అప్పలపాలైపోతానని ఆయనకి బాగా తెలుసు. ఆయన నమ్మకం ఫలిస్తుందా?

Tuesday, August 16, 2011

న్యూస్: రానా, జెనీలియా జంట ఆకట్టుకుంటుందా?

దగ్గుబాటి రానా ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి తెలుగు సినిమా 'నా ఇష్టం' అయితే, మరొకటి హిందీ సినిమా 'డిపార్ట్‌మెంట్'. వీటిలో రెండోదాన్ని రాంగోపాల్‌వర్మ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. గమనించదగ్గ సంగతేమంటే రానా 'నా ఇష్టం' టైటిల్ వర్మ రాసిన పుస్తకం 'నా ఇష్టం' పేరే కావడం. ఇందులో రానా సరసన బక్క పలుచని భామ జెనీలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఇదివరకు కనిపించిన దానికి భిన్నంగా మీసం లేకుండా లవర్ బాయ్ రోల్‌లో కనిపించనున్నాడు రానా. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రకాష్ తోలేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 'సింహా' వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత యునైటెడ్ మూవీస్ నిర్మిస్తుండటంతో 'నా ఇష్టం'పై అంచనాలు బాగానే ఉన్నాయి. చక్రి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కథ ఎక్కువగా మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. 'లీడర్', 'నేను నా రాక్షసి', బాలీవుడ్ సినిమా 'దం మారో దం' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 'నా ఇష్టం' మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు రానా. మరి రానా, జెనీలియా జోడీని జనం ఆదరిస్తారా? వెయిట్ అండ్ సీ.

మన చరిత్ర: ఆంధ్రరాష్ట్ర ఉద్యమం

ఆంధ్రరాష్ట్ర నిర్మాణావశ్యకత ఓ ఉద్యమంగా జనంలో పాకుతోంది. రాజమండ్రిలో జరిగిన ఓ సభలో టంగుటూరి శ్రీరాములు, మరికొంతమంది ఈ ఉద్యమం తమిళులతో కలిసి ఉండటంవల్ల కలిగే మంచిని గమనించక లేవదీసిందంటూ ప్రసంగించారు. దాంతో సభలో ఉన్న చిలకమర్తి లక్ష్మీనరసింహం చాలా ఉద్వేగంతో వారి వాదాన్ని ఖండిస్తూ ఆంధ్ర జనాభ్యుదయానికి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం అత్యవసరమని గట్టిగా నొక్కి చెప్పారు. దాంతో ఆ సభాసదులందరూ అంగీకరించక తప్పింది కాదు.
1914 వేసవిలో విశాఖపట్నంలో మూడవ ఆంధ్ర మహాసభ అప్పటి కేంద్ర శాసనసభలో సభ్యులైన పానుగంటి రామారాయణిం అధ్యక్షతన జరిగింది. ఈ సభ ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ ఆంధ్ర మహాసభ మోచర్ల రామచంద్రరావు, వరాహగిరి జోగయ్య, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా; కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేసింది.
1915లో కాకినాడలో నాలుగో ఆంధ్ర మహాసభలు జరిగాయి. మోచర్ల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం సభలవరకూ వీరు ఆంధ్రరాష్ట్ర నిర్మాణ ఉద్యమ విషయంలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నా, కాకినాడ సభల నాటికి పూర్తిగా ఉద్యమాన్ని బలపర్చేవారుగా మారారు. సభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
1916లో నెల్లూరు పట్టణంలో 5వ ఆంధ్రరాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సభలకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు. వంగోలు వెంకటరంగయ్య పూనికతో సభల్ని నిర్వహించారు. సభలో ఆంధ్రరాష్ట్రానికి ప్రతికూలురు కూడా ఉన్నారు. అత్యధిక మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గింది. కోడి రామ్మూర్తి, బయ్యా నరసింహేశ్వరశర్మ తదితరులు చాలా కృషిచేసి తీర్మానాన్ని నెగ్గించారు.
1917లో ఆరో ఆంధ్ర మహాసభ కడపలో జరిగింది. ఈ సభలకు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు. చాలా జయప్రదంగానే సభలు ముగిశాయి. ఈలోగా ఆంధ్రరాష్ట్ర నిర్మాణావశ్యకతను వివరిస్తూ, మొత్తం దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించడం అవసరమంటూ ఆంధ్రరాష్ట్ర స్థాయీ సంఘం పక్షాన న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య ఒక నివేదికను మాంటేగుకు సమర్పించారు.
1935లో ఆంగ్లేయులు సింధ్, ఒరిస్సాలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసేంతవరకూ ఇక్కడి ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో స్తబ్దత వచ్చింది. జాతీయోద్యమం సాగుతున్నా ఇది అంతగా ప్రస్ఫుటం కాకపోవడం గమనించాల్సిన విషయం.

న్యూస్: కృష్ణ అల్లుడు ఆకట్టుకుంటాడా?

వారసులుగా కొడుకులు రావడం చాలా కాలం నుంచి తెలుగు సినీరంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లుళ్లు కూడా ఆ బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు హీరోగా మారారు. అతను కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త. నాగచైతన్య సినిమా 'ఏమాయ చేసావె'లో హీరోయిన్ సమంతా అన్నగా ఆకట్టుకుంది సుధీర్‌బాబే. అతను హీరోగా ఇప్పుడు 'శివ మనసులో శ్రుతి' అనే సినిమా తయారవుతోంది. 'భీమిలి కబడ్డిజట్టు' ఫేం తాతినేని సత్య ఈ సినిమాకి డైరెక్టర్. సత్య తండ్రి టి.ఎల్.వి. ప్రసాద్ ఒకే హీరోతో 35 సినిమాలు డైరెక్ట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆ హీరో మిథున్ చక్రవర్తి. ఇక సత్య తాత తాతినేని ప్రకాశరావు కూడా గొప్ప డైరెక్టర్. 'పల్లెటూరు', 'ఇల్లరికం' వంటి సినిమాల్ని ఆయన రూపొందించారు. ఇప్పుడు 'శివ మనసులో శ్రుతి' సినిమాని ఆర్.బి. చౌదరి సమర్పిస్తుండగా, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియ నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన నాయికగా రెజీనా పరిచయమవుతోంది. సెల్వ గణేశ్ మ్యూజిక్ డైరెక్టర్. మంచి స్ఫురద్రూపి అయిన సుధీర్ ఇప్పటికే 'ఏమాయ చేసావె'తో నటుడిగా ఓకే అనిపించుకోవడంతో హీరోగానూ రాణిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ప్రేక్షకులు అతణ్ణి ఆదరిస్తారా?

Monday, August 15, 2011

న్యూస్: పరుచూరి మురళికి 'మహదేవనాయుడు'తో కలిసి వస్తుందా?

ఇదివరకు నితిన్, ఇలియానా జంటగా రూపొందించిన 'రెచ్చిపో' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ పరుచూరి మురళి ఆశలన్నీ 'మహదేవనాయుడు' సినిమాపైనే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ హీరో కావడంతో చాలా జాగ్రత్తగా సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'సింహా' వంటి ఇటు అవార్డులూ, రివార్డులూ పొందిన సినిమా తర్వాత బాలయ్య చేసిన 'పరమవీరచక్ర' అట్టర్‌ఫ్లాపైన సంగతి తెలిసిందే. అందుకే 'మహదేవనాయుడు' సినిమా హిట్టవ్వాల్సిన అవసరం హీరో, దర్శకుల ఇద్దరికీ ఉంది. కీర్తి క్రియేషన్స్ బేనర్‌పై ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకు ఇదే బేనర్‌లో జగపతిబాబుతో 'పెదబాబు', గోపీచంద్‌తో 'ఆంధ్రుడు' సినిమాలు చేశాడు మురళి. ఆ రెండూ బాగానే ఆడాయి. కలిసి వచ్చిన బేనర్‌లో మురళి ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలనే తపనతో ఆచితూచి పనిచేస్తున్నాడు. అందుకే మొదట దసరాకి రిలీజవుతుందనుకున్న ఈ సినిమా తాజాగా సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయినట్లు సమాచారం. ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఆయనతో ముగ్గురు తారలు జతకడుతున్నారు. వారిలో లక్ష్మీరాయ్, సలోని ఆయనతో తొలిసారి నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఛార్మికి బాలయ్యతో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆమె 'అల్లరి పిడుగు' సినిమాలో నటించింది. ఈ సినిమాతో బాలకృష్ణ-మురళి కాంబినేషన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.

న్యూస్: వెంకటేశ్, ఆదిత్య కాంబినేషన్ కుదిరేనా?

వెంకటేశ్‌ని వి.ఎన్. ఆదిత్య డైరెక్ట్ చేయబోతున్నాడా? సీనియర్ నిర్మాత డి. రామానాయుడు మాటల్ని బట్టి ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఆదిత్య దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు' సినిమా ఈ నెల (ఆగస్ట్) 19న రిలీజ్ కాబోతోంది. ఇందులో నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటిస్తే, వారికి జోడీలుగా శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నటించారు. రీమాసేన్ మరో మెయిన్ రోల్ చేసింది. ఈ సినిమా సెట్స్ మీద ఆదిత్య పనితీరు పట్ల రామానాయుడు బాగా ఇంప్రెస్ అయ్యారు. అందుకే అతని దర్శకత్వంలో మరో సినిమా చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే భూపతిరాజా చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చింది. "వెంకటేశ్‌కి ఆ కథ బాగుంటుంది. వాడు సరేనంటే ఈ సినిమాని ఆదిత్య డైరెక్షన్‌లో తీస్తాను' అని ఆయన చెప్పారు. అంటే వెంకటేశ్ ఈ ప్రాజెక్టుకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంకో సంగతేమంటే ఈ ప్రాజెక్ట్ విషయం ఆదిత్యకి ఇంకా తెలీకపోవడం. గతంలో నాగార్జున వంటి టాప్ హీరోతో రెండు సినిమాలు - 'నేనున్నాను', 'బాస్' చేసిన ఆదిత్య వాటి తర్వాత మరో పెద్ద హీరోని డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ కుదిరితే అతను ఏమేరకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక్కడ ఇంకో కిటుకు కూడా ఉంది. 19న రాబోతున్న 'ముగ్గురు' పెద్ద హిట్టు కాకపోయినా ఆదిత్య బాగా చేశాడనే పేరు వస్తేనే అతనితో చేసేందుకు వెంకటేశ్ ఒప్పుకునే వీలుంది. లేదంటే... అంతే సంగతులు.

మన చరిత్ర: ప్రథమాంధ్ర మహాసభ

జొన్నవిత్తుల గుర్నాధం సహాయంతో కొండా వెంకటప్పయ్య 'ఆంధ్రోద్యమము' అనే ఓ చిన్న పుస్తకాన్ని ఇంగ్లీషు, తెలుగుల్లో రాశారు. తెలుగుదేశంలో ప్రజల్ని స్వరాష్ట్ర వాంఛకు అనుకూలంగా తయారుచేయడానికి కొండా వెంకటప్పయ్య పర్యటన చేశారు.
పర్యవసానంగా బాపట్లలో 1913 ఎండాకాలంలో ప్రథమాంధ్ర మహాసభగా అవతరించింది. 800 మంది ప్రతినిథులొచ్చారు. ఈ సభలకు బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గూర్చి వేమవరపు రామదాసు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభలో చాలా కలకలం పుట్టింది. న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు, గుత్తి కేశవపిళ్లె వంటివారు ప్రతికూలంగా ప్రసంగించారు. ఈ ముగ్గురూ వ్యతిరేకిస్తే ఈ ఉద్యమం ముందుకెళ్లదని సభ అభిప్రాయపడింది. ప్రజల్లో కూడా దీని గురించి మరింత విస్తృతంగా ప్రచారం జరగాలనీ, ఆ తర్వాత ఇలాంటి తీర్మానం చేస్తే ఉద్యమం బాగా వేళ్లూనుతుందనీ అందరూ అనడంతో దాన్నే తీర్మాన రూపంలో అంగీకరించడం జరిగింది. దీని ప్రచారకులు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరి సూర్యనారాయణరావు, కొండా వెంకటప్పయ్య. వీరు 1913 డిసెంబరులో తెలుగుదేశమంతా పర్యటించారు.
1914 ఎండాకాలంలో బెజవాడలో రెండో ఆంధ్ర మహాసభ జరిగింది. పెద్దిభోట్ల వీరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావ్, అయ్యంకి వెంకటరమణయ్య తదితరులు దీనికి నడుంకట్టారు. హఠాత్తుగా వచ్చిన గాలివానతో బ్రహ్మాండమైన సభాస్థలి రెండుసార్లు నేలకూలింది. అయినా చివరకు సభలు ఉత్సాహపూరిత వాతావరణంలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగాయి. వేలాదిమంది ప్రతినిథులొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గూర్చీ, కొన్ని కాలేజీల్ని స్థాపించాలనీ, ఉద్యోగాల్లో ఆంధ్రులకు ఎక్కువ అవకాశాలివ్వాలనీ తెలిపే అనేక తీర్మానాల్ని సభ ఆమోదించింది. జోరున కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా ప్రతినిథులు గొడుగులేసుకుని ఈ తీర్మానాల అంగీకారం వరకూ ఉండి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం యెడల తమ దీక్షను ప్రకటించడం ఈ సభల ప్రత్యేకత. రాష్ట్ర ఉద్యమపథంలో ఇదో మైలురాయి.

న్యూస్: తమిళ హీరోల బాటలో...

రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందాక తర్వాతి తరం నటులైన విక్రం, సూర్య, విశాల్, కార్తీ, ఇప్పుడు జీవా వంటివాళ్లు సైతం తెలుగునాట అనూహ్యమైన మార్కెట్‌ని సంపాదించారు. ఇప్పుడు వాళ్ల సినిమాలు తెలుగు మార్కెట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని తయారవుతున్నాయి. ఇది చూసి తాము కూడా టాలీవుడ్‌లో పాగా వెయ్యాలనే ఆలోచన కన్నడ హీరోలకు కలిగింది. అయితే ఇప్పటివరకు ఏ కన్నడ హీరో కూడా తెలుగులో మార్కెట్ సంపాదించలేక పోయాడు. నిన్నటికి నిన్న కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ చిన్న కొడుకు పునీత్ రాజ్‌కుమార్ 'జాకీ'గా తెలుగు ప్రేక్షకుల మధ్యకు వచ్చాడు. అయితే మనవాళ్లు అతన్నేమాత్రమూ పట్టించుకోలేదు. విశేషమేమంటే 'జాకీ' సినిమాని పునీత్ కుటుంబమే స్వయంగా తెలుగులో విడుదల చేసింది. దాన్నిబట్టే పునీత్‌ని తెలుగువాళ్ల చేత ఆమోదింపజేయడానికి వాళ్లు గట్టిగా ప్రయత్నించారని అర్థమవుతుంది. అలాగే ఇటీవలే రాజ్ అనే నటుడు 'తిరుగుబోతు' పేరుతో తన జాతకాన్ని పరీక్షించుకున్నాడు. విలన్ పాత్రలతో కన్నడ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా మెప్పించిన అతను హీరోగా 'సంచారి' అనే సినిమా చేసి హిట్‌కొట్టాడు. అదే సినిమాని తెలుగులో తనే స్వయంగా 'తిరుగుబోతు'గా తెచ్చాడు. ఇందుకోసం అతను మరో కన్నడ సినిమా ఏదీ చేయకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం వెచ్చించాడు. గమనించాల్సిందేమంటే 'తిరుగుబోతు' హిట్టు కాకపోయినా 'జాకీ' కంటే బెటర్‌గా ఆడింది. అంతేకాదు.. ఈ సినిమా పాటలు ఓ మోస్తరుగానైనా ఆదరణ పొందాయి. రాజ్ ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించేందుకు యత్నిస్తున్నాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ శిష్యుడు నాగిరెడ్డి డైరెక్షన్‌లో నటించేందుకు అంగీకారం తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలన్నా, తెలుగు హీరోలన్నా విపరీతమైన అభిమానం కనపరిచే రాజ్ తెలుగులో రాణిస్తాడా?

బిగ్ స్టోరీ: టాలీవుడ్‌లో ఫైనాన్సర్లకి ఎంత కష్టం?

టాలీవుడ్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒకతను డైరెక్టర్ అవుదామనుకున్నాడు. కానీ తనతో సినిమా తీయడానికి డబ్బులు ఎవరు పెడతారు? అనే ఆలోచన అతని మదిలో మెదిలింది. అప్పుడే ఓ చిన్న పరిష్కారం తోచింది. అంతే! సినిమా తీయడానికి ఓ నలుగురు వ్యక్తుల్ని చూసుకుని మనిషికి ఇన్ని లక్షలు అంటూ లెక్కలు వేసుకున్నాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయల్ని లెక్కలోకి తీసుకున్నాడు. ఫైనాన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. చివరికి ఫైనాన్సర్‌ను పట్టుకుని అతని కోరికి మేరకు అందంగా ఉన్న హీరో హీరోయిన్లతో సినిమా ప్రారంభించాడు. సినిమా విడుదల సమయంలో డబ్బులు తిరిగి ఇస్తానని అగ్రిమెంట్ రాసుకున్నాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయల్లోంచి నయాపైస కూడా ఖర్చు చేయకుండా ఫైనాన్సర్ ఇచ్చిన డబ్బుతో సినిమా చుట్టేశాడు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. కాని ఫైనాన్సర్ చేతికి డబ్బులు రావాలంటే సినిమా విడుదల కావాలి. దానికంటే ముందు బిజినెస్ కావాలి. అప్పుడే ఫైనాన్సర్ చేతికి డబ్బులు వస్తాయి. అయితే ఎంతకీ సినిమా బిజినెస్ కావడం లేదు. ఫైనాన్సర్‌కు డబ్బు రావడం లేదు. తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవచ్చాయి. రోజురోజుకు ఫైనాన్సర్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. చివరికి ఆ నిర్మాత నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలీక కృష్ణానగర్ రోడ్లపై పిచ్చోడిలా తిరిగుతూ వచ్చాడు.
సినిమాలకు ఫైనాన్స్ చేసి చితికిపోయిన ఇలాంటి ఫైనాన్సర్లు ఇప్పుడు టాలీవుడ్‌లో అనేకమంది కనిపిస్తారు. సినిమా విడుదల సమయంలో డబ్బులు ఇస్తామని సదరు నిర్మాత చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమా రిలీజయ్యేంతవరకు ఫైనాన్సర్ నోరు కట్టేసుకోవాల్సిందే. అయితే ఆ సినిమా రిలీజ్ కాదు. ఫైనాన్సర్ చేతికి డబ్బులు రావు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో అర్థంకాక అనేకమంది ఫైనాన్సర్లు తమ దుకాణాల్ని మూసుకునే పరిస్థితి వస్తోంది. చేసిన అగ్రిమెంట్ ప్రకారంగా చెప్పిన సమయానికి చేతికి డబ్బులు రాకపోతుండటంతో అనేకమంది ఫైనాన్సర్లు విలవిల్లాడుతున్నారు.
అగ్రిమెంట్లు ఎలా జరుగుతాయంటే...
సినిమా నిర్మాణం కోసం ఫైనాన్సర్లు, నిర్మాతలు ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే ఈ అగ్రిమెంట్‌లో ఎంత టైంలో డబ్బు చెల్లిస్తారనే సంగతి మాత్రం ఉండదు. ఏదో ఓ ల్యాబ్‌లో నిర్మాత, ఫైనాన్సర్‌కు మధ్య ఓ ఏరియా అమ్ముకునే హక్కులు కల్పిస్తూ అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్ కాపీ ల్యాబ్ వద్ద ఉంటుంది. సినిమా బిజినెస్ అయినా ఫైనాన్సర్ క్లియరెన్స్ లేకపోతే సినిమా విడుదలను ఆపేసే అవకాశం ఉంటుంది. క్లియరెన్స్ లెటర్ ఫైనాన్సర్ ఇస్తేనే సినిమా రిలీజ్‌కు నోచుకుంటుంది. ప్రధానంగా సినిమా బిజినెస్ అయ్యాక డబ్బులు ఇస్తామనో, లేక ఓ ఏరియా రాసి ఇస్తామనో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏ ఏరియా అయితే నిర్మాత రాసి ఇస్తారో ఆ ఏరియాలో సినిమా విడుదల చేసుకునే హక్కులు కేవలం ఫైనాన్సర్లకు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా జరిగే ఒప్పందాల ప్రకారం అనుకున్న సమయంలో బిజినెస్ కాకపోవడం, ఫైనాన్సర్ చేతికి డబ్బులు రాకపోవడంతో నిర్మాత, ఫైనాన్సర్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఫైనాన్సర్లు 5 నుంచి 10 శాతం వడ్డీకి ఇచ్చి మునిగిపోయి ఉన్నారని పలువురు ఫైనాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా బిజినెస్ జరిగితే ఫర్వాలేదు. కానీ బిజినెస్ జరగలేదంటే ఇక ఫైనాన్సర్ సంగతి అంతే!
నిర్మాత కావడమే బెటర్
తెలుగులో సినిమాకు ఫైనాన్స్ చేయడం కంటే ఏకంగా నిర్మాతగా మారడమే బెటరని అనేకమంది ఫైనాన్సర్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా నిర్మాణానికి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు కాల్చుకునే బదులు స్వయంగా తామే సినిమా నిర్మించడం మంచిదని వారు భావిస్తున్నారు. ఒకవేళ సినిమా బిజినెస్ కాకపోయినా సొంతంగా తామే విడుదల చేసుకునే వీలుంటుంది. నష్టం వచ్చినా తాము చేసిన బిజినెస్ వల్లనేనని సరిపెట్టుకోవచ్చు. అంతే కాని లక్షలాది రూపాయలు వేరొకరి చేతికిచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకని ఫైనాన్సర్లు అంటున్నారు. సినిమాలకే ఫైనాన్స్‌లు ఇవ్వాలనుకుంటే అవే డబ్బులతో చిన్న సినిమాని నిర్మించి విడుదల చేయడమే మంచిదని భావిస్తున్నారు. ఫైనాన్స్ తీసుకున్న నిర్మాతలు తిరిగి డబ్బులు కట్టక, ల్యాబ్ నుంచి బయటకిరాక అనేక సినిమాలు ఆగిపోయి ఉన్నాయని ఫైనాన్సర్లు చెబుతున్నారు.
మారిన ఫైనాన్స్ విధానం
లక్షలాది లేదంటే కోట్లాది రూపాయలు నిర్మాతలకు ధారాదత్తం చేసి మునిగిపోవడం ఇష్టంలేక పలువురు ఫైనాన్సర్లు కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. ఇంతకుముందు జరిగే ఒప్పందాల ప్రకారం అనేకమంది ఫైనాన్సర్లు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో కొత్తగా ఫైనాన్స్ ఇచ్చే వాళ్లంతా నిర్మాతలు ఏదైనా ప్రాపర్టీ చూపిస్తేనే సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారని నిర్మాతలు అంటున్నారు. చిన్న సినిమాలకు సరైన ఫైనాన్స్ దొరక్క, బడ్జెట్ సమస్య వల్ల అనేక సినిమాల షూటింగులు మధ్యలోనే ఆగిపోయాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇదీ మన తెలుగు చిత్రసీమలో ఫైనాన్సర్లు ఎదుర్కొంటున్న జఠిల సమస్య. ఇలాంటి సమస్యల నుంచి తమని బయటపడేసేలా ఫిల్మ్ చాంబర్ తగిన చర్యలు చేపట్టాలని పలువురు ఫైనాన్సర్లు కోరుతున్నారు.

Saturday, August 13, 2011

మన చరిత్ర: ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకత

బెంగాల్ విభజన ఆ రాష్ట్రవాసుల్లో ఉద్విగ్నతను రేపింది. ఆంగ్లేయులు ఉద్దేశపూర్వకంగా దేశీయులని చీల్చి సమైక్యతను నాశనం చేయడం చూసిన బిపిన్ చంద్రపాల్ దేశపర్యటనకు బయల్దేరాడు. జాతి జనుల్లో సంఘటిత శక్తీ, పోరాట పటిమా పెంచడం, విదేశీయుల దురన్యాయాల్ని ప్రజల దృష్టికి తేవడం ఆయన పర్యటనలో ఉద్దేశం. ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రజల్లో భాషా రాష్ట్రాల యెడ సుహృద్భావం అంకురించింది. అప్పటికే తెలుగునాట ఆంధ్రకేసరి, కృష్ణా పత్రిక వంటి కొన్ని పత్రికలు స్వరాష్ట్ర వాంఛను వ్యాసాల రూపంలో వెల్లడించనారంభించాయి. న్యాపతి నారాయణరావు భాసా ప్రాతిపదికపై ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని మేల్ పత్రికలో ఒక లేఖ రాశాడు. కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు కలిసి హైదరాబాద్‌లో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. భాషాపరమైన రాష్ట్రాల గురించీ, జాతీయోద్యమాన్ని గురించీ సభలూ, సమావేశాలూ, చర్చలూ సాగిస్తుండేవారు. వారి కార్యక్రమంలో భాగంగా 1910లో 'ఆంధ్రుల చరిత్ర'ను ప్రకటించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర యువజన సాహిత్య సంఘం వారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను నొక్కి చెబుతూ ఓ తీర్మానం చేశారు.
1911 - ఆ మధ్యకాలంలో గుంటూరు, నెల్లూరు మెట్టభూములు వర్షాలు లేక పండలేదు. క్షామబాధ అధికమైంది. గుంటూరు జిల్లాలో తేలుకుట్ల దగ్గర కృష్ణకు ఆనకట్ట కట్టి, అక్కడనుండి కాలువలు తవ్వి పినాకినితో కలిపితే ఈ రెండు జిల్లాల మధ్య భాగం ఎప్పటికీ క్షామానికి గురికాదని ప్రజలు భావించారు. దీన్ని 'కృష్ణా రిజర్వాయర్ ప్రాజెక్ట్' అని పేరుపెట్టి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అనేక చర్యలు, విమర్శల తర్వాత ప్రభుత్వం దీనికి 7 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లానులు, అంచనాలు సిద్ధమై పనులు ఆరంభానికి రంగమతా ఏర్పడింది. ఆ సమయంలో మెట్టూరు దగ్గర ఓ ఆనకట్ట 4 కోట్లతో కట్టడం అవసరమని చెబుతూ దాన్ని కొనసాగించాలని మద్రాసు శాసనసభ తీర్మానించింది. తెలుగు శాసన సభ్యులు కూడా తలవంచారు. దీంతో ప్రజల్లో క్రోధావేశాలు పెల్లుబికాయి.
ఆ సమయంలోనే నిడదవోలులో కొన్ని ఆంధ్ర మహాసభలు జరిగాయి. అప్పటికి గుంటూరు, కృష్ణా గోదావరి మండలాలన్నిటికీ కలిపి ఒకే కాంగ్రెస్ సంఘం ఉండేది. ఆ కాంగ్రెస్ సభ, సంఘ సంస్కరణ సభ, ఆంధ్ర ఆస్తిక సభలు జరపడానికి నిడదవోలు తయారైంది. ఆ కాంగ్రెస్ సభలకెళ్లినవాళ్లు గుంటూరు జిల్లాకొక ప్రత్యేక సంఘం ఉండాలని పట్టుబట్టారు. సభ అంగీకరించింది. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను గూర్చి ఒక తీర్మానం వచ్చింది. అధ్యక్షులుగా ఉన్న వేమవరపు రామదాసు పంతులు ఇది విషయ నిర్ణయ సభ ద్వారా రాలేదు గనుక చర్చించరాదని తోసేశారు.

న్యూస్: చిరంజీవికి 'ఠాగూర్', మరి రాంచరణ్‌కి?

'బద్రినాథ్' తర్వాత రాంచరణ్‌ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు వి.వి. వినాయక్. సూపర్ హిట్ సినిమా 'కృష్ణ' తర్వాత అతను డైరెక్ట్ చేసిన 'అదుర్స్', 'బద్రినాథ్' సినిమాలు రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వక పోవడంతో రాంచరణ్‌తో చేసే సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్టు కొట్టాలని అతను తపిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌తో సినిమా వుంటుందని రెండు నెల్ల క్రితమే నిర్మాత డి.వి.వి దానయ్య ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పక్కా స్క్రిప్టు సిద్ధమైంది. వినాయక్ తీసిన 'లక్ష్మీ', 'కృష్ణ'తో పాటు బోయపాటి శ్రీను రూపొందించిన 'తులసి'కీ రచయితగా పనిచేసిన ఆకుల శివ ఈ సినిమాకి మంచి కథతో పాటు డైలాగ్ వెర్షన్‌నీ సిద్ధం చేశాడు. రాంచరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'రచ్చ'లో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో పూర్తి కానున్నది. ఈలోగా ఈ ఆగస్టులోనే రాంచరణ్, వినాయక్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 'రచ్చ' షూటింగ్ పూర్తయ్యాకే జరుగుతుంది. 'ఆరెంజ్' వంటి డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం ప్రయోగాలకి కామాపెట్టి, మాస్ ఎంటర్‌టైనర్స్‌తో అభిమానుల్ని అలరింపజేయాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల మాట. చిరంజీవికి 'ఠాగూర్' వంటి హిట్టిచ్చిన వినాయక్, ఇప్పుడు చరణ్‌కి అంతకంటే పెద్ద హిట్టునిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం.. వినాయక్ ఏం చేస్తాడో...

న్యూస్: 'బ్యాచిలర్స్ 2' గెలుస్తారా?

సినీ డైరెక్టర్‌గా మారిన లాయర్ సానా యాదిరెడ్డి 2002లో తీసిన 'బ్యాచిలర్స్' సినిమా మంచి హిట్టయ్యింది. అందులో శివాజీ, మాన్య, సుమిత్ రాయ్, జాకిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ జాకిర్ ఆ సినిమాకి సీక్వెల్‌గా 'బ్యాచిలర్స్ 2' తీశాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అతను అందులో ఓ మెయిన్ హీరోగానూ చేశాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు విహార యాత్రకి వెళ్లే కొంతమంది బ్యాచిలర్స్‌కి రోడ్ మీద ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేసి ఈ సినిమా తీసినట్లు జాకిర్ చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. జాకిర్‌తో పాటు ఎవిన్, బాషా, రాజశేఖర్ బ్యాచిలర్స్‌గా నటించిన ఈ సినిమాలో తృప్తి శర్మ హీరోయిన్. అలీ కూడా కామెడీ పంచే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న జాకిర్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లేని సమకూర్చాడు. "మొదటి బ్యాచిలర్స్‌తో నటుడిగా గుర్తింపు వచ్చిన నాకు ఈ సీక్వెల్‌తో డైరెక్టర్‌గా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పాడు జాకిర్. అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

Friday, August 12, 2011

న్యూస్: 'రామదండు' పరిస్థితి ఏమిటి?

'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ పొందిన స్థూలకాయ నటుడు కృష్ణుడు హీరోగా తన ప్రస్థానాన్ని ఎంతకాలం కొనసాగించ గలుగుతాడు? స్థూలకాయులు హీరోగా రాణించరనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ రెండు విజయాలు సాధించిన కృష్ణుడు వాటి తర్వాత వెనకడుగు వేశాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి', తాజాగా 'అమాయకుడు' సినిమాలు అటకెక్కాయి. ముఖ్యంగా 'కోతిమూక', 'అమాయకుడు' డిజాస్టర్‌గా నిలిచాయి. అందుకు ఆయా దర్శకులే (ఏవీయస్, భారతీ గణేశ్) ముఖ్య కారణమని చెప్పాలి. త్వరలో కృష్ణుడు 'నాకూ ఓ లవరుంది'లో హీరోగా కనిపించబోతున్నాడు. ఇదికాక పోయినేడాదే విడుదల కావలసిన 'రామదండు' అనే సినిమా ఇంతవరకూ అతీ గతీ లేకుండా ఆగిపోయి ఉంది. నరేష్‌తో రూపొందించిన 'దొంగల బండి' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన వేగేశ్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమాని అతను రూపొందించాడు. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్ పాత్రని చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వెలుగు చూస్తుందోనని కృష్ణుడుతో పాటు అతని శ్రేయోభిలాషులంతా వెయిట్ చేస్తున్నారు. 'వినాయకుడు' సీరిస్‌తో తనకి దక్కిన సక్సెస్ గాలివాటం కాదనీ, హీరోగా సినిమాని క్యారే చేసే సత్తా తనకుందనీ అతను నిరూపించుకోవాలంటే వీటిలో ఓ సినిమా అయినా ఆడాలి. అది జరుగుతుందా?

న్యూస్: 'సెగ' ఆరిపోయింది!

నానికి 'సెగ' తగిలింది. ఆ సినిమా గురించి అతను చెప్పిన గొప్పలు ఉత్తవని తేలిపోయాయి. బాక్సాఫీసు వద్ద అది ఫెయిలైంది. తమిళ వెర్షన్ 'వెప్పం' పరిస్థితి కూడా ఇదేనని తెలిసింది. 'సెగ'లో కార్తీక్ పాత్రలో నాని రాణించాడు. డైరెక్టర్ అంజన సినిమాని రియలిస్టిక్‌గా తీసింది. పెద్దల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారనే కథాంశంతో ఈ సినిమాని ఆమె రూపొందించింది. అయితే ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. అందుకే బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ప్రధానంగా క్రైం థ్రిల్లర్‌గా కనిపించిన ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఇటీవలి కాలంలో ఆదరించిన సినిమాలన్నీ ఎంటర్‌టైనర్సే కావడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్‌కి ముందు "నందినీరెడ్డి తరహాలోనే అంజన చాలా ప్రతిభావంతురాలు. నాలుగు సినిమాలు చేస్తే ఆమె ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకుంటుంది" అని తెగ పొగిడేశాడు నాని. దాంతో 'సెగ' చాలా గొప్పగా ఉంటుందనీ, నానికి మరో హిట్టు గ్యారంటీ అని అంతా అనుకున్నారు. రిలీజయ్యాక చూస్తే ఫలితం తారమారయ్యింది. ఇటు నాని నటనని గానీ, అటు అంజన డైరెక్షన్ గురించి గానీ గొప్పగా చెప్పినవాళ్లు ఒక్కరూ లేకుండా పోయారు. 'అలా మొదలైంది'లో జంటగా ఆకట్టుకున్న నాని, నిత్యమీనన్ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక పోయారు. ఇకనుంచైనా నాని భూమ్మీద నడిస్తే అతని కెరీరుకి మంచిదని సలహా ఇస్తున్నారు విశ్లేషకులు.

చిట్ చాట్: అనుష్క

బాలీవుడ్ అవకాశాలు
బాలీవుడ్‌లో నటించేందుకు నేను సిద్ధం. 'సింఘం' సినిమాలో చేయక పోవడానికి డేట్స్ కుదరక పోవడమే కారణం. బిజీ వల్లనే దాన్ని చేయలేకపోయా. అన్నీ కుదిరితే హిందీలోనే కాదు ఏ భాషలోనైనా నటిస్తా. స్క్రిప్టు నచ్చితే చాలు.
అవార్డులపై అభిప్రాయం
సినిమా ఫీల్డులోకి వచ్చి ఐదున్నరేళ్లే అయ్యింది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓ పదేళ్లు అయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలో నా నటన బాగుందని గుర్తుంచుకునేలా ఉండాలి. మనం చేసిన కష్టానికి ఇచ్చే ప్రతిఫలం అవార్డు. అది రావడం వల్ల మన బాధ్యత మరింత పెరుగుతుంది.
నచ్చిన నటులు
నటనాపరంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. హి ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. పర్సనల్‌గా అయితే నాగార్జున ఇష్టం. నన్ను సినీ రంగానికి పరిచయం చేసింది నాగ్, పూరి జగన్నాథ్. అందుకే నా ఆల్‌టైం ఫేవరేట్స్ నాగ్ అండ్ జగన్.
నచ్చిన హీరోయిన్లు
తమన్నా, కాజల్ అంటే ఇష్టం. అయితే తమన్నా బాగా హార్డ్ వర్కర్. అందుకే తనంటే బాగా ఇష్టం. బాగా కష్టపడే వాళ్లని నేనెప్పుడూ అభిమానిస్తా. తను నాకంటే బాగా నటిస్తోంది అంటే నాకంటే సంతోషించేవాళ్లు మరొకరు ఉండరు.
డబ్బింగ్ సంగతి
తెరముందు నా పాత్రకి నేనే వాయిస్ ఇవ్వాలని నాకూ ఉంది. కానీ నాలుగైదు సినిమాలు చేతిలో ఉండటం వల్ల డబ్బింగ్‌కి సమయం కేటాయించలేకున్నా. 'వేదం'కు చెపాలనుకున్నా కానీ అది వెస్ట్ గోదావరి యాసలో మాట్లాడాలి. ఆ యాసను చెడగొట్టరాదనే ఉద్దేశంతోనే అందులో నేను డబ్బింగ్ చెప్పలేదు. ఈసారి తప్పకుండా ట్రై చేస్తా.
బెంగళూరులో ఎక్కువ సమయం
అమ్మా నాన్నలు బెంగళూరులో ఉంటారు. అందుకే వీలున్నప్పుడల్లా వారి దగ్గర ఉంటున్నా. ఐటీ అధికారులు దాడులు చేశారని నేనేదో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాననీ రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదు. నేను ఇంటున్నా. 'డమరుకం', 'రెబెల్' షూటింగుల్లో పాల్గొంటున్నా.
గ్లామర్ రహస్యం
యోగా చెయ్యడం వల్ల మనలో ఉన్న అన్ని చెడు అలవాట్లు పోతాయి. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే చాలు.. మీకు తెలియకుండానే మీలో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోతాయి. ఉదాహరణకి ఓ హాబీలా మాంసాహారం తింటున్నారనుకోండి. యోగా చేస్తే అది మీకు తెలియకుండానే మరచిపోతారు. 

Thursday, August 11, 2011

ఇంటర్వ్యూ: గేయ రచయిత అనంత శ్రీరాం

"అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా'' అని చెప్పారు యువ గేయ రచయిత అనంత శ్రీరామ్. అతి చిన్న వయసులోనే పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలో అగ్రశ్రేణి గేయ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. అన్ని రకాల పాటల్లోనూ ప్రతిభ చూపిస్తున్న ఆయన 'తెలుగమ్మాయి' కోసం రాసిన 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట శ్రోతల నాలుకల మీద నర్తిస్తోంది. చిత్రసీమలో తన ప్రస్థానంతో పాటు గేయ రచనా రంగం గురించి తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్. అవేమిటో ఆయన మాటల్లోనే...

నా అనుభవం, అవగాహన మేరకు చిత్రసీమలో గౌరవం, ప్రోత్సాహం, తక్కువ వత్తిడి ఉన్నది గీత రచనా రంగంలోనే. పాట హిట్టయితే సాహిత్యాన్ని చూస్తున్నారు. తద్వారా రచయితకి పేరు వస్తోంది. పాట ఫ్లాపయితే పట్టించుకోరు కాబట్టి వచ్చే నష్టమేమీ ఉండదు. నెల నెలా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మామీద పుకార్లు ఉండవు. క్రేజ్ లేకపోయినా గౌరవం, ఆప్యాయత ఉంటుంది. సౌకర్యవంతమైన రంగం. మిగతా వాటితో పోలిస్తే పోటీ తక్కువ ఉన్న రంగం ఇదే.
ఈ రంగంలో నిరుద్యోగం లేదు
తెలుగు సినిమా రంగంలో ఏడాదికి కనీసం 200 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఒక్కో సినిమాలో సగటున ఐదు పాటలుంటాయనుకుంటే ఆ అన్ని సినిమాల్లో కలిపి వెయ్యి పాటలుంటాయి. బాగా డిమాండ్ ఉన్న రచయిత నెలకి పది పాటలు, అంటే సంవత్సరానికి 120 పాటలు రాస్తాడు. అలాంటి వాళ్లు నలుగురు ఉన్నారనుకుంటే వాళ్లు రాసేది 480 పాటలు. ఇంకా 520 పాటలు రాసే అవకాశం మిగతా వాళ్లకి ఉంది. సంవత్సరానికి 20 చొప్పున వేసుకున్నా ఇంకో 25 మందికి ఇక్కడ అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రంగంలో నిరుద్యోగం అయితే ఉండదు. ఇక్కడ క్రేజ్‌ని బట్టి, హిట్టుని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. పాట రాయడం రాకుండా ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సామాన్య ప్రజ్ఞాపాటవాలుంటే ఈ రంగంలో ఉపాధి దొరుకుతుంది.
ఊరికే కష్టపెట్టరు
దేవిశ్రీకి పాట నచ్చితే మొదటి వెర్షన్‌కే ఓకే చేసేస్తారు. తనకి కావాలనుకున్నది రాకపోతే 20వ వెర్షన్ అయినా రాయిస్తారు. రచయితని ఊరికే కష్టపెట్టరు. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతేనే రచయితకి ఇబ్బంది వస్తుంది తప్పితే కావాలని చెయ్యరు. రాజమౌళి 'యమదొంగ'లో 'నూనూగు మీసాలోడు' పాటని వెంటనే ఓకే చేశారు. అదే 'మర్యాద రామన్న' విషయానికొస్తే 'తెలుగమ్మాయీ..' పాటని ఓకే చెయడానికి 40 రోజులు పట్టింది.
ఓటమిగా భావించేవాణ్ణి
'100% లవ్' సినిమాలో రెండు సన్నివేశాలకి కష్టపడి రాసినా ఓకే అవ్వలేదు. కానీ కష్టపడినందుకు గీతా ఆర్ట్స్ నుంచి డబ్బులు వచ్చేశాయి. ఇట్లాంటివి కెరీర్ మొదట్లో జరిగినప్పుడు బాధపడేవాణ్ణి. దాన్ని ఓటమిగా భావించేవాణ్ణి. అప్పుడు అంత అనుభవం ఉండకపోవడం, మనసు సున్నితంగా ఉండటం కారణం. ఎప్పుడైనా ఏదైనా పాట ఓకే చెయ్యకపోయినా, ఆ తర్వాత అదే దర్శకుడు, అదే సంగీత దర్శకుడు తర్వాత నా చేత రాయించుకున్న సందర్భాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ఇలాంటివాటికి మనస్తాపం చెందడం లేదు.
కీరవాణితో ఎక్కువ సౌకర్యం
సంగీత దర్శకుల్లో కీరవాణి గారితో ఎక్కువ సౌకర్యంగా ఫీలవుతా. రచయితకి ఆయన బాగా స్వేచ్ఛనిస్తారు. నాచేత ముందు పాట రాయించి, ఆ తర్వాత ఆయన బాణీలు కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'యమదొంగ'లో 'రబ్బరు గాజులు..' పాటని నేను రాస్తే, దానికి ఆయన ట్యూన్ కట్టారు. నాకైతే మొదట పాట రాయడమే హాయనిపిస్తుంది. ట్యూన్‌కి పాట రాయడంలోనే కొంచెం వత్తిడి అనిపిస్తుంది. అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా. నా తొలి చిత్రం 'కాదంటే ఔననిలే'లో 'కర్రా బిళ్లా..' పాట నచ్చి చిరంజీవి గారు 'స్టాలిన్' కోసం 'పరారే పరారే..' పాట రాయించుకున్నారు.
ఆయన ఆరాధ్య రచయిత
ఎప్పటికీ నా ఆరాధ్య రచయిత సీతారామశాస్త్రి గారే. నన్ను పాటలు రాయడానికి ఉసిగొల్పింది ఆయన సాహిత్యమే. 'సిరివెన్నెల', 'స్వాతికిరణం', 'స్వర్ణ కమలం' పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.
అది పేరు తెస్తుంది
ఈ సంవత్సరం 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మంచి హిట్టయింది. రానున్న 'తెలుగమ్మాయి'లో 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట పేరు తెస్తుందని అనుకుంటున్నా. నాగచైతన్య చిత్రం 'దడ' రిలీజవుతోంది. నాగార్జునగారి సినిమా 'రాజన్న', రాజమౌళి సినిమా 'ఈగ', ఎన్టీఆర్ - సురేందర్‌రెడ్డి సినిమా 'ఊసరవెల్లి', వెంకటేశ్ - గోపీచంద్ మలినేని సినిమా, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', దేవా కట్టా చిత్రం 'ఆటోనగర్ సూర్య'కి పాటలు రాస్తున్నా.