Monday, August 22, 2016

Sunday, July 3, 2016

Poetry: Handloom

మగ్గం ఆడుతుంటే...

రోజంతా మగ్గం ఆడుతున్న చప్పుడు వింటాను
ఆ బక్కపలుచని చెక్కల నిర్మాణం ఎంత సుందరం!
నిలువుగా రెండు.. అడ్డంగా రెండు..
ఉక్కు కండల చేతులూ కాళ్లలా.. చెక్కలు!!
ఒక చేత్తో పలక, ఇంతో చేత్తో పిడి..
మగ్గంలో కూర్చున్న నాన్నని అపురూపంగా చూస్తుంటాను
లయబద్ధంగా నాట్యం చేస్తున్న నటరాజే జ్ఞాపకమొస్తాడు
పోగు పక్కన ఇంకో పోగు - పడుగు
పోగు మీద ఇంకో పోగు - పేక
సొరుగుల్లోంచి చకచకా అట్నించి ఇటు తిరిగే నాడి
వడివడిగా దూసుకొచ్చే జలతారు పోగులు
ఒక పావుచెక్క కిందికి దిగితే
ఇంకో పావుచెక్క పైకి లేస్తుంది
అచ్చులో సగం పోగులు కిందికీ
ఇంకో సగం పోగులు పైకీ
పోగులు చిక్కుబడకుండా
కచ్చిబద్దలు కాపలా కాస్తుంటాయి సైనికుల్లాగా
బట్ట బిగువు సడలిపోకుండా
చేళ్లు చేతులు చాపి పట్టుకుంటాయి రక్షకుల్లాగా
బుటా తర్వాత ఇంకో జరీ బుటా
సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు
పడుగు పైన పట్టు పాగళ్లు
గుడ్డమీద రంగుల సీతాకోకలవుతుంటాయి
నెమ్మదిగా చీకటి చిక్కనవుతుంటే
కిరసనాయిలు బుడ్డీలు
మగ్గం రెండుపక్కలా వెలుగుతాయి
మగ్గం చప్పుడు ఆగదు
పడుగు-పేక పరిమళాలు వదలవు
పదకొండు కొట్టేదాకా మగ్గం విశ్రమించదు
ఒక దోనె ఖాళీ అవుతుంటే
ఇంకో దోనె నిండు కుండవుతుంటుంది
ఒక తాను పుట్టాక
ఇంకో తాను పురుడు పోసుకోవడం మొదలవుతుంది!
టకటకమనే పలక చప్పుడులో
చెమట చుక్కల పాట సమ్మగా వినిపిస్తుంటుంది!!

-ఆంధ్రజ్యోతి 'వివిధ', 4 అక్టోబర్ 2010

Thursday, June 30, 2016

Profile of Director K. Pratyagatma

Born: 31 October 1924
Birth Place: Mudunur (Krishna District)
Parents: Kolli Kotayya, Annapurna
Wife: Satyavathi
Son: K. Vasu (director)
Magazine Editor: Jwala
First Film as a Writer: 'Nirupedalu' (1953)
First Film as a Director: Bharya Bharthalu (1961)
Last Film as a Director: Nayakudu VinayakuDu
Artists Introduced: Jayalalitha (Manushulu Mamathalu), Krishnam Raju (Chilaka Gorinka), Ramaprabha (Chilaka Gorinka), Tyagaraju (Manchi Manishi), Sarath Babu (Stree), Rallapalli (Stree)
Dead: 8 June 2001

Saturday, June 4, 2016

Interview of actress Samantha

అతనెవరో నేనే చెబుతా!

‘త్వరలోనే సమంత పెళ్లంట. పేరు చెప్పకపోయినా ఓ తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతోందట’.. కొద్ది రోజులుగా సినీ ప్రేమికుల మధ్య నలుగుతున్న మాటలివి. ‘ఎవరా హీరో?’ అనే దానిపై ఎవరికి తోచినట్లు వాళ్లు నిర్ధారణకు వస్తున్నారు. పెళ్లి గురించి అడిగితే నవ్వుతూ తన ప్రతినిధి ఆ విషయం చెబుతారని దాటవేస్తోంది సమంత. అయితే పెళ్లి తర్వాత కూడా నటిస్తానని స్పష్టం చేస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అ ఆ’ చిత్రంలో నాయికగా నటించిన ఆమె.. తనను నడిపిస్తోంది తన అమ్మే అంటోంది. సమంత చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..

ఈ వేసవికి విడుదలవుతున్న నా చివరి చిత్రం ‘అ ఆ’. నేను చేసిన ముఖ్యమైన సినిమాల్లో ఇదొకటి. ఇప్పటిదాకా సీరియస్‌ సినిమాలు, ఇంటెన్స్, రొమాన్స్ ఉన్న సినిమాలు చేశాను. కామెడీ చెయ్యలేదు. మొదటిసారి నేను కామెడీ చేసిన సినిమా ఇది. కమెడియ న్స్అంటే నాకు చాలా గౌరవం. కామెడీ పండించడం చాలా క్లిష్టమైన వ్యవహారం. ప్రేక్షకులకు నవ్వు రాలేదంటే, అది అపహాస్యమైనట్లే. ఆ రిస్క్‌ను నేను తీసుకున్నా. నాకు అలాంటి పాత్ర ఇచ్చినందుకు కచ్చితంగా త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగానూ త్రివిక్రమ్‌గారి ప్రభావం నాపై ఉంది. ఆయన చాలా నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. నాలోని కొన్ని అభద్రతాభావనలను ఆయన వల్ల అధిగమించాను. ఆయనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఆయన నాకు పాత్ర గురించి చెబుతుంటే, ఆయనను నేను ఇమిటేట్‌ చేశానంతే. నేనేమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే అనసూయ పాత్రకు న్యాయం చేశానని నమ్ముతున్నా. ఈ సినిమాతో నటిగా మరింత ఎదిగాననుకుంటున్నా.

అప్పుడు జీరో కెమిస్ట్రీ

నేను వ్యక్తుల్ని బట్టి సినిమా చెయ్యను. స్క్రిప్టును బట్టే చేస్తాను. ఇప్పటివరకూ స్క్రిప్ట్ విని, కన్విన్స్ అయ్యాకే సినిమా చేస్తూ వచ్చా. ఏ స్క్రిప్టూ వినకుండా సంతకం చెయ్యలేదు. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాముఖ్యమే ఉంటోందన్నది నిజం. పది సినిమాల్లో ఒక్క సినిమాలోనే హీరోయిన్‌కు మంచి పాత్ర దొరుకుతోంది. ఇలాంటి రోజుల్లో ‘అ ఆ’ స్క్రిప్ట్ నాకు చాలా ముఖ్యమైంది. ఇందులో హీరో హీరోయిన్‌లకు సమాన ప్రాధాన్యం ఉంది. సినిమా మొత్తం హీరోయిన్‌ దృక్కోణంతో నడుస్తుంది. నిజ జీవితంలో నేనేమిటో ఆ పాత్ర కూడా అంతే. కొంచెం అల్లరి, వేగంగా నిర్ణయాలు తీసుకొనే తత్వం ఉన్న పాత్ర. నితిన్‌కూ, నాకూ, త్రివిక్రమ్‌గారికీ కూడా ఈ సినిమా ఓ మేకోవర్‌ లాంటిది. ఇప్పటివరకూ నితిన్‌ చేసిన ఉత్తమమైన అభినయాల్లో ఇందులోని ఆనంద్‌ విహారి పాత్ర ఒకటి. ఈ సినిమా చెయ్యకముందు నుంచీ నితిన్‌ నాకు మంచి ఫ్రెండ్‌. అందువల్ల ఈ సినిమా చేసేప్పుడు చాలా ఒత్తిడి ఫీలయ్యాను. మొదటి రెండు రోజులూ రొమాంటిక్‌ సీన్లు చేయడం చాలా కష్టమైపోయింది. సెట్స్‌పై మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ జీరో. ‘‘మీ ఇద్దర్ని పెట్టి నేను తప్పు చేశానా?’’ అని కూడా అనేశారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత మేం కుదురుకున్నాం.

అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు

‘ఇది చాలా కొత్త కథ.. ఇలాంటి ప్రేమకథ ఇంతదాకా రాలేదు..’ ఇలాంటి మాటలు ‘అ ఆ’ గురించి చెప్పను. సినిమా చూస్తున్నంతసేపూ మన ముఖాలపై చిన్న నవ్వు ఉంటుంది. నేను సినిమా చూశాను. ఆ మరుసటి రోజే నాకు మళ్లీ ఇంకోసారి చూడాలనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా సింపుల్‌ సినిమా, అందమైన సినిమా వస్తోంది. ఇది హీరోయిన్ చెప్పే కథ అయినా, కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాకు నేను డబ్బింగ్‌ చెప్పే పనైతే ఈ ఏడాది జూన్‌కు కాకుండా, వచ్చే ఏడాది జూన్‌కు వస్తుందేమో. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగులతో పాటు వాయిస్‌ ఓవర్‌ కూడా ఎక్కువే. దాన్ని నేను హ్యాండిల్‌ చెయ్యగలనని అనుకోలేదు. అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు.

ఫ్లాప్‌కు బాధపడతా

నేను అబద్ధం చెప్పను. హిట్లు వస్తే సంతోషిస్తాను. ఫ్లాపులొస్తే బాధపడతాను. ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ అంతే. జయాపజయాలనేవి ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి. మనం చేసే ప్రతి సినిమా హిట్టవ్వాలని లేదు. ఒక్కోసారి స్క్రిప్టుపరంగా బాగా ఉందనుకున్నది తెరమీద అంత బాగా రాకపోవచ్చు. బ్యాడ్‌ ఫిల్మ్‌ చెయ్యాలని ఎవరూ కోరుకోరు. సినిమా విజయానికి అదృష్టం కూడా తోడవ్వాలి.

పెళ్లి తర్వాతా నటిస్తా

పొద్దున్నే నిద్రలేచి.. ‘ఈ రోజు బాగుంటుందిలే’ అనుకుంటే, ఏదో ఓ పేపర్‌లో ‘సమంతకు పెళ్లి.. ఎవరితో పెళ్లి?’ అంటూ ఎవరెవరివో ఐదు పేర్లు రాసేసిన న్యూస్‌ కనిపిస్తుంది. ‘అమ్మబాబోయ్‌.. ఇతనితో నేను మాట్లాడి రెండు సంవత్సరాలైపోయిందే.. అతనితో నాకు పెళ్లా?’ అని నవ్వుకుంటాను. నేనెవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయం నేనే చెబుతాను. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా.

వివక్షపై ఫిర్యాదు లేదు

ఓ స్త్రీగా నన్ను పురుషులతో పోల్చుకొని వివక్షకు గురైనట్లుగా నేనెప్పుడూ భావించుకోలేదు. జీవితమంటేనే పోరాటం. పోటీ అనేది పురుషులతో కావచ్చు, స్త్రీలతో కావచ్చు. లింగ వివక్షపై నాకెప్పుడూ దృఢమైన అభిప్రాయం లేదు. పురుషులతో పాటు స్త్రీలనూ సమానంగా చూడ్డం మొదలైంది. బాలీవుడ్‌లో ఇప్పటికే స్త్రీ ప్రధాన చిత్రాలు పెరుగుతున్నాయి. తెలుగులోనూ ఆ వాతావరణం వస్తుంది. నేనైతే ఈ విషయమై ఎవరిపైనా ఫిర్యాదు చెయ్యదలచుకోలేదు.

వీలైనంతమందికి గుండె ఆపరేషన్లు

మా ‘ప్రత్యూష సపోర్ట్‌’ ఫౌండేషన్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నాను. దాని కోసమే జూలైలో అమెరికా వెళ్తున్నాను. అక్కడి ఓ ఫౌండేషన్ వాళ్లు ఆహ్వానించారు. ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా ఖర్చవుతోంది. ఆ ఆపరేషన్ల కోసం మా వద్దకు చాలామంది వస్తున్నారు. వారిలో నిజంగా ఎవరికి ఆపరేషన్ అవసరమనేది మా బృందంలోని డాక్టర్‌ మంజుల చూసుకుంటారు. ఈ విషయంలో వీలైనంత మందికి సాయం చెయ్యాలనేది నా సంకల్పం. ఇప్పటివరకూ నిధుల సమీకరణకై ఎవరి సాయమూ తీసుకోలేదు.

అది తప్పంటాను

నిర్భయ తరహా దుర్ఘటనల వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఇవాళ దేశంలోని చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న దారుణమైన సమస్య అది. సో టెర్రిబుల్‌. ఈ ప్రపంచంలో మంచి విషయాలే జరగాలని కోరుకునే మనస్తత్వం నాది. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పనులు చేస్తున్నాయి. ఇలాంటి దారుణాల్ని ఎలా ఆపాలో నాకు తెలీదు. కానీ ఏదైనా చెయ్యమంటే నా వంతుగా చెయ్యడానికి సిద్ధంగా ఉంటాను. నిర్భయ కేసులో నిందితులు రెండేళ్లలో విడుదలయ్యారు. మైనర్‌ అనే కారణంతో వాళ్లను విడుదల చేయడాన్ని నేనంగీకరించను. అది తప్పంటాను. వాళ్లను తిరిగి జైలులో పెట్టాలనేవాళ్లకు నేను మద్దతిస్తాను.

అమ్మ నన్ను కాపాడింది

మా కుటుంబంలోని అందరిలోకీ అమ్మతోటే ఎక్కువ అనుబంధం నాకు. నాన్న చాలా చాలా స్ట్రిక్టు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. చిన్నప్పట్నించీ నాతోనూ అంతే. అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘షి సేవ్డ్‌ మి’ అంటాను. నా చిన్నతనంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాలు పడింది. ఆ టైమ్‌లో అమ్మే అందరికీ ధైర్యం చెబుతూ వచ్చింది. నాన్నకు కోపమెక్కువ. అమ్మకు ఓర్పెక్కువ. ఆ ఓర్పుతోటే కుటుంబాన్నీ, నన్నూ నడిపించింది. ఇప్పటికీ నా వెనకాల అమ్మ ఉందనే ధైర్యంతో కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాను.

- ఆంధ్రజ్యోతి డైలీ, 31 మే 2016.

Saturday, May 21, 2016

Profile of Director K.S.R. Das

Original Name: Konda Subba Rama Dasu
Born: 5 January 1936
Birth Place: Venkatagiri, Nellore District.
Parents: Seshamma and Chenchu Ramaiah
First Job: Bookin Clerk at Krishna Mahal Theatre at Guntur
First Job in Film Industry: Apprentice in Editing Dept. for the film BANDA RAMUDU
First film as a Director: Loguttu Perumallakeruka (1966)
Last film as a Director: Nagulamma (2000)
Trendsetter film as a Director: Mosagallaku Mosagadu (1971)
Died: 8 June 2012

Thursday, May 19, 2016

Short Story: Samskarana (Reform)


సంస్కరణ

మంచి సంబంధం ఒకటి వచ్చిందనీ, అమ్మాయిని చూసేందుకు రమ్మనీ, వచ్చే ముందు ఉత్తరం రాయమనీ తండ్రి జగన్నాథం నుంచి ఉత్తరం వచ్చింది వసంత్‌కి. శ్వేతకు చూపించాడు దాన్ని. చదివి నవ్వింది.
"చూసి రాపో."
"వేళాకోళమా" నెత్తిమీద మొట్టికాయ వేశాడు.
నాలుగు నెలల మూడు వారాల నుంచీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. "ఆడా, మగా కలిసి జీవించడానికి పెళ్లి అవసరమా?" అంటాడు వసంత్.
"పెళ్లి కాకుండా ఎట్లా సాధ్యమవుతుంది?" అంది మొదట్లో శ్వేత. అయితే ఆమెకు నాలుగు నిమిషాల్లాగే గడిచిపోయాయి ఈ నాలుగు నెలలు. ప్రేమలో ఉండే మాధుర్యం రుచి చూస్తున్నారు, సెక్స్ తప్పించి. శ్వేత ఇంకా స్టూడెంటే.
ఒక రాత్రి బాగా టెంప్టయ్యి సెక్స్ కావాలన్నాడు వసంత్.
"తప్పదా. కనీసం పరీక్షలయిన దాకా అయినా ఆగుతావనుకున్నా" అంది అతడి అవేశానికీ, బాధకీ చలిస్తూ. ఆమె మొహం వంక చూసి కంట్రోల్ చేసుకున్నాడు.
"పరీక్షలయ్యేంత వరకూ దీనితోనే తృప్తి పడతాను" అని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
రక్తం పోరు పెడుతుంది. నరాలు గిలగిలా కొట్టుకుంటాయి. దేహాలు ఏదో కావాలంటాయి. కళ్లు ఏమేమో చెప్పుకుంటాయి. అయినా ఏదో అడ్డు తగుల్తుంటుంది. ఆగిపోతారు. కావలింతలతో, ముద్దులతో తృప్తి పడుతున్నారు. ఆమె ఫైనలియర్‌లో ఉంది. ఎం.ఏ. సోషియాలజీ చేస్తోంది. ఇంకెంతకాలమనీ. రెండు నెలలు ఓపిక పడితే చాలు. కానీ ఆ రెండు నెలలు తనకు రెండు యుగాలుగా ఉంటుందనుకుంటున్నాడు వసంత్.
పెళ్లి కాకుండా ఓ ఆడదీ - ఓ మగాడూ కలిసి ఉంటున్నారంటే లోకానికి ఆ జంట పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో దిగ్భ్రాంతి పాలు ఎక్కువ. ఎక్కువవుతున్నారు వాళ్లని గమనించేవాళ్లు. ఎవర్నీ లక్ష్యపెట్టకుండా గొప్ప సంతోషంతో రోజులు గడుపుతున్నారు ఇద్దరూ.
ఇప్పుడు జగన్నాథం నుంచి ఉత్తరం.
రెండు రోజులు డ్యూటికి సెలవుపెట్టి ఊరెళ్లాడు. దాపరికం ఇష్టంలేదు. తల్లి వరలక్ష్మితో చెప్పాడు శ్వేత అనే అమ్మాయీ, తనూ కలిసి ఉంటున్నట్లు.
వరలక్ష్మి బిత్తరపోయింది. కంగారు పడిపోయింది. లోకం సంగతి జ్ఞాపకం వచ్చి భయపడింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆ అమ్మాయిది ఏ కులమో? తమ కులమైతే కొంతలో కొంత నయం. కలిసి ఉంటున్నారంటే ఆ పిల్ల తనకేమవుతుంది? కోడలనొచ్చా? పెళ్లయితేనే కదా కోడలయ్యేది. ఓవేళ ఆ పిల్ల ఇక్కడకొస్తే చుట్టుపక్కల అమ్మలక్కలకు ఏమని పరిచయం చేస్తుంది? కొడుక్కి ఏమవుతుందని చెప్పాలి? స్నేహితురాలనా, ప్రియురాలనా? అదేంది.. ఆ.. రూమ్మేట్ అనా?
కొడుకుపై ఆమెకు కోపం వచ్చింది పీకల దాకా. ఎట్లా ప్రదర్శించాలో తెలీలేదు చప్పున. రోజులు మారిపోతున్నాయి. తరానికీ తరానికీ మార్పు వస్తోంది, వేగంగా. స్పీడు ఎక్కువవుతోంది జీవనంలో. ఒక్కటొక్కటే తెగిపోతున్నాయి కట్టుబాట్ల సంకెళ్లు. ఇవేవీ అర్థం చేసుకోగల పరిజ్ఞానం లేదు వరలక్ష్మికి.
"పెళ్లి కాకుండా ఎవరో అమ్మాయితో కలిసి ఉండటమేమిట్రా?" అంది వరలక్ష్మి.
"మేం ప్రేమించుకున్నామమ్మా. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం."
"ఆ పిల్లకి ఎవరూ లేరా?"
"ఎందుకు లేరు? అమ్మా, నాన్నా.. అంతా ఉన్నారు."
"మరా పిల్ల ఇట్లాంటి పనిచేస్తే ఊరుకున్నారా?"
"ఇట్లాంటి పనంటే - ఇది ఘోరమైన పనా. వాళ్లు ఊరుకున్నారో లేదో అక్కడికి వచ్చి శ్వేతనే అడుగు."
"తప్పు కదరా అట్లా ఉండటం. నలుగురూ ఏమనుకుంటారు. ఎంత ఎగతాళి అయిపోతాం అందరిలో. గౌరవం, మర్యాదా ఉంటాయా మనకి."
"గౌరవం, మర్యాదా అనేవి మనం ఊహించుకునే దాన్నిబట్టి ఉంటాయమ్మా. నా దృష్టిలో మేం చేసిన పని ఎంత మాత్రమూ తప్పుకాదు. మా ఇద్దరికీ అది ఇష్టమైన పని ఐనప్పుడు ఇంకొకరు మా విషయంలో ఎందుకు తలదూర్చాలి?" అన్నాడు ప్రశాంతంగానే.
అప్పుడే వచ్చాడు జగన్నాథం ఇంట్లోకి. సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడతాడతను.
"విన్నారా.. వీడూ, ఇంకో అమ్మాయీ కలిసి ఉంటున్నారట" చెప్పింది వరలక్ష్మి.
"నిజమా! ఏరా, అద్దె కలిసి వస్తుందనా?"
వచ్చే నవ్వును ఆపుకున్నాడు వసంత్. "లేదు మేం ప్రేమించుకున్నాం."
"అదేంట్రా. నేను ఉత్తరం రాశాను కదా సంబంధం వచ్చిందనీ, అమ్మాయిని చూసేందుకు రమ్మనీ. అందలేదా?"
"అందింది. అందుకే అట్లాంటి ప్రయత్నాలేవీ అవసరం లేదని చెప్పేందుకే వచ్చాను."
"ఏవిటీ? ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నావా?"
"ఇంకా మేం పెళ్లి గురించి ఏం అనుకోలేదు."
బిత్తరపోయాడు జగన్నాథం. నోటెంట వెంటనే మాట రాలేదు. కలిసి ఉంటున్నామని చెప్తున్నాడు. మళ్లీ పెళ్లి మాట మాత్రం అనుకోలేదంటున్నాడు. ఈ రెంటికీ లంకె ఎట్లా కుదురుతుంది?
"నువ్వంటే మగాడివి. ఎట్లా చేసినా చెల్లుతుంది. పాపం ఆడపిల్ల. ఆ అమ్మాయి బతుకుతో ఆటలాడాలనుకుంటున్నావా?" - బాగా అడిగాననుకున్నాడు.
"ఎవరం ఎవరితో ఆటలాడుకోటం లేదు. ఇద్దరం ప్రేమించుకున్నాం. కలిసి ఉండాలనుకున్నాం. నాలుగు నెల్ల నుంచీ ఉంటున్నాం."
"పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేదేంట్రా. ఫలానా జగన్నాథం కొడుకు హైద్రాబాద్‌లో ఎవరో పిల్లని పెట్టుకొని ఉంటున్నాడని జనం అనుకుంటే మనకి ఎంత అప్రతిష్ఠగా ఉంటుందో ఆలోచించావా?"
"ఇందులో ఆలోచించడానికేమీ లేదు నాన్నా. నేను మీతో గొడవ పెట్టుకునేందుకు రాలేదు. ఉత్తరంలోనే రాసేవాడిని ఈ సంగతి. స్వయంగా చెబితేనే బాగుంటుందని శ్వేత అంటే వచ్చాను."
మళ్లీ గట్టిగా వసంత్‌ని అనేందుకు జంకాడు జగన్నాథం. గొణుక్కుంటూ ఉండిపోయాడు. కొడుకుతో మాట్లాడేందుకు మనస్కరించలేదు వరలక్ష్మికి కూడా. కొడుకు ఘోరమైన తప్పుపని చేశాడని ఆమె నమ్ముతోంది. బరితెగించినవాళ్లు తప్ప ఇట్లాంటి పనులు చేయరని ఆమె అభిప్రాయం.
మరో రోజు సెలవు ఉన్నా, ఉండబుద్ధికాక వసంత్ ఆ రోజు రాత్రే బయలుదేరి వచ్చేశాడు హైద్రాబాద్.
* * *
బాత్‌రూంలోకి పోబోతూ ఇంటి ముందు ఆటో శబ్దం వినపడ్డంతో ఆగి చూశాడు వసంత్. ముందు జగన్నాథం, తర్వాత వరలక్షీ దిగారు ఆటోలోంచి. ఆశ్చర్యపడ్తూ అమ్మానాన్నలకు ఎదురువెళ్లాడు. ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి వచ్చారు.
"నువ్వు అట్లా వచ్చేశాక ఉండబట్టలేక మేం వచ్చేశాం" చెప్పింది వరలక్ష్మి. ఇంట్లోకి అడుగుపెడ్తూనే చుట్టూ కలియజూసింది. గతంలో తను వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది.
కొత్త మనుషుల్ని చూడ్డంతోటే వాళ్లెవరై ఉంటారో ఊహించింది శ్వేత.
"మా అమ్మా నాన్నా.. ఈమే శ్వేత" - పరిచయం చేశాడు వసంత్. అప్పటిదాకా మనసులో ఎంతో కోపం ఉన్నా, అందమైన శ్వేత నవ్వూ, చొరవగా వచ్చి తన చేతులు పట్టుకోవడం.. వరలక్ష్మి కోపం తగ్గించాయి.
"నీకు టైమవుతోంది వసంత్. స్నానానికి వెళ్లిరా" అంది శ్వేత, కళ్లతోనే ఏం ఫర్వాలేదని చెప్తూ.
'వసంత్‌ని అట్లా పేరుపెట్టి పిలుస్తోందేమిటి ఈ పిల్ల, బొత్తిగా మర్యాద లేకుండా. రోజులిట్లా తయారవుతున్నాయేమిటో?' అనుకుంది వరలక్ష్మి.
"మీరు కూర్చోండి. టీ కలుపుకొని తెస్తాను" అని వంటగదిలోకి వెళ్లింది శ్వేత. తనూ వెళ్లింది వెనకాలే - వరలక్ష్మి.
"నువ్వు కాలేజీకి వెళ్తున్నావంట గదమ్మా. అబ్బాయి చెప్పాడు."
"అవునండి. నన్ను కాలేజీ వద్ద దింపి తను ఆఫీసుకి వెళ్తాడు."
"అమ్మాయ్. నాకు తెలీకడుగుతాను. పెళ్లి చేసుకోకుండా ఇట్లా ఒకే ఇంట్లో ఉండటం ఏవన్నా బాగుందా?"
"ఒక ఆడా, మగా ప్రేమించుకొని కలిసి ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు పెళ్లి అవసరం లేదని వసంత్ అభిప్రాయం. మీలాగే మొదట్లో నాకూ అది కష్టమనిపించింది. ఇప్పుడయితే నా అభిప్రాయం మార్చుకున్నాను."
"మా కుటుంబాల్లో ఏ ఒక్క మగాడికీ ఇట్లాంటి ఆలోచనలు లేవు. వీడికే ఇట్లాంటివి ఎందుకు వస్తాయో అర్థం కాదు. చిన్నప్పట్నించీ అంతే. పాలచెట్టు పేరు ఎప్పుడన్నా విన్నావమ్మాయ్. మా ఇంటిపక్క ఉండేది ఓ చెట్టు. చాలా రుచిగా ఉంటాయ్ పాలపళ్లు. ఆ స్థలం కలవాళ్లు వాళ్లవసరం కోసం చెట్టు కొట్టేస్తుంటే అక్కడున్న పిల్లలంతా సంతోషంగా కొమ్మలకి ఉన్న పళ్లు తెంపుకు తింటుంటే వీడు భోరున ఏడ్చేశాడు చెట్టు కొట్టేస్తున్నారని. పైగా చెట్టు కొట్టేస్తున్నవాళ్లతో పోట్లాట పెట్టుకున్నాడు. వీడు ఏడుస్తూ అడిగే మాటలకి వాళ్లు తెల్లముఖం వేశారనుకో. అట్లా ఉంటుంది వీడి వరస. సరే, ఇంతకీ మీది ఏ కులం అమ్మాయ్?"
ఆమె నోటినుంచి ఈ ప్రశ్న తప్పకుండా వస్తుందని ముందే గ్రహించింది శ్వేత. తనేం చెప్పినా ఆమె అర్థం చేసుకోగలదన్న నమ్మకం లేదు. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న కుల వ్యవస్థ తాలూకు జీవం నరనరాన ప్రవహిస్తున్న వరలక్ష్మి తన మాటల్ని అర్థం చేసుకుంటుందా?
"కులం గురించి మీకంత పట్టింపు ఎందుకో తెలుసుకోవచ్చా?"
శ్వేత ప్రశ్నకి విసురుగా చూసింది వరలక్ష్మి. 'ఇంత పెద్దదాన్ని పట్టుకొని తన్నే ఎదురు ప్రశ్న వేస్తుందా ఈ బుడత, బొత్తిగా గౌరవం లేకుండా' అన్నట్లు చూసింది.
"అదేంటమ్మాయ్. ఏ కులం వాళ్లకైనా ఆ కులం గురించి పట్టింపు ఉండదా. మన పెద్దవాళ్లు పెట్టిన కట్టుబాట్లని కాదనడానికి మనమెవరం? వాళ్లు పిచ్చివాళ్లా?". వరలక్ష్మి అన్నదానికి నవ్వుతూ చూసింది శ్వేత.
"అసలు కులం ఎందుకు పుట్టిందో తెలిసి ఉంటే మీరిలా అనేవాళ్లు కాదండీ. కులాలు ఏర్పడక ముందు సమాజంలో వర్ణ వ్యవస్థ ఉండేది. బుద్ధుణ్ణి మీరు గొప్పవాడని ఒప్పుకుంటారు కదా. ఆయనే ఈ వర్ణ వ్యవస్థని వ్యతిరేకించాడు."
"కులాలు తెలుసు కానీ వర్ణ వ్యవస్థేమిటి?"
"వర్ణాలంటే - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని అప్పుడు నాలుగు వర్ణాల వాళ్లుండేవాళ్లు. మిగతా మూడు వర్ణాలవాళ్లూ శూద్రుల్ని హీనంగా చూసేవాళ్లు - ఇప్పుడు హిందువులు దళితుల్ని చూస్తున్నట్లు. ఎవరు ఏ వర్ణానికి చెందుతారనేది పుట్టుకనిబట్టి నిర్ణయించే ఈ వర్ణ వ్యవస్థని బుద్ధుడు ఖండించాడు. అయితే అందుకు విరుద్ధంగా బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థని జనంలో ప్రచారంలోకి తెచ్చారు."
"బుద్ధుడు ఒప్పుకోకపోతే ఆయన్ని దేవుడిగా కొలిచే జనం మాత్రం ఎందుకు ఈ వర్ణాల్ని పట్టుకున్నారు?" అడిగింది వరలక్ష్మి, ఈ ప్రశ్నకి జవాబు ఉందా? అని చూస్తూ.
"దానికి పెద్ద చరిత్రే ఉందండీ. కొద్ది మాటల్లో చెప్తాను. ఆ రోజుల్లో సమాజంలో స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది. దీనివల్ల అంతదాకా సాగుతూ వచ్చిన దూరప్రాంత వర్తకం దెబ్బతింది. స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ అంటే తమ అవసరాల్ని తామే తీర్చుకొనే వ్యవస్థ అన్నమాట. అందుచేత ఈ వర్తకంతో ముడిపడివున్న బౌద్ధ విహారాలనేవి క్షీణించిపోయాయి. బౌద్ధ మతానికి ఉన్న సామాజిక పునాది కూడా పోయింది. ఇక వర్ణాలనేవి స్వయంపోషక గ్రామీణ వ్యవస్థకి అతికాయి కాబట్టే వర్ణ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది."
"వర్ణాల గురించి చెబుతున్నావే కానీ కులాల సంగతి చెప్పవేం?"
"వాటి దగ్గరకే వస్తున్నాను. కాలక్రమంలో వర్ణాల స్థానంలోనే కులాలు వచ్చాయి. నాలుగు వర్ణాల మధ్య వర్గ సంకరం జరిగినందువల్ల కులాలన్ని ఏర్పడ్డాయని మనువు అనే ఆయన ఒక కల్పన చేశాడు. ఆయన కల్పనని తర్వాత బ్రాహ్మణులు ఓ శాస్త్రంగా కొనసాగించారు. ఫలితంగా ఇప్పుడున్న కుల వ్యవస్థ సాగుతూ వస్తోంది" చెప్పి టీ కలిపింది శ్వేత.
ఆమె చెప్పినదంతా ఆశ్చర్యంగా వింది వరలక్ష్మి. ఆమెకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. అయినా ఇంత చిన్న వయసులో ఈ సంగతులన్నీ ఎట్లా తెలిశాయి ఈ పిల్లకి? అదే అడిగింది.
"చదువుకోవడం చేత" చెప్పింది శ్వేత.
నిజమే. తను చదువుకోలేదు. అందుకే ఈ సంగతులేవీ తెలీదు. అయితే చదువుకున్న వాళ్లందరికీ ఈ సంగతులు తెలుసు కదా. ఈ కులాల్లో మంచంటూ లేకపోతే వాళ్లెందుకు ఊరుకుంటున్నారు? కులాల మధ్య పోట్లాటలు ఎందుకు సాగుతున్నాయి? తమ ఊళ్లోనే రెండు కులాల మధ్య గొడవలు వచ్చి ఒకళ్లనొకళ్లు కత్తులతోటీ, కటార్లతోటీ పొడిచి చంపుకోడం తనకు తెలుసు. మరెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి?
ఆమె సందేహం తెలుసుకొని "ముందు టీ తీసుకోండి" అని ఆమెకో కప్పు ఇచ్చి, ముందుగదిలోకి వచ్చి జగన్నాథానికో కప్పు ఇచ్చింది.
వసంత్ స్నానం చేసి బట్టలేసుకు వచ్చాడు.
"నువ్వు కూడా రెడీకా" అన్నాడు శ్వేతను ఉద్దేశించి.
"ఈ రోజు నేను సెలవు పెడుతున్నాను."
శ్వేత వంక ఆశ్చర్యంగా చూశాడు వసంత్. కళ్లతోనే సందేహ నివృత్తి చేసింది.
"అబ్బాయికి కూడా టీ ఇవ్వమ్మా" అంది వరలక్ష్మి.
"లేదండీ. తను ముందు టిఫిన్ చేశాకే" చెప్పింది శ్వేత.
ఈ పిల్ల అప్పుడే వసంత్ మీద పెత్తనం చేస్తోందా అన్నట్లు చూసింది వరలక్ష్మి. ఆమె తన గురించి ఏమనుకుంటుందో గ్రహించుకొని చిన్నగా నవ్వుకుంది శ్వేత.
వసంత్ ఆఫీసుకు వెళ్లిపోయాడు. జగన్నాథం టాయిలెట్‌లోకి వెళ్లాడు. అప్పుడు వరలక్ష్మితో అంది శ్వేత - "మీరిందాక ఓ ప్రశ్న అడిగారు కదా. చెప్తాను. ప్రతి కులం వారూ తమ కులం మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. తరతరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. వాళ్లలో చదువుకున్న వాళ్లకు కులాలు ఎందుకు పుట్టాయో తెలుసు. అయినా తెలీనట్లే ఉంటారు. అహంభావం అనేది వాళ్లనట్లా చేస్తుంది. 'ముందు ఎదుటివాడ్ని సంస్కరణకు ఒప్పుకోమను. అప్పుడు నేనూ ఒప్పుకుంటాను' అనే మనస్తత్వం మనది. ఇక కుల నిర్మూలన ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వాలు కూడా కులాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఇక అది అసాధ్యమనే అనుకోవాలి."
చెప్పి వరలక్ష్మి ముఖంలోకి చూసింది. తాను చెప్పింది ఆమెకు కొంచెం కూడా అర్థమై ఉండదని అనిపించింది. ఆమెతో ఇట్లా సంభాషించడం వృథా అని తోచింది.
"ఏమోనమ్మాయ్. నువ్వెనయినా చెప్పు. మా ఆయన కంటే నీకెక్కువ తెలుసుంటుందని నేననుకోను. ఎందుకొచ్చిన తగలాటం. పరువుపోవడం తప్ప. మీరిట్లా ఉండటం ఏం బావుంటుంది? మావాడంటే మూర్ఖుడు. మగాడు కాబట్టి వాడికొచ్చే నష్టంతో పోల్చుకుంటే నీకొచ్చే తిప్పలు చాలా ఎక్కువ. శుభ్రంగా మీ వాళ్ల దగ్గరకి వెళ్లిపో. అందరికీ బావుంటుంది."
వచ్చే కోపాన్ని బలవంతాన అదిమిపెట్టింది శ్వేత.
"ఎ మాటే వసంత్ వచ్చాక అతనితో చెప్పండి" అంది.
* * *
కొద్దికాలం గడిచాక జగన్నాథం నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది వసంత్‌కి.
"ఒరేయ్. నువ్వు చేసిన పనికి ఇక్కడందరూ ఉమ్మేస్తున్నారు. మా పెంపకం సరిగాలేదు కాబట్టే నువ్విట్లా తయారయ్యావంటున్నారు మీ బాబాయిలూ, మీ మావయ్యలూ. తెలిసిన ప్రతివాడూ వచ్చి 'మీవాడు హైద్రాబాద్‌లో ఎవతెనో ఉంచుకున్నాడంటగా' అంటుంటే నా నెత్తురు ఎట్లా మరుగుతుంటుందో అర్థం చేసుకో. వాళ్ల తాకిడికి బయటకి వెళ్లాలంటేనే దడగా ఉంటోంది. నువ్వు చేసిన వెధవ పని మీ బావకీ తెలిసి నీ చెల్లెల్ని నానా మాటలూ అంటూ, మన వంశాన్నంతా తిడుతూ కొడుతూ ఉంటే భరించలేక అది పుట్టింటికి చేరింది. ఎట్లాగో నచ్చెజెప్పి మళ్లీ అత్తగారింటికి తీసుకుపోతే అల్లుడు నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. ఈ జన్మలో మొదటిసారిగా ఒకరి కాళ్లు పట్టుకోవాల్సొచ్చింది.
దయచేసి నువ్వు ఈ ఛాయలకి రామాకు. ఏ కూస్తో ఉన్న శాంతి కూడా పోతుంది. నువ్వు పాటిస్తావన్న నమ్మకం లేకపోయినా నాదో సలహా. 'ఎవతెనో ఉంచుకున్నాడు' అనే మాట నీకు బాగానే ఉంటుందేమో కానీ జనానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి కనీసం ఆ పిల్లని పెళ్లయినా చేసుకుంటే కొంత నయంగా ఉంటుంది.
నీ దయవల్ల మీ అమ్మకి అదే నా భార్యకి అనారోగ్యం అమోఘంగా ఉంటోంది.
- ఇట్లు, జగన్నాథం."


- ఆంధ్రభూమి ఆదివారం, 27 ఏప్రిల్ 1997



Tuesday, May 10, 2016

Poetry: Break

విరామం

ఒక్కో షిఫ్టులో మాకు రెండు అరగంట బ్రేకులుంటాయి
పెడళ్లను తొక్కడం మేం ఆపగానే అంతంత భారీ యంత్రాలు
గోలపెట్టడం ఆపి నిశ్శబ్దమవుతాయి
మా చేతుల్లోనే అక్కడి లోహపు గొలుసులు పురుడు పోసుకుంటాయి
వాటిని వొంచుతాం, వొత్తుతాం, వెల్డింగ్ చేస్తాం,
సైజుల వారీగా ట్రిమ్మింగ్ చేస్తాం
యంత్రాల వేగంతో మా చేతులు పోటీపడుతుంటాయి
గొలుసు పుట్టాక నాణ్యతను పరీక్షిస్తాం
ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీ నుంచి సాగనంపుతాం
మా ఎమ్డీ విశాలమైన ఏసీ ఆఫీస్ పక్కనే
ఇరుకు కాంక్రీట్ నడవాలోంచి కిందుగా ఉండే గదికి
ఒకర్నొకరం నెట్టుకుంటూ పోతాం
మేం మనస్ఫూర్తిగా యంత్రాల్ని తాకాలనుకొనేది అక్కడే
మా కోసమే అవి ఎదురు చూస్తుంటాయి, కూనిరాగాలు ఆలపిస్తుంటాయి
ఆ యంత్రాలు మా వేళ్లను తెగ్గొట్టాలనుకోవు, నలగ్గొట్టాలనుకోవు
అక్కడి యంత్రాలు మాకు నీళ్లనిస్తాయి,
చాయ్ సమోసా బిస్కెట్‌నిస్తాయి
మా జేబుల్లోని వేడి వేడి నాణేల్ని మార్చుకోవడంలో
మా చేతులు తగిలి ఆ ఇత్తడి చక్రాలు మురికవుతాయి
లంచ్ బెల్ మోగిందంటే కాస్త ఊపిరి సలుపుతుంది
కొన్నిసార్లు మేం ఫ్యాక్టరీలోని వేడి, మడ్డి, జిడ్డుకు దూరంగా
తింటానికీ, 'టీ'కీ బయటకు వెళ్తుంటాం
టీ తాగి, తాజా చార్మినార్ సిగరెట్ దమ్ములు లాగి
మరి కొన్ని గంటల పాటు పని చెయ్యడానికి శక్తి నింపుకుంటాం
మళ్లీ రణగొణ ధ్వనుల ఫ్యాక్టరీకొచ్చేస్తాం
మా మెదడులేని శరీరాలు ఎప్పట్లాగే ఒకే రకమైన పని చేస్తుంటాయి
మోటార్ సైకిళ్ల గొలుసులు, భారీ యంత్రాల గొలుసులు పుట్టిస్తుంటాయి
మరుసటి రోజూ అదే పని మా కోసం ఎదురుచూస్తుంటే
మేం మొదటి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటాం.

- కవి సంగమం, 5 ఏప్రిల్ 2016.

Thursday, May 5, 2016

Profile of actress Devika

Original Name: Mohana Krishna
First Screen Name: Mohana Krishna (Puttillu and Pakkinti Ammayi)
Second Screen Name: Prameela (with Rechukka)
Third Screen Name: Devika (with Tamil film Mudhalali)
Last film as heroine: Rajakota Rahasyam (1971)
Film film as a character artiste after heroine: Pandanti Kapuram
Husband: Devadas (Tamil director)
As a producer: Tamil film Vengulippen (1971)
Died: 2 May 2002

Tuesday, May 3, 2016

Profile of actor Suri Babu

Original Name: Puvvula Suri Babu
Born: 22 February 1915
Birth Place: Bommaluru (Krishna District)
Parents: Lingam Bulli Subbayya, Srihari
First Film: Seetha Kalyanam (1934)
First Character: Gowthama Maharshi
First Wife: Chitra Devi
Second Wife: Rajeswari
Theater Company: Raja Rajeswari Natya Mandali
Play brought fame: Thara Sashankam
Died: 12 February 1968

Thursday, April 28, 2016

Short Story: Champion

ఛాంపియన్


సెప్టెంబర్ 9. ఓ దినపత్రికలో స్పోర్ట్స్ కాలం...
"రేపటి నుంచి జరిగే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సమరంలో ప్రపంచ ఛాంపియన్ ఆండ్రి లిబకోవ్ భారత గ్రాండ్‌మాస్టర్ 20 సంవత్సరాల అనంత ముఖేష్‌తో తలపడబోతున్నాడు. గత పోటీలలో సయితం భారత గ్రాండ్‌మాస్టర్ అయిన చేతన్ పద్మనాభన్‌ను 18 ఎత్తులలో ఓడించిన లిబకోవ్ ఈసారి మరింత సునాయాసంగా ముఖేష్‌ను ఓడించగలనన్న ధీమాతో ఉన్నాడు. లిబకోవ్‌తో పోల్చుకుంటే ముఖేష్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువ. భారత చేస్ క్రీడారంగంలో తారాజువ్వలా దూసుకొచ్చి వరల్డ్ చేస్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ రౌండ్లలో విజయం సాధించినప్పటికీ లిబకోవ్ ముందు అతడి దూకుడుకు పగ్గాలు పడే అవకాశమే ఎక్కువగా ఉంది. పద్నాలుగు సంవత్సరాలుగా ప్రపంచ చెస్ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న లిబకోవ్ మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకోగలనన్న ధీమాను వ్యక్తం చేశాడు. అతణ్ణి ఓడించడమంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లే ఉంటుంది.."
పేపర్ చదువుతున్న అనంత ముఖేష్ ఓసారి వాచీవంక చూసుకున్నాడు. సాయంత్రం 4 గంటలు. ఎదురుగా కూర్చున్న తన స్నేహితుడు, సెకండ్ అయిన చేతన్ పద్మనాభన్ వంక చూశాడు. "చూశావా ఈ పేపర్! అతడితో నేను పోటీపడ్డం పొట్టేలు కొండను ఢీకొన్నట్లు ఉంటుందట."
"చూశాను. నువ్వు కేవలం ప్రపంచ ఛాంపియన్‌షిప్పుకి క్వాలిఫై అయిన ఆటగాడివేగా. పైగా నీ ప్రత్యర్థి పద్నాలుగేళ్లుగా వరల్డ్ ఛాంపియన్ అయిన వ్యక్తి. అతడితో ఆడటం ఎట్లా ఉంటుందో పోయిన ఛాంపియన్‌షిప్పులో అనుభవించినవాణ్ణి."
చేతన్ చెప్తున్నదాంట్లో తప్పేమీ లేదు. అతడేమీ లిబకోవ్ తరపున వకాల్తా పుచ్చుకున్నవాడు కాడు.
"అయినా సరే. నువ్వు నీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడబోతున్నావు. గెలుపు ఎప్పుడూ ఒక్కడి సొత్తేమీ కాదు."
* * *
సెప్టెంబర్ 10. ఉదయం 10.30 గంటలు. లిబకోవ్, ముఖేష్‌లిద్దరూ పోటీ జరిగే గదిలోకి ప్రవేశించారు. టేబుల్ మీద చెస్ బోర్డూ, పావులూ సిద్ధంగా ఉన్నాయి. మొదటి గేం, మొదటి ఎత్తు వేసే ఛాన్సు లిబకోవ్‌కే దక్కింది. అతడి మొహంలో చిరునవ్వు తొంగిచూసింది. ముఖేష్ కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. మొదటి ఎత్తు వేయబోయే ముందు "నేను మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌ని అయినప్పుడు నువ్వు ప్రైమరీ స్కూలు కూడా దాటి ఉండవనుకుంటాను. అయితే యాభయ్యేళ్ల తర్వాత నువ్వు నీ మనవళ్లతో నాతో పోటీచేసిన విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు" అన్నాడు లిబకోవ్ నవ్వుతూనే.
ముఖేష్ ఏమీ బదులు చెప్పలేదు.
లిబకోవ్ తెల్లపావులతో రూయిలోపెజ్ విధానంతో గేంను మొదలుపెట్టాడు. ముఖేష్ డ్రాగన్ వేరియేషన్‌ను ఎంచుకున్నాడు. ఐదు ఎత్తులు వేయడంతోటే లిబకోవ్‌కు అర్థమైంది - తన చిన్నారి ప్రత్యర్థి సత్తా ఏమిటో. పోయిన ఛాంపియన్‌షిప్పులో డ్రాగన్ వేరియేషన్ విధానంతోనే చేతన్ పద్మనాభన్‌ను ఓడించాడు లిబకోవ్. ఇప్పుడు మొదటి గేంలోనే ముఖేష్ ఆ తరహా ఆటను ఎంచుకొన్నాడు. ఇదంతా ఇప్పుడు ముఖేష్‌కు సెకండ్‌గా ఉన్న చేతన్ వ్యూహంలో భాగమని వెంటనే లిబకోవ్‌కు అర్థమైపోయింది. మొదట్లో కనిపించిన నెర్వస్‌నెస్ ముఖేష్‌లో మచ్చుకైనా లేదు. చాలా ఏకాగ్రతతో ఆడుతున్నాడతను. 26 ఎత్తుల తర్వాత తను గెలిచే అవకాశం మచ్చుకైనా కనిపించకపోవడంతో లిబకోవ్ 'డ్రా'కు అంగీకరించక తప్పలేదు. పోటీని అమితాసక్తితో తిలకిస్తున్న ప్రేక్షకుల్లు, చెస్ క్రీడాకారులు చప్పట్లు చరిచారు. ఆటని సాంతం చూసిన ఓ అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ "మొదట నల్లపావులతో ఆడుతూ 'డ్రా' చేసిన ముఖేష్‌కిది గొప్ప ఆశావహమైన ప్రారంభం" అని వ్యాఖ్యానించాడు.
ముఖేష్ తన సీట్లోంచి లేస్తూ లిబకోవ్ వంక చూశాడు. లిబకోవ్‌లో అసహనం చోటు చేసుకున్నట్లు అతడి ముఖంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుండటం గమనించాడు. బయటకు రావడంతోటే యాపిల్ జ్యూస్‌తో ఎదురయ్యాడు చేతన్. "కంగ్రాట్స్.. ఇది నీకు మొదటి విజయం లాంటిది. అయితే ఇక్కడినుంచి నువ్వు మరీ జాగ్రత్తగా ఆడాలి" అని చెప్పాడు.
ముఖేష్‌కు తెలుసు, పోయిన ఛాంపియన్‌షిప్పులోనూ ఇదే రీతిలో చేతన్ మొదటి గేంలో లిబకోవ్‌ను నిలువరించినప్పుడు పత్రికలన్నీ ఆకాశానికెత్తేశాయి. రికార్డ్ స్థాయిలో మొదటి ఎనిమిది గేముల్నీ 'డ్రా' చెయ్యగలిగిన చేతన్ 9వ గేంలో లిబకోవ్‌పై నెగ్గి సంచలనం సృష్టించాడు. అయితే కష్టకాలంలోనూ అమిత స్థైర్యాన్ని ప్రదర్శించగల లిబకోవ్ మరుసటి గేంలోనే విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడమే గాక 20 గేంల పోటీని 18 గేంలలోనే ముగించి విజయం సాధించాడు. ఒకసారి ఓడితే ఆ ప్రభావం మిగిలిన గేంల మీద కూడా పడుతుందనటానికి చేతన్ నిదర్శనం. లిబకోవ్ లాంటి క్రీడాకారుడి విషయం వేరు. ఓడినకొద్దీ ప్రతీకారంతో రగిలే వ్యక్తి అతను. ఈ సంగతిని ముఖేష్‌కు ముందుగానే వివరించాడు చేతన్. లిబకోవ్ ఆడిన గేములన్నింటినీ శ్రద్ధగా విశ్లేషించి చెప్పాడు.
* * *
సెప్టెంబర్ 11. అసహనంగా కనిపిస్తున్నాడు లిబకోవ్. అతడి ప్రతి చర్యలోనూ అది కనిపిస్తోంది. చూసే వాళ్లందరూ అతను టెన్షన్లో ఉన్నాడని ఇట్టే చెప్పేస్తారు. అతడు కోరుకుంటున్నదీ అదే. మిగతా వాళ్ల సంగతి కంటే తన ఎదురుగా ఉన్న ముఖేష్ తనని అలాగే అనుకోవాలని అతడి వాంఛ. ఎదుటివాళ్లను ఏదో ఓ రకంగా బోల్తా కొట్టించడానికి అతడెంచుకునే మార్గాల్లో ఇదొకటి. అసహనంతో ఉండేవాళ్లు త్వరగా ఆటపై పట్టుకోల్పోతారన్న చిన్న పాయింట్ మీదే అందరూ బేస్ అవుతారనీ, అలా అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తారనేది లిబకోవ్ వ్యూహం. బోర్డుమీద పావులు కదులుతున్నాయి.. ముఖేష్ తెల్ల పావులు త్వరగా, లిబకోవ్ నల్ల పావులు నిదానంగా!
15వ ఎత్తు. ముఖేష్ తన శకటాన్ని లిబకోవ్ గుర్రానికి గురిపెట్టాడు. అంతటా నిశ్శబ్దం. సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం. గుర్రాన్ని పక్కకి తప్పిస్తే కింగ్‌కి 'చెక్' అవుతుంది. కింగ్‌ని జరపడానికి ఎటూ దారిలేని స్థితి. ఇంతవరకూ లిబకోవ్ అట్లాంటి స్థితిని ఎదుర్కోలేదు. మరోవేపు మినిస్టర్ కాచుకుని ఉన్నాడు. ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు. లిబకోవ్ మౌనంగా రిజైన్ చేసి తన గదికి వెళ్లిపోయాడు. ముఖేష్ సెకండ్ చేతన్‌తో ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ సభ్యుడు స్టీవ్ బెకర్ అన్నాడు - "కొద్ది రోజుల్లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం."
* * *
సెప్టెంబర్ 12. ఒక దినపత్రికలో స్పోర్ట్స్ కాలం - ".. అతిపెద్ద ఓటమి. ఇరవయ్యేళ్ల కుర్రాడి చేతిలో ప్రపంచ ఛాంపియన్, కంప్యూటర్‌నే ఓడించిన మేధావి పరాజయం. కేవలం 15 ఎత్తుల్లోనే ఆండ్రీ లిబకోవ్‌ను రెండవ గేంలోనే ఓడించి భారత గ్రాండ్‌మాస్టర్ అనంత ముఖేష్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఏమి జరిగిందో అర్థంకాని స్థితిలో లిబకోవ్ మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ముఖేష్ చెస్ క్రీడాభిమానుల హృదయాల్ని దోచుకున్నాడు. రెండవ గేంలో అతడు ఆటపై పూర్తి పట్టు సాధించాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే వైనం చూస్తుంటే ప్రపంచ ఛాంపియన్ కాగల అర్హతలు అన్నీ అతనిలో ఉన్నాయనిపిస్తున్నది..". కాఫీ తాగడం పూర్తిచేసిన ముఖేష్ ఆ ఆర్టికల్‌ను కట్‌చేసి డైరీలో దాచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌పై ఒక గేంలో విజయం సాధించడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదకరమైంది. అది అనుకోని తప్పుల్ని చేయిస్తుంది. ఏకాగ్రతని దెబ్బతీస్తుంది. పొగడ్తలు కూడా సంపూర్ణ విజయానికి అడ్డంకులే. అందుకే అన్ని గేంలూ పూర్తయ్యేవరకు పేపర్ చూడకూడదని నిశ్చయించుకున్నాడు.
సెప్టెంబర్ 25. వాతావరణం భిన్నంగా ఉంది. అద్దాల గదిలో ఆట జరుగుతుంటే పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి ఆటను చూస్తున్నారు. 20 గేంల పరంపరలో అది 11వ గేం. 10వ గేంలో ఎట్టకేలకు లిబకోవ్ 64 ఎత్తుల్లో విజయం సాధించడంతో స్కోరు 5-5 అయ్యింది. అంతకుముందు జరిగిన 7 గేంలూ డ్రా అయ్యాయి. అయితే 10వ గేంలో లిబకోవ్ నల్ల పావులతో ఆడినప్పటికీ విజయం సాధించడంతో 11వ గేంకు ప్రాధాన్యం వచ్చింది. 
రష్యన్ గ్రాండ్‌మాస్టర్ వాసిలీ రుబ్కోవ్ దీనిపై వ్యాఖ్యానిస్తూ "లిబకోవ్ రిథంలోకి వచ్చేశాడు. గత ఛాంపియన్‌షిప్ ఫలితం పునరావృతం కాబోతున్నది" అని అప్పుడే తేల్చేశాడు. అప్పటి పోటీలో చేతన్ పద్మనాభన్ 10వ గేంలో ఓడాక మళ్లీ తేరుకోలేకపోయాడు.
ముఖేష్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. తెల్లటి ప్యాంటూ, షర్టూ, పైన నేవీ బ్లూ కోటు వేసుకున్నాడు. ముందు కోటు మధ్యలో నుంచి ఎర్రని టై కనిపిస్తున్నది. లిబకోవ్ తన వ్యూహానికి భిన్నమైన ఆటను ప్రారంభించాడు. అలా చేయడం ద్వారా ప్రత్యర్థిలో కంగారు పుట్టించడం అతడి వ్యూహం. ముఖేష్‌లో ప్రశాంతత చెక్కుచెదరలేదు. లిబకోవ్ ఎంత దూకుడుతో ఆడుతున్నాడో అంత వేగంతోనూ అతను సమాధానం చెప్తూ వచ్చాడు. ఆ గేములో ఫలితం ఎటూ తేలలేదు. గేంను డ్రా చేసిన వెంటనే లిబకోవ్ చిన్నగా నవ్వుతూ ముఖేష్‌కు షేక్‌హ్యాండిచ్చి "బాగా ఆడావు" అని అభినందించాడు. అందులో ఎలాంటి తిరకాసూ లేదు. నిజంగానే ముఖేష్ ఆ గేమును గొప్పగా ఆడాడు. లిబకోవ్ తప్పనిసరిగా ఆ గేములోనూ గెలుస్తాడని భావించిన పలువురు చెస్ క్రీడా విశ్లేషకులు సైతం ముఖేష్ ఆటతీరును అభినందించకుండా ఉండలేకపోయారు. అనంత ముఖేష్‌ను 'ఎ.కె.'గా పిలవడం మొదలుపెట్టారు.
ఈలోగా పత్రికలవారు ముఖేష్‌ను కలిశారు. "మిస్టర్ ముఖేష్! మీరు మెదడు బదులు కంప్యూటర్ పెట్టుకొని వచ్చారేమిటి?" అని ఓ విలేకరి నవ్వుతూ ప్రశ్నించాడు. 
ముఖేష్ కూడా నవ్వాడు. "అదేం లేదు."
"అయితే మీరు ఇంత వేగంగా ఎత్తులు ఎలా వేయగలుగుతున్నారు?"
"ఏకాగ్రత మూలంగా."
"ప్రపంచ చెస్ రంగంలోకి ఉన్నట్లుండి ఎలా ఊడిపడ్డారు?"
అతని వంక ఓ క్షణం అలాగే చూశాడు. బహుశా అతనికి తెలీకపోయుండొచ్చనుకొని చిరునవ్వుతో "నేను మూడేళ్ల నుంచీ భారత జాతీయ ఛాంపియన్‌ని. రెండేళ్ల క్రితమే ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్పును సాధించాను" చెప్పాడు.
"కానీ మీరు ఒక్కసారిగా సీనియర్ ఛాంపియన్‌షిప్పులో ఫైనల్స్‌కి ఎలా చేరుకోగలిగారు?".
ముఖేష్ పక్కనే ఉన్న చేతన్ వంక చూశాడు. "నాకు సరైన మార్గదర్శి లభించడం వల్ల."
"ఎవరతను?"
"చేతన్.. చేతన్ పద్మనాభన్. నా సెకండ్."
* * *
అక్టోబర్ 7. ముఖేష్‌కు సూచనలిస్తున్నాడు చేతన్. అప్పుడతను గురువైతే ముఖేష్ శిష్యుడు. చేతన్ చెప్తున్న ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన వాడిలాగా మరో ధ్యాస లేకుండా చెప్తున్నాడు చేతన్. ఇద్దరి మధ్యా ఉన్న చదరంగం బోర్డు గళ్లపై పావులు చకచకా దిశలు మార్చుకుంటున్నాయి.
రెండు సంవత్సరాల నుంచీ ముఖేష్‌ని తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాడు. ప్రపంచ జూనియర్ చెస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా ముఖేష్ అవతరించడంతోటే చేతన్ నిర్ణయించుకున్నాడు.
పోయిన ఛాంపియన్‌షిప్పులో లిబకోవ్ గెలవడంతోటే తన వంక చూసి పరిహాసంగా నవ్వడం అతడి హృదయంలో ఇంకా మెదులుతూనే ఉంది. అందుకే తను ఏర్పరచుకున్న లక్ష్యానికి ఆయుధంగా ముఖేష్‌ని ఎంచుకున్నాడు. ఓటమిలోనూ చెక్కుచెదరని ప్రశాంతత ముఖేష్‌లో కనిపించడం అతణ్ణి ఆకట్టుకున్నది. లిబకోవ్‌ని ఛాలెంజ్ చేసే క్రమంలో ముఖేష్‌ని దగ్గరుండి ఒక్కొక్క మెట్టే ఎక్కించాడు. ఎక్కడా తప్పటడుకు వేయకుండా అనుకున్నది అనుకున్నట్లే సాధిస్తూ వచ్చాడు ముఖేష్. చివ్వరి మెట్టుదాకా చేరుకున్నాడు. ఆఖరి మెట్టు కూడా విజయవంతంగా ఎక్కగలిగితే అతడికి అంతకుమించిన ఆనందం లేదు. 
మరుసటి రోజునే ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి గేం జరగబోతున్నది. స్కోరు 9.5-9.5గా ఉంది. లిబకోవ్ డ్రా చేసి 10 పాయింట్లు పొందితే చాలు.. ప్రపంచ చెస్ కిరీటం మళ్లీ అతడి వశమవుతుంది. ముఖేష్ మాత్రం ఛాంపియన్‌షిప్ గెల్చుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిందే!
అటువంటి సమయాల్లో సహజంగా రెండో వ్యక్తిపైనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. "ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారతీయులు బలహీనం" అన్న లిబకోవ్ పలుకులు చేతన్ స్మృతిపథంలో మెదులుతున్నాయింకా. 
"రేపు నువ్వు భారతదేశానికి గొప్ప కానుకని ఇవ్వబోతున్నావు" - ముఖేష్ భుజంతట్టి చెప్పాడు చేతన్.
'నేను నీకిచ్చే గురుదక్షిణ అదే' అనుకున్నాడు ముఖేష్. ఆ రాత్రి అతడికి హాయిగా నిద్రపట్టింది.
* * *
అక్టోబర్ 8. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్. ఆటగాళ్లిద్దరూ దర్పంగా అద్దాల గదిలోకి ప్రవేశించారు. లిబకోవ్ ముఖంలో ఎలాంటి కంగారూ లేదు. కేవలం 'డ్రా'తో కాకుండా 20వ గేంలో గెలుపుతో ఛాంపియన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలని అతడు కోరుకుంటున్నాడు. గెలుపు సాధ్యమనే ధీమాతో అతడున్నాడు. 
మరోవైపు అదే నవ్వు, అదే ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తున్నాడు ముఖేష్. ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్‌ని ఎదుర్కొనే ఛాలెంజర్‌గా అవతరించిన రెండో భారతీయుడిగా అతడు అప్పటికే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే తొలి ఛాంపియన్ గౌరవం దక్కాలంటే తాను ఎంత ప్రతిభ చూపించాలో అతడు ఆలోచించడం లేదు. యుద్ధానికి సర్వసన్నద్ధమై వచ్చిన సైనికుడిలా లేడతను. పోరాటానికి వచ్చిన వ్యక్తిని సైతం మిత్రుడిగా చేసుకునే గొప్ప తేజస్సు అతడిలో వెలుగుతున్నది.
ఆట మొదలయ్యింది. 10 ఎత్తుల వరకూ మామూలుగానే సాగింది. ముఖేష్ సెంటర్ కౌంటర్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం లిబకోవ్‌ను కొద్దిసేపు విస్మయపరిచింది. అది చేతన్‌కు అత్యంత ప్రీతికరమైన వ్యూహం. లిబకోవ్ మాత్రం ప్రయోగాలకు పూనుకోకుండా డ్రాగన్ సిసిలియన్‌నే అనుసరించాడు. 
రెండు గంటలు గడిచాయి. ముఖేష్‌కు నాలుగు బంటులు మిగలగా, లిబకోవ్‌కు ఒక బంటు అదికంగా ఉంది. అతడు ఆధిక్యంలోకి వెళ్తున్నట్లు ప్రేక్షకులు తేల్చేశారు. రష్యన్ గ్రాండ్‌మాస్టర్ రుబ్కోవ్ తనకు కాస్త దూరంలో ఉన్న చేతన్ పద్మనాభన్ వంక చూశాడు. అతని ముఖంల్లో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఎదురుగుగా జరుగుతున్న ఆటను తిలకించడంలో అతడు నిమగ్నమై ఉన్నాడు. 
వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ముఖేష్ ఓ శకటాన్ని కోల్పోగా లిబకోవ్ గుర్రం ఒకటి బోర్డు నుంచి తప్పుకుంది. ముఖేష్ బంటుని తెల్లగడిలోంచి నల్లగడిలోకి జరిపాడు చాలా క్యాజువల్‌గా. లిబకోవ్ కళ్లు పెద్దవయ్యాయి. అందులో వ్యూహం ఏమిటన్నది పది నిమిషాలపాటు ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. తలెత్తి ముఖేష్‌ని చూశాడు. ఏదో అనీజీగా ఉన్నట్లనిపించింది. మరోసారి బోర్డువంక చూసి ఆ బంటుని మరో గుర్రంతో కబళించాడు. ముఖేష్ వద్ద మూడు బంటులు మిగిలాయి. మరో రెండు ఎత్తులయ్యాయి. ముఖేష్ తన తెల్ల శకటంతో నల్ల గుర్రాన్ని 'స్మాష్' చేశాడు. లిబకోవ్‌కు తలపట్టుకోవాలనిపించింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అప్పటికే అతడు పెదవులు బిగించడం రష్యన్ గ్రాండ్‌మాస్టర్ రుబ్కోవ్ గమనించాడు. అతడి ముఖంలో రంగులు మారాయి.
40 నిమిషాలు గడిచాయి. లిబకోవ్ వద్ద రెండు శకటాలు, ఒక ఏనుగు, మినిస్టర్, మూడు బంట్లు మిగలగా, ముఖేష్ వద్ద ఒక శకటం, రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, మినిస్టర్, రెండు బంట్లు మిగిలాయి. గుర్రంతో లిబకోవ్ కింగ్‌కు 'చెక్' చెప్పి కుర్చీలోంచి లేచాడు ముఖేష్. ఆట మధ్యలో అతడింతవరకూ అలా లేవడం జరగలేదు. ఆట ఏమీ ముగింపుకు రాలేదు. లిబకోవ్ ఆలోచిస్తున్నాడు. వెంటవెంటనే వ్యూహరచన చేశాడు. ముఖేష్ గుర్రాన్ని లిబకోవ్ ఏనుగు పక్కకు తప్పించింది.
గంట గడిచింది. బోర్డుమీద ఆధిక్యత ఎవరిదన్నది చూస్తున్నవాళ్లకు అర్థం కాలేదు. నలభై ఐదవ ఎత్తు. లిబకోవ్ మినిస్టర్‌ని ఇరకాటంలో పెట్టాడు ముఖేష్. ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ సభ్యుడు స్టీవ్ బెకర్ "గొప్ప ఎత్తు" అనరిచాడు. లిబకోవ్ గట్టిగా తన 'మినిస్టర్'ని పట్టుకున్నాడు. గత్యంతరమే లేదు. అతడు మినిస్టర్‌ని పోగొట్టుకున్నాడు - ముఖేష్ శకటానికి బదులుగా.
యాభై ఒకటవ ఎత్తు వేశాడు ముఖేష్. పోటీ చూస్తున్న చేతన్ ఒక్కసారిగా ఉద్వేగం అణచుకోలేక పక్కనే ఉన్న స్టీవ్‌ని కావలించుకున్నాడు. పద్నాలుగు సంవత్సరాలు ప్రపంచ చెస్ క్రీడారంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గొప్ప మేధావి ఆండ్రీ లిబకోవ్ నిస్సహాయంగా ఓటమిని ఒప్పుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. రెండు నిమిషాల పాటు అక్కడ మరో రకమైన శబ్దమేమీ వినిపించలేదు, ప్రేక్షకుల చప్పట్లు తప్ప. అందరి నోళ్లలోనూ "ఏకే.. ఏకే.." అనే మాటే. 
ముఖేష్ బయటకు రావడంతోటే చేతన్ గట్టిగా అతణ్ణి కావలించుకొని నుదిటిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అనుకున్నది సాధించానన్న తృప్తి అతడి కళ్లల్లో కనిపించింది. "నా గురుదక్షిణ చెల్లించాను" అన్నాడు ముఖేష్.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంటూ తన విజయాన్ని తన సెకండ్ అయిన చేతన్ పద్మనాభన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు ముఖేష్.
* * *
అక్టోబర్ 8. దినపత్రికలోని స్పోర్ట్స్ కాలం. "ప్రపంచ చెస్ వేదికపై కొత్త ఛాంపియన్ ఆవర్భవించాడు. ఒక సుదీర్ఘ శకం ముగిసి కొత్త శకం మొదలయ్యింది. 14 సంవత్సరాల పాటు చెస్ రారాజుగా వెలిగిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ ఆండ్రీ లిబకోవ్ అక్టోబర్ 8న తన ఛాంపియన్ హోదాని 20 సంవత్సరాల 'వండర్ బాయ్' ముఖేష్‌కు కోల్పోయాడు. ఆఖరి గేం వరకూ సాగిన పోటీలో 10.5-9.5 పాయింట్ల తేడాతో లిబకోవ్‌పై ముఖేష్ అద్భుత విజయం సాధించాడు. అతడు తన విజయాన్ని చేతన్ పద్మనాభన్‌కు అంకితమిచ్చి తమ మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చాటుకున్నాడు. ఇద్దరు భారతీయుల కృషి ఫలితంగా ప్రపంచ చేస్ రంగంలో భారతదేశం శిఖరాగ్రాన్ని చేరుకున్నది.."
పేపర్ చూస్తున్న చేతన్ పద్మనాభన్ అనుకున్నాడు - 'లిబకోవ్! ఇప్పుడు గెలించింది ముఖేష్ కాదు, నేను! భారతీయుల్లోనూ ఒత్తిడిని స్థైర్యంతో ఎదుర్కొని విజయం సాధించే మొనగాళ్లున్నారని ఒప్పుకుంటావనుకుంటాను.'

- ఈనాడు ఆదివారం, 21 జూలై 1996

Thursday, April 21, 2016

Poetry: Aame (She)

ఆమె

లోకం నేనేమిటో చెప్పక ముందే
నన్ను నేను తెలుసుకోవాలని ఉంది
నేనెప్పుడూ అమ్మ కథ అడగలేదు
చిత్రం.. అమ్మ కూడా తన కథ చెప్పలేదు
నా కథ నా డైరీల్లో భద్రంగా ఉంది
నా డైరీలు చూస్తుంటే నాతో నేను సంభాషిస్తున్నట్లే ఉంటుంది
నా ఇన్‌ఫాచ్యుయేషన్స్, నా భగ్న ప్రేమలు,
నా అనుభూతులు, నా అనుభవాలు నాతో నేను
పంచుకుంటున్నట్లే ఉంటుంది
నా కథ చెబుతోంది
నాది అనుకున్నదేదీ నాది కాదని
నాకు అర్థమవుతోంది
ఆనంద క్షణాలు స్వల్పమని
బాధామయ సందర్భాలు అనల్పమని
అందరూ ఉండీ ఒక స్త్రీగా
ఎంత ఒంటరినో బాగా తెలిసింది

- కవితాఝరి (ఫేస్‌బుక్ గ్రూప్), 5 ఏప్రిల్ 2016

Thursday, April 14, 2016

Wednesday, March 30, 2016

Thursday, March 24, 2016

Short Story: Palayanam (Retreat)

కథ: పలాయనం


రోజులన్నీ ఒక్కలాగే నడుస్తుండటంతో మార్పు కావాలని హృదయం ఆరాటపడుతోంది. జీవితానికి మార్పు చాలా అవసరమనీ, మార్పే లేకపోతే జీవితం నిస్సారమవుతుందనీ అనుభవానికి వచ్చింది. నాలాంటి దానికైతే మార్పు మరీ అవసరమనుకుంటాను. కొన్ని మార్పులు సంతోషాన్నిస్తే చాలా మార్పులు విషాదాన్ని మిగులుస్తాయి. అయినా కానీ మార్పు కావాల్సిందే.
కాలేజీ రోజుల్లో మార్పు కోసం ఎన్నడూ తాపత్రయపడలేదు. ఆ రోజులు ఎట్లా గడచిపొయ్యాయో! మళ్లీ మళ్లీ ఆ రోజులు రావాలని ఎంతగా హృదయం క్షోభించినా, ఆశించినా నా కోసమని అవి వెనక్కి రావు కదా!
జగన్‌తో ఆ కాలమంతా ఎప్పటికీ మరవలేని మధురస్వప్నంలా నిలిచిపోయింది. ఆ వెంటనే నా పిరికితనమూ నన్ను వెక్కిరిస్తుంది.
* * *
సైకిల్ మీదనే కాలేజీకి పోయేదాన్ని. అట్లా ఓ రోజు సైకిల్‌పై పోతుంటే జగన్ చిన్నగా నవ్వాడు. అతను కాలేజీకి నడిచివచ్చేవాడు. జగన్ నవ్వినా నాకు నవ్వాలని తోచలేదు. అయినా కానీ నాకు తెలీకుండానే, నా ప్రయత్నమేమీ లేకుండానే నా పెదాల మీదికి నవ్వు వచ్చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. జగన్ నవ్వితే బాగుంటుంది. అంత నిర్మలంగా నవ్వే మగాడు ఇంతదాకా నాకు తారసపడనే లేదు. అతను నవ్వితే ఏదో ఆనందం హృదయంలో కలగడం నాకే చిత్రంగా తోచింది.
అప్పట్నించీ మా మధ్య 'పలకరింపు నవ్వులు' మొదలయ్యాయి.
'రేణుక నా వంక చూసి ఒక్క నవ్వు విసిరితే చాలును' అనుకునే అల్ప సంతోషులు.. జగన్ అది సాధించేసరికి అసూయతో కుళ్లుకోడం నాకు తెలుస్తూనే ఉంది.
నవ్వులతో పాటుగా మా మధ్య మాటలు కూడా మొదలయ్యాయి. ఏ రోజునైనా జగన్‌తో క్యాంపస్‌లో మాట్లాడుతుంటే కాలేజీ మొత్తం మా వంకే తిరిగి చూస్తోందని నేను గమనించాను. అయినా నేను సిగ్గుపడలేదు, భయపడలేదు. సాధారణ ఆడవాళ్లకు మల్లే ఇంటి బయట ఏ పరాయి మగాడైనా పలకరిస్తే కుచించుకుపోయే, భయపడి దిక్కులు చూసే రకాన్ని కాను గనక చాటుమాటున ఎవరేమనుకున్నా నేను ఖాతరు చేయదలచుకోలేదు. 'చూస్తే చూడనీ' అనే నా రెబల్ మనస్తత్వాన్ని జగన్ అమితంగా ఇష్టపడ్డాడు.
కాలేజీలో చేరిన రెండో యేడు కాలేజీ మేగజైనులో నేనొక వ్యాసం రాశాను. ఈ పురుషాధిక్యపు సొసైటీలో పురుషులు స్త్రీలనెట్లా వంచించి అణచి వేస్తున్నారో లోకంలో యథార్థంగా జరుగుతోన్న ఇన్సిడెంట్లు కొన్నింటిని ఉదహరిస్తూ ఈ మగవాళ్ల మనస్తత్వాన్ని చెండాడేశాను. స్త్రీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని తామే తెలుసుకోలేని స్థితిలో ఉన్నారనీ, ఆ స్థితి నుంచి వాళ్లు బయటపడి ఆలోచనలు చేసే దిశగా పయనిస్తేనే కానీ స్త్రీకి సొంత జీవనం అనేది ఏర్పడదనీ నా హృదయంలోని వ్యథనంతా అందులో వ్యక్తం చేశాను.
చిత్రమేమంటే ఇది చదివి నాపై యుద్ధానికి వచ్చింది మగవాళ్లు కాదు, నా స్నేహబృందంలోని ఆడవాళ్లే. నా రాతల్ని నా మీదికే తిప్పికొట్టాలని వాళ్లు ప్రయత్నించారు. నేను చలించలేదు. నవ్వుతో "మనం చేసే తప్పుల్ని మనమే తెలుసుకోలేని స్థితిలో మనమున్నాం. నా మీదికి మీరిట్లా యుద్ధానికి వొచ్చినప్పుడే అది తెలుస్తోంది" అన్నాను. అప్పటికి మళ్లీ ఎవరూ నోరెత్తలేదు.
* * *
నా బలవంతంపై జగన్‌ను కన్యాశుల్కం సినిమాకి తీసుకుపోయాను. అయిపోయాక అందులోని నటులు తమ పాత్రలకెట్లా న్యాయం చేశారో చర్చించుకుంటూ వస్తున్నాం.
ఇట్లా మాట్లాడుకుంటుండగానే ఊహించని విధంగా ఉరుములూ, మెరుపులూ లేకుండానే వర్షపు చినుకులు మొదలయ్యాయి.
ఆందోళనగా నేను జగన్ వొంక చూశాను. అతడి మొహంలో ప్రశాంతత చెక్కు చెదరకుండా ఉంది. చినుకులు కాస్తా జడివానగా మారాయి. తలదాచుకునేందుకు దగ్గర్లో షెల్టర్ వంటిదేమీ కనిపించకపోవడం చేత వేగంగా నడుస్తున్నాం. అంతలోకి జగన్ రూం వచ్చేసింది. అక్కడకి మా ఇంటికి చేరాలంటే ఎంతలేదన్నా పది నిమిషాలు పడుతుంది.
జగన్ రూం తాళం తీస్తుంటే "నేను ఇంటికి వెళ్లిపోతాను జగన్" అన్నాను.
"ఇంట్లోకిరా. తగ్గినాక వెళ్లొచ్చు కదా" అన్నాడు నావంక చూస్తా. కానీ వాన తగ్గుతుందా ఇప్పట్లో...?
నేనిక రెట్టించలేదు. మౌనంగా జగన్‌తో రూంలోనికి నడిచాను. ఇంతకు ముందు చాలా సార్లు అక్కడికి వచ్చి ఉన్నా ఇప్పటి స్థితి వేరు. నాలో ఏదో తెలీని కలవరం కలుగుతోంది. ఒళ్లు మొత్తం తడవడంతో వొణికిపోతున్నాను చలితో. వర్ష బిందువులు తలమీంచి జారి బుగ్గల్ని స్పృశిస్తూ జాకెట్లోకి జారటం తెలుస్తోంది.
మగవాడు కాబట్టి మొహమాటమేమీ లేకుండా జగన్ పొడిబట్టల్లోకి మారాడు. మరి నేనో? ఏమీ తోచకుండా ఉంది.. ఆ నిమిషాన. తలుపువద్ద నిల్చొని బయట వానని చూస్తున్నా.
"రేణుకా!" అని జగన్ పిలవడంతో వెనక్కి తిరిగాను.
"బట్టలు మార్చుకుంటావా. జలుబు చేస్తుందేమో అట్లానే ఉంటే. మరి నా వద్ద ఆడవాళ్ల బట్టలు లేవు" అని తన చొక్కా, పైజమా ఇవ్వబోయాడు.
"వద్దు జగన్. తల తుడుచుకోడానికి టవల్ ఇవ్వు చాలు" అన్నాను, చిన్న గొంతుతో.
"ఏయ్.. సిగ్గుపడుతున్నావ్ కదూ. సరే నీ ఇష్టం" అంటూ టవల్ ఇచ్చాడు. తను బాత్‌రూంలోకి పోయి వచ్చాడు.
ఈ లోపల తల తుడవడం పూర్తిచేసి అతడు బయటకు రావడంతోనే నేను బాత్‌రూంలోకి పోయి తడిసిన బట్టల్ని పిండుకున్నాను.
బయట వర్షం ఆగకుండా పడ్తూనే ఉంది. నేను మళ్లీ తలుపు వద్ద నిల్చున్నాను. జగన్ చాపపై కూర్చున్నాడు బాధేమీ లేకుండా. నాకేమో అనీజీగా ఉంది, ఇట్లాంటి స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని.
"తగ్గేదాకా అక్కడే నిల్చుంటావా?"
'ఏం చేయమన్నావ్ మరి?' అన్నట్లు చూశాను, జగన్ చూపులో ఏదో తేడా అవుపించింది. ఎందుకో అర్థమవడంతోనే అంత వణుకులోనూ ఒళ్లు ఝల్లుమంది. చలి స్థానంలో వేడి రాజుకుంటోంది. నాకే ఇట్లా ఉంటే, పాపం మగాడు.. ఊరకనే ఉద్వేగపడే జగన్‌కు ఎట్లా ఉందో. నా నుంచి ఎట్లాంటి సంకేతం అందిందో.. చాపపై కూర్చున్నవాడల్లా చప్పున లేచి నా దగ్గరకు వచ్చేశాడు. నాకంతా ఇది ఏదో కలలో జరుగుతున్నట్లుందే కానీ వాస్తవమన్నది స్ఫురించకుండా ఉంది.
నా ఎదురుగా నిల్చొని భుజాలమీద చేతులు వేశాడు జగన్. అతని చేతిపై నా చేయి వేసి అతని కళ్లలోకి చూశాను. నాపై అధికారమంతా తనదేనన్నట్లు చూస్తున్నాడు. తెలుస్తూనే ఉందిప్పుడు నాకు, నా నరాలు నా స్వాధీనం తప్పిపోతున్నాయని. ఏం చెయ్యను? 'ఛీ.. దుర్మార్గుడా. ఇదా నీ అసలు రూపం' అంటూ చెంప పగలగొట్టేదాన్నే మరొకరైతే. నా ముందున్నది జగన్ అయినప్పుడు, అతనే నా జీవితం అనుకున్నప్పుడు ఎట్లా అనను, ధిక్కరించను?
అట్లానే నా తలని అతని ఛాతీపై వాల్చేసి కావలించుకున్నాను. నా నుదురుని ముద్దాడి "రేణుకా! ఐ లవ్ యూ" అన్నాడు నాపై ఆరాధననంతా తన కంఠంలోకి తెచ్చుకొని.
మాట్లాడకుండా మరింత గట్టిగా అతణ్ణి వాటేసుకున్నాను.
"ఆలస్యమైతే ఇంట్లో కోప్పడతారేమో."
"పడితే పడనీ. నీ తర్వాతనే ఏదైనా, ఏమైనా."
"రేణూ!".. జగన్ కంఠంలో వొణుకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంక అతణ్ణి నమ్మకుండా ఉంటానికి వేరే ఆధారం అవసరమేంటి నాకు? నేనేమైపోయినా చింతలేదు నాకు. అతడి కావలింతల్లోని హాయి ముందు ఇంట్లో మావాళ్లు పెట్టే చీవాట్లు ఎంతనీ!
"నేను స్వార్థపరుణ్ణి కాలేను. పద.. వాన వెలుస్తున్నట్టే ఉంది."
అవును, వాన వెలుస్తోంది. కానీ.. కానీ. తనకు ఇంక నేనేమీ అడ్డు చెప్పనని తెలిసికూడా.. జగన్.. ఇట్లాంటి గొప్ప ప్రేమికుడు ఎట్లాంటి పుణ్యం చేసుకుంటే దక్కుతాడు నాకు!
ఆనందంతో ఒళ్లు ఊగిపోతుంటే అతడి పెదాలని గట్టిగా ముద్దు పెట్టుకొని వొదిలాను.
* * *
అదే పోవడం. మళ్లీ ఆ రూంలో అడుగు పెట్టలేదు. జగన్‌కు దూరమవుతానని అప్పుడే గనక నా మనసులో మెదిలినట్లయితే అక్కడనే ఉండి ఉందును. అనుకొని ఏం ఉపయోగం?
అంతా నాకు అనుకూలంగా జరుగుతుందనే భ్రమలో ఉంటిని. నా మాటకు, జగన్ మీది నా ప్రేమకు నాన్న విలువనిస్తాడనే అనుకుంటిని. అంతదాకా ఇంట్లో నాకు విరుద్ధంగా ఏమీ జరగక పోవడంతో ఆ నమ్మకం నాలో స్థిరపడింది. అందుకనే జగన్ విషయంలో నాన్న నాపై కోపంగా విరుచుకు పడ్డప్పుడు షాక్ తిన్నాను.
నేను మళ్లీ జగన్‌ని కలుసుకోకుండా చెయ్యడంలో ఆయన విజయం సాధించాడు. అంతటితో తృప్తి పడకుండా మరొకరితో నాకు పెళ్లి నిశ్చయం చేశాడు. ఎంత ఎదురు తిరిగీ ప్రయోజనం లేకపోయింది.
ప్రేమ కోసం ప్రాణ త్యాగానికీ, ఆత్మ త్యాగానికీ సిద్ధపడ్డ స్త్రీల ఆత్మల్లో ఏ ఒక్కటీ నాపై కనికరం చూపకపోవడంతో నా ప్రేమని నాలోనే అణచి పెట్టుకున్నాను. అట్లా నేను దీక్షితులుకి భార్యగా మారాల్సి వచ్చింది.
తిరిగి ఇన్నినాళ్లకు నేను జగన్‌ని చూడగలుగుతానని కలనైనా తలచలేదు. అతడు కనిపించకపోయినా బాగుండేది. తిరిగి నాలో అశాంతి రేకెత్తకుండా ఉండేది. దీక్షితులుతో ఈ జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎట్లాగో గడిపేసేదాన్ని. మళ్లా అవుపించి నన్ను పిచ్చిదాన్నే చేసేశాడు జగన్.
నాకెంత మాత్రమూ ఇంటరెస్ట్ లేదు, మ్యారేజ్‌డేని సెలబ్రేట్ చేసుకోడం. మూడేళ్లు గడిచాయి మా పెళ్లయి. ఏం ఉపయోగం, వ్యర్థంగా, ఏ మాత్రమూ తృప్తనేదే లేకుండా గడిచింది ఈ కాలం.
ఈ నాలుగో పెళ్లిరోజుకు దీక్షితులు తన ఆఫీస్ స్టాఫ్‌కు పార్టీ ఏర్పాటు చేశాడు. ముందుగా నాకు చెప్పినట్లయితే ఎట్లాగైనా కేన్సిల్ చేయించి ఉందును. అందరికీ పార్టీ అని చెప్పేసినాక తర్వాత ఒచ్చి 'ఇట్లా చెప్పాను' అంటే ఏం మాట్లాడను? ఇట్లా పార్టీ ఇవ్వడానికి కారణం ఒక్కటే తట్టింది. నేను కడుపుతో ఉండటం.
స్టాఫంతా వొచ్చినట్లుంది. బెడ్‌రూంలో ఉన్న నాకు దాని తాలూకు సందడి వినిపిస్తోంది. దీక్షితులు వొచ్చి "మా వాళ్లంతా వొచ్చేశారోయ్, నీదే ఆలస్యం. రా, వెళ్దాం" అన్నాడు.
ఐదో నెలే కాబట్టి పొట్ట పెద్ద ఎత్తుగా లేదు. అయినా కానీ అట్లా అందరి ముందూ దిష్టిబొమ్మలా నిల్చోవాలంటే నా మనసొప్పింది కాదు. సిగ్గూ, బిడియమూ మీదికి వొచ్చి పడ్డాయి. పోకపోతే బాగోదు కనుక తప్పనిసరై అతని వెనుక నడిచాను.
అప్పుడే.. అప్పుడే.. జగన్ అవుపించాడు. నన్ను ముందుగానే గమనించి కాబోలు అందరికీ కాస్త ఎడంగా ఒక మూలగా నిల్చొని ఉన్నాడు. అతని వంక నన్ను చూడనివ్వకుండా ఎవరో అడ్డొచ్చారు. దాదాపు స్టాఫంతా నాకు తెలుసు. జగన్ ఎప్పుడు జాయినయినట్లు? అందుకు జవాబన్నట్లు జగన్ దగ్గరకు నన్ను తీసుకువెళ్లాడు దీక్షితులు.
అంతదాకా ఎటో చూస్తున్నట్లున్న జగన్ నా వొంక చూపు తిప్పాడు.
"ఇతనేవరో తెలుసా రేణూ! జగన్.. జగన్మోహన్. గొప్ప ఆర్టిస్టులే. అతను రాసిన నాటకానికి ఈ ఏడాది అవార్డ్ కూడా వచ్చింది తెలుసా. నా దగ్గర జాయినయ్యి రెండు నెల్లే అయినా నాకు మిగతా వాళ్లందరికంటే దగ్గరయ్యాడు" అని చెప్తూ, "జగన్.. ఈమె రేణుక. నా వైఫ్" అంటూ అతనికి పరిచయం చేస్తుంటే జగన్ చిన్నగా నవ్వాడు. అర్థం కాక.. ముందు అతనివొంకా, తర్వాత నా వొంకా చూశాడు దీక్షితులు.
జగన్ నవ్వడంతో నాలో గొప్ప శాంతి కదలాడింది. ఏదో భారమంతా నాలోంచి పోయినట్లు ఫీలయ్యాను. వెంటనే నేనూ సన్నగా నవ్వాను.
"ఏమిటి మీ ఇద్దరికీ ఇదివరకే పరిచయముందా?" అనడిగాడు. ఆ గొంతులో ఆసక్తే తప్ప మరెలాంటి అనుమానమూ లేదు. అట్లా అనుమానపడే వ్యక్తి కాదని నాకు తెలుసు.
"ఒక్క పరిచయమేనా.." అంటూ ఆగి జగన్ వొంక చూశాను. జగన్ కళ్లల్లో అంతులేని ఆశ్చర్యం ఒక్కమారుగా తొంగిచూసింది. నేనట్లా అనగలనని ఊహించలేదనుకుంటాను.
"అవన్నీ ఇప్పుడెందుకులే రేణుకా" అని నన్ను అడ్డుకుంటూ "తనూ, నేనూ ఒక్క కాలేజీలోనే చదివాం" అని దీక్షితులుతో అన్నాడు.
"మరేమిటి తను 'ఒక్క పరిచయమేనా' అని ఆపేసింది". దీక్షితులుకు తెలుసుకోవాలన్న ఆరాటం వొదల్లేదు. అతని ఆఫీస్ మైండ్‌కు ఇట్లాంటి సంగతులు అందకుండా ఉన్నాయి.
"నీతో పెళ్లి కాకుండా ఉన్నట్లయితే, పరిస్థితులు అనుకూలించినట్లయితే మా ప్రేమ ఫలించి ఉండేది" అన్నాను నిర్భయంగా, నిబ్బరంగా.
నన్నాపలేకపోయినందుకు విచారపడ్తూ తలవంచుకున్నాడు జగన్. అదీగాక తన బాస్ భార్యకు తను మాజీ ప్రేమికుణ్ణని తెలిసిపోవడం కొంత కారణం.
"ఇంతదాకా ఈ సంగతి నాకు చెప్పలేదే రేణూ" అని, మళ్లీ జగన్ వేపు తిరిగి "అయితే చాలా ముఖ్యమైన వ్యక్తివి నాకు" అన్నాడు.
జగన్‌కు అక్కడ నిలవాలనిపించలేదేమో "ముందు పార్టీ సంగతి చూడండి" అన్నాడు. అప్పుడు స్పృహ తెలిసి "మాటల్లో అసలు సంగతే మరిచాను" అంటూ వెళ్లాడు దీక్షితులు.
"ఎందుకతనికి అట్లా చెప్పావు?" అనడిగాడు జగన్ నా వంక కాకుండా ఎటో చూస్తూ.
"తప్పేమీ చెప్పలేదే."
"కానీ అందువల్ల చిక్కులన్నీ నీకేగా."
"దీక్షితులు అటువంటి మనిషి కాడులే. దేనికీ ఫీలవడు."
"ఏమిటి! నేను నీ ఒకప్పటి లవర్‌నని తెలిసినా కూడానా!"
"మన మధ్య ఆ వర్షం కురిసిన రోజు నాటి విషయం చెప్పినా ఫీల్ కాని మనిషి అతడు."
"అది కూడా చెప్పేశావా?! అయితే నీకు ఎలాంటి ప్రాబ్లెమూ లేదన్న మాట. అందుకే కాస్త ఒళ్లు కూడా చేశావు" అన్నాడు, అప్పుడు పరిశీలనగా నన్ను చూస్తూ. తర్వాత ఆలోచనలో పడినట్లు మౌనంగా ఉండిపోయాడు. మళ్లీ అతను పెదవి విప్పలేదు.
పార్టీ అయ్యాక మాత్రం "వస్తాను" అని చెప్పి పోతుంటే "నువ్వు మాత్రం ఉండాలోయ్" అని ఆపడానికి యత్నించాడు దీక్షితులు.
"నాకు ఓ ముఖ్యమైన పని ఉంది.. ఈ రాత్రికి" అంటూ తప్పించుకుపోయాడు జగన్.
పక్కమీద పడుకొని జగన్ గురించే ఆలోచిస్తున్నా.
దీక్షితులు నా మీదికి ఒంగి బుగ్గపై ముద్దు పెట్టుకొని, "ఏమిటిట్లా దీర్ఘాలోచనలు చేస్తున్నావ్. జగన్ గురించేనా?" అనడిగాడు. ఆ గొంతులో జెలసీ కానీ, ఎగతాళి కానీ ఏమీ లేవు. చాలా క్యాజువల్‌గా ఉంది.
"అవును. ఇంకా బ్రహ్మచారిగా ఉండి ఏం సాధించగలడా అని."
"నీ మూలంగానే అనుకుంటా కదూ, అతడు పెళ్లి చేసుకోంది. పాపం ఎట్లా ప్రేమించాడో నిన్ను. ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేకపోయారు?"
మా ప్రేమని కలిసి అనుభవించింది ఎంతకాలమనీ చెప్పడానికి. అయినా ఎట్లా విడిపోయామో దీక్షితులుకు చెప్పాక రిలీఫ్‌గా అనిపించింది.
"పాపం జగన్ మాత్రం పూర్ ఫెలో" - దీక్షితులు గొంతులో సానుభూతి తొంగిచూసింది.
"నేనో?"
"పెద్ద ఆఫీసర్ భార్యవి. నీకేం లోటు?" అంటూ మీదికి రాబోతుంటే తోసేశాను - "వద్దు ఇప్పుడు" అంటూ.
"మూడాఫ్ అయ్యిందా, సరే అయితే."
ఆ రాత్రంతా జాగారమే అయ్యింది. కాలేజీ, అప్పటి ప్రేమ.. అంతా సినిమా రీలుమల్లే కళ్లముందు మెదిలింది.
* * *
సరిగ్గా వారం గడిచాక నాకు ఉత్తరం వొచ్చింది జగన్ నుంచి. ఉత్తరం ఎందుకా! అని ఆశ్చర్యపడ్తూ తెరిచాను.
"నేను వెళ్లిపోతున్నాను. ఎక్కడ మళ్లీ నీ ఆకర్షణలో పడిపోతానో అనే భయంతోటే. మరి కొద్ది రోజులుంటే చాలు, నీ పిచ్చిలో మళ్లీ పడిపోతాను. అక్కడ ఉంటే నీ దగ్గరకు రాకుండా ఉండలేను. ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు నీ ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని మొన్ననే తెలిసొచ్చింది. నువ్వు సంతోషంగా ఉన్నావు. అది చాలు నాకు. నా వల్ల నీకెలాంటి ఇబ్బందీ రాకూడదు. మీ ఆయన మంచివాడే కావొచ్చు. కానీ మా మగాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. అందుకే ఈ పలాయనం. నేను రిజైన్ చేసినట్లు ఈసరికి దీక్షితులు నీకు చెప్పే ఉంటారనుకుంటాను. మళ్లీ కనపడనని ఆశిస్తూ - జగన్."
చప్పున కళ్లెమ్మట నీళ్లొచ్చాయి. జగన్.. ఎందుకింత తొందరపడ్డావ్? అప్పుడప్పుడైనా నిన్ను చూసుకోవచ్చని ఎంతగా ఆశపడ్డాను?.. ఇంతకీ నా జీవితం ఇట్లా ఉండాలని రాసుంటే ఎన్ననుకునీ ఏం లాభం?
- మయూరి వీక్లీ, 12 ఆగస్టు 1994.

Saturday, March 19, 2016

Interview with actor Mohan Babu

- ఆంధ్రజ్యోతి డైలీ, 19 మార్చి 2016

Poetry: Nippu Kanam (Fire Cell)

నిప్పుకణం

నీది ఆత్మహత్య అయినా
రాజ్యం చేసిన హత్య అయినా
నీది సాదాసీదా మరణం కాదు
దేశం దేశాన్నే జ్వలింపజేసిన 
నిప్పుకణిక నీ మరణం

మొదట్లో నేనూ అనుకున్నాను
యుద్ధం మధ్యలో వెన్నుచూపిన భీరువువని
చావు తప్ప పరిష్కారం లేదనుకున్న పిరికివాడివని
ఇప్పుడు కళ్లకు కడుతోంది వీరుడా
యుద్ధం మధ్యలో ఆత్మాహుతి అంటే ఏమిటో
ప్రత్యర్థి వెన్నులో చలి పుట్టించడమంటే ఏమిటో

పుట్టుక నుంచే పెరిగిన ఇంటినుంచే
వివక్షను ఎదుర్కొన్నవాడివి
విశ్వవిద్యాలయంలో వివక్ష
నీకు పెద్దలెక్కలోనిది కాదు
అయినా నీ ఊపిరి నువ్వే తీసుకున్నావంటే
అన్యాయపు వేర్లు ఎక్కడిదాకా విస్తరించాయో
తెలిసొచ్చి నిర్లిప్తుడవై నిస్పృహుడవయ్యావేమో
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడుతున్న
అవరోధాల్ని ఈడ్చిపారేయలేనని అనుకున్నావేమో

నువ్వు లేకపోయినా 
నీ మరణం ఎట్లాంటి జ్వాలను రేపిందో చూడు
ఎన్ని ప్రశ్నల్ని లేవనెత్తిందో చూడు
విద్యాలయాల్లో విద్యకు బదులు మితిమీరుతున్న 
రాజకీయాల జాడలు దిగ్భ్రాంతిపరుస్తున్నాయి
దుర్మార్గ దోపిడీ శక్తులు దట్టంగా అల్లుతున్న 
కులసూత్రాలు సాలెపురుగులా చంపుకుతింటున్నాయి 
చదువు కోసం వెళ్లిన కొడుకులు
క్షేమంగా ఇంటికొస్తాడో లేదోనని
అమ్మలు ఆందోళనపడుతున్నారు

నువ్వు అర్ధంతరంగా లోకాన్ని వదిలేశావు
పడమటి సూర్యుడిలా మాయమయ్యావు
నీకు తెలీదు.. నువ్విప్పుడు ఎంతమంది గుండెల్లో చిరంజీవివో
ఎంతమందిని ధీరులుగా మార్చేస్తున్నావో
నీకు తెలీదు.. నువ్వు గోడలో పాతుకొన్న రావిమొక్కవు
ఎన్నిసార్లు తుంచినా తిరిగి చిగురిస్తావు
నువ్విప్పుడు ఓటమిని ఒప్పుకున్న పరాజితుడివి కాదు
సహచరులకు యుద్ధాన్ని కొనసాగించే తెగింపునిచ్చిన విజేతవు

- 'స్వాప్నికుడి మరణం' పుస్తకం నుంచి

Poetry: Nimisham (One Minute)

- సూర్య దినపత్రిక, 14 మార్చి 2016

Thursday, March 10, 2016

Interview with Actress Regina Cassandra

పెళ్లిసందడే ఇష్టం.. లివింగ్‌ టుగెదర్‌ కష్టం! 


మనకు సినీ తార బాహ్యముఖమే తెలుసు. ఆమె అంతర్ముఖం ఎలా ఉంటుందో తెలియదు. వెలుగుజిలుగుల మధ్య, గ్లామర్‌సగా కనిపించే తార అంటే మనకో ఇమేజ్‌ ఉంటుంది. వాళ్లు వేరే లోకం వాళ్లన్న అభిప్రాయమూ ఏర్పడుతుంది. అయితే మిగతా అందరిలానే వాళ్లకూ స్నేహితులు ఉంటారనీ, వాళ్లకూ ఓ కుటుంబం ఉంటుందనీ, వాళ్ల జీవితాల్లోనూ మరపురాని క్షణాలుంటాయనీ, వాటిని స్వచ్ఛంగా ఆస్వాదిస్తుంటారనీ హీరోయిన్‌ రెజీనా కసాండ్రా మాటలు చూశాక మనకు అర్థమవుతుంది. ఆమె చెప్పిన కబుర్లు ఇవి. 

‘‘వృత్తిపరమైన జీవితాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ బ్యాలెన్స చేసుకోవడం క్లిష్టంగానే ఉంటోంది. ఎందుకంటే మా అమ్మానాన్నలు చెన్నైలో ఉంటారు. నేను అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటాను. వాళ్లకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇంట్లో అమ్మానాన్నలతో పాటు రెండు పిల్లులు కూడా ఉంటాయి. నా గురించి ‘నాకు ఒక్క కూతురే కానీ పదిమంది ఉన్నట్లుంటుంది’ అంటుంది అమ్మ. అలా అని బాగా అల్లరి పిల్లననుకునేరు. కాదు. కాకపోతే హైపర్‌ కిడ్‌ను. ఎక్కడా కాసేపు కూర్చోలేను. ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాను. కొత్త సినిమా మొదలైనప్పుడు అమ్మ నాతో పాటు వచ్చి ఓ వారం రోజులుండి చెన్నై వెళ్లిపోతుంది. నాన్ననూ, పిల్లుల్నీ చూసుకోవాలి కదా. ఆ తర్వాత నా విషయాలు నేనే చూసుకుంటాను.
 
నాన్న గవర్నమెంట్‌ ఉద్యోగిగా రిటైరయ్యి, సొంతంగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. చెన్నైలో ఉంటే అమ్మ చేతి వంట తినడానికే ప్రాముఖ్యం ఇస్తా. హైదరాబాద్‌లో నన్ను కలవడానికి వచ్చే స్నేహితులు ఏవైనా తినడానికి తెస్తుంటారు. వాటిని ఎంత ఆప్యాయంగా తింటానో. హోటల్‌ భోజనం తినీ తినీ మొహం మొత్తిపోతుంటుంది. అందుకని వాళ్లు తెచ్చే వంటకాలే పరమాన్నం. బయట తిండి ఎక్కువ రోజులు తినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు అమ్మ చేతి వంట తిందామా అని గుండె కొట్టుకుపోతుంది. పోయినేడాది అయితే షూటింగుల కారణంగా బయటే ఎక్కువగా గడపాల్సి రావడంతో నెల రోజులు కూడా అమ్మ వంటకాల్ని తినలేకపోయా.
 
మర్చిపోలేని క్షణాలు
మా స్వస్థలం చెన్నై. అక్కడే పుట్టి పెరిగాను. అక్కడి విమెన్స క్రిస్టియన కాలేజీ (డబ్ల్యుసీసీ)లో బీయస్సీ సైకాలజీ చేశాను. కాలేజీ వదిలిన ఐదేళ్ల తర్వాత ఇటీవల అక్కడ జరిగిన కల్చరల్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లడం ఇప్పట్లో మర్చిపోలేను. ఆ రోజు ఎంత ఆనందంగా గడిచిపోయిందో! ప్రిన్సిపాల్‌, లెక్చరర్స్‌ చూపించిన ఆప్యాయతకు కళ్లు చెమర్చాయి. నిజానికి కాలేజీలో నేను బాగా అల్లరి చేసేదాన్ని. ఐదేళ్ల తర్వాత నన్ను చూసి నాకంటే వాళ్లే ఎక్కువ ఆనందపడ్డారు. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే నా కళ్లూ తడయ్యాయి. అయితే అవి ఆనందభాష్పాలు. ఆ క్షణాల్ని ఎలా వర్ణించాలో తెలీడం లేదు నాకు. నేను అతిథిగా వెళ్లిన ప్రోగ్రామ్‌ పూర్తయి, వేరే ప్రోగామ్‌ జరుగుతున్నా, కదలాలనిపించక అక్కడే ఉండిపోయా. ఎవరి జీవితంలోనైనా కాలేజీ లైఫ్‌ అంత మధురమైన దశ ఇంకోటి ఉండదని ఎందుకంటారో ఆ క్షణాన నాకు అనుభవంలోకి వచ్చింది. మా ప్రిన్సిపాల్‌ ‘‘ఏంటే నువ్వు ఇలా తయారయ్యావ్‌? ఈ సల్వార్‌ ఏమిటి? ఈ జుట్టేమిటి? ఈ మేకప్పేమిటి? నిజంగా సెలబ్రిటీ అనిపించావ్‌’’ అని ఆశ్చర్యపోయింది. అప్పట్లో కాలేజీకి నేను షర్ట్‌, జీన్సలోనే వెళ్లేదాన్ని. చాలా కాజువల్‌గా కనిపించేదాన్ని. 
 
స్నేహానికి ప్రాధాన్యం
నా జీవితంలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనేవాళ్లు డబ్ల్యుసీసీలోని నా క్లాస్‌మేట్సే. వాళ్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తాను. ఇటీవల జనవరిలోనే ఓ ఫ్రెండ్‌ పెళ్లయింది. త్వరలో ఇంకో ఫ్రెండ్‌ పెళ్లి కాబోతోంది. మా ఫ్రెండ్స్‌ అందరం రెగ్యులర్‌గా వాట్స్‌పలో మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో మాదో గ్రూప్‌ ఉంది. నా సినిమా రిలీజయితే, ఎక్కడున్నా వెళ్లి సినిమా చూస్తారు. లేదంటే యూట్యూబ్‌లో చూస్తారు. వాళ్లెవరికీ తెలుగు తెలీదు. సబ్‌టైటిల్స్‌ చూసి అర్థం చేసుకుంటారు. సినిమాలో నేనెలా నటించానో, నా పాత్ర ఎలా ఉందో నిర్మొహమాటంగా చెబుతుంటారు. ‘ఆ సినిమాలో ఫలానా సీనలో నువ్వేసుకున్న డ్రస్‌ నచ్చలేదే’ అని కూడా చెప్పేస్తుంటారు. నాకు ఒంటరితనం లేకుండా చేసేది వాళ్లే. ఏమాత్రం తీరిగ్గా ఉన్నా, వాట్స్‌పలో వాళ్లతో మాట్లాడుతుంటా. నాకేదైనా సలహా కావాలనుకుంటే వాళ్లనే అడుగుతుంటా. వాళ్లు నన్ను ‘డ్రామా క్వీన’ అని ఆటపట్టిస్తుంటారు. ఎందుకంటే కాలేజీలో నేను చాలా నాటికలు, నాటకాల్లో నటించాను. పుస్తకాలు కూడా నాకు మంచి మిత్రులే. వీలున్నప్పుడల్లా పుస్తకాలు చదువుతుంటా. లేటె్‌స్టగా పాలో కొయిలో పుస్తకం ‘11 మినిట్స్‌’ పూర్తి చేశాను. కొయిలో పుస్తకాలంటే బాగా ఇష్టం. ఇంటర్‌లో ఉన్నప్పుడే ఆయన ప్రసిద్ధ రచన ‘అల్కెమిస్ట్‌’ చదివేశా. ఆయన లేటెస్ట్‌ బుక్‌ ‘అడల్టరీ’నీ చదివా. 
 
ట్రెక్కింగ్‌ చేస్తాను
చదువుకునే రోజుల్నించీ నాకు స్పోర్ట్స్‌ అంటే బాగా ఇష్టం. చదువునూ, ఆటల్నీ సమన్వయం చేసుకునేదాన్ని. హైస్కూల్లో నేను స్కూల్‌ పీపుల్‌ లీడర్‌ (ఎస్‌పీఎల్‌)ని. బాస్కెట్‌బాల్‌ అడేదాన్ని. కేవలం చదువే లోకంగా బతక్కుండా అన్నింటికీ ప్రాముఖ్యం ఇవ్వాలని అమ్మ నేర్పించింది. అలాగే ఉండేదాన్ని. ఇప్పుడు చూస్తే.. పిల్లలకు చదువు తప్ప ఇంకో లోకం ఉండకూడదన్నట్లుగా చూస్తున్నారు తల్లిదండ్రులు. దాంతో చిన్నప్పట్నించే పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు వచ్చేస్తున్నాయ్‌. అలా కాకుండా చదువుతో పాటు ఆర్ట్స్‌లో, స్పోర్ట్స్‌లో కూడా ఆసక్తి కలిగేలా చేస్తే మంచి వికాసంతో పెరుగుతారు. బేసికల్‌గా నాకు సాహస క్రీడలంటే ఇష్టం. ఇప్పుడు నటిని అయినా కూడా ట్రెక్కింగ్‌కు వెళ్తుంటాను. నల్లగొండ అడవుల్లో, తిరుపతి దగ్గర ఉన్న తడ అడవుల్లో ట్రెక్కింగ్‌ చేశాను. ఈ మధ్య మా ఫ్రెండ్‌ పెళ్లికని మేఘాలయకు వెళ్లినప్పుడు అక్కడ టూరా అడవుల్లో ట్రెక్కింగ్‌ చేశాను. 2800 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్ని ఎక్కడం ఓ మంచి జ్ఞాపకం. అక్కడి అల్లం, మిర్చి, టమోటా తోటల్లో ప్లకింగ్‌ చేశాను. అలాగే హాలిడేస్‌ దొరికితే చెన్నైలో సర్ఫింగ్‌కు, స్కూబా డైవింగ్‌కు వెళ్తుంటా. 
 
పెద్ద కుటుంబానికి కోడలిగా
నేను మన సంప్రదాయాల్ని గౌరవిస్తాను. మనకు తెలీని అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతాను. చర్చికి వెళ్తుంటాను. సహ జీవనంలో నాకు నమ్మకం లేదు. అందరి సమక్షంలో సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిలో ఎంత ఆనందం, సందడి ఉంటాయి! అలాంటి సందడిని నేను ఇష్టపడతాను. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు కానీ పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబం ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లాలనేది నా కోరిక. అక్కడ తోడి కోడళ్లు, ఆడబిడ్డలు, మరుదులు వంటివాళ్లంతా ఉండి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. మాది చిన్న కుటుంబం కాబట్టి ఇలాంటి కోరిక ఏర్పడిందేమో తెలీదు. జగమంత కుటుంబానికి కోడలు అయితే బావుంటుందన్నది నా ఆశ. 

- ఆంధ్రజ్యోతి డైలీ, 8 మార్చి 2016

Sunday, February 28, 2016

Monday, January 25, 2016

Society: Need vast selfishness in people

విశాల 'స్వార్థం' కావాలి

కరడుగట్టిన స్వార్థపరులు కూడా తమ కుటుంబం మేరకు స్వార్థాన్ని సడలించి భార్యాబిడ్డల సుఖానికి పాటుపడతారు. వ్యక్తిగత స్వార్థం కొంచెం విశాలమై కుటుంబ స్వార్థంగా పరిణమిస్తుంది. సమాజంలో చాలామంది కుటుంబం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగం చేస్తారు. అయితే వాళ్లు ఇతరులతో వ్యవహరించేప్పుడు మాత్రం స్వార్థాన్ని ఆవగింజంతైనా వదిలిపెట్టరు. మరికొంతమందిలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ వరకు రకరకాలుగా స్వార్థం వ్యాపించి ఉంటుంది. ఎవరికి వాళ్లకు ఆ పరిధుల్ని నిర్ణయించుకునే స్వాధికారం ఉంది. ఇలా స్వార్థం విశాలతను పొందుతూ ఉంటే అది సాధించ గలిగిన, సాధించాలనుకున్న విషయాలు విశాలమైన ఆశలుగా పరిణతి చెందుతాయి. కుటుంబ పరిమితుల్లో సాధించదగ్గ విషయాలు రాష్ట్రం, దేశం వంటి పరిమితుల్లో సాధించదగ్గ విషయాల కంటే చిన్నవిగా, త్వరితగతిన సాధింప దగ్గవిగా ఉంటాయి. ఈ స్వార్థం అతి విశాలతను పొంది ఉన్నతమైన ఆశగా రూపొందినప్పుడు అది ఇతరుల కోసమే అవుతుంది.
ఇలాంటి విశాలమైన ఆశే ఆదర్శం. ఆశలో సంఘ దృష్టి సమ్మిళితమవుతున్న కొద్దీ అది విశాలతను సంతరించుకుంటుంది. కొంతమంది సంస్కర్తలు, విప్లవకారులు కొన్ని ఆదర్శాలను నమ్మి మూఢ సంఘాన్ని, మూఢ నమ్మకాల్ని ఎదిరించారు. తమ ఆదర్శాల కోసం ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడలేదు. కాల గమనంలో వాళ్ల ఆదర్శాలు ఫలించినప్పుడు భావి తరాలవాళ్లు వాళ్లను పూజించారు. బుద్ధుడు, సోక్రటీస్, క్రీస్తు, మహమ్మద్, బ్రూనో, గెలీలియో, లింకన్, గాంధీ, అంబేద్కర్, మార్క్స్, కందుకూరి వీరేశలింగం.. ఈ కోవలోకి వస్తారు. వీళ్లు ప్రచారం చేసిన విశాల భావాలు మానవాళికి ఆశాజ్యోతులై ఆదర్శాలయ్యాయి.
వ్యక్తి తాలూకు, సంఘం తాలూకు అనుభవాల్ని ఆదర్శాలు సంస్కరిస్తాయి. నిరాశతో కుంగిపోకుండా, ఉత్సాహంతో, ఉత్తేజంతో జీవిస్తూ, ఇతరులకు ఆ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలగజేయడంలో జీవితం ఉత్తమంగా భాసిస్తుంది. కొన్ని ఆశయాలు, లక్ష్యాలు మనుషుల్ని ఉద్వేగపరచి ఉద్రేకపరుస్తాయి. అవి కొరవడితే నిరాశ, నిస్పృహ ఆవహిస్తాయి. స్తబ్దత ప్రవేశిస్తుంది. శాశ్వతమైన ఆదర్శాన్ని గుర్తించని ఉద్యమాలు సంపూర్ణ పరిణతిని చెందలేవు, సంపూర్ణ ప్రయోజనం కలిగించలేవు. ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడటం విశాలమైన సమతా సాధన కృషిలో భాగాలుగా గుర్తించాలి.
నియంతృత్వానికి ఎదురునిల్చి బహిరంగంగా పోరాటం చేసే ఆదర్శవాదులు లేకుండాపోతున్నారు. నియంతలు, నిరంకుశవాదులు తమ ఆధిపత్యం నిలబెట్టుకోడానికి ఆదర్శాలు వల్లిస్తారు. నిజం గ్రహించడానికి సమయం పడుతుంది. సంకుచితమైన లక్ష్యాలు ఆదర్శాలుగా చలామణీ అవుతున్నా, వాటిని ఎత్తిచూపే విచక్షణాశక్తిని ప్రజల్లో కలిగించడంలో నాయకులు విఫలమవుతున్నారు. వాతావరణం సానుకూలంగా లేనప్పుడు కూడా ఇసుమంతైనా వెనుదీయకుండా విశాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యాకులకు అప్రియమైన సత్యాన్నయినా ఆదర్శవాదులు ఎలుగెత్తి చెప్పాలి. ప్రచారం వల్లా, ఆదర్శవాదుల అకుంఠిత దీక్ష వల్లా విశాల భావాలకు అమోదం లభిస్తూ సంఘం మారుతుంది. 'న్యాయానికి రోజులు కావు' అనే ధోరణిని ఆదర్శవాదులే తమ ఆచరణ ద్వారా ఎదుర్కొని, మోసం, అన్యాయంతో రాజీపడే అవకాశవాదులకు తగిన సమాధానం చెప్పి వాతావరణంలో మార్పులు తీసుకొని రావాలి.

Friday, January 22, 2016

Music Director Bhimavarapu Narasimha Rao Filmography

1. Sati Tulasi (1936)
2. Mohini Rukmangada (1937)
3. Kanaka Thara (1937)
4. Mala Pilla (1938)
5. Raitu Bidda (1939)
6. Meerabai (1940)
7. Apavadu (1941)
8. Bhagya Lakshmi (1943)

contd...

Thursday, January 21, 2016

Synopsis of the movie PRANA MITRULU (1967)

'ప్రాణమిత్రులు' (1967) కథాంశం


చిన్నా, బాబు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, ఒక తల్లి పాలు తాగి పెరిగారు. ఆ ఇంట చిన్నా నౌకరే అయినా బాబే అతని సర్వస్వం. మూడు తరాలుగా నౌకా వ్యాపారం చేస్తున్న వాళ్ల ఎస్టేటును చూస్తూ బాబును ఎలాగైనా మోసం చెయ్యాలని కాచుకొని ఉంటాడు దివాను. ఈ వ్యవహారమంతా కనిపెడుతూ తెలివిగా తప్పిస్తాడు చిన్నా. అది సహించలేక బాబు, చిన్నా మీద దివాను విరుచుకుపడతాడు. దాంతో వెంటనే దివానును తొలగించి ఆ స్థానంలో చిన్నాను నియమించి, తన యావదాస్తినీ చిన్నాకే రాసిస్తాడు బాబు. ఈ విషయం తెలుసుకున్న తల్లి జగదాంబ, చిన్నా దగ్గర లేకపోతే బాబు దారిలోకి వస్తాడనుకుంటుంది. ఎంత డబ్బయినా సరే తీసుకొని బాబును విడిచి వెళ్లమని చిన్నాను బతిమాలుతుంది. బాబు కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ చిన్నా ఇల్లు విడిచి వెళ్లేందుకు నిశ్చయించుకుంటాడు. తర్వాత బాబు, చిన్నా అన్యోన్యతను ఆమె అర్థం చేసుకుంటుంది.
హార్బర్ ఆఫీసుకు చిన్నా మేనేజరవుతాడు. అయితే అక్కడి వ్యవహారాలన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయి. చదువుకొని విజ్ఞానం సంపాదించాలని పంతులమ్మ పార్వతి దగ్గరకు వెళ్లి రాత్రిపూట చదువుకుంటూ, పగలు ఆఫీసుపని చేస్తుంటాడు. అతడి మంచితనానికీ, అమాయకత్వానికీ ఆకర్షితురాలై అతనికి మనసిస్తుంది పార్వతి.
వాళ్ల ప్రేమను కనిపెట్టిన బాబు పరిహాసానికి పార్వతిని తనకిచ్చి పెళ్లిచెయ్యమంటాడు. చిన్నా నోట ఈ విషయం విన్న పార్వతి ఖిన్నురాలవుతుంది. అవమానంతో కుంగిపోతుంది. బాబు పశ్చాత్తాపపడతాడు. కానీ, ఏం లాభం. విరిగిన మనసు అతకలేదు. తన పరిహాసం ఇంత ప్రమాదానికి దారితీసిందని బాధపడి వాళ్లను నమ్మించడానికి గాను పద్మ అనే అమ్మాయిని పెళ్లాడతాడు బాబు.
అటు అదను కోసం కాచుకొన్న దివాన్ బోనస్ తగాదాల్ని లేపి పనివాళ్లను రెచ్చగొడతాడు. బాబు, చిన్నా కలిసి ఆఫీసులో ఒక చిన్న నాటకం ఆడతారు. చిన్నా పనివాళ్లలో చేరి వాళ్లకు నాయకుడై బోనస్ ఇప్పిస్తాడు. బాబుకూ, అతని వ్యాపారానికీ మేలు చేద్దామని గూడెం చేరిన చిన్నా, పార్వతి బోధనల వల్లా, అక్కడి అమాయకులైన కార్మికుల కష్టాల్ని కళ్లారా చూస్తుండం వల్లా నిజంగానే బాబుకు దూరమవుతాడు.
అది సహించలేని బాబు వెర్రికోపంతో హార్బర్‌కు వెళ్లి అక్కడ సింహాలు అనే కార్మికునిపై చేయి చేసుకుంటాడు. దాంతో పంతాలు పెరిగి ఈ సంఘటన సమ్మెకు కారణమవుతుంది. చిన్నా ఔన్నత్యాన్ని గుర్తిస్తుంది పార్వతి. చివరకు చిన్నా నాయకత్వంలో ఊరేగింపు జరుగుతుంది. తనవైపుకు రాకుండా వారిస్తూ రివాల్వర్ పైకెత్తి అడుగు ముందుకేస్తే ప్రాణం తీస్తానంటాడు బాబు. చిన్నా అడుగుముందుకేస్తాడు. 'అమ్మా' అని కేకపెట్టి పడిపోతాడు. అయితే గుండు పేల్చింది బాబు కాదు. దివాన్ అనుచరుడు. జనం విరుచుకుపడతారు. బాబు అందర్నీ క్షమాపణ వేడుకుంటాడు. "చిన్నా నువ్వు చిరంజీవివి. ధర్మానికీ, న్యాయానికీ, మంచికీ, మానవత్వానికీ ప్రాణాలు విడిచిపెట్టావు" అని విలపిస్తాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి, కాంచన, గీతాంజలి, గుమ్మడి, రేలంగి, శాంతకుమారి, అల్లు రామలింగయ్య, చదలవాడ కుటుంబరావు, గిరిజ
సంగీతం: కె.వి. మహదేవన్
నిర్మాత: వి. వెంకటేశ్వర్లు
దర్శకుడు: పి. పుల్లయ్య
బేనర్: పద్మశ్రీ పిక్చర్స్

Monday, January 18, 2016

Poetry: Cobweb to be amputated

సాలెగూడు ఛేదించాలి


నేను కాలాన్ని కరిగిస్తున్నవాణ్ణి
సంఘసేవకు వద్దామనే ఉంది
ఏమేమో చేద్దామనీ ఉంది

మనసులో భావాల వరదలు పొర్లుతున్నయ్
గుండెలో ఆవేశాల నురగలు రాగాలు పాడుతున్నయ్
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడే అవరోధాలు
అధిగమించాలని ఉంది అవతలకి తోసేయాలని ఉంది

మొదటి కునుకు ఎలాగొస్తుందో కనిపెట్టలేను
ఉదయపు మెలకువ వరకూ వదలవు సినిమా కలలు
నా దారినిపోయే వేళ నాక్కనిపించే అమ్మాయిలు
అదేం ఖర్మమో అందరూ అందగత్తెలు
నా దారినిపోయే వేళ నాక్కనిపించే బిచ్చగాళ్లు
గుండెల్లో మెత్త జాగాలు తడతారు

సంజవేళ సంచరించు ఒంటరి కంకాళం
సందు చూసుకొని సంద్రంలో దూకేస్తుంది
ఆధారం అగుపించని అనుమానం
గుండెలో మండు కుంపటి పెడుతుంది
అమ్మాయిల వెంటపడే తుంటరి వెధవల జాతిని
తన్ని తగలేయాలని ఉంది తుడిచిపెట్టేయాలని ఉంది

మిత్రమా లాభం లేదు
నన్ను నిందించి ప్రయోజనం లేదు
దుర్మార్గ దోపిడీ శక్తులేవో
డబ్బు సూత్రాలు దట్టంగా అల్లుతున్నాయి
సాలెపురుగులా చంపుకు తినాలనుకుంటున్నాయి
సారీ.. నిన్ననుసరించలేను
నీ అడుగులో నా కాలిడలేను
సాలెగూటిలో చిక్కుకోలేను

Saturday, January 16, 2016

Writer Samudrala Raghavacharya Filmography

1. Kanaka Thara (1937) (dialogues)
2. Grihalakshmi (1938) (story)
3. Vande Matharam (1939) (dialogues)
4. Sumangali (1940) (dialogues)
5. Devatha (1941) (dialogues)
6. Bhakta Potana (1942) (story and dialogues)
7. Garuda Garvabhangam (1943) (dialogues)
8. Swargaseema (1945) (dialogues)

As a lyricst
1. Kanaka Thara (1937)
2. Grihalakshmi (1938)
3. Vande Matharam (1939)
4. Raitu Bidda (1939)
5. Sumangali (1940)
6. Devatha (1941)
7. Bhakta Potana (1942)
8. Pantulamma (1943)
9. Chenchu Lakshmi (1943)
10. Swargaseema (1945)

contd...

Friday, January 8, 2016

Poetry: The Writer

రాతగాడు


రాయడం అందరికీ అలవడే విద్యకాదు
రాయడం ఒక నేర్పు, రాత ఒక మత్తు
నేనున్నాననీ, నేను కవిత్వం అల్లగలననీ
రుజువుచెయ్యడానికి రాస్తాడు
తనను తాను ఆవిష్కరించుకుంటాడు
ఒకాయన అగ్గిపుల్ల మీద రాస్తాడు
ఇంకొకాయన క్రికెట్ బ్యాట్ మీద రాస్తాడు
వేరొకాయన ప్రభుత్వానేధినేతను
ఆయనకే తెలీని గొప్పలతో కీర్తిస్తూ రాస్తాడు
మరొకాయన పెళ్లాం మీదా, పిల్లల మీదా
నిజ జీవితంలో కురిపించని ప్రేమనంతా ఒలకబోస్తూ రాస్తాడు
ఏది రాసినా నేర్పున్నోడే రాస్తాడు
ఏం రాయాలనే కిటుకు తెలిసినోడే రాస్తాడు

Wednesday, January 6, 2016

Writer Tapi Dharma Rao Filmography

As a writer
1. Mohini Rukmangada (1937) (dialogues)
2. Sarangadhara (1937) (dialogues)
3. Raitu Bidda (1939) (dialogues)
4. Illalu (1940) (dialogues)
5. Apavadu (1941) (dialogues)
6. Patni (1942) (dialogues)

contd...

As a lyricist
1. Mohini Rukmangada (1937)
2. Mala Pilla (1938)
3. Raitu Bidda (1939)
4. Illalu (1940)
5. Apavadu (1941)
6. Patni (1942)

contd...

Tuesday, January 5, 2016

Society: Encouragement to Superstitious Beliefs

మూఢత్వానికి ప్రోత్సాహం

సమాజాన్ని నిస్సహాయత ఆవహించింది. తప్పని తెలిసి కూడా ఆ తప్పునే అంతా ఆచరిస్తున్నారు. సమాజ దృష్టితో కూడిన ధ్యేయం లేకుండా పోయింది. సంకుచిత స్వార్థాలు, పార్టీ, ముఠా, కులం, మతం, ప్రాంతం, భాష పేరిట కక్షలు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కర్త, నిర్ణేత పౌరుడే. కానీ ఆ పౌరుడు ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించాల్సిందిపోయి, దీనంగా మంత్రుల్నీ, ఎమ్మెల్యేలనీ, స్థానిక ప్రతినిథుల్నీ, ప్రభుత్వాధికారుల్నీ అర్థించే బానిస మాదిరిగా దిగజారిపోయాడు. పౌరుడు దీనుడవటంతో, జనశక్తి బలహీనపడటంతో అధికారులు, పాలక వర్గాల వాళ్లూ తమ ఇష్టాయిష్టాలకు, రాగద్వేషాలకు, భోగవిలాసాలకు, సంపదను పోగేసుకోడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సాధనంగా చేసుకొని ప్రజల్ని బలి చేస్తున్నారు.
అధికారంలో ఉన్నవాళ్లు నిజంగా ప్రజా ప్రయోజనాలు కోరేవారైతే ప్రజల్లోని మూఢ విశ్వాసాల్ని తొలగించడానికి కృషిచేసి, వారిలో నూతన చైతన్యాన్ని, ప్రేరణనీ కల్పించాలి. కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్లు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి బదులు వాళ్లలోని మూఢ నమ్మకాలకు మరింత ప్రోత్సాహమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదొకటే. అది.. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటేనే ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడి నియంతృత్వంపై అభిమానం పెరగడం. ఇలాంటప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపినా, ఎన్ని ప్రణాళికలు వేసినా, వాటి ఫలితాలు ప్రజలదాకా చేరకుండానే ఇంకిపోతాయి.
ఈ రకంగా భ్రష్టమైన రాజకీయ జీవితం మొత్తం ప్రజా జీవితాన్ని బాధలు పెడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిథులు తమ కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తించకపోతే దానివల్ల వాళ్లు ప్రాతినిథ్యం వహించే కోటానుకోట్ల ప్రజలు కష్టాల పాలవుతారు. అందువల్ల వాళ్లను సంకుచిత ముఠా స్వార్థాలలోకి దిగజారకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే.

Saturday, January 2, 2016

Synopsis of the movie CHIRANJEEVI (1969)

'చిరంజీవి' (1969) చిత్ర కథాంశం

బాలకృష్ణ నర్సింగ్ హోంలో 7వ నెంబర్ వార్డులోని ముగ్గురు రోగులు - సత్యం (చలం), మధు (రామకృష్ణ), వెంకటప్పయ్య (అల్లు రామలింగయ్య). సత్యం అనాథ. ఊపిరితిత్తుల వ్యాధితో బతికేది కొద్ది రోజులే అయినా అది తెలియక అందర్నీ నవ్విస్తూ, కవ్విస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. మధు పేరుపొందిన ఫుట్‌బాల్ ఛాంపియన్. ప్రపంచ ఖ్యాతి వచ్చిందని సంబరపడేంతలోనే కాలు విరిగి తన భవిష్యత్ అంధకారబంధురమైందని బాధపడుతుంటాడు. ఇక వెంకటప్పయ్యకు కడుపులో పుండు. డాక్టర్‌కు తెలీకుండా దొరికిన ప్రతిదీ తింటుండే మూర్ఖుడు.
మృత్యువు సమీపంలో ఉన్న సత్యం డాక్టర్ ఇందిరాదేవి (సావిత్రి), మధు మధ్య ప్రేమను కలిగిస్తాడు. తనకు మందు ఇచ్చే నర్సు స్టెల్లా (మీనాకుమారి)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. రోగుల్ని కన్నతండ్రిగా చూసే డాక్టర్ బాలకృష్ణ (ప్రభాకరరెడ్డి)నీ, ఇందిరాదేవినీ అవసరమున్నా లేకపోయినా మాటిమాటికీ కంగారుపెడుతుంటాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకననే నిజం డాక్టర్ నోట రహస్యంగా విన్న సత్యం జీవితంలో నిజమైన బాధను తొలిసారి అనుభవిస్తాడు. జీవితం అంటే ఏమితో తొలిసారిగా అప్పుడే అర్థమవుతుంది. చనిపోయేలోగా తానూ ఒక మంచిపని చేసి చనిపోవాలనుకుంటాడు. ఆ మంచిపని మధు, ఇందిర పెళ్లనేది అతని అభిప్రాయం.
సత్యం జీవితం ముగిసిపోయే క్షణం రానే వచ్చింది. డాక్టర్ కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఇదీ వేళాకోళానికేనని భావించిన ఇందిర నిర్లక్ష్యం చేస్తుంది. చివరకు పెద్ద డాక్టర్ వచ్చినా ఫలితం ఉండదు. మధు చేతిలో సత్యం కన్ను మూస్తాడు. చనిపోయే ముందు డాక్టర్ బాలకృష్ణ మనసు మార్చి ఆయన కూతురు ఇందిరను కుంటివాడైన మధుకు ఇవ్వడానికి ఒప్పిస్తాడు. ఇదివరకు తండ్రి వ్యతిరేకించా మధు ప్రేమ కోసమే విదేశాల్లో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పిన ఇందిర, ఇప్పుడు సత్యం మరణంతో మనసు మార్చుకుంటుంది. విదేశాలకు వెళ్లి కేన్సర్ స్పెషలిస్టయి సత్యంలాంటి అభాగ్యుల్ని చిరంజీవులను చేయాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మనసారా అభినందిస్తాడు మధు. తన యావదాస్తినీ ఆమె ఆస్పత్రికి దానం చేస్తానని మాటిస్తాడు.

తారాగణం: సావిత్రి, ప్రభాకరరెడ్డి, చలం, రామకృష్ణ, అల్లు రామలింగయ్య, మీనాకుమారి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాత: ఎ.కె. వేలన్
దర్శకురాలు: సావిత్రి

Actress Tanguturi Suryakumari Filmography

1. Usha Parinayam (1939) (Parvathi)
2. Raitu Bidda (1939) (Seetha)
3. Jayaprada (1939)
4. Chandrahasa (1941)
5. Devatha (1941) (Seetha)
6. Deena Bandhu (1942)
7. Bhakta Potana (1942) (Saraswathi)

contd...