Wednesday, February 20, 2013

సినిమాపై పన్ను పడుతోంది


మూలిగే నక్క మీద తాటికాయ పడటమంటే ఇదే. అసలే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయి, విజయాల శాతం కనిష్టస్థాయికి పడిపోయి, ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల నష్టాల్ని చవిచూస్తూ వస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు పన్నుల దాడితో మరింత ఉక్కిరిబిక్కిరవుతోంది. పరిశ్రమలో 24 శాఖల వారు పనిచేస్తున్నా, ఈ పన్నుల బెడదను అంతిమంగా ఎదుర్కోబోతున్నదీ, దాని దెబ్బ రుచి చూడబోతున్నదీ పెట్టుబడిదారుడైన నిర్మాతే. దీంతో మునుముందు సినీ నిర్మాణం మరింత క్లిష్టం కాబోతున్నదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినోదపు పన్ను కడుతోంది చిత్ర పరిశ్రమ. ఇది థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడి ద్వారా వసూలవుతోంది. సరాసరిన చూసుకుంటే రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నుంచి ఏడాదికి రూ. కోటి చొప్పున ప్రభుత్వానికి జమవుతోంది. అలాగే సినిమా తీయడానికి ఉపయోగించే ఫిల్మ్ నెగటివ్, పాజిటివ్ మీద ఎక్సయిజ్ డ్యూటీ చెల్లిస్తోంది పరిశ్రమ. సాధారణంగా ఇప్పటికే ఒక పన్ను కడుతున్న వస్తువు మీద ఇతర పన్నులు వేయరు. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మరో రెండు పన్నులు దాడి చేశాయి. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) కాగా, మరొకటేమో కేంద్ర ప్రభుత్వం వేసిన సేవా పన్ను.
నిర్మాత ఓ సినిమాని ఎవరికైనా అమ్మితే, అమ్మిన రేటు మీద 14.5 శాతం వ్యాట్ కట్టమని రాష్ట్రం ఆదేశిస్తే, సినిమాకి పనిచేసే, సంవత్సరాదాయం పది లక్షలు దాటే ప్రతి వ్యక్తీ 12.36 శాతం సేవా పన్ను (సర్వీస్ టాక్స్) కట్టమని కేంద్రం హుకుం జారీచేసింది. జూలై 1 నుంచి ఈ సర్వీస్ టాక్స్ అమల్లోకి వచ్చింది. దీంతో నిర్మాతలు గుండెలు గుభేల్మంటున్నాయి. తమ జేబులు పూర్తిగా ఖాళీ అవడమే కాకుండా నిండా మునిగిపోతామని అమితంగా ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వ్యాట్, మరోవైపు సర్వీస్ టాక్స్‌తో సినిమా వ్యాపారం చేయడమెలా అనే సంశయస్థితిలో పడిపోయారు. ఇప్పటికే చాలామంది నిర్మాతలకూ, పంపిణీదారులకూ వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ కట్టమనీ, లేదంటే ఆఫీసులు సీజ్ చేస్తామనీ శ్రీముఖాలు పంపారు.
సినిమాపై వ్యాట్ అనేది మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు. అలాంటిది ఇక్కడే దాన్ని విధించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీన్ని పూర్తిగా తొలగించాలనీ, అలా కాని పక్షంలో కనిష్టంగా మాత్రమే వసూలు చేయాలనీ కోరుతూ ఇప్పటికే పలు దఫాలు ప్రభుత్వాన్ని కలిశారు నిర్మాతలు. నాలుగు నెలల క్రితం జరిగిన నంది అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆగస్ట్‌లో దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. మన పొరుగునే ఉన్న తమిళనాడులో క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు అక్కడి ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. దీని వల్ల హింస, అశ్లీలత, అసభ్యతకు తావులేని మంచి సినిమాలకు ప్రోత్సాహం లభిస్తున్నట్లయింది. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేదు.
ఇప్పుడు సేవా పన్ను వల్ల ఖరీదైన కళాకారులు, సాంకేతిక నిపుణులు ఆ పన్ను పరిధిలోకి రానున్నారు. ఆ పన్నుని వారు నిర్మాతలపై రుద్దడం సహజం కాబట్టి ఇప్పటికే అదుపు తప్పిన నిర్మాణ వ్యయం మరింత భారీగా పెరిగే ప్రమాదముందని నిర్మాతలు భయపడుతున్నారు. ఇవాళ సినిమా బడ్జెట్‌లో ఆర్టిస్టుల, టెక్నీషియన్ల పారితోషికాలకి అయ్యే వ్యయం 50 శాతం పైమాటే. సర్వీస్ టాక్స్ కారణంగా సుమారు 8 శాతం మేర బడ్జెట్ పెరగబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన, నిరసన వ్యక్తమైతే తప్ప అది తొలగే వీలులేదు. దేశంలోని అన్ని భాషా చిత్రసీమలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే అది జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా భవిష్యత్తు ఏం కాబోతున్నదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ 'పన్ను' ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే చిత్ర పరిశ్రమ అంతా తమకు తిండి పెడుతున్న నిర్మాతకు అండగా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయడం వినా మరో దారిలేదు.
ఆఫీసులు చెన్నైకి మారిపోతాయి
 -డి. సురేశ్‌బాబు, ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు
2005 నుంచి వ్యాట్ అమలు చేస్తున్నారు. సినీ పరిశ్రమకి కూడా దాన్ని వర్తింపజేశారు. ఏ డిస్ట్రిబ్యూటర్ కైనా సినిమాని అమ్మితే ఆ అమ్మిన దానిమీద 14.5 శాతం వ్యాట్ కట్టాలన్నారు. దాంతో అప్పట్నించీ వ్యాట్ తీసేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ కడుతున్నాం కాబట్టి, ఒక వస్తువు మీద రెండు పన్నులు వేయడం న్యాయంకాదని చెబుతూ వస్తున్నాం. అలా ఇప్పటివరకు వ్యాట్ కట్టలేదు. అయితే ఏడాది నుంచీ వ్యాట్ కట్టమని వాణిజ్య పన్నుల శాఖ నుంచి ప్రొడక్షన్ ఆఫీసులకీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకీ వరుసగా నోటీసులు వస్తున్నాయి. వైజాగ్ వంటి చోట్ల పన్ను కట్టకపోతే ఆఫీసుల్ని సీజ్ చేస్తామనే దాకా వెళ్లారు. పైగా 2005 నుంచి 2011 దాకా ఎరియర్స్ కూడా కట్టమంటున్నారు. అంటే ఒకేసారి పరిశ్రమ నుంచి దాదాపు రూ. 200 కోట్ల నుంచి 250 కోట్ల దాకా కట్టాల్సి వస్తుంది. ఈ వ్యాట్ స్థానిక నిర్మాణ సంస్థలకే అమలు చేస్తున్నారు. ముంబైలోనో, చెన్నైలో ఉండి ఇక్కడ సినిమాలు తీసినా వ్యాట్ పడదు. డబ్బింగ్ సినిమాలకీ వ్యాట్ వర్తించదు. ఇదింకా దారుణం. వినోదపు పన్ను కట్టి, ఈ వ్యాట్ కూడా కడితే సినిమా మీద పన్ను 24 శాతం దాటిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సినిమా ఆఫీసులన్నీ చెన్నైకి మారిపోతాయి. ఇదే విషయం ప్రభుత్వానికి చెప్పాం. అక్కడనుంచి సానుకూల స్పందనే వచ్చింది. అతి త్వరలోనే ఈ పన్నును కనీస స్థాయికి తగ్గిస్తారని ఆశిస్తున్నాం. సినిమాపై టాక్స్ ఏదైనా సరే నిర్మాతలనే కట్టమంటారు ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ. అందువల్ల కేంద్రం విధించిన సర్వీస్ టాక్స్‌ని అంతిమంగా భరించాల్సింది నిర్మాతలే. దీన్ని తగ్గించమని కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ పన్నుల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తాము చేయబోయే సినిమా వర్కవుట్ అవుతుందా, లేదా అనేది నిర్మాతలు ముందే గ్రహించుకోవాలి. మిగతా అంశాల కంటే స్క్రిప్టుకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
సినిమా హాలు కంటే షాపింగ్ కాంప్లెక్స్ మేలు 
-టి. ప్రసన్నకుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి 
ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, ఎక్సయిజ్ డ్యూటీ వంటివి ప్రభుత్వానికి కడుతున్నాం. ఒక్కో థియేటర్‌పై సంవత్సరానికి సగటున ఒక కోటి రూపాయలు వినోదపు పన్ను కడుతున్నాం. అదే ప్లేస్‌లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దానిలో 10 శాతం కూడా టాక్స్ కట్టం. అలాగే 1950ల నాటికీ, ఇప్పటికీ ఆస్తి పన్ను వెయ్యింతలు పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు తక్కువ, విధిస్తున్న పన్నులు మాత్రం చాలా ఎక్కువ. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు లొకేషన్ చార్జీలు కూడా చాలా ఎక్కువ. పేరుకి వీటి అనుమతులకు సింగిల్‌విండో ఉందని చెబుతున్నా ప్రాక్టికల్‌గా అమలు కావడం లేదు. ఏడాది క్రితం కాస్ట్ కంట్రోల్‌లో భాగంగా తమ వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల్ని తామే భరించుకుంటామని ఆర్టిస్టులు సంతకాలు పెట్టారు కానీ అవి ఇప్పటికీ అమలు జరగటం లేదు. వాటిని నిర్మాతలే భరిస్తున్నారు. సర్వీస్ టాక్స్ రద్దు కావడానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పోరాటం చేయబోతున్నాం. 
ప్రమాదంలో నిర్మాత 
-కె.ఎస్. రామారావు, సీనియర్ నిర్మాత
ఆరేళ్ల నుంచీ వ్యాట్ తీసేయమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ప్రతిసారీ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు కానీ, దీన్ని తీసేయడంలో ఎవరూ శ్రద్ధ చూపించలేదు. వ్యాట్ విధిస్తే ఏడాదికి ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి నలభై నుంచి యాభై కోట్ల దాకా వస్తుంది. దీనిలో ఉన్న సమస్య ఏమిటంటే ఎంత ఖర్చుతో సినిమా తీస్తే ముందు ఆ ఖర్చుపై వ్యాట్ కట్టి ఆ తర్వాతే సినిమాని విడుదల చేసుకోవాలి. విడుదలకు ముందు పారితోషికాలే కట్టలేని స్థితిలో ఉంటున్న నిర్మాత ఈ వ్యాట్ కూడా కట్టాల్సి వస్తే ఏమైపోవాలి? సినిమా విడుదలై ఫ్లాపయితే కష్టాల్లో ఉండే నిర్మాతకి వ్యాట్ కట్టమని నోటీసు ఇస్తే ఏం చేయాలి? అంటే నిర్మాత ప్రమాదంలో పడిపోయినట్లే. చిరంజీవిగారు కూడా శ్రద్ధ తీసుకుని మమ్మల్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. సి.ఎం. కూడా బాగా స్పందించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సినిమాలపై విధించిన సర్వీస్ టాక్స్ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కూడా అంతిమంగా నిర్మాత మీదే పడుతుంది.
- ఆంధ్రజ్యోతి, 28 జూలై 2012