Monday, November 30, 2015

First banned Telugu Film

స్వతంత్రం - 'రైతుబిడ్డ'పై నిషేధం

1937లో మొదటిసారి విడుదలైన గూడవల్లి రామబ్రహ్మం చిత్రం 'రైతుబిడ్డ' నిషేధానికి గురయ్యింది. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఈ చిత్రాన్ని అప్పుడు నిషేధించారు. అయితే స్వతంత్రం వచ్చాక కూడా కృష్ణాజిల్లాలో ఈ సినిమాపై నిషేధం కొనసాగడం శోచనీయం. 1947 నవంబర్‌లో ఉయ్యూరులోని శ్రీ ఏకాంబరేశ్వర పిక్చర్ ప్యాలెస్ యజమాని అప్పటి కృష్ణా జిల్లా కెలెక్టర్ వద్దకు వెళ్లి 'రైతుబిడ్డ' సినిమాని ప్రదర్శించడానికి అనుమతి కోరాడు. 'రైతుబిడ్డ'పై ఇంకా నిషేధం ఉంది కాబట్టి దాన్ని ప్రదర్శించేందుకు వీలు లేదని కలెక్టర్ ఖరాఖండీగా చెప్పారు. జమీందారుల పాలన కింద రైతుబిడ్డలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు  చూపించారు రామబ్రహ్మం. దేశానికి స్వతంత్రం వచ్చినా, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా, అప్పటికే జమీందారీ వ్యవస్థ రద్దవడానికి ఏర్పాట్లు జరుగుతున్నా, 'రైతుబిడ్డ'లాంటి అభ్యుదయ సినిమాపై బ్రిటీష్ కాలంలో పెట్టిన నిషేధాన్ని వెంటనే తొలగించకపోవడం మన బానిస మనస్తత్వానికి నిదర్శనమూ, సిగ్గుచేటు విషయంగా అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎప్పటికో ఆ నిషేధాన్ని తొలగించారు. ఏదేమైనా నిషేధానికి గురైన మొట్టమొదటి తెలుగు సినిమాగా 'రైతుబిడ్డ' చరిత్రపుటల్లో చోటు దక్కించుకుంది.

Sunday, November 29, 2015

Actor Kalyanam Raghuramaiah Filmography

1. Prithvi Putra (1933)
2. Bhakta Kuchela (1935)
3. Lanka Dahanam (1936)
4. Rukmini Kalyanam (1937) (Srikrishna)
5. Kacha Devayani (1938) (Indra)
6. Pasupathastram (1939)
7. Talli Prema (1941)

contd...

Saturday, November 28, 2015

Synopsis of the movie NENE MONAGANNI (1968)

'నేనే మొనగాణ్ణి' చిత్ర కథాంశం


బెజవాడ భద్రయ్య (రాజనాల) బందిపోటు దొంగ. పేరుచెప్పి మరీ దోపిడీలు చేస్తుంటాడు. అతణ్ణి డీఎస్పీ నందనరావు (సత్యనారాయణ) వెంటాడుతూ ఉంటాడు. ఒక దోపిడీ సందర్భంలో ఆ ఇద్దరూ తారసపడతారు. నందనరావును చంపిన భద్రయ్య తన నాలుగేళ్ల కొడుకు నానీతో పారిపోతూ, పోలీసు తుపాకీ దెబ్బలు తిని, తన కొడుకును ఒక బావిలో పడేసి, తను పారిపోతాడు. భద్రయ్యను అతని ముఠా పోలీసుల దృషిపడని దూరప్రాంతానికి తీసుకుపోతారు. తన కొడుకు చనిపోయాడనుకున్న భద్రయ్య, దానికి కారణమైన డీఎస్పీ కుటుంబంపై కసి పెంచుకుంటాడు.
అయితే నానీ చనిపోలేదు. నందనరావు ఇంట్లో పెరుగుతున్నాడు. తన భర్తను చంపినవాడిపై కసితీర్చుకోవడానికే అతని కొడుకును  తన ఇంట్లో పెట్టుకున్న ఆయన భార్య శాంత (శాంతకుమారి)లో ఆ పసివాడు మాతృత్వాన్ని రేకెత్తిస్తాడు. ఆ బాబును దేవుడిచ్చిన బిడ్డగా భావించి పెంచుతుందామె. అ పిల్లాడు వంశీధర్ (ఎన్టీఆర్)గా పెద్దవాడవుతాడు. అందమైన అమ్మాయిలతో కలిసి హుషారుగా చిందులేస్తూ ఉంటాడు. నందనరావు బావమరిది పోలీస్ కమీషనర్ (ధూళిపాళ). ఆయన కూతురు నీల (షీలా), వంశీధర్ మనసులు ఇచ్చిపుచ్చుకొని బావామరదళ్లుగా సరస సల్లాపాల్లో పడతారు.
తిరిగొచ్చిన భద్రయ్య దేశంలో అల్లకల్లోలం లేపాలనుకున్న ఒక విదేశీ ఏజెంట్ల ముఠాకు నాయకుడవుతాడు. దేశంలో అల్లర్లనూ, అరాచకాలనూ ప్రేరేపిస్తుంటాడు. తన కొడుకును బలితీసుకున్న నందనరావు కొడుకు వంశీని చంపాలని కంకణం కట్టుకుంటాడు. ఈ ముఠాను పట్టుకోవాలనుకున్న వంశీ అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులకు చిక్కి జైలుకెళతాడు. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని జైలునుంచి తప్పించుకుంటాడు. ఫలితంగా దొంగల ముఠాకు వంశీయే నాయకుడన్న అనుమానాలు బలపడతాయి. దాంతో అతనిపై నిఘా వేస్తాడు పోలీస్ కమీషనర్. వీటన్నిట్నించీ తప్పించుకుంటూ, దొంగల ముఠాను హతమార్చి తానే మొనగాణ్ణని నిరూపించుకుంటాడు వంశీ.

తారాగణం: ఎన్టీ రామారావు, షీలా, రాజనాల, ధూళిపాళ, శాంతకుమారి, గీతాంజలి, సంధ్యారాణి, జ్యోతిలక్ష్మి, రామకృష్ణ, రమణారెడ్డి, రాజబాబు, సత్యనారాయణ (గెస్ట్), బాలయ్య, అల్లు రామలింగయ్య
సంగీతం: టీవీ రాజు
నిర్మాత, దర్శకుడు: ఎస్.డి. లాల్
బేనర్: ప్రతిమా ఫిలిమ్స్
విడుదల తేదీ: 4 అక్టోబర్

Telugu Choreographer in Hindi Cinema

బాలీవుడ్‌లో రాణించిన తెలుగు నృత్య దర్శకుడు

బాలీవుడ్‌లో ఐదు, ఆరు దశకాల్లో నృత్య దర్శకుడిగా పనిచేసిన తెలుగువాడు సీవీ రావు గురించి ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండును. తొలితరం అగ్ర తారల్లో ఒకరైన బీనారాయ్ వంటి నటీమణులు వెంటితెరపై సమ్మోహనంగా నృత్యం చేయడానికి వెనుక ఉంది సీవీరావే. బీనారాయ్ నాయికగా నటించిన 'మధ్ భరే నయన్' (1955)తో పాటు ఆ కాలంలోనే వచ్చిన  'రుక్సానా',  'జగద్గురు శంకరాచార్య', 'బసంత్ బహార్', 'ఊంచి హవేలీ', 'మస్తానీ' వంటి సినిమాలకు రావు నృత్య దర్శకుడిగా పనిచేశారు. ఆయన చెన్నైలో పుట్టి పెరిగి బాలీవుడ్‌లో డాన్స్ డైరెక్టర్‌గా కెరీర్‌ను కొనసాగించారు. ఆయన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Friday, November 27, 2015

Actor MC Raghavan Filmography

1. Draupadi Vastrapaharanam (1936) (Vidushaka)
2. Kanaka Thara (1937) (Durjaya)
3. Mala Pilla (1938) (Muneyya)
4. Grihalakshmi (1938) (Viswasa Rao)
5. Vande Matharam (1939)
6. Raitu Bidda (1939) (Shavukar)

Thursday, November 26, 2015

Government Role for Telangana Cinema

తెలంగాణ సినిమా రావాలంటే...?

"చిత్ర పరిశ్రమ అవసరాలు ప్రభుత్వానికి తెలుసు. ఈ పరిశ్రమలోని అన్ని శాఖలూ అభివృద్ధి చెందడానికి సలహాలు ఇచ్చినట్లయితే ప్రభుత్వం సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నాం. ప్రభుత్వమూ, సినీ పరిశ్రమ చేయీ చేయీ కలిపి పనిచేస్తే ఎంతో సాధించగలుగుతాం."
"ప్రజల అభిప్రాయాలపై సినిమాల ప్రభావం చాలా ఉండటం వల్ల మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్ల మంది జనం సినిమాలకు వినోదం కోసమే వెళ్తున్నారనే విషయం గుర్తుంచుకొనే, ఆ వినోదాన్నిస్తూనే ప్రేక్షకుల నైతిక, సాంఘిక అభివృద్ధికి తోడ్పడే సినిమాలు తియ్యాలి."
ఇలాంటి మాటలు ప్రభుత్వాధినేతల నుంచి  ఇటీవల తరచూ వింటున్నాం. అయితే ఆ మాటలన్నీ కంటితుడుపువి అనేది నిజం. కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్న తెలుగు సినిమాలు ఎంత దుర్బలంగా, అవినీతికరంగా, అసభ్యకరంగా ఉంటున్నాయో తెలిసిందే. వినోదం, వ్యాపార స్వేచ్ఛ అనే వాటిని అడ్డం పెట్టుకొని నిర్మాతలు, దర్శకులు తీస్తున్న అసహ్య, అసభ్య సినిమాలు సమాజ ఉన్నతిని ఎంతగా దిగజార్చుతున్నాయో అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇరుకు మనసులు కలిగినవాళ్ల సినిమాలు అభ్యుదయ నిరోధకంగా ఉంటున్నందున, అలాంటి సినిమాలపై కత్తి ఝళిపించాల్సిందే. కానీ ఆ పని చేయాల్సిన సెన్సార్ బోర్డులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోవడమే విచారకరం.
సమష్టి ప్రయోజనం కోసం సమష్టి పరిశ్రమ అనే ప్రాతిపదికమీదే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. సమష్టి పరిశ్రమలో వ్యష్టి త్యాగం అనేది అంతర్భాగం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధిక లాభాల కోసం వ్యాపారం చేసే వ్యక్తులు చూస్తూ చూస్తూ ఎలా త్యాగం చేస్తారు? అందువల్ల సమష్టి శ్రేయస్సు కోసం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సినీ పరిశ్రమ క్షేమం కోసం కొంతమంది వ్యక్తుల్లో పెచ్చుమీరిపోతున్న అవినీతిని అరికట్టేందుకైనా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది. ఇండస్ట్రీలో నెలకొని ఉన్న అక్రమ వ్యాపారాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం శాసనాలు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడకూడదు. థియేటర్ల లీజు విషయంలో ఇంతవరకు సర్కార్లు ఎలాంటి జోక్యం చేసుకోకుండా చూస్తూ ఊరుకుంటున్నాయంటే లోపం ఎక్కడ ఉందో ఊహించుకోవాల్సిందే.
ఇప్పటికీ కాలం మించిపోలేదు. అవకాశాలు చెయ్యిదాటిపోలేదు. ప్రజల జీవితాల్లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినీ పరిశ్రమను ప్రభుత్వపు అజమాయిషీ కింద ఉంచుకొని కళను పోషించాల్సిన అవసరం చాలా ఉంది. చలన చిత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రంలో ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాల్సిందిగా దేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది కాలానికే విఖ్యాత దర్శకుడు వి. శాంతారాం ప్రభుత్వానికి సూచించారు. అయితే నేటికీ అది సాఫల్యం కాకపోవడం శోచనీయం. సినిమాలు ఇప్పటికీ కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో భాగంగానే ఉంటున్నాయి. హైదరాబద్‌లో తెలుగు సినీ పరిశ్రమ వేళ్లూనుకున్నాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉంటూ వచ్చిన ఆ శాఖ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో భాగమైంది.
సినీ పరిశ్రమలోని సమస్యల్ని, అక్కడి పరిస్థితుల్ని అర్థంచేసుకొని పరిశ్రమను నడిపిస్తూ, అవసరమైన సహాయం చేయడం ఈ మంత్రిత్వ శాఖ ఉద్దేశంగా ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేకసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో తెలుగు నిర్మాతల మండలి వాళ్లు, తెలంగాణ నిర్మాతల మండలి వాళ్లు తమ సాధక బాధకాలు చెప్పుకున్నా, ఇంతవరకు పరిశ్రమకు మేలు చేసే దిశగా ఒక్క చర్యా తీసుకోలేదు. తెలంగాణ సినిమా రావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమని ఒకటిన్నరేళ్లుగా తెలంగాణ సినిమా రూపకర్తలు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా ఆ వైపుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తెలంగాణ సినిమా వృద్ధి చెందకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రయోజనం ఏమిటని ఇక్కడి నిర్మాతలు, దర్శకులు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి పనిచెయ్యకపోతే తెలంగాణ సినీ పరిశ్రమ అనేది వేళ్లూనుకోవడంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని విషయమై తెలంగాణ సినిమావాళ్లతో పాటు తెలంగాణ ప్రజా సమూహమంతా ఆందోళన చెయ్యాల్సి ఉంది.

Wednesday, November 25, 2015

Synopsis of the movie BHALE ABBAYILU (1969)

'భలే అబ్బాయిలు' చిత్ర కథాంశం


స్వశక్తిని తప్ప విధిని పట్టించుకోని కోటయ్య (గుమ్మడి) కండలు కరిగించి, చెమటోడ్చి డబ్బు కూడబెట్టి కోటేశ్వరరావుగా మారతాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వాళ్ల సుఖాల్ని చూడలేని విధి శీతకన్ను వేసింది. భూకంపంలో సర్వస్వమూ కోల్పోయి బికారి అవుతాడు కోటయ్య. కుటుంబం చెల్లాచెదురవుతుంది.
పెద్ద కొడుకు బాబ్జీ (కృష్ణంరాజు) ఓ అనాథాశ్రమంలో చేరి, అక్కడి మేనేజర్ పెట్టే బాధలు పడలేక పారిపోయి హైదరాబాద్ చేరి ప్రతాప్ (సత్యనారాయణ) అనే ఘరానా దొంగకు తోడుదొంగగా రాజాలా బతుకుతుంటాడు. రెండోవాడు రవి (కృష్ణ) విశాఖలో ఒక లాయర్ ఇంట పెంపుడు కొడుకై తాను కూడా లాయరవుతాడు.
తన కుటుంబాన్ని వెదుక్కుంటూ అనాథశరణాలయానికి వచ్చి తన కుమారుని చావుదెబ్బలు కొట్టాడన్న కసితో మేనేజర్‌ను హత్యచేసి జైలుపాలవుతాడు కోటయ్య.
హైదరాబాద్ జడ్జిగారింట్లో వజ్రాల హారం దొంగిలించిన రాజా, ఆ హారం ఆయన కూతురు మీనా (కె.ఆర్. విజయ) పుట్టినరోజుకు తెప్పించిందని తెలుసుకొని ఆ హారాన్ని తానే తిరిగి ఇచ్చేస్తాడు. ఆమె ఆకర్షణకు లోనై ఆమె కటాక్షం కోసం పడిగాపులు కాస్తుంటాడు.
అప్రెంటిస్ లాయర్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చి జడ్జి ఇంట్లో దిగుతాడు రవి. అతను, మీనా ప్రేమించుకుంటారు. పెద్దల ఆకాంక్ష కూడా అదే కావడంతో పెళ్లికి ఎదురు చూస్తుంటారు. ఇది తెలిసి రవిని అంతంచేసి మీనాను దక్కించుకోవాలనుకుంటాడు రాజా. అయితే రవి తన తమ్ముడనే నిజం తెలిసి, తన ప్రేమను త్యాగంచేసి, రవికి బాసటగా నిలుస్తాడు.
అన్నదమ్ముల్లో మూడోవాడైన రాము (రామ్మోహన్)ను తల్లి కష్టించి పనిచేస్తూ డిగ్రీ వరకూ చదివిస్తుంది. ఆమె అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొస్తాడు రాము. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో ప్రతాప్ వద్ద డ్రైవర్‌గా చేరతాడు. జైలునుండి విడుదలైన కోటయ్య సైతం భార్యాపిల్లల్ని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరతాడు.
రామును రవి చెల్లెలు రాధ (గీతాంజలి) ప్రేమిస్తుంది. దానికి రవి వ్యతిరేకించడంతో రాము అనాథ అనే సంగతి బయటపెడ్తుంది రాధ. కథ మలుపు తిరిగి మీనా, రవి పెళ్లికి జడ్జి నిరాకరిస్తాడు. దాంతో రవి పెళ్లి బాధ్యతను రాజా స్వీకరిస్తాడు. అదే సమయంలో ప్రతాప్ తన అనుచరుణ్ణి చంపి, ఆ నేరాన్ని రాజాపై మోపుతాడు. డబ్బు కోసం తప్పుడు సాక్ష్యానికి సిద్ధమైన రాము చివరి నిమిషంలో నిజం చెప్పడం, లాయర్ రవి చాకచక్యంతో రాజాకు శిక్ష తప్పుతుంది. విధివశూత్తూ తప్పిపోయిన ఆ కుటుంబం తిరిగి విధివిలాసంతోనే కలవడంతో కథ సుఖాంతం.

తారాగణం: కృష్ణ, కేఆర్‌విజయ, కృష్ణంరాజు, గుమ్మడి, రామ్మోహన్, రాజనాల, శాంతకుమారి, ధూళిపాళ, గీతాంజలి, శైలశ్రీ, రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ (గెస్ట్)
సంగీతం: ఘంటసాల
నిర్మాత: తోట సుబ్బారావు
దర్శకుడు: పేకేటి శివరాం
బేనర్: శ్రీదేవి కంబైన్స్
విడుదల తేదీ: 19 మార్చి

Actor Vemuri Gaggaiah Filmography

1. Sati Savitri (1933)
2. Sri Krishna Leelalu (1935)
3. Sati Tulasi (1936)
4. Draupadi Vastrapaharanam (1936) (Sisupala)
5. Mohini Rukmangada (1937) (Rukmangada)
6. Bhakta Markandeya (1938) (Yama)
7. Krishna Jarasandha (1938) (Jarasandha)
8. Mairavana (1940) (Mahiravana)
9. Chandika (1940)

contd...

Tuesday, November 24, 2015

Discrimination on Telugu Cinema

తెలుగు సినిమాలపై వివక్ష

నేడు థియేటర్ల లభ్యత విషయంలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాల మధ్య ఎలాగైతే వివక్ష కొనసాగుతూ ఉందో, గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు, తమిళ సినిమాల  మధ్య అలాంటి వివక్షే కొనసాగేది. ఉదాహరణకు 1948లో కొన్ని తమిళ చిత్రాలు ఒకేసారి 50 కేంద్రాల్లో (అప్పట్లో అది చాలా ఎక్కువ) విడుదలయ్యాయి. కానీ ఒక్క తెలుగు చిత్రం కూడా పట్టుమని పది కంటే ఎక్కువ కేంద్రాల్లో విడుదల కాలేదు. ఆ ఏడాది ఆగస్టులో ఒక తెలుగు సినిమాకి 6 కేంద్రాల్లో ఒకేసారి విడుదల చేయాలంటే ముడి ఫిల్మ్ దొరకలేదు. తమిళ సినిమాలకూ, తెలుగు సినిమాలకూ మధ్య నెలకొన్న ఈ వివక్ష అన్యాయమంటూ అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ వివక్ష చివరంటా కొనసాగింది.

Monday, November 23, 2015

Narthasala: The Award Winning Movie

'నర్తనశాల' (1963) అందుకున్న పురస్కారాలు

కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' చిత్రం 11వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి బహుమతి పొందింది. జకార్తాలో జరిగిన ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. కీచక పాత్రధారి ఎస్వీ రంగారావు ఉత్తమ నటుడిగా, అద్భుతమైన సెట్టింగ్స్‌తో 'నర్తనశాల' అందంగా కనిపించడానికి కారణమైన టీవీఎస్ శర్మ ఉత్తమ కళా దర్శకునిగా పురస్కారాలు అందుకున్నారు. అలాగే 1963 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తం తెలుగు చిత్రం అవార్డును సాధించింది 'నర్తనశాల'.

Sunday, November 22, 2015

Actor Tungala Chalapathi Rao Filmography

1. Sati Anasuya (1935)
2. Sati Sakkubai (1935)
3. Mohini Bhasmasura (1938) (Narada)
4. Panduranga Vittal (1939) (Kukkuta Muni)
5. Usha Parinayam (1939) (Sainyadhipathi)
6. Vara Vikrayam (1939)

Saturday, November 21, 2015

Greatness of MS Subbulakshmi

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఘనత

ఇవాళ్టి రోజుల్లో ఓ సంగీత కార్యక్రమం ద్వారా రూ. లక్ష రూపాయలు వసూలు చేయడం తలకు మించిన భారంగా మారుతుంటే, ఎప్పుడో సుమారు ఏడు దశాబ్దాల క్రితమే ఓ కచ్చేరీ ద్వారా రూ. లక్ష రూపాయలు వసూలు కావడం గొప్ప విషయాల్లోనే గొప్ప విషయం. ప్రసిద్ధ దక్షిణాది గాయనీమణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 1947 డిసెంబర్‌లో బొంబాయిలో నాలుగు గంటలసేపు సంగీత కచ్చేరీ చేశారు. ఈ ప్రదర్శన ద్వారా రూ. లక్ష వసూలు కావడం ఆ రోజుల్లో రికార్డు. దాక్షిణాత్య విద్యా వ్యాపక సంఘం వాళ్ల భవన నిర్మాణ నిధికి విరాళాలు వసూలు చేయడంలో భాగంగా ఈ కచ్చేరీని ఏర్పాటు చేశారు. మురార్జీ దేశాయ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి బరోడా మహారాజు, ఆయన భార్య సీతాదేవి, బొంబాయి నగరంలో పేరుపొందినవాళ్లు అనేకమంది హాజరయ్యారు. సుబ్బులక్ష్మి గాన ప్రవాహంలో మునిగితేలారు.

Friday, November 20, 2015

Government Interference in Film Industry

చిత్ర పరిశ్రమ - ప్రభుత్వ జోక్యం

సినీ పరిశ్రమలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలి, అసలు ఉండవచ్చా? అనే చర్చ చాలా కాలంగా ఉంది. న్యాయానికి ఈ చర్చ రావలసింది కాదు. ఎందుకంటే, చిత్ర పరిశ్రమ ఇతర పరిశ్రమల మాదిరిగా నిత్యావసర వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమ కాదు. వినోదం ప్రధానంగా ప్రజల్లో ఉన్నతాభిరుచులు పెంపొందించడానికి ఉపకరించేది. అంటే సాహిత్యంతో పోలినదన్న మాట. అయితే సాహిత్యం విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని మనం ఏ రకంగానూ ఒప్పుకోం. ఒప్పుకుంటే సాహిత్యకారుల ప్రతిభా పాటవాలూ, పరిశీలనా దృష్టి పనికిరాకుండా పోతాయి. కానీ చిత్ర పరిశ్రమలో ఈ సమస్య వచ్చింది. ఇందులో ప్రభుత్వ జోక్యం ఎంతవరకూ, ఏ విధంగా ఉండాలనేది చూడాలి. ఇవాళ సినిమాలు తీసేవాళ్లలో నూటికి 95% మందికి ధనార్జనే లక్ష్యం. మిగతా 5% మంది కళాత్మక దృష్టి ఉన్నవాళ్లు. చక్కని సినిమాలు తీసి, చరిత్రలో నిలిచిపోవాలనేది వాళ్ల ఆశయం.
ప్రభుత్వం ఈ పరిశ్రంలో జోక్యం చేసుకోవడం అంటే, నిర్మాతలకు అండగా ఉండి, వాళ్లకు చేయూతనివ్వాలి. ఇవాళ నిర్మాతలకున్న లోటుపాట్లు ప్రధానంగా పెట్టుబడి, థియేటర్ల లభ్యత. ఈ రెండింటి విషయంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే భరోసా ఉంటే, నిర్మాతలు సమధికోత్సాహంతో చక్కని సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఆ ప్రకారం ప్రజల్లో నూతన భావాల వ్యాప్తికీ, ఉన్నతాభిరుచులు కలగడానికీ ప్రభుత్వం దోహదమవ్వాలి.
ప్రభుత్వం ఆ భరోసా కలిగించినా నిర్మాతలు ఇప్పటిలాగే మూస ప్రేమకథలు, మూస వినోదాత్మక చిత్రాలు, బకరా కంటెంట్ సినిమాలు తీస్తూనే ఉంటారనే సందేహం రావచ్చు. అదే జరుగుతుంది కూడా. అందుకని నిర్మాతలు తమ బాధ్యతల్ని గుర్తించేట్లు నిబంధనలు, నిషేధాలు పెట్టవచ్చు. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన మీడియాపైనే అలాంటి నిబంధనలు ఉన్నాయి కదా.
ఈ సందర్భంగా మీడియా ఎలాగైతే సమష్టిగా కొన్ని నియమ నిబంధనల్ని ఏర్పరచుకుందో, నిర్మాతలు కూడా అలాంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికి ఫిల్మ్ చాంబర్ కానీ, నిర్మాతల మండలి కానీ పెద్దరికం వహించవచ్చు. అలా చేస్తే నిర్మాతలపై ప్రభుత్వం విధి నిషేధాలు పెట్టే అవసరమే కలగకపోవచ్చు. ఏదేమైనా భావ స్వేచ్ఛకూ, సినీ పరిశ్రమ అభివృద్ధికీ భంగం కలగని రీతిలోనే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
సినిమాల వసూళ్ల విషయంలో థియేటర్ల లీజుదారులు/యజమానులు, సినిమాల ఏజెంట్లూ కలిసి నిర్మాతల్ని మోసం చేస్తున్నారనీ, థియేటర్‌లోని ప్రేక్షకుల సంఖ్యకూ, వసూళ్లకూ మధ్య భారీ తేడా కనిపిస్తుంటున్నదనీ తరచూ ఆరోపణలు వస్తున్నాయి. అంటే నిజంగా వసూలైన దానికంటే నిర్మాతకు లేదా డిస్ట్రిబ్యూటర్‌కు తక్కువగా వసూలైనట్లు లెక్కలు చెబుతున్నారనేది ఆరోపణ. ఈ విషయాన్ని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలు చెప్పి బాధపడ్డారు.
దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్‌లైన్ టికెటింగ్ ఒక్కటే మార్గమని అంటున్నారు. అందులో నిజముంది కానీ, మళ్లీ దానిపేరిట సర్వీస్ చార్జ్ అని అదనంగా ప్రేక్షకుల నుంచి వసూలు చేయకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.

Synopsis of the movie ANARKALI (1955)

'అనార్కలి' చిత్ర కథాంశం:

పారశీకంలో పుట్టిన అందాల సుందరి 'నాదిరా' దురదృష్టవశాతూ తనవాళ్లతో కలిసి ఆగ్రా నగరం చేరాల్సి వస్తుంది. ఒకసారి అక్బర్ పాదుషా వారి దానిమ్మతోటలో నాదిరా పూలు కోసుకుంటూ, పాట పాడుతూ ఉంటే, ఆ మధుర గానానికి యువరాజు సలీం ముగ్ధుడవుతాడు. ఆమెను చూసి ఆ దివ్య సౌందర్యానికి దాసుడవుతాడు. నాదిరా కూడా అమాయకంగా సలీం ప్రేమలో పడుతుంది. అప్పట్నించీ రోజూ వాళ్లిద్దరూ ఆ తోటలో కలుసుకుంటూ ఉంటారు. నాదిరా పాడుతున్న సమయంలో ఒకసారి తోటకు వచ్చిన అక్బర్ ఆమె గానానికి పరవశుడై ఆమెకు 'అనార్కలి' అనే బిరుదునిస్తాడు.
కాబూల్‌లో కల్లోలం చెలరేగడంతో, దాన్ని అణచడానికి అక్కడకు వెళ్తాడు సలీం. తన ప్రియుణ్ణి వెదుకుతూ బందిపోటు దొంగలకు పట్టుబడుతుంది అనార్కలి. బానిసల్ని విక్రయించే బజారులో అనార్కలిని బహిరంగంగా వేలం వేస్తాడు బందిపోటు నాయకుడు. ముసుగులో ఉన్న సలీం అధిక ధరకు పాడి ఆమెను కొనుక్కుంటాడు. తన స్వాధీనంలోకి వచ్చిన అనార్‌ను మారువేషంలోని సలీం బలాత్కరించబోతాడు. తన శీలాన్ని భంగపరచవద్దనీ, అదివరకే తన హృదయం మరొకరికి అర్పించాననీ అతన్ని ప్రాధేయపడుతుంది అనార్.
ఆమె నిష్కల్మష ప్రేమను గుర్తించి ఆనందంతో తన ముసుగు తొలగించి, ఆమెనూ ఆనందింపజేస్తాడు సలీం.
యుద్ధంలో సలీంకు బలమైన గాయం తగులుతుంది. అతన్ని ఆగ్రా తీసుకుపోతారు. అనార్ కూడా ఆగ్రా చేరుకుంటుంది. ఎన్ని మందులు వాడినా సలీంకు స్పృహ రాదు. చివరకు అనార్ మధురగానం చెవికి సోకి ఈ లోకంలోకి వస్తాడు సలీం. అనార్ చేసిన మేలుకు సంతోషించిన అక్బర్ ఆమెకు తన కోటలో ఆతిథ్యం ఇస్తాడు. ఆమె అక్కడే నివాసం ఉంటుంది. సలీం ఆరోగ్యవంతుడైన సంతోషంలో ఆగ్రాలో మహోత్సవాలు చేయిస్తాడు అక్బర్. అనార్ అద్భుత నాట్యానికి నజరానాగా ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు.
సలీంపై ఆశలు పెట్టుకున్న గుల్‌నార్‌కు అనార్‌పై అసూయ కలుగుతుంది. సలీం, అనార్ ప్రణయాన్ని భగ్నం చేయాలని కక్ష కడుతుంది. సలీం యువరాజ పట్టాభిషేక మహోత్సవంలో అనార్కలి నాట్యం ఏర్పాటు చేస్తారు. పానీయంలో మత్తుమందు కలిపి అనార్ చేత తాగిస్తుంది గుల్‌నార్. మైకంతో నాట్యంలోనే శృంగార చేష్టలు చేస్తూ యువరాజుపై పడుతుంది అనార్.
దాంతో అక్బర్ ఆమెను ఖైదుచేయిస్తాడు. ఇది తట్టుకోలేని సలీం తండ్రిపై తిరుగుబాటు చేస్తాడు. తల్లిముఖం చూసి తన యుద్ధాన్ని విరమించి బందీ అవుతాడు. దర్బార్‌లో అనార్, సలీంలను దోషులుగా నిర్ణయించి ఇద్దరికీ మరణదండన విధిస్తాడు అక్బర్. సలీంను వధించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్బర్ స్వయంగా కుమారుని చంపడానికి పూనుకుంటాడు. కానీ అతనిలోని పుత్రవాత్సల్యం వెనుకంజ వేయిస్తుంది. సలీంను విడిచిపెడతారు. మరోవైపు అనార్కలిని సజీవ సమాధి చేస్తుంటారు. ఆమెను కాపాడాలని గుర్రంపై బయలుదేరుతాడు సలీం. దారిలో అతనిపై బాణం వేస్తుంది గుల్‌నార్. అది అతని వెన్నులో దిగుతుంది. అయినా తన ప్రయత్నం వీడక ముందడుగు వేస్తాడు. సలీం వచ్చేసరికి అనార్ సమాధి పూర్తయిపోతుంది. విలపిస్తూ తన తలను సమాధికేసి కొట్టుకుంటాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, చిత్తూరు నాగయ్య, పేకేటి శివరాం, సురభి బాలసరస్వతి, హేమలత
సంగీతం: ఆదినారాయణరావు
నిర్మాత: ఆదినారాయణరావు
దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
బేనర్: అంజలీ పిక్చర్స్
విడుదల తేదీ: 28 ఏప్రిల్

Thursday, November 19, 2015

Director Chittajallu Pullaiah Filmography


1. Sati Savitri (1933)
2. Lava Kusa (1934)
3. Sri Krishna Thulabharam (1935)
4. Sati Anasuya (1936)
5. Dhruva Vijayam (1936)
6. Sri Satyanaraya Swamy (1938)
7. Mohini Bhasmasura (1938)
8. Vara Vikrayam (1939)
9. Malathi Madhavam (1940)

contd...

Synopsis of the movie AGGI MEEDA GUGGILAM (1968)

'అగ్గిమీద గుగ్గిలం' చిత్ర కథాంశం:


క్షుద్రవిద్యల్ని సొంతం చేసుకున్న మాయాపురం మాంత్రికుడు (రాజనాల) శ్రీపుర మహారాణి భట్టిణి (జూనియర్ శ్రీరంజని)ని అపహరించుకుపోయి, తన మాయా మందిరంలో బంధించి, ఆమెను వశపరచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ అవమాన భారంతో మహారాజు (గుమ్మడి) కుంగిపోతాడు. రాణి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మరణించిందని ప్రకటిస్తాడు. అయితే తన రహస్య మందిరంలో అహోరాత్రులూ కఠోర దీక్షలో మునిగిపోయి యక్షిణిని ప్రసన్నం చేసుకుంటాడు. అపూర్వ మంత్రశక్తుల్ని సాధిస్తాడు. ఈ శక్తులతో మాంత్రికుడి పీచమణచి, రాణిని బంధవిముక్తి చేయడానికి ఎదురు చూస్తుంటాడు.
రాజు వైమనస్యాన్ని అవకాశంగా తీసుకొని మంత్రి చండవర్మ (ధూళిపాళ) రహస్యంగా సైన్యాధిపతిని హతమార్చి తన కుమారుడు శకటాలు (సత్యనారాయణ)కు ఆ పదవిని కట్టపెట్టాలని పన్నాగం పన్నుతాడు. ఈ ప్రమాదాన్ని శంకించిన రాజు అందుకు అంగీకరించక పోటీలు ఏర్పాటుచేసి, వాటిలో నెగ్గిన వీరునికే ఆ పదవి ఇవ్వాలని ఆదేశిస్తాడు.
ఆ పోటీల్లో వీరేంద్ర (కాంతారావు) నెగ్గుతాడు. అయితే సైన్యాధిపతి పదవిని నిరాకరిస్తాడు. అతని శౌర్యపరాక్రమాలకు ముగ్ధురాలైన రాకుమారి చంద్రప్రభాదేవి (రాజశ్రీ) అతనికి తన హృదయాన్ని అర్పిస్తుంది. వీరేంద్రుడు అరణ్యంలో తన చెల్లి అరుణ (విజయలలిత), తాత (కాశీనాథ్ తాత)తో నివసిస్తూ ఉంటాడు. రాకుమారి మారువేషంతో అక్కడకు వెళ్లి సైన్యాధిపత్యానికి అతణ్ణి ఒప్పిస్తుంది. వీరేంద్రుని చెల్లి అరుణ ఒకరోజు విచిత్ర పరిస్థితుల్లో కామపురి యువరాజు అరిందముడి (రామకృష్ణ)ని కలుసుకొని ప్రేమలో పడుతుంది.
ఈ కథలో ఇంకో ఉపకథ వస్తుంది. నిజానికి వీరేంద్రుడు కామపురి యువరాజనీ, అరిందముడి తండ్రి కామపాలుడు వీరేంద్రుని తండ్రి అయిన రాజును హతమార్చి, పిల్లల్ని కూడా చంపాలనుకుంటుండగా, పసికందుల్ని తాను రక్షించి అరణ్యానికి తెచ్చినట్లు తాత చెబుతాడు. శ్రీపురంలో వీరేంద్రుని భక్తి విశ్వాసాల్ని పరీక్షించిన మహారాజు అతడ్ని రహస్య మందిరానికి తీసుకెళ్లి, తన వృత్తాంతమంతా అతనికి వివరిస్తాడు. మాంత్రికునిపై పోరాటానికి బయల్దేరి, అతనికి బందీ అవుతాడు. అడవిలో వెళ్తున్న అరిందముడిపై శకటాలు బలగం దాడిచేస్తుంది. వీరేంద్రుడు అతనికి సాయపడతాడు. ఆ పోరులో స్పృహతప్పిన అరిందముడిని తన ఇంటికి తీసుకుపోతాడు. తాత ద్వారా తన తండ్రి చేసిన రాజద్రోహాన్ని తెలుసుకుంటాడు అరిందముడు. తండ్రి అక్రమాల్ని వ్యతిరేకిస్తాడు. దాంతో కొడుకుని బంధించమంటాడు కామపాలుడు. భటుల నుంచి తప్పించుకొని పారిపోతాడు అరిందముడు.
మహారాజును వీరేంద్రుడు హత్యచేశాడని చండవర్మ ప్రచారం చేస్తాడు. ఫలితంగా ప్రియుణ్ణి అనుమానించి కారాగారంలో వేయిస్తుంది రాకుమారి. అక్కణ్ణించి వీరేంద్రుడు తప్పించుకొని మహారాజు కోసం మాంత్రికుని వద్దకు బయలుదేరుతాడు. కామపాలునితో కలిసి కుట్ర పన్నిన చండవర్మ శ్రీపుర రాజ్యాపహరణకు ప్రయత్నిస్తాడు. రాకుమారి, అరుణ పారిపోతుండగా పట్టుకొని బంధిస్తారు. మాంత్రికుని స్థావరం చేరిన వీరేంద్రుడు, అక్కడ ఆకాశ బేతాళుడికి సాయపడి, అతని సాయంతో మాంత్రికుడి ప్రాణాలుండే కప్పను చేజిక్కించుకుంటాడు. దాంతో కథ సుఖాంతం.
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, రామకృష్ణ, విజయలలిత, రాజనాల, గుమ్మడి, ధూళిపాళ, సత్యనారాయణ, రాజబాబు, జ్యోతిలక్ష్మి
సంగీతం: సత్యం
నిర్మాతలు: పి.యస్. ప్రకాశరావు, ఎ. పూర్ణచంద్రరావు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: నవభారత్ ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 సెప్టెంబర్

Wednesday, November 18, 2015

Director Chitrapu Narasimha Rao Filmography

1. Seetha Kalyanam (1934)
2. Sri Krishna Leelalu (1935)
3. Sati Tulasi (1936)
4. Mohini Rukmangada (1937)
5. Krishna Jarasandha (1938)
6. Jayaprada (1939)

Interview with actor Raj Tarun

- ఆంధ్రజ్యోతి డైలీ, 18 నవంబర్ 2015

Interview with Actress Sayesha Saigal

- ఆంధ్రజ్యోతి డైలీ, 16 నవంబర్ 2015

Tuesday, November 17, 2015

Beginning Days: KR Vijaya

తొలి రోజుల్లో.. కె.ఆర్. విజయ

అచిరకాలంలోనే కె.ఆర్. విజయ తెలుగువారి అభిమాననటి కాగలిగిందంటే దాని వెనుక ఆమె సముపార్జించుకున్న సామర్థ్యం, పట్టుదల, సహనశక్తే కారణమని చెప్పాలి. అందరిలా ఆమె మొదట చిన్న చిన్న పాత్రలు ధరించి, అవకాశం లభించగానే కథానాయికగా మారలేదు. విజయ మొదటగా తమిళ చిత్రరంగంలో కథానాయికగానే ప్రవేశించింది. ఆయా సినిమాల్లో విజయ ప్రదర్శించిన అభినయం చూసి ముచ్చటపడి తెలుగు చిత్ర నిర్మాతలు తమ చిత్రాల్లో కూడా విజయకు ముఖ్య పాత్రల్ని ఇస్తూ వచ్చారు. వాటిలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ముగ్ధులైన తెలుగువాళ్లు తమ అభిమాన తారగా ఆమెకు సముచిత స్థానాన్ని కల్పించారు. విజయ కళ్లల్లో మత్తుమందు ఉంది. నాయికగా వెలుగొందిన కాలంలో కొంటె చూపులు విసురుతూ పెదాలతో చిరు దరహాసం చిందిస్తూ ప్రేక్షకుల్ని అయస్కాంతంగా ఆకర్షించే నేర్పు ఉంది. ఆ నేర్పుతోటే నాయికగా రాణిస్తూ సినీ రంగంలో మేటి స్థానాన్ని అందుకుంది.
విజయ 1947 ఫిబ్రవరి 8న కేరళలోని త్రిచూర్‌లో రామచంద్రన్, కల్యాణి దంపతులకు జన్మించింది. రామచంద్రన్ పేరుపొందిన రంగస్థల నటుడు. ఆయన 1934లో స్కూలు చదువును అర్ధంతరంగా ఆపేసి, మధుర వచ్చి, బోయ్స్ డ్రమటిక్ కంపెనీలో చేరి, దాని తరపున ఎన్నో ప్రదర్శనలిచ్చి రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
విజయ పెద్దగా చదువుకోలేదు. ఆమెకు బాల్యం నుంచే నటనలో శిక్షణనిచ్చి నటిగా రూపొందడానికి తండ్రి ఎంతగానో శ్రమించారు. విజయకు నాట్యం కూడా ఆయనే నేర్పారు. ఆయన శ్రమ వృధా కాలేదు. విజయ నటిగా రూపొందింది.

తొలి చిత్రం 'కర్పగం'

ప్రముఖ రచయిత కె.ఎస్. గోపాలకృష్ణన్ 'కర్పగం' చిత్రాన్ని రూపొందిస్తూ విజయను చూశారు. చూసీ చూడగానే తన సినిమా హీరోయిన్ ఆమే అనుకుని, మరో ఆలోచనకు తావివ్వకుండా తీసుకున్నారు. ఆ సినిమా కథంతా నాయిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాంటి క్లిష్ట పాత్రను విజయకు ఇచ్చారంటే, ఆమెపై ఆయన ఉంచిన నమ్మకం ఏపాటిదో గ్రహించవచ్చు. 'కర్పగం' విడుదలయ్యాక అభినందనల వర్షంలో తడిసి ముద్దయింది విజయ. ఆ తర్వాత 'కైకుడుత్తదైవం', 'తొయిలాళి', 'కరుప్పుపణం' వంటి తమిళ చిత్రాల్లో నాయిక అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అప్పుడే కొన్ని మలయాళ చిత్రాల్లోనూ ఆమె నటించింది.
ఆమె అంతగా చదువుకోకపోయినా తెలుగు, తమిళ, మలయాళ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది.
విజయలోని ముగ్ధమోహనత్వం గమనించి ఎన్టీ రామారావు తమ ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించిన 'శ్రీకృష్ణ పాండవీయం'లో రుక్మిణి పాత్రనిచ్చి ప్రోత్సహించారు. అంది వచ్చిన అవకాశాన్ని ఆమె వృథా చేసుకోలేదు. తన సామర్థ్యాన్ని నిరూపించుకొంది. ఆ తర్వాత వచ్చిన 'పరమానందయ్య శిష్యుల కథ', 'అసాధ్యుడు', 'భలే అబ్బాయిలు', 'ఏకవీర' వంటి చిత్రాలు విజయను మేటితారగా రూపొందించాయి. 'భలే అబ్బాయిలు' నాటికి ఆమె వివాహం చేసుకొని పిల్లల తల్లి అయినా ఆమె అందం ఇనుమడించిందే కానీ తగ్గలేదు. ప్రేక్షకుల అభిమాన తారగా ఆమె ప్రాభవం మరింత పెరిగింది. తెలుగు సినిమాలతో పాటే తమిళ సినిమాల్లోనూ ఆమె మంచి డిమాండ్ సంపాదించుకుంది. ఉత్తమనటిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డును అందుకుంది.
'కళావర్థని' అనే నాటక సంస్థను విజయ సొంతంగా నిర్వహించేది. ప్రతిభ ఉన్న కొత్త నటీనటుల్ని ఈ సంస్థ ద్వారా అందించింది. కళావర్థని ద్వారా ఇచ్చిన నాటక ప్రదర్శనల వల్ల వసూలైన డబ్బును సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించింది. తన ఇద్దరు చెల్లెళ్లకు తీరిక వేళల్లో నృత్యంలో శిక్షణ ఇస్తూ వచ్చింది. తన కూతురికి హేమలత అనే పేరు పెట్టుకుంది. సినిమాలతో తీరికలేనంత పని ఒత్తిడి ఉండటంతో కళావర్థనికి సమయం కేటాయించలేకపోతున్నానని బాధపడేది.

Monday, November 16, 2015

Main Reason For RUDRAMADEVI Failure

'రుద్రమదేవి' ఫ్లాపవడానికి కారణం అదేనా?

గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ 'రుద్రమదేవి' వసూళ్లు రూ. 50 కోట్లకు చేరుకుంటున్నాయి. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు చేయడం టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. ఇంత చేసినా 'రుద్రమదేవి' ఫ్లాప్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోనుండటం విచారకరం. రూ. 80 కోట్లు వసూలైతేనే కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి గుణశేఖర్ బయటపడే స్థితిలేదు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ రూ. 42 కోట్లు, హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లు కలిపి రూ. 6 కోట్లు వసూలు చేశాయి. ఫుల్ రన్‌తో ఇంకో రెండు కోట్లు వస్తాయని అంచనా. దీన్నిబట్టి థియేటర్ కలెక్షన్ పరంగా రూ. 30 కోట్లు డెఫిసిట్ వచ్చే అవకాశాలున్నాయి. శాటిలైట్ హక్కులు తీసేస్తే ఈ నష్టం కొత తగ్గుతుంది. దీంతో తెచ్చిన అప్పులను గుణశేఖర్ ఎలా తీరుస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆస్తులన్నీ అమ్ముకోవడంతో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
'రుద్రమదేవి' కథాంశంలో గుణశేఖర్ మరింత శ్రద్ధపెట్టి పనిచేసినట్లయితే వంద కోట్ల ప్రాజెక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'రుద్రమదేవి' సినిమాలో రుద్రమదేవి పాత్ర హైలైట్ కాకుండా గోన గన్నారెడ్డి పాత్ర ఆకర్షణీయంగా కనిపించడంతోనే, ఈ సినిమా విషయంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. రుద్రమదేవిని వీరనారిగా, మహా సామ్రాజ్ఞిగా చూపించడానికి బదులుగా ఎంతసేపూ ఆమె లైంగికతపైనే దృష్టి సారించడంతో ప్రేక్షకులను ఆ పాత్ర ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదనేది నిజం. చిన్ననాటి నుంచి మగవాడిగా పెరిగిన రుద్రమదేవి యుక్తవయసు వచ్చాక తాను ఒక స్త్రీనని తెలుసుకోవడంతో మొదలైన ఈ లైంగిక కోణంపైనే చివరాఖరి వరకూ సినిమా నడవడం ప్రేక్షకుల్లో ఒకవిధమైన వ్యతిరేక భావన ఏర్పడటానికి దోహదం చేసింది. అలా కాకుండా రుద్రమదేవి ప్రదర్శించిన వీరత్వం, ఆమె రాజనీతిజ్ఞత, ప్రజల్ని పరిపాలించిన విధానంపై దృష్టి నిలిపినట్లయితే ఆమె పాత్రకు న్యాయం చేసినట్లయ్యేది.
సీనియర్ నటి విజయశాంతి గనుక ఈ సినిమా చేసినట్లయితే, ఆమె ఫోకస్ అంతా రుద్రమదేవి శక్తియుకుల మీదే ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపారు. "ఇప్పుడొచ్చిన 'రుద్రమదేవి' లైన్ వేరు. మేము ఎంచుకున్న లైన్ వేరు. మా కథ రుద్రమదేవి పట్టాభిషేకంతో మదలై ఆమె 83వ యేట వరకూ నడుస్తుంది. ఆ వయసులోనూ శత్రువులపై పోరాడిన వీరనారి ఆమె" అని చెప్పారామె. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొనడం వల్ల సినిమా చేయడానికి కుదరలేదనేది ఆమె మాట. లేనట్లయితే రుద్రమదేవిగా విజయశాంతి ఈ సరికే మనకు కనిపించి ఉండేవారు. ఆమె చెప్పినట్లుగా పట్టాభిషేకం తర్వాత నుంచే రుద్రమదేవి కథను చెప్పినట్లయితే ఈ సినిమా ఫలితం వేరుగా ఉండేదని విశ్లేషకులు నమ్ముతున్నారు. రుద్రమదేవికి సీక్వెల్‌గా 'ప్రతాపరుద్రుడు' తీయాలని గుణశేఖర్ భావిస్తున్నప్పటికీ, ఆయన కోరిక తీరే అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి.

Sunday, November 15, 2015

Writer Balijepalli Lakshmikantha Kavi Filmography

1. Lava Kusa (1934) (dialogues)
2. Harischandra (1935) (story and dialogues)
3. Sati Anasuya (1936) (dialogues)
4. Dhruva Vijayam (1936) (dialogues)
5. Malli Pelli (1939) (dialogues)
6. Vara Vikrayam (1939) (dialogues)
7. Bhookailas (1940) (dialogues)
8. Vishwa Mohini (1940) (dialogues)
9. Bala Nagamma (1942) (dialogues)
10. Garuda Garvabhangam (1943) (story)

contd...

Need Change of Attitude of Film Makers

సినీ నిర్మాతల దృక్పథం మారాలి

సినిమాలు చాలావరకు ప్రజల మానసిక తత్వాల్లో, ప్రవర్తనలో మార్పు కలుగజేస్తాయి. ప్రతి సినిమా ఏదోవిధంగా ప్రజల మనస్సులలో హత్తుకుపోతుంది. సాధారణంగా జనం సినిమాల్లోని మంచికంటే, చెడునే ఎక్కువగా గ్రహిస్తుంటారు. 'చిడుము అబ్బుతుంది గానీ, సిరి అబ్బదు' అని పెద్దలు ఊరకే అన్నారా! సినిమా విలువని ఇతర దేశాలవాళ్లు గుర్తించినట్లు మనవాళ్లు గుర్తించలేదు. వాళ్లు ఉపయోగించుకుంటున్నట్లు, మనవాళ్లు వాటిని ఉపయోగించుకోవడం లేదు.
అయితే ఇటీవల మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన 'శ్రీమంతుడు' చిత్రం ప్రజలపై మంచి ప్రభావాన్ని చూపడం ఆనందించదగ్గ విషయం. అందులో కథానాయకుడు కోటీశ్వరుడైనప్పటికీ, ఎక్కువగా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తుంటాడు. ఇది యువతని బాగా ఆకర్షించడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైకిల్ వినియోగం పెరిగింది. అలాగే అతను ఒక ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేయడమనే అంశం బాగా ప్రచారంలోకి వచ్చి, సంపన్నవంతులు ఏదో ఒక ఊరిని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. సినిమా కలిగించే మేలు ఎలా ఉంటుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. అయితే ఇలాంటి మేలు కలిగించే సినిమాల కంటే ప్రజల నడతపై చెడు ప్రభావాన్ని కలిగించే సినిమాలే ఎక్కువగా వస్తుండటమే బాధాకరం.
రాంగోపాల్‌వర్మ తీసిన 'ఐస్‌క్రీం' లాంటి సినిమాల్లోని శృంగార, హింసాత్మక సన్నివేశాలు శ్రుతిమించి రాగాన పడ్డాయి. అవన్నీ యవ్వనంలోని లేత హృదయాల్ని ఎంత సునాయాసంగా కల్మష పరుస్తాయో ఇట్టే గ్రహించవచ్చు. వీటి వల్ల సమాజ జీవితం బలహీనమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సమాజంలోని చెడు ఏవిధంగా ఉందో చూపిస్తూ, దానివల్ల ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయో తెలియజేస్తూ, దానికి పరిష్కారాల్ని కమర్షియల్ ఫార్మట్‌లోనే చూపించవచ్చు. రాజకీయ, అధికార అవినీతిపై పోరాటం ప్రధానంగా కథాంశాలు తయారుచేసి సినిమాలు తీయవచ్చు. అయితే ఇలాంటి సినిమాల్ని యథాతథంగా తీస్తే ప్రభుత్వ అధీనంలోని సెన్సార్ బోర్డులు అడ్డు తగులుతుండటం శోచనీయం. ప్రభుత్వాన్నీ, దాని వ్యవస్థల్నీ, అధికార మదాంధుల్నీ ప్రశ్నించే సినిమాలు సెన్సార్ కత్తెరకు గురవుతుంటాయి. రాజ్యంపై తిరుగుబాటు నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్. నారాయణమూర్తి సినిమాలకు అలాంటి కత్తిరింపులు ప్రతిసారీ జరుగుతూనే ఉన్నాయి. అయినా అలుపెరుగని యోధునిలా ఆయన ఆ తరహా సినిమాల్నే తీస్తూ రావడం సామాన్య విషయం కాదు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మరింతమంది నిర్మాతలు, దర్శకులు సమాజానికి ఉపకరించే కథలతో సినిమాలు తీయాలి.
ప్రజలకు ఉపయోగపడే, వాళ్ల అభిరుచుల్ని పెంచే సినిమాలు విరివిగా రాకపోవడానికి మూడు కారణాలు కనిపిస్తాయి. మొదటిది - ప్రభుత్వ అధీనంలోని సెన్సార్ బోర్డులు అడ్డు తగలడం, రెండోది - ప్రభుత్వ సహకారం లేకపోవడం, మూడోది - ప్రజల నుంచి మంచి సినిమాల కోసం డిమాండ్ రాకపోవడం. ఈ ప్రతికూలతలు లేనట్లయితే తెలుగులో మంచి సినిమాలు క్రమం తప్పకుండా వస్తాయని చెప్పొచ్చు.

Saturday, November 14, 2015

NANNAKU PREMATHO: Crucial Project To NTR

'నాన్నకు ప్రేమతో'.. ఆ ఇద్దరికీ కీలకమే!

ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా ఎలా ఉండబోతోంది?.. ఇది ఇప్పుడు చాలామంది తెలుగు సినిమా ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. కావాల్సినంత ప్రతిభ ఉన్నా, ఎంచుకుంటున్న కథల కారణంగా అగ్ర హీరో రేసు నుండి ఎన్టీఆర్ కాస్త దూరం జరిగిపోయాడనేది విశ్లేషకుల అభిప్రాయం. 'ఆది', 'సింహాద్రి' సినిమాలతో అతను టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అవుతాడని అప్పట్లో అంచనాలు వేశారు. కానీ ఆ తర్వాత అతను అనూహ్యంగా వెనకపడిపోయాడు. 'సింహాద్రి' తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అతని నుంచి రాలేదు. 'యమదొంగ', 'అదుర్స్', 'బృందావనం', 'బాద్‌షా' సినిమాలు ఆశలు కల్పించాయి కానీ అతని ఇమేజ్‌ను పెంచలేకపోయాయి. మొన్న వచ్చిన 'టెంపర్' అతని సినిమాల్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించింది కానీ, చివరకు అదీ మామూలు సినిమా జాబితాలోనే చేరింది. ఎన్టీఆర్ కేరక్టర్‌ను పూరి జగన్నాథ్ తీర్చిదిద్దిన తీరు కూడా విమర్శలపాలైంది. ఇలాంటి నేపథ్యంలో 'నాన్నకు ప్రేమతో' సినిమా రాబోతోంది. ఇందులో అల్ట్రా మోడరన్ గెటప్ వేసి కుతూహలం రేపుతున్నాడు ఎన్టీఆర్. పైగా దర్శకత్వం వహిస్తోంది సుకుమార్ అయ్యే. మహేశ్‌తో చేసిన '1.. నేనొక్కడినే' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ, అతని టేకింగ్ హై క్లాస్‌లో ఉందనేది నిజం. రేజర్ ఎడ్జ్ సబ్జెక్ట్, స్క్రీన్‌ప్లేతో అతను ఆడే ఆట ఒక్కోసారి రక్తికడితే, ఇంకోసారి పక్కదారి పడుతుంటుంది. అతనితో వచ్చే సమస్య అదే. అందుకే 'నాన్నకు ప్రేమతో' సినిమాని అతను ఎలా రూపొందిస్తున్నాడనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ లుక్స్‌ను అతను డిజైన్ చేసిన తీరుకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు నెగటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. తెలుగువాళ్లలో మాస్ ఆడియెన్స్ ఎక్కువ కాబట్టి, ఆ అల్ట్రా గెటప్‌ను వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న రకుల్‌ప్రీత్ సింగ్ నాయికగా నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా ఎన్టీఆర్, సుకుమార్.. ఇద్దరి కెరీర్‌కూ ముఖ్యమైనదే. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా వాళ్లకు ఎలాంటి అనుభవాన్నిస్తుందో చూడాలి.

Actress Sriranjani Filmography

1. Lava Kusa (1934)
2. Sri Krishna Leelalu (1935)
3. Sati Tulasi (1936)
4. Maya Bazaar (1936)
5. Nara Narayana (1937) (Chitrarekha)
6. Sarangadhara (1937) (Ratnangi)
7. Chitra Naleeyam (1938)
8. Vande Matharam (1939)
9. Vara Vikrayam (1939)

Friday, November 13, 2015

Sobhan Babu and his desire

శోభన్‌బాబు - సినిమా హాలు

హైదరాబాద్‌లో సినిమా థియేటర్ కట్టాలని ఒకప్పటి అందాల నటుడు దివంగత శోభన్‌బాబు అభిలషించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. చిత్రసీమ అంతా హైదరాబాద్ తరలివచ్చినా ఆయన మాత్రం చెన్నైని విడిచిపెట్టలేదు. చివరివరకు అక్కడే గడిపారు. 1975 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తగిన స్థలాన్ని నిర్ణయించి ఆధునిక వసతులతో ఒక చక్కని థియేటర్‌ను నిర్మించదలచినట్లు ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకనో ఆయన ఆ పనిని విరమించుకున్నారు. 'హలో గురూ' సినిమా తర్వాత సినిమాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తన కుమారుణ్ణి సైతం సినిమా రంగానికి దూరంగా ఉంచారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును చెన్నైలోని పలు ప్రాంతాల్లో స్థలాలు, భవనాలపై వెచ్చించారు. మరింత డబ్బు గడించారు. ఆయన చూపిన బాటలోనే మరో నటుడు మురళీమోహన్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగంలో రాణించారు.

Is DICTATOR going to be another LEGEND?

'డిక్టేటర్' మరో 'లెజెండ్' అవుతాడా?

'సింహా' తర్వాత చాన్నాళ్ల దాకా మళ్లీ హిట్ లేకపోవడంతో రేస్ నుంచి బాలకృష్ణ పూర్తిగా తొలగిపోయాడనుకున్నాయి వైరి వర్గాలు (వీవీ). అవి చంకలు గుద్దుకుంటూ ఉండగానే 'లెజెండ్'ని అంటూ వచ్చాడు. ఈయనేం లెజెండ్? అందరివాడనుకున్న వాణ్ణే కొందరివాడుగా మిగిల్చిన జనం బాలయ్యను 'లెజెండ్'గా ఒప్పుకుంటారా?.. అని వైరి వర్గాలు కుప్పిగంతులు వేశాయి. ఏమైంది? మూతులు పగిలాయి. 'లెజెండ్'గా బాలయ్యను జనం ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు. ఆ సినిమా కాస్తా ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు వసూలుచేసి పెట్టింది. అందులో బాలయ్య డబుల్‌రోల్ చేసి మెప్పించాడు. దాని తర్వాత 'లయన్'గా వచ్చిన బాలయ్యను జనం యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆల్రెడీ 'సింహా'గా నిన్ను ఒప్పేసుకున్నాం కదా, మళ్లీ భాష మార్చి 'లయన్'గా రావడమెందుకని అడిగేశారు జ్జనం. వైరి వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు బాలయ్య 'డిక్టేటర్'ని అంటున్నాడు. ఈ రోజుల్లో డిక్టేటర్‌షిప్ నడవదు కాబట్టి జనం ఈ సినిమాని మడతపెట్టేస్తారని అప్పుడే వీవీ ప్రచారం చేసేస్తోంది. మీరెంతగా నెగటివ్ ప్రచారం చేస్తే నాకంతగా మంచిదన్నట్లు చిద్విలాసంగా ఉన్నాడు బాలయ్య. ఎందుకంటే ఆయన 'డిక్టేటర్'గా ఉండేది దుష్టులకని వీవీకి తెల్వదు కాబట్టి. ఇంతకు ముందే 'లౌక్యం' అనే జనం మెచ్చిన సినిమా తీసిన శ్రీవాస్ 'డిక్టేటర్'ను తీర్చిదిద్దుతున్నాడు. కోన వెంకట్, గోపీమోహన్ కలిసి ఇచ్చిన స్క్రిప్ట్ కాబట్టి మినిమం గ్యారంటీ సినిమా అని ఆయన బల్లలు విరిగిపోయేంత గట్టిగా చెబుతున్నాడు. పైగా ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి ఆయన స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దానికోసం వేదాశ్వ క్రియేషన్స్ అనే బేనర్‌ని కూడా పెట్టాడు. 'డిక్టేటర్'లో బాలయ్య ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో జత కడుతున్నాడు. వాళ్లు.. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష. ఇక జనానికి వినోదాల విందే అని యూనిట్‌వాళ్లు అంటున్నాయి. వీవీకి మరోసారి శృంగభంగం తప్పదని వాళ్లు ఘంటాపథంగా చెబుతున్నారు.

Actress Ramatilakam Filmography

1. Srirama Paduka Pattabhishekam (1932)
2. Sati Savitri (1933)
3. Chintamani (1933)
4. Seetha Kalyanam (1934)
5. Sri Krishna Leelalu (1935)
6. Sati Tulasi (1936)
7. Draupadi Vastrapaharanam (1936) (Satyabhama)
8. Nara Narayana (1937) (Subhadra)
9. Mohini Rukmangada (1937) (Mohini)
10. Bala Yogini (1937)

Thursday, November 12, 2015

Synopsis of the movie UNDAMMA BOTTU PEDATHA (1968)

'ఉండమ్మా బొట్టుపెడతా' కథాంశం:

భూమిని నమ్ముకుని కాయకష్టం చేసి శ్రమించే దశరథరామయ్య (నాగయ్య) కుటుంబం ఒక సంవత్సరం పంటలు పుష్కలంగా పండించింది. అది గుర్తించిన ప్రభుత్వం ఆయనను 'కృషి పండిట్' బిదురుతో సత్కరించాలనుకుంది. ఆ బిరుదుకు తను అర్హుణ్ణి కాననీ, తన మనవరాలు లక్ష్మి అని చెబుతూ ఆయన తన కుటుంబ గాథను వివరిస్తాడు. ఆ కథ ప్రకారం...
దశరథరామయ్యకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాసులు (నాగభూషణం) పేకాట మినహా మరో వ్యాపకంలేని వ్యక్తి. అతని భార్య తులశమ్మ (జానకి) మూఢభక్తి శిఖామణి. పత్రీ పుష్పాలతో దేవుణ్ణి కొలవడం తప్ప ఇల్లూ వాకిలీ చక్కదిద్దుకోవడం ఎరుగని ఇల్లాలు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (అర్జా జనార్దనరావు) కండబలంతో రౌడీగా బతుకుతూ, నిత్యం సారా మైకంతో భార్య శేషు (సూర్యకళ)పై పిడిగుద్దులు కురిపిస్తుంటాడు. పగలంతా మొగుడితో కీచులాటలాడి, తన్నులుతిని అదే ఊళ్లోని పుట్టింటికి పోవడం, రాత్రయ్యేసరికల్లా సింగారించుకుని మొగుడి పక్కలో చేరడం శేషు దినచర్య.
మూడో కొడుకు ఆంజనేయులు (చలం) మోజుపడి ఇంగ్లీష్ చదివిన అమ్మాయిని భార్యగా చేసుకొని, ఆమెకు బెడ్ కాఫీ అందిస్తూ వంటవాడిగా తయారైన మనిషి. ఆ భార్య సుమతి (మీనాకుమారి) అచ్చంగా కుమతి. మొగుణ్ణి వాజమ్మను చేసి దర్జా, దర్పం వెలిగిస్తూ ఉంటుంది. ఇక నాలుగో కొడుకు కృష్ణ (కృష్ణ) అవివాహితుడు. తన భాగానికొచ్చిన పొలాన్ని నమ్ముకొని తండ్రికి అండగా ఉన్న మంచివాడు.
బాధ్యత తెలీని కొడుకులూ, కోడళ్లతో అరాచకత్వం తాండవిస్తున్న ఇంటిని చూసి దశరథరామయ్య కుమిలిపోతుంటాడు. ఆ ఊళ్లోనే ఓ హరిదాసు (ధూళిపాళ) కుటుంబం ఉంటోంది. ఆయనకు ఒకే ఒక్క కూతురు లక్ష్మి (జమున). 'అడుగడుగున గుడివుంది, అందరిలో గుడివుంది' అని నమ్మిన యువతి. శుచి, శుభ్రం ఉన్న ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మి కొలువుంటుందని ఆమె నమ్మకం.
హరిదాసు రోజూ ఊళ్లో భిక్షాటన చేసి, ఆ వచ్చిన బియ్యాన్ని పాపాయమ్మకు అమ్ముకుని, ఆ డబ్బు ఆమె వద్దే కూడబెడుతుంటాడు. ఆ డబ్బుతో కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనేది ఆయన సంకల్పం. పాపాయమ్మ (సూర్యకాంతం) పేరుకు తగినట్లే పాపాలపుట్ట. కాఫీ ఇడ్లీల దగ్గర్నుంచి 'రూపాయి సోడా' (సారా) దాకా ఆమె దగ్గర దొరుకుతాయి. ఎవరింట్లోనన్నా ఏ వస్తువైనా కనిపించలేదంటే అది పాపాయమ్మ ఇంట్లో తాకట్టుకు చేరివుంటుందని చెప్పుకుంటారు. లక్ష్మికి సంబంధం ఖాయం చేసుకున్న హరిదాసు తన డబ్బు కోసం పాపాయమ్మ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా హరిదాసే తన డబ్బు కాజేయడానికి తనను కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను అరెస్ట్ చేయిస్తుంది పాపాయమ్మ.
పీటలమీద పెళ్లి చెదిరిపోవడం, తన తండ్రి అపనిందకు గురికావడం భరించలేని లక్ష్మి ఆత్మహత్యకు పూనుకుంటుంది. ఆమెను కృష్ణ కాపాడతాడు. అదే ముహూర్తానికి లక్ష్మిని తనయింటి కోడలిగా చేసుకుంటాడు దశరథరామయ్య. ముష్టివాడి కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసినందుకు పెద్ద కోడళ్లు ఈసడిస్తారు. అడుగడుగునా అవమానిస్తారు. తోడికోడళ్లు ఎలా ప్రవర్తించినా, ఆ ఇంటికి దీపంగా, భర్తకు నీడగా ఉంటూ వస్తుంది లక్ష్మి.
అరాచకత్వం, అపరిశుభ్రం తాండవిస్తున్న ఆ ఇంటినుండి శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోతుండగా, ఆమెను అక్కడ నిలిపేందుకు ఆత్మత్యాగం చేసిన లక్ష్మి పేరంటాలై వెలుస్తుంది. ఆమె ఆత్మత్యాగంతో కళ్లు తెరిచిన ఆ కుటుంబం ఏకమై, అందరూ కష్టించి పనిచేసి, ఆ ఇంటిని సిరులతో కళకళలాడిస్తారు.

తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, షావుకారు జానకి, ధూళిపాళ, సూర్యకాంతం, అంజలీదేవి, చలం, నాగభూషణం, నాగయ్య, అర్జా జనార్దనరావు, మీనాకుమారి, సూర్యకళ
సంగీతం: కె.వి. మహదేవన్
సమర్పణ: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
దర్శకత్వం: కె. విశ్వనాథ్
బేనర్: బాబూ మూవీస్
విడుదల తేది: 28 సెప్టెంబర్ 1968

BENGAL TIGER Fulfilling The Hopes?

'బెంగాల్ టైగర్'పై ఆశలెన్నో!

రెండు వరుస హిట్లు - 'బలుపు', 'పవర్'తో రవితేజ మళ్లీ రిథంలోకి వచ్చాడు. అయితే మునుపటి సినిమా 'కిక్ 2' డిజాస్టర్ కావడంతో పరిస్థితి మొదటికి వస్తుందేమోనని అతని అభిమానులు, శ్రేయోభిలాషులు కాస్త ఆందోళన చెందుతున్నారు. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 'కిక్' కంటే కూడా పెద్ద హిట్టవుతుందని రవితేజ చాలా గట్టిగా నమ్మాడు. అదే విషయాన్ని అంత నమ్మకంతోనూ అందరితోనూ చెప్పాడు. కానీ ఫలితం దానికి భిన్నంగా వచ్చింది. ఆ సినిమా నిర్మించిన నందమూరి కల్యాణ్‌రాంకు భారీగా నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఆ సినిమా విడుదలకే అతను కష్టాలు ఎదుర్కొన్నాడు. ఖర్చుకు తగ్గట్లు బిజినెస్ కాకపోవడంతో ఎన్టీఆర్ చేసిన ఆర్థిక సాయంతో ఎట్లాగో విడుదల చేశాడు. ఆ సినిమాలో రవితేజ లుక్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సన్నపడ్డం సరేకానీ, మొహంలో గ్రేస్‌లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. వయసు పెరుగుతున్న ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో 'బెంగాల్ టైగర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాయికగా తమన్నా చేస్తోంది. వయసు ముదురుతున్న రవితేజ పక్కన మిల్కీ బ్యూటీనా అని కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఆ జంట తెరపై ఆకట్టుకుంటుందా?.. అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'బలుపు' రాకముందు రవి కెరీర్‌లో ఎంత బ్యాడ్ ఫేజ్ నడిచిందీ తెలిసిందే. 'దొంగల ముఠా', 'వీర', 'నిప్పు', 'దరువు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు' సినిమాలతో అతని ఇమేజ్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. 'కిక్ 2' ఫ్లాపవడం, అందులో అతను  కనిపించిన తీరుతో, ఇప్పుడందరి దృష్టీ 'బెంగాల్ టైగర్' మీదే ఉంది. పైగా పవన్ కల్యాణ్ కోసం తయారు చేసుకున్న స్క్రిప్టులో కొద్దిపాటి మార్పులు చేసుకొని సంపత్ తీస్తున్న సినిమా కావడం వల్ల, ఇది రవితేజకు ఏ మేరకు ఉపకరిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Wednesday, November 11, 2015

Actress Surabhi Kamalabai Filmography

1. Bhakta Prahlada (1931)
2. Sakunthala (1932)
3. Srirama Paduka Pattabhishekam (1932)
4. Prithvi Putra (1933)
5. Veera Abhimanyu (1936)
6. Draupadi Mana Samrakshanam (1936) (Draupadi)
7. Thukaram (1937)
8. Bhakta Jayadeva (1938)
9. Bhookailas (1940)

Tuesday, November 10, 2015

Synopsis of the movie BHALE MASTARU (1969)

'భలే మాస్టారు' కథాంశం:

డిగ్రీ అర్హతలు అన్నీ ఉన్న నిరుద్యోగి మధు. చదువు పూర్తయ్యేసరికి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పాలవుతుంది. కన్నతల్లి క్షయవ్యాధికి గురవడంతో ఆమెను రక్షించుకునే దారి తెలీక విలవిలలాడిపోతాడు. ఆ సమయంలో ఒక పత్రికా ప్రకటన ఎడారిలో ఒయాసిస్సులాగా కనిపించింది. ఆ ప్రకటన సారాంశం.. జమీందార్ గారింట్లో ప్రైవేట్ మాస్టార్ ఉద్యోగం. నెలకు రూ. 700 జీతం. ఎమ్మే డిగ్రీ ఉండాలి. అన్నింటికీ మించి వయసు 50 సంవత్సరాలు దాటి ఉండాలి.. ఈ వయసొక్కటే అతడికి ప్రతిబంధకమైంది. ఏదేమైనా తల్లికి వైద్యం చేయించాలంటే డబ్బు కావాలి. కాలేజీలో ఆడిన నాటకాలు గుర్తుకొస్తాయి. ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని 25 యేళ్ల యువకుడు కాస్తా 50 యేళ్ల మధ్యవయస్కుడిగా జమీందార్ గారింట్లో అడుగుపెడతాడు.
ఇక్కణ్ణించి మధు జీవితం కొత్తగా మొదలవుతుంది. జమీందారిణి తమ్ముని పిల్లలు విజయ (బీయస్సీ), విమల (పీయూసీ), మెట్రిక్‌ను నాలుగేళ్లుగా చదువుతున్న బుచ్చిబాబు, మరో నలుగురు చిన్నపిల్లలు - వీళ్లకు చదువు చెప్పాలి. ఈ వయసుమీరిన మాస్టారి పీడ ఎలాగైనా వదిలించుకోవాలని వాళ్లూ, ఈ గడుగ్గాయిల్ని దారికి తెచ్చి ఉద్యోగం నిలబెట్టుకోవాలని మధూ - ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటారు.
మధు, విజయ సినిమాటిక్‌గా కలుసుకుని, కాస్త కరుకుగా, మరికాస్త ఘాటుగా ఊసులాడుకుని చివరకు సినిమాటిక్‌గానే ప్రేమలో పడతారు. ఆ సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడుతుంది. వయసుమళ్లిన జమిందారిణి హృదయంలో ప్రేమ బీజాలు మొలకెత్తుతాయి. ఎవడో ఓ మగాడు తన అక్కను మోసగించిన దాని ఫలితంగా ఆమె ఆత్మాహుతి చేసుకోవడంతో మొత్తం మగజాతి మీదనే ద్వేషం పెంచుకున్న జమిందారిణి సీతాదేవి మాస్టారుపై మనసు పారేసుకుంటుంది. అతణ్ణి పెళ్లిచేసుకోవాలని భావిస్తుంది. ఈలోగా మాస్టారు మేనల్లుడిగా పరిచయమైన మధుకు విజయనిచ్చి, ఆ తర్వాత తమ పెళ్లి జరుపుకోవాలని ఆమె ఉవ్విళ్లూరుతున్న సమయంలో కథ అడ్డం తిరుగుతుంది.
వయసొచ్చిన మరో అమ్మాయి విమల పైలా పచ్చీసుగా తిరిగే గిరి అనేవాడి వలలోపడి గర్భవతవుతుంది. గిరి ఆమెను చేపట్టేందుకు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోడానికి నదిలో దూకుతుంది. మాస్టారు ఆమెను కాపాడటంతో మధు నిజ స్వరూపం వెళ్లడవుతుంది. విమల జీవితాన్ని నాశనం చేసి, విజయను సైతం వల్లో వేసుకుని తనలో ప్రేమను రగిలించింది మధేననే కక్షతో అతణ్ణి కాల్చి చంపబోతుంది జమిందారిణి. ఆ సమయానికి అక్కడికి వచ్చిన మధు తల్లి ఆ తుపాకీ గుండుకు అడ్డువెళ్లి కొడుకును రక్షిస్తుంది.
కథ ఇక్కడితో ఆగక ఇంకొంత దూరం నడిచి బోల్డన్ని ఫైట్లూ ఫీట్లూ చేసి గిరిని మధు పట్టుకొని వచ్చి విమలకు అప్పగించి, జమిందారిణికి కనువిప్పు కలిగించి, విజయను సొంతం చేసుకోవడంతో కంచి వెళుతుంది.

తారాగణం: ఎన్టీ రామారావు, కాంచన, షీలా, అంజలీదేవి, కృష్ణంరాజు, రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ
సంగీతం: టి.వి. రాజు
నిర్మాత: సి.యస్. రాజు
దర్శకత్వం: ఎస్.డి. లాల్
బేనర్: విజయగిరి ధ్వజ

Monday, November 9, 2015

Is SARDAAR GABBAR SINGH Responsible?

'సర్దార్ గబ్బర్‌సింగ్' బాధ్యతతో ప్రవర్తిస్తాడా?

పవన్‌కల్యాణ్ కెరీర్‌ను అమాంతం అందలం ఎక్కించిన సినిమా 'గబ్బర్‌సింగ్'. సల్మాన్‌ఖాన్ హిందీ సినిమా 'దబాంగ్'కు రీమేక్‌గా హరీశ్‌శంకర్ రూపొందించిన ఈ సినిమా మూడు వరుస ఫ్లాపుల తర్వాత కల్యాణ్‌కు దక్కిన ఘన విజయం. అంతకు ముందు 'పులి', 'తీన్‌మార్', 'పంజా' సినిమాల పరాజయాలతో అతను విమర్శల్ని ఎదుర్కొన్నాడు. కథల విషయంలో తప్పటడుగులు వేస్తున్నానని గ్రహించిన అతను పక్కా మాస్ మసాలా కథను ఎంచుకొని విజయాన్ని సాధించాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను చేస్తున్నాడు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే.. అప్పుడు ఆయన జనసేనాధినేత కాదు. ఇప్పుడు దానికి అధినేత. ఇప్పటివరకూ ఎన్నికల్లో పాల్గొనకపోయినా జనసేన రాజకీయ పార్టీయే. దానికి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పవన్‌కల్యాణ్ కేవలం నటుడు కాదు. ఎంతో బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు కూడా. తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై స్పందిస్తూ, అవసరమైతే.. వాళ్ల వద్దకు వెళ్తూ, వాళ్లకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను చేస్తుండటం వల్ల అందరి దృష్టీ దానిపై ప్రసరిస్తోంది. ఆ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడనే అంశం దగ్గర్నుంచీ, ఆ సినిమాతో ఆయన ఏం చెప్పబోతున్నాడో కూడా జనం గమనిస్తారు. 'గబ్బర్‌సింగ్'లో మాదిరిగా సీక్వెల్‌లోనూ కనిపిస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయ్యుండీ యూనిఫాం వేసుకునే తీరు నుంచీ, అతను ప్రవర్తించే విధానం దాకా అంతా సినిమాటిక్‌గా ఉంటుందే కానీ, వాస్తవికంగా ఉండదు. ఇప్పుడు కూడా గబ్బర్‌సింగ్ కేరక్టర్ అదే తరహాలో ప్రవర్తిస్తే, బాధ్యత లేకుండా సినిమా చేశాడనే విమర్శలు తప్పవు. రాజకీయ నాయకులు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని, ఆయనను దుమ్మెత్తిపోయవచ్చు. పైగా ఈ సీక్వెల్ కథా రచయిత కూడా స్వయంగా కల్యాణే. అందువల్ల సబ్జెక్ట్‌తో పాటు తన పాత్ర విషయంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతికి విడుదల కానున్నది.

Sunday, November 8, 2015

Actor Pulipati Venkateswarlu Filmography

1. Chintamani (1933)
2. Harischandra (1935)
3. Sati Tulasi (1936)
4. Veera Abhimanyu (1936)
5. Nara Narayana (1937) (Arjuna)
6. Mohini Rukmangada (1937) (Agni)
7. Sarangadhara (1937) (Subuddhi)
8. Choodamani (1941)

Saturday, November 7, 2015

Friday, November 6, 2015

Removing Of Fences

తెలుగు చిత్రసీమలో క్రిష్ ఒక విభిన్న దర్శకుడు. ఇవాళ్టి టాప్ డైరెక్టర్లలో అత్యధికులు మూస కథలు, భావావేశ సన్నివేశాలు, వినోదం, వందమందిని ఒక్కడే అలవోకగా చిత్తుచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నవాళ్లే. వాళ్ళ సినిమాలు కేవలం కాలక్షేపం బఠాణీలే. అవి ప్రేక్షకుల అభిరుచుల్ని ఏమాత్రం పెంపొందించకపోగా, మరింత నష్టాన్ని కలగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఆఖరుకి తెలుగు సినిమా సత్తాని ‘బాహుబలి’ విశ్వవ్యాప్తం చేసిందని ఎక్కువమంది గర్వపడుతున్నా, నా దృష్టిలో ఆ సినిమా కూడా ప్రేక్షకుల అభిరుచిని కాస్త కూడా పెంచే రకం కాదు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆడియెన్స్‌ను అది మెస్మరైజ్ చేస్తే చేసుండవచ్చు. కానీ వస్తుపరంగా అది ఏమాత్రమూ ఉత్తమ స్థాయి సినిమా కానే కాదు.
రాజమౌళికి జనాన్ని ఎట్లా మెప్పించి, వాళ్ల డబ్బు కొల్లగొట్టాలనేదే ప్రధానం. దానివల్ల వాళ్ల ఆలోచనలు వికసిస్తాయా, వాళ్లలో మానసిక చైతన్యం కలుగుతుందా.. అనేది ఆయనకు పూర్తిగా అప్రధానం. ఆయన తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి. అవన్నీ భావావేశాలు, ఉద్రిక్తతలు, ఉద్వేగాలు, భీబత్సాలతో నిండివుండేవే. సరిగ్గా క్రిష్ ఇందుకు పూర్తి విరుద్ధ దర్శకుడు. తొలి అడుగు ‘గమ్యం’ నుంచి, ఇప్పటి ‘కంచె’ దాకా అతడి సినిమాలు మానవ సంబంధాలపై అల్లినవే. వివిధ పరిస్థితుల్లో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఎలా స్పందిస్తుంటారు అనే విషయాల్ని కమర్షియల్ పరిధిలోనే వీలైనంత వాస్తవికంగా చూపించే సినిమాలే. ‘కంచె’ ముందు ఆయన హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తీస్తున్నప్పుడు నేను అసంతృప్తి చెందాను.
ఇప్పటికే రెండు భాషల్లో వచ్చిన సినిమాను హిందీలో తీయడంలో ఆయన ప్రతిభ ఏముంది? అసలు ఎందుకు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నాడా? అనేది ఆ అసంతృప్తికి కారణం. ఆ సినిమా సమాజంలోని.. ముఖ్యంగా బ్యూరోక్రసీలోని అవినీతిపై ఓ వ్యక్తి సాగించిన సమరం. కానీ అందులో వాస్తవికత కంటే, నాటకీయత పాలే ఎక్కువ. అంటే క్రిష్ స్కూల్‌కు భిన్నమైన అంశం. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో నేను సంతోషించాను. అవును నిజం. అది ఆడుంటే, క్రిష్ ఆ స్కూల్లోకి వెళ్లిపోయే అవకాశాలుంటాయి కదా. అలా జరగలేదు. ఫలితమే ‘కంచె’. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఉదయం మీడియాకు వేసిన 8.45 గంటల షోకు వెళ్లాను. ఇంటర్వెల్ పడింది. క్రిష్ చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాను. యుద్ధ నేపథ్య చిత్రాలు తెలుగులో ఆడవనేది నాకున్న నమ్మకం.
మనవాళ్లు అట్లాంటి వాటికి కనెక్ట్ కారు. క్రిష్ ఈ సినిమాతో ఎంత పెద్ద సాహసం చేశాడంటే, తను తీసుకున్న నేపథ్యం కారణంగా విదేశీ పాత్రల్ని కీలక పాత్రలుగా చూపించాడు. జర్మన్, బ్రిటీష్ పాత్రలుగా అవి మనకు కనిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మినహా మిగతా సినిమా అంతా ఆ పాత్రలకు ప్రాధాన్యం ఉంది. వాటితో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేరనేది అప్పటిదాకా నాకున్న అభిప్రాయం. చాలామంది సహచర మీడియా మిత్రులు ‘ఏందీ సినిమా? నాకైతే అర్థం కాలేదు. క్రిష్‌కు డబ్బులెక్కువయ్యాయా?’ అని కూడా అనడం విన్నాను. నలుగురైదుగురు నా వద్ద కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘సెకండాఫ్ కూడా చూసి మాట్లాడండి’ అన్నాను. సినిమా అంతా అయ్యాక నేనెవరి అభిప్రాయం కోసం ఆగలేదు. అప్పుడైనా వాళ్ల నుంచి భిన్నమైన అభిప్రాయం వస్తుందని అనుకోను. నా మనసు నిండుగా ఉన్నట్లనిపించింది.
మనుషుల మధ్య, వాళ్ల మనసుల మధ్య.. హోదాలు, అంతస్థులు, కులాలు ఎట్లా అడ్డు’కంచె’లవుతున్నాయో, అలాంటి ‘కంచె’ల కారణంగానే ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని ప్రతీకాత్మకంగా చూపిస్తూ ఎంత బాగా తీశాడనుకున్నా. మనుషుల మధ్య ‘కంచె’ కారణంగా రెండు భిన్న నేపథ్యాలున్న ప్రేమికుల జీవితాలు ఎలా విషాదమయమయ్యాయో హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఇక్కడ కూడా ఆయన ఫార్ములాకు భిన్నంగానే వెళ్లాడు. హీరో హీరోయిన్లు చనిపోతే.. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు కన్నెత్తి చూస్తారా?.. అయినా క్రిష్ తెగించాడు. ‘కంచె’ల వల్ల జరుగుతున్న అనర్ధం తెలియాలంటే విషాదాంతమే సరైందనుకున్నాడు. అప్పుడే కదా.. అందులోని నొప్పి తెలిసేది. కథలో ఎవరైతే ప్రేమికులకు ప్రధాన అడ్డంకిగా నిలిచాడో, ఆ వ్యక్తి (హీరోయిన్ అన్న) చివరకు ఊళ్లమధ్య లేసిన ‘కంచె’లను తీసేయమనడం కథకు సరైన ముగింపు.
ఈ సినిమా ఆడితే.. ప్రేక్షకులు ఎదిగినట్లేననేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ వినోదం కోసమే సినిమాలు చూస్తున్నవాళ్లు ఎక్కువ. యువత కోరుకుంటోంది అదే. అలాంటప్పుడు ‘కంచె’లాంటి సీరియస్ సినిమా ఎవరికి కావాలి? వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేసేవాళ్లకు ‘కంచె’ల గురించి ఆలోచించే తీరుబాటు ఉంటుందా? అందువల్ల ‘కంచె’ విషయంలో నాది అత్యాశ అవుతుందనే అనుకున్నా. కానీ.. సుమారు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలిసి ఎంత ఆనందమేసిందో? మొత్తంగా ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయనే నమ్మకం కలుగుతోంది.
ఒకవేళ పోయినా అతి తక్కువ మొత్తంలోనే పోవచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనడానికి ఇది సంకేతమా? మూస ‘బ్రూస్‌లీ’కి పరాభవం ఎదురై, కొత్త ‘కంచె’కు ఊహించిన దానికంటే ఆదరణ లభించడం జనం మారుతున్నారనడానికి నిదర్శనమా? చెప్పలేం. కానీ ఒక ఆశ కలుగుతోంది. కొత్తకు మార్గాలు తెరుచుకుంటున్నాయని ఆశ కలుగుతోంది. ‘కంచె’ ఆడితే కొత్త భావాలు, కొత్త వస్తువులతో తెలుగు సినిమాలు వస్తాయనే ఆశ కలుగుతోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ వంటి సినిమాలు తీసిన క్రిష్ వంటి దర్శకుల అవసరం ఇవాళ తెలుగు సినిమాకు ఎంతైనా ఉంది. ఫార్ములా కంచెలు దాటుకొని కొత్త ప్రయోగాలతో, కొత్త నిర్వచనాలతో తెలుగు సినిమాకు అర్థంచెప్పే క్రిష్‌కు తోడుగా అనేకమంది దర్శకులు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
– బుద్ధి యజ్ఞమూర్తి

- సారంగ వెబ్ వీక్లీ, 29 అక్టోబర్ 2015

Wednesday, November 4, 2015

Unusual Movie Targets Mass

మాస్ హిట్ కోసమే బన్నీ-బోయపాటి కాంబినేషన్?

'స్తైలిష్ స్టార్'గా పేరుపడ్డ అల్లు అర్జున్, పక్కా నాటు మాస్ మసాలా సినిమాలు తీసే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తుండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే బోయపాటి వర్కింగ్ స్టయిల్‌కు బాలకృష్ణలాంటి మాస్ హీరోలైతేనే కరెక్ట్ అనేది సినీ వర్గాల అభిప్రాయం. అందుకే అర్జున్-బోయపాటి సినిమాని 'అన్‌యూజ్వల్ మూవీ'గా పేర్కొంటున్నారు. అయితే 'లెజెండ్' వంటి హిట్ సినిమా తర్వాత బోయపాటి తీస్తున్న సినిమా కావడంతో సహజంగానే దీనిపై ఆసక్తీ, అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 'రేసుగుర్రం' వంటి కెరీర్ టాప్ ఫిల్మ్ తర్వాత చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం మాస్‌లో కంటే క్లాస్‌లోనే పేరు తెచ్చుకొని, బయ్యర్లకు లాభాల్ని అందించడంలో విఫలమవడంతో మాంచి మాస్ హిట్ కోసమే బోయపాటితో బన్నీ జతకట్టాడని ఇన్‌సైడర్స్ అంటున్నారు. కాకపోతే బన్నీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్‌తో పాటు క్లాస్‌నీ ఆకట్టుకునేలా మలిచేందుకు  బోయపాటి కృషి చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. గీతా ఆర్ట్స్ బేనర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'సరైనోడు' అనే టైటిల్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ ప్రమోట్ చేస్తున్న హీరోయిన్లలో ఒకరైన రకుల్‌ప్రీత్ సింగ్ ఇందులో బన్నీకి జోడీగా చేస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అన్‌యూజ్వల్ మూవీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Monday, November 2, 2015

Actor Yadavalli Suryanarayana Filmography

1. Sakunthala (1932)
2. Srirama Paduka Pattabhishekam (1932)
3. Ramadasu (1933)
4. Sati Anasuya (1936)
5. Draupadi Vastrapaharanam (1936) (Duryodhana)

Sunday, November 1, 2015

Whole World Waiting For BAAHUBALI 2!

రెట్టింపు ఉత్సాహంతో రాజమౌళి.. మరోసారి తప్పదు కాసుల బలి!

విషయపరంగా ఎలాంటి కొత్తదనం లేకపోయినా, సమాజానికి ఉపకరించే అంశాలేమీ లేకపోయినా, కేవలం భారీతనం, గ్రాఫిక్స్ మాయాజాలం, ఉచిత మీడియా ప్రచారంతో 'బాహుబలి - ది బిగినింగ్' తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు యస్.యస్. రాజమౌళికీ తెలుసు. ఈ సినిమాతో రాజమౌళికీ, కథారచయితగా ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కూ అవసరానికి మించి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. కొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా కాలం కలిసిరాక పేరు రాదు, అవకాశాలూ రావు. కొంతమందికి ప్రతిభను మించి కాలం కలిసిరావడంతో అప్పనంగా పేరు వచ్చేస్తుంది. 'బాహుబలి'ని గ్రాఫిక్స్ మినహాయించి, సబ్జెక్ట్ మీద దృష్టి కేంద్రీకరించి చూస్తే, సమాజ పురోగతికి అదెంత అపకారో అర్థమవుతుంది. రాచరికాలు, స్పర్థలు, బానిసత్వం, అర్థంపర్థంలేని యుద్ధాలతో ఆ సినిమా మొత్తం ఫ్యూడల్ కంపు కొడుతూ ఉంటుంది. అలాంటి సినిమా ప్రప్రంచవ్యాప్తంగా తనకే నమ్మశక్యం కానంతగా వసూళ్లు సాధించడంతో, రెట్టింపైన ఉత్సాహంతో రాజమౌళి దీనికి సీక్వెల్ 'బాహుబలి - ద కంక్లూజన్'ను తయారుచేసే పనిలో పడ్డాడు. మొదటి భాగం చూసినవాళ్లకు రెండో భాగంలో కథ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య ప్రణయం, పెళ్లి, రాజ్యం కోసం బాహుబలిని భల్లాలదేవ ఎలా చంపిందీ, అతడిని చంపి మహేంద్ర బాహుబలి/శివుడు ఎలా ప్రతీకారం తీర్చుకుందీ అందులో చూడబోతున్నాం. దానిని ఎంత ఆసక్తికరంగా చూపించాలనే దానిపై రాజమౌళి కసరత్తులు చేస్తున్నాడు. 2016 జూన్ లేదా జూలైలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రెండు సినిమాల పెట్టుబడికి మించి లాభాలు వచ్చినందున ఆ సినిమా బిజినెస్ విషయమై నిర్మాతలకు ఎలాంటి టెన్షన్లూ లేవు. ప్రేక్షకుల చెవుల్లో పువ్వులుపెట్టి ఈ రెండో భాగం నుంచి వారి నుంచి ఎన్ని కోట్లు పిండుకోవాలనే లెక్కల్లో ఉంటారు. మొదటి భాగం మాదిరిగానే దీనికీ వద్దన్నా విపరీత ప్రచారం ఇవ్వడానికి మీడియా కూడా ఇప్పట్నించే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రాజమౌళికి ఇంతకు మించి ఏం కావాలి!