Tuesday, August 31, 2010

Movies: Pawan Kalyan's film launched in Jerusalem


పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రధారిగా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించే సినిమా మంగళవారం (ఆగస్టు 31) జెరూసలేంలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఆదిత్య ప్రొడక్షన్స్ బానరుపై కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెరూసలేం నుంచి మీడియాతో మాట్లాడారు పవన్ కల్యాణ్. "ప్రేమతత్త్వం బోధించే, సమాజానికి మంచి సందేశాన్నిచ్చే ఈ సినిమాలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. చిన్నప్పుడు మిషనరీ స్కూలులో చదువుకునేప్పుడే జీసస్ అంటే ఆరాధనా భావం ఏర్పడింది. ఈమధ్య మా అబ్బాయి కిందపడితే మోకాలికి గాయమయ్యింది. అదిచూసి నాకే దెబ్బ తగిలినట్లు బాధపడ్డా. అలాంటిది తన కళ్లముందు ఎదిగిన కుమారుణ్ని చిత్రహింసలు పెడుతుంటే మేరీ మాత ఇంకెంతగా వ్యథచెంది ఉంటుందా అనుకున్నా. అదే సమయంలో కృష్ణంరాజు ఈ ప్రాజెక్టుతో నా వద్దకు వచ్చారు. వాళ్లు తయారు చేసుకున్న సబ్జెక్టు, అందులో నాకు చెప్పిన పాత్ర బాగా నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. వయసు పెరిగేకొద్దీ సామర్థ్యం పెరుగుతున్న సింగీతం గారి డైరెక్షనులో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇమేజ్ గురించీ, రేంజ్ గురించీ ఆలోచించి సినిమాలు చేయను. నా మనసులో అనిపించింది చేసుకుంటూ వెళ్తుంటా. 25 నుంచి 30 రోజుల పాటు ఈ సినిమాకి పనిచేయబోతున్నా. ఇందులో నా పాత్రేమితో ఇప్పుడు చెప్పడం సరికాదు. ఇందులో నాకు హీరోయిన్లు ఉండరు. ఇది రెగ్యులర్ సాంగ్ అండ్ డాన్స్ సినిమా కాదు" అని చెప్పారు పవన్ కల్యాణ్.
డైరెక్టర్ సింగీతం మాట్లాడుతూ "ఇది విశిష్టమైన సినిమా. జీసస్ క్రిస్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. అయినా ఓ సాహసంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. పిల్లలతో ఇదివరకు రామాయణం, భారతం తీశారు. ఇప్పుడు ఈ జీసస్ సినిమాని పిల్లలతో తీస్తున్నాం. పవన్ కల్యాణ్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జీసస్ పుట్టుక నుంచి శిలువ వేయడం వరకు ఇందులో ఉంటుంది" అని తెలిపారు.
నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ "ఇండియాలోని హయ్యస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఇదొకటి అవుతుంది. తెలుగుతో బాటు హిందీ, మలయాళం, ఇంగ్లీషు భాషల్లో ఈ సినిమా తీస్తున్నాం. అక్టోబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే యేడాది చివరలో సినిమా విడుదల చేస్తాం" అన్నారు.
జె.కె. భారవి రచన చేస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్, ఆర్ట్: రవీందర్, మేకప్: క్రిస్టియానా టెన్స్ లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేషు.

Gallery: Anushka
Nostalgia: KBK Mohanraj - The Forgotten Singer

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'పూలరంగడు' (1967) సినిమాలోని 'చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవీ' పాటని ఆలపించినదెవరో తెలుసా? నేటి తరంలో చాలామందికి తెలీని ఆ గాయకుడు కె.బి.కె. మోహన్ రాజ్. పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు.
విజయవాడలో ఉషాకన్య, శేషయ్య దంపతులకు తొలి సంతానంగా 1934లో పుట్టిన మోహన్ రాజు ఎలక్ట్రికల్ బోర్డులో ఉద్యోగిగా వుంటూనే ఆకాశవాణి గాయకుడిగా ప్రవృత్తిని చేపట్టారు. 1957లో అఖిల భారత స్థాయిలో జరిగిన 'మర్ఫీ మెట్రో పాటల పోటీ'లో దక్షిణ బారతదేశంలోనే ప్రథమ స్థానం పొందారు. ఆ పోటీలకు అనిల్ బిశ్వాస్, నౌషాద్, పంకజ్ మల్లిక్ వంటి మహామహులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
కృష్ణమోహన్ రాజుకు బాగా పేరు తెచ్చిన సినీ గీతాలు..

రాధవు నీవయితే.. నా రాధవు నీవయితే.. నిను మలచుకుంటాను నా మురళిగా.. (ఇనస్పెక్టర్ భార్య)
అన్నా వదినలు మా కోసం అమ్మానాన్నగ మారారు (పెద్దన్నయ్య)
బండెనక బండిగట్టి పదహారు బండ్లుగట్టి.. ఏ బండ్లో వస్తవొ కొడుకో నైజాము సర్కరోడా (గద్దర్ తో కలిసి 'మాభూమి'లో)
కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం.. కనిపిస్తూ నువ్వూ నేనూ ఆడుతాము బూటకం (తాసిల్దారుగారి అమ్మాయి)
చిన్నారి చెల్లి.. ఈ యింటవున్న మరేయింట వున్న నీవున్న ఆ యింట దీపావళి (దేవుడమ్మ)
ఎవరికి వారే ఈ లోకం.. రారు ఎవ్వరూ నీకోసం (సాక్షి)

ఉద్యోగంలో రిటైర్ అయ్యాక విశ్రాంతి తీసుకుంటూ అవకాశం లభించినప్పుడల్లా సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ శేష జీవితం గడుపుతున్నారు మోహన్ రాజు.

Movies: Terror December


డిసెంబర్ అంటేనే టాలీవుడ్ వణికిపోతోంది. ఆంధ్ర, సీడెడ్, నైజాంలతో కూడిన ఎగ్జిబిషన్ రంగం ఆందోళన చెందుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ చివర్లో నివేదిక ఇవ్వాలి. అనుకూలంగా ఇచ్చినా, వ్యతిరేకంగా ఇచ్చినా తిరిగి ఉద్యమాలు రాజుకుని సినిమాలు నష్టపోతాయని ఈ వర్గాల భయం. జనవరిలో సంక్రాంతికి పెద్ద సినిమాలే విడుదలకి సిద్ధమవుతాయి. వీటి గతేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇదిలా వుంటే, ఒక అగ్రహీరోతో ఒక ప్రముఖ నిర్మాత అనుకున్న సినిమా సందిగ్ధంలో పడింది. కారణం పైన చెప్పుకున్నదే. జనవరిలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోననీ, అందువల్ల హీరో సహా డైరెక్టర్, హీరోయిన్ తమ పారితోషికాల్లో సగమే తీసుకోవాలనీ, మిగిలిన సగం అప్పటి పరిస్థితిని బట్టి చూసుకుందామని ఆ నిర్మాత ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిమీద ఏకాభిప్రాయం కుదరక సినిమా వాయిదా వేసుకున్నారని ఫిలింనగర్ భోగట్టా.

Movies: Shriya - The outdated actress


నేడు తెలుగు చిత్రసీమలో టాప్ హీరోయిన్లు ఎవరంటే.. అనుష్క, జెనీలియా, ఇలియానా, కాజల్ అగర్వాల్. తమన్నా కూడా ఆ రేసులోకి రావాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. వీళ్లంతా ఆరేడేళ్లలోపు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే. టాప్ రేంజిని ఎంజాయ్ చేసి, అంతలోనే డిమాండ్ తగ్గిపోయిన తారల ఉదాహరణలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. లేటెస్టుగా తీసుకుంటే మొన్న వచ్చిన రవితేజ సినిమా 'డాన్ శీను'లో హీరోయిన్ గా నటించిన శ్రియ కెరీర్ ఎలా సాగింది? మూడేళ్ల క్రితం వచ్చిన 'శివాజి'లో రజనీకాంత్ సరసన మెరుపులా మెరిసినా తెలుగులో ఆమెకి హీరోయిన్ అవకాశం వచ్చింది మళ్లీ 'డాన్ శీను'లోనే.
తొమ్మిదేళ్ల క్రితం 'ఇష్టం'తో తెలుగులో తెరంగేట్రం చేసిన శ్రియకు 'సంతోషం', 'నువ్వే నువ్వే', 'ఠాగూర్' సినిమాలు గిరాకీ తెచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమె గిరాకీని క్రమేణా క్షీణింపజేశాయి. 'శివాజి' తర్వాత ఆమె ఓ తెలుగు సినిమాలో హీరోయినుగా చేయడానికి మూడేళ్ల కాలం పట్టిందంటే కారణం, ఆమెని 'ఔట్ డేటెడ్ హీరోయిన్'గా పరిశ్రమ భావించడమే. ఈ మధ్యకాలంలో ఆమె ఐటమ్ సాంగ్స్ చేస్తూ కాలం గడిపేసింది. 'డాన్ శీను' రిలీజై వారాలు గడిచిపోయినా 28 ఏళ్ల ఈ ఢిల్లీ సుందరి ఇప్పటిదాకా మరే తెలుగు సినిమాకీ హీరోయినుగా సంతకం చేయలేదు. గణాంకాల ప్రకారం నాలుగేళ్లు కూడా టాప్ రేంజిని ఎంజాయ్ చేయలేకపోయింది శ్రియ.

Monday, August 30, 2010

Nostalgia: Great Comedian Padmanabham


నవ్వించడంలోనే కాక హృదయం ద్రవింపజేయడంలో కూడా పద్మనాభంది అందె వేసిన చెయ్యి. 1931లో కడప జిల్లా సింహాద్రిపురంలో జన్మించిన ఆయన పూర్తిపేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1943లో విడుదలైన 'మాయాలోకం' ఆయన తొలి చిత్రం. ప్రేక్షకులకి దగ్గరయ్యింది మాత్రం విజయా వారి 'పాతాళ భైరవి'లో వేసిన సదాజపుని పాత్రతో. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ఛాయాదేవి వంటి మేటి నటీనటులతో నటించి తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు.
పద్మనాభం మంచి గాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. పొట్టి ప్లీడరు, ఆజన్మ బ్రహ్మచారి, శ్రీశ్రీ మర్యాద రామన్న, కథానాయిక మొల్ల, మాంగల్యబలం, దేవత వంటి గొప్ప చిత్రాలు నిర్మించారు. 'కథానాయిక మొల్ల', 'శ్రీరామకథ' సినిమాలకి దర్శకత్వం వహించారు. పాండవ వనవాసంలో లక్ష్మణ కుమారుడిగా, పొట్టి ప్లీడరులో ప్లీడరుగా, పాతాళభైరవిలో సదాజపునిగా, దేవతలో సినిమా పిచ్చోడిగా, దసరా బుల్లోడులో ఏఎన్నార్ స్నేహితునిగా, ఆజన్మ బ్రహ్మచారిలో చాటుమాటు ప్రేమికునిగా.. ఇలా అనేక పాత్రలు వేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కృష్ణవంశీ సినిమా 'చక్రం'లో 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' అన్నట్లు ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో ఏకాకిగానే ఈ లోకాన్ని వీడి వెళ్లారు.

Posters: Action Replayy
Movies: 'Gayam2' gained


సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి' విడుదల లేకపోవడం జగపతిబాబు సినిమా 'గాయం2'కు కలిసొచ్చింది. 'కొమరం పులి' 2న (ఆరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు) వస్తున్నదనే ఉద్దేశంతో చాలామంది చిన్న నిర్మాతలు తమ సినిమాల్ని అక్టోబరుకు వాయిదా వేసుకున్నారు. అయితే 'పులి' సెప్టెంబర్ 10న అయిన వస్తుందో, లేదో గ్యారంటీ లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉండే పరిస్థితి తలెత్తింది. ఇదే 'గాయం2'కు అనుకూలంగా మారింది. మొన్నటిదాకా ఈ సినిమాని కొనేందుకు బయ్యర్లెవరూ ముందుకు రాలేదు. అందువల్ల ఈ సినిమాకి డెఫిసిట్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండు రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఈ సినిమాని కొనేందుకు బయ్యర్లు ఎగబడ్డారు. ఫలితంగా డెఫిసిట్ తప్పదనుకున్న నిర్మాత లాభాలతో సినిమాని రిలీజ్ చేసే స్థితి ఏర్పడింది. జగపతిబాబు సరసన విమలా రామన్ నటించిన ఈ సినిమాని రాంగోపాల్ వర్మ శిష్యుడు ప్రవీణ్ శ్రీ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 3న ఈ సినిమా విడుదలవుతోంది.

Movies: Neha Sharma opposite with Emraan Hashmi


తెలుగులో రాంచరణ్ సరసన 'చిరుత'లో, వరుణ్ సందేశ్ సరసన 'కుర్రాడు'లో నటించిన నేహా శర్మ ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో ఆమె తొలి సినిమా హీరో కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మి. అన్నదమ్ములు మహేశ్ భట్, ముఖేష్ భట్ లకు చెందిన విశేష్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఆ సినిమా పేరు 'క్రూక్ - ఇట్స్ గుడ్ టు బి బాడ్'. మోహిత్ సూరి డైరెక్టర్. 'ఫ్యాషన్' ఫేమ్ అర్జన్ బజ్వా మరో కీలక పాత్ర చేసిన ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. విదేశాల్లోని, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాతి వివక్ష దాడుల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అక్టోబర్ 8న ఈ సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో రెండు క్రేజీ సినిమాలు చేసినా క్రేజ్ సంపాదించుకోలేకపోయిన నేహా ఇప్పుడు బాలీవుడ్ లో అయినా పేరు తెచ్చుకుంటుందో, లేదో చూడాలి.

Gallery: Hamsanandini
Movies: Ram Gopal Varma's Counter Warning"ఓబుల్ రెడ్డికి సంబంధించిన మనుషులు అతన్ని దుర్మార్గుడిగా చూపిస్తే ఊరుకునేది లేదని నాకు ఒక నోటీసు పంపారు. ఒకవేళ అలా చూపిస్తే, కోర్టు తీర్పు కోసం ఆగకుండా తమదైన పద్ధతిలో చంపుతామని రకరకాల వర్గాల ద్వారా వార్నింగులు పంపారు. నేను సినిమాలో ఏం చూపించానో అది సినిమా చూసే వరకూ ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. సినిమాలో ఉన్నవీ, లేనివీ వాళ్లకి వాళ్లు ఊహించుకుని నన్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి నేను ఇచ్చే వార్నింగ్ ఒక్కటే. నేను ఓబుల్ రెడ్డి మనుషులకి కాదు కదా..! చచ్చిపోయిన ఓబుల్ రెడ్డి దెయ్యమై తిరిగొచ్చినా కూడా భయపడను.
ఇది నా కౌంటర్ వార్నింగ్
-రాంగోపాల్ వర్మ"
ఇదీ రాంగోపాల్ వర్మ మార్కు రిటార్ట్. తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి జీవిత కథ ఆధారంగా వర్మ 'రక్తచరిత్ర' తీస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా తొలి పార్ట్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఓబుల్ రెడ్డి అనుయాయులుగా భావిస్తున్న వాళ్లు సినిమాలో ఓబుల్ రెడ్డిని విలన్ గా చూపించినట్లు తెలిసిందని, వెంటనే అలాంటి సన్నివేశాలు తొలగించాలని, లేనిపక్షంలో వర్మని చంపుతామని వర్మ ముంబై ఆఫీసుకి బెదిరింపు ఉత్తరాలు పంపారు. ఫోన్ కాల్స్ చేశారు. మరోవైపు ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి కూడా వర్మకు లీగల్ నోటీసు పంపింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు.
పరిటాల రవి, ఓబుల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. మరణించిన ఓబుల్ రెడ్డిపై పలు రేప్, మర్డర్ కేసులు పెండింగులో ఉన్నాయి.
మరోవైపు ఈ బెదిరింపు ఫోన్ల వెనుక మద్దెలచెరువు సూరి ఉన్నాడనే ప్రచారం కూఢా జరిగింది. ఓబుల్ రెడ్డికి సూరి సన్నిహితుడు. అయితే ఆ ఫోన్లకీ, తనకీ ఎలాంటి సంబంధమూ లేదనీ, వాటిని నమ్మవద్దనీ వర్మకి సూరి తెలిపినట్లు సమాచారం.
'రక్త చరిత్ర'లో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, అతని భార్య సునీతగా రాధికా ఆప్టే, సూరిగా సూర్య, అతని భార్య భానుమతిగా ప్రియమణి, నాగమునిరెడ్డిగా కోట శ్రీనివాసరావు, ఎన్టీఆర్ గా శతృఘ్న సిన్హా నటించారు.

Sunday, August 29, 2010

Gallery: Simran
Movies: 'Gaganam' inspired from Kandahar incident


నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గగనం' సినిమా ఇతివృత్తానికి కాందహార్ సంఘటన ఆధారం. రాధామోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బానరుపై రాజు నిర్మిస్తున్నారు. 1999 డిసెంబర్ 24న ఖాట్మండు (నేపాల్)లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హర్కత్-ఉల్-ముజాహిదీన్ సంస్థకు చెందిన టెర్రటిస్టులు హైజాక్ చేశారు. విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో బలవంతంగా దింపేశారు. 176 మంది ప్రయాణీకుల్లో 27 మంది మాత్రమే దుబాయిలో విడుదల చేశారు. ఇప్పుడు ఈ సంఘటనే 'గగనం' కథకి ఆధారం. తీవ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి, కొంతమందిని కిడ్నాప్ చేస్తే ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండో తన బృందంతో ఏం చేశాడన్నది ఈ సినిమాలోని ప్రధానాంశం. "ఇందులో మైండ్ గేమ్ ప్రధానం. పాటలుండవు. కొత్త తరహా సినిమా. ప్రజలు ఆదరిస్తే ఈ తరహా సినిమాలు మరిన్ని వస్తాయి" అని చెప్పారు నాగార్జున.

Movies: 'Rajanna' fights with Rajakars


నాగార్జున హీరోగా వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించే సినిమాకి 'రాజన్న' అనే టైటిల్ నిర్ణయించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బానరుపై నాగార్జున స్వయంగా ఈ సినిమా నిర్మించనున్నారు. "1947 ఆగస్టు 15న దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రాంతానికి రాలేదు. అప్పటి రజాకార్ల దుశ్చర్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 1945 నుంచి 1955 మధ్య కాలంలో జరిగే కథ. రాజాకార్ల పాలనలో బాధిత ప్రజానీకం కోసం పోరాడిన 'రాజన్న' అనే యోధుని కథ. విజయేంద్రప్రసాద్ అద్భుతంగా కథ తయారుచేశారు. రాజమౌళి ఈ సినిమా యాక్షన్ పార్ట్ చూసుకుంటాడు. ఈ సినిమా గురించి ఇటీవల కేసీఆర్ కు కూడా చెప్పాం. పూర్తిగా విని తప్పులు లేకుండా చూస్తానన్నారు. సినిమా ప్రారంభానికి ముందు ఆయనకు ఓసారి చెబుతాం. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా" అని చెప్పారు నాగార్జున. ఇందులో 'రాజన్న'గా టైటిల్ పాత్రని ఆయన పోషిస్తారు.

Movies: Silver screen Narada


తెలుగు సినిమాల్లో నారదుడి పాత్రను ఇప్పటివరకు ఎంతోమంది పోషించారు. ముఖ్యంగా నారదుడి పాత్ర అనగానే గుర్తుకువచ్చే పేరు కాంతారావు. ఆయనలా ఆ పాత్రలో ఒదిగిపోయిన నటులు ఇంకొకరు అవుపించరు. 'గంగా గౌరీ సంవాదం' (1958), 'దీపావళి' (1960), 'సతీ సులోచన' (1961), 'సీతారామ కల్యాణం' (1961), 'శ్రీకృష్ణార్జున యుద్ధం' (1963), 'శ్రీకృష్ణ పాండవీయం' (1966), 'శ్రీకృష్ణ తులాభారం' (1966) వంటి చిత్రాతో ఆయన అభినవ నారదుడిగా సినీ చరిత్రలో నిలిచిపోయారు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, హరనాథ్, పద్మనాభం, చంద్రమోహన్ కూడా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఇటీవలి కాలంలో నారదుడి పాత్ర అంటే నరేశ్ వేస్తున్నారు.
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 'భక్త ప్రహ్లాద' (1967)లో నారదుడిగా మెప్పించారు. హాస్యనటులైన రేలంగి 'చెంచులక్ష్మి', 'భీష్మ' సినిమాల్లో, రమణారెడ్డి 'పార్వతీ కల్యాణం' (1962)లో, నూతన్ ప్రసాద్ 'కనకదుర్గా మహాత్మ్యం'లో నారద పాత్ర వేశారు.
విశేషమేమంటే ఒక నటి కూడా తెరమీద నారదుడిగా నటించడం. 'కృష్ణప్రేమ' (1943) సినిమాలో నారద పాత్రని టంగుటూరి సూర్యకుమారి పోషించారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఆ పాత్రని చేసిన ఏకైక నటి ఆమే.

Gallery: Sheela