Thursday, April 28, 2016

Short Story: Champion

ఛాంపియన్


సెప్టెంబర్ 9. ఓ దినపత్రికలో స్పోర్ట్స్ కాలం...
"రేపటి నుంచి జరిగే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సమరంలో ప్రపంచ ఛాంపియన్ ఆండ్రి లిబకోవ్ భారత గ్రాండ్‌మాస్టర్ 20 సంవత్సరాల అనంత ముఖేష్‌తో తలపడబోతున్నాడు. గత పోటీలలో సయితం భారత గ్రాండ్‌మాస్టర్ అయిన చేతన్ పద్మనాభన్‌ను 18 ఎత్తులలో ఓడించిన లిబకోవ్ ఈసారి మరింత సునాయాసంగా ముఖేష్‌ను ఓడించగలనన్న ధీమాతో ఉన్నాడు. లిబకోవ్‌తో పోల్చుకుంటే ముఖేష్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువ. భారత చేస్ క్రీడారంగంలో తారాజువ్వలా దూసుకొచ్చి వరల్డ్ చేస్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ రౌండ్లలో విజయం సాధించినప్పటికీ లిబకోవ్ ముందు అతడి దూకుడుకు పగ్గాలు పడే అవకాశమే ఎక్కువగా ఉంది. పద్నాలుగు సంవత్సరాలుగా ప్రపంచ చెస్ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న లిబకోవ్ మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకోగలనన్న ధీమాను వ్యక్తం చేశాడు. అతణ్ణి ఓడించడమంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లే ఉంటుంది.."
పేపర్ చదువుతున్న అనంత ముఖేష్ ఓసారి వాచీవంక చూసుకున్నాడు. సాయంత్రం 4 గంటలు. ఎదురుగా కూర్చున్న తన స్నేహితుడు, సెకండ్ అయిన చేతన్ పద్మనాభన్ వంక చూశాడు. "చూశావా ఈ పేపర్! అతడితో నేను పోటీపడ్డం పొట్టేలు కొండను ఢీకొన్నట్లు ఉంటుందట."
"చూశాను. నువ్వు కేవలం ప్రపంచ ఛాంపియన్‌షిప్పుకి క్వాలిఫై అయిన ఆటగాడివేగా. పైగా నీ ప్రత్యర్థి పద్నాలుగేళ్లుగా వరల్డ్ ఛాంపియన్ అయిన వ్యక్తి. అతడితో ఆడటం ఎట్లా ఉంటుందో పోయిన ఛాంపియన్‌షిప్పులో అనుభవించినవాణ్ణి."
చేతన్ చెప్తున్నదాంట్లో తప్పేమీ లేదు. అతడేమీ లిబకోవ్ తరపున వకాల్తా పుచ్చుకున్నవాడు కాడు.
"అయినా సరే. నువ్వు నీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడబోతున్నావు. గెలుపు ఎప్పుడూ ఒక్కడి సొత్తేమీ కాదు."
* * *
సెప్టెంబర్ 10. ఉదయం 10.30 గంటలు. లిబకోవ్, ముఖేష్‌లిద్దరూ పోటీ జరిగే గదిలోకి ప్రవేశించారు. టేబుల్ మీద చెస్ బోర్డూ, పావులూ సిద్ధంగా ఉన్నాయి. మొదటి గేం, మొదటి ఎత్తు వేసే ఛాన్సు లిబకోవ్‌కే దక్కింది. అతడి మొహంలో చిరునవ్వు తొంగిచూసింది. ముఖేష్ కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. మొదటి ఎత్తు వేయబోయే ముందు "నేను మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌ని అయినప్పుడు నువ్వు ప్రైమరీ స్కూలు కూడా దాటి ఉండవనుకుంటాను. అయితే యాభయ్యేళ్ల తర్వాత నువ్వు నీ మనవళ్లతో నాతో పోటీచేసిన విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు" అన్నాడు లిబకోవ్ నవ్వుతూనే.
ముఖేష్ ఏమీ బదులు చెప్పలేదు.
లిబకోవ్ తెల్లపావులతో రూయిలోపెజ్ విధానంతో గేంను మొదలుపెట్టాడు. ముఖేష్ డ్రాగన్ వేరియేషన్‌ను ఎంచుకున్నాడు. ఐదు ఎత్తులు వేయడంతోటే లిబకోవ్‌కు అర్థమైంది - తన చిన్నారి ప్రత్యర్థి సత్తా ఏమిటో. పోయిన ఛాంపియన్‌షిప్పులో డ్రాగన్ వేరియేషన్ విధానంతోనే చేతన్ పద్మనాభన్‌ను ఓడించాడు లిబకోవ్. ఇప్పుడు మొదటి గేంలోనే ముఖేష్ ఆ తరహా ఆటను ఎంచుకొన్నాడు. ఇదంతా ఇప్పుడు ముఖేష్‌కు సెకండ్‌గా ఉన్న చేతన్ వ్యూహంలో భాగమని వెంటనే లిబకోవ్‌కు అర్థమైపోయింది. మొదట్లో కనిపించిన నెర్వస్‌నెస్ ముఖేష్‌లో మచ్చుకైనా లేదు. చాలా ఏకాగ్రతతో ఆడుతున్నాడతను. 26 ఎత్తుల తర్వాత తను గెలిచే అవకాశం మచ్చుకైనా కనిపించకపోవడంతో లిబకోవ్ 'డ్రా'కు అంగీకరించక తప్పలేదు. పోటీని అమితాసక్తితో తిలకిస్తున్న ప్రేక్షకుల్లు, చెస్ క్రీడాకారులు చప్పట్లు చరిచారు. ఆటని సాంతం చూసిన ఓ అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ "మొదట నల్లపావులతో ఆడుతూ 'డ్రా' చేసిన ముఖేష్‌కిది గొప్ప ఆశావహమైన ప్రారంభం" అని వ్యాఖ్యానించాడు.
ముఖేష్ తన సీట్లోంచి లేస్తూ లిబకోవ్ వంక చూశాడు. లిబకోవ్‌లో అసహనం చోటు చేసుకున్నట్లు అతడి ముఖంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుండటం గమనించాడు. బయటకు రావడంతోటే యాపిల్ జ్యూస్‌తో ఎదురయ్యాడు చేతన్. "కంగ్రాట్స్.. ఇది నీకు మొదటి విజయం లాంటిది. అయితే ఇక్కడినుంచి నువ్వు మరీ జాగ్రత్తగా ఆడాలి" అని చెప్పాడు.
ముఖేష్‌కు తెలుసు, పోయిన ఛాంపియన్‌షిప్పులోనూ ఇదే రీతిలో చేతన్ మొదటి గేంలో లిబకోవ్‌ను నిలువరించినప్పుడు పత్రికలన్నీ ఆకాశానికెత్తేశాయి. రికార్డ్ స్థాయిలో మొదటి ఎనిమిది గేముల్నీ 'డ్రా' చెయ్యగలిగిన చేతన్ 9వ గేంలో లిబకోవ్‌పై నెగ్గి సంచలనం సృష్టించాడు. అయితే కష్టకాలంలోనూ అమిత స్థైర్యాన్ని ప్రదర్శించగల లిబకోవ్ మరుసటి గేంలోనే విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడమే గాక 20 గేంల పోటీని 18 గేంలలోనే ముగించి విజయం సాధించాడు. ఒకసారి ఓడితే ఆ ప్రభావం మిగిలిన గేంల మీద కూడా పడుతుందనటానికి చేతన్ నిదర్శనం. లిబకోవ్ లాంటి క్రీడాకారుడి విషయం వేరు. ఓడినకొద్దీ ప్రతీకారంతో రగిలే వ్యక్తి అతను. ఈ సంగతిని ముఖేష్‌కు ముందుగానే వివరించాడు చేతన్. లిబకోవ్ ఆడిన గేములన్నింటినీ శ్రద్ధగా విశ్లేషించి చెప్పాడు.
* * *
సెప్టెంబర్ 11. అసహనంగా కనిపిస్తున్నాడు లిబకోవ్. అతడి ప్రతి చర్యలోనూ అది కనిపిస్తోంది. చూసే వాళ్లందరూ అతను టెన్షన్లో ఉన్నాడని ఇట్టే చెప్పేస్తారు. అతడు కోరుకుంటున్నదీ అదే. మిగతా వాళ్ల సంగతి కంటే తన ఎదురుగా ఉన్న ముఖేష్ తనని అలాగే అనుకోవాలని అతడి వాంఛ. ఎదుటివాళ్లను ఏదో ఓ రకంగా బోల్తా కొట్టించడానికి అతడెంచుకునే మార్గాల్లో ఇదొకటి. అసహనంతో ఉండేవాళ్లు త్వరగా ఆటపై పట్టుకోల్పోతారన్న చిన్న పాయింట్ మీదే అందరూ బేస్ అవుతారనీ, అలా అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తారనేది లిబకోవ్ వ్యూహం. బోర్డుమీద పావులు కదులుతున్నాయి.. ముఖేష్ తెల్ల పావులు త్వరగా, లిబకోవ్ నల్ల పావులు నిదానంగా!
15వ ఎత్తు. ముఖేష్ తన శకటాన్ని లిబకోవ్ గుర్రానికి గురిపెట్టాడు. అంతటా నిశ్శబ్దం. సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం. గుర్రాన్ని పక్కకి తప్పిస్తే కింగ్‌కి 'చెక్' అవుతుంది. కింగ్‌ని జరపడానికి ఎటూ దారిలేని స్థితి. ఇంతవరకూ లిబకోవ్ అట్లాంటి స్థితిని ఎదుర్కోలేదు. మరోవేపు మినిస్టర్ కాచుకుని ఉన్నాడు. ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు. లిబకోవ్ మౌనంగా రిజైన్ చేసి తన గదికి వెళ్లిపోయాడు. ముఖేష్ సెకండ్ చేతన్‌తో ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ సభ్యుడు స్టీవ్ బెకర్ అన్నాడు - "కొద్ది రోజుల్లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం."
* * *
సెప్టెంబర్ 12. ఒక దినపత్రికలో స్పోర్ట్స్ కాలం - ".. అతిపెద్ద ఓటమి. ఇరవయ్యేళ్ల కుర్రాడి చేతిలో ప్రపంచ ఛాంపియన్, కంప్యూటర్‌నే ఓడించిన మేధావి పరాజయం. కేవలం 15 ఎత్తుల్లోనే ఆండ్రీ లిబకోవ్‌ను రెండవ గేంలోనే ఓడించి భారత గ్రాండ్‌మాస్టర్ అనంత ముఖేష్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఏమి జరిగిందో అర్థంకాని స్థితిలో లిబకోవ్ మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ముఖేష్ చెస్ క్రీడాభిమానుల హృదయాల్ని దోచుకున్నాడు. రెండవ గేంలో అతడు ఆటపై పూర్తి పట్టు సాధించాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే వైనం చూస్తుంటే ప్రపంచ ఛాంపియన్ కాగల అర్హతలు అన్నీ అతనిలో ఉన్నాయనిపిస్తున్నది..". కాఫీ తాగడం పూర్తిచేసిన ముఖేష్ ఆ ఆర్టికల్‌ను కట్‌చేసి డైరీలో దాచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌పై ఒక గేంలో విజయం సాధించడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదకరమైంది. అది అనుకోని తప్పుల్ని చేయిస్తుంది. ఏకాగ్రతని దెబ్బతీస్తుంది. పొగడ్తలు కూడా సంపూర్ణ విజయానికి అడ్డంకులే. అందుకే అన్ని గేంలూ పూర్తయ్యేవరకు పేపర్ చూడకూడదని నిశ్చయించుకున్నాడు.
సెప్టెంబర్ 25. వాతావరణం భిన్నంగా ఉంది. అద్దాల గదిలో ఆట జరుగుతుంటే పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి ఆటను చూస్తున్నారు. 20 గేంల పరంపరలో అది 11వ గేం. 10వ గేంలో ఎట్టకేలకు లిబకోవ్ 64 ఎత్తుల్లో విజయం సాధించడంతో స్కోరు 5-5 అయ్యింది. అంతకుముందు జరిగిన 7 గేంలూ డ్రా అయ్యాయి. అయితే 10వ గేంలో లిబకోవ్ నల్ల పావులతో ఆడినప్పటికీ విజయం సాధించడంతో 11వ గేంకు ప్రాధాన్యం వచ్చింది. 
రష్యన్ గ్రాండ్‌మాస్టర్ వాసిలీ రుబ్కోవ్ దీనిపై వ్యాఖ్యానిస్తూ "లిబకోవ్ రిథంలోకి వచ్చేశాడు. గత ఛాంపియన్‌షిప్ ఫలితం పునరావృతం కాబోతున్నది" అని అప్పుడే తేల్చేశాడు. అప్పటి పోటీలో చేతన్ పద్మనాభన్ 10వ గేంలో ఓడాక మళ్లీ తేరుకోలేకపోయాడు.
ముఖేష్ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. తెల్లటి ప్యాంటూ, షర్టూ, పైన నేవీ బ్లూ కోటు వేసుకున్నాడు. ముందు కోటు మధ్యలో నుంచి ఎర్రని టై కనిపిస్తున్నది. లిబకోవ్ తన వ్యూహానికి భిన్నమైన ఆటను ప్రారంభించాడు. అలా చేయడం ద్వారా ప్రత్యర్థిలో కంగారు పుట్టించడం అతడి వ్యూహం. ముఖేష్‌లో ప్రశాంతత చెక్కుచెదరలేదు. లిబకోవ్ ఎంత దూకుడుతో ఆడుతున్నాడో అంత వేగంతోనూ అతను సమాధానం చెప్తూ వచ్చాడు. ఆ గేములో ఫలితం ఎటూ తేలలేదు. గేంను డ్రా చేసిన వెంటనే లిబకోవ్ చిన్నగా నవ్వుతూ ముఖేష్‌కు షేక్‌హ్యాండిచ్చి "బాగా ఆడావు" అని అభినందించాడు. అందులో ఎలాంటి తిరకాసూ లేదు. నిజంగానే ముఖేష్ ఆ గేమును గొప్పగా ఆడాడు. లిబకోవ్ తప్పనిసరిగా ఆ గేములోనూ గెలుస్తాడని భావించిన పలువురు చెస్ క్రీడా విశ్లేషకులు సైతం ముఖేష్ ఆటతీరును అభినందించకుండా ఉండలేకపోయారు. అనంత ముఖేష్‌ను 'ఎ.కె.'గా పిలవడం మొదలుపెట్టారు.
ఈలోగా పత్రికలవారు ముఖేష్‌ను కలిశారు. "మిస్టర్ ముఖేష్! మీరు మెదడు బదులు కంప్యూటర్ పెట్టుకొని వచ్చారేమిటి?" అని ఓ విలేకరి నవ్వుతూ ప్రశ్నించాడు. 
ముఖేష్ కూడా నవ్వాడు. "అదేం లేదు."
"అయితే మీరు ఇంత వేగంగా ఎత్తులు ఎలా వేయగలుగుతున్నారు?"
"ఏకాగ్రత మూలంగా."
"ప్రపంచ చెస్ రంగంలోకి ఉన్నట్లుండి ఎలా ఊడిపడ్డారు?"
అతని వంక ఓ క్షణం అలాగే చూశాడు. బహుశా అతనికి తెలీకపోయుండొచ్చనుకొని చిరునవ్వుతో "నేను మూడేళ్ల నుంచీ భారత జాతీయ ఛాంపియన్‌ని. రెండేళ్ల క్రితమే ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్పును సాధించాను" చెప్పాడు.
"కానీ మీరు ఒక్కసారిగా సీనియర్ ఛాంపియన్‌షిప్పులో ఫైనల్స్‌కి ఎలా చేరుకోగలిగారు?".
ముఖేష్ పక్కనే ఉన్న చేతన్ వంక చూశాడు. "నాకు సరైన మార్గదర్శి లభించడం వల్ల."
"ఎవరతను?"
"చేతన్.. చేతన్ పద్మనాభన్. నా సెకండ్."
* * *
అక్టోబర్ 7. ముఖేష్‌కు సూచనలిస్తున్నాడు చేతన్. అప్పుడతను గురువైతే ముఖేష్ శిష్యుడు. చేతన్ చెప్తున్న ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన వాడిలాగా మరో ధ్యాస లేకుండా చెప్తున్నాడు చేతన్. ఇద్దరి మధ్యా ఉన్న చదరంగం బోర్డు గళ్లపై పావులు చకచకా దిశలు మార్చుకుంటున్నాయి.
రెండు సంవత్సరాల నుంచీ ముఖేష్‌ని తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాడు. ప్రపంచ జూనియర్ చెస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా ముఖేష్ అవతరించడంతోటే చేతన్ నిర్ణయించుకున్నాడు.
పోయిన ఛాంపియన్‌షిప్పులో లిబకోవ్ గెలవడంతోటే తన వంక చూసి పరిహాసంగా నవ్వడం అతడి హృదయంలో ఇంకా మెదులుతూనే ఉంది. అందుకే తను ఏర్పరచుకున్న లక్ష్యానికి ఆయుధంగా ముఖేష్‌ని ఎంచుకున్నాడు. ఓటమిలోనూ చెక్కుచెదరని ప్రశాంతత ముఖేష్‌లో కనిపించడం అతణ్ణి ఆకట్టుకున్నది. లిబకోవ్‌ని ఛాలెంజ్ చేసే క్రమంలో ముఖేష్‌ని దగ్గరుండి ఒక్కొక్క మెట్టే ఎక్కించాడు. ఎక్కడా తప్పటడుకు వేయకుండా అనుకున్నది అనుకున్నట్లే సాధిస్తూ వచ్చాడు ముఖేష్. చివ్వరి మెట్టుదాకా చేరుకున్నాడు. ఆఖరి మెట్టు కూడా విజయవంతంగా ఎక్కగలిగితే అతడికి అంతకుమించిన ఆనందం లేదు. 
మరుసటి రోజునే ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి గేం జరగబోతున్నది. స్కోరు 9.5-9.5గా ఉంది. లిబకోవ్ డ్రా చేసి 10 పాయింట్లు పొందితే చాలు.. ప్రపంచ చెస్ కిరీటం మళ్లీ అతడి వశమవుతుంది. ముఖేష్ మాత్రం ఛాంపియన్‌షిప్ గెల్చుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిందే!
అటువంటి సమయాల్లో సహజంగా రెండో వ్యక్తిపైనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. "ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారతీయులు బలహీనం" అన్న లిబకోవ్ పలుకులు చేతన్ స్మృతిపథంలో మెదులుతున్నాయింకా. 
"రేపు నువ్వు భారతదేశానికి గొప్ప కానుకని ఇవ్వబోతున్నావు" - ముఖేష్ భుజంతట్టి చెప్పాడు చేతన్.
'నేను నీకిచ్చే గురుదక్షిణ అదే' అనుకున్నాడు ముఖేష్. ఆ రాత్రి అతడికి హాయిగా నిద్రపట్టింది.
* * *
అక్టోబర్ 8. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్. ఆటగాళ్లిద్దరూ దర్పంగా అద్దాల గదిలోకి ప్రవేశించారు. లిబకోవ్ ముఖంలో ఎలాంటి కంగారూ లేదు. కేవలం 'డ్రా'తో కాకుండా 20వ గేంలో గెలుపుతో ఛాంపియన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలని అతడు కోరుకుంటున్నాడు. గెలుపు సాధ్యమనే ధీమాతో అతడున్నాడు. 
మరోవైపు అదే నవ్వు, అదే ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తున్నాడు ముఖేష్. ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్‌ని ఎదుర్కొనే ఛాలెంజర్‌గా అవతరించిన రెండో భారతీయుడిగా అతడు అప్పటికే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే తొలి ఛాంపియన్ గౌరవం దక్కాలంటే తాను ఎంత ప్రతిభ చూపించాలో అతడు ఆలోచించడం లేదు. యుద్ధానికి సర్వసన్నద్ధమై వచ్చిన సైనికుడిలా లేడతను. పోరాటానికి వచ్చిన వ్యక్తిని సైతం మిత్రుడిగా చేసుకునే గొప్ప తేజస్సు అతడిలో వెలుగుతున్నది.
ఆట మొదలయ్యింది. 10 ఎత్తుల వరకూ మామూలుగానే సాగింది. ముఖేష్ సెంటర్ కౌంటర్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం లిబకోవ్‌ను కొద్దిసేపు విస్మయపరిచింది. అది చేతన్‌కు అత్యంత ప్రీతికరమైన వ్యూహం. లిబకోవ్ మాత్రం ప్రయోగాలకు పూనుకోకుండా డ్రాగన్ సిసిలియన్‌నే అనుసరించాడు. 
రెండు గంటలు గడిచాయి. ముఖేష్‌కు నాలుగు బంటులు మిగలగా, లిబకోవ్‌కు ఒక బంటు అదికంగా ఉంది. అతడు ఆధిక్యంలోకి వెళ్తున్నట్లు ప్రేక్షకులు తేల్చేశారు. రష్యన్ గ్రాండ్‌మాస్టర్ రుబ్కోవ్ తనకు కాస్త దూరంలో ఉన్న చేతన్ పద్మనాభన్ వంక చూశాడు. అతని ముఖంల్లో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఎదురుగుగా జరుగుతున్న ఆటను తిలకించడంలో అతడు నిమగ్నమై ఉన్నాడు. 
వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ముఖేష్ ఓ శకటాన్ని కోల్పోగా లిబకోవ్ గుర్రం ఒకటి బోర్డు నుంచి తప్పుకుంది. ముఖేష్ బంటుని తెల్లగడిలోంచి నల్లగడిలోకి జరిపాడు చాలా క్యాజువల్‌గా. లిబకోవ్ కళ్లు పెద్దవయ్యాయి. అందులో వ్యూహం ఏమిటన్నది పది నిమిషాలపాటు ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. తలెత్తి ముఖేష్‌ని చూశాడు. ఏదో అనీజీగా ఉన్నట్లనిపించింది. మరోసారి బోర్డువంక చూసి ఆ బంటుని మరో గుర్రంతో కబళించాడు. ముఖేష్ వద్ద మూడు బంటులు మిగిలాయి. మరో రెండు ఎత్తులయ్యాయి. ముఖేష్ తన తెల్ల శకటంతో నల్ల గుర్రాన్ని 'స్మాష్' చేశాడు. లిబకోవ్‌కు తలపట్టుకోవాలనిపించింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అప్పటికే అతడు పెదవులు బిగించడం రష్యన్ గ్రాండ్‌మాస్టర్ రుబ్కోవ్ గమనించాడు. అతడి ముఖంలో రంగులు మారాయి.
40 నిమిషాలు గడిచాయి. లిబకోవ్ వద్ద రెండు శకటాలు, ఒక ఏనుగు, మినిస్టర్, మూడు బంట్లు మిగలగా, ముఖేష్ వద్ద ఒక శకటం, రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, మినిస్టర్, రెండు బంట్లు మిగిలాయి. గుర్రంతో లిబకోవ్ కింగ్‌కు 'చెక్' చెప్పి కుర్చీలోంచి లేచాడు ముఖేష్. ఆట మధ్యలో అతడింతవరకూ అలా లేవడం జరగలేదు. ఆట ఏమీ ముగింపుకు రాలేదు. లిబకోవ్ ఆలోచిస్తున్నాడు. వెంటవెంటనే వ్యూహరచన చేశాడు. ముఖేష్ గుర్రాన్ని లిబకోవ్ ఏనుగు పక్కకు తప్పించింది.
గంట గడిచింది. బోర్డుమీద ఆధిక్యత ఎవరిదన్నది చూస్తున్నవాళ్లకు అర్థం కాలేదు. నలభై ఐదవ ఎత్తు. లిబకోవ్ మినిస్టర్‌ని ఇరకాటంలో పెట్టాడు ముఖేష్. ప్రొఫెషనల్ చెస్ అసోసియేషన్ సభ్యుడు స్టీవ్ బెకర్ "గొప్ప ఎత్తు" అనరిచాడు. లిబకోవ్ గట్టిగా తన 'మినిస్టర్'ని పట్టుకున్నాడు. గత్యంతరమే లేదు. అతడు మినిస్టర్‌ని పోగొట్టుకున్నాడు - ముఖేష్ శకటానికి బదులుగా.
యాభై ఒకటవ ఎత్తు వేశాడు ముఖేష్. పోటీ చూస్తున్న చేతన్ ఒక్కసారిగా ఉద్వేగం అణచుకోలేక పక్కనే ఉన్న స్టీవ్‌ని కావలించుకున్నాడు. పద్నాలుగు సంవత్సరాలు ప్రపంచ చెస్ క్రీడారంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గొప్ప మేధావి ఆండ్రీ లిబకోవ్ నిస్సహాయంగా ఓటమిని ఒప్పుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. రెండు నిమిషాల పాటు అక్కడ మరో రకమైన శబ్దమేమీ వినిపించలేదు, ప్రేక్షకుల చప్పట్లు తప్ప. అందరి నోళ్లలోనూ "ఏకే.. ఏకే.." అనే మాటే. 
ముఖేష్ బయటకు రావడంతోటే చేతన్ గట్టిగా అతణ్ణి కావలించుకొని నుదిటిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అనుకున్నది సాధించానన్న తృప్తి అతడి కళ్లల్లో కనిపించింది. "నా గురుదక్షిణ చెల్లించాను" అన్నాడు ముఖేష్.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంటూ తన విజయాన్ని తన సెకండ్ అయిన చేతన్ పద్మనాభన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు ముఖేష్.
* * *
అక్టోబర్ 8. దినపత్రికలోని స్పోర్ట్స్ కాలం. "ప్రపంచ చెస్ వేదికపై కొత్త ఛాంపియన్ ఆవర్భవించాడు. ఒక సుదీర్ఘ శకం ముగిసి కొత్త శకం మొదలయ్యింది. 14 సంవత్సరాల పాటు చెస్ రారాజుగా వెలిగిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ ఆండ్రీ లిబకోవ్ అక్టోబర్ 8న తన ఛాంపియన్ హోదాని 20 సంవత్సరాల 'వండర్ బాయ్' ముఖేష్‌కు కోల్పోయాడు. ఆఖరి గేం వరకూ సాగిన పోటీలో 10.5-9.5 పాయింట్ల తేడాతో లిబకోవ్‌పై ముఖేష్ అద్భుత విజయం సాధించాడు. అతడు తన విజయాన్ని చేతన్ పద్మనాభన్‌కు అంకితమిచ్చి తమ మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చాటుకున్నాడు. ఇద్దరు భారతీయుల కృషి ఫలితంగా ప్రపంచ చేస్ రంగంలో భారతదేశం శిఖరాగ్రాన్ని చేరుకున్నది.."
పేపర్ చూస్తున్న చేతన్ పద్మనాభన్ అనుకున్నాడు - 'లిబకోవ్! ఇప్పుడు గెలించింది ముఖేష్ కాదు, నేను! భారతీయుల్లోనూ ఒత్తిడిని స్థైర్యంతో ఎదుర్కొని విజయం సాధించే మొనగాళ్లున్నారని ఒప్పుకుంటావనుకుంటాను.'

- ఈనాడు ఆదివారం, 21 జూలై 1996

Thursday, April 21, 2016

Poetry: Aame (She)

ఆమె

లోకం నేనేమిటో చెప్పక ముందే
నన్ను నేను తెలుసుకోవాలని ఉంది
నేనెప్పుడూ అమ్మ కథ అడగలేదు
చిత్రం.. అమ్మ కూడా తన కథ చెప్పలేదు
నా కథ నా డైరీల్లో భద్రంగా ఉంది
నా డైరీలు చూస్తుంటే నాతో నేను సంభాషిస్తున్నట్లే ఉంటుంది
నా ఇన్‌ఫాచ్యుయేషన్స్, నా భగ్న ప్రేమలు,
నా అనుభూతులు, నా అనుభవాలు నాతో నేను
పంచుకుంటున్నట్లే ఉంటుంది
నా కథ చెబుతోంది
నాది అనుకున్నదేదీ నాది కాదని
నాకు అర్థమవుతోంది
ఆనంద క్షణాలు స్వల్పమని
బాధామయ సందర్భాలు అనల్పమని
అందరూ ఉండీ ఒక స్త్రీగా
ఎంత ఒంటరినో బాగా తెలిసింది

- కవితాఝరి (ఫేస్‌బుక్ గ్రూప్), 5 ఏప్రిల్ 2016

Thursday, April 14, 2016