Thursday, May 9, 2013

'ఆడబొమ్మ' (1988) - రివ్యూ


తారాగణం: సాగరిక, జీవా, హరిప్రసాద్, గుమ్మడి, పి.ఎల్. నారాయణ, ప్రసాద్‌బాబు, త్యాగరాజు, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ
సంభాషణలు: పూసల
సంగీతం: చంద్రశేఖర్
నిర్మాత: ఆర్. కేతినేని
దర్శకుడు: సత్యానాయుడు
విడుదల తేది: 29 ఏప్రిల్
జూదానికి బానిసైన ఓ పెద్దాయన తన ఆస్తినంతటినీ కోల్పోవడమే కాకుండా, కన్న కూతుర్నీ పణంగా పెట్టి ఓడిపోతాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి మాట ప్రకారం ఆయన శవం వద్దే గ్రామస్తులందరి సమక్షంలో రూపేశ్‌ను పెళ్లి చేసుకుంటుంది లౌక్య. ఆ రాత్రి ఆమెని అనుభవిస్తాడు  రూపేశ్. మరుసటి రోజే డబ్బు కోసం ఆమెను మరొక వ్యక్తితో తార్చాలని చూస్తాడు. లౌక్య ఎదురు తిరుగుతుంది. దాంతో ఆమెని క్యాబరే డాన్సర్‌గా మార్చి డబ్బు సంపాదిస్తుంటాడు రూపేశ్. పోలీసులు అరెస్ట్ చేయడంతో క్యాబరే మానేస్తుంది లౌక్య. ఒక హత్య కేసులో భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. దాంతో రూపేశ్‌కు జైలు శిక్ష పడుతుంది.
నాలుగిళ్లలో అంట్లు తోముకుంటూ బతుకు సాగిస్తుంటుంది లౌక్య. జైలు నుంచి బయటికొచ్చిన రూపేశ్ ఆమెని డబ్బు కోసం వేధించడమే కాకుండా తమకి పుట్టిన కూతురు ఎక్కడుందో చెప్పమని గొడవపడతాడు. కూతుర్ని కూడా క్యాబరే డాన్సర్‌గా మార్చాలని అతని ఆలోచన. కూతుర్ని రహస్యంగా వేరో వూర్లో చదివిస్తున్న లౌక్య ఆమెకి ప్రమాదం ఏర్పడిందని భావించి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. పెళ్లి వేదికపై లౌక్య క్యాబరే చేస్తున్న ఫొటోలు చూపించి తాళి కట్టే సమయానికి ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు రూపేశ్. ఆఖరుకి కన్న కూతురి మెడలోనే తాళి కట్టేందుకు సిద్ధమైన రూపేశ్‌ని లౌక్య ఏం చేసిందన్నది పతాక సన్నివేశం.
లౌక్యగా సాగరిక, రూపేశ్‌గా జీవా, లౌక్య బావగా హరిప్రసాద్, లౌక్య తండ్రిగా గుమ్మడి, ఎస్.ఐ.గా రాజ్యలక్ష్మి తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించిన ఈ సినిమాని ఆర్. కేతినేని నిర్మించగా, సత్యానాయుడు డైరెక్ట్ చేశారు. సన్నివేశాల కల్పన, కథనం బలంగా ఉండినట్లయితే ఈ సినిమా ఆకర్షణీయంగా ఉండేది. ఈ సినిమాలోని ప్రధాన లోపం అదే.