Thursday, September 24, 2015

Short Story: Maaya

నిమీద బయటికెళ్లిన మాణిక్యరావు ఇంటికొచ్చాడు. ముందింట్లో నవనీత కనిపించకపోయేసరికి, నేరుగా వంటింట్లోకెళ్లాడు. ఆమె దొడ్లో బాట్టలు ఆరేస్తా కనిపించింది. బావి అరుగుమీదకెళ్లి నిల్చుని బక్కెట్‌లోని నీళ్లను కాళ్లమీద
కుమ్మరించుకున్నాడు.
“రేపు గుంటూరుకెళ్తున్నానే” అన్నాడు.
“అయితే కొనాలనే నిర్ణయించుకున్నావన్న మాట” అంది నవనీత, బట్టలకు క్లిప్పులు పెడతా.
“ఇప్పుడు కొనకపోతే, ఇంకెప్పుడూ అక్కడ కొనలేమే. ఇప్పుడే సెంటు లక్ష చెబుతున్నారంటే, ఇంకో ఏడు పోతే ఎంతవుద్దో. ఇప్పుడు కొంటే రెండేళ్లలో నాలుగైదింతలు రేటు పెరగడం గ్యారంటీ.”
“మనం ఉంటున్న ఈ చోటే సెంటు లక్షుంటే ఎక్కడో ఊరికి దూరంగా, ఇళ్లంటూ లేని చోట కూడా లక్షా? అంతెందుకుంటుంది?”
“మనం ఉంటున్న ఏరియాకీ, రాజధాని అమరావతి ఏరియాకీ లంకె పెడతావేందే. ఇక్కడ సెంటు స్థలం లక్ష కావడానికి ఎంత కాలం పట్టిందో నీకు తెలీదా. ఇప్పుడందరి చూపూ అమరావతి ఏరియా మీదే ఉంది. దాని చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దాకా ఎక్కడ స్థలం కొన్నా బంగారం కిందే లెక్క. ఆ చదువులయ్య చూడు. తెలివంటే ఆడిదే. రాష్ట్రం రెండుగా యిడిపోవడానికి ఏడాది ముందుగాల్నే గుంటూరు కాడ ఏకంగా అరెకరం స్థలం కొనేశాడు. ఇంకా రెండేళ్లు కాలేదు. అప్పుడే నాలుగింతలు రేటు పలుకుతోందంట. ఒక్క దెబ్బకు కోట్లు వెనకేసుకోబోతున్నాడు. మనమూ ఉన్నాం ఎందుకూ? ప్రతిదానికీ జంకే. తెగించి ఏం చేద్దామన్నా పడనియ్యవు కదా” అన్నాడు కాస్త విసురుగా.
వేటపాలెం ప్రాంతంలోని షావుకార్ల (మాస్టర్ వీవర్ల)లో మాణిక్యరావు ఒకడు. అతని చేతికింద నూటయాభై మగ్గాల దాకా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది షావుకార్లు నష్టాలపాలై వేరే వ్యాపారాల్లోకి దిగారు. కొంతమందైతే తామే నేతగాళ్లుగా మారిపోయారు. మాణిక్యరావు ఒకేరకం బట్టని కాకుండా నాలుగైదు రకాల బట్టలు నేయిస్తూ కొద్దో గొప్పో సంపాదించాడు. మాణిక్యరావు మాదిరిగానే చదువులయ్యా మాస్టర్ వీవరే. కాకపోతే అతను ఒక్క మగ్గాల్నే నమ్ముకోలేదు. బట్టల వ్యాపారం మీదొచ్చిన డబ్బుతో మొదట్లో ఏడాదికి మూడు పంటలు పండే పొలాలు కొన్నాడు. తర్వాత వాటిని అమ్మేసి రెండెకరాల మామిడితోట కొన్నాడు. నాలుగేళ్లయ్యాక ఆ రెండెకరాల తోటని నాలుగెకరాలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెని చూశాక రాష్ట్రం రెండుగా విడిపోతుందనే నమ్మకం బలపడి గుంటూరు కాడ స్థలం కొన్నాడు. అతడి నమ్మకం నిజమై ఇప్పుడది నాలుగింతల విలువకు చేరుకుంది. అతడి మాదిరిగా తను ఆస్తులు పెంచుకోలేకపోతున్నందుకు మాణిక్యరావులో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. చదువులయ్యకు వాళ్లావిడ సపోర్ట్ బాగా ఉండబట్టే తెగువతో ముందుకెళ్లిపోతున్నాడని అప్పుడప్పుడూ నవనీతని ఎత్తిపొడుస్తుంటాడు.
“ఇప్పుడు మనకేం తక్కువయ్యిందయ్యా. యాపారం బాగానే సాగుతా, హాయిగా గడిచిపోతోంది కదా. తిండికి కరువా, బట్టకి కరువా? మంచి మేడ కట్టుకున్నాం కదా. ఇద్దరు పిల్లల్నీ మంచి స్కూల్లో చదివించుకుంటున్నాం. కంటిమీద సుఖంగా కునుకుపడితే చాలు. లేనిపోని ఆశలతో తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడమెందుకంటా?” అంది ముందింట్లోకొచ్చి.
“నీకు చెప్పాను చూడూ.. నాదీ బుద్ధి తక్కువ. దేనికీ పడనియ్యవు కదా. ఎప్పుడూ ఇట్టాగే ఉండిపోతామంటావేం. మనిషన్నాక ఆశుండాలే. ఆశుంటేనే ఎదుగుతాం. ఈ యేటపాలెం ఏరియాలో మాణిక్యరావు అనేవాడు డబ్బున్నోడిగా, పెద్దమనిషిగా పేరు తెచ్చుకోవడం నీకిష్టం లేదా?” అంటా, అక్కడ బల్లమీద తను పెట్టిన సంచీని తెరిచాడు. దాంట్లోని శ్రద్ధగా మడతలు పెట్టిన ఆయిల్ పేపర్‌ను తీశాడు. అది మల్లెపువ్వంత తెల్లగా, పాదరసం అంత నున్నగా మెరుస్తోంది.
“మందెట్టా మైకాన్నిస్తుందో ఆశ కూడా అంతేనయ్యా. ఆ మైకంలో పడితే ఎవరేం చెప్పినా తలకెక్కదు” అంటా నెత్తికొట్టుకుంది నవనీత.
“నువ్వు చెప్పే నీతులు పుస్తకాల్లో రాయడానికీ, బళ్లో చదువుకోడానికీ పనికొస్తాయే కానీ జీవితానికి పనికిరావే మొద్దూ” అంటా మెరుపుల కాయితం మడతలు విప్పి, బల్లమీద పరిచాడు.
దానిమీద రంగురంగుల గీతలతో డబ్బాలు కొట్టున్నాయి. ఆ గీతలు, ఆ డబ్బాలు గజిబిజిగా కనిపించాయి నవనీతకు.
“ఇది ఆ స్థలానికి చెందిన లేఔటే. రాజధాని వొస్తున్న ఏరియాకి దగ్గరలో అమరావతి రోడ్ పక్కనే ఉంది ఈ సైటు. ఇక్కడ సెంటు లక్షకి దొరకడమంటే చాలా అదృష్టమనీ, ఆ రేటుకి ఆ చుట్టుపక్కల ఎక్కడా స్థలం దొరకట్లేదనీ గణపతి చెప్పాడు. ఈ అవకాశం వొదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అతను అబద్ధం చెప్పడు కదా. నిజానికి ఆ స్థలాన్ని చూడకుండానే కొనేయొచ్చు. కానీ చూశాకే తీసుకుంటానని చెప్పా తెలుసా” అన్నాడు, తనకు తెలివితేటలు ఎక్కువనే సంగతి ఆమె గ్రహించాలన్నట్లు.
“భూమితో యాపారం చేసే మనిషి అట్టా చెప్పకుండా ఇంకెట్టా చెబుతాడంటా. తన భూమి అమ్ముడుపోడానికి ఎన్ని కబుర్లైనా చెబుతాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు. మెట్టని మాగాణని చెబుతాడు. పల్లాన్ని మెరకంటాడు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా అతను రాజకీయాల్లో తిరిగే మనిషి. అధికారం అండదండలున్నోడు” అంది నవనీత నచ్చచెబుతున్న ధోరణితో.
దాంతో కాస్త మెత్తబడ్డాడు మాణిక్యరావు. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. లేఔట్ కాయితాన్ని మడతలు పెడతా, కాస్త చిన్నగా “అందుకేగా రేపు గుంటూరు పోతోందీ. సైటు చూశాకే, నచ్చితేనే తీసుకుందాంలేవే” అన్నాడు.
కారులో కూర్చున్నాక “ఈ సైటుకు మీరన్నట్లు వాల్యూ పెరుగుతుందంటారా?” అడిగాడు మాణిక్యరావు.
“అసలా అనుమానం ఎందుకొచ్చింది మాణిక్యం. అది కొంటే బంగారం కొన్నట్లే. లేకపోతే నేనెందుకక్కడ ఆ సైట్‌కొని ప్లాట్లేస్తాను? ఏడాది తిరిగేసరికల్లా ఒకటికి రెండు రెట్లు రేటు పెరక్కపోతే అప్పుడడుగు” అన్నాడు గట్టి నమ్మకాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ గణపతి.
ఇటీవలి కాలంలోనే ఆ ఏరియాలో భూముల రేట్లు ఎట్లా పెరిగాయో, ఇంకా ఎట్లా పెరుగుతున్నాయో వర్ణించి వర్ణించి చెప్పాడు. ఉదాహరణగా హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో ఒకప్పుడు కాణీకి కొరగావనుకున్న భూములు చంద్రబాబునాయుడు హైటెక్ సిటీని ప్రకటించగానే ఎట్లా మారిపోయాయో, అక్కడ భూములున్న పేదోళ్లంతా రాత్రికి రాత్రే ఎట్లా కోటీశ్వరులైపోయారే చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు మాణిక్యరావు. నిజానికి ఆ సంగతి అతనికెప్పుడో తెలుసు. కానీ గణపతి చెప్పే విధానంతో, తనూ కోట్లకు పడగలెత్తినట్లేనని ఊహించేసుకున్నాడు. ఆ ఊహ అతన్ని ఉద్వేగభరితుణ్ణి చేసింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా అమరావతి ఏరియా అలాగే కాబోతున్నదనీ, దానికి తిరుగులేదనీ గణపతి చెప్పడంతో, మాణిక్యరావులో హుషారు ఎక్కువైంది. నవనీతవన్నీ ఉత్త భయాలు, అనుమానాలుగా తోచాయి.
“ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయా మాణిక్యం. మన సైట్లో నీళ్లకు కరువనేదే లేదు. పుష్కలంగా ఉంటాయి. మన సైట్‌కు దగ్గర్లోనే కృష్ణా నీళ్లు పారుతున్నాయి. భూమిలో చాలా తక్కువ లోతులోనే నీళ్లు పడతాయి. నిజం చెప్పాలంటే చుట్టుపక్కలున్న అన్ని సైట్ల కంటే మనదే విలువైన సైట్. కొన్న ఏడాదికే అమ్మకానికి పెట్టి చూడు. ఎంతలేదన్నా రూపాయికి ఐదు రూపాయల వొడ్డీ వొస్తుంది” అన్నాడు గణపతి.
ఇంక మాణిక్యరావు ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. ఓ గంటన్నరలో సైట్ కాడికి వెళ్లిపోయారు. అమరావతి రోడ్డుకు బాగా దగ్గర్లోనే ఉందది. గణపతి చెప్పినట్లు అల్లంత దూరంలోనే కృష్ణ ప్రవహిస్తూ కనిపించింది.
గణపతి ఓసారి లేఔట్ తీసి, ఖాళీగా ఉన్న ప్లాట్లేవో చూపించాడు. ఈశాన్య మూల ప్లాట్ మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒకటే ఉంది. దానికి మంచి డిమాండ్ ఉందనీ, ఈ రోజు సాయంత్రమే ఒకతను దానికి అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడనీ, అది వొదిలేసి మిగతా వాటిలో దేన్నయినా తీసుకొమ్మనీ చెప్పాడు గణపతి. దాంతో ఆ ఈశాన్య మూల బిట్ తనకే దక్కాలని తీర్మానించేసుకున్నాడు మాణిక్యరావు.
“సాయంత్రం కాదు, నేనిప్పుడే బయానా (అడ్వాన్స్) ఇస్తున్నా. ఆ బిట్ నా పేరే రాయండి” అని జేబులోంచి డబ్బులు తీసి, పదివేలు గణపతి చేతిలో పెట్టాడు.
“మాణిక్యం.. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావోయ్. చాలా కాలం నుంచి తెలిసిన మనిషివి కాబట్టి కాదనలేకపోతున్నా. సాయంకాలం వొచ్చే అతనికి ఏం చెప్పాలో, ఏమో. సర్లే.. నా తిప్పలేవో నేను పడతాలే. మొత్తానికి సూపర్ ప్లాట్ కొట్టేశావ్” అన్నాడు మెచ్చుకోలుగా.
అప్పుడే, ఆ నిమిషమే ఆ ఇరవై సెంట్ల స్థలం తనదై పోయినట్లు తబ్బిబ్బయిపోయాడు మాణిక్యరావు. ఆ స్థలంపై ఒక్కసారిగా ఆరాధనా భావం పెల్లుబికింది. ఆ ప్లాటుకు హద్దులుగా వేసిన రాళ్లను తనివితీరా చూసుకున్నాడు. ఓ రాయిని చేత్తో నిమిరాడు కూడా. విపరీతమైన ఉద్వేగం మనసుని ఊపేస్తుంటే కిందికి వొంగి, అక్కడి మట్టిని గుప్పిట్లోకి తీసుకున్నాడు. వొదల్లేక వొదల్లేక కొద్దికొద్దిగా మట్టిని వొదిలి, చేతులు దులుపుకున్నాడు. పిట్ట ఈక ఎంత తేలిగ్గా ఉంటుందో, మాణిక్యరావు గుండె అంత తేలికైపోయినంది. అతడి చేష్టల్ని ఆశ్చర్యపడతా చూశాడు గణపతి. అతని పెదాల మీదికి ఓ విధమైన నవ్వు విచ్చుకుంది.
ఇరవై లక్షల రూపాయలతో ఆ ఇరవై సెంట్ల ఈశాన్య మూల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు మాణిక్యరావు. రిజిస్ట్రేషన్ కాయితాలు కూడా అతడి చేతికొచ్చాయి. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మాత్రం దాని విలువ సెంటుకు ఐదువేలుగానే రాశారు. గవర్నమెంటోళ్ల రేటు అట్లాగే ఉంటుందనీ, రేటు ఎక్కువ రాస్తే, రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాల్సొస్తుందనీ గణపతి చెప్పాడు. మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎప్పుడూ తక్కువే ఉంటుంది కాబట్టి తలాడించాడు మాణిక్యరావు. డబ్బు కట్టడానికి ఐదు లక్షలు తగ్గితే మూడు రూపాయల వడ్డీకి రెండు లక్షలు చదువులయ్య కాడే అప్పు తీసుకున్నాడు. నవనీత నగలు తాకట్టుపెట్టి బ్యాంకులో మూడు లక్షలు గోల్డ్ లోను తీసుకున్నాడు. మనసులో బితుకుబితుకుమంటున్నా అతని ఉత్సాహం చూసి, అతను చేసింది మంచి పనేనేమో, అనవసరంగా అనుమానిస్తున్నానేమోనని సమాధానపడింది నవనీత. ఇరవై లక్షలు పెట్టికొన్న ఆ ఈశాన్య మూల స్థలాన్ని చూసి రావాలనే ఆరాటం మొదలైంది ఆమెలో.
“రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది. ఇంకెప్పుడు చూపిస్తావ్ మన స్థలాన్ని?” అడిగేసింది ఉండబట్టలేక.
“కొనే ముందు దాకా ఎందుకు కొనడమంటూ గోలచేశావ్. కొన్నాక ఎప్పుడు చూపిస్తావని గోలపెడ్తున్నావ్. మీ ఆడాళ్లంతా ఇంతేనే” అని గర్వంగా నవ్వాడు మాణిక్యరావు.
“మేం గోలపెట్టినా మీ మగాళ్లు ఆగుతారా? చెయ్యాలనుకుంది చెయ్యక మానతారా?” అని తనూ నవ్వింది నవనీత.
3
పిల్లలకు సెలవు రోజు చూసుకుని ఆదివారం కారు మాట్లాడుకుని స్థలం చూసేందుకు బయల్దేరారు. ఆ ముందు రోజు రాత్రి పెద్ద వాన పడింది. ఆదివారం కూడా ఉంటుందేమో, వెళ్లడానికి కుదరదేమో అనుకుంది నవనీత. అయితే పొద్దున్నే వాన తెరిపియ్యడంతో స్థిమితపడింది ఆమె మనసు.
కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కనే కాదు, రోడ్ల మీదే కాల్వలు  కనిపిస్తున్నాయ్. దాంతో కారు కాస్త నెమ్మదిగా వెళ్లింది. ఈసారి ప్రయాణం రెండు గంటలు పట్టింది. అయితే తను కొన్న ప్లాటు ఎక్కడుందో గుర్తుపట్టలేక పోయాడు మాణిక్యరావు. అతడికి అంతా అయోమయంగా ఉంది. తను కరెక్టుగానే వొచ్చాడే.
“ఈ ఏరియానేనా సార్? ఇక్కడంతా నీళ్లే కనిపిస్తున్నాయ్ కదండీ” అన్నాడు కారు డ్రైవర్.
“ఇదే ప్లేసయ్యా. నేనెందుకు మర్చిపోతాను?” అన్నాడు బలహీనమైన గొంతుతో, మాణిక్యరావు.
అతడు ప్లాటు కొన్న సైటులో ఒక్క అంగుళం భూమి కనిపించట్లేదు. ఆ ఏరియా అంతా పెద్ద చెరువులా తయారైంది. హద్దు రాళ్లు కూడా నీళ్లలో మునిగిపోయినట్లున్నాయి. నవనీత మొహం వొంక చూడాలంటే భయమేసింది మాణిక్యరావుకు.
“మన సైటేది నాన్నా?” ఉన్నట్లుండి అడిగాడు పదో క్లాస్ చదువుతున్న కొడుకు.
కొడుక్కి సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు మాణిక్యరావు. రోడ్డుకి రెండోవైపు పొలంలో కొంతమంది పనిచేస్తూ కనిపించారు. వాళ్లల్లో ఒకర్ని పిలుచుకు రమ్మని డ్రైవర్ని పంపాడు.
“ఏంటమ్మా. ఎక్కడ మన సైట్?” – ఈసారి తల్లిని అడిగాడు కొడుకు.
“ఆగు నాన్నా. నాన్న చూపిస్తాడుగా” అని నవనీత చెప్తుంటే, ఏడో క్లాస్ చదువుతున్న కూతురు “నాన్న కొన్న సైట్ ఈ నీళ్లల్లో ఉన్నట్టుందన్నయ్యా. అవును కదా అమ్మా” అంది, ‘చూడు నేనెట్లా కనిపెట్టేశానో’ అన్నట్లు.
మాణిక్యరావు మొహంలో నెత్తురు చుక్క లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆశ ఉన్నచోట అజ్ఞానం ఉంటుందని ఎవరో పెద్దమనిషి అననే అన్నాడు. ఒకడి ఆశని ఇంకొకడు క్యాష్ చేసుకోవడం తన ఎరుకలోనే ఎన్నిసార్లు చూళ్లేదు. ఇప్పుడు తన ఆశని గణపతి క్యాష్ చేసుకున్నాడా?
ఒకతన్ని వెంటబెట్టుకు వొచ్చాడు డ్రైవర్.
“ఏమయ్యా.. ఈ చోటు గురించి నీకు బాగా తెలుసా?” అడిగాడు మాణిక్యరావు.
“ఎందుకు తెలీదు బాబూ. నేను పుట్టి పెరిగిందీ, ఉంటందీ ఇక్కడే. ఈడ ప్రెతి అంగుళం నాకు తెలుసు.”
“ఓ.. అవునా.. రెణ్ణెల కింద ఈడ స్థలం కొన్నాను. ఇప్పుడు చూస్తే మొత్తం నీళ్లే అవుపిస్తున్నాయ్?”
“చెరువులో స్థలం కొంటే నీళ్లు కాకుండా ఇంకేం అవుపిస్తాయ్ నాయనా. ఇదంతా చెరువు. ఈ మజ్జ చాలా కాలం వానల్లేక ఎండిపోయింది. నిన్నా, మొన్నా కురిసిన పెద్దవానతో నిండిపోయింది. నీకు తెలీక ఈడ స్థలం కొన్నట్లున్నావ్. ఆ మాయగాళ్లు కారుచౌకగా కొని, నీలాంటోళ్లకు ఎకువ రేట్లకు అమ్మి టోపీ పెడతన్నారు. ఇప్పుడైతే ఈడ సెంటు పది, పదిహేనేల కంటే ఎక్కువ లేదు. మీకు చాలా ఎక్కువ రేటుకి అమ్ముంటారే. అయినా కొనేప్పుడు అన్నీ ఇచారించుకోవాలి కద బాబూ.”
అతని వొంక నమ్మలేనట్లు చూశాడు మాణిక్యరావు. తన తెలివితేటల మీద అతడికి చాలా నమ్మకం. నెమ్మదిగా నిజం తెలిసొచ్చింది. ఓ కన్ను మూసి, ఆకాశం వొంక ఐమూలగా చూశాడు. తర్వాత చెరువు వొంకా, ఆ రైతు వొంకా, తన భార్యాబిడ్డల వొంకా బిత్తరబిత్తరగా చూశాడు.
అక్కడ అతను కొన్న స్థలం ఉంది. కానీ దాన్నిప్పుడు తన భార్యాబిడ్డలకు చూపించలేని చిత్రమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ల సంగతి అట్లా పెట్టినా, తన స్థలమేదో ఇప్పుడు తనకే తెలీడం లేదు. తన స్థలం నీళ్ల కింద ఉంది!
ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, ఓ సిగరెట్టుని పెదాల మధ్య పెట్టుకొని, ప్యాకెట్టుని మళ్లీ జేబులో పెట్టేసుకున్నాడు. లైటర్ తీసి, సిగరెట్ వెలిగించాడు. మామూలుగా అతను పిల్లల ముందు  సిగరెట్లు కాల్చడు. కానీ ఇప్పుడు కాల్చకుండా ఉండలేకపోయాడు. అతడి స్థితి అర్థమై నవనీత పిల్లలను తీసుకుని కాస్త అవతలకు వెళ్లింది. తను ఎంత సునాయాసంగా మోసపోయాడో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మాణిక్యరావుకు. తానే కాదు, అక్కడ ప్లాట్లు కొన్నోళ్లంతా మోసపోయారు. నోటెంట మాట రానంతగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.
మనసు రగిలిపోతుంటే గణపతికి ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నట్లు సౌండ్ వొస్తోంది. మళ్లీ మళ్లీ చేశాడు. అదే సౌండ్. మౌనంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. అతణ్ణలా చూసిన నవనీతకు భయమేసింది. స్థలం చూడాలని అక్కడకు ఎంత ఉత్సాహంతో వొచ్చిందో, అదంతా తుస్సుమంటూ చల్లారిపోయింది. తమ స్థలం నీళ్లకింద ఉందనే విషయం, అదంతా చెరువు ప్రాంతమనే విషయం తెలిశాక ఆమెలో కోపం కట్టలు తెంచుకున్న మాట నిజం. ఆ క్షణంలో భర్తని ఇష్టమొచ్చినట్లు దులిపేద్దామని కూడా అనుకుంది. కానీ అక్కడ కారు డ్రైవర్‌తో పాటు, ఇంకో మనిషీ ఉంటంతో నోరు నొక్కేసుకుంది. కానీ వాళ్లు తమని చూసి నవ్వుతున్నట్లు అనిపించి, అక్కడ ఇంక ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇంకోవైపు భర్త మొహం చూస్తే, అతడు పిచ్చిచూపులు చూస్తున్నాడు. అలాంటప్పుడు అతణ్ణి కదిలించడం ఏం బావుంటుంది. కారులో ఉన్నంతసేపూ భార్యాభర్తలిద్దరూ మౌనంగానే ఉండిపోయారు.
ఇంటికొచ్చాక గణపతికి మరోసారి ఫోన్ చేశాడు మాణిక్యరావు. ఫోన్ రింగవుతోంది కానీ, ఎత్తట్లేదు. బైక్‌మీద అతనింటికి వెళ్లాడు. ఆఫీసులోనే ఉన్నాడని ఇంట్లోవాళ్లు చెప్పారు. అక్కడకు వెళ్లే సమయానికి చీకటి పడుతోంది. ఆవేశంతో ఊగిపోతూ ఆఫీసులో అడుగుపెట్టాడు. తన రూంలో కుర్చీలో హాయిగా వెనక్కి చేరగిలబడి ఉన్నాడు గణపతి. కాళ్లను బార్లా చాపి, కిటికీ మీద ఆన్చి ఉంచాడు. కళ్లు మూసుకుని, విలాసంగా డన్‌హిల్ సిగరెట్ పీలుస్తున్నాడు. మొహంలో తన్మయత్వం కనిపిస్తోంది. తలకు హెడ్‌సెట్ పెట్టుకొని, సెల్‌ఫోన్‌లో హుషారైన పాటలు వింటున్నాడు.
గణపతిని ఆ స్థితిలో చూసేసరికి మాణిక్యరావులోని ఆవేశం పదింతలైంది.
“గణపతిగారూ” అని అరిచాననుకున్నాడు. గణపతిలో చలనం లేదు. సిగరెట్ పొగ పీలుస్తూ, తల ఊపుతూ అదే తన్మయత్వంలో ఉన్నాడు.
“ఏవండీ గణపతిగారూ” అని ఈసారి బల్లమీద గట్టిగా చరిచాడు మాణిక్యరావు.
వైబ్రేషన్స్‌కి కళ్లు తెరిచాడు గణపతి.
“ఓ.. మాణిక్యం, నువ్వా. రారా. కూర్చో” అంటూ హెడ్‌సెట్ తీశాడు.
“నేను కూర్చోడానికి రాలేదండీ.”
“ఏంటి విషయం? ఏమైంది? మొహం అట్లా ఉందేంటి?”
“విషయం చాలానే ఉంది. ఇందాకట్నించీ ఫోన్ చేస్తున్నాను. మీరు తియ్యట్లేదు. ఇవాళ సైట్ చూసొచ్చాం.”
“సంతోషం. చూసొచ్చాం అంటున్నావ్. ఎవరెవరు వెళ్లారేం?”
“మా ఫ్యామిలీ అంతా వెళ్లాం. కానీ అక్కడ నా ప్లాటే కాదు, అసలు మీ సైటే అవుపించట్లేదు.”
“సైట్ కనిపించకపోవడమేంటి? సైట్ యేడకి పోద్ది. ఏం మాట్లాడతన్నావ్ మాణిక్యం?”
“సైటేతే ఉంది కానీ నీళ్లకింద ఉందండీ. అదంతా చెరువంట కదా. నిన్నపడిన వానకే అది మునిగిపోయింది. కనీసం హద్దు రాళ్లు కూడా అవుపించట్లేదు. అంత పల్లంలో ఉన్న స్థలాన్ని, సెంటు ఇరవై యేలు కూడా చెయ్యనిదాన్ని, మాయమాటలు చెప్పి, లక్ష రూపాయల కాడికి అమ్మారు. రాజధాని ఏరియా కదా, రేటు పెరుగుతుందనే నమ్మకంతో యెనకా ముందూ ఆలోచించకుండా, మా ఆవిడ వొద్దంటున్నా మూర్ఖంగా కొన్నా. నాకా ప్లాటొద్దు, గీటొద్దు. దయచేసి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి” అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసి గణపతి చేతికియ్యబోయాడు.
“అది కుదరదు మాణిక్యం” అంటా సిగరెట్‌ని యాష్‌ట్రేలో పెట్టి నలిపాడు గణపతి.
“అట్లా అయితే, ఆ పల్లంలో మట్టినింపి, మెరక చెయ్యండి. ఆ సైట్లో నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు చెయ్యండి” అన్నాడు మాణిక్యరావు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా.
“అది నా పని కాదు మాణిక్యం, నీదే.”
“అయితే నేను నా జీవితంలోనే ఘోరమైన తప్పు చేశానన్న మాట.”
“ఎందుకట్లా ఇదైపోతావ్. నేనట్లా అనుకోవట్లేదు. మట్టి తోలుకొని, రోడ్ లెవల్‌కి పైన ఉండేట్లు చూసుకున్నావంటే దాని గిరాకీ ఎక్కడికీ పోదు.”
“దానికి మట్టి తోలాలంటే ఎంతవుద్దో నీకు తెలీదా. పైగా నేనొక్కణ్ణే తోలితే సరిపోద్దా. అందరూ తోలాలి కదా. ఇంతన్యాయం చేస్తావా? నువ్వసలు మనిషి పుడక పుట్టావా?”
“అది నా తప్పు కాదు.”
“అవునయ్యా, తప్పు నాదే. నిన్ను నమ్మడం నా తప్పే. నువ్వు మోసం చేస్తుంటే తెలుసుకోలేకపోవడం నా తప్పే. నీయంత పెద్ద రాస్కెల్‌గాణ్ణి ఇంతదాకా నీ జీవితంలో చూళ్లేదు. ఇంతదాకా నేను సంపాదించుకున్నదంతా నీళ్లపాలు చేశావ్ కదరా.”
“ఇదిగో మాణిక్యం, మర్యాద.. మర్యాద. మాటలు తిన్నగా రానీయ్. నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదిక్కడ. నువ్వేం చేస్కుంటావో చేస్కో. రిజిస్ట్రేషన్ ఐపోయాక ఆ సైట్‌తో నాకేం సంబంధం లేదు. అది నీదే. దాన్నేం చేస్కుంటావో నీ ఇష్టం. ముందిక్కణ్ణించి కదులు. లేదంటే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాల్సొస్తుంది.”
“పోలీసులకు కంప్లయింటిస్తావా? ఎందుకియ్యవూ. ఇది మీ రాజ్యం కదా. అధికారం మీ చేతుల్లోనే ఉందయ్యే. ఏమైనా చేస్తారు. అందుకేగా ఈ ఏరియానంతా దోచుకు తింటన్నారు. అయినా ఇప్పుడు నన్నేడికి పొమ్మంటావ్ గణపతీ.”
“ఏట్లోకి పో. నువ్వెక్కడికిపోతే నాకేంటి. ఈ తెలివి సైట్ కొనేప్పుడే ఉండాల్సింది. అయినా చూసుకునే కదా కొన్నావ్” అన్నాడు వెటకారం నిండిన గొంతుతో, గణపతి.
“నేను ఏట్లోకి పోతే నీకు సంబరంగా ఉంటుందేమిట్రా.. నానా కష్టాలు పడతా మగ్గాల్ని నమ్ముకుని నేను సంపాదించుకున్నదంతా మాయతో, మోసంతో అన్యాయంగా దోచుకున్నావ్. అందుకని నేను ఏట్లోకి దూకాలా? నువ్వు చేసిన పనికి ఏదో నాటికి నువ్వే ఏట్లో పడే రోజొస్తుంది. మనిషి మాంసం అమ్ముకుని బతికేవాళ్లు ఏదో రోజు కుక్కచావు చావక తప్పదు. గుర్తుంచుకో. నేనెళ్తాను. ఏట్లోకి కాదురోయ్. నీమీద కేసెయ్యడానికి వెళ్తాను” అన్నాడు మాణిక్యరావు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుని సంచిలో పెట్టుకుంటా.
గణపతి నవ్వాడు. “అంతకంటే నువ్వేం చెయ్యగలవ్ మాణిక్యం. శుభ్రంగా వేసుకో. మళ్లీ దాంట్లో ఓడిపోయి, లాయర్ ఖర్చులయ్యాయని నా మీదపడి ఏడిస్తే లాభం ఉండదు.”
4
ఇప్పటికీ మాణిక్యరావు స్థలం నీళ్లకింద భద్రంగా చెరువులో ఉంది. ఆ స్థలం కోసం నిండా మునిగిన మాణిక్యరావు ఇంకో రెండు లక్షల రూపాయల అప్పుకోసం తిరుగుతున్నాడు. కోర్టు కేసుల కోసం కాదు. తనవద్ద నేసే నేతగాళ్లకు కూలీ (మజూరీ) డబ్బులివ్వాలి. వాళ్లకు నూలు, పట్టు సమకూర్చాలంటే, వాటిని కొనాలి. దానికోసం డబ్బు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. అందుకే అప్పుకోసం తిరుగుతున్నాడు. ఈ అనుభవంతో అతను జీవితంలో మళ్లా ఎక్కడైనా స్థలాలు కొనకుండా ఉన్నాడా, లేదా? ఏమో.. కానీ భవిష్యత్తులో నవనీత మాటలకు విలువివ్వాలని మాత్రం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు.
——————- x ———————-

- 10 సెప్టెంబర్ 2015, సారంగ వెబ్ వీక్లీ

Monday, September 21, 2015

Confusion on Release Date of BHAKTA PRAHLADA

'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1931లోనే!

మొట్టమొదటి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' 1931లో కాకుండా, 1932లో విడుదలైందని సీనియర్ సినీ పాత్రికేయుడు రెంటాల జయదేవ తనకు లభించిన కొన్ని ఆధారాల ద్వారా తెలియజేసిన విషయం సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆయన దానికి సంబంధించిన వ్యాసం రాసిన తర్వాత కొంతమంది ఆయన చెప్పినదాన్నే నిజమని నమ్ముతూ వస్తున్నారు. అయితే 'ప్రహ్లాద' 1931లోనే విడుదలైందని చెప్పడానికి ఓ ఆధారం లభ్యమైంది. నవోదయ పత్రిక 1947లో వెలువరించిన ప్రత్యేక పారిశ్రామిక సంచికలో యం.యస్. శర్మ 'తెలుగు ఫిల్మ్ పరిశ్రమలో పరాయివారి పెట్టుబడి' అనే వ్యాసంలో 'ప్రహ్లాద' 1931లో విడుదలైందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాసం 1947లో రాసింది కాబట్టి ఈ కాలంలో రాసిన దానికంటే క్రెడిబిలిటీ దానికే ఎక్కువ ఉంటుంది. ఈయనే కాదు, 1934 నుంచే సినిమారంగంతో సాన్నిహిత్యం కలిగి, అప్పట్నించే సినిమాపై వ్యాసాలు రాస్తూ వచ్చిన మహా రచయిత కొడవటిగంటి కుటుంబరావు సైతం 1953 అక్టోబర్ 1 ఆంధ్రప్రభ దినపత్రిక ఆంధ్రరాష్ట్ర అవతరణ సంచికలో రాసిన 'తెలుగు చిత్రాలు - సింహావలోకం' వ్యాసాన్ని "మొట్టమొదటి తెలుగు టాకీ 'ప్రహ్లాద' 1931లో వెలువడింది" అంటూ ప్రారంభించడం గమనార్హం. కాకపోతే 1931 సెప్టెంబర్ 15న అది విడుదలైందని చెప్పడానికి మరింత నమ్మకమైన అధారాలు లభ్యం కావలసి ఉంది. ఆ పనిలోనే నేను నిమగ్నుడనై ఉన్నందున సమీప భవిష్యత్తులో అవి కూడా లభ్యమవుతాయని ఆశిస్తున్నా.

Sunday, September 20, 2015

Tuesday, September 15, 2015

Kathanayakudu (1969) Movie Synopsis

కథానాయకుడు (1969) కథాంశం:



అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పెద్దమనిషి దయానందం (నాగభూషణం) గింజలు చల్లి, పిట్టను పట్టి, పిల్లికి పెట్టి, ఎలుకను పట్టగల నేర్పరి. ఆయన అండతో ఆ గ్రామ ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్న షావుకారు అప్పడు దొర (అల్లు రామలింగయ్య). కాంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని), మరో డాక్టరూ కలిసి ఆ ఊరికి దుష్ట చతుష్టయంగా దాపురిస్తారు. అందరు పెద్దమనుషుల తరహాలోనే దయానందానికి 'ధర్మ కార్యాలు' చేసే ఓ ట్రస్టు, మరో అనాథాశ్రమం నిర్వహణ బాధ్యతా ఉంటాయి. ఆ ఆశ్రమం కోసం ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన లక్ష రూపాయల్ని కైంకర్యం చేస్తుంది చతుష్టయం. ఆ రహస్యం బయటపడుతుందని అనాథాశ్రమ అధికారిని దారుణంగా హత్యచేసి, ఆ హతుడిని మృతవీరుణ్ణి చేసి, అతని స్మారక చిహ్నం కోసం తిరిగి జనం వద్ద వసూళ్లు చేసి, దిగమింగుతారు. జనతా హౌసింగ్ స్కీము పెట్టి, చౌకగా ఇళ్లు నిర్మించి ఇస్తామని జనం నుంచి ఐదు లక్షల రూపాయలు కైంకర్యం చేయాలని పన్నాగం పన్నుతారు. ఈలోగా వీళ్ల అక్రమాల్ని అరికట్టడానికి సన్నద్ధమవుతాడు సారథి (ఎన్టీఆర్). సామాన్యుడైన సారథి పేదల సాయంతో దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కొంటాడు. ఆ ఊరి మున్సిపాలిటీ ఛైర్మన్ అవుతాడు. కానీ చతుష్టయం కుట్రతో పదవి నుంచి వైదొలగుతాడు. మోసాన్ని మోసంతోనే జయించాలని నిర్ణయించుకొని వ్యాపారిగా నాటకమాడి, తన ప్రియురాలినే అందులో వ్యాంప్‌గా నటింపజేసి, ఘరానా దొంగలనందర్నీ ఒడుపుగా పట్టించి జైలుపాలు చేస్తాడు. దయానందం జైలుకు పోతూ "మేం పోతేనేం. మావాళ్లు దేశమంతా ఉన్నారు" అంటూ తమ సంతతి ఎట్లా సమాజంలో సర్వత్రా వ్యాపించి ఉందో తెలియజేస్తాడు.

Thursday, September 10, 2015

Synopsis Of PALNATI YUDDHAM (1947) Movie

బ్రహ్మనాయుడు (గోవిందరాజుల వెంకట సుబ్బారావు) వైష్ణవ భక్తుడు, భజనపరుడు. ప్రజలు ఆయనను గౌరవిస్తుంటారు. రాజ బంధువుల్లో అత్యధికులు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటారు. 'జై చెన్నకేశవా' అంటూ హరిభక్తుల వేషాలలో ఆయన్ను అనుసరిస్తుంటారు. సర్వమానవ సమత్వాన్నీ, హరిజనోద్ధరణనూ బోధించే బ్రహ్మనాయుడు దేవాలయంలో హరిజన ప్రవేశాన్నీ, హరిజనులతో పంక్తి భోజనాన్నీ తలపెడతాడు. ఇది గిట్టని ప్రతిపక్షులు, రాజభటులు ఈ విషయాన్ని దండనాథులతోనూ, నరసింహరాజు (ముదిగొండ లింగమూర్తి)తోనూ పితూరీ చేస్తారు. బ్రహ్మనాయుడిపై నరసింహరాజుకు కోపం వస్తుంది. అతని అనుయాయులు కొంతమంది నాగమ్మ (కన్నాంబ) వద్దకు వెళ్తారు. ఆమె శైవ యోగినిగా తన ఊళ్లో శివార్చన చేసుకుంటూ ఉంటుంది. హరిజనులను బ్రహ్మన్న వర్ణస్థుల్లో కలిపివేస్తున్నాడనీ, ఆమె వచ్చి, రాజుకు దన్నుగా నిలిచి, ఆయనను బ్రహ్మన్న మాయ నుంచి తప్పించి, రాజ్యాన్నీ, పురాతన ఆచార ధర్మాలనీ కాపాడాలని బతిమాలుకుంటారు. సర్వసంగ పరిత్యాగిని అయిన తనకు ఈ బెడదలు ఎందుకంటూనే అర్ధంగీకారంతో నాగమ్మ వాళ్ల మాటలు మన్నించి రాజసభలో అడుగుపెడుతుంది. నరసింహరాజు సంతోషిస్తాడు.
మాల కన్నమదాసు (వి. కోటేశ్వరరావు)ను బ్రహ్మన్న దండనాయకుడిగా చేశాడంటూ సభలో ఒక పక్షం ఉద్రిక్తంగా ప్రవర్తిస్తుంది. బ్రహ్మన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది నాగమ్మ. తన మాటలు అక్కడ ఎవరూ వినడంలేదనీ, తనకక్కడ స్థానం లేదనీ ప్రధాని పదవి వదులుకొని రాజాస్థానం నుంచి వెళ్లిపోతాడు. వెళ్లవద్దని నలగామరాజు (తీగల వెంకటేశ్వర్లు) ఆపబోతుంటే, రాజమంత్రులకే కాకుండా రాజాస్థానానికీ ప్రతిష్ఠ ఉందంటూ అతణ్ణి వారిస్తుంది నాగమ్మ. అన్నతో గొడవపడ్డ మలిదేవరాజు (డి.ఎస్. సదాశివరావు) రాజ్యంలో తన భాగం తనకు పంచి ఇమ్మంటాడు. దేశాలూ, రాజ్యాలూ ప్రజలతో కూడుకున్నవనీ, పంపకాలు చేయడానికి రాజులకు హక్కులు లేవనీ చెబుతుంది నాగమ్మ. నలగామరాజు పల్నాడును పంపకం చేస్తాడు. బ్రహ్మన్న వద్దకు వెళ్తాడు మలిదేవుడు. అతడు చేసిన పనికి విచారిస్తాడు బ్రహ్మన్న. అఖండ పల్నాడు, సర్వవర్ణ సమత్వాలు తన ఆశయాలని చెప్పి జరిగిన పనికి చింతిస్తూనే మలిదేవాదుల రక్షణ భారం వహిస్తాడు. కన్నమదాసును సైన్యాధ్యక్షుడిగా చేసుకొని మాచర్ల బయల్దేరతాడు. బ్రహ్మన్నతో కొమ్మరాజు కూడా వెళ్తాడు.
నరసింహరాజు ప్రొత్సాహంతో నాగమ్మను బతిమలాడి ఆమెను మహామంత్రిణిగా చేస్తాడు నలగామరాజు. ఆమె మలిదేవ, బ్రహ్మన్న, అలరాజు (కోనేరు కుటుంబరావు) మీద పగ సాధించే ప్రయత్నంలో భాగంగా నరసింహరాజును ఉపయోగించుకుంటూ, మాచర్లకు గూఢచారులను పంపిస్తూ, అక్కడి విషయాలు తెలుసుకుంటూ, మెలకువగా వ్యవహరిస్తూ, మాచర్లను తిరిగి గురజాల రాజ్యంలో కలపాలని తపిస్తుంటుంది.
మాచర్లలో బ్రహ్మన్న కొడుకు బాలచంద్రుడు (అక్కినేని నాగేశ్వరరావు) గూఢచారులని పట్టుకొని దండించబోతుంటే వారిస్తాడు కన్నమదాసు. అతను సేనానాయకుడు కాబట్టి అతని ఆజ్ఞను పాలించాల్సిందిగా కొడుక్కు చెబుతాడు బ్రహ్మన్న. యవ్వన ఉద్రేకంలో ఉండే బాలచంద్రునికి ఇది చికాకు తెప్పించినా, తండ్రిని ఏమనలేకపోతాడు. బ్రహ్మన్నకు కోడిపందేలంటే ఇష్టమనే సంగతి గూఢచారుల ద్వారా నాగమ్మకూ, నరసింహరాజుకూ తెలుస్తుంది. కోడిపందేల మిషతో మాచర్లను మళ్లీ గురజాలలో కలపవచ్చనీ, బ్రహ్మనాయుడు, మలిదేవాదులను దేశంనుంచే వెళ్లగొట్టించవచ్చనీ పన్నాగం పన్నుతుంది నాగమ్మ. మాయ కవచం తొడిగిన కోడిపుంజునొకదాన్ని తన సేవకుని దగ్గర తయారుగా ఉంచుతుంది.
ఆహ్వానం స్వీకరించకపోవడం పౌరుషానికి లోటంటూ బ్రహ్మన్న, మలిదేవాదులు గురజాల ఆస్థాన మంటపంలో కోడిపందేలలో పాల్గొంటారు. మొదట బ్రహ్మనాయుడి కోడిపుంజులే నెగ్గుతాయి. చివరకు నాగమ్మ కవచం తొడిగిన పుంజును రప్పిస్తుంది. మలిదేవరాజుకు రోషం కలిగిస్తుంది. బ్రహ్మనాయుడిని అడక్కుండానే మలిదేవుడు తన రాజ్యాన్ని పణంగా పెట్టి, ఓడిపోయినవాళ్లు ఏడేళ్లు వలసపోవాలనే పందేనికి ఒప్పుకుంటాడు. నలగామరాజుని అలరాజు నివారించాలని చూసినా నాగమ్మ, నరసింహరాజు ప్రోద్బలంతో పందెం సాగుతుంది. బ్రహ్మన్న కోడి పడిపోగానే నాగమ్మ సేవకుడు తమ కోడి కవచాన్ని రహస్యంగా తీసేస్తాడు. పందెంలో మోసం జరిగిందని బ్రహ్మన్న పక్షంవాళ్లు గొడవ చేయడంతో, కోడిని పరీక్షించుకొమ్మని బ్రహ్మన్న ముందు పెడుతుంది నాగమ్మ. పందెం ప్రకారం మాచర్లను వదిలి కర్నూలు సీమకు వలసపోతుంది బ్రహ్మన్న బృందం.
నలగామరాజు అల్లుడైన అలరాజు తాను కూడా వలసపోతున్నానని భార్య రత్నాల పేరిందేవి (సురభి బాలసరస్వతి)తో చెప్పి వెళ్లిపోతాడు. అతణ్ణి ఆపాల్సిందిగా నలగామరాజును ఏడుస్తూ అర్థిస్తుంది పేరిందేవి. తన తర్వాత రాజ్యం అలరాజుదేననే అభిప్రాయం ఉండి కూడా అతడు ఏమీ చేయకుండా చేష్టలుడిగిపోతాడు. బ్రహ్మనాయుని పరివారం వలస జీవితం పూర్తి చేసుకొని సైన్యంతో సమాయత్తమవుతారు. తమ రాజ్య భాగం తమకివ్వాల్సిందిగా అలరాజును రాయబారానికి పంపుతారు. అలరాజు వస్తే నలగామరాజు మళ్లీ తమ ప్రభావం నుంచి బయటకొచ్చి, బ్రహ్మనాయుడి ప్రభావంలో పడతాడని నరసింహరాజుకు నూరిపోసిన నాగమ్మ, అతడిలో రాజ్యాపేక్షను రగిలిస్తుంది. అలరాజును దారిలోనే చంపేయమని ప్రేరేపిస్తుంది. అలరాజును ఊరిబయటనే కలుసుకున్న నరసింహరాజు అతడికి ఆతిథ్యాలిస్తాడు. నర్తకి చేతికి విషపాత్రనిచ్చి అతని వద్దకు పంపుతాడు. అక్కణ్ణించి తాను వెళ్లిపోతున్నట్లు తప్పుకుంటాడు. నర్తకి వ్యామోహంలో పడిన అలరాజు ఆమె ఇచ్చిన విషం తాగి మరణిస్తాడు. అలరాజు మృతికి విచారించిన బ్రహ్మన్న యుద్ధానికి సన్నద్ధమవుతాడు. అంతఃపుర స్త్రీరక్షణ కోసం బాలచంద్రుణ్ణి ఇంటివద్దే ఉండమంటాడు. బజారులో ఒక బొంగరం ఆట సంఘటనతో పౌరుషం పెల్లుబికిన బాలచంద్రుడు తల్లివద్దకు పోయి, యుద్ధానికి వెళ్తాననీ, దీవించమనీ అంటాడు. కన్నకొడుకును వదలలేక వదులుతూ దీవించి, మొహాన తిలకం దిద్దుతుంది తల్లి. పుట్టింటిలో ఉన్న కోడలు మాంచాల (ఎస్. వరలక్ష్మి)కు కూడా ఓ మాటచెప్పి వెళ్లమంటుంది. అత్తవారింటికి వస్తాడు బాలచంద్రుడు. మాంచాల భర్తను సంతోషపరిచి, వీరపత్నిలాగా అతణ్ణి యుద్ధానికి పంపుతుంది. యుద్ధ శిబిరంలో బ్రహ్మనాయుడు శాంతివచనాలు పలుకుతుంటే వారించి, సైన్యాన్ని యుద్ధోన్ముఖం చేస్తాడు బాలచంద్రుడు. బ్రహ్మన్న పరిస్థితులకు లొంగుతాడు. తను కత్తిపట్టకుండా యుద్ధాన్ని నడుపుతాడు. ఇరుపక్షాలూ యుద్ధంలో తలపడతాయి. బాలచంద్రుడు వీరోచితంగా యుద్ధంచేసి, నరసింహరాజుతో తలపడి, అతని తలనరికి, తనూ గాయపడి, కొనప్రాణంతో తలను బ్రహ్మనాయుడి వద్దకు తెస్తాడు. తను పుత్రప్రాయంగా పెంచిన నరసింహరాజు తలచూసి బ్రహ్మన్న దుఃఖిస్తాడు. తండ్రి తనను మెచ్చుకోకపోగా నరసింహరాజు చనిపోయినందుకు దుఃఖించడంతో "నాన్నా, నువ్వెప్పుడూ ఇంతే"నంటూ నిస్పృహతో ప్రాణాలు వదుల్తాడు బాలచంద్రుడు. మనసు నీరవమైపోగా, యుద్ధం ఆపెయ్యాలనే తలంపుతో, ఆయుధమనేది లేకుండా యుద్ధరంగం మధ్యలోకి వెళ్తాడు బ్రహ్మన్న. అతనిలోని తేజస్సును చూసి ప్రత్యర్థి సైనికులు పారిపోతుంటారు. నరసింహరాజు మృతికి కోపావేశంతో స్వయంగా సైన్యాన్ని ఉద్రిక్తం చేస్తూ బ్రహ్మన్నను ఎదుర్కొంటుంది నాగమ్మ. అహింసనే నమ్మిన్న బ్రహ్మన్న, తన తలనరికి యుద్ధాన్ని ఆపమంటాడు. అతని మహోన్నత హృదయాన్ని ప్రత్యక్షంగా చూసిన నాగమ్మ పశ్చాత్తాపంతో కత్తి దించి క్షమించమంటూ అతని కాళ్లమీద పడుతుంది. యుద్ధం ముగుస్తుంది. బ్రహ్మన్నను మంత్రిగా ఉండమని కోరతాడు నలగామరాజు. నాగమ్మనే మంత్రిణిగా ఉండవలసిందిగా ఆదేశించి, చెన్నకేశవ స్వామిని కీర్తిస్తూ ఆయనలో లీనమైపోతాడు బ్రహ్మనాయుడు.

Tuesday, September 8, 2015

Bhale Bhale Magadivoy (2015) Movie Review

భలే భలే మగాడివోయ్

మతిమరుపు మగాడు మెప్పించాడు



తారాగణం: నాని, లావణ్య, మురళీశర్మ, అజయ్‌, నరేశ్‌, సితార, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి
 
సంగీతం: గోపిసుందర్‌
 
రచన-దర్శకత్వం: మారుతి

విడుదల తేదీ: 4 సెప్టెంబర్ 2015

పేరుచూసి కథానాయకుడు ఏమేం సాహసాలు చేస్తాడోనని అనుకునేవాళ్లు సినిమాలో అతని మతిమరుపు పనులు చూసి ఆశ్చర్యపోతారు. అయితే ‘భలే భలే మగాడివోయ్‌’ ఓ ఉత్సాహభరితమైన, కాలక్షేపానికి బాగా పనికొచ్చే సినిమా. ప్రేమకోసం ఎన్ని ఆటలు, ఎన్ని అబద్ధాలు ఆడవచ్చో, ఆఖరుకి కన్న తల్లిదండ్రుల్ని సైతం అన్నాచెల్లెళ్లుగా ఎలా మార్చేయవచ్చో చూపించే సినిమా.
 
లక్కీ స్టోరీ:
ఈ సినిమాలో లక్కీ (నాని) అందరిలాంటి మగాడు కాదు. అసాధారణంగా లోకంలో ఎవరికీ లేనంత మతిమరుపుతో పుట్టినవాడు. అలాంటివాడికి పెళ్లి చెయ్యడం తల్లిదండ్రులకు బ్రహ్మప్రళయం కాక మరేమిటి! అయితేనేం, అతను నందన (లావణ్య త్రిపాఠి) అనే అందమైన అమ్మాయిని చూసి, మనసిచ్చేసి, ఆమె ప్రేమను పొందడం కోసం తన లోపాన్ని కప్పిపుచ్చుకోడానికి ఎన్ని ఆటలు, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడతాడు. ఈ క్రమంలో ఎంతోమందిని మోసం చేస్తాడు. నందన తండ్రి (మురళీశర్మ) ఓ వ్యవసాయ శాస్త్రవేత్త. ఏ లోటూ లేకుండా మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకునే ఆయన కాబోయే అల్లుడి విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు! మొదటే లక్కీ(నాని) సంబంధం ఆయన వద్దకు వస్తుంది. కానీ లక్కీ మతిమరుపు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించి, జన్మలో అతడి మొహం చూడకూడదనుకుంటాడు. ఆయన ఎంత వద్దనుకున్నా కూతురి జీవితంలోకి వచ్చేస్తాడు లక్కీ. ఒక సందర్భంలో కన్నతల్లిని పక్కింటి ఆంటీగా ఆయనకు పరిచయం చేస్తాడు లక్కీ. తండ్రిని తల్లిచేత ‘అన్నయ్యా’ అనిపిస్తాడు! 
నందనను తొలిచూపులోనే కామించి ఆమెను పెళ్లిచేసుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ (అజయ్‌) అనే అతను కాచుక్కూర్చుంటాడు. అతని తండ్రి, నందన తండ్రి స్నేహితులు. కానీ అజయ్‌ తనకు నచ్చలేదనీ, తను లక్కీ అనే అతన్ని ప్రేమించాననీ తండ్రికి చెబుతుంది నందన. అవమానంతో రగిలిపోతాడు అజయ్‌. లక్కీ అనేవాడి అంతు చూడాలనుకుంటాడు. లక్కీని తండ్రికి పరిచయం చేయాలనుకుంటుంది నందన. తనెవరో ఆయనకు తెలుసుకాబట్టి ఆయన వద్దకు తన బదులు తన స్నేహితుణ్ణి (వెన్నెల కిశోర్‌)ను పంపిస్తాడు లక్కీ. ఇక దాగుడుమూతలాట మొదలు. లక్కీ మరో గేమ్‌ ఆడి, నందన రికమండేషన్‌తో లక్కీ స్నేహితుడిగా ఆమె తండ్రి వద్దే ఉద్యోగంలో చేరతాడు. చివరకు ఈ ఆటలో అసలు లక్కీ ఎవరో నందన తండ్రికి ఏ పరిస్థితుల్లో తెలిసింది, లక్కీ ఆడిన ఆటలు, అతని భయంకరమైన మతిమరుపు గురించి నిజం తెలిసిన నందన ఏం చేసిందనేది పతాక సన్నివేశం. 
 
నాని సినిమా:
హీరో హీరోయిన్లుగా నాని, లావణ్య మధ్య కెమిస్ట్రీ ‘భలే’ కుదిరింది. మతిమరుపు కుర్రాడిగా ఆహ్లాదాన్ని పంచుతూనే, నందన వదినకు ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి పడ్డ అవస్థల్లో నాని ప్రదర్శించిన హావభావాలు, చివరలో తను ఆడిన అబద్ధాలు, ఆటల వల్ల నందన దూరమైపోయిందన్న బాధతో అతను చూపించిన అభినయాన్ని ప్రశంసించకుండా ఉండలేం. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసిన అతనికి ఈ సినిమా మంచి బ్రేక్‌నిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నందనగా లావణ్యకూ ఈ సినిమా పెద్ద ప్లస్సవుతుంది. అందంగా ఉండటమే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంది. పాత్ర పరిధిలో విలన్‌గా తనదైన ధోరణిలో నటించాడు అజయ్‌. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌ తండ్రిగా నటించిన మురళీశర్మ గురించి. దాదాపు హీరోతో సమానమైన కీలక పాత్రలో గొప్పగా రాణించాడు. సెకండాఫ్‌లో వచ్చినా తనదైన ‘తత్తరబిత్తర’ కామెడీతో అలరించాడు వెన్నెల కిశోర్‌. లక్కీ స్థానంలో వెళ్లినప్పట్నించీ అతను పడే అవస్థలు ఆహ్లాదాన్ని పంచాయి. లక్కీ తల్లిదండ్రులుగా నరేశ్‌, సితార జోడీ ఆకట్టుకుంటుంది. కాకపోతే భర్తను పట్టుకొని సితార ‘అన్నయ్యా’ అని అంటుంటే ఎంత ఎబ్బెట్టుగా ఉందో! ఎంత ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకుంటే మాత్రం భర్తను అన్నయ్యగా ఏ స్త్రీ అయినా పిలుస్తుందా? నందన వదినగా స్వప్నమాధురి కూడా ఓ సన్నివేశానికి కీలకమైన పాత్రను చక్కగా చేసింది. గతంలో ‘కొడుకు’గా హీరో వేషంలో కనిపించిన ఎమ్మెస్‌ నారాయణ కొడుకు విక్రమ్‌ని ఇందులో పోలీస్‌గా ఏమాత్రం ప్రాధాన్యంలేని ఓ సాదాసీదా పాత్రలో చూసి జాలిపడతాం. నందన బంధువుల బృందంలో శ్రీనివాసరెడ్డి కొద్దిసేపైనా తన మార్కు హాస్యాన్ని పండించాడు.
 
దర్శకత్వ ప్రతిభ:
చూడ్డానికి సినిమా కథే అయినా అతి సాధారణంగా ఉన్న క్లైమాక్స్‌ మినహా మిగతా సినిమానంతా ఆహ్లాదభరితంగా, ఉద్వేగభరితంగా చిత్రించాడు దర్శకుడు మారుతి. మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి లక్కీ ఆడే అబద్ధాల వల్ల తర్వాత సన్నివేశంలో ఏమవుతుందో, ఒక్కో అబద్ధంతో ఒక్కో సమస్యలో చిక్కుకుని అతను ఎలా బయటపడతాడోననే కుతూహలం, ఒక పనిమీద వచ్చి, దాన్ని మర్చిపోయి ఇంకో పనిచేసే లక్కీ తర్వాత ఎలాంటి చిక్కులో పడతాడోననే ఆదుర్దాని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. టేకింగ్‌తోనూ, మాటలు, స్ర్కీన్‌ప్లేతోనూ మెప్పించాడు మారుతి. కాకపోతే క్లైమాక్స్‌ రెగ్యులర్‌ టైప్‌లో ఉండి అసంతృప్తి కలిగిస్తుంది. మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి లక్కీ ఆడిన ఆటలు తనకు ముందే తెలుసునంటూ, తర్వాత అతనేం చేస్తాడో చూడాలనే ఉద్దేశంతో అతడికి తెలీకుండా గమనిస్తూ వచ్చానని ప్రీ క్లైమాక్స్‌లో మురళీశర్మ చెప్పడం ఓవర్‌ డ్రమటైజేషన్‌. అది కన్విన్సింగ్‌గా లేదు. నందన అన్నయ్య ఎవరో చివరాఖరి దాకా దర్శకుడు చూపించకపోవడం, భార్యకు ప్రసవమై బిడ్డ పుట్టాక కూడా అతను రాకపోవడం సినిమా విచిత్రం! ఐదు పాటల్లో హీరో హీరోయిన్లపై తీసిన టైటిల్‌సాంగ్‌, నానిపై తీసిన ‘హౌ హౌ’ సాంగ్‌ మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటల బాణీలకంటే గోపిసుందర్‌ ఇచ్చిన రీరికార్డింగ్‌ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. 
 
రేటింగ్‌: 3.25/5

- ఆంధ్రజ్యోతి పోర్టల్, 4 సెప్టెంబర్ 2015


Thursday, September 3, 2015