Tuesday, September 15, 2015

Kathanayakudu (1969) Movie Synopsis

కథానాయకుడు (1969) కథాంశం:



అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పెద్దమనిషి దయానందం (నాగభూషణం) గింజలు చల్లి, పిట్టను పట్టి, పిల్లికి పెట్టి, ఎలుకను పట్టగల నేర్పరి. ఆయన అండతో ఆ గ్రామ ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్న షావుకారు అప్పడు దొర (అల్లు రామలింగయ్య). కాంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని), మరో డాక్టరూ కలిసి ఆ ఊరికి దుష్ట చతుష్టయంగా దాపురిస్తారు. అందరు పెద్దమనుషుల తరహాలోనే దయానందానికి 'ధర్మ కార్యాలు' చేసే ఓ ట్రస్టు, మరో అనాథాశ్రమం నిర్వహణ బాధ్యతా ఉంటాయి. ఆ ఆశ్రమం కోసం ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన లక్ష రూపాయల్ని కైంకర్యం చేస్తుంది చతుష్టయం. ఆ రహస్యం బయటపడుతుందని అనాథాశ్రమ అధికారిని దారుణంగా హత్యచేసి, ఆ హతుడిని మృతవీరుణ్ణి చేసి, అతని స్మారక చిహ్నం కోసం తిరిగి జనం వద్ద వసూళ్లు చేసి, దిగమింగుతారు. జనతా హౌసింగ్ స్కీము పెట్టి, చౌకగా ఇళ్లు నిర్మించి ఇస్తామని జనం నుంచి ఐదు లక్షల రూపాయలు కైంకర్యం చేయాలని పన్నాగం పన్నుతారు. ఈలోగా వీళ్ల అక్రమాల్ని అరికట్టడానికి సన్నద్ధమవుతాడు సారథి (ఎన్టీఆర్). సామాన్యుడైన సారథి పేదల సాయంతో దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కొంటాడు. ఆ ఊరి మున్సిపాలిటీ ఛైర్మన్ అవుతాడు. కానీ చతుష్టయం కుట్రతో పదవి నుంచి వైదొలగుతాడు. మోసాన్ని మోసంతోనే జయించాలని నిర్ణయించుకొని వ్యాపారిగా నాటకమాడి, తన ప్రియురాలినే అందులో వ్యాంప్‌గా నటింపజేసి, ఘరానా దొంగలనందర్నీ ఒడుపుగా పట్టించి జైలుపాలు చేస్తాడు. దయానందం జైలుకు పోతూ "మేం పోతేనేం. మావాళ్లు దేశమంతా ఉన్నారు" అంటూ తమ సంతతి ఎట్లా సమాజంలో సర్వత్రా వ్యాపించి ఉందో తెలియజేస్తాడు.

No comments: