Sunday, July 31, 2011

న్యూస్: 'చైతూ మంచి నటుడు' అనిపించుకునేదెప్పుడు?

ఏ హీరోకైనా ఇది ఇబ్బందికరమైన విషయమే. 'హీరోకంటే హీరోయినే బాగా చేసింది' అనే కామెంట్లు ఆ హీరో నటనా సామర్థ్యాన్ని తక్కువ చేయడమే. అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య అలియాస్ చైతూ ఇప్పుడు అలాంటి స్థితినే ఎదుర్కొంటున్నాడు. హీరోగా చేసిన మూడు సినిమాల్లో రెండు హిట్లతో అతని కెరీర్ పైకి బాగానే కనిపిస్తోంది. అయితే అంతర్గతంగా చైతూలో అసంతృప్తి ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 'ఏమాయ చేసావె', '100% లవ్' సినిమాల్లో తనకంటే ఎక్కువగా హీరోయిన్లకే పేరు వచ్చిందనీ, ఆఖరుకి తన తాత, తండ్రి కూడా హీరోయిన్లకే ఎక్కువ మార్కులు వేశారనీ అతను బాధపడుతున్నాడు. అవును మరి. తొలి సినిమా 'జోష్'లో అతని సరసన రాధ కుమార్తె కార్తీక నటించింది. ఆమె నటన సంగతి అలా ఉంచితే, అసలామె స్క్రీన్ ప్రెజెన్సే బాగా లేకపోవడంతో 'దొందూ దొందే' అనే మాట వినిపించింది. ఆ సినిమా ఫ్లాపవడంతో హీరోయిన్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. కానీ 'ఏమాయ చేసావె'లో చైతూ కంటే రెండేళ్లు పెద్దదానిగా నటించిన సమంతా అటు నటనతో, ఇటు అందచందాలతో ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంది. ఎమోషనల్, రొమాంటిక్ సీన్లలో ఆమె హావభావాలు, ముఖ్యంగా కళ్లతో ప్రదర్శించిన అభినయం అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఆ సినిమా విడుదలయ్యాక అక్కినేని నాగేశ్వరరావు అంతటి మహానటుడు సమంతాని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. "సమంతాకి 60 మార్కులు, నాగచైతన్యకి 40 మార్కులు వేస్తాను. సమంతాలో సావిత్రి తరహా నటి కనిపిస్తోంది" అని కితాబునిచ్చారు. అలా తాతతో సహా అంతా సమంతానే పొగిడారు. అప్పుడు సర్దిచెప్పుకున్న చైతూని తాజాగా '100% లవ్' విషయంలోనూ తనకంటే తమన్నాకే ఎక్కువ పేరు రావడం ఇబ్బందికి గురిచేసింది. 'మిల్కీ బ్యూటీ'గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న తమన్నా తన గ్లామర్‌తో, పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని బాగా ఇంప్రెస్ చేసింది. అందుకే చైతూ ఆమె ముందు తేలిపోయాడు. దీనికితోడు ఈమధ్య ఆ సినిమా ఫంక్షన్‌లో చైతూ తండ్రి నాగార్జున "చైతూ కంటే తమన్నా నటనే నాకు బాగా నచ్చింది" అనడం పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఎట్లాగైనా నటునిగా హీరోయిన్ కంటే ఎక్కువ మార్కులు పొందాలనే పట్టుదల అతనిలో పెరిగింది. 'దడ'తో తనేమిటో ప్రూవ్ చేసుకోవాలనే కసితో అతనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండటం, పైగా మాస్ మసాలాలు మేళవించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా తనకి మాస్ హీరోగా మంచి గుర్తింపునిస్తుందని అతను నమ్ముతున్నాడు. ఇందులో అతని జోడీగా మరో గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నటిగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఆమె చైతూకి ఆ పేరు తీసుకువస్తుందా?

న్యూస్: తండ్రీకొడుకులుగా కృష్ణంరాజు, ప్రభాస్ రాణిస్తారా?

కృష్ణంరాజు, ప్రభాస్ తొలిసారి తండ్రీకొడుకులుగా వెండితెర మీద ఆవిష్కృతం కాబోతున్నారు. అవును. ప్రభాస్ హీరోగా చిత్రరంగంలో అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత ఆ ఇద్దరూ తండ్రీ కొడుకుల పాత్రల్ని అభినయించ బోతున్నారు. ఆ సినిమా 'రెబెల్'. దాన్ని రూపొందిస్తోంది రాఘవ లారెన్స్. శ్రీ బాలాజీ సినీ మీడియా బేనర్‌పై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. ఆ ఇద్దరూ 'బిల్లా'లో మొదటిసారి కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో వారికి ఎలాంటి బంధుత్వమూ లేదు. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తే, కృష్ణంరాజు పోలీసాఫీసర్ పాత్రని చేశారు. 'బిల్లా' ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ పెదనాన్న, కుమారుల్ని తండ్రీ కొడుకులుగా చూపించే ఛాన్స్‌ని దక్కించుకున్నాడు లారెన్స్. అతను చెప్పిన కథ, పాత్రలు ఆ ఇద్దరికీ బాగా నచ్చినందునే ఆ పాత్రల్ని చేయడానికి వారు అంగీకరించారు. ఇప్పటివరకు ఆ తరహా పాత్రలు వచ్చినా స్క్రిప్టులు నచ్చనందునే వారు చేయలేదు. తెరమీద తండ్రీకొడుకులుగా చేసే సినిమా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలనీ, తప్పనిసరిగా హిట్టవ్వాలనీ ఆశించడం వల్లే, సరైన సబ్జెక్ట్ కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పటికి వారు ఆశించిన సబ్జెక్ట్ దొరికింది. మాస్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు నాయికలు - అనుష్క, దీక్షాసేథ్ నటిస్తున్నారు. నాగార్జునతో చేసిన 'డాన్' తర్వాత లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి కృష్ణంరాజు, ప్రభాస్‌ని ప్రేక్షకులు ఏ రీతిలో ఆదరిస్తారన్నది ఆసక్తికరం.

Saturday, July 30, 2011

న్యూస్: ఇండస్ట్రీలో సౌందర్యలు ఎంతమంది?

టాలీవుడ్‌లో సావిత్రులు, సౌందర్యలు ఎంతమందున్నారో లెక్క తేలడం లేదు. అవును మరి. ప్రతి హీరోయిన్నీ ఎవరో ఒకరు సౌందర్యతోటో, సావిత్రితోటో, లేదంటే జయసుధతోటో పోల్చడం పరిపాటైపోయింది. ఇటీవల 'తెలుగమ్మాయి' ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా హీరోయిన్ సలోనిని సొందర్య అంతటి నటంటూ ఆకాశానికెత్తేశాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన పోలికని అదే ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన గురువు దాసరి నారాయణరావు సున్నితంగా తోసిపుచ్చడం గమనార్హం. "రామకృష్ణా అప్పుడే ఎందుకు తొందర. సౌందర్యకి ఎవరూ పోలిక కారు" అని ఆయన సున్నితంగా శిష్యుణ్ణి మందలించారు. కోడి రామకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్నా ఆ సినిమాకి సంబంధించిన వాళ్లని ఊహాతీతంగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం అలవాటే. ఆయన సంగతి అలా పక్కన పెడదాం.
సొందర్య ప్రమాదవశాత్తూ మృతి చెందాక మొదట స్నేహని ఆమెతో పోల్చడంతో ఈ పోలికల గొడవ ఎక్కువవుతూ వచ్చింది. 'అన్నమయ్య', 'రాధా గోపాలం' సినిమాలు చేసిన ఆమెని సౌందర్య అంతటి నటిగా కొంతమంది ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఆమె ఆ సినిమాల తర్వాత సరిగా రాణించలేక పోయింది. తెలుగులో ఆమె కెరీర్ ఎదగలేదు. ఆమధ్య 'కలవరమాయే మదిలో' సినిమా చేసిన స్వాతిని ఆ చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల "సావిత్రి తర్వాత అంతటి నటి స్వాతే" అని తీర్మానించేశారు. అంటే వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, విజయశంతి, సౌందర్య కూడా స్వాతి ముందు దిగదుడుపే అని ఆయన పరోక్షంగా చెప్పాడన్న మాట. ఆ సినిమానే కాదు, ఆ తర్వాత కూడా స్వాతి చెప్పుకోదగ్గ రీతిలో తెలుగులో రాణించలేదు. భూమిక, ఛార్మి, అనుష్క వంటి వాళ్లని కూడా సౌందర్యతో మనవాళ్లు పోల్చిన సందర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం 'అలా మొదలైంది' నాయిక నిత్యమీనన్‌ని కూడా కొంతమంది సౌందర్యతోటీ, జయసుధతోటీ పోల్చారు. నో డౌట్. ఆ సినిమాలో నిత్య నటించలేదు, బిహేవ్ చేసింది. అయినా ఆమెని సౌందర్యతో పోల్చలేం. ఇలా చాలామంది సౌందర్యలను మనవాళ్లు తమ మాటల ద్వారా సృష్టించారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ మరో సౌందర్య రాలేదన్నది నిఖార్సయిన నిజం. సినిమావాళ్లు ఊరికే సౌందర్యతో ఇతర తారల్ని పోల్చడం మానితే బెటర్.

న్యూస్: వేణుమాధవ్ హవా ఏమైంది?

ఆమధ్య కాలంలో సినీ రంగానికి సంబంధించి అడ్డూ, ఆపూ లేని నోరెవరిదయ్యా అంటే అందరి వేళ్లూ కమెడియన్ వేణుమాధవ్‌నే చూపించేవి. తను యాంకర్‌గా వ్యవహరించే లేదా తను పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ అతను తన నోటితో ముతక హాస్యాన్ని కురిపించేవాడు. హాస్యమంటే అతడి దృష్టిలో సెక్సు జోకులు వేయడంగానే కనిపించేది. అట్లా కొంత కాలం అతడి రాజ్యం నడిచింది. కమెడియన్‌గా యమ బిజీ కావడమే దీనికి కారణం. ఒక యేడాది బ్రహ్మానందం, అలీ, సునీల్ వంటి కమెడియన్లను సైతం వెనక్కి నెట్టి 47 సినిమాల్లో నటించడమే గాక అందరి కంటే ఎక్కువ ఆదాయాన్నీ గడించిన చరిత్ర అతడిది. అట్లాంటిది ఇప్పుడు అతడి హవా ఏ మాత్రం కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో ఏ కార్యక్రమంలోనూ అతడు యాంకర్‌గా కనిపించలేదు. సినిమా ఫంక్షన్లలోనూ చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. అప్పటి జోరు కూడా అతడి మాటల్లో ఉండటం లేదు. సినిమాలు తగ్గిపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్ కమెడియన్‌గా కొనసాగిన కాలంలో నిర్మాతలు, దర్శకుల్ని అతడు పెట్టిన ఇబ్బందులు, ప్రదర్శించిన అహంభావమే ఇప్పుడతనికి చేటు తెచ్చాయంటున్నారు. 'హంగామా'లో అలీతో పాటు హీరోగా నటించిన అతను సోలో హీరోగా 'భూకైలాస్'లో నటించాడు. ఆ సమయంలో అతడి డిమాండ్లకూ, చేష్టలకూ దర్శకుడు శివనాగేశ్వరరావు విసిగిపోయాడు. ఆ తర్వాత స్వయంగా వేణుమాధవ్ 'ప్రేమాభిషేకం' సినిమాని హీరోగా నటిస్తూ నిర్మించాడు. అది బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడంతో మళ్లీ ప్రొడక్షన్ జోలికి పోలేదు. అతడి డిమాండ్ల కారణంగా నిర్మాతలు ఇతర కమెడియన్ల వైపు చూపు సారిస్తున్నారు. దాంతో వేషాలూ తగ్గిపోతున్నాయి. ఎదిగే కొద్దీ వొదిగి ఉండాలనే సత్యాన్ని విస్మరించడం వల్లే అతడికి ఈ స్థితి తలెత్తిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సంగతి గ్రహించి మసలుకుంటే అతడు మళ్లీ పూర్వ వైభవం పొందడం అసాధ్యమేమీ కాదు. కానీ మన సినిమా వాళ్లు అంత తేలిగ్గా మారతారా?

న్యూస్: 'మార్క్'ని ఆశీర్వదించడానికి మన హీరోలకు మనసు రాలేదు!

ఫైట్ మాస్టర్ విజయన్ పేరు వినని, తెలీని సినిమా ప్రియులు ఉండరు. అనేకమంది హీరోలు మాస్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకోడానికి ఆయన సమకూర్చిన ఫైట్లు ఉపకరించాయి. నేటి పేరుపొందిన హీరోల్లో ఎక్కువమంది తొలి సినిమాలకి ఆయనే ఫైట్ మాస్టర్. ఆయన ఖ్యాతి అలాంటిది. 1975 నుంచీ అంటే 36 సంవత్సరాలుగా ఒకే వృత్తిలో అగ్ర స్థాయిలో కొనసాగడమంటే సాధారణ విషయం కాదు. విజయన్ అలాంటి అరుదైన వృత్తి నిపుణుడు. అవును. ఫైట్ మాస్టర్లలో ఇప్పటికీ ఆయనది అగ్ర స్థాయే. ఫైట్లలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని గమనిస్తూ, తనని తాను అప్‌డేట్ చేసుకుండటమే ఆయన విజయ రహస్యం. ఇప్పుడాయన తన కుమారుడు శబరీశ్‌ని హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరు 'మార్క్'. సోమవారమే (జూలై 25) ఆ సినిమా ఆడియో మార్కెట్లోకి వచ్చింది. ఈ సినిమాని మొదట తమిళంలో తన దర్శకత్వంలోనే ప్రారంభించాడు విజయన్. కొంత షూటింగ్ జరిపాక ఇందులో ఓ కీలక పాత్రకి శ్రీహరిని సంప్రదించాడు. చేయడానికి వెంటనే ఒప్పుకున్న శ్రీహరి తెలుగులోనూ ఈ సినిమాని తీసుకు వస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. నిర్మాతగా నట్టి కుమార్ పేరునూ సూచించాడు. అలా తమిళ, తెలుగు భాషల్లో 'మార్క్' రూపొందింది. ఈ సినిమాలో శ్రీహరి మినహా మరో తెలుగు నటుడు కనిపించడు. హీరోయిన్‌గా బ్యాంకాక్‌కు చెందిన పింకీ నటించింది. మంచి పొడగరి అయిన శబరీశ్ ఈ సినిమాలో ఫైట్స్‌ని గొప్పగా ఛేశాడంటున్నారు. క్లైమాక్స్‌లో చేసిన రిస్కీ షాట్లో మొహం ఎడమవైపు కాలిపోవడంతో చాలా రోజులు ఈ సినిమా షూటింగ్ ఆగింది. శబరీశ్‌కి నయమయ్యాక ఈ సినిమాని పూర్తి చేశాడు విజయన్. అయితే జూలై 25న ఏర్పాటు చేసిన ఆడియో ఫంక్షన్ సందర్భంగా విజయన్ మాస్టర్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. కారణం, ఈ వేడుక కోసం ఆయన ఆహ్వానించిన వారిలో చాలామంది రాకపోవడం. అలా మొహం చాటేసిన వారిలో ఎక్కువమంది హీరోలే. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ వంటి హీరోల్ని ఆయన ఆహ్వానించాడు. వారంతా వస్తామని చెప్పి కూడా డుమ్మా కొట్టారు. ఇప్పుడే కాదు, 'మార్క్' ఓపెనింగ్‌కీ వారు ఇలాగే ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఆయన సమకూర్చిన ఫైట్లతో యాక్షన్ హీరోలుగా పేరు తెచ్చుకున్న మన హీరోలకు ఆయన కుమారుణ్ణి ఆశీర్వదించడానికి మాత్రం మనసు రాలేదు. సినీ'మాయా'రంగమని మరి ఊరికే అన్నారా? ఏమైనా మనసున్నవారే ఈ ఫంక్షన్‌కి వచ్చి శబరీశ్‌ని ఆశీర్వదించారు.

న్యూస్: మార్పు కోరుకుంటున్న నమిత!

సుమారు పదేళ్ల నుంచీ తన భారీ అందాల ప్రదర్శనతోటే ఒక తరహా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్న నమిత ఇక తన కెరీర్‌లో మార్పును ఆశిస్తోంది. జూలై 25 'శుక్ర' సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా స్వయంగా తన మనోభీష్టాన్ని వెల్లడించింది. ఈ సినిమాలో ఆమె టైటిల్ రోల్ చేస్తోంది. "ఇది నాకు స్పెషల్ ఫిల్మ్. పోలీస్ కమీషనర్‌గా నటిస్తున్నా. మంచి యాక్షన్ ఫిల్మ్. పదేళ్ల నుంచీ గ్లామరస్ రోల్స్ చేస్తూ వస్తున్న నేను మార్పు కోరుకుంటున్నా. నటనకు అవకాశమున్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నా. అందులో భాగంగా ఈ సినిమాలో యాక్షన్ హీరోయిన్‌గా కనిపించబోతున్నా" అని చెప్పింది నమిత. అయితే దర్శకుడు రవివర్మ (పరిచయం) కేవలం ఆమెతో యాక్షన్ సీన్లనే చేయించే ఉద్దేశంలో లేడు. "నమిత ఇటు యాక్షన్ సీన్లతో పాటు గ్లామర్‌నీ కురిపిస్తుంది' అని చెప్పాడు. అందాల ప్రదర్శన లేకపోతే నమితను ఎవరు చూస్తారనే సంగతి అతనికి తెలియంది కాదు కదా. 'శుక్ర'కి సంబంధించిన ఇంకో సంగతుంది. ఇందులో టీవీ నటి, యాంకర్ డింపుల్ సెకండ్ హీరోయిన్‌గా పరిచయం కానుండటం. ఆమె ఎవరో తెలుసు కదా. సరిగ్గా యేడాది క్రితం శ్రీధర్‌వర్మ అనే మరో టీవీ నటుడిపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. తనని పెళ్లి చేసుకోనన్నాడనే కోపంతో అతడిపై కొంతమందితో దాడి చేయించి తన మీద కూడా దాడి జరిగినట్లుగా ఆమె ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. అయితే పోలీసుల దర్యాప్తులో అది అందర్నీ తప్పుదోవ పట్టించడానికి ఆమె ఆడిన నాటకమని తేలడంతో డింపుల్‌ని హత్యాయత్నం నేరం కింద ఆమెని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఆ కేసునుంచి బయటపడినట్లే ఉంది. ఏమైనా ఆ సంఘటన తర్వాత ఆమె పాపులారిటీ పెరిగి, యాంకర్‌గా మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సినిమా అవకాశమే వచ్చింది. నెగటివ్ పబ్లిసిటీ కూడా ఆమెకి మేలు చేసినట్లే ఉంది.

Friday, July 29, 2011

న్యూస్: కమలాకర్ 'సంచలనం' సృష్టిసాడా?

మాజీ ఎమ్మెల్యే (దర్శి) బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారుడైన కమలాకర్‌రెడ్డి సినిమా రంగంలో ఎలాగైనా తన ముద్ర వేయాలనే పట్టుదలతో అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితమే 'అభి' అనే సినిమాతో హీరోగా తెరగేంట్రం చేసిన అతను ప్రేక్షకాదరణ పొందలేక పోయాడు. నిజానికి 'అభి' బాక్సాఫీసుని గెలవక పోయినా మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కారణం దానికి బాణీలు కూర్చింది దేవిశ్రీ ప్రసాద్!. అందులోని 'వంగతోట మలుపుకాడ..' పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. దాని తర్వాత కమలాకర్ 'సన్నీ', 'హాసిని' వంటి సినిమాలు చేశాడు. 'హాసిని'లో 'ప్రేమిస్తే' సంధ్య హీరోయిన్. అది కూడా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. అయినా కానా ఈ సినిమా డైరెక్టర్ బి.వి. రమణారెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంచిన కమలాకర్ ఇప్పుడు అతని డైరెక్షన్‌లోనే 'సంచలనం' చిత్రాన్ని నిర్మించాడు. కమలాకర్, సాయికుమార్, ఆశిశ్ విద్యార్థి ప్రధాన పాత్రధారులు. రెగ్యులర్ సాంగ్ అండ్ ఫైట్, రొమాన్స్‌లకు భిన్నంగా కాన్సెప్ట్ ఓరిఎంటెడ్ సినిమాగా దీన్ని రమణారెడ్డి రూపొందించాడు. ఓ అమాయక యువకుణ్ణి కొంతమంది ఎందుకు టార్గెట్ చేశారు, తనకెదురైన ప్రమాదం నుంచి అతను ఎలా తప్పించుకునాడనేది ఇందులోని ప్రధానాంశం. "ఇది యధార్థ సంఘటన ప్రేరణతో అల్లిన కల్పిత కథతో తయారైన సినిమా. ఎవర్నీ ఉద్దేసించి ఈ సినిమా తీయలేదు. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే అది కేవలం కాకతాళీయమే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని గ్రహించాల్సిందిగా కోరుతున్నా" అని కమలాకర్ చెప్పడాన్ని బట్టి ఇందులో పోలీస్ వ్యవస్థ మీదా, రాజకీయ వ్యవస్థ మీదా వివాదాస్పద అంశాలు ఇమిడి ఉన్నాయని అర్థమవుతోంది. అయితే 'సంచలనం' టైటిల్‌కి తగ్గట్లు బాక్సాఫీసు వద్ద అది చేసే సందడి పైనే అది సృష్టించే వివాద తీవ్రత కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రేక్షకాదరణ పొందలేక పోయిన కమలాకర్ నిజంగా 'సంచలనం' సృష్టిస్తాడా? ఈ రోజే ఈ సినిమా విడుదలైంది. ఇనిషియల్ టాక్ బావుంది. అది కలెక్షన్ల రూపంలో మారడమే కావలసింది.

Thursday, July 28, 2011

విశ్లేషణ: క్రేజీ సినిమాలొస్తున్నాయ్!

సినిమా ప్రియుల్ని రానున్న ఐదు నెలల కాలం కనువిందు చేయనున్నది. క్రేజీ హీరోల, డైరెక్టర్ల సినిమాలు కొన్ని రిలీజవుతుండటమే దీనికి కారణం. మొదట ఆగస్ట్ 5న రాం హీరోగా నటించిన 'కందిరీగ' విడుదలవుతోంది. దీంతో కలుపుకుంటే ఈ యేడాది ఆఖరులోగా సుమారు 15 క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ 'కందిరీగ'తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'మస్కా' తర్వాత రాం, హన్సిక మరోసారి జతకట్టగా, 'యువత' ఫేం అక్ష మరో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రధాన బలం. 'రెడీ' తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేని రాం 'కందిరీగ'తో హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.
నాగచైతన్య, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'దడ' సినిమా విడుదల కోసం చాలామందే వేచి చూస్తున్నారు. ఆగస్టు 12న రానున్న ఈ సినిమాతో అజయ్ భుయాన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అమెరికా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలోని ఫైట్స్‌ని ఇంటర్నేషనల్ మాస్టర్స్ కంపోజ్ చేయడం గమనార్హం. హీరోయిన్ కాజల్‌ని ఆపద నుంచి రక్షించే యువకునిగా నటించిన నాగచైతన్య ఈ సినిమాతో మాస్ ఇమేజ్‌ని ఆశిస్తున్నాడు.

ఇప్పటివరకు అనిశ్చితిలో ఉన్న మహేశ్ 'దూకుడు' విడుదల ఓ కొలిక్కి వచ్చినట్లు అగుపిస్తోంది. ఆగస్టు 26న ఈ సినిమా విడుదలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు కాకపోయినా సెప్టెంబర్ తొలి వారంలోనైనా 'దూకుడు' వస్తుందని ఆశించవచ్చు. 'ఖలేజా' తర్వాత మహేశ్ నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. సమంత నాయికగా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అంబరాన్నంటుతున్న అంచనాలున్న సినిమా ఇదే. 'పోకిరి' తర్వాత హిట్‌లేని మహేశ్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు.
సెప్టెంబర్‌లో రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవి బాబాయ్, అబ్బాయ్ సినిమాలు కావడం విశేషం. ఆ సినిమాలు బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం', ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'. 'శ్రీరామరాజ్యం'లో సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటిస్తుండగా, బాపు దర్శకత్వం వహిస్తున్నారు. అలనాటి అజరామర చిత్రం 'లవకుశ'కు ఇది రీమేక్. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనీ, తద్వారా పెద్ద విజయాన్ని సాధిస్తుందనీ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'ఊసరవెల్లి'పై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలున్నాయో విడమర్చి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కేరక్టరైజేషన్ హైలైట్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'కిక్' తర్వాత సురేందర్‌రెడ్డి సృజనాత్మక శక్తికీ, ఎన్టీఆర్ ఇమేజ్‌కీ ఓ పరీక్ష కానున్నది. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన 'అశోక్' హిట్ అనిపించుకోలేక పోయింది. ఆ అసంతృప్తిని 'ఊసరవెల్లి'తో పారదోలాలని ఆ ఇద్దరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర చినీ చిత్ర బేనర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. 'రాఖీ' తర్వాత ఎన్టీఆర్‌తో దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తున్న  ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ కావడం గమనార్హం.
ఇక అక్టోబర్‌లో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. అవి నాగార్జున 'రాజన్న', వెంకటేశ్ మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. 'రగడ' వంటి కమర్షియల్ హిట్, 'గగనం' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత నటిస్తున్న 'రాజన్న' నాగార్జున కెరీర్‌లో మరో కీలకమైన చిత్రం కానున్నది. 1940-50 నాటి నేపథ్యంలో రజాకార్ల దురాగతాల మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 'రాజన్న' అనే పోరాట యోధుని కల్పిత కథతో ఈ చిత్రాన్ని వి. విజయేంద్రప్రసాద్ రూపొందిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాల్ని ఆయన కుమారుడు, నేటి టాప్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్నాడు. నాగార్జునకి జోడీగా స్నేహ నటిస్తున్న ఈ సినిమాతో నాగార్జున కీర్తి నటునిగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంది.
'రాజన్న'కు పోటీగా వస్తున్న వెంకటేశ్ సినిమా 'గంగ - ద బాడీగార్డ్'. 'తులసి' తర్వాత సరైన హిట్టులేని వెంకటేశ్ కొంత పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు. 'డాన్ శీను' ఫేం గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ త్రిషకు బాడీగార్డ్‌గా కనిపించనున్నారు వెంకటేశ్. మలయాళ హిట్ ఫిల్మ్ 'బాడీగార్డ్'కి ఇది రీమేక్. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించ గలననే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది.
నవంబరులో మూడు సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. రాంచరణ్ 'రచ్చ' వాటిలో ఒకటి. 'ఏమైంది ఈవేళ' ఫేం సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాని రాంచరణ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు. 'మగధీర' తర్వాత చేసిన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ కావడమే దీనికి కారణం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. నవంబరులో రాని పక్షంలో డిసెంబరులోనైనా ఈ సినిమా రిలీజవుతుంది.
వేణు శ్రీరాంని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' నవంబరులోనే వస్తుందని అంటున్నారు. ఇందులో హీరో సిద్ధార్థ్ కాగా, హీరోయిన్లు శ్రుతి హాసన్, హన్సిక. 'అనగనగా ఓ ధీరుడు' నుంచి సిద్ధార్థ్, శ్రుతి హాసన్ మధ్య రొమాన్స్ జరుగుతున్నదనే ప్రచారం నేపథ్యంలో అందరి కళ్లూ ఈ సినిమా మీదున్నాయి. నిజానికి ఇందులో మొదట తననే తీసుకున్నారనీ, తర్వాత సిద్ధు పట్టుబట్టి తన ప్లేస్‌లో శ్రుతిని తీసుకునేలా చేశాడనీ నిత్య బహిర్గతం చేసిన సంగతి ప్రస్తావనార్హం.
చిరంజీవి కేంపు నుంచి వస్తున్న మరో హీరో సినిమా నవంబర్‌లోనే రిలీజవబోతోంది. అతను చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ కాగా ఆ సినిమా 'రేయ్'. స్వీయ నిర్మాణంలో బొమ్మరిల్లు పతాకంపై  వైవీఎస్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'దేవదాసు' తర్వాత తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అనడంతో ఈ సినిమాని చాలా శ్రద్ధపెట్టి తీస్తున్నాడు చౌదరి. ఇందులో ధరంతేజ్ సరసన శుభ్ర అయ్యప్ప నాయికగా పరిచయం కాబోతోంది.
ఇక డిసెంబర్‌లో మరిన్ని రసవత్తర చిత్రాలు ఒకదానితో మరొకటి ఢీకొననున్నాయి. లారెన్స్ డైరెక్షన్‌లో కృష్ణంరాజు, ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న 'రెబెల్', నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'ఢమరుకం', గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ తీస్తున్న 'మొగుడు' ఈ నెల్లో రానున్నాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'కాళీ' కూడా డిసెంబర్లో వచ్చే అవకాశాల్ని తోసిపుచ్చలేం.
ఇన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుండటంతో ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది, ఏది తిరస్కారానికి గురవుతుంది.. అన్నది ఆసక్తికర అంశం. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో తయారవుతున్న ఈ సినిమాలు విజయాన్ని సాధిస్తే తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతుంది. అయితే విడుదలైన క్రేజీ సినిమాలన్నీ విజయాన్ని సాధించిన దాఖలా ఇంతదాకా లేదు కాబట్టి ఈసారీ అది పునరావృతమవుతుందనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ బంతి ఉండేది ప్రేక్షకుడి కోర్టులోనే. చూద్దాం అతడు ఎటువంటి తీర్పునిస్తాడో...

సాహిత్యం: ఆధునిక సాహిత్యాన్ని ప్రభావితం చేసిన ఇద్దరు

ఆధునిక సాహిత్యాన్ని ఇద్దరు శాసించారు. ఒకరు కార్ల్ మార్క్స్, మరొకరు సిగ్మండ్ ఫ్రాయిడ్. మార్క్స్ సమాజంలోని వర్గ సంఘర్షణని సిద్ధాంతీకరించాడు. పెట్టుబడి వర్గాలైన ధనిక స్వామ్యానికీ, శ్రామిక వర్గాలైన కర్షక కార్మికులకూ మధ్య నిత్య సంఘర్షణ ఉంటుందని గతి తార్కిక చారిత్రక భౌతిక వాదాలతో నిరూపించాడు. ఈ భావజాలమే ప్రపంచ సాహిత్యంపైన ప్రభావం చూపించి అభ్యుదయ సాహిత్యానికి తగిన భూమికను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత భౌతిక విషయాలనే కాక మనిషి మానసిక, అంతర్గత విషయాలు కూడా ఆధునిక సాహిత్యంలోకి రావడానికి తగిన ప్రాణవాయువును అందించింది ఫ్రాయిడ్ చేసిన సైకో అనాలిసిస్ థీరీ. మనిషి ప్రవర్తన వ్యక్తిగత పరిస్థితిలో ఒక రకంగా, సాంఘిక పరిస్థితిలో మరో రకంగా ఉంటుందని చెప్పాడు ఫ్రాయిడ్. మనిషి భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు, అనుభూతులు, కోరికలు మెదడులో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూ, మరెన్నో అలోచనల్ని రేకెత్తిస్తుంటాయి. వాటిలో కొన్ని బహిర్గతమైతే, మరికొన్ని అలాగే మెదడు పొరల్లో సుప్తావస్థలో ఉండిపోతాయి. ఇలా సుప్తావస్థలో వుండిపోయిన అంశాలే నిద్రపోయేటప్పటి వ్యక్తావ్యక్త చైతన్యం (సబ్ కాన్షియస్) స్ఠితిలో అనేక ప్రతీకల రూపంలో కలలుగా వ్యక్తమవుతాయి. ఇదే కలల మెటమార్ఫసిస్ రహస్యం. దీన్ని అధ్యయనం చేసేదే సైకో అనాలిసిస్ థీరీ.

న్యూస్: 'నిప్పు'తో వైవీఎస్ చౌదరి చెలగాటం

'సొగసు చూడతరమా', 'రామాయణం', 'చూడాలని వుంది', 'మనోహరం', 'ఒక్కడు'... ఇవన్నీ ఒకే దర్శకుడు రూపొందించిన సినిమాలు. 'మృగరాజు', 'సైనికుడు', 'వరుడు'... ఇవి కూడా అదే దర్శకుడు తీసిన సినిమాలు. అతను గుణశేఖర్. తన కెరీర్‌లో అబ్బురమనిపించే చిత్రాలతో పాటు 'ఇంత ఘోరంగా తీశాడేంటి?' అనిపించే చిత్రాలూ తీసిన గుణశేఖర్‌పై ప్రధానంగా ఒక విమర్శ ఉంది. అది ఔట్‌డోర్‌లో తీయాల్సిన సన్నివేశాల్ని కూడా భారీ సెట్స్ వేసి తీస్తాడనీ, తద్వారా బడ్జెట్‌ని విపరీతంగా పెంచేస్తాడనీ. అందుకే 'బడ్జెట్ పెంచాలంటే గుణశేఖర్‌లా సెట్స్ వేస్తే సరి' అనే నానుడి టాలీవుడ్‌లో ఏర్పడింది. 'ఒక్కడు'లోని చార్మినార్ సెట్, 'అర్జున్'లోని మధుర మీనాక్షి దేవాలయ సెట్, 'సైనికుడు'లోని సముద్రం సెట్ వంటివి అందుకు ఉదాహరణలు. మునుపటి డిజాస్టర్ మూవీ 'వరుడు'లోనూ పెళ్లి మండపం సెట్‌ని అతి లావిష్‌గా ఏర్పాటు చేయించాడు. ఇలా నిర్మాతల పాలిట విలన్‌లాగా తయారైన ఆయన్ని తన 'ఇదీ నా కథ'లో ప్రఖ్యాత కవి, నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎమ్మెస్ రెడ్డి) తూర్పారబట్టిన సంగతి ఇటీవలే మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ప్రస్తుతానికి వస్తే అలాంటి గుణశేఖర్ డైరెక్షన్‌లో మరో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి 'నిప్పు' అనే సినిమాని నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో రవితేజ హీరో. దీక్షా సేథ్ హీరోయిన్. 'దేవదాసు' తర్వాత డైరెక్టర్‌గా మరో హిట్‌లేని చౌదరి ఇప్పుడు గుణశేఖర్‌తో ఎందుకు సినిమా నిర్మిస్తున్నాడో అర్థంకాక సినీ వర్గాల వారు తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో మద్రాసులో ఒకే చోట ఉన్నామనీ, ఆ స్నేహంతో ఈ సినిమా చేస్తున్నాననీ చౌదరి చెబుతున్నాడు. కానీ గుణశేఖర్ గురించి తెలిసి తెలిసీ ఎందుకు 'నిప్పుతో చెలగాటమాడుతున్నాడు? ఇది తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.

Wednesday, July 27, 2011

న్యూస్: ఆ ఇద్దరి కసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

తెలుగులో, ఆ మాటకొస్తే దేశంలోనే హీరోలందరిలో నెంబర్‌వన్ డాన్సర్ అతను. సినిమా సినిమాకీ స్టైల్ మార్చే 'స్టైలిష్ స్టార్' అతను. అయినా అతనికి ఇటీవలి కాలంలో ఆశించిన హిట్లు దక్కడం లేదు. అతను అల్లు అర్జున్. రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకంతో 40 కోట్ల రూపాయలు పైగా ఖర్చుపెట్టి అతని తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన 'బద్రినాథ్' సినిమా ఓపెనింగ్స్‌ని బాగానే రాబట్టినా చివరికి ఫ్లాప్‌గా లెక్కతేలింది. తన పరిచయ చిత్రం 'గంగోత్రి'కి కథనందించిన చిన్నికృష్ణ, 'బన్నీ' వంటి హిట్‌ని డైరెక్ట్ చేసిన వి.వి. వినాయక్ కాంబినేషన్ కూడా అర్జున్‌కి కలిసిరాలేదు. ఆఖరుకి మిల్కీ బ్యూటీ తమన్నా అందచందాల ప్రదర్శనా వర్కవుట్ కాలేదు. తొలిసారిగా టాలీవుడ్‌లో బద్రినాథ్ దేవాలయాన్ని నేపథ్యంగా తీసుకున్నా ప్రయోజనం కలిగించలేదు. సరైన కథా కథనాలు లోపిస్తే ఎన్ని హంగులున్నా నిష్ప్రయోజనమేనని 'బద్రినాథ్' ఉదంతం మరోసారి తేటతెల్లం చేసింది. ఇక బన్నీ ఆశలన్నీ త్రివిక్రం మీదే ఉన్నాయి. ఇప్పుడు బన్నీ నటించబోతోంది అతని దర్శకత్వంలోనే. యూనివర్సల్ మీడియా బేనర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 'హనీ' అనే టైటిల్‌ని ఆయన రిజిస్టర్ చేశారు. హీరోయిన్ ఎంపికే సస్పెన్స్‌గా మారింది. ఒకసారి కాజల్ పేరు, ఇంకోసారి ఇలియానా పేరు వినిపించగా, లేటెస్ట్‌గా సమంతా పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి ఇలియానా, సమంతా.. వీరిలో ఒకరు ఖాయమయ్యే అవకాశముంది. సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లబోతోంది. 'మహేశ్ ఖలేజా' వంటి ఫ్లాప్‌తో త్రివిక్రం, 'బద్రినాథ్' వంటి ఫ్లాప్‌తో బన్నీ ఇప్పుడు మంచి కసి మీదున్నారు. ఆ కసి సెన్సేషనల్ మూవీని క్రియేట్ చేస్తుందా?

న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?

వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?

గొప్ప వ్యక్తులు: తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై

మనదేశంలో తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై వ్యరవల్లా. 1913లో గుజరాత్‌లోని నవసారిలో జన్మించిన 97 యేళ్ల హోమై ఇప్పటికీ సజీవురాలే. ఆమె భర్త విఖ్యాత ఫొటోగ్రాఫర్ మానెక్‌షా. ఆయన ప్రోద్బలంతోటే హోమై ఫొటో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. చిత్రమేమంటే "నాకు ఫొటోగ్రఫీ తెలీదు. నిజంగా. నేనేమీ జోక్ చేయడం లేదు" అనంటుంది ఆమె. "నేను థిరీ చదువుకోలేదు. కెమెరాని ఎలా క్లిక్ చేయాలో, కేప్షన్స్ ఎలా రాయాలో, ఇంగ్లీషులో విషయాన్ని ఎలా వివరించాలో తెలుసు. 'థీరీ చదవడానికి నా టైంని వేస్ట్ చేసుకుంటే, నా ప్రాక్టికల్ పనికి ఆటంకం కలుగుతుంది' అని నాకు నేను చెప్పుకునేదాన్ని. థీరీ చదవడం వల్ల మనం చేస్తున్నది రైటా, రాంగా అనే మీమాంసలో పడి పనిని ఆలస్యం చేసేస్తాం" అని ఆమె చెబుతుంది. ఆమె వంట నేర్చుకునే తరహాలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలోనే కెమెరాని ఎలా వాడాలో నేర్చుకుందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
మొదట్లో ఆమె తీసిన ఫొటోగ్రాఫులు ఆమె భర్త మానెక్‌షా పేరిటే పబ్లిష్ అవుతూ వచ్చాయి. ఆమె ఎన్నో చారిత్రక సందర్భాల్ని తన కెమెరాతో బంధించింది. భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిన అర్థరాత్రి క్షణాల్నీ, భారతదేశ విభజనకి మన నాయకులు ఓటేసిన సంఘటననీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ రైడ్ ప్రికాషన్ (ఎ.ఆర్.పి.) శిక్షణలొ భారతీయ మహిళలు భాగమైన క్షణాల్నీ తన కెమరాతో బంధించింది హోమై. తనకి భారతీయ తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌గా గుర్తింపు దక్కడం ఆమెకేమీ గొప్పగా అనిపించదు. అదే ఆమెలోని గొప్పతనం. ద ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఈమె ఫొటోగ్రాఫులెన్నో మంచి పేరుపొందాయి. బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఉద్యోగినిగా పనిచేసిన ఆమె ఢిల్లీ ఈ మూల నుంచి ఆ మూలకి చక్కర్లు కొట్టేది. అప్పట్లో శాంతి భద్రతల పరిస్థితి బాగున్నందువల్లే రాత్రిళ్లు కూడా ఒంటరిగా ప్రయాణించ గలిగానని అప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటుంది హోమై.
భర్త మరణానంతరం 1973లో వడోదరకి మకాం మార్చిన ఆమె ప్రస్తుతం అక్కడే నివాసముంటోంది. 

న్యూస్: తమిళంలో అదరగొడ్తున్న తెలుగు కుర్రాడు

తెలుగులో ఆదరణ పొందలేకపోయిన ఓ తెలుగు కుర్రాడు తమిళంలో మంచి గుర్తింపుతో పాటు మంచి సినిమాల అవకాశాల్నీ పొందుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. అతను ఆది. అసలు పేరు సాయిప్రదీప్ పినిశెట్టి. 'పెదరాయుడు' డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు. 2006లో తేజ డైరెక్ట్ చేసిన 'ఒక విచిత్రం'తో హీరోగా పరిచయమైన ప్రదీప్ ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడంతో తెలుగులో మరో సినిమా అవకాశాన్ని పొందలేక పోయాడు. కానీ అతడి రూపం తమిళ దర్శకుడు సామిని ఆకట్టుకుంది. అంతే. 'మిరుగం' అనే సినిమా తీసేశాడు. విచ్చలవిడి ప్రవర్తనతో ఎయిడ్స్ రోగిగా అతడి నటన తమిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే దాన్ని హిట్ చేశారు. ఆ సినిమాతో ప్రదీప్ కాస్తా ఆదిగా మారాడు. ఆ సినిమా తెలుగులో 'మృగం'గా అనువాదమై ఇక్కడా సొమ్ము చేసుకుంది. 'మిరుగం' తర్వాత తమిళంలో ఒక్కో అవకాశం అతడి వళ్లో వచ్చి వాలుతోంది. అక్కడ ఇప్పటికి అతడివి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. రెండేళ్ల క్రితం ఎస్. శంకర్ నిర్మించిన 'ఈరం'తో మరో విజయాన్ని అందుకున్నాడు ఆది. ఆ సినిమాని ఇటీవలే దిల్ రాజు తెలుగులో 'వైశాలి' పేరుతో విడుదల చేసి సక్సెస్ సాధించిన సంగతి మనకి తెలుసు. దీంతో ఆది తమిళంలో నటించిన మిగతా సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. 2010 డిసెంబర్‌లో వచ్చిన 'అయ్యనార్' సినిమా 'వస్తాద్'గా, 2011 ఫిబ్రవరిలో విడుదలైన 'ఆదు పులి' సినిమా 'చెలగాటం' పేరుతో రాబోతున్నాయి. ఆది ప్రస్తుతం నటిస్తున్న తమిళ చిత్రం 'అరవాన్' అక్కడ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. 600 యేళ్ల క్రితం నాటి మదురై నేపథ్యంతో వసంతబాలన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సు. వెంకటేశన్ ప్రసిద్ధ నవల 'కావల్ కొట్టం' ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది కూడా తెలుగులో వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంటే ఏమిటి? మనవాళ్లు ఆదరించకపోయినా తమిళులు ఆదిని తమవాణ్ణి చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మనవాళ్లు అతడి వైపు చూస్తున్నారు. త్వరలోనే తెలుగులో అతడు తన రెండో సినిమా చేసే అవకాశాలున్నాయి.

Tuesday, July 26, 2011

న్యూస్: తాప్సీ ఆ సినిమా చేస్తుందా?

ఇలియానా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది భావించిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను నాలుగు సినిమాల తర్వాత కూడా అలాంటి క్రేజ్‌ని సృష్టించలేక పోయింది. తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'లో ఆమెని రాఘవేంద్రరావు చూపించిన తీరు చూసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ టాలీవుడ్ అంటూ తీర్మానించేసింది చిత్రసీమ. అయితే 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా ఆమె ఖాతాలో ఇంతదాకా మరో హిట్టు లేదు. ఆ సినిమాలోనూ ఆమెది సెకండ్ హీరోయిన్ రోలే. 'ఝుమ్మంది నాదం'తో పాటు 'వస్తాడు నా రాజు', 'వీర' ఫ్లాపయ్యాయి. ఇలియానా మాదిరిగా తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' వంటివి తాప్సీకి తగిలుంటే ఆమె కూడా ఈపాటికే యువతరం కలల రాణిగా ఆవిర్భవించి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న 'మొగుడు'లో గోపీచంద్ సరసన నటిస్తున్న ఆమె తాజాగా సునీల్ సరసన నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన 'తను వెడ్స్ మను'కి ఇది రీమేక్. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీప్రసాద్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో తాప్సీ నటించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ వినిపిస్తోంది. తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. నిజానికి తాప్సీ కంటే ముందు ఇద్దరు ముగ్గురు నేటి క్రేజీ హీరోయిన్లని నిర్మాతలు సంప్రదించారు కానీ వారు సునీల్‌తో చేయడానికి విముఖత చూపించారు. ఈ పరిస్థితుల్లో సునీల్ జోడీ తాప్సీనా లేక మరొకరు ఆ స్థానంలోకి వస్తారా?

న్యూస్: 'తెలుగమ్మాయి' వచ్చేదెప్పుడు?

ఆరేళ్ల క్రితమే టాలీవుడ్‌కు 'ధన 51' ద్వారా పరిచయమైనా ఈ మధ్యే వచ్చిన రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న' తోటే పాపులర్ అయిన తార సలోని. ఆ సినిమా తర్వాత అవకాశాలు పోటెత్తుతాయనీ, టాప్ హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తాయనీ ఊహించిన ఆమెకి నిరాశే ఎదురైంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు 'తెలుగమ్మాయి' అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో టైటిల్ పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది తెలుగు మాట్లాడ్డం రాని ఈ ఉత్తరాది అమ్మాయి. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు' చిత్రాల దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రాజకీయ నాయకుడు, ఒకప్పటి నిర్మాత చేగొండి హరిరామజోగయ్య నిర్మాణ సారథిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఓ అమ్మాయి, నలుగురు అబ్బాయిల మధ్య నడిచే కథతో తయారైంది. ఆ నలుగురు అబ్బాయిల్లో యశ్వంత్, విక్రం (ఎమ్మెస్ నారాయణ కొడుకు) ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి నెల రోజుల పైనే అయిన ఈ సినిమాని జూన్‌లోనే విడుదల చేయాలని మొదట నిర్మాతలు భావించారు. అయితే బిజినెస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా, ప్రోత్సాహమూ రాలేదు. చివరికి శాటిలైట్ హక్కుల కోసమూ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఈ నెల 24న ఆడియో ఫంక్షన్ని ఆర్భాటంగా జరిపి బయ్యర్లని ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. తద్వారా ఆగస్టు తొలి వారంలో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ల ఆశలు నెరవేరతాయా? బయ్యర్లు రాకపోతే సొంతంగా విడుదల చేయని పరిస్థితి ఏర్పడినట్లే. అందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారో, లేదో? ఈ సినిమాతోనన్నా మరికొన్ని ఛాన్సులు దక్కించుకోవాలని చూస్తున్న సలోని ఆశలు నెరవేరుతాయా?

న్యూస్: జగపతిబాబు 'క్షేత్రం' మీద నమ్మకాలున్నాయా?

ఏడాదికి 10 సినిమాల్లో నటిస్తానని ఆమధ్య జగపతిబాబు ప్రకటించారు. బానే ఉంది కానీ ఆ సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితేమిటని ఫిలింనగర్ వర్గాలు అడుగుతున్నాయి. దానికి బలమైన కారణమే ఉంది మరి. జగపతిబాబు ప్రత్యేక పాత్ర పోషించిన 'జై తెలంగాణ' మినహా ఆయన హీరోగా నటించిన ఏ సినిమా ఈమధ్య కాలంలో హిట్టయ్యింది? మొన్ననే విడుదలైన 'కీ' సినిమాకి మొదటి రోజే 10 శాతం కంటే ఎక్కువమంది జనం రాలేదు. ఆ తర్వాత ఆ జనం కూడా కనిపించడం లేదు. అంతకు ముందు ప్రేంరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', నట్టి కుమార్ నిర్మించి, అరుణ్‌ప్రసాద్ డైరెక్ట్ చేసిన 'చట్టం' ఫ్లాప్. వాటికంటే ముందొచ్చిన 'గాయం 2', 'సాధ్యం', 'మా నాన్న చిరంజీవి', 'బంగారు బాబు' ఫ్లాప్. మధ్యలో మదన్ డైరెక్ట్ చేసిన 'ప్రవరాఖ్యుడు' అతని ప్రతిభతో ఫర్వాలేదనిపించుకుంది. ఇలా చేసిన ప్రతి సినిమా నిర్మాత కళ్ల ముందు చుక్కలు చూపిస్తుంటే జగపతిబాబుతో సినిమాలు తియ్యడానికి ఏ నిర్మాతకైనా అవసరానికి మించి ధైర్యం కావాలి. ప్రస్తుతం అలాంటి ధైర్యం చూపిస్తున్నారు 'క్షేత్రం' నిర్మాత. అవును. ఇప్పుడాయన 'క్షేత్రం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రియమణి!. ఆ ఇద్దరూ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రం. పొడవాటి మీసాలతో జగపతిబాబు ఇందులో విచిత్రంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా హిట్టవుతుందనే ఆశలు నిర్మాత, దర్శకుడికి తప్ప ఇంకెవరికైనా ఉన్నాయంటారా?

Monday, July 25, 2011

న్యూస్: మనోజ్ కెరీర్‌కి ప్రేక్షకులు ఊ కొడతారా?

ఇప్పటివరకు హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించిన మంచు మనోజ్ కెరీర్‌లో ఎన్ని హిట్లున్నాయి? సరిగ్గా చెప్పాలంటే ఒక్కటే. అది 'బిందాస్'. 2010 మొదట్లో వీరు పోట్ల తొలిసారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజానికి మరింత హిట్టవ్వాల్సింది కానీ నాలుగు వారాల తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద అప్పటికే మంచి వసూళ్లను అది రాబట్టింది. క్రిష్ డైరెక్షన్‌లో నటించిన 'వేదం' అందరి ప్రశంసలూ పొందింది కానీ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అందులో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ నటనని విమర్శకులు మెచ్చారు. మొదట్లోనే డైలాగ్ డిక్షన్‌లో స్పష్టత సాధించిన మనోజ్ హావభావాల్లోనూ పరిణతి కనపర్చాడు. హీరోగా తొలి సినిమా 'దొంగ దొంగది'లోనే తన నటనతో అతను ఆకట్టుకున్నాడు. మరైతే అతనికి ఎందుకు హిట్లు దక్కడం లేదు? ఎంచుకుంటున్న సబ్జెక్టులే అందుకు కారణం. ఆఖరుకి కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప సీనియర్ డైరెక్టర్ కూడా పాత చింతకాయ సబ్జెక్టుతోటే 'ఝుమ్మంది నాదం' తీయడంతో పాటలు తప్ప మరేమీ ఆకట్టుకోక ఆ సినిమా ఫ్లాపయ్యింది. ఈ నేపథ్యంలో మనోజ్ రెండు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', రెండు 'మిస్టర్ నోకియా'. మొదటి సినిమాని శేఖర్ రాజా అనే కొత్త దర్శకుడు తీస్తుంటే, రెండే సినిమాని 'అసాధ్యుడు' (కల్యాణ్‌రాం హీరో), 'జంక్షన్' (పరుచూరి రవిబాబు హీరో) వంటి సూపర్ డిజాస్టర్లను రూపొందించిన అనిల్‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిల్‌కృష్ణ ఈ సినిమాకి తన పేరుని 'అని' అంటూ మార్చుకున్నాడు. ఫెయిల్యూర్లు వచ్చిన వాళ్లెందుకు పేరు మార్చుకుంటారో తెలిసిందే కదా. ఈ సినిమాలతో అయినా కమర్షియల్ హీరోగా మనోజ్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకో గలుగుతాడా?

Sunday, July 24, 2011

న్యూస్: సదా ఆఖరి ప్రయత్నం!

అందచందాలకు, అభినయ సామర్థ్యానికీ ఏమాత్రం కొదవలేని సదా తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని చాలామంది తలచారు. కానీ చిత్రంగా ఆమె క్రమేపీ వెనుకంజ వేస్తూ వచ్చి, ఇవాళ తన ఇమేజ్‌ని టాలీవుడ్‌లో పూర్తిగా కోల్పోయింది. అయితే 'జయం' సదాగా ఇప్పటికీ జనం హృదయాల్లో ఆమె నిలిచే ఉంది. తేజ డైరెక్షన్‌లో వచ్చిన ఆ తొలి సినిమా తెచ్చిన అమోఘమైన ఇమేజ్‌ని సద్వినియోగం చేసుకోవడంలో ఆమె విఫలమైంది. ఆ సినిమాలో 'వెళ్లవయ్యా వెళ్లూ' అనే మేనరిజం, 'జయం' లంగా ఓణీ డ్రస్సులు ఎంత పాపులరో! అంతటి పేరుని ఆమె పోగొట్టుకోవడానికి కారణం, ఆ తర్వాత కాలంలో సినిమాల ఎంపికలో ఆమె చేసిన పొరబాట్లని విశ్లేషకుల అభిప్రాయం. 'దొంగ దొంగది', 'లీలామహల్ సెంటర్' ఫర్వాలేదనిపించినా మిగతావేవీ బాక్సాఫీసుని గెలవలేక పోయాయి. దాంతో ఆమె ఉంటే ఆ సినిమా ఫ్లాపే అనే ముద్రపడింది. మరోవైపు మిగతా భాషల్లోనూ ఆమె నటిస్తూ వచ్చింది. బాలీవుడ్‌లో 'లవ్ ఖిచిడి', 'క్లిక్' సినిమాలు చేసి, పరాజయాలు మూటగట్టుకుంది. కన్నడంలో కాస్త బెటర్ పొజిషన్‌లో ఉన్న ఆమె టాలీవుడ్‌లో 'అ ఆ ఇ ఈ'తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ప్రయత్నించి ఫెయిలైంది. ఇప్పుడు ఆఖరి యత్నంగా శివాజీతో ఓ హారర్ సినిమా చేస్తోంది. ఏప్రిల్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇలాంటి హారర్‌లో నటించడం తనకిదే తొలిసారనీ, తప్పకుండా ఈ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందుతాననీ నమ్మకం వ్యక్తం చేస్తోంది ఈ అందగత్తె. ఆమె నమ్మకం నిజమై, తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందా?

సాహిత్యం: వ్యాసం పుట్టుక ఎప్పుడు?

19వ శతాబ్దం చివరి వరకూ వ్యాసానికి తెలుగులో ఓ రూపం రాలేదు. పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల వ్యాసం ఎలాగైతే భారతీయ భాషల్లో వచ్చిందో, అలాగే తెలుగులోనూ ప్రవేశించింది. అదీ 19వ శతబ్దం పూర్వార్థం అనవచ్చు.
మనకు తెలిసినంతవరకూ 1840-1850లలో సామినేని ముద్దు నరసింహం నాయని రాసిన 'హితసూచని' వ్యాసాల సంపుటమే మొదటిది. అయితే ఇది 1862లో అచ్చయింది. ఇందులో వ్యాసాల్ని 'ప్రమేయాలు' అన్నాడు రచయిత. ఇక పరవస్తు వెంకట రంగాచార్యులు (1822-1900) తమ వ్యాసాల్ని 'సంగ్రహం' అనంటే, కందుకూరి వీరేశలింగం (1848-1919) 'ఉపన్యాసము'లన్నాడు. 1852లో బ్రౌను తన నిఘంటువులో 'వ్యాసము రాసేవాడు గ్రంథకర్త' అన్నాడు. అంటే అప్పటికే వ్యాసం అన్న పేరు లోకానికి పరిచితమైందన్న మాట.
వీరేశలింగం పూర్వులూ, సమకాలికులూ ఈ వ్యాసాన్ని పరిపుష్టం చేశారు. దీన్ని నాటి పత్రికలు - ప్రధానంగా అముద్రిత గ్రంథ చింతామణి, గ్రంథాలయ సర్వస్వము, తెలుగు - ఇంకా నాటి పండితులు నడిపించిన పత్రికలూ పెంచి పోషించాయి. సాధారణంగా వ్యాసం సారస్వత విషయాల్నే వస్తువుగా కలిగి ఉండేది ఆనాడు.
వ్యాసం చిన్న రచన. సుదీర్ఘమైందీ, జటిలమైందీ, దుర్భేద్యమైందీ కాకూడదు. వ్యాసం గొప్పతనం శైలిమీద ఆధారపడి ఉంటుంది.

Saturday, July 23, 2011

న్యూస్: 'ది బిజినెస్ మ్యాన్'కి రంగం సిద్ధం

రెండో బాలీవుడ్ సినిమా 'బుడ్డా.. హో గయా తేరా బాప్' (తొలి సినిమా 'బద్రి'కి రీమేక్ అయిన 'షర్త్') తర్వాత మహేశ్‌తో రెండో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ కాంబినేషన్‌లో తొలిగా వచ్చిన 'పోకిరి' బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు సినిమా 40 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్ మూవీ 'మగధీర' ఏకంగా దానికి రెట్టింపు వసూళ్లను సాధించి యావద్భారతీయ చిత్రసీమనే అబ్బురపరిచిన సంగతి మనకు తెలుసు. ప్రస్తుతానికి వస్తే మహేశ్‌తో జగన్ తీయబోతున్న 'ది బిజినెస్‌మ్యాన్' బిజినెస్ వర్గాల్లో హాట్ ప్రాజెక్ట్‌గా మారింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ద గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్' అనే ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తున్నారు. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా మహేశ్‌తో జతకట్టబోతోంది. నిజానికి మొదట ఆ పాత్రకి ఇలియానా, శ్రుతిహాసన్ పేర్లు వినిపించినా, చివరకి కాజల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. తమన్ మ్యూజిక్ అందించే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలు కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దీనితో పాటు రవితేజతో 'ఇడియట్ 2'ని కూడా తీయబోతున్నాడు జగన్.

Friday, July 22, 2011

న్యూస్: 'అమాయకుడు' బాక్సాఫీసు వద్ద నిలుస్తాడా?

హీరోగా కృష్ణుడు కెరీర్ పరీక్షకు నిలుస్తున్న తరుణమిది. 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో స్థూలకాయుడైన తొలి తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్న అతను ఆ తర్వాత ఆ మ్యాజిక్‌ని కొనసాగించలేక పోయాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి' సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యాయి. ఇప్పుడు మూడు వారాల గ్యాప్‌లో అతని సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొదటగా ఈ నెల (జూలై) 22న 'అమాయకుడు' విడుదల కాగా,  ఆగస్టు 11న 'నాకూ ఓ లవరుంది' విడుదలవుతోంది. 'అమాయకుడు' సినిమా రెండేళ్ల క్రితమే మొదలైనా ఇప్పటికి వచ్చింది. తమిళుడైన భారతీగణేశ్ దీని దర్శకుడు. ముగ్గురమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా ఈ సినిమాలో కృష్ణుడు నటించాడు. ఆ ముగ్గురిలో తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడనేది కథాంశం. ఇక 'నాకూ ఓ లవరుంది' విషయానికొస్తే ఇందులో బ్రాహ్మణ పురోహితునిగా నటించాడు. ఈ సినిమా ద్వారా రాం వెంకీ దర్శకునిగా, రితిక హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాల బాక్సాఫీసు ఫలితం అతని కెరీర్‌ని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. మునుపటి సినిమాలు ఫ్లాపవడం అతని సినిమాల బిజినెస్‌పై ప్రభావాన్ని చూపుతోంది. ఈ పరిస్థితిలో వీటిలో ఒకటైనా హిట్టవడం కృష్ణుడికి అవసరం.

న్యూస్: ఛార్మి 'మంత్రం' పారడం లేదు!

లేడీ ఓరియంటెడ్ మూవీ 'మంత్ర' తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాని ప్రేక్షకులు ఆదరించారు? ప్చ్.. ఏమీ లాభం లేదు. 'మంత్ర' (2007) తర్వాత ఛార్మి వైభవం మసకబారుతూ వచ్చింది. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో 'సుందరకాండ', వి. ఈశ్వరరెడ్ది దర్శకత్వంలో 'మనోరమ', కొత్తవాడైన రమణ దర్శకత్వంలో 'సై ఆట', 'మంత్ర' ఫేం తులసీరాం దర్శకత్వంలో 'మంగళ', ప్రేంరాజ్ డైరెక్ట్ చేసిన 'నగరం నిద్రపోతున్న వేళ' వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ సక్సెస్‌ని అందించలేదు. కొద్ది రోజుల తేడాతో ఇటీవల వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', 'మాయగాడు' సినిమాలు రెండూ ప్రేక్షకుల నుంచి కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో అమితాబ్‌తో కలిసి నటించిన హిందీ సినిమా 'బుడ్డా.. హోగా తేరా బాప్' ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యిందంటూ మీడియా మొదట్లో తెగ హడావుడి చేసినా, వారాంతం తర్వాత చూసుకుంటే కలెక్షన్లు బాగా డౌనయ్యాయి. ఏదేమైనా దానికి పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఛార్మి శ్రీకాంత్ సరసన 'సేవకుడు' చిత్రంలో నటిస్తోంది. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునేవాళ్లు కరువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

న్యూస్: సుమంత్ దగ్గరవుతాడా? దూరమవుతాడా?

ఎన్ని సినిమాలు చేస్తున్నా అంగుళం కూడా ఇమేజ్ పెరగని హీరోల్లో సుమంత్ ఒకరు. 1999లో రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో 'ప్రేమకథ'లో నటించడం ద్వారా మంచి ఆరంభమే పొందిన ఈ అక్కినేని క్యాంప్ హీరో యువకుడు, సత్యం, గౌరి, మహానంది, గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కొండ హైస్కూల్ వంటి చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. కానీ అదేం విచిత్రమో ప్రస్తుతం ఆయన సినిమాలకి బిజినెస్సే ఉండటం లేదు. సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మించిన 'బోణి' అతి ఘోరంగా ఫ్లాపయ్యాక ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు సుమంత్. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన చేసిన 'గోల్కొండ హైస్కూల్' సినిమాకి విమర్శకుల నుంచి మంచి చిత్రంగా ప్రశంసలు లభించాయి కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇక వి.ఆన్. ఆదిత్య డైరెక్షన్‌లో చివరగా వచ్చిన 'రాజ్' సినిమా ఎంతటి డిజాస్టరో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ట్రేడ్ వర్గాల్లో సుమంత్ అంటే భయం మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం ఆయన 'దగ్గరగా.. దూరంగా..' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక, సింధు తులానీ హీరోయినులుగా నటిస్తున్న ఈ సినిమాకి రవికుమార్ చావలి దర్శకుడు. ఈయన రక రకాల స్క్రీన్ నేమ్స్‌తో కనిపిస్తూ వచ్చాడు. మొదట రవి చావలి పేరుతో, తర్వాత రవి సి. కుమార్ పేరుతో సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు మళ్లీ పూర్తి పేరుని వాడుతున్నాడు. సుధ సినిమా బేనర్‌పై జె. సాంబశివరావు అనే కొత్త నిర్మాత తీస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ని గోల్కొండ హైస్కూల్ కంటే ముందే ఓకే చేశాననీ, ఇది తప్పకుండా హిట్టవుతుందనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు సుమంత్. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సినిమాతోనైనా సుమంత్ కెరీర్‌కి ఊపు వస్తుందో, లేదో?

Thursday, July 21, 2011

న్యూస్: మహేశ్‌లో 'దూకుడు' ఏదీ?

టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరు టాప్ హీరోల్లో ఒకడైన మహేశ్ 'దూకుడు' ఎప్పుడు విడుదలవుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. టైటిల్ చూస్తేనేమో 'దూకుడు'. కానీ ఆ సినిమా షూటింగ్ కానీ, మహేశ్ కెరీర్ కానీ దూకుడు మీద కనిపించడం లేదు. ఏడాది క్రితమే అంటే 2010 జూన్‌లోనే 'దూకుడు' లాంఛనంగా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్‌ని 2010 సెప్టెంబర్ నుంచి జరుపుతున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్‌లో 'ఢీ' తర్వాత అంత టైం తీసుకుంటున్న సినిమా ఇదే. నిజానికి 'ఢీ' ప్రొడక్షన్ ఆలస్యం కావడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం. 'దూకుడు'కు ఆ ఇబ్బందులేమీ లేవు. 16 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై తయారవుతున్న ఈ సినిమా నిర్మాణం దూకుడుగా సాగక పోవడానికి మహేశే కారణమంటున్నారు. ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తున్న మహేశ్ వాటి షూటింగులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని ఇటీవలి కాలంలో విమర్శలు వస్తున్నాయి. వాటిపై వచ్చే ఆదాయం అధికంగా ఉండటం వల్లే ఆయా బ్రాండ్ల మోడల్‌గా పని చేయడానికి అతణ్ణి పురిగొలుపుతున్నదని తెలుస్తోంది. ఇవాళ టాలీవుడ్‌లో నెంబర్‌వన్ బ్రాండ్ అంబాసిడర్ కూడా అతనే. దీంతో 'దూకుడు' నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. స్పీడుగా షూటింగ్ జరుపుతాడని పేరున్న శ్రీను వైట్ల కూడా దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ సమంతా నటిస్తోంది. వేసవికే రావాల్సిన ఈ సినిమాని మహేశ్ పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్భంగా ఆ వారంలో అంటే ఆగస్టు 11న విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఆగస్టు నెలాఖరున వస్తుందని చెప్పారు. అప్పటికైనా 'దూకుడు' రిలీజవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి సినిమా 75 శాతమే అయ్యిందనీ, సినిమా పూర్తవడానికి కనీసం ఇంకో నెలన్నా పడుతుందనీ వినిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఆగస్టులో ఈ సినిమా విడుదలయ్యేట్లు కనిపించడం లేదు. అందువల్ల ఈ సినిమాకి 'దూకుడు' అని కాకుండా 'నెమ్మది' అని పెడితే బాగుంటుందని ఫిలింనగర్ వర్గాలు హాస్యమాడుతున్నాయి.

న్యూస్: 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఎందాకా వచ్చింది?

డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'డాలర్ డ్రీమ్స్‌తోటే ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల కొంత కాలంగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నాడు. తనకి ఎంతో పేరు తీసుకు రావడంతో పాటు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్టయిన 'హ్యాపీడేస్' తరహాలోనే ఈ సినిమా ద్వారా కొత్తవాళ్లని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే టేలంట్ హంట్ ద్వారా వచ్చిన వారిలోంచి కొంతమందిని ఎంపిక చేసి, వారికి ఆడిషన్ నిర్వహిస్తున్నారు. 'హ్యాపీడేస్'లో నలుగురబ్బాయిలు, నలుగురమ్మాయిలు ప్రధాన పాత్రధారులు కాగా, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కాలేజీ అనంతర జీవితాన్ని స్పృశించే కథతో ఈ సినిమాని తీయబోతున్నాడు శేఖర్. ఈమధ్యే ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ఇండియన్ పెవిలియన్‌లో పాల్గొని, ఆ ఘనత పొందిన ఏకైక తెలుగు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చాలా దీక్షతో ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. కారణం, తానెంతో ఆశలు పెట్టుకున్న 'లీడర్' సినిమా ఆశించిన రీతిలో విజయాన్ని సాధించక పోవడం. 'హ్యాపీడేస్' శతదినోత్సవ సభలో తన సినిమా ఫెయిలైతే అప్పట్నించీ సినిమాలు తియ్యడం ఆపేస్తానని ఆయన ప్రకటించాడు. అది అతి విశ్వాసంతోనో, అహంకారంతోనో చెప్పిన మాటలు కావు. తన మీదా, తన సామర్థ్యం మీదా ఉన్న నమ్మకంతో చెప్పినవి. అందుకే చాలామందికి మల్లే హడావుడిగా ఏదో ఒకటి తీయడం ఆయనకు తెలీదు. తెలిసిందల్లా తను నమ్మిన దాన్ని నిబద్ధతతో తీయడం. ఈ సంగతి ఆయన్ని ఎరిగిన వాళ్లకి బాగా తెలుసు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ప్రాజెక్టుకి ఆయన తీసుకుంటున్న సమయం ఎక్కువైనా, అంతిమంగా ఆ సినిమాతో ఆయన మరోసారి వార్తల్లో నిలవడం ఖాయం.

న్యూస్: హీరో అవుతున్న మరో బాల నటుడు

'ఛత్రపతి'లో చిన్నప్పటి ప్రభాస్, 'అతడు'లో చిన్నప్పటి మహేశ్, 'లక్ష్మీ'లో చిన్నప్పటి వెంకటేశ్ జ్ఞాపకమున్నారా? ఆ ముగ్గురూ ఒక్కరే. అతను మనోజ్ నందం. నిన్నటి దాకా మాస్టర్ మనోజ్ అనిపించుకున్న అతను ఇప్పుడు మనోజ్ నందం పేరుతో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అతను హీరోగా పరిచయం కాబోతున్న సినిమా పేరు 'తొలిసారిగ...'. ఇటీవలే ఈ సినిమా పాటలు మార్కెట్లోకి వచ్చాయి. ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతోంది.
"తొమ్మిదేళ్ల క్రితం 'నువ్వు లేక నేను లేను' సినిమాలో హీరో తరుణ్ తమ్ముడిగా నటించడం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన నేను బాల నటుడిగా 27 సినిమాలు చేశా. చివరగా టీనేజ్ వయసులో '18, 20 లవ్ స్టోరీ'లో నటించి, ఇప్పుడు 'తొలిసారిగ...'తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నా" అని అతను తెలిపాడు. పవన్‌కల్యాణ్, వెంకటేశ్ సినిమాల్ని బాగా ఇష్టపడుతూ తాను కూడా వారిలా హీరో అవ్వాలనే కలతో ఈ రంగంలోకి వచ్చిన మనోజ్ కాస్త పెద్దవాడయ్యాక కమలహాసన్ నటనతో స్ఫూర్తిపొందాడు. ఆయన చేసే దాంట్లో సగమైనా చేయగలిగే స్థాయికి చేరుకోవాలనేది ఇప్పుడతని ఆశయం. ఇటు క్లాసికల్, అటు వెస్టర్న్ డాన్సులు రెండూ నేర్చుకున్న అతను కరాటేలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. ప్రస్తుతం యాదగిరిగుట్టలోని మాట్రిక్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 19 యేళ్ల మనోజ్ 'తొలిసారిగ...'తో హీరోగా ప్రేక్షకుల ఆదరణని పొందుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

Wednesday, July 20, 2011

విశ్లేషణ: మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సూపర్‌హిట్టే!

ఏ కథకైనా నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) ముఖ్యం. మంచి కథకు మంచి నేపథ్యం తోడైతే సినిమా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా హైలైట్ చేస్తూ తెలుగులో తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సందర్భాలు అనేకం. గతంలో కాశ్మీర్, అమెరికా, సింగపూర్ తదితర ప్రాంతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకోవాలంటే చిన్న సినిమా అయినా గోదావరి నేపథ్యంలో వంశీ రూపొందించిన 'గోపి గోపిక గోదావరి' పెద్ద మ్యూజికల్ హిట్టయ్యింది. గోపిక అనే లేడీ డాక్టర్ పేదలకు సేవ చేసే ఉద్దేశంతో గోదావరి గ్రామాల్లో పనిచేసే ఓ బోటు హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైన గోపి అనే ఆర్కెస్ట్రా సింగర్‌ని ప్రేమిస్తుంది. అయితే ఓ యాక్సిడెంట్లో గోపి చనిపోయాడని విని హతాశురాలవుతుంది. చిత్రమేమంటే తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయిన గోపి ఆమె వల్లే కోలుకుని ప్రభుగా చలామణి అవుతాడు. చివరకు ఆ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారన్నది కథ. చక్రి సంగీతం సమకూర్చగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే' పాట ఏ నోట విన్నా వినిపించింది. చక్రి సంగీత మాయాజాలంతో పాటు గోదావరి తీరంలో వంశీ తీసిన సన్నివేశాలన్నీ జనాన్ని ఆకట్టుకోవడంతో 'గో గో గో' చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది.
దాని తర్వాత వచ్చిన పెద్ద సినిమా 'మగధీర' ఏ స్థాయి విజయాన్ని పొందిందో మనకు తెలుసు. అంతకు ముందు బాక్సాఫీస్ పరంగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్న 'పోకిరి'ని వెనక్కినెట్టి ఏకంగా దానికి దాదాపు రెట్టింపు వసూళ్లతో అదరగొట్టింది. అలాంటి 'మగధీర'లోనూ ఓ ప్రాంతపు నేపథ్యం ఉంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఉదయగఢ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజం నేపథ్యంలో వచ్చే అన్ని సన్నివేశాలూ (ముఖ్యంగా రాంచరణ్-కాజల్, రాంచరణ్-దేవ్‌గిల్, రాంచరణ్-శ్రీహరి సన్నివేశాలు) ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉదయఘడ్‌ని రక్షించే కాలభైరవ పాత్రలో రాంచరణ్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. ఉదయఘడ్‌ని కళా దర్శకుడు ఆనంద్‌సాయి తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. రానున్న అరిష్టాన్ని పోగొట్టడానికి రాజకుమారి చేసే కాలభైరవ పూజా సన్నివేశాల చిత్రీకరణ, అక్కడ విలన్లతో హీరో కాలభైరవ పోరాడే తీరు అద్భుతమనిపించాయి.
అంతకుముందు గంగోత్రి, హరిద్వార్ నేపథ్యంలో వచ్చిన అల్లు అర్జున్ తొలి చిత్రం 'గంగోత్రి', చార్మినార్ నేపథ్యంలో వచ్చిన మహేశ్ 'ఒక్కడు', వరంగల్ నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ 'వర్షం', కలకత్తా నేపథ్యంలో వచ్చిన చిరంజీవి 'చూడాలని ఉంది', రాయలసీమ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వీటిలాగే ఘన విజయం పొందిన మరో సినిమా 'సింహాద్రి'. జూనియర్ ఎన్‌టీఆర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు రాయలసీమతో పాటు కేరళను నేపథ్యంగా ఎంచుకున్నారు. 'ఇంద్ర'లో కాశీ, 'సింహాద్రి'లో కేరళ నేపథ్యాలు వాటి భారీ విజయాల్లో తమవైన పాత్ర పోషించాయి. 'వర్షం' సినిమా ప్రభాస్‌కు స్టార్‌డంను తీసుకొచ్చిందనేది వాస్తవం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథకు నేపథ్యం వరంగల్. హీరో హీరోయిన్ల రొమాన్స్‌కు సాక్షీభూతంగా వరంగల్ నిలుస్తుంది. అంతదాకా వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణాన్ని ఎవరూ చూపించని రీతిలో ఈ సినిమాలో అందంగా చూపించారు.
అయితే కేవలం ఓ ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ సినిమా తీసేస్తే కచ్చితంగా హిట్టు దక్కుతుందా? అనే ప్రశ్నకు 'కాదు' అనే జవాబే వస్తుంది. కథకు అనుగుణమైన నేపథ్యం, వాస్తవికంగా ఉండే చిత్రీకరణ మాత్రమే సినిమాను అందంగా తీర్చిదిద్దగలుగుతాయి. లేదంటే కోరి అపజయం తెచ్చుకున్నట్టే. ఉదాహరణకు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'బద్రినాథ్'ను తీసుకోండి. ఈ సినిమా కథకు నేపథ్యంగా హిమాలయాల్లోని తక్షశిలనీ, అక్కడి బద్రీనాథ్ దేవాలయాన్నీ ఎంచుకున్నారు. అయితే కథలో లోపాలు, గురు (ప్రకాష్‌రాజ్), శిష్య (అల్లు అర్జున్) అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి సినిమాలకి అత్యవసరమైన ఎమోషన్‌ని క్యారీ చేయకపోవడం, దర్శకత్వ లోపాలు ఈ సినిమాకి ఆశించిన రీతిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే బద్రీనాథ్ దేవాలయం సెట్లో తీసిన సన్నివేశాలు బాగుండటం గమనార్హం.
అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన 'తీన్‌మార్' సినిమా కొంతవరకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ హీరో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా వచ్చినప్పటికీ తెలుగు నేటివిటీని మిస్సవడం, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్సులయ్యాయి. ఇక మహా శక్తిపీఠాల నేపథ్యంతో పాటు రాజస్థాన్, కాశ్మీర్ నేపథ్యంలో వచ్చిన ఎన్‌టీఆర్ సినిమా 'శక్తి' అసహజమైన సన్నివేశాల కారణంగా ఘోర పరాజయం పాలైంది. ఇష్టమొచ్చినట్లు భారీగా ఖర్చుపెట్టేసి, 'మగధీర'ని మించిన సినిమా తీయాలనుకునే యత్నంలో నేల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం మరోసారి స్పష్టం చేసింది. దీన్నిబట్టి మంచి కథకు మంచి నేపథ్యం అనేది మరింత శోభను చేకూర్చిపెడుతుందనే సంగతితో పాటు కథలో దమ్ము లేకపోతే మంచి నేపథ్యం కూడా వృథా అవుతుందనే విషయం అర్థమవుతుంది.
తాజాగా కొన్ని సినిమాలు అమెరికా, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశీ నేపథ్యాలతో తయారవుతున్నాయి. ఓవర్సీస్‌లోని తెలుగువాళ్లని కూడా మెప్పించే ఉద్దేశంతో ఇప్పుడు ఈ తరహా నేపథ్యాలు తెలుగు సినిమాల్లో ఎక్కువవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సత్తా వీటికి ఉంటుందా?

న్యూస్: శత దినోత్సవ హీరో!

చిన్న హీరోల్లో మినిమం గ్యారంటీ హీరో ఎవరు? నిస్సందేహంగా నరేశ్. అదే 'అల్లరి' నరేశ్! రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఏకైక హీరో. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' సినిమాలతో సునీల్ కూడా కామెడీ హీరోగా సక్సెస్సయినా అతను నరేశ్ లాగా పూర్తి స్థాయి హీరో ఇంకా కాలేదు. కమెడియన్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. నరేశ్ ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్నా వాటి సంఖ్య చాలా తక్కువ. ప్రధానంగా అతణ్ణే ఆధారం చేసుకుని ప్రొడ్యూస్ అవుతున్న సినిమాలే ఎక్కువ. అతడి చివరి ఆరు సినిమాల్లో ఫ్లాపయిన ఒకే సినిమా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శుభప్రదం'. వంశీ తీసిన 'సరదాగా కాసేపు' యావరేజ్ అయితే మిగతా నాలుగు.. 'బెట్టింగ్ బంగార్రాజు', 'కత్తి కాంతారావు', 'అహ నా పెళ్లంట', 'సీమటపాకాయ్' అందరికీ లాభాలు తీసుకొచ్చాయి. 'అహ నా పెళ్లంట' ఇటీవలే శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పటి రోజుల్లో అర్థ శతదినోత్సవమే గొప్పనుకుంటే శత దినోత్సవం జరుపుకోవడం నిజంగా విశేషమే. త్వరలో 'సీమటపాకాయ్' కూడా ఆ బాటలోనే 100 రోజులు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం నవ్వించడమే కాదు, ఏడిపించగలనని కూడా 'గమ్యం'తో అతను నిరూపించుకున్నాడు. ఇక త్వరలో అతను ఓ ఇంటరెస్టింగ్ సినిమా చేయబోతున్నాడు. గ్లామరస్ హీరోయిన్ శ్రియ అతనితో జోడీ కట్టబోతోంది. నారాయణ అనే కొత్త డైరెక్టర్ రూపొందించే ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణించడంతో నరేశ్ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటాడనే సందేహాలు పొడచూపుతున్న సమయంలో అతడికి వస్తున్న సినిమాలు ఆ అనుమానాల్ని పారదోలుతున్నాయి. ఇక నరేశ్ చేయాల్సిందల్లా క్రమశిక్షణతో మెలగడమే.

Tuesday, July 19, 2011

న్యూస్: బాలీవుడ్‌లో కాజల్ జిగేల్‌మంటుందా?

తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ముంబై భామ కాజల్ అగర్వాల్ తన మాతృభూమిలో అలాంటి మ్యాజిక్‌ని చూపిస్తుందా? ఇప్పుడందరూ ఈ విషయంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆమె నాయికగా నటించిన తొలి బాలీవుడ్ ఫిల్మ్ 'సింఘం' జూలై 22న విడుదలవుతుండటమే దీనికి కారణం. ఇందులో ఆమె అజయ్ దేవగణ్ సరసన కనిపించబోతోంది. సూర్య, అనుష్క జంటగా నటించిన తమిళ హిట్ మూవీ 'సింగం' (తెలుగులో 'యముడు')కి ఇది రీమేక్. ఇందులో ఎస్సై బాజీరావ్ సింఘంగా అజయ్ నటిస్తే, అతని ప్రేయసి కావ్యగా కాజల్ నటించింది. మొదట ఈ పాత్రకి అసిన్‌నీ, తర్వాత ఒరిజినల్‌లో చేసిన అనుష్కనీ తీసుకోవాలని దర్శకుడు రోహిత్‌శెట్టి అనుకున్నాడు. అయితే అనుష్క బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపక పోవడంతో అనుకోకుండా ఆ ఛాన్స్ కాజల్ దక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని ఆమె చక్కగా ఉపయోగించుకున్నదనేది సమాచారం. నిజానికి ఈమెకి బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కాదు. అసలామె తెరంగేట్రమే బాలీవుడ్‌లో జరిగింది. 2004లో వచ్చిన 'క్యూన్.. హో గయా నా' సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఫ్రెండ్ పాత్రని తొలిగా చేసింది. ఆ సినిమా ఫ్లాపవడంతో ఎవరి దృష్టినీ ఆకర్షించలేక పోయింది కాజల్. దాంతో దక్షిణాదికి వచ్చిన ఆమె తన అందచందాలు, అభినయంతో టాలీవుడ్‌లో టాప్ రేంజికి ఎదిగింది. ఇన్నాళ్లకి హీరోయిన్‌గా తన భాషా చిత్రసీమలో ఆమెకి తొలి అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో మాదిరిగానే అక్కడ కూడా ఆమె జిగేల్‌మంటుందో, లేదో...

న్యూస్: నితిన్ ప్రేక్షకుల 'ఇష్క్' పొందుతాడా?

నితిన్‌కి హిట్టొచ్చి ఎంత కాలమైందో జ్ఞాపకముందా? ఏడేళ్లు! అవును. అతని చివరి హిట్ మూవీ 'సై'. అది కూడా నిర్మాతకి డబ్బులు తీసుకు రాలేదు. కొన్నవాళ్లే లాభపడ్డారు. అంతకు ముందు 'జయం', 'దిల్' సినిమాలతో రెండు వరుస హిట్లిచ్చిన అతను నాలుగో సినిమా 'సై'తో మరో సక్సెస్ సాధించాననుకున్నాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో రగ్బీ నేపథ్యంలో నడిచే ఆ సినిమా చాలామందిని ఆకట్టుకుంది. దాని తర్వాత నితిన్ 13 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏ ఒక్కటీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఆ సినిమాల్లో రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన హిందీ సినిమా 'అగ్యాత్' కూడా ఉంది. అంటే నితిన్ బాలీవుడ్ ఎంట్రీ సైతం నిరాశనే కలిగించింది. కృష్ణవంశీ (శ్రీ ఆంజనేయం), కె. రాఘవేంద్రరావు (అల్లరి బుల్లోడు), తేజ (ధైర్యం), ఎన్. శంకర్ (రాం) వంటి దర్శకులు కూడా తర్వాతి కాలంలో అతనికి సక్సెస్సులు ఇవ్వలేకపోయారు. ప్రియమణి అందాల కనువిందు చేసిన 'ద్రోణ' కానీ, మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఇలియానాతో చేసిన 'రెచ్చిపో' కానీ, క్యూట్ గర్ల హన్సికతో నటించిన 'సీతారాముల కల్యాణం.. లంకలో' కానీ అతడికి విజయాన్ని చేకూర్చలేక పోయాయి. అతని కెరీర్ కోసం తండ్రి ఎన్. సుధాకర్‌రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా కూడా నితిన్ ఎందుకనో ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాడు. ప్రస్తుతం అతను 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో 'అలా మొదలైంది'తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న నిత్య మీనన్ హీరోయిన్. విక్రం కుమార్ అనే కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ విశేషం ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరాం దీనికి పని చేస్తుండటం. ఈ సినిమాతోనైనా నితిన్ తన పరాజయ పరంపరకి అడ్డుకట్ట కట్టుకోగలడా? వెయిట్ అండ్ సీ.

Monday, July 18, 2011

న్యూస్: రానాని ప్రేక్షకులు ఇష్టపడతారా?

తొలి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మూడో సినిమా మీద ప్రాణమే పెడుతున్నాడు రానా దగ్గుబాటి. శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'లో ముఖ్యమంత్రిగా నటించి బాగానే చేశాడనిపించుకున్న ఈ రామానాయుడి మనవడు, సురేశ్‌బాబు కుమారుడు పూరి జగన్నాథ్ సినిమా 'నేను నా రాక్షసి' కచ్చితంగా తనకి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశించాడు. కానైతే ఆ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. పైగా ఆ సినిమా వల్ల అతని కంటే ఎక్కువగా ఇలియానాకే పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో 'నా ఇష్టం' అనే సినిమా చేస్తున్నాడు రానా. ఇందులో అతని జోడీగా 'బొమ్మరిల్లు' బ్యూటీ జెనీలియా నటిస్తుండటం విశేషం. 'సింహా'తో హిట్టు కొట్టిన పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. పర్సనాలిటీ పరంగా సీరియస్ కేరక్టర్స్‌కి పనికి వస్తాడనిపించే రానా 'నా ఇష్టం'లో రఫ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ప్రేక్షకులు తనని ఇష్టపడేలా చేసుకోవాలని తపిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

న్యూస్: అనుష్క నెంబర్‌వన్నా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్‌వన్ పొజిషన్ ఎవరిది? అనుష్కదా? కాజల్ అగర్వాల్‌దా? వరుస హిట్లు, క్రేజీ ప్రాజెక్టులతో కాజల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిన సంగతి తెలిసిందే. అప్పటికే 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అనిపించుకున్న అనుష్క ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్నీ చేస్తోంది. కాజల్ ఇంతవరకు ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమానీ చేయలేదు. హీరోతో పని లేకుండా తన సత్తాతోటే సినిమాని హిట్ చేయించగల ఇమేజ్ అనుష్క సొంతం చేసుకుంది. ఆ ఇమేజ్ కాజల్‌కి ఇంకా రాలేదు కాబట్టి అనుష్కే టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్ అని విశ్లేషకుల అభిప్రాయం. అయితే వయసు, ఎత్తు అనుష్కకి కొన్ని పరిధులు విధిస్తున్నాయి. ఇప్పటి కుర్ర హీరోలతో, తనకంటే పొట్టి హీరోలతో కలిసి స్టెప్పులేసే అవకాశం ఆమెకి లేదు. ఇప్పటికే 29 యేళ్ల వయసులో ఉన్న ఆమె ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి క్రేజీ స్టార్ల సరసన నటించలేని స్థితిలో ఉంది. ఈ విషయంలో ఆమెకంటే కాజల్‌ది పైచేయి. అందరు హీరోల సరసనా చేయగల స్థితి ఆమెది. అనుష్క ప్రస్తుతం 'ఢమరుకం'లో నాగార్జున సరసనా, 'రెబల్'లో ప్రభాస్ సరసనా నటిస్తోంది. ఇవిగాక 'రంపచోడవరం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతోంది. ఈ సినిమాల ఫలితం అనుష్క భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈలోగా కాజల్‌తో పాటు తమన్నా నుంచి కూడా గట్టి పోటీని ఆమె ఎదుర్కోనున్నది.

న్యూస్: తెలుగు సినిమాలకు థియేటర్లు కావలెను!

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ డబ్బింగ్ సినిమాల హవా నడుస్తున్నదనే దానికి ఇంకో మంచి ఉదాహరణ ఈ శుక్రవారం (జూలై 15) విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు. వాటిలో రెండు తమిళం నుంచి తెలుగుకు వచ్చిన 'నాన్న', 'కాంచన' కాగా, మరోటి హాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చిన 'హారీపోట్టర్ 7' (పార్ట్ 2). వీటి మధ్య 16న రెండు తెలుగు సినిమాలు 'మాయగాడు', 'కీ' విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలు మూడు కలిసి హైదరాబాద్ ఏరియాలో 65 థియేటర్లకు పైగా విడుదలైతే, రెండు తెలుగు సినిమాలు కలిసి కేవలం 14 థియేటర్లలో రిలీజయ్యాయి. విక్రం, అనుష్క జంటగా నటించిన డబ్బింగ్ సినిమా 'నాన్న' సిటీ ఏరియాలో 25 థియేటర్లలో, రాఘవ లారెన్స్ సినిమా 'కాంచన' 33 థియేటర్లలో, 'హారీపోట్టర్ 7' 7 థియేటర్లలో విడుదలయ్యాయి. మన తెలుగు సినిమాల్లో వేణు, ఛార్మి సినిమా 'మాయగాడు' 10 థియేటర్లలో విడుదలైతే, జగపతిబాబు హీరోగా నటించిన 'కీ' కేవలం అత్యల్పంగా 4 థియేటర్లలోనే రిలీజవడం గమనార్హం. అంటే తెలుగు సినిమాల కంటే పర భాషల నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ బిజినెస్ జరుగుతున్నదన్న మాట. ఈ నేపథ్యంలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల కారణంగా థియేటర్లే దొరకని స్థితి నెలకొంది. ఇప్పటికే తమిళం నుంచి మరో రెండు డబ్బింగ్ సినిమాలు 'రంగం', 'వాడు వీడు' హైదరాబాద్ థియేటర్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆరోవారంలో ఉన్న అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా కేవలం 5 థియేటర్లలోనే సిటీలో నడుస్తుండగా, ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా నటించిన 'రంగం' డబ్బింగ్ సినిమా పదో వారంలో 11 థియేటర్లలో ఆడుతుండటం విశేషం. దీన్ని బట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దబ్బింగ్ సినిమాలకు 50% టాక్స్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

Sunday, July 17, 2011

న్యూస్: మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకుంటున్న తేజ

సంచలన దర్శకుడు తేజ మూడేళ్ల సుదీర్ఘ విరామంతో మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నాడు. చివరి సారిగా అతను డైరెక్ట్ చేసిన 'కేక' 2008 అక్టోబర్‌లో వచ్చింది. ఈ సినిమాతో ప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు రాజా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చిపోయిందో జనానికి తెలీదు. అందుకే అతను మళ్లీ తెర మీద కనిపించలేదు. ఇక తేజ అయితే ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి మూడేళ్లు టైం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనతో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చింది భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనందప్రసాద్. 'అమరావతి', 'వాంటెడ్' వంటి ఫ్లాపుల తర్వాత ఆయన తీయబోతున్న సినిమా ఇది. తేజ, ఆనందప్రసాద్ కాంబినేషన్ కుదిర్చింది అన్నే రవి. ఇదివరలో సినీ జర్నలిస్టుగా పనిచేసిన రవి ఇప్పుడు భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. తేజకు బాగా సన్నిహితుడు. అందుకే ఈ కాంబినేషన్ వీలుపడింది. తేజ డైరెక్ట్ చేయబోతున్న ఈ కొత్త సినిమాలో నలుగురు స్టార్ కమెడియన్లు మినహా మిగతా వాళ్లంతా కొత్తవాళ్లే నటించనున్నారు. దీని కోసం స్టార్ హంట్‌ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తన సినిమాలతో అనేకమందిని చిత్రసీమకు పరిచయం చేసిన తేజ ఈ సినిమాతో మరి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్, నితిన్, సదా, నవదీప్, సుమన్‌శెట్టి నుంచి ఎంతో మంది ఆయన ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టినవాళ్లే. ఈ కొత్త సినిమాతో పరిచయమైన వాళ్లలో ఎవరు లైంలైట్‌లోకి వస్తారో చూడాలి.

Saturday, July 16, 2011

న్యూస్: ఇలియానా అంతేనా?

జూనియర్ సిమ్రాన్‌గా పేరు తెచ్చుకుని అచిర కాలంలోనే టాప్ రేంజికి ఎదిగి, టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి తారగా కాంతులీనిన గోవా సుందరి ఇలియానాకు ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం వింతే! ముఖారవిందం కంటే అందమైన నడుముతోటే యువతరాన్ని పడగొట్టేసిన ఆమె తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' ఒకదాన్ని మించి మరోటి హిట్టవడంతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన 'భలే దొంగలు' సినిమాతో కోటి రూపాయలు తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోయిన్‌గా ఆమె సంచలనం సృష్టించింది. అయితే 'కిక్' హిట్ తర్వాత ఆమె సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద ఆడకపోవడం, రెమ్యూనరేషన్ విషయంలో కిందికి దిగక పోవడం వంటి కారణాలతో నిర్మాతలు ఆమెకంటే ఇతర తారల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 'రెచ్చిపో', 'సలీం', 'శక్తి' సినిమాలు ఒకదాన్ని మించి మరోటి అట్టర్‌ఫ్లాప్ కావడం, రానా సరసన చేసిన 'నేను నా రాక్షసి' మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫ్లాపవడంతో నిన్నటి దాకా ఆమెని గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే ఇవాళ ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. ఫలితంగా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిపోయింది. మరోవైపు తమన్నా, తాప్సీ, సమంతా వంటి తారలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం సౌతిండియా టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న తమిళ 'నంబన్' సినిమా మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఇది బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన '3 ఇడియట్స్'కి రీమేక్. ఇందులో ఆమె విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా ఆడితే మొదట తమిళంలోనూ, తర్వాత తెలుగులోనూ తనకి మళ్లీ మంచి అవకాశాలొస్తాయనేది ఆమె నమ్మకం. మరోవైపు 'బర్ఫీ'తో బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్న ఆమె, దానితో అక్కడా తనకి గుర్తింపు లభిస్తుందనే ఆశ పెట్టుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో..

న్యూస్: 'బెజవాడ రౌడీలు' సంచలనం సృష్టిస్తారా?

రవితేజ, ఛార్మి, సునీల్ కాంబినేషన్‌లో తీసిన 'దొంగల ముఠా' తర్వాత రాంగోపాల్‌వర్మ తెలుగులో 'బెజవాడ రౌడీలు' సినిమాని తీస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ఆయన కేవలం నిర్మాతే. దర్శకుడు వివేక్‌కృష్ణ. అతనికిదే తొలి సినిమా. 20 యేళ్ల క్రితం బెజవాడలో ఉండే వాతావరణం నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, అతని సరసన ప్రతీక రావు నటిస్తోంది. ఆమె ఎవరో కాదు, 'అతిథి' ఫేం అమృతారావు చెల్లెలు. వాతావరణం 20 యేళ్ల క్రితంది అయినా అప్పటి వ్యక్తుల గురించి కానీ, అప్పటి సంఘటనల గురించి కానీ లేకుండా, పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమాగా దీన్ని తీస్తున్నామని వర్మతో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కిరణ్‌కుమార్ కోనేరు చెబుతున్నారు. అయితే ఇది ఒకప్పుడు విజయవాడని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు గ్యాంగ్ వార్ నడిపిన వంగవీటి, దేవినేని కుటుంబాలే ఈ సినిమా కథకి ప్రేరణ అని ఇప్పటికే జనానికి తెలిసిపోయింది. వంగవీటి రంగాని పోలిన పాత్రని నాగచైతన్య పోషిస్తుండగా, దేవినేని రమణ అలియాస్ గాంధీ పాత్రని అభిమన్యుసింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ మీద వివాదం చెలరేగి రెండు నెల్ల క్రితం విజయవాడలో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు పోలీసుల సహకారంతో అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్నారు నిర్మాతలు. దీపావళికి ఈ సినిమాని విడుదల చేయాలనేది వారి ఆలోచన. 'రక్త చరిత్ర' తరహాలో ఉసూరుమనకుండా 'బెజవాడ రౌడీలు' సంచలనం సృష్టిస్తుందని ఆ సినిమా యూనిట్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.

Friday, July 15, 2011

న్యూస్: మరో జీవితకాల పాత్ర 'రాజన్న'!

2010 చివరలో 'రగడ'తో హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున త్వరలో 'రాజన్న'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యేడాది మొదట్లో వచ్చిన 'గగనం' చిత్రం ఆయన అభిరుచిని తెలియజేసింది. కమర్షియల్‌గా హిట్టు కాకపోయినా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. అదే సినిమా తమిళ వెర్షన్ 'పయనం'లోనూ ఆయన నటించారు. 1997లో నటించిన 'రక్షగన్' తర్వాత ఆయన నటించిన తమిళ సినిమా ఇదే. ఇప్పుడు టైటిల్ పాత్ర పోషిస్తూ సొంతంగా 'రాజన్న'ని నిర్మిస్తున్నారు నాగార్జున. వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో క్లైమాక్స్‌తో పాటు మరో యాక్షన్ ఎపిసోడ్‌ని ఆయన కుమారుడు, నేటి నెంబర్‌వన్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి చిత్రీకరించడం విశేషం. 1940 నుంచి 1950 మధ్య కాలం నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమాలో రజాకార్ల దురాగతాల మీద తిరుగుబాటు చేసే 'రాజన్న' అనే యోధునిగా నాగార్జున నటిస్తున్నారు. ఇప్పటికే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి జీవిత కాల పాత్రలు చేసిన ఆయనకు ఈ పాత్ర కూడా అంతటి పేరునీ, అవార్డుల్నీ తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టులోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది కాకుండా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నాగార్జున 'డమరుకం' అనే సోషియో ఫాంటసీలో హీరోగా నటిస్తున్నారు.

న్యూస్: 'ఇడియట్ 2'తో మరో సంచలనం?

రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఇప్పటికి ఆ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు నాలుగొచ్చాయి. రాబోయేది ఐదో సినిమా. ఈ సినిమాకి ఓ విశిష్టత ఉంది. దీని టైటిల్ 'ఇడియట్ 2'. దీన్నిబట్టే ఈ విశిష్టత అర్థమై ఉంటుంది. జగన్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా 'ఇడియట్' 2002 బిగ్ హిట్లలో ఒకటిగా నిలిచింది. తమ తమ విభాగాల్లో ఆ ఇద్దరికీ క్రేజ్‌ని తెచ్చింది. అందులో రవితేజ మేనరిజం భలే పాపులర్.
"చంటిగాడొచ్చాడు"
"ఆడెవడు?"
"నేనే"
ఆ సినిమా తర్వాత ఎంతమంది తమ పిల్లలకి 'చంటి' అనే ముద్దు పేరు పెట్టుకున్నారో! అంతగా చంటి క్యారెక్టరైజేషన్ ఆడియెన్సుని ఆకట్టుకుంది. అంతే కాదు. ఆ సినిమాతో పరిచయమైన హీరోయిన్ రక్షిత సైతం యూత్‌ని అలరించింది. రక్షితని రవితేజ ఆటపట్టిస్తుంటే యువత బాగా ఆస్వాదించారు. అలాంటి ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోందంటే మంచిదే. మహేశ్‌బాబుతో చేసే 'ది బిజినెస్ మ్యాన్' తర్వాత దీని షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాని వైష్ణో అకాడమీ బేనర్ మీద కాకుండా కొత్తగా నెలకొల్పిన పూరి జగన్నాథ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై తీయనున్నాడు జగన్. ఈ 'ఇడియట్ 2' ఒరిజినల్ మాదిరిగానే సంచలనం సృష్టిస్తుందో, లేదో చూడాలి.

న్యూస్: ఛార్మితో పోటీపడ్డ 'మాయగాడు'

హీరో వేణులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సక్సెస్సుల మీదున్నప్పుడు చాలా కేర్‌లేస్‌గా కనిపిస్తూ వచ్చిన అతను ఇప్పుడు జర్నలిస్టులతో మాట్లాడేప్పుడు చాలా నమ్రతగా, వినయంగా మాట్లాడుతున్నాడు. 'మాయగాడు' విడుదలలో జాప్యం జరిగినా సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా సినిమాలో హీరోయిన్ ఛార్మితో తన జోడీ చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు. "సినిమాలో మొత్తం ఆరు పాటలుండగా, వాటిలో నాలుగు డ్యూయెట్లు. స్వతహాగా ఛార్మి మంచి డాన్సర్. ఈ పాటల్లో ఆమెతో డాన్సుల్లో నేను పోటీపడ్డా. నా డాన్సులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలో ఇలా ఆరు పాటలూ బ్రహ్మాండంగా వచ్చినవి లేవు. ఈ పాటలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకి ప్రధాన బలం" అని చెప్పాడు వేణు. ఈ సినిమాలో అతను కష్టపడకుండా మాయ మాటలతో బతికేద్దామనుకునే లీలాకృష్ణ అనే పల్లెటూరి యువకుడి పాత్రని చేశాడు. అతను సిటీకి వచ్చి, ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాక ఆమె వల్ల ఎలా ప్రయోజకుడిగా మారాడన్నది కథ. పర భాషా నటులు సైతం తెలుగులో తమ పాత్రలకి తమే డబ్బింగ్ చెప్పుకుంటుంటే తెలుగు వాడయ్యుండీ అతను మాత్రం ఇంకా తెరమీద సొంత గొంతు పలికించలేదు. "తమిళనాడులోనే పెరగడం వల్ల డబ్బింగ్ చెప్పాలంటే ఏదో సంకోచం నన్నాపుతోంది. ఎవరైనా పక్కనుండి ముందుకు తోస్తే నా పాత్రకి నేనే వాయిస్‌నిస్తా. సొంత గొంతు కాకపోవడం వల్లే 'గోపి గోపిక గోదావరి' వంటి హిట్ సినిమాని కూడా ఇంతదాకా నేను చూడలేదు. ఆ లోపాన్ని సరిచేసుకోవాలి" అని చెప్పాడు వేణు. 16న విడుదలవుతున్న 'మాయగాడు' అతడి ఆశల్ని నిలబెడుతుందో, లేదో చూడాలి.

Thursday, July 14, 2011

న్యూస్: అది హిట్టయితే ఓకే, లేకపోతే..?

సీనియర్ హీరోయిన్ త్రిష క్రేజ్ తెలుగులో క్రమేపీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఏడేళ్ల క్రితం 'వర్షం'తో యువత కలల రాణిగా ఆవిర్భవించిన ఈ తమిళ తార ఆ మరుసటి యేడాదే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో అగ్ర తారల్లో చేరిపోయింది. ఈ రెండూ ఎమ్మెస్ రాజు నిర్మించినవే కావడం గమనార్హం. అనంతరం 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'కృష్ణ', 'కింగ్' వంటి హిట్ సినిమాల్లో నటించి నెంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత కాలంలో కొత్త తారల సందడి వల్ల ఆమె కెరీర్ వెనుకపట్టు పట్టింది. 'కింగ్' తర్వాత ఆమె చేసిన 'శంఖం', 'నమో వెంకటేశ' సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. ఆమె పాత్రలు కూడా అంతే. వాటి తర్వాత పవన్ కల్యాణ్‌తో తొలిసారిగా నటించిన 'తీన్‌మార్' కూడా ఆమెకి ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. అది వెంకటేశ్‌తో చేస్తున్న మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. వెంకటేశ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం తెలుగులో త్రిష కెరీర్‌ని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితే సరే, లేకపోతే.. సమస్యే.

న్యూస్: మంచి రచయితని మిస్సవుతున్న టాలీవుడ్

డైరెక్టర్‌గా పోసాని కృష్ణమురళికి ఊహించని ఓటమి 'దుశ్శాసన'. శ్రీకాంత్‌తో ఇదివరకు తీసిన 'ఆపరేషన్ దుర్యోధన' పెట్టుబడిపై మంచి ఆదాయం తీసుకొచ్చి నిజమైన హిట్టవడంతో 'దుశ్శాసన' కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుందని అతను ఆశించాడు. కానీ ఆ సినిమా విడుదల చేయడమే నిర్మాతకి తలకి మించిన భారమైంది. హీరో శ్రీకాంత్ రూ. 20 లక్షలిచ్చి ఆదుకోబట్టి సరిపోయింది. రాజకీయ, పోలీసు వ్యవస్థల మీదా, సమాజం మీదా తనకున్న అక్కసునీ, కోపాన్నీ సినిమాల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించే పోసాని రచయితగా ఎంతగా సక్సెస్ అయ్యాడో, దర్శకుడిగా మారినప్పట్నించీ అంతగా విమర్శల్నీ, వివాదాల్నీ మూటగట్టుకుంటూ వచ్చాడు. తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన 'మెంటల్ కృష్ణ' ఆయన మానసిక పరిస్థితికి అద్దం పట్టింది. ఆ సినిమాకి కొద్దో గొప్పో డబ్బులు రావచ్చు గాక, కానీ ఆ తర్వాత నుంచీ ఆయన నటించిన సినిమాల్ని కానీ, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్ని కానీ జనం పట్టించుకోవడం మానేశారు. రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీపరుడని కీర్తిస్తూ చిరంజీవి పార్టీలో చేరిన ఆయన గత ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు అదే చిరంజీవిని పెద్ద అవినీతిపరుడని విమర్శిస్తూ ఉన్నవాళ్లలో జగన్మోహనరెడ్డి బెటరంటూ వైయెస్సార్ కాంగ్రెస్స్ పార్టీలో చేరిపోయాడు. ఇలా స్థిరమైన అభిప్రాయమంటూ లేని ఆయన మునుముందు ఏం చేసినా జనం వినే స్థితి కానీ, చూసే స్థితి కానీ కనిపించడంలేదు. మొత్తానికి సినీ పరిశ్రమ ఓ మంచి రచయిత సేవల్ని మిస్సవుతోందని చెప్పవచ్చు.

Wednesday, July 13, 2011

న్యూస్: 'పవర్' చూపిస్తాడా?

పవన్ కల్యాణ్ 'జల్సా' తర్వాత మళ్లీ అంత హిట్ ఎప్పుడిస్తాడు? ఆయన్ని అభిమానించేవాళ్లు ఎదురుచూస్తున్నది దీని కోసమే. 'పులి' సినిమా డిజాస్టర్ కావడమే కాక, దాని నిర్మాత శింగనమల రమేశ్‌ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ హిట్ 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్‌గా ఎంతో హైప్‌తో జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో వచ్చిన 'తీన్‌మార్' సినిమా ఆశించిన రీతిలో ఆడియన్సుని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందువల్ల ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల మీదే అందరి దృష్టి ఉంది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరిలో ఒకరైన పవన్ ఈ యేడాది చివరలో 'ద షాడో' (టైటిల్ మారవచ్చు)గా రాబోతున్నాడు. దీని డైరెక్టర్ విష్ణువర్ధన్. తెలుగువాడైనప్పటికీ తమిళంలోని హాట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రూపొందిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా హీరోయిన్లు. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో నడిచే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. 'లవ్ ఆజ్ కల్' తర్వాత మరో హిందీ హిట్ సినిమా 'దబాంగ్'కి రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు పవన్. 'గబ్బర్ సింగ్' పేరుతో రూపొందే ఈ సినిమాని నటుడు గణేశ్‌బాబు నిర్మించనుండగా, హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇవికాక యేసుక్రీస్తుపై సింగీతం శ్రీనివాసరావు రూపొందిస్తున్న పేరుపెట్టని సినిమాలో పవన్ ఓ ప్రత్యేక పాత్రని చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలన్నిట్నీ బాల తారలు చేస్తున్నారు. ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమాని మినహాయిస్తే.. 'ద షాడో', 'గబ్బర్‌సింగ్' సినిమాలతో పవన్ కల్యాణ్ తన 'పవర్'ని చూపిస్తాడని ఆశించొచ్చు.

న్యూస్: నెంబర్‌వన్ రేసులో తమన్నా!

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా తెలుగులో ఇప్పుడు నెంబర్ వన్ రేసులో దూసుకుపోతోంది. ఈ విషయంలో ఆమె కాజల్ అగర్వాల్‌కి ప్రధాన పోటీదారుగా మారింది. రేసులో నిన్నటి వరకు ముందున్న గోవా సుందరి ఇలియానా వెనకడుగు వేయడం, త్రిష ఇమేజ్ క్రమేపీ తగ్గుతుండటం, తాప్సీ, సమంతా ఇంకా టాప్ స్లాట్‌లోకి రాకపోవడంతో తమన్నాకి అవకాశాలు మెరుగయ్యాయి. ఆరేళ్ల క్రితమే మంచు మనోజ్ సరసన చేసిన 'శ్రీ'తో తెలుగులో అడుగుపెట్టినప్పటికీ ఆమెకి బాగా గుర్తింపు తెచ్చింది శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్' సినిమానే. అయితే దాని తర్వాత కూడా ఆమె సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోయింది. రెండేళ్ల క్రితం 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో ఆకట్టుకున్న ఆమె మళ్లీ రెండేళ్ల గ్యాప్‌తో '100% లవ్'తో ప్రేక్షకుల్నీ, విమర్శకుల్నీ సమానంగా సమ్మోహనపరిచింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో నాగచైతన్య కంటే తమన్నాకే ఎక్కువ పేరు రావడం గమనార్హం. ఈ సంగతిని నాగచైతన్య తండ్రి, సీనియర్ టాప్ హీరో నాగార్జున సైతం పబ్లిగ్గా చెప్పారు కూడా. ఈ సినిమాతో ఆమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. '100% లవ్' నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన భారీ చిత్రం 'బద్రీనాథ్'లో రెగ్యులర్ హీరోయిన్‌గా కనిపించినా తనదైన ముద్రని వేసింది తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
వాటిలో ఒకటి రాంచరణ్‌కి జోడీగా నటిస్తున్న 'రచ్చ' కాగా రెండోది ఎన్‌టీఆర్‌తో చేస్తున్న 'ఊసరవెల్లి'. ఇక మూడోది రాం సరసన నటిస్తున్న 'ఎందుకంటే.. ప్రేమంట'. ఈ మూడు సినిమాలతో తమన్నా తెలుగులో నెంబర్ వన్ తార అవడం ఖాయమని చాలామంది నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందో, లేదో వెయిట్ అండ్ సీ.