Sunday, April 28, 2013

బంగారు మనసులు (1973)- రివ్యూ


విధి వక్రిస్తే, అంతవరకు అనుకూలించినవి కూడా అవరోధాలుగా మారి లేనిపోని అనర్థాలకూ, అవమానాలకూ దారితీస్తాయనీ, ఎదురీదడానికి ఎంత యత్నించినా, ఫలితం శూన్యమనీ, నీతికీ, నిజాయితీకీ కట్టుబడి కష్టాల్ని ఓర్పుతో స్వీకరిస్తే ఒకనాటికి మంచి జరుగుతుందనీ తెలిపే సినిమా 'బంగారు మనసులు'.
చిక్కటి సంఘటనలు నిండిన చక్కటి కథ రాసిన కృష్ణమోహన్ సంభాషణల్నీ ప్రతిభావంతంగా రాశారు. 'కొరడా రాణి' దర్శకుడూ, 'బంగారు మనసులు' దర్శకుడూ ఒక్కరే అంటే నమ్మబుద్ధి కాదు. కథను సాఫీగా నడిపించి, తికమకలు లేకుండా చిత్రాన్ని రూపొందించారు కె.ఎస్. రెడ్డి. సత్యం సంగీతం, కన్నప్ప ఛాయ ఆకట్టుకుంటాయి.
కథానాయకిగా జమున ఆద్యంతం డామినేట్ చేసింది. పరికిణీ పిల్లగా ఆమె చాలా అందంగా కనిపించింది. ఉత్తమ పాత్రపోషణ కూడా ఆమెదే. కృష్ణకుమారి గెస్టుగా నటించింది. అంతవరకు విలన్, క్యారెక్టర్ రోల్స్ వేస్తూ వచ్చిన సత్యనారాయణ సానుభూతి పొందే కథానాయకుడి పాత్రని కూడా చక్కగా చేయగలడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సహాయ భూమికలు చేసిన వారంతా పరిధుల మేరకు రాణించారు.

Wednesday, April 17, 2013

తల్లీబిడ్డలు (1963) - రివ్యూ


దురాశకు లోనైన మనిషి ఎంతటి నీచానికైనా పాల్పడతాడు. జంకు, గొంకు లేకుండా ఎన్ని ఘోర కృత్యాలైనా చేస్తాడు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తాడు. దురాశ అతడిలోని మానవత్వాన్ని హరించివేసి, కిరాతకునిగా మార్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడి అంతరాత్మ నశిస్తుంది. దీనిని ఆధారం చేసుకొని పి.ఎస్. శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం 'తల్లీబిడ్డలు'.
జమీందార్ కేశవరావు (నాగయ్య)కు సకల సంపదలు ఉన్నా, సంతానం లేదు. దాంతో ఆయనా, ఆయన భార్యా తీరని వ్యధకు లోనవుతారు. ఈ సంగతి గ్రహించిన కారు డ్రైవర్ వెంకన్న (లింగమూర్తి)కి దురాశ కలుగుతుంది. భార్య లక్ష్మి (హేమలత) కంటికీ మంటికీ ఏకధారగా విలపిస్తున్నా లెక్కచెయ్యక దిక్కులేనివాడని అబద్ధం చెప్పి తన ఒక్కగానొక్క కొడుకును కేశవరావుకు అప్పగిస్తాడు. కొద్ది రోజుల్లోనే కేశవరావు భార్య గర్భవతై మగ పిల్లాణ్ణి కంటుంది. తన పథకం విఫలమవడంతో రాక్షసుడిగా మారతాడు వెంకన్న. ఒక రాత్రివేళ్ల పురిటిబిడ్డను ఎత్తుకుపోయి చంపేందుకు ప్రయత్నిస్తాడు. అతడికి అడ్డు తగిలి లక్ష్మి ఆ పసివాడితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. లేకలేక కలిగిన బాబు మాయమవడంతో కేశవరావు భార్య మనోవ్యధతో మరణిస్తుంది. జమీందార్ ఇంట్లో పెరిగిన వెంకన్న కొడుకు కుమార్ (హరనాథ్) పోకిరిగానూ, లక్ష్మి పెంపకంలో పెరిగిన ప్రకాశ్ (బాలయ్య) బుద్ధిమంతుడిగానూ తయారవుతారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరడానికి పట్నానికి వెళ్తున్న ప్రకాశ్‌కు గీత (కృష్ణకుమారి) పరిచయమవుతుంది. కుమార్ వ్యసనాలు హద్దుమీరుతాయి. పుష్ప (రాజశ్రీ)తో అతడికి సంబంధం ఏర్పడుతుంది. అతణ్ణి మంచిదారిలో పెట్టడానికి పెళ్లి చెయ్యడమొక్కటే మార్గమని కేశవరావుకు నచ్చజెబుతాడు వెంకన్న. కుమార్ ఆస్తి మీద కన్నేసిన పుష్ప ఒక రాత్రివేళ అతడికి మత్తు మందు ఇచ్చి తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుంటుంది. ఆ రాత్రే ఆమె హత్యకు గురవుతుంది. కుమార్ మీద హత్యానేరం పడుతుంది. అతణ్ణి రక్షించడానికి ఆ నేరం తానే చేసినట్లు చెప్పి అరెస్టవుతాడు కేశవరావు. దీంతో పశ్చాత్తాపానికి గురైన వెంకన్న మొదట్నించీ తాను చేసిన ఘోరాల్ని బయటపెట్టి, పుష్పని హత్య చేసింది తానేనని ఒప్పుకుంటాడు. లక్ష్మికి కుమార్, కేశవరావుకు ప్రకాశ్ దక్కుతారు. గీతా ప్రకాశ్‌లకు పెళ్లవుతుంది.
కథనంలో మరికొంత శ్రద్ధ చూపినట్లయితే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది. రిలీఫ్ కోసమంటూ అక్కడక్కడా కావాలని హాస్యం చొప్పించడం రాణించలేదు. పుష్ప హత్యానంతరం కథలో మలుపు వచ్చింది. అలాంటి సందర్భంలో శివరావు, మీనాకుమారి మధ్య హాస్య సన్నివేశం రిలీఫ్ నివ్వకపోగా విసుగు కలిగించింది. జమీందార్ ఇంటికి లక్ష్మి వెళ్లినప్పుడు గీత అక్కడ ఎందుకుందో అర్థం కాదు. ఇలాంటివే ఒకట్రెండు సన్నివేశాలు అసందర్భంగా కనిపించినా మొత్తం మీద సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
నటులలో అందరికంటే ఎక్కువ మార్కులు లింగమూర్తి, హేమలతకే పడతాయి. నాగయ్య, బాలయ్య, హరనాథ్, కృష్ణకుమారి పాత్రోచితంగా నటించారు. చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో రాజశ్రీ చక్కగా నటించింది. శివరావునూ, పేకేటినీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. కె.ఎస్. ప్రసాద్ ఛాయాగ్రహణం నయనానందకరం. ఈ చిత్రంతో పరిచయమైన శంకరరావు సంగీతం రెండు మూడు పాటల్లో వినసొంపుగానే ఉంది.

Thursday, April 11, 2013

Chittajallu Pullaiah Filmography

1. Sati Savitri                                  (1933)
2. Lava Kusa                                  (1934)
3. Anasuya                                     (1935)
4. Sri Krishna Thulabharam             (1935)
5. Sati Anasuya                               (1936)
6. Dhuruva Vijayam                        (1936)
7. Mohini Bhasmasura                     (1938)
8. Sri Satyanarayana Swamy            (1938)
9. Vara Vikrayam                            (1939)
10. Malathi Madhavam                     (1940)
11. Bala Nagamma                           (1942)
12. Gollabhama                                (1947)
13. Vindya Rani                                (1948)
14. Apoorva Sahodarulu                   (1950)
15. Sankranthi                                   (1952)
16. Pakkinti Ammayi                         (1953)
17. Devantakudu                               (1960)
18. Lava Kusa                                  (1963)
19. Paramanandayya Sishyula Katha  (1966)
20. Bhama Vijayam                           (1967)
21. Bhuvana Sundari Katha               (1967)

HM Reddy Filmography

1. Bhakta Prahlada      (1931) as a director
2. Grihalakshmi           (1938)    "
3. Mathru Bhoomi       (1939)    "
4. Bondam Pelli           (1940)    "
5. Tenali Ramakrishna (1941)    "
6. Gharana Donga       (1942)    "

Thursday, April 4, 2013

'స్త్రీ' (1973) రివ్యూ


ఆస్తులు, అంతస్థులు, అయినవాళ్లని కాదని ఆత్మీయత, అప్యాయత నిండిన మనసు కలిగిన ఓ ఆదర్శ వ్యక్తిని వివాహమాడి, జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా ఎదురీదిన ఓ ధీరవనిత గాథ 'స్త్రీ'. కె. ప్రత్యగాత్మ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణా మూవీస్ బేనర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిచారు.
ఈ సినిమాలో తల్లీ కూతుళ్లుగా చంద్రకళ ద్విపాత్రాభినయం హైలైట్. ఆడంబరం, అహంకారం లేని ఉత్తమురాలు తల్లి అయితే, అవే కూతురి లక్షణాలు. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా తల్లి భావిస్తే, సొంత కోరికలు తీర్చుకోవడమే తన ధ్యేయంగా కనిపిస్తుంది కూతురు. ఈ రెండు పాత్రల్లోన్ని వ్యత్యాసాన్ని ప్రతి సన్నివేశంలో ప్రతిభావంతంగా ప్రదర్శించింది చంద్రకళ. చదువు, సంస్కారం ఉన్న ఉత్తమునిగా, నలుగురి కోసం పాటుపడే కార్మిక నాయకునిగా, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీని చేరదీసి, అర్ధాంగిగా స్వీకరించిన గుణవంతునిగా కృష్ణంరాజు మంచి నటనని ప్రదర్శించాడు.
ధూళిపాళ, చంద్రమోహన్, రమణారెడ్డి, మాడా, వల్లం నరసింహారావు, కె.కె. శర్మ, వై.వి. రావు, రాళ్లపల్లి, శరత్‌బాబు, విజయభాను, సాయికుమారి, మమత, బేబీ గౌరి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
నిజానికి ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు ప్రత్యగాత్మ. సన్నివేశాల కల్పన, వాటి చిత్రీకరణ, కథనం వంటి విషయాల్లో ఆయన పనితనం అడుగడుగునా గోచరిస్తుంది. మహదేవన్ సంగీతం, రావిశాస్త్రి సంభాషణలు, శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీ, బి.ఎన్. కృష్ణ కళా దర్శకత్వం ఈ సినిమాకి మంచి ఆకర్షణని తీసుకొచ్చాయి. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు.

Tuesday, April 2, 2013

'చట్టానికి వేయికళ్లు' రివ్యూ


మనిషికీ, కోరికలకీ ఉన్న సంబంధం ఎలాంటిదో, సమాజానికీ, చట్టాలకీ ఉన్న సంబంధం కూడా అలాంటిదే. కోరికలని అదుపులో పెట్టగలిగిన వ్యక్తి జీవితం, చట్టాల్ని చక్కగా పాటించే సమాజం సాఫీగా సాగిపోతాయి. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది కాబట్టే సమాజంలో రకరకాల అవాంఛనీయ సంఘటనలు, సంఘర్షణలు తటస్థిస్తుంటాయి. వాటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలని చెప్పే సినిమా 'చట్టానికి వేయికళ్లు'.
విజయనిర్మల దర్శకత్వంలో రంజిత్ ఆర్ట్స్ బేనర్‌పై కానూరి రంజిత్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాలో ద్విపాత్రల్లో కృష్ణ నటన, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, ఆదుర్తి హరనాథ్ ఎడిటింగ్ చెప్పుకోదగ్గ అంశాలు. కథలోకి వెళ్తే... పోలీస్ కమీషనర్ అయిన ప్రతాప్‌కుమార్, సావిత్రి ప్రేమించుకుంటారు. గురునాథం అనే కామాంధుని కాటుకి సావిత్రి బలవుతుంది. ఆమె శీలానికి వెల కడుతుంది సమాజం. నలిగిన పువ్వును ఆఘ్రాణించలేని ప్రతాప్ హృదయం కుంగిపోతుంది. ఆమెతో పెళ్లి తలంపుని విరమిస్తాడు. తల్లికీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన తమ్ముడు ఆనంద్‌కుమార్‌కీ, చెల్లికీ దూరమైపోతాడు కానీ పోలీసు అధికారిగా తన కర్తవ్యాన్ని మరచిపోడు. ప్రతాప్, ఆనంద్‌లపై రెండు దొంగల ముఠాలు పగబడతాయి. ఈ ముఠాలు జరిపే అత్యాచారాలకు ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతుంటాయి. గురునాథం మృతితో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ప్రతాప్, ఆనంద్ మధ్య సంఘర్షణ చెలరేగుతుంది. ప్రతాప్ ప్రాణాలు కాపాడేందుకు సావిత్రి తన జీవితానికి తానే ముగింపు పలుకుతుంది. ప్రతాప్ విధి నిర్వహణలో ప్రాణాల్ని త్యాగం చేస్తాడు.
ప్రతాప్, ఆనంద్ పాత్రల్ని కృష్ణ, సావిత్రిగా జయసుధ ప్రతిభావంతమైన అబినయాన్ని ప్రదర్శించారు. జర్నలిస్టుగా మాధవి, కె.డి. స్వామిగా రావుగోపాలరావు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. చక్రవర్తి సంగీతం ఆకట్టుకుంటుంది.