Wednesday, July 2, 2014

Cinema: Interview with Actor Venkat

తెలుగు చిత్రసీమను బాగు చెయ్యాలి: వెంకట్

"ప్రజలకు మంచి చేయడానికి ఎలా రాజకీయాల్లోకి వచ్చారో, అలాగే తెలుగు చిత్రసీమను బాగు చెయ్యడానికి పవన్‌కల్యాణ్ నడుం బిగించాలని కోరుకుంటున్నా. ఆయనొక్కరే ఏమైనా చెయ్యగలరనిపిస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన్ని కలవాలనుకుంటున్నా'' అని చెప్పారు వెంకట్. 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' వంటి హిట్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన చక్కని నటునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కొంతకాలంగా ఆయనకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి. కొంత విరామంతో ఇప్పుడు ప్రేమ్ మూవీస్ పతాకంపై ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తోన్న 'ఆ ఐదుగురు' చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా పత్రికలవారితో వెంకట్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

ఒక ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రయి, సమాజాన్ని మార్చడానికి ఏం చేశాడనేది 'ఆ ఐదుగురు'లోని ప్రధానాంశం. ముఖ్యమంత్రయ్యాక ఆయన నెక్స్‌ట్ జనరేషన్ ఫోర్స్ (ఎన్.జి.ఎఫ్.) అనే ఓ దళాన్ని ఏర్పాటుచేస్తాడు. నలభైమంది సభ్యుల ఆ బృందానికి శిక్షణనిచ్చే ఐపీఎస్ ఆఫీసర్‌గా నేను నటించాను. సీఎంగా వాసు అనే కొత్త నటుడు చేశారు. నలభై మంది బృందంలోని వాళ్లే 'ఆ ఐదుగురు'. మిగతా 35 మంది పాత్రలను నిజమైన పోలీసులే చేశారు. ఈ సినిమాలో నటించడానికి 'అప్పా' (ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ)లో రెండు నెలలపాటు శిక్షణ పొందాను. కాగా ఇందులోని డాక్టర్ పైపుల అనే పాత్రలో చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పట్రా కామెడీని పంచబోతున్నారు. ఇది యువతకు మార్గదర్శకం చూపించే సినిమా. మంచి సినిమాలు రావట్లేదని ఎప్పుడూ వాపోతూ ఉంటాం. కానీ మంచి సినిమాలు వచ్చినప్పుడు చూస్తున్నామా? ఇది కచ్చితంగా మంచి సినిమా. కమర్షియల్ అంశాలు మేళవించిన మంచి సినిమా.

ఆశాభావంతో ఉన్నా

పోలీసాఫీసర్‌గా నటించడం నాకిదే మొదటిసారి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో నా లుక్ డిఫరెంట్. నిజ జీవితంలో ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారో నా పాత్రను అలా చూపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ అందాల పోటీకి నేను, అస్మితా సూద్ జడ్జీలుగా వెళ్లాం. అందులో మమ్మల్ని చూసిన ప్రేమ్‌కుమార్ గారు ఈ సినిమాలోని కీలక పాత్రలు మేం సరిపోతామని భావించి, మాకు ఈ కేరక్టర్స్‌ని ఇచ్చారు. నా శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేశా. నా శరీరాకృతిని దృఢంగా మలచుకున్నా. స్టంట్స్‌ని డూప్‌లేకుండా చేసే క్రమంలో పై నుంచి కిందపడ్డాను. వెన్నెముక గాయంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఫలితంగా సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగింది. నా కోసం నిర్మాత ఓపిక వహించారు. 'ఆ ఐదుగురు' విడుదల కోసం ఎదురు చూస్తున్నా. విడుదలయ్యాక నాకు మంచి ఆఫర్లు వస్తాయనే ఆశాభావంతో ఉన్నా. సోలో హీరో కంటే ఇద్దరు, ముగ్గురు హీరోలుంటే సినిమాలు చెయ్యాలనుకుంటున్నా. ఇదివరకు నేను చేసిన అలాంటి సినిమాలు మంచి హిట్టయ్యాయి.

ప్రొడక్షన్ అంటేనే భయం

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పరిస్థితి బాగా లేదు. నిర్మాతలకు మేలు చేకూర్చే వాతావరణం ఇవాళ ఇండస్ట్రీలో అసలు లేదు. సినిమాలు తీసినా డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమైపోతోంది. గతంలో నేను ఓ సినిమాని ప్రొడ్యూస్ చేశాను. ఇవాళ ప్రొడక్షన్ అంటేనే భయమేస్తోంది. కొత్త నిర్మాతలు వస్తున్నా నిజాయితీగా సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ. సినిమా నిర్మాణంలో ప్రొఫెషనలిజం తక్కువగా కనిపిస్తోంది. మోజు కోసమో, గ్లామర్ కోసమో వచ్చేవాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే మన సూపర్‌స్టార్ల సినిమాలను కూడా తమిళనాడులో ఎందుకు చూడరో, వాళ్ల సినిమాలను మనమెందుకు చూస్తున్నామో ఆలోచించాలి.

విలన్‌గా చేస్తా

నేను ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నా. నెగటివ్ కేరక్టర్లూ చేస్తా. అయితే 'ఈగ'లో సుదీప్ చేసినటువంటి విలన్ కేరక్టర్ అయితేనే. అంటే కథకు ఆ పాత్ర కీలకంగా ఉండాలి.

- ఆంధ్రజ్యోతి డైలీ, 2 జూలై 2014