Saturday, August 30, 2014

Short Story: Sarangi Vadyagadu Maa Mavayya

కథ: 

సారంగి వాద్యగాడు మా మావయ్య

మా మావయ్య సారంగి మా గొప్పగా వాయిస్తాడు. మావయ్యంటే మా అమ్మకి అన్న. మావయ్యకు సంగీతమంటే ప్రాణం. ఉద్యోగం నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కి పోయినప్పుడు జహీర్‌ఖాన్ అనే ఆయన దగ్గర సారంగి వాద్యం నేర్చుకొన్నాడు. సారంగి మీద వయొలిన్ స్వరాలు కూడా పలికించే మొనగాడు మా మావయ్య. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. నేనింకా హైస్కూలుకు వెళ్లకముందే మా అత్తయ్య చనిపోయింది. దాంతో కూతుళ్లిద్దర్నీ తనే తల్లీ తండ్రీ అయ్యి ఏ లోటూ లేకుండా పెంచాడు మావయ్య. బాగా చదువు చెప్పించాడు. అయితే చీరాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పెద్ద కూతురు వినీల ఇంట్లోంచి వెళ్లిపోయింది. వెళ్లిపోయిందంటే మనవాళ్లు సాధారణంగా అంటుంటారే.. 'లేచిపోయింది' అనీ.. అలా అన్నమాట. చీరాల్లోనే ఉండే ఒక డబ్బున అబ్బాయి ప్రేమలో పడి, పెద్దవాళ్లకు చెప్పా పెట్టకుండా గుళ్లో పెళ్లిచేసుకొని అతనితో వెళ్లిపోయింది. అప్పుడు మావయ్య ఎంత బాధపడ్డాడో. తన ప్రాణం పోయినట్లే విలవిల్లాడాడు. కొద్ది రోజులు ఎవరితోనూ.. అఖరుకి తన చిన్న కూతురు భావనతోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పలకరించడానికి వెళ్లిన మా అమ్మతో "అదేంది అట్లా చేసింది? తల్లిలేని పిల్లలు కదా అన్జెప్పి వాళ్లని ఎండకి కందకుండా ఎట్లా పెంచాను. నా పరువిట్లా తీసుద్దని అనుకోలేదు" అన్నాడు.
అమ్మ "దానికి నువ్వేం చేస్తావులే అన్నయ్యా. నీ మీద గౌరవం ఉంటే అది ఈ పని ఎందుకు చేసుద్ది? నువ్వు దిగులు పెట్టుకోమాక" అని సముదాయించబోతే, "ఆడెవడో దానికి మాయమాటలు చెప్పి తీసకపొయ్యాడు. అది తప్పకుండా ఎప్పటికైనా వొచ్చుద్ది చూడు" అన్నాడు కూతుర్ని వెనకేసుకొస్తా. అమ్మ బిత్తరపొయ్యింది. ఆ తర్వాత చాలా మంది మావయ్యతో వినీల చాలా సంతోషంగా ఉందనీ, ఆమె మాంగారు బాగా ఉన్నోళ్లనీ, మీ అల్లుడు శానా మంచోడనీ చెప్పేతలికి "మంచోడైతే నాకు చెప్పి పెళ్లి చేసుకుంటాడు కానీ ఇట్టా లేవదీసుకపోతాడా" అని పైకని, లోపల్లోపల చాలా సంతోషపడ్డాడు. వినీల సంగతి వాళ్లు ఒకటి చెబితే, ఇంకో రెండు సంగతులడిగి, గోడకి తగిలించిన మా అత్తయ్య పటం ముందు నిల్చొని "ఏమనుకోమాక. అప్పుడది అట్టాంటి పన్జేసిందని తిట్టా. ఇప్పుడది సుఖంగా ఉందని తెలిశాక కూడా తిడ్తానా. దాన్సుఖమే కదా నాకు కావాల్సింది. నీకు సంతోషమే కదా" అన్నాడు.
కొన్ని నెలలు గడిచిపొయ్యాయి. ఒకరోజు మా అమ్మతో "పెద్దదాని బాధ్యత తీరిపోయింది. అది సుఖంగా ఉంది అంతే చాలు. రెండో దానికి ఓ మంచి సంబంధం చూసి చేస్తే ఇంక నాకే దిగులూ ఉండదు" అన్నాడు మావయ్య. ఆ సంగతి నాకు చెప్పిందమ్మ. ఆ తర్వాత రోజే ఆదివారం రావడంతో నేను మావయ్య వాళ్లింటికెళ్లా. నన్న్ను చూడ్డంతోటే భావన కళ్లు మెరిశాయి. నాకు తెలుసు భావనకి నేనంటే ఎంతిష్టమో. "మావయ్యా, నేను భావనని పెళ్లి చేసుకుంటా" అని చెప్పేశా. మామూలుగా అయితే ఎవర్నన్నా మధ్యవర్తుల్ని పంపించి సంబంధం అడిగిస్తుంటారు. సొంత బంధువులైనా సరే. నాకట్లా చెయ్యడం ఇష్టం లేదు. అందుకే డైరెక్టుగా చెప్పేశా. అప్పుడు మావయ్య కళ్లు వెలిగాయి.
"ఏరా రాఘవా. నిజంగానే అంటున్నావా, తమాషా చేస్తున్నావా?" అనడిగాడు మావయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆయనకంటే మాకు ఆస్తులెక్కువ. మా నాన్న బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. చీరాల్లో మాకు రెండు బట్టల దుకాణాలున్నాయి. వాటిలో ఓ షాపుని నన్ను చూసుకొమ్మని నాన్న చెప్పాడు కానీ, నాకు ఇష్టం లేక రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా.
"పెళ్లి విషంలో కూడా తమాషా చేస్తానా మావయ్యా. నాకు భావన అంటే ఇష్టం. తనకీ ఇష్టమైతే చేసుకుంటా" అన్నా, అక్కడే ఉన్న భావన వంక ఆరాధనగా చూస్తా. మావయ్య భావన వంక చూశాడు. అప్పుడు భావన "రాఘవని చేసుకోవడం నాకిష్టమే" అంది, కొంచెం సిగ్గుపడతా. మావయ్య మా పెళ్లిని మా గొప్పగా చెయ్యాలని నిర్ణయించుకొన్నాడు. పెద్ద కూతురి పెళ్లి తానెలాగూ చెయ్యలేకపోయాడు కాబట్టి ఈ చివరి పెళ్లినైనా ఘనంగా చెయ్యాలనేది ఆయన కోరిక. నాకేమో సింపుల్‌గా చేసుకోవాలనుంది. కానీ మావయ్య పడనియ్యలేదు.
"పెళ్లనేది జీవితంలో ఒక్కసారే కదరా వొచ్చేది. నాకు ఈ పెళ్లి తప్ప వేరే ఖర్చేముంది? మీ అంత లేకపోయినా నేను సంపాదించింది కూతుళ్లకి గాక ఎవరికియ్యను? దీనికి మాత్రం అడ్డు చెప్పకురా" అన్నాడు బతిమాలుతున్నట్లు.
దాంతో సరేననక తప్పలేదు. చీరాల ఏరియాలోనే ఖరీదైన కల్యాణ మండపాన్ని మాట్లాడాడు మావయ్య. ఇంకొద్ది రోజుల్లో పెళ్లనంగా ఓ మధ్యాహ్నం పూట మావయ్య, భావన బలవంతపెడితే వాళ్లతో పాటు భోజనం చేస్తున్నా. అప్పుడే తలుపు దగ్గిర ఎవరో వచ్చిన అలికిడి.
"ఎవరూ, లోపలికి రండి" అని కేకేశాడు మావయ్య. ఒక స్త్రీ లోపలికొచ్చింది. ముగ్గురం తినడం ఆపి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టాం. ఆ వొచ్చింది వినీల!
"నాన్నా" అని మావయ్య దగ్గరకొచ్చింది. ఆయనకి నోటెంట మాట రావడం లేదు. చాలాకాలం తర్వాత పెద్దకూతురు కనిపించేటప్పటికి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తోచనట్లు కట్టెలా ఉండిపోయాడు.
నేనే "మావయ్య ఏంటట్లా మాట్లాడకుండా చూస్తున్నావ్, వినీల వొస్తే" అన్నా ఉండబట్టలేక. అయినా ఆయన్లో ఉలుకూ పలుకూ లేదు. అట్లానే చూస్తున్నాడు వినీల వొంక. భావన "అక్కా, ఎంతకాలమైందే నిన్ను చూసి. యెట్టా ఉన్నావే" అని ఓ చేత్తో వాటేసుకుంది.
అప్పుడు చూడాలి మావయ్య మొహం. ఆనందంతో కళ్లెమ్మట నీళ్లు. "ఇన్నాళ్లకు నాన్నని చూడాలనిపించిందా బంగారు తల్లీ" అని వినీలని దగ్గరకు తీసుకున్నాడు. ఇట్లాంటి ఎమోషనల్ సీన్లని సినిమాల్లో చూడ్డమే కానీ నిజ్జంగా చూడ్డం అప్పుడే నాకు.
నిజం చెప్పొద్దూ.. అప్పుడా తండ్రీకూతుళ్ల సీను చూస్తుంటే నాక్కూడా ఏడుపొచ్చింది కానీ బలవంతాన అపుకున్నా.
"సారీ నాన్నా.. సారీ నాన్నా..." అంతకంటే మాట్లాడలేకపోయింది వినీల. మాతో పాటు తను కూడా తృప్తిగా భోంచేసింది. మా పెళ్లి సంగతి తెలిసి రాకుండా ఉండలేకపోయానంది. భావన, నేను పెళ్లి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
మా పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. మాఘమాసంలో చివరి సోమవారం భావన మెళ్లో మూడు ముళ్లూ వేశా. ఆ పెళ్లికి వినీల, వాళ్లాయనా, ఆమె అత్తామామలు కూడా వొచ్చారు. అప్పుడు మావయ్య ఆనందం అంతా ఇంతా కాదు. వినీల వాళ్లాయన పేరు చంద్రశేఖర్. అతను వినీలను అంటిపెట్టుకునే తిరుగుతున్నాడు. వాళ్లను చూసి "చూడముచ్చటైన జంట" అంది మావయ్యతో అమ్మ. అప్పుడు మావయ్య కళ్లు తృప్తిగా మెరిశాయి. వినీల వాళ్లను చూసి కొంతమంది చాటుమాటుగా చెవులు  కొరుక్కుంటున్న సంగతి చూసి కూడా ఆయన పట్టించుకోలేదు. 'అల్లుడి కులమేదైతేనేం, కూతురు సుఖంగా ఉంది. అంతే చాలు' అన్నాడు.
పెళ్లయి పదహార్రోజుల పండగ అయినాక మా అందర్నీ భోజనానికి పిలిచాడు చంద్రశేఖర్. ఆ ఆలోచన వినీలదేనని మా అందరికీ తెలుసు. మావయ్య వెళ్లాలా, వొద్దా అని వొకటే మల్లగుల్లాలు పడ్డాడు. "వెళ్లకపోతే అక్క బాధపడుద్ది నాన్నా. వెళ్దాం" అని పట్టుబట్టింది భావన. నేనూ, అమ్మ కూడా తనను సపోర్ట్ చేశాం.
వినీల వాళ్లింటి దగ్గిర ఊహించనంత మర్యాదలు జరిగాయి. వినీల అత్తామామలు మాపై చూపిన ఆదరంతో మావయ్య అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అంతదాకా బాగా డుబ్బున్నోళ్లకు తలపొగరు ఉంటుందనీ, తమకంటే తక్కువ స్థాయివాళ్లను చులకనగా చూస్తారనీ నాకూ ఓ అభిప్రాయం ఉండేది. వాళ్లను చూశాక నా అభిప్రాయం సవరించుకున్నా, బాగా ఆస్తిపరుల్లోనూ కొంతమంది మంచివాళ్లుంటారని.
ఆ ఇంట్లోని ప్రతిగదినీ దగ్గరుండి చూపించింది వినీల. అంతసేపూ భావన చేయిపట్టుకునే ఉంది. అన్నీ విశాలమైన గదులు. హాలు సంగతైతే చెప్పనక్కరలేదు. అంత పెద్ద ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండటాన్ని మేం గమనించాం. డైనింగ్ హాల్లోకి వెళ్లాక ఆశ్చర్యపోయాం. అక్కడ పదిమంది కూర్చునేంత పెద్ద టేబుల్ ఉంది. అప్పటికే వాటిపై భోజన ఏర్పాట్లు చేసున్నాయి. పెద్దవాళ్లంతా.. వినీల అత్తామామలు, మా అమ్మానాన్నలు, మావయ్య ఒకేపు కూర్చుంటే, కుర్రాళ్లం.. వినీల, చంద్రశేఖర్, భావన, నేను.. ఇంకోయేపు ఎదురెదురుగా కూర్చున్నాం.
ఆ ఇంట్లో పనివాళ్లయిన ఇద్దరు మొగుడూ పెళ్లాలున్నారు. వాళ్లు ముందుగానే టేబుల్ మీద తొమ్మిది వెడల్పాటి అరిటాకులు వేసి, గాజు గ్లాసులో మంచినీళ్లు పోసి ఉంచారు. భోజన పదార్థాలన్నీ టేబుల్ మధ్యలో ఉంచిన పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి, వేడివేడిగా. వినీలే స్వయంగా అందరికీ వడ్డిస్తుంటే చంద్రశేఖర్ ఆమెకు అవీ ఇవీ అందిస్తూ వచ్చాడు. మేం తృప్తిగా, సుష్టుగా భోంచేశాం. భోజనాలయ్యాక అందరం ఇంటిముందున్న చెట్లకింద నీడలో వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. కొద్దిసేపటి దాకా అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు కావడం వల్ల కావచ్చు మేం కలివిడిగా ఉండలేకపోతున్నాం. గాలి చల్లగా వీస్తున్నా.. ఏదో అసౌకర్యం.
అప్పుడే వినీలకు చంద్రశేఖర్ దేనికోసమో సైగచేయడం గమనించా. లోపలికి వెళ్లిన వినీల తెచ్చిన వస్తువును చూసి అందరం ఆశ్చర్యపోయాం. అది సారంగి! మావయ్యయితే వెడల్పయిన కళ్లతోటి దానివొంక చూశాడు. ఆ సారంగి కొత్తదని దాని మెరుపు చెబుతోంది. వినీల దాన్ని చంద్రశేఖర్‌కిచ్చింది. వినీల వొంక నవ్వుతా చూసి సారంగి తీగను మీటాడు చంద్రశేఖర్. అది శ్రావ్యంగా మోగింది. మావయ్య ఆశ్చర్యంలో మునిగితేలుతుండగా యమునా రాగంలో ఒక పాత సినిమా పాట పాడుతూ సారంగి వాయిస్తున్నాడు చంద్రశేఖర్. అది మావయ్యకు ఎంతో ఇష్టమైన పాట. ఒక పల్లవీ, ఒక చరణం పూర్తయ్యాయి. ఆ పాట, ఆ వాద్యం తప్ప మరే చప్పుడూ అక్కడ లేదు.
మేం పరిసరాల్ని మర్చిపోయి అతడి పాటనీ, మధురమైన సారంగి వాద్యాన్నీ ఆస్వాదిస్తున్నాం, ఆ ఎండలో నీడపట్టున. అంతలో ఏదో అపశృతి. పాటకూ, వాద్యానికీ లంకెలేకుండా. సంగీత జ్ఞానం లేని మాకు కూడా అది తెలిసిపోయింది. చప్పున మావయ్య "తాళం తప్పింది అల్లుడుగారూ" అన్నాడు అప్రయత్నంగా. చంద్రశేఖర్ చేతిలోని సారంగి ఆగిపోయింది. "మీ వాద్యం వినాలని ఉంది మావయ్యగారూ" అన్నాడు. నాకెందుకో అతను కావాలనే తాళం తప్పాడనీ, మావయ్యచేత సారంగి వాయించడానికి అలా చేశాడనీ అనిపించింది.
"కానియ్ నాన్నా" అంది వినీల మావయ్య బెరుకును పోగొట్టాలని. అప్పుడు మావయ్య ఆ పాటలోని రెండో చరణాన్నీ, పల్లవినీ సారంగి వాయిస్తూ అద్భుతంగా పాడాడు. సారంగి వాద్యంలోని తీయదనాన్ని మాకందరికీ పంచాడు. "సూపర్.. సూపర్‌గా పాడారు మావయ్యగారూ" అని చంద్రశేఖర్ చప్పట్లు కొడితే, మిగతా అందరం అతనితో జత కలిశాం. దాంతో మావయ్య కాస్త సిగ్గుపడ్డాడు. సారంగిని చూస్తూ దాని తీగలు సవరించాడు. చంద్రశేఖర్‌కు దాన్ని తిరిగివ్వబోయాడు. అతను "మీ వద్దే ఉంచండి మావయ్యా. ఇది మీకు నా గిఫ్ట్" అన్నాడు. మావయ్యకు ఆశ్చర్యమూ, ఆనందమూ.. రెండూ కలిగాయి.
"మీరు నాకు కానుక ఇవ్వడమేమిటి అల్లుడుగారూ.. నేనే మీకివ్వాలి. ఇంత గొప్పింటికి నా కూతురు కోడలైనా మీకేమీ ఇవ్వలేకపోయా" అన్నాడు  మావయ్య కృతజ్ఞత నిండిన గొంతుతో.
"ఎందుకివ్వలేదు మీరు. పెద్ద కానుకే ఇచ్చారుగా" అన్న చంద్రశేఖర్ మాటలకు అందరం అతనివొంక ఆసక్తిగా చూశాం. అతను వినీల చేయిపట్టుకొని "ఇదుగో ఆ కానుక" అన్నాడు. అతని మంచి మనసుకు మావయ్యతో పాటు మేం కూడా చాలా చాలా సంతోషించాం.
"అవునూ.. మీకు సారంగి ఎలా వొచ్చు?" అడిగా కుతూహలం ఆపుకోలేక.
"నేను ఉస్మానియా యూనివర్శిటీలో చదివేప్పుడు జాహెద్ అనే అతను నాకు మంచి ఫ్రెండ్. వాడిది ఉత్తరప్రదేశ్. వాడి దగ్గర సారంగి ఉండేది. బాగా వాయిస్తాడు. వాడివద్దే ఏదో కొద్దిగా నేర్చుకున్నా. పెళ్లయ్యాక వినీల చెప్పింది, మావయ్యకు సారంగి అంటే బాగా ఇష్టమని. జాహెద్‌కు ఫోన్‌చేశా. ఇది పంపించాడు" చెప్పాడు చంద్రశేఖర్. అప్పుడు మావయ్య కళ్లు చెమర్చకుండా ఉండలేకపోయాయి. చంద్రశేఖర్ రెండు చేతులూ పట్టుకొని "సారీ బాబూ" అన్నాడు.
"ఎందుకు మావయ్యాగారూ?"
"మా అమ్మాయిని నాకు తెలీకుండా, చెప్పకుండా పెళ్లిచేసుకొని తీసుకుపొయ్యావని నిన్ను ఎన్ని మాటలన్నానో. నీ మంచి మనసు చూశాక, నేనెంత తప్పు చేశానో అర్థమైంది."
"లేదు మావయ్యాగారూ. మా ప్రేమ సంగతి మీకు చెప్పకుండా నిజంగా తప్పుచేసింది నేనూ, వినీలా. మీరు మా పెళ్లికి ఒప్పుకోరనే సందేహంతోటే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. తనను మా ఇంటికి తీసుకుపోయా. అప్పుడు ఓ తండ్రిగా మీరెంత బాధపడి ఉంటారో. మీరే మమ్మల్ని క్షమించాలి."
అదరి హృదయాలూ తేలికైపోయాయి.
ఇప్పుడు మావయ్య మా పిల్లల్నీ, వినీల పిల్లల్నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ సారంగి వాయిస్తూ, వాళ్లకు నేర్పిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు హాయిగా.

- 4 ఏప్రిల్ 2010, ఆదివారం ఆంధ్రప్రభ