Tuesday, November 30, 2010

Saturday, November 27, 2010

సినిమా: ఒక కాంపౌండు.. మూడు డిజాస్టర్లు!

ఇది నిజంగా బాధాకరమైన సంగతి. ఒకే కాంపౌండుకు చెందిన ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ఒక దాన్ని మించి ఒకటి బోల్తాపడ్డాయి. ఆ మూడు సినిమాలు.. మొన్నటి అల్లు అర్జున్ సినిమా 'వరుడు', నిన్నటి పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి', నేటి రాంచరణ్ సినిమా 'ఆరెంజ్'. అవును.. నిన్ననే (నవంబర్ 26) విడుదలైన 'ఆరెంజ్' అట్టర్‌ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. చిరంజీవి మీద ఈగ వాలినా సహించలేని వాళ్లు నడిపే పాపులర్ వెబ్‌సైట్ 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్నట్లు ఆ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇవ్వొచ్చుగాక.. బాక్సాఫీసు వద్ద 'ఆరెంజ్' తోక ముడిచిందన్నది తొలిరోజు మార్నింగ్ షోకే తేలిపోయింది. థియేటర్ల వద్ద ఈగలు తోలుకుంటున్న బయ్యర్లే దీనికి సాక్ష్యం. వాళ్ల కాంపౌండుకే చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయకుండా తమకెందుకు ఇచ్చారో నైజాంకి ఆ సినిమాని తీసుకున్న ఏషియన్ ఫిలింస్ వాళ్లు ఎందుకు ఆలోచించలేదో తెలియదు. మొత్తానికి అల్లు అరవింద్ సేఫ్. ఏషియన్ సునీల్ నారంగ్ బలి.
పాపం. చిరంజీవి సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్స్ మరోసారి 'ఆరెంజ్'తో తమ పూర్ పర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించింది. ఆ సంస్థ ఇంతవరకు తీసిన సినిమాల్లో కమర్షియల్‌గా ఆడింది ఒక్కటే. అది 'బావగారూ బాగున్నారా'. మరో సినిమా 'రుద్రవీణ' అవార్డులు తెచ్చింది. అంతే. అంతకుమించి ఆ బేనర్‌లో వచ్చిన సినిమాలేవీ జనాన్ని అలరించలేకపోయాయి. 'మగధీర'తో సూపర్‌స్టార్ రేంజిని పొందిన రాంచరణ్ 'ఆరెంజ్'తో టాలీవుడ్ నెంబర్‌వన్ హీరో అయిపోయినట్లేనని కలలు కన్నవాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. అయినా స్వయంగా నాగబాబే 'మగధీర' మ్యాజిక్.. 'ఆరెంజ్' ఎక్స్‌పీరియెన్స్ అన్నాక వాళ్లు మాత్రమైనా ఆ సినిమా గురించి ఎందుకు ఆశలు పెట్టుకున్నట్లు! 'మగధీర' వంటి గొప్ప సినిమా తర్వాత ఆ హీరో ఎలాంటి సినిమా చేయాలి? కచ్చితంగా 'ఆరెంజ్' లాంటి సినిమా మాత్రం కాదు.

Friday, November 26, 2010

సినిమా: 'రామదండు'తో కృష్ణుడు సక్సెసవుతాడా?

'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ పొందిన స్థూలకాయ నటుడు కృష్ణుడు హీరోగా తన ప్రస్థానాన్ని ఎంతకాలం కొనసాగించ గలుగుతాడు? స్థూలకాయులు హీరోగా రాణించరనే నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ రెండు విజయాలు సాధించిన కృష్ణుడు వాటి తర్వాత వెనకడుగు వేశాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక' చిత్రాలు రెండూ ఫ్లాపయ్యాయి. ముఖ్యంగా 'కోతిమూక' డిజాస్టర్‌గా నిలిచింది. అందుకు ఏవీయెస్ డైరెక్షన్ ప్రధాన కారణమని చెప్పాలి. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రధారిగా 'రామదండు' అనే సినిమా తయారవుతోంది. నరేష్‌తో రూపొందించిన 'దొంగల బండి' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన వేగేశ్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమాని అతను రూపొందించాడు. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్ పాత్రని చేశాడు. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో కృష్ణుడు మళ్లీ తన సత్తా చూపుతాడా?

గేలరీ: కుదిరితే కప్పు కాఫీ









Thursday, November 25, 2010

గేలరీ: కత్తి కాంతారావు











ఫోకస్: నిలిచే తార ఎవరు? (చివరి భాగం)

'దేవదాసు'తో ఇలియానా పేరు ఎలా మారుమోగిందో, అలాగే 'ఝుమ్మంది నాదం'తో తాప్సీ పేరు ప్రచార మాధ్యమాల్లో మోగిపోయింది. సహజంగానే ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు బారులు తీరారు. ప్రస్తుతానికైతే ఆమె మూడు సినిమాలు చేస్తోంది. ఒకటి ప్రభాస్‌తో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమా, రెండోది విష్ణుతో మోహన్‌బాబు నిర్మిస్తోన్న 'వస్తాడు నారాజు', మూడోది రవితేజ సినిమా 'వీర'. వచ్చే ఏడాది ఆమె డైరీలో ఖాళీ లేదనేది సమాచారం.
ఈ ఇద్దరితో పాటు మరో తార కూడా నేను సైతం అంటూ ముందుకొస్తోంది. ఆమె శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' ద్వారా నాయికగా పరిచయమైన బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ్. గతంలో శేఖరే పరిచయం చేసిన 'ఆనంద్'తో పరిచయమైన మరో బెంగాలీ తార కమలినీ ముఖర్జీ ఆ సినిమా తర్వాత అనుకున్న మేర రాణించని నేపథ్యంలో రిచా ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. 'లీడర్'లో ఫర్వాలేదనిపించిన ఆమె, రెండో సినిమాలోనే రవితేజ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరు 'మిరపకాయ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. కొత్త తారల్లో అందంతో పాటు కొద్దో గొప్పో అభినయ సామర్థ్యం వున్న తార మధురిమ. 'ఆ ఒక్కడు' అనే సినిమాలో తన నటనతో మెప్పించిన ఆమె ఇటీవల వంశీ సినిమా 'సరదాగా కాసేపు'లో నరేశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. అయితే ఆమెకి చిత్రసీమ ఏమేరకు అవకాశాలు కల్పిస్తుందనే దానిపైనే ఆమె భవితవ్యం ఆధారపడి వుంది.
ఇక తెలుగు తారల సంగతికొస్తే, వారిలో ఏ ఒక్కరూ కొన్నాళ్లపాటైనా ప్రేక్షకుల్లో ఆదరణ నిలుపుకుంటారని చెప్పలేని స్థితి. 'నచ్చావులే'తో మెరిసిన మాధవీలత ఇమేజ్ ఆ తర్వాత ఒక్కసారిగా మసకబారిపోయింది. ఇప్పుడామెని తలచుకుంటున్నవాళ్లే లేరు. 'అష్టాచమ్మా'లో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న స్వాతికి స్టార్ ఇమేజ్ రావడం కష్టమే. 'ఆవకాయ్ బిర్యానీ' చేదుగా మారినా, 'బంపర్ ఆఫర్'తో ఓ మోస్తరుగా రాణించిన బిందుమాధవికి సరైన అవకాశాలు లేవు. మిగతావాళ్లకి ఆ మాత్రం పేరు కూడా లేదు. ఏదేమైనా హీరోతో పాటు హీరోయిన్ పాత్రకీ కథలో ప్రాధాన్యత ఉంటేనే నాయికలు ఎక్కువకాలం పరిశ్రమలో నిలుస్తారు. అందుకు హీరోలు, దర్శకులు, రచయితలు పెద్ద మనసు చేసుకోవాలి. (అయిపోయింది)

Sunday, November 21, 2010

నేటి పాట: ఇచ్చేశా నా హృదయం (ఈ తరం మనిషి)

చిత్రం: ఈ తరం మనిషి (1976)
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి:
అతడు: ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో   ||ఇచ్చేశా||

చరణం 1:
అతడు: చిగురువంటి చినదానికి
చెంపలే సొంపులు
ఆమె: చిలిపి కళ్ల చినవాడితో
చెలిమిలోనే ఇంపులు
అతడు: చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు
చెప్పలేని ఊహలు
చేయబోవు చేతలు   ||ఇచ్చేశా||

చరణం 2:
అతడు: మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు
నువ్వు నా ఊపిరి
ఆమె: నేను నీ లాహిరి
ఇద్దరు: ఇద్దరమూ హిమగిరి   ||ఇచ్చేశా||

ఫోకస్: నిలిచే తార ఎవరు? (రెండో భాగం)

'శశిరేఖా పరిణయం'లో ఆమె నటన కొన్ని సందర్భాల్లో చికాకుని సైతం కలిగించిన సంగతి అనుభవమే. మిగిలిన తారల్లో తమ నటనా కౌశలంతో సినిమాకి వన్నె తెచ్చిన వాళ్లెవరూ లేరు. వాళ్ల సంగతలా వుంచితే ఇప్పుడిప్పుడే వస్తోన్న తారల్లో అయినా సౌందర్య మాదిరిగానో, విజయశాంతి మాదిరిగానో నిలిచేవాళ్లెవరు?
'జోష్' కలిగిస్తుందనుకున్న రాధ కూతురు కార్తీక, 'వరుడు' సరసన కనిపించిన భానుశ్రీ మెహ్రా, 'మరో చరిత్ర' సృష్టిస్తుందనుకున్న అనిత, 'కొమరం పులి'తో పరిచయమైన నికిషా పటేల్ వంటివాళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకే వాళ్లలో ఎవరికీ ఇంతదాకా రెండో సినిమా అవకాశం రాలేదు. 'కొత్త బంగారులోకం'తో పరిచయమై, తొలి సినిమా తోటే ఆకట్టుకున్న బెంగాలీ అమ్మాయి శ్వేతాబసు ప్రసాద్ తర్వాత్తర్వాత మరింత రాణిస్తుందనుకుంటే, అందుకు విరుద్ధంగా క్రేజ్‌ని కోల్పోతూ వస్తోంది.
'ఎవరైనా ఎపుడైనా', 'గాయం 2' చిత్రాల్లో కనిపించిన విమలా రామన్; 'సిద్ధు ఫ్రం సికాకుళం', 'శుభప్రదం' చిత్రాల్లో కనిపించిన మంజరి ఫద్నిస్ కానీ, 'లీడర్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో నటించిన ప్రియా ఆనంద్; 'ఏం పిల్లో ఏం పిల్లడో', 'బావ' సినిమాల్లో నటించిన ప్రణీత కానీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారు. ఇక మిగిలిన వాళ్లలో స్టార్లుగా ఎదిగే సత్తా వున్నవాళ్లు ఇప్పటికైతే ఇద్దరే కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సమంతా కాగా, మరొకరు తాప్సీ.  
గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన 'ఏ మాయ చేసావె'తో పరిచయమైన సమంతా ఎంతగా ఆకట్టుకున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెస్సీ పాత్రలో అమోఘంగా రాణించి, యువతరాన్ని కట్టిపడేసిన ఈ సుందరి ఎన్‌టీఆర్ సినిమా 'బృందావనం'లోనూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. కాజల్ అగర్వాల్ చేసిన భూమి పాత్రతో పోలిస్తే తను చేసిన ఇందు పాత్ర నిడివి తక్కువ. అయితేనేం, ఆ పాత్రలోనూ చక్కగా అలరించింది. ఇప్పుడామె చేతిలో రెండు క్రేజీ సినిమాలున్నాయి. రెండూ సూపర్‌స్టార్ల సినిమాలే. వాటిలో ఒకటి మహేశ్ సరసన చేస్తోన్న 'దూకుడు'. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల రూపొందిస్తోన్న ఈ సినిమాలో సమంతా పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉంది. ఇక రెండోది పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న సినిమా. వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఇవికాక మరెన్నో ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నాయి.
సమంతా లాగే తాప్సీ తెరంగేట్రం కూడా బాగానే జరిగింది. హీరోయిన్లను అతి సుందరంగా చూపించగల సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం' చిత్రంలో మనోజ్ సరసన నటించడం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఉత్తరాది భామ తాప్సీ రూప లావణ్యాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా తాప్సీకి వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువే. (ఇంకావుంది)

Saturday, November 20, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (తొలి భాగం)

కొత్త తారల్లో నిలిచే తార ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా? చాలామందిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు ఏ తారని చూసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. కేవలం గ్లామర్‌ని నమ్ముకొని వస్తున్నందునే వాళ్లు ఎక్కువ కాలం వెండితెర మీద వెలగలేక పోతున్నారు. అందం ఏ కాస్త చెదిరినా వాళ్లకి మరో అవకాశమే ఉండటం లేదు. అంటే 'ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్' అనే మాట ఇక తెలుగు సినిసీమలో వినిపించే అవకాశాలు కూడా తక్కువే. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు చివరి ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు సౌందర్య. అవును. సౌందర్యతోటే తెలుగు సినిమా అసలు సిసలైన నాయిక కూడా మాయమైపోయింది.  
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)

Friday, November 19, 2010

వాల్‌పేపర్: హన్సిక

సినిమా: నాని కెరీర్ 'అలా మొదలైంది'

తప్పకుండా హిట్టయ్యి తనకు పేరు తెస్తుందనుకున్న 'భీమిలి కబడ్డీ జట్టు' అనుకున్నట్లు ఆడకపోవడంతో నాని కాస్త నిరాశపడ్డాడు. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ సినిమాని విషాదాంతం చేయడంవల్ల ఎలాంటి నష్టం వుండదనీ, తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఈ విషాదాంత సినిమాని ఆదరిస్తారనీ బల్లగుద్ది మరీ చెప్పిన నాని ప్రేక్షకుల తీర్పు చూశాక సైలెంటయ్యాడు. ఇప్పుడు అతని ఆశలన్నీ 'అలా మొదలైంది' చిత్రంమీదే వున్నాయి.
ఈ సినిమాతో నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతోంది. గతంలో నందిని, నాని ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. అంటే ఇద్దరూ మంచి దోస్తులన్నమాట. నిత్యమీనన్ హీరోయిన్‌గా పరిచయమవుతోన్న ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్, కృతి కర్బందా కీలక పాత్రలు చేస్తున్నారు. రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా నవంబరులోనే రిలీజ్ కాబోతోంది. 'అష్టాచమ్మా', 'రైడ్' సినిమాలతో సక్సెస్ సాధించడమే కాక, కొత్త హీరోల్లో ప్రామిసింగ్ యాక్టర్‌గా కూడా పేరు సంపాదించుకున్న నానికి 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాలు అసంతృప్తిని కలిగించాయి. ఇప్పుడు 'అలా మొదలైంది'తో అతడి కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా?

Thursday, November 18, 2010

నేటి పాట: కళ్లలో వున్నదేదో (అంతులేని కథ)

చిత్రం: అంతులేని కథ (1976)
రచన: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గానం: ఎస్. జానకి

పల్లవి:
కళ్లలో వున్నదేదో కనులకే తెలుసు
రాళ్లలో వున్న నీరు కళ్లకెలా తెలుసు
నాలో వున్న మనసూ నాకుగాక ఇంకెవరికి తెలుసు

చరణం 1:
నీటిలో ఆరే నిప్పును కానూ
నిప్పున కాగే నీరైన కానూ
ఏదీ కానీ నాలో రగిలే
ఈ అనలాన్నీ ఆర్పేదెవరో   ||కళ్లలో||

చరణం 2:
తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్లు దారి ఓ ముళ్లదారి
రాలేరు యెవరూ నాతో చేరి   ||నాలో||

చరణం 3:
వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకు జీవం రాదా
జరిగేనాడే జరుగును అన్నీ
జరిగిననాడే తెలియును కొన్నీ   ||నాలో||

వాల్‌పేపర్: తమన్నా

సినిమా: లేటు వయసులో సుహాసిని అందాలు!

భర్త పేరుపొందిన గొప్ప డైరెక్టర్ అయినా తను కూడా సొంత అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు తాపత్రయపడే నటి సుహాసిని. అందుకే తమిళంలో చాలా రోజుల క్రితమే డైరెక్టర్‌గా కూడా మారింది. తెలుగులో ఎంతో కాలం నుంచి తల్లి పాత్రలు వేస్తూ ప్రేక్షకులకు సన్నిహితంగా వుంటూ వస్తోన్న ఆమె తాజాగా ఓ సినిమాలో ముదురు నాయిక పాత్రని చేస్తుండటం విశేషం. అదీ రాజేంద్ర ప్రసాద్ సరసన. ఆ ఇద్దరూ కలిసి 'భలేమొగుడు భలేపెళ్లాం' అనే సినిమాలో టైటిల్ రోల్స్ చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ దినేశ్‌బాబు రూపొందిస్తోన్న ఈ సినిమాని జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్నారు. బట్టల్ని పొదుపుగా ఉపయోగించే గ్లామర్ డాల్ కావేరీ ఝా కూడా ఇందులో ఓ పాత్ర చేస్తోంది. చిత్రమేమంటే కావేరీతో పాటీపడుతూ కొన్ని సన్నివేశాల్లో సుహాసిని గ్లామర్ డ్రెస్సులతో కనిపించబోవడం. ఆమె ధరించిన ఓ డ్రస్సులో అయితే ఎద పొంగులు కూడా దర్శనమిస్తున్నాయి. కుర్ర వయసులోనూ ఆమె ఇలా ఎక్స్‌పోజింగ్ చేయలేదు. ఈ ముదురు వయసులో ఆమె అలాంటి డ్రస్సుల్లో కనిపించనుండటమే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులు ఈ గ్లామరస్ సుహాసినిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే.

Wednesday, November 17, 2010

నేటి పాట: అవ్వా బువ్వా కావాలంటే (సోగ్గాడు)

చిత్రం: సోగ్గాడు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

ఆమె: అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి
అతడు: అయ్యేదాకా ఆగావంటే, అవ్వైపోతావ్ అమ్మాయి
ఆమె: అయ్యో పాపం అత్తకొడుకని అడిగిన దిస్తానన్నాను
అతడు: వరుసా వావీ వుందికదా అని నేనూ ముద్దే అడిగాను
ఆమె: నాకూ యిద్దామని వుంది
అతడు: కానీ అడ్డేం వచ్చింది?
ఆమె: అంతటితో నువ్వాగుతావని నమ్మకమేముంది?
అతడు: బస్తీకెళ్లే మరదలుపిల్లా తిరిగొస్తావా మళ్లీ ఈలా
ఆమె: ఇంతకన్నా ఎన్నో ఎన్నో సొగసులు ఎదిగి వస్తాను
అతడు: ముడుపు కట్టుకుని తెస్తావా
ఆమె: మడి కట్టుకు నువ్వుంటావా
అతడు: ఈనగాచి నక్కలపాలు కాదని మాటిస్తావా?
ఆమె: పల్లెటూరి బావకోసం - పట్టా పుచ్చుకు వస్తాను
అతడు: పచ్చపచ్చని బ్రతుకే నీకు పట్టా రాసి యిస్తాను
ఆమె: కమతానికి నువ్వొస్తావా
అతడు: కామందుగ నువ్వుంటావా
ఆమె: శిస్తులేని, సేద్యం చేస్తానంటావా   ||అవ్వా||

పోస్టర్స్: నాగవల్లి










Tuesday, November 16, 2010

సినిమా: శివాజీకి 'లోకమే కొత్తగా' కనిపిస్తోంది!

శివాజీకి 'లోకమే కొత్తగా' కనిపిస్తోంది. టీవీ యాంకర్ నుంచి సినీ నటుడిగా మారిన అతను 'తాజ్‌మహల్' సినిమాతో నిర్మాతగానూ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కన్నడంలో అదే పేరుతో వచ్చి సూపర్‌హిట్టయిన సినిమాకి ఆ సినిమా రీమేక్. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ని నెలకొల్పి హీరోగా నటిస్తూ 'తాజ్‌మహల్'ని నిర్మించిన శివాజీ పన్నెండేళ్ల కెరీర్‌లో కూడబెట్టిన సొమ్మునంతా ఆ సినిమాకే వెచ్చించాడు. కానీ ఆ సినిమా అట్టర్‌ఫ్లాపై అతడికి వేదననే మిగిల్చింది. ఆ అనుభవంతో మళ్లీ సినీ నిర్మాణం జోలికి వెళ్లకూడదనీ, నటుడిగానే కొనసాగాలనీ అతను నిర్ణయించుకున్నాడు. ఇటీవలే 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమాని హీరోగా ఎంజాయ్ చేసిన అతను తాజాగా 'లోకమే కొత్తగా' సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ నాయిక. చాలా కాలం గ్యాప్‌తో ఆమె ఈ సినిమా చేస్తోంది. నిర్మాతగా సంపాదించిన అనుభవం తర్వాత నటుడి పని హాయిగా ఉందని అతను భావిస్తున్నాడు. అంటే మున్ముందు శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నుంచి సినిమాలు వచ్చే అవకాశాలు లేనట్లే.