Friday, August 30, 2013

ఆనాటి సంగతి: ఫాల్కే శిష్యుడు పుల్లయ్య

'గంగావతరణం' చిత్రం కోసం కొల్హాపూర్ పక్కన రాధానగరిలో రెండు కొండలకు తెల్లగా సున్నం వేయించారు దాదాషాహెబ్ ఫాల్కే. ఆ సినిమాలో ఒక జలపాత సన్నివేశం కోసం ఆయన యూనిట్‌తో పాటు గోకాక్ వాటర్ ఫాల్స్ వద్దకు పి. పుల్లయ్య కూడా వెళ్లారు. అప్పుడాయన ఫాల్కేకి శిష్యుడు. అప్పుడక్కడ ధార తక్కువగా ఉంది. "మీరు అనుకున్న ఎఫెక్ట్ రాదేమో" అన్నారు పుల్లయ్య. "ఏయ్, మదరాసీ! ఏం చేద్దామంటావ్?" అడిగారు ఫాల్కే. "ఈ వేళ రాత్రి మనం పైన అడ్డకట్టలు వేసి, నీటిని బాగా నిలువచేసి, రేపు ఉదయం షూటింగప్పుడు ఆ కట్ట తీసేస్తే, ధార జోరుగా పడుతుంది" అన్నరు పుల్లయ్య. యూనిట్‌లో ఉన్నవాళ్లంతా ఆయన వంక వింతగా చూశారు. "ఐతే ఆ బాధ్యత నువ్వే తీసుకో" అన్నారు ఫాల్కే.
వెంటనే పుల్లయ్య అక్కడి జనం కొంతమందిని పోగుచేసి, వారిని పైకి తీసుకెళ్లి, అలాగే అడ్డకట్ట వేయించారు. నీరు బాగా నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం అందరూ షూటింగ్‌కు సిద్ధంగా ఉన్నారు. ఫాల్కే వద్దకు పుల్లయ్య పరుగున వెళ్లి "సేట్ సాబ్! మీరు రిహార్సల్స్‌లో ఆ కట్ట తీయించేస్తే, ధార మొత్తం పడిపోతుంది. ఆ తర్వాత 'టేక్' అప్పుడు ధార పడదు" అని చెప్పారు. "అవునవును. బాగా గుర్తు చేశావు" అంటూ ఫాల్కే "నీటి ధార పడుతున్నట్లు భావిస్తూ అందరూ యాక్ట్ చేయాలి" అని రిహార్సల్స్ చేయించారు.
టేక్ అప్పుడు అడ్డకట్ట తీయించారు. ధార బ్రహ్మాండంగా పడింది. ఆ షాట్‌లో పుల్లయ్య కూడా పాడుతూ నటించాలి. షాట్ మహాద్భుతంగా వచ్చిందంటూ పరమానందంతో ఆయనను ఫాల్కే అమాంతంగా కౌగలించుకున్నారు.

Thursday, August 29, 2013

ఆనాటి సంగతి: 'నేరము-శిక్ష'తో కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన కత్తి వీరుడు

ఎం. బాలయ్య నిర్మించిన 'నేరము-శిక్ష' సినిమా నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా మారారు కత్తి వీరుడు కాంతారావు. అంతకు ముందు ఆయనతో తయారైన జానపద చిత్రాలన్నీ తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైనవే. నిర్మాతలకు బాగా లాభాలు వచ్చేవి. పుష్కలంగా డబ్బు రావడంతో నిర్మాతల దృష్టి సహజంగానే భారీ బడ్జెట్ సినిమాల మీద పడేది. ఆయనకూ భారీ తారాగణంతో సినిమాలు తీయాలనిపించేది. తీశారు. చెయ్యి కాల్చుకున్నారు. సంపాదించిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. మరోవైపు జానపద చిత్రాలు ఉధృతంగా తయారై ఒకదాని మీదొకటి పోటీగా విడుదలవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. దాంతో ఆ నిర్మాతల దృష్టి సాంఘిక చిత్రాల వైపు మళ్లింది. జానపద చిత్రాల నాయకుడన్న ముద్ర పడటంతో కాంతారావుకు సాంఘిక చిత్రాల్లో నాయకుడిగా సరైన అవకాశాలు రాలేదు. ఆయనతో బాలయ్య "మీరేమీ అనుకోకపోతే మా సినిమాలో ఒక ఫాదర్ రోల్ ఉంది. మీరే వెయ్యాలి" అన్నారు. ఒకప్పుడు బాలయ్య కూడా హీరోనే. నిర్మాత అయ్యాక కేరక్టర్స్ అడపాదడపా వేస్తూ వస్తున్నారు. ఆయన వచ్చి అడిగితే కాదనలేకపోయారు కాంతారావు. కానీ ఆయన మిత్రులు కొందరు "హీరో వేషాలు వేసిన మీరు ఒకసారి వయసు మళ్లిన పాత్రలు వేస్తే మీ మీద అదే ముద్ర పడిపోతుంది. ఒప్పుకోకండి" అని చెప్పారు. మరి జరుగుబాటయ్యేది ఎలా? ఒక రాత్రంతా తీవ్రంగా ఆలోచించి అక్కినేని నాగేశ్వరరావును సలహా అడిగారు. "తప్పకుండా ఒప్పుకోండి. మీకిది టర్నింగ్ పాయింట్ కావచ్చు" అని నాగేశ్వరరావు చెప్పారు. ఆయన చెప్పింది నిజమేననీ, ఇండస్ట్రీకి దూరం కాకుండా ఉండాలంటే, కాలానికి తగ్గట్లు సర్దుకు పోవాలనీ తనకు తనే నచ్చచెప్పుకున్నారు కాంతారావు. అలా 'నేరము-శిక్ష'లో తొలిసారి తండ్రి వేషం వేశారు. అదిచూసి దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు 'బంగారు కలలు'లో కేరక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత 'గుణవంతుడు', 'ఓ సీత కథ', 'ముత్యాల ముగ్గు' వంటి సినిమాలు ఆయనను కేరక్టర్ ఆర్టిస్టుగా నిలబెట్టాయి.

Saturday, August 17, 2013

కాంచనమాల మొదటి చిత్రం

'శ్రీకృష్ణ తులాభారం' (1935)లో ఒక అప్రధాన పాత్ర చేసిన కాంచనమాలకు హీరోయిన్‌గా మొదటి చిత్రం 'వీరాభిమన్యు' (1936). సాగర్ మూవీటోన్ పతాకంపై డాక్టర్ అంబాలాల్ ఎం. పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమీన్ దర్శకుడు. ఇది సాగర్ వాళ్లు 'వీరాభిమన్యు' పేరుతోటే హిందీలో తీసిన సినిమాకు రీమేక్. అభిమన్యునిగా పులిపాటి వెంకటేశ్వర్లు, ఉత్తరగా కాంచనమాల నటించగా, కీలకమైన సుభద్ర పాత్రను సురభి కమలాబాయి అద్భుతంగా పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ను ఉత్తర గర్భాదానం సన్నివేశంతో ప్రారంభించారు. తొలిరోజే కాంచనమాల తనకిచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకోనని మొండికేసింది. ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు. ఆమె కోసం డ్రస్సులో కొద్ది మార్పులు చేశారు. కాని ఈ సీనులే కొంత కాలానికి రీషూట్ చేయాల్సి వచ్చినప్పుడు తాను మొదట వద్దన్న డ్రస్సు వేసుకోడానికి కాంచమాల ఒప్పుకుంది. ఆ డ్రస్సులో ఆనాడు కానమాల కనిపించినంత అందంగా తెలుగు తెర మీద చాలా కాలం వరకూ మరో తార కనిపించలేదని చెప్పుకునే వాళ్లు. సాగర్ మూవీటోన్ స్టూడియోలో ఆమె చాలా మంచి ఇంప్రెషన్ కలిగించింది. సెట్టు మీద ఆమె శరీరం వంచి కష్టపడేది. అందుచేత టెక్నీషియన్లు ఆమె మీద చాలా అభిమానంగా ఉండేవాళ్లు. మెహబూబ్ ఆమెకు హిందీ నేర్పి తన చిత్రాల్లో నటింప చేస్తానని అడిగాడు. కాంచనమాల ఒప్పుకుంటే తెలుగు సినిమా ఒక గొప్ప అందాల తారను మిస్సయ్యేది.

Thursday, August 15, 2013

ఆనాటి సంగతి: అంజలి ఎందరికో అమ్మ, వదిన!

అంజలీదేవి కథానాయికగా నటించినప్పటి కంటే 'లవకుశ'లో సీతగా, 'రంగుల రాట్నం'లో తల్లిగా నటించినప్పటి నుంచే ఆమెకు అభిమానులు ఎక్కువయ్యారు. ఆమె నటించిన చిత్రాలు ప్రజల మనసులపై ఎంతటి అమోఘమైన ప్రభావాన్ని చూపించాయో ఆమె ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లిన అనేక సందర్భాల్లో వెల్లడైంది. ఒకసారి ఆమె శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఒక గ్రామం దగ్గర జనం దారికి అడ్డుగా నిల్చుని, కారు రాగానే ఆపారు. కొందరు ఆడవాళ్లు "సీతమ్మ తల్లీ కారు దిగమ్మా" అని ఆప్యాయతతో కోరారు. దిగిన వెంటనే కొంతమంది ఆమె కాళ్లకు నమస్కరించారు. ధాన్యపు కంకుల గుత్తులు కానుకగా సమర్పిస్తూ, నుదుట కుంకుమ తిలకం దిద్ది "తొలి పంటమ్మా! నీకిస్తున్నాం. నీకు జయం కలగాలి" అని అంతా ఏకకంఠంతో పలకడమో ఆమె పరవశించి పోయారు. జీవితం చరితార్థమైందని భావించారు. ఇది 'లవకుశ' విడుదలయ్యాక ప్రజల్లో ఆమెపై ఏర్పడిన పవిత్ర భావం. ఇలాగే 'వదినగారి గాజులు' చూసిన కొంతమంది మగవాళ్లు "నీలాంటి వదిన కావాలని కోరుకుంటున్నాం" అని ఉత్తరాలు రాశారు. 'ఇలవేల్పు', 'రుణానుబంధం', 'రంగుల రాట్నం', 'బడిపంతులు' సినిమాలు వచ్చాక ఆమెను వదినగా, తల్లిగా, సోదరిగా ఊహించుకుని సంబోధిస్తూ వచ్చారు జనం.

Wednesday, August 14, 2013

మంచి కాలం వస్తుంది

చాలామంది విజ్ఞులు, సంస్కారవంతులు, పాత్రికేయులు, పెద్దలు, నిజంగా ఈ సినిమా పరిశ్రమ పట్ల ప్రేమాభిమానాలు కలవాళ్లు 'రోజు రోజుకీ రాసి హెచ్చుతున్నప్పటికీ వాసి తరిగిపోతోంది' అని బాధ పడుతున్నారు. నిజమే. తెలుగులో ఓ సామెత ఉండనే ఉంది - మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందని. అందుచేత, సినిమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటిలో సరుకు తగ్గడం సహజమే. ముఖ్యంగా పాశ్చాత్య చిత్రాలలోని హింసా, అశ్లీల శృంగార ప్రభావం మన చిత్రాల్లో బలంగా పాదుకుపోయాయి. ఇది మనకు బాధాకరమైన విషయమే. ఈ అనారోగ్యకరమైన పరిణామాలకు చిత్ర పరిశ్రమ బయట ఉన్న శ్రేయోభిలాషులు, హితులు ఎంతగా బాధపడుతున్నారో, ప్రతినిత్యం పరిశ్రంలో ఉండి పనిచేస్తున్న పలువురు పెద్దలూ బాధపడుతున్నారు.
అయితే క్రమక్రమంగా సినిమాలు చూసేవారి దృక్పథంలోనూ, తీసేవారి దృక్పథంలోనూ మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం కొద్దిమందైనా చక్కని మానవత్వపు విలువలున్న కథల్నీ, ప్రయోజనాత్మకమైన ఇతివృత్తాల్నీ ఎన్నుకొని, అత్యుత్తమమైన చిత్రాల్ని తీస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం. కొండ కొనకు చేరుకున్నది ఏదైనా కింద పడిపోక తప్పదు. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్న అశ్లీల శృంగార, హింసా చిత్రాల గతి కూడా అంతే. పరిణామ సిద్ధాంతం ప్రకారం మంచి కాలం వస్తుందనే ఆశిద్దాం.

ఆనాటి సంగతి: అప్పటి చిన్న శాస్త్రి ఇప్పటి కళాతపస్వి!

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'కలిసొచ్చిన అదృష్టం' (1968) చిత్రంలో సీనియర్ నటి శాంతకుమారిని ఓ పాత్ర కోసం బుక్ చేసినప్పుడు "మీకు కథ వినిపించడానికి మా డైరెక్టర్‌ను ఎప్పుడు పంపించమంటారు?" అనడిగారు నిర్మాత మిద్దే జగన్నాథరావు. "డైరెక్టర్ గారు మా ఇంటికి రావడమా? నేనే మీ ఆఫీసుకు వచ్చి కథ వింటాను" అన్నారు శాంతకుమారి. కంపెనీ కారులో ఆఫీసుకు వెళ్లిన ఆమెకు అక్కడ చిన్న శాస్త్రి అనే యువకుడు "రండమ్మా" అంటూ నవ్వుతూ స్వాగతం పలికాడు. అతడిని చిన్న శాస్త్రి అనీ పిలిచేవాళ్లు. ఆ చిన్న శాస్త్రి వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్‌గా ఎప్పుడూ ఖాకీ యూనిఫాంలో కనిపించేవాడు. ఇప్పుడు కూడా అవే దుస్తుల్లో ఉన్నాడు. "నువ్విక్కడున్నావేమిటి చిన్న శాస్త్రీ?" అనడిగారు శాంతకుమారి. "ఈ పిక్చర్‌కు నేనేనమ్మా డైరెక్టర్‌ను" అన్నాడతను. "నీ ఇల్లు బంగారం కానూ! నువ్వెప్పుడు డైరెక్టర్‌వి అయ్యావు నాయనా!" అని ఆశ్చర్యపోయారు శాంతకుమారి. ఆ చిన్న శాస్త్రే డైరెక్టర్ కె. విశ్వనాథ్. అతను కథ వినిపిస్తుంటే, తన పాత్ర కాస్త విచిత్రంగా కొత్త తరహాలో ఉన్నట్లనిపించింది ఆమెకు. "నేనెప్పుడూ ఏవో ఏడ్చే పాత్రలే చేశాను కానీ, వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే ఈ హాస్య పాత్రను చేయగలనా?" అన్నారామె. "మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? రామారావు గారు కూడా ఆ పాత్రకు మేరే కరెక్టుగా సూటవుతారని చెప్పారు" అన్నాడు విశ్వనాథ్. ఆ కామెడీ పాత్రలో తనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని శాంతకుమారి భయపడ్డారు. కానీ సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రను అంతా మెచ్చుకున్నారు. అలాగే 'చిన్ననాటి స్నేహితులు' (1971) చిత్రంలో కూడా విశ్వనాథ్ ఆమె చేత మరో కొత్త పాత్రను అందరి మెప్పూ పొందేలా చేయించాడు.

Monday, August 12, 2013

ఆనాటి సంగతి: వేటూరికి మహదేవన్ క్లాస్


ఎన్టీఆర్, జయప్రద, జయసుధ నటించిన 'అడవిరాముడు ' (1976) సినిమా చరిత్రను సృష్టించి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. సత్య చిత్ర సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చగా వేటూరి రాసిన ప్రతి పాటా సూపర్ హిట్టే. వాటిలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ' పాట ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా పేరు తెచ్చుకుంది. వాడవాడలా మోగిపోయింది. ఆరింటిలో ఐదు పాటల్ని ఒకే తాళం.. త్రిశ్రంలో రాశారు వేటూరి. అందుకని ఆరో పాటనైనా చతురస్రంలో రాయమని ఆయనకు సూచించారు మహదేవన్. ఆరవది క్లైమాక్స్ పాట. వేటూరి రాసిన పాటను రాఘవేంద్రరావు ఓకే చేసి మహదేవన్ కు  ఇచ్చారు. అది మారు వేషాలతో సాగే పాట. మహదేవన్ కు సన్నివేశం చెప్పి పనిమీద వెళ్లిపోయారు రాఘవేంద్రరావు. పాట చూడగానే మహదేవన్ కోపంగా వేటూరిని చూస్తూ 'ఏం రాశావ్? చదువు' అన్నారు. 'చూడరా చూడరా సులేమాను మియ్యా' అని చదివారు వేటూరి. 'ఇది ఏం తాళం?' అని మహదేవన్ అడిగితే చతురస్రంలో రాశానన్నారు. తను పాడి వినిపించి 'ఇది చతురస్రమా?' అనడిగారు మహదేవన్. కాదన్నారు వేటూరి. తాళం మార్చి రాయమని ఆయనడిగితే ఎలా మార్చాలో వెంటనే వేటూరికి తెలియలేదు. ఇది గమనించిన మహదేవన్ ఇంకో రెండు 'చూడరా'లు తగిలిస్తే సరిపోతుందని చెప్పారు. దాంతో 'చూడర చూడర చూడర చూడర ఒక చూపూ సులేమాన్ మియా' అని తిరిగి రాశారు వేటూరి. అప్పుడది అవలీలగా చతురస్రంలో వచ్చింది. అందరూ విని ఊగిపోయారు.