Saturday, March 30, 2013

'రెండుజెళ్ల సీత' రివ్యూ


రచయిత జంధ్యాల అల్లిన పసందైన కథ, దర్శకుడు జంధ్యాల నడిపిన హుషారైన కథనం, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చిన వినసొంపైన బాణీలు, ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాలరెడ్డి కెమెరా పనితనం కలిపి 'రెండుజెళ్ల సీత'ను ముగ్ధమోహనంగా తయారుచేశాయి. ఆబాల గోపాలానికి నచ్చేట్టు చేశాయి. ఈ సినిమాలో కథ చాలా సింపుల్. గోపి, కృష్ణ, మోహన్, మూర్తి అనే నలుగురు ఆకతాయి అబ్బాయిలు ఓ అందమైన అమ్మాయిని ప్రేమించేయాలనుకుంటారు. అందమైన అమ్మాయి ఉండే కుటుంబానికి తమ భవనంలో ఓ వాటని అద్దెకు ఇవ్వాలని భావిస్తారు. దీని కోసం సుబ్బారావు అనే అమాయకుణ్ణి ఆటపట్టించి ఓ వాటాని ఖాళీ చేయిస్తారు. ఆ వాటాలో సీత అనే అమ్మాయి తన అమ్మా నాన్నలతో ఆ వాటాలో దిగుతుంది. నలుగురు కుర్రాళ్లూ అమాంతం ఆమెని ప్రేమించేసి, బోలెడు కలలు కంటారు. తన్నులు కూడా తింటారు. రాజీకి వచ్చి "మా నలుగురిలో ఎవరంటే నీకిష్టం" అని సూటిగా సీతనే అడుగుతారు. "నాకు మధు అంటే ఇష్టం" అని చెబుతుంది సీత. ఆ మధు ఎవరన్నది సినిమాలోనే చూడాలి.
ఈ కథలోని సన్నివేశాలకు జంధ్యాల రాసిన సంభాషణలు, ఆ సన్నివేశాల్ని ఆయన చిత్రీకరించిన తీరు వల్ల ఆద్యంతం ఆహ్లాదం కలుగుతుంది. సీత కోసం అబ్బాయిలు పడే పాట్లు, వారి చేతుల్లో సుబ్బారావు పడే అగచాట్లు బాగా నవ్వింపజేస్తాయి. ఈ నవ్వుల మధ్య హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాలూ ఉన్నాయి. వరకట్న దురాచారం కష్ట నష్టాల్ని సైతం ఇందులో చూపించారు జంధ్యాల. రమేశ్‌నాయుడు కూర్చిన బాణీల్లో 'లేడి వేటా లేడీ వేటా', 'రెండు జెళ్ల సీతా తీపి గుండె కోతా', 'మందారంలో ఘుమఘుమనై', 'కొబ్బరి నీళ్లా జలకాలాడి' పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. విశాఖ సముద్ర తీర ప్రాంతంలోనూ, అరకు లోయలోనూ ఈ పాటల్ని నయనానందకరంగా చిత్రించాడు గోపాలరెడ్డి.
రెండుజెళ్ల సీతగా కొత్తమ్మాయి మహాలక్ష్మి చక్కగా నవ్వుతూ నిజంగానే యువతకు 'తీపి గుండెకోత' పెట్టించింది. ఆమె తల్లి పుష్పలత ఇందులోనూ ఆమెకి తల్లిగానే నటించారు. నలుగురు అబ్బాయిలుగా నరేశ్, ప్రదీప్, రాజేశ్, శుభాకర్ హుషారుగా నటించారు. సుబ్బారావుగా సుత్తివేలు నటన, ఆయన డైలాగులు స్పెషల్ ఎట్రాక్షన్. శ్రీలక్ష్మి నవ్వులు పంచుతుంది. ఇది జంధ్యాలకు మరింత పేరు తెచ్చిన సినిమా.

Saturday, March 23, 2013

రమేశ్‌బాబు 'ప్రేమ చరిత్ర' ఏమైంది?

తమిళ డైరెక్టర్ టి. రాజేందర్ అంటే మనకి మొదట గుర్తొచ్చే సినిమా 'ప్రేమ సాగరం'. తెలుగులో అది యేడాది పైగా ఆడింది. ఇప్పుడు ఆయన నేరుగా తెలుగులో 'ప్రేమదాసు' అనే సినిమా తీస్తున్నారు. టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు. గతంలోనే ఆయన తెలుగులో ఓ సినిమా ప్రారంభించారు కానీ మధ్యలోనే ఆపేశారు. అందులో హీరో ఎవరో తెలుసా? కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు. ఆ సినిమా పేరు 'ప్రేమ చరిత్ర'. పాతికేళ్ల క్రితం... అంటే 1988 మార్చి 14న మద్రాస్ బొటానికల్ గార్డెన్స్‌లొ షూటింగ్ మొదలైంది. రమేశ్‌బాబు సరసన శ్రీభారతి అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇది మామూలు ప్రేమకథ కాదనీ, అసాధారణ ప్రేమకథనీ రాజేందర్ చెప్పారు. మాటల రచయితగా మహారథినీ, పాటల రచయితగా సీతారామశాస్త్రినీ తీసుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం, దర్శకత్వాల్ని రాజేందర్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. సుధాలయా పిక్చర్స్ బేనర్‌పై శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరిబాబు ఈ సినిమా నిర్మాతలు. కానీ తర్వాత ఈ సినిమా షూటింగ్ అటకెక్కింది. రమేశ్‌బాబు 'ప్రేమ చరిత్ర' వెలుగు చూడలేదు.

Wednesday, March 13, 2013

ఇంటర్వ్యూ: తాప్సీ

"పదేళ్ల తర్వాత, హీరోయిన్ కేరక్టర్లు చేయడం అయిపోయాక దేశం వదిలి నన్నెవరూ గుర్తించని వేరే దేశానికి వెళ్లిపోతా. అక్కడ సాధారణ జీవితం గడుపుతా'' అని ఆశ్చర్యపరిచింది అందాల తార తాప్సీ. ఓ మామూలు అమ్మాయిగా బతకడమే ఇష్టమంటున్న ఆమె ఇటీవల విడుదలైన 'గుండెల్లో గోదారి' చిత్రంలో నెగటివ్ షేడ్ ఉన్న సరళ పాత్రలో చక్కగా రాణించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆ పాత్రని ఎందుకు చేసిందనే విషయంతో పాటు అనేక అంశాల్ని పత్రికలవారితో పంచుకుంది ఈ ఢిల్లీ సుందరి. ఆమె చెప్పిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశాలు ఆమె మాటల్లోనే..

'గుండెల్లో గోదారి' రిలీజైన రోజు నేను ముంబైలో ఉన్నా. చాలా కాల్స్ వచ్చాయి ఫ్యాన్స్ నుంచి. అందరూ చెప్పిన దాంట్లో కామన్‌గా ఉన్న సంగతేమంటే 'సినిమా బాగుంది మేడమ్. మీ యాక్టింగ్ అదిరిపోయింది' అని. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాది 'గ్రే' (నెగటివ్) షేడ్ కేరక్టర్. ఇందులో నేను హీరోయిన్ని కాను. హీరోయిన్ అంటే లక్ష్మీనే. నాదో కేరక్టర్ మాత్రమే. ఓ కేరక్టర్ ఆర్టిస్టుగా, అదీ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని మొదట భయపడ్డాను. 'కొత్త తాప్సీ కనిపించింది' అనీ, 'పల్లెటూరి అమ్మాయిగా తాప్సీ బాగుంది' అనీ చాలామంది ప్రశంసించారు.
వేరొకరైతే చేసేదాన్ని కాదు
ఈ సినిమాకి ముందు లక్ష్మీ నాకో పెద్ద మెసేజ్ పెట్టింది. 'తాప్సీ ప్లీజ్ కథ విను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. కన్సిడర్ చేయి' అనేది దాని సారాంశం. నేను జవాబిచ్చాను. 'ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్. నేను చేస్తాను. నాకు కథ కూడా చెప్పాల్సిన పని లేదు' అని. కేవలం లక్ష్మీ కోసం, డైరెక్టర్ కుమార్ నాగేంద్ర కోసం కథ వినకుండానే చేయడానికి ఒప్పుకున్నాను. లక్ష్మీ కాకుండా ఇంకెవరైనా ఈ పాత్రని ఆఫర్ చేస్తే కచ్చితంగా చేసేదాన్ని కాదు. హీరోయిన్ కంటే తక్కువ స్థాయి కేరక్టర్‌ని చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే డబ్బు కోసం ఈ సినిమా చెయ్యలేదు. లక్ష్మీ చాలా నాటీ కో-యాక్టర్. ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ తారల్లో లక్ష్మీ ఒకరు.
లేడీ విలన్‌గా చేస్తా
నాకు సవాలు విసిరే పాత్రలంటే ఇష్టం. అలాంటి పాత్రలిస్తే అందర్నీ నా నటనతో ఆశ్చర్యపరుస్తాను. ఈ సినిమాతో నాకు అవార్డు వస్తుందో, లేదో తెలీదు కానీ లక్ష్మికి వస్తుందనే నమ్మకం ఉంది. చాలా విషయాల్లో తను నాకు ఇన్‌స్పిరేషన్. పెద్ద కుటుంబం అండగా ఉన్నా, సొంతంగా పైకి రావాలనే తపన ఆమెలో కనిపిస్తుంటుంది. నాకు నచ్చితే పూర్తి స్థాయి లేడీ విలన్ కేరక్టర్ చేయడానికీ సిద్ధం. మొదట కథ ముఖ్యం.
యాక్.. చేపలా!
గోదావరి ప్రాంతంలో షూటింగ్ చేయడం గొప్ప అనుభవం. అక్కడి జనం చూపిన ఆదరణ మర్చిపోలేను. అక్కడ అంత అందమైన లొకేషన్లు ఉంటే పాటల కోసం విదేశాలకు ఎందుకెళ్తారో అర్థం కాదు. గోదావరిలో ఉన్నన్ని అందమైన లొకేషన్లు వేరే ఎక్కడ ఉన్నాయి! అయితే గోదావరిలో నాకో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. చేపలంటే నాకసహ్యం. ఆ వాసన నాకు పడదు. గ్రిల్డ్ ఫిష్ అయితే ఓకే. కానీ రాజమండ్రి చేపలకి బాగా ఫేమస్. అక్కడ షూటింగ్ చేసేప్పుడు చేపలు తినమని లక్ష్మీ బలవంతపెట్టేది. చేప పట్టుకున్నప్పుడల్లా చాలా సేపు చేతులు కడిగేదాన్ని. అయితే చాలా రకాల చేపల ఆహారం అక్కడ తిన్నానండోయ్. మాంసాహారంలో నాకు నచ్చేది ఒక్క చికెనే. శాకాహారం విషయానికొస్తే నార్త్‌లో దాల్ రోటీ, సబ్జీ, సౌత్‌లో సాంబార్ ఇడ్లీ, వడ ఇష్టం.
సాధారణ జీవితం ఇష్టం
నేను చేసిన హిందీ సినిమా 'చష్మే బద్దూర్' విడుదలైతే దేశంలోని అన్ని ప్రాంతాల వారికీ నేను తెలిసిపోతా. సాధారణ జీవితం గడపాలనేది నా కోరిక. ఎప్పుడూ స్టార్‌గా ఉండాలని లేదు. ఇప్పుడు దక్షిణాదిలో నేను స్టార్‌నైనా ఢిల్లీలో ఓ మామూలమ్మాయినే. దాన్ని ఎంజాయ్ చేస్తుంటా. హిందీ సినిమా రిలీజ్ తర్వాత అది కూడా వీలుపడదు. అందుకే దేశాన్ని వదిలేస్తా.
నడిచే ఫిల్మ్ స్కూలు
ఏప్రిల్ 5న 'చష్మే బద్దూర్' రిలీజవుతోంది. బాలీవుడ్‌లో అది నా డ్రీమ్ డెబ్యూ. వెంకటేశ్‌గారితో చేస్తున్న 'షాడో'లో ఓ నార్మల్ హీరోయిన్ కేరక్టర్ చేస్తున్నా. కానీ చాలా స్టయిలిష్ లుక్‌తో కనిపిస్తాను. వెంకటేశ్‌గారు నడిచే ఫిల్మ్ స్కూల్‌లా కనిపిస్తారు. ఆయనకు తెలీని విషయం ఉండదు. హోదాతో సంబంధం లేకుండా మనుషుల్ని ఎలా గౌరవించాలో ఆయన్నుంచి నేర్చుకున్నా. 'షాడో' తర్వాత గోపీచంద్ సరసన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా వస్తుంది. తెలుగులో ఇదివరకు ఎన్ని ఎడ్వంచరస్ సినిమాలొచ్చినా ఈ తరహా ఎడ్వంచరస్ సినిమా రాలేదు. ఈ సినిమా షూటింగ్‌లో ఓసారి గుర్రం నా కాలిని తొక్కేసింది. నొప్పితే ఎంత బాధపడ్డానో. కానీ ఐ లవ్ దట్ మూవీ. అందులో నాది పరమ భక్తురాలి పాత్ర. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాను. తమిళంలో విష్ణువర్థన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నా.
ఒక కాఫీ జీవితాన్నే మార్చేసింది
మహత్‌తో మాట్లాడి చాలా కాలమైంది. ఇప్పుడు మా మధ్య మాటలేం లేవు. 'చష్మే బద్దూర్' షూటింగ్ సమయంలో వరుణ్ ధావన్‌ను మొదటిసారి కలిశాను. ఆ తర్వాత మారియట్‌లో చాలా మంది స్నేహితులతో కలిసి కాఫీ తాగాం. దాంతో మా మధ్య ఏదో నడుస్తున్నట్లు ప్రచారం చేసేశారు. వన్ కాఫీ చేంజ్డ్ ద హోల్ థింగ్.

Sunday, March 3, 2013

శరత్‌బాబుపై రమాప్రభ కామెంట్స్


శరత్‌బాబుతో ప్రేమ, విడాకులపై రమాప్రభ ఏమన్నారంటే...
"అదో ప్రేమ వ్యవహారం. నేను శరత్‌బాబును గానా, ఆయన నన్నుగానీ ప్రేమించలేదు. కానీ యాక్సిడెంటల్‌గా జరిగిపోయింది. అందరూ ప్రేమించేస్తున్నారు, అందరూ తిరుగుతున్నారు.. అంటూ ముందుకెళ్లిపోయా. ఆయన అవకాశం కోసం నా దగ్గర చేరారు. శరత్‌బాబు చాలా తోతుగా ప్లాన్ వేశారని తెలుసుకోలేకపోయా. అందరితో సరదాగా ఉండటాన్ని వివాదం చేశారు. కొందరు తారలు కూడా అసూయతో మా మధ్య ఇబ్బందులు సృష్టించారు. శరత్ కొద్ది కొద్దిగా ఆస్తిని చేజిక్కించుకున్నారు. విడిపోయేటప్పుడు మిగిలినవి నేను రాసిచ్చేశాను.