Saturday, March 30, 2013

'రెండుజెళ్ల సీత' రివ్యూ


రచయిత జంధ్యాల అల్లిన పసందైన కథ, దర్శకుడు జంధ్యాల నడిపిన హుషారైన కథనం, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చిన వినసొంపైన బాణీలు, ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాలరెడ్డి కెమెరా పనితనం కలిపి 'రెండుజెళ్ల సీత'ను ముగ్ధమోహనంగా తయారుచేశాయి. ఆబాల గోపాలానికి నచ్చేట్టు చేశాయి. ఈ సినిమాలో కథ చాలా సింపుల్. గోపి, కృష్ణ, మోహన్, మూర్తి అనే నలుగురు ఆకతాయి అబ్బాయిలు ఓ అందమైన అమ్మాయిని ప్రేమించేయాలనుకుంటారు. అందమైన అమ్మాయి ఉండే కుటుంబానికి తమ భవనంలో ఓ వాటని అద్దెకు ఇవ్వాలని భావిస్తారు. దీని కోసం సుబ్బారావు అనే అమాయకుణ్ణి ఆటపట్టించి ఓ వాటాని ఖాళీ చేయిస్తారు. ఆ వాటాలో సీత అనే అమ్మాయి తన అమ్మా నాన్నలతో ఆ వాటాలో దిగుతుంది. నలుగురు కుర్రాళ్లూ అమాంతం ఆమెని ప్రేమించేసి, బోలెడు కలలు కంటారు. తన్నులు కూడా తింటారు. రాజీకి వచ్చి "మా నలుగురిలో ఎవరంటే నీకిష్టం" అని సూటిగా సీతనే అడుగుతారు. "నాకు మధు అంటే ఇష్టం" అని చెబుతుంది సీత. ఆ మధు ఎవరన్నది సినిమాలోనే చూడాలి.
ఈ కథలోని సన్నివేశాలకు జంధ్యాల రాసిన సంభాషణలు, ఆ సన్నివేశాల్ని ఆయన చిత్రీకరించిన తీరు వల్ల ఆద్యంతం ఆహ్లాదం కలుగుతుంది. సీత కోసం అబ్బాయిలు పడే పాట్లు, వారి చేతుల్లో సుబ్బారావు పడే అగచాట్లు బాగా నవ్వింపజేస్తాయి. ఈ నవ్వుల మధ్య హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాలూ ఉన్నాయి. వరకట్న దురాచారం కష్ట నష్టాల్ని సైతం ఇందులో చూపించారు జంధ్యాల. రమేశ్‌నాయుడు కూర్చిన బాణీల్లో 'లేడి వేటా లేడీ వేటా', 'రెండు జెళ్ల సీతా తీపి గుండె కోతా', 'మందారంలో ఘుమఘుమనై', 'కొబ్బరి నీళ్లా జలకాలాడి' పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. విశాఖ సముద్ర తీర ప్రాంతంలోనూ, అరకు లోయలోనూ ఈ పాటల్ని నయనానందకరంగా చిత్రించాడు గోపాలరెడ్డి.
రెండుజెళ్ల సీతగా కొత్తమ్మాయి మహాలక్ష్మి చక్కగా నవ్వుతూ నిజంగానే యువతకు 'తీపి గుండెకోత' పెట్టించింది. ఆమె తల్లి పుష్పలత ఇందులోనూ ఆమెకి తల్లిగానే నటించారు. నలుగురు అబ్బాయిలుగా నరేశ్, ప్రదీప్, రాజేశ్, శుభాకర్ హుషారుగా నటించారు. సుబ్బారావుగా సుత్తివేలు నటన, ఆయన డైలాగులు స్పెషల్ ఎట్రాక్షన్. శ్రీలక్ష్మి నవ్వులు పంచుతుంది. ఇది జంధ్యాలకు మరింత పేరు తెచ్చిన సినిమా.

No comments: