Saturday, October 31, 2015

South Indian Film Chamber of Commerce Committee 1975

President: P. Pullaiah
Vice-Presidents: Sundarlal Nahta, K. Rajagopal Shetty
Honorary Secretaries: PS Ramakrishna Rao, D. Ramanujam
Treasurer: TS Muthuswamy
Organizing Committee: RM Krishna Swamy, Murali Krishna Prasad, B. Nagi Reddy, G. Adiseshagiri Rao, P. Gangadhara Rao, KP Kottarkar, R. Lakshmanan, M. Murugan, MS Nayak, S. Pundarikakshaiah, DVS Raju, RS Srinivasan, V. Srinivasan, VC Subbaraman, RM Veerappan

Actor Parupalli Satyanarayana Filmography

1. Sati Savitri (1933)
2. Prithvi Putra (1933)
3. Lava Kusa (1934)
4. Sri Krishna Leelalu (1935)
5. Dasavatharamulu (1937)

Friday, October 30, 2015

All Eyes on BRAHMOTSAVAM

అందరి కళ్లూ 'బ్రహ్మోత్సవం' పైనే!

'శ్రీమంతుడు' వంటి కెరీర్ టాప్ ఫిల్మ్ తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా అంటే, అందరి కళ్లూ దానిపై ఉండటం సహజం. అందుకే ఇప్పుడందరూ 'బ్రహ్మోత్సవం' వైపు చూస్తున్నారు. సెట్స్‌పై వెళ్లడానికి చాలా ముందుగానే టైటిల్ పెట్టేయడం, దానికి అనూహ్యమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆరంభానికి ముందే సినిమా సూపర్‌హిట్ అనే భావన ఇండస్ట్రీలోని వాళ్లలోనే కాకుండా, బయటివాళ్లలోనూ వచ్చేసింది. ఇప్పటికే మహేశ్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి కుటుంబ కథా చిత్రం వచ్చి రూ. 50 కోట్లు పైగా వసూలు చేసింది. వ్యక్తిగత జీవితంలో శ్రీకాంత్ ఆటుపోట్లు ఎదుర్కోవడం గమనించిన మహేశ్, అతనికి నైతిక మద్దతునూ, ఆత్మస్థైర్యాన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరో సినిమా చేస్తానని, మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకొమ్మని చెప్పడం కొద్దిమందికే తెలిసిన నిజం. మహేశ్ చూపించిన అభిమానంతో, ఇనుమడించిన ఉత్సాహంతో 'బ్రహ్మోత్సవం' స్క్రిప్టును సిద్ధం చేసుకొని వినిపించాడు శ్రీకాంత్. ఫస్ట్ సిట్టింగ్‌లోనే దాన్ని ఓకే చేశాడు మహేశ్. శ్రీకాంత్ మునుపటి సినిమా 'ముకుంద' ఫ్లాపైనా దానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు మహేశ్. 'బ్రహ్మోత్సవం' సబ్జెక్టును అంతగా అతను ఇష్టపడ్డాడు. ఇప్పుడు దాని షూటింగ్ లాంఛనంగా మొదలైంది. టైటిల్‌కు తగ్గట్లే ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా, కన్నుల పండువగా ఉంటుందని సమాచారం. రెండు వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్ కావడంతో, 'బ్రహ్మోత్సవం' కూడా ఘన విజయం సాధిస్తే.. రెండు వరుస విజయాలు సాధించినట్లవుతుందనీ, ఆ తర్వాత రెండో హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టొచ్చనీ మహేశ్ అభిమానులు ఆశిస్తున్నారు.

గమనిక: మహేశ్ మొదటి హ్యాట్రిక్ - 'దూకుడు' (2011), 'బిజినెస్‌మేన్' (2012), 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (2013)

Thursday, October 29, 2015

Actor Nellore Nagaraja Rao Filmography

1. Sakunthala (1932)
2. Srirama Paduka Pattabhishekam (1932)
3. Ramadasu (1933)
4. Seetha Kalyanam (1934)
5. Sati Tulasi (1936)
6. Draupadi Vastrapaharanam (1936) (Sakuni)
7. Chitra Naleeyam (1938)
8. Raitu Bidda (1939) (Tahsildar)
9. Kalachakram (1940) (Judge)

Nani gains momentum

నాని రేంజ్ పెరిగింది

'భలే భలే మగాడివోయ్'తో కెరీర్‌లోని 13 సినిమాల్లో 6వ విజయాన్ని అందుకున్నాడు నాని. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తొలి వారానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 14 కోట్లు వసూలు చేసి, అందర్నీ ఆశ్చర్యపర్చింది. నాని కెరీర్‌లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ 'ఈగ'. రాజమౌళి డైరెక్టర్ కావడం, భారీ బడ్జెట్‌తో, భారీ ప్రమోషన్‌తో రావడం వల్ల, దాని క్రెడిట్ మొత్తం రాజమౌళికే వెళ్లింది. పైగా అందులో నానిది దాదాపు స్పెషల్ అప్పీరెన్స్ అని చెప్పాలి. కానీ 'భలే భలే మగాడివోయ్' సినిమాకి సంబంధించి డైరెక్టర్ మారుతితో పాటు నానికి కూడా క్రెడిట్ దక్కింది. మతిమరుపు లక్కీ కేరక్టర్‌లో బాగా రాణించి, దాదాపు సినిమానంతా తన భుజాలపై మోశాడు నాని. ఈ సినిమాతో అతని విమర్శకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునుపటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' కూడా మంచి పేరు తెచ్చినా, ఆర్థికంగా లాభాలు తేలేదు. ఇప్పుడు ఇటు ప్రశంసలు, అటు లాభాలు దక్కడంతో బిజినెస్ సర్కిల్స్‌లో నాని స్థాయి పెరిగింది. దీని విజయంతో.. సబ్జెక్టుల విషయంలో నాని మరింత శ్రద్ధ చూపితే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి 'బ్యాంకబుల్ స్టార్'గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sunday, October 25, 2015

Tribute To Actor and Singer Saigal

హిందీ 'దేవదాస్' అంటే సైగల్!

గోదావరి ఆవకాయ, గుంటూరు గోంగూర, శ్రీశ్రీ కవిత్వం, పొందూరు ఖద్దరు ఎంత ఫేమస్సో, సైగల్ పాట అంత ఫేమస్సు. 1935 నుండి 1945 వరకు పదేళ్ల కాలం భారత వెండితెరపై సైగల్ రాజ్యమేలాడు. 'సినిమా పాటనా?' అని ఈసడించుకొనే వాళ్లు సైతం ఘంటసాల పాట వింటే ఎట్లా మైమరచిపోతారో, ఆ రోజుల్లో సైగల్ పాట కూడా అంతే గొప్పగా పేరు గడించింది. ఈ రోజుల్లోనూ సైగల్ పాట వినిపిస్తే రెండు చెవులప్పగించేవాళ్లు ఎందరో. సైగల్ అంటే పాట. పాటంటే సైగల్. భాషకూ, భావానికీ ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. గానానికీ, భావానికీ కూడా అదేవిధమైన బాంధవ్యం ఉంది. సైగల్‌కు మించి దాన్ని ప్రదర్శించిన మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. నటుల్లో సైగల్‌ను మించినవాళ్లు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ సైగల్ 'దేవదాస్' ప్రత్యేకతే వేరు. తర్వాత దిలీప్ కుమార్, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్రలో రాణించారు. దిలీప్‌ను మించి అక్కినేని 'దేవదాస్'గా గొప్ప పేరు సంపాదించిన మాట నిజం. అయితే శరశ్చంద్రుని 'దేవదాస్'ను అత్యంత సహజంగా ప్రదర్శించింది సైగల్ అని నమ్మేవాళ్లు ఎక్కువే. సైగల్ పాట శాస్త్ర సంగీతమా, భావ సంగీతమా అనే చర్చకు తావేలేదు. సంగీతానికి పరాకాష్ఠ ఆయన స్వరమే. కటిక చీకట్లో పండు వెన్నెల కురిపించే ప్రభావం, యావత్ జీవరాశినీ ఏడిపించగల శక్తీ ఆయన పాటకున్న మహత్తు. సైగల్‌కున్న కంఠం ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఆయనలా దాన్ని ఉపయోగించుకున్నవాళ్లు ఎంతమంది? చుక్కలెన్ని ఉన్నా చంద్రుడొక్కడే. గాయకులెందరున్నా సాటిలేని మహా గాయకుడు సైగల్ ఒక్కడే. అమృతప్రాయమైన తన పాటలో సైగల్ ఎప్పటికీ జీవించే ఉంటాడు.

Friday, October 23, 2015

Director Should Know The Basics

దర్శకుడు తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయం

కళల్లో సినిమాకళకున్న పాపులారిటీ మరిదేనికీ లేదు. శిల్పకళలో చెక్కడానికి ఎంత వరకు అవకాశం ఉందో అంతవరకే ప్రతిభను వ్యక్తీకరించడానికి వీలవుతుంది. సంగీతానికి నాదమే ఆధారం. చిత్రలేఖనంలో రంగులు, రేఖలతోనే చిత్రకారుడు ప్రతిభను చూపించగలడు. భాష మీదే ఆధారపడి రచన చేస్తాడు రచయిత. నాటకం కొంతవరకు సినిమాకు దగ్గరగా ఉన్నా, ప్రధానంగా అది సంభాషణలు, నటుల ప్రతిభ మీదే ఆధారపడుతుంది. నాటకాన్ని అచ్చులో చదువుకున్నా మొత్తం అర్థమవుతుంది. సినిమా కథనం అలా కాదు. సినిమాలో సంభాషణలు ఒక భాగం మాత్రమే. నాటకానికి లాగా సినిమాకి రచయిత కేవలం స్రష్ట అయితే సరిపోదు. శబ్దాలతో, సంభాషణలతో, లైటింగ్‌తో, నటుల అభినయంతో, కళాకుశలంతో, చాయాగ్రహణంతో సినిమాని సర్వాంగ సుందరంగా సినిమా కథను మలచాల్సినవాడు దర్శకుడు. 24 శాఖలను సమన్వయపరచి, కళాత్మకంగా సినిమాని రూపొందించడం దర్శకుని బాధ్యత. అన్ని శాఖలకు సంబంధించిన అవగాహన, పాత్రల చిత్రణ, సన్నివేశాల కల్పన కరతలామలకమైతేనే ఏ దర్శకుడైనా రాణిస్తాడు.
వీటిలో ప్రతి ఒక్కటీ కథను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. అందువల్ల వీటిని సమపాళ్లలో మేళవించడం దర్శకునికి కత్తిమీద సాము తరహా వ్యవహారం. సంభాషణలు, సందర్భం, నటీనటుల ఆహార్యం, పాత్రల ధోరణి విషయాల్లో ఔచిత్య భంగం కాకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మధ్యతరగతి వాడి కథ చెబుతూ అతడి ఇంటిని సంపన్నవంతంగా, అతడి దుస్తులు ఖరీదైనవిగా చూపించడం పరస్పర విరుద్ధ విషయం. అవన్నీ అతడి ఊహల్లో భాగంగా చూపిస్తే అది సాత్విక గుణం సంపాదించుకొని కథకు ప్రయోజనకారిగా మారుతుంది. దాన్నే మనం కథన శిల్పం అంటాం. తారతమ్య ప్రదర్శనకూ, విరోధభావ ప్రదర్శనకూ మధ్య ఉండే తేడాని దర్శకుడు గ్రహించాలి. పేదింటి యువకుడు సంపన్నురాలైన ప్రేయసి ఇంటికి టిప్‌టాప్‌గా తయారై వస్తే అది విరోధభావ ప్రకటన. తన ఆర్థిక స్థితికి తగ్గ బట్టలతోనే అతడు వస్తే, ఆ తారతమ్యం వల్ల అతడి పేదరికాన్ని దుస్తులతోనే ప్రదర్శించేందుకు దర్శకుడికి వీలు దొరికినట్లవుతుంది. దీనిని దృశ్య సమ్మేళనం అంటాం.
సాధారణ దర్శకుడికీ, ప్రతిభావంతుడైన దర్శకుడికీ తేడాని సులువుగా పట్టేయవచ్చు. సాయంత్రం వేళ మించినా స్కూలుకు వెళ్లిన కూతురు ఇంటికి రాకపోతే తల్లి ఆదుర్దాతో ఇంటి బయట గడప మీద నిల్చుని దగ్గర్లో కూతురు ఎక్కడైనా ఉందేమో అని పేరుపెట్టి కేక వేస్తుంది. ఈ సన్నివేశాన్ని సాధారణ దర్శకుడైతే కూతురు రాకపోవడం వల్ల తల్లి ఆదుర్దాతో ఏడుస్తున్నట్లు చూపించి, తర్వాత ఖాళీ గడప చూపిస్తాడు. అదే ప్రతిభావంతుడైన దర్శకుడైతే, తల్లిని సన్నివేశంలో కనిపించనీయకుండా, ఆమె ఆదుర్దాతో కూతుర్ని పిలిచినట్లు చూపించి, ఖాళీ గడప చూపిస్తాడు. దీనివల్ల అక్కడ రావాల్సిన ఎమోషన్ వచ్చేస్తుంది. ఇక్కడ దృశ్యం - ఖాళీ గడప, శబ్దం - తల్లి కేక. ఈ రెండింటి సమ్మేళనంతోనే తల్లి ఆదుర్దానంతా చెప్పగలిగాడు దర్శకుడు. నిశ్శబ్దం అంటే చప్పుడు లేకపోవడమే. కానీ కేవలం చప్పుడు లేనంత మాత్రాన నిశ్శబ్దం పూర్తిగా అవగాహన కాదు. ఉదాహరణకు ఒక తోటలో ఆకులు కూడా కదలకుండా ఉన్న చెట్లు, మూసి ఉన్న ఒక ఇంటి కిటికీలు, నిద్రపోతున్న మనుషులను ఎలాంటి చప్పుడూ లేకుండా చూపి, తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తే, అప్పుటి దాకా ఉన్న నిశ్శబ్దం అప్పుడు మన అనుభవంలోకి వస్తుంది.
ఉన్న పరిమితుల్లోనే కథను వివరంగా చెప్పేందుకు దర్శకుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తపడాల్సి వస్తుంది. సంభాషణలు, సంగీతం, దృశ్యం, నటీనటుల హావభావాలు.. వీటితో ఏ సందర్భంలో కథను ఆసక్తికరంగా చెప్పగలుగుతాడో ఎప్పటికప్పుడు దర్శకుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. నిజానికి ఒక సన్నివేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటే ఉంటుంది. తిరిగి అందులోనే సందర్భం చెడకుండా ఇతర చిన్న విషయాల్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.

Tuesday, October 20, 2015

Bad Phase of Telugu Film Music

అథమ స్థాయిలో మన సినిమా సంగీతం

ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రజల వైజ్ఞానిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక జీవితాభివృద్ధి కోసం జరిగే ప్రయత్నాల్లో ప్రముఖ స్థానంలో ఉంటున్నది సినిమాయే. ఏ యేటికాయేడు సినిమా కొత్తపుంతలు తొక్కుతూ ప్రజల్ని ప్రభావితం చేస్తూ వస్తోంది. అయితే ఎలాంటి మనుషులనైనా పరవశింపజేయగల సంగీతం విషయానికొస్తే తెలుగు సినిమా పాటిస్తున్న ప్రమాణాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మనిషికి భౌతిక, మానసిక బాధల నుండి ఉపశమనాన్నిచ్చే శక్తి సంగీతానికుందని ఇదివరకే రుజువైంది. తెలుగు సినిమాల్లో 'ఆ పాత మధురాలు' తప్ప  మనసును రంజింపజేసే, తన్మయత్వానికి గురిచేసే పాటలు నేడు మచ్చుకైనా కనిపిస్తున్నాయా? మన శాస్త్రీయ సంగీతానికున్న విశిష్టతనూ, శక్తినీ గాలికొదిలేసి 'బీట్' పేరుతో నేటి సంగీత దర్శకులు కడుతున్న బాణీలు ఎంత ఘోరంగా వుంటున్నాయో చెప్పనలవి కాదు. ఇవాళ వస్తున్న పాటల్లో నాలుగు కాలాలపాటు వినిపించే సత్తా ఉన్న వాటిని వేళ్ల మీద లెక్కిద్దామన్నా కనిపించడం లేదు. ఇళయరాజా తర్వాత కర్నాటక సంగీతాన్ని మేళవించి రాగాలు కడుతున్న సంగీత దర్శకులే లేకుండా పోయారు. కీరవాణిలాంటి వాళ్లు ఎప్పుడో ఓసారికానీ దాని జోలికి వెళ్లడం లేదు. ఈ విషయంలో మనకంటే తమిళ సినిమాలే ఉత్తమంగా కనిపిస్తున్నాయి. అడపాదడపా అయినా వారి సినిమాలు రాగయుక్తమైన పాటల్ని వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మనం రాగయుక్తమైన పాటలంటే 'శంకరాభరణం', 'సాగరసంగమం' వంటి పాతికేళ్ల కిందటి సినిమాల్నే ఉదాహరణలుగా చూపించుకోవాల్సిన దుస్థితి.
మన సంగీత శాస్త్రంలో 72 జనక రాగాలు, వాటి భేదాలతో పుట్టిన 34,848 జన్య రాగాలు ఉన్నాయంటారు. అయితే వాటిలో అత్యధిక భాగం పుస్తకాల్లోనే ఉండిపోయాయి కానీ, ఆచరణలో కనిపించవు. హనుమత్తోడి, మాయా మాళవగౌళ, వఠభైరవి, ఖరహరప్రియ, హరికాంభోజి, ధీర శంకరాభరణం, శుభపంతువరాళి, కామవర్థని, గమనశ్రమ, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమం, మేచకల్యాణి వంటి పేరుపొందిన జనక రాగాల్ని సందర్భానుసారం మన సినిమా పాటల్లో ఉపయోగించవచ్చు. జ్యోతిస్వరూపిణి రాగంతో త్యాగయ్య, మేఘరంజని రాగంతో ముద్దుస్వామి దీక్షితులు, నాగవరాళి రాగంతో చిన్నస్వామి దీక్షితులు తమ విశిష్టతను  చాటుకున్నారు. నాగయ్య 'త్యాగయ్య' సినిమా అంత గొప్ప పేరు సంపాదించుకోడానికి అందులోని పాటలు అమితంగా దోహదం చేశాయనేది నిజం. విశ్వనాథ్ 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'సిరివెన్నెల', 'శ్రుతిలయలు' వంటి చిత్రాలు జన బాహుళ్యంలోకి అంతగా వెళ్లడానికి శాస్త్రీయ సంగీతాన్ని సందర్భోచితంగా ఉపయోగించుకోవడమే ప్రధాన కారణం. ఈనాటికీ వాటిలోని పాటలు జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి కదా.
నేటి నిర్మాతలకు గానీ, దర్శకులకు గానీ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి లేకపోవడం వల్ల బీట్, వెస్ట్రన్ సంగీతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్లేం అడిగితే అదివ్వడమే తమ పని కాబట్టి సంగీత దర్శకులూ ఫాస్ట్ బీట్‌లతోటే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఫలితంగా మిగతా భాషల పాటలతో పోలిస్తే తెలుగు సినిమా పాటలు నాణ్యతా ప్రమాణాలపరంగా తీసికట్టుగా ఉంటున్నాయి. ఇప్పటివరకూ సినిమా పాటల్ని పరిశీలిస్తే మెలోడీలే కలకాలం గుర్తుండిపోతున్నాయనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకులకు, నిర్మాతలకు అర్థమయ్యేట్లు చెప్పాల్సిన బాధ్యత సంగీత దర్శకుల మీద ఉంది. సినిమాలో కనీసం ఒక పాటైనా శాస్త్రీయ బాణీలతో కూడిన మేలోడీగా ఉండేట్లు ఒప్పించాలి. ఆ తర్వాత నెమ్మదిగానైనా మెలోడీలే సినిమాల్లో రాజ్యం చేసే రోజులు వస్తాయి. చెవులకు వీనుల విందుగా ఉండే ఆ పాటల వల్ల జన హృదయాలు ఉల్లాసాన్ని పొందుతాయి.

Tuesday, October 13, 2015

RUDRAMADEVI Facing Scarcity Of Theaters

- ఆంధ్రజ్యోతి డైలీ, 13 అక్టోబర్ 2015

Rajamouli's Answers With BAAHUBALI

సీక్వెల్ పనిలో.. 



పోటీ తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, సినిమా జూదంగా మారిపోయిన సంధి కాలంలో డైరెక్ట్‌ చేసిన పది సినిమాల్లో తొమ్మిది సినిమాలు నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాయంటే, వాటిలో రెండు ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయంటే ఆ దర్శకుణ్ణి ఏమని పిలవాలి? దర్శకుల్లోనే ‘బాహుబలి’ అని. ఆ ‘బాహుబలి’ యస్‌.యస్‌. రాజమౌళి కాకపోతే ఇంకెవరవుతారు! ఇవాళ ‘బాహుబలి’ ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌. రాజమౌళి ఓ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలతో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలిపిన ఆయన ‘బాహుబలి: ద బిగినింగ్‌’తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒక్క ‘సై’ మినహా ఆయన రూపొందించిన మిగతా సినిమాలన్నీ హిట్టే. ‘సై’ కూడా కాస్ట్‌ ఫెయిల్యూర్‌ మాత్రమే. ‘బాహుబలి’ సినిమా తెలుగులోనే కాకుండా దక్షిణ భారతావనిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రకెక్కి, ప్రపంచవ్యాప్త వసూళ్లలో టాప్‌ 3 ఇండియన్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇక దేశీయ వసూళ్లలో నెంబర్‌వన్‌ ప్లేస్‌ ‘బాహుబలి’దే. ఇంతటి చరిత్రకు కారకుడైన రాజమౌళి ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ అయిన ‘బాహుబలి: ద కంక్లూజన్‌’ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు. విమర్శకుల ప్రకారం మొదటి సినిమాను ‘ఇంటర్వెల్‌’లో ఆపేసిన ఆయన, పోస్ట్‌ ఇంటర్వెల్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ భాగాల్ని తీస్తున్నాడన్న మాట. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య పరిచయం ఎలా జరిగింది? ఆ పరిచయం ప్రణయంగా ఎలా మారింది? అది పెళ్లిగా ఎలా రూపాంతరం చెందింది? దేవసేనపై మోజుపడ్డ భల్లాలదేవ దీన్నంతా చూస్తూ ఊరుకున్నాడా? బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? అమరేంద్ర బాహుబలి కొడుకు, పసికందు మహేంద్ర బాహుబలిని రాజమాత శివగామి ఎలాంటి పరిస్థితుల్లో కాపాడింది? భర్త హత్యకు కొడుకు మహేంద్ర/శివుడు సాయంతో దేవసేన ఎలా ప్రతీకారం తీర్చుకుంది?... ఇవన్నీ ‘బాహుబలి’ చూశాక మన మనసుల్లో తలెత్తిన ప్రశ్నలు. వాటన్నింటికీ సీక్వెల్‌లో సమాధానాలివ్వబోతున్నాడు రాజమౌళి. దీని కథేమిటో ముందే మనకు తెలిసినా, ఎలా తీసుంటాడనే కుతూహలం అందరిలోనూ ఉంది. సన్నివేశాల కల్పన, భావోద్వేగాల చిత్రణ విషయంలో సామాన్య ప్రేక్షకులఊహల్ని ఎప్పుడూ సంతృప్తిపరుస్తూనే ఉన్నాడు రాజమౌళి. ‘బాహుబలి: ద కంక్లూజన్‌’తోనూ ఆయన ఆ మ్యాజిక్‌ను మరోసారి చూపిస్తాడనేది ఖాయం. చూడాల్సింది.. అది ‘బాహుబలి’ని మించుతుందా, లేదా?.. అని మాత్రమే.

- ఆంధ్రజ్యోతి డైలీ, 10 అక్టోబర్ 2015

Saturday, October 10, 2015

Beginning Days: Vijaya Nirmala

తొలి రోజుల్లో.. విజయనిర్మల

పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు నిర్మల. తర్వాత నీరజగా పేరు మారింది. తిరిగి సినిమాల్లో విజయనిర్మలగా రూపాంతరం చెందింది. తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన తారగా ఆమెకు సముచిత స్థానాన్ని ఇచ్చారు. విజయనిర్మల తండ్రికి మద్రాసులో ఉద్యోగం. ఆమె మద్రాసులోనే పుట్టి, అక్కడే పెరిగింది. చిన్నతనంలోనే నాటకాల్లో నటించాలని ఆమెకు కోరిక. దానికి పెద్దల ఆమోద ముద్ర లభించక ముందే తిరువెంకట మొదలియార్ వద్ద నృత్యంలో శిక్షణ తీసుకుంది. చిన్నతనంలోనే ఆమె ఇచ్చిన ఓ నృత్య ప్రదర్శనను చూసి, ఓ తమిళ చిత్ర నిర్మాత తన 'మత్స్యరేఖ' అనే చిత్రంలో చిన్నప్పటి హీరో వేషం ఇచ్చారు. ఆ సినిమాలో ప్రసిద్ధ నటి ఎస్. వరలక్ష్మి చెల్లెలు నిర్మల, చిన్న హీరో విజయనిర్మల సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆ తర్వాత 'సింగారి' అనే ఇంకో తమిళ చిత్రంలో చిన్నప్పటి పద్మినిగా కనిపించింది విజయనిర్మల. 'మాంగల్యం' అనే తమిళ చిత్రంలో నటించాక, ఎన్.ఎ.టి. వారి 'పాండురంగ మహత్యం' చిత్రంలో చిన్నప్పటి పాండురంగనిగా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా తన మొదటి తమిళ, తెలుగు చిత్రాల్లో ఆమె మగ పాత్రలు ధరించడం విశేషం.
తల్లిదండ్రులు పెట్టిన నిర్మల పేరును బి.ఎన్. రెడ్డి 'రంగులరాట్నం'లో నీరజగా మార్చారు. ఆ పేరుతోటే శ్రీకాంత్ పిక్చర్స్ వారి 'పిన్ని' చిత్రంలోనూ నటించింది. కానీ విజయా సంస్థ 'షావుకారు' చిత్రాన్ని 1965లో 'ఎంగవీటు పెణ్' పేరుతో నిర్మిస్తూ, అందులో కథానాయిక పాత్రకు నిర్మలను తీసుకోవడంతో, ఆ సినిమాతో ఆమె 'విజయ'నిర్మలగా స్థిరపడిపోయింది. ఆ పాత్ర ద్వారా తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఆ తర్వాత వచ్చిన 'సాక్షి', 'భామా విజయం', 'ఉపాయంలో అపాయం' చిత్రాలు విజయనిర్మల స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. 'పూలరంగడు', 'నడమంత్రపు సిరి', 'బంగారు పిచుక', 'బంగారు గాజులు', 'లవ్ ఇన్ ఆంధ్రా' చిత్రాలు ఆమె నటనకు మెరుగులు దిద్దాయి.
తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయిక పాత్రలను ధరిస్తూనే మలయాళ చిత్రాల్లోనూ నాయికగా నటించింది విజయనిర్మల. 'భార్గవి నిలయం' చిత్రంలో నటనకు గాను అవార్డును కూడా అందుకుంది. 'కల్యాణ ఫొటో', 'కల్యాణ రాత్రయిళ్', 'పూదక్కణ్ణి', 'కండదిల్లా', 'ఉద్యోగస్తు', 'నిశాగంధి', 'కళిప్పావై', 'కరుత్తా పౌర్ణమి' వంటి మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాలలో విరివిగా అవకాశాలు రావడంతో తమిళ, మలయాళ చిత్రాలను తగ్గించుకుంది. అయినా తమిళ చిత్రం 'పణమా పాశమా' సినిమా విజయఢంకా మోగించడంతో అక్కడ విజయనిర్మల పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో 'అలేక్' అనే ముద్దుపేరు కూడా సంపాదించింది. తెలుగులో 'ముహూర్తబలం', 'బొమ్మలు చెప్పిన కథ', 'ఆత్మీయులు', 'లంకెబిందెలు', 'విచిత్ర కుటుంబం', 'ప్రేమలు పెళ్లిళ్లు' చిత్రాలు మంచిపేరు తెచ్చాయి.
మలయాళ చిత్రం 'భార్గవి నిలయం'లో నటించే ముందే ఆమెకు వివాహమైంది. ఆమె భర్త షిప్ డిజైనింగ్ ఇంజినీర్ (తర్వాత కాలంలో హీరో కృష్ణతో ఆమెకు ద్వితీయ వివాహం జరగడం వేరే సంగతి). వారికి నరేశ్ అనే కొడుకు పుట్టాడు. తొలి సినిమా  'మత్స్యరేఖ'లో నటించేప్పుడే ఆమెకు మరచిపోలేని సంఘటన ఎదురైంది. అందులో చిన్నతనంలో హీరోయిన్‌ను హీరో ఉయ్యాలలూపే సీన్ తీస్తున్నారు. హీరోగా నటిస్తోంది విజయనిర్మల. హీరోయిన్‌ను బలంగా ఊపి పక్కకు తప్పుకోమని డైరెక్టర్ చెప్పాడు. సరేనని బలంగా ఉయ్యాల ఊపాక, పక్కకు తప్పుకోవడం మరిచిపోయి అలాగే నిల్చుంది విజయనిర్మల. ఇంకేముంది, ఉయ్యాల అదే వేగంతో వెనక్కివచ్చి, ఆమె తలకు బలంగా కొట్టుకుంది. ఆమైనే ఆమె కిందపడిపోయింది. వెంటనే అక్కడున్నవాళ్లు  కంగారుగా వచ్చి ఆమెను పైకి లేవనెత్తారు. అప్పుడే సినిమా షూటింగులంటే ఎన్ని కష్టాలుంటాయో అర్థమైంది విజయనిర్మలకు.

Tuesday, October 6, 2015

Synopsis Of MAA BABU (1960) Movie

మా బాబు కథాంశం:

డాక్టర్ ఆనంద్ భార్య ఓ పిల్లవాణ్ణి ప్రసవించి వెంటనే మరణిస్తుంది. అదే సమయంలో ఆనంద్ ఆస్పత్రిలోనే రత్నాదేవి అనే వితంతువు ఓ మగశిశువును కని స్పృహతప్పిపోతుంది. ఆమె శిశువు చనిపోతాడు. అంతకు ముందే ఆ శిశువును కాపాడతానని ఆమెకు వాగ్ధానం చేస్తాడు ఆనంద్. ఆ వాగ్ధానం వమ్మయ్యిందనే ఆవేదన, తన కొడుకును సాకేవాళ్లెవరనే నిస్పృహతో, క్షణికోద్వేగానికి గురై తన బిడ్డనే ఆమె బిడ్డగా రత్నాదేవికి అప్పగిస్తాడు. రత్నాదేవి కానీ, ఆమె బంధువులకు కానీ పిల్లవాడు మారిపోయాడనే విషయం తెలీదు. ఒక్క నర్సుకు మాత్రమే ఈ రహస్యం తెలుసు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమె వద్ద మాట తీసుకుంటాడు ఆనంద్. తన కొడుకుపై ఉన్న ప్రేమకొద్దీ తరచూ రత్నాదేవి ఇంటికి వెళ్తుంటాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల మాయ అనే నర్సును అతను పెళ్లాడాల్సి వస్తుంది. ఆమె ఎవరో కాదు, మొదటి నర్సు కూతురే. ఆనంద్ తండ్రి మరణిస్తూ, నెలకు రూ. 10 వేల వరకూ ఆదాయం వచ్చే తన ఆస్తి తన మనవడికి చెందుతుందని వీలునామా రాస్తాడు. వైద్య శాస్త్ర రీత్యా మాయకు సంతాన యోగ్యం ఉండదు. దాంతో రత్నాదేవి వద్ద పెరుగుతున్న అబ్బాయి ఆనంద్ కొడుకేననీ, అతణ్ణి తెచ్చుకుంటే ఆస్తి దక్కుతుందనీ మాయకు ఉపాయం చెబుతుంది తల్లి. దాంతో మాయ కోర్టుకెక్కుతుంది. ఆ బాబు డాక్టర్ ఆనంద్ కొడుకేనని కోర్టు నిర్ధారిస్తుంది. బాబు దూరమవడంతో రత్నాదేవి కుప్పలా కూలిపోతుంది. బలవంతాన తన దగ్గరకు తెచ్చుకున్న బాబును మాయ మాలిమి చేసుకోలేకపోతుంది. బాబు ఇంటి నుంచి పారిపోతాడు. వాడిని వెంటాడుతూ మాయ వెళ్తుంది. ఆనంద్, రత్నాదేవి కూడా వెళ్తారు. మాయ ఓ ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తుంది. అలా రెండో భార్యను కూడా పోగొట్టుకున్న ఆనంద్ చివరకు బాబును రత్నాదేవికిచ్చేసి తన జీవితాన్ని వైద్యవృత్తికే అంకితం చేస్తాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, రేలంగి, ఎం. సరోజ, ఎం.ఎన్. రాజం, కన్నాంబ, హనీ ఇరానీ
సంగీతం: టి. చలపతిరావు
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
విడుదల తేదీ: 22 డిసెంబర్ 1960

Thursday, October 1, 2015

Beginning Days: Actress Chandrakala

తొలి రోజుల్లో.. చంద్రకళ


చంద్రకళ తల్లిదండ్రులు ఉడిపికి చెందినవారైనా, ఆమె విశాఖపట్నంలో 1947 డిసెంబర్ 25న జన్మించింది. రెండో యేట నుంచే నటరాజ రామకృష్ణ వద్ద నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఐదో యేట నుంచే ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత విఖ్యాత నర్తకి బాలసరస్వతి శిక్షణలో నృత్యశాస్త్రంలోని వివిధ పదరీతులను అభ్యసించి, 1959లో మద్రాసులో అరంగేట్రం ఇచ్చింది. ఓ వైపు నర్తకిగా పేరు మారుమోగిపోతుంటే, మరోవైపు సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తొలిగా 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో యయాతి కుమార్తెగా నటించి చిత్రరంగానికి పరిచయమైంది. 'సతీ సుకన్య' చిత్రంలో బాల యముని పాత్ర పోషించింది. 1962 ప్రాంతంలో హిందీ సినీ నిర్మాత, దర్శకుడు రమేశ్ సైగల్ తాను నిర్మించే 'షోలా ఔర్ షబ్నం' సినిమాలో యంగ్ హీరోయిన్ కేరక్టర్ ఇచ్చారు. బేబీ చంద్రకళ నుంచి కుమారి చంద్రకళగా మారాక కన్నడ చిత్రం 'ఔన్‌గూడు'లో నటించి ఉత్తమ సహాయనటి అవార్డును అందుకుంది. అప్పుడే వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. గోకుల్ ఆర్ట్ థియేటర్స్ నిర్మించిన 'విశాల హృదయాలు' చిత్రంలో నటించి రాణించింది. 'ఆడపడుచు' సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అదివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఈ సినిమా మరో ఎత్తు. ఆ సినిమా విడుదలయ్యాక ఆమెకు ఫ్యాన్ మెయిల్ విపరీతంగా పెరిగింది. ఎన్ఏటీ వారి 'వరకట్నం' చిత్రం ఆమెకు మరింత పేరుతెచ్చి, మరో పది సినిమా అవకాశాలను తీసుకొచ్చింది. 'అన్నదమ్ములు', 'ప్రతీకారం', 'ఆత్మీయులు', 'మాతృదేవత' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. కన్నడ, తమిళ, మరాఠీ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఓ వైపు నటిస్తూనే, మరోవైపు చెన్నైలోని ఎస్.ఐ.ఇ.టి. విమెన్స్ కాలేజీ విద్యార్థినిగా ఆమె బి.ఎ. పూర్తి చేయడం విశేషం.