Friday, July 11, 2008

Just title gets success?

ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి టైటిల్ బాగా దోహదం చేస్తుందని సినిమా రంగంలోని చాలామంది నమ్ముతారు. టైటిల్ అనేది సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది కానీ, విజయానికి మొత్తంగా అదే దోహదం చేయదనీ, సినిమా కథలో పస లేకపోతే టైటిల్ ఎంత బాగున్నా, వింతగా వున్నా ఆ సినిమా నడవదనీ విశ్లేషకులు అనే దాంట్లో తప్పు కొంచెం కూడా లేదు. అయినప్పటికీ మన దర్శకులు తమ సినిమా టైటిళ్లను విభిన్నంగా పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు.
ఎవరన్నా కాస్త డబ్బులు ఖర్చు పెడుతూ సరదా చేసుకునే వాణ్ణి చూసి మనం 'వాడికేంటిరా జల్సా పురుషుడు' అంటుంటాం. అందులోని 'జల్సా'ని టైటిల్‌గా పెట్టి సక్సెస్ సాధించారు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు. రెండక్షరాలతో చాలా సినిమాలే వచ్చాయి కానీ అన్నీ విజయం సాధించలేక పోయాయి. గత యేడాది నుంచి చూసుకుంటే యోగి, టాస్, ఆట, లక్ష్యం, మున్నా, మంత్ర, డాన్, కృష్ణ, వాన, గమ్యం, జల్సా, కంత్రి, రెడీ వచ్చాయి. లక్ష్యం, మంత్ర, కృష్ణ, గమ్యం, జల్సా విజయం సాధించగా; ఆట, డాన్ బాక్సాఫీసు వద్ద యావరేజ్ ముద్రను వేసుకున్నాయి. యోగి, టాస్, మున్నా, వాన, కంత్రి సినిమాలు విఫలమయ్యాయి. 'రెడీ' బాక్సాఫీసు ఫలితం తేలాల్సి వుంది. తేజ తొలి చిత్రం 'చిత్రం' హిట్టవడంతో రెండక్షరాల టైటిల్‌కి గిరాకీ ఏర్పడింది. 'ఖుషి', 'ఆది' చిత్రాలు ఆ బాటలో మంచి హిట్టవగా తేజ స్వయంగా రూపొందించిన మరో రెండక్షరాల సినిమా 'జయం', చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'ఇంద్ర' బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి.
టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్ టైటిల్‌ని విభిన్నంగా పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇట్లు.. శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి 9848022338 అంటూ అతడు వెరైటీగా పెట్టిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తిట్టుపదాలు ఇడియట్, పోకిరి, దేశముదురు టైటిళ్లతో బంపర్‌హిట్ సినిమాలు తీయడం అతడికే చెల్లింది. ఆ కోవలోనే ఎన్టీఆర్ హీరోగా పూరీ శిష్యుడు మెహర్ రమేష్ రూపొందించిన 'కంత్రి' బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ప్రభాస్ హీరోగా తను రూపొందించిన ఇటీవలి సినిమాకు 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' అనే వెరైటీ టైటిల్ పెట్టాడు పూరీ. కానీ అది వర్కవుట్ కాలేదు.
తెలుగు సినిమాలకీ, యముడికీ మంచి అవినాభావ సంబంధం వుంది. 'యమజాతకుడు' వంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే 'యమ' శబ్దంతో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా విజయం సాధించినవే. 'యమగోల', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'యమలీల' వంటివి అందుకు ఉదాహరణలు. నిరుడు వచ్చిన ఎన్టీఆర్ సినిమా 'యమదొంగ', శ్రీకాంత్, వేణుల సినిమా 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు రెండూ విజయాన్ని చవిచూశాయి. అంటే యముడు బాక్సాఫీసు మంత్రమన్నమాట.
ఆహ్లాదకరమైన పేర్లు పెడితే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పొలోమని వస్తారనేది చాలామంది భావన. కానీ ఆ తరహా టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్లో అత్యధికం ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విచారకరం. టైటిల్‌లో వున్న ఆహ్లాదం సినిమాలో లేకపోవడమే దానికి కారణం. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అందమైన మనసులో', పదిహేనేళ్ల తర్వాత గిరిబాబు రూపొందించిన 'నే సుఖమే నే కోరుతున్నా', అపురూప చిత్రాల దర్శకుడు బాపు గీచిన 'సుందరకాండ', తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 'నవ వసంతం' వంటివి తుస్సుమన్నాయి.
కొన్ని సినిమాలు టైటిళ్లకు విరుద్ధమైన ఫలితాల్ని పొంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనించదగ్గ అంశం. 'వాన' ఎమ్మెస్ రాజుకు బాక్సాఫీసు వానను కురిపించలేక పోయింది. రాజా నటించిన 'వేడుక' నిర్మాత పాలిట పీడకల అయ్యింది. శ్రీహరి 'శ్రీ మహాలక్ష్మి' సిరులు కురిపించలేక పోయింది. 'లక్షీపుత్రుడు', 'లక్ష్మీ కల్యాణం'లదీ అదే దారి. ఎస్వీ కృష్ణారెడ్డి 'బహుమతి' నిర్మాత జేబుల్ని ఖాళీ చేయించింది. నాగబాబు హీరోగా నటించిన 'ఆపద మొక్కులవాడు' నిర్మాతల్ని పుట్టిముంచాడు. 'హ్యాపీ డేస్' మాత్రం శేఖర్ కమ్ములకూ, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకూ నిజంగానే హ్యాపీ డేస్‌ను తెచ్చింది.
హిట్టయిన పాత సినిమాల టైటిల్స్‌తో వచ్చిన సినిమాలేవీ ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. ఉదయ్‌కిరణ్, శ్రీహరిల 'వియ్యాలవారి కయ్యాలు', వేణుమాధవ్ నటించగా దాసరి కథను అందించిన 'ప్రేమాభిషేకం', తరుణ్, ఇలియానాల 'భలే దొంగలు', తరుణ్ మరో సినిమా 'నవ వసంతం', శ్రీకాంత్, ప్రభుదేవా, సునీల్ ప్రధాన పాత్రలు పోషించిన 'మైఖేల్ మదన కామరాజు' వంటివి అందుకు ఉదాహరణలు.
అంటే చిత్ర విజయానికి టైటిల్ అనేది ఒక ప్లస్ పాయింట్‌గా మాత్రమే వుంటుందనీ, కేవలం టైటిల్ వల్లే సినిమా హిట్టు కాదనీ స్పష్టమవుతుంది. మంచి కథతో సినిమాని రూపొందించి, దానికి జస్టిఫై అయ్యే టైటిల్‌ని పెడితే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతందనడంలో సందేహ లేదు. అందుచేత కథకులూ, దర్శకులూ టైటిల్ కంటే ముందు కథకీ, స్క్రీన్‌ప్లేకీ ప్రాధాన్యతనిచ్చి వాటిమీద శ్రద్ధ చూపి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించడం బెటరు.

Thursday, July 10, 2008

Ready movie review

Rating: 3.25/5


వినోదానికి 'రెడీ'



కరడుగట్టిన గూండా ఇంట్లో కూడా వినోదాన్ని ఎలా పండించవచ్చో 'ఢీ'లో చూపించి మెప్పించిన దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు కిరాతకులైన ఫ్యాక్షన్ లీడర్ల కుటుంబాల్లోనూ అదే తరహా వినోదాన్ని సృష్టించి, మరోసారి అదే తరహా ఫలితాన్ని రాబట్టాడు. 'రెడీ.. దేనికైనా' అంటే పోట్లాటలకే కాదు, సరదా ఆటలకి కూడా అని రుజువు చేశాడు. ఫైటింగుల కంటే లాఫింగులకే పెద్ద పీట వేసి ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పైగా కుర్చీలకు అతుక్కునేట్లు చేశాడు. 'ఢీ', 'దుబాయ్ శీను'లతో తెచ్చుకున్న మంచి పేరును 'రెడీ'తో కొనసాగించాడు. మరోవైపు 'దేవదాసు'తో ఈజ్ వున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కుర్రాడు రామ్ 'జగడం' ఇచ్చిన చేదు అనుభవాన్ని చెరిపివేస్తూ మరింత చలాకీగా తన మూడో సినిమాలో నటించాడు. 'బొమ్మరిల్లు'లో హాసినిగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జెనీలియా మరోసారి ప్రాధాన్యత వున్న పాత్రని చేసిన 'రెడీ' జూన్ 19న విడుదలైంది. ఇదివరకు కొన్ని చక్కని సినిమాల్ని ప్రేక్షకులకి అందించిన శ్రీ స్రవంతీ మూవీస్ అధినేత రవికిశోర్ ఈ సినిమాను నిర్మించారు.


కథ:

బళ్లారిలో ఇంజినీరింగ్ చదివే చంద్రశేఖర్ అలియాస్ చందు (రామ్) తెగువ వున్న సరదా కుర్రాడు. పెళ్లిరోజే తన మరదలికి ఆమె ప్రేమించిన వాడితో రిజిస్టర్ మ్యారేజి చేయించి ఇంట్లో వాళ్ల ఆగ్రహానికి గురవుతాడు. అమెరికా నుంచి వచ్చిన పూజ (జెనీలియా)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. క్లాస్‌మేట్ ఒకడు ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి జరుగుతుందని తెలిసి, ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి స్నేహితుడితో పెళ్లి చేయాలని తలచి, ఒకమ్మాయి బదులు మరో అమ్మాయిని ఎత్తుకొస్తాడు. ఆమెవరో కాదు పూజ! ఆమెకు కూడా బలవంతపు పెళ్లి జరిగే సమయంలోనే చందు బృందం ఆమెను ఎత్తుకొస్తుంది. దాంతో నరసింహ (సుప్రీత్) అనేవాడు వారిని వెంటాడుతాడు. చందు చితక్కొట్టడంతో అతడు కోమాలోకి వెళతాడు. అమెరికాకు తిరిగి వెళ్లిపోవాలనుకున్న పూజ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటుంది. అది వచ్చేదాకా కర్నూలులోని స్నేహితురాలి వద్ద వుండాలనుకుంటే, ఆమె కూడా అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దాంతో ఒక నాటకం ఆడి ఆమెను తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు చందు. తనూ ఇంటికి వెళతాడు. వాళ్లది ఉమ్మడి కుంటుంబం. రఘుపతి (నాజర్), రాఘవ (తనికెళ్ల భరణి), రాజారాం (గిరి) అన్నదమ్ములు. రాఘవ కొడుకు చందు. త్వరలోనే చందు, పూజ ఒకర్నొకరు ప్రేమించుకుంటున్న సంగతి అందరికీ తెలుస్తుంది. అప్పుడే పూజ ఫ్యాక్షనిస్టయిన మేనమామ పెద్దినాయుడు (కోట శ్రీనివాసరావు) కంటపడుతుంది. ఆమెను చందు ఎత్తుకొచ్చింది అతడి కొడుకుతో పెళ్లి జరిపిస్తున్న సమయంలోనే. పెద్దినాయుడు ఆమెను తీసుకెళ్లిపోతాడు. ఇక కథ పెద్దినాయుడు, అతడి తమ్ముడు చిట్టినాయుడు (జయప్రకాష్‌రెడ్డి) ఇళ్లకి మళ్లుతుంది. అక్కడినుంచి మెక్‌డోనాల్డ్ మూర్తి (బ్రహ్మానందం)ని అడ్డం పెట్టుకుని పూజ కోసం చందు వేసే రకరకాల ఎత్తులు, వాటి ద్వారా వచ్చే వినోదంతో కథ కులాసాగా సాగిపోతుంది. చివరికి ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

కథనం:



'రెడీ' కథలో కొత్తదనమేమీ లేదు. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ ఆ పాత కథతోటే శ్రీను వైట్లలోని దర్శకుడు చెడుగుడు ఆడేశాడు. పాజిటివ్ పాత్రలతోటే కాకుండా, నెగటివ్ పాత్రల్తోటీ కావలసినంత వినోదాన్ని దట్టించి ప్రేక్షకుల మీదికి వదిలాడు. ఇక ఆ పాత్రలు సృష్టించే కామెడీకి నవ్వు ఆగదు. ప్రథమార్ధంలో సునీల్‌తో పాటు హీరో బృందం వినోదింప జేస్తే, ద్వితీయార్ధంలో బ్రహ్మానందం దున్నేశాడు. 'ఢీ'లో ఏ విధంగానైతే బ్రహ్మానందంతో మ్యాజిక్ చేశాడో, 'రెడీ' ద్వితీయార్ధానికి అదే బ్రహ్మానందంతో జీవం పోశాడు దర్శకుడు శ్రీను. 'రెడీ'లో చాలా పాత్రలున్నాయి. అయినా కన్‌ఫ్యూజన్ లేకుండా కథలో ప్రతి పాత్రకీ సొంత వ్యక్తిత్వాన్ని కల్పించాడు. ప్రధమార్ధంలో హీరో ఉమ్మడి కుటుంబానికి, ద్వితీయార్ధంలో విలన్ బ్రదర్స్ కుటుంబాలకు ప్రాముఖ్యత కల్పించి, ఎప్పుడూ తెర నిండుగా వుండేట్లు జాగ్రత్త పడ్డాడు. ఫ్యామిలీ లోపల పుట్టించే వినోదం ఎంత ఆహ్లాదాన్ని పంచుతుందో ఇదివరకు మనం 'అతడు'లో చూశాం. ప్రారంభ సన్నివేశాల్లో నాజర్ ప్రభృతుల్ని పరిచయం చేసే తీరులోనే సినిమా ఎలా వుండబోతుందో తెలియజేశాడు దర్శకుడు. నాజర్ మేనల్లుడు జానకి (సునీల్) పాత్రని 'అటూ ఇటూ కాని' రీతిలో మలిచిన విధానం ఎవరికైనా నవ్వు తెప్పిస్తుంది. సినిమా నడస్తున్నంత సేపూ ఆయా పాత్రల్ని ఎక్కడో, ఏదో సినిమాలో చూసిన జ్ఞాపకం మనలో మెదలుతుంటుంది. రామ్, జెనీలియా అడవిలోకి వెళ్లే సన్నివేశాలు 'క్షణక్షణం'ను గుర్తు చేస్తే, రామ్ ఇంట్లో జెనీలియా ఎదుర్కొనే సన్నివేశాలు 'భద్ర', 'పరదేశ్' సినిమాల్నీ, సెకండాఫ్‌లో రామ్ విలన్ల ఇళ్లలో చేసే చేష్టలు 'గుడుంబా శంకర్', 'ఆట' సినిమాల్నీ జ్ఞప్తి చేస్తాయి. అయినా అవి మనకి నచ్చుతాయి. ఈ తరహా సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ పండటం చాలా ముఖ్యమైన అంశం. 'రెడీ'లో అది బాగా పండింది. రామ్, జెనీలియా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇటీవల వచ్చిన చాలా సినిమాల్లో ఈ ఎలిమెంటే మైనస్. జెనీలియాను కోట తీసుకు వెళుతుంటే, ఆమె కోసమే బైకు మీద వస్తూ ఆమె వెళుతున్న వాహనాన్ని రామ్ క్రాస్ చేసుకుని ముందుకు వెళుతుంటే, సుమోలోంచి రామ్ వంక జెనీలియా దీనంగా చూసే ఇంటర్వెల్ సన్నివేశం ఫెంటాస్టిక్. 100 కోట్ల ఆస్థి కోసం ఇటు కోట, అటు జయప్రకాష్‌రెడ్డి.. ఇద్దరూ జెనీలియాను తమ కోడలిగా చేసుకోవడానికి పోటీ పడటం, వారి కోడుకులు భరత్ (రవితేజ తమ్ముడు), షఫి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అర్రులు చాచడం, ఆ రెండు కుటుంబాలని రామ్ కుటుంబం చేత ఆటాడించడం.. సినిమాకి లైవ్‌లీనెస్‌ని తీసుకొచ్చాయి. రామ్ వేసే ప్లాన్‌లో అతడి కుటుంబమంతా పాలు పంచుకుని జెనీలియాను తమ ఇంటి కోడలిగా తెచ్చుకోవాలను కోవడం కొత్తగా అనిపిస్తుంది. చిట్టినాయుడు మనవడిగా ఇంకో బుల్లి చిట్టినాయుడు (మాస్టర్ భరత్)ని సృష్టించి, అతడి చేత కూడా కామెడీ చేయించి, అతడికి రామ్ చేత బుద్ధి చెప్పించే సన్నివేశాలు బాగా వచ్చాయి. ఒకరంటే ఒకరికి గిట్టని అన్నదమ్ములు కోట, జయప్రకాష్‌రెడ్డిలకు ఆడిటర్ ఒక్కడే కావడం, ఆ ఒక్కడు మెక్‌డోనాల్డ్ మూర్తి.. అంటే బ్రహ్మానందం కావడం 'రెడీ' చేసుకున్న భాగ్యం. అయితే అది లాజిక్‌కి అందని సంగతి కూడా. బద్ధ శత్రువుల్లాగా వుండేవాళ్లు ఒక్కణ్ణే ఇద్దరికీ ఆడిటర్‌గా ఎలా ఒప్పుకుంటారు? అలాగే ఎంతో చదువుకుని, అమెరికాలో పెద్ద బిజినెస్ మాగ్నెట్‌గా ఎదిగిన నాగబాబు (జెనీలియా తండ్రి.. అతిథి పాత్ర) తన చెల్లెళ్లని ఏమాత్రం చదువు సంధ్యలు లేని, సంతకం పెట్టడం కూడా రాని, జుట్టుకి పిలకలతో అనాగరికంగా కనిపించే ఫ్యాక్షనిస్టులకిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు? ఇలాంటి విషయాల్ని ఉపేక్షిస్తే 'రెడీ' ఖచ్చితంగా ప్రేక్షకుడు పెట్టే డబ్బుకి పూర్తి న్యాయం చేకూర్చే సినిమా.

పాత్రధారుల అభినయం:

చందు పాత్రని రామ్ సునాయాసంగా చేసుకుపోయాడు. తన మునుపటి సినిమాల్లోని లోపాలను సరి చేసుకుంటూ డైలాగ్ డిక్షన్‌లోనూ పరిణతి చూపించాడు. సరదా సన్నివేశాల్లో ఎంత హుషారుగా కనిపించాడో, హావభావాలు పలికించాల్సిన ఎమోషనల్ సన్నివేశాల్లో అంతగానూ రాణించాడు. ఇక మాస్ హీరో లక్షణాలైన ఫైట్స్, డాన్సులు చేయడంలోనూ తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. పూజ పాత్రకి జెనీలియా అతికినట్లు సరిపోయింది. అల్లరి చేయడంలో, కరుణ రసాన్ని ఒలికించడంలో ఆమె వైవిధ్యాన్నీ, విలక్షణతనీ ప్రదర్శించింది. విలన్లుగా కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, సుప్రీత్, షఫి రాణించారు. మెక్‌డోనాల్డ్ మూర్తిగా బ్రహ్మానందం, జానకిగా సునీల్, సంతోష్‌రెడ్డిగా ధర్మవరపు, బుల్లి చిట్టినాయుడుగా మాస్టర్ భరత్ ప్రేక్షకుల్ని బాగా నవ్వించారు. రామ్ పెదనాన్నగా నాజర్ సంగతి చెప్పేదేముంది. భరణి, సుధ, ప్రగతి, వినోదా ప్రసాద్, శరణ్య, సురేఖావాణి తదితరులు పరిధుల మేరకు నటించారు. రామ్ మరదలిగా తమన్నా, ఆమె ప్రియునిగా నవదీప్, జెనీలియా తండ్రిగా నాగబాబు అతిథి పాత్రల్లో కనిపించారు.



టెక్నీషియన్ల పనితనం:
గోపీ మోహన్‌తో కలిసి కథను అందించిన కోన వెంకట్ సంభాషణలు సినిమాకు ఆయువుపట్టు అని చెప్పాలి. అనేక సన్నివేశాల్లో ఆయన మాటలు నవ్వుల తూటాల్ని పేల్చాయి. బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపుల నోటివెంట పలికిన మాటలన్నీ వినోదాన్ని పంచాయి. ఆరంభ సన్నివేశాల్లో రామ్ చదివే కాలేజీలో లోకల్, నాన్‌లోకల్ గొడవలకు సంబంధించిన మాటలు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తరచూ పలికే మాటలకు వ్యంగ్య సమాధానంగా తోస్తాయి. బ్రహ్మానందం తనను తాను 'క్రియేటర్'గా భావించుకుని మాట్లాడే మాటలు ప్రస్తుత సినీ పరిశ్రమలో రచయితల తీరుని పట్టిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సూపర్‌గా లేకపోయినా బాగానే వున్నట్లు అనిపిస్తుంది. పాటల చిత్రీకరణ బాగుంది. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ సన్నివేశాలకు గాఢతను చేకూర్చింది. సీజీ వర్క్‌తో అది మరింత రాణించింది. సాధారణంగా పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ అంటే భారీ ఫైట్స్ వుంటాయి. కానీ ఇందులో రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు అవసరమైన మేరకే ఖర్చుపెట్టి ఫైట్స్‌ని రూపొందించారు. క్లైమాక్స్‌లోనూ అనవసర ఆర్భాటానికి పోలేదు. సినిమా విసుగు కలగకుండా ఆద్యంతం ఆసక్తి రేకెత్తించడంలో వర్మ ఎడిటింగ్ పనితనం చెప్పుకోతగ్గది.

బలాలు, లోపాలు:

ఆద్యంతం వినోదాన్ని కలిగించే సన్నివేశాలు, విసుగు పుట్టించని కథనం, ప్రధాన పాత్రల చిత్రణ, రామ్, జెనీలియా మధ్య రొమాన్స్, వారి బాడీ కెమిస్ట్రీ, బ్రహ్మానందం పాత్ర, సంభాషణలు, సంగీతం బలాలు. సినిమాలో ప్రేక్షకులు ఎత్తి చూపే రీతిలో లోపాలు లేవు. సెకండాఫ్ 'గుడుంబా శంకర్'కు కాపీ అనే టాక్ రావడం, కథలో కొత్తదనం లేకపోవడం మాత్రమే లోపాలని చెప్పాలి. ఐటమ్ సాంగ్స్, ఎక్స్‌పోజింగ్స్ వంటివి లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రెడీ' సినిమా ప్రేక్షకులు పెట్టే డబ్బుకు పూర్తి న్యాయం చేకూరుస్తుందనేది ఖాయం.


…యజ్ఞమూర్తి