Thursday, September 30, 2010

వాల్ పేపర్: శ్రద్ధాదాస్

సినిమా: 'రోబో'కి థియేటర్లు దొరుకుతాయా?


దక్షిణ భారతంలోనే - ఆ మాటకొస్తే దేశంలోనే అత్యధిక పారితోషికాలు తీసుకుంటున్న నటుడు రజనీకాంత్, దర్శకుడు శంకర్, నటి ఐశ్వర్యారాయ్ కాంబినేషనులో తయారైన 'రోబో' అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారత దేశంలో ఒక సినిమా 180 కోట్ల రూపాయల (అనధికార సమాచారం ప్రకారం 225 కోట్లు) వ్యయంతో రూపొందటమనేది ఊహకి అందని సంగతి. కానీ ఊహాతీతంగా సినిమాలు చెయ్యడమే డైరెక్టర్ శంకర్ పంథా. మునుపటి సినిమా 'శివాజి'తో వంద కోట్ల రూపాయల బిజినెస్ మార్కుని అధిగమించిన శంకర్ ఇప్పుడు దానికి రెట్టింపు వ్యయంతో 'రోబో'ని తీసి వార్తల్లో వ్యక్తిగా మారాడు. 
అసాధారణ రిస్కుతో కూడిన ఈ వ్యయాన్ని భరించేందుకు చెన్నైకి చెందిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ముందుకు రావడం వల్లే 'రోబో' ప్రాజెక్టు సాధ్యపడింది. సుమారు రెండేళ్లపాటు నిర్మాణం సాగిన ఈ సినిమాకి కథ కంటే గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రాణంగా నిలవనున్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ లో అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన సినిమాలకు దీటుగా 'రోబో' నిలవనున్నదని ఈ సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. టీవీల్లో, థియేటర్లలో కనిపిస్తున్న ట్రైలర్లు ఆ సంగతే నిరూపిస్తున్నాయి.
ఇంతటి భారీ ఖర్చుతో తీసినందునే తెలుగు హక్కులు సైతం కనీవినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొక్కజొన్న వ్యాపారి తోట కన్నారావు ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. రజనీ ద్విపాత్రాభినయం 'రోబో'లోని విశేషం. ఒక పాత్ర సైంటిస్ట్ అయితే, ఆ సైంటిస్ట్ చేతిలో రూపొందిన మరో పాత్రే 'రోబో'. మనుషుల్లాగా స్పందనలు కూడా కలిగిన ఆ రోబోతో అందాల ఐశ్వర్యారాయ్ ఆడే ఆటలు, పాడే పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాతలు అంటున్నారు. అలాగే 'రోబో' చేసే యాక్షన్ సన్నివేశాలు గగుర్పాటు కలిగించనున్నాయి.
'రోబో' తెలుగు వెర్షన్ 500 ప్రింట్లతో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే అన్ని ప్రింట్లు విడుదల చేయడానికి థియేటర్లు లభ్యమవుతాయా - అనే సందేహం కలుగుతోంది. అక్టోబర్ 7న విడుదలవుతున్న 'మహేశ్ ఖలేజా'ని అల్లు అరవింద్ పంపిణీ చేస్తుండటం, 8న వస్తున్న ఎన్టీఆర్ 'బృందావనం' నిర్మాత దిల్ రాజు స్వయంగా డిస్ట్రిబ్యూటర్ కావడంతో వాటికి లభ్యమైనన్ని ప్రధాన థియేటర్లు 'రోబో'కి లభించే విషయం అనుమానాస్పదమే.
నైజాం ఏరియాకి సంబంధించి రెండు రోజుల క్రితమే 'రోబో' బిజినెస్ పూర్తయింది. ఇదివరకు నైజాంలో 'సింహా'ని పంపిణీ చేసిన మల్టీడైమెన్షన్ ఎంటర్టయిన్మెంట్ సంస్థ 8 కోట్ల రూపాయలకి పంపిణీ హక్కులు సొంతం చేసుకుంది. 12 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్మాలని ఆశించిన కన్నారావు ప్రయత్నాలు ఫలించలేదు.                           

Wednesday, September 29, 2010

వాల్ పేపర్: శ్రియ

Memories: Ghantasala Venkateswara Rao

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4న గుడివాడ వద్ద చౌటపల్లిలో జన్మించారు. తన సినీ జీవితంలో వంద సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించి, దాదాపు ఎనిమిది వేల పాటలు ఆలపించారు. ఆయన తొలి తిరుమల తిరుపతి ఆస్థాన గాయకులు.
సినిమాల్లో తొలిసారి ఘంటసాల బలరామయ్య రూపొందించిన 'సీతారామ జననం'లో ప్రభల సత్యనారాయణతో కలిసి కోరస్ పాడారు. ఆ సినిమాలో సీతాజననం సన్నివేశంలో నటించారు కూడా. దానికి గాను అప్పట్లో 10 రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు.
సినిమా పాటలతో పాటు కరుణశ్రీ 'పుష్ప విలాసం', కుంతీ విలాపం ఖండ కావ్యం, శ్రీ శ్రీ 'పొలాలనన్నీ హలాల దున్నీ', గురజాడ 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' వంటివి గానం చేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.              
ఆయన 'పరోపకారం', 'సొంత ఊరు', 'భక్త రఘునాథ్' అనే మూడు చిత్రాలు నిర్మించారు. మూడూ ఫ్లాపవడంతో లక్షల్లో నష్టపోయారు. 1953-54లో ఆరు లక్షల రూపాయల అప్పుల్లో పడ్డారు. 11 సంవత్సరాలు కష్టపడి 1965 నాటికి వాటినన్నింటినీ తీర్చగలిగారు. ఈ అప్పుల కారణంగా ఇంట్లో పనిమనిషినీ, చాకలినీ మాన్పించేశారు.
ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా పట్టుదలతో భగవద్గీత గానం చేశారు. కానీ హెచ్.ఎం.వి. వాళ్లు దాని రికార్డుల్ని విడుదల చేయక మునుపే ఆరోగ్యం మరింత క్షీణించి 1974 ఫిబ్రవరి 11న మరణించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు చేతుల మీదుగా ఆయన ఆలపించిన భగవద్గీత రెండు లాంగ్ ప్లే రికార్డ్స్ విడుదలయ్యాయి.
ఆయన వివాహం మేనమామ కుమార్తె సావిత్రితో 1944 మార్చి 3న జరిగింది. ఆయనకు ఐదుగురు పిల్లలు.. విజయ్ కుమార్, రత్నకుమార్, శ్యామల, సుగుణ, శాంతి. సుగర్ వ్యాధితో విజయ్ కుమార్ 45 ఏళ్ల వయసులో మరణిస్తే ఆయన పిల్లల్ని కూడా రత్నకుమార్ చూసుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల సావిత్రమ్మ తమ ఇంటి కింది భాగం అద్దెకిచ్చి పైభాగంలోకి మారారు. తమ కారుని టాక్సీగా తిప్పడానికి ఇచ్చారు. హెచ్.ఎం.వి. వాళ్ల నుంచి ఇదివరకులా రాయల్టీ రావడం లేదు. తన నగల్ని అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు.

Tuesday, September 28, 2010

వాల్ పేపర్: సదా

నేటి పాట: కృషి ఉంటే మనుషులు (అడవిరాముడు)
చిత్రం: అడవిరాముడు (1977)
రచన: వేటూరి
సంగీతం: కె.వి. మహదేవన్                            
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం

సాకీ:
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
పల్లవి:
కృషి ఉంటే మనుషులు
రుషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
చరణం 1:
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతి భయంకరుడు యమకింకరుడు
అడవి జంతువులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేలకూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరకంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా 
కవిగా అతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు
కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం
జగతికి అతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనో ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే    ||కృషి ఉంటే||
చరణం 2:
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువని విద్యనేర్పని
గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకుని
బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు
తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పాదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి
గురికలవాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే    ||కృషి ఉంటే||

చరణం3:
శబరీ.. ఇంతకాలము వేచినది
ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి
రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో
నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము
కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన
దోరపండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న
మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా
ఆడపడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో
మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే
అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో
మీరే మాకు సారథులు
అందుకే    ||కృషి ఉంటే||

వాల్ పేపర్: ప్రియాంకా చోప్రా

సినిమా: రెండు మూడు నెలల్లో సినిమా తీసే సత్తా ఉందా?

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాల్ని రెండేళ్ల పాటు తీస్తున్నారు. అందుకు చక్కని ఉదాహరణలు - పవన్ కల్యాణ్ 'కొమరం పులి', మహేశ్ 'ఖలేజా'. నిన్నటికి నిన్న రాంచరణ్ 'మగధీర' నిర్మాణానికి కూడా రెండేళ్లు పట్టింది. కానీ టాకీలు మొదలైన తర్వాత చాలాకాలం పాటు ఎంత పెద్ద హీరో సినిమా అయినా రెండు మూడు నెలల్లోతీసేవాళ్లు. దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య ఏ సినిమానైనా ఒకటిన్నర నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేసేవాళ్లు.
దాదాపు ఒకేసారి నిర్మాణమై, విడుదలైన గోపీచంద్ 'లక్ష్మమ్మ', ఘంటసాల బలరామయ్య 'శ్రీ లక్ష్మమ్మ కథ' సినిమాలు రెండూ రెండు నెలల్లోనే తయారయ్యాయి. సుందర్ లాల్ నహతా (శ్రీ ప్రొడక్షన్స్) 'శాంతినివాసం' చిత్రాన్ని 3 నెలల్లో నిర్మించారు. షూటింగుకు పట్టిన కాలం కంటే ఎక్కువ కాలం అది థియేటర్లలో ప్రదర్శితమైంది. పెట్టుబడికి ఆరింతలు మించి నికర లాభం రావడం విశేషం. అదే నిర్మాత అక్కినేని, సావిత్రితో 'అభిమానం' (1960) సినిమాని రెండు నెలల్లోనే తీశారు. హేమాహేమీలు పనిచేసిన ఆ సినిమా రెండు నెలల్లో పూర్తి కావడం చిన్న విషయం కాదు.
నటీనటులందరూ ఆ సంస్థని అభిమానించడం వల్లా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ డబ్బు ఠంచనుగా ఇవ్వడంవల్లా, ముందే తారలకు కాల్షీట్లు ఎక్కువ కావాలని చెప్పి, అన్న ప్రకారం అన్ని కాల్షీట్లు నిర్విఘ్నంగా ఉపయోగించుకోవడం వల్లా, అన్నిటికీ మించి ప్లానింగ్ అండ్ పంక్చువాలిటీ వల్లా, ఒక సెట్టుపై పని ముగిసే లోగా మరో సెట్టు సిద్ధం చేసుకుని 'బ్రేక్' లేకుండా షూటింగ్ కొనసాగిస్తూ వున్నందువల్లా డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు (సి.యస్. రావు) 'అభిమానం'ను రెండు నెలల్లో పూర్తి చేయగలిగాడు.
మరిప్పుడు అలాంటి వాతావరణం ఉందా? డబ్బుని తప్ప మంచి సంస్థనైనా అభిమానించే తారలున్నారా? అందరికీ ఠంచనుగా డబ్బిచ్చే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? పక్కా ప్లానింగ్, పంక్చువాలిటీ ఎంత మంది పాటిస్తున్నారు? బ్రేక్ లేకుండా షూటింగులు కొనసాగించే దర్శకులు ఉన్నారా? అలా లేనందునే ఇవాళ ఇష్టమొచ్చినన్ని రోజులు షూటింగులు జరుగుతూ నిర్మాతని నిలువునా ముంచుతున్నాయి.                          

Monday, September 27, 2010

వాల్ పేపర్: సమంతా

వాల్ పేపర్: పూజాభారతి

సినిమా: 'మొగల్-ఎ-ఆజమ్' విశేషాలెన్నో!1960ల కాలంలో మన తెలుగు సినిమాలకి అయ్యే ఖర్చు ఒక్కోదానికి ఐదారు లక్షల రూపాయలైతే ఆగస్ట్ 5, 1960న విడుదలై అఖండ విజయం సాధించడమే కాక, ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరుపొందిన హిందీ సినిమా 'మొగల్-ఎ-ఆజమ్' అయిన ఖర్చెంతో తెలుసా? అక్షరాలా 125 లక్షల రూపాయలు. 17,200 అడుగుల పొడవైన ఈ సినిమాని అప్పట్లోనే 150 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ సినిమాకి నిర్మాతలు చెల్లించిన ఎక్సైజ్ డ్యూటీ రెండు లక్షల రూపాయలు. అక్బర్ గా పృథ్వీరాజ్ కపూర్, సలీమ్ గా దిలీప్ కుమార్, అనార్కలిగా మధుబాల నటించిన ఈ సినిమా నిర్మాణానికి ఏళ్లు పట్టింది.                             
ఇంత ఖర్చు, ఇంత కాలం, ఇంత పబ్లిసిటీతో విడుదలైన భారతీయ చిత్రం అప్పటివరకు మరోటి లేదు. సినిమా విడుదలయ్యే తేదీకి అడ్వాన్స్ బుకింగ్ గానే దేశం మొత్తంపై 50 లక్షల రూపాయలు వసూలైంది. దొంగ నోట్ల మాదిరిగా దొంగ టిక్కెట్లు ముద్రిస్తారేమోనన్న ఉద్దేశంతో బొంబాయిలో పది రంగుల టిక్కెట్లు తయారుచేసి వాడారు. వ్యాపార ఆంక్షల పుణ్యమా అని పాకిస్తానులో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం అప్పట్లో లేనందున పాకిస్తాన్ నుంచి ప్రేక్షకులు భారత్ కు వచ్చారు. బొంబాయిలో వెయ్యిమంది పాకిస్తాన్ పౌరులు తమ పాస్ పోర్ట్ చూపి, కేవలం ఈ సినిమా కోసం వచ్చామని చెప్పి టిక్కెట్లు సంపాదించి, సినిమా చూడటం పెద్ద విశేషం. 
ఇంతాచేసి 'మొగల్-ఎ-ఆజమ్' షూటింగ్ జరిగింది కేవలం 5 వేల గజాల్లోనే. అందులో రంగుల్లో తీసిన శీష్ మహల్ సెట్టు నిర్మాణానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ సెట్టు నిర్మాణానికి అయిన వ్యయం 15 లక్షల రూపాయలని ఆ సినిమా దర్శకుడు, నిర్మాత అయిన కరీముద్దీన్ అసిఫ్ చెప్పారు. ఇంతకీ ఆ సెట్లో షూటింగ్ జరిగింది కేవలం ఐదు వారాలే. 

ఈ సినిమాలో అక్బరుగా నటించిన పృథ్వీరాజ్ కపూర్ వాడాల్సిన మీసం మోడళ్లను మేకప్ డిపార్టుమెంట్ వాళ్లు అనేకం తయారుచేసి దర్శకుడు అసిఫ్ కు చూపితే ఆయనకు వాటిలో ఏదీ నచ్చలేదు. ఉన్న వాటిలో సూచించిన మోడల్ లోనే ఆధారం చేసుకుని మేకప్ వాళ్లు 13 రోజులు నిర్విరామంగా పాటుపడి తయారుచేసిన మీసాన్ని అసిఫ్ చివరికి  ఓ.కే. చేశారు.

Sunday, September 26, 2010

వాల్ పేపర్: కాజల్ అగర్వాల్

నేటి పాట: గొప్పోళ్ల చిన్నది (కొడుకు కోడలు)చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల


పల్లవి: 
గొప్పోళ్ల చిన్నది - గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే - చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే - గుండెను వూపేస్తది     ||గొప్పోళ్ల||
చరణం 1:
నడుమెంత సన్నదో - నడకంత చక్కంది
చూపెంత చురుకైందో - రూపంత సొగసైంది
మనిషేమో దుడుకైంది - వయసేమో వుడుకైంది 
మనసెలా వుంటుందో - అది ఇస్తేనే తెలిసేది    ||గొప్పోళ్ల||
చరణం 2:
ఒంటరిగా వచ్చిందంటే - జంటకోసమే వుంటుంది
పేచీతో మొదలెట్టిందంటే - ప్రేమ పుట్టే వుంటుంది
కొమ్మనున్న దోరపండు - కోరుకుంటే చిక్కుతుందా? నాకు దక్కుతుందా?
కొమ్మబట్టి గుంజితేనే - కొంగులోకి పడుతుంది    ||గొప్పోళ్ల||
చరణం 3:
ఊరుకున్న కుర్రవాడ్ని - వుడికించి పోతుంది
మాపటికీ పాపమంతా వేపించుకు తింటుంది
ఒకచోట నిలవలేక - పక్కమీద వుండలేక -
ఆ టెక్కూ నిక్కూ తగ్గి -
రేపిక్కడికే తానొస్తుంది..    ||గొప్పోళ్ల||                            

Friday, September 24, 2010

వాల్ పేపర్: మల్లికా షెరావత్

కథ: మమకారం

వాల్ పేపర్: జెనీలియా

సినిమా: సౌందర్యలాంటి నటి కావాలి

"అప్పట్లో నా దర్శకత్వంలో 'నర్తనశాల' మొదలుపెట్టా. సౌందర్య చనిపోవడంతో ఆ ప్రాజెక్టు కాస్తా ఆగిపోయింది. ద్రౌపది పాత్రే ఆ సినిమాకి కీలకం. సౌందర్య వంటి ఆర్టిస్టు కావాలి. ఆమె తర్వాత ఇంకెవ్వరూ నాకు కనిపించడం లేదు. నా మనసులో దర్శకత్వమనే బీజం ఇప్పటికే పడిపోయింది కాబట్టి, అది రోజురోజుకీ పెరిగి పెద్దదవుతూనే ఉంది. ద్రౌపది పాత్రకు సరైన నాయిక దొరికితే - ఆ క్షణమే 'నర్తనశాల' మొదలుపెడతా. ఎవరిని పడితే వారిని పెట్టి ఆ సినిమా చేయకూడదు. ఒక్క మిస్ కాస్టింగ్ చాలు - సినిమా పోవడానికి. అలా నా కెరీరులో మిస్ కస్టింగ్ వల్ల పోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి" అన్నారు బాలకృష్ణ.                      

వాల్ పేపర్: బిపాసా బసు

సినిమా: బాలకృష్ణ డ్రీమ్ రోల్


"ఎప్పటినుంచో చెంఘిజ్ ఖాన్ పాత్ర చేయాలని ఉంది. తెన్నేటి సూరి రాసిన 'చెంఘిజ్ ఖాన్' నవల చదివి పులకించిపోయా. చేస్తే అలాంటి పాత్ర చేయాలనిపించింది. చెంఘిజ్ ఖాన్ పై హాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది. నవల చదివిన అనుభూతితో ఆ సినిమా చూస్తే చాలా పేలవంగా అనిపించింది. అందుకే ఆ నవల దాచుకుని, ఆ వీడియోను పక్కన పడేశా. ఎప్పటికైనా అది నా డ్రీమ్ రోల్" అని చెప్పారు బాలకృష్ణ.

వాల్ పేపర్: అనుష్క

Thursday, September 23, 2010

సినిమా: నాకు ఏ ట్రెండులూ పనిచేయవు: బాలకృష్ణ


"ఏవో ట్రెండులంటూ దర్శకులు కథలు చెబుతుంటారు. నాకు ట్రెండులూ, గిండులూ పనిచేయవు. నా బాడీ లాంగ్వేజికి తగ్గట్టుగా కథ ఉండాలి. కథ ఎంపిక అనేది కత్తికి రెండు వైపులా పదునన్నట్లుగా వుండాలి. నాకు ఫలానా తరహా పాత్రలు, కథలకి సన్నివేశాలు ఉండాలని అనుకుంటా. వాటిని దర్శకులకు చెబుతుంటా. ఒక్క సంఘటన నుంచి కూడా కథ పుట్టే అవకాశం ఉంటుంది. నాకు ఇలాంటి పాత్ర చేయాలని అనిపిస్తే దర్శకులకు చెబుతా. ఒకవేళ నాకు మార్పు కావాలనిపించినా, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనిపించినా అవన్నీ దర్శకులకు వివరంగా చెబుతా" అని చెప్పారు బాలకృష్ణ.

నేటి పాట: ఏ కులము నీదంటే (సప్తపది)


చిత్రం: సప్తపది (1981)
రచన: వేటూరి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

పల్లవి:
ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది ||ఏ కులము||

చరణం1:
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది
అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ||ఏడు|| ||ఏ కులము||

చరణం 2:
ఆది నుంది ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది ||ఆది||
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు ||ఏ కులము||

రివ్యూ: చంద్రసిద్ధార్థ్ - టాబు సినిమా 'ఇదీ సంగతి!'


సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎన్.వై. పతంజలి కొన్నేళ్ల క్రితం ‘నువ్వే కాదు’ అనే నవలిక రాశారు. డబ్బు మనుషుల్ని ఎలాంటి నైచ్యానికి దిగజారుస్తుందనేది అందులోని ప్రధానాంశం. అందులో వివాదాస్పద అంశాలూ వున్నాయి. ఒక రంగమని కాకుండా న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థల్లోనూ అవినీతి ఎలా పేరుకు పోయిందో పతంజలి అందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దాన్ని వెండితెర మీదకు తీసుకు రావాలనే ఆలోచన దర్శకుడు చంద్రసిద్ధార్థకు కలిగింది. ‘ఇదీ సంగతి!’ అంటూ చిత్రానువాదం చేశారు. అయితే జీవిత వాస్తవికత ఒక్కోసారి ఎంతటి ఉత్కంఠతనీ, భీతినీ కలిగిస్తుందో, అంత చేదునీ ఇస్తుంది. ‘ఇదీ సంగతి!’ మన మనసుల్ని యథాతధంగా ఆవిష్కరించింది. కానీ మనలోని నెగటివ్ అంశాల్ని ఒప్పుకునే ధైర్యం ఎంతమందికుంటుంది? అందుకే అది చేదు మాత్ర అయిపోయింది. ఎలాగంటే..

కథ:
ముంబై ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ప్రజా పత్రిక క్రైమ్ రిపోర్టర్ సత్యమూర్తి (అబ్బాస్)కి అక్కడ చనిపోయిన వాళ్ల దగ్గర్నించి కొంతమంది ఏది కనపడితే అది దోచుకోవడం చూసి తనతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ (సునీల్)తో కలిసి తానూ దొరికినకాడికి దొచుకుంటాడు. అతడికి దొరికిన ఎర్ర సూట్‌కేస్‌లో 500 కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలుంటాయి. అయితే అతడికి ఆ సంగతి తెలీకముందే అతడి భార్య స్వరాజ్యలక్ష్మి (టాబు) వాటిని దాచేస్తుంది. తను తెచ్చిన సూట్‌కేస్‌లో కోట్ల రూపాయల విలువచేసే వజ్రాలున్నాయని తెలిసిన సత్యమూర్తి వాటికోసం చూస్తే అవి కనిపించవు. ఆ సూట్‌కేస్‌లో బట్టలు తప్ప వజ్రాల్లాంటివేవీ లేవని స్వరాజ్యం చెబుతుంది. నిజమే అనుకుంటాడు సత్యమూర్తి. భర్తకి వాటి గురించి చెబితే వాటిని తనకు చెందకుండా చేస్తాడనేది స్వరాజ్యం భయం. ఆ వజ్రాలు సాక్షాత్తూ ప్రధాన మంత్రివి. ఆ స్థాయి వ్యక్తికి చెందిన వజ్రాలు విమానంలో కాకుండా, రైలుబండిలో ఎందుకు రవాణా అవుతున్నాయి? అసలు అవి ప్రధానివనే సంగతి లోకానికి తెలుసా? వాటివల్ల సత్యమూర్తి కుటుంబం ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంది? స్వరాజ్యలక్ష్మి అత్యాశ చివరికి ఎటువంటి పరిణామాలకు దారి తీసింది? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:
మనిషిలోని డార్క్‌నెస్‌ని ఆకర్షణీయంగా చెప్పడం అంత తేలికైన సంగతి కాదు. డబ్బనేది మనిషిని ఎంత నైచ్యానికీ, దుర్మార్గానికీ లోను చేస్తుందో ‘ఇదీ సంగతి!’ బాగా ఆవిష్కరించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ చెప్పడంలో ఆకర్షణీయత లోపించడమే ఆ సినిమాకు ప్రతికూలంగా మార్చింది. ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై, అందులోని ప్రయాణీకులు చాలామంది శవాలుగా మారి, మరెంతో మంది క్షతగాత్రులై కళ్లముందు కనిపిస్తుంటే సాధారణంగా హృదయాలు అవిసిపోతాయి. వారికి సాయం చేయాలన్న తపన కలుగుతుంది. దానికి రెండో కోణం.. అందినకాడికి దోచుకోవాలనే దుర్బుద్ధి కలగడం. ఇలాంటివి జరుగుతున్నాయని మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. చదువుతున్నాం. ఈ సినిమాలో మనం దాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. సత్యమూర్తి, ఫోటోగ్రాఫర్ కలిసి శవాలనుంచి ఆభరణాలు వొలుచుకోవడం వంటిని జలదరింపజేస్తుంది. ఇలాంటివే అనేక ఊహకందని సన్నివేశాలు ఈ సినిమాలో వున్నాయి. దొంగతనానికి గురైన వజ్రాల్ని కనిపెట్టడానికి దొంగలతో పొలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేసి, వాటాల గురించి మాట్లాడుకోవడం.. దొంగలకీ, పోలీసులకీ మధ్యవర్తిగా ఒక మాజీ న్యాయమూర్తి వ్యవహరించడం, అలా మధ్యవర్తిగా వుండేందుకు ఆయనా వాటా అడగడం.. వూళ్లోని ఇళ్లలో దొంగతనం చేయడానికి దొంగలకి పోలీసులే వ్యానుని ఏర్పాటు చేయడం.. ఆ వ్యానులో దొంగలతో పాటు మాజీ న్యాయమూర్తి కూడా ప్రయాణించడం.. వంటివి ఆ తరహా సన్నివేశాలు.
ఈ సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్లు రెండు. సత్యమూర్తి, స్వరాజ్యలక్ష్మి. ఇద్దరూ డబ్బు మనుషులే. నేటి జర్నలిస్టులు ఎలాంటి బ్రోకర్ పనులు చేస్తున్నారనేందుకు సత్యమూర్తి పాత్ర నిదర్శనం. సహజంగానే ఆ పాత్ర మీడియా వ్యక్తులకి నచ్చదు. అతను శవాలని దొచుకు తెస్తే, అతన్నే దోచుకోవాలని అతని భార్య స్వరాజ్యలక్ష్మి భావిస్తుంది. వంటినిండా నగలు పెట్టుకుని తిరగాలనీ, కోటి రూపాయల ఖరీదు చేసే కారులో తిరగాలనీ, లంకంత ఇంటిలో కాపురముండాలనీ.. ఆమె కలలు కంటూ వుంటుంది. దొరికిన వజ్రాలతో అవి సమకూర్చుకోవచ్చనుకుంటుంది. కానీ వాటి గురించి పోలీసులు ఆరా తీస్తుండడం, మీడియాలో కథనాలు వస్తుండడంతో వాటిని కాపాడుకోవడానికి ఆమెపడే ఆదుర్దా సహేతుకమే. తన భర్త ప్రమాదంలో చిక్కుకున్నాక గానీ ఆమెకు తన తప్పు తెలిసిరాలేదు. అందుకే స్వార్థం స్థానంలో తన భర్తని కాపాడుకోవాలనే తపన ఆమెలో కలిగింది. వజ్రాలకంటే తన భర్తే తనకు ముఖ్యమనే విచక్షణ కలిగింది. తన మునుపటి ప్రశాంత జీవితం కావాలనే స్పృహ కలిగింది. ఆ పాత్రని దర్శకుడు చక్కగా మలిచాడు. డబ్బాశ ఒక స్త్రీని ఎలాంటి పనులకు పురికొల్పుతుందనే దానికి స్వరాజ్యలక్ష్మి నిలువెత్తు నిదర్శనం. పోలీస్ ఇన్‌స్పెక్టర్ దగ్గర్నుంచి ప్రధాన మంత్రి దాకా వజ్రాల కోసం చేసే పనులు ‘ఔరా’ అనిపిస్తాయి. అయితే అన్నీ నెగటివ్ పాత్రలు కావడమే ‘ఇదీ సంగతి!’కి కమర్షియల్ పరంగా ప్రతికూలంగా మారింది. సన్నివేశాల్ని దేనికి దానికి విడిగా చూసినప్పుడు బాగా వున్నట్లనిపిస్తాయి. పాత్రలు చెప్పే డైలాగులు మెప్పిస్తాయి. కానీ అన్నిటినీ కలిపి చూసినప్పుడు వెలితిగా తోస్తుంది. క్లైమాక్స్ కూడా అసంపూర్ణంగా ఆగినట్లు తోస్తుంది. కొన్ని పాత్రలు చివరకు ఏమయ్యాయనే సంగతిని దర్శకుడు ప్రేక్షకుడి ఊహకే వదిలేశాడు. సత్యమూర్తి కుటుంబాన్ని చంపాలనుకున్న డిఐజి (చలపతిరావు), అతని బావమరిది (రాజా రవీంద్ర), మంచివాడిగా నటిస్తూ వజ్రాలు కాజేయాలనుకున్న లాయర్ చందర్రావు (బ్రహ్మాజీ), మాజీ న్యాయమూర్తి (మేల్కోటే), ఇన్‌స్పెక్టర్ సూర్రెడ్డి (సూర్య) పాత్రలను దర్శకుడు అర్ధంతరంగా ముగించేశాడు. అందుకే క్లైమాక్స్ అసంతృప్తి కలిగిస్తుంది.

పాత్రధారుల అభినయం:
స్వరాజ్యలక్ష్మి పాత్రని టాబు ఉన్నత స్థాయిలో పోషించింది. ఆ పాత్రలోని రకరకాల ఎమోషన్స్‌ని బాగా పలికించింది. డబ్బాశ కలిగిన మధ్యతరగతి గృహిణిగా, చివరకు కనువిప్పు కలిగి వజ్రాలకంటే తన భర్తే తనకు ముఖ్యమనుకునే సగటు స్త్రీగా ఆమె అభినయం మెచ్చతగ్గది. ఒక పాటలోనూ, కొన్ని సన్నివేశాల్లోనూ దర్శకుడు ఆమెలోని గ్లామర్ కోణాన్నీ చూపించాడు. క్రైమ్ రిపోర్టర్ సత్యమూర్తిగా అబ్బాస్ కూడ మెరుగైన నటని ప్రదర్శించాడు. చాలా రోజుల తర్వాత అతడికి నటనను చూపించే పాత్ర లభించింది. అబ్బాస్ వెంటవుండే ఫోటోగ్రాఫర్‌గా సునీల్ మెప్పించాడు. అతనికి భార్యగా హేమను చూపించడం నప్పలేదు. ఆమె అతనికి అక్కలా కనిపించింది. కళావర్ కింగ్ అనే దొంగ పాత్రలో రాజా ఆశ్చర్యపరుస్తాడు. ఆ తరహా మాస్ పాత్రకి అతను సూట్ కాడని స్పష్టమైంది. అతని పాత్ర ముగిసే తీరు చూశాక అతని పట్ల మనకు జాలి కలుగుతుంది. ఇన్‌స్పెక్టర్ సూర్రెడ్డిగా సూర్య, లాయర్ చందర్రావుగా బ్రహ్మాజీ పాత్రోచితంగా నటించారు. ప్రధానమంత్రిగా కోట శ్రీనివాసరావు నటనకు మనం వంక చెప్పేదేముంది! కానీ ప్రధానిగా అతను పరిచయమయ్యే సన్నివేశాలు ఆ స్థాయికి తగ్గట్లు లేవు. చలపతిరావు, మేల్కోటే, రాజారవీంద్ర ఓకే.

టెక్నీషియన్ల పనితనం:
కథతో పాటు ఈ సినిమాకి మాటల్ని కూడా పతంజలే రాశారు. సన్నివేశాలకు తగ్గట్లు ఆయన కలం చురుగ్గా సంభాషణలు పలికించింది. వ్యవస్థ మీద ఆయన విసిరిన చెణుకులు, వ్యంగ్యాస్త్రాలు చప్పట్లు కొట్టేలా చేస్తాయి. చాలా సన్నివేశాలకు ఆయన సంభాషణలే టానిక్. పాటలకు నూతన సంగీత దర్శకుడు జాన్ పి. వర్గి బాగానే బాణీలిచ్చాడు. టైటిల్ సాంగ్‌లో వచ్చే బాణీలు మెచ్చదగ్గ రీతిలో వున్నాయి. అనూప్ నేపథ్య సంగీతం ఎఫెక్టివ్‌గా వుంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాల్లోని వాతావరణానికి తగ్గట్లు లైటింగ్ వుపయోగించి సన్నివేశాలకు గాఢతని తెచ్చాడు.

బలాలు, లోపాలు:
కథాంశంలోని నవ్యత, టాబు పాత్ర, ఆమె నటన, పతంజలి సంభాషణలు, సంగీతం, రీ రికార్డింగ్, సినిమాటోగ్రఫీ బలాలు. అన్నీ నెగటివ్ పాత్రలు కావడం, సీరియస్‌నెస్ ఎక్కువై ఆహ్లాదాన్ని కలిగించే సన్నివేశాలు లేకపోవడం, కమర్షియాలిటీని మిస్సవడం, కథనంలో స్పీడు లేకపోవడం, క్లైమాక్స్ అసంపూర్ణంగా వుండడం.. లోపాలు. సీరియస్ సినిమాల్ని ఇష్టపడే వాళ్లని మాత్రమే ఈ సినిమా సంతృప్తిపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Wednesday, September 22, 2010

గేలరీ: ప్రియారామన్


నేటి పాట: ఎవ్వరికోసం ఈ మందహాసం (నర్తనశాల)


చిత్రం: నర్తనశాల (1963)
రచన: శ్రీ శ్రీ
సంగీతం: పి. దక్షిణామూర్తి
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
ఎవ్వరికోసం - ఈ మందహాసం
ఒకపరి వివరించవే - సొగసరీ
ఒకపరి వివరించవే!
అనుపల్లవి:
చెలిమి కోసం - చెలి మందహాసం!
ఏమని వివరింతునో - గడసరీ
ఏమని వివరింతునో
వలపులు చిలికే - వగలాడి చూపు!
పిలువక పిలిచే - విరహాల రేపు!!

చరణం 1:
ఎదలో మెదలే చెలికాని రూపు!
ఏవో తెలియని - భావాల రేపు!
ఈ నయగారం - ప్రేమసరాగం!
అందించు - అందరాని సంబరాలే ||ఎవ్వరికోసం||

చరణం 2:
పరుగులు తీసే - జవరాలి వయసు!
మెరుపై మెరసి - మరపించు మనసు!
ప్రణయము చిందే - సరసాల చందం!
ఇరువురినొకటిగ - పెనవేయు బంధం!
ఈ వయ్యారం - ఈ సింగారం!
చిందించు - చిన్ని చిన్ని వన్నెలెన్నో ||ఎవ్వరికోసం||

గేలరీ: అదితి అగర్వాల్ - 1
ప్రొఫైల్: మోహన్ బాబు


అసలు పేరు: మంచు భక్తవత్సలం నాయుడు
స్వస్థలం: మోదుగుల పాలెం (చిత్తూరు జిల్లా)
తల్లిదండ్రులు: లక్ష్మమ్మ, నారాయణస్వామి నాయుడు
కుటుంబం: భార్య నిర్మాలాదేవి. కూతురు లక్ష్మీప్రసన్న, కుమారులు విష్ణువర్థన్ బాబు, మనోజ్ కుమార్.
చదువు: తిరుపతిలో కాలేజీ చదువు. మద్రాసులో వై.ఎం.సి.ఎ. కాలేజిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్
తొలి ఉద్యోగం: 1968లో మద్రాసులో కేసరి హైస్కూలులో 197 రూపాయల జీతానికి ఉద్యోగం.
సినీ రంగ ప్రవేశం: నటుడు ప్రభాకరరెడ్డి ద్వారా 'కూతురు కోడలు' సినిమాకి దర్శకుడు లక్ష్మీదీపక్ వద్ద అప్రెంటీస్ గా చేరారు. తొలి సంపాదన ఆరు నెలలకు 50 రూపాయలు. ఆ సినిమాకి దాసరి కో-డైరెక్టర్.
నటునిగా తొలి సినిమా: దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన 'స్వర్గం-నరకం'. ఈ సినిమాతో భక్తవత్సలం నాయుడు పేరును 'మోహన్ బాబు'గా మార్చారు దాసరి. 22 నవంబర్ 1975న 'స్వర్గం-నరకం' విడుదలైంది.
తమిళంలోనూ అడుగు: శివాజీ గణేశన్ సొంత సినిమా 'అన్నన్ ఒరు కోవిల్' ద్వారా తమిళ రంగానికి పరిచయం. తమిళంలో 14 సినిమాల్లో విలన్ వేషాలు వేశారు.
సొంత నిర్మాణ సంస్థ: చెన్నై విజయా గార్డెన్స్ లో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ఆవిర్భావం. దాసరి పద్మ జ్యోతి వెలిగిస్తే, 'బొబ్బిలిపులి' వేషంలో ఎన్టీఆర్ తొలి కొబ్బరికాయ కొట్టారు. నిర్మాతగా తొలి చిత్రం 'ప్రతిజ్ఞ'.
విద్యారంగ ప్రవేశం: కులమతాలకు అతీతంగా 1992లో తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద 'శ్రీ విద్యానికేతన్' పేరుతో విద్యా సంస్థ స్థాపన.
అభిమాన తారలు: ఎన్టీఆర్, సావిత్రి
సంగీత దర్శకుడు: కె.వి. మహదేవన్
గీత రచయితలు: ఆత్రేయ, శ్రీ శ్రీ, గద్దర్
పద్మశ్రీ అవార్డు: 2007లో పద్మశ్రీ అవార్డు

రివ్యూ: క్రిష్ తొలి సినిమా 'గమ్యం'


సజావుగా సాగిన 'గమ్యం'

సినిమా కళ పట్ల అభిమానం, అభిరుచి వున్న దర్శకుల వల్ల తెలుగులో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తూ వున్నాయి. ఇటీవలి కాలంలో కొత్తగా ఆలోచిస్తూ సినీ రంగంలోకి అడుగుపెడుతున్న దర్శకులు ఎక్కువవుతున్నారు. వారిలో రాధాకృష్ణ జాగర్లమూడి కూడా చేరతాడని చెప్పాలనిపిస్తుంది 'గమ్యం' చూశాక. ఫార్ములా చట్రంలో కాకుండా తాననుకున్న పాయింట్‌ని కొత్తగా చెప్పాలనే తాపత్రయం రాధాకృష్ణలో కనిపిస్తుంది. నటీనటుల ఎంపికలో కూడా అతను ఈ ధోరణిని కనపర్చాడు. శర్వానంద్ ప్రధాన హీరో అయితే, నరేష్ సైడ్ హీరో. కమలినీ ముఖర్జీ హీరోయిన్. నిజంగా ఆసక్తి కరమైన కాంబినేషన్. శుక్రవారం (ఫిబ్రవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకీ, సిద్ధార్థుడి (బుద్ధుడి) కథకీ ఒక పోలిక వుంది. అదేమంటే...
కథ:
చెప్పుకోవడానికి ఇందులో కథంటూ పెద్దగా ఏమీ లేదు. తనని వదలి వెళ్లిన కథానాయిక కోసం కథానాయకుడు జరిపే అన్వేషణ ఈ సినిమా. ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో అతను పొందిన అనుభవాల మాలిక ఈ సినిమా. అభిరామ్ (శర్వానంద్) పదివేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన సంపన్న యువకుడు. ఒకసారి అతడికి జానకి (కమలిని) అనే అందమైన మెడికో తారస పడుతుంది. ఆమెని వారం రోజుల్లో ప్రేమలో పడేస్తానని తన మిత్రుడితో పందెం కడతాడు అభి. ఆమెకు 'ఐ లవ్ యు' చెబుతాడు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. ఆమెతో పరిచయం పెంచుకుని తన బర్త్‌డే పార్టీకి పిలుస్తాడు. అభి తనకోసం ఎందుకు తిరుగుతున్నాడనే నిజం అక్కడ జానకికి తెలుస్తుంది. అభిని ఏవగించుకుంటుంది. పందెం కట్టింది నిజమే గానీ, ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నానంటాడు అభి. అక్కణ్ణించి కారులో వస్తున్న ఇద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. కారు కంట్రోల్ తప్పి ఒక స్త్రీని ఢీకొంటుంది. కళ్లువిప్పితే ఆసుపత్రిలో వుంటాడు అభి. జానకి అతణ్ణి వదిలి వెళ్లిపోతుంది. తనకోసం వెతకొద్దని ఉత్తరం రాస్తుంది. కానీ అభికిప్పుడు జానకి నిజంగా కావాలి. ఆమె కోసం బయలుదేరతాడు. మధ్యలో ఒక మోటారు వాహనాల దొంగ గాలి శీను (నరేష్) తారసపడతాడు. అభి వద్ద కనిపించిన ఖరీదైన మోటార్ బైకుని దొంగిలించాలని శీను కూడా అతనితో ప్రయాణిస్తాడు. అక్కణ్ణించి ఆ ఇద్దరూ ఎన్నో అనుభవాలు పొందుతారు. ఆ అనుభవాలేమిటి? ఆ ఇద్దరూ తమ తమ గమ్యాల్ని చేరుకున్నారా? జానకి ఏమయ్యింది? అనేది మిగతా సినిమా.
కథనం:
అంతఃపురం వీడి బయటి లోకంలోకి అడుగుపెట్టిన సిద్ధార్థుడు అక్కడి భయంకరమైన స్థితుల్ని చూసి బిత్తరపోతాడు. చావు బతుకుల గురించి ప్రత్యక్షంగా చూసి చలించిపోతాడు. నిజమైన జీవితమంటే ఏమిటో తెలుసుకుంటాడు. జన్మకి అర్ధాన్ని అన్వేషించే క్రమంలో సన్యాసి అవుతాడు. జ్ఞానోదయంతో బుద్ధుడిగా మారతాడు. బుద్ధుడిగా మారకముందు ప్రపంచంలో గౌతముడికి ఎదురైన అనుభవాల ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని 'గమ్యం' కథని మలిచాడు దర్శకుడు రాధాకృష్ణ. కాకపోతే కథానాయకుడి అన్వేషణ తన నాయక కోసం. ప్రేమ కోసం. అయినప్పటికీ ఆ అన్వేషణలో కథానాయకుడు లోకం తీరు ఎలా వుందో తెలుసుకుంటాడు. జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. మనిషికీ, మనిషితనానికీ అర్ధం తెలుసుకుంటాడు. ప్రేమంటే ఏమిటో, ప్రేమించడమంటే ఏమిటో తెలుసుకుంటాడు. తన చేతుల మీదుగా ఒక జననం, ఒక మరణం చూస్తాడు. కథానాయకుడు అభిరామ్ పొందే ఈ అనుభవాల కోసం దర్శకుడు కల్పించిన సన్నివేశాలు ప్రశంసనీయంగా వున్నాయి. మొదట్లో రిలేషన్‌షిప్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అనుకున్న అభిరామ్ చివరకు వచ్చేసరికి అనుబంధాల్లోని ఆత్మీయతని ఆస్వాదిస్తాడు. అలా ఆ పాత్ర మారే క్రమాన్ని చూపించడంలో దర్శకుడు ఎంతో మెచ్యూరిటీని కనపర్చాడు. ఆ పాత్రలో ఆ పరిణామానికి కారణమైన గాలి శీను పాత్రనీ చక్కగా తీర్చిదిద్దాడు. అభిరామ్, శీను మధ్య స్నేహానుబంధం పెనవేసుకునే తీరు ఆకట్టుకుంటుంది. కలిసి ప్రయాణించే క్రమంలో ఆ ఇద్దరి స్వభావాల్లోనూ మార్పు వస్తుంది. అందుకే ఒకచోట విజయచందర్ చేత "జంతువులు మారవు. మారని వాడు మనిషి కాడు" అనిపిస్తాడు దర్శకుడు. గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు ఎలా జరుగుతాయో చూపించిన అతను అక్కడ రికార్డింగ్ డాన్సర్‌కి కూడా మనసు, ఆత్మగౌరవం వుంటాయనే సన్నివేశాన్ని కల్పించిన తీరు ప్రశంసనీయం. అలాగే నక్సలైట్లు అడవుల్లోంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజోపయోగ పనులు చేయాలని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిరామ్ అన్వేషణకి కారణమైన జానకి పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించిన దర్శకుడు ఆమె పాత్రని ఇంకా విపులంగా చిత్రించివుంటే సినిమాకి మరింత ఆకర్షణ చేకూరేది. పాటల చిత్రీకరణ విషయంలోనూ రాధాకృష్ణ జాగ్రత్త వహించాడు. కథ నడకకి అవి అడ్డుపడకుండా చూసుకున్నాడు. రవీంద్రభారతిలో కమలిని బృందం చేత చేయించిన నృత్యం యువతని సైతం ఆకట్టుకుంటుంది. నరేష్ పాత్రలో వినోదాన్ని చొప్పించిన దర్శకుడు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలను సందర్భోచితంగా వాడుకున్నాడు. కథనం విషయంలో ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని రూపొందించింది కొత్త దర్శకుడంటే నమ్మడం కష్టం.
నటీనటుల అభినయం:
'వెన్నెల', 'అమ్మ చెప్పింది' సినిమాల్లో ప్రతిభావంతంగా నటించిన శర్వానంద్ 'గమ్యం'లో అభిరామ్‌గా పరిణతి చెందిన అభినయాన్ని ప్రదర్శించాడు. కథ ప్రకారం పాత్ర ఎలా పరిణతి చెందుతూ వస్తుందో దానికి తగ్గట్లు అతను హావభావాలు ప్రదర్శించాడు. వాచకంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే హీరోగా రానున్న రోజుల్లో రాణించగలుగుతాడు. ఏమైనా ఈ సినిమాతో హీరోగా అతనికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. గాలి శీనుగా సైడ్ హీరో పాత్రని చేయడానికి నరేష్ అంగీకరించి, మంచిపనే చేశాడు. ఆ పాత్ర స్వభావానికి నరేష్ అతికినట్లు సరిపోయాడు. ఈమధ్య చేసిన సినిమాలతో నిరాశపరచిన అతను ఇందులో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. మొదట్లో అల్లరి చిల్లరగా కనిపించి కాలక్షేపాన్ని అందించిన అతను చివర్లో కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాడు. కమలిని నటనా సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జానకి పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చింది. సినిమాలో ప్రధానమైనవి ఈ మూడు పాత్రలే. మిగతావి ఇలా వచ్చి అలా పోతాయి. ఆ పాత్రల్లో ఆయా నటులు.. అభిషేక్ (శర్వానంద్ మిత్రుడు), బ్రహ్మానందం, ఎమ్మెస్, ఎల్బీ శ్రీరామ్, విజయచందర్, హేమ వగైరా.. రాణించారు.
టెక్నీషియన్ల పనితనం:
కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ తన పనిని శ్రద్ధగా చేస్తే, సంభాషణల్ని నాగరాజు గంధం సందర్భోచితంగా ప్రయోగించాడు. కథనానికి ఆయన మాటలు బాగా వుపకరించాయి. ప్రధానంగా నరేష్ నోట పలికే మాటలు ప్రేక్షకులకి రిలీఫ్‌నిస్తాయి. జీవితం గురించి చెప్పే సందర్భాల్లోనూ ఆయన కలం చురుగ్గా పనిచేసింది. ఇ.ఎస్. మూర్తి, అనిల్ కలిసి కూర్చిన సంగీతం ఓకే. నేపథ్య సంగీతం యాప్ట్‌గా వుంది. ఈ సినిమాకి ప్రధాన బలాల్లో ఒకటి సినిమాటోగ్రఫీ. యువకుడైన దర్శకుడి మనసుని గ్రహించినట్లు సీనియర్ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు కెమెరా సన్నివేశాల్లోని మూడ్‌ని బాగా క్యాప్చర్ చేసింది. సన్నివేశాలకు తగ్గట్లు నేపథ్యాన్ని సృష్టించడం అంత తేలికైన పనికాదు. కళా దర్శకుడు రాజీవ్ నాయర్ ఆ పనిని మెరుగ్గా చేసుకుపోయాడు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా వుంది.
బలాలు, లోపాలు:
అభిరామ్, గాలి శీను పాత్రలు, ఆ పాత్రల్లో శర్వానంద్, నరేష్ అభినయం, కథనం, సంభాషణలు, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం బలాలు. కమలిని పాత్ర నిడివి తక్కువ కావడం, ప్రథమార్ధంలో ఆకర్షణీయమైన సన్నివేశాలు తక్కువ కావడం, క్లైమాక్స్ ముందరి లీడ్ సన్నివేశాలు.. లోపాలు. ఓవరాల్‌గా చూస్తే కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది.