Saturday, June 30, 2012

'కొరియర్ బోయ్ కళ్యాణ్'గా నితిన్

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొరియర్ బోయ్ కళ్యాణ్'. తమిళంలో ఈ చిత్రం 'తమిళ్ సెల్వనుం తనియార్ అంజలుం' పేరుతో తెరకెక్కనుంది. గౌతమ్ వాసుదేవమీనన్ నిర్మాత. ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. నిర్మాత మాట్లాడుతూ "నేను దర్శకత్వం వహించిన 'ఏమాయ చేసావె' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు నితిన్‌తో తీస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. భాషలకు అతీతంగా అందరి అభినందనల్ని అందుకుంటుంది. ప్రేమ, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్ళలో ఉన్న కథ ఇది. కథ నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాల్లో మంచి పాటలు పాడిన కార్తీక్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నారు. కీలక పాత్రల్లో జై ,సంతానం, విటివి గణేష్ నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది'' అని అన్నారు.

'ఈగ'ని చూసి ఎగ్జయిటైన నిర్మాతలు

నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏక కాలంలో ఈ సినిమా విడుదలవుతోంది. దర్శకుడు రాజమౌళి "ఈ సినిమా తొలికాపీని సురేశ్‌బాబు, తమిళ వెర్షన్ 'నాన్ ఈ' నిర్మాత పి.వి. కలిసి చూశారు. సినిమా అయ్యాక నన్ను కౌగలించుకుని ఈ సినిమా నిర్మాణంలో తాము పాలుపంచుకున్నందుకు గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. వాళ్ల అభినందనకు చాలా చాలా సంతోషంగా ఉంది'' అని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇటీవల నానిపై చిత్రీకరించి విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నా. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం'' అని చెప్పారు.

క్లైమాక్స్ సీన్లలో 'ఒక్కడినే'


నారా రోహిత్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్‌గా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో గులాబీ మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న 'ఒక్కడినే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా సి.వి.రెడ్డి మాట్లాడుతూ 'మా సినిమాలోని పతాక సన్నివేశాల చిత్రీకరణని ఈ నెల 27 నుంచి రామోజీ ఫిలింసిటిలో ప్రారంభించా. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. జూలై 3 వరకూ జరిగే షూటింగ్‌తో మూడు పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. ఆ మూడు పాటల్లో ఐటెం సాంగ్‌ని హైదరాబాద్‌లోను, మిగిలిన రెండు డ్యూయెట్లని విదేశాల్లో జూలై ప్రథమార్థంలోగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం శబ్దాలయా థియేటర్‌లో డబ్బింగ్ జరుగుతోంది' అని తెలిపారు.
నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, ఫొటోగ్రఫీ: ఆండ్ర బాబు, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.

'ఆల్ ది బెస్ట్' చెప్పండి

శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, లక్కీ శర్మ కీలక పాత్రల్లో నటించిన 'ఆల్ ది బెస్ట్' ఈ నెల 29న విడుదల కానుంది. సుధా సినిమా పతాకంపై సాంబశివరావు నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నిర్మాతల మండలి హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ "ఇది ముమ్మాటికీ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం. శ్రీకాంత్ లేకుంటే నేను ఈ సినిమాను ఊహించి ఉండేవాడిని కాదు. ప్రేక్షకులు మాకు 'ఆల్ ది బెస్ట్' చెప్పాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. " వన్ బై టు, ఎగిరే పావురమా చిత్రాల్లో నేను, చక్రి కలిసి నటించాం. ఇందులో ఫ్రెండ్స్‌గా నటించాం. ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ కథను నడిపిస్తాం. ఇ.వి.వి., కృష్ణారెడ్డి తరహా చిత్రమిది'' అని శ్రీకాంత్ చెప్పారు. "సినిమా చాలా బాగా వచ్చింది. 29న విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు. మంచి పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందని రఘుబాబు, బ్రహ్మాజీ చెప్పారు.

హై వోల్టేజ్ కేరక్టర్‌లో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారు. శేఖర్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దీక్షాసేథ్ నాయిక. డా.ఎం.మోహన్‌బాబు సమర్పిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ "విజయవంతమైన చిత్రానికి కావాల్సిన అన్ని హంగులతో మా చిత్రం సర్వసన్నద్ధమవుతోంది. మా అన్నయ్య బాలకృష్ణగారి పాత్రకి హై ఓల్టేజ్ స్పందన వస్తుందనడంలో అనుమానం లేదు. మహిళా ప్రేక్షకులకు, యువతకు విపరీతంగా నచ్చుతుంది. మనోజ్ మంచి పెర్‌ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ ప్రామిసింగ్ స్టార్‌గా ఎదుగుతాడు. బోబోశశి సంగీతానికి మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్రలో నేను నటించాను. వచ్చేనెల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. ప్రభు, సోనూసూద్ తదితరులు ఇతర పాత్రధారులు.

Thursday, June 28, 2012

'జగన్.. నిర్దోషి' పేరుతో సినిమా


శివ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి 'జగన్.. నిర్దోషి' అనే టైటిల్ ఖరారు చేశారు. తోట సినిమాస్ సమర్పణలో ఐ.ఎస్.జె. ఫిలిమ్స్ పతాకంపై శాఖమూరి మల్లికార్జునరావు, తోట హేమసుందర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరయు, సంజన, శ్రుతిరెడ్డి నాయికలు. మంగళవారం షూటింగ్ లొకేషన్‌లో యూనిట్ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు శివ.
ఈ సందర్భంగా నిర్మాత మల్లికార్జునరావు మాట్లాడుతూ "కథకి ఇది సరిగ్గా సరిపోయే టైటిల్. హీరోగా శివ బాగా చేస్తున్నాడు. జూలై 10 వరకు జరిపే షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాలు సహా టాకీ పార్టును పూర్తి చేస్తాం. జూలై 15 నుంచి యూరప్‌లో నాలుగు పాటల్ని తీయడంతో షూటింగ్ అయిపోతుంది. కృష్ణగారి సూపర్‌హిట్ సినిమా 'ఖైదీ రుద్రయ్య'లోని 'పువ్వెత్తి కొట్టమాకు పురుషోత్తమా' రీమిక్స్ సాంగ్‌ను శివ, సంజనపై తీస్తాం'' అని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకీ, తమ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదనీ, ఇందులో తన పాత్రను బాగా డిజైన్ చేశారనీ హీరో శివ తెలిపారు.
సంజన మాట్లాడుతూ చాలా కాలం తర్వాత అభినయానికి మంచి అవకాశమున్న పాత్ర చేస్తున్నాననీ, తెలుగులో తొలిసారి ఓ కొత్త హీరోతో చేస్తున్నాననీ చెప్పారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా చేస్తున్నానని నాగినీడు తెలిపారు. దర్శకుడు వెంకన్నబాబు మాట్లాడుతూ "ఇందులో హీరో పేరు జగన్. జైలుకు వెళ్లిన అతను ఎలా నిర్దోషిగా బయటకు వచ్చాడన్నదే ఈ చిత్ర కథ'' అన్నారు. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని మరో నిర్మాత హేమచందర్ తెలిపారు.
బ్రహ్మానందం, ప్రసాద్‌బాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, ఆర్కే, ఖాదర్ ఘోరి, శివన్నారాయణ, ఝాన్సీ, అల్లరి సుభాషిణి, ఈడ్పుగంటి లోకేంద్రనాథ్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, అమర్ మొహిలే, ఛాయాగ్రహణం: జయరామ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: నందు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.

'జై శ్రీరామ్' అంటున్న ఉదయ్‌కిరణ్


ఉదయ్‌కిరణ్ హీరోగా 5 స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేళ్ల రమేశ్ నిర్మిస్తున్న చిత్రానికి 'జై శ్రీరామ్' అనే టైటిల్ ఖరారు చేశారు. బాలాజీ ఎన్. సాయి దర్శకుడు. 'ఈ రోజుల్లో' ఫేమ్ రేష్మా నాయిక. మంగళవారం ఈ సినిమా యూనిట్ సభ్యుల మధ్య కేక్ కోసి జన్మదినం జరుపుకున్నారు ఉదయ్‌కిరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఈ సినిమా నా జీవితంలో పెద్ద మైలురాయి అవుతుందని గట్టి నమ్మకం. నటుడిగా నాలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే సినిమా. పన్నెండేళ్ల నుంచీ నేను మోస్తున్న 'లవర్ బాయ్' ట్యాగ్‌ను పక్కనపెట్టి చేస్తున్న సినిమా'' అన్నారు.
మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిథి వాసు మాట్లాడుతూ "ఫస్ట్‌లుక్‌కు మంచి ప్రశంసలొచ్చాయి. హీరోగా ఉదయ్‌కి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్. దర్శకుడు బాలాజీ బాగా తీస్తున్నాడు'' అని చెప్పారు. దర్శకుడు బాలాజీ ఎన్. సాయి మాట్లాడుతూ "త్రేతాయుగంలోని రాముడికి ఎలాంటి గుణాలున్నాయో, అలాంటి గుణాలున్నవాడే మా హీరో. ఈ దేశం కోసం ఓ పోలీసాఫీసర్ ఏం చేశాడన్నది ప్రధానాంశం. ఉదయ్ నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తాడు'' అని చెప్పారు. ఉదయ్‌తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఇందులో తన పాత్రలో రెండు కోణాలుంటాయనీ రేష్మా తెలిపారు. నిర్మాత తోట రమేశ్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చిందనీ, టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందనీ అన్నారు. చిత్రంలో ఐదు పాటలున్నాయనీ, ఇప్పటికే ఓ పాటను తీశారనీ సంగీత దర్శకుడు డాకే చెప్పారు. తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ తాను వినోదాన్ని పంచే పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటిస్తున్నానన్నారు.
చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, గిరిధర్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివ-మురళి, కళ: భాస్కరరాజు, స్టంట్స్: డ్రాగన్ ప్రకాశ్, డాన్స్: రఘు, సహ నిర్మాత: ఎన్.సిహెచ్. రాజేశ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బాలాజీ ఎన్. సాయి.

Monday, June 25, 2012

స్విట్జర్లాండ్‌లో 'శ్రీమన్నారాయణ'


నందమూరి బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ సంస్థ రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది.
షూటింగ్ వివరాలను నిర్మాత రమేష్ పుప్పాల వెల్లడిస్తూ 'ఈ నెల 18న ప్రారంభమైన షూటింగ్ 28 వరకూ జరుగుతుంది. మలేషియాలో ఒక పాట, ఫైట్ తీశాం. ఇవి రెండూ బాగా వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఇటలీలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం, దీంతో చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారితో 'శ్రీమన్నారాయణ' వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు, అభిమానులు బాలయ్యబాబు నుంచి ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి' అన్నారు.
పార్వతీమెల్టన్, ఇషాచావ్లా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయకుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, ఫొటోగ్రఫీ: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.

జూలైలో 'ఏం బాబూ లడ్డూ కావాలా'


శివాజీ హీరోగా గాంధీ మనోహర్ దర్శకత్వంలో వనితాస్ డ్రీమ్‌లైన్ సంస్థ నిర్మిస్తున్న 'ఏం బాబూ లడ్డూ కావాలా' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిధి అగర్వాల్, రచనా మౌర్య కథానాయికలు.
ఈ సినిమా గురించి శివాజీ మాట్లాడుతూ 'సాధారణంగా మా చిత్రానికి స్క్రిప్ట్, ఆర్టిస్టులు బాగా సెట్ అయ్యారని అంటుంటారు. కానీ ఈ చిత్రానికి నిర్మాత కరెక్ట్‌గా సెట్ అయ్యారు. దర్శకుడు గాంధీ టైటిల్‌కు తగ్గట్లు ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ, గీత రచయిత భాస్కరభట్ల నాకు మరోసారి సూపర్‌హిట్ ఆడియోను అందించారు. కుటుంబసమేతంగా చూసి, ఎంజాయ్ చేసే సినిమా ఇది' అన్నారు.
నిర్మాత టి.జనార్థన్ మాట్లాడుతూ 'గత వారం విడుదలైన మా సినిమాలోని అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఆడియో హిట్ కావడం శుభ పరిణామం. ఈ సందర్భంగా శ్రీలేఖగారికి, భాస్కరభట్లగారికి నా ధన్యవాదాలు' అన్నారు.
దర్శకుడు గాంధీ మనోహర్ మాట్లాడుతూ ' వినోదాత్మక చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు. ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, రాంజగన్, తిరుపతి ప్రకాష్, జి.టి.రావు, భావన, లక్ష్మి, లహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: వాసు, కూర్పు: నాగిరెడ్డి, కళ: విజయకృష్ణ, నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్.

'దేవుడు చేసిన మనుషులు' పాటల విడుదల


రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించిన పాటలన్నీ అలరిస్తాయని నమ్ముతున్నానీ, సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోవాలనీ ఆకాంక్షించారు.
గేయ రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ "ఇది చాలా మంచి ఆడియో. సింగిల్ కార్డ్ రాశా. 'ఏమి సేతుర సామీ' అనేది నా మనసుకు బాగా నచ్చిన పాట. 'బంపర్ ఆఫర్' తర్వాత రఘు కుంచెతో పనిచేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది వేరే సెటప్‌తో తీసిన సినిమా. కథలేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసిన సినిమా. మొదట ఈ కథని ఇలియానాకి చెప్పా. తను టాక్సీ డ్రైవర్‌గా బాగా చేసింది. రవితేజతో ఇది నాకు ఐదో సినిమా. రవి అంటే నాకు మోజు. హైదరాబాద్‌లో నాకు తగిలిన మొదటి ఫ్రెండు రఘు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బర్తాంతే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ చేసింది'' అని చెప్పారు. ఈ పాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాయనీ, జగన్‌తో, రవితో పనిచేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందనీ హీరోయిన్ ఇలియానా చెప్పింది.
రఘు కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్‌గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి'' అని తెలిపారు.
రవితేజ మాట్లాడుతూ "ఈ సినిమాతో రఘు కుమ్మేయబోతున్నాడు. జగన్ నమ్మకమే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది'' అని చెప్పారు. జూలై 27న 'దేవుడు చేసిన మనుషులు'ను విడుదల చేస్తామని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు గుణ్ణం గంగరాజు, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, వీరభద్రం, రిలయెన్స్ ప్రతినిధి మహేశ్ రామనాథన్, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బండ్ల గణేష్, లవ్‌లీ రాజు, సహ నిర్మాత భోగవల్లి బాపినీడు, నటులు ఆలీ, సుబ్బరాజు, తారలు జ్యోతిరాణా, గాబ్రియేలా, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, కల్యాణ్, కళా దర్శకుడు చిన్నా, ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్, సోనీ మ్యూజిక్ ప్రతినిధులు అశోక్, అశ్విన్, బ్యాంకాక్ బాబీ తదితరులు పాల్గొన్నారు.

తారకరత్న 'విజేత'


తారకరత్న కథానాయకుడిగా 'విజేత' అనే చిత్రం రూపొందుతోంది. వి.ఎం.సి. కంబైన్స్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. ఉదయభాస్కర్ దర్శకుడు. సంజన, శ్వేతాబసు ప్రసాద్ నాయికలుగా నటిస్తున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. శుక్రవారం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌చాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన సమావేశంలో రామసత్యనారాయణ మాట్లాడుతూ జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామనీ, అక్టోబర్‌లో సినిమాని రిలీజ్ చేస్తామనీ చెప్పారు.
దర్శకుడు ఉదయభాస్కర్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రి' వంటి సూపర్‌హిట్ ఇచ్చిన సంస్థ ఇప్పుడు మరో వారసుడు తారకరత్నతో తీస్తున్న 'విజేత' కూడా అంత హిట్టవుతుందని ఆశిస్తున్నాం. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది తయారవుతుంది'' అన్నారు. తారకరత్న మాట్లాడుతూ "ఈ సంస్థలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చక్కని చిత్రం'' అని చెప్పారు. చిత్రంలో ఆరు పాటలుంటాయని సంగీత దర్శకుడు అర్జున్ తెలిపారు.
నిర్మాత దొరస్వామిరాజు మాట్లాడుతూ "మేమెప్పుడూ కుటుంబ కథాచిత్రాల్నే చేస్తాం. 'విజేత' తప్పకుండా మంచి సినిమా అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్‌కి 'సింహాద్రి' ఎలా బెస్ట్ ఫిల్మ్ అయిందో, తారకరత్న కెరీర్‌కి 'విజేత' బిస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు. ఈ సమావేశంలో దర్శకుల సంఘాధ్యక్షుడు సాగర్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత-నటుడు అశోక్‌కుమార్, నిర్మాత మోహన్ వడ్లపట్ల, సినిమాటోగ్రాఫర్ కంకణాల శివరాంరెడ్డి, నటుడు గుండు అశోక్‌కుమార్ మాట్లాడారు.
కృష్ణుడు, సాయాజీ షిండే, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, ఝాన్సీ, తాగుబోతు రమేశ్, ధనరాజ్, నందన్, హేమసుందర్, బి.హెచ్.ఇ.ఎల్. ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి కూర్పు: పి. శ్రీనివాస్, కళ: శ్రీభాస్కరరాజు, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, కొరియోగ్రఫీ: రమణ, ప్రేమ.

జూలైలో 'తూనీగ.. తూనీగ'

తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న 'తూనీగ..తూనీగ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దిల్ రాజు సమర్పణలో పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రామ్‌చంద్రన్ (రాంజీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి సమర్పకుడు రాజు మాట్లాడుతూ ' హై టెక్నికల్ వాల్యూస్‌తో యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రేమకథల్లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఎం.ఎస్.రాజుగారు తీసిన ఈ చిత్రం 2012 టాప్ హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలవడం ఖాయం. హీరోగా సుమంత్ అశ్విన్‌కు మంచి బిగినింగ్ లభించనుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. త్వరలోనే అగ్రహీరోల సమక్షంలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ని నిర్వహిస్తాం.జూలైలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: కార్తీక్‌రాజా, ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, పాటలు: సిరివెన్నెల, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, కళ: వివేక్.

Saturday, June 23, 2012

కరీనా కాదంటే దీపిక ఔననెలే

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి అంటే కరీనా కపూర్‌కి భయం కానీ దీపికా పదుకోనేకు ఎందుకు భయం? అందుకే ఏక్తాకపూర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి కరీనా కపూర్ తప్పుకుంటే దీపిక 'నేను చేస్తాను' అంటూ ముందుకొచ్చింది. ఈ సినిమాలో చేయడానికి మొదట అంగీకరించిన కరీనా, ఆ తర్వాత అందులో హీరోగా ఇమ్రాన్ హిష్మి ఎంపికయ్యాడని తెలియగానే దాని నుంచి తప్పుకుంది. అతనితో కలిసి తెరమీద కనిపించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నదని సమాచారం. "తనకు ఆఫర్ చేసిన పాత్ర విషయంలో కరీనా సంతోషంగా లేదు. పైగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయంలోనే ఆమె పెళ్లి జరగనుంది'' అని కరీనా సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీపికకు ఇలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఇందులో చేసేందుకు అంగీకరించింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనీ, హీరో కంటే హీరోయిన్‌కే సినిమాలో ఎక్కువ ప్రాధాన్యమున్నదనీ సమాచారం. కాగా దీపిక ఈ సినిమా చేస్తున్నదని తెలిశాక, కరీనా మనసు మార్చుకున్నదనీ, తానే చేస్తాననీ కబురు పంపించిందనీ యూనిట్ సభ్యులు తెలిపారు. "అయితే దీపికను తీసేసి, కరీనాను తీసుకోవడం అనైతికమవుతుందనీ, పైగా దీనిక కూడా ఆ పాత్రకు బాగానే సరిపోతుందనీ నిర్మాతలు భావించారు'' అని వారు చెప్పారు. ఈ ప్రేమకథాచిత్రం ద్వారా అక్షయ్ రాయ్ దర్శకునిగా పరిచయం కాబోతున్నాడు.

Thursday, June 21, 2012

'దేనికైనా రెడీ'లో ప్రభాస్ నాకు డబ్బింగ్ చెబుతున్నాడు

"ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు మంచు విష్ణు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్‌బాబు నిర్మిస్తున్న 'దేనికైనా రెడీ'లో ఆయన హీరోగా నటిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా జరిపిన సంభాషణలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలతో పాటు, మరికొన్ని ఆసక్తికర విషయాల్ని తెలియజేశారు విష్ణు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'దేనికైనా రెడీ' మూడు పాటలు మినహా సినిమా పూర్తయింది. తమ్ముడు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' విడుదలయ్యాక ఆ మూడు పాటలూ తీస్తాం. జూలై చివరలో పాటల్నీ, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తాం. యూరప్‌లో రెండు పాటల్నీ, హైదరాబాద్‌లో ఓ పాటనీ తీద్దామనుకుంటున్నాం. ఒకవేళ యూరప్‌కి వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తాం.

అమ్మ సెంటిమెంట్
ఇది ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి చెబితే, అతనితో కలిసి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్ చేశారు. మాటలు మరుధూరి రాజా రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్‌లైన్‌గా ఉపయోగించిన 'దేనికైనా రెడీ'నే టైటిల్‌గా పెట్టాం. ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దానితో పాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. అది తల్లీ కొడుకుల సెంటిమెంట్. నా తల్లిగా సీత, తండ్రిగా సుమన్ చేశారు. నా తల్లి హిందు అయితే, తండ్రి ముస్లిం. హన్సిక తండ్రిగా ప్రభు చేశారు. విలన్‌గా కోట శ్రీనివాసరావు చేశారు.

ఇందులోనూ బ్రహ్మానందమే
ఈ సినిమాని 'ఢీ'కి సీక్వెల్ అనొచ్చు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామికల్‌గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్ ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే ఉంటారు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్‌లో ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి' అనే మేనరిజమ్‌తో నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ మేనరిజమ్‌తో తెగ నవ్విస్తారు. హన్సికతో మొదటిసారి పనిచేశా. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోయిన్లందరిలోకీ బ్యూటిఫుల్ గర్ల్. ప్రొఫెషనల్‌గా బ్రిలియంట్. ఆమెతో పనిచేయడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. శ్రీను వైట్ల తర్వాత అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అని చాలామంది అన్నారు. ఆయన్ని అనుకున్నప్పుడు శ్రీను వైట్ల కూడా 'వెరీగుడ్ చాయిస్ విష్ణు. ఆయన బ్రిలియంట్‌గా చేస్తారు' అని చెప్పారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ కూడా బాగా ఎక్కువ. 'ఢీ'కి శ్రీను గారితో ఎంతగా ఎంజాయ్ చేశానో, ఆయన తర్వాత ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిందీ, అంత కాన్ఫిడెంట్‌గా ఉందీ ఈ సినిమాకే.

ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలున్నాయి. ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరోని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ఆ హీరోనే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు ప్రభాస్. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విక్రమ్ (ఎమ్మెస్ నారాయణ కుమారుడు)ను యంగ్ విలన్‌గా పరిచయం చేస్తున్నాం. సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికి రెండు పాటల్ని తీశాం. ఒకటి మాంటేజ్ సాంగ్‌గా వస్తుంది. చక్రి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా సన్నిహిత మిత్రుడు, దేశంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్‌శంకర్ రాజా రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చారు. అందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక యాక్షన్ సన్నివేశాల్ని సెల్వ మాస్టర్ ఆధ్వర్యంలో చేశాం. నేనెంతో ఇష్టపడి చేశా. ఇటీవలే క్లైమాక్స్ ఫైట్ చేశాం. చాలా గొప్పగా వచ్చింది. మొత్తం నాలుగు ఫైట్లు. ఒకటి తిరుపతిలో, ఒకటి కాళహస్తిలో, రెండు హైదరాబాద్‌లో తీశాం.

తమిళంలోనూ అడుగేస్తున్నా
ఈ సినిమా నుంచి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నా. ఇక ప్రతి సినిమా తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. బాలీవుడ్‌లోకి ఇప్పుడే వెళ్లే అవకాశం లేదు. ఇంట గెలిచాక అప్పుడు రచ్చ సంగతి చూద్దాం. నాలుగేళ్ల తర్వాత ఇతను తెలుగు నటుడనీ, అతను తమిళ నటుడనీ, హిందీ నటుడనీ భేదాలు ఉండవు. నటుడికి భాషాభేదం అనేది తొలగిపోతుంది. ఉత్తరాది వాళ్లు కూడా కేరక్టర్లకి ఇక్కడి నటుల్ని తీసుకోవాల్సిందే. నా కెరీర్‌లో 'ఢీ' ఒక్కటే బిగ్ హిట్. 'వస్తాడు నా రాజు' రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడం వల్ల ఫెయిలైంది. 'దేనికైనా రెడీ' మీద చాలా నమ్మకంతో ఉన్నాం. దీని తర్వాత నాన్నగారి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నా కెరీర్‌ను ప్లాన్ చేసుకోబోతున్నా.

నలుగురు హీరోల సినిమా
'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా తరానికి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్‌ను నాన్నగారు చేస్తారు. సురేందర్‌రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే.

బాలయ్యకు హ్యాట్సాఫ్
నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా మనోజ్ కెరీర్‌కీ, నిర్మాతగా లక్ష్మి కెరీర్‌కీ 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చాలా ముఖ్యం. అందుకే దాని మీద చాలా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనోజ్ చేసినవి సన్నని లైన్‌మీద నడిచిన కథలే. అంతా అతని షోనే కనిపిస్తుంది. తొలిసారి అద్భుతమైన కథలో చేస్తున్నాడు. బాలకృష్ణ గారి కేరక్టర్ హైలైట్ అవుతుంది సినిమాకి. ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకూ, ఆ పాత్రని చేసిన విధానానికీ హ్యాట్సాఫ్. ఈ తరహా పాత్ర చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి.

Tuesday, June 19, 2012

నారాయణరావు మాస్టారి కథ


ఇంతకుముందు దినపత్రిక ఎడిటర్ రఘురామ్ ('ఆ నలుగురు'), రాజాజీ ('మీ శ్రేయోభిలాషి') పాత్రల్లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ తాజాగా నారాయణరావు మాస్టారుగా తెరమీద కనిపించబోతున్నారు. ఆయన ఆ పాత్ర పోషిస్తున్న 'ఓనమాలు' చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సన్‌షైన్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. అటువంటి ఉత్సాహం కలిగించిన సినిమా ఇది. ఇందులోని నారాయణరావు మాస్టారు పాత్ర నా మనసుకు బాగా నచ్చిన పాత్ర. ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి వాళ్ల కెరీర్‌లో వయసుతో నిమిత్తం లేకుండా మంచి పాత్రలు దొరికాయి. అలా నాక్కూడా ఇదో మంచి అవకాశం. ఇవాళ మన సమాజానికి కచ్చితంగా కావాల్సిన అనుబంధాల్ని చెప్పే సినిమా'' అని చెప్పారు.
నిర్మాత, దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ "మనిషి ఓడలాంటివాడు. ఒడ్డుకు చేరితేనే ఓడకు ఎలాగైతే విలువ వస్తుందో, అలాగే మనిషి కూడా ఏదో ఓ విజయపు ఒడ్డుకు చేరితేనే విలువ. ఇందులో ఓ స్కూలు మాస్టారు ఎలాంటి ఒడ్డుకు చేరాడన్నది కథ. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి కథ: తమ్ముడు సత్యం, మాటలు: ఖదీర్‌బాబు, సంగీతం: కోటి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: గౌతంరాజు, కళ: బాబ్జీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. క్రాంతిమాధవ్.

Monday, June 18, 2012

సినిమాగా పుట్టపర్తి సాయిబాబా చరిత్ర


పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సౌభాగ్య చిత్ర పతాకంపై నిర్మితమవుతోంది. కరాటం రాంబాబు నిర్మాత. చిత్ర విశేషాలను దర్శకుడు కోడి రామకృష్ణ వివరిస్తూ "సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని కథ సిద్ధం చేసుకున్నాం. ఆరునెలలు, 8, 10, 14, 35, 50, 85 ఏళ్ళ బాబా పాత్రధారులను ఈ చిత్రంలో చూడొచ్చు. స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనువిందు చేసే బాబా పాత్రధారి కోసం ఎందరెందరినో అనుకున్నాం. మలయాళ నటుడు దిలీప్‌ను ఎంపిక చేశాం. ఈ విషయమై ఆయనకు ఫోన్ చేయగానే 'నేను ఇంతకుముందే బాబా గురించి ఆలోచించాను. అంతలో మీరు ఇలా ఫోన్ చేయడం ఆ భగవంతుడి సంకల్పమేమో' అని అన్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనానికి తోడ్పడేవే'' అని చెప్పారు.
నిర్మాత కరాటం రాంబాబు మాట్లాడుతూ "తొలి షెడ్యూల్‌ను పుట్టపర్తిలో, రెండో షెడ్యూల్‌ను పశ్చిమ గోదావరి పరిసరాల్లో చిత్రీకరించాం. బాబా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను, కరణం సుబ్బమ్మ ఇంటి దృశ్యాలను తెరకెక్కించాం. స్థానిక పుట్టాయిగూడెంలో వేసిన బాబా సెట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. బ్రిటిష్ కాలానికి సంబంధించిన పరిసరాలను ప్రతిఫలించేలా వేసిన సెట్‌లో బాబాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. బాబా పాత్రధారికి విదేశీ నిపుణులు మేకప్ వేస్తున్నారు. మిగిలిన అన్ని పాత్రలకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్‌మేన్‌లను పిలిపిస్తున్నాం. మా సంస్థలో సంచలనాత్మక చిత్రమవుతుంది. త్వరలో పేరును ప్రకటిస్తాం. ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్‌లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు'' అని అన్నారు.
దిలీప్, జయప్రద, శరత్‌బాబు, సుకుమారి, సిజ్జు, కె.వి.రమణాచారి.ఐ.ఎ.ఎస్., శ్రీజిత్ విజయ్, లక్ష్మి, అమృత, అర్చన, రూపాలక్ష్మి, సుజాత, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: కరాటం రాంబాబు, దర్శకత్వం: కోడి రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్: వాసు, సంగీతం: ఇళయరాజా, రచన: రాజేంద్రకుమార్, సాహిత్యం: జొన్నవిత్తుల, కళ: నాగు, ఎడిటర్: నందమూరి హరి.

Sunday, June 17, 2012

'ఒక రొమాంటిక్ క్రైం కథ'ను నిషేధించండి

శుక్రవారం (జూన్ 15) విడుదలైన 'ఒక రొమాంటిక్ క్రైం కథ'లో అభ్యంతరకర దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయని బాలల హక్కుల సంఘం ఆరోపించింది. పిల్లల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ సినిమాను తక్షణం నిషేధించాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హెచ్ఆర్‌సీకి శనివారం ఫిర్యాదు చేశారు. టీనేజర్లు, యువత తమ సంతోషాల కోసం అడ్డదార్లు తొక్కుతారనే భావాన్ని స్ఫురింపజేసేలా అందులో కొన్ని దృశ్యాలు, మాటలు ఉన్నాయని ఆరోపించారు. ఒక సీన్లో.. 'శవంపై ఉన్న ఆభరణాలను కూడా అందులో నటించిన బాలలు తీసుకుంటున్నట్లు ఉంది. మరో సీన్లో ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నట్లుగా చూపించారు. ఇంకా ఇబ్బందికర సన్నివేశాలున్నాయి' అని చెప్పారు. పిల్లల్ని నేరస్థులుగా చూపించేందుకూ చిత్ర నిర్మాతలు, దర్శకలు వెనకాడకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్‌సీ కేంద్ర సెన్సార్ బోర్డు డైరెక్టర్‌కు నోటీసులు పంపింది. 28లోగా ఆ అంశంపై వివరణ పంపాలని ఆదేశించింది.

Saturday, June 16, 2012

జూలై 6న వస్తున్న 'ఈగ'


నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'నా పేరు నాని, నేను ఈగనైతే గానీ' అనే టైటిల్ సాంగ్‌ను హీరో నాని బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా ఉపయోగిస్తున్నామనీ, చిత్రంలో ఈ పాటను 'ఈగ'పై తీశామనీ రాజమౌళి చెప్పారు.
'మగధీర' చేసేప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా తెలిసిందని అనుకున్నాననీ, కానీ 'ఈగ' చేస్తుంటే నేను తెలుసుకుంది చాలా తక్కువనీ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువనీ అర్థమైందన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ "ఈ సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ దర్శకుని శ్రమ కనిపిస్తుంది. తను అనుకున్నది రాజమౌళి చెయ్యగలిగాడు. రీరికార్డింగ్ అయిపోయి నెలపైనే అయ్యింది. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ కూడా అయిపోవచ్చింది. నేను విలన్ పాత్రలకు సంబంధించి కోట శ్రీనివాసరావుకు వీరాభిమానిని. 'ఈగ' చూసి సుదీప్‌కు వీరాభిమానినైపోయా. అతనిలాంటి నటులు ఇవాళ చాలా తక్కువమంది ఉన్నారు'' అని చెప్పారు.
హీరో నాని మాట్లాడుతూ "ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతతో ఉన్నా. రాజమౌళి ఈజ్ రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారు. ఇప్పటిదాకా భారతీయ తెరపైనే కాదు, అసలు వెండితెర మీదే ఇలాంటి సినిమా రాలేదనేది నా అభిప్రాయం'' అని తెలిపారు. సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనూ ప్రింట్లు వేస్తున్నాం. ఈ సినిమాకి రాజమౌళి ఎంతో శ్రమించాడు. ఇందులోని యానిమేషన్ గ్రాఫిక్స్ ఎంతో క్లిష్టమైనవి. అవి చాలా బాగా వచ్చాయి'' అన్నారు.

'ఎందుకంటే ప్రేమంట'ను ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు

రామ్, తమన్నా జంటగా తను రూపొందించిన 'ఎందుకంటే ప్రేమంట!'లోని కొత్తదనాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారనీ, సినిమాకి వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే దీనికి నిదర్శనమనీ దర్శకుడు ఎ. కరుణాకరన్ చెప్పారు. శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా కరుణాకరన్ మాట్లాడుతూ "చచ్చిన తర్వాతనే ఆత్మ ఉంటుందని అనుకుంటున్నారే తప్ప అసలు నిజమేంటో ఎవరికీ తెలీదు. నేను కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ హీరో సాయంతో తనని బతికించుకోవడం చూపించాను. ఇది అద్భుతమైన ప్రేమకథ. ఈ సినిమాని మెదడుతో చూడొద్దు, ఆత్మతో చూడండి. అందరూ చాలా చక్కని ఎమోషనల్ లవ్‌స్టోరీగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చేయని రీతిలో ఎంతో ఎనర్జిటిక్‌గా డాన్సులు చేశాడు రామ్'' అని చెప్పారు. నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ "ఎ, బి సెంటర్లలో సినిమా బాగా ఆడుతోంది. ఓ మంచి సినిమా చూద్దామనుకునే వాళ్లకి సంతృప్తినిస్తోంది. ఏ సినిమాకీ వెంటనే బాగుందని జనం చెప్పలేదు. 'గీతాంజలి', 'దేవదాసు' వంటి సినిమాలు కూడా చాలా రోజుల తర్వాతనే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతానికి కలెక్షన్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇది నవ్యతను కోరుకునేవాళ్ల కోసం తీసిన సినిమా. చూసినవాళ్లంతా ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. రామ్, తమన్నా జంట ముచ్చటగా ఉందని చెబుతున్నారు. చివరలో రామ్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దర్శకుడు కరుణాకరన్ బాగా తీశాడు. కొన్ని రోజులైనా గుర్తుండిపోయే సినిమా. ఇది ఎంత వసూలు చేస్తుందనేది తెలియడానికి కొంత టైమ్ పడుతుంది'' అన్నారు.

Friday, June 15, 2012

తమ్మారెడ్డి భరద్వాజ్ 'ప్రతిఘటన'

ఆరేళ్ల క్రితం సింధూ తులాని నాయికగా 'పోతే పోనీ' చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ మళ్లీ ఇప్పటివరకు సినిమాల జోలికి పోలేదు. తిరిగి చరిత చిత్ర పతాకంపై సినిమాలు తీయడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. ఇకనుంచీ ఏడాదికి ఏకంగా ఆరు సినిమాలు నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. "ఈ ఏడాది డిసెంబర్‌లోగా మూడు సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. నా దర్శకత్వంలో 'ప్రతిఘటన' అనే సినిమా చేయబోతున్నా. ఒరిస్సాలో జరిగిన ఓ నిజ సంఘటన ఈ సినిమా కథకు ఆధారం. అలాగే శివ అనే దర్శకుణ్ణి పరిచయం చేస్తూ 'ధ్యేయం' అనే సినిమాని నిర్మించబోతున్నా. ఈ సినిమాల ద్వారా ఎక్కువమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా'' అని చెప్పారు. కాగా ప్రతి ఏటా ఓ చారిటీ షో నిర్వహించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు భరద్వాజ్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 16న సత్యసాయి నిగమాగమంలో ఓ షోని నిర్వహిస్తున్నామనీ, ఇందులో గీతామాధురి, శ్రీకృష్ణ, మాళవిక, పర్ణిక వంటి గాయనీ గాయకుల పాటలు, శివారెడ్డి మిమిక్రీ, శ్రీనివాసరెడ్డి కామెడీ స్కిట్స్ ఉంటాయన్నారు. దీని ద్వారా వచ్చే డబ్బును గుంటూరులోని ఓ పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తామని భరద్వాజ్ చెప్పారు.

Wednesday, June 13, 2012

రవితేజ కోసమే పుట్టిన 'దరువు'


"ఇది రవితేజ కోసమే పుట్టిన కథ. ఇందులో తను చేసిన సీన్లు ఇప్పటివరకు చేయలేదని రవి అన్నారు'' అని చెప్పారు శివ. రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన 'దరువు'కు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి శివ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
'దరువు' పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్. యువతతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి చేస్తే మంచే జరుగుతుందనే సందేశం వాళ్లని ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలవగానే బాగుందన్నారు. ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి.
ఇదే తొలి చిత్రం
తెలుగులో ఇంతవరకు సోషియో పాంటసీ, సామాజిక అంశాల మేళవింపుతో సినిమా రాలేదు. ఆ తరహాలో ఇదే తొలి చిత్రం. చిరంజీవిగారి 'యముడికి మొగుడు'కీ, 'దరువు'కీ ఇదే తేడా. ఇది అవినీతిపై పోరాడే హీరో కథ. అవినీతిపై పోరాటం అంటేనే మనకు శంకర్ గుర్తుకొస్తారు. అందువల్ల ఈ సినిమాకీ, ఆయన సినిమాలకీ పోలిక రావడం సహజం. కానీ సన్నివేశాల్ని నా శైలిలో చిత్రీకరించా. ఇందులోని 3డి గ్రాఫిక్స్‌ని ప్రైమ్ ఫోకస్ వాళ్లు చాలా బాగా చేశారు.
అలసట ఎరుగని హీరో
ఆయన వద్దకు బౌండ్ స్క్రిప్టుతో వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆయన ఎనర్జీ మనకి కూడా వస్తుంది. ఆయనకు అలసట అనేది ఉండదు. ఈ సినిమా అవగానే వెంటనే మరో సినిమా కలిసి చేద్దామన్నారు రవి. రానున్న రోజుల్లో తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తా.
యాక్టింగ్ కష్టం
నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని ఇందులో చిన్న యముడి కేరక్టర్‌ని నన్నే వెయ్యమన్నారు రవితేజ. కానీ నా వరకు డైరెక్షన్ చేయడమే బెటర్. యాక్టింగ్ చాలా కష్టం. ఆ పాత్రను ప్రభు చాలా బాగా చేశారు. సీనియర్ యుమునిగా నటించిన కైకాల సత్యనారాయణగారు కూడా ప్రభు ఛాయిస్‌ను మెచ్చుకున్నారు. ఆడతనం ఉన్న పాత్ర చెయ్యడం బ్రహ్మానందంకు ఇదే తొలిసారి. అందుకే ఆయన పాత్రకు విద్యాబాలన్ పేరు పెట్టాం. ఆయన తెరమీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ పాత్రకు మంచి డాన్సర్ కావాలి. తాప్సీకి భరతనాట్యం వచ్చు. అందుకే ఆమెని తీసుకున్నాం. ఇప్పటివరకు ఆమె కామెడీ చేయలేదు. ఈ సినిమాలో ఆమె బాగా చేసింది.
మాట నిలబెట్టుకున్నా
తొమ్మిదేళ్ల గ్యాప్‌తో బూరుగుపల్లి శివరామకృష్ణగారు నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాని నేననుకున్న విధంగా తీయడానికి ఆయనిచ్చిన సహకారం మరచిపోలేనిది. సినిమా మొదలుపెట్టేప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి చూసేవిధంగా సినిమా ఉండాలనీ, వల్గారిటీ ఉండకూడదనీ చెప్పారు నిర్మాత శివరామకృష్ణగారు. ఆయనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నా. ఆయన బేనర్‌లో గతంలో 'ప్రేమంటే ఇదేరా'కి అసిస్టెంట్ కెమెరామన్‌గా, 'శ్రీరామ్'కు సినిమాటోగ్రాఫర్‌గా, ఇప్పుడు 'దరువు'కు డైరెక్టర్‌గా పనిచేశా. నన్నో కుటుంబ సభ్యునిలా ఆయన చూసుకుంటారు.
అజిత్‌తో సినిమా
తమిళంలో అజిత్ హీరోగా సెప్టెంబర్ నుంచి ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా. ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మించబోతోంది. తర్వాత తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తా.

Tuesday, June 12, 2012

బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా


"బాలకృష్ణకు రెండేళ్ల క్రితం 'నరసింహస్వామి' అనే కథ చెప్పా. ఓకే అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా'' అని చెప్పారు దర్శకుడిగా మారిన నటుడు జీవీ సుధాకరనాయుడు. ఆయన రాబోయే రోజుల్లో తన ప్రణాళికల గురించి పత్రికల వారికి తెలియజేశారు. "త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనిల్‌కపూర్, నానాపటేకర్, రేఖ కాంబినేషన్‌లో 'శత్రు' అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా'' అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బయటి బేనర్లలో 'హీరో', 'రంగ ది దొంగ' సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్‌ను నెలకొల్పారు.
"ఈ బేనర్‌పై తొలిసారిగా 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాని నిర్మించబోతున్నా. 'ద ప్రిన్స్ ఆఫ్ రాయలసీమ!' అనేది ఉప శీర్షిక. దీనికి నేను నిర్మాతను మాత్రమే. ఓ సీనియర్ డైరెక్టర్ దీన్ని రూపొందిస్తారు. కథ నాదే. టైటిల్ ప్రకారం రాయలసీమకు చెందిన ఓ పవర్‌ఫుల్ రెడ్డిగారు, ఆయన మనవడి చుట్టూ నడిచే కథ. రెడ్డిగారు ఏ రోజున పుట్టారో అదే రోజు మనవడు కూడా పుడతాడు. తాత ఎంత నీచుడో మనవడు అంతకంటే నీచుడు. 'దండంపెట్టి ఓటడిగేవాడు అన్నం పెడతానంటేనే ఓటెయ్' అని జనానికి చెబుతుంటాడు హీరో. రాయలసీమ ఫ్యాక్షన్, దాని ద్వారా వచ్చే అధికారం, దాన్ని ఉపయోగించుకుని సంపాదించే డబ్బు... వీటి చుట్టూ అల్లిన కథ. ఇందులో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. రెడ్డిగారికి ప్రత్యర్థి అయిన చౌదరి కూతురు, హీరో ప్రేమించుకోవడం, వారి ప్రేమకూ, రాజకీయాలకూ లంకె ఉండటం ఇందులోని ఇంటరెస్టింగ్ పాయింట్. రాజకీయం వ్యాపార స్థాయికి ఎలా ఎదిగిందో ఈ కథలో చెబుతున్నా. వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి ఈ కథకు క్లైమాక్స్ రాస్తా. అప్పుడే హీరోకి పేరు పెడతా. రెడ్డిగారి పాత్రకు కోట శ్రీనివాసరావును అనుకుంటున్నాం. హీరో ఛాయిస్‌ను డైరెక్టర్‌కి వదిలేస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, జయసుధ, రమ్యకృష్ణ, ముమైత్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు. చక్రి సంగీతం సమకూర్చబోతున్నారు'' అని తెలిపారు జీవీ. ఈ సినిమా వివాదాల్ని రేకెత్తించే అవకాశాలున్నాయి కదా అనడిగితే "తప్పకుండా కాంట్రవర్సీ అవుతుంది. అవనీయండి. అవ్వాలనే కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.

'ఎందుకంటే ప్రేమంట!'కు ప్రధాన బలం స్క్రిప్టే


"ఈ సినిమాకు ప్రధాన బలం కరుణాకరన్ సమకూర్చిన స్క్రిప్టే'' అన్నారు రామ్, తమన్నా. ఆ ఇద్దరూ కరుణాకరన్ డైరెక్ట్ చేసిన 'ఎందుకంటే ప్రేమంట!'లో జంటగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామ్, తమన్నా- ఇద్దరూ ఆ సినిమాకు సంబంధించిన తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు... 
రామ్: ఏడాది విరామంతో వస్తున్న సినిమా ఇది. చాలా ఎగ్జయిటింగ్‌తో ఉన్నా. ఇది నా హృదయానికి సన్నిహితమైన సినిమా. కరుణాకరన్, తమన్నా కాంబినేషన్‌తో ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. దీంతో ఆ కోరిక తీరింది. ఇందులో తమన్నా, నా కేరక్టర్లు సమానంగా ఉంటాయి. కరుణాకరన్ అంటేనే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీస్ చేస్తాడనే పేరు. ఇప్పటివరకు చెయ్యని కొత్త తరహాలో ఈ లవ్ స్టోరీని డీల్ చేశాడు. తమిళ వెర్షన్‌కి కొన్ని మార్పులు చేశాం, నేటివిటీని దృష్టిలో ఉంచుకొని.
తమన్నా: 'రెడీ'కి ఒకే రోజు పనిచేశా. అప్పుడు రామ్‌తో సరిగా మాట్లాడటానికి కూడా కుదరలేదు. ఈ సినిమాతో రామ్ ఎంత ఎనర్జిటిక్, స్పాంటేనియస్ యాక్టరో తెలిసింది. ఇక అతని డాన్సులు చూసి, అలా ఎలా చేయగలుగుతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. ఇందులో అతని డాన్సులే ఎక్కువ. నా డాన్సులు పెద్దగా ఉండవు. ఇది ఫ్రెష్‌నెస్ ఉన్న సబ్జెక్టు.
రామ్: తమన్నా కూడా మంచి డాన్సర్. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాకు ప్రధాన బలం కరుణాకరన్ స్క్రిప్టే. పాటల కంటే జీవీ ప్రకాశ్ ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాకి ఆరో ప్రాణం. కోన వెంకట్ ఇంపార్టెంట్ అయిన నెగటివ్ రోల్ చేశారు. రైటర్ కాబట్టి తన కేరక్టర్‌ను బాగా రాసుకున్నాడు. ఈ సినిమా చూశాక ఆయన రైటరా లేక యాక్టరా అనే కన్‌ఫ్యూజన్‌లో పడతారు ప్రేక్షకులు. ఇందులో నా కేరక్టర్ పేరు కూడా రామ్. 'నీ చూపులే' అనేది నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్.
తమన్నా: నేను చేసిన పాత్ర పేరు స్రవంతి. వెరీ ప్రొటెక్టివ్ గర్ల్ రోల్. నా కెరీర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్. 'నీ చూపులే' అనేది బెస్ట్ సాంగ్. నా దృష్టిలో కరుణాకరన్ స్క్రీన్‌ప్లే హైలైట్. నా మునుపటి సినిమా 'రచ్చ' ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే 'ఎందుకంటే ప్రేమంట!' అనేది దానికి భిన్నమైన సినిమా. ఇందులో పర్ఫార్మెన్స్‌కి బాగా అవకాశమున్న కేరక్టర్ నాది. ఈ సినిమాలో ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నా.
రామ్: హీరోగా మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలి కాబట్టి అటు కమర్షియల్ సినిమాలూ, ఇటు పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న సినిమాలూ.. రెండూ బేలన్స్ చేసుకుంటూ వస్తున్నా. 'కందిరీగ' పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే, ఇది దానికి భిన్నమైన లవ్‌స్టోరీ.
తమన్నా: బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న 'హిమ్మత్‌వాలా'లో అజయ్ దేవగన్ సరసన నటించబోతున్నా.

Monday, June 11, 2012

టీనేజ్ అబార్షన్లపై దృష్టిపెట్టిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'


"పిల్లలతో సెక్స్ గురించి చర్చించే ధైర్యం పెద్దలకి లేకపోవడంతో టీన్ అబార్షన్స్ పెరిగిపోతున్నాయి. టీనేజ్ లవ్, టీనేజ్ సెక్స్ సమాజాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ సినిమాలో చూపించా'' అని చెప్పారు పి. సునీల్‌కుమార్‌రెడ్డి. డిజిక్వెస్ట్ ఇండియా సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'కు ఆయన దర్శకుడు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే... 
ఇది నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద తీసిన సినిమా. టీన్ సెక్సువాలిటీ మీద ఫోకస్ చేసిన సినిమా. బైక్స్, గర్ల్‌ఫ్రెండ్స్ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న అబ్బాయిలు తమ కోరికల కోసం చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతోంది. చదువులేని వాళ్లకంటే చదువుకున్నవాళ్లే తప్పుదోవ పడుతున్నారు. పోలీసు రికార్డులు ఈ సంగతే చెబుతున్నాయి. ప్రతి నేరంలో ఓ రొమాన్స్ ఉంటుంది. మనుషులు తాము ప్రేమించిన వాళ్లకోసం నేరాలు చేస్తుంటారు. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' అని టైటిల్ పెట్టడానికి కారణం ఇదే.
ఏదీ రహస్యం కాదు
ఈ కథ కోసం ఎంతోమంది కాలేజీ పిల్లల్ని కలిసి మాట్లాడా. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాయిష్టాలు ఏమిటో ప్రతిఫలింపజేశా. వాళ్ల దృష్టికోణం నుంచే ఈ సినిమా తీశా. ఎక్కడా వల్గారిటీ వైపు పోకుండా ఈస్థటిక్‌గా, అందరూ కలిసి చూడదగ్గ రీతిలో తీశా. 'ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది' అనే ట్యాగ్‌లైన్ పెట్టాను. సీరియస్ సబ్జెక్టుని వినోదాత్మకంగా చెప్పా. తప్పుచేసిన వాళ్లు తాము దొరకం అనుకుంటే తప్పే. ఏదీ రహస్యం కాదనీ, దాపరికం అనేది ఏదో ఓ రోజు బయటపడుతుందనీ చెబుతున్నాం. ఇది ఓ టెన్ల్‌క్లాస్ అమ్మాయి, ఇంకో ఇంటర్మీడియేట్ అమ్మాయి, మరో ఇంజనీరింగ్ విద్యార్థిని - ఈ ముగ్గురి చుట్టూ నడిచే కథ. ఆ పాత్రల్ని గాయత్రి, దివ్య, స్వప్న చేశారు. హీరోలుగా ఇదివరకు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన మనోజ్ నందం, అనిల్ కల్యాణ్ నటించారు.
ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా
అవార్డులు పొందిన 'సొంతవూరు', 'గంగపుత్రులు' సినిమాలు ఎక్కువమంది ప్రేక్షకులకు ఎందుకు చేరలేదనే ప్రశ్న నుంచి పుట్టిన సినిమా ఇది. ఇవాళ సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతే. వాళ్లకు సంబంధించిన విషయంతో సినిమా తీస్తే వాళ్లు సొంతం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ సినిమా తీశా. నా సినిమాల్లో బిజినెస్‌పరంగా కూడా సంతృప్తికరమైన స్పందన వచ్చింది దీనికే. సినిమాకి స్ట్రక్చర్ కంటే ఎమోషన్ ఇంపార్టెంట్ అనేది నేను తెలుసుకున్న నిజం.
సెన్సిబుల్ సబ్జెక్టుకి కమర్షియాలిటీ
సమాజాన్ని ప్రతిబింబించే, సమాజానికి సంబంధం ఉండే కథలతో సినిమాలు తియ్యాలనుకునే వాళ్లలో నేనొకణ్ణి. సినిమా అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నమ్ముతా. ఇకనుంచీ సెన్సిబుల్ సబ్జెక్టులకే కమర్షియాలిటీ జోడించి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' తర్వాత ఓ కళారూపం నేపథ్యంలో సినిమా తీయాలనుకుంటున్నా. దానికి ఎల్బీ శ్రీరామ్‌తో కలిసి ఓ స్క్రిప్టు తయారు చేస్తున్నా.

Sunday, June 10, 2012

విలువైంది పోగొట్టుకున్నా

కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ప్రతి ఏటా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇదివరకు సీరియస్ సినిమా ప్రియులే దీనిపట్ల ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు కమర్షియల్ సినిమా ప్రియులు కూడా ఆ ఫెస్టివల్ అంటే మక్కువ చూపుతున్నారు. అంతటితో ఆగకుండా అక్కడకి వెళ్తున్నారు. అలాంటి వారిలో అందాల తార శ్రియ కూడా చేరిపోయింది. ఇటీవల కాన్స్‌కు వెళ్లిన శ్రియ అక్కడ తీపి, చేదు అనుభవాలు- రెండింటినీ చవిచూసింది. "కాన్స్‌లో ఎన్నో మంచి మంచి సినిమాలు చూశా. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సినిమా ప్రియుల్ని కలుసుకుని, వాళ్లతో మాట్లాడటం మరచిపోలేని అనుభవం'' అని చెప్పింది శ్రియ. మరి చేదు అనుభవం ఏమిటి? "ఈ ఫెస్టివల్ విషయంలో నాకున్న ఒకే కంప్లయింట్ నా వాలెట్ పోవడం. దాంతో పాటు నా క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, డైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నా. అది నా ఫేవరేట్ వాలెట్'' అని వాపోయింది శ్రియ.

Saturday, June 9, 2012

షార్క్ చేపలతో ఈతకొట్టా

ఫిట్‌నెస్ విషయంలో ఏ బాలీవుడ్ హీరోయినూ ఆమెని గెలవకపోవచ్చు. విమానాల్లోంచి కిందకి దూకే, సముద్రంలో షార్క్ చేపలతో కలిసి ఈతకొట్టే సాహసం ఆమెకి గాక మరెవరికి ఉంటుంది. ఆమె... దీపికా పదుకోనె. 'కాక్‌టెయిల్' సినిమా షూటింగ్ మధ్యలో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ ఫీట్లు చేసింది. ప్రస్తుతం 60 కిలోల బరువుతో ఇదివరకెన్నడూ లేనంత ఫిట్‌గా ఉన్నానని చెబుతున్న ఆమె "షూటింగ్ అయిపోగానే నేను, దర్శకుడు హోమీ అదజానియా, నా సహ నటి డయానా పెంటీ కలిసి గన్స్‌బాయ్ గ్రామంలో గ్రేట్ వైట్ షార్క్‌లతో కలిసి ఈతకొట్టాం. మూడుసార్లు విమానాల్లోంచి కిందికి దూకాం. నేను గనక ఫిట్‌నెస్‌తో లేకపోయినట్లయితే ఈ ఫీట్లు చేయగలిగేదాన్ని కాదు'' అని చెప్పింది 26 సంవత్సరాల దీపిక. ఇదివరకటికంటే ఇప్పుడామె మరింత అందంగా కనిపిస్తోంది. "ఫిట్‌నెస్ అనేది శరీర బరువు మీద కాక వంట్లోని కొవ్వు శాతం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది సన్నగా ఉండేవాళ్లలో అధిక కొవ్వుశాతం ఉంటుంది. అది అనారోగ్యకరం'' అని తెలిపింది ఈ బక్కపలుచని భామ.

Friday, June 8, 2012

కేఎస్ఆర్ దాస్ కన్నుమూత

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.ఆర్. దాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి (జూన్ 8) తుదిశ్వాస విడిచారు. ఆయన 1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించారు. 1966లో 'లోగుట్టు పెరుమాళ్లకెరుక' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణతో అత్యధికంగా 30 పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా ఆయనకు అమితమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. తెలుగులో యాక్షన్ సినిమాల ఒరవడికి ఆయనే ఆద్యుడిగా నిలిచారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, రజనీకాంత్ వంటి హేమాహేమీలను డైరెక్ట్ చేశారు.

బాలకృష్ణ ఇంట్లో చోరీ

ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో చోరీ జరిగింది. 35 తులాల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గతనెల 24వ తేదీన బాలకృష్ణ సతీమణి వసుంధర, పిల్లలు విహారయాత్రలకు వెళ్లారు. 30వ తేదీన బాలకృష్ణ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే వసుంధర వెళ్లేటప్పుడు తన సోదరి భర్త ప్రసాద్‌కు తాళం ఇచ్చి ఇంట్లో కొన్ని మరమ్మతులు చేయించాలని కోరారు. ప్రసాద్ తన భార్యతో కలసి బుధవారం బాలకృష్ణ ఇంటికెళ్లారు. అక్కడి నుంచి వసుంధరకు ఫోన్ చేసి ఎక్కడ మరమ్మతులు చేయించాలో అడిగారు. ఆ సమయంలో వసుంధర తాను ఒక గదిలో బంగారు ఆభరణాలు ఉంచాననీ, ఒకసారి చూడాలని కోరారు. ఆ గదిలోకి వెళ్లి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. దాంతో ఇంట్లో చోరీ జరిగిందని భావించిన ప్రసాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కామెడీ చేస్తున్న విద్య

'ద డర్టీ పిక్చర్', 'కహాని' సినిమాల్లో బలమైన పాత్రలు పోషించి, ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఇప్పుడు ఓ కామెడీ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరు 'ఘన్‌చక్కర్'. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. "ఇది నా తొలి కామెడీ సినిమా కావడంతో కాస్త నెర్వస్‌గా ఉంది. ఇప్పుడే నా కేరక్టర్ గురించి చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇందులో నేను ఇమ్రాన్ హష్మి పంజాబీ భార్యగా కనిపిస్తాను'' అని తెలిపింది విద్య. 'ద డర్టీ పిక్చర్' తర్వాత ఇమ్రాన్, విద్య మరోసారి ఇందులో కలిసి నటించనుండటం గమనార్హం. 'ఆమిర్', 'నో ఒన్ కిల్డ్ జెస్సికా' ఫేమ్ రాజ్‌కుమార్ గుప్తా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యుటీవీ నిర్మిస్తోంది. 'ద డర్టీ పిక్చర్', 'కహాని' సినిమాలతో సూపర్ హీరోయిన్ ఇమేజ్ పొంది, హీరోయిన్లు సైతం బాక్సాఫీసును కొల్లగొట్టగలరనే సంగతిని నిరూపించిన విద్య నేడు హీరోయిన్లకి స్ఫూర్తిగా నిలిచిందన్నది కాదనలేని సత్యం.

Tuesday, June 5, 2012

గాలి జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) గనుల అక్రమాల కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి, ఆయన సన్నిహితుడు అలీఖాన్ కస్టడీని ఈనెల 18 వరకు పొడిగించారు. గనుల అక్రమాలకు సంబంధించి సీబీఐ వీరిద్దరినీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీ పూర్తి అయిన సందర్భంగా సీబీఐ కోర్టు ఈ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి జనార్దన రెడ్డి, ఆయన సన్నిహితుడు అలీఖాన్ ప్రస్తుతం బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహార జైల్లో ఉండడంతో భద్రతా దృష్ట్యా అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం న్యాయమూర్తి విచారణ చేపట్టి కస్టడీని పొడిగించారు.

రాయచోటిలో వైకాపా, టిడిపి ఘర్షణ

వైఎస్‌ఆర్ కడప జిల్లా రాయచోటిలో సోమవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాత రాయచోటిలో ఉదయం ప్రచారానికి వెళ్లిన వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి, అతని అనుచరులను తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చేసుకుంది. ఇంతలో తెలుగుదేశం వర్గం వారు వైకాపా నాయకులపై రాళ్లు, ఇటుకపెళ్లలు విసిరారు. దీంతో వైకాపా నేతలు సైతం ప్రతిదాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీకాంత్‌రెడ్డి గన్‌మెన్ జాకీర్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైకాపాకు చెందిన రఘునాథ, నిత్యానందరెడ్డికి గాయాలయ్యాయి. గన్‌మెన్ కాల్పుల్లో వీరనాగయ్య గాయపడినట్లు తెలుస్తోంది. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదుచేశాయి. సంఘటనా స్థలాన్ని ఎస్‌పి మనీష్‌కుమార్ సిన్హా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్త చర్యగా రాయచోటికి అదనపు బలగాలను తరలించారు. ఈ సందర్భంగా వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పాత రాయచోటిలో ప్రచారానికి వెళ్లిన తమను టిడిపి వర్గీయులు ముందస్తు ప్రకాళికతో అడ్డుకుని దాడికి పాల్పడ్డారన్నారు. ఓడిపోతామన్న భయంతోనే దాడికి పాల్పడ్డారన్నారు. ఇదిలా ఉండగా ప్రచారానికి వచ్చిన శ్రీకాంత్‌రెడ్డిని స్థానిక ప్రజలు అడ్డుకుంటే తమపై నింద మోపడం విచారకరమని టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం అన్నారు. పాత రాయచోటిలో అభివద్ధి జరగలేదనే ప్రజలు అడ్డుకున్నారన్నారు. వారే తొలుత దాడిచేశారని ఆయన ఆరోపించారు.

సీబీఐ జేడీకి ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన అభిమాని

సినీ హీరోలకూ, రాజకీయ నాయకులకూ అభిమానులు ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానం చాటుకోవడం మనకు తెలుసు. అయితే ఇక్కడ సీన్ మారింది. మహా మహా నాయకుల్ని జైలుకు పంపుతున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పుడు అభిమాన సంఘాలు ఏర్పడుతున్నాయి. ఈ దశాబ్దపు హీరోగా లక్ష్మీనారాయణను కీర్తిస్తూ అమలాపురంలో ఉదయభాస్కర్ అనే అభిమాని ఆయనకు ఫ్లెక్సీకట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నాయకుల్ని జైల్లో పెడుతున్న లక్ష్మీనారాయణకు యువత సంపూర్ణ మద్దతునివ్వాలని అందులో సూచించారు.

రామ్‌దేవ్‌కు గడ్కారీ పాదాభివందనం

బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సోమవారం యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు పాదాభివందనం చేశారు. తాను రామ్‌దేవ్ పాదాలకు నమస్కరించడం గౌరవంతో కూడుకున్నదని, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం తప్పేమీ కాదని గడ్కారీ పేర్కొన్నారు. ‘కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి మన వద్దకు వస్తే ఆయన దీవెనలు తీసుకోవాలని మన సంస్కృతి చెపుతోంది. నేను అదేవిధంగా చేశాను. బాబా ఆశీర్వాదం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. మన సంస్కృతిని పాటించని వారు వేరే విధమైన ప్రవర్తనను కలిగి ఉంటారు’ అని గడ్కారీ అన్నారు. విదేశాల్లో దాగున్న నల్లడబ్బును భారత్‌కు తిరిగి తెచ్చేందుకు చేపట్టిన ఉద్యమానికి బీజేపీ మద్దతు కోరుతూ రామ్‌దేవ్ ఢిల్లీలోని గడ్కారీ నివాసానికి వెళ్లిన సమయంలో... ఆయన రామ్‌దేవ్ పాదాలకు నమస్కరించారు. పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం, నల్లధనం అంశంపై వారిద్దరూ సమావేశమై చర్చించారు. ఇదిలా ఉండగా, ప్రతిపక్షాలు, పౌర సమాజంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా విమర్శలు చేయడంపై బీజేపీ చీఫ్ గడ్కారీ మండిపడ్డారు. ఆమె ఆరోపణలు నిరాధారమన్నారు. నల్లధనాన్ని వెనక్కి తేవాలన్న రామ్‌దేవ్ డిమాండ్ జాతి వ్యతిరేకమని కాంగ్రెస్ భావిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ నెల 24న నాగ్‌పూర్‌లో జరగనున్న తన కొడుకు సారంగ్ పెళ్లికి రావాలని గడ్కారీ.. సోనియాను వ్యక్తిగతంగా కలుసుకుని ఆహ్వానించారు. 

తారా చౌదరి సీడీలున్నాయి!


"తారా చౌదరికి, మీకూ సంబంధించిన ఆడియో, వీడియో సీడీలు మా దగ్గర ఉన్నాయి. నన్ను కలిస్తే వాటిని అప్పగిస్తాను. ఈ నెంబర్‌కు తిరిగి ఫోన్ చేయొద్దు. చేసినా... అది పని చేయదు''... ఇది గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సెల్‌ఫోన్‌కు ఎస్ఎమ్మెస్ సారాంశం! ఒకటీ రెండు కాదూ... పదే పదే అదే ఎస్ఎమ్మెస్! 7306727667 అనే నెంబర్ నుంచి ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసింది.
నాలుగు రోజుల క్రితం ఎంపీ రాయపాటి లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కన్యకాపరమేశ్వరీ గుడికి వెళ్లిన సమయంలో ఈ ఎస్ఎమ్మెస్ వచ్చింది. దీనిని ఆయన అక్కడే ఉన్న సీఐ రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అర్బన్ ఎస్పీ రవికృష్ణను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.. దీనిపై సీఐ రామాంజనేయులు కోర్టు అనుమతి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే తారా చౌదరి కేసులో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని రాయపాటి ఆగ్రహంగా ఉన్నారు.
ఇప్పుడు ఎస్ఎమ్మెస్‌లు రావడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. బెదిరింపు మెసేజ్ వచ్చిన సెల్ నెంబర్ ఎవరిదనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. తనకు ఇటీవల బెదిరిం పు మెసేజ్‌లు వస్తున్నందునే పోలీసులకు ఫిర్యాదు చేసి నట్లు రాయపాటి తెలిపారు. ఈ బెదిరింపులు మావోయిస్టుల పని అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

సూర్య సరసన హన్సిక

సూర్య, అనుష్క జంటగా నటించిన 'సింగమ్' ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో 'యముడు' పేరుతో విడుదలై ఇక్కడా సక్సెసయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు హరి. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా అందాల తార హన్సిక ఎంపికైంది. తమిళంలో 'చిన్న కుష్బూ'గా పేరుపొందిన హన్సిక ఈ సినిమాలో కాలేజ్ గర్ల్‌గా కనిపించన్నుది. సూపర్‌హిట్ తెలుగు సినిమా 'దేశముదురు'తో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అవడం గమనార్హం. 'మాప్పిళ్లై', 'ఎంగేయుమ్ కాదల్', 'వేలాయుధం', 'ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాలతో ఆమె తమిళంలో టాప్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది. 'సింగమ్ 2' సినిమా తన పాపులారిటీని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ సుందరి. కాగా ఒరిజినల్‌కి సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకీ బాణీలు కూర్చబోతున్నాడు.

Monday, June 4, 2012

కార్తిక స్థానంలో తాప్సీ

విశాల్ సరసన నాయికగా తాప్సీ నటించనుంది. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందబోతున్న 'మద గజ రాజా' (ఎం.జి.ఆర్.) చిత్రంలో మొదట నాయికగా కార్తిక ఎంపికైంది. అయితే మొదట ఆమె విన్న స్క్రిప్టుకూ, తర్వాత మార్పులు చేసిన స్క్రిప్టుకూ చాలా తేడా ఉండటమే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోడానికి కారణమని వినిపిస్తోంది. మొదట విశాల్ కోసం దర్శకుడు మూడు పాత్రలు సృష్టించాడు. తర్వాత వాటి స్థానంలో ఒకే పాత్రను పెట్టాడు. ఆ పాత్ర సరసన ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించాలని డైరెక్టర్ చెప్పడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కార్తిక నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె బదులు ఆ స్థానంలోకి తాప్సీ వచ్చిందనేది కోలీవుడ్ వర్గాల భోగట్టా. రెండో హీరోయిన్ కేరక్టర్‌కి నిర్మాతలు కొత్తమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారు. మరో హీరోయిన్ బదులు తాప్సీ రావడం కోలీవుడ్‌లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదివరకు అజిత్ హీరోగా విష్ణువర్థన్ రూపొందించ తలపెట్టిన సినిమాలోనూ రిచా గంగోపాధ్యాయ్ స్థానంలో ఆమె ఎంపికైంది.

పవన్‌కల్యాణ్ షో గబ్బర్‌సింగ్

"ఒన్‌మ్యాన్ షో 'గబ్బర్‌సింగ్'. పవన్‌కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్‌సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్‌చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్‌సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్‌కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్‌ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్‌వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్‌సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

Saturday, June 2, 2012

ఆల్బమ్ రూపోందించే పనిలో ఉన్నా


'నాకెంతో ఇష్టమైన వ్యాపకం సంగీతం. గతంలో సంగీతాన్ని అందించినప్పటికీ త్వరలో స్వయంగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నాను. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాను' అని అంటున్నారు కమల్‌హాసన్ గారాలపట్టి శ్రుతి హాసన్. శాంసంగ్ సంస్థ రూపొందించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్-3 మొబైల్ ఫోన్‌ను నగరంలో ఆవిష్కరించటానికి ప్రత్యేకంగా విచ్చేశారు ఆమె. నగరంలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసిన మొదటి 10 మందికి వాటిని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 'గబ్బర్ సింగ్' హిట్ తరువాత తాను చేయబోయే సినిమాపై జాగ్రత్త వహిస్తున్నానని చెప్పారు.

చిరుకు అపూర్వ స్పందన

తిరుపతి పర్యటనలో చిరంజీవికి విశేష స్పందన లభించింది. జనం తన కోసం ఎదురు చూస్తుండటంతో సంబరపడిన చిరంజీవి హుషారుగా అడుగులు వేసుకుంటూ ఇంటింటి ముంగిటకు దూసుకుపోయి హస్తం గుర్తుకు ఓటేయమని అభ్యర్థించారు. చిరంజీవి చొరవ, మాట తీరు గమనించిన ప్రజలు ఆయన ప్రసంగంపై ఎక్కువ ఆసక్తి కనబరిచారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో యువకులు చిరంజీవితో పాటు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

'అధినాయకుడు'పై నివేదిక రావాలి

నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి భన్వర్‌లాల్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ చిత్రంలో సంభాషణలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ చేసిన చెల్లింపు వార్తలపై జిల్లా స్థాయి కమిటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని నేతలకు సూచించారు.

'గబ్బర్‌సింగ్'పై రజనీకాంత్ ప్రశంసలు

విడుదలైన అన్ని చోట్లా సూపర్‌హిట్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్' సినిమాని పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ అభివర్ణించారు. పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్'గా అదరగొట్టేశాడని రజనీ ప్రశంసించారు. గత బుధవారం లోకల్ డిస్ట్రిబ్యూటర్ తరపున చెన్నయ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రదర్శనలో రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో సహా 'గబ్బర్‌సింగ్' చిత్రాన్ని వీక్షించారు. సినిమా ఆద్యంతం రజనీ బాగా ఎంజాయ్‌చేశారట. సినిమా ముగిసిన అనంతరం పవన్‌కళ్యాణ్‌కి ప్రత్యేకంగా ఫోన్‌చేసి అభినందించినట్లు తెలిసింది. కాగా, 'గబ్బర్‌సింగ్' ఆంధ్రాలో మాత్రమే కాకుండా, తమిళనాడులో కూడా హిట్ చిత్రంగా నిలిచింది.

'యథార్థ ప్రేమకథ'తో ఎన్ని ఇబ్బందులు పడ్డానో

"ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా'' అని చెప్పారు చరణ్‌రాజ్. 'ప్రతిఘటన'తో నటునిగా పరిచయమై, తొలి చిత్రంతోటే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన చరణ్‌రాజ్ ఇప్పుడు దర్శకునిగా మారి 'యథార్థ ప్రేమకథ'ను రూపొందించారు. సి.ఆర్. క్రియేషన్స్ పతాకంపై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా గురించి చరణ్‌రాజ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
టీవీలో 'అనితా ఓ అనితా' పాట చూసి, నాగరాజు కథ విని ఎమోషనల్ అయిపోయి ఆ కథపై సినిమా తీస్తానని అప్పటికప్పుడు ప్రకటించా. చెప్పినట్లుగానే తీశా. నాగరాజు పాత్రలో అమర్‌నీ, అనిత పాత్రలో చిరినీ పరిచయం చేస్తున్నాం. ఇద్దరూ చక్కగా చేశారు. వాళ్లిద్దరి ప్రేమనూ సఫలం చేయాలని ప్రయత్నించే పాత్రను నేను చేశా. ఈ నెల 25 మా చిన్నబ్బాయి దేవేందర్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని సొంతంగానైనా రిలీజ్ చేస్తున్నానంటే మల్టీడైమన్షన్ వాసు సహకారం వల్లే. వాళ్లకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.

సినిమా అంతా హైలైటే
నా దృష్టిలో కథే మొదటి హీరో. ఈ కథ మీద నాకు బాగా నమ్మకం. ప్రేమ అంటే సెక్స్ కాదు, గొడవలు పడ్డం కాదు, అదో పవిత్ర భావన అని ఈ సినిమా ద్వారా చెబుతున్నా. ఇందులో ఫలానాది హైలైట్ అని చెప్పలేను. సినిమా మొత్తంగా హైలైటే. ఫస్టాఫ్ బాగుంటుంది. సెకండాఫ్ ఇంకా బాగుంటుంది. బిగువైన స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాం. ఎంవీఎస్ హరనాథరావు దేవుడిలా నాకు దొరికారు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. డైలాగ్స్ అద్భుతంగా రాశారు. ఈ సినిమా కథ కానీ, సన్నివేశాలు కానీ ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తాయి. తప్పకుండా వారు ఈ సినిమాని ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నా. ఈ సినిమా విడుదల సందర్భంగా పది ప్రేమ జంటలకి పెళ్లి చేస్తామని ప్రకటించా. ఇటీవలే ఆర్యసమాజ్‌లో కులం, మతంతో సంబంధం లేకుండా ఆ పెళ్లిళ్లు జరిపించాం. ఇది మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది.

ఆ సంగతి తెలుసుకున్నా
నటుడిగా ఎంత అనుభవం ఉన్నా నిర్మాతగా ఇదే తొలి అనుభవం. దీని వల్ల ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలుసుకున్నా. నటుడిగా 20 సినిమాల ఆఫర్లను పక్కనపెట్టి దీన్ని చేశా. ఈ సినిమాని ఎలా పూర్తి చేయగలిగానో, దీని కోసం ఏమేం ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆర్థిక వనరులు సరిపోక, మధ్యలోనే ఈ సినిమాని ఆపేద్దామనుకున్నా. కానీ మనసు ఒప్పుకుంటేగా. వడ్డీ ఎంతనేది చూసుకోకుండా అప్పులు చేసి, ఈ సినిమా పూర్తిచేశా. ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదనే సంగతి తెలిసింది. కొంతమంది నన్ను మోసం చేశారు. నటుడిగా అవకాశాలు వదలుకొని ఎందుకు ఈ సినిమా చెయ్యాలి అని ఎన్నోసార్లు అనిపించింది. తామున్నామని ధైర్యం చెప్పినవాళ్లు తర్వాత ఏమయ్యారో తెలీలేదు. 400 సినిమాల్లో నటించిన నాకే ఇలాంటి స్థితి ఉందంటే కొత్తగా వచ్చే నిర్మాతలకి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే. తొలి కాపీ చూసుకున్న రోజు నేను పడ్డ కష్టాన్నంతా మరిచిపోయా.
కృష్ణవంశీ సినిమా చేస్తున్నా
నాని హీరోగా కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. అలాగే 'జెంటిల్‌మన్ పోలీస్' అనే సినిమాని త్వరలో డైరెక్ట్ చేయబోతున్నా. ఇందులో పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్ నేనే చేస్తున్నా. ఈ సినిమాని మంత్రాలయం పోలీసులకు అంకితమిస్తాను. కథ నాదే. ఎంవీఎస్ హరనాథరావు రచయిత.


Friday, June 1, 2012

ఏడు పదుల యువకుడు


కమర్షియల్‌గా తెలుగు సినిమాని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన అగ్రగణ్య దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటారనే సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ తొలినాళ్లలో 'జ్యోతి', 'ఆమె కథ', 'ప్రేమలేఖలు', 'కల్పన' వంటి నాయిక ప్రధాన చిత్రాలతో విజయాలు సాధించిన ఆయన అనంతర కాలంలో టాప్ కమర్షియల్ డైరెక్టర్‌గా ఎదిగారంటే నిరంతరం తనలోని ప్రతిభను మెరుగు పరచుకుంటూ రావడం వల్లే.
1977లో ఎన్టీ రామారావు హీరోగా ఆయన రూపొందించిన 'అడవిరాముడు' సాధించిన సంచలనాలతో ఆయన ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోయారు. అప్పట్లో ఆ సినిమా సాధించిన కలెక్షన్లు అందర్నీ అబ్బురపరిచాయి. మరీ ముఖ్యంగా అందులోని 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' పాట అనంతర కాలంలో తెలుగు సినిమా పాట స్థితిగతుల్నే మార్చేసింది. 'పదహారేళ్ల వయసు', 'వేటగాడు', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి', 'దేవత', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'అగ్నిపర్వతం', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మేజర్ చంద్రకాంత్', 'పెళ్లి సందడి', 'గంగోత్రి' వంటి సినిమాలు కమర్షియల్ డైరెక్టర్‌గా ఆయన ప్రతిభకు తార్కాణాలు. అటువంటి డైరెక్టర్ దృష్టి కొంతకాలం క్రితం భక్తిరసం వైపు మళ్లింది.
ఫలితంగా చారిత్రక కథలకు కమర్షియల్ హంగులద్ది ఆయన రూపొందించిన భక్తిరస చిత్రాలు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' ఆయన కీర్తిని మరింత పెంచాయి. ప్రస్తుతం ఆయన కోట్లాది భారతీయుల ఆరాధ్యదైవమైన 'శిరిడి సాయి'ని తెరమీద చూపించే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. అన్నమయ్య, రామదాసు పాత్రల్ని పోషించిన అక్కినేని నాగార్జునే సాయి పాత్రనూ పోషిస్తున్నారు. ఇప్పటికే సాయిపై పలు సినిమాలు వచ్చినా, కేవలం రాఘవేంద్రరావు రూపొందిస్తున్నందునే 'శిరిడి సాయి'కి ప్రత్యేకత వచ్చిందనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సొంతం చేసుకున్న రాఘవేంద్రరావు భవిష్యత్తులో ఇంకేం అద్భుతాలు చేయనున్నారో...