Thursday, December 30, 2010

సినిమా సక్సెస్‌కి ఫార్ములా వుందా?

'నువ్వు నేను' సినిమాని ఎంత బాగా తీశాడురా డైరెక్టరు - చాలాచోట్ల ఈ మాటే వినిపిస్తోంది. అందులో కాస్తయినా అసత్యం లేదు. తేజ ఆ చిత్రాన్ని చక్కగా తీసి, పరిశ్రమని చిక్కుల్లోకి నెట్టాడు. సినిమా హిట్టవ్వాలంటే ఫార్ములా ఏంటి? ఈ ప్రశ్నకి ఎవరికి తోచినట్లు వాళ్లు సమాధానం చెబుతారు. ఒకరు చెప్పిన దానికీ, మరొకరు చెప్పిన దానికీ పోలికలో భేదం లేకుండా వుండదు. 'స్టార్స్ లేకుండా సినిమా తీసి చేతులు కాల్చుకోలేను' అంటాడో నిర్మాత. అంటే ఏమిటర్థం - సినిమా ఆడాలంటే స్టార్లు (పెద్ద హీరోలు) కావాలని. కానీ స్టార్లు లేకుండానే ఈ మధ్య ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. తేజ తీసిన మూడు సినిమాల్లో రెండు హిట్టయ్యాయి. ఆ రెండింటిలోనూ హీరో ఉదయ్‌కిరణ్ అయితే హీరోయిన్లు కొత్తవాళ్లు. వాళ్లెవరికీ స్టార్ వాల్యూ లేదు. అయినా అటు 'చిత్రం', ఇటు 'నువ్వు నేను' విజయం సాధించడంలో 'స్టార్ వాల్యూ' ఏమాత్రం అడ్డు కాలేదు. తేజే తీసిన 'ఫ్యామిలీ సర్కస్'లో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వున్నా అది ఫెయిలయ్యింది. 'నువ్వే కావాలి' చేసేప్పుడు తరుణ్, రిచాలకి స్టార్ వాల్యూ లేదు. అదెంత ఘనవిజయం సాధించిందో మనకు తెలుసు. 'నువ్వే కావాలి' దర్శకుడు విజయభాస్కర్ దానికంటే ముందు తీసిన 'స్వయంవరం' కూడా చక్కని విజయం సాధించింది. అందులో హీరో వేణు. అంతదాకా అతడి గురించి ఎవరికీ తెలీదు. ఆ వేణుదే 'చిరునవ్వుతో' కూడా హిట్టయ్యింది.
2001లోనే చూస్తే - మృగరాజు, దేవీపుత్రుడు, ప్రేమతో రా, ఎదురులేని మనిషి, బావనచ్చాడు, భలేవాడివి బాసూ, బడ్జెట్ పద్మనాభం, ఫ్యామిలీ సర్కస్, శుభకార్యం, రైల్వే కూలీ, సూరి, మనసిస్తారా - వంటి స్టార్ వాల్యూ వున్న సినిమాలు అటు బయ్యర్లనీ, ఇటు ప్రేక్షకుల్నీ ఏడిపించాయి. కానీ 'ప్రియమైన నీకు', '6టీన్స్', 'సంపంగి' వంటి స్టార్ వాల్యూలేని సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా 'నువ్వు నేను' ఘనవిజయం దిశగా పయనిస్తోంది. కాబట్టి చిత్ర విజయానికీ, స్టార్ వాల్యూకీ సంబంధంలేదని స్పష్టమవుతోంది. మరైతే చిత్ర విజయానికి సంబంధం దేనితో? చిత్రాన్ని బాగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది మామాలుగా అందరూ అనే మాటే. బాగా తీయడానికి ఫార్ములా ఏదన్నా వుందా? లేదు. కొంతమంది 'సామాజికాంశంతో సినిమాలు తీస్తే జనరంజకం కావు' అంటారు. అందులో వాస్తవం లేదు. దివంగత దర్శకుడు టి. కృష్ణని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే.. ఆయన తీసినవన్నీ సామాజిక ప్రయోజనం ఉన్న చిత్రాలే. 'ప్రతిఘటన', 'నేటి భారతం', 'దేశంలో దొంగలుపడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'రేపటి పౌరులు' వంటివన్నీ విజయం సాధించినవే. వాటిలో ఒక్కో సినిమా ఒక్కో సమస్యని ఎలివేట్ చేస్తుంది. అయినా ప్రేక్షకులు వాటిని ఆదరించారు. అంటే సామాజికాంశంతో చిత్రాలు రూపొందించినా విజయం సాధించవచ్చని కృష్ణ నిరూపించారు. ఆర్. నారాయణమూర్తి కూడా నిరూపించారు. పెద్ద దర్శకులైనవాళ్లు కూడా అడపదడపా అట్లాంటి చిత్రాలు తీసి నిరూపించారు. 'ఈనాడు', 'గణేశ్', 'ఆజాద్' వంటి సామాజిక చైతన్య చిత్రాలు పెద్ద హీరోలున్నా విజయం సాధిస్తాయని రుజువు చేశాయి. 'భారతీయుడు', 'జెంటిల్మన్' వంటి డబ్బింగ్ సినిమాలూ దీన్ని బలపరిచాయి. అంటే సామాజిక చిత్రాలు తీసి విజయం సాధించవచ్చన్నది స్పష్టం. పైగా దానివల్ల ప్రజలకు మేలు చేసినవాళ్లూ అవుతారు.
మళ్లీ మొదటికి వద్దాం. 'నువ్వు నేను' విజయంతో ఇప్పుడు సినిమా విజయానికి ఫార్ములా దొరికిందని పరిశ్రమలో కొంతమంది లెక్కలు కడుతున్నారు. ప్రేమకథకి కాస్తంత మసాలా జోడించి విడిచిపెడితే అందులో యాక్టర్లు ఎవరన్నది పట్టించుకోకుండా జనం దాన్ని హిట్‌చేసి పారేస్తారన్నది ఆ ఫార్ములా రహస్యం. దాంతో ఇప్పటికే 'ప్రేమ' కాన్సెప్టుతో కొత్తవాళ్లతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల్లో 'మసాలా' శాతం ఎంత వుందో తూకం వేసుకుంటున్నారు. మసాలా ఎక్కువైనా ఫర్వాలేదు. కానీ తక్కువైతే మరికొంత జోడిద్దాం అని ఆలోచనలు చేస్తున్నారు. మసాలా తక్కువ కాబట్టే 'వేచి వుంటా', 'తొలివలపు', 'రేపల్లెలో రాధ', 'రావే నా చెలియా', 'స్పర్శ' వంటి చిత్రాలు ఫెయిలయ్యాయంటున్నారు. అయితే వాళ్లు ఇక్కడ ఓ సంగతి మరుస్తున్నారు. మసాలా ఎక్కువైనా ప్రేక్షకులు భరించలేరనేదే ఆ సంగతి. 'మనసిస్తా రా', 'ప్రేమతో రా', 'సూరి' వంటి సినిమాలు మసాలా మోతాదు మించినందునే ఫట్‌మన్నాయని గ్రహిస్తారా?
ఒకాయన యథాలాపంగా 'ప్రేమకథ తీసినా, సామాజిక చిత్రం తీసినా, యాక్షన్ సినిమా తీసినా, స్టార్ వాల్యూ వున్నా, లేకపోయినా చూడ్డానికి బాగుంటే, రంజింపజేసేట్టు వుంటే జనం తప్పకుండా ఆదరిస్తారు' అన్నాడు. అంటే మంచి సినిమా అనేది ఏ రూపంలో వున్నా జనం చూస్తారని. 'సరే ఇంతకీ జనరంజకంగా వుండాలంటే ఏ మసాలా ఎంత శాతంలో వుండాలి?' అని ఓ ఔత్సాహిక దర్శకుడు ఆలోచనలో పడిపోయాడు.
-ఆంధ్రభూమి, 24 ఆగస్టు 2001 

Monday, December 27, 2010

సినిమా: మన 'విలన్'పై చిన్న చూపెందుకు?-2

ఇంతమంది నటులు విలన్‌గా రాణించి హీరోలతో పాటే (తక్కువగానైనా) స్థిరంగా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు అట్లాంటి స్థిరమైన విలన్ వేషధారులు కనిపించకపోవడమే బాధాకరం. జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి వంటి నటులు విలన్ వేషాల్లో మెప్పిస్తున్నా వాళ్లు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో జయప్రకాశ్‌రెడ్డి విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా తగినన్ని అవకాశాలు మన నిర్మాతలు, హీరోలు ఇవ్వడం లేదు. అతను ఆహార్యంలో కానీ, హావభావాల్లో కాన్నీ పచ్చి దుర్మార్గాన్ని పలికించడంలో నేర్పరి. ఇతన్ని తెలుగు చిత్రసీమ సరైన రీతిలో వినియోగించుకుంటే ఈసరికే తిరుగులేని విలన్ అయ్యుండేవాడు. 'మాతృదేవోభవ', 'నువ్వు నేను' సినిమాల్లో అతి క్రూరమైన విలన్ పాత్రల్లో బాగా రాణించిన తనికెళ్ల భరణిని విలన్‌గా కంటే హాస్య నటుడి పాత్రల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి భరణిని హాస్యనటుల జాబితాలోనే వేసుకోవాలి. చలపతిరావుది మరో రకం కథ. పక్కా విలన్‌గా కనిపించే రూపం వున్నా ఎందుకనో పరిశ్రమ ఆయన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. తెలుగులో ద్వితీయ శ్రేణి సినిమాల్లోనే ఎక్కువగా ప్రధాన విలన్ పాత్రలు వేసిన ఆయన 'నిన్నే పెళ్లాడుతా' నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు.
ప్రస్తుతం విలన్ వేషాల్లో పేరు తెచ్చుకుంటున్న వాళ్లంతా హీరో వేషాలు వేయడానికే ఆసక్తి చూపిస్తూ రావడం గమనార్హం. హీరోగా పరిచయమై, మళ్లీ అవకాశాలు లేకపోవడంతో 'జయం'తో విలన్‌గా మారిన గోపీచంద్ ఆ పాత్రలకి అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. 'వర్షం', 'నిజం' సినిమాలు ఆ కోవలేనివే. తెలుగు సినిమాకి మంచి తెలుగు విలన్ లభించాడని అందరూ ఆనందిస్తున్న కాలంలోనే అనూహ్యంగా 'యజ్ఞం'తో హీరో అయిపోయాడు గోపీచంద్. ఇప్పుడు ఆ పాత్రల్లో తనకంటూ సొంత ఇమేజ్ కూడా సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కుర్ర విలన్లు అజయ్, సుబ్బరాజు కూడా హీరో పాత్రల కోసం ట్రై చేస్తున్నారు. అజయ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించేశాడు కూడా. సుబ్బరాజు కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.
మనం ఇక్కడ ఇంకో ఇద్దరు నటుల గురించి కూడా చెప్పుకోవాలి. విలన్లుగా పేరు తెచ్చుకుని, తర్వాత హీరోలుగా కూడా రూపాంతరం చెంది, అట్లా కూడా పేరు తెచ్చుకున్న ఆ నటులు - మోహన్‌బాబు, శ్రీహరి. కొత్తరకం డైలాగ్ మాడ్యులేషన్‌తో మోహన్‌బాబు, యాక్షన్ విలన్‌గా శ్రీహరి బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ మరింతకాలం విలన్లుగా వాళ్లు నటించి వుంటే వాళ్ల సేవలు అటు పరిశ్రమకీ, ఇటు ప్రేక్షకులకీ దక్కేవి. సో, ఇద్దరు మంచి విలన్లని అట్లా మిస్సయ్యాం. పోతే ఇప్పుడు మన పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు తమ చిత్రాల్లో విలన్లుగా మన నటుల్ని కాక ఇతర భాషల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల కూడా మన 'విలన్' నటులకి మంచి అవకాశాలు దక్కడం లేదు. ముఖేష్‌రుషి, మోహన్‌రాజ్, ఆనంద్‌రాజ్, సాయికుమార్ (మలయాళీ), సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్‌దేవ్, ముకుల్‌దేవ్, దండపాణి వంటి పరభాషా విలన్లనే మన అగ్రహీరోలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్ద హీరోలు మన వాళ్లలోని టాలెంటుని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఒత్తిడికి లోంగిపోకూడదు. అలా జరిగితే మరికొందరు మంచి తెలుగు 'విలన్లు' తయారవుతారు. వాళ్లలో కొందరైనా చరిత్రలో స్థానం పొందగలిగే అవకాశం వుంటుంది. (అయిపోయింది)

Monday, December 20, 2010

సినిమా: మన 'విలన్'పై చిన్న చూపెందుకు?

సాధారణంగా మన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మూడుంటాయి. హీరో, హీరోయినూ, విలనూ. హీరో హీరోయిన్లుగా అందమైన వాళ్లనే ఎంచుకుంటారు. కానీ విలన్‌కి మాత్రం ఎంత క్రూరంగా కనిపించే ముఖమైతే అంత నప్పుతుందని అట్లాంటి వాళ్లని గాలించి మరీ మన సినిమావాళ్లు విలన్లని చేస్తుంటారు. మన సినిమా విలన్లకు లేని దుర్గుణాలు కానీ, వాళ్లు చెయ్యని ఘోరాలు కానీ వుండవు. తెరమీద కనిపించడమే తాము చాలా దుర్మార్గులమని గట్టిగా చెప్పుకుంటారు. వాళ్లెంతటి దుర్మార్గంగా వుంటారంటే తేడా వస్తే తమ మనిషిని కూడా అతి సులువుగా చంపేస్తూ వుంటారు. కొంతమంది విలన్లు సూటూ బూటూ వేసుకుని పైకి బాగా మంచివాళ్లుగానే కనిపించినా వాళ్లు చేసేవన్నీ దుర్మార్గపు పనులే. కొంతమందయితే నల్ల కల్లజోళ్లు పెట్టుకునో, ఒక కన్ను లేకుండానో, చెంపమీద పెద్ద గాటుతోనో, ఒక చెయ్యి లేదా ఒక కాలు లేనివాళ్లుగానో కనిపించి అసలు సిసలు విలన్లు తామే అనిపిస్తుంటారు. ఈ ప్రతినాయకుల ముఖ్య కర్తవ్యం హీరో హీరోయిన్లని తిప్పలు పెట్టడం, వాళ్లు కలుసుకోకుండా చూస్తూ రీళ్లని పెంచడం. ఈ పనికోసం సినిమా ఆరంభం నుంచి ఆఖరుదాకా హీరోయిన్ వంక కోరచూపులు చూస్తూవుంటారు. ఈ విలన్లకు గుర్రపుస్వారీ, ఫైట్లు అన్నీ బాగావచ్చు. హీరోకంటే కూడా వాటిలో అతడికి ఎక్కువ సామర్థ్యం వుంటుంది. కండబలంతో పాటు తెలివితేటలూ ఎక్కువే. అయితే రచయితా, దర్శకుడూ, కథా - వీళ్లంతా కుట్రతో విలన్నే ఎప్పుడూ ఓడిస్తూ వుంటారు. సినిమా ఆఖర్న విసిగిపోయిన విలన్ చావనైనా చస్తాడు లేదంటే పోలీసులతో సంకెళ్లయినా వేయించుకుంటాడు. లేదంటే బుద్ధి వచ్చిందని లెంపలేసుకుంటాడు. మొత్తానికి ఈ విలనే లేకపోతే హీరోగారి హీరోయిజం బయటపడదు కాబట్టి నూటికి తొంభై అయిదు సినిమాలకి ఈ విలనే ఆధారం.
ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే ఇంతటి ప్రాధాన్యత వున్న విలన్ పాత్రధారుల్ని ఇవాళ మన సినిమావాళ్లు చిన్నచూపు చూస్తున్నారని. అలనాటి గోవిందరాజుల సుబ్బారావు నుంచి ఇప్పటి జయప్రకాశ్‌రెడ్డి దాకా విలనిజాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నా వాళ్లకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పటివాళ్లు చాలా మెరుగు. గోవిందరాజుల సుబ్బారావు, సీఎస్సార్ ఆంజనేయులు, ధూళిపాళ, ఎస్వీ రంగారావు, ముక్కామల, రాజనాల, జగ్గయ్య, ఆర్. నాగేశ్వరరావు, నాగభూషణం, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి విలన్ పాత్రధారులకి పేరు ప్రతిష్ఠలూ, గౌరవమూ దక్కాయి. శకుని పాత్ర పోషణలో సీఎస్సార్, ధూళిపాళ; విశ్వామిత్ర పాత్రలో ముక్కామల; రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రల్లో ఎస్వీ రంగారావు; దుష్ట మాంత్రికుడి పాత్రలో ఎస్వీ రంగారావు, రాజనాల; దుష్ట సైన్యాధిపతి పాత్రలో రాజనాల; 'అల్లూరి సీతారామరాజు'లో బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్ పాత్రలో జగ్గయ్య పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎస్వీ రంగారావు కేవలం దుష్ట పాత్రల్లోనే కాకుండా సాత్త్విక పాత్రల్లోనూ గొప్పగా రాణించి మహానటుడు అనిపించుకున్నారు.
ఆయన తర్వాత అట్లాంటి ఖ్యాతి కైకాల సత్యనారాయణకీ, కోట శ్రీనివాసరావుకీ దక్కింది. హీరోగా వచ్చి విలన్‌గా నిలదొక్కుకొని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందిన సత్యనారాయణని అందుకే అందరూ 'నవరస నటనాసార్వభౌమ' అనేది. కేవలం డైలాగ్ మాడ్యులేషన్‌తోటే విలన్లుగా గొప్పగా రాణించినవాళ్లు నాగభూషణం, రావు గోపాలరావు. సీరియస్ విలనిజంలో హాస్యాన్ని జోడించి మాటని విరిచి మాట్లాడే నాగభూషణాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. డైలాగుల్లో గోదావరి యాసని జోడించి కొన్ని మాటల్ని వత్తి పలుకుతూ విలన్‌గా రావు గోపాలరావు కొత్త రూపంతో కనిపించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. 'ముత్యాల ముగ్గు', 'యమగోల' చిత్రాల్లో ఆయన డైలాగుల్ని ఇప్పటికీ చాలామంది తెలుగువాళ్లు మరచిపోలేదు. 'అహ నా పెళ్లంట'లో పిసినారి విలన్‌గా, 'గాయం'లో గుండు విలన్‌గా కోట శ్రీనివాసరావు నటనకి శభాష్ అన్నారు ప్రేక్షకులు. ఒక్క విలన్‌గానే కాక హాస్య పాత్రల్లోనూ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తను తక్కువవాణ్ణి కానని కోట నిరూపించుకున్నారు. (ఇంకావుంది)

Saturday, December 18, 2010

ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా - 3

ఎన్‌టీఆర్ వారసునిగా అంతకుముందే బాలకృష్ణ హీరోగా ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున; కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్ రాగా అగ్ర నిర్మాతలైన రామానాయుడు, వీబీ రాజేంద్రప్రసాద్ కుమారులు వెంకటేశ్, జగపతిబాబు హీరోలుగా ప్రవేశించారు.
తెలుగు చిత్రరంగంలో తన పేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్‌టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆఖరుకి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో తొలి 70ఎం.ఎం. సినిమా 'సింహాసనం' ఈ దశాబ్దంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్తరక్తం మొదలైంది. ఎంతోమంది కొత్త దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించుకోవడంతో పాతతరం దర్శకులు చాలామంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్‌వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్లలో గత రికార్డులనన్నిట్నీ తిరగరాయడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఐతే ఆ సినిమా యువతపై చెడు ప్రభావాన్ని కలిగించడం విచారించాల్సిన అంశం. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక సన్నివేశాలున్న సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యత ఎక్కువైంది. సాంకేతికపరమైన అంశాలపట్ల శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు- అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడు ఆ స్థితి మచ్చుకి కూడా కనిపించదు. 80వ దశకం నుంచే హీరోనుబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ ఆ స్థితి కొనసాగుతూ వస్తోంది. గతంలో సినిమా ఫెయిలైతే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటులమీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామని చెప్పక తప్పదు. మన పొరుగునే ఉన్న మలయాళ చిత్రాలు దేశంలోనే అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమళంలోనూ అప్పుడప్పుడైనా అలాంటి చిత్రాలు వస్తున్నాయి. తెలుగు రంగమే దుస్థితిలో వున్నట్లు కనిపిస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా హిట్టయ్యిందంటే అదే మూసలో పది, ఇరవై సినిమాలు వచ్చేస్తాయి. ఒక కాలేజీ నేపథ్యం సినిమా హిట్టయితే ఆ తరహా కథతో ఎన్నొచ్చాయో లెక్కేలేదు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నమే తప్పితే అందులో సినిమాలు తీసేవారికి చిత్తశుద్ధి వుందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న సినిమాల్లో మనవతా విలువలు కనిపించడం అరుదైపోయింది. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా వుండటం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలకు మల్లే పురుషాధిక్యత మరీ ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ నాసిరకంగా తయారైంది. వాంప్ పాత్రల అవసరం లేకుండా హీరోయిన్లతోనే దర్శకులు వాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థంకాని స్థితి. అట్లాంటి దృశ్యాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! వీటినే ఆశీర్వచనాలుగా భావించుకుంటున్న నిర్మాతలు అట్లాంటి సినిమాల నిర్మాణానికే ఆసక్తి చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్నిస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చూపిస్తున్నారు. 'ప్రతీకారమే పరమసోపానం' అని చెప్పే రక్తపాత కథలతో సినిమాలు తీస్తున్నారు. కాలేజీ ఆడపిల్లల్ని ఎంతగా టీజ్ చేస్తూ ఆనందించవచ్చో, భర్త ఎంత హింసించినా భార్య ఎలా అణకువగా ఉండాలో చెప్పే సినిమాలు వస్తున్నాయి. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం వుంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోయిందనడమూ పాక్షికత్వమే అవుతుంది. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవికాంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలుగు చిత్రరంగాన్ని మార్చేస్తోంది. ఈ కాలంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాక ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి వుంది. అప్పుడే విమర్శకి నిలిచే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది. (అయిపోయింది)

Friday, December 10, 2010

ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా-2

అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథాచిత్రాలే రాజ్యం చేస్తూ వుంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే తొలి జేంస్‌బాండ్ తరహా చిత్రం. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి రూపుదిద్దుకోవడం మరో విశేషం. ఆ తర్వాత ప్రేమ కథాచిత్రాలు, యాక్షన్ సినిమాలు సమానంగా ఆదరణ పొందుతూ వచ్చాయి. 70వ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమాల ప్రభావం తెలుగు సీమకి కూడా సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు నిర్మించడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువులకింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' వంటి అభ్యుదయ చిత్రాలు కొన్ని వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్ర, హీరోగా నటించింది కృష్ణ. 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్‌పై కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' సినిమా నిర్మించి ఆ పాత్రలో తానే నటించాడు. తెలుగులో ఇది తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చెప్పుకోదగ్గ ఘన విజయాన్నే సాధించింది. ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఎన్‌టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి త్రిపాత్రల్లో (కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దానవీరశూర కర్ణ' కలెక్షన్ల వర్షం కురిపించింది. భారతంలో దుష్టపాత్రగా చిత్రీకరణకు గురైన దుర్యోధనుణ్ణి కొత్త కోణంలో ఆవిష్కరించి ఆ పాత్రకి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌దే.
80వ దశకంలో తెలుగు సినిమా పూర్తిగా కమర్షియల్ మయమైపోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ, హీరోలూ. బూతు సంభాషణలూ, శృంగార సన్నివేశాలూ వున్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సులు సాధారణమయ్యాయి. 70వ దశకం ఆఖర్లో నటుడిగా రంగప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకొంటున్న సమయంలో 'ఖైదీ' అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ చిత్రాల్లొ 'ఖైదీ' సరికొత్త ట్రెండుని నెలకొల్పింది. తెలుగులో హీరోల డాన్సులకి అక్కినేని ఆద్యులైనప్పటికీ వాటికి ఎక్కువ ప్రాచుర్యం కలిపించింది చిరంజీవే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తున్నా, మరోవైపు కళాత్మక విలువలున్న చిత్రాలు కొద్ది సంఖ్యలో అయినా వచ్చాయి. కె. విశ్వనాథ్ సృష్టి 'శంకరాభరణం' తెలుగు సినిమాకే గర్వకారణమైన చిత్రంగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ చిత్రం దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొంది. అక్కినేనితో దాసరి నారాయణరావు రూపొందించిన 'మేఘసందేశం' కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే మాదాల రంగారావు నటించిన 'యువతరం కదిలింది', 'ఎర్ర మల్లెలు', 'విప్లవ శంఖం' వంటి విప్లవాత్మక చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'వందేమాతరం', 'నేటి భారతం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' వంటి సినిమాలు రూపొందించాడు.  (ఇంకావుంది)

Thursday, December 9, 2010

ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా

ఈ శతాబ్ద కాలంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మీడియాగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ అరవై ఏళ్ల పైచిలుకు కాలపు తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలించి చూస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికివచ్చేది నిర్మాణమవుతోన్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతియేటా తెలుగులో సినిమాలు నిర్మాణవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అతి స్వల్పం. ఐతే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బీఎన్ రెడ్డి, నిర్మాతల్లో బి. నాగిరెడ్డి, డి. రామానాయుడు, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, ఎన్‌టీ రామారావు వంటి నటులు; రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లు, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి గొప్ప నటీమణులూ; గూడవల్లి రామబ్రహ్మం, కేవీ రెడ్డి, పి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకులు మనకి లభించారు.
మొదట్లో- అంటే 60వ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు చాలా తక్కువ. అయితే 'దేవదాసు', 'మాయాబజార్', మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ సినిమాలు అప్పుడు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా నిలిచారు. తారల్లో భానుమతి, సావిత్రి అగ్రస్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు భానుమతి. 1954 వరకు వచ్చిన చిత్రాల్లో ఏ ఒక్కటీ వంద రోజులదాకా ఆడలేదు. 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన 'రోజులు మారాయి' చిత్రం తొలిసారిగా వంద రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. ఇది సామాజిక దృష్టితో తీసిన చిత్రం కావడం విశేషమే. స్వాతంత్ర్యానికి ముందు కమర్షియల్ దృష్టితో తీసిన సినిమాలు కనిపించవు. ఆ తర్వాతే 1950లో విజయా సంస్థ తీసిన 'షావుకారు' చిత్రంతో ఈ వాణిజ్య పోకడలు కనిపిస్తాయి. ఈ చిత్రంతోనే జానకి నటిగా తెరంగేట్రం చేశారు. 1964లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అంజలీదేవి, ఎన్‌టీ రామారావు సీతారాములుగా నటించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా అనేక కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ యేడాదే ఓ తెలుగు నటుడికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆ నటుడు ఎస్వీ రంగారావు. జకార్తాలో ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించిన 'నర్తనశాల'లో కీచకుడి పాత్రకి గాను ఆ పురస్కారం లభించింది.
తొలి సాంఘిక రంగుల చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. హీరో కృష్ణ పరిచయమయ్యింది ఈ సినిమాతోనే. (ఇంకావుంది)

Wednesday, December 8, 2010

సినిమా: 'అప్పల్రాజు'లో వర్మ రాసిన బూతుపాట

సాకీ:
నీయమ్మ
ఆ కళ్లేంటే..
ఆ ముక్కేంటే..
ఆ కాళ్లేంటే..
ఆ నడుమేంటే..
ఏంటే.. ఏంటే..

పల్లవి:
అతడు: ఏవెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను   ||ఏవెట్టి||

అవి పెదాలా రసగుల్లాలా.. అది నడుమా ఐసు క్రీమా
నీ ఒంట్లో అణువు అణువు నా ఒంట్లో అణుబాంబై
నీ ఒంట్లో అణువు అణువు నా ఒంట్లో అణుబాంబై
పేల్చేస్తుందే నీ అందం నన్ను
కాల్చేస్తుందే ఈ హాటు సన్ను   ||పేల్చేస్తుందే||

ఆమె:  నీయబ్బ..
ఏవెట్టి పెంచార్రా అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను  ||ఏవెట్టి||

అవి కండలా.. రాతి బండలా
అది నడకా.. సూపర్ స్టైలా

నీ కంటి ఆ చూపే నా ఒంటికి యమషాకై   ||నీ కంటి||
ఉడికిస్తుంద్రా నా బాడీ పార్ట్లు
అనిపిస్తుంద్రా ఒళ్లంతా స్వీట్లు   ||ఉడికిస్తుంద్రా||

చరణం 1:
అతడు: జెన్నిఫర్ మడొన్నాని మిక్సింగ్ చేసి వాడు
నిన్నిట్టా భూలోకానికి చేసాడేమె లోడు

ఆమె: షారుఖ్‌కి హృతిక్‌కి షేకిచ్చేసి వీడు
వండర్‌గా నాకె ఏదో టెండర్ పెట్టేసాడు

అతడు: వై2కె వైరస్‌లాగ వ్యాపించావె ఒళ్లంతా

ఆమె: పిచ్చిట్టా పట్టేలాగ ఏదో చేసేసావిట్టా

అతడు: ఐ డోంట్ నో వాట్ టు డు బేబీ..  ||ఏవెట్టి||

చరణం 2:
ఆమె: మహేషుబాబుని కూడా ఛీఛీ పో అన్నాను
నీ హైటు స్మార్టు చూసి నీ వల్లో పడ్డాను

అతడు: ఐపీఎల్ ఛీర్ గర్ల్‌లా వుంటుందే నీ మేను
ఒంపుల్తో క్రికెట్ ఆడేస్తున్నావే నన్ను

ఆమె: మేగ్నెట్‌లా నిన్నంటి వుంటారా రోజంతా

అతడు: చిక్‌లెట్‌లా నమిలేస్తా నీ బుగ్గల్ని రాత్రంతా

ఆమె: నౌ యు నో వాట్ టు డు బేబీ

అతడు: ||ఏవెట్టి||

ఆమె: ||ఏవెట్టి||

అతడు: అవి పెదాలా రసగుల్లాలా.. అది నడుమా ఐసు క్రీమా

ఆమె: ఉడికిస్తుంద్రా నా బాడీ పార్ట్లు
అనిపిస్తుంద్రా ఒళ్లంతా స్వీట్లు

- ఎవరు రాసిందీ పాట.. ఏంటీ పాట.. ఈ పాటలో ఆ భాషేంటి.. అనుకుంటున్నారా? అదేమరి. ఈ పాట రాసింది స్వయానా రాంగోపాల్‌వర్మ. తను డైరెక్ట్ చేస్తోన్న 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం-అప్పల్రాజు' సినిమా కోసం ఈ పాటని వర్మ రాశాడు. ఈరోజు ఈ పాటని మార్కెట్లో విడుదల కూడా చేశారు. ఈ పాటని తనే ఎందుకు రాశాడో కూడా వర్మ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపాడు. ఏ సందర్భంగా ఆ పాట వస్తుందో కూడా చెప్పాడు.
"ఈ పాటని ఇంకో గీత రచయిత తోటి రాయించకుండా నేనే రాయడానికి నా కారణం.. నా దృష్టిలో స్త్రీ అందాన్ని నా కన్నా తాదాత్మ్యంగా ఇంకెవ్వరూ చూడరు.. చూడలేరు. ఆ మహోన్నత అందమే ఒక కఠోరమైన రాయిలాంటి నన్ను కూడా ఒక కవిలా మార్చేసింది. ఆ అందాల విందుకు నేను దాసుడినై, ఆ అభినవ దేవతకు ఒక బానిసనై.. స్త్రీని భగవంతుడు సృష్టించిన అత్యంత మహా సృష్టిగా భావించి, ప్రేమించి, గౌరవించి, ఆరాధించి రాసిన పాటే ఈ 'ఏమెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను?'. ఈ నా పాట స్త్రీలందరికీ అంకితం" - ఇదీ ఈ పాట రాయడానికి వర్మ చెప్పిన కారణం.

సినిమా: రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ'ప్రారంభం

నాని, సమంత, సుదీప్ కాంబినేషన్‌తో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'ఈగ' షూటింగ్ మంగళవారం (డిసెంబర్ 7) లాంఛనంగా ప్రారంభమైంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత డి. రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వి.వి. వినాయక్ క్లాప్‌నిచ్చారు. దీనికి సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు వెంకటేశ్, ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ 'యాక్షన్' చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ "విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు. మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి. చాలా చాలా ప్రయోగాత్మక చిత్రం. చాలా కష్టమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్న చిత్రం. చిన్న సైజులో కనిపించే ఈగనీ, పెద్దగా కనిపించే మనుషుల్నీ అనుసంధానం చేయడానికి జేమ్స్ ఫౌల్డ్స్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాం. హిందీలో 'లమ్హే' చిత్రానికి ఆయన ఫెంటాస్టిక్ ఫ్రేమింగ్ వర్క్ చేశారు. రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని తీస్తున్నాం'' అని చెప్పారు.
సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకులకి కొత్త తరహా అనుభవాన్నిస్తుంది. రాజమౌళి చెప్పిన కథ చాలా సంతృప్తినిచ్చింది. చాలా మ్యాజిక్ ఉండే సినిమా. అయినా సేఫ్ ఫిల్మ్. అన్ని రకాల భావోద్వేగాలూ ఉంటాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది'' అన్నారు.
విలన్ పాత్రధారి సుదీప్ మాట్లాడుతూ "ఈ సినిమాలో భాగమవుతున్నందుకు సంతోషం. అద్భుతమైన విజన్ ఉన్న రాజమౌళి లాంటివాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. తెలుగులో 'రక్తచరిత్ర' తర్వాత చేస్తున్న సినిమా ఇది. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి స్క్రిప్టు వినలేదు. ఇది వచ్చాక తెలుగు సినిమా చాలా మారిపోతుంది'' అని తెలిపారు.
ఈ సినిమాలో తనది చిన్న పాత్రే కానీ రాజమౌళి తనకి పెద్ద బాధ్యత అప్పగించారని హీరో నాని చెప్పగా, రాజమౌళి డైరెక్షన్‌లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ సమంత తెలిపారు. సమావేశంలో నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ జేమ్స్ ఫౌల్డ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అడిల్ మాట్లాడారు.
ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్. రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

Sunday, December 5, 2010

సినిమా: కనకదుర్గ పూజా మహిమ (1960)

తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ
రచన: జి. కృష్ణమూర్తి
సంగీతం: రాజన్-నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్
కథ: మణిశిలాదేశపు మహారాణి ఎంతో కాలానికి గర్భం ధరించిందన్న సంతోషంలో మహారాజు కులదేవతైన కనకదుర్గ పూజకు వెళ్లక ఆ తల్లిని చులకన చేస్తాడు. దాంతో నిండు చూలాలైన మహారాణి అడవుల పాలయ్యింది. రాజ్యభారం బావమరిది సేనాధిపతి నరేంద్రునికి అప్పగించి మహారాణికి వెదకడానికి బయలుదేరి దారీతెన్నూ తోచక అల్లాడుతుంటాడు రాజు. అరణ్యాలలో కుమారుణ్ణి కన్న రాణి ఒక ముని కోపానికి గురై ఆయన శాపంవల్ల భల్లూకమై పోతుంది. ఆ దారిని కనకదుర్గ పూజ చేసుకుని వస్తున్న ఒక పుణ్యదంపతులకు ఆ బిడ్డ దొరకగా మాధవుడని పేరుపెట్టి అల్లారుముద్దుగా తమ కుమారుడైన త్రిలోకంతో పెంచుకొస్తారు. రాజులేని రాజ్యానికి నరేంద్రుడు రాజైపోతాడు. అతనికి మాలతి ఒక్కతే సంతానం. రోజురోజుకి దేశంలో మారుమోగిపోతున్న మాధవుని వీరత్వం ఆమె వింటుంది. ఒకనాడు తన ప్రాణాలు మాధవుడు కాపాడగా అతనికి హృదయం అర్పిస్తుంది.
సిద్ధేంద్రుడనే కపాలకుని వద్ద శిష్యరికం చేసి సకల విద్యలూ సంపాదించిన మేఘనాథుడనే వీరుడు మాయావతి అనే మునికన్యను బలవంతం చేస్తాడు. గురువు మందలిస్తే ఆ శిష్యుడు గురువునే మంత్రబద్ధునిగా చేస్తాడు. ఆ గురుద్రోహికి తగిన శిక్ష విధించాలని సిద్ధేంద్రుడు సర్వసిద్ధికి మార్గం చెబుతాడు. దానికి ఒక అదృష్టజాతకుడైన మహారాజు అవసరం పడుతుంది. మేఘనాథుని దృష్టికి నరేంద్రుడు గోచరిస్తాడు. భార్యావిహీనుడైన ఆ మహారాజును మాయావతి మూలంగా వశం చేసుకోవచ్చని ఆలోచించి మాయావతిని మంత్రబద్ధం చేసి మారురూపంతో మేఘనాథుడు మణిశిలాదేశం ప్రవేశిస్తాడు.
మేఘనాథుని ప్రగల్భాలు విని మాధవుడు అతనిని ఓడించాలని ప్రయత్నించి మంత్రశక్తివల్ల ఓడిపోతాడు. మహారాజు మేఘనాథునికి పాదపూజ చేయ నిశ్చయించుకుంటాడు. కాని మాధవుడు మందలిస్తూ మేఘనాథుని ఓడించడానికి ఒక సంవత్సరం గడువు తీసుకుంటాడు. రాకుమారి అతని పట్టుదలకు ఆనందిస్తుంది. కృతజ్ఞతగా అతనిని ఆనాడే గాంధర్వ వివాహం చేసుకుంటుంది.
ఈలోగా సేనాని మార్తాండవర్మ రాజ్య ప్రలోభంతో మేఘనాథుడు పన్నిన వలలోపడి మహారాజును హత్యచేయ యత్నిస్తాడు. యత్నం విఫలంకాగానే నేర్పుగా నేరం నిర్దోషియైన మాధవుని మీదికి తోస్తాడు. మాధవునికి మహారాజు ఉరిశిక్ష విధిస్తాడు. మాధవుడు తన తమ్ముని సహాయంతో వధ్యస్థానం నుంచి తప్పించుకుని పారిపోతాడు.
మేఘనాథుని ఆటకట్టే అధినాధుడే లేకపోతాడు. ప్రతి పౌర్ణమినాడు మాయను నాగుగా మార్చి తన బాటకు అడ్డుగావున్న వారిని తొలగిస్తుంటాడు. ప్రతి పర్ణమినాడు ఒక్కొక్కరు సర్పద్రష్టలై చనిపోతుంటారు.
పారిపోయిన మాధవుడు తన తమ్మునితో నానా అగచాట్లు పడతాడు. మోహిని చేతిలో చిక్కి తన తమ్ముని వల్ల ప్రమాదం నుంచి బయటపడతాడు. చివరకు సిద్ధేంద్రుడున్న గుహకు చేరుకుంటాడు.
మేఘనాథుడు అమాత్యుని, సేనానిని పాముకాట్లతో చంపిస్తాడు. రాకుమారి గర్భిణీ అని గ్రహించి ఆమె అంతఃపురంలో వుంటే దేశానికే అరిష్టమని రాజుతో చెబుతాడు. రాజు అతని సలహా ప్రకారం కుమార్తెను జలపాతంలో తోయిస్తాడు. నదిలో కొట్టుకుపోతున్న ఆ చూలాలిని ఒక భల్లూకం రక్షిస్తుంది.
మాధవుడు త్రిలోకంతో ఎన్నో అవాంతరాలు గడచి భూతాల్ని పిశాచాల్ని జయించి సిద్ధేంద్రుని కనిపెడతాడు. మంత్రబద్ధుడైన అతన్ని విడుదలచేసి అతని వద్దనున్న అన్ని విద్యలూ అభ్యసిస్తాడు. కానీ అతనికి సర్వసిద్ధి లభించదు. కనకదుర్గ కనికరం లేనందున సిద్ధి లభించలేదని గురువు చెప్పగా మాధవుడు నిరాశ చెందుతాడు.