Thursday, December 9, 2010

ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా

ఈ శతాబ్ద కాలంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మీడియాగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ అరవై ఏళ్ల పైచిలుకు కాలపు తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలించి చూస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికివచ్చేది నిర్మాణమవుతోన్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతియేటా తెలుగులో సినిమాలు నిర్మాణవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అతి స్వల్పం. ఐతే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బీఎన్ రెడ్డి, నిర్మాతల్లో బి. నాగిరెడ్డి, డి. రామానాయుడు, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, ఎన్‌టీ రామారావు వంటి నటులు; రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లు, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి గొప్ప నటీమణులూ; గూడవల్లి రామబ్రహ్మం, కేవీ రెడ్డి, పి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకులు మనకి లభించారు.
మొదట్లో- అంటే 60వ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు చాలా తక్కువ. అయితే 'దేవదాసు', 'మాయాబజార్', మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ సినిమాలు అప్పుడు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా నిలిచారు. తారల్లో భానుమతి, సావిత్రి అగ్రస్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు భానుమతి. 1954 వరకు వచ్చిన చిత్రాల్లో ఏ ఒక్కటీ వంద రోజులదాకా ఆడలేదు. 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన 'రోజులు మారాయి' చిత్రం తొలిసారిగా వంద రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. ఇది సామాజిక దృష్టితో తీసిన చిత్రం కావడం విశేషమే. స్వాతంత్ర్యానికి ముందు కమర్షియల్ దృష్టితో తీసిన సినిమాలు కనిపించవు. ఆ తర్వాతే 1950లో విజయా సంస్థ తీసిన 'షావుకారు' చిత్రంతో ఈ వాణిజ్య పోకడలు కనిపిస్తాయి. ఈ చిత్రంతోనే జానకి నటిగా తెరంగేట్రం చేశారు. 1964లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అంజలీదేవి, ఎన్‌టీ రామారావు సీతారాములుగా నటించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా అనేక కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ యేడాదే ఓ తెలుగు నటుడికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆ నటుడు ఎస్వీ రంగారావు. జకార్తాలో ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించిన 'నర్తనశాల'లో కీచకుడి పాత్రకి గాను ఆ పురస్కారం లభించింది.
తొలి సాంఘిక రంగుల చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. హీరో కృష్ణ పరిచయమయ్యింది ఈ సినిమాతోనే. (ఇంకావుంది)

No comments: