Thursday, December 30, 2010

సినిమా సక్సెస్‌కి ఫార్ములా వుందా?

'నువ్వు నేను' సినిమాని ఎంత బాగా తీశాడురా డైరెక్టరు - చాలాచోట్ల ఈ మాటే వినిపిస్తోంది. అందులో కాస్తయినా అసత్యం లేదు. తేజ ఆ చిత్రాన్ని చక్కగా తీసి, పరిశ్రమని చిక్కుల్లోకి నెట్టాడు. సినిమా హిట్టవ్వాలంటే ఫార్ములా ఏంటి? ఈ ప్రశ్నకి ఎవరికి తోచినట్లు వాళ్లు సమాధానం చెబుతారు. ఒకరు చెప్పిన దానికీ, మరొకరు చెప్పిన దానికీ పోలికలో భేదం లేకుండా వుండదు. 'స్టార్స్ లేకుండా సినిమా తీసి చేతులు కాల్చుకోలేను' అంటాడో నిర్మాత. అంటే ఏమిటర్థం - సినిమా ఆడాలంటే స్టార్లు (పెద్ద హీరోలు) కావాలని. కానీ స్టార్లు లేకుండానే ఈ మధ్య ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. తేజ తీసిన మూడు సినిమాల్లో రెండు హిట్టయ్యాయి. ఆ రెండింటిలోనూ హీరో ఉదయ్‌కిరణ్ అయితే హీరోయిన్లు కొత్తవాళ్లు. వాళ్లెవరికీ స్టార్ వాల్యూ లేదు. అయినా అటు 'చిత్రం', ఇటు 'నువ్వు నేను' విజయం సాధించడంలో 'స్టార్ వాల్యూ' ఏమాత్రం అడ్డు కాలేదు. తేజే తీసిన 'ఫ్యామిలీ సర్కస్'లో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వున్నా అది ఫెయిలయ్యింది. 'నువ్వే కావాలి' చేసేప్పుడు తరుణ్, రిచాలకి స్టార్ వాల్యూ లేదు. అదెంత ఘనవిజయం సాధించిందో మనకు తెలుసు. 'నువ్వే కావాలి' దర్శకుడు విజయభాస్కర్ దానికంటే ముందు తీసిన 'స్వయంవరం' కూడా చక్కని విజయం సాధించింది. అందులో హీరో వేణు. అంతదాకా అతడి గురించి ఎవరికీ తెలీదు. ఆ వేణుదే 'చిరునవ్వుతో' కూడా హిట్టయ్యింది.
2001లోనే చూస్తే - మృగరాజు, దేవీపుత్రుడు, ప్రేమతో రా, ఎదురులేని మనిషి, బావనచ్చాడు, భలేవాడివి బాసూ, బడ్జెట్ పద్మనాభం, ఫ్యామిలీ సర్కస్, శుభకార్యం, రైల్వే కూలీ, సూరి, మనసిస్తారా - వంటి స్టార్ వాల్యూ వున్న సినిమాలు అటు బయ్యర్లనీ, ఇటు ప్రేక్షకుల్నీ ఏడిపించాయి. కానీ 'ప్రియమైన నీకు', '6టీన్స్', 'సంపంగి' వంటి స్టార్ వాల్యూలేని సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా 'నువ్వు నేను' ఘనవిజయం దిశగా పయనిస్తోంది. కాబట్టి చిత్ర విజయానికీ, స్టార్ వాల్యూకీ సంబంధంలేదని స్పష్టమవుతోంది. మరైతే చిత్ర విజయానికి సంబంధం దేనితో? చిత్రాన్ని బాగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది మామాలుగా అందరూ అనే మాటే. బాగా తీయడానికి ఫార్ములా ఏదన్నా వుందా? లేదు. కొంతమంది 'సామాజికాంశంతో సినిమాలు తీస్తే జనరంజకం కావు' అంటారు. అందులో వాస్తవం లేదు. దివంగత దర్శకుడు టి. కృష్ణని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే.. ఆయన తీసినవన్నీ సామాజిక ప్రయోజనం ఉన్న చిత్రాలే. 'ప్రతిఘటన', 'నేటి భారతం', 'దేశంలో దొంగలుపడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'రేపటి పౌరులు' వంటివన్నీ విజయం సాధించినవే. వాటిలో ఒక్కో సినిమా ఒక్కో సమస్యని ఎలివేట్ చేస్తుంది. అయినా ప్రేక్షకులు వాటిని ఆదరించారు. అంటే సామాజికాంశంతో చిత్రాలు రూపొందించినా విజయం సాధించవచ్చని కృష్ణ నిరూపించారు. ఆర్. నారాయణమూర్తి కూడా నిరూపించారు. పెద్ద దర్శకులైనవాళ్లు కూడా అడపదడపా అట్లాంటి చిత్రాలు తీసి నిరూపించారు. 'ఈనాడు', 'గణేశ్', 'ఆజాద్' వంటి సామాజిక చైతన్య చిత్రాలు పెద్ద హీరోలున్నా విజయం సాధిస్తాయని రుజువు చేశాయి. 'భారతీయుడు', 'జెంటిల్మన్' వంటి డబ్బింగ్ సినిమాలూ దీన్ని బలపరిచాయి. అంటే సామాజిక చిత్రాలు తీసి విజయం సాధించవచ్చన్నది స్పష్టం. పైగా దానివల్ల ప్రజలకు మేలు చేసినవాళ్లూ అవుతారు.
మళ్లీ మొదటికి వద్దాం. 'నువ్వు నేను' విజయంతో ఇప్పుడు సినిమా విజయానికి ఫార్ములా దొరికిందని పరిశ్రమలో కొంతమంది లెక్కలు కడుతున్నారు. ప్రేమకథకి కాస్తంత మసాలా జోడించి విడిచిపెడితే అందులో యాక్టర్లు ఎవరన్నది పట్టించుకోకుండా జనం దాన్ని హిట్‌చేసి పారేస్తారన్నది ఆ ఫార్ములా రహస్యం. దాంతో ఇప్పటికే 'ప్రేమ' కాన్సెప్టుతో కొత్తవాళ్లతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల్లో 'మసాలా' శాతం ఎంత వుందో తూకం వేసుకుంటున్నారు. మసాలా ఎక్కువైనా ఫర్వాలేదు. కానీ తక్కువైతే మరికొంత జోడిద్దాం అని ఆలోచనలు చేస్తున్నారు. మసాలా తక్కువ కాబట్టే 'వేచి వుంటా', 'తొలివలపు', 'రేపల్లెలో రాధ', 'రావే నా చెలియా', 'స్పర్శ' వంటి చిత్రాలు ఫెయిలయ్యాయంటున్నారు. అయితే వాళ్లు ఇక్కడ ఓ సంగతి మరుస్తున్నారు. మసాలా ఎక్కువైనా ప్రేక్షకులు భరించలేరనేదే ఆ సంగతి. 'మనసిస్తా రా', 'ప్రేమతో రా', 'సూరి' వంటి సినిమాలు మసాలా మోతాదు మించినందునే ఫట్‌మన్నాయని గ్రహిస్తారా?
ఒకాయన యథాలాపంగా 'ప్రేమకథ తీసినా, సామాజిక చిత్రం తీసినా, యాక్షన్ సినిమా తీసినా, స్టార్ వాల్యూ వున్నా, లేకపోయినా చూడ్డానికి బాగుంటే, రంజింపజేసేట్టు వుంటే జనం తప్పకుండా ఆదరిస్తారు' అన్నాడు. అంటే మంచి సినిమా అనేది ఏ రూపంలో వున్నా జనం చూస్తారని. 'సరే ఇంతకీ జనరంజకంగా వుండాలంటే ఏ మసాలా ఎంత శాతంలో వుండాలి?' అని ఓ ఔత్సాహిక దర్శకుడు ఆలోచనలో పడిపోయాడు.
-ఆంధ్రభూమి, 24 ఆగస్టు 2001 

No comments: