Saturday, December 18, 2010

ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా - 3

ఎన్‌టీఆర్ వారసునిగా అంతకుముందే బాలకృష్ణ హీరోగా ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున; కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్ రాగా అగ్ర నిర్మాతలైన రామానాయుడు, వీబీ రాజేంద్రప్రసాద్ కుమారులు వెంకటేశ్, జగపతిబాబు హీరోలుగా ప్రవేశించారు.
తెలుగు చిత్రరంగంలో తన పేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్‌టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆఖరుకి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో తొలి 70ఎం.ఎం. సినిమా 'సింహాసనం' ఈ దశాబ్దంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్తరక్తం మొదలైంది. ఎంతోమంది కొత్త దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించుకోవడంతో పాతతరం దర్శకులు చాలామంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్‌వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్లలో గత రికార్డులనన్నిట్నీ తిరగరాయడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఐతే ఆ సినిమా యువతపై చెడు ప్రభావాన్ని కలిగించడం విచారించాల్సిన అంశం. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక సన్నివేశాలున్న సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యత ఎక్కువైంది. సాంకేతికపరమైన అంశాలపట్ల శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు- అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడు ఆ స్థితి మచ్చుకి కూడా కనిపించదు. 80వ దశకం నుంచే హీరోనుబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ ఆ స్థితి కొనసాగుతూ వస్తోంది. గతంలో సినిమా ఫెయిలైతే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటులమీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామని చెప్పక తప్పదు. మన పొరుగునే ఉన్న మలయాళ చిత్రాలు దేశంలోనే అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమళంలోనూ అప్పుడప్పుడైనా అలాంటి చిత్రాలు వస్తున్నాయి. తెలుగు రంగమే దుస్థితిలో వున్నట్లు కనిపిస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా హిట్టయ్యిందంటే అదే మూసలో పది, ఇరవై సినిమాలు వచ్చేస్తాయి. ఒక కాలేజీ నేపథ్యం సినిమా హిట్టయితే ఆ తరహా కథతో ఎన్నొచ్చాయో లెక్కేలేదు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నమే తప్పితే అందులో సినిమాలు తీసేవారికి చిత్తశుద్ధి వుందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న సినిమాల్లో మనవతా విలువలు కనిపించడం అరుదైపోయింది. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా వుండటం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలకు మల్లే పురుషాధిక్యత మరీ ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ నాసిరకంగా తయారైంది. వాంప్ పాత్రల అవసరం లేకుండా హీరోయిన్లతోనే దర్శకులు వాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థంకాని స్థితి. అట్లాంటి దృశ్యాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! వీటినే ఆశీర్వచనాలుగా భావించుకుంటున్న నిర్మాతలు అట్లాంటి సినిమాల నిర్మాణానికే ఆసక్తి చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్నిస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చూపిస్తున్నారు. 'ప్రతీకారమే పరమసోపానం' అని చెప్పే రక్తపాత కథలతో సినిమాలు తీస్తున్నారు. కాలేజీ ఆడపిల్లల్ని ఎంతగా టీజ్ చేస్తూ ఆనందించవచ్చో, భర్త ఎంత హింసించినా భార్య ఎలా అణకువగా ఉండాలో చెప్పే సినిమాలు వస్తున్నాయి. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం వుంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోయిందనడమూ పాక్షికత్వమే అవుతుంది. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవికాంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలుగు చిత్రరంగాన్ని మార్చేస్తోంది. ఈ కాలంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాక ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి వుంది. అప్పుడే విమర్శకి నిలిచే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది. (అయిపోయింది)

No comments: