Wednesday, December 8, 2010

సినిమా: రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ'ప్రారంభం

నాని, సమంత, సుదీప్ కాంబినేషన్‌తో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'ఈగ' షూటింగ్ మంగళవారం (డిసెంబర్ 7) లాంఛనంగా ప్రారంభమైంది. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత డి. రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వి.వి. వినాయక్ క్లాప్‌నిచ్చారు. దీనికి సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు వెంకటేశ్, ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ 'యాక్షన్' చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ "విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు. మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి. చాలా చాలా ప్రయోగాత్మక చిత్రం. చాలా కష్టమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్న చిత్రం. చిన్న సైజులో కనిపించే ఈగనీ, పెద్దగా కనిపించే మనుషుల్నీ అనుసంధానం చేయడానికి జేమ్స్ ఫౌల్డ్స్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాం. హిందీలో 'లమ్హే' చిత్రానికి ఆయన ఫెంటాస్టిక్ ఫ్రేమింగ్ వర్క్ చేశారు. రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని తీస్తున్నాం'' అని చెప్పారు.
సమర్పకుడు సురేశ్‌బాబు మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకులకి కొత్త తరహా అనుభవాన్నిస్తుంది. రాజమౌళి చెప్పిన కథ చాలా సంతృప్తినిచ్చింది. చాలా మ్యాజిక్ ఉండే సినిమా. అయినా సేఫ్ ఫిల్మ్. అన్ని రకాల భావోద్వేగాలూ ఉంటాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది'' అన్నారు.
విలన్ పాత్రధారి సుదీప్ మాట్లాడుతూ "ఈ సినిమాలో భాగమవుతున్నందుకు సంతోషం. అద్భుతమైన విజన్ ఉన్న రాజమౌళి లాంటివాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. తెలుగులో 'రక్తచరిత్ర' తర్వాత చేస్తున్న సినిమా ఇది. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి స్క్రిప్టు వినలేదు. ఇది వచ్చాక తెలుగు సినిమా చాలా మారిపోతుంది'' అని తెలిపారు.
ఈ సినిమాలో తనది చిన్న పాత్రే కానీ రాజమౌళి తనకి పెద్ద బాధ్యత అప్పగించారని హీరో నాని చెప్పగా, రాజమౌళి డైరెక్షన్‌లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ సమంత తెలిపారు. సమావేశంలో నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ జేమ్స్ ఫౌల్డ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అడిల్ మాట్లాడారు.
ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్. రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

No comments: