Tuesday, March 25, 2014

Classic novels rule the Hollywood

హాలీవుడ్: క్లాసిక్స్‌కి భలే మంచి కాలం
హాలీవుడ్‌లో క్లాసిక్స్‌కి ఆదరణ పెరిగిందా? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జేన్ ఆస్టిన్, షేక్‌స్పియర్, థామస్ హార్డీ, హెన్రీ జేమ్స్‌ల క్లాసిక్ నవలలు హాలీవుడ్‌లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఈ నవలల ఆధారంగా డబ్బు చేసుకోవచ్చునని భావిస్తున్న వాళ్లు సినీ పరిశ్రమలో పెరుగుతున్నారు.
ఈ ఏడాది (1997) అందరూ అత్యంత ఆసక్తితో ఎదురుచూసిన సినిమా జేన్ ఛాంపియన్ తీసిన 'ద పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ'. ఇదే పేరుతో హెన్రీ జేమ్స్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రధాన పాత్రలో నికోల్ కిడ్మన్ నటించింది. ఇటువంటిదే బీబీసి నిర్మించిన 'జ్యూడ్ ది అబ్స్‌క్యూర్'కి థామస్ హార్డీ నవల మాతృక. అత్యధిక శాతం మంది ప్రశంసలు పొందిన ఈ చిత్రంలో కథానాయికగా సౌందర్యరాశి కేట్ విన్‌స్లెట్ అద్భుతంగా నటించింది. ఇప్పుడు అందరి కళ్లూ భారీ తారాగణంతో కెన్నెత్ బ్రానా తీస్తున్న సినిమాపైనే ఉన్నాయి. షేక్‌స్పియర్ మహోన్నత నాటకం 'హామ్లెట్' ఆధారంగా రూపొందిస్తుండటమే దీనికి కారణం.
1996లో హాలీవుడ్‌లో అటు విమర్శనా పరంగా కానీ, ఇటు వ్యాపారాత్మకంగా కానీ అత్యంత ఆదరణ పొందినవి ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ సినిమాలు, సిల్వెస్టర్ స్టాలోన్ సినిమాలు కాదు. గ్వినిత్ పాల్ట్రో ప్రధాన పాత్ర ధరించగా జేన్ ఆస్టిన్ నవల ఆధారంగా తీసిన 'ఎమ్మా', ఇంగ్లీష్ రంగస్థల నటుడు ఇయాన్ మెకెల్లన్ టైటిల్ రోల్‌లో ఉత్తమంగా నటించిన 'రిచర్డ్ 3' (షేక్‌స్పియర్ నవల ఆధారం), ఫ్రాంకో జఫరెల్లి తీసిన 'జేన్ ఐర్' (చార్లెట్ బ్రాంటే నవల ఆధారం) చిత్రాలు అత్యధిక ప్రజాదరణ పొందాయి. ఇవన్నీ క్లాసిక్ సినిమాలే. ఇంట్లాంటి దృశ్యమే రెండేళ్ల కిందట కూడా మనకి కనిపించింది. ఎమ్మా థామ్సన్ అద్భుత నటనను చూసేందుకే అందరూ 'సెన్స్ అండ్ సెన్సిబిలిటీ' సినిమాని చూసేందుకు ఎగబడ్డారంటే అతిశయోక్తి కాదు. జేన్ ఆస్టిన్ నవల ఆధారంగా రూపొందిన 'పర్సుయేషన్' చిత్రాన్ని కూడా జనం బాగా ఆదరించారు. ఆ తర్వాత బీబీసి సొంతంగా నిర్మించి తన ఛానల్లో ప్రదర్శించిన 'ప్రైడ్ అండ్ ప్రెజుడీస్'ని కోట్లాది మంది ఇళ్లల్లో కూర్చునే చూశారు.
కొద్ది సంవత్సరాలుగా అనేక క్లాసిక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడాన్ని మనం గమనించవచ్చు. 'ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్', 'రాబ్‌రాయ్', 'హెన్రీ 4', 'మచ్ అడో అబౌట్ నథింగ్', 'హోవార్డ్స్ ఎండ్' వంటి సినిమాలు ఇందుకు నిదర్శనం. జేన్ ఆస్టిన్ తర్వాత 1997లో థామస్ హార్డీ, హెన్రీ జేమ్స్ కథలకి హాలీవుడ్‌లో సమాన స్థాయిలో ఆదరణ లభిస్తోంది.
ప్రేక్షకుల్లో ఉన్నట్లుండి క్లాసిక్స్ పట్ల ఆసక్తి ఎందుకు పెరిగింది? క్లాసిక్స్ స్క్రిప్టులు ఉత్తమంగా ఉండటం ఓ కారణమని హాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఏదైనా పుస్తకాన్ని చదవడం కంటే క్లాసిక్‌ని చూడటం హాయనిపించడం కూడా కారణం కావచ్చు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. స్పెషల్ ఎఫెక్టులూ, హింసా చూసీ చూసీ ప్రేక్షకులు అలసిపోయారు. సినిమా థియేటర్‌కి వెళ్లి టెన్షన్ ఫీలవడానికి వాళ్లిప్పుడు ఇష్టపడటం లేదు. ప్రశాంతంగా, నరాలపై ఎట్లాంటి ఒత్తిడీ లేకుండా సినిమాలు చూడాలనుకుంటున్నారు వాళ్లు. క్లాసిక్స్ వల్ల తమ పిల్లలకీ ఎంతో కొంత విజ్ఞానం చేకూరుతుందని కూడా భావిస్తున్నారు. స్టూడియో ఎగ్జిక్యూటివ్‌లు కోట్ల కొద్దీ డాలర్లు పెట్టి తీసే భారీ చిత్రాలకి పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు వాళ్ల్లు ఆఫీసుల్లో బొమ్మా, బొరుసూ వేసుకుని క్లాన్సీ సినిమాకో, బ్రాంటే సినిమాకో ఫైనాన్స్ చేయాలని ఆశిస్తున్నారు. చాలా సందర్భాల్లో నవలలకంటే కూడా వాటి ఆధారంగా తీసిన చిత్రాలే ఎక్కువ ఆదరణ పొందడం చిత్రంగా అనిపించినా వాస్తవం. జాన్ గ్రీషం నవల 'ది ఫర్మ్' కంటే దాని ఆధారంతో సిడ్నీ పొలాక్ తీసిన సినిమా ఎక్కువ ప్రశంసలు అందుకున్నది.
ఫిలిప్ నాయిస్ నవల 'క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్'ని టాం క్లాన్సీ సమర్థవంతంగా టెక్నో థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఫ్రాంక్ దారబంట్ తాను తీసిన చిత్రం 'ది షాషంక్ రిడెంప్షన్'ని దాని మాతృక అయిన స్టీఫెన్ కింగ్ నవలని ఇంప్రూవ్ చేసి నిర్మించాడు. జోనాథన్ డెం సినిమా 'ద సైలెన్స్ ఆఫ్ ద లాంబ్స్', రాబర్ట్ జేమ్స్ వాలర్ సినిమా 'ద బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కంట్రీ' కూడా ఇదే కోవకి చెందుతాయి.
సంవత్సరాలపాటు నవలలని నిర్లక్ష్యం చేసిన హాలీవుడ్ ఎట్టకేలకు సరైన దారిలోకి వచ్చింది. సాహిత్యానికిప్పుడక్కడ గౌరవం పెరిగింది. మంచి స్క్రిప్టుకీ, సృజనాత్మక ప్రతిభావంతుడైన స్క్రీన్ రైటర్‌కీ ప్రాముఖ్యత లభిస్తోంది. ఇవాళ క్లాసిక్స్‌ని ప్రాక్టికల్ దృష్టితో నిజాయితీగా, ప్రతిభావంతంగా స్క్రీన్ రైటర్లు సినిమాల కోసం తయారు చేస్తున్నారు. ఐతే ఇదే సమయంలో నవలలోని థీంని, పాత్రల్నీ మార్చివేయడమే కాక ముగింపుని కూడా మార్చేస్తున్నారు. కొన్ని కొన్ని పాత్రల్ని ఐతే పూర్తిగా తీసేస్తున్నారు. దీన్ని సినిమాపరమైన ఇంద్రజాలంగా పరిగణిస్తున్నారు. మిలన్ కుందేరా నవల 'ది అన్‌బీటబుల్ లైట్‌నెస్ ఆఫ్ బీయింగ్'ని సినిమాగా తీయాలనుకున్న దర్శకుడు ఫిలిప్ కాఫ్‌మన్ సినిమా కోసం చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పినప్పుడు రచయిత ఖంగుతిన్నాడు.
అయితే విమర్శకులు మాత్రం దర్శకుల్ని సమర్థిస్తున్నారు. "ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసేవాళ్లు నవలలో మార్పులు చేర్పులు చేస్తే తప్పేంలేదు" అని న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు జనెట్ మస్లిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇట్లా నవలలోని పాత్రల్ని, సన్నివేశాల్ని మార్చివేసి తీసే సినిమాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఆస్ట్రేలియన్ డైరెక్టర్ బజ్ లార్మన్ రూపొందించిన 'రోమియో అండ్ జూలియట్'పై వివాదాలు చెలరేగాయి. పాత్రల స్వభావాన్నే మార్చారనే విమర్శలు వచ్చాయి. పైగా చిత్రంలో కళ్లు మిరుమిట్లుగొలిపే భారీ సెట్టింగులు వేశారు. ఎంటీవీ తరహాలో అట్టహాసంగా ఈ సినిమాని నిర్మించారన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఈ విమర్శలూ, వివాదాలూ పక్కనపెడితే మొత్తంగా క్లాసిక్ నవలలకి ఆదరణ బాగా పెరిగిందనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు ఆదరించినంత కాలం ఈ ఆరోగ్యకర వాతావరణం హాలీవుడ్‌లో కొనసాగుతుంది.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 8 ఆగస్ట్ 1997

Sunday, March 16, 2014

Sai Paranjpye movie SAAZ

ఆమె మనసుకి అద్దం పట్టిన 'సాజ్'

'సాజ్' - షబానా అజ్మీ నటించిన చిత్రం. సాయి పరాంజపే దర్శకత్వం వహించిన చిత్రం. సున్నితమైన, కదిలే చిత్రంవంటి మానవ ప్రకృతిని 'సాజ్' మన కళ్ల ముందుంచుతుంది. జూన్ 28న స్టార్ ప్లస్ చానల్ 'సాజ్' వరల్డ్ ప్రీమియర్‌ని ప్రసారం చేసింది. పరాంజపే సినిమాల్లో తొలిసారిగా ఓ టెలివిజన్ చానల్లో ప్రీమియర్‌గా ప్రసారమైన సినిమా 'సాజ్'.
చిత్ర కథలోకి వెళ్తే - మాన్సి (అరుణా ఇరాని)కి గొప్ప నేపథ్య గాయని కావాలని ఆశ. మాన్సి చెల్లెలు బన్సి (షబానా అజ్మి). పెళ్లయిన బన్సీని ఆమె భర్త తరచూ హింసిస్తుంటాడు. ఓమారు మాన్సి ఇంటికి వెళ్తుంది బన్సి. అక్కడ గోడమీద ఓ ఫొటో ఆకర్షిస్తుంది. అందులో తనూ, మాన్సీ హార్మోనియం పెట్టె ముందేసుకుని పాడుతుంటారు. బన్సీలో భావావేశం పొంగుతుంది. అక్కడే ఉన్న హార్మోనియం అందుకుని పాడుతుంది. అప్పుడే మాన్సి సలహాదారూ, ప్రియుడూ అయిన ఇందర్ వచ్చి ఆమె గానానికి అచ్చెరువొందుతాడు. బన్సీలో అద్భుత గాయని దాగుందని అతడు గ్రహిస్తాడు. ఆమెకి గాయనిగా అవకాశం ఇవ్వాలనుకుంటాడు. అయితే బన్సీ చేత తను పాడిస్తాననీ, ఇదరమూ కలిసే పాడతామనీ బన్సీని తనతో పాటు తీసుకుపోతుంది మాన్సి. రికార్డింగ్ రోజున మాన్సి పాట మొదలుపెడుతుంది. 'రింజిం రింజిం' అంటూ కోరస్ పాడుతుంది బన్సి. తర్వాతి చరణం ఆమె పాడాలనుకునేంతలో అది కూడా, అది మాత్రమే కాదు పాట మొత్తం మాన్సినే పాడుతుంది. బన్సీకి పాడేందుకు 'రింజిం రింజిం' మాత్రమే మిగులుతుంది. అక్క చేసిన మోసానికి బన్సీకి దఃఖం తన్నుకువస్తుంది. ఏడుస్తున్న బన్సీని మాన్సి ఓదారుస్తుంది. తన మనసులో ఎట్లాంటి దురుద్దేశమూ లేదని నమ్మకంగా చెబుతుంది. బన్సి నమ్ముతుంది.
అయితే ఇందర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లోకానికి ఓ కొత్త, అపురూప గాయనిని పరిచయం చేయాలని అతను తలపోస్తున్నాడు. అనుకున్నట్లే బన్సీకి స్వతంత్రంగా పాడే అవకాశాన్ని కల్పిస్తాడు. మొదటి పాటతోనే బన్సి పేరు మోగిపోతుంది. సినిమా పత్రికలన్నీ బన్సీని ఆకాశానికెత్తేస్తూ కథనాలు రాస్తాయి. అవి చూసిన మాన్సి అసూయతో దహించుకుపోతుంది. అప్పటికే బన్సి గర్భవతి. పాపను కంటుంది. బన్సి ప్లేబ్యాక్ సింగర్‌గా పాపులర్ అవుతుంది. ఆమె ఖ్యాతి ఢిల్లీ వరకు పాకుతుంది. ఆగస్ట్ 15న ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య వేడుకల్లో పాడే అవకాశం వస్తుంది. సంతోషంతో ఉప్పొంగిపోతుంది బన్సి. అయితే ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆగస్ట్ 15న జరిగే కార్యక్రమానికి హాజరుకమ్మని ఆమెకు ఎలాంటి ఆహ్వానమూ అందదు. బన్సి ఊహించని విధంగా ఆగస్ట్ 15న మాన్సి పాడుతూ టీవీలో కనిపిస్తుంది. మాన్సి సంగతంతా ఆమెకు బోధపడుతుంది.
ఆ తర్వాత ఎన్నో సంఘటనలు జరిగిపోతాయి. మాన్సికి బ్లడ్ కేన్సర్ సోకి చనిపోతుంది. బన్సి అభిమానించిన ఇందర్ తానింక ఇండస్ట్రీలో ఉండలేననీ, తనని మన్నించమనీ వెళ్లిపోతాడు. బన్సి కూతురు కుహు (ఆయేషా ధర్కర్) పెద్దదై ఓ మ్యూజిక్ కంపెనీలో చేరుతుంది. తల్లికి తన మ్యూజిక్ డైరెక్టర్ (జాకిర్ హుస్సేన్)ను పరిచయం చేస్తుంది. జాకిర్ తొలి పరిచయంతోనే బన్సీని అభిమానిస్తాడు. అప్పటికి బన్సి తన గొప్ప స్వరాన్ని కోల్పోతుంది. అయినా జాకిర్ ఆమెను ఆరాధిస్తాడు. ఈ సంగతి నేరుగా ఆమెకే చెప్తాడు. బన్సి తేలిగ్గా తీసుకొని "నీకంటే పదేళ్లు పెద్దదాన్ని. నాతో పెళ్లేంటి. నాకు అంత పెద్ద కూతురుంటే" అంటుంది. అవేమీ తనకి అడ్డు కాదంటాడు జాకిర్. పెళ్లి చేసుకుందామని ఆమెపై ఒత్తిడి తెస్తాడు. ఎటూ తేల్చుకోలేక సైకియాట్రిస్టు, స్నేహితుడు  అయిన పరీక్షిత్ సహానీని సలహా అడుగుతుంది. కుహుకి కూడా ఈ సంగతి చెప్పమని అతను సలహా ఇస్తాడు. అట్లాగే చెబుదామనుకుంటే ఈలోగా కుహు తను జాకిర్‌ని ప్రేమిస్తునాననీ, అతన్ని పెళ్లి చేసుకుంటాననీ చెబుతుంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లాడాలనుకోవడమా? బన్సీకి చేష్టలు దక్కిపోతాయి. జాకిర్ వద్దకు వెళ్లిన కుహుకి అసలు విషయం తెలిసి తల్లిని అసహ్యించుకుంటుంది. బన్సి తన పరిధులు తెలుసుకుని జాకిర్ ప్రేమని తిరస్కరిస్తుంది. నిరాశతో జాకిర్ వెళ్లిపోతాడు. కూతురికి సన్నిహితం కావడానికి యత్నిస్తుంది బన్సి. కుహుకి సీషెల్స్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. కూతురితో వెళ్లేముందు పరీక్షిత్‌ని కలుస్తుంది బన్సి. అక్కడి అనుభవాలు తనకు ఎప్పటికప్పుడు తెలపమంటాడతను. సీషెల్స్‌లో ప్రదర్శన ఇవ్వకముందే కుహుకి జాతీయ ఉత్తమ గాయని అవార్డ్ వచ్చిన కబురందుతుంది. ఆ సంతోషంలో తనూ స్టేజి మీద పాట పాడుతుంది బన్సి. తల్లిలో వచ్చిన మార్పు చూసి కుహు ఆమెకి మళ్లీ చేరువవుతుంది. ఈ సంగతులన్నీ పరీక్షిత్‌కి ఉత్తరంలో రాస్తుంది. ఇండియాలో ప్లేన్ దిగి బయటకు వచ్చేసరికి పరీక్షిత్ ఎదురు చూస్తుంటాడు. బన్సి అతన్ని కలుస్తుంది. సినిమా పూర్తవుతుంది.
బన్సీగా షబానా తనదైన శైలిలో గొప్పగా నటించింది. బన్సి పాత్ర మానసిక పరిణామాల్ని షబానా చక్కగా ప్రదర్శించింది. ఉదాత్త సన్నివేశాల్లో తనకి తానే సాటి అని నిరూపించుకుంది. అయితే తల్లి కాకముందు యువతిగా ఆమెకు మేకప్ సరిగా నప్పలేదు. వయసు మీదపడుతున్న ఛాయలు స్పష్టంగా కనిపించాయి. నలభై యేళ్ల ప్రౌఢ స్త్రీగానే షబానా అందంగా అగుపించింది. హిందీ సినిమాల్లో వాంప్ పాత్రలు, తల్లి పాత్రలు వేస్తున్న అరుణా ఇరానీ చెల్లెలి మీద అసూయతో నిండిన పాత్రలో రాణించింది. బన్సి కూతురుగా ఆయేషా ధర్కర్ చలాకీగా చేసింది. ఆమె చిరునవ్వు ముఖం పాత్రకి సరిగ్గా అమిరింది. పరీక్షిత్ సహానీది నటనని ప్రదర్శించే అవకాశమున్న పాత్ర కాకపోవడంతో సాదాగా అగుపించాడు. ఇక షబానాతో పాటు ఎక్కువ మార్కులు కొట్టేసింది జాకిర్ హుస్సేన్. మంచి తబలా విద్వాంసుడిగా మాత్రమే పరిచయమున్న జాకిర్ యువ సంగీతకారుడి పాత్రని చాలా సునాయాసంగా చేసి ప్రశంసలందుకున్నాడు. చిత్రంలో పాటలు, సంగీతం బాగా కుదిరాయి. అనీ సందర్భోచిత పాటలే. 'కథ', 'స్పర్శ్', 'చష్మేబుద్దూర్' సినిమాల తర్వాత సాయి పరాంజపే సినిమాల్లో 'సాజ్' ఆ స్థాయిలో నిలుస్తుందని ఆశించవచ్చు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 11 జూలై 1997

Saturday, March 15, 2014

Song: Gudhachari 116

పాట: గూఢచారి 116 (1966)
సంగీతం: చలపతిరావు
రచన: సి. నారాయణరెడ్డి

అతడు: నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
ఆమె: నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
అతడు: ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు  ||ముద్దబంతిలా||
జింకపిల్లలా చెంగుచెంగుమని చిలిపి సైగలే చేసేవు
ఆమె: ||నువ్వు నా ముందుంటే||
చల్లచల్లగా రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు  ||చల్లచల్లగ||
బుగ్గపైన కొనగోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు
అతడు: ||నువ్వు నా ముందుటే||
లేతలేతగా నవ్వేవు లేని కోరికలు రువ్వేవు  ||లేతలేతగా||
ఆమె: మాటలల్లి మరుమందు చల్లి నను మత్తులోన పడవేసేవు
ఇద్దరు: నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు

Tuesday, March 11, 2014

Review: Chelikadu (1997)

ప్రేమ ప్లస్ సెంటిమెంటు

తారాగణం: వడ్డే నవీన్, ప్రేమ, రుచిత, హీరా, ఉత్తర, నాగబాబు, చలపతిరావు, చంద్రమోహన్, గిరిబాబు
సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్
నిర్మాత: చిన్నచౌదరి అంజిరెడ్డి
దర్శకుడు: శరత్

ఓ మామూలు ప్రేమకథకి చిన్న సెంటిమెంట్ ట్విస్ట్ ఇచ్చి తీసిన చిత్రం 'చెలికాడు'. కాకపోతే ఇందులో ముగ్గురు+ఒకరు మొత్తం నలుగురు అమ్మాయిలు హీరో ప్రేమ కోసం వెంపర్లాడుతూ కనిపిస్తారు. సదరు హీరో ధీర గంభీరుడు కావడంతో ఆఖరి రీలు వచ్చేదాకా అటు నాయికలనీ, ఇటు ప్రేక్షకుల్నీ సస్పెన్స్‌లో పెట్టి వినోదిస్తాడు.
గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూళ్లో ముగ్గురు ప్రాణ స్నేహితులు - చలపతి (చలపతిరావు), చంద్రం (చంద్రమోహన్), గిరి (గిరిబాబు) ఉంటారు. ముగ్గురిలో ఓ ఒక్కరికోసమైనా మిగతా ఇద్దరు అవసరమైతే ప్రాణమైనా సరే ఏమాత్రం కష్టమనుకోకుండా ఇచ్చేస్తారు. వాళ్ల ముగ్గురు కూతుళ్లు (ఒక్కొక్కరికి సరిగ్గా ఒక్కో కూతురే ఉంటారు) లిఖిత (హీరా), శారద (రుచిత), నిర్మల (ప్రేమ) పట్నంలో చదువుతుంటారు. తండ్రులకి మల్లే వాళ్లు కూడా ప్రాణ స్నేహితులే. అయితే ముగ్గురివీ మూడు భిన్న మనస్తత్వాలు. లిఖిత దేనినైనా సరే డబ్బుతో కొనేయగలనని నమ్ముతుంటుంది. స్త్రీకి ధైర్య సాహసాలు అవసరమని చెప్పి కసరత్తులు చేస్తుంటుంది నిర్మల. ఇక శారదకి పుస్తకాలు తప్ప (క్లాసు పుస్తకాలు మాత్రమే) మరో లోకం ఉండదు.
ఉన్నట్లుండి ఒకానొక రోజు రాము (నవీన్) అనే పల్లెటూరి కుర్రోడు జీవనోపాధి కోసం తన పల్లెని విడిచి పట్నం వచ్చి బాబుమోహన్ సాయంతో ముగ్గురమ్మాయిల ఇంటి ముందు టీకొట్టు పెడతాడు. ముందు చీదరగా భావించి టీకొట్టు తీసేయమని హుంకరించిన ముగ్గురమ్మాయిలు ఒకానొక రాత్రివేళలో తోటి మగ విద్యార్థుల చేత తమ ఇంటిముందే దౌర్జన్యానికి గురవుతుండగా రాము వాళ్లని చితకబాది తమని రక్షించడంతో ముగ్గురూ అతని మీద మనసు పారేసుకుంటారు. జరిగిన గొడవ కారణంగా టీకొట్టు ఎత్తేసి తిరిగి పల్లెకి పోవాలనుకుంటున్న రాముని నిలువరిస్తారు. లిఖిత డబ్బు తెచ్చి (బాబుదే కదా) రాముచేత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టిస్తుంది. నిర్మల కసరత్తులతో ధైర్య సాహసాలు నేర్పిస్తుంది. శారద చదువు చెబుతుంది. దాంతో మిగతా మగవాళ్లు దశాబ్దాలు కృషిచేసినా సాధించలేని పరిపూర్ణతని రాము నెలల్లోనే సాధించేస్తాడు. ఈలోగా ముగ్గురు హీరోయిన్లూ రాముతో కలల్లో డ్యూయెట్లు పాడేసుకుంటారు. అతని ప్రేమని ఎలాగైనా పొందాలనే పట్టుదలతో చలపతిని ఒప్పించి తమ ఆస్తినంతా స్యూరిటీగా పెట్టి రాముకి లోను ఇప్పించి అతనిచేత స్టార్ హోటల్‌ని కట్టిపిస్తుంది లిఖిత.
రాజేంద్ర (నాగబాబు) అనే మిలియనీర్ ఇంటికి రాము వెళ్లినప్పుడు అతని చెల్లెలు ప్రమీల (ఉత్తర) తొలిచూపులోనే రాముని ప్రేమిస్తుంది. ఆ తర్వాత తాను రాముని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నతో చెప్తుంది. రాజేంద్రది చెల్లెలి కోసం ఖూనీలు చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం. ఈలోగా వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) వస్తుంది. అంతదాకా తాము ప్రేమిస్తోంది ఒక్కరినే అనే సంగతి తెలీదు కాబట్టి ముగ్గురు స్నేహితురాళ్లు ఆరోజు గ్రీటింగ్స్‌తో తమ ప్రేమని చెబుతామని ఒకేసారి ఠంచన్‌గా వస్తారు. రాము అభిప్రాయం తెలుసుకోకుండానే మరోపక్క మందీ మార్బలంతో అదే సమయానికి నిశ్చితార్థం కోసం వస్తాడు రాజేంద్ర. అప్పుడు ముగ్గురు స్నేహితురాళ్లకీ తాము ఒక్కరినే ప్రేమిస్తున్నామనే సంగతి తెలుస్తుంది. 'నాకు తెలీకుండా నువ్వెందుకు ప్రేమించావు' అని ఒకర్నొకరు తిట్టుకుంటారు. ముగ్గురు ఈసారి విడివిడిగా వెళ్లి తమని ప్రేమిస్తున్నామని చెప్పకపోతే చచ్చిపోతామని బెదిరిస్తారు. ఏ సంగతీ ఆదివారం చెప్తానంటాడు రాము. మరోపక్క తన చెల్లెల్ని చేసుకోవడానికి రాము తిరస్కరించడంతో ఆగ్రహోదగ్రుడై శాలిని హోటల్‌ని బ్లాస్ట్ చేయడానికి మనుషుల్ని పంపిస్తాడు రాజేంద్ర. అయితే అతని చెల్లెలు ప్రమీల ద్వారా విషయం తెలుసుకున్న రాము తన హోటల్‌ని కాపాడుకుంటాడు కానీ గాయాల పాలవుతాడు. హాస్పిటల్లో అతనికి రక్తం అవసరమవుతుంది. ముగ్గురు మిత్రురాళ్లు పోటీల మీద తమ రక్తం ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎవరి రక్తమూ రాము రక్తంతో సరిపోదు. మొత్తానికి రాము త్వరగానే కోలుకుంటాడు. అప్పుడే రాముకి డాక్టర్  ఓ భయంకర వాస్తవాన్ని చెప్తాడు. రాము నిర్ఘాంతపోతాడు. ఆవేదనతో కదిలిపోతాడు. శారదకి బ్లడ్ క్యాన్సర్! ఆమె ఎన్నో రోజులు బతికే అవకాశం లేదు కాబట్టి ఆఖరి రోజుల్లో ఆమెకి సంతోషం కలిగించే ఉద్దేశంతో ఆమెని పెళ్లి చేసుకుంటానంటాడు. ముందు  రాముని చీత్కరించిన మిగతా ఇద్దరు అసలు విషయం తెలిశాక రియలైజ్ అవుతారు. రాము, శారద పెళ్లి జరిగే సమయానికి శారదని రాజేంద్ర కిడ్నాప్ చేయించి ఆమె బతకాలంటే తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని రాముని బెదిరిస్తాడు. జరిగిన సంగతి తెలుసుకున్న ప్రమీల అన్నయ్య చర్యని అసహ్యించుకుంటుంది. జ్ఞానోదయమైన రాజేంద్ర తానే స్వయంగా బావిలో పడిపోతున్న శారదని కాపాడతాడు. పెళ్లయ్యాక వైద్య చికిత్స కోసం బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో అమెరికాకి శారదని తీసుకుపోతాడు రాము.
నవీన్ నటించగా విడుదలైన చిత్రాల్లో రెండోది 'చెలికాడు'. ముఖంలో హావభావాల్ని పలికించకపోయినా పాటలు, ఫైట్లలో ఫర్వాలేదనిపించాడు. మున్ముందు నటనలో రాణిస్తాడని ఆశించవచ్చు. ముగ్గురు స్నేహితురాళ్లుగా రుచిత, హీరా, ప్రేమలలో ప్రేమ ఒక మార్కు ఎక్కువ కొట్టేసింది. రుచితకి మేకప్ మరీ ఎక్కువైనట్లు తోచింది. నాగబాబు చాలా రోజుల తర్వాత నటనకి అవకాశంలేని పాత్రని అంగీకరించడం సరదాకోసమై ఉండొచ్చు. ఇక చంద్రమోహన్, గిరిబాబు, చలపతిరావు ప్రాణ స్నేహితులుగా బాగా నప్పారు. ఈటీవీలో లేడీ డిటెక్టివ్‌గా నటిస్తున్న ఉత్తర ఉన్నది కొద్ది సన్నివేశాల్లో అయినా రాజేంద్ర చెల్లెలి పాత్రలో అందంగా కనిపించింది. బాబూమోహన్, కాస్ట్యూమ్స్ కృష్ణ, మల్లికార్జునరావు, శ్రీలక్ష్మిపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు కొంచెం రిలీఫ్‌నిస్తాయి. చిత్రంలో విచిత్రమనిపించే సంగతులున్నాయి. ముగ్గురు స్నేహితుల భార్యలు చిత్రంలో కనిపించరు. వాళ్లు ఉన్నారో లేదో సినిమా పూర్తయ్యాక కూడా మనకు తెలీదు. చిత్రంగా ముగ్గురికీ కూతుళ్లే పుడతారు. అదీ ఒక్కరు చొప్పున. కూతురి మాటమీద అనామకుడెవరో హోటల్ కట్టుకోడానికి అవసరమైన లోన్‌కి సంబంధించి ఆస్తినంతా స్యూరిటీ కింద పెట్టే తండ్రులు మనకి నిజ జీవితంలో కోటికి ఒకరు కూడా ఉండరు. ఈ సినిమాలో మాత్రం అది అతి సునాయాసంగా జరిగిపోతుంది. హీరో టీకొట్టు స్థాయి నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్థాయికి, అక్కణ్ణించి స్టార్ హోటల్ రేంజికి ఎదిగే ప్రస్థానంలో తీసుకున్న కాలం ఎంతటి వాడికైనా అసాధ్యం. కానీ మన హీరోకి అది కూడా నల్లేరు మీద బండి నడక. హీరోయిన్ల చదువు పూర్తి కాకముందే అతడు కోటీశ్వరుడైపోవడం ప్రపంచ వింత. ఎస్.ఎ. రాజ్‌కుమార్ సంగీతం బాగుంది. డైలాగులు కుదిరాయి. చిత్రీకరణ ఫర్వాలేదు. మొత్తానికి కథనంలో కొత్తదనం లేకపోయినా ఒకసారి మాత్రం చూడదగ్గ యావరేజ్ సినిమా 'చెలికాడు'.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 11 జూలై 1997