Thursday, September 10, 2015

Synopsis Of PALNATI YUDDHAM (1947) Movie

బ్రహ్మనాయుడు (గోవిందరాజుల వెంకట సుబ్బారావు) వైష్ణవ భక్తుడు, భజనపరుడు. ప్రజలు ఆయనను గౌరవిస్తుంటారు. రాజ బంధువుల్లో అత్యధికులు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటారు. 'జై చెన్నకేశవా' అంటూ హరిభక్తుల వేషాలలో ఆయన్ను అనుసరిస్తుంటారు. సర్వమానవ సమత్వాన్నీ, హరిజనోద్ధరణనూ బోధించే బ్రహ్మనాయుడు దేవాలయంలో హరిజన ప్రవేశాన్నీ, హరిజనులతో పంక్తి భోజనాన్నీ తలపెడతాడు. ఇది గిట్టని ప్రతిపక్షులు, రాజభటులు ఈ విషయాన్ని దండనాథులతోనూ, నరసింహరాజు (ముదిగొండ లింగమూర్తి)తోనూ పితూరీ చేస్తారు. బ్రహ్మనాయుడిపై నరసింహరాజుకు కోపం వస్తుంది. అతని అనుయాయులు కొంతమంది నాగమ్మ (కన్నాంబ) వద్దకు వెళ్తారు. ఆమె శైవ యోగినిగా తన ఊళ్లో శివార్చన చేసుకుంటూ ఉంటుంది. హరిజనులను బ్రహ్మన్న వర్ణస్థుల్లో కలిపివేస్తున్నాడనీ, ఆమె వచ్చి, రాజుకు దన్నుగా నిలిచి, ఆయనను బ్రహ్మన్న మాయ నుంచి తప్పించి, రాజ్యాన్నీ, పురాతన ఆచార ధర్మాలనీ కాపాడాలని బతిమాలుకుంటారు. సర్వసంగ పరిత్యాగిని అయిన తనకు ఈ బెడదలు ఎందుకంటూనే అర్ధంగీకారంతో నాగమ్మ వాళ్ల మాటలు మన్నించి రాజసభలో అడుగుపెడుతుంది. నరసింహరాజు సంతోషిస్తాడు.
మాల కన్నమదాసు (వి. కోటేశ్వరరావు)ను బ్రహ్మన్న దండనాయకుడిగా చేశాడంటూ సభలో ఒక పక్షం ఉద్రిక్తంగా ప్రవర్తిస్తుంది. బ్రహ్మన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది నాగమ్మ. తన మాటలు అక్కడ ఎవరూ వినడంలేదనీ, తనకక్కడ స్థానం లేదనీ ప్రధాని పదవి వదులుకొని రాజాస్థానం నుంచి వెళ్లిపోతాడు. వెళ్లవద్దని నలగామరాజు (తీగల వెంకటేశ్వర్లు) ఆపబోతుంటే, రాజమంత్రులకే కాకుండా రాజాస్థానానికీ ప్రతిష్ఠ ఉందంటూ అతణ్ణి వారిస్తుంది నాగమ్మ. అన్నతో గొడవపడ్డ మలిదేవరాజు (డి.ఎస్. సదాశివరావు) రాజ్యంలో తన భాగం తనకు పంచి ఇమ్మంటాడు. దేశాలూ, రాజ్యాలూ ప్రజలతో కూడుకున్నవనీ, పంపకాలు చేయడానికి రాజులకు హక్కులు లేవనీ చెబుతుంది నాగమ్మ. నలగామరాజు పల్నాడును పంపకం చేస్తాడు. బ్రహ్మన్న వద్దకు వెళ్తాడు మలిదేవుడు. అతడు చేసిన పనికి విచారిస్తాడు బ్రహ్మన్న. అఖండ పల్నాడు, సర్వవర్ణ సమత్వాలు తన ఆశయాలని చెప్పి జరిగిన పనికి చింతిస్తూనే మలిదేవాదుల రక్షణ భారం వహిస్తాడు. కన్నమదాసును సైన్యాధ్యక్షుడిగా చేసుకొని మాచర్ల బయల్దేరతాడు. బ్రహ్మన్నతో కొమ్మరాజు కూడా వెళ్తాడు.
నరసింహరాజు ప్రొత్సాహంతో నాగమ్మను బతిమలాడి ఆమెను మహామంత్రిణిగా చేస్తాడు నలగామరాజు. ఆమె మలిదేవ, బ్రహ్మన్న, అలరాజు (కోనేరు కుటుంబరావు) మీద పగ సాధించే ప్రయత్నంలో భాగంగా నరసింహరాజును ఉపయోగించుకుంటూ, మాచర్లకు గూఢచారులను పంపిస్తూ, అక్కడి విషయాలు తెలుసుకుంటూ, మెలకువగా వ్యవహరిస్తూ, మాచర్లను తిరిగి గురజాల రాజ్యంలో కలపాలని తపిస్తుంటుంది.
మాచర్లలో బ్రహ్మన్న కొడుకు బాలచంద్రుడు (అక్కినేని నాగేశ్వరరావు) గూఢచారులని పట్టుకొని దండించబోతుంటే వారిస్తాడు కన్నమదాసు. అతను సేనానాయకుడు కాబట్టి అతని ఆజ్ఞను పాలించాల్సిందిగా కొడుక్కు చెబుతాడు బ్రహ్మన్న. యవ్వన ఉద్రేకంలో ఉండే బాలచంద్రునికి ఇది చికాకు తెప్పించినా, తండ్రిని ఏమనలేకపోతాడు. బ్రహ్మన్నకు కోడిపందేలంటే ఇష్టమనే సంగతి గూఢచారుల ద్వారా నాగమ్మకూ, నరసింహరాజుకూ తెలుస్తుంది. కోడిపందేల మిషతో మాచర్లను మళ్లీ గురజాలలో కలపవచ్చనీ, బ్రహ్మనాయుడు, మలిదేవాదులను దేశంనుంచే వెళ్లగొట్టించవచ్చనీ పన్నాగం పన్నుతుంది నాగమ్మ. మాయ కవచం తొడిగిన కోడిపుంజునొకదాన్ని తన సేవకుని దగ్గర తయారుగా ఉంచుతుంది.
ఆహ్వానం స్వీకరించకపోవడం పౌరుషానికి లోటంటూ బ్రహ్మన్న, మలిదేవాదులు గురజాల ఆస్థాన మంటపంలో కోడిపందేలలో పాల్గొంటారు. మొదట బ్రహ్మనాయుడి కోడిపుంజులే నెగ్గుతాయి. చివరకు నాగమ్మ కవచం తొడిగిన పుంజును రప్పిస్తుంది. మలిదేవరాజుకు రోషం కలిగిస్తుంది. బ్రహ్మనాయుడిని అడక్కుండానే మలిదేవుడు తన రాజ్యాన్ని పణంగా పెట్టి, ఓడిపోయినవాళ్లు ఏడేళ్లు వలసపోవాలనే పందేనికి ఒప్పుకుంటాడు. నలగామరాజుని అలరాజు నివారించాలని చూసినా నాగమ్మ, నరసింహరాజు ప్రోద్బలంతో పందెం సాగుతుంది. బ్రహ్మన్న కోడి పడిపోగానే నాగమ్మ సేవకుడు తమ కోడి కవచాన్ని రహస్యంగా తీసేస్తాడు. పందెంలో మోసం జరిగిందని బ్రహ్మన్న పక్షంవాళ్లు గొడవ చేయడంతో, కోడిని పరీక్షించుకొమ్మని బ్రహ్మన్న ముందు పెడుతుంది నాగమ్మ. పందెం ప్రకారం మాచర్లను వదిలి కర్నూలు సీమకు వలసపోతుంది బ్రహ్మన్న బృందం.
నలగామరాజు అల్లుడైన అలరాజు తాను కూడా వలసపోతున్నానని భార్య రత్నాల పేరిందేవి (సురభి బాలసరస్వతి)తో చెప్పి వెళ్లిపోతాడు. అతణ్ణి ఆపాల్సిందిగా నలగామరాజును ఏడుస్తూ అర్థిస్తుంది పేరిందేవి. తన తర్వాత రాజ్యం అలరాజుదేననే అభిప్రాయం ఉండి కూడా అతడు ఏమీ చేయకుండా చేష్టలుడిగిపోతాడు. బ్రహ్మనాయుని పరివారం వలస జీవితం పూర్తి చేసుకొని సైన్యంతో సమాయత్తమవుతారు. తమ రాజ్య భాగం తమకివ్వాల్సిందిగా అలరాజును రాయబారానికి పంపుతారు. అలరాజు వస్తే నలగామరాజు మళ్లీ తమ ప్రభావం నుంచి బయటకొచ్చి, బ్రహ్మనాయుడి ప్రభావంలో పడతాడని నరసింహరాజుకు నూరిపోసిన నాగమ్మ, అతడిలో రాజ్యాపేక్షను రగిలిస్తుంది. అలరాజును దారిలోనే చంపేయమని ప్రేరేపిస్తుంది. అలరాజును ఊరిబయటనే కలుసుకున్న నరసింహరాజు అతడికి ఆతిథ్యాలిస్తాడు. నర్తకి చేతికి విషపాత్రనిచ్చి అతని వద్దకు పంపుతాడు. అక్కణ్ణించి తాను వెళ్లిపోతున్నట్లు తప్పుకుంటాడు. నర్తకి వ్యామోహంలో పడిన అలరాజు ఆమె ఇచ్చిన విషం తాగి మరణిస్తాడు. అలరాజు మృతికి విచారించిన బ్రహ్మన్న యుద్ధానికి సన్నద్ధమవుతాడు. అంతఃపుర స్త్రీరక్షణ కోసం బాలచంద్రుణ్ణి ఇంటివద్దే ఉండమంటాడు. బజారులో ఒక బొంగరం ఆట సంఘటనతో పౌరుషం పెల్లుబికిన బాలచంద్రుడు తల్లివద్దకు పోయి, యుద్ధానికి వెళ్తాననీ, దీవించమనీ అంటాడు. కన్నకొడుకును వదలలేక వదులుతూ దీవించి, మొహాన తిలకం దిద్దుతుంది తల్లి. పుట్టింటిలో ఉన్న కోడలు మాంచాల (ఎస్. వరలక్ష్మి)కు కూడా ఓ మాటచెప్పి వెళ్లమంటుంది. అత్తవారింటికి వస్తాడు బాలచంద్రుడు. మాంచాల భర్తను సంతోషపరిచి, వీరపత్నిలాగా అతణ్ణి యుద్ధానికి పంపుతుంది. యుద్ధ శిబిరంలో బ్రహ్మనాయుడు శాంతివచనాలు పలుకుతుంటే వారించి, సైన్యాన్ని యుద్ధోన్ముఖం చేస్తాడు బాలచంద్రుడు. బ్రహ్మన్న పరిస్థితులకు లొంగుతాడు. తను కత్తిపట్టకుండా యుద్ధాన్ని నడుపుతాడు. ఇరుపక్షాలూ యుద్ధంలో తలపడతాయి. బాలచంద్రుడు వీరోచితంగా యుద్ధంచేసి, నరసింహరాజుతో తలపడి, అతని తలనరికి, తనూ గాయపడి, కొనప్రాణంతో తలను బ్రహ్మనాయుడి వద్దకు తెస్తాడు. తను పుత్రప్రాయంగా పెంచిన నరసింహరాజు తలచూసి బ్రహ్మన్న దుఃఖిస్తాడు. తండ్రి తనను మెచ్చుకోకపోగా నరసింహరాజు చనిపోయినందుకు దుఃఖించడంతో "నాన్నా, నువ్వెప్పుడూ ఇంతే"నంటూ నిస్పృహతో ప్రాణాలు వదుల్తాడు బాలచంద్రుడు. మనసు నీరవమైపోగా, యుద్ధం ఆపెయ్యాలనే తలంపుతో, ఆయుధమనేది లేకుండా యుద్ధరంగం మధ్యలోకి వెళ్తాడు బ్రహ్మన్న. అతనిలోని తేజస్సును చూసి ప్రత్యర్థి సైనికులు పారిపోతుంటారు. నరసింహరాజు మృతికి కోపావేశంతో స్వయంగా సైన్యాన్ని ఉద్రిక్తం చేస్తూ బ్రహ్మన్నను ఎదుర్కొంటుంది నాగమ్మ. అహింసనే నమ్మిన్న బ్రహ్మన్న, తన తలనరికి యుద్ధాన్ని ఆపమంటాడు. అతని మహోన్నత హృదయాన్ని ప్రత్యక్షంగా చూసిన నాగమ్మ పశ్చాత్తాపంతో కత్తి దించి క్షమించమంటూ అతని కాళ్లమీద పడుతుంది. యుద్ధం ముగుస్తుంది. బ్రహ్మన్నను మంత్రిగా ఉండమని కోరతాడు నలగామరాజు. నాగమ్మనే మంత్రిణిగా ఉండవలసిందిగా ఆదేశించి, చెన్నకేశవ స్వామిని కీర్తిస్తూ ఆయనలో లీనమైపోతాడు బ్రహ్మనాయుడు.

No comments: