Saturday, March 12, 2011

కథ: పదహారేళ్ల తర్వాత...

కృష్ణా ఎక్స్‌ప్రెస్ వేగంగా పరుగెత్తుతోంది. పద్మాకర్‌ని ఆనందం, ఉద్వేగం కలగలసిన భావం ఊపేస్తోంది. అది మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎదుటివాళ్లకి.
"ఏం సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు?" ఎదురుగా విండో పక్కన కూర్చున్న లక్ష్మణ్ అడిగాడు. అతనో ఇంజినీరింగ్ స్టూడెంట్. అప్పటికే ఇద్దరికీ పరిచయమయ్యింది.
"ఇంకో అరగంటలో వేటపాలెం వచ్చేస్తుంది. పదహారేళ్ల తర్వాత నా స్నేహితుణ్ణి కలవబోతున్నా!" పద్మాకర్ గొంతులో ఉద్వేగం దాగలేదు.
"పదహారేళ్ల తర్వాత మీ ఫ్రెండుని కలవబోతున్నారా! అబ్బా.. చాలా థ్రిల్లింగ్‌గా ఉండి ఉంటుంది మీకు. అవునా?" అడిగాడు లక్ష్మణ్.
"మామూలు థ్రిల్లింగ్ కాదు. వాడు నా ప్రాణమిత్రుడు. కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. మా క్లోజ్‌నెస్ చూసి మిగతా స్టూడెంట్స్, లెక్చరర్స్ తెగ ఆశ్చర్యపోయేవాళ్లు. మమ్మల్ని విడదీయాలని చూసిన వాళ్లు సక్సెస్ కాలేకపోయారు."
"మరి ఎలా విడిపోయారు?"
"బీఎస్సీ ఫైనలియర్‌లో ఉండగానే మా నాన్నకు ప్రమోషన్ మీద కలకత్తాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఆయన అప్పుడు స్టేట్ బ్యాంకు మేనేజర్. ఎగ్జాంస్ అయ్యేలోగా నాలుగు నెలలు సుదర్శన్ వాళ్లింట్లోనే ఉన్నా. ఆ తర్వాత కలకత్తాకు వెళ్లిపోయా. మళ్లీ ఇప్పుడే రావడం."
"అప్పణ్ణుంచీ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ లేదా?"
రైలు వేగం తగ్గింది.
"నేను కలకత్తాకి వెళ్లిన కొత్తలో రెండు మూడు ఉత్తరాలు రాసుకున్నాం. ఆ తర్వాత నేను ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయా. చదువులో పడి నేను వాడికి ఉత్తరాలు రాయడం నిర్లక్ష్యం చేశా. అట్లా మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నెల రోజుల క్రితమే వాడితో మళ్లీ మాట్లాడా ఫోనులో. అప్పట్నించీ వాడెలాగ ఉన్నాడో చూడాలనే ఆరాటం. అందుకే ఈ ప్రయాణం."
రైలు బాపట్ల స్టేషనులో ఆగింది. దిగేవాళ్లు దిగుతుంటే, ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు.
"గుగ్గిళ్లోయ్.. గుగ్గిళ్లూ" అంటూ తిరుగుతున్న ఓ కుర్రాడిని పిలిచాడు పద్మాకర్. ఐదేసి రూపాయలకు రెండు పొట్లాలు తీసుకుని ఒకటి లక్ష్మణ్‌కిచ్చాడు. అతను మొహమాటపడుతూ తీసుకున్నాడు.
"గుగ్గిళ్లంటే సుదర్శన్‌కీ, నాకూ చాలా ఇష్టం. కాలేజీ దగ్గరకి ఓ ముసలామెతో పాటు ఇద్దరు ముగ్గురు గుగ్గిళ్లు తెచ్చేవాళ్లు. మేం మాత్రం రోజూ ఆ ముసలామె దగ్గరే కొనేవాళ్లం. ఒకసారి ఆమె ఆ గుగ్గిళ్లు అమ్ముతూనే గుండెపోటు వచ్చి చనిపోయింది" జ్ఞాపకం చేసుకున్నాడు పద్మాకర్.
"అసలు అన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఎలా దొరికాడు" అడిగాడు లక్ష్మణ్.
"ఫోన్ చేసింది నేను కాదు, వాడే. ఢిల్లీలో ఆ ఊరతను ఒకాయన పరిచయమయ్యాడు. అప్పుడు సుదర్శన్ గురించి అతనికేమన్నా తెలుసేమో అడిగాను. అతనేమన్నాడో తెలుసా? 'సుదర్శన్‌గారి గురించి తెలీకపోతే ఆ ఊరతను కానట్టే' అని. అయితే వాడి ఫోన్ నెంబర్ తెలీదనీ, వాడి పేరు, ఊరి పేరు రాస్తే చాలు లెటర్ వాడికి చేరుతుందనీ చెప్పాడు. అతను చెప్పినట్లే లెటర్ రాశా. అందులో నా ఫోన్ నెంబరు ఇచ్చా. నాలుగు రోజుల తర్వాత వాడు ఫోన్ చేశాడు" ఉత్సాహంగా చెప్పాడు పద్మాకర్.
రైలు కదిలింది.
"మీ ఫ్రెండ్ అక్కడ అంత ఫేమస్ ఫిగరా?" లక్ష్మణ్ గొంతుకలో కుతూహలం.
"అవును. ఆ ఊళ్లోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ల వాళ్లకీ వాడు తెలుసంట! ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరికంటే ఎక్కువసార్లు అరెస్ట్ అయ్యిందీ, జైలుకి వెళ్లిందీ వాడేనంట!" అని పద్మాకర్ చెప్పగానే గుగ్గిళ్లు తింటున్న వాడల్లా నోరెళ్లబెట్టాడు లక్ష్మణ్.
"జైలుకి వెళ్తుంటాడా? అంటే.." అని ఆగిపోయాడు.
"నీ ఉద్దేశం అతడు నేరాలు చేస్తూ జైలుకి వెళ్తుంటాడా? అని కదూ!.. కాదు. మామూలుగానైతే జైలుకి వెళ్లేది నేరాలు చేసేవాళ్లే. కానీ నా ఫ్రెండు అలాంటివాడు కాదు. అన్నిసార్లూ ఇతరుల కోసమే, వారి కోసం చేసిన పోరాటాల వల్లే జైలుకి వెళ్లాడు. పేదవాళ్లకి అన్యాయం జరిగితే కాళ్లూ చేతులూ ముడుచుకుని, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం వాడికి చేతకాదు. అందుకే అన్నిసార్లు జైలుకెళ్లాడు. ఇంకెన్నిసార్లు వెళతాడో! ఢిల్లీలో ఈ సంగతి చెప్పిన ఆ వ్యక్తి తనూ ఆ ఊరివాడైనందుకు గర్విస్తున్నానని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వపడ్డాను, సుదర్శన్‌కి నేను మిత్రుడనైనందుకు. అలాంటి గొప్ప లీడర్ని వెంటనే చూడాలని మనసు కొట్టుకుపోయింది. అందుకే ఈ ప్రయాణం" చెబుతుంటే పద్మాకర్ గొంతు ఉద్వేగంతో పూడుకుపోయింది. వొళ్లు వణికింది. విండోలొంచి బయటకు చూశాడు. రైలుకట్ట పొడవూతా వరిచేలు పచ్చగా. అప్పుడే కోతలు మొదలు పెడుతున్నట్లుంది. గోచీలు బిగించి ఆడవాళ్లు కొడవళ్లతో పైరు కోస్తుంటే, మగాళ్లు వాటిని కుప్పలు పెడుతున్నారు.
అంతట్లోనే నూలు డయ్యింగులు ప్రత్యక్షమయ్యాయి. బొంగుల మీద ఎండకు ఆరబెట్టిన రంగురంగుల నూలు. ఈపూరుపాలెం స్టేషను దాటింది రైలు. అక్కడ ప్యాసింజర్లు మాత్రమే ఆగుతాయి. రైలు వేగం తగ్గుతోంది. చీరాల స్టేషన్ దగ్గరవుతోంది.
"ఇంకో పది నిమిషాల్లో వేటపాలెం వచ్చేస్తుంది" అన్నాడు లక్ష్మణ్ విండోలోంచి బయటకి చూస్తూ.
పద్మాకర్ తలూపాడు.
"మీరు చెబుతుంటే మీ ఫ్రెండుని చూడాలని నాకూ ఆరాటంగా ఉందండీ. ఆయన గురించీ, ఆయన పనుల గురించీ ఇంకా తెల్సుకోవాలన్న కోరిక కలుగుతోంది. అలాంటివాళ్లే నాకు స్ఫూర్తి. నేను మా కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ని. కానీ నేను తప్పకుండా గూడూరుకి వెళ్లాలి. అమ్మకి ఆరోగ్యం బాలేదు" అన్నాడు లక్ష్మణ్ కాస్త విచారంగా.
"ఏంటి ప్రాబ్లెం అమ్మకి?" అడిగాడు పద్మాకర్.
చీరాల్లో ఆగింది రైలు.
"రెండ్రోజుల క్రితం ఇల్లు కడుగుతూ జారి గడప మీద పడిపోయిందంట! మడమ దగ్గర ఫ్రాక్చరంట! అసలే అమ్మకు సుగర్" చెప్పాడు అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ లక్ష్మణ్.
"అరే.. అవునా! అమ్మ ఆరోగ్యం ముఖ్యం. నిన్ను చూశాక అమ్మకు కాస్త ధైర్యం రావచ్చు. ఇష్టమైన వాళ్లు దగ్గరుంటే మనిషిలో హుషారు వస్తుంది" చెప్పాడు పద్మాకర్. రైలు కదిలింది. పద్మాకర్ లేచి సీటుకింద పెట్టిన ఎయిర్‌బ్యాగ్‌ను లాగి సీటు మీద పెట్టాడు. తనలో కలుగుతున్న ఉద్వేగానికి ఆశ్చర్యపడ్డాడు. తనకి ఊహ తెలిశాక ఇటువంటి ఉద్వేగాన్ని ఎన్నడూ ఎరుగడు. ఎంబీఏలో టాపర్‌గా నిలిచినప్పుడు గానీ, ప్రతిష్ఠాత్మక ఢిల్లీ బిజినెస్ స్కూల్లో ఉద్యోగం వచ్చినప్పుడు గానీ ఇంతటి ఉద్వేగం కలగలేదు.
అంతలోనే రైలు స్పీడు తగ్గింది. వేటపాలెం స్టేషన్ వచ్చేస్తోంది. కిర్రుమని చప్పుడు చేస్తూ ఆగింది రైలు.
పద్మాకర్ దిగుతుంటే "మీ ఫ్రెండుని అడిగినట్లు చెప్పండి సార్. బై.." చెప్పాడు లక్ష్మణ్.
నవ్వి "బై" అంటూ రైల్లోంచి ఫ్లాట్‌ఫాం మీదకి అడుగుపెట్టాడు. స్టేషన్ కాస్త మారింది. ఇదివరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవు. అవతలివైపు ఫ్లాట్‌ఫాంకి షెల్టర్లు లేవు. ఇప్పుడు వచ్చాయి. స్టేషన్ బయటకొచ్చాడు. అక్కడ పెద్ద మార్పు కనిపించలేదు. మూడు నాలుగు రిక్షాలు, రెండు ఆటోలు ఉన్నాయి.
"సార్! ఆటో కావాలా? ఎక్కడికి?" అంటూ వచ్చాడు ఒక ఆటోవాలా.
త్వరగా సుదర్శన్‌ని చూడాలని ఉన్నా, రిక్షాలో వెళ్లాలని అనుకున్నాడు పద్మాకర్. రిక్షాలో అయితే ఊరు చూస్తూ వెళ్లొచ్చు.
అతణ్ణి పంపించేసి ఒక రిక్షా ఎక్కి "నాయనపల్లికి పోనీయ్" అని కూర్చున్నాడు.
రిక్షా పోతుంటే అటూ ఇటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జింఖానా క్లబ్, పోలీస్ స్టేషన్, గరల్స్ హైస్కూలు దాటింది రిక్షా.
"అరే ఇక్కడ సరస్వతీ పిక్చర్ ప్యాలెస్ ఉండాలే. విజయదుర్గా థియేటర్ అని మార్చారన్న మాట!" అన్నాడు రూపురేఖలు మారిపోయిన సినిమా హాలును చూస్తూ.
(మిగతా వచ్చే వారం) 

No comments: